Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  28—సీనాయివద్ద విగ్రహారాధన

  మో షేలేని కాలం ఇశ్రాయేలీయులకి ఉత్కంఠతో కని పెట్టే కాలం. యెహోషువాతో కలిసి మోషే కొండ ఎక్కటం, మైదానం నుంచి తాము చూస్తుండగా నల్లని మేఘంలోకి వెళ్లటం, అది పర్వత శిఖరాన ఉండి దేవుని మహిమతో ప్రకాశించటం ప్రజలకు తెలుసు. మోషే తిరిగి రాకకోసం ప్రజలు ఆశగా కని పెట్టారు. ఐగుప్తులో వివిధ రూపాల్లో దేవుడి చిత్రీకరణకు అలవాటుపడ్డ ప్రజలు కనిపించని దేవున్ని నమ్మటం కష్టమయ్యింది. తమ విశ్వాసాన్ని బలపర్చటానికి వారు మోషే మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు అతడు కూడా లేడు. రోజులు, వారాలు గతించినా అతడు తిరిగి రాలేదు. కొండ శిఖరాన ఆ మేఘం ఇంకా కనిపిస్తున్నా శిబిరంలో ఉన్న అనేకమందికి తమ నాయకుడు తమని వదిలేసినట్లు అతడు దహించే అగ్నిలో కాలిపోయినట్లు కనిపించింది.PPTel 305.1

  తాము విని ఉన్న దైవ ధర్మశాస్త్రం గురించి ధ్యానించటానికి, ఇంకా ఆయన తమకు ఇవ్వాలనుకొన్న ప్రత్యక్షతల్ని అందుకోటానికి తమ హృదయాల్ని ఆయత్త పర్చుకోటానికి తాము వేచి ఉన్న ఈ కాలం వారికి ఉపకరించింది. ఈ పని నిమిత్తం వారికి ఎక్కువ సమయం లేదు. దేవుని నియమాల గురించి వారు స్పష్టమైన అవగాహనను కోరుతూ దీనమనస్కులై ఉంటే శోధన నుంచి ప్రభువు వారిని కాపాడే వాడు. వారు ఇది చేయలేదు. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, విచ్చలవిడిగా ప్రవర్తించారు. ముఖ్యంగా అన్యజనుల సమూహం అలా ప్రవర్తించింది. ఆ అన్యజనులు పాలు తేనెలు ప్రవహించే వార్దత్త దేశానికి వెళ్లటానికి తొందర పడున్నారు. విధేయత షరతు మీదనే దేవుడు ఆ దేశాన్ని వాగ్దానం చేశాడు. కాని వారు ఆ సంగతి మర్చిపోయారు. తిరిగి ఐగుప్తీకి వెళ్లిపోదామని కొందరు ప్రతిపాదించారు. ముందుకి సాగి కనానుకు వెళ్లటమో వెనక్కు తిరిగి ఐగుప్తీకి వెళ్లిపోవటమో ఏదో చేయటం తప్ప మోషే కోసం ఇక ఆగటానికి ప్రజలు సిద్ధంగా లేరు.PPTel 305.2

  నాయకుడు లేని తమ నిస్సహాయ స్థితిని ఆసరా చేసుకొని వారు తమ పాత మూఢనమ్మకాల్ని మళ్లీ నమ్మనారంభించారు. సణగటంలో, సహనం కోల్పోటంలో ముందున్నవారు అన్యజనుల సమూహం. పర్యవసానంగా చోటు చేసుకొన్న మతభ్రష్టతతో నాయకులు వారే. ఐగుప్తీయులు ఎద్దుని దూడను దైవ చిహ్నాలుగా పరిగణించారు. ఐగుప్తులో ఈ రకమైన విగ్రహారాధనను ఆచరించిన వారే ఇప్పుడు దూడ విగ్రహాన్ని చేసి దాన్ని పూజించారు. దేవుని సూచిస్తూ మోషేకి మారుగా తమ ముందు నడవటానికి ఒక విగ్రహం కావాలని ప్రజలు కోరారు. తన విషయంలో దేవుడు ఎలాంటి రూపాన్ని ఇవ్వలేదు. పూజార్థం ఎలాంటి రూపాన్నైనా చేయటాన్ని దేవుడు నిషేధించాడు. ఐగుప్తులో, ఎర్ర సముద్రం వద్ద జరిగిన మహత్కార్యాలు అదృశ్యుడు, సర్వశక్తిమంతుడు అయిన ఇశ్రాయేలీయుల దేవుని పై విశ్వాసాన్ని బలపర్చటానికి ఏర్పాటయ్యాయి. ఆయన సన్నిధిని సూచించే నిదర్శనం వారిని నడిపించిన మేఘ స్తంభంలో, అగ్ని స్తంభంలో, సీనాయి పర్వత శిఖరాన మహిమ ప్రదర్శనలో కనిపించింది. కాగా ఆయన సన్నిధి ఉన్న మేఘం ఇంకా తమ ముందుండగానే ఐగుప్తు విగ్రహారాధనకు అదృశ్యుడైన దేవుని మహిమను సూచించటానికి ఎద్దు పోలికను మళ్లీ ఎంపికను చేసుకొన్నారు!PPTel 305.3

  మోషే లేనప్పుడు తీర్పులు చెప్పే అధికారం అహరోనుకి బదలాయింపు అయ్యింది. అతడి గుడారం చుట్టు పెద్ద జన సమూహం చేరి “లెమ్ము, మా ముందర నడచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదు” అన్నారు. అప్పటి దాకా తమను నడిపించిన మేఘం పర్వతం మీద నిలిచిపోయిందని ఇక తమను అది నడిపించదని అన్నారు. ఆ మేఘం స్థానంలో తమకు ఒక విగ్రహం కావాలని తాము భావిస్తున్నట్లు, తాము ఈ విగ్రహాన్ని తమ దేవతగా అంగీకరించి దాన్ని ముందు పెట్టుకొని ఐగుప్తుకి తిరిగివెళ్లే ఆ ప్రజలు తమను కరుణిస్తారని చెప్పారు.PPTel 306.1

  అట్టి క్లిష్ట పరిస్థితిలో ధృఢంగా, నిర్ణయాత్మకంగా, ధైర్యంగా వ్యవహరించగల నాయకుడు అవసరం. ప్రజాభిప్రాయం కన్నా, వ్యక్తిగత క్షేమం కన్నా, లేక సొంత ప్రాణం కన్నా, దేవుని గౌరవించటం ప్రధానమని భావించే నాయకుడు అవసరం. అయితే ప్రస్తుతం ఇశ్రాయేలీయుల నాయకుడు అలాంటి నాయకుడు కాడు. అహరోను బలహీనుడు. ప్రజల్ని కాదనలేకపోయాడు. ఆ క్లిష్ట సమయంలో అతడి ఊగిసలాట పిరికితనం వారికి బలం చేకూర్చింది. గందరగోళం పెచ్చు పెరిగింది. ప్రజలు గుడ్డివారు, ఉన్మాదులు అయ్యారు. కొందరు దేవునితో తాము చేసుకొన్న నిబంధనకు కట్టుబడి ఉన్నారు. కాని అధిక సంఖ్యాక ప్రజలు మతభ్రష్టులతో చెయ్యి కలిపారు. విగ్రహం చేయటాన్ని వ్యతిరేకించిన వారు కొందరున్నారు. భ్రష్టులు వారిని ఎదిరించి వారి పై చెయ్యి చేసుకొన్నారు. ఆ ఉద్రిక్త పరిస్థితిలోను, గందరగోళంలోను చివరికి వారు ప్రాణాల్ని కోల్పోయారు.PPTel 306.2

  అహరోను తన సొంత ప్రాణానికి భయపడ్డాడు. దేవునికోసం ధైర్యంగా నిలబడే బదులు ప్రజల వత్తిడికి లొంగిపోయాడు. ప్రజలు వ్యక్తిగత త్యాగానికి ముందుకురారని భావించి మొదటగా వారు తమ బంగారు పోగులు తేవాల్సిందిగా ఆదేశించాడు. కాని ప్రజలు సంతోషంగా తమ ఆభరణాల్ని ఇచ్చారు. వాటితో అహరోను ఐగుప్తు దేవుడు మాదిరిగా ఒక దూడను పోత పోశాడు. అప్పుడు ఆ ప్రజలు “ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే” అన్నారు. యెహోవాకు ఈ అవమానం జరగటానికి అహరోను అనుమతించటం ఘోరం. అంతేకాదు, ఈ బంగారు దేవతను ప్రజలు ఉత్సాహంగా అంగీకరించటం చూసి దానికి ఒక బలిపీఠం కట్టి “రేపు యెహోవాకు పండుగ జరుగును” అని ప్రకటించాడు. ఆ వార్తను శిబిరంలోని సమూహాలన్నిటికీ బూరలతో ప్రకటించారు. “మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి”. ” యెహోవాకు పండుగ” నెపంతో ప్రజలు తిని తాగి తందనాలాడారు.PPTel 307.1

  ఈ రోజుల్లోనూ, వినోదాలపట్ల గల మక్కువ ‘పైకి భక్తిగలవారి వలె” నటించటానికి ఎందరిని నడిపించటం లేదు? ఆరాధన తతంగం జరుపుతూ శరీరేచ్చలూ, స్వార్ధాశలూ తీర్చుకోటానికి అనుమతించే మతానికి ఇశ్రాయేలీయుల దినాల్లో ఎంత ప్రజాదరణ ఉందో నేడు మన దినాల్లోనూ అంతే ప్రజాదరణ ఉంది. సంఘంలో అధికారానికి అంటుకుపోయి నిజాయితీ, నిబద్ధతలు లేని ప్రజల దురేచ్ఛలకు అనుమతించి పాపం చెయ్యటంలో వారికి చేదోడు వాదోడుగా ఉండే చచ్చు అహరోన్లు ఇంకా ఉన్నారు.PPTel 307.2

  యెహోవా చెప్పినవన్నీ చేస్తామని హెబ్రీయులు దేవునితో నిబంధన చేసుకొని కొన్ని దినాలు మాత్రమే గడిచాయి. “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” అని యెహోవా చెప్పిన మాటలు వింటూ ఆ పర్వతం ముందు వారు వణుకుతూ నిలబడి ఉన్నారు. ఇశ్రాయేలీయుల సమాజం ముందు సీనాయి కొండమీద దేవుని మహిమ ఇంకా ఉన్నది. అయినా వారు పక్కకు తిరిగి అన్యదేవుళ్లు కావాలని కోరారు. హోరే బులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి” కీర్తనలు 106:19, 20. ప్రేమగల తండ్రిగా, సర్వశక్తిగల రాజుగా వారికి తన్ను తాను ప్రత్యక్ష పర్చుకొన్న ప్రభువు పట్ల ఇంతకన్నా ఎక్కువ కృతఘ్నత ఇంత కన్నా ఎక్కువ అవమానం వారు చూపించి ఉండగలరా!PPTel 307.3

  కింద శిబిరంలో చోటుచేసుకొంటున్న భ్రష్టతను గూర్చి మోషేని హెచ్చరించి వెంటనే శిబిరానికి తిరిగి వెళ్లాల్సిందిగా దేవుడు ఆదేశించాడు. దేవుడు మోషేతో ఇలాగన్నాడు, “నీవు దిగి వెళ్లుము. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడిరి”. ఆరంభంలోనే దేవుడు దీన్ని ఆపగలిగేవాడు. ఆ ద్రోహాన్ని, భ్రష్టతను శిక్షించటంలో అందరికీ పాఠం నేర్పటం కోసం దేవుడు దాన్ని ఇంతవరకూ రానిచ్చాడు. తన ప్రజలతో చేసిన నిబంధనను దేవుడు పూర్తిగా రద్దుపర్చి మోషేతో ఇలా అన్నాడు, “నీవు ఊరకుండుము. నా కోపము వారిమీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదను”. ఇశ్రాయేలు ప్రజలు, ముఖ్యంగా అన్యజనులు ఎల్లప్పుడూ దేవునికి ఎదురు తిరిగే ప్రవృత్తి కలవారు. తమ నాయకులమీద సణుగుకొనే ప్రజలు కూడా. తమ అవిశ్వాసం మంకుతనం వల్ల నాయకుడికి వేదన కలిగిస్తారు. వాగ్దత్త భూమికి వారిని నడిపించం తీవ్ర శ్రమ, తీవ్ర ఆవేదనతో కూడిన పని. తమ పాపాల వల్ల వారు దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకొన్నారు. వారి సత్వర నాశనమే న్యాయం. అందుకే వారిని నాశనం చేసి మోషేని గొప్ప జనం చేస్తానని దేవుడన్నాడు.PPTel 308.1

  “నీవు ఊరకుండుము... నేను వారిని కాల్చివే”స్తాను అని దేవుడన్నాడు. ఇశ్రాయేలీయుల్ని నాశనం చేయటానికి దేవుడు నిశ్చయించుకొంటే ఎవరు కాదనగలరు? ఆ పాపుల్ని తమ కర్మకి విడిచి పెట్టని వారు ఎందరుంటారు? శ్రమ, హృదయభారం, త్యాగంతో నిండి అడుగడుక్కీ కృతఘ్నత, గొణుగుడు ఎదురయ్యే బతుక్కు బదులు సుఖసంతోషాలు, గౌరవ ప్రతిష్ఠలతో హాయిగా సాగే జీవితం దేవుడే ఇస్తానన్నప్పుడు ఎందరు కాదంటారు?PPTel 308.2

  నిరాశ, ఉగ్రత మాత్రమే ఉన్నట్లు కనిపించిన చోట మోషే ఆశాకిరణాన్ని చూశాడు. “నీవు ఊరకుండుము” అన్న దేవుని మాటలు విజ్ఞాపనకు తలుపు మూసేకన్నా విజ్ఞాపనను ప్రోత్సహించే మాటలుగా అవగాహన చేసుకొన్నాడు. ఇశ్రాయేలీయుల్ని తన ప్రార్థనలు మాత్రమే కాపాడగలవని అలా విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తన ప్రజల్ని కాపాడాడని మోషే నమ్మాడు. మోషే “తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని - యెహోవా, నీ మహాశక్తివలన బాహుబలమువలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?” అన్నాడు.PPTel 308.3

  తన ప్రజల్ని విడిచి పెట్టేస్తానని దేవుడు సూచించాడు. వారిని గురించి మోషేతో “ఐగుప్తు దేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు” అని దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలీయుల నాయకుణ్ని తాను కానని మోషే వినయంగా సూచించాడు. వారు తన ప్రజలు కారు “దేవుని ప్రజలు” -- “నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీద నుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను?” అంటూ మోషే దేవునితో విజ్ఞాపన చేశాడు.PPTel 308.4

  ఇశ్రాయేలీయులు ఐగుప్తునుంచి వెళ్లిపోయిన కొన్ని నెలలకి వారి విచిత్రమైన విడుదలను గూర్చిన వార్తలు చుట్టపక్కల ఉన్నదేశాలకు అందాయి. ఆ అన్యప్రజల మనసుల్లో భయం అదురు చోటు చేసుకొన్నాయి. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు ఏం చేస్తాడా అని అందరూ కని పెడ్తూ ఉన్నారు. వారిప్పుడు నాశనమైపోతే వారి శత్రువులకు విజయం కలుగుతుంది, దేవునికి అపకీర్తి కలుగుతుంది. తమ ఆరోపణలు వాస్తవమైనవని ఐగుప్తీయులు చెప్పుతారు. తన ప్రజలు బలులర్పించే నిమిత్తం వారిని అరణ్యంలోకి నడిపించే బదులు వారినే బలిగొన్నాడని అంటారు. వారు ఇశ్రాయేలీయులు చేసిన పాపాల్ని పరిగణించరు. తాను ఎంతో గైరవించిన ప్రజల్ని నాశనం చెయ్యటం ఆయనకు అపఖ్యాతి గడిస్తుంది. దేవుని వలన గౌరవం పొందినవారు ఆయన నామం ప్రశంసలు పొందేటట్లు వ్యవహరించే బాధ్యత ఎంత గుర్తురమైంది! ప్రజలమీదికి దేవుని తీర్పులు వచ్చి భక్తిహీనులు ఆయన నామాన్ని దూషించకుండా ఉండేందుకు గాను దైవ ప్రజలు పాపం చెయ్యకుండా తమ్మును తాము ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి!PPTel 309.1

  దేవుని సహాయంతో తాను ఏ ప్రజల కోసం ఎంతో సాధించటంలో సాధనంగా ఉన్నాడో ఆ ఇశ్రాయేలీయుల తరపున దేవునితో విజ్ఞాపన చేస్తుండగా తన ఆసక్తిని బట్టి, తన ప్రేమను బట్టి అతడి భయం మాయమయ్యింది. అతడి విజ్ఞాపనను దేవుడు ఆలకించాడు. అతడి స్వార్థరహిత ప్రార్థనను అంగీకరించాడు. దేవుడు తన సేవకుడైన మోషేని పరీక్షించాడు. కృతజ్ఞతలేని ఆ ప్రజలపట్ల మోషే విశ్వాసాన్ని ప్రేమను దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో మోషే గొప్ప విజయం సాధించాడు. ఇశ్రాయేలీయుల విషయంలో మోషే ఆసక్తి స్వార్థంవల్ల పుట్టింది కాదు. తన గౌరవంకన్నా గొప్ప జాతిపితకావటంకన్నా ప్రతిష్ఠ కన్నా మోషేకు మిక్కిలి ప్రియమైంది ఇశ్రాయేలీయుల ప్రగతి. అతడి విశ్వసనీయతతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో దేవుడు తృప్తి చెందాడు. ఇశ్రాయేలీయుల్ని వాగ్దత్త దేశానికి నడిపించే గొప్ప బాధ్యతను నమ్మకమైన కాపరి అయిన మో షేకు అప్పగించాడు.PPTel 309.2

  మోషే యెహోషువాలు కొండదిగి వచ్చారు. మోషే “శాసనములుగల రెండు పలకలను” పట్టుకొన్నాడు. ఉద్రేకంలో ఉన్న ప్రజల కేకలు వారికి వినిపించాయి. సైనికుడైన యెహోషువాకు వచ్చిన మొదటి తలంపు తమ శత్రువులు దాడి జరపటం. “పాళెములో యుద్ధ ధ్వని” అన్నాడు. అయితే ఆ గోల ఏమిటన్న విషయమై మో షే భావించింది వాస్తవం. అది యుద్ధ ధ్వని కాదు, అది ఉత్సాహ ధ్వని, “అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు. సంగీత ధ్వని నాకు వినబడుచున్నది” అన్నాడు.PPTel 310.1

  శిబిరాన్ని సమీపించినప్పుడు ప్రజలు తమ విగ్రహం చుట్టూ కేకలు వేసుకొంటూ నాట్యం చేయటం చూశారు. అది అన్యుల దొమ్మీ దృశ్యం. అది ఐగుప్తులో విగ్రహారాధకుల పండుగ అనుకరణ. భక్తితో కూడిన దైవారాధనకూ, దానికి ఎంత వ్యత్యాసం! మోషే నిర్ఘాంతపోయాడు. అతడు దేవుని మహిమలో నుంచి అప్పుడే వచ్చాడు. జరుగుతున్న దాన్ని గురించి హెచ్చరిక పొందినా ఇశ్రాయేలీయులు అంతగా దిగజారిపోతారని అతడనుకోలేదు. మోషే ఉగ్రుడయ్యాడు. వారు చేసిన పాపాన్ని తాను అసహ్యించుకొంటున్నట్లు చూపించటానికి అతడు రాతి పలకల్ని కింద పడేశాడు. అవి పగలిపోయాయి. ఆ దృశ్యాన్ని ప్రజలందరూ చూశారు. వారు దేవునితో తాము చేసుకొన్న నిబంధనను భగ్నం చేశారు కాబట్టి వారితో దేవుడు తాను చేసిన నిబంధనను రద్దు చేస్తున్నట్లు ఆ క్రియ సూచించింది.PPTel 310.2

  మోషే శిబిరంలోకి వెళ్లినప్పుడు జన సమూహాలు వేడుకలో తేలి ఆడున్నట్లు చూశాడు. మోషే ఆ విగ్రహాన్ని అందుకొని దాన్ని అగ్నిలో పడేశాడు. ఆ తర్వాత దాన్ని పొడుంచేసి పర్వతం మీద నుంచి ప్రవహిస్తున్న నీటిలో కలిపి దాన్ని ప్రజలచే తాగించాడు. తాము పూజిస్తున్న బంగారం వ్యర్థమైందని ఈ విధంగా కనపర్చాడు.PPTel 310.3

  ఆ మహానాయకుడు దోషి అయిన తన అన్నను పిలిచి ఇలా కఠినంగా ప్రశ్నించాడు, “నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమి చేసిరి?” అహరోను తన్ను తాను సమర్థించుకోటానికి ప్రజలు దొమ్మీగా వచ్చి పెద్ద గొడవ చేశారని, తాను వారు చెప్పినట్లు చేసి ఉండకపోతే వారు తనని చంపి ఉండేవారని చెప్పాడు. “నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు - మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమయెనో మాకు తెలియదనిరి. అందుకు నేను - ఎవరియొద్ద బంగారమున్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడాయెను” అన్నాడు. తాను బంగారం అగ్నిలో వేయగా అది కరిగి దూడగా మారిందని అది ఒక సూచక క్రియ అని చెప్పటానికి అహరోను వ్యర్థంగా ప్రయత్నించాడు. అతడి సాకులు, అసత్యాలు ఉపయోగపడలేదు. ప్రధాన నేరస్తుడుగా అతడితో వ్యవహరించాల్సి వచ్చింది.PPTel 310.4

  ప్రజలందరిలోను తాను గౌరవ ప్రదమైన స్థానం ఆక్రమించినందున అతడి పాపం అతి నీచపాపమయ్యింది. ” యెహోవాకు ప్రతిష్ఠితుడైన” (కీర్తనలు 106:16) అహరోనే విగ్రహం చేసి పండుగ ప్రకటించాడు. “అతడు బాగుగా మాటలాడగలడని” (నిర్గమ 4:14) ఎవరి గురించి దేవుడు చెప్పాడో ఎవరు మోషేకి వక్తగా ఉన్నాడో ఆ అహరోనే దైవ ధిక్కార కార్యంలో ఆ ప్రజల్ని నిలువరించలేకపోయాడు. ఎవరి ద్వారా ఐగుప్తు ప్రజలమీదికి వారి దేవుళ్ల మీదికి దేవుడు తన తీర్పులు పంపించాడో ఆ వ్యక్తే “ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తులోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే” అంటూ ఆ పోత దూడముందు ప్రజలు చేసిన ప్రకటనను చీమ కూడా కుట్టనట్లు విన్నాడు. మోషేతో పర్వతం మీద ఉండి అక్కడ దేవుని మహిమను వీక్షించిన వ్యక్తి, విగ్రహం చేసేందుకు ఆ మహిమా ప్రదర్శనలో ఏదీ లేదని గ్రహించిన వ్యక్తి అతడే. ఆ మహిమను దూడ ఆకృతికి మార్చిందీ అతడే. మోషే లేని కాలంలో ప్రజా పరిపాలన బాధ్యతను దేవుడు తన చేతుల్లో పెట్టగా వారి తిరుగుబాటుపై ఆమోద ముద్రవేసిందీ అతడే. ” యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా” కోప్పడ్డాడు. ద్వితీ 9:20. కాకపోతే మోషే చేసిన హృదయ పూర్వక విజ్ఞాపన ఫలితంగా అతడి ప్రాణం దక్కింది. తన ఘోర పాపం నిమిత్తం అతడు పొందిన పశ్చాత్తాపం అతడు ప్రదర్శించిన దీనత్వం ఫలితంగా అతణ్ని దేవుడు తిరిగి చేర్చుకొన్నాడు.PPTel 311.1

  పర్యవసానాలకు భయపడకుండా అహరోను ధైర్యంగా నీతికోసం నిలబడి ఉంటే ఆ మత భ్రష్టతను నిలువరించగలిగేవాడు. వ్యక్తిగతంగా తాను దేవునికి నమ్మకంగా నిలిచి ఉంటే, సీనాయి భయంకర సంభవాలకు ప్రజల దృష్టిని తిప్పి, ఆయన నిబంధనను ఆచరిస్తామని వారు దేవునితో చేసిన వాగ్దానాన్ని వారికి జ్ఞాపకం చేసి ఉంటే ఆ దుశ్చర్యను ఆపగలిగేవాడు. అయితే అతడు ప్రజల కోరికలు తీర్చటానికి పూనుకోటం, చీకు చింత లేకుండా వారి ప్రణాళికల్ని అమలు పర్చటం, ప్రజలు ధైర్యం తెచ్చుకొని తాము ఎన్నడూ ఊహించని నికృష్ణ పాపాలికి పాల్పడటానికి తోడ్పడింది.PPTel 311.2

  శిబిరానికి తిరిగి వచ్చాక మోషే తిరుగుబాటుదారుల్ని ఎదుర్కొన్నప్పుడు అతడి మందలింపులు, పరిశుద్ధ ధర్మశాస్త్రపు పలకల్ని పగులగొట్టటం ద్వారా అతడు ప్రదర్శించిన ఆగ్రహం - వీటిని అన్న అహరోను మృదు భాషతో, అతడి మర్యాద పూర్వక వ్యవహార శైలితో పోల్చి ప్రజలు అహరోనుపట్ల సానుభూతి చూపారు. తన్నుతాను సమర్ధించుకొనే ప్రయత్నంలో ప్రజల కోరిక మేరకు తాను వ్యవహరించటానికి ప్రజల్నే బాధ్యుల్ని చేయటానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడి సాధుత్వాన్ని బట్టి అతడి సహనాన్ని బట్టి ప్రజలు అహరోనుపట్ల ఆదరాభిమానాలు కలిగి ఉన్నారు. అయితే మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. అహరోను మెతక స్వభావం, అందరినీ తృప్తి పరచాలన్న అతడి మనస్తత్వం తన నేరం తీవ్రతను చూడకుండా అతణ్ని గుడ్డివాణ్ని చేశాయి. ఇశ్రాయేలీయులు చేసిన ఈ పాపానికి అతడిచ్చిన సహకారం వేలాది మంది ఇశ్రాయేలీయులు ప్రాణాలు పోగొట్టుకోటానికి కారణమయ్యింది. దీనికి మోషే వ్యవహరించిన తీరుకీ ఎంత వ్యత్యాసముంది! దేవుని తీర్పులు నమ్మకంగా అమలు జరుపుతున్నప్పుడు తన ప్రగతికన్నా, తన ప్రతిష్ఠకన్నా, తుదకు తన ప్రాణం కన్నా తనకు ఇశ్రాయేలు ప్రజల శ్రేయస్సే ప్రధానమని మోషే చూపించాడు.PPTel 311.3

  దేవుడు శిక్షించే పాపాలన్నిటిలోను అతి తీవ్రంగా ఆయన పరిగణించే పాపం ఇతరుల్ని పాపం చేయటానికి ప్రోత్సహించటం. అది ఎంత బాధాకరమైన పని అయినా తన సేవకులు అతిక్రమాన్ని గద్దించటం ద్వారా తమ విశ్వాస పాత్రతను నిరూపించుకోవాలని దేవుడు కోర్తున్నాడు. దైవ సేవార్థం నియమితులైనవారు బలహీనంగా మెతకగా వ్యవహరించకూడదు. వారు తమ సొంత ఔన్నత్యాన్ని లక్షించకూడదు, అప్రియ విధుల్ని తోసిపుచ్చకూడదు. వారు దేవుని కార్యాల్ని అతి నమ్మకంగా నిర్వహించాలి.PPTel 312.1

  మోషే ప్రార్థన మేరకు దేవుడు ఇశ్రాయేలీయుల్ని నాశనం చెయ్యకుండా ఉన్నప్పటికీ వారి మతభ్రష్టత శిక్షార్హం. అహరోను అనుమతించిన విచ్చల విడితనం, అవిధేయత వెంటనే అణచివేయకపోతే దుర్మార్గత, దౌర్జన్యం పెచ్చరిల్లి, జాతి వినాశనానికి దారితీస్తాయి. తీవ్ర చర్య ద్వారా ఆ దుర్మార్గతను రూపుమాపాలి. శిబిరం గుమ్మములో నిలబడి ప్రజలకు మోషే ఈ పిలుపునిచ్చాడు. “యెహోవా పక్షమున నున్నవారందరు నాయొద్దకు రండి”. మత భ్రష్టతలో పాలు పొందని వారందరూ మోషే కుడిపక్క నిలబడాల్సి ఉన్నారు. అపరాధులై పశ్చాత్తాపం పొందినవారు ఎడమ పక్క నిలబడాల్సి ఉన్నారు. ఆ విధంగానే ప్రజలు నిలబడగా లేవీ గోత్రం విగ్రహారాధనలో పాలు పొందనట్లు బయటపడింది. తక్కిన గోత్రాల నుంచి చాలామంది పాపం చేసినప్పటికీ ఇప్పుడు తమ పశ్చాత్తాపాన్ని కనపర్చారు. కాగా ప్రజలు ప్రధానంగా దూడను చేయటానికి ప్రేరేపించిన అన్యజనులు, మొండిగా పెద్ద సంఖ్యలో తమ తిరుగుబాటును కొనసాగించారు. విగ్రహారాధనలో పాలు పొందని వారు తన కుడిపక్క ఉన్నారు. వారు తమ ఖడ్గాలు ధరించి తిరుగుబాటు చేస్తున్న వారందరిని “ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా” పేర సంహరించాల్సిందిగా మోషే ఆజ్ఞాపించాడు. “ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేలమంది కూలిరి”. హోదాని, బంధుత్వాన్ని, స్నేహాన్ని లెక్కచేయకుండా ఆ దుర్మార్గతలో ప్రధాన పాత్రధారులందరినీ సంహరించారు. పశ్చాత్తాపం పొంది దీన హృదయులైన వారందరినీ విడిచి పెట్టారు.PPTel 312.2

  ఈ భయంకర తీర్పును అమలుపర్చిన వారు దైవాధికారం కింద పరలోక రాజు తీర్మానాన్ని అమలు జరుపుతున్నారు. మనుషులు తమ మానవ అంధత్వంలో తమ సాటి మనుషుల్ని ఎలా శిక్షిస్తారన్న విషయమై జాగ్రత్తగా ఉండాలి. కాని దుర్మార్గుల విషయంలో తాను విధించిన శిక్షను అమలు పర్చాల్సిందిగా దేవుడు మానవుల్ని ఆజ్ఞాపించినప్పుడు మానవులు దాన్ని అమలు పర్చాలి. ఈ బాధాకరమైన క్రియను జరిపించినవారు తిరుగుబాటు పట్ల విగ్రహారాధన పట్ల తమ అసహ్యతను ఇలా ప్రదర్శించి తమ్మును తాము దేవుని సేవకు సంపూర్తిగా సమర్పించుకొన్నారు. తమ విశ్వసనీయతకు లేవీ గోత్రాన్ని ప్రత్యేక గుర్తింపుతో దేవుడు గౌరవించాడు. PPTel 313.1

  ఇశ్రాయేలీయులు రాజద్రోహ నేరానికి పాల్పడ్డారు. తమకు ఎన్నో ఉపకారాలు చేసిన రాజుకు, ఎవరి అధికారానికి విధేయులమై ఉంటామని వారు స్వచ్ఛందంగా ప్రమాణం చేశారో ఆ పరలోక రాజుకు వారు ద్రోహం చేశారు. దైవ ప్రభుత్వం కొనసాగేందుకుగాను ద్రోహులు శిక్ష పొందాలి. అయినా ఇక్కడ కూడా దేవుని కృప వెల్లడయ్యింది. తన ధర్మ శాసనాల్ని కొనసాగిస్తూనే అందరికీ ఎంపిక చేసుకొనే స్వతంత్రతను పశ్చాత్తాపం పొందేందుకు తరుణాన్ని ఆయన ఇచ్చాడు. పట్టువిడువ కుండా తిరుగుబాటు చేసిన వారిని మాత్రమే నాశనం చేశాడు.PPTel 313.2

  విగ్రహారాధనను దేవుడు సహించడని పరిసర ప్రాంతాల్లోని రాజ్యాలకు తెలిసేందుకు ఈ పాపాన్ని శిక్షించటం అవసరమయ్యింది. దేవుని సాధనంగా వ్యవహరించిన మోషే అపరాధుల్ని శిక్షించటం ద్వారా వారి పాపాల్ని నిరసించినట్లు బహిరంగ రికార్డుల్లో దాఖలాలు ఉంచాలి. అనంతరం చుట్టుపట్ల జాతుల్లోని విగ్రహారాధనను ఇశ్రాయేలీయులు ఖండించాల్సినప్పుడు వారి శత్రువుల యెహోవా తమ దేవుడని చెప్పకొనే ప్రజలు హో రేబు వద్ద దూడను చేసి దాన్ని పూజించారు గదా అని తిరిగి దేవున్ని నిందిస్తారు. అప్పుడు సిగ్గుకరమైన ఆ వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉన్నా ఆ పాపాన్ని దేవుడు అంగీకరించటం గాని, ఉపేక్షించటం గాని చేయలేదని చెప్పటానికి అపరాధులకు కలిగిన ఈ భయంకర శిక్షను ఇశ్రాయేలీయులు చూపించవచ్చు.PPTel 313.3

  ఈ పాపాన్ని శిక్షించటం అవసరమని న్యాయపాలనే కాదు ప్రేమకూడా కోరింది. తన ప్రజల విషయంలో కాపుకర్త సర్వాధికారి దేవుడే. తిరుగుబాటుకి కృతనిశ్చయులైన వారు ఇతరుల్ని నాశనానికి నడిపించకుండేందుకుగాను వారిని దేవుడు నాశనం చేశాడు. పాపాన్ని శిక్షించకుండా విడిచి పెట్టే కలిగే ఫలితాలేమిటో కయీనును శిక్షించకుండా విడిచి పెట్టడం ద్వారా దేవుడు విశ్వానికి వెల్లడి పర్చాడు. తన మాటలు, చేతలు జీవితం ద్వారా అతడు తన సంతతి పై ప్రసరించిన ప్రభావం లోకాన్ని పాడుచేసి జలప్రళయం వల్ల లోకం నాశనం కావటానికి దారితీసింది. దీర్ఘాయుర్దాయం పాపికి దీవెనకరం కాదని జలప్రళయ పూర్వ ప్రజల చరిత్ర చెబుతున్నది. దేవుని సుదీర్ఘ సహనం వారి దుర్మార్ధతను అణచి వేయలేకపోయింది. మనుషులు ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంత ఎక్కువ దుర్మార్గులయ్యారు.PPTel 314.1

  సీనాయి వద్ద మతభ్రష్టత విషయంలో జరిగింది ఇదే. అతిక్రమాన్ని వెంటనే శిక్షించకపోతే అదే పరిస్థితి మళ్లీ తలెత్తి ఉండేది. నోవహు దినాల్లోలా లోకం మళ్లీ చెడిపోయి ఉండేది. ఈ దోషుల్ని విడిచి పెట్టడం జరిగి ఉంటే కయీనుని విడిచి పెట్టినందువల్ల చోటు చేసుకొన్న దుష్టికన్నా ఎంతో దుర్మార్గత చోటుచేసుకొని ఉండేది. కోట్లాది మందికి శిక్ష తప్పేందుకుగాను వేలమందిని శిక్షించటమన్నది దేవుని కృపా సంకల్పం. అనేకమందిని రక్షించటానికి ఆయన కొద్దిమందిని శిక్షించాలి. ఇంకా చెప్పాలంటే, ప్రజలు దేవుని విడిచి పెట్టారు కాబట్టి వారు దేవుని కాపుదలను పోగొట్టుకున్నారు. భద్రతను కోల్పోయారు. ఇశ్రాయేలీయుల జాతే శత్రువుల దాడికి గురి అయ్యింది. ఆ దుర్నీతిని తక్షణమే అంతం చేయకపోతే వారు కొద్దికాలంలోనే శక్తిమంతులైన అనేక శత్రువుల చేతుల్లో పడి నశించేవారు. నేరాన్ని వెంటనే శిక్షించటం ఇశ్రాయేలీయులికి మంచిది. అది భావితరాల ప్రజలకు కూడా గుణపాఠం, దుర్మార్గతలో పాపులకు అడ్డుకట్ట పడటం ఒక కృపాకార్యమే. వారి ప్రాణాలు కాపాడటం జరిగి ఉంటే దేవుని పై తిరుగుబాటుకు కారణమైన స్వభావమే వారు తమతో తాము కలహించుకోటానికి ఒకర్నొకరు ద్వేషించుకోటానికి దారితీసి వారు ఒకర్నొకరు నాశనం చేసుకొనేటట్లు చేసేది. ప్రపంచం పట్ల ఇశ్రాయేలు ప్రజలపట్ల, చివరికి అపరాధులపట్ల ప్రేమవల్లే నేరాన్ని కఠినంగా సత్వరం శిక్షించటం జరిగింది.PPTel 314.2

  ప్రజలు మేల్కొని తమ నేరం తీవ్రతను గుర్తించినప్పుడు వారి శిబిరమంతా భయాందోళనలతో నిండింది. ప్రతీ నేరస్తుడూ నాశనం కావచ్చునని భయపడ్డారు. వారి దు:ఖాన్ని, సంతాపాన్ని చూసిన మోషే వారి పై జాలిపడి తమ పక్షంగా దేవునికి మరోసారి విజ్ఞప్తి చేస్తానని వాగ్దానం చేశాడు.PPTel 314.3

  మోషే వారితో “మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో” అన్నాడు. పైకి వెళ్లి ఆయనతో తన విజ్ఞాపనలో ఇలా వేడుకొన్నాడు, “అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహసించితివా, లేనియెడల నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలుకొనుచున్నాను”. “ఎవడు నా యెదట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము.ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లను. నేను వచ్చు దినమును వారి పాపమును వారి మీదికి రప్పించెదను” అని మోషేకి ఆయన సమాధానమిచ్చాడు.PPTel 315.1

  తన ప్రార్థనలో అందరి పేర్లూ వారి వారి క్రియలూ అవి మంచివేగాని చెడ్డవేగాని నమ్మకంగా దాఖలై ఉండే పరలోక గ్రంథాలకు మన గమనాన్ని మోషే తిప్పుతున్నాడు. దేవుని సేవలో ప్రవేశించిన వారందరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఇందులో ఎవరైనా ఆయనను విడిచి పెట్టి మొండిగా పాపంలో కొనసాగటం ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావానికి చోటివ్వకుండా ఉన్నట్లయితే తీర్పులో వారి పేర్లు జీవగ్రంథంలో నుంచి తుడిచివేయబడ్డాయి. తమకు తామే వారు నాశనాన్ని కోరుకుంటారు. పాపి పరిస్థితి ఎంత భయంకరమైందో మోషే గుర్తించాడు. అయినా ప్రభువు ఇశ్రాయేలీయుల్ని నిరాకరిస్తే వారితో పాటు తన పేరునుకూడా తీసివేయమని మోషే దేవుణ్ని కోరాడు. దేవుడు అంత ఆశ్చర్యకరంగా విమోచించిన ప్రజలు ఆయన తీర్పులకు గురికావటం మోషే భరించలేకపోయాడు. ఇశ్రాయేలీయుల తరపున మోషే సల్పిన విజ్ఞాపన పాపుల తరపున క్రీస్తు చేసే విజ్ఞాపనను సూచిస్తున్నది. పాపి అపరాధాన్ని క్రీస్తు భరించినట్లు ఇశ్రాయేలీయుల అపరాధాన్ని మోషే భరించటానికి ప్రభువు అనుమతించలేదు. “ఎవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును” అని ప్రభువన్నాడు.PPTel 315.2

  హతులైన తమ ఆప్తుల్ని ప్రజలు దు:ఖభారంతో సమాధి చేశారు. మూడు వేలమంది ఖడ్గం వల్ల కూలారు. దైవ సముఖం ఇక తమతో ఉండదన్న వార్త వచ్చింది. ప్రభువిలా సెలవిచ్చాడు, “మీరు లోబడనొల్లని ప్రజలుగనుక నేను మీతో కూడా రాను; త్రోవలో మిమ్మును సంహరించెదనేమో”. మిమ్మును ఏమి చేయవలెనో ఆయన ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల శిబిరమంతా దు:ఖంలో మునిగింది. “కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి”.PPTel 315.3

  తాత్కాలిక ఆరాధన స్థలంగా ఉన్న గుడారాన్ని దేవుని ఆదేశం మేరకు “పాళెమునకు దూరముగా” వేశారు. దేవుడు తన సముఖాన్ని వారి మధ్యనుంచి తీసివేసుకొన్నాడన టానికి ఇది అదనపు నిదర్శనం. ఆయన తన్ను తాను మోషేకి ప్రత్యక్ష పర్చుకొంటాడు గాని ప్రజలకు మాత్రం కాదు. ఈ గద్దింపు ప్రజలకు ఎంతో బాధాకరంగా ఉంది. మనస్సాక్షి ఉన్న అనేకమందికి ఇది ఇంకా పెద్ద ప్రమాదానికి సూచికగా తోచింది. ఆ సమాజాన్ని పూర్తిగా నాశనం చేయటానికి దేవుడు వారి నుంచి మోషేను వేరు చేయలేదా? అయితే వారు నిరీక్షణ లేకుండా లేరు. శిబిరం బయట ఆ గుడారం వేసి దానికి మోషే “ప్రత్యక్ష గుడారము” అని పేరు పెట్టాడు. పశ్చాత్తాపం పొందిన వారందరూ ఆ గుడారంలోకి వెళ్లి తమ పాపాలు ఒప్పుకొని కృప చూపించమని ప్రభువును వేడుకోవచ్చు. ప్రజలు అక్కడ నుంచి తమ గుడారాలకు తిరిగి వెళ్లాక మోషే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్లాడు. తమ తరపున మోషే విజ్ఞాపనను దేవుడు అంగీకరించాడనటానికి గుర్తు కోసం ప్రజలు బరువెక్కిన హృదయాలతో కని పెడ్తున్నారు. అతణ్ని కలుసుకోటానికి దేవుడు దిగివస్తే వారు దహించబడరు. మేఘస్తంభం ప్రత్యక్షపు గుడార ద్వారం వద్ద నిలిచినప్పుడు ప్రజలు ఆనంద భాష్పాలు కార్చారు. వారందరూ తమ తమ “గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి”.PPTel 316.1

  తాను నడిపించాల్సిన ప్రజల వక్రబుద్ధి గుడ్డితనం మోషేకి బాగా తెలుసు. తాను ఎదుర్కోనున్న సమస్యలు కూడా అతడికి తెలుసు. అయితే ప్రజలతో సరిగా వ్యవహరించటానికి దేవుని సహాయం అవసరమని నేర్చుకొన్నాడు. తన చిత్తమేంటో స్పష్టంగా బయలు పర్చమని ఆయన తనతో ఉంటానన్న వాగ్దానాన్నిమ్మని మోషే దేవున్ని అర్థించాడు. “చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావుగాని నాతో ఎవరిని పం పెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివికదా. కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును. చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా” అన్నాడు. PPTel 316.2

  “నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను” అన్నది దేవుని సమాధానం. అయినా మో షేకి ఇంకా తృప్తి కలుగలేదు. ఇశ్రాయేలనీయుల్ని కఠిన హృదయులు పశ్చాత్తాపరహితులు కావటానికి దేవుడు విడిచి పెట్టేస్తే భయంకర ఫలితాలు కలుగుతాయన్న భావం మోషే హృదయాన్ని బరువెక్కించింది. తన ఆసక్తులు తన సోదర ప్రజల ఆసక్తులు వేర్వేరు అన్న ఆలోచనను భరించలేకపోయాడు. దేవుడు తన ప్రజలపట్ల మళ్లీ ప్రసన్నుడు కావాలని, తన ప్రజల ప్రయాణంలో ఆయన సన్నిధి చిహ్నం వారిని నడిపించాలని మోషే ప్రార్థించాడు. “నీ సన్నిధి రానియెడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొనిపోకుము. నా యెడలను నీ ప్రజల యెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననేగదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమిమీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుము.”PPTel 316.3

  “నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును” అని మోషేతో చెప్పాడు దేవుడు. అయినా ప్రవక్త ఇంకా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. తాను చేసిన ప్రతీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అయినా దేవుని అనుగ్రహం తనకున్నదని ఇంకా ఎక్కువ నిదర్శనాలకోసం మోషే ఆశతో ఎదురు చూశాడు. ఏ మానవుడూ ఎన్నడూ చేయని మనవిని మోషే ఇప్పుడు చేశాడు. “దయచేసి నీ మహిమను నాకు చూపుము” అన్నాడు.PPTel 317.1

  తన అతిశయపూర్వక అభ్యర్థనకు దేవుడు అతణ్ని మందలించలేదు. కాని దయగా ఇలా అన్నాడు, “నా మంచితనమంతయు నీ యెదుట కనపర్చుదును” ప్రత్యక్షంగా దేవుని మహిమను చూసి ఈ మర్త్యమైన స్థితిలో ఏ మానవుడూ బతకలేడు. కాగా మోషే భరించగలిగినంత మేరకు తన మహిమను మోషేకు కనపర్చటానికి అతడికి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మళ్లీ మోషేని కొండమీదికి పిలిచాడు. అంతట ప్రపంచాన్ని సృజించిన హస్తం “వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయు” హస్తం (యోబు 9:5) మన్నుతో నిర్మితి అయిన ఈ మానవమాతృణ్ని, ఈ విశ్వాస వీరుణ్ని బండ సందులో దాచి అతణ్ని దాటి వెళ్లేటప్పుడు తన మహిమను మంచితనాన్ని యెహోవా అతడికి కనపర్చాడు.PPTel 317.2

  ఈ అనుభవం అన్నిటికన్నా ప్రధానంగా దైవ సన్నిధి తనతో ఉంటాదన్న వాగ్దానాన్ని తన ముందున్న పనిలో తనకు జయం కలుగుతుందన్న నిశ్చయతను మోషేకు పుట్టించింది. ఐగుప్తులో తాను సంపాదించిన జ్ఞానం కన్నా లేక రాజనీతిజ్ఞుడుగా, సైనిక నాయకుడుగా తాను సాధించిన ఘనతకన్నా ఈ అనుభవం ఎంతో విలువైందిగా మోషే పరిగణించాడు. లౌకికమైన ఏ అధికారం ఏ నైపుణ్యం ఏ పరిజ్ఞానం కూడా దేవుని నిత్య సన్నిధిని సరఫరా చేయజాలదు.PPTel 317.3

  అపరాధికి దేవుని చేతిలో పడటం భయంకరమైన సంగతి. అయితే నిత్యుడైన దేవుని సముఖంలో మోషే ఒంటరిగా నిలబడ్డాడు. అతడు భయపడలేదు. ఎందుచేతనంటే అతడి ఆత్మకు దేవునికి మధ్య సామరస్యం ఉంది. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు. “నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును” కీర్తనలు 66:18. కాగా “యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును” కీర్తనలు 25:14.PPTel 317.4

  దేవుడు తన్ను తాను ఇలా ప్రచురపర్చుకొన్నాడు, “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచ”డు.PPTel 318.1

  “మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారము” చేశాడు. తన ప్రజల పాపాన్ని క్షమించి వారిని తన స్వాస్థ్యంగా స్వీకరించమని దేవున్ని మళ్లీ బతిమాలాడు. అతడి మనవిని దేవుడు అంగీకరించాడు. ఇశ్రాయేలీయులపట్ల తన ప్రసన్నత కొనసాగిస్తానని, “భూమిమీద ఎక్కడనైనను ఏ జనములోనైనను” చేయని అద్భుత కార్యాలు వారి పక్షంగా చేస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు.PPTel 318.2

  నలబయి రాత్రింబగళ్లు మోషే కొండమీద ఉన్నాడు. మొదటిసారిలాగే ఈ నలభై దివారాత్రులు అతనికి ఆశ్చర్యకరంగా ఆహారపానాల సరఫరా జరిగింది. అతనితో ఇంకెవ్వరూ కొండమీదికి వెళ్లలేదు. మోషే లేని కాలంలో ఎవరూ పర్వతాన్ని సమీపించటం నిషిద్ధం. దేవుని ఆదేశం మేరకు అతడు రెండు రాతి పలకలు తయారు చేశాడు. వాటిని తనతో కొండ మీదికి తీసుకువెళ్లాడు. అంతట ప్రభువు మళ్లీ “ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను” PPTel 318.3

  దేవునితో ఉన్న ఈ దీర్ఘకాలంలో మోషే ముఖం దైవ తేజస్సును ప్రతిబింబించింది. అతడు పర్వతం దిగి కిందకి వచ్చినప్పుడు అతడి ముఖం తేజోవంతమైన కాంతితో ప్రకాశించింది. స్తెఫనును న్యాయాధిపతుల ముందుకు తీసుకొని వచ్చినప్పుడు అతడి ముఖం కూడా అలాంటి కాంతితోనే ప్రకాశించింది. సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను” అ.కా. 6:15. అహరోనూ, ప్రజలూ మోషే వద్దనుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. “వారు అతని సమీపింపవెరచిరి” వారి గందరగోళ పరిస్థితి భయాందోళనలు అజ్ఞానం చూసి దగ్గరకు రావలసిందిగా మోషే వారికి మనవి చేశాడు. దేవునితో రాజీని తమపట్ల ఆయన ప్రేమాదరాల పునరుద్ధరణకు వారికి వాగ్దానం చేశాడు. మోషే స్వరంలో ప్రేమను విజ్ఞాపనను మాత్రమే వారు కనుగొన్నారు. చివరకు ఒక్క వ్యక్తి అతణ్ని సమీపించటానికి ధైర్యం చేశాడు. భయంతో మాట్లాడలేక మోషే ముఖం మీది ప్రకాశతకేసి ఆకాశం కేసి చూపించాడు. ఆ మహానాయకుడు అతడి భావాన్ని గ్రహించాడు. తాము పాపం చేశామన్న స్పృహతో, తామింకా దేవుని ఉగ్రతకు గురి అయి ఉన్నామన్న భావనతో ఉన్న వారు ఆ పరిశుద్ధ తేజస్సును తాళలేకపోయారు. దేవునికి విధేయులై ఉంటే ఆ తేజస్సు వారిని ఆనందంతో నింపి ఉండేది. అపరాధంలో భయం దాగి ఉంటుంది. పాపంలేని ఆత్మ పరలోక కాంతినుంచి దాక్కోటానికి ప్రయత్నించదు.PPTel 318.4

  వారికి అందించటానికి మోషేకి చాలా విషయాలున్నాయి. వారి భయాన్ని తొలగించటానికి మోషే తన ముఖం పై ముసుగు వేసుకున్నాడు. ఆ తర్వాత దేవునితో సమావేశమై వచ్చినప్పుడల్లా ముకానికి ముసుగు వేసుకొన్నాడు.PPTel 319.1

  ఈ తేజస్సు ద్వారా, తన ధర్మశాస్త్రం పవిత్రమైంది పరిశుద్ధమయ్యింది అని క్రీస్తు ద్వారా ప్రచురమయ్యే సువార్త మహిమకరమైందని ఇశ్రాయేలీయులు గుర్తించేటట్లు చెయ్యాలని దేవుడు సంకల్పించాడు. తనతో కొండమీద ఉన్నప్పుడు దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్నే గాక రక్షణ ప్రణాళికను కూడా ఇచ్చాడు. యూదుయుగంలోని ఛాయలు, గురుతులు క్రీస్తు బలిదానాన్ని సూచించాయని మోషే అర్థం చేసుకొన్నాడు.కల్వరి నుంచి ప్రవహిస్తున్న పరిశుద్ధ కాంతి దైవ ధర్మశాస్త్ర ప్రకాశం ఈరెంటివల్ల మోషే ముకం అంత తేజస్సుతో ప్రకాశించింది. ఈ పరిశుద్ధ ప్రకాశం నిజమైన మధ్యవర్తి అయిన క్రీస్తు కనిపించే ప్రతినిధిగా మధ్యవర్తిగా మోషే వ్యవహరించిన కాలానికి చిహ్నం.PPTel 319.2

  మోషే ముఖంపై ప్రకాశించిన మహిమ ఆజ్ఞలు ఆచరించే ప్రజలకు క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా ఒనగూడే దీవెనల్ని సూచిస్తున్నది. దేవునితో మన సంబంధం ఎంత పటిష్ఠంగానూ ఆయన విధుల్ని గూర్చి మన అవగాహన ఎంత స్పష్టంగాను ఉంటే దేవుని స్వరూపం అంత సంపూర్ణంగా మనలో ఏర్పడి అంత ఇష్టంగా మనం దైవ స్వభావంలో పాలుపొందుతామని అది సూచిస్తున్నది.PPTel 319.3

  మోషే క్రీస్తుకు ప్రతీక. ప్రజలు తన ముఖ ప్రకాశాన్ని చూడలేకపోయినందున ఇశ్రాయేలీయుల మధ్యవర్తి తన ముఖానికి ముసుగు వేసుకొన్నట్లు దివ్య మధ్యవర్తి అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తన దైవత్వానికి మానవత్వపు ముసుగు వేసుకొన్నాడు. ఆయన ఈ లోకంలో తన దైవత్వం ధరించివచ్చి ఉంటే పాపంలో నివసిస్తున్న మానవులతో ఆయన వ్యవహరించలేకపోయేవాడు. మానవులు ఆయన మహిమను తాళలేకపోయేవారు. పతనమైన మానవుల వద్దకు వెళ్లి వారిని పైకిలే పేందుకుగాను తన్ను తాను తగ్గించుకొని ఆయన “పాప శరీరాకారములో.” జన్మించాడు (రోమా 8:3).PPTel 319.4