Go to full page →

పని చెయ్యటంలో తప్పు పద్దతి . CDTel 486

(1890) C.T.B.H.119,120 CDTel 486.1

798. విడివిడి అభిప్రాయాలు పట్టుకుని వాటిని ఓ పరీక్షగా చేసి మీ అభిప్రాయాలతో ఏకీభవించని ఆచారాలు గలవారిని విమర్శించకండి. కాని అంశాన్ని లోతుగా విశాలంగా అధ్యయనం చేసి వాస్తవ క్రైస్తవ మితానుభవ నియమాలకు అనుగుణంగా ఉండేటట్లు మీ అభిప్రాయాల్ని అభ్యాసాల్ని తీర్చిదిద్దుకోండి. పరులలో దురభ్యాసాలుగా తాము భావించే వాటి పై దాడి చెయ్యటం ద్వారా వారి జీవితాల్ని సరిదిద్దటానికి ప్రయత్నించేవారు అనేకులున్నారు. తప్పిదంలో ఉన్నట్లు తాము భావించే వారి వద్దకు వెళ్లి వారి లోపాలు ఎత్తి చూపిస్తారు గాని వాస్తవ నియమాల పైకి మనసును తిప్పరు. అట్టి చర్య తరచు ఆశించిన ఫలితాల్నివ్వదు. ఇతరుల తప్పులు దిద్దటానికి మనం ప్రయత్నిస్తున్నట్లు కనిపించినప్పుడు తరచుగా వారిలో ప్రతిఘటన స్వభావాన్ని మేల్కొలుపుతాం. అది మేలుకన్నా కీడు ఎక్కువ చేస్తుంది. మందలించే వ్యక్తికి కూడా ప్రమాదముంది. ఇతరుల తప్పులు దిద్దటానికి ప్రయత్నించే వ్యక్తి తప్పులెన్నటానికి అలవాటు పడవచ్చు. అతడు త్వరలో తప్పులు లోపాలు ఎన్నటంలో అమితాసక్తి కనపర్చవచ్చు. తప్పుపట్టటానికో, పొరపాట్లు ఎండగట్టటానికో ఇతరుల్ని కనిపెట్టవద్దు. శక్తిమంతమైన మీ ఆదర్శం ద్వారా వారికి మంచి అలవాట్లు నేర్పించండి. CDTel 486.2

ఆరోగ్య సంస్కరణ పరమోద్దేశం మనసు ఆత్మ శరీరాల సమున్నతాభివృద్ధి సాధనని నిత్యం మనసులో ఉంచుకోవాలి. ప్రకృతి చట్టాలన్నీ దేవుని చట్టాలే. అవి మన మేలుకోసం ఏర్పాటయ్యాయి. వాటి ఆచరణ ఈ జీవితంలో మనకు సంతోషాన్నిచ్చి, రానున్న జీవితానికి సిద్ధపడటంలో సహాయం చేస్తుంది. ఇతరుల తప్పులు బలహీనతల గురించి మాట్లాడటం కన్నా మనం మాట్లాడటానికి మెరుగైన విషయం ఉన్నది. దేవుని గురించి ఆయన అద్భుత కార్యాల గురించి మాట్లాడండి. ప్రకృతి కార్యాల్లో ప్రదర్శితమౌతున్న ఆయన ప్రేమను వివేకాన్ని అధ్యయనం చెయ్యండి. CDTel 486.3