దైవ ప్రజలు ఏదో మార్పుకోసం కని పెడ్తున్నాట్లు - బలవంతంచేసే ఓ శక్తి తమను స్వాధీనపర్చుకోవాలని కని పెడ్తున్నట్లు - నాకు దర్శనంలో చూపించటం జరిగింది. కాని వారికి ఆశాభంగం ఎదురవుతుంది. ఎందుకంటే వారు అపోహపడ్తున్నారు. వారు పనిచెయ్యాలి. పనిని చేపట్టి, తమను గూర్చి యదార్ధ జ్ఞానం కోసం చిత్తశుద్ధితో దేవునికి మొర పెట్టుకోవాలి. మన ముందునుంచి వెళ్తున్న దృశ్యాలు మనల్ని మేల్కొల్పి, వినే వారందరికి సత్యాన్ని బోధించటానికి మనల్ని ప్రోత్సహించాల్సినంత ప్రాముఖ్యం గలవి. టెస్టిమొనీస్, సం1, పు. 261. ChSTel 93.1
మూడోదూత వర్తమానంలో మనకు తెలపబడ్డ రీతిగా సత్యం ఎరిగిన వారందరు ఆ సత్యాన్ని ప్రకటించటానికి మినహాయింపులేకుండా తమను తాము ప్రతిష్ఠించుకోవాలని విశ్వంలో ఉన్న సమస్తం ఘోషిస్తున్నది. మనకు కనిపించేవి వినిపించేవి మనల్ని మన విధి నిర్వహణకు పిలుస్తున్నాయి. సాతాను శక్తులు చేస్తున్న పని ప్రతీ క్రైస్తవుడు తన స్థానంలో నిలవవలసిందంటూ పిలుపునిస్తున్నది. టెస్టిమొనీస్, సం9, పు. 25, 26. ChSTel 93.2
క్రీస్తు త్వరలో వస్తున్నాడన్న వర్తమానం లోకంలోని అన్ని జాతులకు అందించాలి. శత్రుశక్తుల్ని జయించటానికి అప్రమత్తమైన, అవిశ్రాంతమైన కృషి అవసరం. కదలకుండా కూర్చుని, ఏడవటం చేతులు నలుపుకోటం మన పాత్ర కాదు. కాని లేచి ప్రస్తుత కాలానికి భావి నిత్యకాలానికి పనిచెయ్యటం. సదర్న్ వాచ్ మేన్, మే 29, 1902. ChSTel 93.3
“ఏదో కొంత చెయ్యండి, మీ యావచ్చక్తితో
దాన్ని త్వరగా చెయ్యండి ఆసక్తితో,
ఎక్కువగా విశ్రమిస్తే దేవదూత రెక్క
కుంగుతుంది;
దేవుడు తానే పనిలేకుండా ఉంటే
దీవించటం ఇక ఎక్కడ ఉంటుంది?” ChSTel 94.1
టెస్టిమొనీస్, సం5, పు. 308.
చేతులు ముడుకుని ఏ పనిచెయ్యకుండా ఉండటం తమ హక్కని ఎవరూ తలంచకుందురుగాక. సోమరీ, క్రియాశూన్యుడు రక్షించబడటం అసాధ్యం. తన భూలోక సేవలో క్రీస్తు ఏమి సాధించాడో ఆలోచించండి. ఆయన ఎంత చిత్తశుద్దితో, ఎంత అవిశ్రాంతంగా పనిచేస్తాడు! తనకిచ్చిన పనినుంచి ఆయన్ని మళ్లించటానికి దేనికీ ఆయన తావివ్వలేదు. మనం ఆయన్ని తన అడుగుజాడల్లో వెంబడిస్తున్నామా? కోలేపోర్టర్ ఇవేంజిలిస్ట్, పు. 38. ChSTel 94.2
ఆత్మల రక్షణ సేవలో దైవమానవ ప్రతినిధులు కలిసి పనిచేస్తారు. దేవుడు తనవంతు పనిని చేశాడు. ఇప్పుడు క్రైస్తవుడి చర్య అవసరం. ఇది చేయమని దేవుడు మనల్ని కోరుతన్నాడు. అన్ని జాతులకు సత్యం తాలూకు వెలుగును సమర్పించటంలో తన ప్రజలు కొంత పని చెయ్యటానికి ఆయన ఎదురుచూస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువుతో ఈ భాగస్వామ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? ChSTel 94.3
పనిచేసే సంఘమే సజీవ సంఘం. వ్యతిరేక శక్తులైన పాపాల్ని అసత్యాన్ని ప్రతిఘటించడంతోను మందగమనంతో ముందుకి సాగటంతోను తృప్తి చెందక సంఘం క్రీస్తు కాడిని మొయ్యాలి. నాయకునితో కలిసి నడవాలి. మార్గం పొడుగునా కొత్త విశ్వాసుల్ని సంపాదించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ. 4, 1891. ChSTel 94.4
పోరు సల్పటానికి మనకు కొద్దికాలం మాత్రమే ఉంది. అంతట క్రీస్తు వస్తాడు. ఈ తిరుగుబాటు దృశ్యం సమాప్తమౌతుంది. క్రీస్తుతో పనిచెయ్యటానికి ఆయన రాజ్యవ్యాప్తికి తోడ్పటానికి మన చివరి కృషి అప్పుడు పూర్తి అవుతుంది. పోరాటం ముందు వరసలో నిలిచి, వస్తున్న దుర్మార్గాన్ని ఉత్సాహోద్రేకాలతో ప్రతిఘటించి నిలిచిన కొందరు తమ విధి నిర్వహణలో నేలకు ఒరుగుతారు. కూలిపోయిన వీరుల వంక ఇతరులు దుఃఖ ముఖాలతో చూస్తారు. కాని పని అపటానికి సమయం లేదు. వారి ఖాళీల్ని భర్తీ చెయ్యాలి. పడిపోయిన వీరుడి చేతిలోనుంచి ధ్వజాన్ని తీసుకుని, నూతన శక్తితో సత్యాన్ని క్రీస్తు ఘనతను ధ్రువీకరించాలి. మును పెన్నటికన్నా తీవ్రంగా పాపాన్ని ప్రతిఘటించాలి. చీకటి శక్తుల్ని ప్రతిఘటించాలి. నేటి సత్యాన్ని విశ్వసించేవారు గొప్పశక్తితో దృఢచిత్తంతో పని చెయ్యాలి. తమ ఉచ్చరణ ఆచరణల ద్వారా సత్యాన్ని బోధించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో. 25, 1881. ChSTel 94.5
అన్ని ప్రాంతాలలో ఉన్న సెవెంతు డె ఎడ్వంటిస్టులు తమను తనకు ప్రతిష్టించుకుని తమ పరిస్థితుల ప్రకారం తమ శక్తి కొద్దీ తన సేవలో సహాయం చెయ్యాలని ప్రభువు పిలుపునిస్తున్నాడు. టెస్టిమొనీస్, సం.9, పు. 132. ChSTel 95.1
సోమరితనంతో మతానికి సంబంధంలేదు. క్రైస్తవ జీవితంలోను అనుభవంలోను మన గొప్ప లోటుకు కారణం మనం దేవుని సేవలో సోమరులుగా ఉంటమే. మీ దేహంలోని కండరాల్ని పనిలేకుండా ఉంచితే అవి బలహీనపడతాయి. ఆధ్యాత్మిక ప్రకృతిలోనూ ఇదే జరుగుతుంది. బలంగా ఉండాలంటే మీరు మీ శక్తుల్ని వినియోగించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 13, 1888. ChSTel 95.2
మనం శ్రద్ధగా పనిచేసే పనివారం కావాలి. సోమరివాడు నికృష్టజీవి. అయితే ఏ పనిపూర్తి కోసం ప్రభువు తన జీవితాన్ని అర్పించాడో ఆ గొప్ప సేవలో సోమరతనానికి ఏ సాకు చెప్పగలం? ఆధ్యాత్మిక శక్తుల్ని ఉపయోగించకపోతే అవి తమ ఉనికిని కోల్పోతాయి. వాటిని నాశనం చెయ్యటానికి సాతాను కృషి చేస్తాడు. లోకానికి క్రీస్తు రెండో రాకకోసం ఒక జనాంగాన్ని సిద్ధపర్చే సేవలో పరలోకమంతా చురుకుగా పని చేస్తున్నది! మనం “దేవుని జతపనివారము”. సమస్తం అంతమయ్యే సమయం సమీపిస్తున్నది. పని చెయ్యటానికి మనకు తరుణమున్న సమయం ఇదే. రివ్యూ అండ్ హెరాల్డ్, జన. 24, 1893. ChSTel 95.3
హృదయంగల మిషనెరీలు అవసరం. చెదురుమదురు ప్రయత్నాలవల్ల మంచి జరగదు. మనం దృష్టిని ఆకర్షించాలి. మనకు ప్రగాఢ చిత్తశుద్ది అవసరం. టెస్టిమొనీస్, సం9, పు. 45. ChSTel 95.4
మన మధ్య కొందరున్నారు. వారు కొంత సమయం తీసుకుని తమ నిష్క్రియా వైఖరిని పరిగణించినట్లయితే, తమకు దేవుడిచ్చిన వరాల్ని నిర్లక్ష్యం చేస్తూ పాపం చేస్తున్నామని గుర్తిస్తారు. టెస్టిమొనీస్, సం.6, పు. 425. ChSTel 96.1
లోకంలో మన స్థితి ఏమిటి? మనం కని పెడ్తున్న కాలంలో ఉన్నాం. అయితే ఈ సమయాన్ని అరూప ధ్యానంలో గడపకూడదు. కని పెట్టటం, మెలకువగా ఉండటం, అప్రమత్తంగా పని చెయ్యటం మిళితమవ్వాలి. మనం జీవితమంతా వ్యక్తిగత భక్తిని, దేవుడు కోరుతున్న సేవను నిర్లక్ష్యం చేసి, లోక సంబంధమైన పని, పనిలో చొరవ చూపటం, లౌకిక విషయాల గురించి ప్రణాళికలు తయారు చెయ్యటంలోనే నిమగ్నమం కాకూడదు. మనం పనిలో సోమరులంకాకుండా ఉంటూ ఆత్మలో ఉద్రేకంతో ప్రభువు సేవ చెయ్యాలి. ఆత్మ దీపాన్ని చక్కపరచాలి. దివిటీలతో పాటు సిద్దెల్లో నూనె నింపుకోవాలి. ప్రభువు దినం దొంగ వచ్చినట్లు మన మీదికి రాకుండేందుకు ఆధ్యాత్మిక క్షీణతను నివారించటానికి ప్రతీ జాగ్రత్త తీసుకోవాలి. టెస్టిమొనీస్, సం5, పు. 276. ChSTel 96.2
మనం ఆధ్యాత్మిక సోమరితనం పనికిరాని యుగంలో నివసిస్తున్నాం. ప్రతీ ఆత్మకు పరలోక విద్యుత్తు సరఫరా అవ్వాలి. టెస్టిమొనీస్, సం.8, పు. 169. ChSTel 96.3
ఈ జీవితంలో సాధ్యమైనన్ని మంచి పనులు నింపండి. టెస్టిమొనీస్, సం.5, పు. 488. ChSTel 96.4
తన నామం ధరించిన వారందరూ చిత్తశుద్ది పట్టుదలగల కార్యకర్తలవ్వాలని యేసు కోరుతున్నాడు. ప్రతీ వ్యక్తిగత సభ్యుడు క్రీస్తు యేసు బండపై నిర్మించుకోటం అవసరం. ప్రతీ వ్యక్తి ఆధ్యాత్మిక పునాదినీ తీవ్రంగా పరీక్షించే తుఫాను రేగుతున్నది. కనుక ఇసుక పొరను తప్పించి బండను వెదకండి. లోతుగా తవ్వి స్థిరమైన పునాది వేసుకోండి. నిత్య జీవితానికి మా బతుకును నిర్మించుకోండి. కన్నీటితో, హృదయపూర్వక ప్రార్ధనలతో నిర్మించుకోండి. మీలో ప్రతీ ఒక్కరూ ఇప్పటినుంచి మా జీవితాల్ని మంచి పనులతో అందంగా తీర్చిదిద్దుకోండి. ఈ చివరి దినాల్లో కాలేబు వంటి మనుషులు అవసరం. టెస్టిమొనీస్, సం.5, పు. 129,130. ChSTel 96.5