Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  12—కనానులో అబ్రాహాము

  అబ్రాహాము “వెండి, బంగారము, పశువులు కలిగి బహు ధనవంతుడై” కనానుకు తిరిగి వచ్చాడు. లోతు తన తోనే ఉన్నాడు. మళ్లీ బేతెలుకు వచ్చి క్రితం తాము కట్టిన బలిపీఠం పక్కనే గుడారాలు వేసుకొన్నారు. ఆస్తి పెరగటంతో సమస్యలు కూడా పెరిగాయి. కష్టాలు శ్రమల మధ్య అబ్రాహాము, లోతు సమాధానం గానే నివసించారు. కాని సంపద పెరుగుదల సందర్భంగా వారి మధ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముంది. ఇరువురి గొర్రెలు పశువుల మందలకు చాలినన్ని గడ్డి బీడులు లేవు. మంద కాపరుల మధ్య తగాదాలు పరిష్కారం కోసం వారి వద్దకు తరచుగా వస్తున్నాయి. వారిరువురు వేరు పడాల్సిన అవసరం ఏర్పడింది. అబ్రాహాము లోతుకన్నా వయసులో పెద్దవాడు. సంబంధాల విషయంలోను, సంపద విషయంలోను హోదా విషయంలోను అబ్రాహాము స్థితి పెద్దది. అయినా శాంతి సమాధానాల దృష్ట్యా అబ్రాహామే ప్రణాళికను ప్రతిపాదించాడు. భూమి అంతటినీ దేవుడే తనకు వచ్చినా అబ్రాహాము ఆ హక్కును పట్టించుకోలేదు.PPTel 122.1

  “మనము బంధువులము గనుక నాకును, నీకును, నా పశువుల కాపరులకును, నీ పశుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ యెదుట నున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్లిన యెడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్లిన యెడల నేను యెడమ తట్టునకును వెళ్లుదును” అని లోతుతో చెప్పాడు.PPTel 122.2

  ఇక్కడ అబ్రాహాము ఉదాత్త, స్వార్థరహిత స్వభావం కనిపిస్తున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతమంది తమ వ్యక్తిగత హక్కులకు ఎంపికలకు హత్తుకు పోయి ఉంటారు! “నీకును నాకును..... కలహముండకూడదు”. మనము బంధువులము” అన్నాడు అబ్రాహాము, వారు జన్మత్త బంధువులేకాకా నిజమైన దేవుని ఆరాధకులు గనుక వారిరువురూ బంధువులు. లోకమంతా ఉన్న దైవ ప్రజలు ఒకే కుటంబ సభ్యులు. అవే మమతానురాగాలు అదే సమాధాన స్ఫూర్తి. దైవ ప్రజల మధ్య రాజ్య మేలాలి. “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషమయులో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” (రోమా 12:10) అన్నది మన రక్షకుని బోధన. అందరి ఎడల మర్యాదగా ప్రవర్తించటం, ఇతరులు మనకు చేయలని మనం కోరేదే మనం ఇతరులకు చేయటానికి సిద్ధమనస్సు కలిగి ఉండటం బతుకు బాటలోని సగం సమన్యల్ని పరిష్కరిస్తాయి. స్వీయ బల సంపదల వృద్ధిని కోరేది సాతాను గుణం. కాగా క్రీస్తును ప్రేమించే వ్యకిత్త హృదయం స్వప్రయోజనం విచారించాదు. అట్టివారు దేవుడిచ్చిన ఈ ఆదేశాన్ని ఆచరిస్తారు. “మీలో ప్రతివాడును, తన సొంత కార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” ఫిలిప్పీ 2:4.PPTel 122.3

  అబ్రాహాముతో ఉన్నందువల్లనే లోతు అభివృద్ధి చెందినా లోతు తన ఉపకారికి కృతజ్ఞత కనపర్చలేదు. ఎంపిక అబ్రాహాముకి విడిచి పెట్టటం మర్యాద. కాని లోతు స్వార్థంతో నిండి లాభాలన్నీ తానే పొదాలని ప్రయత్నించాడు. “తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను.... సాయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమై యుండెను”. పాలస్తీన దేశమంతటిలోనూ మిక్కిలి సారవంతమైన ప్రదేశం యోర్దాను లోయ, చూసే వారిద్దరికీ అది పోయిన పరదైసు జ్ఞప్తికి తెచ్చింది. వారు కొద్దికాలం క్రితమే విడిచి వచ్చిన సుందరమైన ఫలవంతమైన నైలునది మైదానాల్లా కనిపించింది. అక్కడ అందమైన పట్టణాలు, డబ్బుగల పట్టణాలు ఉన్నాయి. వాటి బజార్లు, లాభసాటి వర్తకం చేసే వర్తకులతో నిండి ఉన్నాయి. ధన సంపదను గూర్చి కలలు కంటూ అక్కడ ఎదురు కానున్న నైతిక, అధ్యాత్మిక దుర్మార్గతను లోతు ఉపేక్షించాడు “మైదానమందున్న పట్టణములలోని మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పావులునై యుండిరి”. ఇది అతడికి తెలియదు. ఒకవేళ తెలిసినా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అతడు “యోయోను ప్రాంతమంతటిని ఏర్పరుచుకొని” “సొదొమ దగ్గర తన గుడారము వేసికొనెను”. తన స్వార్థపూరిత ఎంపిక ఫలితాలు ఎంత భయంకరమైనవో అతడు ఊహించలేకపోవటం ఎంత శోచనీయం!PPTel 123.1

  లోతు వేరుపడిన తర్వాత అబ్రాహాముకి దేవుడు మళ్లీ వాగ్దానం చేశాడు ఈ దేశమంతా తనకిస్తానని. ఇది అయిన వెంటనే అబ్రాహాము హెబ్రోనుకు వెళ్లి మమే దగ్గర సింధూర వనంలో గుడారం వేసుకొని దాని పక్కనే దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. అక్కడి మెరక భూముల్లోని ఒలీవ వనాలు, ద్రాక్షతోటల్లో నుంచి, పంటతో నిండిన పొలాల్లోనుంచి, కొండల చూట్టూ ఉన్న విశాల గడ్డి మైదానాలనుంచి వస్తున్న చక్కని గాలి ప్రశాంత వాతావరణంలో అబ్రాహాము సామాన్య జీవితం జీవిస్తూ తృప్తి చెంది లోతుకి తాను కోరుకున్న సాదొమ లోయను విడిచి పెట్టాడు.PPTel 123.2

  చుట్టూ ఉన్న రాజ్యాలు అబ్రాహామును మహరాజుగా సమర్థమైన అధినేతగాను గౌరవించాయి. తన ప్రభావం పొరుగున ఉన్నవారి పై పడకుండా అబ్రాహాము దాచుకోలేదు. విగ్రహరాధకుల జీవితాలకు మల్లేకాక ఆబ్రాహాము జీవితం, ప్రవర్తన నిజమైన విశ్వాసం పక్షంగా శక్తిమంతమైన ప్రభావాన్ని ప్రసరించాయి. దేవుని పై అతని విశ్వాసం అచంచలం. అతని మృదు స్వభావం, ఔదార్యం ఇతరుల్లో నమ్మకాన్ని, మిత్రతను పుట్టించాయి. అతని స్వాభావిక ఔన్నత్యాన్ని ఇతరులు గుర్తించి గౌరవించారు.PPTel 124.1

  అబ్రాహాము తన మతాన్ని కేవలం తన కోసమే తాను అనుభవించటానికే ఒక ప్రశస్త నిధిగా భద్రంగా కాపాడుకోలేదు. యాదార్ధ మతాన్ని అలా బంధించలేం. అలాంటి స్వభావం సువార్త స్ఫూర్తికి బద్ద విరుద్ధం, క్రీస్తు హృదయంలో నివసిస్తుండగా ఆయన సన్నిధి కాంతిని దాచి ఉంచటం అసాధ్యం లేదా ఆ కాంతి క్షీణించటం అసాధ్యం. మంచులా ఆత్మను అలుముకున్న స్వార్థాన్ని, పాపాన్ని నీతి సూర్యుడి కిరణాలు పారదోల్తాయి.PPTel 124.2

  తన ప్రజలే లోకంలో దేవునికి ప్రతినిధులు. ఈ లోకంలోని నైతిక అంధకారంలో వారు జ్యోతులై ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేశంలోని పట్టణాల్లో, నగరాల్లో, గ్రామల్లో దేవునికి సాక్షులుగాను విశ్వసించని లోకానికి ఆయన అందించగోరుతున్న తన వాక్యానికి కృపకు సాధనాలుగాను వారు ఉండాలని కోరుతున్నాడు. రక్షణలో పాలుపొందే వారందరూ తనకు మిషనెరీలు కావలన్నది ఆయన ప్రణాళిక. క్రైస్తవుడి భక్తి జీవితమే లోకస్తులు సువార్తను కొలిచే కొలామానం. సమానంతో భరించే శ్రమలు, ఆర్భాటం లేకుండా అనుభవించే దీవెనలు, అలవాటుగా బహిర్గతమయ్యే సాత్వికం, కనికరం, దయాళుత్వం, అనురాగం ఇవి ప్రవర్తన ద్వారా లోకంముందు వెలిగే దీపాలు. ఈ గుణాలు స్వాభావిక హృదయంనుంచి వెలువడే స్వార్థపు చీకటికి భిన్నమైనవి.PPTel 124.3

  అబ్రాహాము విశ్వాసపరంగా భాగ్యవంతుడు. ఔదర్యంలో అధికుడు, అచంచల విధేయతగల భక్తుడు, సాత్వికుడు, నిరాడంబరంగా నివసించిన యాత్రికుడు, అతడు రాజనీతిలో మహజ్ఞాని, భయమెరుగని యుద్ధ శూరుడు, కొత్త మత బోధకుడుగా పేరుపొందినప్పటికి తాను నివసిస్తున్న అమోరీయ మైదానంలోని నగరాల్ని పాలించే ముగ్గురు రాజ సహోదరులు అబ్రాహాముపట్ల స్నేహం ప్రకటించి ఆ ప్రాంతం భద్రత నిమిత్తం అతనితో సంధి కోరారు. ఎందుకంటే దేశం దౌర్జన్యంతోను, హింసతోను నిండి ఉన్నది. ఈ సంధిని ఉపయోగించుకోవటానికి కొద్ది కాలంలోనే అబ్రహాముకు అవసరం ఏర్పడింది.PPTel 124.4

  ఏలాము రాజైన కదొర్లాయోమెరు పధ్నాలుగా ఏళ్ళ క్రితం కనాను పై దండెత్తి దాన్ని తన సామంత రాజ్యంగా చేసుకొన్నాడు. ఇప్పుడు చాలామంది సామంత రాజులు తిరుగుబాటు చేయటంతో ఏలాము రాజు నలుగురు మిత్రరాజులతో కలిసి తిరుగుబాటుకు అణచివేయటానికి ఆ రాజ్యం పై మళ్లీ దండెత్తాడు. అయిదుగురు కనాను రాజులు ఏకమై ముట్టడిదార్లను సిద్దీము లోయలో ఎదుర్కొన్నారు. కాని వారు ఘోర పరాజయం పాలయ్యారు. వారి సంయుక్త సేనలో చాలమందిని శత్రు సైన్యం ముక్కల ముక్కలుగా ఖండించింది. కొందరు తప్పించుకొని తలదాచుకోటానికి కొండలలోకి పారిపోయారు. విజేతలు మైదానంలో పట్టణాల్ని కొల్లగొట్టి గొప్ప దోపుడు సొమ్ముతోను అనేక బందీలతోను వెళ్లిపోయారు. ఆ బందీల్లో లోతు అతడి కుటుంబం ఉన్నారు.PPTel 125.1

  మ వద్ద సింధూరవనంలో ప్రశాంతంగా నివసిస్తున్న అబ్రాహాము ఆ యుద్ధం గురించి తన సోదరుడి కుమారుడు లోతుకి అతడి కుటుంబానికి ఏర్పడ్డ విపత్తును గురించి అక్కడ నుంచి తప్పించుకొని వచ్చిన ఒక వ్యక్తి ద్వారా తెలుసుకొన్నాడు. లోతు కృతఘ్నతను అబ్రాహాము మనసులో ఉంచుకోలేదు. లోతుపట్ల తనకున్న ప్రేమ నిద్రలేచింది. అతడ్ని కాపాడటానికి తీర్మానించుకొన్నాడు. ముందుగా దేవునితో సంప్రదించి అబ్రాహాము యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. తన సొంత శిబిరం నుంచి మూడు వందల ఎనభైమంది శిక్షణ పొందిన సేవకుల్ని సమకూర్చాడు. వారు దైవభక్తిలోను, తమ నాయకుడి సేవలోను, ఆయుధాలు ఉపయోగించటంలోను శిక్షణ పొందిన మనుషులు. తన మిత్రరాజులు మమే, ఎష్కోలు, అనేరులు తమ తమ సేనలతో అబ్రహాముతో ఏకమై ముట్టడిదారుల్ని పట్టుకోటానికి బయలుదేరారు. ఎలామీయులు వారి మిత్రపక్షాలు కనాను ఉత్తర సరిహద్దున ఉన్న ధానులో శిబిరం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. విజయగర్వంతో ఓడిపోయిన తమ శత్రువులు ఎదురుదెబ్బ తీయలేరన్న ధీమాతో వారు తాగి తందనాలాడుతున్నారు. శత్రువుని ఆయా పక్కలనుంచి ఎదుర్కొనేందుకు అబ్రాహాము తన సేనల్ని విభజించి శత్రు శిబిరంమీదికి రాత్రివేళ దండెత్తాడు. అది శక్తివంతమైన హఠాత్తుగా ఏర్పాటైన దాడి. అందులో అబ్రాహాము విజయం సాధించాడు. ఏలాము రాజు హతుడయ్యాడు. భయభ్రాంతులైన అతడి సైన్యం వైరి కరవాలాలకు ఎర అయ్యింది. లోతు అతడి కుటుంబం వారి పనివారు వారి సామాగ్రితో పాటు శత్రువుల చెరనుంచి విముక్తి పొందారు. దేవుని నడుపుదల కింద అబ్రాహాము మూలంగానే ఆ జయం సాధ్యపడింది. యెహోవా భక్తుడైన అబ్రాహాము దేశానికి సేవ చేయటం మాత్రమే కాదు తాను యుద్ధ శూరుడినని రుజువుPPTel 125.2

  చేసుకొన్నాడు. నీతి అంటే పిరికితనం కాదని అబ్రాహాము మతం న్యాయాన్ని కాపాడి బాధితుల్ని ఆదుకోటానికి అతనికి ధైర్యసాహసాలిచ్చిందని వ్యక్తమయ్యింది. అబ్రాహాము నిర్వహించిన సాహసకార్యం చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో అతడి పలుకుబడిని ఇనుమడింపజేసింది. అబ్రాహాము యుద్ధం నుంచి తిరిగివచ్చినప్పుడు సొదొమ రాజు విజేతను సన్మానించటానికి తన పరివారంతో బయటికివచ్చాడు. ఖైదీల్ని మాత్రమే తనకు తిరిగి ఇవ్వమని కొల్లధనాన్ని తీసుకోమని అతడు అబ్రాహామును బతిమాలాడు. యుద్ధ సంప్రదాయం ప్రకారం విజేత కొల్లధనానికి హక్కుదారుడు. అయితే అబ్రాహాము ఈ దండయాత్రను లాభాపేక్షతో నిర్వహించలేదు గనుక దురదృష్టాన్ని సొమ్ము చేసుకోటానికి నిరాకరించాడు. తన మిత్ర రాజులికి రావలసింది మాత్రం వారికివ్వాల్సిందిగా కోరాడు.PPTel 126.1

  అలాంటి పరీక్షవస్తే అబ్రాహాము చూపించిన ఔదార్యాన్ని చూపించేవారు బహుకొద్దిమంది. అంత ధనాన్ని సొంతం చేసుకోటానికి కలిగే శోధనకు లొంగనివారు బహుకొద్దిమందే. అతని ఆదర్శం స్వార్థపరులకు చెంపపెట్టు. అబ్రాహాము న్యాయాన్ని, మానవత్వాన్ని ఉన్నతంగా పరిగణించాడు. “నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అన్న పరిశుద్ధ సూత్రానికి అబ్రాహాము ప్రవర్తన ఒక సాదృశ్యం. లేవీకాండము 19:18. “నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీ వాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు, భూమికిని సృష్టికర్తయును, సర్వోన్నతుడును, దేవుడునైన యెహోవా యెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను” అన్నాడు. తాను ఏదో ఉపకారం పొందటానికే యుద్ధం చేశాడన్న తలంపు కలిగించటానికి ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని లేదా వారి బహుమతుల వల్ల దయవల్ల తాను ధనవంతుడైనట్లు వారి తలంచటానికి వారికి తావీయకూడదని అతడు భావించాడు. అబ్రాహాముని ఆశీర్వదిస్తానని దేవుడ వాగ్దానం చేశాడు. ఆ మహిమ ఆయనకే చెందాల్సి ఉంది.PPTel 126.2

  విజేతకు స్వాగతం చెప్పటానికి బయటికి వచ్చిన మరొక వ్యక్తి షాలేము రాజైన మెల్కీ సెదకు. అతడు అబ్రాహాము సైనికులకు రొట్టె, ద్రాక్షరసం తెచ్చాడు. “సర్వోన్నతుడగు దేవుని యాజకుడు”గా అతడు అబ్రాహామును ఆశీర్వదించి తన సేవకుడు అబ్రాహాము ద్వారా గొప్ప విమోచన కలిగించిన ప్రభువుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. అప్పుడు అబ్రాహాము “అన్నిటిలో ఇతనికి పదియవ వంతు ఇచ్చెను”.PPTel 126.3

  అబ్రాహాము తన గుడారాలు, మందలు ఉన్న తావుకి ఉత్సాహంగా తిరిగి వెళ్లాడు. తన మనసు మాత్రం కొంత ఆందోళనకు గురి అయ్యింది. సాధ్యమైనంత వరకు విరోధానికి వివాదాలికి దూరంగా ఉంటూ శాంతి దూతగా వ్యవహరించాడు. తాము చూసిన హత్యాకాండను జ్ఞాపకం చేసుకొన్నాడు. తాను ఓడించిన రాజులు కనాను పై దాడిని మళ్లీ ప్రారంభించటం అబ్రాహాము పై కక్ష తీర్చుకోవటం ఖాయం. రాజకీయ సంఘర్షణల్లో ఆరీతిగా కలిగించుకోటంవల్ల తాననుభవిస్తున్న శాంతి సమాధానాలు తనకు కరవవుతాయి. అంతేకాదు, తానింకా కనానును స్వాధీన పర్చుకోలేదు. దేవుడు తనకు చేసిన వాగ్దానం నెరవేరటానికి ఇప్పుడు అతనికి సంతానం కలిగే అవకాశం కూడా లేదు. PPTel 127.1

  రాత్రి దర్శనంలో దేవుని స్వరం మళ్లీ వినిపించింది. “అబ్రాహామూ! భయపడకుము. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును” అని సమాధానాధిపతి పలికాడు. అయితే అబ్రాహాము మనసు బయంతోను, సంశయంతోను నిండటంచేత ఆ వాగ్దానాన్ని ముందులా అచంచల విశ్వాసంతో నమ్మలేకపోయాడు. ఆ వాగ్దాన నెరవేర్పుకు గట్టి నిదర్శనం కోసం ప్రార్థించాడు. కుమారుణ్ణి ఇవ్వకుండా నిబంధన వాగ్దానాన్ని దేవుడు ఎలా నెరవేర్చుతాడు? “నాకేమి యిచ్చిన నేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే” “ఇదిగో... నా పరివారములో ఒకడు నాకు వారసుడగును” తన నమ్మకమైన సేవకుడు ఎలియాజరుని దత్తత చేసుకొని తన ఆస్తికి వారసుడుగా చేయాలని ఆలోచించాడు. తన సొంత కుమారుడే తనకు వారసుడవుతాడన్న నిశ్చయతను దేవుడు అబ్రాహాముకిచ్చాడు. అప్పుడు అబ్రాహాముని తన గుడారం వెలుపలికి పిలిచి ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాల వంక చూడమని చెప్పాడు. నక్షత్రాల వంక అబ్రాహాము చూస్తుండగా దేవుడు ఈ మాటలు పలికాడు, “నీ సంతానము ఆలాగవును”. “అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను.” రోమా 4:3.PPTel 127.2

  ఇంకా, తన విశ్వాస ధ్రువీకరణగాను, తన నిమిత్తం దేవుని సంకల్పాలు నెరవేరాయని తదనంతర తరాలవారికి నిదర్శనంగాను కంటికి కనిపించే ఒక గుర్తుకోసం అబ్రాహాము దేవున్ని అర్థించాడు. ఒక ముఖ్యమైన కార్యాన్ని ధ్రువపర్చటానికి మనుషులు సామాన్యంగా అవలంబించే ఆచారాన్ననుసరించి అతనితో ఒక నిబంధన చేసుకోటానికి దేవుడు దిగివచ్చాడు. దేవుని సూచన మేరకు అబ్రాహాము మూడేళ్ల పెయ్యను, మూడేళ్ల మేకను, మూడేళ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురం పిల్లను నడుముకు ఖండించి దేని ఖండాన్ని దానికి ఎదురుగా ప్రత్యేకించి ఉంచాడు. వీటితో పాటు ఒక తెల్లగువ్వను, ఒక పావురం పిల్లను వధించాడు. పిట్టల్ని మధ్యకు ఖండించలేదు. ఇది అయిన తర్వాత వాటి మధ్య నడిచి దేవునికి నిత్యము విధేయుడై వుంటానని వాగ్దానం చేశాడు. ఆ కళేబరాలు అపవిత్ర పడకుండా లేదా పక్షులు వాటిని తినేయకుండా అప్రమత్తుడై కావలికాస్తూ వాటిపక్కనే ఉన్నాడు. దాదాపు పొద్దుకుంకే సమయంలో గాఢ నిద్రలో మునిగిపోయాడు. “భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా” వాగ్దాత్త భూమిని స్వాధీనం చేసుకోటం వెంటనే జరగదని, తన సంతతి ప్రజలు కనానులో స్థిరపడక ముందు శ్రమలు, కష్టాలు అనుభవించాల్సి ఉంటుందని దేవుని స్వరం చెప్పటం విన్నాడు. క్రీస్తు మరణం, మహా త్యాగం, మహిమతో ఆయన రాకడ ద్వారా రక్షణ ప్రణాళిక అతనికి బహిర్గతం చేయబడింది. వాగ్దాన నెరవేర్పుగా తాను అనంతకాలం నివసించటానికిగాను ఏదెను సౌందర్యంతో పునరుద్ధరణ పొందిన భూమిని తాను సొంతం చేసుకోటం కూడా అబ్రాహాము చూశాడు. మానవులతో దైవ నిబంధన వాగ్దానంగా, దైవ సన్నిధికి చిహ్నాలైన రాజుతున్న పొయ్యి, అగ్ని జ్వాల ఆ ఖండాల మధ్య కనిపించి వాటిని పూర్తిగా దహించివేసింది. “ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు” కనాను దేశాన్ని ఇస్తానన్న వాగ్దానాన్ని ధ్రువపర్చుతూ ఒక స్వరం పలకటం అబ్రహాముకు వినిపించింది.PPTel 127.3

  అబ్రాహాము కనానులో దాదాపుగా ఇరవై అయిదేళ్లు నివసించిన తర్వాత ప్రభువతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడచుచు నిందారహితడవై యుండుము”. అబ్రాహాము ప్రభువు ముందు సాగిలపడగా అతనితో దేవుడిలా అన్నాడు, “ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు”. ఈ నిబంధన నెరవేర్పుకు గుర్తుగా అంతవరకు అబ్రామని ఉన్న పేరు “అనేక జనములకు తండ్రి” అని సూచించే అబ్రాహాముగా మార్చబడింది. శారయి పేరు శారా అయ్యింది. ఎందుకంటే “ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమె వలన కలుగుదురు” అని దైవ స్వరం చెప్పింది.PPTel 128.1

  ఈ సమయంలో “అతడు సున్నతి పొందకమునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను” రోమా 4:11. తాము దేవుని పరిచర్యకు అంకితమై విగ్రహారాధకుల నుంచి వేరయ్యారని తమను దేవుడు ప్రత్యేక జనాంగంగా అంగీకరించాడని వ్యక్తం చేసే గుర్తుగా దీన్ని అబ్రాహాము అతని సంతతివారు ఆచరించాల్సి ఉన్నారు. అబ్రాహాముతో దేవుడు చేసిన ఈ నిబంధన షరతుల్ని నెరవేర్చుతామని ఈ ఆచారం ద్వారా వారు బద్దులై ఉన్నారు. అన్యులతో వారికి వివాహ సంబంధాలుండకూడదు. అట్టి సంబంధాల ద్వారా వారు దేవుని పట్ల పరిశుద్ధ ధర్మశాస్త్రంపట్ల గౌరవాన్ని కోల్పోటం జరుగుతుంది. అన్యుల దురాచారాల్లో పాలు పొందటానికి విగ్రహారాధన చేయటానికి వారికి శోధన కలుగుతుంది.PPTel 128.2

  అబ్రాహాముపట్ల దేవుడు గొప్ప గౌరవం చూపించాడు. స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడేటట్లు పరలోక దూతలు అబ్రాహాముతో నడిచేవారు మాట్లాడేవారు. సొదొమ మీదికి తన తీర్పులు పంపకముందు ఆ సంగతి దేవుడు అబ్రాహాముకి దాచలేదు. ఆ విషయంలో పాపుల తరపున అబ్రాహాము దేవుని ముందు ఉత్తరవాది అయ్యాడు. దేవదూతలతో అతని సమావేశం అతిథి ఆతిథ్యం విషయంలో చక్కని ఆదర్శంగా నిలిచింది. ఎండాకాలంలో గుడారం ద్వారంలో కూర్చొని తనముందున్న ప్రశాంత దృశ్యాన్ని తిలకిస్తూ ఉన్న తరుణంలో ముగ్గురు బాటసారులు రావటం అబ్రాహాము చూశాడు. అతని గుడారం దగ్గరకు రాకముందు తమ మార్గం గురించి సంప్రదించు కోటానికన్నట్లు ఆ పరదేశులు ఆగారు. వారు వచ్చి సహాయం కావాలని అడిగే వరకూ ఆగకుండా అబ్రాహాము కంగారు కంగారుగా లేచి వారు మరోదిశకు వెళ్లటానికి మలుపు తిరగనున్నట్లు కనిపించినప్పుడు వారి వెనక పరుగెత్తి తన ఇంటిలో విశ్రమించి తనను గౌరవించాల్సిందిగా ఎంతో వినయంగా వారిని కోరాడు. వారు కాళ్లు కడుగుకోటానికి స్వయంగా తానే నీళ్లందించాడు. వారికి ఆహారం తానే ఎంపికచేసి ఆ నీడలో వారు విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో వారికి భోజన వసతి ఏర్పాటు చేసి వారు భోంచేసేటప్పుడు మర్యాదపూర్వకంగా వారి ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఈ వినయ స్వభావం దాఖలు కావలసినంత ప్రాముఖ్యమైనదిగా దేవుడు పరిగణించాడు. వెయ్యి సంవత్సరాల తదనంతరం దాన్ని గురించి ఆవేశపూరితమైన అపొస్తలుడిలా అన్నాడు: “ఆతిథ్యము చేయ మరువకుడి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. హెబ్రి 13:2.PPTel 129.1

  ఈ ముగ్గురిలో అలసిఉన్న బాటసారుల్ని మాత్రమే అబ్రాహాము చూశాడు. వారిలో ఒకరు పూజనీయుడైన దేవుడున్నట్లు అతనికి తెలియలేదు. అయితే ఈ పరలోక రాయబారుల కథాకమామీషు బయలు పడింది. వారు దైవాగ్రహరాయబారులుగా వెళ్తున్నా విశ్వాసానికి పేరుపొందిన అబ్రాహాముతో ముందు ఆశీర్వాదాల గురించి మాట్లాడారు. పాపాన్ని గుర్తించటంలోను అతిక్రమాన్ని శిక్షించటంలోను దేవుడు ఖచ్చితంగా ఉన్నప్పటికీ శిక్షించటంలో ఆయనకు సంతోషం లేదు. అపార ప్రేమగల ఆయనకు నాశనం చేసే పని “ఆశ్చర్యమైన కార్యము”.PPTel 129.2

  “యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులుగల వారికి తెలిసియున్నది.” కీర్తనలు 25:14. అబ్రాహాము దేవుని ఘనపర్చాడు. దేవుడు అబ్రాహామును గౌరవించి తన ఆలోచనల్ని, ఉద్దేశాల్ని అతనికి తెలియజేశాడు. “నేను చేయబోవు కార్యము అబ్రామామునకు దాచెదనా?” అని ప్రభువనుకొన్నాడు. “సొదొమ గొమొట్టాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయని యెడల నేను తెలిసికొందును” అనుకొన్నాడు. సొదొమ పాపం ఏంటో దేవునికి బాగా తెలుసు. తన వ్యవహరణ న్యాయమైనదని మనుషులు గ్రహించేందుకోసం మానవుల పద్ధతిలో ఆయన మాట్లాడాడు. అపరాధులకు దండన విధించకముందు అపరాధాన్ని స్వయంగా తానే పరిశోధించటానికి పూనుకొన్నాడు. వారు దేవుని కృప అవధుల్ని మించిపోకుండా ఉంటే పశ్చాత్తాపపడటానికి వారికింకా సమయం ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు.PPTel 130.1

  అబ్రాహాము దైవ కుమారుడుగా ఇప్పుడు గుర్తించిన ప్రభువును అబ్రామాముతో విడిచి పెట్టి ఆ యిద్దరు పరలోక రాయబారులు వెళ్లిపోయారు. అబ్రాహాము సొదొమ నివాసుల పక్షంగా ప్రభువుతో విజ్ఞాపన చేశాడు. వారిని ఒకసారి తన ఖడ్గంతో కాపాడాడు. ఇప్పుడు ప్రార్థనతో కాపాడటానికి ఆపసోపాలు పడున్నాడు. లోతు అతడి కుటుంబ సభ్యులు ఇంకా అక్కడే నివసిస్తున్నారు. ఎలామీయుల బారినుంచి వారిని రక్షించటానికి తనను ప్రోత్సహించిన నిస్వార్థమైన ఆ ప్రేమే ఇప్పుడు దేవుని తీర్పు తుఫానులోనుంచి వారిని కాపాడటానికి ప్రయత్నించింది. PPTel 130.2

  భక్తితో వినయ మనసుతో ఇలా మనవి చేశాడు : “ధూళియు, బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించియున్నాను”. ఇక్కడ ఆత్మవిశ్వాసం గాని తన సొంత నీతిని గూర్చిన స్తుతిగాని లేదు. తన విధేయత ఆధారంగా లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో తాను చేసిన త్యాగాల ఆధారంగా ఏ మేలునూ కోరలేదు. పాపి అయిన తాను పాపి తరపున విజ్ఞాపన సల్పాడు. దేవుని వద్దకు వెళ్లే వారందరిలోనూ ఈ స్వభావం ఉండాలి. అబ్రాహాము ప్రేమగల తండ్రితో విజ్ఞాపన చేసే పసివాడి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. రాయబారిగా వచ్చిన ప్రభువు దగ్గరకు వచ్చి తన మనవిని విన్నవించుకొన్నాడు. లోతు సొదొమలో నివసించినా ఆ పట్టణ ప్రజల దుర్మార్గతలో పాలు పొందలేదు. పెద్ద జనసంఖ్య గల ఆ పట్టణంలో నిజదేవుని ఆరాధించే ఇతరులు ఉంటారని అబ్రాహాము భయపడ్డాడు. ఇది దృష్టిలో ఉంచుకొని ఈ ధోరణిలో విజ్ఞాపన చేశాడు, “నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?” అబ్రాహాము ఇలా విజ్ఞాపన చేసింది ఒకసారి కాదు, అనేకసార్లు. దేవుడు తన మనవుల్ని అంగీకరించేకొద్దీ అబ్రాహాము మరింత ధైర్యం తెచ్చుకొని తుదకు పదిమంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉన్నా దాన్ని నాశనం చేయనన్న హామీని ఆయననుంచి పొందాడు.PPTel 130.3

  నశించిపోతున్న ఆత్మలపట్ల ప్రేమ అబ్రాహాము ప్రార్థనకు ప్రేరణ నిచ్చింది. ఆ పట్టణంలోని పాపాల్ని అసహ్యించుకొన్నా పాపులు రక్షణ పొందాలని వాంఛించాడు. సొదొమ విషయంలో అతడు చూపించిన ఆసక్తి మారుమనసు లేనివారిపట్ల మనకుండాల్సిన ఆందోళనను సూచిస్తున్నది. పాపంపట్ల ద్వేషాన్ని, పాపిపట్ల దయానురాగాల్ని మనం ప్రదర్శించాలి. సొదొమ నాశనానికి కారణమైన భయంకర పాపాల బారినపడ్డ అనేకమైన ఆత్మలు మనచుట్టూ ఉన్నాయి. ప్రతీదినం కొందరికి కృపకాలం ముగిసిపోతున్నది. కొంతమంది ప్రతీ ఘడియా కృపాపరిధిని దాటిపోతున్నారు. భయంకర నాశనం నుంచి పారిపోమంటూ పాపిని హెచ్చరిస్తూ బతిమాలే స్వరాలు ఏవి? అతణ్ణి, ప్రతీ ఘడియ మరణం నుంచి వెనక్కు లాగే చేతులేవి? వినయమనసుతో, ధృఢ విశ్వాసంతో అతడికోసం దేవునితో విజ్ఞాపన చేసేవారేరి?PPTel 131.1

  అబ్రాహాముది క్రీస్తు స్పూర్తి. స్వయాన దేవుని కుమారుడే పాపితరపున ఉత్తరవాది. పాపవిమోచన మూల్యాన్ని చెల్లించిన ఆయనకు మానవాత్మ విలువ ఏమిటో తెలుసు. నిష్కళంకం, పవిత్రం అయిన స్వభావంలో మాత్రమే వర్ధిల్లగల పాప వ్యతిరేకతతో నిండిన అపార కృప మాత్రమే పుట్టించగల ప్రేమను క్రీస్తు పాపి పట్ల ప్రదర్శించాడు. సిలువ శ్రమల నడుమ, లోకపాపాల భారంతో తానే కుంగిపోతూ ఉన్నా అపహాసకులు, హంతకుల కోసం ఆయన ఇలా ప్రార్థించాడు, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”. లూకా 23:34.PPTel 131.2

  అబ్రాహామును గురించి లేఖనంలో ఇలా ఉన్నది, “దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను”. “నమ్మినవారికందరికి అతడు తండ్రి”. యాకోబు 2:23; రోమా 4:11. విశ్వాసపాత్రుడైన ఈ పితరుణ్ని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఇది : “అబ్రాహాము నా మాటవిని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెను”. ఇంకా, “తన తరువాత తన పిల్లలును, తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నా” నన్నాడు. లోకానికి అందాల్సిన దైవ సత్యానికి శతాబ్దాలుగా కాపుకర్తలు పరిరక్షకులు అయిన ప్రజలకు అనగా మెస్సీయ రాకవలన లోక రాజ్యాలన్నిటికీ దీవెన పంచగల ప్రజలకు జనకుడు కావటానికి అబ్రాహాము పిలుపు పొందటం గొప్ప గౌరవం. అబ్రాహామును పిలిచిన ఆ ప్రభువు అతడ్ని యోగ్యుడుగా ఎంచాడు. మాట్లాడుతున్నవాడు దేవుడే. మనుషుల తలంపుల్ని దూరంనుంచే గ్రహించి వారిని గూర్చి అంచనాలు వేయగల ఆ ప్రభువు “నేనతని నెరిగియున్నాను” అని అబ్రాహాము గురించి అంటున్నాడు. అబ్రహాము స్వార్థ ప్రయోజనాల నిమిత్తం సత్యాన్ని ఉహించటం జరగలేదు. అతడు ధర్మశాస్త్రాన్ని ఆచరించి న్యాయంగాను, నీతిగాను వ్యవహరించాడు. అతడు దేవునికి భయపడటమే గాక తన గృహంలో మతాన్ని పోషించాడు. నీతి విషయంలో తన కుటుంబాన్ని ఉప దేశించాడు. తన గృహంలో దైవ ధర్మశాస్త్రమే ప్రధాన నిబంధన.PPTel 131.3

  అబ్రాహాము ఇంటివారి సంఖ్య వెయ్యిమందికి మించి ఉన్నది. అబ్రాహాము బోధనలు అంగీకరించి నిజమైన దేవుని ఆరాధిస్తున్నవారు తన శిబిరంలో స్థానం పొందారు. పాఠశాలలోలాగ ఇక్కడ వారు యథార్థ సత్యానికి ప్రతినిధులుగా వ్యవహరించటానికి తమను సిద్ధం చేసే సత్యాల్ని నేర్చుకొనేవారు. ఈ విధంగా వారు గొప్ప బాధ్యతను వహించారు. ఇక్కడ కుటుంబ నాయకులకు అబ్రాహాము శిక్షణ నిచ్చేవాడు. ఇక్కడ నేర్చుకొన్న పరిపాలన పద్దతుల్ని వారు తమ గృహ నిర్వహణలో ఉపయోగించేవారు.PPTel 132.1

  వెనుకటికాలం కుటుంబ వ్యవస్థలో తండ్రి నాయకుడు యాజకుడుగా వ్యవహరించేవాడు. బిడ్డలు పెరిగి తమ తమ కుటుంబాలు ఏర్పరచుకొన్న తర్వాత కూడా తండ్రి వారి పై అధికారం సాగించేవాడు. మతపరమైన లౌకిక సంబంధమైన విషయాల్లో తండ్రిని శిరసుగా భావించాలని బిడ్డల్ని ఉపదేశించటం జరిగేది. ఈ పితృస్వామ్య విధానం దేవుని గూర్చిన జ్ఞానాన్ని పరిరక్షించింద గనుక దాన్ని కొనసాగించటానికి అబ్రాహాము ప్రయత్నించాడు. విస్తరించి వేళ్లు తన్ని ఉన్న విగ్రహారాధనకు అడ్డుకట్ట వేయటానికి తన యింటివారినందరినీ కలిపి ఉంచటం అవసరమయ్యింది. అన్యులతో కలిసి ఉండటం వారి విగ్రహారాధన ఆచారాలతో పరిచయం కలిగి ఉండటం నియమాల్ని భ్రష్టు పట్టిస్తుందని అబ్రాహాముకి తెలుసు. అందుచేత తన శిబిర నివాసులెవ్వరికి వాటితో సంబంధం లేకుండా వారిని కాపాడటానికి అబ్రాహాము తన శక్తి మేరకు కృషి చేశాడు. తప్పుడు మతానికి తావులేకుండా చేసి యథార్ధమైన ఆరాధన మహిమాన్వితుడు సజీవుడు అయిన దేవుని ఆరాధించే పద్ధతి వారికి బోధపరచటానికి అబ్రాహాము ఎంతో శ్రద్ధ తీసుకొన్నాడు. తన ప్రజలు సాధ్యమైనంతవరకు అన్యులతో దగ్గర సంబంధాలు పెట్టుకోకుండా ఉండి ప్రత్యేకంగా నివసించాలని వారు లౌకికులుగా ఉండకూడదని దేవుడు చేసిన ఏర్పాటు వివేకవంతమైన ఏర్పాటు. తరం నుంచి తరానికి యథాఢ విశ్వాసం నిర్మలంగా కొనసాగించేందుకూ అరమ్నహరాయిలో తమ చుట్టూ ఉండే మోసకర ప్రభావాలకు లోనుకాకుండా తన కుటుంబాన్ని తర్ఫీదు చేయటానికి అబ్రాహామును తన విగ్రహారాధక బంధువుల నుంచి దేవుడు వేరుచేశాడు.PPTel 132.2

  తన బిడ్డలపట్ల, తన ఇంటివారిపట్ల అబ్రాహాముకున్న ప్రేమ వారి మత విశ్వాసాన్ని కాపాడటానికి తన బిడ్డలకూ వారి ద్వారా లోకానికి దైవ విశ్వాసాన్ని, జ్ఞానాన్ని ప్రశస్త స్వాస్థ్యంగా అందించటానికి అతణ్ని నడిపించింది. తాము పరలోకమందున్న దేవుని పాలన కింద ఉన్నామని వారికందరికీ బోధించాడు. తల్లిదండ్రులు బిడ్డల్ని బాధించకూడదని పిల్లలు తమ తల్లిదండ్రులకు అవిధేయులు కాకూడదని బోధించాడు. దైవ ధర్మశాస్త్రం ప్రతివారికీ తమ తమ విధులు నిర్దేశించింది. వాటిననుసరించి నివసించేవారు ఆనంద సౌభాగ్యాలు పొందుతారు.PPTel 133.1

  అతని జీవితమే - తన దినదిన నిశ్శబ్ద జీవితం - నిత్యమూ సాగే నీతి పాఠం. అతనిది సువాసన విరజిమ్మిన జీవితం, ఉదాత్తమైన, సుందరమైన ప్రవర్తన. అతనికి దేవునితో సన్నిహిత సంబంధమున్నదని అది సూచించింది. చిన్న సేవకుడి ఆత్మను కూడా అతను నిర్లక్ష్యం చేయలేదు. తన కుటుంబ సమాజంలో సేవకుడికి ఒక నిబంధన నాయకుడికి మరో నిబంధన లేవు. ఉన్నవాడికి రాజమార్గం, లేని వాడికి ఇంకో మార్గం లేవు. అందరూ కృపకు సహవారసులుగా అందరితోనూ న్యాయంగా, దయగా వ్యవహరించాడు.PPTel 133.2

  “యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించును.” అతడు తన బిడ్డల దుర్వర్తనను నిలువరించటం నిర్లక్ష్యం చేయడు. వారిపట్ల బలహీనంగా, బుద్దిహీనంగా, పక్షపాతంగా వ్యవహరించడు. విధి నిర్వహణ విషయంలోను మమకారం అడ్డురానివ్వడు. అబ్రాహాము నీతిని ఉపదేశించటమే కాదు న్యాయ చట్టాలు నీతి చట్టాల అధికారాన్ని గుర్తించి ఆచరించాడు.PPTel 133.3

  నేడు ఈ ఆదర్శాన్ని అనుసరించేవారు బహుకొద్దిమంది! ప్రేమ అని తప్పుగా పిలువబడున్న ఉద్వేగం వల్ల అనేకమంది తల్లిదండ్రులు గుడ్డివారై తమ బిడ్డల్ని తమ ఫలింపని తీర్మానాలకు, అదుపుతప్పిన ఆవేశాలకు విడిచి పెడ్తున్నారు. యువతపరంగా ఇది బహుక్రూరం. లోకస్తుల విషయంలో ఇది గొప్ప తప్పిదం. తల్లిదండ్రుల గారాబం కుటుంబాల్లోను, సమాజంలోను అస్తవ్యస్త పరిస్థితుల్ని సృష్టిస్తుంది. అది దేవుని విధులను ఆచరించే బదులు తమ ఇష్టాన్ని ఆచరించాలన్న కోరికను యువతలో ధృఢపర్చుతుంది.ఈరకంగా దేవుని చిత్తాన్ని జరిగించటానికి వ్యతిరేకతను పెంచు తుంది.వారు తమ భక్తిహీన,అవిధేయస్వభావాన్ని తమ బిడ్డలకు,బిడ్డల బిడ్డలకు అంది స్తారు. తల్లిదండ్రులు అబ్రాహాముకు మల్లే తమ పిల్లలు యెహోవా మార్గాన్ని గైకొనటానికి వారికి ఆజ్ఞాపించాలి. దేవుని అధికారానికి విధేయత నేర్పించటం విషయంలో మొదటి మెట్టుగా తల్లిదండ్రుల అధికారానికి విధేయత నేర్పించటం అవసరం.PPTel 133.4

  దైవ ధర్మశాస్త్రాన్ని మత నాయకులు సయితం తేలికగా చూడటం ఎంతో కీడు కలిగిస్తుంది. మానవులు ఆజ్ఞలు ఆచరించాల్సిన అవసరం లేదు అని ప్రబలంగా సాగుతున్న బోధన మనుషుల నైతిక ప్రవర్తనపై చూపుతున్న ప్రభావం విగ్రహారాధన ప్రభావం వంటిది. దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్ర విధుల్ని చులకనచేస్తున్నవారు ప్రత్యక్షంగా కుటుంబం పునాదుల్ని, దేశాల పునాదుల్ని దెబ్బతీస్తున్నారు. దైవ విధులననుసరించి నడుచుకోని క్రైస్తవ తల్లిదండ్రులు ప్రభువు మార్గాన్ని అవలంబించమని తమ బిడ్డల్ని ఆజ్ఞాపించలేరు. దైవ ధర్మశాస్త్రాన్ని జీవిత ప్రమాణంగా వారు ఆచరించటం లేదు. ఆనక వారి పిల్లలు తమ కుటుంబాల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తాము ఏమి నేర్చుకోలేదో వాటిని తమ బిడ్డలకు నేర్పించాల్సిన అవసరాన్ని గుర్తించరు. దేవుడు లేని కుటుంబాల సంఖ్య పెరగటానికి ఇదే కారణం. ఇందువలననే దుర్మార్గం పెచ్చు పెరుగుతున్నది.PPTel 134.1

  తల్లిదండ్రులు పూర్ణ హృదయంతో దైవ ధర్మవిధుల ప్రకారం నడుచుకొనే వరకు తమను వెంబడించమని తమ బిడ్డల్ని ఆజ్ఞాపించలేరు. ఈ విషయంలో దిద్దుబాటు అవసరం. బోధకులకు దిద్దుబాటు అవసరం. వారి గృహాల్లో దేవుడు ఉండటం అవసరం. పరిస్థితుల్లో వ్యత్యాసం కావాలన్నది వారి వాంఛ అయితే వారు దైవ వాక్యాన్ని తమ కుటుంబాల్లోకి తెచ్చి దాన్ని తమ సలహాదారుగా చేసుకోవాలి. అది తమతో మాట్లాడున్నది దైవ స్వరమని దానికి తాము విధేయులై వుండాలని వారు తమ పిల్లలకు బోధించాలి. వారు తమ బిడ్డలకు ఓపికగా నేర్పించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎలా నివసించాలో వారు తమ బిడ్డలకు దయగా నిర్విరామంగా బోధించాలి. అలాంటి కుటుంబ వాతావరణంలో పెరిగే పిల్లలు నాస్తిక సిద్ధాంతాల్ని ఎదుర్కొనటానికి సమర్దులవుతారు. వారు బైబిలుని తమ విశ్వాసానికి ప్రాతిపదికగా అంగీకరించినందున వరవలే వచ్చే నాస్తికత తాకిడికి చెక్కుచెదరని పునాది పై నిలిచి ఉంటారు.PPTel 134.2

  అనేక గృహాల్లో ప్రార్థనను అశ్రద్ధ చేయటం జరుగుతున్నది. ఉదయం సాయంత్రం ప్రార్థనలకు సమయం లేదని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అనేకమైన దైవ కృపలకు, మొక్కలు, పైరుల పెరుగుదలకు దోహదపడే వర్షధారలకు, పరిశుద్ధ దూతల కాపుదలకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి వారికి కొద్ది నిమిషాల సమయం కూడా ఉండదు. దైవ సహాయం కోసం మార్గనిర్దేశంకోసం, గృహంలో యేసు సమక్షంకోసం ప్రార్ధించటానికి వారికి సమయం ఉండదు. దేవుని గురించిగాని పరలోకాన్ని గురించిగాని ఆలోచన లేకుండా ఎద్దు మాదిరిగా లేదా గుర్రం మాదిరిగా వారు తమ పనులికి వెళ్లిపోతారు. నిరీక్షణ లేకుండా నశించిపోవటం చూడలేక దైవ కుమారుడు క్రీస్తు తన ప్రాణాన్ని తమకోసం అర్పించిన ఆత్మలు వారు. కాగా నశించిపోయే జంతువులవలే వారు ఆయన ఔదార్యాన్ని అభినందించరు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకొనేవారు వెనకటి పితరులవలే తాము ఎక్కడ గుడారం వేసుకుంటే అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాలి. ప్రతీ గృహం ప్రార్థన మందిరం కావాల్సిన అవసరం ఎన్నడైనా ఉన్నదంటే అది ఇప్పుడే. తండ్రులు, తల్లులు తమకోసం తమ బిడ్డలకోసం వినయ హృదయులై దేవునితో ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేయాలి. తండ్రి కుటుంబ యాజకుడిగా బలిపీఠం పై ఉదయం, సాయంత్రం బలులు అర్పిస్తుండగా భార్య, పిల్లలు కలిసి ప్రార్థన చేసి దేవుని స్తుతించాలి. అలాంటి గృహంలో ఇంకా కొద్ది సేపు ఆగటానికి ప్రభువు ముచ్చట పడ్డాడు.PPTel 134.3

  ప్రతీ క్రైస్తవ గృహంలోనుంచి పరిశుద్ధ కాంతి ప్రకాశించాలి. ప్రేమ కార్యాల్లో వ్యక్తమవ్వాలి. గృహ సంబంధాలన్నింటిలోనూ దయ, సాత్వికం, స్వార్థరాహిత్యం నమ్రత రూపంలో ప్రేమ ప్రవహించాలి. ఈ సూత్రాన్ని అమలుపర్చే గృహాలున్నాయి. అవి దేవున్ని ఆరాధించే గృహాలు, యధార్థ ప్రేమ పరిఢవిల్లే గృహాలు. ఈ గృహాల నుంచి ఉదయం సాయంత్రం పరిమళ ధూపంలో దేవుని సన్నిధికి ప్రార్థనలు చేరుకుంటాయి. ప్రార్థించే భక్తుల పైకి దీవెనలు ఉదయం కరిగే మంచులా దిగివస్తాయి.PPTel 135.1

  క్రమబద్ధమైన క్రైస్తవ గృహం క్రైస్తవం నిజాయితీని నిరూపించే బలమైన వాదన. అది నాస్తికుడు కాకాదనలేని వాదన. చిన్నారుల్లో మార్పు తెచ్చే కుటుంబంలో గొప్ప ప్రభావం ఉన్నదని అబ్రాహము దేవుడే అందుకు కారణమని అందరూ చూడగలుగుతారు. క్రైస్తవులుగా చెప్పుకొనేవారి గృహాలు సరియైన రీతిలో ఉంటే వాటి ప్రభావాన్ని బట్టి ఎందరో మంచివారవుతారు. అవి నిజంగా “లోకమునకు వెలుగై” ఉంటాయి. అబ్రాహాము నుద్దేశించి పలికిన ఈ మాటల్లో నమ్మకమైన ప్రతీ తండ్రితోను, ప్రతీ తల్లితోను దేవుడు మాట్లాడున్నాడు, “యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత పిల్లలును తన యింటివారును నీతి, న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించునట్లు నేనతనినెరిగి యున్నాను”.PPTel 135.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents