Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  43—మోషే మరణం

  తన ప్రజలతో ప్రేమ, కరుణ సమ్మిళితమైన తన వ్యవహరణ లన్నిటిలోనూ దేవుని ఖచ్చితమైన నిష్పక్షపాతమైన న్యాయశీలత కనిపిస్తుంది. ఈ స్పూర్తి హెబ్రీయుల చరిత్రలోనూ కనిపిస్తుంది. ఇశ్రాయేలీయుల పై దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు కుమ్మరించాడు. వారి పట్ల ఆయన మమతానురాగాల్ని ఈ మాటలు చక్కగా వర్ణిస్తున్నాయి, “పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని తన రెక్కలమీద వాటిని మోయునట్లు యెహోవా దానిని నడిపించెను”. అయినప్పటికీ తమ అతిక్రమాల నిమిత్తం ఎంత త్వరితంగా ఎంత కఠినమైన శిక్ష విధించాడు వారికి!PPTel 467.1

  నశించిన మానవ జాతి విమోచనార్థం తన ఒకే ఒక కుమారుణ్ని అర్పించటంలో దేవుని అనంత ప్రేమ వ్యక్తమౌతున్నది. తన తండ్రి శీలాన్ని మనుషులకు ప్రదర్శించటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవించిన జీవితం దయతో, కరునతో కూడిన కార్యాలతో నిండింది. ఆయనే ఇలా అంటున్నాడు. “ఆకాశమును, భూమియు గతించిపోయిననేగాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి యొక పొల్లయినను, ఒక సున్నయైనను తప్పిపోదు”. మత్తయి 5:18. తన వద్దకు వచ్చి పాప క్షమాపణను, సమాధానాన్ని పొందవలసిందిగా బతిమాలుతూ పాపిని ఆహ్వానిస్తున్న స్వరమే తన కరుణను విసర్జించిన వారిని తీర్పు సమయంలో శపింపబడిన వారలారా నన్ను ... “విడిచిపోవుడి” అని శాసిస్తుంది. మత్తయి 25:41 దయగల తండ్రిగానే గాక సత్యవంతుడైన న్యాయాధిపతిగా బైబిలంతటా దేవుడు ప్రత్యక్షమౌతున్నాడు. కృప చూపించటంలోను “దోషులను నిర్దోషులుగా” ఎంచడు. నిర్గమ. 34:7.PPTel 467.2

  విశ్వపరిపాలకుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దత్త కనాను దేశంలోకి మోషే నడిపించరాదని ప్రకటించాడు. మోషే ఎంత విజ్ఞాపన చేసినా ఆ తీర్పు మారలేదు. తాను మరణించక తప్పదని గుర్తించాడు. వాగ్దత్త దేశంలో ప్రవేశించేందుకు ఇశ్రాయేలీయుల్ని నమ్మకంగా సంసిద్ధం చేశాడు. దేవుని ఆదేశం మేరకు మోషే యెహోషువ గుడారం వద్దకు వెళ్లారు. మేఘస్తంభం గుడారపు ద్వారం పై నిలిచివుంది, ప్రజా నాయకత్వ బాధ్యతలను ఇక్కడ యెహషువ గంభీరంగా స్వీకరించాడు. ఇశ్రాయేలీయుల నాయకుడుగా మోషే బాధ్యత అంతమయ్యింది. మోషే ఇంకా తన ప్రజల ధ్యాసలోనే తన్నుతాను మర్చిపోయాడు. సమావేశమై ఉన్న ప్రజల ముందు తన వారసుణ్ని ఉద్దేశించి దేవుని పేర ఈ ఉత్సాహభరితమైన మాటలు పలికాడు. మోషే, “నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు”. ఆ తర్వాత సమాజపు పెద్దలు, అధికారులు తట్టు తిరిగి దేవుడు తన ద్వారా తమకు ఇచ్చిన ఉపదేశాన్ని నమ్మకంగా ఆచరించాల్సిందిగా ఆజ్ఞాపించాడు.PPTel 467.3

  త్వరలో తమ మధ్య నుంచి వెళ్లిపోవాల్సి ఉన్న వృద్ధుడైన మోషే వంక చూసినప్పుడు ప్రజలు అతడి పితృవాత్సల్యాన్ని, విజ్ఞతతో కూడిన హితవును, తమకోసం అతడి అవిశ్రాంత కృషిని గుర్తుకు తెచ్చుకొన్నారు. తమ పాపాల పర్యవసానంగా దేవుని తీర్పులకు గురి కావలసి వచ్చినప్పుడు మోషే ప్రార్థనల్ని బట్టి దేవుడు తమను శిక్షించకుండా విడిచి పెట్టటం ఎంత తరచుగా జరగలేదు! ఫలితంగా వారు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. తమ దుష్టతవల్లనే మోషే పాపం చేసి దాని ఫలితంగా ఇప్పుడు మరణించాల్సి ఉన్నాడని గుర్తించి కుమిలి కుమిలి ఏడ్చారు. మోషే మరణించకుండా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతణ్ని తమ మధ్య నుంచి తీసివేయటం కన్నా భయానకమైన గుద్దింపు ఇశ్రాయేలీయులికి ఇంకొకటి ఉండేది కాదు. మోషే జీవితాన్ని దుర్భరం చేసినట్లే నూతన నాయకుడు యెహోషువ జీవితాన్ని దుర్భరం చేయరాదని తీర్మానించుకో టానికి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఉపకారాలు, ఆశీర్వాదాల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. తమ పాపల్ని గుర్తించి తమ పూర్ణ హృదయంతో తన వద్దకు తిరిగి రావలన్నదే ఆయన ఉద్దేశం.PPTel 468.1

  ఆ రోజునే మో షేకి ఈ ఆదేశం వచ్చింది, “నెబోకొండ యెక్కి నేను ఇవ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతి బొంది తన స్వజనుల యొద్దకు చేరుదువు” “దేవుని పిలుపు మేరకు ఆయనతో మాట్లాడేందుకు మోషే శిబిరం విడిచి వెళ్లటం తరచుగా సంభవించేది. కాని ఇప్పుడతడు ఒక కొత్త మర్మపూరితమైన పని మీద వెళ్లనున్నాడు. తన జీవాన్ని తన సృష్టికర్త చేతులకు అప్పగించుకోటానికి వెళ్తున్నాడు. తాను ఒంటరిగా మరణించ నున్నట్లు మోషేకి తెలుసు. తన చివరి ఘడియల్లో తనకు ఏ మానవ మిత్రుడూ సాయం చేయటానికి లేడని కూడా మో షేకి తెలుసు. తన ముందున్న దృశ్యం మర్మంతోను, భయంతోను నిండిన దృశ్యం. అది చూసి అతడి గుండె చెదిరింది. తాను ఎంతగానో ప్రేమించిన తన ప్రజల ఎడబాటును తట్టుకోటమే తనకు కఠోర పరీక్ష. ఆ ప్రజతోనే అంతకాలంగా తన ఆశలు తన జీవితం ముడిపడి ఉన్నది. కాగా మోషే దేవుని పై ప్రగాఢ విశ్వాసం ఉంచిన వ్యక్తి. ఆయన ప్రేమగల కరుణగల హస్తాలకు తన్నుతానూ తన ప్రజలను అప్పగించు కొన్నాడు.PPTel 468.2

  చివరిసారిగా మోషే తన ప్రజల సమావేశంలో నిలబడ్డాడు. మళ్లీ అతడి మీదికి పరిశుద్దాత్మ వచ్చాడు. హృదయాన్ని కదిలించే ఈ మాటల్లో ప్రతీ గోత్రాన్ని సర్వసమాజాన్ని ఆశీర్వదించాడు.PPTel 469.1

  “యెషూరునూ దేవుని పోలినవాడెవడును లేడు
  ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును
  మహోన్నతుడై మేఘ వాహనుడగును
  శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము
  నిత్యముగనుండు బహువులు నీ క్రింద నుండును
  ఆయన నీ యెదుట నుండి శత్రువును వెళ్లగొట్టి —
  నశింపజేయుమనెను ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును
  యాకోబు ఊట ప్రత్యేకింపబడును
  అతడు ధాన్య, ద్రాక్ష రసములు గల దేశములో నుండును
  అతని పై ఆకాశము మంచును కరిపించును
  ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది
  యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?
  ఆయన నీకు సహాయకరమైన కేడెము
  నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము
  నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు
  నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదువు
  PPTel 469.2

  ” ద్వితి. 33:26-29.

  మోషే సభలో నుంచి బైటికి వచ్చి నిశ్శబ్దంగా ఒంటరిగా పర్వతం పక్కకు నడిచాడు. అతడు “పిస్గా కొండవరకు పోయి నెబో శిఖరమునకెక్కెను”. ఎత్తుగా ఒంటరిగా ఉన్న ఆ శిఖరం పై నిలబడి తన ముందున్న ఆ దృశ్యాల్ని స్పష్టంగా చూశాడు. పడమట దిక్కున దూరంలో సముద్రముంది. ఉత్తరాన ఆకాశన్నంటుతున్న హర్మోను కొండ ఉంది. తూర్పున మోయాబు మైదానం, దానికి పైన ఇశ్రాయేలీ యులు విజయపతాకం ఎగురవేసిన బాషాను ఉన్నాయి. దక్షిణాన వారు దీర్ఘ సంచారం చేసిన ఎడారి ఉంది.PPTel 470.1

  దేవుని ప్రజలతో శ్రమలనుభవించటానికి ఎంపిక చేసుకోవటానికి తీర్మానించుకొని రాచ గౌరవ మర్యాదల్ని భవిష్యత్తులో తనకు రానున్న ఐగుప్తు రాజ్య సింహాసన్ని, తోసి రాజనినప్పటి నుంచి తన జీవితంలో చోటు చేసుకొన్న మార్పుల్ని, ఇట్టి బాధల్ని ఆ ఏకాంత స్థంలో మోషే నెమరు వేసుకొన్నాడు. ఇన్ని మందల్ని వేపుతూ తాను దీర్ఘకాలం అరణ్యంలో గడపటం, మండుతున్న పొదలో దేవదూత కనిపించటం, ఇశ్రాయేలీయుల విమోచనకు స్వయాన తనకే పిలుపు రావటం జ్ఞాపకం వచ్చాయి. దేవుడు తాను ఎంపిక చేసుకొన్న ప్రజల నిమిత్తం తన మహాశక్తిని ప్రదర్శిస్తూ చేసిన అద్భుత కార్యాల్ని, ఆ ప్రజల అరణ్య సంచార సంవత్సరాల్లో వారి తిరుగు బాటు విషయంలో దేవుని దీర్ఘ సహనాన్ని, దయను మోషే గుర్తు చేసుకొన్నాడు. దేవుడు అంత చేసినా, తాను ఎంతగానో ప్రార్థన చేసి వారిపక్షంగా కృషి చేసినా, ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఆ విస్తార జనుల్లో ఇద్దరు మాత్రమే వాగ్దత్త కనానులో ప్రవేశానికి అర్హులుగా నిలిచారు. ఇశ్రాయేలీయుల నిమిత్తం తన కృషిని సింహావలోకనం చేసుకొన్నప్పుడు, కష్టాలు, శ్రమలు, త్యాగాలతో నిండిన తన జీవితం దాదాపు నిరర్థకమనింపించింది.PPTel 470.2

  అలాగని తాను పొందిన బాధలు, మోసిన భారాల్ని గురించి కోభించలేదు. తాను నిర్వహించిన సేవ దేవుడు తనకు నియమించిందేనని గుర్తించాడు. ఇశ్రాయేలీయుల్ని దాస్యం నుంచి విడిపించటానికి నాయకత్వం వహించమని ముందు పిలుపు వచ్చినప్పుడు మోషే వెనుకంజ వేశాడు. కాని ఆ భాద్యతను చేపట్టినప్పటి నుంచి నిర్విరామంగా పనిచేశాడు. తనను మినహాయించి తిరుగుబాటు చేసి ఇశ్రాయేలీయులందరినీ నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు అతడు సమ్మతించలేదు. తనకు తీవ్రమైన శ్రమలు వచ్చినా దేవుడు అతడిపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. అరణ్య ప్రయాణకాలంలో దేవుని శక్తి ప్రభావాల్ని చూడటం ద్వారా, ఆయనతో మాట్లాడటం ద్వార గొప్ప అనుభవాన్ని పొందాడు. కొంతకాలం పాపభోగాల్ని అనుభవించేకన్నా దేవుని ప్రజలతో శ్రమలనుభవించేందుకు తాను చేసుకొన్న తీర్మానం వివేకవంతమైన తీర్మానమని భావించాడు.PPTel 470.3

  దైవ ప్రజల నాయకుడుగా తన అనుభవం గురించి ఆలోచించినప్పుడు తన జీవితంలో ఒక్క అపశ్రుతి చేటుకలిగించింది. ఆ అతిక్రమం తుడుపు పడితే మరణించటానికి ఏమాత్రం వెనకాడనని తనలో తాననుకొన్నాడు. పశ్చాత్తాపం చెంది క్రీస్తు వాగ్రత్త త్యాగం పై విశ్వాసం కలిగి ఉండటమే తాను కోరుతున్నది అని దేవుడు వ్యక్తం చేశాడు. మోషే మళ్లీ తన పాపాన్ని ఒప్పుకొని యేసు నామంలో క్షమాభిక్ష వేడుకొన్నాడు.PPTel 471.1

  ఆ వాగ్దత్త దేశం విశాల దృశ్యాన్ని దేవుడు మోషేకి ప్రదర్శించాడు. ఆ దేశంలో ప్రతి భాగాన్ని అతని కళ్లముందుంచాడు. ఎంతో దూరంలో ఉన్నట్లు మసక మసకగా కాదు తన కంటికి స్పష్టంగా వివరంగా అతి రమ్యంగా కనిపించింది ఆ దృశ్యం. మోషే చూసింది అప్పుడు ఉన్నది కాదు. దేవుని ఆశీర్వాదాలతో ఇశ్రాయేలీయుల స్వాధీనంలోకి వచ్చినప్పుడు ఉండమన్న దేశం అది. అతడికి రెండో ఏదెనును చూస్తున్న అనుభూమి కలిగింది. లెబానోను దేవదారు వృక్షాలతో నిండిన పర్వతాలు, ఒలీవ చెట్లతో, సువసనల వెదజల్లే పూల తీగెలతో అలరారే నీలి కొండలు పువ్వులు, కాయలతో నిండిన చెట్లు పచ్చని మైదానాలు, ఉష్ణ ప్రాంతపు అంజూరపు చెట్లు ఇక్కడ, గోధుమ బార్లీ వెన్నులతో నిండిన పొలాలు అక్కడ, లోయల్లో పారుతున్న సెలయేళ్ల గలగలల సంగీతం, పక్షుల కలకలగానం, అందమైన నగరాలు, ఉద్యానవనాలు, “సముద్రముల సమృద్ధి॥ గల సరస్సులు, కొండలపక్క మేసే మందలు, రాళ్లసందుల్లో తేనె తుట్టెలు -- దాని సొగసులు. దేవుని ఆత్మ ఆవేశంవల్ల మోషే ఇశ్రాయేలీయులికి ఈ విధంగా వర్ణించినట్లే అది ఉంది: “ఆకాశ పదార్దముల వలన, మంచు వలన క్రింద క్రుంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థాముల వలన .. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును”.PPTel 471.2

  ప్రతీ గోత్రం తన తన భూభాగం స్వతంత్రించుకొని ఇశ్రాయేలీయులు కనానులో స్థిరపడటాన్ని మోషే చూశాడు. వాగ్దత్త దేశంలో స్థిరపడిన అనంతరం వారి చరిత్రను వీక్షించాడు. సుదీఘమైన వారి మత భ్రష్టత చరిత్ర, దానికి శిక్ష అతడి కళ్లముందు కనిపించాయి. తమ పాపాల కారణంగా వారు అన్యజనుల మధ్యకు చెదిరిపోయి నివశించటం, ఇశ్రాయేలీయుల్ని ఆవరించిన మహిమ వారిని విడిచిపోవటం, వారి సుందర నగరం శిధిలమవ్వటం, వారు పరాయి దేశాల్లో బానిసలు కావటం చూశాడు. వారు తమ తండ్రుల దేవా దేశానికి తిరిగి రావటం చివరికి రోమా రాజ్యం అధికారం కిందకు రావటం చూశాడు.PPTel 471.3

  కాల ప్రవాహం చివరి వరకు చూడటానికి దేవుడు అనుమతించగా మన రక్షకుని మొదటి రాకను మోషే చూశాడు. బేల్లె హేములోయేసు శిశువుగా ఉండటం చూశాడు. దేవునికి మహిమ భూమిమీద సమాధానం అంటూ ఉత్సాహగీతం పాడిన దూతగణాలు స్వరాలు విన్నాడు. తూర్పు జ్ఞానుల్ని యేసు వద్దకు నడిపిన నక్షత్రాన్ని ఆకాశంలో చూశాడు. ఈ ప్రవచన వాక్కులు గుర్తుకు తెచ్చుకొన్నప్పుడు అతడి మనసు వెలుగుతో నిండింది, “నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజ దండము ఇశ్రాయేలులో నుండి లేచును” సంఖా 24:17. నజరేతులో క్రీస్తు సామాన్య జీవితాన్ని, ప్రేమ, కరుణ స్వస్థత కార్యాలతో కూడిన ఆయన సేవను, గర్వం, అవిశ్వాసంతో నిండిన జాతి ఆయనకు విసర్జించటాన్ని చూశాడు. ధర్మశాస్త్రానికి కర్త అయిన ప్రభువును తృణీకరించి నిరాకరిస్తూనే ధర్మశాస్త్రం పట్ల తమ ప్రగాడ కర్త గౌరవాన్ని వారు అతిశయంగా ప్రచురించుకోటం విని ఆశ్చర్యపడ్డాడు. తాను ప్రేమించిన పట్టణాన్ని కన్నీటితో వీడ్కోంటూ యేసు ఒలీవ కొండపై నిలిచి ఉండ టం చూశాడు. తాను ఎవరికోసమైతే శ్రమలనుభవించి, ప్రార్థనలు, త్యాగాలు చేశాడో, ఎవరికోసం జీవ గ్రంథం నుంచి తన పేరు తుడుపు పడటానికి కూడా సిద్ధపడ్డాడో, దేవుడు ఎంతో ఆశీర్వదించిన ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి దేవుడు పలికిన ఈ మాటల్ని “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది” (మత్తయి 23:38) అన్న మాటల్ని విన్నప్పుడు అతడి హృదయం భించింది. దైవ కుమారుని దు:ఖంలో పాలు పొందుతూ కన్నీళ్లు కార్చాడు. PPTel 472.1

  రక్షకునితో గెత్సెమనేకి వెళ్లాడు. ఆ తోటలో ఆయన పొందిన వేదనను, అప్పగింతను, ఎగతాళిని, దెబ్బల్ని- సిలువ మరణాన్ని చూశాడు. తాను అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్లు ఆయనను విశ్వసించేవారు “నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు” దేవుని కుమారుడైన క్రీస్తు ఎత్తబడాల్సి ఉన్నాడని మోషే గ్రహించాడు.యోహాను 3:15. తమ రక్షకుడూ, తమ తండ్రుల ముందు నడిచిన మహాదూత అయిన ప్రభువుపట్ల యూదులు ప్రదర్శించిన దొంగ నాటకాన్ని, ద్వేషాన్ని చూసి మోషేని దు:ఖం, ఆగ్రహం, భయం ముప్పిరి గొన్నాయి. “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి” అని క్రీస్తు బాధతో వేసిన కేకను విన్నాడు. మార్కు 15:35. యోసేపు కట్టుకొన్న కొత్త సమాధిలో ఆయన పడి ఉండటం చూశాడు. లోకాన్ని నిరాశ, నిస్పృహ చీకటి కప్పినట్లు కనిపించింది. కాని అతడు మళ్లీ నిదానించి చూడగా క్రీస్తు విజయుడై లేవటం, దూతలు, సాతాను చెరలోని బందీల సమూహం వెంటరాగా ఆయన పరలోకానికి వెళ్లటం చూశాడు. ధగధగ మెరిసే పరలోక గుమ్మాలు తెరచుకొని తమ సేనాధిపతిని విజయ గీతాలో స్వాగతించటం చూశాడు. రక్షకుని పక్కనే ఉండి ఆ నిత్య రాజ్యపు గుమ్మాల్ని తెరవవలసింది తానే అని అక్కడే మో షేకి తెలిసింది. దైవ కుమారుడు అనుభవించిన శ్రమలతో పోల్చినప్పుడు తనకు కలిగిన శ్రమలు ఏ పాటివి అనిపించాయి. “అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము” ముందు ఆ శ్రమలు ఎంత తేలిక అనిపించాయి. 2 కొరింథీ 4:17. అంతంత మాత్రం గానైనా క్రీస్తు శ్రమల్లో తనకు భాగం దొరికినందుకు మోషే ఆనందించాడు.PPTel 472.2

  సువార్తను ప్రపంచానికి ప్రకటించటానికి బయలు దేరిన యేసు శిష్యుల్ని మోషే చూశాడు. “శరీరానుసారముగా నడచుకొని ఇశ్రాయేలీయులు తాను ఉద్దే శించిన ఉన్నత స్థితిని చేరలేకపోయినప్పటికీ, తమ అవిశ్వాసం వల్ల వారు లోకానికి వెలుగు కాలేకపోయినప్పటికీ, ఆయన కృపను తృణీకరించి ఆయన ప్రజలుగా పొందాల్సిన దీవెనలు పొందలేకపోయినప్పటికీ దేవుడు అబ్రాహాము సంతానాన్ని విసర్జించలేదు. ఇశ్రాయేలీయుల ద్వారా దేవుడు నెరవేర్చాలని సంకల్పించిన ఉద్దే శాల్ని నెరవేర్చాల్సి ఉన్నది. క్రీస్తు పై విశ్వాసం ద్వారా దైవ ప్రజలయ్యే వారందరు అబ్రాహాము సంతానంగా పరిగణన పొందాల్సి ఉన్నారు. వారు నిబంధన వాగ్దానాలకు వారసులు. అబ్రాహాము మాదిరిగానే దైవ ధర్మశాస్త్రాన్ని ఆయన కుమారుని సువార్తను పరిరక్షించి దాన్ని లోకానికి ప్రకటించాల్సి ఉన్నారు. “మరణాచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి యేసు శిష్యుల ద్వారా సువార్త వెలుగు ప్రకాశించటం (మత్తయి 4:16) అన్యుల దేశాల నుంచి వేవేలమంది ఆ వెలుగులో పోగుపడటం మోషే చూశాడు. అది చూసి ఇశ్రాయేలు ప్రగతి, సౌభాగ్యాల గురించి ఆనందించాడు.PPTel 473.1

  ఇప్పుడు ఇంకొక దృశ్యం తన కనుల ముందుకు వచ్చింది. తన తండ్రి ధర్మశాస్త్రాన్ని సన్మానిస్తున్నట్లు చెబుతూ క్రీస్తును విసర్జించటానికి యూదుల్ని సాతాను నడిపించటాన్ని చూశాడు. ఇప్పుడు క్రైస్తవ లోకం అలాంటి మోసంలోనే అనగా క్రీస్తును నమ్ముతున్నట్లు చాటుకొంటూ దైవ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించట మన్న మోసంలోనే ఉండటం చూశాడు. “ఇతనిని సంహారించుము”. “వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము” అంటూ యాజకులు పెద్దలు కేకలు వేయటం విన్నాడు. ఇప్పుడు క్రైస్తవ బోధకులమని చెప్పుకొనే వారు “ధర్మశాస్త్రం వద్దు” అనటం విన్నాడు. సబ్బాతును కాలరాచటం దాని స్థానంలో నకిలీ సంస్థను స్థాపించటం చూశాడు. మోషే హృదయం ఆశ్చర్యంతోను, భయంతోను నిండింది. క్రీస్తు మీద విశ్వాసముంచిన వారు ఆ పరిశుద్ధ పర్వతం మీద నుంచి ఆయనే పలికిన ధర్మశాస్త్రాన్ని ఎలా విసర్జించగలుగుతారు? ఇహ పరలోకాల్లో దేవ పరిపాలనకు పునాది అయిన దైవ ధర్మశాస్త్రాన్ని దేవునిపట్ల భయభక్తులు గల వారెవరైనా ఎలా తోసిపుచ్చ గలుగుతారు? నమ్మకంగా నిలిచిన కొద్దిమంది దైవ ధర్మశాస్త్రాన్ని ఇంకా గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో ఆచరించటాన్ని చూసి మోషే ఎంతో ఆనందించాడు. దేవుని ఆజ్ఞలు కాపాడే ప్రజల్ని నాశనం చేయటానికి లోక ప్రభుత్వాధికారాలు చిట్టచివరిగా చేసే బృహత్ యత్నాన్ని చూశాడు. తమ దుర్మార్గతనుబట్టి ఈ లోక ప్రజల్ని శిక్షించటానికి దేవుడు విజృంభించే సమయానికి అతడు ఎదురు చూశాడు. తనను విశ్వసించి భక్తిగా జీవించిన వారిని ఆయన ఆ ఉగ్రత దినమందు దాచి కాపాడుతాడు. తన ఆజ్ఞల్ని కాపాడిన వారితో ఆయన చేసుకొన్న సమాధాన నిబంధనను విన్నాడు. తన పరిశుద్ధ నివాసం నుండి ఆయన గొంతు వినిపించినప్పుడు భూమ్యాకాశాలు దద్దరిల్లుతాయి. క్రీస్తు మహిమతో రెండోసారి రావటాన్ని, మరణించిన నీతిమంతులు అమర్యులుగా లేవటాన్ని, సజీవులైవున్న నీతిమంతులు మరణం చూడకుండా అక్షయులుగా రూపాంతరం చెందటం, అందరూ కలిసి ఉత్సాహ గానాలతో దేవుని పరిశుద్ద పట్టణానికి పైకి ప్రయాణమై వెళ్లటం చూశాడు.PPTel 473.2

  ఇంకొక దృశ్యం అతడి కళ్లముందుకి వచ్చింది. కొద్ది సేపటి క్రితం తనకు కనువిందు చేసిన వాగ్దత్త దేశంకన్నా ఎంతో అందమైన శాపఛాయలు లేని భూమి అది. పాపంలేదు, మరణం ప్రవేశించటానికి లేదు. రక్షణ పొందిన నానాజాతుల ప్రజలకు అది నిత్య నివాసం. పట్టలేని ఆనందంతో ఆ దృశ్యాల్ని చూశాడు మోషే, తాను నిరీక్షించినదాని కన్నా, ఊహించుకొన్న దానికన్నా ఎంతో మహిమాన్వితమైన విమోచన అది. ఇశ్రాయేలీయుల భూలోక సంచారాలకు తెర దిగింది -- నిరంతరంగా, దేవుని ఇశ్రాయేలు ప్రజలు చివరికి అందమైన ఆ దేశంలో ప్రవేశించారు.PPTel 474.1

  అ దృశ్యం మాయమయ్యింది. తన ముందు విస్తరించి ఉన్న కనాను పై మళ్లీ తన దృష్టి నిలిచింది. అంతట అలసిపోయిన యోధుడిలా విశ్రమించటానికి నేలకు ఒరిగాడు. “యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయోబు దేశములో మృతి నొందెను. బేత్పయోరు యెదుట మోయాబు దేశములో నున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు”. మోషే బతికి ఉన్నప్పుడు అతడి ఉపదేశాల్ని పాటించటానికి సముఖంగాలేని అనేకమంది అతడు సమాధి అయిన స్థలం తెలిసి ఉంటే అతడి మృతదేహం పై విగ్రహారాధన జరిపే ప్రమాదం ఏర్పడేది. ఆ కారణం చేతనే దేవుడు ఆ స్థలాన్ని మరుగుపర్చాడు. నమ్మకమైనా ఆ దైవ సేవకుడి శవాన్ని దేవుని దూతలు సమాధి చేసి ఆ ఒంటరి సమాధికి కావలి కాశారు.PPTel 474.2

  “ఏ సూచక క్రియలను, మహత్కార్యాలను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి యింకొక ప్రవక్త ఇవ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు.”PPTel 475.1

  కాదేషులో బండలో నుంచి నీళ్లు రప్పించటంలోదేవునికి మహిమ, ఘనత ఇవ్వకపోటం ద్వారా తాను చేసిన ఆ ఒక్క పాపం వల్ల మోషే జీవితం మచ్చపడకుండా ఉంటే అతడు వాగ్దత్త దేశంలో ప్రవేశించేవాడు, మరణం చూడకుండా పరలోకానికి ఆరోహణ్యమయ్యేవాడు. అయినా సమాధిలో ఎంతోకాలం ఉండటం అవసరం లేదు. మోషేని సమాధి చేసిన దూతలతో స్వయాన క్రీస్తే పరలోకం నుంచి దిగివచ్చి నిద్రిస్తున్న భక్తుణ్ని లేపాడు. దేవునికి విరోధంగా మోషేతో పాపం చేయించి అతణ్ని మరణం ఆధిపత్యానికి అప్పగించటంలో విజయం సాధించినందుకు సాతాను సంబరపడ్డాడు. “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు” (ఆది 3:19) అన్న దేవుని తీర్పు మృతుల్ని తన ఆధీనంలో ఉంచుతుందని సాతాను వెల్లడించాడు. సమాధికున్న అధికారం కొనసాగుతూనే ఉంది. సమాధుల్లో ఉన్నవారంతా తన బానిసలని తన చీకటి గృహం నుంచి వారు ఎన్నడూ విడుదల కాకూడదని అతడ వాదన.PPTel 475.2

  మృతుల్లో నుంచి మొట్టమొదటిసారిగా లేపటానికి క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. జీవనాధుడైన క్రీస్తు ఆయన దూతలు మోషే సమాధిని సమీపించినప్పుడు సాతాను తన ఆధిపత్యం గురించి ఆందోళన చెందాడు. తనదిగా తాను చెప్పుకొంటున్న భూభాగం పై దాడి జరుగుతుందంటూ వాదిస్తూ సాతాను, అతడి దుష్ట దూతలూ నిలబడి ఉన్నారు. దైవ సేవకుడైన మోషే తనకు బందీ అయ్యాడంటూ బింకాలు పలుకుతున్నాడు. మోషే సయితం దైవ ధర్మశాస్త్రాన్ని కాపాడలేకపోయాడని యెహోవాకు చెందిన మహిమను తానే సొంతం చేసుకొన్నాడని అదే పాపం తాను చేసినందుకు పరలోకం నుంచి బహిష్కృతి పొందానని కనుక ఆజ్ఞాతిక్రమం వల్ల మోషే తన ఆధీనంలోకి వచ్చాడని సాతాను వాదించాడు. దైవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఆదిలో చేసిన ఆరోపణలనే ఆ అపూర్వ ద్రోహి మళ్లీ చేశాడు. తన పట్ల దేవుడు అన్యాయంగా వ్యవహరించాడంటూ ఆయనను నిందించాడు.PPTel 475.3

  సాతానుతో వాద ప్రతివాదాలకు దిగలేదు క్రీస్తు. పరలోకంలో అతడి క్రూరత్వాన్ని, దాని పర్యవసానంగా పరలోక నివాసులు వంచితులై నాశనమవ్వటాన్ని ఆయన ప్రస్తావించి ఉండవచ్చు. ఆదాము పాపానికి హేతువై మానవ జాతి మీదికి మరణాన్ని తెచ్చిన అబద్దాల్ని అతడు ఏదెనులో పలకటాన్ని ఆయన ప్రస్తావించి ఉండవచ్చు. ఇశ్రాయేలీయుల సణగటానికి తిరుగుబాటు చేయటానికి వారిని శోధించిన పాపం తనదేనని దీర్ఘశాంతుడు, సహనశీలి అయిన తమ నాయకుణ్ని అది వత్తిడికి గురిచేసి అజాగ్రత్తగా ఉన్న నిముషంలో ఆ పాపంలోకి దించిందని ఆ కారణంగా ఇప్పుడు మోషే మరణం అధికారం కిందికి వచ్చాడని ఆయన సాతానుకి గుర్తు చేసి ఉండవచ్చు. కాని క్రీస్తు అదంతా తండ్రికి విడిచి పెడ్తూ “ప్రభువు నిన్ను గద్దించును గాక” అని అన్నాడు. యూదా 9. విరోధితో క్రీస్తు వాదానికి దిగలేదు. కాని సాతాను అధికారం కూలదోసి మృతుల్ని లేపే తన పనిని క్రీస్తు అక్కడికక్కడే ప్రారంభించాడు. ఇది దైవ కుమారుని ఆధిక్యతకు, ప్రాబల్యానికి నిదర్శనం. ఇది సాతాను కాదనలేని రుజువు. ఇది పునరుత్థానానికి తిరుగులేని నిశ్చయత. సాతాను బందీకి విముక్తి కలిగింది. మరణించిన నీతిమంతుడు మళ్లీ జీవిస్తారు.PPTel 476.1

  పాప ఫలితంగా మోషే సాతాను అధికారం కిందకు వచ్చాడు. తన క్రియలను బట్టి అతడు న్యాయంగా మరణానికి బానిస. అయితే, విమోచకుడైన క్రీస్తు పేరిట హక్కు పొంది నిత్యజీవానికి పునరుత్థానుడయ్యాడు. సమాధిలో నుంచి మహిమతో లేచి మోషే తన విమోచకుడితో కలిసి దేవుని పట్టణానికి ఆరోహణమయ్యాడు. మోషేతో వ్యవహరించిన సందర్భాలన్నిటిలోను దేవుడు తన న్యాయశీలతను, తన ప్రేమను విశేషంగా ప్రదర్శించాడు. క్రీస్తు త్యాగంలో వాటిని కనపర్చేవరకూ అంతటి ప్రదర్శన ముందెన్నడూ జరగలేదు. మరవరాని ఒక పాఠం నేర్పేందుకు దేవుడు మో షేకి కనాను ప్రవేశం నిషేధించాడు. తాను ఖచ్చితమైన విధేయత కోరుతున్నాని మానవుడు తన సృష్టి కర్తకు చెందే మహిమను సొంతం చేసుకోటానికి ప్రయత్నించకుండా జాగ్రత్తగా ఉండాలన్నది ఆ పాఠం. ఇశ్రాయేలు స్వాస్థ్యంలో తనకు భాగస్వామ్యం కావాలంటూ మోషే చేసిన ప్రార్థనను దేవుడు ఆమోదించలేదు. అలాగని ప్రభువు తన సేవకుడైన మోషేని మరచిపోలేదు, విడిచి పెట్టలేదు. మోషే పడ్డ శ్రమల్ని దేవుడు గుర్తించాడు. కష్టాలు, సంఘర్షణలతో నిండిన సుదీర్ఘకాలంలో మోషే చేసిన నమ్మకమైన సేవను ఆయన గుర్తించాడు. ఈ లోక సంబంధమైన కనానుకన్నా ఎంతో సమున్నతము, శ్రేష్ఠము అయిన స్వాస్థ్యానికి పిస్గా కొండమీద దేవుడు మోషేని పిలిచాడు. PPTel 476.2

  పరలోకానికి సజీవుడుగా ఆరోహణుడయిన ఏలియాతో రూపాంతర పర్వతం మీద మోషే కూడా ఉన్నాడు. తండ్రి వద్ద నుంచి కుమారునికి వెలుగు, మహిమలు అందించటానికి వచ్చిన దూతలు వారు. కొన్ని శతాబ్దాల క్రితం మోషే చేసి ప్రార్థన తుదకు ఈ విధంగా నెరవేరింది. ఇశ్రాయేలీయులికి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ ఎవరిమీద కేంద్రీకృతమై ఉన్నాయో ఆ ప్రభువుని గురించి సాక్ష్యమివ్వటానికి తన ప్రజల స్వాస్థ్యంలోని ” ఆ మంచి పరతం” మీద మోషే నిలబడ్డాడు. దేవుని ఆదరాన్ని విశేషంగా పొందిన ఆ మహనీయుడి చరిత్రలో మానవ నేత్రానికి ప్రదర్శితమైన చివరి దృశ్యం ఇది.PPTel 477.1

  మోషే క్రీస్తుకు ప్రతీక. ఇశ్రాయేలుతో ఆయన ఇలా అన్నాడు, “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులతో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను” ద్వితీ 18:16. భూలోక కనానులోకి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించకముందు కష్టాలు, పేదరికం పాఠశాలలో మో షే క్రమ శిక్షణ నేర్చుకోటం అవసరమని దేవుడు తలంచాడు. పరలోక కనానుకు, ప్రయాణం చేసే ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులకు అధిపతి ఉన్నాడు. తన కర్తవ్య నిర్వహణ సిద్ధబాటకు ఆయనకు మానవ శిక్షణ అవసరం లేదు. అయినా ఆయన శ్రమల ద్వారా పరిపూరుణడయ్యాడు. “తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడైయున్నాడు”. హెబ్రీ 2:18. మన రక్షకునిలో ఏ మానవ బలహీనత గాని అంసపూర్ణత గాని లేదు. అయినా వాగ్రత్త కనానులో మనకు ప్రవేశం సంపాదించేందుకోసం ఆయన మరణించాడు.PPTel 477.2

  “ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై యుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడైయుండి ఆయన యింటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన యిల్లు”. హెబ్రీ 3:5,6.PPTel 477.3