ప్రసంగ వేదిక బోధను బట్టి కాదు సంఘసభ్యుల జీవితాల్నిబట్టి లోకానికి నమ్మకం కలుగుతుంది. వేదిక నుంచి వాక్యపరిచారకుడు సువార్త సిద్దాంతాన్ని ప్రకటిస్తాడు, దాని శక్తిని సభ్యుల జీవితాలు ప్రదర్శిస్తాయి. టెస్టిమొనీస్, సం. 7, పు. 16. ChSTel 76.1
మన సంఘ సభ్యులైన పురుషులు స్త్రీలు సంఘటితమై వాక్యపరిచారకుడితోను సంఘ ఆఫీసర్లతోను కలిసి పని చేసేవరకు ఈ లోకంలో దేవుని సేవ సమాప్తంకాదు. గాస్పుల్ వర్కర్స్, పు. 352. ChSTel 76.2
ఆత్మల రక్షణ నిమిత్తం చేయాల్సి ఉన్న పనిలో బోధించటం చిన్న భాగం మాత్రమే. దేవుని ఆత్మ పాపులకి సత్యం పట్ల నమ్మకం పుట్టించి, వారిని సంఘం చేతుల్లో పెడతాడు. వాక్యపరిచారకులు తమ పాత్ర పోషించవచ్చు గాని సంఘం చెయ్యాల్సిన పనిని వారు ఎన్నడూ చెయ్యలేరు. టెస్టిమొనీస్, సం. 4, పు. 69. ChSTel 76.3
దేవుని సత్యప్రచారం కొందరు అభిషిక్త వాక్యపరిచారకులకే పరిమితం కాదు. క్రీస్తు అనుచరులుగా చెప్పుకునేవారందరు సత్యాన్ని వెదజల్లాల్సి ఉంది. దాన్ని సమస్త జలాల పక్క విత్తాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ. 22, 1899. ChSTel 76.4
వాక్యపరిచాకులు శక్తిమంతమైన ప్రసంగాలు చెయ్యవచ్చు. సంఘాన్ని పటిష్ఠపర్చి వృద్దిపర్చటానికి ఎంతో శ్రమపడవచ్చు. కాని వ్యక్తిగత సభ్యులు యేసుక్రీస్తు సేవకులుగా తమ పాత్ర నిర్వహించకపోతే, సంఘం నిత్యం చీకటిలో మగ్గుతుంది. శక్తి లేకుండా ఉంటుంది. లోకం కఠినంగా ఉన్నా, చీకటితో నిండిఉన్నా, అచంచల క్రైస్తవాదర్శం గొప్పమేలు చేసే శక్తిగా రూపుదిద్దుకుంటుంది. టెస్టిమొనీస్, సం. 4, పు. 285, 286. ChSTel 76.5