Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  2—సృష్టికార్యం

  “యెహోవా వాక్కుచేత అకాశములు కలిగెను.ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వ సమూహము కలిగెను”, “ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను” “ఆయన ఆజ్ఞాపించగానే ఆ కార్యము స్థిరపరచబడెను” కీర్తనలు 33:6, 9.“భూమి యెన్నటికినీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను” కీర్తనలు 104:5.PPTel 29.1

  సృష్టికర్త చేతుల్లోనుంచి భూమి వచ్చినప్పుడు అది ఎంతో మనోహరంగా ఉంది. పర్వతాలు, కొండలు, మైదానాలు, అక్కడక్కడ నదులు సరస్సులతో భూమి ఉపరితలం ముచ్చటగా ఉంది. కొండలు, పర్వతాలు, ఇప్పటిలా కరకు బండలతో మధ్యమధ్య భయంకరమైన సందులతో అర్థాంతరంగా పైకి లేచి లేవు. భూగర్భంలోని పదునైన రాతిపొర మీద సారవంతమైన మట్టి ఏర్పడి అంతటా పచ్చని మొక్కల పెరుగుదలకు తోడ్పడింది. అసహ్యమైన బందభూములుగానీ ఎడార్లుగానీ లేవు. చూడముచ్చటగొల్పే పొదలు, చక్కని పువ్వులు అన్నిచోట్లా దర్శనమిచ్చేవి. కొండ ప్రాంతాల్లోని చెట్లు నిటారుగా పెరిగి ఠీవీగా నిలిచి ఉండేవి. వాటి ఠీవి ఇప్పటి వృక్షాలకు లేదు. గాలి దుర్గంధాలేవీ లేకుండా స్వచ్ఛంగా ఆరోగ్యకరంగా ఉండేది. నాటి పచ్చని మైదానాల సహజ సౌందర్యం ముందు నేటి రాజభవనాల చుట్టూ ఉండే గడ్డిమైదానాలు ఎందుకూ పనికిరావు. దేవుని అద్భుత హస్తకృత్యాల్ని చూసి దూత సమూహాలు ఉత్సహించి ఆనందించారు.PPTel 29.2

  జంతుజాలం వృక్షసంపదతో నిండిన భూమి సృష్టి జరిగిన తర్వాత దేవుని సృష్టికి కిరీటమనతగిన మానవుడు కార్యరంగ ప్రవేశం చేశాడు. ఈ రమణీయమైన భూమి మానవుడికోసమే దేవుడు సృజించాడు. తనకంటికి కనిపించే సమస్తం మీద మానవునికి అధికారం ఇచ్చాడు. “దేవుడు - మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము... వారు సమస్త భూమిని... ఏలుదురు... దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను... స్త్రీనిగాని పురుషునిగాను వారిని సృజించెను”. మానవజాతి ఆరంభం ఇక్కడ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. అపార్థం చేసుకోటానికి తావులేకుండా దేవుడు చేసిన దాఖలా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నది. దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి సృజించాడు. ఇది మర్మమేమీ కాదు. మానవుడు తక్కువస్థాయి జంతువుల్నుంచో వృక్షజాతినుంచో నెమ్మదిగా పరిణామం చెందాడని ఊహించటానికి ఆస్కారం లేదు. ఇది సృష్టికార్యాన్ని చిన్నచూపు చూసి, సృష్టికర్తను మానవుడి సంకుచిత, లౌకిక అభిప్రాయాల స్థాయికి దిగజార్చుతుంది. విశ్వసార్వభౌ మత్వం నుంచి దేవున్ని తొలగించటానికి ఇష్టపడటం ద్వారా మానవులు మానవుణ్ణి తన గౌరవప్రద స్థానం నుంచి కిందికి దించి తన ఆరంభం విషయంలో అతణ్ణి దోచుకొంటున్నారు.PPTel 29.3

  ఆకాశంలో నక్షత్రమండలాల్ని సృజించి, పొలాల్లోని పువ్వులకి రంగులు రంగరించి, తన శక్తి అద్భుతాలు, వింతలతో భూమ్యాకాశాల్ని నింపిన దేవుడు తన సృష్టికి మకుటమైన మానవుణ్ణి సృజించి అతణ్ణి భూమండల పాలకుడిగా నిలపటానికి వచ్చినప్పుడు పరాజయం పొందలేదు. మన జాతి ఆద్యులు క్రిములు, జలచరాలు, జంతువులు కాదు గానీ స్వయాన సృష్టికర్త అయిన దేవుడే అని దైవవాక్యంలోని వంశావళి చెబుతున్నది. మన్నులోనుంచి సృజించబడ్డప్పటికీ ఆదాము “దేవుని కుమారుడు”.PPTel 30.1

  తక్కువస్థాయి ప్రాణులపై ఆదాము దేవుని ప్రతినిధిగా నియమితుడయ్యాడు. అవి దేవుని సర్వాధికారాన్ని గుర్తించలేవు. మానవుణ్ణి ప్రేమించటానికి మానవుడికి సేవచేయటానికి అవి సృష్టించబడ్డాయి. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు “నీ చేతి పనులమీద వానికి అధికారమిచ్చియున్నావు. అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్సములను, సముద్ర మార్గములలో సంచరించువాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు” కీర్తనలు 8:6-8.PPTel 30.2

  బాహ్యాకారంలోను ప్రవర్తన విషయంలోను మానవుడు దేవుని స్వరూపాన్ని కలిగి ఉండాల్సి ఉన్నాడు. క్రీస్తు మాత్రమే తండ్రి “తత్వము యొక్క మూర్తిమత్వము” కలిగి ఉన్నాడు (హెబ్రీ 1:3). కాని మానవుడు దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు. అతని స్వభావం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంది. దైవ సంగతుల్ని గ్రహించటానికి అతని మనసు సమర్థంగా ఉంది. అతని ప్రేమ పవిత్రమైంది. అతని రుచులు అభిరుచులు వివేచన అదుపులో ఉన్నాయి. దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్న అతడు పరిశుద్ధంగా ఆనందంగా ఉన్నాడు. ఆయన చిత్తానికి సంపూర్తిగా లోబడి ఉన్నాడు.PPTel 30.3

  మానవుడు సృష్టికర్త చేతుల్లోంచి వచ్చినప్పుడు దీర్ఘకాయం, అంగసౌష్టవం కలిగి ఉన్నాడు. అతని ముఖం ఆరోగ్య సూచకమైన గులాబీరంగుతో నిగనిగలాడింది. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులకన్నా ఆదాము ఎంతో ఎత్తరి. అవ్వ ఎత్తు కొంచెం తక్కువ. అయినా ఆమె ఆకృతి అతి సుందరమైనది. పాపరహితమైన ఆ జంట దుస్తులు ధరించలేదు. దూతలకు మల్లే వారు వెలుగుతోను మహిమతోను కప్పబడి ఉన్నారు. దేవునికి లోబడి ఉన్నంతకాలం వారిని ఈ మహిమ అంగీ కప్పింది.PPTel 30.4

  ఆదాము సృష్టి జరిగిన తర్వాత ప్రతి జీవి తన ముందుకి రాగా వాటికి ఆదాము పేర్లు పెట్టాడు. ప్రతి ప్రాణికి జత ఉన్నట్లు గుర్తించాడు. కాని వాటిలో తనకు “సాటియైన సహాయము... లేకపోయెను”. దేవుడు చేసిన సమస్త జీవరాశిలోను ఒక ప్రాణి కూడా మానవుడికి సరిసాటిగా లేదు. “నరుడు ఒంటరిగా ఉండుట మంచిదికాదు వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదును” అని దేవుడు అనుకొన్నాడు. ఒంటరిగా నివసించటానికి మానవుణ్ణి దేవుడు సృష్టించలేదు. మానవుడు సంఘజీవి కావాల్సి ఉన్నాడు. భాగస్వామిలేకుండా ఏదెను సుందర దృశ్యాలు ఆహ్లాదకరమైన ఏదెను తోట పనులు సంతోషానందాలు కూర్చేవికాదు. సానుభూతికోసం స్నేహంకోసం అతని కోరికను దేవదూతల సహవాసం సైతం తృప్తి పర్చేది కాదు. ప్రేమ ఇచ్చి పుచ్చుకోటానికి ఒకే స్వభావం గల వ్యక్తి ఇంకొక్కరు లేరు.PPTel 31.1

  దేవుడే ఆదాముకి స్నేహితురాల్ని ఇచ్చాడు. అతడికి “సాటియైన సహాయమును” ఏర్పాటు చేశాడు. అతనికి స్నేహం, ప్రేమ, సానుభూతి పంచటానికి ఆమెలో సమర్థత ఏర్పాటయ్యింది. ఆదాము పక్కటెముక నుంచి అవ్వ సృష్టి జరిగింది. శిరస్సు మాదిరిగా ఆమె అతణ్ణి నియంత్రించకూడదనీ ఆమెను అతడు తక్కువదానిగా కాళ్లకింద తొక్కక తనతో సమానురాలిగా తన పక్క నిలుపుకొని ఆమెను ప్రేమించి సంరక్షించాలని ఇది సూచిస్తున్నది. అతని ఎముకలో ఎముక, మాంసంలో మాంసం అయిన ఆమె అతనిలో ఒక భాగం.అతని రెండో ప్రాణం. ఈ బాంధవ్యంలో ఉండాల్సిన అన్యోన్యతను ఆత్మీయతను ఇది సూచిస్తున్నది. “తన శరీరమును ద్వేషించువాడెవడును లేడుగాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును” ఎఫెసి 5:29. “ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరులగుదురు”.PPTel 31.2

  మొదటి వివాహకార్యాన్ని దేవుడే జరిపాడు. ఈ వ్యవస్థ స్థాపకుడు విశ్వసృష్టి కర్త అయిన దేవుడే. “వివాహము అన్ని విషయములలో ఘనమైనది” హెబ్రీ 13:4. మానవుడికి దేవుడిచ్చిన మొదటి వరాల్లో ఇదొకటి. ఆదాము పాపంలో పడ్డ తర్వాత ఏదెనునుంచి బైటికి వచ్చేటప్పుడు తనతో తెచ్చిన రెండు వ్యవస్థల్లో ఇదొకటి. వివాహంలోని దైవ నియమాల్ని గుర్తించి వాటికి విధేయులై నివశించినప్పుడు సతీపతులకు వివాహం గొప్పదీవెన. జాతి పవిత్రతను సంతోషాన్ని అది కాపాడుంది. మానవుడి సాంఘికావసరాల్ని తీర్చుతుంది. ఆధ్యాత్మిక, మానసిక, నైతిక స్వభావాన్ని ఉన్నతపర్చుతుంది.PPTel 31.3

  దేవుడైన యెహోవా తూర్పు ఏదెనులోన ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను” దేవుడు చేసిన సమస్తం పరిపూర్ణంగాను అందంగాను ఉన్నది. ఆ పరిశుద్ధ దంపతుల ఆనందానికి దోహదం చేయగలిగింది ఇంకేమీ లేదు. వారి నివాస గృమంగా ఒక తోటను తయారు చేయటం ద్వారా వారి పట్ల తన ప్రేమకు ఇంకొక గుర్తును దేవుడిచ్చాడు. ఈ తోటలో సువాసనలు విరజిమ్మే పండ్లతో నిండిన అన్ని రకాల ఫలవృక్షాలూ ఉన్నాయి. నోరూరించే రకరకాల రంగురంగుల పళ్లతో చిలవలు పలవలుగా బరువుగా అయినా నిటారుగా పెరుగుతున్న ద్రాక్షవల్లిలున్నాయి. తీగల్ని మలిచి పొదరిళ్లు చేయటం ఆదామవ్వలపని. ఆకులు పళ్లతో నిండిన చెట్ల కొమ్మలతో ఆదామవ్వలు తమ నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. సువాసనలు విరజిమ్మే రంగురంగుల పువ్వులు ఆ తోటలో కోకొల్లలు. తోట మధ్య జీవ వృక్షం ఉన్నది. అది వృక్షాలన్నిటికన్నా మిక్కిలి తేజోవంతంగా ఉన్నది. దాని పంట్లు బంగారు వెండి ఏపిలు పండ్లలా ఉన్నాయి. వాటికి నిత్యజీవాన్నిచ్చే శక్తి ఉన్నది.PPTel 32.1

  ఇప్పుడు సృష్టి పూర్తి అయ్యింది. “ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును పూర్తి చేయబడెను”. “తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగనుండెను” ఏదెను భూమిపై వికసించింది. ఆదామవ్వలు జీవవృక్ష ఫలాల్ని స్వేచ్ఛగా భుజించవచ్చు. అందమైన ఆ సృష్టిలో పాపపు మరకగాని, ఛాయగాని లేవు. “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడా పాడినప్పుడు దేవదూతలందరు ఆనందించి జయధ్వనులు” చేశారు. యోబు 38:7.PPTel 32.2

  మహాదేవుడు యెహోవా భూమికి పునాది వేశాడు. సర్వలోకాన్ని సౌందర్యంతో కప్పి దాన్ని మానవుడికి అవసరమైన వాటితో నింపాడు. నేలమీద ఉన్న అద్భుతాల్ని సముద్రంలో ఉన్న అద్భుతాల్ని ఆయన సృజించాడు. ఈ మహాసృష్టికార్యాన్ని ఆయన ఆరుదినాల్లో పూర్తిచేశాడు. దేవుడు “తాను చేసిన పని అంతటి నుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను” తాను చేసిన పనిని చూసి దేవుడు తృప్తి చెందాడు. సమస్తం సంపూర్ణంగా, సృష్టికర్తచేసిన యోగ్యమైన కార్యంగా కనిపించింది. అంతట ఆయన విశ్రమించాడు. ఆయన విశ్రమించటం అలిసిపోయిన వ్యక్తిగా కాదు, తన వివేకం, కృపాబాహుళ్యం, మహిమా ప్రత్యక్షతలతో తృప్తి చెందిన ప్రభువుగా.PPTel 32.3

  ఏడోనాడు విశ్రమించిన తర్వాత దేవుడు ఆ దినాన్ని పరిశుద్ధ పర్చాడు లేదా దాన్ని మానవుడికి విశ్రాంతి దినంగా ప్రత్యేకించాడు. ఆకాశాన్ని భూమిని చూసేటప్పుడు దేవుడు చేసిన బ్రహ్మాండమైన సృష్టిని గూర్చి తాను ధ్యానించేందుకుగాను దేవుని వివేకాన్ని కృపాబాహుళ్యాన్ని గూర్చిన నిదర్శనాల్ని పరిశీలించే కొద్ది సృష్టికర్త పట్ల తన హృదయం ప్రేమతోను గౌరవంతోను నిండేందుకుగాను మానవుడు సృష్టికర్త ఆదర్శాన్ననుసరించి ఈ దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలి.PPTel 32.4

  ఏడో దినాన్ని ఆశీర్వదించటంలో దేవుడు తన సృష్టి స్మారక చిహ్నాన్ని ఏదెనులో నెలకొల్పాడు. మానవ కుటుంబ పిత ప్రతినిధి అయిన ఆదాముకు దేవుడు సబ్బాతును అప్పగించాడు. భూమిమీద నివసించే జనులందరూ సబ్బాతు ఆచరణ ద్వారా దేవుడు తమ సృష్టికర్త అని తమ న్యాయమైన సార్వభౌముడని తాము ఆయన హస్తకృత్యమని, ఆయన అధికారానికి లోబడి నివసించే ప్రజలమని కృతజ్ఞత పూర్వకంగా గుర్తిస్తారు. ఇలా జ్ఞాపకార్థంగా ఈ వ్యవస్థ మానవాళికి వచ్చింది. ఇందులో ఛాయారూపకాలు గాని ఏ ప్రజలకూ పరిమిత వర్తింపులు గాని లేవు.PPTel 33.1

  మానవుడికి సబ్బాతు అవసరమని - పరదైసులో కూడా - దేవుడు భావించాడు. దేవుని కార్యాలగురించి, ఆయన శక్తినిగురించి, మంచితనం గురించి ఎక్కువ తలంచి ధ్యానించటానికి ఏడురోజుల్లో ఒక రోజు తన పనులు ఆసక్తులు మానవుడు పక్కన పెట్టటం అవసరం. దేవునిగురించి స్పష్టంగా జ్ఞాపకం చేయటానికి, తాను అనుభవిస్తున్న దీవెనలు సంపాదిస్తున్న సంపాదన ఆయన ఇస్తున్నవే గనుక ఆయనకు కృతజ్ఞత తెలుపుకోటానికి మానవుడికి సబ్బాతు అవసరం.PPTel 33.2

  మనుషుల మనసుల్ని సృష్టి కార్యాలపైకి నడిపించటానికి సబ్బాతును దేవుడు ఏర్పాటు చేశాడు. సజీవుడైన దేవుడున్నాడని, ఆయన సృష్టికర్త, అత్యున్నత పరిపాలకుడని ప్రకటిస్తూ వారి జ్ఞానేంద్రియాలతో ప్రకృతి మాట్లాడుంది. “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి నక్షత్రము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి. పగటికి పగలు బోధచేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది” కీర్తనలు 19:1,2. భూమి ధరించిన అందం దేవుని ప్రేమకు సంకేతం. ఆ అందం మనకు నిత్యము నిలిచే కొండల్లో కనిపిస్తుంది. ఎత్తైన వృక్షాల్లో, విచ్చుకొంటున్న మొగ్గల్లో, సున్నితమైన పువ్వుల్లో కనిపిస్తుంది. ఇవన్నీ మనకు దేవుని గురించి చెబుతున్నాయి. వాటన్నిటినీ కలుగజేసిన వానిని సూచిస్తూ ప్రకృతి గ్రంథాన్ని తెరిచి అందులో నిక్షిప్తమై ఉన్న సృష్టికర్త వివేకాన్ని, శక్తిని, ప్రేమను గుర్తించమంటూ సబ్బాతు విజ్ఞప్తి చేస్తుంది.PPTel 33.3

  ఆదామవ్వలు నిరపరాధులుగా, పరిశుద్దులుగా సృష్టి అయినా తప్పుచేయటానికి సాధ్యపడని విధంగా వారి నిర్మాణం జరగలేదు. తన విజ్ఞతను ఉదార గుణశీలాన్ని, న్యాయమైన తన ధర్మ విదుల్ని అభినందించి వాటికి విధేయులై నివసించటానికి లేదా వాటిని నిరాకరించటానికి ఎంపిక చేసుకోగల స్వేచ్ఛతో దేవుడు వారిని సృజించాడు. దేవునితోను దూతలతోను వారు సహవాసం కలిగి జీవించాల్సి ఉన్నారు. కాని వారు నిత్యం పరిశుద్దులుగా ఉండటానికి భద్రత ఏర్పాటుకు ముందు వారి విశ్వసనీయతను పరీక్షించాల్సి ఉన్నది. సాతాను పతనానికి పునాది అయిన స్వార్థాశ పై మానవుడి ఉనికి ఆరంభంలోనే నియంత్రణ విధించటం జరిగింది. తోట మధ్యలో ఉన్న జీవవృక్షం పక్కనే మేలు కీడుల జ్ఞానాన్నిచ్చే వృక్షం ఉన్నది. మన మొదటి తల్లిదండ్రులు ఆదామవ్వల విధేయతను, విశ్వాసాన్ని, దేవునిపట్ల వారి ప్రేమను పరీక్షించటానికి ఏర్పాటైన వృక్షం. తక్కిన చెట్ల పండ్లను స్వేచ్ఛగా తినటానికి వారికి అనుమతి ఉండగా ఈ చెట్టు పండ్లు తినకూడదని దాన్ని తిన్ననాడు వారు మరణిస్తారని దేవుడు చెప్పాడు. సాతాను శోధనలకు కూడా వారు గురికావల్సి ఉన్నారు. అయితే ఈ పరీక్షలకు వారు నిలబడితే అప్పుడు వారు సాతాను శక్తికి అతీతంగా ఉండి దేవుని ఆదరానుగ్రహాల్ని నిరంతరంగా ఆనందించగలుగుతారు.PPTel 33.4

  మానవుడి ఉనికికే అత్యవసర షరతుగా దేవుడు అతణ్ణి ధర్మశాసనం కింద ఉంచాడు. తన శాసనాల్ని మీరే శక్తి లేకుండా మానవుణ్ణి దేవుడు సృజించగలిగేవాడు. నిషిద్ధ ఫలాన్ని ముట్టకుండా అతని చేతిని ఆపగలిగేవాడే. అప్పుడు మానవుడు ఎంపిక స్వేచ్ఛ ఉన్న వ్యక్తిగాక కేవలం యంత్రంలా ఉండేవాడు. ఎంపిక చేసుకోటానికి స్వేచ్ఛలేని అతని విధేయత స్వచ్చంద క్రియకాక వత్తిడి వల్ల జరిగిన క్రియ అవుతుంది. ప్రవర్తన పెరుగుదలకు మెరుగుదలకు ఆస్కారం ఉండేది కాదు. తక్కిన లోకాల్లోని నివాసులతో వ్యవహరించటానికి దేవుడు అనుసరిస్తున్న ప్రణాళికకు అట్టి విధానం విరుద్ధంగా ఉంటుంది. అదీగాక, జ్ఞానంగల వ్యక్తిగా మానవుణ్ణి చేసి దేవుడు నిరంకుశ పరిపాలకుడన్న సాతాను ఆరోపణను నిజం చేసేది.PPTel 34.1

  దేవుడు మానవుణ్ణి నీతిమంతునిగా సృజించాడు. చెడుగుపట్ల మొగ్గులేకుండా ఉన్నత సుగుణాల్ని అతనికి ఇచ్చాడు. అతనికి ఉన్నతమైన మానసిక శక్తులనిచ్చి అతను తన విశ్వాసానికి నమ్మకంగా నిలిచేందుకుగాను అతని ముందు బలమైన ప్రోత్సాహకాలుంచాడు. పరిపూర్ణమైన నిరంతరమైన విధేయత షరతు పైనే నిత్య జీవానందం లభిస్తుంది. ఈ షరతు పైనే నిత్యజీవఫలాలు తినటానికి అతనికి అనుమతి లభించాల్సి ఉన్నది.PPTel 34.2

  తమ బిడ్డలు భూమి నలుమూలలకు వెళ్లి నివసించుచున్నారు గనుక ఆదామవ్వల గృహం ఇతర గృహాలకు ఆదర్శంగా ఉండాల్సి ఉన్నది. దేవుని హస్తమే అందంగా చేసిన ఆ గృహం గొప్ప రాజభవనం కాదు. అహంభావ పూరితులైన మనుషులు బ్రహ్మాండమైన ఖరీదైన భవనాలు కట్టుకొని తమ హస్తకృత్యాన్ని చూసి అతిశయిస్తారు. కాని దేవుడు ఆదామును ఒక తోటలో ఉంచాడు. అదే అతని నివాసగృహం. దాని పైకప్పు నీలి ఆకాశం. మృదువైన పుష్పాలు, పచ్చని గడ్డితో నిండిన భూమి దానికి నేల. ఆకులతో నిండిన చెట్ల కొమ్మలు దానికి నీడ. దాని గోడల మీద అద్భుతమైన అలంకరణలు వేలాడాయి. అది ఉత్తమ చిత్రకారుడు సృష్టికర్త చేతిపని. ఈ పరిశుద్ధ జంట చుట్టూ ఉన్న ప్రకృతిలో అన్ని కాలాల్లో అందరికీ ఒక పాఠం ఉంది. నిజమైన ఆనందం గర్వాన్ని ప్రదర్శించే విలాసాలు వినోదాల్లోలేదు.PPTel 34.3

  అది దేవుని సృష్టిద్వారా ఆయనతో సహవాసం చేయటంలోనే ఉన్నది అన్నదే ఆ పాఠం. మనుషులు కృత్రిమాల పై దృష్టిపెట్టక సామాన్య నిరాడంబర జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే దేవుడ తమను ఏ ఉద్దేశంతో సృజించాడో అన్నది స్పష్టంగా అవగతమవుతుంది. గర్వాన్ని దురాశను తృప్తిపర్చటం ఎన్నడూ సాధ్యం కాదు. అయితే యధార్థజ్ఞానం గలవారు దేవుడు అందరికీ అందుబాటులో ఉంచిన వనరుల్లో అసలైన ఉన్నతమైన ఆనందాన్ని కనుగొంటారు.PPTel 35.1

  ఆదామవ్వలు ఏదెను తోటను “సేద్యపరచుటకు దాని కాచుటకును” బాధ్యులై ఉన్నారు. వారి పని శ్రమకలిగించేది కాక ఆనందాన్నిచ్చి బలం చేకూర్చేది. మానవుడి మనసును ఆలోచింపజేయటానికి, శరీరాన్ని బలపర్చటానికి, మానసిక శక్తుల్ని వృద్ధిపర్చటానికి ఒక దీవెనగా అతనికి దేవుడు పనిని ఏర్పాటు చేశాడు. తన పరిశుద్ధ జీవితంలో మానసిక, శారీరక పరిశ్రమలో ఆదాము ఉన్నతమైన ఆనందాన్ని కనుగొన్నాడు. అవిధేయత కారణంగా సుందరమైన తన గృహం విడిచి వెళ్లిపోయి తన అనుదిన ఆహారం కోసం ఆదాము మట్టిలో కష్టపడాల్సి వచ్చినప్పుడు ఆశారీరక శ్రమ ఏదెను తోటలోని శ్రమలా ఆనందదాయకం కాకపోయినా అది అతణ్ణి శోధనలో పడకుండా కాపాడి అతనికి సంతోషాన్నిచ్చే సాధనమయ్యింది. ఆయాసం, బాధ కలిగించేదైనప్పటికీ పనిని ఒక శాపంగా పరిగణించేవారు తప్పుడు పంథాను అనుసరిస్తున్నారు. ధనవంతులు శ్రమజీవుల్ని తరచుగా తక్కువగా చూస్తుంటారు.PPTel 35.2

  అయితే మానవుణ్ణి సృజించటంలో దేవుని ఉద్దేశానికి ఇది పూర్తిగా విరుద్ధం. ఆదాముకు ఇవ్వబడ్డ వారసత్వంతో పోల్చిచూస్తే మిక్కిలి ధనవంతుడి ఆస్థి ఏపాటిది? అయినా ఆదాము పనిలేకుండా ఊరకే కూర్చోలేదు. మానవుడి ఆనందానికి ఏది అవసరమో ఎరిగిన మన సృష్టికర్త ఆదాముకి పనిని నియమించాడు. జీవితంలోని అసలైన ఆనందం వళ్ళు వంచి పనిచేసే పురుషులికి, మహిళలకి మాత్రమే తెలుసు. దూతలు కష్టపడి పనిచేస్తారు. వారు మనుషులకు పరిచర్యచేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన పరిచారకులు. సోమరిపోతులికి దేవుని రాజ్యంలో తావులేదు.PPTel 35.3

  దేవునికి విధేయులై నివసించిన కాలంలో ఆదాము అతని జీవిత భాగస్వామి భూమిని పరిపాలించాల్సి ఉన్నారు. ప్రతీ ప్రాణి పైన వారికి హద్దులు లేని నియంత్రణాధికారం ఉన్నది. వారి చుట్టూ సింహం, గొర్రెపిల్ల ఆటలాడుకొనేవి లేదా వారి పాదాల వద్ద పడుకొనేవి. పక్షులు భయంలేకుండా ఉల్లాసంగా వారి చుట్టూ ఎగిరేవి. వారి పాటలు సృష్టికర్తకు స్తుతిగానంగా పైకెగసేటప్పుడు ఆదామవ్వలు వాటితో కంఠం కలిపి తండ్రి కుమారుల్ని స్తోత్రించేవారు.PPTel 36.1

  ఈ పరిశుద్ధ దంపతులు తండ్రి అయిన దేవుని ఆలనపాలన కింద పెరిగే పిల్లలేకాక సర్వజ్ఞుడైన దేవునివద్ద ఉపదేశం పొందే విద్యార్థులు కూడా. వారిని దేవదూతలు సందర్శించేవారు. మధ్య అడ్డుతెరలేకుండా వారు ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవారు. జీవవృక్షం ఇచ్చిన శక్తితో వారు బలో పేతులయ్యారు. వారి మానసిక శక్తి దేవదూతల మానసిక శక్తికన్నా కొంచెం తక్కువగా ఉన్నది. కనిపించే విశ్వం తాలూకు మర్మాలు - “పరిపూర్ణ జ్ఞానముగలవాని మహాకార్యములు”(యోబు 37:16) వారి ఉపదేశానికి ఆనందానికి తరగని మూలం అయ్యాయి.PPTel 36.2

  మానవులు అధ్యయనం చేయటానికి సమస్తాన్ని కలుగజేసి సమస్తాన్ని కాపాడే ఆ నిత్యుడు ఆరువేల సంవత్సరాలుగా ప్రకృతి చట్టాలు, వాటి పనితీరును గురించి వారి మనసులను తెరిచాడు. వారు ఆకును, పువ్వును చెట్టును పరిశోధించి ప్రతీదానినుంచి జీవిత రహస్యాల్ని సేకరించారు. వీటిలో ఆడుకొనే తిమింగలం మొదలు సూర్యకిరణంలో తేలే కీటకం వరకూ అన్నిటితో ఆదాముకు పరిచయం ఉంది. వాటికి అతను పేర్లు పెట్టాడు. వాటి స్వభావాన్ని అలవా ట్లను ఎరిగి ఉన్నాడు.PPTel 36.3

  విశాల ఆకాశంలో దేవుని మహిమ, వాటి వాటి క్రమబద్ద భ్రమ ణంలో ఉన్న అసంఖ్యాక ప్రపంచాలు, “మేఘములను తేలచేయుటయు”, వెలుగు, ధ్వనుల మర్మాలు, పగలు, రాత్రి మర్మాలు-ఇవన్నీ. మన మొదటి తల్లిదండ్రులకు అధ్యయనాంశాలే. అడవిలోని ప్రతీ ఆకుమీద, పర్వతాల పైని ప్రతిరాయి పైన ప్రకాశిస్తున్న ప్రతీ నక్షత్రంలోను, భూమిలోను, గాలిలోను, ఆకాశంలోను దేవుని పేరు రాసి ఉన్నది. సృష్టిలోని క్రమం, సామరస్యం నిత్యుడైన దేవుని వివేకాన్ని శక్తిని గూర్చి వారికి జ్ఞానాన్నిచ్చాయి.PPTel 36.4

  తమ హృదయాల్ని ప్రేమతో నింపి తాము మళ్ళీ మళ్ళీ దేవునికి కృత జ్ఞతలు తెలుపుకోటానికి వారు సర్వదా కొత్త కొత్త విషయాలు కనుగొంటూ నివసించాడు. వారు దైవ ధర్మశాస్త్రానికి విధేయులై నివసించినంతకాలం గ్రహించటానికి, అనుభవించటానికి, ప్రేమించటానికి వారి సమర్థత నిత్యము పెరుగుతూ ఉంటుంది. వారు నిత్యం నూతన జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారు. తాజా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అవధులులేని, ఎన్నడూ చల్లారని దేవుడు ప్రేమను కనుగొంటారు.PPTel 37.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents