తన సేవకు పురుషుల్ని స్త్రీలని ఎంపిక చేసుకోటంలో వారికి విద్య ఉన్నదా? లేక వాగ్దాటి ఉన్నదా? లేక లోక భాగ్యం ఉన్నదా? అని దేవుడు ప్రశ్నించడు. తమకు నా మార్గాల్ని బోధించటానికి యోగ్యులయ్యేంత వినయంగా వారు నడుస్తారా? నా మాటల్ని వారి నోట పెట్టగలనా? వారు నన్ను సూచిస్తారా?‘ అని ఆయన అడుగుతాడు. టెస్టిమొనీస్, సం. 7, పు. 114. ChSTel 289.1
పేదలకు, తృణీకరించబడ్డవారికి, విడువబడ్డవారికి సహాయం చెయ్యటానికి ప్రయత్నించే దిశలో గౌరవం ఆధిక్యం అన్న ఉన్నతాసనం ఎక్కి వారి కోసం పని చెయ్యకండి. ఇలా మీరు సాధించగిగేది ఏమి ఉండదు. టెస్టిమొనీస్, సం. 6, పు. 277. ChSTel 289.2
తమ కృషిలో మన సంఘాల్ని బలపర్చి జయప్రదం చేసేది ఆర్భాటం కాదు, మౌనంగా వినయంగా చేసే సేవ; హంగు ఆడంబరం కాదు, సహనంతో ప్రార్ధన పూర్వకంగా, ఎడతెగకుండా చేసే కృషి టెస్టిమొనీస్, సం. 5, పు. 130. ChSTel 289.3
ఓటమి పరాభవం తరచు దీవెనగా పరిణమిస్తుంది. దేవుని సహాయం లేకుండా ఆయన చిత్రాన్ని నెరవేర్చలేమని అది మనకు చూపిస్తుంది. పేట్రియార్క్స్ అండ్ ప్రోఫెట్స్, పు. 633. ChSTel 289.4
పూరి గుడిసెలో నివసించే దీనుడి వరాలు ఇంటింట పని చెయ్యటానికి అగత్యం. అవి గొప్ప వరాలు సాధించలేని పనిని సాధిస్తాయి. టెస్టిమొనీస్, సం. 9, పులు. 37, 38. ChSTel 289.5
దేవుని సేవకులు క్రీస్తు నామంలో లోకంలో చేస్తున్న సేవలో పరలోకమంతా ఆసక్తి కలిగి ఉంది. సోదర సోదరీలారా, ఇది గొప్ప సేవ. మనం దేవుని ముందు దీనమనసు గలవారమై ఉండాలి. మన వివేకం సంపూర్ణమైందని మనం భావించకూడదు. ఆయన సేవను మనం శ్రద్దగా నిర్వహించాలి. మనల్ని వినయుల్ని చెయ్యాల్సిందిగా మనం దేవుని ప్రార్ధించకూడదు. ఎందుకంటే మనకు సంతోషం కూర్చని విధంగా ఆయన మనల్ని వినయుల్ని చేస్తాడు. కాని బలంగల దేవుని నాయకత్వంలో మనం అనుదినం దీన మనసు గలవారమవ్వాలి. భయంతోను వణకుతోను మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఇచ్చయించటానికి కార్యసిద్ధి కలుగజేసుకోటానికి మనలో పని చేసేవాడు దేవుడు కాగా ఆయన మన ద్వారా పనిచెయ్యటానికి మనం ఆయనతో సహకరించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 12, 1887. ChSTel 289.6
మనం ఇరుకు ద్వారాన ప్రవేశించటానికి ప్రయాసపడాలి. ఈ ద్వారం దాని మడత బందుల మీద సాఫీగా కదలదు. అనుమానితుల్ని లోపలికి రానివ్వదు. మన ముందున్న బహుమానానికి దీటైన తీవ్రతతో మనం నిత్యజీవం కోసం పాటుపడాలి. ద్రవ్యం, భూములు లేదా హోదాలు పరదైసు ద్వారాలు మనకు తెరవలేవు. వాటిని మనకున్న క్రీస్తుని పోలిన ప్రవర్తన మాత్రమే తెరుస్తుంది. ఘనత, ప్రతిభా సంబంధమైన సాధనలు మనకు నిత్యజీవ కిరీటాన్ని సంపాదించలేవు. ఎవరు దేవున్ని తమ బలం సామర్థ్యం చేసుకుంటారో ఆ సాత్వికులు ఆ దీనులు మాత్రమే ఆ బహుమానాన్ని పొందుతారు. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 16, 1903. ChSTel 290.1
మిషనెరీ సేవ చేసి తిరిగివచ్చినప్పుడు ఆత్మ స్తుతికి దిగకుండా యేసుని ఘనపర్చండి. కల్వరి సిలువను పైకెత్తండి. టెస్టిమొనీస్, సం. 5, పు. 596. ChSTel 290.2
గౌరవానికి ముందు అణకువ ఉంటుంది. మనుషుల ముందు ఉన్నత స్థానాన్ని అలంకరించటానికి, స్నానికుడైన యోహానులా, దేవుని ముందు దీనమైన స్థానాన్ని ఆక్రమించిన పనివాణ్ని పరలోకం ఎంపిక చేస్తుంది. చిన్న బిడ్డవంటి శిష్యుడు దేవుని సేవలో మిక్కిలి సమర్థవంతుడవుతాడు. ఆత్మ స్తుతికి కాక ఆత్మల రక్షణకు పూనుకునేవాడితో సహకరించటానికి పరలోక జ్ఞానులు సిద్ధంగా ఉంటారు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 436. ChSTel 290.3
దేవుని ప్రతీ బిడ్డ తినటంలోను, బట్టలు ధరించటం, పని చెయ్యటం విషయాల్లోను మితం పాటించటం ద్వారా దేవునికి ఉత్తమ సేవ చెయ్యాల్సిన అవసరాన్ని ప్రాముఖ్యాన్ని గుర్తించాలని నా ప్రగాడ ఆకాంక్ష. పనివాడు పని ఒత్తిడికి చింతకు లోనై మానసికంగాను శారీరకంగాను అధిక శ్రవకు గురి అయినప్పుడు అతడు కాస్త విశ్రాంతి తీసుకుంటాడు. అది స్వార్ధ తృప్తి కోసం కాదు. భవిష్యత్తులో విధుల్ని మెరుగుగా నిర్వర్తించటానికి సిద్ధపడటానికి అది అతడికి అవసరం. మనకు అప్రమత్తుడైన శత్రువు ఉన్నాడు. చెడుతనానికి పాల్పడటానికి మనల్ని నడిపించటానికి, తన శోధనల్ని ఆకర్షణీయం చెయ్యటంలో మన బలహీనతల్ని సొమ్ముచేసుకోటానికి, అతడు నిత్యం మనమార్గంలో పొంచి ఉంటాడు. మనసుకి అధికశ్రమ కలిగినప్పుడు, శరీరం బలహీనమైనప్పుడు దాన్ని అలుసుగా తీసుకుని దేవుని బిడ్డను పడదోయ్యటానికి తన భయంకర శోధనలతో ఆత్మ పై దాడి చేస్తాడు. దైవ సేవకుడు తన బలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాను చెయ్యాల్సిన పనిలో అలసినప్పుడు పని నుంచి పక్కకు తప్పుకుని కాస్త విశ్రాంతి తీసుకుంటూ యేసుతో సహవాసం చెయ్యాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, నవ. 14, 1893. ChSTel 290.4
మన శారీరక శక్తుల దుర్వినియోగం దేవుని మహిమకు వినియుక్తం కావలసి ఉన్న మన జీవితం నిడి విని తగ్గిస్తుంది. దేవుడు మనకు నియమించిన పనికి మనల్ని అయోగ్యుల్ని చేస్తుంది. తప్పు అలవాట్లు ఏర్పర్చుకోటం, ఆలస్యంగా నిద్రపోటం ఆరోగ్యానికి హాని చేసే ఆహారవాంఛ తృప్తి ద్వారా మనం బలహీనతకు పునాది వేసుకుంటాం. శరీర వ్యాయమాన్ని నిర్లక్ష్యం చెయ్యటం ద్వారా, మనసుకి లేక శరీరానికి అధిక శ్రమ కల్పించటం ద్వారా మనం మన నాడీమండల సమతుల్యాన్ని పాడుచేస్తాం. ప్రకృతి . చట్టాల్ని అలక్ష్యం చెయ్యటం ద్వారా ఇలా తమ జీవిత కాలాన్ని తగ్గించుకుని దేవుని సేవకు తమని తాము అయోగ్యుల్ని చేసుకునేవారు దేవున్ని దోచుకున్నవారిగా అపరాధులవుతారు. వారు తోటి మనుషుల్ని కూడా దోచుకుంటున్నవారవుతారు. తమని దేవుడు ఈలోకంలోకి ఏ పనికి పంపించాడో దానికి అనగా ఇతరులికి మేలు చెయ్యటానికి వారికి ఉన్న అవకాశాల్ని తమ కార్యవిధానం ద్వారా తక్కువ చేసుకుంటారు. తమకున్న తక్కువ కాలంలో కూడా తాము సాధించగలిగి ఉండేదాన్ని సాధించటానికి తమని తాము అనుగ్దుల్ని చేసుకుంటారు. మన హానికరమైన అలవాట్ల ద్వారా మనం ఇలా లోకానికి చేయాల్సిన మేలును చెయ్యలేకపోయినప్పుడు ప్రభువు మనల్ని అపరాధులుగా ఎంచుతాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 346, 347. ChSTel 291.1
మన దేవుడు దయ కనికరాలు గలవాడు. తన నీతినిధులన్నింటిలోను సహేతుకతగలవాడు. మన ఆరోగ్యాన్ని పాడు చేసే లేక మన మానసిక శక్తుల బలహీనతకు దారితీసే కార్యాచరణనను అనుసరించాలని మనల్ని ఆయన కోరటం లేదు. మనం అలసిపోయే వరకు మన నరాలు కుంగిపోయే వరకు ఒత్తిడికి లోనై పని చెయ్యటం దేవుని చిత్తం కాదు. దేవుడు మనకు బుద్దినిచ్చాడు. మనం విచక్షణను ఉపయోగించి, మనలో నిక్షిప్తమై ఉన్న చట్టాలకి అనుగుణంగాను, మనకు సమతుల్యత గల వ్యవస్థీకరణ ఉండేందుకు వాటికి విధేయంగాను మనం వ్యవహరించటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. రోజు తర్వాత రోజు వస్తుంది. ప్రతీ రోజు దాని బాధ్యతలు విధుల్ని తెస్తుంది. కాని రేపు చేయాల్సిన పనిని ఈ రోజు పనితో కలిపి దాన్ని ఎక్కువ చేసుకోకూడదు. దైవ సేవకులు తమ సేవ ఎంత పవిత్రమైందో గ్రహించి, తమ శక్తుల్ని ఈ రోజు వివేకవంతంగా వినియోగించటం ద్వారా రేపటి పనికి సిద్ధపడాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, నవ. 7, 1893. ChSTel 292.1