నిరాశచెంది ఓడిపోయినట్లు భావించిన ఏలీయా ఆదినాల్లోని అనుభవం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు, నీతికి న్యాయానికి దూరంగా ఉన్న ఈ యుగంలోని దైవ సేవకులకు అమూల్యమైన పాఠాలు చాలా ఉన్నాయి. నేడు విస్తరిస్తున్న మతభ్రష్టత ఈ ప్రవక్త దినాల్లో ఇశ్రాయేలులో ప్రబలిన మత భ్రష్టత వంటిది. మనుషుణ్ని దైవానికి పైగా హెచ్చించటంలో, ప్రజానాయకుల్ని స్తుతించటంలో, డబ్బుని పూజించటంలో లేఖనంలో వెల్లడైన సత్యాలకి పైగా శాస్త్ర బోధనల్ని మన్నించటంలో వేవేల ప్రజలు బయలుని వెంబడిస్తున్నారు. సందేహం అవిశ్వాసం వాటి దుష్ప్రభావాన్ని మనుషుల మనసులు హృదయాల పై చూపిస్తున్నాయి. అనేకులు మానవ సిద్దాంతాల్ని పరిశుద్ధ లేఖనాలికి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు. మానవ ప్రతిభను వాక్యబోధనలకు పైగా ఉంచవలసిన సమయానికి మనం చేరుకున్నామని బహిరంగంగా బోధించటం జరుగుతున్నది. నీతికి ప్రమాణమైన దైవధర్మశాస్త్రం ఇక ఆచరణీయం కాదని ప్రకటించటం జరుగుతున్నది. దేవుడుండవలసిన స్థానంలో మానవ వ్యవస్థల్ని నిలపటానికి, మానవుల సంతోషానికి రక్షణకు ఏది ఏర్పాటయ్యిందోదాన్ని విస్మరించటానికి సత్యవిరోధి అయిన అపవాది గొప్ప వంచనా శక్తితో పనిచేస్తున్నాడు. అయినా ఈ మతభ్రష్టత విస్తృతంగా ఉన్నప్పటికీ లోకవ్యాప్తం కాలేదు. లోకంలో ఉన్న వారందరూ ధర్మశాస్త్రంలేనివారు పాపులు కారు. అందరూ శత్రువు పక్షాన్ని చేరలేదు. బయలుకి మోకాలు వంచనివారు, క్రీస్తుని గురించి ధర్మశాస్త్రం గురించి మరింత తెలుసుకుని అవగాహన చేసుకోవాలని ఆకాంక్షించేవారు, పాపం పరిపాలనను మరణాన్ని అంతం చెయ్యటానికి యేసు త్వరగా రావాలని నిరీక్షించేవారు చాలామంది ఉన్నారు. ఇకపోతే బయలుని అజ్ఞానంగా పూజించేవారూ చాలామంది ఉన్నారు. అయితే వారి నిమిత్తం దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పులు. 170, 171. ChSTel 62.1