Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  16—యాకోబు ఏశావులు

  ఇస్సాకు కవల కొడుకులు యాకోబు ఏశావులు ప్రవర్తన విషయంలోను జీవిత విధానంలోను ఒకరినొకరు చుక్కెదరు. వారి మధ్య ఉన్న ఈ భేదం గురించి వారు పుట్టకముందే దేవదూత తెలిపాడు. ఆందోళనతో నిండిన రిబ్కా ప్రార్థనకు జవాబుగా తనకు ఇద్దరు కుమారులు పుడతారని, వారిద్దరూ ఒక్కొక్క రాజ్యానికి అధినేతలవ్వుతారిని కాని ఒకడు ఇంకొకడికన్నా గొప్పవాడవుతాడని చిన్నవాడు ప్రముఖుడవుతాడని వారి భావి చరిత్రను దూత తెలిపాడు.PPTel 168.1

  ఏశావు స్వార్దాశలు తీర్చుకొంటూ ప్రస్తుతంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పెరిగాడు. కట్టుబాట్లంటే కిట్టని ఏశావుకు స్వేచ్చగా తిరుగుతూ వేటాడటమంటే ఎంతో ఇష్టం. చిన్న వయసులోనే వేటగాడి జీవితాన్ని ఎన్నుకొన్నాడు. అయినా అతడంటే తండ్రికి ప్రాణం. నెమ్మది పరుడు, శాంతి కాముకుడు అయిన ఆ కాపరి పెద్ద కుమారుడి సాహస గుణానికి, చురుకుతనానికి ఆకర్షితుడయ్యాడు. ఏశావు కొండలమీద అరణ్యంలో సంచరించి సాయంత్రం తండ్రికి తాను వేటాడిన జంతవుల మాంసం తెచ్చి పెట్టి తన సాహసకార్యాల్ని నివేదించే వాడు. యాకోబు ఆలోచన పరుడు. కష్టపడి పనిచేస్తూ విషయాలన్నిటిని జాగ్రత్తగా చూసుకొనేవాడు, ప్రస్తుతానికన్నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంటివద్ద ఉండటంతోనే తృప్తి పొంది మందల్ని మేపటం, సేద్యం చేయ్యడంలో నిమగ్నుడయ్యేవాడు. అతడి ఒర్పు, జాగరూకత, దూర దృష్టి తల్లిని ఆకట్టు కొన్నాయి. అతడి అనురాగాలు గాఢమైనవి, బలమైనవి. అతడి సున్నితమైన, నిశ్చలమైన ప్రేమ ఏశావు అప్పుడప్పుడు ఉద్వేగ భరితమైన కనికరం కన్నా ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. రిబ్కాకు యాకోబు అంటే అమిత ప్రేమ.PPTel 168.2

  దేవుడు అబ్రాహాముకి చేసి ఇస్సాకు ద్వారా నెరవేర్చనున్న వాగ్దానాల్ని ఇస్సాకు రిబ్కాలు తమ ఆశలకు నిరీక్షణలకు లక్ష్యంగా నిలువుకొని నివసించారు. ఈ వాగ్దానాలు ఏమిటో ఏశావు యాకోబులకు తెలుసు. జ్యేష్ఠత్వం గొప్ప ప్రాముఖ్యం గలదని వారికి నేర్పించారు. ఎందుకంటే అందులో లౌకికమైన ఆస్తికి హక్కు మాత్రమే గాకుండా ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కూడా ఇమిడి ఉన్నాయి. పోతే జ్యేష్ఠత్వం ఉన్న వ్యక్తి నెరవేర్చాల్సిన బాధ్యతలూ ఉన్నాయి. జ్యేష్ఠత్వ లబ్ధిని పొందే వ్యక్తి తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసుకోవాలి. అబ్రాహముకు మల్లే అతడు దైవ విధుల్ని ఆచరించాలి. వివాహం, కుటుంబం సంబంధాలు, ప్రజా జీవితం - ఈ విషయాల్లో అతడు దేవుని చిత్త మేమిటో తెలుసుకొని వ్యవహరించాలి.PPTel 168.3

  ఈ ప్రత్యేక హక్కుల్ని షరతుల్ని ఇస్సాకు తన కుమారులకి వివరించి పెద్ద కుమారుడుగా జ్యేష్ఠత్వానికి ఏశావు హక్కుదారుడని స్పష్టంగా చెప్పాడు. కాని ఏశావు భక్తి జీవితాన్ని ప్రేమించలేదు. మతంపట్ల అతడికి ఆసక్తి సుతరామూలేదు. ఆధ్మాత్మిక వారసత్వానికి సంబంధించిన విధుల్ని ఏశావు స్వాగతించలేదు, ద్వేషించాడు. అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనకు షరతు అయిన దైవ ధర్మశాస్త్రాన్ని ఏశావు దాసత్వపు కాడిగా భావించాడు. స్వార్ధాశలు తీర్చుకోవాలన్న తీర్మానంతో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటానికి స్వేచ్ఛ కావాలని కోరాడు. అతడికి అధికారం, ధనం, తినటం, తాగటమే ఆనందం. తన సంచార ఆటవిక జీవితానికి తనకున్న పరిపూర్ణ స్వేచ్చ విషయంలో అతిశయించాడు. దూత చెప్పిన మాటల్ని రిబ్కా జ్ఞాపకం చేసుకొంది. కుమారుల ప్రవర్తనల గురించి తన భర్తకన్నా రిబ్కానే బాగా అవగాహన చేసుకొంది. దైవ వాగ్దాన వారసత్వం యాకోబుకి ఉద్దేశించిందని ఆమె గట్టిగా నమ్మింది. దూత చెప్పిన మాటల్ని రిబ్కా ఇస్సాకుకి వల్లించింది. అయినా తండ్రి ప్రేమ పెద్ద కొడుకుమీదే నిలిచి ఉంటంతో అతడి ఉద్దేశంలో మార్పు కనిపించలేదు.PPTel 169.1

  దైవ సూచననుబట్టి జ్యేష్ఠత్వం తనకు వస్తుందని తల్లి నుంచి యాకోబు తెలుసుకొని జ్యేష్ఠత్వం ద్వారా వచ్చే ప్రత్యేక హక్కుల కోసం ఎంతగానో ఆశించాడు. తండ్రి ఆస్తిని సొంతం చేసుకొవానలన్నదికావు అతడు ఆశించింది. అతడు వాంఛిస్తున్నదల్లా ఆధ్యాత్మిక జ్యేష్ఠత్వం. అబ్రాహాముకు మల్లే దేవునితో మాట్లాడటం, తన కుటుంబం తరపున బలులర్పించటం, ఎంపికయ్యే వాగ్దాత్త మెస్సీయకు మూలపురుషుడు కావటం, నిబంధన దీవెనలో ఇమిడి ఉన్న అక్షయ సంపదకు హక్కుదారుడు కావటం-ఈ ప్రత్యేక హక్కులు గౌరవాదరాలకు అతనిలో చల్లారని తృష్ణ పుట్టింది. భవిష్యత్తును చేరటానికి, కనిపించని దీవెనల్ని అందుకోటానికి అతడి మనసు నిత్యమూ ముందడుగు వేసింది.PPTel 169.2

  ఆధ్యాత్మిక జ్యేష్ఠత్వం గురించి తన తండ్రి చెప్పినదంతా ఆశతో రహస్యంగా విన్నాడు. తల్లివద్దనుంచి నేర్చుకొన్నదంతా మనసులో ఉంచుకున్నాడు. ఆ అంశమే రాత్రిం బగళ్లు అతడి మనసును నింపి తన జీవితాశయమయ్యింది. అయితే తానిలా నిత్యమైన వాటిని లౌకిక దీవెనలకన్నా ఉన్నతంగా ఎంచుతుండగా తాను ఘనపర్చుతున్న దేవున్ని గూర్చి యాకోబుకి ప్రయోగాత్మకమైన జ్ఞానం లేదు. అతడి హృదయాన్ని దైవ కృప నూతన పర్చలేదు. జ్యేష్ఠత్వం ఏశావుకున్నంతకాలం తన్ను గూర్చిన వాగ్దానం నెరవేర్చటం జరగదని అతడు విశ్వసించాడు. కనుక తన సోదరుడు చులకనగా భావిస్తున్నా తాను ప్రశస్తంగా ఎంచుతున్న జ్యేష్ఠత్వాన్ని కైవసం చేసుకోటానికి అతడు నిత్యం పన్నాగాలు పన్నుతున్నాడు. ఒకనాడు ఏశావు తిరిగి తిరిగి అలసిపోయిన వచ్చిన తరుణంలో యాకోబు వండుకొంటున్న భోజనం పెట్టమని ఏశావు అర్థించినప్పుడు రేయీపగలూ ఒకే ఆలోచనతోవున్న యాకోబు దాన్ని ఆసరాగా తీసుకొని ఏశావు జ్యేష్ఠత్వాన్ని తనకిస్తే భోజనం పెడతానని యాకోబు బదులు పలికాడు. “నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకు?” అన్నాడు వ్యసనాలకు దాసుడైన ఆ వేటకాడు. చిక్కుడు కాయల కూరకు అన్నంకు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దాన్ని ధ్రువపర్చుతూ ప్రమాణంకూడా చేశాడు. కొద్దిక్షణాల్లోనే తండ్రి గుడారంలో తనకు భోజనం లభించి ఉండేదే. కాని ఆ క్షణంలో తన కోర్కెను తీర్చుకోటానికిగాను తన పితరులకు దేవుడు వాగ్దానం చేసిన మహిమకరమైన స్వాస్థ్యాన్ని అమ్ముకొన్నాడు. అతడి ఆసక్తంతా ప్రస్తుతం మీదే ఉంది. లోక సుఖాలకోసం పరలోక జీవనాన్ని, క్షణికానందం కోసం భావి సుఖానందాల్ని త్యాగం చేయటానికి అతడు సిద్ధంగా ఉన్నాడు.PPTel 169.3

  “ఇట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను”. దాన్ని అమ్మివేయటంతో అతడికి ఉపశమనం కలిగింది. తనకిప్పుడు అడ్డు అదుపు లేదు. తన ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు ప్రవర్తించవచ్చు. స్వేచ్చ అని తప్పుగా పరిగణన పొందుతున్న ఈ ఆటవిక వినోదం కోసం ఇంకా పరలోకంలో తమకున్న పవిత్రమైన వాడబారని నిత్యజీవవాన్ని ఎంతమంది అమ్ముకోటం లేదు!PPTel 170.1

  బాహ్యమైన లౌకికమైన ఆకర్షణలకు ఎల్లప్పుడూలోనై ఏశావు హేతు కుమార్తెల్లో ఇద్దరిని భార్యలుగా తీసుకొన్నాడు. వారు విగ్రహారాధన చేసే స్త్రీలు. వారి విగ్రహారాధన ఇస్సాకుకు, రిబ్కాకు ఎంతో దు:ఖం కలిగించింది. ఎంపిక అయిన ప్రజలు అన్యుల్ని వివాహం చేసుకోరాదన్న నిబంధన షరతుల్లో ఒకదాన్ని ఏశావు మీరాడు. అయినా జ్యేష్ఠత్వాన్ని ఏశావుకి ఇవ్వటానికి ఇస్సాకు కృతనిశ్చయుడై ఉన్నాడు. ఆ దీవెనకోసం యాకోబు ప్రగాఢ వాంఛ, దాని విధుల నిర్వహణకు ఏశావు ఉదాసీనత ఇవేవీ తండ్రి ఉద్దేశాన్ని మార్చటంలో నిరర్థకమయ్యాయన్నది రిబ్కా తర్కం.PPTel 170.2

  ఏళ్లు గతించాయి. ఇస్సాకు ముసలివాడై గుడ్డివాడై మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు. జ్యేష్ఠత్వాన్ని పెద్ద కొడుక్కి ప్రదానం చేయటంలో ఎలాంటి జాప్యం చేయకూడదని తీర్మానించుకొన్నాడు. అందుకు రిబ్కా యాకోబులు సుముఖంగా లేరిన గ్రహించి ఆ కార్యాన్ని రహస్యంగా నిర్వహించాలనుకున్నాడు. అలాంటి సందర్భాల్లో విందుచేసే ఆచారాన్ననుసరించి ఇస్సాకు ఏశావును ఇలా ఆదేశించాడు. “అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్ము”.PPTel 170.3

  అతడి ఉద్దేశమేంటో రిబ్కా ఊహించింది. దేవుడు వ్యక్తం చేసిన తన చిత్రానికి అది విరుద్ధమని ఆమె నమ్మింది. ఇస్సాకు దేవుని ఆగ్రహానికి గురి అవుతాడేమోనని చిన్న కొడుక్కి దేవుడు నియమించిన స్థానాన్ని దక్కకుండా అడ్డుకుంటాడేమోనని భావించింది. ఇస్సాకుకు తన వాదనను వినిపించినా లాభం లేకపోవటంతో కపటోపాయానికి పూనుకొంది.PPTel 171.1

  ఏశావు తన పని మీద వెళ్లిన వెంటనే రిబ్కా తాను ఉద్దేశించిన కార్యాచరణకు పూనుకొన్నది. జరిగిందేంటో యాకోబుకు నివేదించి ఆ దీవెన ఏశావుకు దక్కకుండా తక్షణ చర్య తీసుకోటం అవసరమని నొక్కి చెప్పింది. తన సూచన మేరకు అతడు నడుచుకుంటే దేవుడు వాగ్దానం చేసినట్లే ఆ దీవెన తనకు దక్కగలదని యాకోబుతో అన్నది. ఆమె ప్రతిపాదించిన ప్రణాళికకు యాకోబు వెంటనే సమ్మతించలేదు. తండ్రిని మోసగించటమన్నది అతడికి బాధ కలిగించింది. దీవెనలిచ్చే బదులు ఆ పాపం శాపం తెస్తుందని భావించాడు. అయినా తన నియమాల్ని పక్కన పెట్టి తల్లి సూచనల్ని అమలు పర్చటానికి నిశ్చయించుకున్నాడు. అబద్దం చెప్పకూడదనే అతడనుకొన్నాడు, కాని తండ్రి ముందుకు వెళ్లేసరికి తిరిగి వెళ్లే మార్గం కనిపించలేదు. తాను బహుగా ఆశించిన దీవెనను మోసం ద్వారా పొందాడు. PPTel 171.2

  యాకోబు రిబ్కాల కోరిక నెరవేరింది. కాని వారి మోసం తమకు మిగిల్చింది శ్రమ, దు:ఖం మాత్రమే. జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందుతాడని దేవుడనుకొన్నాడు. దేవుడు దాన్ని తాను ఉద్దేశించిన సమయంలో తాను చెప్పిన ఆ మాటను నెరవేర్చేవాడు. కాని దేవుని బిడ్డలమని నేడు చెప్పుకొనే అనేకులమల్లే వారు ఆ విషయాన్ని దేవుని చేతుల్లో విడిచి పెట్టడానికి ఇష్టపడలేదు. తన కుమారుడికి తప్పుడు సలహా యిచ్చినందుకు రిబ్కా పశ్చాత్తాపపడింది. అది ఆమెను యాకోబును విడదీయటానికి హేతువయ్యింది. ఆమె కొడుకు ముఖం మళ్లీ చూడలేదు. జ్యేష్ఠత్వాన్ని పొందిన ఘడియనుంచి యాకోబు ఆత్మఖండనతో కుమిలిపోయాడు. అతడు తన తండ్రికి, సోదరుడికి, తన సొంత ఆత్మకు, దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఒక్క గంట కాలంలో అతడు జీవితం పొడవునా పశ్చాత్తాప పడాల్సిన పనిచేశాడు. అనంతర సంవత్సరాల్లో తన సొంత కుమారుల ముష్కర ప్రవర్తన తనకు హృదయ వేదన కలిగించిన తరుణంలో ఈ సన్నివేశమే యాకోబు కళ్లముందు నిలిచింది.PPTel 171.3

  యాకోబు నిష్క్రమించిన వెనువెంటనే ఏశావు తండ్రి గుడారంలో ప్రవేశించాడు. తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని ఆ క్రియను గంభీర వాగ్దానంతో ధ్రువపర్చినప్పటికీ తమ్ముడి హక్కును తోసిపుచ్చి ఇప్పుడు దాని దీవెనల్ని సొంతం చేసుకోటానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. ఆధ్యాత్మిక జ్యేష్ఠత్వంలో లౌకికమైన జ్యేష్ఠత్వం జతపడి ఉంది. అది కుటుంబానికి శిరసుగా ఉండే హక్కును తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగం పొందే హక్కును అతడికి ఇవ్వాల్సి ఉంది. అతడు విలువ గలవిగా పరిగణించే దీవెనలు ఇవి. “నా తండ్రి నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుము” అన్నాడు.PPTel 172.1

  ఆశ్చర్యంతోను, దు:ఖంతోను నిండి వణుకుతూ గుడ్డివాడు వృద్ధుడయిన ఇస్సాకు తాను మోసపోయిన వైనాన్ని తెలుసుకున్నాడు. ఎంతోకాలంగా అతడు పెంచుకున్న ఆశలు అడియాసలయ్యాయి. తన పెద్ద కుమారుడికి కలుగనున్న ఆశాభంగం గురించి బాధపడ్డాడు. అయినా తన సంకల్పాన్ని నెరవేరకుండా చేసి దేవుడే తన చిత్రాన్ని నెరవేర్చుకోటానికి ఇది చేశాడని ఇస్సాకు నమ్మాడు. రిబ్కాతో దూత చెప్పిన మాటలు గుర్తు చేసుకొన్నాడు. యాకోబు అపరాధం చేసినప్పటికీ దేవుని ఉద్దేశాల్ని సమర్థంగా నెరవేర్చగలిగిన వ్యక్తి అని యాకోబులో చూశాడు. దీవెనలిచ్చే మాటలు తన పెదాలపై దొర్లుతున్నప్పుడు తన మీద దేవుని ఆత్మ ఉనికిని ఇస్సాకు గుర్తించాడు. ఇప్పుడు పరిస్థితులన్నిటిని గ్రహించిన ఇస్సాకు తెలియకుండా తాను యాకోబుకిచ్చిన దీవెనల్ని ధ్రువపర్చాడు. “అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవించబడినవాడే”.PPTel 172.2

  జ్యేష్ఠత్వ దీవెన తన అందుబాటులో ఉన్న కాలంలో ఏశావు దాన్ని లెక్క చెయ్యలేదు. కాని అది చేజారిపోయినప్పుడు అది కావాలని కోరాడు. స్వభావ సిద్ధంగా తనలోవున్న ఉగ్వేదం, ఉద్రేకం, సంతాపం, ఆగ్రహం భయంకరరూపం దాల్చాయి. దు:ఖాక్రాంతుడై పెద్దకేకవేసి “ఓనా తండ్రీ, నన్నును దీవించుము”. “నా కొరకు మరి యేదీవెనయు మిగిల్చియుండలేదా?” అని అడిగాడు. అయితే చేసిన వాగ్దానాన్ని తిరిగి తీసుకోటానికి వీలులేదు. అతడు అంత అజాగ్రత్తగా బదలాయించిన జ్యేష్ఠత్వాన్ని అతడు తిరగి పొందలేడు. “ఒక్కపూట కూటికొరకు”, ఎన్నడూ అదుపులో ఉంచుకొని భోజన వాంఛను ఒక్క క్షణం తీర్చుకొనేందుకోసం ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొన్నాడు. అయితే తాను చేసిన తెలివి తక్కువ పనిని గుర్తించినప్పుడు దాన్ని తిరిగి సంపాదించుకోటం అసాధ్యమయ్యింది. “ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెదకినను మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెను” హెబ్రీ 12:16, 17. పశ్చాత్తాపం ద్వారా దైవానుగ్రహం పొందే ప్రత్యేక హక్కును కోల్పోలేదు. కాని జ్యేష్ఠత్వాన్ని తిరిగి సంపాదించే మార్గం అతడికి కనిపించలేదు. అతడి దు:ఖం పాపం చేశానన్న గుర్తింపు నుంచి పుట్టింది కాదు. దేవునితో సమాధాన పడాలన్న కోరిక అతడికి లేదు. తాను చేసిన పాప ఫలితం గురించి అతడు దు:ఖించేవాడేగాని పాపాన్ని గురించి కానేకాదు.PPTel 172.3

  దేవుని దీవెనలు ధర్మవిధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటంవల్ల లేఖనాలు ఏశావును “భ్రష్టుడు” అంటున్నాయి. 16వ వచనం. తమ నిమిత్తం క్రీస్తు కొన్న రక్షణను చులకనగా చూసి శాశ్వతంకాని లోక సుఖాలకోసం పరలోక వారసత్వ హక్కును త్యాగం చేసే ప్రజల్ని అతడు సూచిస్తున్నాడు. భవిష్యత్తును గురించి ఒక్క తలంపుగాని కాస్త శ్రద్ధగాని లేకుండా ప్రస్తుతం కోసమే వేలాది ప్రజలు నివసిస్తారు. ఏశావల్లే వారు “రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము” అంటారు 1 కొరింథీ 15:32.తమ ఆశే వారిని అదుపు చేస్తుంది. ఆత్మ ఉపేక్షను ఆచరించే బదులు వారు మిక్కిలి విలువైన విషయాల్ని ఉపేక్షిస్తారు. తిండిపై యావనో లేదా స్వార్థాన్ని నిరసించి దేవునికి భయపడేవారికి మాత్రమే లభించే దైవ దీవెనల్లో ఒకదానినో విడిచి పెట్టాల్సి వస్తే మనుషులు తిండినే ఎన్నుకొని దేవున్ని పరలోకాన్ని విడిచి పెట్టడం జరుగుతుంది. క్రైస్తవులుగా చెప్పుకొనే వారు సహా ఎంతమంది తమ ఆరోగ్యానికి హానిచేసి మానసిక శక్తుల్ని మొద్దుబార్చే వ్యసనాలకు దాసులై ఉన్నారు! శారీరకమైన, ఆధ్యాత్మికమైన మాలిన్యం నుంచి శుద్ధి పొందటానికి పిలుపు వచ్చినప్పుడు వారు అభ్యంతరపడి నొచ్చుకుంటారు. హానికరమైన ఈ అభ్యాసాల్ని కొనసాగిస్తూ పరలోకం చేరలేమని గుర్తించి నిత్య జీవానికి నడిపే మార్గం చాలా ఇరుకైంది కష్టాలతో నిండింది గనుక అందులో తాము ఇక నడువలేమని గ్రహిస్తారు. ,PPTel 173.1

  వేలాది ప్రజలు శారీరక సుఖాలకోసం తమ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొంటున్నారు. ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు. మానసిక శక్తుల్ని బలహీన పర్చుకొంటున్నారు. పరలోకాన్ని పోగొట్టుకంటున్నారు. ఇదంతా తాత్కాలిక ఆనందం కోసం, ప్రవర్తనను శక్తి హీనం చేసి దిగజార్చే వినోదాల కోసం. తాను దుందుడుకుతనంతో చేసిన బదలాయింపు పొరపాటని గుర్తించేటప్పటికి జరిగిన నష్టాన్ని నివారించటానికి ఏశావుకి సమయం మించిపోయినట్లే తమ స్వార్థాశలు తీర్చుకోవటానికి తమ పరలోక వారసత్వాన్ని బదలాయించేవారి పరిస్థితి ఉంటుంది దేవుని రాక సమయంలో!PPTel 173.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents