Go to full page →

38 - చీకటిలోనుంచి వెలుగు PKTel 324

దైవభక్తులు ప్రవక్తల ప్రవచన వాక్కుల మూలంగా చోటుచేసుకున్న ప్రోత్సాహ ఉత్సాహాలే లేకపోతే, యూదా రాజ్యానికి మరణ ఘంటికలు మోగించిన చీకటి సంవత్సరాల్లోని వినాశనం, మరణం ఎంత బలీయమైన గుండెనైనా నిరాశ నిస్ర్పుహలతో అతలాకుతలం చేసేవి. యెరూషలేములో యిర్మీయాద్వారా, బబులోను ఆస్థానంలో దానియేలు ద్వారా, కేబారు నదిగట్టుపై యె హేజ్కేలు ద్వారా కృపగల ప్రభువు తన నిత్య సంకల్పాలు బయలుపర్చి, మోషే రచనల్లో తన ప్రజలికి తాను చేసిన వాగ్దానాల్ని నెరవేర్చటానికి తాను సంసిద్ధుణ్నన్న భరోసా ఇచ్చాడు. తనకు నమ్మకంగా నిలిచినట్లు నిరూపించుకునేవారికి ఇస్తానని తాను వాగ్దానం చేసినదాన్ని ఆయన నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. “ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.” 1 పేతు. 1:23. PKTel 324.1

అరణ్య సంచార దినాల్లో తన ప్రజలు ధర్మశాస్త్ర నియమ నిబంధనల్ని జ్ఞాపకముంచుకోటానికి ప్రభువు ఎన్నో వసతులు కల్పించాడు. కనానులో స్థిరనివాసాలు ఏర్పడ్డ తర్వాత ఈ ధర్మశాస్త్ర సూత్రాల్ని ప్రతీ గృహంలోను ప్రతీదినం వల్లించాల్సి ఉండేది. గృహస్తులు వాటిని ద్వారబంధాలమీద తలుపులమీద స్పష్టంగా రాయాల్సి ఉండేది. జ్ఞాపకార్ధపు పలకలమీద వాటిని చెక్కాల్సి ఉండేది. ఆ మాటలికి సంగీతం సమకూర్చి వాటిని పిన్నలతోను పెద్దలతోను పాడించేవారు. యాజకులు ఈ పరిశుద్ధ సూత్రాల్ని బహిరంగ సమావేశాల్లో నేర్పించాల్సి ఉండేది. దేశ పాలకులు వాటిని అనుదినం పఠించాల్సి ఉండేది. ధర్మశాస్త్ర గ్రంథం గురించి ప్రభువు యెహోషువని ఇలా ఆదేశించాడు. “దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన యెడల నీ మార్గములను వర్ధిల్ల జేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” యెహోషువ 1:8. PKTel 324.2

మోషే రచనల్ని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు. “స్త్రీలును పిల్లలును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట యొక్కటియు లేదు.” యెహోషు. 8:35. పర్ణశాలల పండుగ జరిగే సమయంలో ప్రతీ ఏడేళ్లకోసారి ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటల్ని బహిరంగంగా అభ్యసించాలని దేవుడిచ్చిన నిర్దిష్ట ఆజ్ఞకు లోబడి ఇది జరిగేది. ఇశ్రాయేలులోని ఆధ్యాత్మిక నాయకుల్ని ఇలా ఉపదేశించటం జరిగేది, “మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఆచరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను. ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగనివారి సంతతివారు దానినివిని, మీరు స్వాధీనపరచు కొనుటకు యోర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినములన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు.” ద్వితియో. 31:12,13. PKTel 324.3

ఆ తర్వాతి శతాబ్దాల్లోని ప్రజలు ఈ హితోపదేశాన్ని పాటించి ఉంటే ఇశ్రాయేలు చరిత్ర ఎంత వ్యత్యాసంగా ఉండేది! ప్రజల హృదయాల్లో దేవుని పరిశుద్ధ వాక్యంపట్ల భక్తిభావం ఉన్నప్పుడే వారు ఆయన సంకల్పాన్ని నెరవేర్చగలుగుతారు. దావీదు ఏలుబడి కాలంలోను సొలొమోను పరిపాలన తొలి సంవత్సరాల్లోను ఇశ్రాయేలుని బలోపేతం చేసింది దైవధర్మశాస్త్రంపట్ల ఆ ప్రజలు చూపించిన భక్తి గౌరవాలే. దేవుని సజీవ వాక్యంపై విశ్వాసం మూలంగానే ఏలీయా యోషీయా దినాల్లో దిద్దుబాటు చోటు చేసుకుంది. తన దిద్దుబాటు కృషిలో ఇశ్రాయేలు గొప్ప వారసత్వమైన ఈ లేఖన సత్యాలనే యిర్మీయా ప్రస్తావించాడు. అతడు ఎక్కడ పరిచర్య చేసినా అక్కడి ప్రజలకు ఈ విజ్ఞప్తి చేసేవాడు, “మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను. యిర్మీ. 11:2. PKTel 325.1

యూదా మతభ్రష్టత చివరి సంవత్సరాల్లో ప్రవక్తల హితవాక్యాలు నిరర్ధకమైనట్లు కనిపించింది. యెరూషలేమును ముట్టడించటానికి కల్దీయుల సేనలు మూడోసారి చివరిసారి దండెత్తి వచ్చినప్పుడు ఎవరి హృదయంలోనూ ఎలాంటి నిరీక్షణా మిగల్లేదు. అది పూర్తిగా నాశనమౌతుందని యిర్మీయా ప్రకటించాడు. లొంగిపొమ్మని అతడు పదేపదే సలహా చెప్పినందువల్ల అతణ్ని చెరసాల పాలుచేశారు. ఇలాగుండగా ఆ పట్టణంలో తనకు నమ్మకంగా నిలిచిన చిన్న శేషిత గుంపును దేవుడు నిసృహకు నిరాశకు విడిచిపెట్టెయ్యలేదు. యిర్మీయా వర్తమానాల్ని ద్వేషించినవారు అతడిపై గట్టి నిఘా వేసి ఉంచిన సమయంలోనే, క్షమించి రక్షించటానికి దేవుని సంసిద్ధతను గూర్చి అతడికి వర్తమానం వచ్చింది. ఇది ఆనాటినుంచి నేటివరకు దేవుని సంఘానికి గొప్ప ఆదరణనిస్తూ వస్తున్నది. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని, తన ప్రజలపట్ల దేవుని సంకల్పం తుదకు నెరవేరుతుందన్న ప్రగాఢ విశ్వాసాన్ని ఓ ఉపమానంద్వారా ఆ పట్టణ ప్రజలముందు యిర్మీయా ఏకపాత్రాభినయం చేశాడు. చట్టపరమైన లాంఛనాల్ని పాటించి, సాక్షుల సమక్షంలో యిర్మీయా పిత్రార్జితమైన ఓ పొలాన్ని పదిహేడు తులాల వెండికి కొన్నాడు. అది పక్కనే ఉన్న అనాతోతు గ్రామంలో ఉంది. PKTel 325.2

మానవ ధృక్కోణం నుంచి చూస్తే, అప్పటికే బబులోనీయుల ఆధీనంలో ఉన్న భూమిని కొనుగోలు చెయ్యటం అవివేకంగా కనిపించింది. ప్రవక్త తానే యెరూషలేము నాశనాన్ని, యూదా నిర్మానుష్యాన్ని, ఆ రాజ్యం శిధిలాన్ని ప్రవచిస్తున్నాడు. దూరంలో ఉన్న బబులోనులో దీర్ఘకాల బానిసత్వాన్ని ప్రవచిస్తున్నాడు. అప్పటికే పెద్ద వయసుగల అతడికి ఆ స్థలం కొనుగోలునుంచి ఏమంత వ్యక్తిగత ప్రయోజనం చేకూరదు. అయినా లేఖనాల్లో దాఖలైఉన్న ప్రవచనాల్ని అతడు చేసిన అధ్యయనం అతడి హృదయంలో ఓ బలమైన నమ్మకం సృష్టించింది. దాసులుగా నివసిస్తున్న తన ప్రజలకు వాగ్దత్త దేశంలో తమ పూర్వ స్వాస్థ్యాన్ని తమకు పునరుద్దరించటం ప్రభువు ఉపదేశమన్నది ఆ నమ్మకం. కష్ట సమయం అనంతరం బానిసలు తిరిగి రావటం తమ తండ్రుల దేశాన్ని ఆక్రమించుకోటం విశ్వాస నేత్రంతో యిర్మీయా చూశాడు. తన హృదయానికి ఎంతో ఆదరణను తెచ్చిన నిరీక్షణను ఇతరులలో రగిలించటానికే అతడు అనాత్తు భూమిని కొనుగోలు చేశాడు. PKTel 326.1

మార్పిడి పత్రాలపై సంతకంచేసి, ఆ మీదట సాక్షి సంతకాలతో ధ్రువీకరణ సంపాదించిన అనంతరం యిర్మీయా తన లేఖికుడు బారూకుని పిలిచి ఇలా ఆదేశించాడు, “ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహు దినములుండునట్లు మంటికుండలో వాటిని దాచి పెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - ఇండ్లును పొలములును ద్రాక్ష తోటలును ఇంక ఈ దేశములో కొనబడును.” యిర్మీ. 32:14,15. PKTel 326.2

ఈ కొనుగోలు వ్యవహారం జరిగిన సమయంలో యూదా పరిస్థితి ఎంతో నిరాశాజనకంగా ఉంది. కొనుగోలుకు సంబంధించిన వివరాలన్నీ పూర్తి చేసుకుని ఆ రాతపూర్వక రికార్డుల్ని భద్రపర్చుకున్న తర్వాత యిర్మీయా విశ్వాసం తీవ్ర పరీక్షకు గురి అయ్యింది. అది స్థిరంగానే ఉన్నది. సుమా! యూదాను ప్రోత్సహించటానికి ప్రయత్నించటంలో దురహంకారంతో వ్యవహరించాడా? దేవుని వాగ్దానాలపై ప్రజల విశ్వాసాన్ని స్థిరపర్చటానికి ఆకాంక్షించటంలో తప్పుడు నిరీక్షణ ఏర్పడటానికి తావిచ్చాడా? దేవునితో నిబంధన బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నవారు తమకు సంబంధించిన ఆ నిబంధన అంశాల్ని దీర్ఘకాలంగా ద్వేషించారు. దేవుడు ఎంపిక చేసుకున్న ఆ ప్రజలకు వర్తించే వాగ్దానాలు పూర్తిగా నెరవేరటం జరిగేనా? PKTel 326.3

మదిలో ఆందోళన చెలరేగింది. తమ పాపాలనిమిత్తం పశ్చాత్తాపపడటానికి నిరాకరించిన ప్రజలు అనుభవిస్తున్న శ్రమలు బాధలు అతణ్ని క్షోభింపచేశాయి. మానవుల విషయంలో దైవ సంకల్పాల్ని గురించి మరింత వెలుగుకోసం ప్రవక్త దేవునికి విజ్ఞప్తి చేశాడు. PKTel 327.1

“యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధిక బలముచేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైన దేదియు లేదు. నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయములో నీవు గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తననుబట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశములో చేసినట్లు నేటివరకు ఇశ్రాయేలువారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటివలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలము కలిగి, చాపిన చేతులు గలవాడవై మహా భయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చెదనని వారి పితరులకు ప్రమాణము చేసి, పాలుతేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి. నీ ధర్మశాస్త్రము ననుసరింపక పోయిరి. వారు చేయవలెనని నీవాజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారికి రప్పించియున్నావు.” 17-23 వచనాలు. PKTel 327.2

నెబుకద్నెజరు సేనలు సీయోను ప్రాకారాలపై హఠాత్తుగా దాడి చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాయి. పట్టణాన్ని కాపాడటానికి ప్రాణాలు పణంగా పెట్టి చివరగా చేస్తున్న ప్రయత్నంలో వేలప్రజలు మరణిస్తున్నారు. మరిన్నివేల ప్రజలు ఆకలితో వ్యాధితో మరణిస్తున్నారు. యెరూషలేము నాశనం తప్పదు. శత్రురాజు నిర్మించిన ముట్టడి దిబ్బలు ప్రాకారాలకు ఎదురుగా ఉన్నాయి. తాను దేవునికి చేస్తున్న ప్రార్ధనలో ప్రవక్త ఇలా అంటున్నాడు, “ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి; ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించేను, నీవే దాని చూచుచున్నావు గదా? యెహోవా ప్రభువా, ధనమిచ్చి యీ పొలమును కొనుక్కొని సాక్ష్యము పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది.” 24,25 వచనాలు. PKTel 327.3

ప్రవక్త చేసిన ప్రార్ధనకు దేవుడు జవాబిచ్చాడు. ఆ దుఃఖ సమయంలో దైవ సేవకుడి విశ్వాసం అగ్నిపరీక్షకు లోనవుతున్నప్పుడు “యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది, “నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” 26, 27 వచనాలు. కొద్దికాలంలోనే ఆ పట్టణం కల్దీయుల హస్తగతం కానుంది. దాని గుమ్మాలు, రాజభవనాలు అగ్నికి ఆహుతి కానున్నాయి. అయితే త్వరలో నాశనం సంభవించనన్నప్పటికీ యెరూషలేము నివాసుల్ని బానిసలుగా కొనిపోటం జరిగినప్పటికీ, ఇశ్రాయేలు విషయంలో యెహోవా సంకల్పం నెరవేరనుంది. తన సేవకుడి ప్రార్థనకు జవాబులో ప్రభువు తన శిక్షలు ఎవరిమీద పడనున్నవో వారిగురించి ఇంకా ఇలా అన్నాడు: PKTel 328.1

“ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నింటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. వారు నాకు ప్రజలైయుందురు. నేను వారికి దేవుడనై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారియందు ఆనందించు చున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలమీదికి ఇంత గొప్ప కీడును రప్పించిన రీతినే నేను వారినిగూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోవుచున్నాను. ఇది పాడైపోవును, దానిలో నరులులేరు, పశువులు లేవు, ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడి యున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేనే వారిలో చెరపోయిన వారిని తప్పింపబోవు చున్నాను గనుక బైన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను దక్షిణ దేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు. క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు” 37-44 వచనాలు. PKTel 328.2

విముక్తిని పునరుద్ధరణను నిర్వహిస్తానన్న ఈ వాగ్దానాల్ని ధ్రువపర్చుతూ, “యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను: PKTel 328.3

“మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నాకు మొఱ్ఱపెట్టుము. నేను నీకు ఉత్తమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదా రాజుల నగరులును శిధిలమైపోయెను గదా వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా... నేను దాని ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలోనుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్ర పరతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.... భూజనులందరి యెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతా స్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమునుబట్టియు సమస్తమైన మేలునుబట్టియు భయపడుచు దిగులు నొందుదురు.” PKTel 329.1

“యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే,... యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును - యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్తులను నేను దర్శించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు: PKTel 329.2

“సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములలోను దాని పట్టణముల లోను గొట్టెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. మన్నెపు పట్టణముల లోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశము లోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టు వారిచేత లెక్కపెట్టింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు: PKTel 329.3

“యెహోవా సెలవిచ్చు వాక్కు ఇదే - ఇశ్రాయేలు వంశస్తులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. యిర్మీ. 33:1-14. PKTel 329.4

దుష్టశక్తులతో తన సుదీర్ఘ పోరాటంలోని మిక్కిలి అంధకార గడియలో దేవుని సంఘం ఈవిధంగా ఓదార్పు పొందింది. ఇశ్రాయేలును నాశనం చెయ్యటంలో సాతాను విజయం సాధించినట్లు కనిపించాడు. కాని ప్రభువు ప్రస్తుత సంఘటనల్ని అదుపు చేస్తున్నాడు. వీటి తర్వాతి సంవత్సరాల్లో ఆయన ప్రజలు తమ గతాన్ని మార్చుకుని మంచి జీవితాలు జీవించటానికి వారికి మరొక తరుణం ఇవ్వనెంచాడు. సంఘానికి ఆయన వర్తమానం ఇది : PKTel 330.1

“నా సేవకుడైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ విస్మయ మొందకుము; నేను దూరముననుండు నిన్నును, చెరలోనికిపోయిన దేశముననుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగివచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే - నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను.” “నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను. నీ గాయములను మాన్పెదను.” యిర్మీ. 30:10,11,17. PKTel 330.2

చెదరిపోయిన ఇశ్రాయేలువారు పునరుద్ధరణ జరిగే సంతోషానందాల దినాన ఒకే జనాంగంగా మళ్లీ ఏకం కానున్నారు. ప్రభువు “ఇశ్రాయేలు వంశస్థులకందరికి” పాలకుడుగా గుర్తింపు పొందుతాడు. వారు నాకు ప్రజలై యుందురు” అంటున్నాడు ప్రభువు. “యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి; రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి. ప్రకటించుడి. స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమా అని బతిమాలుడి; ... గ్రుడ్డివారినేమి కుంటివారినేమి... నేను భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను... వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్లకాలువల యొద్దవారిని నడిపించెదను. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ణ కుమారుడు కాడా!” యిర్మీ. 31:1,7—9. PKTel 330.3

ఒకప్పుడు లోకంలోని ప్రజలందరికన్నా ఎక్కువ ప్రియమైన ప్రజలుగా దేవునిచే పరిగణన పొందినా, ఇప్పుడు లోక ప్రజలందరిముందు కొరగానివారిగా ఉన్న ఈ ప్రజలు తమ భావి ఆనందానికి ఎంతో అగత్యమైన విధేయతా పాఠాన్ని బానిసలుగా బతుకు వెళ్లదీస్తున్న కాలంలో నేర్చుకోవాల్సి ఉంది. వారు ఈ పాఠం నేర్చుకునేవరకు వారికి తాను చేయాలని ఉద్దేశించినదంతా దేవుడు చెయ్యలేకపోయాడు. తమ ఆధ్మాత్మిక శ్రేయాన్ని లక్షించే తమను శిక్షించటం జరిగిందని విశదంచేస్తూ ఆయన ఇలా అన్నాడు, “ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.” యిర్మీ. 30:11. తాను ఆయన ప్రేమించేవారిని ఆయన తోసి పుచ్చడు. అపజయం నుంచి విజయాన్ని తేవడానికి నాశనం చెయ్యటంకన్నా రక్షించటానికి ఆయన తన ప్రణాళికను లోక రాజ్యాలముందు ప్రదర్శిస్తాడు. ప్రవక్తకు ఆయన ఈ వర్తమానాన్ని ఇచ్చాడు : PKTel 330.4

“జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటించుడి - ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొట్టెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సీయోను కొండమీద ఉత్సాహ ధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలను బట్టియు ద్రాక్షరసమును బట్టియు తైలమును బట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారికనెన్నటికిని కృషింపక నీళ్లుపారు తోటవలె నుందురు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక... సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తి నొందుదురు.” PKTel 331.1

ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు - చెరలోనుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు - నీతి క్షేత్రమా, ప్రతిష్టిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తి పరచుదును, కృశించిన వారినందరిని నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడు వారేమి యూదావారందరును వారి దేశములో కాపురముందురు.” PKTel 331.2

“ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు ఇది ఐగుపులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగముచేసి కొనిరి; యిదే యెహోవా వాక్కు ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలీయులతోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచెదను. వారి హృదయముమీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును - యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు యిర్మీ. 31:10-14, 23-25, 31-34. PKTel 331.3