మీరు ఇప్పటిలాగే ఆహారపానాలు తీసుకుంటుంటే మీ ప్రస్తుత ఆరోగ్యసమస్యల్ని తీర్చగల చికిత్స లేదు. మిక్కిలి అనుభవజ్ఞుడైన వైద్యుడు చెయ్యలేనిది మీకు మీరు చేసుకోగలరు. మీ ఆహారాన్ని క్రమబద్ధం చేసుకోండి. మీ రుచులని తృప్తి పర్చుకోటానికి, ఆరోగ్యవంతంకాని ఆహారంతో, కొన్నిసార్లు ఎక్కువ పరిమాణంలో, కడుపుని నింపటం ద్వారా మీ జీర్ణమండల అవయవాలకి తరచుగా తీవ్ర శ్రమ కలిగిస్తున్నారు. అందువల్ల కడుపు అలసిపోతుంది. అది మిక్కిలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సయితం స్వీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారం విషయంలో తప్పుడు అలవాట్ల మూలంగా మీ అన్నకోశాన్ని నిత్యం దుర్బల స్థితిలో ఉంచుకుంటారు. మీ ఆహారం కొవ్వు పదార్థాలతో కూడి అనుచితంగా ఉంటుంది. ఆహారాన్ని మీరు సామాన్యంగా, స్వాభావికంగా తయారు చేసుకోటం లేదు. మీ రుచులకి అనుకూలంగా తయారుచేసుకోటం వల్ల అది మీ అన్నకోశానికి సరిపడటం లేదు. ప్రకృతికి భారం ఎక్కువవుతుంది. దాన్ని కుంటుపర్చటానికి మీరు చేసే ప్రయత్నాల్ని అది ప్రతిఘటిస్తుంది. మీరు దానిపై మోపే భారాన్ని వదిలించుకోటానికి అది చేసే ప్రయత్నాల ఫలితమే చలి జ్వరాలు. మీరు అతిక్రమించే ప్రకృతి చట్టాలకు శిక్ష అనుభవించక తప్పదు. మీ శరీర వ్యవస్థలో దేవుడు చట్టాల్ని స్థాపించాడు. వాటి ఉల్లంఘనకు శిక్షను అనుభవించాల్సిందే. ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా మీరు రుచినే పరిగణిస్తున్నారు. కొన్ని మార్పులు చేసుకుని ఆహార సంస్కరణలో మొదటి మెట్టు మాత్రమే మీరు తీసుకున్నారు. అన్ని విషయాల్లో మనం మితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. “మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.” CDTel 122.2