Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  50—దశమభాగాలు, కానుకలు

  హెబ్రీయుల ఆర్థిక వ్యవస్థలో ప్రజలు తమ ఆదాయంలోని పదో భాగాన్ని బహిరంగ దైవారాధన మద్దతు కార్యక్రమాకి కేటాయించేవారు. ఈ నేపథ్యంలో మోషే ఇశ్రాయేలీయులకి ఇలా ప్రకటించాడు, “భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠతమగును” “గోవులలోనే గాని గొట్టె మేకలలోనే గాని... దశమ భాగము ప్రతిష్ఠితమగును” లేవీయకాండము 27:30, 32.PPTel 523.1

  కాగా దశమ భాగ వ్యవస్థకు హెబ్రీయులు ప్రారంభకులు కాదు. దశమ భాగం తనదని ఆదిలో నుంచి దేవుడు చెబుతూనే ఉన్నాడు. దీన్ని ప్రజలు గుర్తించి గౌరవిస్తూ వచ్చారు. అబ్రాహాము సర్వోన్నత దేవుని యాజకుడైన మెల్కీ సెదెకుకి దశమ భాగం చెల్లించాడు. ఆదికాండము 14:20. యాకోబు బహిష్కృతుడుగా సంచారిగా బేతేలుకి వెళ్లినప్పుడు ప్రభువుతో ఇలా వాగ్దానం చేశాడు, “నీవు నాకిచ్చు యావత్తులో పదియవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను”. ఆదికాండము 28:22. ఇశ్రాయేలీయులు ఒక జాతిగా ఏర్పాటుకానున్న తరుణంలో దశమ భాగ నిబంధన దైవ స్థాపిత ధర్మ విధిగా ఆమోదం పొందింది. దాన్ని ఆచరించడం పైనే వారి ప్రగతి ఆధారపడి ఉంది.PPTel 523.2

  మానవుల హృదయాలపై ఒక గొప్ప సత్యాన్ని ముద్రించేందుకే దశమ భాగాలు కానుకల వ్యవస్థ ఏర్పాటయ్యింది. ప్రజలు అనుభవించే మేళ్లన్నిటికీ మూలం దేవుడేనని దయామయుడైన ఆ ప్రభువిచ్చే వరాల నిమిత్తం మానవులు ఆయనకు కృతజ్ఞులై ఉండాలన్నదే ఆ సత్యం.PPTel 523.3

  “ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు”. అ.కా.17:25. “అడవి మృగములన్నియు వేయి కొండలమీది పశువులన్నియు నావే గదా” అంటున్నాడు ప్రభువు. కీర్తనలు 50:10. “వెండి నాది, బంగారము నాది” హగ్గయి 2:8. మనుషులు ఆస్తి సంపాదించుకోటానికి శక్తినిచ్చేది దేవుడే. ద్వితీ. 8:18. సమస్తం మనకు దేవుని వద్ద నుంచే వస్తున్నదని మనం గుర్తించేందుకోసం ఆయన ఆరాధనను కొనసాగించేదుకోసం ఆయన సమృద్ధిగా మనకిచ్చిన దాంట్లో కొంత భాగం అర్పణలు కానుకలుగా ఆయనకు తిరిగి చెల్లించాలని దేవుడు కోరుతున్నాడు.PPTel 523.4

  “దశమ భాగము యెహోవా సొమ్ము”. సబ్బాతు ఆజ్ఞలోని పదబంధాల్లాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి. “ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము” నిర్గమ కాండము 20:10. మానవుడి సమయంలోను ఆదాయంలోను ఒక నిర్దిష్ట భాగాన్ని దేవుడు తన కోసం ప్రత్యేకించుకొన్నాడు. ఈ రెంటిలో ఏ ఒక్కదాన్ని కూడా మానవుడు స్వార్థ ప్రయోజనాలకు సొంతం చేసుకోలేడు: చేసుకొని నిరపరాధి కాలేడు.PPTel 524.1

  గుడార సేవకు ప్రత్యేకంగా ఏర్పాటైన లేవీయులికి మాత్రమే దశమభాగం ఉపయుక్తమవ్వాల్సి ఉంది. అయితే మత సంబంధిత కార్యాల నిమిత్తం విరాళాలకు ఇది ఏవిధంగాను అడ్డుగా నిలువలేదు. గుడారం ఆ తర్వాత ఆలయం కూడా స్వేచ్చార్పణలతోనే నిర్మతమయ్యింది. మరమత్తులు తదితర ఖర్చుల నిమిత్తం ప్రజల జనాభా లెక్కలు జరిగినప్పుడల్లా “గుడారము యొక్క సేవ నిమిత్తము” ప్రజల్లో ప్రతీ ఒక్కరూ అరతులం అర్పణ ఇవ్వాలని మోషే ఆదేశించాడు. నిర్గమ 30:12-16: 2 రోజులు 12:4,5: 2 దిన వృత్తాం. 24:4-3: నెహెమ్యా 10:32, 33 చూడండి. ప్రజలు అప్పుడప్పుడు పాపపరిహారార్థ బలులు, కృతజ్ఞతార్పణలు దేవునికి తెచ్చేవారు. వీటిని సాంవత్సరిక పండుగలప్పుడు పెద్ద సంఖ్యలో సమర్పించేవారు. పేదలకు ఉదారంగా సహాయం అందించేవారు.PPTel 524.2

  దశమ భాగాన్ని వేరుచేసి ఉంచేముందు దేవుని హక్కును గుర్తించటం జరిగేది. భూ ఫలాల్లో మొదట పండిన వాటిని దేవునికి సమర్పించేవారు. గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు దాని నుంచి మొదటగా తీసిన ఉన్ని, గోధుమల్ని నూర్చినప్పుడు గోధుముల, మొదటగా ఆడిన నూనె, మొదటగా తీసిన ద్రాక్షరసం దేవునికోసం ప్రత్యేకంగా ఉంచేవారు. జంతువుల్లోనూ మొదట పుట్టినదాన్ని ప్రత్యేకించి ఉంచే వారు. జ్యేష్ఠ కుమారుడి విషయంలో విమోచన మూల్యంగా కొంత ధర చెల్లించేవారు. ప్రథమ ఫలాల్ని గుడారంలో ప్రభువు ముందు పెట్టేవారు. ఆ తర్వాత వాటిని యాజకులు భుజించేవారు.PPTel 524.3

  పొలాలకు, మందలకు, పశు సంపదకు నిజమై సొంతదారుడు ప్రభువేనని, విత్తన కాలంలోను, కోత కాలంలోను ఎండ వానలు అనుగ్రహించేవాడు ఆయనేనని తమ కున్నదంతా ఆయన సృజించినదేనని ఆయనే తమను తన ఆస్తి మీద గృహ నిర్వహకులుగా నియమించాడని ఇలా సర్వదా ప్రజలకు గుర్తు చేయటం జరిగేది.PPTel 524.4

  ఇశ్రాయేలు ప్రజల చేల నుంచి, పండ్ల తోటల నుంచి, ద్రాక్ష తోటల నుంచి ప్రథమ ఫలాలు భారంగా మోసుకొచ్చి గుడారం వద్ద సమావేశమైనప్పుడు బహిరంగంగా దేవుని దయాళుత్వాన్ని గుర్తించటం జరిగేది. యాజకుడు కానకను స్వీకరించినప్పుడు దాత యెహోవా సముఖంలో నిలబడినట్లే ఇలా పలికేవాడు, “నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు”. ఆ మీదట ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల తాత్కాలిక జీవితాన్నీ, “యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహా భయము వలనను, సూచక క్రియలవలనను మహత్కార్యాలవలనను” వారిని విడిపించటాన్ని వర్ణించేవాడు. ఇంకా అతడిలా చెప్పేవాడు, “యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నాను”. ద్వితీ 26:5, 8-11.PPTel 525.1

  మత కార్యకలాపాలకు, ధార్మిక కార్యాలకు హెబ్రీయులు ఇవ్వాల్సిన విరాళాలు తమ ఆదాయంలో నాల్గోవంతు. ప్రజల వనరుల పై అంత భారమైన పన్ను విధింపు వారిని నిరు పేదలుగా మార్చాలి, కాని అలా జరుగలేదు. ఈ నిబంధనల్ని నమ్మకంగా ఆచరించటమన్న షరతు నెరవేర్పువల్లే వారి ప్రగతి సాధ్యపడింది. విధేయత షరతు పై దేవుడు వారికి ఈ వాగ్దానం చేశాడు, “మీ పంట తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాల ఫలములను రాల్చకయుండను... అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురుగనుక అన్య జనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు”, మలాకీ 3:11.PPTel 525.2

  దైవ సేవ నిమిత్తం స్వేచ్ఛార్పణల్ని సైతం స్వార్థంలో అట్టి పెట్టుకొన్నందువల్ల సంభవించే ఫలితాలకు హగ్గయి దినాల్లోని సంభవాలు చక్కని ఉదహరణ. బబులోను చెరలో నుంచి తిరిగి వచ్చాక యూదులు దేవుని ఆలయాన్ని నిర్మించేం దుకు పూనుకొన్నారు. శత్రువుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదురైనప్పుడు పని నిలపివేశారు. భయంకరమైన కరవు సంభవించినప్పుడు ప్రజలు నిరు పేదలుగా మారారు. ఆ పరిస్థితుల్లో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయటం అసాధ్యమని నిర్ధారించుకొన్నారు. “సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింకరాలేదు” అన్నారు. అయితే ప్రభువు తన ప్రవక్త ద్వారా వారికీ వర్తమానం పంపాడు, “ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీ వేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా -- మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయ్నుది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించు కొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది”. హగ్గయి 1:2-6. అనంతరం దానికి కారణమేంటో చెప్పాడు, “విస్తారముగా కావలెనని మీరు చూచితిరి గాని కొంచెముగా పండెను: మీరు చూచితిరి గాని కొంచెముగా పండెను: మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని: ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనేగదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది. భూమి పండకయున్నది. నేను భూమికిని, పర్వతములకును అనావృష్టి కలుగజేసే, ధాన్యము విషయములోను, ద్రాక్షరసము విషయములోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్తము విషయములోను, మనుష్యుల విషయములోను, పశువుల విషయములోను, చేతి పనులన్నిటి విషయములోను, క్షామమును పుట్టించియున్నాను” హగ్గయి 1:9-11. “నాటి నుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువది కొలలు మాత్రమే దొరకును. తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను.” హగ్గయి 2:16,17.PPTel 525.3

  ఈ హెచ్చరికలతో కనువిప్పు కలిగిన ప్రజలు దేవుని ఆలయ నిర్మాణానికి పూనుకొన్నారు. అంతట దేవుని వద్ద నుంచి వారికి ఈ సందేశం వచ్చింది: “మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి... యిది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.” 18, 19 వచనాలు.PPTel 526.1

  జ్ఞాని ఇలా అంటున్నాడు, “వెదజల్లి అభివృద్ధి పొందువారుకలరు. తగిన దానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారుకలరు. ” సామెతలు 11:24. కొత్త నిబంధనలలో అపోస్తలుడైన పౌలు ఇదే నీతిని బోధిస్తున్నాడు, “కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును: సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును.” “అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు.” 2 కొరింథీ 9:6,8. PPTel 526.2

  తన ప్రజలైన ఇశ్రాయేలీయులు లోక నివాసులకు సత్య ప్రకాశకులుగా వ్యవహరించాలన్నది దైవ సంకల్పం. ఆయనను బహిరంగంగా ఆరాధించటంలో వారు దేవుడు ఉన్నాడని ఆయనే సర్వం సహాయకారి అని సాక్ష్యం ఇస్తున్నారు. ఈ ఆరాధనను కొనసాగించటం వారికి గొప్ప ఆధిక్యత. వారి స్వామి భక్తిని ఆయనపట్ల వారి ప్రేమను అది చాటుతుంది. పరమ జీవాన్ని వరంగా పొందబోయే వారి సేవలు, కానుకల ద్వారా లోకంలో సువార్త సత్యం వ్యాప్తి చెందాలన్నది దేవుని సంకల్పం. తన దూతల్ని రాయబారులుగా పంపి దేవుడు సత్యాన్ని ప్రకటించగలిగేవాడే. ధర్మ శాస్త్రాన్ని సీనాయి పర్వతం పై నుంచి గొంతెత్తి తానే క్రకటించినట్లు ఆయన తన చిత్తాన్ని బయలు పర్చేవాడే. కాని హద్దులు లేని ప్రేమ వివేకాలుగల ఆ ప్రభువు తన సేవను నిర్వహించటానికి తనతో కలిసి పనిచేసేందుకు మనుషుల్ని పిలిచాడు.PPTel 527.1

  ఇశ్రాయేలీయుల దినాల్లో దైవారాదన సంబంధిత ఆచారల నిర్వహణ నిమిత్తం దశమ భాగాలు స్వేఛ్చార్పణలు అవసరమయ్యా యి. దైవ ప్రజలు ఈ యుగంలో అంతంత మాత్రంగానే ఇవ్వాలా? మనకున్న వెలుగు, ఆధిక్యతలకు దీటుగా మన కానకలుండాలన్నది క్రీస్తు మనకిచ్చిన నియమం. “మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వానియెద్ద ఎక్కువగా అడుగుదురు” లూకా 12:48. శిష్యుల్ని లోకం లోకి పంపుతున్న సందర్భంలో వారితో రక్షకుడీ మాటలన్నాడు, “ఉచితముగా పొంది తిరి, ఉచితముగా ఇయ్యుడి.” మత్తయి 10:8. మన ఆశీర్వాదాలు, ఆధిక్యతలు పెరుగుతున్న కొద్దీ, మరీ ముఖ్యంగా దైవకుమారుని సాటిలేని త్యాగం మన కళ్ళముందే ఉంటుండగా మనం కృతజ్ఞతతో నిండి ఇతరులకు రక్షణ వర్తమానాన్ని అందించటానికి ఉదార కానుకల ద్వారా ఆ కృతజ్ఞతను ప్రదర్శించాల్సిన అవసరం లేదా? సువార్త సేవ విస్తరించే కొద్దీ దాన్ని నిర్వహించటానికి పూర్వం కన్నా ఇప్పుడు అధిక వనరులు అవసరమవుతాయి. అందును బట్టి దశమ భాగాలు కానుకల నిబంధన హెబ్రీయులనాటికన్నా ఇప్పుడు ఎక్కువ అగత్యమౌతుంది. సంఘం ఖజానాను నింపటానికి క్రైస్తవులకు తగని పద్ధతుల్ని దైవ ప్రజలు అవలంబించేకన్నా ఉదార కానుకలతో దైవ సేవను కొనసాగించినట్లైతే అది దేవునికి మహిమ తేవటమే కాదు ఎంతోమంది క్రీస్తును రక్షకుడుగా స్వీకరించటానికి సాధన మౌతుంది.PPTel 527.2

  గుడార నిర్మాణానికి మోషే రూపొందించిన ప్రణాళిక విజయవంత మయ్యింది. విజ్ఞప్తుల అవసరం లేకపోయింది. ఈనాడు మన సంఘాలు ఉపయో గిస్తున్న ప్రచార సాధనాల్లో దేన్నీ మోషే ఆశ్రయించలేదు. బ్రహ్మాండమైన విందు భోజనం ఏర్పాటు చెయ్యలేదు సంబరాలు, నృత్యాలు వినోదాలకు ప్రజల్ని ఆహ్వానించలేదు. దైవ గుడార నిర్మాణానికి లాటరీలు గాని మరే భ్రష్ట కార్యాన్ని గాని ఏర్పాటు చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు కానుకలు తేవలసిందిగా వారిని ఆహ్వానించమని మో షేకు దేవుడు ఆజ్ఞాపించాడు. మనస్పూర్తిగా ఇచ్చే ప్రతీ వారి వద్ద నుంచి కానుకల్ని మోషే అంగీకరించాల్సి ఉన్నాడు. ప్రజలు అవసరాన్ని మించి కానుకలు తెచ్చినందున ఇక కానుకలు తేవద్దని మోషే ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.PPTel 528.1

  దేవుడు మానవుల్ని తన గృహనిర్వాహకులుగా నియమించాడు. వారికి ఆయనిచ్చిన ఆస్తే సువార్త సేవ నిమిత్తం ఆయన ఏర్పాటు చేసిన సాధనం. నమ్మకమైన గృహనిర్వాహకులుగా నిరూపించుకొనే వారికి ఆయన ఇంకా పెద్ద బాధ్యతలిస్తాడు. ప్రభువిలా అంటున్నాడు, “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును” 1 సమూయేలు 2:30. “దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును” తన ప్రజలు “సణుగుకొనకయు బలవంతముగా కాకయు” కృతజ్ఞత హృదయాలతో తమ అర్పణల్ని కానుకల్ని తెచ్చినట్లయితే వారికి ఆయన ఆశీర్వాదాలు చేకూరాయి. “నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి, దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెను” మలాకి 3:30.PPTel 528.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents