Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  6—షేతు, హనోకు

  ఆదాముకి ఇంకొక కుమారుడు పుట్టాడు. అతడు దేవుడు చేసిన వాగ్దానానికి, ఆధ్యాత్మిక జ్యేష్టత్వానికి హక్కుదారుడుగా పుట్టాడు. షేతని ఈ కుమారుడికి పెట్టిన పేరుకు “నియమించెను” లేదా “ప్రతిగా” అని అర్థం. “కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెను” అన్నది తల్లి. షేతు కయీను కన్నా ఆ మాటకొస్తే హేబెలు కన్నా కూడా ఉదాత్త స్వభావం కలిగి వారిద్దరికన్నా ఎక్కువగా ఆదామును పోలి ఉన్నాడు. హేబెలు అడుగుజాడల్లో నడిచిన నీతిమంతుడు షేతు. అయినా అతనికి కయీను కన్నా ఎక్కువ మంచి సక్రమించలేదు. ఆదాము సృష్టి విషయంలో “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను” అని లేఖనం చెబుతున్నది. ఆదాము దేవుని స్వరూపంలో పాపరహితుడుగా సృష్టి పొందగా షేతు కయీనుకుమల్లే అతడి తల్లిదండ్రుల పాప స్వభావాన్ని వారి వద్ద నుంచి పొందాడు. రక్షకుణ్ని గూర్చిన జ్ఞానాన్ని, నీతి బోధను కూడా వారి వద్ద నుంచి పొందాడు. దైవ కృపవల్ల దేవుని సేవించి ఘనపర్చాడు. హేబెలు జీవించి ఉంటే పాపులు దేవున్ని ఘనపర్చి ఆయనకు విధేయులై నివసించటానిక అతడు నడిపించి ఉండేవాడు. ఆ కార్యసాధనకే షేతు కృషిసల్పాడు.PPTel 67.1

  “మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది” ఇంతకు ముందు దేవుని ఆరాధించిన విశ్వాసులున్నారు. అయితే జన సంఖ్య పెరిగే కొద్దీ ఈ రెండు తరగతుల ప్రజలమధ్య గల తేడా కొట్టిచ్చినట్లు కనిపించింది. ఒక తరగతి ప్రజలు దేవునిపట్ల తమ భక్తి విశ్వాసాల్ని బహిరంగంగా వ్యక్తం చేయగా ఇంకొక తరగతి ప్రజలు తమ ద్వేషాన్ని అవిధేయతను ప్రదర్శించారు.PPTel 67.2

  పాపంలో పడకముందు ఆదామవ్వలు ఏదెనులో స్థాపితమైన సబ్బాతును ఆచరించారు. ఏదెనునుంచి బహిష్క ృతులైన తర్వాత సబ్బాతు ఆచరణను కొనసాగించారు. అవిధేయత చేదు ఫలితాలు అనుభవించి దేవుని ధర్మశాసనాలు పరిశుద్ధమైనవి మార్పులేనివని అతిక్రమానికి శిక్ష నిశ్చయంగా కలుగుతుందని దేవుని ఆజ్ఞల్ని కాలరాచే వారందరూ ఒకనాడు తెలుసుకొంటారు. ఆదాము పిల్లల్లో దేవునికి నమ్మకంగా నిలిచిన వారందరూ సబ్బాతును ఆచరించారు. కయీను అతడి సంతతివారు మాత్రం దేవుడు విశ్రమించిన ఆ దినాన్ని ఆచరించలేదు. దేవుని నిర్దిష్ట ఆజ్ఞను లెక్కచేయకుండా పనికి విశ్రాంతికి వారు తమ సొంత సమయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. దేవుని శాపానికి గురి అయిన తర్వాత కయీను తండ్రి గృహం విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అతడు వ్యవసాయ వృత్తిని చేపట్టాడు. అనంతరం ఒక పట్టణాన్ని నిర్మించి దానికి తన కొడుకు పేరు పెట్టాడు. ప్రభువును విడిచి పెట్టి కయీను వెళ్లిపోయాడు. ఏదెను పునరుద్ధరణ వాగ్దానాన్ని తృణీకరించాడు. పాపశాపం క్రింద ఉన్న ధరిత్రిలో ఆస్తుల్ని సుఖభోగాల్ని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు.PPTel 67.3

  ఈ రీతిగా అతడు ఈ లోక దేవతను పూజించే తరగతి ప్రజలకు అధినేతగా నిలిచాడు. కేవలం లోక సంబంధమైన విషయాల్లో అతడి వంశీకులు ఖ్యాతిగడించారు. కాని దేవుడంటే వారికి లెక్కలేదు. మానవుల నిమిత్తం దేవుని ఉద్దేశాలతో వారికి పనిలేదు. కయీను ప్రారంభించిన హత్యానేరానికి అతడి వంశంలో అయిదో వాడైన లెమెకు బహు భార్యావ్యవస్థను చేర్చాడు. తిరస్కార ధోరణితో ప్రగల్భాలు పలుకుతూ దేవుని పై అవిశ్వాసం ప్రకటించాడు. పగ తీర్చుకొనే కయీను అతడికి హానిచేయనని హామీ ఇచ్చాడు. హేబెలు గొర్రెల కాపరి. గుడారాల్లో నివశించిన వ్యక్తి. షేతు సంతతివారు కూడా అదే వృత్తిని జీవిత విధానాన్ని అవలంబించారు. ” తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని” “అయితే?... మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నామని” వారు విశ్వసించారు. హెబ్రీ 11:13, 16.PPTel 68.1

  ఈ రెండు తరగతుల ప్రజలూ కొంతకాలం వేర్వేరుగా ఉన్నారు. కయీను సంతతివారు తాము స్థిరపడ్డ స్థలం నుంచి వెళ్లిపోయి షేతు సంతతివారు స్థిరపడ్డ మైదానాలు లోయల్లో స్థిరపడ్డారు. షేతు వంశీయులు కయీను వంశీయుల దుష్ప్రభావానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో పర్వత ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఈ వేర్పాటును కొనసాగించినంతకాలం వారి ఆరాధనలో స్వచ్చత కొనసాగింది. అయితే కాల గమనంలో వారు అంచెలంచెలుగా లోయ నివాసులతో కలిసి ఉండటం మొదలు పెట్టారు. ఇది దుష్పరిణామాలకు దారి తీసింది. “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని” చూశారు. షేతు వంశీయులు కయీను సంతతివారి కుమార్తెల అందానికి ఆకర్షితులై వారిని పెండ్లి చేసుకోవటం దేవునికి సమ్మతం కాలేదు. దేవుని ఆరాధించేవారిలో చాలామంది తమ ముందు ఎప్పుడూ ఉంటున్న ఆకర్షణలకు లోనై పాపంలో పడటం వల్ల తమ విశిష్టతను, పరిశుద్ధ ప్రవర్తనను పోగొట్టుకున్నారు. దుష్టులతో కలిసి మెలిసి ఉన్నందువల్ల స్వభావంలోను క్రియల్లోను వారికి మల్లే తయారయ్యారు. ఏడో ఆజ్ఞ విధించే నిషేధాన్ని వారు లెక్కజేయకుండా “తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి” షేతు సంతానం “కయీను నడిచిన మార్గముననడిచిరి” (యూదా 11). వారు లోకాసక్తులు, సుఖభోగాల్లో తలమునకలై దేవుని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేశారు. వారు “దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమ పర్చలేదు... “గాని తమ వాదములయందు వ్యర్ధులైరి” రోమా 1:21. అందుచేత “దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను” 28వ వచనం. లోకంలో పాపం కుష్టువ్యాధివలే ప్రబలింది.PPTel 68.2

  రమారమి వెయ్యి సంవత్సరాలు ఆదాము పాపఫలితాల్ని చూస్తూ జీవించాడు. దుర్మార్గతకు అడ్డుకట్ట వేయటానికి శాయశక్తులా ప్రయత్నించాడు. తన సంతతివారికి ప్రభువు మార్గాన్ని ఉపదేశించాల్సిందిగా ఆదేశం పొందాడు. దేవుడు తనకు ప్రత్యక్ష పర్చిన వాటన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకొని వాటిని తన తర్వాతి తరాల వారికి అందించాడు. తన తొమ్మిదో తరం వరకు తన బిడ్డలకు పరదైసులోని పరిశుద్ధ జీవనం గురించి వివరించాడు. తాను పాపంలో ఎలా పడ్డాడో ఆ చరిత్రను చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని నిష్టగా ఆచరించటం అవసరమని కష్టాలు శ్రమల ద్వారా తనకు దేవుడు నేర్పాడని చెప్పాడు. తమ రక్షణ కోసం దేవుడు కృపతో చేసిన ఏర్పాటును వారికి ఆదాము వివరించాడు. అయినా అతడి మాటల్ని ఆలకించిన వారు ఉపదేశాన్ని వినుకొన్నవారు బహుకొద్దిమంది తన సంతతికి అన్ని శ్రమలు కష్టాలు తెచ్చి పెట్టినందుకు వారు ఆదాముని తీవ్రంగా నిందించటం తరచుగా జరిగింది.PPTel 69.1

  ఆదాము జీవితం దు:ఖంతో దీనత్వంతో హృదయవేదనతో నిండిన పశ్చాత్తాపంతో గడిచింది. ఏదెను వనం విడిచి పెట్టే తరుణంలో తనకు మరణం సంభవిస్తుంది అన్న ఆలోచన ఆదాము గుండెల్ని భయంతో నింపింది. తన జ్యేష్ఠ పుత్రుడు కయీను హంతకుడై తమ్ముణ్ని చంపినప్పుడు మానవ కుటుంబంలో మరణం వాస్తవికతను ఆదాము మొట్టమొదటిసారిగా గుర్తించాడు. స్వయాన తాను చేసిన పాపానికి దు:ఖం, హేబెలు మరణం, పులిమీద పుట్రలా దేవునిచే కయీను నిరాకరణ అతడికి తీరని హృదయవేదన కలిగించాయి. తుదకు లోకం జలప్రళయంతో నాశనానికి కారణం కానున్న దుర్మార్గత దౌర్జన్యం లోకమంతటా విస్తరించటం చూశాడు. దేవుడు తనకు విధించిన మరణ శాసనం మొదట్లో భయంకరంగా కనిపించినా, పాప పర్యవసానాల్ని దాదాపు వెయ్యి సంవత్సరాలు చూసిన తర్వాత దు:ఖాలు, బాధలు, శ్రమలతో నిండిన మానవ జీవితం అంత మొందటం దేవుని కృపాకార్యమేనని ఆదాము గుర్తించాడు.PPTel 69.2

  జలప్రళయ పూర్వ ప్రపంచం దుష్టత్వంతో నిండి ఉన్నప్పటికీ అనేకులు భావిస్తున్నట్లు అది అజ్ఞాన, అనాగరిక యుగం కాదు. నైతిక, మానసిక అంశాల్లో ప్రజలు ఉన్నత ప్రమాణాలు సాధించటానికి అవకాశాలెన్నో ఉన్నాయి. వారికి గొప్ప శారీరక, మానసిక శక్తి ఉన్నది. మతపరమైన శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని ఆర్జించటానికి వారికెన్నో వనరులున్నాయి. వారు ఎంతో పెద్ద వయస్సు వరకూ జీవించారు. గనుక వారి మనసులు ఆలస్యంగా పరిణితి చెందాయని భావించటం తప్పు. వారి మానసిక శక్తులు చిన్న వయసులోనే వృద్ధి పొందాయి. దేవుని భయభక్తులతో, ఆయన చిత్తాన్ననుసరించి నివసించినవారు జ్ఞానంలోను, వివేకంలోను తమ జీవితం పొడుగునా వృద్ధి చెందుతూనే వున్నారు. మనకాలంలో ప్రసిద్ధిగాంచిన విద్వాంసుల్ని అదే వయసుకలిగి జలప్రళయానికి ముదు నివసించిన మనుషులకు ఎదురుగా నిలబెట్టటం జరిగితే మానసిక శక్తిపరంగాను, శారీరక శక్తిపరంగాను మన విద్వాంసులు వారికన్నా ఎంతో నాసిగా కనిపిస్తారు. కాలగమనంలో మానవుడి ఆయుషు అతడి బలం, అతడి మానసిక శక్తులూ క్షీణిస్తున్నాయి. ఈ కాలంలో పాతిక, యాభై సంవత్సరాలు అధ్యయనాలు సల్పి ఎన్నో విషయాలు కనుగొన్న వ్యక్తులున్నారు. ప్రపంచం వారిని మెచ్చుకొని అభినందిస్తున్నది. అయితే శతాబ్దాలపాటు పురోభివృద్ధి చెందుతున్న శారీరక, మానసిక శక్తులుగల మనుషుల జ్ఞానంతో పోల్చిచూస్తే వీరి జ్ఞానం ఎంతో పరిమితం!PPTel 70.1

  నవీన కాలంలోని ప్రజలకు తమకు ముందు నివసించిన ప్రజల కృషి ఉపక రిస్తుంది. రూపకల్పన చేసి, అధ్యయనం చేసి రచనలు చేసిన ప్రజ్ఞావంతులు వెనుక వచ్చేవారికి తమ రచనలు విడిచి వెళ్లారు. ఈ సందర్భంలో కూడా మానవ జ్ఞానానికి సంబంధించినంతవరకూ వెనుకటి తరాల ప్రజల ప్రతిభ ఎంత గొప్పది! దేవుడు తన పోలిక చొప్పున సృజించిన ఆదాము వందల సంవత్సరాలు వారి మధ్య నివసించాడు. భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానమంతా దేవుడే తనకి బోధించాడు. సృష్టి చరిత్రను ఆదాము దేవుని వద్ద నేర్చుకొన్నాడు. తొమ్మిది శతాబ్దాలు జరిగిన విషయాన్ని తానే ప్రత్యక్షంగా చూశాడు. జనుల జ్ఞానాన్ని ఆదాము తన సంతతి వారికి అందించాడు. జల ప్రళయానికి పూర్వం ప్రజలకు పుస్తకాలు లేవు. రాతపూర్వక దాఖలాలు లేవు. కాని వారికి అపూర్వమైన జ్ఞాపకశక్తి ఉన్నది. తమ దృష్టికి వచ్చిన విషయాన్ని అవగాహన చేసుకొని జ్ఞాపకముంచుకొనేవారు. తిరిగి దాన్ని తమ పిల్లలకు అందించగలిగేవారు. ఏడు తరాల వారు ఒకే కాలంలో పరస్పరం సంప్రదించుకొంటూ ఒకరి జ్ఞానాన్నుంచి అనుభవం నుంచి ఒకరు నేర్చుకొంటూ కొన్ని వందల సంవత్సరాలు కలిసి నివసించారు.PPTel 70.2

  దేవుని సృష్టిద్వారా ఆయనను గూర్చిన జ్ఞానాన్ని సంపాదించటానికి ఆ కాలపు ప్రజలకున్న అవకాశం అపూర్వం. అది చీకటి యుగం కాదు. అది జ్ఞాన వికాసంతో నిండిన విశిష్టయుగం. ఆదాము వద్ద నుంచి నేర్చుకొనే అవకాశం ప్రపంచమంతటికీ ఉన్నది. దేవునికి భయపడి జీవించిన వారికి క్రీస్తూ, దూతలూ బోధకులుగా వ్యవహరించారు. మూగసాక్షిగా ఏదెను తోట మానవుల మధ్య నిలిచి ఉంది. కెరూబులు కావలి వున్న ఆ తోట గుమ్మం దేవుని మహిమతో ప్రకాశించింది. మొట్టమొదటి ఆరాధకులు ఇక్కడ సమావేశమయ్యారు. ఇక్కడ వారు బలిపీఠాలు కట్టి తమ అర్పణలు అర్పించారు. కయీను హేబెలులు తమ అర్పణలు తెచ్చింది ఇక్కడకే. దేవుడు దిగివచ్చి వారితో మాట్లాడింది ఇక్కడే.PPTel 71.1

  ప్రవేశం వద్ద కావలి కాస్తున్న దూతలతో ఏదెను తమ ముందే ఉండగా ఏదెను ఉనికి నాస్తికులు కాదనలేరు. సృష్టి క్రమం, తోటను ఉంచటంలోని ఉద్దేశం, మానవుడి భవిష్యత్తుకు సంబంధించిన రెండు వృక్షాల చరిత్ర - ఇవి కాదనలేని వాస్తవాలు. దేవుని ఉనికి, ఆయన సర్వాధికారం, ఆయన ధర్మశాస్త్రాచరణ విధి - ఈ వాస్తవాల్ని ఆదాము జీవించి ఉండగా ఎవరూ ప్రశ్నించటానికి ముందుకు రాలేదు.PPTel 71.2

  దుర్మార్గత పెచ్చరిల్లుతున్నప్పటికీ దేవునితో తమ సాన్నిహిత్యం వల్ల ఉన్నతంగా పరిశుద్దంగా జీవించిన భక్తుల సంతతి కొనసాగింది. వారివి బ్రహ్మాండమైన మానసిక శక్తులు, అద్భుత కార్యసాధనలు. నీతి ప్రవర్తనను నిర్మించుకోవటం ఆ యుగంలోని ప్రజలకే కాక భావితరాల ప్రజలకు కూడా దైవభక్తి నేర్పించటమే వారు లక్ష్యించిన పరిశుద్ద కార్యం .అతి ప్రధానమైన వారిలో కొందరిని మాత్రమే లేఖనాలు పేర్కొంటు న్నాయి. కాని అన్ని యుగాల్లోనూ యదార్థమైన దైవభక్తులూ, ఆరాధకులూ ఉన్నారు.PPTel 71.3

  హనోకు అరవై అయిదు సంవత్సరాలు బతికి కుమారుణ్ని కన్నట్లు లేఖనం చెబుతున్నది. ఆ తర్వాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆ కాలావధి తొలి సంవత్సరాల్లో అతడు దేవుని ప్రేమించి ఆయనకు విధేయుడై ఆయన ఆజ్ఞల్ని ఆచరించాడు. పరిశుద్ధుల జాబితాలో అతడొకడు. నిజమైన విశ్వాసాన్ని కాపాడిన వారిలోను, వాగ్రత్త రక్షకుని పితరుల్లోను అతడు ఒకడు. తాను పాపంలో పడ్డ వైనాన్ని గూర్చి, వాగ్దానంలోని దైవ కృపను గూర్చి ఆదాము నోటినుంచి హనోకు విన్నాడు. రానున్న విమోచకుడి మీద ఆధారపడ్డాడు. అయితే తన మొదటి కుమారుడి జననం అనంతరం హనోకు తన అనుభవంలో ఉన్నత స్థాయికి చేరాడు. దేవునితో ఆత్మీయత ఏర్పరచుకొన్నాడు. దేవుని బిడ్డగా తన సొంత విధులు, బాద్యతలు ఏమిటో మరింత స్పష్టంగా అవగాహన చేసుకొన్నాడు. తండ్రిపట్ల చిన్న బిడ్డకుండే ప్రేమను, తండ్రి కాపుదలపై బిడ్డకుండే సంపూర్ణ విశ్వాసాన్ని చూసినప్పుడు తనకు మొదటగా పుట్టిన కుమారుడిపట్ల తన ప్రగాఢ మమతానురాగాల్ని హనోకు పరిగణించినప్పుడు తన కుమారుణ్ణి అర్పించటం ద్వారా దేవుడు మానవులపట్ల చూపించిన ప్రేమను బట్టి దేవుని బిడ్డలు తమ పరమ తండ్రిపై విశ్వాసం ఉంచవచ్చునన్న విలువైన పాఠం నేర్చుకొన్నాడు. క్రీస్తు ద్వారా దేవుడు కనపర్చిన అనంత ప్రేమను గూర్చి అతడు రాత్రింబగళ్లు ధ్యానించాడు. ఆ ప్రేమను తన చుట్టూ ఉన్న ప్రజలకు చూపించటానికి తన శక్తిమేరకు ప్రయత్నించాడు.PPTel 71.4

  హనోకు దేవునితో నడవటం కలలోగాని దర్శనంలోగాని కాదు. తన దైనందిన జీవన విధులన్నిటిలోనూ హనోకు దేవునితో నడిచాడు. అతడు సన్యసించి అరణ్యాలకు వెళ్లి మునీశ్వరుడు కాలేదు. ఎందుకంటే అతడు లోకంలో దేవునికి ఒక పనిని చేయాల్సి ఉన్నాడు. భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, పౌరుడిగా కుటుంబంలోను మనుషులతో తన సంబంధాల్లోను హనోకు దేవునికి నమ్మకమైన స్థిరమైన సేవకుడుగా నివసించాడు. PPTel 72.1

  అతని హృదయం దేవుని చిత్తంతో సమన్వయించింది. ఎందుచేతనంటే “సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా?” ఆమోసు 3:3. పరిశుద్ధమైన ఈ నడక మూడువందల సంవత్సరాలు కొనసాగింది. తమకు కొద్దికాలం మాత్రమే ఉన్నదని గాని లేదా క్రీస్తు రాకడ సంభవించటానికి ఎక్కువ సమయం లేదనిగాని క్రైస్తవులు నిజంగా నమ్మితే వారు మరింత భక్తిగా ఉంటారు. కాగా హనోకు విశ్వాసం శతాబ్దాలు గతించే కొద్దీ మరింత పటిష్టమయ్యింది. అతని ప్రేమ మరింత గాఢమయ్యింది.PPTel 72.2

  హనోకుకు అపూర్వ ప్రతిభ పాటవాలు అపారజ్ఞానం ఉన్నాయి. అతణ్ని తన ప్రత్యేక ప్రత్యక్షతలతో దేవుడు గౌరవించాడు. దేవునితో సంబంధం, ఆయన ఔన్నత్యం, పరిపూర్ణత్వం, స్పృహ నిత్యం తన ముందుంచుకోటంతో అతడు సాత్వీకుడయ్యాడు. దేవునితో తన ఆత్మీయత గాఢమయ్యే కొద్దీ తన దౌర్భల్యం అసంపూర్ణత్వం అతడికి స్పష్టంగా కనిపించాయి.PPTel 72.3

  భక్తిహీనుల దుర్మార్గతను చూసి క్షోభ చెంది, వారి అవిశ్వాసం తన భక్తికి విఘాతం కలిగిస్తుందేమోనని భయపడి, వారితో సాంగత్యం చేయకుండా ఒంటరిగా ఉండి, ధ్యానంలోను ప్రార్ధనలోను సమయం గడిపేవాడు. దేవుని చిత్తమేమిటో తెలుసుకొని దానిననుసరించటానికి స్పష్టమైన జ్ఞానం కోసం ఈ రీతిగా అన్వేషించేవాడు. ప్రార్థన అతనికి ఊపిరి వంటిది. అతడు పరలోక వాతావరణంలో జీవించాడు.PPTel 72.4

  లోకాన్ని జలప్రళయం ద్వారా నాశనం చేయనున్నట్లు దేవుడు హనోకుకు తెలియపర్చాడు. తన రక్షణ ప్రణాళికను కూడా అతడికి దేవుడు సంపూర్తిగా బయలుపర్చాడు. జలప్రళయం తర్వాత జరుగనున్న యుగాల్లో నివసించాల్సి ఉన్న తరతరాల ప్రజల్ని చూపిస్తూ ప్రవచన స్ఫూర్తితో యుగాలగుండా నడిపించి క్రీస్తు రెండో రాకకూ లోకంతానికి సంబంధించిన ఘటనల్ని దేవుడు అతడికి చూపించాడు.PPTel 73.1

  మృతుల విషయం హనోకు ఆందోళన చెందాడు. నీతిమంతులు దుష్టులూ కలిసి మన్ను అవుతారని, అదే తమకు అంతమని భావించాడు. మరణం అనంతరం నీతిమంతులకు ఉన్న నిత్యజీవాన్ని చూడలేకపోయాడు. క్రీస్తు మరణాన్ని సమాధుల్లో ఉన్న తన మృతుల్ని లేపటానికి పరిశుద్ధ దూతలతోను మహామహిమతోను ఆయన రెండోసారి రావటాన్ని ప్రాపంచిక దర్శనంలో దేవుడు అతడికి ప్రత్యక్షపర్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు కాడని క్రీస్తు రాకడ సమయంలో చెప్పేవారు, బింకాలాడేవారు, అహంకారులు, స్వార్థపరులు, దైవధర్మశాస్త్రాన్ని కాలరాచేవారు, క్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని తృణీకరించేవారితో నిండి ఉండే లోకం భ్రష్ట పరిస్థితిని కూడా అతడికి చూపించాడు. నీతిమంతులు మహిమ కిరీటాలతో సన్మానితులు కావటం, దుష్టుల ప్రభువు సన్నిధినుంచి బహిష్కృతులై అగ్నిలో బుగ్గికావటం చూపించాడు.PPTel 73.2

  దేవుడు తనకు ప్రత్యక్షపర్చిన సంగతుల్ని ప్రజలకు బోధిస్తూ హనోకు నీతి ప్రబోధకుడయ్యాడు. దేవునిపట్ల భయభక్తులు గలవారు ఈ భక్తుడి ఉపదేశం పొందటానికి తనతో కలిసి ప్రార్థించటానికి అతడి వద్దకు వెళ్లేవారు. హెచ్చరిక పాటించే వారందరికీ దైవ సందేశాన్ని ప్రకటిస్తూ అతడు బహిరంగ సువార్త సేవ కూడా చేశాడు. అతడి సేవ షేతు వంశీయులకే పరిమితం కాలేదు. కయీను దేవుని సముఖం నుంచి పారిపోయి నివసించిన ప్రాంతంలో కూడా దేవుడు తనకు ప్రత్యక్షపర్చిన దృశ్యాలను ప్రవక్త హనోకు వివరించాడు. “ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తి హీనులందరును భక్తిహీనులుగా చేసినవారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తి హీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారము తోవచ్చెను” యూదా 14:15.PPTel 73.3

  అతడు పాపాన్ని నిర్భయంగా ఖండించాడు. దేవుడు క్రీస్తు ద్వారా తమను ప్రేమిస్తున్నాడని బోధిస్తూ తమ దుష్టత్వాన్ని విడనాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాడు పెచ్చు పెరుగుతున్న దుర్నీతిని ఖండిస్తూ అపరాధులకు దేవుని తీర్పు తప్పదని ఆనాటి ప్రజల్ని హెచ్చరించాడు. క్రీస్తు ఆత్మ హనోకు ద్వారా మాట్లాడాడు. ఆయన ఆత్మ ప్రదర్శితంకావటం. ప్రేమ, కనికరం, విజ్ఞాపన మాటల్లోనే కాదు, పరిశుద్దులు పలికే మెత్తని మాటల్లోనే కాదు రెండంచుల ఖడ్గంలా ఖండించే సత్యాల్ని ప్రకటించటానికి తన సేవకుల హృదయాల్లోను, పెదాలమీద దేవుడు వాటిని పెడతాడు.PPTel 73.4

  తన సేవకుడి ద్వారా దేవుని శక్తి ప్రదర్శితం కావటాన్ని అతడి మాటలు విన్నవారు చూశారు. కొందరు హెచ్చరికను పాటించి తమ పాపాన్ని విడిచి పెట్టారు. అయితే వేలాది ప్రజలు అతడి గంభీర వర్తమానాన్ని ఎగతాళి చేసి మరింత దుర్మార్గతకు పాల్పడ్డారు. చివరి దినాల్లో అలాంటి వర్తమానాన్నే దేవుని సేవకులు లోక ప్రజలకు ప్రకటించాల్సి ఉన్నారు. ప్రజలు ఆ వర్తమానాన్ని విశ్వసించకుండా దైవ సేవకుల్ని ఎగతాళి చేస్తారు. దేవునితో నడిచిన సేవకుడి హెచ్చరిక వర్తమానాన్ని జలప్రళయ పూర్వ ప్రజలు తోసిపుచ్చారు. అలాగే చివరి దినాల్లోని ప్రజలు దైవ సేవకుల హెచ్చరికల్ని పెడచెవిని పెడ్తారు.PPTel 74.1

  కష్టపడి పనిచేస్తున్న సమయంలో సైతం హనోకు దేవునితో తన అనుబంధాన్ని కొనసాగించాడు. పనులు ఎంత కఠినంగా తొందరగా ఉంటే అంత నిలకడగా చిత్తశు ద్ధితో ప్రార్థించేవాడు. కొన్నిసార్లు సమాజం నుంచి తన్నుతాను పూర్తిగా ఉ పసంహరించుకొనేవాడు. ప్రజల మధ్య కొంతకాలముండి ఉపదేశం వల్ల తన ఆదర్శం వల్ల వారికి ఉపచర్యచేసిన తర్వాత దేవుని వద్ద నుంచి ఉపదేశం పొందటానికి ఆకలితోను దాహార్తితోను నిండి ఏకంతంగా కొంతకాలం గడపటానికి వెళ్లిపోయేవాడు. దేవునితో ఈ విధంగా సహవాసం చేస్తూ హనోకు దేవుని స్వరూపాన్ని ప్రతిబింబించాడు. అతని ముఖంలో పరిశుద్ద కాంతి ప్రకాశించింది. అది క్రీస్తు ముఖంలో ప్రకాశించే కాంతివంటిది. దేవునితో ఇలాంటి సహవాస సమావేశాల నుంచి హనోకు వచ్చినప్పుడు భక్తిహీనులు సైతం అతని ముఖంలో దేవుని స్వరూపాన్ని చూసి విస్మయం చెందేవారు.PPTel 74.2

  మానవుల దుర్మార్గత పరాకాష్ఠకు చేరటంతో వారి నాశనం నిశ్చయమయ్యింది. ఏటికి ఏడు గతించే కొద్దీ మానవుల అపరాధాలు ఉప్పెనలా పెల్లుబికటంతో దేవుని తీర్పు మేఘాలు అలముకొన్నాయి. అయినా విశ్వాసానికి సజీవ సాక్షి అయిన హనోకు అపరాధ ఉప్పెనను వెనకకు మళ్లించి ప్రతీకారం పిడుగుల్ని ఆపటానికి తన కృషిని కొనసాగిస్తూ ప్రజలకు హెచ్చరిక చేశాడు. విజ్ఞప్తి చేశాడు, వారిని బతిమాలాడు. విలాసాలు ప్రేమించే దుర్జనులు అతడి హెచ్చరికల్ని లెక్కచేయక పోయినా, తన సేవను దేవుడు అంగీకరించినట్లు గుర్తించి దేవుడు తనను పాపలోకం నుంచి తొలగించి పరలోకానందాన్ని అనుభవించేందుకు తీసుకుపోయే వరకూ లోకంలో ప్రబలుతున్న దుర్మార్గతతో నమ్మకంగా పోరాడాడు.PPTel 74.3

  వెండి బంగారాలు పోగుచేసుకోటానికి గాని ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించటానికిగాని తాపత్రయ పడని అతడి బుద్ధి హీనతను ఆ తరం ప్రజలు వెక్కిరించారు. అయితే హనోకు మనసు నిత్య జీవ సంబంధమైన సిరులపై నిలిచింది. అతడు పరలోక పట్టణాన్ని చూశాడు. సియోను నగరకేంద్రంలో కోటి ప్రభలతో ప్రకాశించే రాజును చూశాడు. అతడి మనసు, అతడి హృదయం పరలోకం మీదే! అతడి సంభాషణ పరలోకాన్ని గురించే! దుర్మార్గత ఎంత ఎక్కువగా ఉంటే పరలోక గృహం గురించి అంత గాఢంగా వాంఛించాడు. ఇంకా లోకంలో ఉండగానే విశ్వాసమూలంగా అతడు దేవుని కాంతి రాజ్యంలో నివసించాడు.PPTel 75.1

  “హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు” మత్తయి 5:8. మూడు వందల సంవత్సరాలుగా దేవునితో సామరస్యాన్ని ఆత్మ శుద్ధిని హనోకు కోరాడు. మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో దినదినమూ మరింత దగ్గర సంబంధాన్ని ఆశించాడు. తాను దేవునికి దగ్గర మరింత దగ్గరవ్వటంతో దేవుడు అతణ్ని పరలోకానికి తన వద్దకు తీసుకుపోయాడు. హనోకు పరలోకం గుమ్మం వద్ద నిలబడ్డాడు. అతడికి నీతిమంతుల నివాసానికి మధ్య ఒక అడుగు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ గుమ్మాలు తెరుచుకున్నాయి. ఎంతో కాలంగా లోకంలో దేవునితో సాగిన నడక కొనసాగింది. పరిశుద్ద పట్టణ గుమ్మాల్లోనుంచి నడిచి అతడు లోపలికి వెళ్లాడు. అక్కడ ప్రవేశించిన మానవుల్లో హనోకు మొదటివాడు.PPTel 75.2

  అతడు లేని లోటు లోకంలో కనిపించింది. హెచ్చరిస్తూ, ఉపదేశిస్తూ ప్రతిరోజూ వినిపించే స్వరం ఇకలేదు. నీతిమంతులు దుర్మార్గులు ఇరువర్గాల వారిలో కొందరు అతడు కొనిపోబడటం చూశారు. తాను ఏకాంతంలో గడిపే స్థలాల్లో ఒక దానికి వెళ్లి ఉండవచ్చునని భావించి అతణ్ని ప్రేమించినవారు అతడికోసం వెదికారు - అనంతర కాలంలో ఏలియా కోసం ప్రవక్తల కుమారులు వ్యర్థంగా వెదికినట్లు. దేవుడు తీసుకుపోయాడు గనుక అతడు కనిపించలేదని వారు నివేదించారు.PPTel 75.3

  హనోకుకు పరలోకానికి తీసుకువెళ్లడం ద్వారా ముఖ్యమైన పాఠం నేర్పించాలని దేవుడు ఉద్దేశించాడు. ఆదాము పాపం పర్యవసానాలవల్ల మనుషులు అధైర్యం చెందే ప్రమాదముంది. “మొత్తం మానవజాతిమీద దైవశాపం నిలిచి అందరికీ మరణం ప్రాప్తిస్తున్నది గనుక, మేము దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు ఆచరించటం ఏమి లాభం?” అని ప్రశ్నించటానికి అనేకులు సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుడు ఆదాముకు ఇవ్వగా షేతు పునరుద్ఘాటించిన, హనోకు ఆచరించిన ఉపదేశం ఆ చీకటిని తొలగించి ఆదాము మూలంగా మరణం వచ్చినట్లే వాగ్రత్త విమోచకుడి మూలంగా జీవం అమరత్వం వస్తాయన్న నిరీక్షణను మానవుడిలో రగిలించింది. నీతిమంతులకు ప్రతిఫలం లేదని దుష్టులకు శిక్షలేదని దేవుని ధర్మ విధుల్ని ఆచరించటం మానవులకు సాధ్యంకాదని మనుషుల్ని నమ్మించటానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. కాగా హనోకు సందర్భంగా “ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి వలము దయచేయువాడనియు” ప్రభువు నిరూపించుకొన్నాడు. హెబ్రీ 11:6. తన ఆజ్ఞల్ని అనుసరించి నివసించేవారిని తాను ఎలా వృద్ధిపర్చుతాడో ఆయన చూపిస్తున్నాడు. మానవులు దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరించటం సాధ్యమేనని, దుర్నీతి మధ్యపాపం మధ్య నివసించినప్పుడు సైతం తాము దేవుని కృపవల్ల శోధనల్ని జయించి పవిత్ర పరిశుద్ధ జీవితం జీవించగలిగామని వారు బోధించారు. హనోకు ఆదర్శంలో ప్రజలు అలాంటి పరిశుద్ధ జీవితాన్ని చూశారు. దేవునికి విధేయులై నివసించేవారికి ప్రతిఫలంగా భవిష్యత్తులో ఆనందంతో మహిమతో నిండిన నిత్యజీవం ఉందనీ, అపరాధికి దు:ఖం మరణం ఉన్నాయని ప్రవచించి బోధించిన సత్యానికి హనోకు పరలోకానికి కొనిపోబడటం ప్రబల నిదర్శనం.PPTel 75.4

  “విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను” హెబ్రీ 11:5. పాపంతో నిండి నాశనానికి సిద్ధంగా ఉన్నలోకంలో హనోకు దేవునికి ఇష్టుడై నివసించటంచేత దేవుడు అతణ్ని మరణం ప్రాబల్యం కిందకి రానివ్వలేదు. క్రీస్తు రెండోరాక సమయంలో “భూలోకమునుండి కొనబడినవారు” (ప్రకటన 14:3) సాధించాల్సిన పరిశుద్ధ స్థితిని ఈ ప్రవక్త పరిశుద్ధ ప్రవర్తన సూచిస్తుంది. జలప్రళయం ముందున్న ప్రపంచంలోలాగే క్రీస్తు రాకకు ముందుండే ప్రపంచంలో కూడా పాపం పెచ్చరిల్లుతుంది. తమ మనసుల్లోని దురాలోచనలు, మోసకరమైన తత్వబోధనల ప్రేరణతో మనుషులు దేవుని అధికారం పై తిరుగుబాటు చేస్తారు. కాని దైవ ప్రజలు హనోకులా ప్రభువు రెండోరాక గురించి, అపరాధులకు కలిగే శిక్షను గూర్చి హెచ్చరించి తమ మాటల ద్వారాను పరిశుద్ధ జీవితం ద్వారాను భక్తిహీనుల పాపాల్ని ఖండిస్తారు. లోకాన్ని నీటితో నాశనం చేయకముందు హనోకును పరలోకానికి తీసుకొనిపోయినట్లే భూమిని అగ్నితో నాశనం చేయకముందు జీవించి ఉన్న నీతిమంతుల్ని భూమి మీదనుంచి దేవుడు పరలోకానికి తీసుకువెళ్తాడు. అపొస్తలుడంటున్న మాటలివి - “మన మందరము నిద్రించముగాని నిమిషములో ఒక రెప్పపాటున కడ బూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము” “ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము ఉండి ప్రభువు దిగివచ్చును” “బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయములుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము” “క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి” 1 కొరి. 15:51, 52, 1 థెస్స 4:16-18.PPTel 76.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents