Go to full page →

43—రోములో AATel 319

ఓడ ప్రయాణం మళ్లీ ఆరంభమైనప్పుడు శతాధిపతి అతడి ఖైదీలు తమ రోము ప్రయాణాన్ని కొనసాగించారు. పశ్చిమానికి వెళ్ళే మార్గంలో మెలితేలో శీతాకాలం గడిపిన “అశ్విని చిహ్నముగల” అలెక్సంద్రియ పట్టణం ఓడలో ఈ ప్రయాణికులు ఎక్కారు. ఎదురు గాలుల వలన కొంత జాప్యం జరిగినా ఓడ ప్రయాణం సురక్షితంగా పూర్తి అయ్యింది. ఓడ ఇటలీ తీరంలోని పొతియొలీ రేవు చేరి అక్కడ లంగరు వేసింది. AATel 319.1

ఈ స్థలంలో కొంతమంది క్రైస్తవులున్నారు. తమతో ఏడు దినాలు ఉండాల్సిందిగా వారు పౌలుని అర్థించారు. వారి మనవిని శతాధిపతి మన్నించి వారితో పౌలు ఉండే ఆధిక్యతను వారికిచ్చాడు. పౌలు రోమీయులకు రాసిన ఉత్తరాన్ని అందుకొన్నప్పటినుంచి ఇటలీలోని క్రైస్తవులు ఆ అపొస్తలుడి సందర్శన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. పౌలు ఖైదీగా వస్తాడనుకోలేదు. అతని శ్రమలు అతన్ని వారికి మరింత ప్రీతిపాత్రుణ్ని చేశాయి. పొలియొలీ నుండి రోముకి నూట ఏబయి మైళ్ళు మాత్రమే. ప్రధాన నగరంతో ఆ రేవు ఎప్పుడు సంప్రదిస్తూ ఉండటంతో పౌలు రాక గురించి రోమా క్రైస్తవులికి వార్త అందింది. అందుకు కొందరు పౌలును కలిసి స్వాగతం పలకటం జరిగింది. AATel 319.2

ఆ రేవు చేరిన ఎనిమిదోరోజు శతాధిపతి అతడి ఖైదీలు రోము కు ప్రయాణమయ్యారు. తన అధికార పరిధిలో చేయగలిగిన ఉపకారాలన్నీ పౌలుకి యూలి చేశాడు. కాని ఖైదీగా పౌలు స్థితిని మార్చలేక పోయాడు. తనను కావలి కాసే సైనికుడికి పౌలును బంధించిన గొలుసుల్ని తీసివేయలేకపోయాడు. తాను ఎంతో కాలంగా ఎదురుచూసిన ప్రపంచ కేంద్ర పట్టణాన్ని సందర్శించటానికి పౌలు బరువెక్కిన హృదయంతో ముందుకు వెళ్లాడు. తాను ఎదురు చూసిన దానికి ఇప్పటి పరిస్థితులకు మధ్య ఎంత వ్యత్యాసముంది! అతని సంకెళ్ళు అతనికి వచ్చిన అపఖ్యాతి సువార్త ప్రకటించటానికి ఎలా ప్రతిబంధకాలయ్యాయి! రోములో అనేక ఆత్మల్ని సత్యంలోని నడిపించాలన్న తన ఆశలు నిరాశలుకానున్నాయి! AATel 319.3

చివరికి ప్రయాణికులు రోముకి నలబై మైళ్ళ దూరంలో ఉన్న అప్పీయాకు వచ్చారు. వారు జనులతో నిండిన మార్గాలగుండా వెళ్తున్నప్పుడు, కరడుగట్టిన నేరగాళ్ళ నడుమ సంకెళ్లు ధరించిన తెల్లని వెంట్రుకల వృద్ధుడు అనేకుల కోరచూపుల్ని ఆకర్షిస్తూ ఎగతాళికి ఛలోక్తులకు కేంద్రబిందువయ్యాడు. AATel 320.1

హఠాత్తుగా ఉత్సాహంతో కేకలువేయటం వినిపించింది. నడుస్తున్న జన సమూహముంలో నుంచి ఒక వ్యక్తి దూసుకువచ్చి ఆ ఖైదీ మెడమీద పడి ఆనంద బాష్పాలు కారుస్తూ ఎంతోకాలం తర్వాత తండ్రిని కలుస్తున్న కుమారుడులా అతణ్ని కౌగిలించుకున్నాడు. సంకెళ్లలో ఉన్న బందీని కొరింథులోను, ఫిలిప్పీలోను, ఎఫెసులోను తమకు జీవవాక్యాన్ని బోధించిన దైవ సేవకునిగా పరీక్షగాను ఆప్యాయంగాను చూసినప్పుడు ఆ దృశ్యం పదే పదే పునరావృత్తమయ్యింది. AATel 320.2

మమతానురాగాలతో నిండిని శిష్యులు ఆతృతగా తమ సువార్త జనకుడి చుటూ గుమిగూడగా ఆ ప్రయాణికులు ముందుకి సాగలేక ఆగిపోయారు. జరుగుతున్న ఆలస్యానికి సైనికులు మండిపడున్నారు. అయినా సంతోషానందాల్తో నిండిన ఈ కలయికను ఆపటానికి వారికి మనసురాలేదు. ఎందుకంటే ఆ ఖైదీ అంటే వారికీ అభిమానానురాగాలు పెరిగాయి. చిక్కి బాధకు అద్దంపడుతున్న ఆ . ముఖంలో శిష్యులు క్రీస్తు స్వరూపం ప్రతిబింబాన్ని చూశారు. తనను మర్చిపోలేదని, తనను అభిమానించటం మానలేదని ఆ శిష్యులు పౌలుతో చెప్పారు. తమ జీవితాల్సి ఉత్తేజపర్చి దేవుని విషయంలో తమకు సమాధానాన్నిచ్చే ఉత్సాహభరిత నిరీక్షణను అందించినందుకు తనకెంతో రుణపడివున్నామని పౌలుకి చెప్పారు. పౌలుపట్ల వారికున్న ప్రేమనుబట్టి అతన్ని భుజాల మీద మోసుకువెళ్ళే ఆధిక్యత తమకిస్తే రోము నగరంలోకి మోసుకెళ్లటానికి వారు సిద్ధంగా ఉన్నారు. AATel 320.3

సహోదరుల్ని చూసినప్పుడు పౌలు “దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను” అన్న లూకా మాటలు ప్రాముఖ్యాన్ని గుర్తించేవారు బహు కొద్దిమంది. తన బంధకాల గురించి సిగ్గుపడని, అపొస్తలుడు దు:ఖితులైన ఆ విశ్వాసుల మధ్య నిలిచి దేవునికి స్తుతులర్పించాడు. అతని ముఖం పై కనిపించిన విచారం మాయమయ్యింది. ఒకదాని వెంట ఒకటిగా వచ్చిన శ్రమలు, బాధలు, ఆశాభంగాలతో అతని క్రైస్తవ జీవితం కూడుకున్నది. కాని ఆ ఘడియలో దానంతటికి సమృద్ధిగా ప్రతిఫలం పొందానన్న అనుభూతిని పొందాడు. మరింత దృఢమైన అడుగులు వేసుకుంటూ ఉత్సాహానందాలతో తన సేవా మార్గాన కొనసాగాడు. జరిగిపోయిన గతాన్ని గురించి ఫిర్వాదులేమీ లేవు. భవిష్యత్తును గూర్చిన భయాలసలే లేవు. బంధకాలు శ్రమలు తన ముందున్నవని అతనికి తెలుసు. కాని ఇంకా భయంకరమైన బానిసత్వం నుంచి ఆత్మల్ని విడిపించటం తన ఆధిక్యత అని కూడా అతనికి తెలుసు. కనుక క్రీస్తు నిమిత్తం శ్రమలనుభవించటానికి పౌలు సంతోషించాడు. AATel 320.4

రోములో శతాధిపతి యూలి తన ఖైదీల్ని చక్రవర్తి భటుల అధికారికి అప్పగించాడు. అతడు పౌలును గురించి చెప్పిన మంచిమాట దానితో పాటు పేస్తు ఉత్తరం వీటిని బట్టి ఆ అధికారి పౌలును దయగా చూశాడు. చెరసాలలో పడెయ్యటానికి బదులు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో పౌలుని ఉండనిచ్చాడు. ఇంకా ఒక సైనికుడికి గొలుసులతో బంధితుడైవున్న పౌలు స్నేహితుల్ని పిలుచుకోటానికి, క్రీస్తు సేవలో కృషిసాగించటానికి అతనికి స్వేచ్ఛ లభించింది. కొన్ని సంవత్సరాల కిందట రోమునుంచి బహిష్కృతులైన యూదులు తిరిగి రావటానికి అనుమతి లభించింది. కనుక యూదులు పెద్ద సంఖ్యలో రోములో నివసించటం జరగాల్సివుంది. తన శత్రువులు తనకు విరోధంగా వీరిని ప్రభావితం చెయ్యకముందు తనను గూర్చి తన సేవను గూర్చి ముందు వీరికి చెప్పాలని పౌలు ఉద్దేశించాడు. కనుక రోము చేరుకున్న మూడు రోజులికి వారి నాయకుల్ని సమావేశపర్చి రోముకి ఎందుకు ఖైదీగా వచ్చాడో సూటిగా స్పష్టంగా చెప్పాడు. AATel 321.1

పౌలిలా అన్నాడు, “సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. వీరు నన్ను విమర్శచేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియులేనందున నన్ను విడుదలచేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియు మోపవలెనని నాయభిప్రాయము కాదు. ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నాను.” AATel 321.2

యూదుల చేతుల్లో తాను పొందిన అవమానాల్ని గురించిగాని లేదా తనను చంపటానికి వారు పదే పదే చేసిన కుట్రల గురించిగాని అతడు ఒక్కమాటకూడ పలకలేదు. అతడు జాగ్రత్తగా దయగా మాట్లాడాడు. వ్యక్తిగత ప్రాముఖ్యం కోసం లేదా సానుభూతికోసం అతడు వెంపర్లాడలేదు. సత్యాన్ని సమర్థించటానికి సువార్త ఔన్నత్యాన్ని కాపాడటానికి పాటుపడ్డాడు. AATel 321.3

ప్రభుత్వం నుంచిగాని వ్యక్తుల నుంచిగాని ఉత్తరాలేమీ తమకు రాలేదని, రోముకు వచ్చిన యూదుల్లో ఎవరూ తనపై ఆరోపణలు మోపలేదని తన శ్రోతలు తనను గూర్చి పౌలుకి సమాధానం చెప్పారు. క్రీస్తు పై తనకు గల విశ్వాసానికి కారణాల్ని వినాలని ఉన్నదని కూడా వారు పౌలుతో అన్నారు. “ఈ మత భేదమును గూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు, ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.” AATel 321.4

వారే కోరారు గనుక సువార్త సత్యాల్ని వారి ముందుంచటానికి ఒక దినం ఏర్పాటుచేయాల్సిందిగా పౌలు కోరాడు. నియమిత సమయానికి అనేకమంది సమావేశమయ్యారు. “ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.” తన సొంత అనుభవాన్ని వారికి చెప్పి పాత నిబంధననుంచి వాదనలను అతిసరళంగా, యధార్థంగా శక్తిమంతంగా వారికి సమర్పించాడు. AATel 322.1

మతమంటే కర్మకాండలు, ఆచారాలు, సంప్రదాయాలు, సిద్ధాంతాలు కాదని అపొస్తలుడు సూచించాడు. అదే అయితే, స్వాభావిక మనిషి లోక విషయాల్ని అవగతం చేసుకున్న రీతిగానే దాన్ని పరిశోధించి అవగాహన చేసుకోగలుగుతాడు. మతం ఆచరణాత్మకమైన రక్షణనిచ్చే శక్తి. అది పూర్తిగా దేవుని వద్దనుంచి వచ్చే నియమం. నూతనపర్చే దైవ శక్తిని ఆత్మ వ్యక్తిగతంగా అనుభవించటం. తాము వినుకొనాల్సిన ప్రవక్తగా రానైయున్న క్రీస్తును మోషే ఇశ్రాయేలీయులకు ఎలా చూపించాడో, పాప సమస్యకు పరిష్కారంగా నిరపరాధి అయిన ఆయనను పాపాలు భరించాల్సివున్న వానిగా ప్రవక్తలందరు ఆయనను గూర్చి ఎలా సాక్ష్యమిచ్చారో పౌలు విశదీకరించాడు. వారి సంప్రదాయాల్ని ఆచారాల్ని తప్పుపట్టలేదు. కాని తాము ఆచారాలు కర్మకాండలతో కూడిన సేవల్ని నిష్ఠగా ఆచరిస్తూనే వాటికి అసలు ఎవరో ఆ ప్రభువును వారు నిరాకరిస్తున్నారని కుండబద్దలుకొట్టాడు. AATel 322.2

తాను క్రైస్తవం స్వీకరించకముందు క్రీస్తునుగూర్చి తనకు తెలుసునని చెప్పాడు పౌలు. అయితే అది వ్యక్తిగత పరిచయం ద్వారా కాదని, ఇతరుల్లా తనకున్న అభిప్రాయాన్నిబట్టి రానున్న మెస్సీయా ప్రవర్తనను సేవను గూర్చిన అభిప్రాయాలు తనకుండేవని పౌలు చెప్పాడు. అయితే ఇప్పుడు క్రీస్తును గురించి ఆయన కర్తవ్యాన్ని గురించి పౌలు అభిప్రాయాలు మరెక్కువ ఆధ్యాత్మికమూ సమున్నతమూ అయినవి. తమకు శారీరకమైన క్రీస్తును తాను పరిచయం చెయ్యలేదని అపొస్తలుడు వారితో చెప్పాడు. క్రీస్తు మానవుడుగా ఉన్న రోజుల్లో హేరోదు ఆయనను చూశాడు. ఆయనను అన్న చూశాడు. పిలాతు, యాజకులు, ప్రధానులు చూశారు. రోమా సైనికులు ఆయనను చూశారు. కాని వారు ఆయనను మహిమపొందిన రక్షకుడుగా చూడలేదు. క్రీస్తును విశ్వాసం ద్వారా అవగతం చేసుకోటం, ఆయనను గూర్చి ఆధ్యాత్మిక జ్ఞానం ఆర్జించటం ఎంతో ఆశింపదగింది. ఆయన లోకంలో నివసించినప్పుడు వ్యక్తిగత పరిచయం కలిగివుండటంకన్నా ఎక్కువ ఆశించ దగింది. పౌలుకి క్రీస్తుతో ఇప్పుడున్న ఆత్మీయత కేవలం లోక సంబంధమైన, మానవ సంబంధమైన స్నేహంకన్నా ఎక్కువ గాఢమైంది, ఎక్కువ దృఢమైంది. నజరేయుడైన యేసే ఇశ్రాయేలు నిరీక్షణ అంటూ పౌలు తనకు తెలిసింది చెప్పగా తాను చూసినదాన్ని సాక్ష్యమియ్యగా సత్యం కోసం నమ్మకంగా వెదకుతున్నవారు విశ్వసించారు. అతని మాటలు కొందరి మనసులపై చెరగని ముద్రవేశాయి. పరిశుద్ధాత్మ ప్రత్యేక వరమున్న దైవ సేవకుడు ఇతరులు నా స్పష్టమైన లేఖనసాక్ష్యాన్ని బోధించినా అంగీకరించలేదు. అతని వాదనల్ని కాదనలేకపోయినా అతని వర్తమానాన్ని విసర్జించారు. AATel 322.3

పౌలు రోము నగరానికి చేరుకున్న అనంతరం యెరూషలేములోని యూదులు ఈ ఖైదీ పై తమ ఆరోపణల్ని తెలియజెయ్యటానికి హాజరుకాకముందు చాలా నెలలు గడిచాయి. వారి దురాలోచనలు పదే పదే ఓటమి పాలయ్యాయి. ఇప్పుడు పౌలు రోమా ప్రభుత్వ సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పుపొందాల్సి ఉండగా మరోసారి పరాజయం పాలుకాకూడదన్నది వారి దృఢసంకల్పం. లూసియ, ఫెలిక్సు, ఫేస్తు, అగ్రిప్పలు పౌలు నిరపరాధి అని శిక్షార్హుడుకాడని ప్రకటించారు. కాబట్టి పౌలు శత్రువులు చక్రవర్తిని కుతంత్రం ద్వారా తమ పక్కకు తిప్పుకోటం ఒక్కటే శరణ్యం. ఆలస్యం వారి లక్ష్యసాధనకు సాయపడుంది. వారి ప్రణాళికల్ని రూపొందించుకొని ఆచరణలో పెట్టటానికి వారికి అది తోడ్పడుంది. అందుకే వారు పౌలు పై తమ ఆరోపణల్ని వ్యక్తిగతంగా సమర్పించటంలో తాత్సారం చేశారు. AATel 323.1

దేవుని ఏర్పాటులో ఈ ఆలస్యం సువార్త ప్రజ్వలనానికి దోహదపడింది. పౌలు పై అజమాయిషీవున్న అధికారుల సద్భావన వల్ల, అతడు విశాలమైన గృహంలో నివసించటానికి అనుమతి లభించింది. ఆ గృహంలో పౌలు తన మిత్రుల్ని కలుసుకోవచ్చు, వినటానికి ప్రతీ రోజూ వచ్చేవారికి సత్యాన్ని బోధించవచ్చు. ఈ రకంగా పౌలు రెండు సంవత్సరాలు ” ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.” AATel 323.2

అనేక ప్రాంతాల్లో తాను స్థాపించిన సంఘాల్ని అతడు ఈ వ్యవధిలో మర్చిపోలేదు. నూతనంగా సత్యాన్నంగీకరించిన విశ్వాసులు ఎదుర్కొనే ప్రమాదాల్ని గుర్తెరిగి వారి ఆధ్యాత్మికావసరాల్ని సాధ్యమైనంత మేరకు హెచ్చరికలు ఉపదేశంతో నిండిన ఉత్తరాల ద్వారా పౌలు తీర్చాడు. అంతేకాదు, ఈ సంఘాల్లో సేవచేయటానికి గాక తాను సందర్శించని ప్రాంతాల్లో పనిచెయ్యటానికి సేవపట్ల అంకితభావం కల సువార్తికుల్ని రోమునుంచి పంపించాడు. ఈ కార్యకర్తలు పౌలు స్థాపించిన సేవను విజ్ఞులైన కాపరులుగ బలోపేతం చేశారు. వారితో నిత్య సంబంధం ద్వారా సంఘాల్లోని పరిస్థితుల్ని అవి ఎదుర్కొంటున్న ప్రమాదాల్ని తెలుసుకుంటున్న అపొస్తలుడు వారి సేవలను జ్ఞానయుక్తంగా పర్యవేక్షించాడు. AATel 323.3

ప్రత్యక్ష సేవనుంచి దూరంగా ఉన్నట్లు కనిపించినా ఈ విధంగా పౌలు తాను స్వేచ్చగా ఉండి సంఘాల్ని దర్శించిన రోజుల్లో కన్నా విస్తృతమైన దృఢమైన ప్రభావాన్ని దైవసేవ పై చూపాడు. ప్రభువు నిమిత్తం ఖైదీగా అతడు సహోదరుల మమకారాల్లో సుస్థిర స్థానాన్ని పొందాడు. క్రీస్తు నిమిత్తం బందీగావున్న అతడు రాసిన మాటలు తాను వ్యక్తిగతంగా వారితో ఉన్నప్పటికన్నా ఎక్కువ శ్రద్ధతో కూడిన గమనాన్ని గౌరవాన్ని పొందాయి. పౌలు తమ మధ్య ఇక లేకపోయేంతవరకూ విశ్వాసులు తమ పక్షంగా అతడు పని భారాల్ని భరించాడో గుర్తించలేదు. ఇంతవరకూ భార బాధ్యతల్ని వహించకపోవటానికి పౌలు వివేకం, నేర్పు, అలు పెరుగని శక్తి తమకు లేవని సాకులు చెప్పి తప్పించుకున్నారు. అనుభవం కొరవడినవారు తాము తృణీకరించిన పాఠాల్నే నేర్చుకోవాల్సిరాగా ఇప్పుడు అతని హెచ్చరికల్ని, హితవచనాల్ని, ఉపదేశాల్ని ఎంతో విలువైనవిగా ఎంచారు. అతని వ్యక్తిగత సేవకన్నా విలువైనవిగా ఎంచారు. తన దీర్ఘ చెరసాల కాలంలో అతని ధైర్యం విశ్వాసం గురించి తెలుసుకున్నప్పుడు దేవుని సేవ చెయ్యటంలో వారు మరెక్కువ నమ్మకంగా మరెక్కువ ఉద్రేకంగా ఉండటానికి స్ఫూర్తిని పొందారు. AATel 324.1

రోములో పౌలుకు సహాయకులుగా ఉన్నవారిలో అనేకులు అతని పూర్వ స్నేహితులు సహ సువార్త సేవకులూను. యెరూషలేముకు చేసిన ప్రయాణంలోను, కైసరయలోని రెండు సంవత్సరాల ఖైదు కాలంలోను, రోముకు కష్టాలకడలిలో చేసిన ప్రయాణంలోను పౌలుతో ఉన్న “ప్రియుడైన వైద్యుడు” లూకా ఇంకా పౌలుతో ఉన్నాడు. తిమోతి కూడా పౌలుకి పరిచర్య చేయటంతో నిమగ్నుడయ్యాడు. “ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును” అయిన తునకు అపొస్తలుని పక్క నమ్మకంగా నిలిచి సేవచేశాడు. అరిస్తార్కు, ఎపఫ్రాలు పౌలుతో చెరసాలలో ఉన్నారు. కొలొస్స 4:7-14. AATel 324.2

క్రైస్తవ విశ్వాసాన్ని, స్వీకరించినప్పటినుంచీ మార్కు క్రైస్తవానుభవం బలీయమౌతూ వచ్చింది. క్రీస్తు జీవితాన్ని మరణాన్ని నిశితంగా అధ్యయనం చేసి రక్షకుని కర్తవ్యం గురించి దానికి సంబంధించిన శ్రమలు సంఘర్షణల్ని గురించి మార్కు స్పష్టమైన అభిప్రాయాల్ని ఏర్పర్చుకున్నాడు. క్రీస్తు చేతులు పాదాల్లోని మచ్చల్లో మానవాళికి ఆయన సేవను గ్రహించి, నశించినవారిని రక్షించటానికి ఆత్మ త్యాగశీలత ఎంతవరకు వెళ్తుందో అన్నది గుర్తించి ఆత్మత్యాగం బాటలో రక్షకుని వెంబడించటానికి మార్కు నిశ్చయించుకున్నాడు. ఖైదీ అయిన పౌలు దుస్థితిలో పాలుపంచుకుంటూ క్రీస్తును సంపాదించటం అపారమైన లాభమని లోకాన్ని సంపాదించి క్రీస్తు దేని రక్షణ కోసమైతే తన రక్తాన్ని చిందించాడో ఆ ఆత్మను నశింపనియ్యటం అనంతమైన నష్టమని ముందెన్నటికన్నా ఇప్పుడు అతడు అవగాహన చేసుకున్నాడు. తీవ్ర శ్రమలు ప్రతికూల పరిస్థితుల నడును మార్కు అపొస్తలునికి నమ్మకమైన ప్రియమైన సహాయకుడిగా సేవచేశాడు. AATel 324.3

దేమా కొంతకాలం నమ్మకంగా ఉండి తర్వాత క్రీస్తు సేవను విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. దీన్ని ప్రస్తావిస్తూ పౌలిలా రాస్తున్నాడు, ” దేమా యిహలోకమును స్నేహించి నిన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్ళేను.” 2 తిమోతి 4:10. లోకాన్ని సంపాదించేందుకోసం దేమా ప్రతీ ఉన్నత ఉదాత్త ఆశయాన్ని పిరాయింపుగా ఇచ్చేశాడు. ఈ పిరాయింపు ఎంత బుద్దిహీనమైంది! లోక భాగ్యాన్ని మాత్రమే కలిగివున్న దేమా వాస్తవానికి నిరు పేద. తనకెంత ఉన్నదని గర్వపడినా అది వ్యర్థమే. కాగా క్రీస్తు నిమిత్తం శ్రమలనుభవించటానికి ఎంపిక చేసుకున్న మార్కు నిత్యసంపదను అందిపుచ్చుకున్నాడు. అతడు పరలోకంలో దేవుని ఆస్తికి వారసుడుగా ఆయన కుమారునితో సహవారసుడుగా పరిగణన పొందుతాడు. AATel 325.1

రోములో పౌలు సేవ ద్వారా తమ హృదయాల్ని దేవునికిచ్చిన వారిలో అన్యుడైన బానిస ఒనేసిము ఒకడు. ఒనేసిము కొలొస్సయిలోని క్రైస్తవ విశ్వాసి ఫిలేమోను సేవకుడు. ఫిలేమోనుకి అన్యాయంచేసి రోముకి పారిపోయాడు. జాలి మనసుగల పౌలు పారిపోయి వచ్చిన ఈ బానిస పేదరికాన్ని నివారించే ఉద్దేశంతో అతడి చీకటి హృదయంలో సత్వకాంతిని ప్రసరింపచేశాడు. ఒనేసిము జీవవాక్యాన్ని నమ్మాడు. తన పాపాల్ని ఒప్పుకొని క్రీస్తును విశ్వసించి క్రైస్తవుడయ్యాడు. AATel 325.2

తన భక్తివల్ల చిత్తశుద్ధివల్ల అంతేగాకుండా అపొస్తలునికి చేసిన సేవలవల్ల సువార్త సేవా వ్యాప్తికి ఉద్రేకంగా పాటుపడటంవల్ల అతడు పౌలుకి ఇష్టుడయ్యాడు. మిషనరీ సేవలో బహుగా ఉపయోగపడే సహాయకుణ్ని అతనిలో పౌలు చూశాడు. అందుకే తాను వెంటనే ఫిలేమోను వద్దకు తిరిగి వెళ్ళి క్షమాపణ వేడుకుని తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవలసిందని హితవు పలికాడు. ఒనేసిము ఫిలేమోనునుంచి దొంగతనం చేసిన సొమ్ముకు తాను బాధ్యత వహిస్తానని పౌలు వాగ్దానం చేశాడు. చిన్న ఆసియాలోని సంఘాలకు ఉత్తరాలతో తుకికును పంపుతూ ఒనేసిమును అతనితో పంపాడు పౌలు. తాను దోచుకున్న యజమానికి ఇలా లొంగిపోవటం ఈ బానిసకు కఠినపరీక్ష. ఆయితే ఒనేసిము నిజంగా మారి క్రైస్తవుడయ్యాడు. ఈ విధి నిర్వహణ నుంచి వైదొలగలేదు. AATel 325.3

ఫిలేమోనుకు తాను రాసిన ఉత్తరాన్ని పౌలు ఒనేసిముతోనే పంపాడు. ఆ ఉత్తరంలో పశ్చాత్తాపం పొందిన బానిస పక్షంగా అపొస్తలుడు తనమామూలు నేర్పుతో దయతో విజ్ఞాపన చేసి భవిష్యత్తులో ఒనేసిమును తన సేవలో ఉంచుకోవాల్సిందిగా అభ్యర్థించాడు. ఫిలేమోనును మిత్రుడుగాను తోటి సేవకుడుగాను సంబోధిస్తూ ఆ ఉత్తరాన్ని పౌలు ప్రారంభించాడు. AATel 325.4

“మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును నాకు కలుగును గాక. నీ ప్రేమను గూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్దుల యెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనయందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమునందు పాలివారగుట అనునది కార్యకారి కావలయుననియు వేడుకొను చున్నాను.” తన ప్రతీ సదుద్దేశం తన ప్రవర్తనలోని ప్రతీ గుణము క్రీస్తు కృపను బట్టే కలిగినవని ఇది మాత్రమే తనను దుర్మార్గులు పాపులనుంచి వ్యత్యాసంగా ఉంచుతుందని అపొస్తలుడు ఫిలేమోనుకు గుర్తుచేశాడు. ఆ కృపే ఒక నికృష్ట నేరస్తుణ్ని దేవుని బిడ్డగాను సువార్త సేవలో విలువైన కార్యకర్తగాను చేస్తుందన్నాడు. AATel 325.5

క్రైస్తవుడుగా తన విధిని నిర్వర్తించమని పౌలు ఫిలేమోనుని కోరేవాడే. కాని విజ్ఞాపన భాషనే అతడు ఎంచుకున్నాడు. “వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరిమంచిదనుకొని, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడే గాని యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయెను.” - AATel 326.1

ఒనేసిము క్రైస్తవాన్ని స్వీకరించటం దృష్టిలో ఉంచుకుని, మారుమనసుపొందిన బానిసను తన సొంత బిడ్డగా స్వీకరించమని ఆ సేవకుడు తనతో ఉండటానికి ఇష్టపడే రీతిగా అతణ్ని ప్రేమించమని “అతడి కమీదట దాసుడుగా ఉండక దాసునికంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను” ఉండేందుకు స్వీకరించమని అపొస్తలుడు ఫిలేమోనును అభ్యర్థించాడు. బంధకాల్లోవున్న తనకు సహాయకుడుగా ఒనేసిమును ఉంచుకోవాలన్న కోరికను వ్యక్తంచేశాడు. ఆ మాటకొస్తే ఫిలేమోను తానే తనకు సహాయం చేసేవాడే అన్న విశ్వాసాన్ని వెలిబుచ్చి ఫిలేమోను తనంతటతానే ఒనేసిమును స్వతంత్రుణ్ని చేస్తే తప్ప తాను ఒనేసిమును ఉంచుకోదలచుకోలేదని పౌలు తెలిపాడు. AATel 326.2

యజమానులు తమ బానిసలపట్ల ఎంత కర్కశంగా వ్యవహరించేవారో పౌలుకి బాగా తెలుసు. ఒనేసిము ప్రవర్తన ఫిలేమోనుకు తీవ్ర అసంతృప్తి కలిగించిందని కూడా పౌలుకి తెలుసు. క్రైస్తవుడుగా ఫిలేమోనులో దయ మొదలైన సున్నిత భావాలను రేకెత్తించే విధంగా పౌలు ఆ ఉత్తరం రాశాడు. ఒనేసిము క్రైస్తవుడిగా మారటంద్వారా విశ్వాసంలో అతడు ఫిలేమోనుకు సహోదరుడయ్యాడు. ఈ నూతన విశ్వాసికి విధించే ఏ శిక్షఅయినా తనకు విధించినట్లే పౌలు పరిగణిస్తాడు. AATel 326.3

నేరస్తుడైన ఒనేసిము శిక్షను తప్పించుకొని తాను పొగొట్టుకున్న ఆధిక్యతల్ని హక్కుల్ని మళ్ళీ పొందేందుకు అతని అప్పును తాను చెల్లిస్తానని పౌలు స్వచ్ఛందంగా ముందుకువచ్చాడు. “కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగచేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను అది నాలెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను. అది నేనే తీరును.” AATel 326.4

పశ్చాత్తపుడైన పాపిపట్ల క్రీస్తు ప్రేమకు ఇది ఎంత చక్కటి ఉదాహరణ! తన యజమానిని దోచుకున్న సేవకుడు దాన్ని తిరిగి చెల్లించేందుకు అతడివద్ద ఏమిలేదు. పాపి దేవుని వద్దనుంచి ఎన్నో సంవత్సరాల సేవను దోచుకుని రుణం రద్దు చేసుకునే మార్గం లేకుండా ఉన్నాడు. యేసు మానవుడికి దేవునికి మధ్య వచ్చి ఆ రుణాన్ని తాను చెల్లిస్తానంటున్నాడు. “పాపిని విడిచి పెట్టండి. అతని బదులు నేను శిక్షను భరిస్తాను” అంటున్నాడు. AATel 327.1

ఒనేసిము రుణాన్ని తామ తీర్చుతానని చెప్పిన తర్వాత ఫిలేమోను తనకు ఎంతగా రుణపడివున్నాడో అపొస్తలుడు గుర్తుచేశాడు. తన ఆత్మ నిమిత్తమే ఫిలేమోను పౌలుకు అచ్చివున్నాడు. ఎందుకంటే ఫిలేమోను క్రైస్తవుడవ్వటంలో దేవుడు పౌలును తన సాధనంగా ఉపయోగించుకున్నాడు. తన దాతృత్వం ద్వారా పరిశుద్దుల్ని సేదదీర్చవలసిందిగా ఫిలేమోనుకు పౌలు సున్నితంగా విజ్ఞప్తి చేశాడు. “నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.” అన్నాడు చివరగా. AATel 327.2

యజమాని సేవకుల మధ్య సంబంధాల పై సువార్త ఎలాంటి ప్రభావాన్ని ప్రసరిస్తుందో ఫిలేమోనుకు పౌలు రాసిన ఉత్తరం వ్యక్తం చేస్తుంది. బానిసల్ని ఉపయోగించటం రోమా రాజ్యమంతటా సుస్థాపితమైన వ్యవస్థ. పౌలు పనిచేసిన సంఘాలన్నిటిలోను యజమానులు బానిసలు సభ్యులుగా ఉన్నారు. పట్టణాల్లో స్వతంత్రులైన ప్రజలకన్నా బానిసలే ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. అందుచేత బానిసల్ని అదుపులో ఉంచటానికి కర్కశ నిబంధనలు అగత్వమని ప్రజలు భావించేవారు. ఒక ధనిక రోమీయుడికి ఆయా జాతులకు చెంది ఆయా హోదాలు కలిగి వివిధ సామర్థ్యాలున్న వందలాది బానిసలుండేవారు. నిస్సహాయులైన ఈ మనుషుల దేహాల పైన ఆత్మల పైన సంపూర్ణ స్వేచ్ఛగల యజమాని వాళ్లని ఎలాంటి బాధకైనా గురిచెయ్యవచ్చు. ఎవరైన ఎదురు తిరిగి ఆత్మ రక్షణ కోసం తన యజమాని మీదకి చెయ్యి ఎత్తితే అతడి కుటుంబంలోని వారందరూ నిర్దయగా వధించబడేవారు. ఏదైన చిన్న పొరపాటు చిన్న ప్రమాదం లేదా చిన్న అజాగ్రత్త జరిగితే దాని పర్యవసానం కఠిన శిక్షకు గురికావటం. AATel 327.3

ఎక్కువ దయగల కొందరు యజమానులు తమ సేవకుల్ని మితిమీరి ప్రేమించేవారు. అయితే భాగ్యవంతులు, సమాజంలో ఉన్నత స్థాయి వారిలో ఎక్కువమంది కామం, క్రోధం, భోజన ప్రీతికి దాసులై తమ బానిసలతో నిర్ధయగా చపలంగా వ్యవహరించేవారు. ఆ మొత్తం వ్యవస్థ ధోరణే నీచాతినీచం. AATel 327.4

సమాజంలో స్థాపితమైన క్రమపద్ధతిని నిరంకుశంగా లేదా అకస్మాత్తుగా మార్చటం అపొస్తలుడి పనికాదు. ఇది చేసేందుకు ప్రయత్నించటం సువార్త విజయాన్ని ఆపుచెయ్యటమౌతుంది. కాగా అతడు ప్రబోధించిన సూత్రాలు బానిసత్వం పునాదిపైనే దెబ్బవిసిరాయి. అది అమలైవుంటే అది ఆ వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టించేది. “ప్రభువు యొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్రమునుండును.” 2 కొరి 3:17. మారుమనసు పొంది క్రైస్తవుడైన తర్వాత బానిస క్రీస్తు సంఘంలో సభ్యుడయ్యాడు. అందుచేత అతణ్ని అందరూ ప్రేమించి ఒక సహోదరుడిలాగ యజమానితో పాటు దేవుని దీవెనలకు, సువార్త ఆధిక్యతలకు వారసుడిలా ప్రేమించి గౌరవించాలి. “మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనః పూర్వకముగా జరిగించుచు” సేవకులు తమ విధుల్ని నిర్వర్తించటం అవసరం. ఎఫె 6:6. AATel 328.1

యజమానికి సేవకుడికి, రాజుకి పౌరుడికి, సువార్త సేవకుడికి పాపం నుంచి క్రీస్తులో శుద్ధిని కనుగొన్న పాపికి మధ్య క్రైస్తవ మతం బలీయమైన ఐక్యతను ఏర్పర్చుతుంది. వారు అదే రక్తంవల్ల శుద్ధి పొందుతారు, అదే ఆత్మవలన జీవం పొందుతారు. క్రీస్తు యేసునందు ఒకటవుతారు. AATel 328.2