Go to full page →

ఆహారం విషయంలో చిన్ననాడే తర్బీతు CDTel 235

(1905) M.H.383,385 CDTel 235.6

346. సరియైన ఆహారపు అలవాట్లలో తర్బీతు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తాము నివసించటానికి తింటున్నామే గాని తినటానికి నివసించటం లేదని చిన్నపిల్లలు నేర్చుకోవాలి. శిక్షణ తల్లి వడిలో ఉన్న శిశువుతో ప్రారంభమవ్వాలి. బిడ్డకు క్రమబద్ధమైన కాలవ్యవధిలో ఆహరమివ్వాలి. బిడ్డ పెరిగే కొద్దీ ఆహారం ఎక్కువసార్లివ్వటం తగ్గించాలి. బిడ్డకి తీపి పదార్థాలివ్వటం గాని పెద్ద వారి ఆహారమివ్వటంగాని చెయ్యకూడదు. దాన్ని బిడ్డ జీర్ణించుకోలేదు. పసిబిడ్డల సంరక్షణ, భోజనమివ్వటంలో క్రమత్వం వారికి ఆరోగ్యాన్నివ్వటం, తద్వారా వారిని ప్రశాంతంగా ఉంచటమేగాక వారి అలవాట్లకు పునాది వేసి వారి భావి జీవితంలో దీవెనగా కూడా పరిణమిస్తుంది. CDTel 235.7

పిల్లలు శైశవం నుంచి బయటపడేటప్పుడు వారి రుచులు ఆహార వాంఛల్ని ఇంకా తర్బీతు చెయ్యటంలో శ్రద్ధతీసుకోవాలి. వారు ఏది తినాలంటే దాన్ని తిననివ్వటం, ఎప్పుడు తినాలంటే అప్పుడు - ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా — తిననివ్వటం తరచుగా జరుగుతుంటుంది. ఆరోగ్యకరం కాని ఆహారం పై తరచుగా వ్యయమయ్యే ద్రవ్యం, శ్రమ యధేఛ్చగా తినటమే జీవిత పరమావధి అని, అత్యంత ఆనందాన్నిచ్చేదని భావించేటట్లు యువతను నడిపిస్తున్నాయి. ఈ తర్బీతు ఫలితం తిండిబోతుతనం, అనంతరం వ్యాధి దాని వెంట విషంతో నిండిన మందులు వస్తాయి. CDTel 236.1

తల్లిదండ్రులు తమ బిడ్డల ఆహారవాంఛల్ని తర్బీతు చెయ్యాలి. ఆరోగ్యవంతంకాని ఆహారాన్ని తిననివ్వకూడదు. ఆహారాన్ని క్రమబద్ధం చేసే కృషిలో, పిల్లలు రుచిలేని ఆహారాన్ని తినాలనిగాని అవసరమైన దానికన్నా ఎక్కువ తినమనిగాని ఆదేశించటమన్న పొరపాటు చెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి హక్కులున్నాయి. వారికి ఇష్టా యిష్టాలుంటాయి. వారి యిష్టాలు సముచితమైనప్పుడు వాటిని గౌరవించాలి.... CDTel 236.2

ఆరోగ్యాన్ని ఉల్లాస స్వభావాన్ని బలిజేసి పిల్లల కోర్కెల్ని తృప్తిపరిచే తల్లులు కీడు దుష్టత విత్తనాలు విత్తుతున్నారు. ఆ విత్తనాలు మొలిచి తమ పంటనిస్తాయి. చిన్నపిల్లల పెరుగుదలతోపాటు స్వార్థాశలూ పెరుగుతాయి. అవి మానసిక, శారీరక శక్తిని బలితీసుకుంటాయి. ఈ పనిచేసే తల్లులు తాము విత్తిన విత్తనం పంటను దుఃఖిస్తూ కోస్తారు. తమ బిడ్డలు మానసికంగాను ప్రవర్తన పరంగాను సమాజంలోను గృహంలోను ఉపయోగకరమైన పాత్ర పోషించటానికి అయోగ్యులుగా పెరుగుతారు. అనారోగ్యకరమైన ఆహారం ప్రభావంకింద వారి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక శక్తులు బలహీనమౌతాయి. మనస్సాక్షి మొద్దుబారుతుంది. మంచి చెయ్యటానికి ప్రభావితమయ్యే బుద్ధి దెబ్బతింటుంది. CDTel 236.3

విచ్చలవిడి తిండిని నియంత్రించి ఆరోగ్యదాయకమైన ఆహారం తినటం పిల్లలకి నేర్పించాల్సి ఉండగా వారు త్యాగం చేస్తున్నది తమకు హానిచేసే ఆహారాన్ని మాత్రమే అని స్పష్టం చెయ్యాలి. వారు మేలుచేసే వాటికోసం హానిచేసే వాటిని విడిచి పెడున్నారు. దేవుడు పుష్కలంగా అనుగ్రహించిన మంచి భోజన పదార్థాలతో నింపి భోజనబల్లని ఆకర్షణీయం చేద్దాం. దేవుడు సమకూర్చేవాటిని తిని ఆనందిస్తూ ఆయనకు స్తుతులర్పిద్దాం. CDTel 236.4

(1875) 3T 564 CDTel 237.1

347. ఆత్మో పేక్ష అలవాట్లను, దేవుడిచ్చే దీవెనల సరియైన వినియోగాన్ని తమ పిల్లలకి నేర్పటాన్ని తప్పించుకోటానికి అనేకమంది తల్లిదండ్రులు వారిని యధేచ్ఛగా తిని తాగటానికి విడిచి పెడ్తారు. తిండి వాంఛను స్వార్థాశల్ని ఖండితంగా అదుపు చెయ్యకపోతే అవి పెరుగుదతో పెరిగి, బలంతో బలం పుంజుకుంటాయి. ఈ పిల్లలు తమ బతుకులు తాము బతకటం మొదలు పెట్టే సమయంలో తమ స్థానాన్ని ఆక్రమించి నప్పుడు శోధనను జయించటానికి శక్తి హీనులవుతారు. అన్నిచోట్ల నైతిక కల్మషం, పాపం ప్రబలుతున్నాయి. సంవత్సరాలు పెరిగినా రుచిని ఇష్టాన్ని తృప్తిపర్చుకోవాలన్న శోధన తగ్గటం లేదు. ముఖ్యంగా యువతని ఉద్వేగం శాసిస్తుంది. వారు తిండి వాంఛకు బానిసలవుతున్నారు. తిండిబోతుల్లో, పొగాకు బానిసల్లో, తాగుబోతుల్లో తప్పుడు విద్య ఫలితాలు మనకు దర్శనమిస్తున్నాయి. CDTel 237.2