దేవుని సేవలో మన విజయం మన ప్రజలు సామరస్యంతో పని చెయ్యటంలో కనబడుతుంది. కేంద్రీకృత చర్య అవసరం. క్రీస్తు శరీరం అయిన సంఘంలోని ప్రతీ సభ్యుడు దేవుడు తనకిచ్చిన సమర్థత ప్రకారం దేవుని సేవలో తన పాత్ర నిర్వహించాలి. మన మందరం భుజంతో భుజం, హృదయంతో హృదయం కలిపి సంఘటితంగా ముందుకి పోవాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 2, 1890. ChSTel 84.2
క్రైస్తవులందరు ఒకేశక్తి అధినాయకత్వంలో, ఒకే ఉద్దేశం నెరవేర్పుకోసం కలిసికట్టుగా కృషిచేస్తూ, ఒకటిగా ముందుకి కదిలితే వారు లోకాన్ని కదిలిస్తారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 221. ChSTel 84.3
దూతలు సామరస్యంతో పనిచేస్తారు. వారి కదలికలన్నిటిలో నిర్దుష్టమైన క్రమం గోచరిస్తుంది. దూత సమూహాల సామరస్యాన్ని, క్రమాన్ని మనం ఎంత దగ్గరగా అనుకరిస్తే, ఈ పరలోక నివాసులు మన పక్షంగా చేసే కృషి అంత ఎక్కువ విజయవంతమౌతుంది. మనం సమైక్య చర్య అవసరాన్ని గుర్తించకుండా, క్రమం క్రమశిక్షణ లేకుండా, కార్యాచరణలో పద్ధతి క్రమంలేకుండా ఉంటే, ఉత్తమ వ్యవస్థీకరణ కలిగి, సంపూర్ణ క్రమాన్ని అనుసరించేదూతలు మన విజయానికి కృషి చెయ్యలేరు. గందరగోళాన్ని, ధ్యానభంగాన్ని, అవ్యవస్థను తాము దీవించలేరు కాబట్టి వారు దుఃఖిస్తూ వెళ్లిపోతారు. పరలోక దూతల సహకారం అభిలషించేవారందరూ వారితో ఒకటై పని చెయ్యాలి. పరిశుద్దాత్మ కుమ్మరింపు పొందినవారు తమ కృషిలో క్రమాన్ని క్రమ శిక్షణను సమైక్య చర్యను ప్రోత్సహిస్తారు. అప్పుడు దేవదూతలు వారితో సహకరిస్తారు. పరలోక దూతలు ఆక్రమాన్ని అవ్యవస్థను, గందరగోళాన్ని ఎన్నడూ అంగీకరించరు. టెస్టిమొనీస్, సం.1, పులు. 649, 650. ChSTel 84.4