Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  32—ధర్మశాస్త్ర నిబంధనలు

  తమ సృష్టి సమయంలో ఆదామవ్వలకు దైవధర్మ శాస్త్రాన్ని గూర్చిన జ్ఞానం ఉంది. తాము నిర్వర్తించాల్సి ఉన్న దర్మ విధులేంటో వారు ఎరిగే ఉన్నారు. ధర్మశాస్త్ర సూత్రాలు వారి హృదయాల్లో లిఖితమై ఉన్నాయి. మానవుడు పాపంవల్ల భ్రష్టుడైనప్పుడు దైవ ధర్మశాస్త్రంలో మార్పు కలుగలేదు. కాని అతణ్ని తిరిగి విధేయమార్గంలోకి తేవటానికి ఒక పరిహారార్థక వ్యవస్థ ఏర్పాటయ్యింది. దేవుడు రక్షకుని గూర్చిన వాగ్దానం ఇచ్చాడు. పాప పరిహారార్థ బలిగా క్రీస్తు మరణాన్ని సూచించే బలి అర్పణల వ్యవస్థ స్థాపిత మయ్యింది. అయితే ధర్మశాస్త్ర ఉల్లంఘన జరిగి ఉండకపోతే మరణం ఉండేది కాదు. రక్షకుని అవసరం ఉండేది కాదు. బలి అర్పణల అవసరం ఉండేది కాదు.PPTel 353.1

  ఆదాము తన బిడ్డలకు దేవుని ధర్మశాస్త్ర విధులను బోధించాడు. అనంతర యుగాల్లో అవి తండ్రి నుంచి కుమారుడుకి సంక్రమిస్తూ వచ్చాయి. మానవుడి రక్షణ నిమిత్తం ఇంత చక్కని ఏర్పాటు జరిగినా దాన్ని అంగీకరించి అనుసరించినవారు అరుదు. పాపం వలన లోకం దుర్నీతితో నిండగా దాన్ని ప్రక్షాళనం చెయ్యటానికి జలప్రళయం అవసరమయ్యింది. నోవహు అతని కుటుంబీకులు దైవ ధర్మశాస్త్రాన్ననుసరించి నివసించారు. నోవహు తన సంతతివారికి పది ఆజ్ఞల్ని నేర్పించాడు. మనుషులు మళ్లీ భ్రష్టులవ్వటంతో దేవుడు అబ్రాహామును ఎంపిక చేసుకొన్నాడు. అబ్రాహాము గురించి దేవుడిలా అన్నాడు, “అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడాలను, నా నియములను గైకొనెను” ఆదికాండము 26:5. దేవుడు అబ్రహాముకు సున్నతి సంస్కారాన్నిచ్చాడు. దీన్ని పొందినవారు దైవ సేవకు అంకితమయి ఉంటా రనటానికి విగ్రహారాధనకు దూరంగా ఉండి దైవ ధర్మవిధుల్ని ఆచరిస్తారనటానికి ఇది ఒక చిహ్నం.ఈ నిబంధన మేరకు నివసించటంలో అబ్రాహాము సంతతివారు విఫలులయ్యారు. అన్యులతో పొత్తులు కుదుర్చుకోటంలో, వారి ఆచారాల్ని అభ్యాసాల్ని ఆచరించటంలో వారి వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపించింది. వారి ఈ వైఫల్యమే వారు ఐగుప్తుకు వెళ్లటానికి అక్కడ దాసత్వంలో సతమతమవ్వటానికి కారణమయ్యింది. కాగా విగ్రహారాధకులతో వారి సంబంధ బాంధవ్యాలవల్ల ఐగుప్తీయులకు లొంగి జీవించాల్సి వచ్చింది. అన్యమత దుర్బోధల ప్రభావం వల్ల వారి దైవ ధర్మసూత్రాలు మరింత కలుషితం అయ్యాయి. అందుచేత ప్రభువు వారిని ఐగుప్తు దాస్యంలోనుంచి వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు దేవదూతల మధ్య ప్రకాశమానమైన మేఘస్తంభంలో ఉండి సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఇశ్రాయేలీయులు వింటుండగా తన ధర్మ శాసనాన్ని మహా ప్రభావంతో ప్రకటించాడు.PPTel 353.2

  ప్రజలు తన ధర్మశాసనాల్ని మరచిపోయే వీలున్నది. అందుచేత వారు జ్ఞాపకముంచు కొంటారని విడిచి పెట్టక ప్రభువు రాతి పలకలమీద వాటిని రాశాడు. తన ధర్మవిధులతో అన్యమత సంప్రదాయాలు మిళితం చేసే అవకాశాన్ని లేదా తన విధులకు మానవాచారాలకు మధ్య గలిబిలి పుట్టించే అవకాశాన్ని ప్రభువు తొలగించాడు. అయినా ఆయన పది ఆజ్ఞల్నివ్వటంతోనే ఆగిపోలేదు. తమను తప్పుమార్గం పట్టించటం సులభమని ప్రజలు నిరూపించుకొన్నారు. కనుక వారు శోధనలో పడకుండా జాగ్రత్తలు పాటించాడు. వారి విధులను గూర్చిన చట్టాలు నిబంధనల వివరాల్ని తాను చెప్పగా రాయాల్సిందిగా ప్రభువు మోషేని ఆదేశించాడు. ఈ ఆదేశాలు ప్రజల విధులకు సంబంధించినవి. దేవుని పట్ల, ఒకరిపట్ల ఒకరికి, పరదేశుల పట్ల ప్రజలకు గల విధుల్ని సూచించే నియమాలు ఈ పది ఆజ్ఞల సూత్రాలు అయితే వాటిని విపులపర్చి ఎవరూ పొరపడటానికి తావులేని రీతిలో ఇచ్చాడు. దాని పరమోద్దేశం రాతి పలకలమీద రాసిన పరిశుద్ధమైన పది నీతి సూత్రాల్ని పరిరక్షించటం.PPTel 354.1

  ఆదాము పొందిన రూపంలో నోవహు కాపాడిన రీతిగా, అబ్రాహాము ఆచరించిన తీరుగా మానవుడు దైవ ధర్మశాసనాల్ని గైకొని ఉంటే, సున్నతి సంస్కారం అగత్య మయ్యేదే కాదు. సున్నతి ఏ నిబంధనకు సంకేతమో ఆ దైవ నిబంధనను అబ్రాహాము సంతతివారు ఆచరించి ఉంటే వారు విగ్రహారాధనకు ఆకర్షితులయ్యేవారు కారు. ఐగుప్తులో వెట్టిచాకిరీ చేసే దాసులుగా పలురీతి బాధలకు గురి అయ్యేవారూకాదు. దేవుని ధర్మవిధుల్ని మనసులో ఉంచుకొనేవారు. కాబట్టి వాటిని సీనాయి పర్వతం మీద నుంచి ప్రకటించాల్సిన అవసరంగాని రాతి పలకలమీద చెక్కాల్సిన అవసరంగాని ఉండకపోవును. పది ఆజ్ఞల్లోని నీతి నియమాల్ని మనుషులు ఆచరించి ఉంటే దేవుడు మో షేకి ఇచ్చిన అదనపు ఉపదేశం అవసరమయ్యేది కాదు.PPTel 354.2

  దేవుడు ఆదాముకి ఇచ్చిన బలి అర్పణ వ్యవస్థను కూడా ఆదాము సంతతివారు వక్రీకరించారు. దేవుడు నియమించిన ఈ సామాన్యమైన, ప్రాముఖ్యమైన పరిచర్యను మూఢనమ్మకం, విగ్రహారాధన, విచ్చలవిడి ప్రవర్తన భ్రష్టపర్చాయి. గుడార నిర్మాణం పూర్తి అయిన తర్వాత దేవుడు కరుణాపీఠం మీది మహిమలోనుంచి మోషేతో మాట్లాడూ గుడారంలో జరగాల్సిన బలి అర్పణ వ్యవస్థను గూర్చి ఆరాధన పద్ధతుల్ని గూర్చి పూర్తి ఉపదేశాన్ని ఇచ్చాడు.PPTel 354.3

  ఆచారాలకు సంబంధించిన శాసనాన్నుపయోగించి నీతి ధర్మశాస్త్రం రద్దయ్యిందని రుజువు చేయటానికీ, ఈ రెండు వ్యవస్థల్ని మిళితం చేయటానికి అనేకమంది ప్రయత్నిస్తున్నారు. ఇది లేఖనాన్ని వక్రీకరించే ప్రయత్నం. ఈ రెండు వ్యవస్థల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆచార సంబంధిత వ్యవస్థ క్రీస్తును ఆయన బలిదానాన్ని ఆయన యాజకత్వాన్ని సూచించే గుర్తులతో కూడి ఉన్నది. బలులు ఆచారాలతో కూడిన ఈ ఆచార ధర్మశాస్త్రం లోకపాపాలు భరించే దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు మరణంలో ఛాయారూపమై దాని వాస్తవ రూపమైన క్రీస్తలో నెరవేరేవరకు హెబ్రీ ప్రజలు ఆచరించాల్సి ఉన్న ధర్మశాస్త్రం అది. అప్పుడు సమస్త బలి అర్పణులు అంతం కావాల్సి ఉన్నాయి. క్రీస్తు “మేకులతో సిలువకు కొట్టి.. మనము అడ్డము లేకుండ... ఎత్తివేసిన”ది ఈ ధర్మశాస్త్రమే, కొలస్స 2:15. కాగా పది ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని గూర్చి కీర్తన కారుడిలా అంటున్నాడు, “యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది” కీర్తనలు 119:89. స్వయాన క్రీస్తే ఇలా అంటున్నాడు, “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకేగాని కొట్టివేయు టకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్ర మంతయు నెరవేరు వరకు దాని నుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” మత్తయి 5:17, 18. ఇక్కడ ధర్మశాస్త్రం నిర్దేశిస్తున్న ధర్మవిధుల్ని కేవలం బోధించటమే గాక ఆ విధులు భూమి ఆకాశం ఉన్నంతకాలం నిలిచి ఉంటాయని ఆయన వెల్లడిచేస్తున్నాడు. దైవ సింహాసనంలా దైవ ధర్మశాస్త్రం మార్పులేనిది. అన్నియుగాల్లోని మనుషులకూ దాని విధులు ఆచరణీయాలు.PPTel 355.1

  సీనాయి పర్వతం మీద నుంచి దేవుడు ప్రకటించిన ధర్మశాసనం గురించి నెహెమ్యా ఇలా అంటున్నాడు, “సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలురకములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి” నెహెమ్యా 9:13. “అన్య జనులకు అపొస్తలుడు” అయిన పౌలు ఇలా అంటున్నాడు, “ధర్మ శాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునైయున్నది” రోమా 7:12. ఇది పది ఆజ్ఞల ధర్మశాసనం తప్ప మరేమీ కాదు. ఎందుచేతనంటే ఆశింపవద్దని” చెబుతున్నది “ధర్మశాస్త్రమే”. 7వ వచనం.PPTel 355.2

  రక్షకుని మరణంతో ముంగుర్తులు ఛాయలు రద్దుపడగా నీతి ధర్మశాస్త్రాన్ని అది రద్దు చేయలేదు. ఇంకా చెప్పాలంటే, ఆ ధర్మశాస్త్ర అతిక్రమానికి ప్రాయశ్చిత్తంగా క్రీస్తు మరణించటం అవసరం కావటం ధర్మశాస్త్రం మార్పులేనిదని రుజువు చేస్తున్నది. యూదుల యుగాన్ని చీకటి యుగంగా, హెబ్రీయుల మతాన్ని గుర్తులు ఆచారాలతో నిండిన మతంగా వ్యవహరించేవారే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి పాత నిబంధనని రద్దు చేయటానికి క్రీస్తు వచ్చాడని చెబుతారు. ఇది పొరపాటు. దేవుడు తాను ఎంపిక చేసుకొన్న ప్రజలతో వ్యవహరించే తీరును గూర్చిన దాఖలాలు పరిశుద్ధ చరిత్ర పొడవునా ఉన్నాయి. నేను ఉన్నవాడను అని తెలుపుకొన్న ఆ సర్వోన్నత దేవుని ఆనవాళ్లు వాటిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు తనను మాత్రమే తమ రాజుగా గుర్తించిన కాలంలో ఆయన తన మహాశక్తి మహిమల్ని మానవ మాత్రులికి ప్రదర్శించినంతగా ఎన్నడూ ప్రదర్శించలేదు. ఇక్కడ రాజ దండం మానవుడి చేతిలో లేదు. కనిపించకుండా రాజ్యపాలన చేసిన ఇశ్రాయేలు రాజు కార్యకలాపాలు అత్యంత వైభవంగా గంభీరంగా సాగాయి.PPTel 355.3

  ఈ దైవ సన్నిధి ప్రత్యక్షతలన్నిటిలోను దేవుని మహిమ క్రీస్తు ద్వారా ప్రదర్శితమయ్యింది. కేవలం రక్షకుడు వచ్చినప్పుడే కాక మానవుడి పతనం, విమోచన వాగ్దానం అనంతరం అన్ని యుగాల్లోనూ “దేవుడు... క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు” కొంటూ ఉన్నాడు. 2 కొరింథీ 5:19. పితరుల యుగం యూదుల యుగం రెండింటిలోనూ బలి అర్పణ వ్యవస్థకు క్రీస్తు పునాది, కేంద్ర బిందువూను. మన ఆది తల్లిదండ్రులు ఆదామవ్వల పాపం అనంతరం దేవునికి మానవుడికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు. తన విజ్ఞాపన సేవ ద్వారా క్రీస్తు మానవుల్ని విమోచించి దేవుని ధర్మశాస్త్ర అధికారాన్ని పరిశుద్ధతను నిరూపించేందుకుగాను తండ్రి కుమారునికి లోకాన్ని అప్పగించాడు.PPTel 356.1

  పడిపోయిన మానవుడికి పరలోకానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు క్రీస్తు ద్వారానే జరగాల్సి ఉన్నాయి. మన మొదటి తల్లిదండ్రులు ఆదామవ్వలకు విమోచన వాగ్దానా న్నిచ్చింది క్రీస్తే. పితరులకు ప్రత్యక్షమయ్యింది క్రీస్తే. ఆదాము, నోవహు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే సువార్తను అవగాహన చేసుకొన్నారు. మానవుడికి ప్రత్యామ్నాయం ద్వారాను పూచీకత్తు (పూటకాపు) ద్వారాను కలిగే రక్షణకు వారు ఎదరుచూశారు. ఈ పరిశుద్ద భక్తులు మానవుడుగా లోకంలోకి రానున్న రక్షకునితో మాట్లాడారు. వారిలో కొందరైతే క్రీస్తుతోను దేవదూతలతోను ముఖాముకి మాట్లాడారు.PPTel 356.2

  క్రీస్తు ఇశ్రాయేలీయులకు నాయకుడు మాత్రమే కాదు. యెహోవా నామం గల దూతగా మేఘస్తంభంలో మరుగై ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినవాడు క్రీస్తే. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్నిచ్చినవాడు క్రీస్తే. సీనాయి మీది బ్రహ్మాండమైన మహిమలోనుంచి తన తండ్రి ధర్మశాస్త్రంలో పది నీతి సూత్రాల్ని ప్రకటించింది క్రీస్తే. ధర్మశాస్త్రాన్ని రాతిపలకలమీది రాసి మోషేకి ఇచ్చింది ఆయనే. ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడింది క్రీస్తే.PPTel 356.3

  అపొస్తలుడైన పేతురు క్రైస్తవ సంఘానికి రాస్తూ “మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడూ ఆత్మయే కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి” అంటున్నాడు. 1 పేతురు 1:10, 11. పాత నిబంధన గ్రంథంలో మనతో మాట్లాడే స్వరం క్రీస్తుదే “యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము” ప్రకటన 19:10.PPTel 357.1

  యేసు మానవునిగా లోకంలో నివసించిన రోజుల్లో తాను బోధించిన బోధనల్లో ప్రజలు గమనాన్ని పాత నిబంధన పైకి తిప్పేవాడు. యూదులతో ఇలా అన్నాడు, “లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించు చున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” యోహాను 5:39. అప్పటికి ఉనికిలో ఉన్న బైబిలు పాత నిబంధన పుస్తకాలు మాత్రమే. దైవ కుమారుడు “వారి యొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు, వారి మాటలు వినవలెను” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు, “మో షేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు వినని యెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరు” లూకా 16:29, 31. PPTel 357.2

  ఆచార శాసనాన్ని క్రీస్తే ఇచ్చాడు. దాన్ని ఆచరించాల్సిన అవసరం ఇక లేకపోయినా రక్షణ ప్రణాళికలో దాని విలువను, క్రీస్తు సేవతో దాని సంబంధాన్ని వివరిస్తూ పౌలు దాన్ని యూదులకు విశదీకరించాడు. ఈ శాసనం ఎంతో మహిమకరమయ్యిందని దాని కర్త అయిన దేవునికి మల్లే అది యోగ్యమైందని పౌలు ప్రశంసించాడు. అది భావితరాల్లో ప్రకటితం కానున్న సత్యాల్ని సూచిస్తున్నది. గుడార పరిచర్య ఇశ్రాయేలీయుల ప్రార్థనలతో సమ్మిళితమై పైకి వెళ్లే పరిమళ ధూపం అయిన పాపి ప్రార్థనను దేవునికి అంగీకృతం చేయగల క్రీస్తు నీతిని సూచిస్తున్నది. రక్తం కారుతూ బలిపీఠం మీద ఉన్న బలిరానున్న విమోచకునికి సాక్షి. అంతట అతి పరిశుద్ధ స్థలం నుంచి దేవుని ప్రత్యక్ష సన్నిధి ప్రకాశించేది. అంధకారం మత భ్రష్టత కొనసాగిన యుగాల్లో వాగ్దత్త మెస్సీయరాక వరకూ మనుషుల హృదయాల్లో ఈ విధంగా విశ్వాసం కొనసాగింది.PPTel 357.3

  మానవుడిగా యేసు లోకంలోకి రాకపూర్వం ఆయన తన ప్రజలకు లోకానికి వెలుగై ఉన్నాడు. లోకాన్ని ఆవరించిన చీకటిని చెండాడిన మొదటి కాంతి రేఖ క్రీస్తు వద్ద నుంచి వచ్చింది. ఈలోక నివాసులపై ప్రకాశిస్తున్న ప్రతీకాంతికిరణం ఆయన వద్దనుంచే వస్తున్నది. రక్షణ ప్రక్రియలో క్రీస్తే అదీ అంతం, మొదటివాడు కడపటివాడు.PPTel 358.1

  “మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు” (హెబ్రీ 9:24) క్రీస్తు మన పాప పరిహారం నిమిత్తం తన రక్తం చిందించి పరలోకానికి వెళ్లినప్పటినుంచి కల్వరి సిలువ నుంచి పరలోక గుడారంలోని పరిశుద్ధ స్థలాల నుంచి వెలుగు ఏరులా ప్రవహిస్తూ ఉన్నది. అయితే మనకు వచ్చిన స్పష్టమైన వెలుగు, రక్షకుని రాకను, సూచిస్తూ పూర్వకాలంలో గుర్తులు ముంగురుల ద్వారా వచ్చిన వెలుగును తృణీకరించటానిక దారితీయకూడదు. క్రీస్తు సువార్త యూదుల ఆచారాలపై సమాచారం అందిస్తున్నది. అది ఆచార శాసనానికి ప్రాధాన్యం ఇస్తున్నది. కొత్త సత్యాలు వెలుగులోకి రావటం, మొదటి నుంచి తెలిసిన విషయాలు మరింత స్పష్టంగా అవగాహన అవ్వటం జరిగినప్పుడు తన ప్రజలతో దేవుడు వ్యవహరించే తీరులో ఆయన ప్రవర్తన, ఆయన సంకల్పాలు ప్రస్ఫుటమౌతాయి. మనం పొందే ప్రతి అదనపు కాంతికిరణం రక్షణ ప్రణాళికపై మనకు స్పష్టమైన అవగాహనను కలిగిస్తుంది. మానవ రక్షణ నిమిత్తం దేవుని కార్యాచరణను ఈ ప్రణాళిక వివరిస్తుంది. మనకు లేఖనంలో కొత్త సౌందర్యం కొత్త శక్తి కనిపిస్తాయి. దైవ గ్రంథాన్ని మనం గొప్ప ఆసక్తితో పఠిస్తాం.PPTel 358.2

  హెబ్రీయులకీ బైట ప్రపంచానికీ మధ్య దేవుడు ఒక అడ్డుగోడ నిర్మించాడని తక్కిన మానవుల పై నుంచి తన ప్రేమను ఉపసంహరించుకొని దాన్ని ఇశ్రాయేలీయుల పై కేంద్రీకరిస్తున్నాడని ఒక అభిప్రాయం పలువురిలో ఉంది. ప్రజలు తమకు తమ తోటి మనుషులకు మధ్య అడ్డుగోడలు నిర్మించుకోటం దేవుని ఉద్దేశం కానే కాదు. అంతులేని ప్రేమగల దేవుని ప్రేమ లోకంలోని ప్రజలందరిపట్ల ఉన్నది. ప్రజలు తనను విసర్జించినప్పటికీ వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకోటానికి తన ప్రేమను కృపను వారికి పంచటానికి ఆయన ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాను ఎంపిక చేసుకొన్న ప్రజలకు తన ఆశీర్వాదాల్ని ఇచ్చాడు. వారు ఇతరులకు దీవెనకరంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం.PPTel 358.3

  దేవుడు అబ్రాహామును పిలిచాడు. అతణ్ని వర్ధిల్లజేసి గౌరవ పాత్రుణ్ణిచేశాడు. ఆ పితరుడి విశ్వసనీయత తాను ఎక్కడెక్కడ సంచరించాడో అక్కడ ప్రజలకు గొప్ప వెలుగుగా ప్రకాశించింది. తన చుట్టూ ఉన్న ప్రజల్ని విడిచి అబ్రాహాము ఏకాంతంలోకి వెళ్లిపోలేదు. తనచుట్టూ ఉన్న రాజ్యాల రాజులతో అబ్రాహాము స్నేహ సంబంధాలు కలిగి నివసించాడు. కొందరు రాజులు అబ్రాహామును ఎంతో గౌరవించారు. అతని నిజాయితీ, చిత్తశుద్ధి, అతని సాహసగుణం, దాతృత్వం దేవుని ప్రవర్తనను ప్రతిబింబిం చాయి. మెసొపొతమియ ప్రజలకు, కనాను ప్రజలకు, ఐగుప్తు ప్రజలకు సొదొమ ప్రజలకు సైతం తన ప్రతినిధుల ద్వారా దేవుడు పరిచయమయ్యాడు.PPTel 358.4

  కనుక ఐగుప్తీయులకి, శక్తిమంతమైన ఆ రాజ్యంతో సంబంధ బాంధవ్యాలున్న అన్ని జాతులకు యోసేపు ద్వారా దేవుడు తన్నుతాను ప్రత్యక్షపర్చుకొన్నాడు. ఐగుప్తు ప్రజల మధ్య యోసేపును ఘనపర్చటానికి దేవుడు ఎందుకు ఎంపిక చేసుకొన్నాడు? యాకోబు సంతతి పట్ల తన సంకల్పాల్ని దేవుడు మరో విధంగా నెరవేర్చుకోగలిగే వాడే. కాని యోసేపును వెలుగుతో నింపి పారలౌకికమైన ఆ ప్రకాశం పరిసర ప్రాంతాలకు విస్తరించేందుకుగాను అతణ్ణి రాజు కోటలో ఉంచాడు. తన జ్ఞానం మూలంగా, తన న్యాయదృష్టి మూలంగా, తన దినదిన పవిత్ర జీవితంలో ప్రజా శ్రేయస్సు పై అనురక్తి మూలంగా, అందునా విగ్రహారాధకులైన ఆ ప్రజల విషయంలో తన ఆసక్తి మూలంగా యోసేపు క్రీస్తు ప్రతినిధి అయ్యాడు. ఎవరిపట్ల ఐగుప్తు దేశంయావత్తు కృతజ్ఞతతో ప్రశంసలతో నిండి ఉన్నదో ఆ యోసేపులో ఆ అన్యజనులు తమ సృష్టికర్త విమోచకుడు అయిన క్రీస్తును వీక్షించాల్సి ఉన్నారు. అలాగే దేవుడు మో షేలో కూడా తన వెలుగును పెట్టి అతణ్ని లోకంలో మిక్కిలి శక్తిమంతమైన రాజ్య సింహాసనం పక్కన ఉంచాడు. ఎంపిక చేసుకొన్న వారందరూ నిజమైన, సజీవుడైన దేవుని గూర్చి తెలుసుకోవాలన్నది ఆయన ఉద్దేశం. తీర్పుల రూపంలో తన హస్తాన్ని ఐగుప్తీయుల మీద చాపకముందు దేవుడు ఈ వెలుగు వారికి ఇచ్చాడు. PPTel 359.1

  ఐగుప్తునుంచి ఇశ్రాయేలీయుల విడుదలలో దేవుని శక్తిని గూర్చిన జ్ఞానం అన్నిచోట్లా వ్యాపించింది. యుద్ధ శూరులైన ఎరికో ప్రజలు వణకారు. రాహాబు ఇలా అన్నది, “మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట వట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు” యెహోషువ 2:11. నిర్గమం జరిగిన కొన్ని శతాబ్దాల తర్వాత ఫిలిప్తీయుల యాజకులు ఐగుప్తు తెగుళ్లను గురించి తమ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలీయుల దేవుణ్ని ప్రతిఘటించవద్దని హెచ్చరించారు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని పిలిచి వారిని ఆశీర్వదించి ఘనపర్చటం వారు ఆయన ఆజ్ఞల్నిగైకొని తద్వారా ఆయన దీవెనల్ని తామే సొంతం చేసుకొనేందుకు కాదు. కాని వారి ద్వారా లోక ప్రజలందరికీ తన్నుతాను ప్రత్యక్షపర్చుకోవాలన్నదే ఆయన ఉద్దేశం. ఈ కర్తవ్య సిద్ధి కోసమే వారు తమ చుట్టూ ఉన్న విగ్రహారాధక ప్రజలతో కలిసిపోకుండా వేరుగా ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఆదేశించాడు. విగ్రహారాధన దాని వెంట ఉండే పాపాలంటే దేవునికి హేయం. అందుకే తన ప్రజలు ఇతర ప్రజలతో మమేకం కాకూడదని “వారి క్రియల వంటి క్రియలు” చేసి దేవుని మరిచిపోకూడదని ఆజ్ఞాపించాడు, వారి మనసులు తనకు దూరమైపోకుండా ఉండే నిమిత్తం విగ్రహారాధకులతో వారి వివాహాల్ని నిషేధించాడు. దైవ ప్రజలు “పవిత్రమును నిష్కళంకమునైన” ప్రవర్తన కలిగి ఉండటం అప్పుడెంత ముఖ్యమో ఇప్పుడూ అంతే ముఖ్యం. వారు లౌకిక స్ఫూర్తికి దూరంగా ఉండాలి ఎందుచేతనంటే అది సత్యానికి నీతికి విరుద్ధం. కాగా తన ప్రజలు స్వనీతిపరులై లోకంతో సంబంధ బాంధవ్యాలు తెంచుకొని, లోకంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా ఏకాకిగా నివసించాలన్నది దేవుని ఉద్దేశం కాదు.PPTel 359.2

  క్రీస్తు అనుచరులు తమ ప్రభువుకుమల్లే లోకానికి వెలుగై నివసించాలి. రక్షకుడిలా అన్నాడు, “కొండమీదనుండు పట్టణము మెరుగైయుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చు టకై దీపస్తంభము మీద పెట్టుదురు” - అనగా లోకంలో. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, “మనుష్యులు మీ సత్కియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” మత్తయి 5:14-16. హనోకు, అబ్రాహాము, యోసేపు, మోషే ఇదే చేశారు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈ పనే చెయ్యాలని దేవుడు సంకల్పించాడు. PPTel 360.1

  తమ వెలుగును తమ చుట్టూ ఉన్న ప్రజలకు పంచే బదులు దాన్ని దాచివేయటానికి నడిపించింది సాతాను అదుపు కింద ఉన్నవారి దుష్ట అవిశ్వాస హృదయమే. అన్యుల దురాచారాల్ని అవలంబించటానికి లేక దేవుని శ్రద్ధాసక్తులు కేవలం తమ పైనే ఉన్న వన్నట్లు తమ్మును తాము ప్రత్యేకించుకొని ప్రజలకు దూరంగా ఉండటానికి వారిని నడిపించింది ఈ దురభిమానమే.PPTel 360.2

  ఒకటి మార్పులేనిది నిత్యమైనది, రెండోది స్వల్పకాలికము తాత్కాలికమైనది అని రెండు ధర్మశాస్త్రాలు బైబిలులో ఉన్నట్లే రెండు నిబంధనలు కూడా ఉన్నాయి. మానవుడి పతనం అనంతరం స్త్రీ సంతానం సర్పం తల చితకకొడ్తాడు అన్న వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మొదటి కృపానిబంధన ఏదెనులో మానవుడితో ఖరారయ్యింది. ఈ నిబంధన మానవులందరికీ క్షమాపణనూ క్రీస్తుపై విశ్వాసం ద్వారా భవిష్యత్తులో విధేయతకు దోహదం చేసే కృపనూ అనుగ్రహించింది. ధర్మశాస్త్రానికి విధేయత షరతు పై వారికి నిత్య జీవంకూడా వాగ్దానం చేసింది. ఈ రీతిగా పితరులు రక్షణ నిరీక్షణ పొందారు.PPTel 360.3

  “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును” ఆది 22:18 అన్న వాగ్దానం ద్వారా ఈ నిబంధననే దేవుడు అబ్రాహాముతో ఖరారు చేశాడు. ఈ వాగ్దానం క్రీస్తును సూచించింది. అబ్రాహాము దాన్ని అవగాహన చేసుకొన్నాడు (గలతీ 3:8, 16 చూడండి). పాప క్షమాపణకు క్రీస్తును విశ్వసించాడు. ఈ విశ్వాసమే అతనికి నీతిగా పరిగణించబడింది. అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన దైవ ధర్మశాస్త్ర అధికారాన్ని కూడా కాపాడింది. ప్రభువు అబ్రాహాముకి కనిపించి ఇలా అన్నాడు, “నేను సర్వశక్తిగలదేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము”ఆది 17:1. నమ్మకమైన తన సేవకుడి విషయంలో దేవుని సాక్ష్యం ఇలాగుంది, “అబ్రాహాము నా మాటవిని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెను” ఆది 26:5. ప్రభువు అతనితో ఇలా అన్నాడు, “నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనైయుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలోని సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను”. ఆది 17:7.PPTel 361.1

  దేవుడు ఈ నిబంధనను ఆదాముతో చేసి అబ్రాహాముకు పునరుద్ఘాటించిన దాన్ని క్రీస్తు మరణించేదాకా ధ్రువపర్చలేదు. విమోచనను గూర్చిన ప్రకటన జరిగినప్పటి నుంచి అది దైవ వాగ్దాన రూపంలో ఉనికిలో ఉంది. మానవుడు దాన్ని విశ్వాస మూలంగా అంగీకరించాడు. క్రీస్తు ధృవపర్చినప్పుడు అది కొత్త నిబంధన అయ్యింది. ఈ నిబంధనకు ఆధారం దైవ ధర్మశాస్త్రం. మానవుల్ని మళ్లీ దైవ చిత్రానికనుగుణంగా నివసించేటట్లు నడిపించి, దైవ ధర్మశాస్త్రం ఆచరించటానికి అనువైన స్థితి వారికి కల్పించటానికి అది చక్కని ఏర్పాటు.PPTel 361.2

  లేఖనంలో “పాత” నిబంధన అని పిలువబడున్నది సీనాయి వద్ద దేవునికి ఇశ్రాయేలీయులికి మధ్య జరిగింది. ఆ మీదట అది క్రీస్తు రక్తం వలన ధ్రువీకరణ పొంది ఆ తర్వాత బలి పశువు రక్తం ద్వారా ధ్రువీకృతమయ్యింది. అబ్రాహాముతో జరిగిన నిబంధన క్రీస్తు రక్తం వలన ధ్రువీకరణ పొందింది. దానికి “రెండో” నిబంధన లేదా “కొత్త” నిబంధన అన్న పేరు కలిగింది. ఎందుకంటే అది ఏ రక్తంతో ముద్రిత మయ్యిందో అది మొదటి నిబంధన రక్తం అనంతరం చిందించబడ్డ రక్తం. ఈ కొత్త నిబంధన అబ్రాహాము దినాల్లో అమల్లో ఉంది. దాన్ని ధ్రువపర్చుతూ దేవుడు చేసిన వాగ్దానం ప్రమాణం రెండూ దానికి రుజువు. అవి “తాను అబద్దమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులు” హెబ్రీ 6:18.PPTel 361.3

  అబ్రాహాముతో చేసిన నిబంధనలో రక్షణ వాగ్దానం ఉంటే సీనాయి వద్ద మరో నిబంధన ఎందుకు అవసరమయ్యింది? దాసులుగా ఉన్న కాలంలో ప్రజలు దేవుని గూర్చిన జ్ఞానాన్నీ అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన సూత్రాన్ని చాలామట్టుకు మరిచిపోయారు. వారిని ఐగుప్తు దాస్యం నుంచి విమోచించటంలో తన శక్తిని తన కృపను వారికి కనపర్చాలన్నది దేవుని ఉద్దేశం. తద్వారా వారు తనను ప్రేమించి విశ్వసించాలన్నది ఆయన ఆకాంక్ష. ఐగుప్తీయులు తరుముకుంటూ వెనుక వస్తుండగా వారినుంచి తప్పించుకొనే మార్గంలేని స్థితిలో వారు తమ నిస్సహాయతను గుర్తించి తనపై పూర్తిగా ఆధారపడి ఉండేటట్లు వారిని ఎర్రసముద్రం వద్దకు తీసుకొని వచ్చి అప్పుడు విమోచించాడు. ఈ రీతిగా వారి హృదయాలు దేవుని పట్ల ప్రేమ కృతజ్ఞతలతో నిండాయి. ఆయన తమకు సహాయమందించటానికి శక్తిమంతుడన్న విశ్వాసం పటిష్ఠమైంది. లౌకికమైన బానిసత్వం నుంచి విమోచించే విమోచకుడుగా వారిని ఆకట్టుకొన్నాడు.PPTel 362.1

  అయినా వారి మనసులు గుర్తించాల్సిన మహత్తర సత్యం ఉన్నది. విగ్రహారాధన మధ్య దుర్మార్గత నడుమ నివసిస్తున్న వారికి దేవుని పరిశుద్ధతను గూర్చి, తమ హృదయాల్లో గూడుకట్టుకొని ఉన్న ఘోరపాపాల్ని గూర్చి దైవ ధర్మశాస్త్రాన్ని తమంతట తాము ఆచరించలేమన్న దాన్ని గూర్చి, తమకు రక్షకుడు అవసరమన్న దాన్ని గూర్చి వారికి ఎలాంటి అవగాహన లేదు. ఇదంతా వారికి నేర్పటం అవసరం.PPTel 362.2

  దేవుడు వారిని సీనాయి వద్దకు తీసుకొని వచ్చాడు. తన మహిమను ప్రదర్శించాడు. వారికి తన ధర్మశాస్త్రాన్నిచ్చి దాన్ని ఆచరించినట్లయితే గొప్ప దీవెనలిస్తానని వాగ్దానం చేశాడు. “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధననుసరించి నడచిన యెడల... మీరు నాక యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు” నిర్గమ 19:5, 6. ప్రజలు తమ పాపస్థితిని గుర్తించలేదు. క్రీస్తు సహాయం లేకుండా తాము దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరించలేమని గుర్తించలేదు. అందుచేత హుటాహుటిగా దేవునితో నిబంధన చేసుకొన్నారు. సొంత నీతిని స్థాపించుకోటానికి సమర్థులమని భావిస్తూ, “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము” అన్నారు. నిర్గమ 24:7. మహిమ ప్రభావాల మధ్య దేవుడు ధర్మశాస్త్ర ప్రకటన చేయటం వారు చూశారు. ఆ పర్వతం ముందు భయంతో వణుకుతూ నిలబడ్డారు. అయినా కొన్ని వారాలు గడిచీ గడవకముందే దేవునితో తాము చేసిన ఆ నిబంధనను అతిక్రమించి పోత విగ్రహానికి పూజలు చేశారు. నిబంధనను అతిక్రమించటం ద్వారా దేవుని ప్రసన్నతను పొందలేకపోయారు. తమ పాపస్థితిని పాపక్షమాపణ అవసరాన్ని గుర్తించి అబ్రాహాముతో దేవుని నిబంధనలోను బలి అర్పణల ముంగుర్తులోను సూచించిన రక్షకుడు తమకు అవసరమని వారు ఇప్పుడు గ్రహించారు. ఇప్పుడు వారు విశ్వాసం ద్వారాను ప్రేమమూలంగాను పాప విమోచకుడుగా దేవునికి దగ్గరయ్యారు. ఇప్పుడు వారు కొత్త నిబంధన ఆశీర్వాదాల్ని అభినందించటానికి సంసిద్ధంగా ఉన్నారు.PPTel 362.3

  విధేయులై నివసించటం “పాత నిబంధన” షరతు : “ఎవడైన వాటిననుసరించిన యెడల వాటిని బట్టి బ్రదుకును” (యె హెజ్కేలు 20:11, లేవీకాండము 18:5). కాని “ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడు”. ద్వితీ 27:26. “కొత్త నిబంధన” మరి యెక్కువైన వాగ్దానములను బట్టి”, అనగా పాపక్షమాపణ వాగ్దానాన్ని, హృదయాన్ని నూతనపర్చి దాన్ని దైవ ధర్మ శాస్త్రానుసారమైన హృదయంగా రూపొందించే వాగ్దానాన్ని బట్టి స్థాపితమయ్యింది. ‘ఈదినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితో.. చేయబోవు నిబంధన యిదే. వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను ...నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను”యిర్మీ 31:33, 34.PPTel 363.1

  రాతిపలకలమీద రాసిన ధర్మశాస్త్రాన్నే హృదయమనే పలకమీద పరిశుద్ధాత్మ లిఖిస్తాడు. మన సొంత నీతిని స్థాపించుకొనే బదులు క్రీస్తు నీతిని మనం అంగీకరిస్తాం. మన పాపాలకి ఆయన రక్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది. మన విధేయతకు బదులుగా ఆయన విధేయత దేవునికి అంగీకృతమౌతుంది. అప్పుడు పరిశుద్దాత్మ మూలంగా నూతనమైన హృదయం “ఆత్మఫలములు” ఫలిస్తుంది. మన హృదయాలపై రాసి ఉన్న ధర్మశాస్త్రానుసారంగా నడుచుకొంటూ జీవిస్తాం. క్రీస్తు స్పూర్తిని కలిగిన మనం ఆయన నడిచినట్లే నడుస్తాం. ఆయన తనను గురించి తాను ప్రవక్త ద్వారా ఇలా ప్రకటించుకొన్నాడు, “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. “కీర్తనలు 40:8. అతడు ఇంకా ఇలా అన్నాడు “ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు” యోహాను 8:29.PPTel 363.2

  కొత్త నిబంధన కింద విశ్వాసానికి ధర్మశాస్త్రానికి మధ్యగల సంబంధాన్ని పౌలు ఇలా స్పష్టంగా వివరిస్తున్నాడు, “విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము”. “విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము”. “ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.” తన పాప స్వభావం వల్ల మానవుడు ధర్మశాస్త్రాన్ని ఆచరించలేకపోయాడు గనుక అది అతణ్ని నీతిమంతుడని తీర్చలేకపోయింది - “దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను” రోమా 5:1, 3:31, 8:3, 4. PPTel 363.3

  వేర్వేరు యుగాల్లోని మనుషుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి విషయం లోను, తన శక్తి ప్రదర్శనలోను కొన్ని తేడాలున్నప్పటికీ అన్ని కాలాల్లోనూ దైవకార్యం ఒకే విధంగా సాగుతుంటుంది. మొదటి సువార్త వాగ్దానంతో ప్రారంభించిన పితరుల యుగం యూదుల యుగం ప్రస్తుతకాలం వరకు కూడా దేవుని రక్షణ ప్రణాళిక క్రమక్రమంగా మానవులకు వివరించబడటం జరుగుతూ వస్తున్నది. యూదుల ఆచారాలు కర్మకాండ సూచించిన రక్షకుడే సువార్త కాలంలో రూపుధరించిన రక్షకుడు. ఆయన దైవ స్వరూపాన్ని ఆవరించిన మబ్బులు విడిపోయాయి. పొగమంచు ఛాయలు మాయమయ్యాయి. యేసు లోక రక్షకుడుగా ప్రత్యక్షమై నిలిచాడు. సీనాయి పర్వతం మీద నుంచి ధర్మశాస్త్రాన్ని ప్రకటించి ఆచార ధర్మశాస్త్ర సూత్రాల్ని మోషేకు ఇచ్చిన ఆ ప్రభువే కొండమీది ప్రసంగం చేశాడు.PPTel 364.1

  తన పట్ల భక్తి ప్రేమల సూత్రాల పునాది పై దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాల్ని నెలకొల్పాడు. మోషే నోట హెబ్రీ ప్రజలతో ఆయన పలికిన మాటలే ఈ సూత్రాలు. వాటిని పునరుద్ఘాటించటం జరిగింది. “ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవానీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను” ద్వితీ 6:4, 5. “నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” లెవీ 19:18. ఈ రెండు కాలాల్లోనూ బోధకుడు ఒక్కడే. దేవునిపట్ల విధులూ అవే. ఆయన పరిపాలన సూత్రాలూ అవే. ఎందుకంటే “ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనా గమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు” సమస్తం ఆయన వద్ద నుంచి వస్తున్నదే. యాకోబు 1:17.PPTel 364.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents