Go to full page →

సంస్కరణ పక్షంగా ఉండాల్సిన మన ఆదర్శం CDTel 454

క్రైస్తవులుగా చెప్పుకునేవారు, తెలివిగలవారు అయిన పురుషులు స్త్రీలు పులియని స్థితిలో ఉన్నప్పుడు క్షారసం, ఏపిల్ రసం మత్తు పుట్టించదు గనుక వాటిని సేవించటం హానికరం కాదని వాదించటం నాకెంతో వేదనను కలిగిస్తుంది. వారు చూడటానికి నిరాకరించే మరోపక్క దీనికి ఉన్నదని నాకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రేరేపకాల వినియోగం వల్ల సంభవించే భయంకర కీడులు చూడకుండా స్వార్థం వారికి గుడ్డితనం కలిగిస్తున్నది.... CDTel 454.2

సంస్కర్తలమని, లోకానికి వెలుగు అందించే వారమని, ఆహారాన్ని వక్రీకరించటానికి సాతాను తన శోధనలతో మనలో ప్రవేశించే మార్గాల్ని నమ్మకంగా కాపాడే కావలివారమని ఓ జనాంగంగా మనం చెప్పుకుంటాం. మన ఆదర్శం మన ప్రభావం సంస్కరణ పక్షంగా ఓ శక్తిగా రూపొందాలి. మనస్సాక్షిని మొద్దుబార్చే లేదా శోధనను ప్రోత్సహించే ఏ అభ్యాసానికైనా మనం దూరంగా ఉండాలి. దేవుని స్వరూపంలో సృష్టి అయిన ఒక్క మనిషి మనసులోకి సాతాను ప్రవేశించేందుకు మనం తలుపు తెరవకూడదు. హాని చెయ్యని పానీయాలుగా చెప్పే ద్రాక్ష ఆపిల్ రసాల మిత వినియోగానికి తెరచుకొనే చిన్న చిన్న మార్గాల్ని నమ్మకంగా కాపాడటానికి అందరూ అప్రమత్తంగా ఉంటే తాగుబోతుతనానికి రాచబాట మూతపడుతుంది. ప్రతీ సమాజంలోను అవసరమయ్యింది ధృఢ సంకల్పం - ముట్టకూడదు, రుచిచూడకూడదు అన్న చిత్తవృత్తి. అప్పుడు మితానుభవ సంస్కరణ బలంగా, స్థిరంగా, పరిపూర్ణంగా ఉంటుంది.... - CDTel 454.3

చివరిదినాల్లోని సహజ పరిస్థితి నెరిగిన లోకవిమోచకుడు తినటం తాగటాన్ని ఈ యుగ పాపాలుగా ఖండిస్తున్నాడు. లోకపరిస్థితి నోవహు దినాల్లో ఉన్నట్లే మనుష్యకుమారుడి రాకడ సమయంలో ఉంటుందని ఆయన అంటున్నాడు. ” నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు, వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసికొనుచు, పెండ్లికిచ్చుకొనుచునుండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొనిపోవు వరకు ఎరుగకపోయిరి.” చివరి దినాల్లో అలాంటి పరిస్థితులే ఉంటాయి. ఈ హెచ్చరికల్ని నమ్మేవారు తమను ఖండనకు గురిచేసే మార్గం అవలంబించకుండేందుకు జాగ్రత్త పడతారు. CDTel 455.1

సోదరులారా, ఈ విషయాన్ని లేఖన కాంతిలో పరిశీలించి, అన్ని విషయాల్లోను మితానుభవ పక్షంగా బలీయమైన ప్రభావాన్ని చూపిద్దాం. ఏపిలు పండ్లు, ద్రాక్షపండ్లు దేవుడు మనకిచ్చిన వరాలు. వాటిని ఆరోగ్యకరమైన ఆహార పదార్ధంగా ఉత్తమ రీతిలో ఉపయోగించుకోవచ్చు లేదా వక్రంగా వినియోగించటం ద్వారా వాటిని దుర్వినియోగం చెయ్యవచ్చు. మనుషుల దురభ్యాసాల మూలంగా దేవుడు జపాదుల్ని, ఏపిల్ పంటని మొత్తుతున్నాడు. లోకం ముందు మనం సంస్కర్తలుగా నిలబడి వున్నాం. మన విశ్వాసాన్ని నిందించటానికి అవిశ్వాసులికి అవకాశమివ్వకుందుము గాక. ” మీరు లోకమునకు ఉప్పయి యున్నారు.” “మీరు లోకమునకు వెలుగై యున్నారు.” అని క్రీస్తు అన్నాడు. మన హృదయాలు మనస్సాక్షులు దేవుని కృప ప్రాబల్యం కింద ఉన్నాయని, దేవుని నియమాలు లోక సంబంధమైన ఆసక్తుల్ని త్యాగం చెయ్యాల్సిందిగా కోరినా, అవే మన జీవితాల్ని నియంత్రిస్తున్నాయని ప్రదర్శిద్దాం. CDTel 455.2