Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  21—యోసేపు సహాదరులు

  పంట సమృద్ధిగల సంవత్సరాల్లోనే వస్తున్న కరువుకోసం సిద్ధబాటు ప్రారంభ మయ్యింది. ఐగుప్తు దేశమంతటా యోసేపు నాయకత్వం కింద పెద్ద పెద్ద నగరాల్లో బ్రహ్మాండమైన ధాన్యపు కొట్లు నిర్మితమయ్యాయి.పండనున్న అదనపు పంటను భద్రంగా నిల్వచేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. పంటసమృద్ధిగల ఏడేళ్ల లోనూ ఒకే విధానం అనుసరించారు. తుదకు నిల్వచేసిన ధాన్యం లెక్కకుమించి పోయింది.PPTel 213.1

  ఇప్పుడు ఏడేళ్ల కరవుకాలం ఆరంభమయ్యింది. యోసేపు ముందే చెప్పిన దాని ప్రకారమే అంతా జరుగుతున్నది. “కరవు సంవత్సరములూ ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొర పెట్టుకొనిరి, అప్పుడు ఫరో -- మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులతో చెప్పెను. కరవు ఆ దేశమందంతట నుండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను”.PPTel 213.2

  పక్కనున్న కనాను దేశానికి కరవు వ్యాపించింది. అది యాకోబు కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలో మరీ తీవ్రంగా ఉంది. ఐగుప్తు రాజు చేసిన కరవు నివారణ ఏర్పాట్లు గురించి విని అక్కడ ధాన్యం కొనుగోలు చేయటానికి యాకోబు కొడుకుల్లో పదిమంది బయల్దేరారు. ఐగుప్తు చేరిన అనంతరం రాజు కింద అధికారి వద్దకు వారిని పంపటం జరిగింది. తక్కిన అర్జీదారుల్తోపాటు వారుకూడా ఆ దేశ పరిపాలకుడి ముందుకి వచ్చారు. వారు “ముఖములు నేలకు మోపి అతనికి వందనము చేసిరి”. “యోసేపు తన సహోదరులను గురుతుపట్టెను గాని వారతని గురుతు పట్టలేదు”. రాజు తన హెబ్రీ పేరు మార్చి యోసేపుకి ఇంకో పేరు పెట్టాడు. అన్నలు ఆనాడు ఇష్మాయేలీయులకు అమ్మిన అర్భకుడికీ ఇప్పుడు ఐగుప్తు ప్రధాన మంత్రికి మధ్య ఎలాంటి పోలికాలేదు. అన్నలు వచ్చి నేలమీద పడి తనకు నమస్కరించటం చూసినప్పుడు యోసేపుకి తన కల గుర్తుకువచ్చింది. గతాన్ని గూర్చిన సన్నివేశాలు తన కళ్లముందు మెదిలాయి. పదునైన అతడి దృష్టి అన్నల గుంపును పరికించినప్పుడు వారిలో బెన్యామీను లేడని గ్రహించాడు. అతడు కూడా ఈ ఆటవికుల క్రూరత్వానికి బలి అయ్యాడా అన్న అనుమానం యోసేపుని తొలిచివేసింది. అసలు విషయాన్ని తెలుసుకోటానికి నిశ్చయించుకొని “మీరు వేగులవారు. ఈ దేశము గుట్టు తెలిసికొన వచ్చితిరి” అన్నాడు.PPTel 213.3

  “లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము. మేము యధార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కాము” అన్నారు. తాను వారితో ఉన్నప్పుడు వారిలోనున్న అహంకారం వారిలో ఇంకా ఉన్నదేమో తెలుసుకోటానికి తమ కుటుంబం గురించి వారి వద్దనుంచి సమాచారం లాగటానికి ప్రయత్నించాడు. వారి మాటలు ఇంకా మోసపూరితంగానే ఉంటాయని అతడికి తెలుసు. అదే నేరాన్ని మళ్లీ మోపినప్పుడు వారిలా ఉత్తరమిచ్చారు, “నీ దాసులమైన మేము పండ్రెండు మంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రివద్ద ఉన్నాడు. ఒకడు లేడు”.PPTel 214.1

  వారి కథనాన్ని శంకిస్తున్నట్లు వారిని ఇంకా వేగులవారిగానే భావిస్తున్నట్లు నటిస్తూ వారిలో ఒకడు వెళ్లి తమ సహోదరుణ్ని తీసుకువచ్చి నిజం నిరూపించమని ఆజ్ఞాపించాడు. వారు అందుకు సమ్మతించకపోతే వారిని గూఢచారులుగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పాడు. కాని ఆ ఏర్పాటుకు యాకోబు కుమారులు ఒప్పుకోరు ఎందుకంటే షరతు నెరవేర్పుకు నిర్దేశించిన సమయంలో వారి కుటుంబం ఆహారంలేక బాధపడుంది. అంతేగాక, తక్కిన సహోదరులు చెరసాలలో ఉండగా వారిలో ఎవరు ప్రయాణం చేయటానికి ముందుకొస్తారు? వారు మరణించటమో లేదా బానిసలవ్వటమో తప్పనిసరి అయ్యేటట్టు కనిపించింది. బెన్యామీనుని తీసుకువస్తే తమ గతే అతడికి పడ్తుందని భావించారు. మిగిలివున్న ఆ ఒక్క కుమారుణ్ని తీసుకువచ్చి అతణ్ని కూడా కోల్పోవటం వల్ల తండ్రికి మరింత వేదరన కలిగించే కన్నా అక్కడే ఉండి అందరూ కలిసి శ్రమలనుభవించటానికి తీర్మానించుకొన్నారు. ఆ ప్రకారం వారిని ఖైదులో వేసి మూడురోజులుంచారు.PPTel 214.2

  అన్నలనుంచి యోసేపు దూరమైన సంవత్సరాల్లో యాకోబు కుమారుల ప్రవర్తనలో మార్పు చోటుచేసుకుంది. అసూయ, ఆవేశకావేశాలు, మోసం, క్రూరత్వం, కక్ష వీటితో వారు నిండి ఉండేవారు. కాని ఇప్పుడు శ్రమలకు లోనైనప్పుడు వారు స్వార్థ రహితులుగా, పరస్పరం యధార్థంగా, నడి వయసులో ఉన్న తాము తండ్రి పట్ల పితృభక్తి అనురాగాలు కలిగి అతడి అధికారానికి లోబడి ఉన్నట్లు కనిపించింది.PPTel 214.3

  ఐగుప్తు చెరసాలలో ఆ సహోదరులు గడిపిన మూడు దినాలు తమ గత పాపాలగురించి తలంచుకొని ఎంతగానో దు:ఖించారు. బెన్యామీనను తీసుకువస్తేనే గాని గూఢచారులుగా తమకు శిక్ష తప్పనట్లు, బెన్యామీను వెళ్లటానికి తండ్రి అనుమతి లభించనట్లు వారికి కనిపించింది. మూడోనాడు యోసేపు అన్నల్ని తన సమక్షంలోకి రప్పించాడు. వారిని ఎక్కువకాలం ఉంచటం అతడికి ఇష్టం లేదు. తండ్రి తండ్రితో ఉన్న కుటుంబాలు ఆహారంలేక ఇప్పటికే బాధపడూ ఉంటారు. అందుచేత యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడువాడను. మీరు బ్రదుకునట్లు దీని చేయుడి. మీరు యధార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింప బడవలెను. మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావకుందురు”. బెన్యామీనుని తండ్రి తమతో పంపుతాడన్న ఆశాభావం లేకపోయినప్పటికీ ఈ ప్రతిపాదనను వారు అంగీకరించారు. వారితో యోసేపు అనువాదకుడి ద్వారా మాట్లాడాడు. ఆ పరిపాలకుడు వారి భాష తెలిసిన వాడన్న అనుమానం లేకుండా వారి అతడి సమక్ష్యంలో ఒకరితో ఒకరు మాట్లాడు కొంటున్నారు. యోసేపుతో తాము వ్యవహరించిన తీరు గురించి వారు ఒకరినొకరు నిందించుకొంటున్నారు. “నిశ్చయముగా మన సహోదరునియెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదనను చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెను”. అతణ్ని విడిపించటానికి దోతానులో ఈ ప్రణాళికను రూపొందించిన రూబేను ఇలా గొంతు కలిపాడు, “ఈ చిన్నవాని యెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నది”. అదంతా వింటున్న యోసేపు తన భావోద్వేగాల్ని అదుపు చేసుకోలేక బయటికి వెళ్లి ఏడ్చాడు. తన సహోదరుడితో క్రూరంగా ప్రవర్తించటంలో షిమ్యోను ప్రధాన పాత్ర పోషించాడు. ఆ కారణంవల్లనే అతణ్ని ఖైదులో ఉంచటం జరిగింది.PPTel 214.4

  సహోదరులు తిరిగి వెళ్లటానికి అనుమతి ఇవ్వకముందు వారికి ధాన్యం ఇవ్వాల్సిందిగా వారి వారి సంచుల్లో మూతివద్ద వారి వారి డబ్బు పెట్టి కట్టాల్సిందిగా యోసేపు ఆదేశించాడు. మార్గంలో గాడిదలకు మేతకూడా ఏర్పాటు చేశాడు. అందులో ఒకడు మార్గంలో తన సంచి తెరవగా తన డబ్బు సంచి అందులో ఉండటం చూసి విస్తుపోయాడు. ఆ విషయం తక్కిన వారికి తెలియజేసినప్పుడు వారు భయాందోళనలతో నిండి, “ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెను?” అని ఒకరితో ఒకరు అన్నారు. అది తాము దేవుడు చేసిన ఉపకారంగా పరిగణించాలా లేక తమ పాపాలకు శిక్షగా ఉద్దే శించి ఇంకా తీవ్రమైన శ్రమ కలిగించటానికి దీన్ని అనుమతించినట్లు భావించాలా? దేవుడు తమ పాపాల్ని చూశాడని ఇప్పుడు తమను ఆయన శిక్షిస్తున్నాడని వారు గుర్తించారు.PPTel 215.1

  కుమారుల రాకకోసం యాకోబు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. వారు వచ్చినప్పుడు శిబిరంలోని వారందరూ వారి చుట్టూ గుమిగూడి వారు జరిగిందంతా తండ్రితో చెప్తుంటే వింటున్నారు. వారి హృదయాలు ఆందోళనతో అభినందనతో నిండాయి. ఐగుప్తీయ గవర్నరు ప్రవర్తనలో ఏదో దురుద్దేశం ఉన్నట్లు వారికి తోచింది. వారు తమ సంచులు తెరవగా వాటిల్లో తమ తమ డబ్బు కనిపించినప్పుడు వారి భయాలు నిజమయ్యాయి. వృద్ధుడైన ఆ తండ్రి ఇలా అన్నాడు, “మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకు పోవుదురు. ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవి”. అందుకు రూబేను, “నేనతని నీయొద్దకు తీసుకొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును” అన్నాడు. “నా కుమారుని మీతో వెళ్లనియ్యను. ఇతని అన్న చనిపోయెను. ఇతడు మాత్రమే మిగిలి యున్నాడు” అని యాకోబు ఉత్తరమిచ్చాడు.PPTel 216.1

  కరవు కొనసాగింది. ఐగుప్తు నుంచి తెచ్చిన ధాన్యం కొంతకాలానికి దాదాపుగా అయిపోయింది. బెన్యామీనులేకుండా ఐగుప్తుకి వెళ్లటం నిరర్థకమన్నది యాకోబు కుమారులికి బాగా తెలుసు. తండ్రి తీర్మానం మారుతుందన్న నమ్మకం వారికి లేదు. ఆ విషయం ఎలా పరిష్కారమవుతుందా అని ఉత్కంఠతో కని పెడ్తూ ఉన్నారు. దగ్గరకు వస్తున్న కరవు నీలినీడలు దట్టమవుతున్నాయి. శిబిరంలో ఉన్నవారి ముఖాల్లో వారి అవసరాల్ని వృద్ధ పితరుడు స్పష్టంగా చూశాడు. “మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడి” అన్నాడు చివరికి.PPTel 216.2

  యూదా ఇలా బదులు పలికాడు, “ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వానిని పంపనొల్లని యెడల మేము వెళ్లము”.తండ్రి ఊగిసలాడటంచూసి ఇంకా ఇలా అన్నాడు, “ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్లుదుము. అప్పుడు మేము కాదు నీవును మా పిల్లలును చావక బ్రతుకుదుము”. తన తమ్ముడికి హామీగా నిలిచి బెన్యామీనును తనకు తిరిగి అప్పగించకపోతే నిరంతరం నిందార్హుడిగా ఉండిపోతానని యూదా తండ్రితో అన్నాడు.PPTel 216.3

  యాకోబు ఇక నిరాకరించలేకపోయాడు. ప్రయాణానికి ఆయత్తపడమని కుమారుల్ని ఆదేశించాడు. కరవు బాధిత దేశం నుంచి ఐగుప్తు రాజుకి కానుక తీసుకొని వెళ్లమని వారిని ఆదేశించాడు. “కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, భోళము, పిస్తాచ కాయలు, బాదము కాయలు” రెండు రెట్లు ద్రవ్యం, “మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి”. సందేహాలతో నిండిన తమ ప్రయాణాన్ని కుమారులు ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వృద్దుడైన తండ్రి తన చేయి పైకెత్తి ఇలా ప్రార్థించాడు, “ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని, బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై యుండవలసిన యెడల పుత్రహీనువడనగుదును”.PPTel 217.1

  వారు మళ్లీ ఐగుప్తునకు ప్రయాణం చేసి యోసేపు ముందు నిలిచారు. తన తల్లి కుమారుడు తన తమ్ముడు అయిన బెన్యామీనును చూసినప్పుడు యోసేపు హృదయం ద్రవించింది. తన భావోద్వేకాన్ని దాచుకున్నాడు. వారిని తన గృహానికి తీసుకురమ్మని వారు తనతో భోంచెయ్యటానికి ఏర్పాట్లు చేయమని సేవకుల్ని ఆదేశించాడు. గవర్నరు నివాసానికి వారిని తీసుకు వెళ్లినప్పుడు వారు ఆందోళన చెందారు. తమ సంచుల్లో వున్న డబ్బు గురించి ఆరా తియ్యటానికి పిలిపించాడని ఆ డబ్బు తమ సంచుల్లో కావాలనే పెట్టి ఉంటారని భావించారు. తామున్న ఆ దుస్థితిలో తాము ఐగుప్తుకు వచ్చిన పరిస్థితుల్ని యోసేపు గృహ సేవాధిపతికి వివరించారు. తమ సంచుల్లో వున్న డబ్బునూ, ఆహారం కొనటానికి అదనపు ద్రవ్యాన్ని తెచ్చామని అది తమ నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుందని అతడితో చెప్పారు. “మా రూకలు మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి”. “మీకు క్షేమమగును గాక. భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవి” అని అతడన్నాడు. చెరసాలలో నుంచి విడుదల పొందిన షిమ్యోను కూడా వారి వద్దకు వచ్చినప్పుడు దేవుడు తమ పట్ల కృప చూపించాడని భావించారు.PPTel 217.2

  గవర్నరు వారిని మళ్లీ కలిసినప్పుడు వారు తమ బహుమతులు సమర్పించి “అతనికి నేలను సాగిలపడిరి”. యోసేపుకు తన కల మళ్లీ జ్ఞాపకం వచ్చింది. తన అతిథులకు నమస్కరించిన తర్వాత “మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా; అతడు ఇంకా బ్రతికియున్నాడా?” అని అడిగాడు. “నీ దాసుడైన మా తండ్రి యింకా బ్రతికియున్నాడు. క్షేమముగా ఉన్నాడని చెప్పి” వంగి నమస్కరించారు. అంతట అతని దృష్టి బెన్యామీను మీద నిలిచింది. “మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?” అని అడిగాడు. “నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక” అని ప్రేమ వల్ల దు:ఖం వస్తుండటంతో ఇక మాట్లాడలేక అక్కడినుంచి వెళ్లిపోయాడు. “లోపలి గదిలోకి వెళ్లి అక్కడ ఏడ్చెను”.PPTel 217.3

  తన సహజ ముఖ వైఖరి తిరిగి వచ్చాక అతడు తిరిగి వచ్చాడు. అందరూ కలిసి విందుకు కూర్చున్నారు. కులపరమైన నిబంధనల ప్రకారం ఐగుప్తీయులు ఇతర జాతుల ప్రజలతో కలిసి భోంచెయ్యటం నిషిద్ధం. కనుక యాకోబు కుమారులకు ఒక బల్ల, గవర్నరుకు తన ఉన్నత హోదానుబట్టి ప్రత్యేకంగా ఒక బల్ల ఏర్పాటు చేశారు. అందరూ కూర్చొన్నప్పుడు వారి స్థలాలు వారి వయస్సుల క్రమంలో ఏర్పాటవ్వటం చూసి ఆశ్చర్యపోయారు. యోసేపు “తన యెదుట నుండి వారికి వంతులెత్తి పంపెను”. కాని బెన్యామీనుని ఎక్కువ ఇష్టపడున్నట్లు కనపర్చే ఈ క్రియ అన్నలు తనపట్ల వ్యవహరించినట్లే తమ చిన్న తమ్ముడిపట్ల కూడా ఈర్ష్య ద్వేషాలతో వ్యవహరిస్తున్నారేమో తెలుసుకోటానికి యోసేపు పెట్టిన పరీక్ష. యోసేపు తమ భాషను అర్థం చేసుకోలేడన్న ఉద్దేశంతోనే ఉన్న సహోదరులు ఒకరితో ఒకరు స్వేచ్చగా మాట్లాడుకొంటున్నారు. ఆ విధంగా వారి నిజమైన మనోభావాలేంటో యోసేపు తెలుసుకోటానికి మంచి అవకాశం లభించింది. వారిని ఇంకా పరీక్షించాలనుకొన్నాడు. అందుకు తాను తాగటానికి ఉప యోగించే వెండి పాత్రను చిన్న తమ్ముడి సంచిలో దాచి ఉంచమని సేవకుల్ని ఆదేశించాడు.PPTel 218.1

  వారు ఉత్సాహంగా తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాడు. వారితో షిమ్యోను బెన్యామీను ఉన్నారు. వారి గాడిదలు ధాన్యపు సంచులతో బరువుగా నడుస్తున్నాయి. తమ కష్టాలన్నీ గట్టెక్కాయని తాము ఇప్పుడు సురక్షితంగా ఉన్నామని వారు భావిస్తున్నారు. అయితే వారు పట్టణం శివార్లు దాటుతుండగా గవర్నరు గృహ నిర్వాహకుడు వారిని అడ్డుకొని ఇలా ప్రశ్నించాడు, “మీరు మేలుకు కీడు చేయనేల? దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదేకదా? మీరు దీని చేయుటవలన కానిపని చేసితిరి”. పానీయంలో ఏదైనా విష పదార్థం ఉంటే దాన్ని గుర్తించే శక్తి ఈ పాత్రకు ఉన్నదట. ఆ దినాల్లో ఇలాంటి పాత్రలకు గొప్ప విలువ ఉండేది. విష ప్రయోగం ద్వారా జరిగే హత్యల నుంచి ఈ పాత్ర భద్రత నిచ్చేది.PPTel 218.2

  గృహ నిర్వాహకుడి నేరారోపణకు పరదేశులు ఇలా జవాబు చెప్పారు, “మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇంటి పని చేయుట నీ దాసులకు దూరమగును గాక. ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలును కనాను దేశములోనుండి తిరిగి తీసికొని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము? నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగానుందుము”.PPTel 218.3

  ఆ గృహ నిర్వాహకుడు అందుకు, “మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి. ఎవరియొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును; అయితే మీరు నిర్దోషులగుదురు” అన్నాడు.PPTel 219.1

  వెంటనే వెదకటం ప్రారంభమయ్యింది. “వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను”. గృహ సేవాధికారి రూబేనుతో ప్రారంభించి క్రమం ప్రకారం చిన్నవాడి దాకా అందరి గోనెలూ పరీక్షించాడు. బెన్యామీను గోనెలో ఆ పాత్ర దొరికింది.PPTel 219.2

  తమ దౌర్భాగ్యానికి సహోదరులు తమ దుస్తులు చింపుకొని దు:ఖించారు. వారు తిరిగి పట్టణానికి నెమ్మదిగా వెళ్లారు. తమ వాగ్దానం ప్రకారం బెన్యామీను తన జీవితమంతా దాసుడుగా ఉండాలి. గృహ సేవాధికారి వెంట వారు గవర్నరు భవనానికి వెళ్లారు. గవర్నరు ఇంకా ఇంటిలోనే ఉండటం చూసి అతడిముందు సాష్టాంగపడ్డారు. “మీరు చేసిన యీ పని ఏమిటి?”“నావంటి మనుష్యుడు శకునమును చూచి తెలిసికొనునని మీకు తెలియదా?” అన్నాడు. వారిచేత తమ పాపాన్ని ఒప్పించటం యోసేపు ఉద్దేశం. తనకు ప్రవచన వరముందని యోసేపు ఎన్నడూ చెప్పలేదు. కాని తనకు రహస్యాలు తెలుసుకొనే శక్తి ఉన్నదని వారు భావించాలన్నది అతడి ఉద్దేశం.PPTel 219.3

  యూదా ఇలా ఉత్తరమిచ్చాడు, “ఏలినవారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపర్చగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవరియొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలినవారికి దాసుల మగుదుము”. PPTel 219.4

  “అట్లు చేయుట నాకు దూరమగునుగాక; ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడి” అన్నది అతడి ప్రత్యుత్తరం.PPTel 219.5

  చింతాక్రాంతుడయిన యూదా పరిపాలకుడి దగ్గరగా వెళ్లి ఇలా వివరించాడు, “యేలినవాడా, ఒక మనవి; ఒక మాట ఏలినవారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తమ దాసునిమీద రవులుకొన నీయకుము. తమరు ఫరో అంతటి వారు కదా”. తాను అమితంగా ప్రేమించిన రాహేలు ఇద్దరు కుమారుల్లో యేసేపు పోయిన విచారంతో తమ తండ్రి యాకోబు ఎంతగా కుంగిపోయాడో ఇక మిగిలి ఉన్న తన చిన్న కుమారుడు బెన్యామీనుని తమతో ఐగుప్తుకి పంపటానికి ఎంతగా వెనకాడాడో చక్కని మాటల్లో అతి సమర్థంగా యూదా అతడికి విశదీకరించాడు. “కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేనియెడల అతని ప్రాణము అతని ప్రాణముతో పెనవేసికొనియున్నది. గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలుగల మత దాసుడైన మా తండ్రిని మృతులలోకములోనికి దు:ఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానిని ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవానిని తన సహోదరులతో వెళ్లనిమ్ము. ఈ చిన్నవాడు నాతోకూడ ఉంటేనేగాని నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లిన యెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చును”. అని చెప్పాడు.PPTel 219.6

  యోసేపు తృప్తి చెందాడు. తన సహోదరుల్లో యధార్థమైన పశ్చాత్తాప ఫలితాన్ని చూశాడు. పెద్ద మనసుతో యూదా తన్నుతాను సమర్పించుకొంటూ పలికిన మాటలు విన్న తర్వాత వీరు తప్ప తక్కిన వారంతా అక్కడినుంచి నిష్క్రమించాల్సిందిగా ఆదేశించాడు. అప్పుడు గట్టిగా ఏడుస్తూ, “నేను మీ సేపును; నా తండ్రి యింకను బ్రదికియున్నాడా?” అన్నాడు. అన్నలు బయంతో, ఆశ్చర్యంతో నిశ్చేష్టితులైపోయారు.PPTel 220.1

  తాము ఎవరిపై అసూయపడి ఎవరిని చంపటానికి సిద్ధమై తుదకు ఎవరిని బానిసగా అమ్మివేశారో ఎవరు ఇప్పుడు ఐగుప్తు పరిపాలకుడో ఆ యోసేపు అతడే! తాము అతణ్ని పెట్టిన శ్రమలన్నీ వారికళ్లముందు కదిలాయి. అతడి కలల్ని తాము తృణీకరించటం అవి నెరవేరకుండా చూడటానికి తాము ఏంచేశారో వారు జ్ఞాపకం చేసుకొన్నారు. అయినా ఈ కలల నెరవేర్పులో వారు తమ పాత్రను పోషించారు. అయితే ఇప్పుడు వారు పూర్తిగా తనవశంలో ఉన్నారు గనుక తనకు జరిగిన అన్యాయానికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాడనుకొన్నారు.PPTel 220.2

  వారి గందరగోళ పరిస్థితని చూసి దయగా, “నా యొద్దకు రండి” అన్నప్పుడు వారు వస్తుండగా “ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దు:ఖపడకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను” అన్నాడు. తనపట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు అప్పటివరకూ వారనుభవించిన శిక్ష సరిపోతుందని భావించి వారి వేదనను ఆత్మనిందను తుడిచి వేయటానికి ప్రయత్నించాడు.PPTel 220.3

  రెండు సంవత్సరములనుండి కరవు దేశములోనున్నది. సేద్యమైనను, కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగ నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటివారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రియొద్దకు వెళ్లి అతనితో - నీ కుమారుడైన యోసేపు - దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు; నీవు గో షేను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొట్టెల మందలును, నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటివారికిని నీకు కలిగినదంతటకిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి. ఇదిగో మాటలాడుచున్నది నా నోరే అని, మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి యేడ్చెను. అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిమీదపడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి”. వారు తమ పాపాన్ని ఒప్పుకొని అతడి క్షమాభిక్ష కోరారు. దీర్ఘకాలం ఆందోళనతో సంతాపంతో నివసించారు. అతడు బ్రతికే ఉన్నందుకు వారు ఇప్పుడు సంతోషించారు.PPTel 221.1

  అక్కడ జరిగినదంతా రాజుకి తెలియజేశారు. మీ సేపుకి తన కృతజ్ఞత సూచకంగా అతడు తన కుటుంబానికిచ్చిన ఆహ్వానాన్ని ధ్రువపర్చుతూ రాజు ఇలా అన్నాడు, “ఐగుప్తు దేశమంతటిలోను మంచి వస్తువులు మీవే అగును”. చాలినంత ఆహారంతో, వారి కుటుంబాలు సేవకులు ఐగుప్తుకి రావటానికి వాహనాలతో అన్నల్ని పంపించాడు. తక్కిన వారికన్నా బెన్యామీనుకి యోసేపు ఎక్కువ విలువైన బహుమతులిచ్చాడు. తిరుగు ప్రయాణంలో వారి మధ్య వివాదాలు రావచ్చునన్న భయంతో వారు వెళ్లకముందు, “మార్గమందు కలహములు పడకుడి” అని వారిని హెచ్చరించాడు.PPTel 221.2

  యాకోబు కుమారులు తండ్రివద్దకు తిరిగివచ్చి “యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడు” అన్న సంతోషకరమైన వార్త అందించారు. మొదట వృద్ధుడైన తండ్రి తబ్బిబ్బుపడ్డాడు. తాను విన్నదాన్ని నమ్మలేకపోయాడు. కాని బారులు తీరిన బండ్లు, బరువులతో ఉన్న జంతువులు, బెన్యామీను తనతో ఉండటము చూసినప్పుడు అతను నమ్మాడు. పట్టజాలనంత సంతోషంతో యాకోబు, “ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు. నేను చావకమునుపు అతని చూచెదను” అన్నాడు.PPTel 222.1

  ఆ పదిమంది అన్నలు ఒప్పుకోవాల్సిన అవమానకరమైన తప్పిదం ఇంకొకటి ఉంది. తండ్రి జీవితాన్ని తమ జీవితాన్ని దు:ఖభరితం దుర్భరం చేసిన వంచనను క్రూరత్వాన్ని ఇప్పుడు తండ్రి ముందు ఒప్పుకొన్నారు. అంత అఘాయిత్యానికి వారు పాల్పడ్డారని తండ్రి అనుమానించలేదు. అయితే దానంతటినీ తమ మంచికోసం దేవుడు మలిచాడని గ్రహించాడు. తప్పులు చేసిన తన బిడ్డల్ని యాకోబు క్షమించి ఆశీర్వదించాడు.PPTel 222.2

  తమ కుటుంబాలతో తమ మందలతో సంఖ్యానేక సేవకులు పనివారతో యాకోబు అతడి కుమారులు కొద్దికాలంలోనే ఐగుప్తుకి ప్రయాణమయ్యారు. ప్రయాణం ఉత్సా హెూద్రేకాలతో సాగింది. బెయెర్దేబాకు వచ్చినప్పుడు యాకోబు కృతజ్ఞతార్పణలు అర్పించి తమతో ఉంటానని మాట ఇవ్వమని ప్రభువుని అర్థించాడు. రాత్రి దర్శనంలో దేవుడు ఈ వాగ్దానం చేశాడు, “ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను”.PPTel 222.3

  “ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను” అన్న వాగ్దానం ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. నక్షత్రాలవలె తన సంతతిని వృద్ధి చేస్తానని దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేశాడు. కాని ఎన్నికయిన ప్రజలింకా సంఖ్యాపరంగా ఏమంత పెరగలేదు. ప్రవచితమైన రీతిగా ఆ జాతి పెరుగుదలకు ఇప్పుడు కనాను కూడా అనుకూల ప్రదేశం కాదు. కనాను శక్తివంతమైన అన్యజాతుల ఆధీనంలో ఉన్నదేశం. “నాల్గో తరం ప్రజలు” వచ్చేవరకూ ఆ అన్యజాతుల్ని నాశనం చేసి ఆ దేశాన్ని స్వాధీన పర్చుకోవటం జరగలేదు. ఇశ్రాయేలు సంతతివారు విస్తారమైన జనాంగం కావాలంటే వారు ఆ దేశ ప్రజల్ని తరిమి వేయటమన్నా చేయాలి లేదా చెదిరిపోయి వారి మధ్య జీవించటమన్నా చేయాలి. దేవుని ఏర్పాటు ప్రకారం మొదటిది చేయలేకపోయారు. ఇకపోతే కనానీయులతో కలసి నివసిస్తే వారి విగ్రహారాధనకు ఆకర్షితులవుతారు. దేవుని ఉద్దేశం నెరవేరటానికి అవసరమైన పరిస్థితులు ఐగుప్తులో ఉన్నాయి. అక్కడ నీటి వసతిగల సారవంతమైన ఒక ప్రాంతం వారికి ద్వారం తెరిచింది. వారు సంఖ్యాపరంగా వేగంగా పెరగటానికి అక్కడ అన్ని హంగులు ఉన్నాయి. తమ వృత్తి - అనగా కాపరి వృత్తి “ఐగుప్తీయులకు హేయము” -- ఐగుప్తులో తమకుండే వ్యతిరేకత వారు ప్రత్యేకమైన జనాంగంగా నివసించటానికి ఐగుప్తులోని విగ్రహా రాధనలో పాలు పొందకుండా వారిని వేరుగా ఉంచటానికి దోహదపడుంది.PPTel 222.4

  ఐగుప్తు చేరుకున్న తర్వాత యాకోబు కుటుంబ సబ్యులు నేరుగా గోషేనుకు వెళ్లారు. ప్రభుత్వ రథం పై ప్రధానుల బృందంతో యోసేపు అక్కడికి వెళ్లాడు. తన పరిసరాల ఔన్నత్యాన్ని తన హోదా గౌరవాన్ని అతడు విస్మరించాడు. అతడి మనసులో ఉన్నది ఒకే తలంపు, ఒకే కోరిక. వస్తున్న ప్రయాణికుల్ని చూసినప్పుడు అనేక సంవత్సరాలుగా అణగారి ఉన్న ప్రేమ ఇక ఎంతమాత్రం అదుపులో లేదు. తన రథంమీదనుంచి దుమికి తండ్రిని స్వాగతించటానికి యోసేపు ముందుకు వెళ్లాడు. “అప్పుడతడు అతని మెడమీదపడి అతని మెడ పట్టుకొని యెంతో యేడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవింక బ్రదికి యున్నావు. నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను”.PPTel 223.1

  తమ గృహాలకోసం భూమిని ఈనాముగా పొందే నిమిత్తం ఫరో ముందు హాజరు పర్చటానికి యోసేపు తన సహోదరుల్లో అయిదుగుర్ని తీసుకొని వెళ్లాడు. తన ప్రధానమంత్రికి కృతజ్ఞత సూచకంగా ఫరో యోసేపు సోదరుల్ని ప్రభుత్వాధికారులుగా నియమించేవాడే కాని యె హోవా ఆరాధకుడైన యోసేపు అన్యమతాచారాలతో నిండిన ఆ స్థానంలోని దుష్టత్వం నుంచి వారిని కాపాడటానికి ప్రయత్నించాడు. అందుచేత రాజు ప్రశ్నించినప్పుడు తన వృత్తి ఏమిటో స్పష్టంగా అతడికి తెలియపర్చాల్సిందిగా సహోదరులతో యోసేపు చెప్పాడు. యాకోబు కుమార్లు ఈ సలహాను పాటించారు. తాము ఐగుప్తులో యాత్రికులుగా ఉండి వెళ్లటానికి వచ్చాముగాని స్థిరంగా నివసించ టానికి రాలేదని కూడా రాజుకి విశదం చేశారు. తాము ఎంపిక చేసుకొన్నట్లయితే తిరిగి తమ దేశానికి వెళ్లిపోయే హక్కును ఇలా అట్టి పెట్టుకున్నారు. రాజు గోషేను దేశంలో వారికి దేశంలోని “మంచి ప్రదేశమందు” స్థలం ఇచ్చాడు.PPTel 223.2

  తన కుటుంబం వచ్చిన కొద్దికాలంలోనే యోసేపు తన తండ్రిని కూడా ఫరో వద్దకు తీసుకువెళ్లాడు. ఆ పితరుడు రాజు ఆస్థానాల్లోని మట్టు మర్యాదలెరిగినవాడు కాదు. అయితే అతి సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ అతడు రాజుకన్నా శక్తిమంతుడైన ప్రభువుముందు నిలిచి మాట్లాడినవాడు. ఇప్పుడు తన ఆధిక్యం ఎరిగినవాడై యాకోబు తన హస్తం పైకెత్తి ఫరోని ఆశీర్వదించాడు.PPTel 224.1

  యోసేపును కలుసుకొన్నప్పుడు తన తొలిపలుకుల్లో సుదీర్ఘమైన, ఆందోళనతో దు:ఖంతో నిండిన తన జీవితానికి ఈ ఆనందదాయకమైన అంతంతో మరణించటానికి సిద్ధంగా ఉన్నానని యాకోబు అన్నాడు. కాని శాంతి సమాధానాలతో నిండిన తన గో షెను గృహంలో అతడు ఇంకా పదిహేడు సంవత్సరాలు జీవించనున్నాడు. వాటికి ముందు సంవత్సరాలు దు:ఖంలో బాధల్లో గడవగా ఈ పదిహేడేళ్లు ఆనందంగా ఉత్సాహంగా గడిచాయి. మారిన మనసుకు సూచనలు కుమారుల ప్రవర్తనలో కనిపించాయి. తన కుటుంబం గొప్ప జనంగా పెరగటానికి అవసరమైన పరిస్థితులు తమ చుట్టూ ఉండటం చూశాడు. భవిష్యత్తులో తాము కనానులో స్థిరపడ్డామన్న నిశ్చిత వాగ్దానం నెరవేర్పును విశ్వాసమూలంగా అవగాహన చేసుకోగలిగాడు. ఐగుప్తు దేశపు ప్రధానమంత్రి, తండ్రిపట్ల కనపర్చగలిగిన మమతానురాగాల మధ్య యాకోబు జీవితం ఆనందమయంగా సాగింది. తాను చాలాకాలంగా పోగొట్టుకున్న కుమారుడి సహవాసంలో ఆనందంగా సాగుతున్న జీవితం ప్రశాంతంగా అంతమయ్యింది.PPTel 224.2

  మరణం ఆసన్నమవుతున్నట్లు గ్రహించిన యాకోబు యోసేపుకు కబురు చేశాడు. కనానును ఇస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇంకా గట్టిగా విశ్వసిస్తూ ఇలా అన్నాడు, “నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము. నా పితరులతో కూడా నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుము”. అలాగే చేస్తానని యోసేపు మాట ఇచ్చాడు. దానితో యాకోబు తృప్తి పడలేదు. మక్పేలా గుహలో తన తండ్రుల పక్క తనను పాతి పెడ్తానని యోసేపుతో ప్రమాణం చేయించు కున్నాడు.PPTel 224.3

  మరో ముఖ్య విషయం గమనార్హం. యోసేపు పిల్లలు ఇశ్రాయేలు ప్రజల్లో వారు లాంఛనంగా పరిగణన పొందాలి. తండ్రిని చివరిసారిగా కలవటానికి వస్తూ యోసేపు తన కుమారులు ఎఫ్రాయము, మన లను వెంటబెట్టుకు వచ్చాడు. ఈ యువకులు తమ తల్లిద్వారా ఐగుప్తు దేశంలో అత్యున్నత స్థాయి యాజకత్వంతో సంబంధం కలిగి ఉన్నారు. ఐగుప్తీయుల్తో సంబంధ బాంధవ్యాలు ఉంచుకోటానికి ఈ యువకులు ఎంపిక చేసుకొంటే తండ్రి హోదాను, గౌరవాన్ని అందిపుచ్చుకొనటానికి మార్గం సుగమనం అవుతుంది. అయితే వారు తన ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలన్నది యోసేపు ఆకాంక్ష. తన కుమారుల విషయంలో ఐగుప్తు రాజు ఆస్థానం ఒనగూర్చే ప్రేమ ప్రతిష్ఠల్ని తోసిరాజని ఎవరికి దేవుడు తన లేఖన వాక్యాన్నిచ్చాడో తృణీకరించబడ్డ ఆ కాపరుల జాతిలో స్థానం పొందాలని యోసేపు ఆశించాడు.PPTel 224.4

  యాకోబు ఇలా అన్నాడు, “నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మన షే నా బిడ్డలై యుందురు”. వారిని తన సొంత బిడ్డలుగా దత్తత తీసుకొన్నాడు. వారు ప్రత్యేక జాతులికి తలలు కానున్నారు. రూబేను పోగొట్టుకున్న జ్యేష్ఠత్వ హక్కుల్లో ఒకటి -- ఇశ్రాయేలులో రెండు రెట్లు స్వాస్థ్యం -- ఇలా యోసేపుకి రానున్నది.PPTel 225.1

  ముసలితనం వల్ల యాకోబు చూపు క్షీణించింది. యోసేపు కుమారులు అక్కడున్నట్లు గుర్తించలేదు. అనంతరం వారి ఆకారాలు చూసి “వీరెవరు?” అని అడిగాడు. తన కుమారులని యోసేపు చెప్పగా, “నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొనిరమ్ము” అన్నాడు. వారు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు వారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారి తలమీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఆ మీదట ఇలా ప్రార్థించాడు, “నా పితరులైన అబ్రాహాము, ఇస్రాయేలు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఆ పిల్లలను ఆశీర్వదించునుగాక”. స్వయం సమృద్ధి, మానవ శక్తి పై విశ్వాసం లేదా యుక్తి ఇక లేవు. అతడి సంరక్షకుడు అతడి ఆధారం దేవుడే. గతంలోని దుర్దినాల గురించి ఫిర్యాదులు లేవు. జీవితంలోని శ్రమలు, దు:ఖాలు తనమీద “కత్తికట్టినట్లు”గా పరిగణించటం ఇకలేదు. యాత్రికుడుగా తన ప్రయాణమంతటిలోను దేవుని కృపను దయాళుత్వాన్ని మాత్రమే అతడి మనసు జ్ఞాపకం చేసుకొంది.PPTel 225.2

  దీవించటం ముగిసిన తర్వాత, దీర్ఘ దాస్యంలో దు:ఖంతో నివసించిన తన విశ్వాసాన్ని గురించిన సాక్ష్యాన్ని భావితరాల ప్రజలకు విడిచి పెడ్తూ కుమారుడు యోసేపుకు యాకోబు ఈ నిశ్చయతను అందజేశాడు, “ఇదిగో నేను చనిపోవుచున్నాను. అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొనిపోవును”.PPTel 225.3

  మరణిస్తున్న యాకోబు పడకచుట్టూ కుమారులందరూ చివరగా సమావేశ మయ్యారు. కుమారులతో యాకోబు ఇలా అన్నాడు, “యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి”. “అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసెదను”. కలత చెందిన మనసుతో తరచుగా వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వివిధ గోత్రాల చరిత్రను ఊహించటానికి ప్రయత్నించేవాడు. చివరగా తన ఆశీర్వాదాలు పొందటానికి తన పిల్లలు వేచివున్న ఈ సమయంలో దేవుని ఆత్మ అతడి పైకి వచ్చాడు. ప్రవచనాత్మకమైన దర్శనంలో బిడ్డల భవిష్యత్తు అతడిముందు ప్రదర్శితమయ్యింది. ఒకరి తర్వాత ఒకరుగా కుమారుల్ని పేర్కొంటూ ప్రతీవారి గుణ లక్షణాలూ వివరిస్తూ ప్రతీ గోత్రపు భావి చరిత్రను సంక్షిప్తంగా చెప్పాడు.PPTel 225.4

  “రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు. నా శక్తియు, నా బలముయొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే”.PPTel 226.1

  తన జ్యేష్ఠ కుమారుడిగా రూబేను ప్రతిపత్తి ఇలా ఉంటుందని తండ్రి ఊహించు కొన్నాడు. అయితే ఏదెరులో అతడు చేసిన తీవ్ర పాతకం అతణ్ని జ్యేష్ఠత్వ దీవెనకు అనర్ముణ్ని చేసింది. “నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు” అన్నాడు. ఇంకా లేవీకి యాజకత్వం, యూదాకి రాజ్యం , మెస్సీయ వాగ్దానం, యోసేపుకు రెండురెట్లు దీవెన చిత్రించాడు. రూబేను గోత్రం ఇశ్రాయేలులో ఎలాంటి ప్రాధాన్యాన్ని పొందలేదు. వారి సంఖ్య కూడా యూదా, యోసేపు లేక దాను గోత్రాలంత పెద్దది కాదు. చెరపట్టబడ్డ గోత్రాల్లో రూబేను గోత్రం మొట్టమొదటిది.PPTel 226.2

  వయసులో రూబేను తర్వాతివారు షిమ్యోను, లేవీలు, షెకెమీయులపట్ల క్రూరంగా వ్యవహరించటంలో వీరిరువురు ఏకమయ్యారు. యోసేపును అమ్మటంలో కూడా ఈ ఇద్దరూ ఎక్కువ నేరస్తులు. వారిని గురించి ఇలాగుంది : “యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను”.PPTel 226.3

  కనానులో ప్రవేశించకముందు ఇశ్రాయేలీయుల్ని లెక్కించినప్పుడు అన్ని గోత్రాలకన్నా షిమ్యోను గోత్రం చిన్నది. మోషే తాను చివరగా ఇచ్చిన దీవెనలో షిమ్యోనును పేర్కొనలేదు. కనానులో ఇశ్రాయేలీయులు స్థిరపడ్డప్పుడు ఈ గోత్రానికి యూదా స్థలంలో కొంత భాగం మాత్రమే వచ్చింది. తర్వాత శక్తిమంతమైన కుటుంబాలు వేర్వేరు వలసలు స్థాపించుకొని పరిశుద్ధ దేశం సరిహద్దులకు వెలపల ఉన్న ప్రాంతాల్లో స్థిరపడ్డారు. లేవీ గోత్రం కూడా దేశమంతా చెదిరి ఉన్న నలభై పట్టణాలు మినహా ఎలాంటి స్వాస్థ్యాన్ని పొందలేదు. తక్కిన గోత్రాలు భ్రష్టమైనప్పుడు ఈ గోత్రం యెహోవాకు నమ్మకంగా ఉండటంవల్ల గుడార సేవలు చేసే పవిత్రాధిక్యత లభించింది. ఈ విధంగా ఈ గోత్రం మీద ఉన్న శాపం దీవెనగా మారింది.PPTel 226.4

  జ్యేష్ఠత్వంలోని ప్రధాన దీవెనలు యూదాకు బదలాయింపయ్యాయి. స్తుతి అన్న అర్థంగల ఈ పేరులోని ప్రాముఖ్యం ఈ గోత్రం ప్రవచన చరిత్రలో వెల్లడవుతున్నది. “యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును. నీ తండ్రి కుమారులు నీయెదుట సాగలిపడుదురు. యూదా కొదమ సింహము. నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి. సింహమువలెను, గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుండెదరు”.PPTel 227.1

  ఈ గోత్రానికి మృగరాజైన సింహం ఉచితమైన సంకేతం. ఈ గోత్రంనుంచే దావీదు, దావీదు కుమారుడు, తుదకు ఎవరికి అన్ని అధికారాలు తలలు వంచుతాయో, ఎవరికి అన్ని జాతులు నివాళులర్పిస్తాయో, ఆ యూదా గోత్రపు యధార్థ సింహం అయిన షిలోహు వచ్చారు.PPTel 227.2

  తన కుమారులలో ఎక్కువమందికి మంచి భవిష్యత్తును యాకోబు ప్రవచించాడు. చివరికి యోసేపు వద్దకు వచ్చాడు. “తన సహోదరులనుండి వేరు పరచబడినవాని నడినెత్తి మీద” చెయ్యి ఉంచి దీవిస్తున్నప్పుడు తండ్రి హృదయం ఉద్వేగ భరితమయ్యింది. “యోసేపు ఫలించెడి కొమ్మ, ఊటయెద్ద ఫలించెడి కొమ్మ. దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి. వారు బాణములను వేసి, అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమ శాలియైన వాని హస్త బలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపువాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోను స్థానముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచ బడిన వాని నడినెత్తిమీదను ఉండును”.PPTel 227.3

  యాకోబు ఎల్లప్పుడు గాఢమైన ప్రేమ ప్రదర్శించిన వ్యక్తి. కుమారులపట్ల అతడి ప్రేమ ధృఢమైనది. సున్నితమైనది. అతడి మరణ వాంగ్మూలం పక్షపాతంతోను ద్వేషంతోను ఇచ్చింది కాదు. వారందరినీ క్షమించాడు. అందరిని చివరిదాక ప్రేమించాడు. తండ్రి ప్రేమ ధైర్యకరమైన మాటలనే వ్యక్తం చేసి ఉండేది. కాని దేవుని శక్తి అతడి మీద నిలిచింది. పరిశుద్దాత్మ ఆవేశంవలన అతడు ఎంత బాధాకరమైందైనా సత్యాన్నే పలికాడు.PPTel 227.4

  చివరి దీవెనల్ని ఇచ్చిన అనంతరం తనను సమాధి చెయ్యటం గురించిన వాగ్దానం విషయం మళ్లీ ప్రస్తావించాడు. “నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను... నా తండ్రుల యొద్ద నన్ను పాతి పెట్టుడి... ఆ గుహ మక్పేలా పొలములో ఉన్నది. అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతి పెట్టితిని”. తన జీవితంలోని చివరి చర్య ఈ విధంగా దేవుని వాగ్దానం పై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నది.PPTel 228.1

  యాకోబు చివరి సంవత్సరాలు ప్రశాంతంగా గడిచాయి. కష్టాలు, శ్రమలతో నిండిన జీవితానికి చరమ దశలో విశ్రాంతినిచ్చాయి. తన మార్గమంతా ఆకాశం మేఘావృతమై ఉన్నా తన సూర్యుడు వెలుగుతో అస్తమించాడు. తన చివరి ఘడియలు సంధ్యారాగంలో రాగరంజితంగా ముగిశాయి. లేఖనం ఇలా అంటున్నది, “అస్తమయ కాలమున వెలుతురు కలుగును”. జెకర్యా 14:7. “నిర్దోషులను కనిపెట్టుము. యధార్థవంతులను చూడుము. సమాధాన పరచువారి సంతతి నిలుచును”. కీర్తనలు 37:37. PPTel 228.2

  యాకోబు పాపం చేసి తీవ్ర శ్రమలనుభవించాడు. తాను చేసిన ఘోర పాప ఫలితంగా తండ్రి గుడారాలు విడిచి పారిపోయిన నాటినుంచి అతడి బతుకు కాయకష్టంతో విచారంతో దు:ఖంతో నిండింది. తల్లినుంచి దైరమై ఆమె ముఖం మరెన్నడూ చూడకుండా ఆశ్రయంలేని కాందిశీకుడుగా నివసించాడు. ప్రేమించిన యువతికోసం ఏడేళ్లు చాకిరీ చేసి ఆ మీదట ఘోర వంచనకు గురి అయ్యాడు. దురాశా పరుడైన బంధువు కొలువులో ఇరవై ఏళ్లు శ్రమించాడు. తన సంపద పెరగటం, తన చుట్టూ తన కుమారులు ఉదయించటం, జగడాలతో అనైక్యతతో ఉన్న ఆ గృహంలో సంతోషం లేకపోవటం చూశాడు. కుమార్తెకు జరిగిన అవమానం గురించి ఆమె అన్నల ప్రతీకారం గురించి రాహేలు మరణం గురించి, రూబేను అస్వాభావిక పాపం గురించి యూదా పాపం గురించి యోసేపు విషయంలో జరిగిన క్రూర వంచన గురించి ప్రదర్శితమైన ద్వేషం గురించి వేదన చెందాడు. అతడి మనోనేత్రం ముందున్న నేరాల జాబితా ఎంత పెద్దది! ఆ మొదటి తప్పుడు పని ఫలితాన్ని పదే పదే అనుభవించాడు. తాను చేసిన పాపాలే తన కుమారుల్లో పదే పదే పునరావృత్తం కావటం చూశాడు. అయితే శిక్ష ఎంతో బాధాకరమైనా అది దాని పనిచేసింది. నొప్పి కలిగించినా శిక్ష “నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” హెబ్రీ 12:11.PPTel 228.3

  దేవుని ప్రేమాభిమానాలు పొందిన మంచి మనుషుల పొరపాట్లను దైవావేశం నమ్మకంగా నమోదు చేస్తుంది. నిజానికి వారి మంచికన్నా వారి పొరపాట్లనే సంపూర్ణంగా కనపర్చుతుంది. ఇది అనేకులకు ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. నాస్తికులు బైబిలుని వెక్కిరించటానికి ఇది అవకాశం కల్పిస్తుంది. వాస్తవాల్ని విస్మరించకపోవటం, ప్రధాన పాత్రధారుల పాపాల్ని అణచివేయకపోవడం, ఇవి లేఖనాలు సత్యమనటానికి బలమైన నిదర్శనం. మనుషుల మనసులు పూర్వ నిశ్చితాభిప్రాయాలతో నిండి ఉండటంచేత మానవ చరిత్రలు నిష్పాక్షికంగా ఉండటం సాధ్యం కాదు. దైవావేశంలేని వ్యక్తులు బైబిలుని రచించి ఉంటే అందులోని ప్రముఖమైన, గౌరవనీయమైన వ్యక్తులను మానవాతీత వ్యక్తులుగా చిత్రించి ఉండేవారు. అలాక్కాక వారి అనుభవాల యధాతథ చిత్రణే మనకు బైబిలులో ఉన్నది. దేవుడు ఎవరిని ప్రేమించి ఎవరికి గొప్ప బాధ్యతలు అప్పగించాడో ఆ మనుషులు కొన్నిసార్లు శోధనకు లొంగి, ఈనాడు మనంకూడా ప్రయత్నించి, తడబడి తరచుగా పొరపాటులో పడేటట్లు వారూ పాపం చేశారు.PPTel 229.1

  దోషాలు, పాపాలతో నిండిన వారి జీవితాలు మనకు ధైర్యం చేకూర్చటానికి, మనకు హెచ్చరిక చేయటానికి మన ముందే ఉన్నాయి. తప్పులు లేనివారిగా వారు మన ముందుకు వచ్చి ఉంటే పాప స్వభావంగల మనం తప్పిదాలు, అపజయాల విషయం నిస్పృహ చెందే వారం. కాని మన ఆశాభంగాలవంటి ఆశాభంగాలతో ఇతరులు ఎలా పోరాడారో, మనలాగే వారు ఎక్కడ శోధనకు గురి అయ్యారో అయినా ధైర్యం తెచ్చుకొని దేవుని కృపద్వారా ఎలా విజయం పొందారో చూసి, నీతికోసం మనం చేసే కృషిలో ధైర్యం పొందవచ్చు. కొన్నిసార్లు విజయం పొందినా, వారు ఎలా తన పరాజయాల్ని అధిగమించి దేవుని దీవెనలు ఎలా పొందారో అలాగే మనంకూడా యేసు బలంతో విజయులం కాగలుగుతాం. అంతేగాక వారి జీవిత చరిత్ర మనకు ఒక హెచ్చరికగా కూడా ఉండగలదు. దేవుడు మన దోషాలను తీసివేయడని కూడా అది చూపిస్తుంది. తాను అమితంగా ప్రేమించే వారిలోని పాపాల్ని ఆయన చూస్తాడు. తక్కువ జ్ఞానం ఉన్నవారితో వ్యవహరించే దానికన్నా తనకు ప్రియమైన వారితో వారి దోషా నిమిత్తం ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తాడు.PPTel 229.2

  యాకోబు సమాధి తర్వాత యాకోబు కుమారుల మనసుల్లో మళ్లీ భయం చెలరేగింది. తమపట్ల యోసేపు దయగా వ్యవహరించినా తమ నేరస్పృహ అన్నల్ని అపనమ్మకంతో అనుమానంతో నింపింది. తండ్రి మీద తనకున్న గౌరవం పగసాధించకుండా యోసేపును ఆపి ఉంటుందని ఇప్పుడు తమ నేరానికి ఎంతో కాలంగా నిలపిన శిక్షను తప్పకు అమలుపర్చవచ్చునని వారు భావించారు. స్వయంగా యోసేపు సముఖంలోకి రాలేక ఈ వర్తమానం పంపారు, “నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా -- మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుము”. ఈ వర్తమానం విని యోసేపు ఏడ్చాడు. ఇది చూసి ధైర్యం తెచ్చుకొని అన్నలు సాష్టాంగపడి ఇలా అన్నారు. “ఇదిగో మేము నీకు దాసులము”. తన అన్నలపట్ల యోసేపుకు గాఢమైన స్వార్థరహితమైన ప్రేమ ఉంది. తనకు పగతీర్చుకొనే ఉద్దేశమున్నట్లు అన్నలు భావిస్తున్నందుకు యోసేపు బాధపడ్డాడు. “భయపడకుడి, నేను దేవుని స్థానమందు న్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకుడి. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను” అన్నాడు. PPTel 229.3

  యోసేపు జీవితం క్రీస్తు జీవితానికి సాదృశ్యం. అన్నలు యోసేపు పై అసూయ పెంచుకున్నారు. అది వారు అతణ్ని అమ్మటానికి కారణమయ్యింది. అతడు తమకన్న గొప్పవాడు కాకుండా అడ్డుకోగల మనుకున్నారు. అతడు ఐగుప్తుకి వెళ్లిపోయినప్పుడు అతడి కలలు తమను ఇక బాధించవని సంతోషించారు. అది నెరవేరే అవకాశాన్నే లేకుండా చేశామని మురిసిపోయారు. అయితే వారు ఏదైతే నెరవేరకుండా చెయ్యాలని ప్రయత్నించారో దాన్ని నెరవేర్చటానికి దేవుడు వారిని పక్కకు నెట్టాడు. అలాగే యూదు యాజకులు యూదు పెద్దలు, ప్రజల్ని తమతో ఉండకుండా తనవద్దకు ఆకర్షించుకొంటాడన్న భయంతో క్రీస్తుపై అసూయ పెంచుకొన్నారు. ఆయన యూదుల రాజవుతాడన్న భయంతో ఆయనను చంపారు. అలా చేయటం ద్వారా తాము కాదనుకున్న కార్యాన్నే వారు జరిగిస్తున్నారు.PPTel 230.1

  ఐగుప్తు దాసత్వం ద్వారా యోసేపు తన తండ్రి కుటుంబానికి రక్షకుడయ్యాడు. అయినా ఆ వాస్తవం అన్నల అపరాధాన్ని తగ్గించలేదు. అలాగే శత్రువులు క్రీస్తును సిలువ వేయటం ఆయనను పడిపోయిన మానవజాతి విమోచకుణ్ని, సర్వలోక పరిపాలకుణ్ని చేసింది. అయినా ఆయనను చంపిన వారి నేరం ఘోరమైన నేరం.PPTel 230.2

  సొంత అన్నలే యోసేపును అమ్మినట్లు శిష్యుల్లో ఒకడు యేసును తన బద్ద విరోధులకు అమ్మాడు. తన నీతి ప్రవర్తన వలన తనపై తప్పుడు నేరం మోపి యోసేపును ఖైదులో వేశారు. అలాగే తన నీతివల్ల ఆత్మోపేక్షతో కూడిన జీవితం పాపాన్ని ఖండించటం వల్ల క్రీస్తును తృణీకరించి విసర్జించారు. ఆయన ఏ నేరం చేయకపోయినా తప్పుడు సాక్ష్యంతో ఆయనకు మరణ దండన విధించారు. అన్యాయం జరిగినప్పుడు, హింసకు గురి అయినప్పుడు యోసేపు ప్రదర్శించిన ఓర్పు, సాత్వికం, తన అస్వాభావిక అన్నలపట్ల క్షమా వైఖరి, ఔదార్యం ... రక్షకుడు దుష్టుల ద్వేషాన్ని, దుర్భాషలను భరించటాన్ని తన హంతకుల్నే గాక తమ పాపాల్ని ఒప్పుకొని క్షమాపణ వేడుకొనే వారందరినీ క్షమించటాన్ని సూచిస్తున్నది.PPTel 230.3

  తండ్రి మరణించిన తర్వాత యోసేపు ఏబయినాలుగు సంవత్సరాలు జీవించాడు. యోసేపు “ఎఫ్రాయిము యొక్క మూడవ తరముల పిల్లలను చూచెను. మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి”. తన ప్రజలు వృద్ధిచెంది వర్థిల్లటం చూశాడు. ఇశ్రాయేలీయులకి వాగ్దత్త భూమిని తిరిగి ఇస్తానన్న దైవ వాగ్దానం పై తన విశ్వాసం ఆ సంవత్సరాలన్నిటిలో అంచంచలంగా నిలిచింది.PPTel 231.1

  మరణం ఆసన్నమయ్యిందని గ్రహించినప్పుడు ఆప్తులందరినీ పిలిపించాడు. ఫరోల ఆదరాభిమానాల్ని పొందినప్పటికీ ఐగుప్తు యోసేపుకి పరదేశమే. తాను ఇశ్రాయేలుకు చెందిన వాడనని తన చివరి క్రియ సూచించాల్సి ఉంది. అతడి చివరి మాటలు ఇవి, “దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి యీ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రయాణము చేసి యిచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవును”. కనాను దేశానికి తన అస్థికల్ని తీసుకొని వెళ్తామని ఇశ్రాయేలు పిల్లలతో యోసేపు వాగ్దానం చెయ్యించుకొన్నాడు. “యోసేపు నూట పది సంవత్సరములవాడై మృతిపొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి”. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు శతాబ్దాలుగా అనుభవించిన శ్రమలలో ఐగుప్తులో తాము యాత్రికులమని సాక్ష్యమిచ్చి తమ ఆశలను వాగ్రత్త భూమిపై నిలపాలని, విడుదల సమయం నిశ్చయంగా వస్తుందని సూచించిన యోసేపు మరణ వాక్కుల్ని ఆ పెట్టె ఇశ్రాయేలీయులకి జ్ఞాపకం చేసింది.PPTel 231.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents