Go to full page →

51 - ఆధ్మాత్మిక పునరుజ్జీవనం PKTel 433

యెరూషలేముకి ఎజ్రా రాక సమయోచితం. అక్కడ అతడి సన్నిధి ప్రభావం ఎంతో అవసరం. కష్టాలు ఇడుమల నడుమ అనేక సంవత్సరాలుగా శ్రమిస్తున్న అనేకమందిలో ఎజ్రారాక ధైర్యాన్ని నిరీక్షణను నింపింది. డెబ్బయి సంవత్సరాల ముందు జెరుబ్బాబెలు యెహోషువ ఆధ్వర్యంలో చెరబందీల మొదటి బృందం తిరిగి వచ్చినప్పటి నుంచి చాలా పని జరిగింది. ఆలయ నిర్మాణం పూర్తి అయ్యింది. పట్టణం గోడలు పాక్షికంగా మరమ్మత్తయ్యాయి. అయినా చేయాల్సింది చాలా ఉంది. PKTel 433.1

గత సంవత్సరాల్లో యెరూషలేముకి తిరిగి వచ్చిన వారిలో మరణంవరకూ దేవునికి నమ్మకంగా జీవించినవారు చాలామంది ఉన్నారు. కాని పిల్లల్లోను వారి పిల్లల్లోను ఎక్కువమంది దేవుని ధర్మశాస్త్ర పరిశుద్ధతను విస్మరించారు. బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొందరు బహిరంగ పాపంలో నివసిస్తున్నారు. దేవుని సేవాభివృద్ధికి ఇతరులు చేస్తున్న కృషిని వారి ప్రవర్తన దెబ్బ తీస్తున్నది. ఎందుకంటే ధర్మశాస్త్ర ఉల్లంఘనను మందలించకుండా విడిచి పెట్టినంత కాలం ఆ ప్రజల్ని దేవుడు ఆశీర్వదించడు. PKTel 433.2

ఎజ్రాతో తిరిగి వచ్చినవారు ప్రత్యేక ప్రార్థనలద్వారా ప్రభువుతో మాట్లాడటం దేవుని నడుపుదల కింద జరిగిన కార్యం. ఏ మానవశక్తి పరిరక్షణ లేకుండా బబులోను నుంచి తాము చేసిన ప్రయాణంలో కలిగిన అనుభవాలు వారికి విలువైన ఆధ్మాత్మిక పాఠాలు నేర్పించాయి. అనేకుల విశ్వాసం బలీయమయ్యింది. అధైర్యంచెంది ఉదాసీనంగా యెరూషలేములో ఉన్నవారితో వీరు కలిసి తిరిగిన కొద్దికాలం తర్వాత చోటుచేసుకున్న దిద్దుబాటులో వీరి ప్రభావం శక్తిమంతమైన పాత్ర పోషించింది. PKTel 433.3

యెరూషలేము చేరిన నాల్గో రోజున ఖజానాదారులు వెండి బంగారం, ఆలయ సేవలకు ఉపకరణాల్ని సాక్షుల సమక్షంలో నిక్కచ్చిగా తూకంవేసి ఆలయాధికారులికి అప్పగించారు. ప్రతీ వస్తువుని “సంఖ్య చొప్పుననను ఎత్తు చొప్పునను” పరీక్షించటం జరిగింది. ఎజ్రా. 8:34. PKTel 433.4

ఎజ్రాతో తిరిగి వచ్చిన చెర ప్రజలు పాప పరిహారార్థ బలిగాను తమ కృతజ్ఞతకు చిహ్నంగాను, తమ ప్రయాణంలో పరిశుద్ద దేవదూతల కాపుదల నిమిత్తం స్తుత్యర్పణగాను “ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి.” “వారు రాజుయొక్క నిర్ణయములను రాజుయొక్క సేనాధిపతులకును నది యవతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి.” 35, 36 వచనాలు. PKTel 434.1

ఆ తర్వాత కొద్దికాలానికి ఇశ్రాయేలులో కొందరు ప్రముఖులు ఓ తీవ్ర సమస్యతో ఎజ్రావద్దకు వచ్చారు. కొందరు “ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును” యెహోవా పరిశుద్ద ఆజ్ఞల్ని లెక్కచెయ్యకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని వివాహం చేసుకుంటున్నారు అని ఫిర్యాదు చేశారు. “వారి కుమార్తెలను పెండ్లిచేసుకొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ద సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా సుముఖులై యుండిరి.” అన్నారు. ఎజ్రా. 9:1,2. PKTel 434.2

బబులోను చెరకు దారితీసిన కారణాల అధ్యయనంలో ఇశ్రాయేలీయుల మత భ్రష్టతకు కారణం చాలామట్టుకు వారు అన్యమత ప్రజలతో సమ్మిళితమవ్వటమేనని ఎజ్రా తెలుసుకున్నాడు. తమ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో ఒకటికాకుండా ప్రత్యేంగా ఉండాలన్న దైవాజ్ఞకు వారు విధేయులై ఉంటే వారికి ఎన్నో దుఃఖకరమైన, అవమానకరమైన అనుభవాలు కలిగేవి కావని ప్రవక్త గుర్తించాడు. గతకాలంలోని అనుభవాల పాఠాలు స్పష్టంగా ఉన్నా ప్రముఖ వ్యక్తులు మతభ్రష్టతనుంచి తమను కాపాడటానికి దేవుడిచ్చిన నియమ నిబంధనల్ని అతిక్రమించటానికి సాహసించారని తెలుసుకున్నప్పుడు అతడి హృదయం బహుగా క్షోభించింది. తన ప్రజలు తమ మాతృదేశానికి తిరిగి రావటానికి మళ్లీ తరుణం ఇవ్వటంలో దేవుని దయాళుత్వంగురించి తలపోశాడు. ప్రజల కృతఘ్నతను గూర్చి పరిశుద్ద ఆగ్రహంతో వణికాడు. ప్రవక్త ఇలా అంటున్నాడు, “నేను ఈ సంగతి విని నా వస్త్రములను పై దుప్పటిని చింపుకొని, నా తల వెంట్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికివేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.” PKTel 434.3

“చెరపట్ట బడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడా వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని.” 3,4 వచనాలు. PKTel 434.4

సాయంత్రపు అర్పణ సమయమప్పుడు ఎజ్రా లేచి మళ్లీ తన వస్త్రం పై దుప్పటి చింపుకుని, మోకాళ్ల పైపడి తన హృదయ భారాన్ని దేవునికి విన్నవించుకున్నాడు. చేతులు విశాలంగా చాపి ఇలా ప్రార్థించాడు, “నా దేవా నా దేవా, నా ముఖము నీవైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనైయున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి యున్నవి, మా అపరాధములు ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నవి.” PKTel 435.1

విజ్ఞాపనను కొనసాగిస్తూ ఇలా అన్నాడు, “మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మా రాజులును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చి నట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మా యెడల దయ చూపియున్నాడు. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక పారసీక దేశపు రాజుల యెదుట మాకు దయకనపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి. PKTel 435.2

“మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమిగదా.... అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మా మీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామిద ఉంచి, మాకు ఈవిధముగా విడుదల కలుగ జేయగా మేము ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనిన యెడల, మేము నాశనమగువరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవైయున్నావు. అందుచేతనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిదిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసిరి.” 6-15 వచనాలు. PKTel 435.3

కనిపించకుండా దేవుని సేవ నడిబొడ్డుకే పాకిన అసహ్య కార్యాల నిమిత్తం ఎజ్రాలోను అతడి సహచరుల్లోను చోటుచేసుకున్న దుఃఖం పశ్చాత్తాపం పుట్టించింది. పాపం చేసిన అనేకమంది హృదయ వేదన చెందారు. “ఇశ్రాయేలీయులు... కూడివచ్చి బహుగా” ఏడ్చారు. ఎజ్రా. 10:1. పాపం నీచత్వాన్ని దేవుడు దాన్ని ఎంత భయంకరమైనదానిగా పరిగణిస్తాడో దాన్ని కొంతమేరకు గ్రహించటం మొదలు పెట్టారు. సీనాయి పర్వతం పైనుంచి ప్రకటితమైన ధర్మశాస్త్రం పరిశుద్దమైందని వారు చూడగలిగారు. అనేకులు తమ అతిక్రమాలగురించి తలపోసుకుని భయంతో వణికారు. PKTel 436.1

అక్కడున్న వారిలో ఒకడైన షెకన్యా ఎజ్రా చెప్పిన మాటలన్నీ నిజమని అంగీకరించాడు. అతడిలా ఒప్పుకున్నాడు, “మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.” అతిక్రమం చేసిన వారందరు తమ పాపాన్ని విడిచిపెడ్తామంటూ దేవునితో నిబంధన చేసుకోవాలని, వారు “ధర్మశాస్త్రానుసారముగా” తీర్పు పొందాలని షెకన్యా ప్రతిపాదించాడు. అతడు ఎజ్రాతో ఇలా అన్నాడు, “లెమ్ము ఈ పని నీ యధీనములోనున్నది. మేము నీతోకూడ నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుము.” “ఎజ్రా లేచి, ప్రధాన యాజకులను ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను.” 2-5 వచనాలు. PKTel 436.2

ఇది చక్కని దిద్దుబాటుకి నాంది అయ్యింది. ఎంతో ఓర్పు చేర్పులతో, ప్రతీవారి హక్కులు సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఎజ్రా, అతడి అనుచరులు పశ్చాత్తపులైన ఇశ్రాయేలీయుల్ని నీతి మార్గంలో నడిపించటానికి శ్రమించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎజ్రా ధర్మశాస్త్ర బోధకుడు. ప్రతీ కేసును వ్యక్తిగతంగా పరిశీలించేటప్పుడు ధర్మశాస్త్ర పరిశుద్ధతనుగూర్చి దాన్ని ఆచరించటంద్వారా పొందగల దీవెనల్నిగూర్చి ప్రజలకు బోధించటానికి కృషి చేసేవాడు. PKTel 436.3

ఎజ్రా ఎక్కడ పరిచర్య చేస్తే అక్కడ పరిశుద్ద లేఖన పఠనం పునరుజ్జీవనం పొందింది. ప్రజలకు ఉపదేశించటానికి బోధకుల్ని నియమించటం జరిగేది. దైవ ధర్మశాస్త్రాన్ని ఘనపర్చటం గౌరవించటం జరిగేది. ప్రవక్తల గ్రంథాల్ని పరిశోధించటం జరిగేది. మెస్సీయా రాకను ప్రవచించే వాక్యభాగాలు అనేక హృదయాలికి ఆదరణను ఓదార్పును నిరీక్షణను అందించేవి. PKTel 436.4

“ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ... ధృఢనిశ్చయము” చేసుకుని (ఎజ్రా. 7:10) రెండువేల సంవత్సరాలకు పైగా కాలం గడిచింది. అయినా కాలగమనంతో అతడి పరిశుద్ధ ఆదర్శ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. అతడి దైవ సేవాంకిత జీవిత చరిత్ర శతాబ్దాలుగా అనేకుల్ని “యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు” స్ఫూర్తినిస్తూ వస్తున్నది. PKTel 436.5

ఎజ్రా ఉద్దేశాలు సమున్నతమైనవి, పరిశుద్దమైనవి. తన కార్యాచరణ అంతటిలోను ఆత్మలపట్ల ప్రగాఢ ప్రేమే చోదక శక్తి. తెలిసో తెలియకో పాపం చేసినవారిపట్ల అతడు కనపర్చిన దయ కనికరాలు సంస్కరణలు తేవాలని ఆశపడేవారికి స్పూర్తినివ్వాలి. నీతి సూత్రాలికి వచ్చేసరికి దైవసేవకులు రాతిబండవలె స్థిరంగా నిలవాలి. అయినా వారు సానుభూతిని సహనాన్ని ప్రదర్శించాలి. సకల సత్కియలకు పునాది అయిన నీతి సూత్రాల్ని పాదుకొల్పటం ద్వారా ఎవలే వారు పాపులకు జీవిత మార్గాన్ని నేర్పాలి. PKTel 437.1

దైవ ధర్మశాస్త్రానికి విధేయంగా నివసించాల్సిన విషయంలో స్త్రీలు పురుషుల కళ్లకు అనేక సాధనాలద్వారా అంధత్వాన్ని కలిగించటానికి సాతాను విశ్వప్రయత్నం చేస్తున్న ఈ యుగంలో అనేకులు “దైవాజ్ఞకు భయపడునట్లు (ఎజ్రా. 10:3) చేయగల వారి అవసరం ఎంతైనా ఉంది. అపరాధుల్ని ధర్మశాస్త్ర కర్తవద్దకు నడిపించి “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యధార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల జేయును, యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్దిహీనులకు జ్ఞానము పుట్టించును.” (కీర్త. 19:7) అని బోధించే యధార్ధ సంస్కర్తల అవసరం ఎంతో ఉంది. లేఖనాల్లో దిట్టలైన మనుషులు, ఎవరి ప్రతీమాట ప్రతీ చర్య యెహోవా కట్టడల్ని ఘనపర్చుతుందో ఆ మనుషులు, విశ్వాసాన్ని బలోపేతం చేయటానికి ప్రయత్నించే మనుషుల అవసరం ఉంది. లేఖనాలపట్ల మనసుల్లో భక్తిశ్రద్దల్ని అభిలాషను పుట్టించే బోధకుల అవసరం అంతా ఇంతా కాదు. PKTel 437.2

నేడు విపరీతంగా విస్తరిస్తున్న దుష్టతకు హేతువు చాలామట్టుకు లేఖనాల్ని పఠించటంలో ఆచరించటంలో చోటుచేసుకుంటున్న వైఫల్యమే. ఎందుకంటే దైవవాక్యాన్ని పక్కన పెట్టటం జరిగినప్పుడు స్వాభావిక హృదయంలో పుట్టే దురవేశాల్ని అదుపుచేసే శక్తిని అది విసర్జిస్తుంది. శరీరాశలు శరీరక్రియలు విత్తేవారు దుర్నీతి అవినీతి పంటను కోస్తారు. PKTel 437.3

బైబిలును పక్కన పెట్టటంతో దైవ ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చటం జరుగుతుంది. దేవుని ధర్మసూత్రాలికి మనుషులు విధేయులు కానవసరంలేదన్న సిద్దాంతం నైతిక విధిని బలహీపర్చి లోకంమీదికి దుష్టత్వపు వరదకు తలుపులు తెరుస్తుంది. అరాచకం, విధ్వంసం, దుర్నీతి వరదలా విస్తరిస్తున్నాయి. ప్రతీచోట అసూయ, కలహం, పరిశుద్ధ విధులకు నీళ్లిదలటం, వభిచారం దర్శనమిస్తున్నాయి. సాంఘిక జీవితానికి పునాది కావాల్సిన మత నియమాలు సిద్ధాంతాల వ్యవస్థ మొత్తం కూలిపోతూ శిథిలాల కుప్పగా మిగలటానికి సిద్దంగా ఉంది. PKTel 437.4

సీనాయి పర్వతంమీద నుంచి మాట్లాడిన స్వరం లోకచరిత్ర చివరి దినాల్లో ఇంకా ఇలా ప్రకటిస్తున్నది : నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” నిర్గమ. 20:3. మానవుడు తన చిత్రాన్ని దేవుని చిత్తానికి అడ్డువేస్తున్నాడు. అయితే ఆయన ఆజ్ఞాపించిన మాటను మానవుడు ఆపలేడు. మానవుడి మనసు ఉన్నతాధికారానికి లోబడాల్సిందే. సిద్ధాంతాలు ఊహాగానాలు ఎన్నో ఉండవచ్చు. మనుషులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా శాస్త్రాన్ని నిలపటానికి ప్రయత్నించవచ్చు. ఈరీతిగా దైవ ధర్మ శాస్త్రాన్ని తోసిపుచ్చవచ్చు. అయితే “ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.” అన్న ఆజ్ఞ బలంగా శక్తిమంతంగా వస్తున్నది. (మత్త. 4:10). PKTel 438.1

యెహోవా ధర్మశాస్త్రాన్ని బలహీనపర్చటం అన్నదీ లేదా బలోపేతం చెయ్యటం అన్నదేదీ లేదు. అనాదినుంచి ఉన్నట్లే అది ఉంది. అది ఇంతవరకు ఎలా పరిశుద్ధంగా, న్యాయంగా మేలుకరంగా సంపూర్ణంగా ఉన్నదో ఇకముందు కూడా అలాగే ఉంటుంది. దాన్ని రద్దు చెయ్యటంగాని మార్చటంగాని సాధ్యంకాదు. దాన్ని “ఘనపర్చటం” లేదా “కించపర్చటం అన్నది మానవుడి మాటతీరు మాత్రమే. PKTel 438.2

సత్యం అసత్యం మధ్య జరిగే అంతిమ మహా సంఘర్షణ మానవ చట్టాలకు యెహోవా ధర్మ శాసనాలకు మధ్య జరగనుంది. ఈ సమరంలో ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. ఇది ప్రత్యర్థి సంఘాల మధ్య జరిగే సమరంకాదు. బైబిలు మతానికి మానవ కల్పిత మతాలు సంప్రదాయాలకి మధ్య జరిగే సమరం. సత్యానికి వ్యతిరేకంగా ఒకటైన సాధనాలన్నీ ఇప్పుడు చురుకుగా పనిచేస్తున్నాయి. గొప్ప శ్రమననుభవించి, రక్తం చిందించి చెల్లించిన మూల్యంవల్ల మనకు వచ్చిన దేవుని పరిశుద్ద వాక్యానికి మనుషులు విలువనివ్వటం లేదు. దాన్ని తమ జీవిత నియమంగా ఒరవడిగా వాస్తవంలో అంగీకరించేవారు బహు కొద్దిమందే. అవిశ్వాసం ఆందోళనకరంగా పెరుగుతున్నది. ఇది లోకంలోనేకాదు సంఘంలో సయితం చోటుచేసుకుంటున్న పరిణామం. అనేకమంది క్రైస్తవ విశ్వాసానికి మూల స్తంభాల్లాంటి సిద్ధాంతాల్ని నమ్మటంలేదు. ఆత్మావేశంతో నిండిన ప్రవక్తలు రచించిన సృష్టి సత్యాల్ని, మానవుడి పతనాన్ని, పాప ప్రాయశ్చిత్తాన్ని, ధర్మశాస్త్రం నిత్యత్వాన్ని, క్రైస్తవ లోకంలోని అధిక సంఖ్యాకులు నిరాకరిస్తున్నారు. తమ జ్ఞానం గురించి అతిశయంతో నిండిన వేలాదిమంది బైబిలుని తు.చ. తప్పకుండా నమ్మటం బలహీనతకు సూచనని పరిగణిస్తున్నారు. లేఖనాల్ని తప్పుపట్టటం, తమ ముఖ్యమైన సూత్రాల్ని ఆధ్మాత్మీకరించి వాటికి వివరణ చెప్పటం జ్ఞానానికి రుజువని వారి భావన. త్వరలో ఈ లోకాన్ని ముంచిఎత్తనున్న విస్మయానికి క్రైస్తవులు సిద్ధపడాలి. దేవుని వాక్యాన్ని శ్రద్దగా పఠించటంద్వారాను, దానిననుసరించి తమ జీవిత సరళిని తీర్చి దిద్దుకోటంద్వారాను వారు ఈ సిద్ధబాటు చేసుకోవాల్సి ఉన్నారు. నిత్యత్వ సమస్యలు ఊహాత్మక మతంకాక ఇంకేదో మననుంచి డిమాండు చేస్తున్నవి. అది సత్యాన్ని ఆచరణంలో ఉంచే మాటలు ఆచారాల మతం. పునరుజ్జీవనానికి దిద్దుబాటుకి దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రసంగ వేదికనుంచి బైబిలు మాటలు మాత్రమే వినబడాలి. బైబిలు శక్తిని దోచుకోటం జరిగింది. ఫలితంగా ఆధ్మాత్మిక స్థాయి తగ్గింది. నేడు చాలా ప్రసంగాల్లో మనస్సాక్షిని మేల్కొలిపి ఆత్మకు జీవాన్నిచ్చే దైవశక్తి ప్రదర్శన లేదు. వింటున్న వారు “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” లూకా 24:32 అనలేరు. జీవం గల దేవునికోసం ఆశగా ఎదురు చూసేవారు ఆయన సన్నిధిని ప్రగాఢంగా కోరుకునేవారు ఎందరో ఉన్నారు. దైవవాక్యాన్ని హృదయంతో మాట్లాడనివ్వండి. సంప్రదాయాన్ని మానవ సిద్ధాంతాల్ని, నీతి సూత్రాల్ని మాత్రమే విన్నవారికి, ఆత్మను నూతనంచేసి, దాన్ని నిత్య జీవానికి తీర్చిదిద్దే ప్రభువు స్వరం వినిపించండి. PKTel 438.3

పితరులు ప్రవక్తలనుంచి గొప్ప వెలుగు ప్రకాశించింది. దేవుని పట్టణమైన సీయోనునుగూర్చి చక్కని సంగతులు వింటున్నాం. తన అనుచరులద్వారా తన వెలుగు ఈవిధంగా నేడు ప్రకాశించాలన్నది దేవుని సంకల్పం. పాత నిబంధన భక్తులు ప్రభువుకి నమ్మకంగా నివసించటం ద్వారా అంతగొప్ప సాక్ష్యం ఇస్తే, శతాబ్దాలుగా పోగుపడిన వెలుగు ఎవరిమీద ప్రకాశిస్తున్నదో వారు సత్యం తాలూకు శక్తినిగూర్చి ఇంకెంత శక్తిమంతమైన సాక్ష్యం ఇవ్వాలి? ప్రవచనాల మహిమ మన మార్గాన్ని వెలుగుతో నింపుతున్నది. దైవ కుమారుని మరణంలో ఛాయారూపం నిజరూపాన్ని కలిసింది. “పునరుత్థానమును జీవమును నేనే” (యోహా. 11:25) అని ప్రకటిస్తూ క్రీస్తు మృతుల్లోనుంచి లేచాడు అన్న సంగతుల్నీ మన జ్ఞాపకానికి తేవటానికి క్రీస్తు తన ఆత్మను లోకంలోకి పంపించాడు. తన అద్భుత శక్తి ప్రదర్శన వలన ఆయన తన లిఖిత వాక్యాన్ని యుగాలకొద్దీ పరిరక్షిస్తూ వస్తున్నాడు. PKTel 439.1

ఎవరి అసమ్మతివలన మనకు “ప్రొటస్టాంట్” అన్న పేరు వచ్చిందో ఆ సంస్కరణ వాదులు సువార్తను లోకానికి అందించటానికి దేవుడు తమను పిలిచాడని నమ్మారు. ఈ కార్య నిర్వహణ కృషిలో తమ ఆస్తిని, స్వేచ్ఛను తుదకు తమ ప్రాణాన్ని త్యాగం చెయ్యటానికి వారు సిద్ధమయ్యారు. హింస, మరణాల మధ్య సువార్తను పలుచోట్ల ప్రకటించారు. దైవవాక్యాన్ని ప్రజలకు అందించారు. గొప్పవారు కొద్దివారు, ధనికులు, దరిద్రులు, విద్యావంతులు, అజ్ఞానులు, అన్ని తరగతుల ప్రజలు తమకైతాము వాక్యాన్ని అధ్యయనం చేశారు. సంస్కర్తలు తాము నమ్మినదానికి ఎంత నమ్మకంగా నిలబడ్డారో మనమూ మనకు వచ్చిన సత్యానికి ఈ మహా సంఘర్షణలోని చివరి పోరాటంలో అంత నమ్మకంగా ఉన్నామా? PKTel 439.2

“సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్టించుడి. వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్టించుడి. పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి.... యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠము నకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు - యెహోవా, నీ జనుల యెడల జాలి చేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము.” “ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు మిదేవుడైన యెహోవా కరుణా వాత్సల్యముగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుగాక మా హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మికు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?” యోవేలు 2:15-17, 12-14. PKTel 440.1