Go to full page →

54 - బలవంతపు వసూళ్లు - మందలింపు PKTel 453

యెరూషలేము గోడ ఇంకా పూర్తి కాలేదు. పేద తరగతి ప్రజల దుస్థితి పైకి నెహెమ్యా గమనం ఆకర్షితమయ్యింది. అస్థిరంగా ఉన్న దేశ పరిస్థితిలో వ్యవసాయం చాలా మట్టుకు నిర్లక్ష్యానికి గురిఅయ్యింది. అదీగాక యూదాకు తిరిగివచ్చిన వారు అనుసరించిన స్వార్థ విధానంవల్ల దేవుని దీవెన వారి భూములపై లేదు. ధాన్యపు కొరత ఏర్పడింది. PKTel 453.1

తమ కుటుంబాలకు ఆహారం సంపాదించటానికి పేద ప్రజలు అప్పుచేసి అధిక ధరలకు తిండిగింజలు కొనుగోలు చేయాల్సి వచ్చేది. పారసీక రాజులు విధించిన భారమైన పన్నుల చెల్లింపుకు వారు వడ్డీపై డబ్బు అప్పు తీసుకోవలసి వచ్చేది. అది చాలదన్నట్లు, యూదుల్లో ధనికులు పేదల అవసర వస్తువుల విషయంలో వారిని దోచుకుని మరింత ధనికులయ్యారు. PKTel 453.2

పేదల సహాయార్థం ప్రతీ మూడో సంవత్సరం పదోభాగాన్ని పోగు చేయాల్సిందిగా ప్రభువు మోషేద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఆదేశించాడు. ఇంకో ఏర్పాటుకూడా ప్రభువు చేశాడు. అది ప్రతీ ఏడో సంవత్సరం వ్యవసాయ కార్యకలాపాలు నిలుపు చెయ్యటం. పంట భూమిని దున్నకుండా ఉంచి దానిలో స్వాభావికంగా వచ్చే ఫలసాయం బీదలకు విడిచిపెట్టటం. బీదల సహాయార్ధం, ఇంకా ఇతరత్రా ధార్మిక ప్రయోజనాల నిమిత్తం ఈ ఈవుల్ని నమ్మకంగా వినియోగించటం - ఇది దేవుడే సమస్తానికి సొంతదారుడన్న సత్యాన్ని తాము దీవెనలకు సాధనాలుగా ఉండవచ్చునన్న సత్యాన్ని నిత్యం ప్రజల ముందుంచేది. స్వార్థాన్ని నిర్మూలించి ఉదాత్త ప్రవర్తనను ప్రోదిచేసే శిక్షణ ఇశ్రాయేలీయులు పొందాలన్నది దేవుని ఉద్దేశం. PKTel 453.3

మోషేద్వారా దేవుడు ఇంకా ఇలా ఉపదేశించాడు : “నా ప్రజలలో నీ యొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వానియెడల జరిగింపకూడదు. వానికి వడ్డి కట్టకూడదు.” “నీవు వెండినేగాని ఆహార ద్రవ్యమునేగాని, వడ్డికి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.” నిర్గమ. 22:25; ద్వితి. 23:19. ఇంకా ఆయనిలా అన్నాడు, “నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణించకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కర చొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.” “బీదలు దేశములోఉండక మానరు. అందుచేత నేను - నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.” ద్వితి. 15:7,8,11. PKTel 453.4

చెర ప్రజలు బబులోను నుంచి తిరిగివచ్చిన తర్వాత ధనికులైన యూదులు కొన్నిసార్లు ఈ ఆజ్ఞలకు విరుద్ధంగా నడుచుకున్నారు. రాజుకి పన్ను చెల్లించటానికి బీదవారు అప్పు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ధనికులు వారికి అప్పిచ్చేవారు, కాని అది ఎక్కువ వడ్డీకి. బీదల భూముల్ని తాకట్టుపై తీసుకోటంద్వారా ఆ బాకీదారుల్ని పేదరికం ఊబిలోకి దించేవారు. అనేకులు తమ కుమారుల్ని కుమార్తెల్ని బానిసలుగా అమ్మేవారు. వారి పరిస్థితిని మెరుగుపర్చే మార్గంగాని వారి బిడ్డల్నిగాని భూముల్నిగాని విడిపించుకునేవల్లగాని వారికి ఉండేదికాదు. దినదినం పెరుగుతున్న దుఃఖం, నిత్యం వేధించే లేమి, బానిసత్వం తప్ప వారిముందు ఇంకేమి లేదు. అయినా వారంత ఒకే జాతి ప్రజలు, అదే నిబంధన బిడ్డలు. PKTel 454.1

కడకు ప్రజలు తమ దుస్థితిని నెహెమ్యా ముందుకి తెచ్చారు. “మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగించవలసివచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములో నున్నారు. మా భూములును మా ద్రాక్షతోటలును అన్యుల వశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది.” అన్నారు. PKTel 454.2

ఈ క్రూర హింసనుగురించి విన్నప్పుడు నెహెమ్యాకు పట్టపజాలనంత కోపం వచ్చింది. నెహెమ్యా ఇలా అంటున్నాడు, “వారి ఫిర్యాదును ఈ మాటలను నేను విన్నప్పుడు మిగుల కోపపడితిని.” బలవంతంగా వసూలు చేసే క్రూరమైన ఆచారాన్ని రూపుమాపటంలో జయం సాధించటానికి న్యాయాన్ని ధృఢంగా సమర్థించటం అవసరమని గుర్తించాడు. కష్టాల్లో ఉన్న తన సహోదరులికి సహాయమందించటానికి ఉద్రేకంతో ధృఢ నిశ్చయతతో కార్యాచరణకు పూనుకున్నాడు. PKTel 454.3

పేదల్ని హింసిస్తున్నవారు ధనికులని ఆ పట్టణ పునరుద్ధరణ కృషిలో వారి మద్దతు చాలా అవసరమన్న విషయం నెహెమ్యాను ఒక్క క్షణం సేపుకూడా ప్రభావితం చెయ్యలేదు. ప్రధానుల్ని సంస్థానాధిపతుల్ని మందలించాడు. పెద్ద సభను ఏర్పాటు చేసి ఈ అంశం పై దేవుని ధర్మవిధుల్ని వారికి వివరించాడు. PKTel 455.1

ఆహాజు రాజు ఏలుబడిలో చోటుచేసుకున్న సంఘటనలకు వారి గమనాన్ని తిప్పాడు. తమ క్రూరత్వానికి హింసకు ఇశ్రాయేలీయుల్ని మందలిస్తూ దేవుడు పంపిన వర్తమానాన్ని వారికి ఉటంకించాడు. యూదా ప్రజల్ని తమ విగ్రహారాధనవల్ల తమకన్నా ఎక్కువగా విగ్రహారాధన చేసే తమ సహోదరులైన ఇశ్రాయేలువారి చేతులకు దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో వేలాది యూదా ప్రజల్ని చంపి పగ సాధించారు. స్త్రీలను పిల్లల్ని బంధించారు. వారిని బానిసలుగా ఉంచుకోటానికో లేక అన్యజనులికి బానిసలుగా విక్రయించటానికో చూశారు. PKTel 455.2

యూదా ప్రజల పాపాల కారణంగా ప్రభువు కలుగజేసుకుని యుద్ధాన్ని నివారించ లేదు. కాని విజయం సాధించిన సైన్యం క్రూరమైన ఆలోచనను దేవుడు ఓదేదు ప్రవక్తద్వారా ఇలా మందలించాడు : “ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరచకొనదలచి యున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా?” 2 దిన వృ. 28:10. తమమీద ప్రభువు కోపము రగులుకున్నదని, తమ హేయ అన్యాయక్రియలు హింసాత్మక చర్యలకు దేవుడు తమ పైకి తీర్పులు పంపుతాడని ఓదేదు ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించాడు. ఈ మాటలు విన్న వెంటనే సైనికులు తాము చెరపట్టిన బందీలను విడిచిపెట్టి తాము కొల్లగొన్న ధనాన్ని అధిపతుల ముందు సమాజం ముందు పెట్టారు. అప్పుడు ఎఫ్రాయిము గోత్రంలోని కొందరు నాయకులు “లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైనవారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూర వృక్షములుగల పట్టణమగు యెరికో వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి.” 15వ వచనం. PKTel 455.3

నెహెమ్యా అతడితో పాటు ఇంకా కొందరు అన్యజనులకు అమ్మబడ్డ కొందరు యూదుల్ని ధనం చెల్లించి విడిపించారు. ఐహికమైన లాభంకోసం తమ సహోదరుల్ని బానిసలుగా అమ్మే విధానానికి విరుద్దంగా ఇప్పుడు నెహెమ్యా వారికి ఈ విధానాన్ని సూచించి ఇలా అన్నాడు, “మీరు చేయునది మంచిదికాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా?”, PKTel 455.4

పారసీక రాజునుంచి అధికారం పొందిన తానుకూడా తన సొంత ప్రయోజనాల కోసం పెద్ద మొత్తాల్లో ద్రవ్యం డిమాండు చెయ్యగలిగే వాణ్నే అని నెహెమ్యా చెప్పాడు. కాని తనకు న్యాయంగా చెందాల్సిన దాన్నికూడా అతడు తీసుకోలేదు. పేదల అక్కర తీర్చేందుకు అతడు ఉదారంగా సహాయం చేశాడు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న యూదు అధిపతులు ఆ దుష్కార్యానికి స్వస్తి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. బీదల భూముల్ని తిరిగి ఇచ్చెయ్యమని, వారివద్దనుంచి నిర్బంధంగా వసూలుచేసిన సొమ్మును తిరిగి చెల్లించమని, వారికి వడ్డీగాని పూచీకత్తుగాని లేకుండా అప్పు ఇవ్వమని అధిపతులకు విజ్ఞప్తి చేశాడు. PKTel 456.1

ఈ మాటల్ని నెహెమ్యా సర్వసమాజం సమక్షంలోనే చెప్పాడు. అధిపతులు తమ్మును తాము సమర్థించుకోజూస్తే అందుకు వారికి ఎంతో అవకాశం ఉంది. కాని వారు ఎలాంటి సాకు చెప్పకుండా, “నీవు చెప్పిన ప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరము” అన్నారు. అంతట నెహెమ్యా యాజకుల సమక్షంలో “ఈ వాగ్దానము ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము” చేయించాడు. “సమాజకులందరును ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరు ఈ మాటల చొప్పున జరిగించిరి.” PKTel 456.2

ఈ చరిత్ర ఓ ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.” 1 తిమో. 6:10. ఈ తరంలో లాభాపేక్ష ఓ ఉన్మాదమైపోయింది. మోసం వల్ల భాగ్యం సంపాదించటం జరుగుతుంది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నవారు కోకొల్లలుగా ఉన్నారు. వారు తక్కువ వేతనానికి వెట్టి చాకిరి చేస్తున్నారు. జీవిత అత్యవసర సదుపాయాలికి కూడా వారు నోచుకోలేదు. కఠిన శ్రమ, మంచి రోజుల నిరీక్షణలేని పరాధీనత వారి జీవితాల్ని దుర్భరం చేస్తున్నాయి. నిత్యం కష్టాలు శ్రమలతో నిండిన జీవితాన్ని వెళ్లదీస్తున్నవారు సహాయానికి ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా ఉన్నారు. వారనుభవిస్తున్న దుర్భర జీవితం ధనికుల విలాస జీవితాల్ని కొనసాగింపుకే! లేక అక్రమ నిల్వలు నిర్వహించాలన్న వారి కోర్కెల్ని తృప్తిపర్చటానికే! PKTel 456.3

ధనంపై ఆశ ఆడంబరంపై మక్కువ ఈ ప్రపంచాన్ని దొంగలు బందిపోట్ల గుహగా మార్చివేశాయి. క్రీస్తు రాకకుముందు ప్రబలే దురాశను హింసనుగూర్చి లేఖనాలు వివరిస్తున్నాయి. యాకోబు ఇలా రాస్తున్నాడు, “ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి. వాటి తుప్పు మిమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనము PKTel 456.4

కూర్చుకొంటిరి. ఇదిగో మా చేలుకోసి పనివారికియ్యక, మీరు మోసముగా బిగబట్టిన కూలి మొఱ్ఱ పెట్టుచున్నది. మా కోతవారి కేకలు సైన్యములకధిపతియుగు ప్రభువుయొక్క చెవులలో జొచ్చియున్నవి. మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైనవానికి శిక్ష విధించి చంపుదురు. అతడు మిమ్మును ఎదిరింపడు.” యాకోబు 5:1,3-6. PKTel 457.1

దైవ భీతిగలవారమని ఆయన మార్గంలో నడుస్తున్నవారమని చెప్పుకునేవారిలో సయతం ఇశ్రాయేలు యజమానులు అవలంబించిన మార్గాన్నే అనుసరిస్తూ అలాగే వ్యవహరిస్తున్నవారున్నారు. తమకు అధికారం ఉంది గనుక అన్యాయపు వసూళ్లు చేస్తూ హింసకు పాల్పడతారు. క్రీస్తు నామం ధరించిన వారిలో పేరాశ ద్రోహం కనిపిస్తున్నాయి గనుక, అక్రమ సంపాదనవల్ల ఆస్తులు సంపాదించేవారి పేళ్లు సంఘ పుస్తకాల్లో కొనసాగుతున్నాయి గనుక క్రీస్తు మతం తృణీకారానికి గురి అవుతుంది. దుబారా, అత్యాశ, బలవంతపు వసూళ్లు అనేకుల విశ్వాసాన్ని భ్రష్టపర్చి, వారి ఆధ్యాత్మికతను నాశనం చేస్తుంది. తన సభ్యుల పాపాలకు సంఘమే చాలామట్టుకు బాధ్యురాలు. పాపానికి వ్యతిరేకంగా గళమెత్తకపోతే దాన్ని సమర్థిస్తున్నట్లే. PKTel 457.2

క్రైస్తవుడికి లోకాచారాలు ప్రామాణికం కాదు. అతడు లోకం ఆచారాల్ని అనుకరించకూడదు. లౌకికుల్లా అత్యాశకు బలవంతపు వసూళ్లకు పాల్పడకూడదు. సహోదరుడి పట్ల జరిగించే ప్రతీ అన్యాయం, అక్రమ కార్యం బంగారు సూత్ర ఉల్లంఘన అవుతుంది. దేవుని బిడ్డలపట్ల జరిగించే ప్రతీ దుప్రియ ఆయన భక్తుల రూపంలో క్రీస్తుకు చేసినట్లే. ఇంకొకరి అజ్ఞానాన్ని బలహీనతను లేక దురదృష్టాన్ని సొమ్ము చేసుకోటానికి చేసే ప్రతీ ప్రయత్నం పరలోక గ్రంథంలో వంచనగా నమోదవుతుంది. నిజంగా దేవునికి భయపడే వ్యక్తి విధవరాండ్రను, తండ్రిలేనివారిని హింసించి లాభం సంపాదించేకన్నా లేదా ఓ పరదేశిని వెళ్లగొట్టి అతడి ఆస్తిని లాక్కొనే కన్నా, రాత్రింబగళ్లు కష్టించి పనిచేస్తాడు, పేదవాడి అరకొర భోజనం తిని ఉంటాడు. PKTel 457.3

నీతి నిజాయితీల స్వల్ప ఉల్లంఘన అడ్డుగోడలా నిలిచిన ఆంక్షలను తొలగించి మరిన్ని అన్యాయాలు అకృత్యాలు చేయటానికి హృదయాన్ని సిద్దపర్చుతుంది. ఒక వ్యక్తి ఇంకొకరికి నష్టం కలిగించి ఏ మేరకు లాభం పొందుతాడో ఆ మేరకు అతడి ఆత్మ పరిశుద్దాత్మ ప్రభావానికి స్పందించడు. అంత ఖరీదు పెట్టి సంపాదించిన లాభం భయంకర నష్టం తప్ప మరేమీకాదు. PKTel 457.4

దేవుని న్యాయం విషయంలో మనమందరం రుణస్తులమే. ఆ రుణం తీర్చటానికి మనవద్ద ఏమిలేదు. మనపై జాలిపడి దేవుని కుమారుడు మన విమోచన మూల్యాన్ని చెల్లించాడు. తన పేదరికంవల్ల మనల్ని ధనవంతులు చేసేందుకు ఆయన పేదవాడయ్యాడు. ఆయన మనపట్ల చూపించిన కరుణాకటాక్షాలకు మనం నిజంగా కృతజ్ఞులై ఉన్నామని పేదవారైన ఆయన బిడ్డలకు కనికరం చూపించటంద్వారా నిరూపించుకోగలం. అపోస్తలుడు పౌలు ఈ హితవు పలుకుతున్నాడు, “మనకు సమయము దొరికిన కొలది అందరియెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరువాని యెడలను మేలు చేయుదము.” గలతీ. 6:10. అతడి మాటలు రక్షకుని ఈ మాటలకు అనుగుణంగా ఉన్నాయి : “బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు. మీకిష్టమైనపుడెల్ల వారికి మేలు చేయవచ్చును.” “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగునే మీరును వారికి చేయుడి . ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది.” మార్కు 14:7; మత్త. 7:12. PKTel 458.1