Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  33—సీనాయి నుంచి కాదేషుకు

  ఇశ్రాయేలీయులు సీనాయికి వచ్చిన కొంతకాలం వరకూ గుడార నిర్మాణం ప్రారంభం కాలేదు. నిర్గమనం రెండోపడి ఆరంభంలో పరిశుద్ద గుడార నిర్మితి జరిగింది. అనంతరం యాజకుల సమర్పణ, పస్కా ఆచరణ, జనాభా లెక్కలు, పౌర లేదా మత వ్యవస్థకు అవసరమైన వివిధ ఏర్పాట్ల నిర్వహణ ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. కనుక సీనాయి వద్ద రమారమి ఏడాది కాలం నిలిచిపోయారు. వారి ఆరాధన ప్రక్రియలో ఇక్కడ ఒక నిర్దిష్ట పద్ధతి రూపుదాల్చింది. ప్రజా పాలనకు నిర్దిష్ట నిబంధనలు ఏర్పాటయ్యాయి. కనానులో వారి ప్రవేశానికి సిద్ధబాటులో భాగంగా క్రమబద్ధమైన వ్యవస్థ రూపొందింది.PPTel 365.1

  ఇశ్రాయేలు ప్రభుత్వం నిర్దిష్ట క్రమ పద్ధతితో కూడిన వ్యవస్థ. సమగ్రత పరంగాను నిరాడంబరత విషయంలోను అది అద్భుతమైన వ్యవస్థ. సృష్టి అంతటిలోను కొట్టచ్చి నట్లు కనిపించే సంపూర్ణత్వం, క్రమం హెబ్రీ సమాజంలోని క్రమంలో ప్రతిబింబిం చాయి. దేవుడే ఇశ్రాయేలీయుల రాజు. అధికారానికి ప్రభుత్వానికి కేంద్రబిందువు ఆయనే. కాగా వారికి కనిపించే నాయకుడు మోషే. దేవుడే తన నిబంధనల్ని అమలు పర్చటానికి అతణ్ని నియమించాడు. తదనంతరం దేశ సాధారణ వ్యవహారాల్లో మోషేకి చెయ్యూతనిచ్చేందుకు డెబ్బయి మంది గోత్ర పెద్దలతో ఒక సలహా సమితి ఏర్పాటయ్యింది. ఆ తర్వాత యాజకులున్నారు. వారు గుడారంలో దేవునితో సంప్రదించేవారు. ప్రధానులు గోత్రాలపై అధికారులుగా వ్యవహరించారు. వీరికింద “వెయ్యిమందకి ఒకడును, నూరుమందికి ఒకడును, ఏబది మందికి ఒకడును, పదిమందికి ఒకడును” చివరగా ప్రత్యేక విధుల నిర్వహణకు నియమితులైన అధికార్లూ ఉన్నారు. ద్వితి 1:15.PPTel 365.2

  హెబ్రీ ప్రజల శిబిరం నిర్దిష్ట క్రమపద్ధతిలో ఏర్పాటయ్యింది. దానికి మూడు విభాగాలు. ప్రతీ విభాగానికి శిబిరంలో ఒక స్థానం నియమితమయ్యాయి. కనిపించని రాజు నిత్యసన్నిధి ఉండే గుడారం శిబిరం మధ్య ఉండేది. గుడారం చుట్టూ యాజకులు లేవీయులు బసచేసేవారు.వీరికి అల్లంత దూరంగా తక్కిన గోత్రాల ప్రజలు ఉండేవారు.PPTel 365.3

  శిబిరం వేసినప్పుడే గాని ప్రయాణంలో ఉన్నప్పుడేగాని గుడారానికి దానికి సంబంధించిన విధులకి లేవీయులు బాధ్యులు. శిబిరం ముందుకు సాగాల్సినప్పుడు పరిశుద్ధ గుడారాన్ని తీసివేయటం ఆగాల్సిన స్థలం వచ్చినప్పుడు గుడారం వేయటం వారి పని. మరో గోత్రానికి చెందినవారెవరూ దాని దగ్గరకు వెళ్లటం ప్రాణాంతకం. లేవీయులు లేని ముగ్గురు కుమారుల సంతతిగా మూడు విభాగాలు అయ్యారు. ప్రతీ విభాగానికీ దాని స్థానం దాని విధులు నిర్దేశితమయ్యాయి. గుడారం ముందు దానికి దగ్గరగా మోషే అహరోను గుడారాలుండేవి. దక్షినాన కహాతీయులుండేవారు. మందసాన్ని ఆలయ ఉపకరణాల్ని గూర్చి శ్రద్ధ తీసుకోటం వారి బాధ్యత. ఉత్తరాన మెరారీయులుండేవారు. వారి బాధ్యత స్తంభాలు దిమ్మలు, బల్లల్ని గూర్చిన జాగ్రత్త తీసుకోటం. గుడారం వెనుక గెరోనీయులుండేవారు. తెరలు, యవనికల బాధ్యత వారిది.PPTel 365.4

  ప్రతీ గోత్రానికి దానిదాని స్థానం ఏర్పాటయ్యింది. ప్రభువు ఆజ్ఞాపించిన రీతిగా ప్రతీ గోత్రం దాని దాని ధ్వజం పక్క నడిచి దాని దాని ధ్వజం పక్క శిబిరం ఏర్పర్చుకోవాల్సి ఉంది. “ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దాని చుట్టు దిగవలెను.” “వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తనతన వరుసలో సాగి నడువవలెను.” సంఖ్యా 2:17. ఐగుప్తునుంచి ఇశ్రాయేలీయుల వెంట వచ్చిన మిశ్రిత జనం ఇశ్రాయేలీయుల గోత్రాలతో కలిసి బసచేయటానికి అనుమతి లేదు. వారు శిబిరం శివార్లలో ఉండాల్సి ఉంది. వారి బిడ్డలు మూడు తరాల వరకూ ఇశ్రాయేలీయుల సమాజం నుంచి వేర్పాటుగా నివసించాల్సి ఉన్నారు. ద్వితి 23:7, 8.PPTel 366.1

  శిబిరంలోను పరిసరాల్లోను పరిశుభ్రత ఖచ్చితమైన క్రమం ఉండాలన్నది ఆదేశం. నిర్దిష్టమైన పారిశుద్ధ్యాన్ని పాటించకపోతే ఆ వ్యక్తికి శిబిరంలో ప్రవేశం లభించేది కాదు. అంత పెద్ద ప్రజా సమూహం మధ్య ఆరోగ్య సంరక్షణకు ఈ చర్యలు తప్పనిసరి. ఇశ్రాయేలీయుల మధ్య పరిశుద్ధ దేవుని సముఖం ఉండటానికి నిర్దుష్టమైన క్రమం, పవిత్రత అవసరం. ప్రభువిలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించు చుండును గనుక... నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను”. PPTel 366.2

  ఇశ్రాయేలీయుల ప్రయాణమంతటిలోను “యెహోవా నిబంధన మందసము వారి ముందుగా సాగెను” సంఖ్యాకాండము 10:33. పరిశుద్ధ ధర్మశాస్త్రం ఉన్న మందసాన్ని కహాతు కుమారులు మోస్తూ ముందు నడచేవారు. మందసానికి ముందు మోషే అహరోనులు నడచేవారు. వెండి బూరలు ధరించిన యాజకులు దానికి సమీపంగా ఉండేవారు. తమకు మోషే అందజేసే వర్తమానాన్ని ఈ యాజకులు బూరల ద్వారా ప్రజలకు అందించేవారు. బూరలు ఊదే యాజకుల సూచనల మేరకు ఎటు సాగాలి అన్న విషయమై ఖచ్చితమైన ఆదేశం ఇచ్చే బాధ్యత ప్రతీ సమూహపు నాయకుడిది. ఆదేశాన్ని నిర్లక్ష్యం చేసి ఆచరించని వ్యక్తి మరణదండన అనుభవించేవాడు. PPTel 366.3

  దేవుడు క్రమానికి కర్త. పరలోకానికి సంబంధించిన సమస్తం క్రమబద్ధం. దూతగణాల కదలికలన్నీ విధేయతతో, క్రమశిక్షణతో కూడి ఉంటాయి. క్రమశిక్షణ, సంఘటిత కార్యాచరణ ఉన్నప్పుడే విజయం సాధ్యపడుంది. ఇశ్రాయేలీయుల రోజుల్లోలాగే ఈనాడు కూడా దేవుడు క్రమాన్ని పద్ధతిని కోర్తున్నాడు. ఆయన కార్యాలు నిర్వహించేవారందరూ అజాగ్రత్తగా ఆషామాషీగా కాక విజ్ఞతతో పనిచేయాల్సి ఉంది. తనకు ఆమోదయోగ్యమయ్యేందుకు తన పనిని నమ్మకంగాను నిక్కచ్చిగాను చెయ్యాల్సిందిగా మనల్నిదేవుడు కోరుతున్నాడు.PPTel 367.1

  తమ ప్రయాణమంతటిలోను ఇశ్రాయేలీయుల్ని దేవుడే నడిపించాడు. మేఘస్తంభం ఎక్కడ ఆగేదో అక్కడ వారు శిబిరం వేసేవారు. అక్కడ శిబిరం కొనసాగాల్సిన కాలమంతా మేఘం గుడారం పై నిలిచి ఉండేది. అక్కడ నుంచి కదలాల్సినప్పుడు గుడారం పై ఎత్తుగా లేచేది. ప్రయాణం ఆరంభం అంతం గంభీర ప్రార్థనతో జరిగేది. “ఆ మందసము సాగినప్పుడు మోషే - యెహోవా లెమ్ము. నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుట నుండి పారిపోవుదురుగాక యనెను. అది నిలిచినప్పుడు అతడు - యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను” సంఖ్యాకాండము 10:35, 36.PPTel 367.2

  కనాను పొలిమేరల్లో ఉన్న కాదేషుకీ సీనాయికి మధ్య పదకొండు దినాల ప్రయాణం మాత్రమే. ముందుకు సాగాల్సిందిగా మేఘం సూచించినప్పుడు ఆ వాగ్దత్త దేశంలో త్వరగా ప్రవేశించాలన్న ఆశతో ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఐగుప్తునుంచి వారిని తీసుకురావటంలో యెహోవా గొప్ప అద్భుతాలు చేశాడు. ఆయనను తమ రక్షకుడుగా అంగీకరించటానికి వారు లాంఛనంగా నిబంధన చేసుకోటం, వారు సర్వోన్నతునికి ఎంపికైన జనంగా గుర్తింపు పొందటం జరిగాక ఇప్పుడు వారికి ఏ దీవెనలకు ఎలాంటి లోటు ఉంటుంది?PPTel 367.3

  అయినా చాలాకాలం అక్కడే శిబిరం వేసుకొని ఉండటంతో అనేకమంది ఆ స్థలం విడిచి పెట్టి వెళ్లటానికి ఏమంత ఆసక్తి కనపర్చలేదు. దాన్ని తమ స్వస్థలంగా పరిగణించేంత వరకూ వచ్చారు. కొండల నడుమ ఆశ్రయంగా ఉన్న ఆ స్థలంలో తనపరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని మరోసారి వారికి ప్రకటించటానికి ఎక్కడ వారిని సమావేశపర్చాడు దేవుడు. ఏ పర్వత శిఖరాల పైన పక్కనున్న పర్వత శ్రేణుల పైన దేవుని మహిమ తరచూ ప్రదర్శితమయ్యేదో ఆ పరిశుద్ద సీనాయి పర్వతాన్ని వీక్షించడానికి వారెంతో ముచ్చటపడేవారు. ఆ దృశ్యం దేవుని సముఖంతోను దేవదూతల సముఖంతోను దగ్గర సంబంధం కలిగి ఉండటం చేత అది పవిత్ర ప్రదేశంగా కనిపించింది. దాన్ని విడిచి వెళ్లిపోవటం మంచిది కాదని భావించారు. PPTel 367.4

  అయితే యాజకులు బూర ఊదినప్పుడు శిబిరమంతా ముందుకు సాగింది. గుడారాన్ని మోసేవాళ్లు మధ్య ఉన్నారు. ప్రతీ గోత్రం తమతమ ధ్వజం కింద తమ తమ నియమిత స్థానాలు ఆక్రమించి ముందుకి సాగారు. మేఘం ఏ దిశగా కదుల్తుందోనని అందరు కళ్లు పైకెత్తి చూస్తున్నారు. శూన్యమైన నల్లని పర్వత పంక్తులున్న దిశగా మేఘం కదలటం చూసినప్పుడు అనేకుల హృదయాల్లో ఆందోళన సంశయం చోటుచేసుకున్నాయి.PPTel 368.1

  ముందుకు సాగే కొద్ది మార్గం కష్టతరమయ్యింది. ప్రయాణం రాళ్లతోనిండిన లోయలు, చెట్టూ చేమాలేని బయళ్లగుండా సాగింది. చుట్టూ ఎడారి. “ఎడారులు, గోతులు” కలిగి “యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశము” అది. యిర్మీయా 2:6. కొండల మధ్య ఇరుకైన మార్గాలు బారులు తీరి నడుస్తున్న పురుషులు స్త్రీలు పిల్లలు మందలతో కిటకిటలాడున్నాయి. ప్రయాణం నెమ్మదిగా ఆయాసకరంగా సాగుతున్నది. చాలాకాలంగా శిబిర నివాసంలో సుఖం అనుభవించిన అనంతరం ఈ ప్రయాణంలోని ప్రమాదాల్ని అసౌకర్యాల్ని ఎదుర్కోటానికి ప్రజలు సిద్ధంగా లేరు.PPTel 368.2

  మూణాళ్ల పయనం అనంతరం గొణుగుడు, సణుగుడు ప్రారంభమయ్యింది. ఫిర్యాదులు వినవచ్చాయి. ఇవి మిశ్రిత జనంతో ఆరంభమయ్యాయి. వీరిలో ఎక్కువమంది ఇశ్రాయేలీయుల్తో మమేకం కాలేదు. ఎప్పుడూ ఏదో తప్పు పట్టటానికి కని పెడ్తూ ఉండేవారు. ప్రయాణం దిశ విషయంలో వారు అసంతృప్తితో ఉన్నారు. తమతో పాటు మోషే కుడా మేఘం నడిపించే ప్రకారం నడుస్తున్నాడని తెలిసినప్పటికీ తమను మోషే నడిపిస్తున్న తీరును వారు ఎల్లప్పుడూ తప్పుపడూ ఉన్నారు. అసంతృప్తి అంటు వ్యాధి వంటిది. తృటిలోనే అది శిబిరమంతా వ్యాపించింది.PPTel 368.3

  తినటానికి మాంసం కావాలని గగ్గోలు పెట్టారు. మన్నా సమృద్ధిగా సరఫరా అవుతున్నా వారికి తృప్తి లేదు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నకాలంలో ఇశ్రాయేలీయులు అతి సామాన్యమైన ఆహారం భుజించాల్సి వచ్చింది. చాలీచాలని భోజనం ఆ పై కఠిన పరిశ్రమవల్ల ఆకలి కారణంగా అదే ఎంతో రుచిగా ఉండేది. ఇప్పుడు ఇశ్రాయేలీయు లతో ఉన్న ఐగుప్తీయుల్లో పెక్కుమంది మంచి భోజనానికి అలవాటు పడ్డవారే. ఫిర్యాదు చేసిన వారిలో వీరు మొదటివారు. సీనాయికి రావటానికి కాస్త ముందు మన్నాను. ఇచ్చే తరుణంలో మత కోరిక మేరకు ప్రభువు వారికి మాంసాన్నిచ్చాడు. అయితే అది ఒక్క రోజు మాత్రమే ఇచ్చాడు.PPTel 368.4

  మన్నాను ఇచ్చినట్లే మాంసాన్ని కూడా దేవుడు సునాయసంగా ఇవ్వగలిగేవాడే, వారి మేలు కోరే దాని పై దేవుడు ఆంక్ష విధించాడు. తాము ఐగుప్తులో అలవాటు పడ్డ చెడు ఆహారంకన్నా తమ శరీరావసారలకు తగిన ఆహారం వారికివ్వాలన్నది దేవుని ఉద్దేశం. దేవుడు ఆదిలో మానవుడికిచ్చిన ఆహారం అనగా ఏదెనులో ఆదామవ్వలకిచ్చిన ఆహారం భూమిఫలాల్ని తిని ఆరోగ్యదాయకంగా జీవించటానికిగాను వారి రుచుల్ని అభిరుచుల్ని తీర్చిదిద్దాల్సి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయులికి మాంసాహరం ఇవ్వలేకపోవటానికి కారణం ఇదే.PPTel 369.1

  సాతాను చెప్పుచేతల్లో ఉన్నవారు ఈ ఆంక్ష అన్యాయం అమానుష్యం అని పరిగణిం చారు. నిషేధించిన వాటిని వాంఛించటానికి సాతాను వారిని నడిపించాడు. కారణమేం టంటే అడ్డూ ఆపూలేని తిండి శరీరేచ్చలు పుట్టిస్తుందని ఈ విధంగా ప్రజలు తమ ఆధీనంలోకి రావటం తేలికగా జరిగే పని అని సాతానుకి తెలుసు. వ్యాధికి దుంఖానికి కర్త అయిన సాతానుకి మనుషుల్ని ఎక్కడ పడగొట్టాలో బాగా తెలుసు. నిషేదించిన పండు తినటానికి అవ్వను ప్రేరేపించిన నాటినుంచి ఆహార విషయంలో శోధించటం ద్వారా అతడు అనేకమందిని పాపంలోకి నడిపిస్తున్నాడు. ఇలాగే దేవుని మీద సణుగు కోటానికి ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు. మితిమీరి తినటం తాగటం తుచ్చమైన ఉద్రోగాల్ని రేపుతుంది. మనుషులు నైతికతను తుంగలో తొక్కటానికి ఇవి దారితీస్తాయి. శోధన కలిగినప్పుడు ప్రతిఘటించే శక్తి ఉండదు.PPTel 369.2

  ఇశ్రాయేలీయులు పవిత్రంగా, పరిశుద్ధంగా సంతోషంగా నివసించేందుకు దేవుడు వారిని ఐగుప్తు నుంచి కనానుకు తీసుకువచ్చాడు. వారి విషయంలో ఈ గురిని నెరవేర్చటానికి వారికి కొన్ని క్రమశిక్షణ పాఠాన్ని నేర్పించాడు. అవి వారికి వారి సంతతి వారికీ మేలు చేసే పాఠాలు. ప్రభువు విధించిన ఆంక్షల్ని పాటించి తమ భోజన ప్రీతిని అదుపులో ఉంచుకొని ఉంటే దౌర్బల్యం వ్యాధి వారి జోలికి వచ్చే వికాదు. వారి సంతతివారు శరీరదారుడ్యం మానసిక శక్తి కలిగి ఉండేవారు. సత్యం, విధి నిర్వహణ, దృఢ సంకల్పం, న్యాయ విచారణ ఈ విషయాల్లో వారికి సరైన అవగాహన ఉండేది. అయితే వారు దేవుడు విధించిన ఆంక్షల్ని ఆయన నీతి విధుల్నీ ఆచరించటానికి సుముఖంగా లేరు. అందుచేత తాము చేరాల్సిన ప్రమాణాల్ని చేరలేకపోయారు. తమ పై కుమ్మరించేందుకు దేవుడు సంసిద్ధంగా ఉన్న దీవెనల్ని పొందలేకపోయారు.PPTel 369.3

  కీర్తన రచయిత ఇలా అంటున్నాడు, “వారు తమ ఆశకొలది ఆహారమునడుగుచు తమ గృహములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడాయనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాటలు విని కోపగించెను” కీర్తనలు 78:18-21. ఎర్రసముద్రం నుంచి సీనాయి వరకూ జరిగిన ప్రయాణంలో సణుగుడు అల్లర్లు అధికమయ్యాయి. కాని ప్రభువు వారి అజ్ఞానానికి గుడ్డితనానికి జాలిపడి వారి పాపానికి శిక్ష విధించలేదు. అయితే తదనంతరం దేవుడు హో రేబులో తన్నుతాను ప్రత్యక్షపర్చుకొన్నాడు. ఆయన ఔన్నత్యాన్ని, మహాశక్తిని కృపను చూసి వారు గొప్ప వెలుగును పొందారు. కాబట్టి ఇప్పుడు వారి అపనమ్మకం, అసంతృప్తి వారి అపరాధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఇంకా చెప్పాలంటే, యెహోవాను తమరాజుగా అంగీకరించి ఆయనకు విధేయులై ఉంటామని వారు నిబంధన చేసుకొన్నారు. వారి గొణుగుడు ఇప్పుడు తిరుగుబాటయ్యింది. దాన్ని శిక్షించి తీరాలి... వెంటనే. ఇశ్రాయేలు ప్రజల్ని అరాజకత్వం నుంచి నాశనం నుంచి కాపాడా లంటే ఆ తిరుగుబాటును శిక్షించాలి. ‘యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆపాళెములో నొకకొనను దహింపసాగెను”. సణిగిన వారిలో ఎక్కువ తప్పిదస్థులు మేఘాల్లోనుంచి వచ్చిన మెరుపువల్ల హతులయ్యారు.PPTel 370.1

  ప్రజలు భయంతో వణుకుతూ మోషే వద్దకు వెళ్లి తమపక్షంగా ప్రభువుని వేడుకోమని యాచించారు. మోషే ప్రభువుని వేడుకోగా ఆ అగ్ని ఆరిపోయింది. ఈ తీర్పు జ్ఞాపకార్థంగా ఆ స్థలానికి “తబేలా (మండే స్థలం)” అన్న పేరు కలిగింది.PPTel 370.2

  ఈ పాపం క్రితం కన్నా అధ్వాన్నంగా తయారయ్యింది. మిగిలిన వాళ్లలో వినయమనసు పశ్చాత్తాపం పుట్టించే బదులు భయంకరమైన ఈ తీర్పు వారు పేట్రేగి ఇంకా ఎక్కువగా గొణగటానికి దారితీసింది. ప్రజలు తమ తమ గుడారం తలుపులవద్ద గుమిగూడి రోధించటం మొదలు పెట్టారు. “వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసా పేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి - మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును, కీరకాయలును, దోసకాయలును, కూరాకులును, ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల యెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి”. తమకు దేవుడిచ్చిన ఆహారం గురించి వారు ఈ రకంగా సణుగుకొన్నారు. అది తమ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటైన ఆహారమన్నది వారికి బాగా తెలుసు. ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా వాటన్నిటినీ వారు తట్టుకోగలిగారు. గోత్రాలన్నిటిలోనూ దుర్బల వ్యక్తి ఒక్కడు లేడు. PPTel 370.3

  మోషే హృదయం చలించింది. తన సొంత సంతతి గొప్ప జనాంగమయ్యే అవకాశమున్నా ఇశ్రాయేలీయుల్ని నాశనం చేయవద్దని దేవునితో విజ్ఞాపన సల్పాడు. వారిని నాశనం చేసే మాటైతే జీవ గ్రంథంలోనుంచి తన పేరు కొట్టి వేయమని దేవున్ని వేడుకొని ప్రజలపట్ల తన ప్రేమను నిరూపించుకొన్నాడు. వారికోసం తన సర్వస్వాన్ని పోగొట్టు కోటానికి సన్నద్ధమయ్యాడు. వారి స్పందనిది. తమ కష్టాలూ బాధలూ అతడి మూలంగానే అని నిందించారు. వారి యోగ క్షేమాలు చూస్తూ బాధ్యతల భారం మోస్తూ ఉన్న మోషేపై వారి గొణుగుడు మరింత భారాన్ని మోపింది. ఆ ఆవేదనలో దేవుని పై విశ్వాసాన్ని కోల్పోయేటంతపనయ్యింది. అతడు చేసిన ప్రార్థన దాదాపు ఒక ఫిర్యాదే. “నీవేల నీ సేవకుని బాధించితివి? నా మీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నా మీద పెట్టనేల?... ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు - తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయుట నావలన కాదు. అది నేను భరించలేని భారము”.PPTel 371.1

  ప్రభువు మోషే ప్రార్థన విన్నాడు. డెబ్బయిమంది ఇశ్రాయేలు పెద్దల్ని సమావేశపర్చమని మోషేతో చెప్పాడు. వారు వయసులో పెద్దవారేగాక గౌరవం, యుక్తాయుక్త జ్ఞానం, అనుభవం కలవారైయుండాలి. “ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలుబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలోపాలు వారిమీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతో కూడ బరింపవలెను”.PPTel 371.2

  తనతో బాధ్యత పంచుకోటానికి నమ్మకమైన, సమర్థులైన మనుషుల్ని ఎంపిక చేసుకోటానికి మోషే దేవుడు అనుమతించాడు. ప్రజల దౌర్జన్యాన్ని కట్టడి చేయటం లోను, తిరుగుబాటును అణచివేయటంలోను వారి పలుకుబడి సహాయపడుంది. అయినా వారిని హెచ్చించటం క్రమేణ తీవ్రమైన అనర్థాలకు దారితీస్తుంది. దేవుని మహాశక్తికీ, మంచితనానికి తాను చూసిన నిదర్శనాలకు దీటుగా మోషే విశ్వాసాన్ని కనపర్చి ఉంటే వారు ఎంపిక అయ్యేవారు కాదు. అలా కాక, మోషే తన సొంత భారాల్ని, సేవల్ని పెద్దవి చేసి తాను దేవుని చేతిలో ఒక సాధనమన్న సంగతిని దాదాపు విస్మరించాడు. ఇశ్రాయేలీయులికి శాపంగా పరిణమించిన సణుగుడులో మోషే పాలుపంచుకోటం క్షమార్హం కాదు. మోషే పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉంటే ప్రభువు అతణ్ని అన్ని వేళల్లోను నడిపించి ప్రతీ అత్యవసర పరిస్థితికి అవసరమైన శక్తిని ఇచ్చేవాడు.PPTel 371.3

  దేవుడు చేయబోతున్న కార్యానికి ప్రజల్ని ఆయత్తపర్చాల్సిందిగా దేవుడు మోషేని ఆదేశించాడు. “మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు యేడ్చి - మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు. ఒక నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుంచి వచ్చి మీకు అసహ్యముపుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని - ఐగుప్తులో నుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి”.PPTel 372.1

  “నేను ఈ జనముల మధ్య ఉన్నాను, వారు ఆరులక్షల పాదచారులు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారి నిమిత్తము కూర్చవలెనా? అంటూ విస్మయం వ్యక్తం చేశాడు మో షే. PPTel 372.2

  తన అపనమ్మకానికి మోషేని దేవుడు గద్దించాడు. “యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు”.PPTel 372.3

  మోషే ప్రభువు చెప్పిన మాటలు సమాజానికి వల్లించి డెబ్బయిమంది పెద్దల నియామకాన్ని ప్రకటించాడు. ఎంపికైన ఆ డెబ్బయిమంది పెద్దల్ని ఉద్దేశించి అధినాయకుడు మోషే పలికిన ఈ మాటలు నేటి న్యాయమూర్తులకు శాసన సభ్యులకు ఒరవడి కాగలవు. “మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చు ప్రతీ మనుష్యునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతిగాని పక్షపాతములేకుండ వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు ” ద్వితి 1:16, 17.PPTel 372.4

  ఈ డెబ్బయి మంది పెద్దల్నీ మోషే గుడారం వద్దకు పిలిచాడు. “యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దలమీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు”. పెంతెకొస్తునాడు శిష్యుల మాదిరిగా వారు “పైనుంచి శక్తి” పొందారు. ప్రభువు వారిని ఆ రీతిగా తాము చేయాల్సిన సేవకు సన్నద్ధం చేసి ఇశ్రాయేలీయుల పరిపాలనలో మోషేతో కలిసి పనిచేయటానికి వారిని ఎంపిక చేశాడన్న నమ్మకాన్ని ధృఢపర్చటానికి సమాజం ముందు వారిని గౌరవించాడు.PPTel 373.1

  ఈ మహానాయకుడి సమున్నత నిస్వార్థ స్ఫూర్తి మళ్లీ బయటపడింది. ఈ డెబ్బయి మందిలో ఇద్దరు అంత గొప్ప బాధ్యతకు తాము యోగ్యులము కామని భావించి తక్కినవారితో పాటు గుడారం వద్దకు వెళ్లకుండా నిలిచిపోయారు. అయితే, వారు ఉన్నచోటే దేవుని ఆత్మ వారి మీదికి దిగిరాగా వారుకూడా ప్రవచించారు. ఈ పరిణామాన్ని గూర్చి తెలుసుకొన్న యెహోషువా అది తమలో అపార్థాలు భేదాలు సృష్టించవచ్చని భయపడూ దాన్ని కట్టడి చేయాలనుకొన్నాడు. నాయకుడి ప్రతిష్ఠ కాపాడాలన్న దుగ్ధతో “మో షే నా ప్రభువా! వారిని నిషేధింపుము” అన్నాడు. “నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక” అన్నది మోషే సమాధానం.PPTel 373.2

  సముద్రం నుంచి బలమైన గాలి దానితో గుంపులు గుంపులుగా పూరేళ్లు వచ్చాయి. “పాళెము చుట్ట ఈ ప్రక్కన, ఆ ప్రక్కన దిన ప్రయాణమంత దూరము వరకు భూమిమీద రెండు మూరల యెత్తున” అవిపడ్డాయి. సంఖ్యా 11:31. అద్భుత రీతిగా ఒనకూడిన ఆహారాన్ని సమకూర్చుకోటానికి ప్రజలు ఆ పగలు రాత్రి మరుసటిరోజూ శ్రమించారు. పెద్ద ఎత్తున ఆహారం పోగు చేసుకొన్నారు. “తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను”. ప్రస్తుత అవసరాలకు మించి సమకూర్చుకొన్నదంతా ఎండబెట్టి దేవుని వాగ్దానం మేరకు నెలకు చాలినంత నిల్వ చేసుకొన్నారు.PPTel 373.3

  తమకు మంచిది కాకపోయినప్పటికీ తాము గుచ్చి గుచ్చి కోరుతున్నందువల్ల తాము కోరిన దాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. తమకు మేలు చేసే వాటితో వారు తృప్తి చెందలేదు. తిరుగుబాటుతో కూడిన వాంఛల్ని వారు తీర్చుకొన్నారు. అయితే వాటి పర్యవసానాల్ని కూడా భరించాల్సి ఉన్నారు. అడ్డూ ఆపూ లేకుండా విందులు ఆరగించారు. ఆ విచ్చలవిడి ప్రవర్తనకు శిక్ష త్వరగానే వచ్చింది. “యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను”. ఉపద్రవమైన జ్వరాల వల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో మరణించారు. వారిలో ఎక్కువమంది తాము ఆశించిన భోజనాన్ని ఆత్రంగా తింటున్నప్పుడే మొత్తబడి నేలకూలారు. అందరికన్నా వీరే ఎక్కువ అపరాధులు.PPTel 373.4

  తబెరా విడిచి పెట్టిన తర్వాత ఇశ్రాయేలీయులు శిబిరం వేసిన స్థలం హజేరోతు. ఇక్కడ మోషేకి మరింత చేదు అనుభవం వేచి ఉన్నది. ఇశ్రాయేలీయ సమాజంలో అహరోను, మిర్యాములు గొప్ప గౌరవం ఆదరంగలవారు. నాయకత్వ బాధ్యతలు వహించేవారు. ఇద్దరికీ ప్రవచన వరం ఉంది. ఇశ్రాయేలు ప్రజల విమోచనలో ఇద్దరూ మోషేకి సహకరించారు. “మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని” అని మీకా ద్వారా దేవుడు చెప్పాడు (మీకా 6:4). నైలునది పక్కన ఉండి పసిబిడ్డ అయిన మోషేని ఉంచిన జమ్ము పెట్టెను కాపాడినప్పుడు మిర్యాము ప్రవర్తన ఎంత ధృఢమైందో ఆ చిన్న వయసులోనే తేటతెల్లమయ్యింది. తన ప్రజల విమోచకుణ్ని కాపాడటంలో మిర్యాము ఆత్మ నిగ్రహాన్ని నేర్పును దేవుడు సాధనంగా ఉపయోగించాడు. కవిత, సంగీతం, వరాలుగా పొందిన మిర్యాము ఎర్రసముద్రం ఒడ్డున ఇశ్రాయేలు స్త్రీలను గాననృత్యాల్లో నడిపించింది. ప్రజల ప్రేమాభిమానాల విషయంలోను దేవుని ప్రసన్నత విషయంలోను మోషే అహరోనుల తర్వాత ఆమెదే ఉన్నత స్థానం. కాగా, పరలోకంలో అసమ్మతికి కారణమైన పాపమే ఈ స్త్రీ హృదయంలోనూ పుట్టుకొచ్చింది. తన అసంతృప్తి విషయంలో సానుభూతి తెలిపే వ్యక్తి ఆమెకు దొరికాడు.PPTel 374.1

  డెబ్బయిమంది పెద్దల నియామకం విషయంలో మోషే అహరోను మిర్యాముల్ని సంప్రదించలేదు. అందుచేత వారు మో షేపట్ల అసూయగా ఆయాసంగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు సీనాయికి ప్రయాణిస్తున్నప్పుడు యిత్ర సందర్శన సమయంలో మామ సలహాని మోషే అంగీకరించినప్పుడు తమసలహాలకన్నా యిత్రో సలహాలకు మోషే ఎక్కువ విలువనిస్తున్నాడన్న భయం వారిలో చోటుచేసుకొన్నది. మోషేకి సహాయం చేయటానికి తాము ఎంపికయ్యాం గనుక నాయకత్వ బాధ్యతను తాము మోషేతో సమానంగా పంచుకోవాలని అభిప్రాయపడ్డారు. మరికొందరు సహాయకుల నియామకం అనవసరమని భావించారు.PPTel 374.2

  దేవుడు తనకు నియమించిన పని ప్రాముఖ్యమైందని మోషే పరిగణించాడు. అలా ఎన్నడూ ఎవ్వరూ భావించలేదు. తన బలహీనతేమిటో గ్రహించి దేవుణ్ని తన సలహాదారుగా ఎన్నుకొన్నాడు. అహరోను తనను మించిన వ్యక్తి లేడని భావించి దేవుని మీద అంతగా ఆధారపడలేదు. బాధ్యతను అప్పగించినప్పుడు తప్పటడుగు వేశాడు. సీనాయి వద్ద విగ్రహారాధనను అనుమతించటంలో తన ప్రవర్తనలోని బలహీనతను ప్రదర్శించుకొన్నాడు. అసూయ అత్యాశ అంధత్వం కలిగించగా దీన్ని మిర్యాము అహరోనులు చూడలేకపోయారు. పరిశుద్ధమైన యాజక బాధ్యతలకు తన కుటుంబాన్ని ఎంపిక చేసుకోటం ద్వారా దేవుడు అహరోనును అభిమానించాడు. ఇది కూడా ఇప్పుడు తన ఔన్నత్యాన్ని పెంచుకోవాలన్న దురాశకు ఊతమిచ్చింది. “వారు - మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేత పలికించలేదా?” అని చెప్పుకొన్నారు. తమ పట్ల కూడా దేవునికి సమానమైన అభిమానం ఉందని భావిస్తూ తమకు కూడా మోషేతో సమానమైన హోదా అధికారం ఉన్నాయని తలంచారు.PPTel 374.3

  అసంతృప్తికి లోనైన మిర్యాము దేవుడే ఉపేక్షించిన ఘటనల్ని ఆసరా చేసుకొని విమర్శించటానికి పూనుకొంది. మోషే చేసుకొన్న పెళ్లి ఆమెకు సుతరాము ఇష్టం లేదు. ఒక ఇశ్రాయేలీయ స్త్రీని కాకుండా వేరే జాతి స్త్రీని మోషే చేసుకోవటం తన కుటుంబానికీ తన జాతికీ నామోషిగా పరిగణించింది. సిప్పోరాను ఆమె చాలా హీనంగా చూసింది. PPTel 375.1

  మోషే భార్యను “కూషుదేశపు స్త్రీ”గా వ్యవహరించటం జరిగినా (సంఖ్యా 12:1) ఆమె మిద్యానీయురాలు. కాబట్టి ఆమె అబ్రాహాము సంతతికి చెందిన స్త్రీ. కాస్త నల్లగా ఉండటం వల్ల ఆకారంలో ఆమె హెబ్రీస్త్రీలా కనిపించేది కాదు. ఇశ్రాయేలీయురాలు కాకపోయినా సిప్పోరా యధార్ధ దేవుడు యెహోవాను ఆరాధించే స్త్రీ. ఆమె ఒకింత భయస్తురాలు. ధైర్యంగా ముందుకు వచ్చే స్త్రీ కాదు. ఎంతో నెమ్మదిపరురాలు. ప్రేమామయి. బాధపడున్న వారిని చూసి సహించలేని అమృతమూర్తి. ఐగుప్తుకి వెళ్తున్నప్పుడు ఆమె మిద్యానుకి తిరిగి వెళ్లటానికి మోషే సమ్మతించటానికి కారణం ఇదే. ఐగుప్తీయుల మీదపడున్న బాధాకరమైన శిక్షల్ని ఆమె చూడకూడదన్నది మోషే ఉద్దేశం.PPTel 375.2

  సిప్పోరా తన భర్త మోషేని తిరిగి అరణ్యంలో కలిసినప్పుడు భారమైన బాధ్యతలు అతణ్ని కుంగదీస్తున్నట్లు గమనించి తన భయాందోళనల్ని ఆమె తన తండ్రి యిత్రోకి విన్నవించింది. సమస్య పరిష్కారానికి యితో కొన్ని సూచనలు మో షేకి చేశాడు. సిప్పోరా పట్ల మిర్యాము ద్వేసానికి ప్రధాన కారణం ఇదే. తననూ అహరోనునూ మోషే నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఊహించుకొని మిర్యాము బాధపడింది. తమను క్రితంలో సంప్రదించినట్లు మోషే సంప్రదించకపోవటానికి మోషే పై అతడి భార్య సిప్పోరా ప్రభావమే హేతువని నిర్ధారించుకొన్నది. అహరోను నిజానికి దృఢంగా నిలబడి ఉంటే దుష్టికి అడ్డుకట్ట వేయగలిగేవాడు. మిర్యాముకి తన ప్రవర్తనలోని చెడుగును చూపించే బదులు ఆమె పట్ల సానుభూతి ప్రదర్శించి ఆమె ఆక్షేపణ విని తద్వారా ఆమెకున్న ఈర్ష్యలో పాలు పంచుకొన్నాడు.PPTel 375.3

  వారి నిందల్ని మోషే నిశ్శబ్దంగా భరించాడు. మిద్యాను అరణ్యంలో శ్రమలకోర్చి గడించిన అనుభవం అక్కడ ప్రోది చేసుకొన్న సాత్వికం దీర్ఘ శాంతం - ప్రజల అపనమ్మకాన్ని సణుగుడిని, తనకు నమ్మకంగా సహకరించేందుకోసం నియమితులైన వారి అతిశయాన్ని ఈర్ష్యను ఓర్పుతో నేర్పుతో ఎదుర్కోటానికి మోషేని సన్నద్ధం చేసింది. మోషే “భూమి మీదనున్న వారందరిలోను మిక్కిలి సాత్వికుడు”. ఇందుమూలంగానే అతడు అందరికన్నా ఎక్కువ వివేకాన్ని నడుపుదలను పొందాడు. లేఖనం ఇలా అంటున్నది, “న్యాయ విధులనుబట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును” కీర్తనలు 25:9. దేవుడు సాత్వికుల్ని నడిపిస్తాడు., ఎందుకంటే వారు నేర్చుకోటానికి సంసిద్ధంగా ఉంటారు. ఉపదేశాన్ని స్వీకరిస్తారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోటానికి దానిననుసరించి నడుచుకోటానికి ఆశిస్తారు. రక్షకుని వాగ్దానం ఇది, “ఎవడైన ఆయన చిత్తము చొప్పున చేయనివ్చయించుకొనిన యెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేను బోధించుచున్నానో వాడు తెలిసికొనును”. యోహాను 7:17. అపొస్తలుడైన యాకోబు నోట దేవుడు ఇలా పలుకుతున్నాడు, “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును” యాకోబు 1:5. అయితే ప్రభువును సంపూర్తిగా వెంబడించటానికి సన్నద్ధంగా ఉన్నవారికే ఆయన వాగ్దానం చెందుతుంది. దేవుడు ఎవరినీ ఒత్తిడి చేయడు. అందుచేత నేర్చుకోటానికి ఇష్టపడని గర్విష్టుల్ని, కేవలం తమ ఇష్ట ప్రకారమే వ్యవహరించేవారిని ఆయన నడిపించలేడు. ద్విమనస్కుడు గురించి అనగా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్లు చెప్పుకొంటూ తన ఇష్ట ప్రకారమే వ్యవహరించే వ్యక్తిని గురించి ఇలా ఉన్నది, “అట్టి మనుష్యుడు... ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు”. యాకోబు 1:7.PPTel 376.1

  దేవుడు మోషేని ఎంపిక చేసుకొని అతడిపై తన ఆత్మనుంచాడు. తమ సణుగుడి వల్ల తమ నేత మోషే పట్ల మాత్రమేగాక దేవునిపట్ల కూడా మిర్యాము అహరోనులు ద్రోహం చేసినవారయ్యారు. విద్రోహకరమైన గుసగుసలాడిన వీరిని గుడారంలో మోషే ముందు నిలవాల్సిందిగా ఆదేశం వచ్చింది. “యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనిలిచి అహరోను మిర్యాములను పిలిచెను” తమకు ప్రవచన వరం ఉందన్న వారి వాదన కాదనలేదు. వారితో దర్శనాల్లోను, స్వప్నాల్లోను దేవుడు మాట్లాడి ఉండవచ్చు. కాని “నా యిల్లు అంతటిలో నమ్మకమైనవాడు” అని ఎవరి గురించి స్వయంగా ప్రభువే అన్నాడో ఆ మోషేతో ఆయన మరింత సన్నిహితంగా మాట్లాడాడు. అతడితో దేవుడు ముఖాముఖీ మాట్లాడాడు. “కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను”. దేవుని అసమ్మతిని సూచిస్తూ గుడారం మీద నుంచి మేఘస్తంభం మాయమయ్యింది. మిర్యాము వ్యాధిగ్రస్తురాలయ్యింది. ఆమె ” హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయెను”. అహరోనికి ఏమీ సంభవించలేదు గాని మిర్యాము శిక్షలో అతడికి మందలింపు వచ్చింది. ఇప్పుడు వారి అహంకారం మట్టికరిసింది. తమ పాపాన్ని అహరోను ఒప్పుకొన్నాడు. హేయమైన భయంకరమైన ఆ వ్యాధితో తన సోదరిని నశింపనియ్యవద్దని ప్రాధేయపడ్డాడు. మోషే ప్రార్థనలకు జవాబుగా కుష్ఠునుంచి మిర్యాము శుద్ధిపొందింది. కాకపోతే శిబిరం వెలుపల మిర్యాము ఏడు దినాలు ఉండాల్సి వచ్చింది. శిబిరంలోనుంచి ఆమె బహిష్క ృతి జరిగాకే దైవానుగ్రహ చిహ్నమైన మేఘస్తంభం మళ్లీ గుడారం మీద నిలిచింది. మిర్యాము తిరిగి శిబిరంలోకి వచ్చేవరకూ ఆమె ఉన్న హోదాకు గౌరవ సూచకంగా, ఆమెకు కలిగినగాయం నిమిత్తం సంతాప సూచకంగా ఇశ్రాయేలు సర్వసమాజం హజేరోతులో వేచి ఉన్నది.PPTel 376.2

  పెచ్చరిల్లుతున్న అసంతృప్తుల్ని అవిధేయతను కట్టడి చేయటానికి తన అగ్రహ ప్రదర్శన ఇశ్రాయేలీయులక హెచ్చరికగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. మిర్యాము ప్రదర్శించిన అసూయ, అసంతృప్తిల్ని గద్దించకుండా విడిచి పెట్టి ఉంటే పర్యవసానంగా తీవ్రమైన చేటు సంభవించేది. అసూయ గొప్ప దుర్గుణం. అది సాతానుకు సంబంధించింది. దాని పర్యవసానంగా కలిగే హాని ఇంత అంత కాదు. జ్ఞాని అయిన సొలొమోను ఇలా అంటున్నాడు, “క్రోధము క్రూరమైనది. కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?” సామెతలు 27:4. పరలోకంలో అశాంతి పుట్టించింది అసూయే. అది చోటుచేసుకొన్నప్పుడు మానవ సమాజంలో ఎంతో కీడు సంభవించింది. “మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును” యాకోబు 3:16.PPTel 377.1

  ఇతరుల గురించి చెడు మాట్లాడటం లేదా ఇతరుల ఉద్దేశాలు క్రియల్ని గూర్చి తీర్పు తీర్చటం చిన్న విషయంగా కొట్టిపారెయ్యటానికి లేదు. “సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమున నెరవేర్చిన వాడవు కాక న్యాయమును విధించిన వాడవైతివి” యాకోబు 4:11. న్యాయం తీర్చేవాడు ఒక్కడే ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచువాడు”. 1 కొరింథీ 4:5. ఎవరైతే తన తోటి మనుషుల్ని విమర్శించి ఖండిస్తారో అతడు దేవునికి మాత్రమే చెందే ప్రత్యేకాధికారాన్ని అందిపుచ్చుకొంటున్నవాడవుతాడు.PPTel 377.2

  తన రాయబారులుగా దేవుడు ఎవరిని పిలిచాడో వారి మీద నిందలు మోపటం విషయంలో జాగ్రత్తగా ఉండాలని బైబిలు బోధిస్తున్నది. ఎన్నడూ మారని ఒక తరగతి పాపుల్ని వర్ణిస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా అంటున్నాడు, “వీరు తెగువ గలవారును స్వేచ్ఛా పరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు. దేవదూతలు వారికంటే మిర అధికమైన బలమున శక్తియు గలవారైనను, ప్రభువు యెదుట వారిని దూషించి వారిమీద నేరము మోపవెరతురు” 2 పేతురు 2:10, 11. సంఘం పై అధికారులుగా నియమితులైన వారికి ఉపదేశమిస్తూ పౌలిలా అంటున్నాడు, “ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము” 1 తిమోతి 5:19. తన ప్రజల పై నాయకులుగా, బోధకులుగా ఎవరి పై ప్రభువు బాధ్యతలు మోపాడో వారు తన సేవకులతో వ్యవహరించే తీరును గూర్చి వారిని ఆయన జవాబు అడుగుతాడు. దేవుడు ఎవరిని అభిమానిస్తాడో వారిని మనం అభిమానించాలి. దేవుడు ఎవరి మీద తన పరిచర్య బాధ్యతలు పెట్టాడో అసూయకు చోటిచ్చి వారి మీద సణుగుకొనేవారికి మిర్యాముకి దేవుడిచ్చిన శిక్ష మందలింపుగా ఉండాలి.PPTel 378.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents