Go to full page →

83—ఎమ్మా యుకి నడిచి వెళ్ళడం DATel 897

పునరుత్థాన దినం మధ్యాహ్మం ఇద్దరు శిష్యులు యెరూషలేముకి ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న ఎమ్మాయు అనే చిన్నపట్టణానికి వెళ్తున్నారు. ఈ శిష్యులు క్రీస్తు పరిచర్యలో ఏమంత ప్రధాన పాత్ర పోషింకపోయినా ప్రభువుని చిత్తశుద్ధితో నమ్మిన విశ్వాసులు. పస్కాను ఆచరించడానికి వారు యెరూషలేము వచ్చారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు వారిని గలిబిలి పరిచాయి. సమాధిలోనుంచి యేసు దేహం దొంగిలించారన్న వార్తను, స్త్రీలు దేవదూతల్ని చూశారని, యేసుని కలిశారని వచ్చిన నివేదికను వారు విన్నారు. ఇప్పుడు ధ్యానించడానికి ప్రార్థన చెయ్యడానికి వారు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. వారి సాయంత్ర ప్రయాణం విచారంతోను దుఃఖంతోను సాగింది. వారు క్రీస్తు విచారణ, సిలువ గురించి మాట్లాడుకుంటూ నడిచారు. వారు ఇంతకుముందెప్పుడూ ఇంత తీవ్రంగా నిరాశ చెందలేదు. విశ్వాసం కోల్పోయి నిరీక్షణ లేకుండా వారు సిలువ ఛాయలో నడుస్తోన్నారు. DATel 897.1

వారు ఎక్కువ దూరం వెళ్లకముందే ఒక పరదేశి వారిని కలిసి వారితో నడుస్తోన్నాడు. అయితే వారు తమ చింతలోను నిస్పృహలోను మునిగిఉండడంతో అతణ్ని పరీక్షగా చూడలేదు. వారు తమ హృదయంలోని భావాల్ని వెలిబుచ్చుకుంటూ తమ సంభాషణను కొనసాగిస్తున్నారు. వారు క్రీస్తు చేసిన బోధల్ని చర్చించుకుంటున్నారు గాని ఆ విషయాల్ని అవగాహన చేసుకోనట్లు కనిపించారు. జరిగిన సంభవాల గురించి వారు మాట్లాడుకుంటుండగా, వారిని ఓదార్చాలని యేసు ఆశించాడు. ఆయన వారి దుఃఖాన్ని చూశాడు. తనను ఇంత కించపర్చడానికి సమ్మతించిన ఈ మనిషి క్రీస్తు కాగలడా అన్న ఆలోచనను వారి మనసుల్లోకి తెచ్చిన పరస్పర విరుద్ధభావాల్ని ఆయన అవగాహన వేసుకున్నాడు. వారి దుఃఖం ఆగలేదు వారు రోదించారు. వారి హృదయాల నిండా తనపట్ల ప్రేమ ఉన్నదని ఆయన గ్రహించాడు. వారి కన్నీళ్లను తుడిచివేసి వారిని సంతోషానందాలతో నింపాలని ఆశించాడు. కాని ముందు వారికి పాఠాలు నేర్పాలి, అవి ఎన్నటికీ మరువకూడని పాఠాలు. DATel 897.2

“ఆయన-మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాటలేవని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లయొపా అనువాడు - యెరూషలేములో బసచేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.” తమ ప్రభువు నిమిత్తం తమ ఆశాభంగాన్ని గూర్చి ఆయనకు చెప్పారు. “ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయైయుండెను. మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి ఏలాగు సిలువ వేయించిరో నీకు తెలియదా?” అని ప్రశ్నించారు. ఆశాభంగంతో నిండిన హృదయాలతో, వణుకుతున్న పెదవులతో ఇంకా ఇలా అన్నారు, “ఇశ్రాయేలును విమోచింప బోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇది గాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దిములాయెను.” DATel 898.1

శిష్యులు క్రీస్తు మాటల్ని గుర్తుంచుకోకపోవడం ఇప్పుడు జరిగిన సంగతుల్ని ఆయన ముందే తమకు చెప్పినట్లు గుర్తించకపోవడం ఎంత విచిత్రం! తాను ముందే చెప్పిన సంగతుల్లో చివరగా చెప్పింది అనగా తాను మూడోరోజు లేస్తానన్నది కూడా ముందు చెప్పిన వాటి లాగే నెరవేరుతుందని వారు గుర్తించలేదు. ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవలసింది. యాజకులు అధికారులు దీన్ని గుర్తుంచుకున్నారు. ఆ దినాన “అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు వచ్చి -అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది” అన్నారు. కాని శిష్యులికి ఈ మాటలు గుర్తులేవు. DATel 898.2

“అందుకాయన -అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా?” అన్నాడు. తమ ఆత్మలోకి చొచ్చుకుపోయి ఇంత నిజాయితీగా, సున్నితంగా, సానుభూతిగా ఇంత నిరీక్షణతో మాట్లాడుతున్న ఈ పరదేశి ఎవరైయుంటారా అని ఆ శిష్యులు తమలో తాము తర్జనభర్జన పడ్డారు. క్రీస్తు అప్పగింత నాటినుంచి మొట్టమొదటిసారిగా వారిలో నిరీక్షణ చోటుచేసుకోడం మొదలు పెట్టింది. తమ ఈ మిత్రుడివంక వారు తరచుగా చూస్తూ ఆయన అంటున్నమాటలు అచ్చు క్రీస్తు పలికి ఉండే మాటల్లాగే ఉన్నాయని తలంచారు. వారు విస్మయం చెందారు. వారి హృదయాలు ఆనందంతోను ఆశాభావంతోను స్పందించాయి. DATel 899.1

బైబిలు చరిత్రకు ఆద్యుడైన మోషేతో ప్రారంభించి తన్ను గూర్చి ఉన్న లేఖనాలన్నిటిని క్రీస్తు వారికి వివరించాడు. ఆయన తన్నుతాను ముందే వారికి బయలుపర్చుకుని ఉంటే వారి హృదయాలు తృప్తి చెంది ఉండేవి. ఆ ఆనందంలో వారు ఇంకా తెలుసుకోవాలని ఆశించి ఉండేవారు కారు. కాని తన్ను గురించి పాత నిబంధన ఛాయారూపాలు, ప్రవచనాలు ఇచ్చిన సాక్ష్యం గురించిన అవగాహన వారికి అవసరం. వారి విశ్వాసం వీటి మీదనే ఆనుకుని స్థిరంగా నిలవాలి. వారిలో నమ్మకం పుట్టించడానికి క్రీస్తు సూచక క్రియ చెయ్యలేదు. కాని లేఖనాల్ని విశదీకరించడం ఆయన చేసిన మొట్టమొదటి పని. ఆయన మరణం తమ నిరీక్షణకు అంతమని వారు భావించారు. తమ విశ్వాసం బలీయవవ్వడానికి ఇది ప్రబల నిదర్శనమని ప్రవచనాల నుంచి ఆయన చూపించాడు. DATel 899.2

ఈ శిష్యులికి బోధించడంలో తన పరిచర్యను గూర్చి సాక్ష్యమివ్వడంలో పాత నిబంధన ప్రాముఖ్యాన్ని యేసు చూపించాడు. క్రైస్తవులమని చెప్పుకుంటున్న అనేకమంది పాతనిబంధన ఉపయోగం ఇకలేదంటూ దాన్ని పక్కన పెడుతున్నారు. కాని క్రీస్తు బోధించింది అదికాదు. ఆయన పాత నిబందనకు ఎంతో విలువనిచ్చాడు. ఒకసారి ఆయన ఇలా అన్నాడు, “మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు.” లూకా 16:31. DATel 899.3

ఆదాము దినాలనుంచి కాలం అంతమయ్యే చివరి క్షణం వరకూ పితరులు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నది క్రీస్తు సర్వమే. కొత్త నిబంధనలోలా పాతనిబంధనలోనూ రక్షకుడు స్పష్టంగా ప్రకటితమయ్యాడు. ప్రావచనిక గతం నుంచి ప్రకాశించిన వెలుగే క్రీస్తు జీవితాన్ని బయలుపర్చి, నూతన నిబంధన బోధనల్ని స్పష్టంగాను రమ్యంగాను చేస్తోంది. క్రీస్తు చేసిన అద్భుతాలే ఆయన దేవత్వానికి నిదర్శనం. అయితే ఆయన లోక విమోచకుడన్న దానికి మరింత బలమైన రుజువు పాతనిబంధన ప్రవచనాల్ని నూతన నిబంధన చరిత్రతో సరిపోల్చడం ద్వారా కనిపిస్తుంది. DATel 899.4

ప్రవచనాల్ని ఆధారం చేసుకుని తాను మానవుడుగా ఎలా వ్యవహరిస్తాడో అన్నదానిపై క్రీస్తు తన శిష్యులికి సరైన అభిప్రాయం ఇచ్చాడు. మానవాభిప్రాయాలికి అనుగుణంగా సింహాసనం అధిష్టించి రాజ్యాధికారం చేపట్టే మెస్సీయాను గూర్చిన వారి ఊహాగానం మోసకరమైంది, తప్పుదారి పట్టించేది. అత్యున్నత స్థానం నుంచి అత్యధమ స్థానానికి దిగి వారడాన్ని గురించి అది సరియైన అవగాహన ఇవ్వడానికి తోడ్పదు. తన శిష్యుల అభిప్రాయాలు ప్రతీ చిన్న విషయంలోను స్వచ్ఛంగాను యధార్ధంగాను ఉండాలని క్రీస్తు అభిలషించాడు. తనకు నియమితమైన శ్రమల గిన్నెను తమకు సాధ్యమైనంత వరకు వారు అవగాహన చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. తమకు అప్పుడు అంతగా గ్రాహ్యంకాని భయంకర సంఘర్షణ గుండెకోత లోకపునాదికి ముందే చేసుకున్న నిబంధన నెవేర్పు ఫలితం అని వారికి చూపించాడు. పాపంలో కొనసాగే ప్రతీపాపి మరణించాల్సి ఉన్నట్లు క్రీస్తు మరణించాలి. ఇదంతా జరగాలి. ఇది పరాజయంతో కాదు ప్రభావవంతమైన నిత్యమైన మహిమతో అంతంకానున్నది. లోకాన్ని పాపం నుంచి రక్షించడానికి ప్రతీ ప్రయత్నం చెయ్యాలని యేసు వారికి చెప్పాడు. తన అనుచరులు తాను జీవించినట్లు జీవించి, తాను పనిచేసినట్లు పట్టుదలతో తీవ్రంగా కృషి చెయ్యలని ఉద్బోధించాడు. DATel 900.1

క్రీస్తు ఇలా ఉపదేశించి లేఖనాల్ని అవగాహన చేసుకోడానికి తన శిష్యుల మనసుల్ని తెరిచాడు. శిష్యులు అలసిపోయి ఉన్నారు. కాని ఆ ఉపదేశం వారికి విసుగు పుట్టించలేదు. ఆయన నోటి నుంచి జీవపుమాటల ముత్యాలు రాలాయి. అయినా వారి దృష్టి మసకబారి ఉంది. యెరూషలేము పతనాన్ని గురించి చెప్పినప్పుడు ఆ పట్టణం వంక దుఃఖముఖాలతో చూశారు. కాని తమతోటి ప్రయాణికుడు ఎవరో వారికింకా తెలియలేదు. తాము ఎవరి గురించి సంభాషించుకుంటాన్నారో ఆయన తమ పక్కనే నడుస్తున్నాడని వారు గ్రహించలేదు. ఎందుకంటే యేసు తన్ను గురించి తాను వేరే వ్యక్తిగా మాట్లాడాడు. ఆయన పస్కాకు హాజరైన వారిలో ఒకడని ఇప్పుడతడు తిరిగి వెళ్లిపోతున్నాడని వారు భావించారు. వారిలాగే కరకు రాళ్లపై ఆయన జాగ్రత్తగా నడిచాడు. అప్పుడప్పుడు వారితోపాటు స్వల్ప విశ్రాంతికోసం ఆగాడు. ఈరకంగా వారు ఆ కొండలు రాళ్లమార్గంలో నడుస్తుండగా, త్వరలో దేవుని కుడిపక్క తన స్థానాన్ని ఆక్రమించాల్సి ఉన్న ప్రభువు “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది” అని చెప్పగలిగిన ప్రభువు వారి పక్క నడిచాడు. (మత్త 28:18) DATel 900.2

తాము ప్రయాణం చేస్తున్న సమయంలో వారింకా తమ విశ్రాంతి స్థలం చేరకముందు పొద్దుకుంకుతున్నది. పొలాల్లో పనిచేసే శ్రామికులు తమ పనిని విరమిస్తున్నారు. శిష్యులు తమ ఇళ్లు చేరడానికి సమయం వచ్చినప్పుడు పరదేశి ఇంకా ముందుకి వెళ్లాల్సి ఉన్నట్లు కనిపించాడు. అయితే శిష్యులు ఆయనకు ఆకర్షికతులయ్యారు. ఆయన మాటలు ఇంకా వినాలని ఆశించారు. “మాతో కూడ ఉండుము” అని వారన్నారు. ఆయన వారి ఆహ్వానాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేనట్లు కనిపించాడు. కాని వారు “సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగ్రుంకినది” అంటూ మనవి చేసినప్పుడు క్రీస్తు అంగీకరించి “వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.” DATel 901.1

ఆయన్ని రమ్మంటూ శిష్యులు ఒత్తిడి చేసి ఉండకపోతే, తమ ప్రయాణ మిత్రుడు పునరుత్థానుడైన ప్రభువని వారికి తెలిసేది కాదు. క్రీస్తు తన స్నేహాన్ని ఎవరి పైనా రుద్దడు. తాను అవసరమని గుర్తించేవారిలో ఆయన ఆసక్తి పుట్టిస్తాడు. నిరు పేద గృహంలోకి ఆయన ఆనందంగా వెళ్తాడు. అతిదీన హృదయాన్ని ఉత్సాహపర్చుతాడు. కాని ఈ పరలోక అతిథిని మనుషులు ఉదాసీనంగా పరిగణించినట్లుయితే లేక తమతో ఉండవలసిందిగా కోరనట్లయితే ఆయన ఆగకుండా వెళ్లిపోతాడు. ఇలా అనేకులు గొప్ప నష్టానికి గురి అవుతారు. తమతో కలిసి మార్గమంతా నడిచి ఆయన్ని గుర్తించని శిష్యుల్లాగ వారు క్రీస్తుని ఎరుగరు. DATel 901.2

రాత్రి తినే సామాన్యాహారమైన రొట్టె తయారుచేశారు. దాన్ని అతిధికి వడ్డించారు. అతిథి భోజనం బల్లవద్ద మొదటిస్తానంలో కూర్చున్నాడు. ఆయన తన చెయ్యిచాపి ఆహారాన్ని ఆశీర్వదించాడు. శిష్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. తమ మిత్రుడు తన చేతుల్ని అచ్చు తమ ప్రభువు చాపుతూ ఉండేటట్టే చపాడు. వారు మళ్లీ చూశారు. ఆయన చేతుల్లో మేకులు దిగిన గాయాలు కనిపించాయి. ఆ ఇద్దరూ ఒకేసారి ఆయన యేసు ప్రభువు! ఆయన తిరిగిలేచాడు! అంటూ సంభ్రమానందాలతో కేకలువేశారు. DATel 901.3

ఆయన పాదాలపై పడి పూజించడానికి లేచారు. కాని ఆయన వారికి కనిపించకుండా మాయమయ్యాడు. ఎవరి దేహం. ఇటీవల సమాధిలో ఉందో ఆప్రభువు కూర్చున్నచోటు చూసి వారు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు, “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” DATel 902.1

ఇంత గొప్ప వార్తను తమవద్ద ఉంచుకుని వారు కూర్చుని మాట్లాడుకోలేరు. వారి ప్రయాణ బడలిక ఆకలి మాయమయ్యాయి. ముందున్న భోజనం ముట్టుకోలేదు. వెంటనే తామువచ్చిన మార్గాన్నే వెనక్కి బయలుదేరి ఆవార్త శిష్యులికి చెప్పడానికి పట్టణానికి హుటాహుటీగా బయలుదేరారు. కొన్నిచోట్ల మార్గం అపాయకరంగా ఉంది. వారు ఎత్తయిన స్థలానికి ఎక్కి నున్నని రాతిబండలమీద నుంచి కిందకు జారారు. ఆ మార్గాన తమతో ప్రయాణం చేసిన ప్రభువు కాపుదల తమకున్నట్లు వారు చూడలేదు. గ్రహించలేదు. ప్రయాణికుడి కర్ర చేతిలో పట్టుకుని తాము కోరుకున్న దానికన్నా వేగంగా నడవడానికి పూనికతో ముందుకి సాగారు. దారి తప్పుతున్నారు. మళ్లీ దారిలో పడుతున్నారు. కొంత సేపు పరిగెత్తుతూ అక్కడక్కడ తూలిపడుతూ వారు కొనసాగారు. తమ మార్గమంతా తమ అదృశ్యమిత్రం వారి పక్కనే నడిచాడు. DATel 902.2

అది చీకటి రాత్రి. అయినా వారి మీద నీతి సూర్యుని కాంతి ప్రకాశిస్తోంది. వారి హృదయాలు ఆనందంలో ఓలలాడ్తున్నాయి. వారు ఒక నూతన ప్రపంచంలో ఉన్నట్లుంది. క్రీస్తు సజీవ రక్షకుడు. మరణించిన వానిలా ఆయన గురించి ఇక వారు దుఃఖించాల్సిన పనిలేదు. క్రీస్తు లేచాడు. దీన్ని వారు మళ్లీ మళ్లీ ఉచ్చరిస్తోన్నారు. దుఃఖిస్తున్న శిష్యులికి వారు తీసుకు వెళ్తున్న వర్తమానం ఇదే. ఎమ్మాయుకి తమ అద్భుతమైన నడక కథని వారికి వినిపించాలి. మార్గంలో ఎవరు తమను కలిసి తమతో నడిచారో వారికి చెప్పాలి. దేవుడు లోకాని కిచ్చిన మహత్తర వర్తమానాన్ని వారు తీసుకు వెళ్తున్నారు. అది ఆనందాన్ని కూర్చే వర్తమానం. ప్రస్తుత జీవితానికి నిత్యజీవితానికి మానవాళి నిరీక్షణ దాని మీదనే ఆధారపడి ఉంది. DATel 902.3