Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  3—శోధన, పతనం

  పరలోకంలో తిరుగుబాటులేపటానికి ఇక స్వేచ్చలేకపోటంతో మానవజాతిని నాశనం చేయటానికి కుట్రచేయటం ద్వారా దేవుని పై కక్షసాధించటానికి సాతానుకి ఒక నూతన రంగం ఏర్పడింది. తాను నిరంతరంగా కోల్పోయిన ఆనందం ఏదెనులోని పరిశుద్ధ దంపతులు అనుభవిస్తున్న శాంతి ఆనందం రూపంలో సాతాను కళ్ళముందు కదలాడింది. అతడి హృదయంలో ఈర్ష్య పెల్లుబికింది. అవిధేయులు కావటానికి ఆ జంటను రెచ్చగొట్టి పాపనేరాన్ని శిక్షను వారిమీదకి తేవాలని నిర్ధారించుకొన్నాడు. వారి ప్రేమను అపనమ్మకంగాను, వారి స్తుతి గానాన్ని దేవుని పై నిందారోపణలగాను మార్చటానికి తీర్మానించుకొన్నాడు. ఈరకంగా ఈ అమాయక దంపతుల్ని తాననుభవిస్తున్న దు:ఖంలోకి దించటమేగాక దేవుణ్ణి అపకీర్తి పాలుచేసి పరలోకాన్ని దు:ఖంలో ముంచాలని నిశ్చయించుకొన్నాడు.PPTel 38.1

  పొంచి ఉన్న అపాయాన్ని గురించి మసులుకోటానికి ఆదామవ్వలు హెచ్చరికలేకుండా లేరు. సాతాను భ్రష్టత్వం గురించి తమను నాశనం చేసేందుకోసం అతడి కుతంత్రాల గురించి పరలోకదూతలు వారికి తెలియజేశారు. దేవుని ప్రభుత్వ స్వభావాన్ని గురించి దాన్ని కూలదొయ్యటానికి అతడి ప్రయత్నాన్ని గురించి దూతలు వారికి విశదీకరించారు. సాతాను అతడి అనుచరుల పతనం దేవుని ఆజ్ఞలకు అవిధేయులవ్వటంవల్ల జరిగింది. కనుక, క్రమం, న్యాయం, ఏ చట్టంవల్ల మాత్రమే అమలు పర్చటం సాధ్యమో ఆ చట్టాన్ని ఆదామవ్వలు గౌరవించటం ఎంత ముఖ్యం?PPTel 38.2

  దేవుడెంత పరిశుద్ధుడో దైవ ధర్మశాస్త్రం అంత పరిశుద్ధమైంది. అది ఆయన చిత్త వ్యక్తీకరణ. ఆయన ప్రవర్తనకు నకలు. దైవప్రేమ, వివేకాల వివరణ. సకల ప్రాణులు, సకల చరాచర జగత్తు సృష్టికర్త చట్టాన్ని సంపూర్ణంగా ఆచరింటం పై సృష్టి సామరస్యం ఆధారపడి ఉంటుంది. దేవుడు ప్రభుత్వానికి చట్టాలిచ్చాడు. అవి మనుషులకే కాక ప్రకృతి కార్యాలన్నిటికీ సంబంధించిన చట్టాలు. సమస్తం నిర్దిష్ట చట్టాలకు కట్టుబడి ఉన్నది వాటిని మీరకూడదు. అయితే ప్రకృతిలోని సమస్తం ప్రాకృతిక చట్టాలకు కట్టుబడి ఉండగా భూమండలంలోని ప్రాణుల్లో మానవుడు మాత్రమే నీతి ధర్మశాస్త్రానికి బద్దుడై ఉన్నాడు. తన ధర్మవిదుల్ని గ్రహించటానికీ, తన ధర్మశాస్త్రనియమాల్ని గ్రహించటానికీ, తన చట్టంలోని న్యాయాన్ని కృపను అర్థంచేసుకోటానికి, దర్మశాస్త్ర ఆదేశాల్ని గుర్తించటానికి దేవుడు మానవుడికి అవగాహన శక్తినిచ్చాడు. వాటికి విధేయుడై ఉండాలని ఆదేశించాడు.PPTel 38.3

  దూతలకుమల్లే ఈ ఏదెను వాసులు కూడా అర్హతా పరీక్షలో ఉన్నారు. ఆనందమయమైన ఆ స్థితివారు సృష్టికర్త చట్టానికి విధేయంగా నివశించటమన్న షరతు పై కొనసాగాల్సి ఉంది. వారు విధేయులై జీవించవచ్చు. అవిధేయులై మరణించవచ్చు. దేవుడు వారికి గొప్ప దీవెనలిచ్చాడు. అయితే వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే పాపం చేసిన దూతల్ని శిక్షించిన ఆయన వారిని కూడా శిక్షించకమానడు. ఆజ్ఞాతి క్రమంవలన ఆయన వరాల్ని పోగొట్టుకొని దు:ఖాన్ని నాశనాన్ని తెచ్చుకోగలరు.PPTel 39.1

  సాతాను కుయుక్తుల్ని గూర్చి అప్రమత్తంగా ఉండాల్సిన తమను వశపర్చుకోటానికి అతను అవిశ్రాంతంగా కృషిచేస్తాడని హెచ్చరించారు. వారు దేవునికి విధేయులై ఉ న్నప్పుడు దుష్టుడు వారికి ఏహాని చేయలేడు. ఎందుకంటే, అవసరమైతే పరలోకంలో ఉన్న ప్రతీదూతను వారికి సహాయం చేయటానికి దేవుడు పంపుతాడు. అతని మొదటి నిందారోపణను వారు ధృఢంగా తిప్పికొట్టితే వారు దూతలకు మల్లే భద్రంగా ఉ ంటారన్నది నిజం. అయితే ఒక్కసారిగాని శోధనకు లొంగటం జరిగితే వారి స్వభావమే దుర్బలమవుతుంది. సాతానుని ప్రతిఘటించటానికి వారికి శక్తిగాని ధృఢచిత్తంగాని ఉండవు.PPTel 39.2

  మేలుకీడుల జ్ఞానాన్నిచ్చే వృక్షాన్ని దేవుడు తనపట్ల ఆదామవ్వల విధేయతకూ ప్రేమకూ వారికొక పరీక్షగా ఉంచాడు. ఆ తోట వృక్షాలన్నిటిలో ఒకదానిపై నిషేదం పెట్టాడు. ఈ నిషేధం విషయంలో నమ్మకంగా లేకపోతే వారు దోషులవుతారు. సాతాను నిత్యం వారిని శోధనలతో వెంటాడనవసరం లేదు. నిషిద్ధ వృక్షం వద్ద వారిని పడగొట్టవచ్చు. దాని స్వభావాన్ని పరిశోధించటానికి ప్రయత్నిస్తే వారు అతని మోసాలకు ఆహుతికావచ్చు. తమకు దేవుడు పంపిన హెచ్చరికను జాగ్రత్తగా పాటించి ఆయన ఇచ్చిన ఉపదేశంతో తృప్తి చెందాల్సిందిగా వారికి హితవు వచ్చింది.PPTel 39.3

  పైకి కనిపించకుండా తన కార్యాన్ని చక్కబెట్టుకోటానికి సర్పాన్ని సాతాను తన సాధనంగా ఎంపిక చేసుకొన్నాడు. ఈ మారువేషం తన వంచన ఉద్దేశానికి చక్కగా సరిపోయింది. అప్పటిలో సర్పం భూమిమీద మిక్కిలి తెలివిగల, మిక్కిలి అందమైన ప్రాణి. దానికి రెక్కలుండేవి. గాలిలో ఎగిరేటప్పుడు అది మెరుగు పెట్టిన బంగారంలా ధగధగ మెరిసేది. నిషిద్ధ వృక్షం కొమ్మపై విశ్రమిస్తూ దాని ఫలాలు తింటూ చూసేవారి గమనాన్ని ఆకర్షిస్తూ ఉంది. ఈ తీరున ఆ శాంతి వనంలో వినాశకుడు తన ఎరకోసం పొంచి ఉన్నాడు.PPTel 39.4

  తోటలో తన అనుదిన విధుల నిర్వహణలో తన భర్తకు దూరంగా ఉండవద్దంటూ దూతలు అవ్వను హెచ్చరించారు. భర్తతో ఉన్నప్పటికన్నా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనకు లోనయ్యే ప్రమాదం ఎక్కువని హెచ్చరించారు. అయితే ఉల్లాసమైన తన పనిని చేసుకొంటూ ఆమె అతన్ని విడిచి పెట్టి దూరంగా వెళ్లింది. ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి కొంచెం భయపడింది. వెంటనే శోధనగుర్తించి దానికి దూరంగా ఉండటానికి తనకుజ్ఞానం ఉన్నదన్న తలంపు కలిగి ధైర్యం తెచ్చుకొన్నది. దూతలు చేసిన హెచ్చరికను ఖాతరు చేయకుండా నిషిద్ధ వృక్షం వద్దకు వెళ్లి ఆశ్చర్యంగా, ఆశగా దాని పండ్లవంక చూడటం మొదలు పెట్టింది. పండ్లు అందంగా కనిపించాయి. వాటిని దేవుడెందుకు నిషేధించాడని తనలోతాను ప్రశ్నించుకొన్నది. శోధకుడికి ఇది అమోఘమైన అవకాశం. ఆమె ఆలోచనల్ని గ్రహించగలవాడిగా ఆమెను “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దీని ఫలములు మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” ప్రశ్నించాడు. తన తలంపుల ప్రతిధ్వనిని అలా వినటంతో అవ్వ ఉలిక్కిపడింది. సంగీతంలాంటి మధురమైన స్వరంతో ఆ సర్పం ఆమె చక్కదనాన్ని పొగడూ తన సంభాషణ కొనసాగిందచింది. అతడి మాటలు కటువుగాలేవు. అక్కడ నుంచి పారిపోయేబదులు సర్పం మాట్లాడటం ఆశ్చర్యంగా వింటూ అక్కడే నిలిచిపోయింది. అతను దూతవేషం ధరించి మాట్లాడి ఉంటే అవ్వకు భయం పుట్టి ఉండేది. కాని అందమైన సర్పం సాతాను సాధనమై ఉంటుందన్న తలంపు ఆమెకు తట్టలేదు.PPTel 40.1

  శోధకుడి మోసకరమైన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చింది, “ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోటమధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు - మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు... అనెను. అందుకు సర్పము - మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియును”.PPTel 40.2

  ఈ పండు తినటం వల్ల తాము ఉన్నతస్థాయి జీవితంలో ప్రవేశిస్తారని, మరింత విశాలమైన విస్తారమైన జ్ఞానాన్ని సంపాదిస్తారని అతను చెప్పాడు. తాను ఆ పండు తిన్నానని అందుకే తనకు మాటలాడే శక్తి వచ్చిందని చెప్పాడు. తమకు ఇవ్వకుండా ప్రభువు ఆ పండును భద్రంగా కాపాడున్నాడని తాము ఆయనతో సరిసాటి కావటం సుతరామూ ఇష్టంలేక అలా వ్యవహరిస్తున్నాడని దొంగదెబ్బ కొట్టాడు. జ్ఞానాన్నీ శక్తినీ ఇచ్చే అద్భుత శక్తి దానికుండటం చేతనే తాము దాన్ని తినకూడదు, ముట్టకూడదన్న నిషేధం విధించాడని చెప్పాడు. ఇంకా, దేవుడు చేసిన ఆ హెచ్చరిక నిజంగా నెరవేరటానికి ఉద్దేశించింది కాదని అది తమను భయ పెట్టటానికి ఉద్దేశించిందని అన్నాడు. మరణించటం ఎలా సాధ్యమవుతుంది? వారు జీవవృక్షఫలాలు తిన్నారుగదా! తాము ఉన్నత స్థితికి చేరి మరెక్కువ ఆనందాన్ని అనుభవించకూడదన్నదే దేవుని ఉద్దేశం అన్నాడు.PPTel 40.3

  ఆదాము కాలం నుంచి నేటి వరకు సాతాను చేస్తున్నపని ఇలాంటిది. ఈ పనిని అతడు విజయవంతంగానే సాగిస్తూ వచ్చాడని చెప్పాలి. దేవుని ప్రేమను ఆయన వివేకాన్ని శంకించటానికి అతడు మనుషుల్ని నడిపిస్తున్నాడు. దేవుని జ్ఞానం శక్తి తాలూకు మర్మాల్ని ఛేదించటానికి భక్తిరహిత పరిశోధనల్ని అలుపెరుగని జిజ్ఞాసను ప్రోత్సహించటానికి అతడు నిరంతరం కృషిసాగిస్తున్నాడు. రక్షణకు అవసరమైన సత్యాల్ని దేవుడు వెలుగులోకి తెచ్చి ఉండగా మర్మాలుగా ఉంచటానికి ఆయన ఉద్దేశించిన విషయాల్ని కనుక్కోటానికి తమ ప్రయత్నాల్లో తలమునకలై వేలాది ప్రజలు వాటిని విస్మరిస్తున్నారు. తాము అద్భుతమైన విజ్ఞాన రంగంలోకి అడుగు పెడ్తున్నట్లు మనుషుల్ని నమ్మించి తమను అవిధేయులు చేయటానికి సాతాను వారిని శోధిస్తాడు. అయితే ఇదంతా మోసమే. జ్ఞానాభివృద్ధిని గూర్చిన అభిప్రాయాలతో ఉత్తేజితులై వారు దైవ ధర్మ విధుల్ని కాలికిందవేసి తొక్కుతూ పతనం నిత్యమరణం దిశగా వడివడిగా అడుగులు వేస్తారు.PPTel 41.1

  దేవుని చట్టాన్ని బేఖాతరు చేయటంవల్ల తమకు మేలుకలుగుతుందని సాతాను ఆ పరిశుద్ధ దంపతులకు సూచించాడు. ఇలాంటి హేతువాదాన్నే నేడు మనం వినటంలేదా? తమ విశాల భావాలని తాము ఎక్కువ స్వతంత్రులమని చెప్పుకొంటూ దేవుని ఆజ్ఞలు గైకొనే ప్రజలు సంకుచిత భావాలుకలవారని అనేకులు ఆరోపిస్తారు. “మీరు వాటిని తిను దినమున” అంటే దేవుని ధర్మవిధిని మీరితే - “మీరు... దేవతల వలె వుందురు” అంటూ ఏదెనులో వినిపించిన మాటల ప్రతిధ్వనికాక ఇది ఇంకేమిటి? నిషిద్ధఫలం తినటం వల్ల గొప్ప ఉపకారం పొందినట్లు సాతాను చెప్పుకొన్నాడు. కాని తన అతిక్రమం వల్ల పరలోకం నుంచి బహిష్కృతికి గురి అయినట్లు చెప్పలేదు. పాపం గొప్ప హాని కలిగించినట్లు గుర్తించినప్పటికీ ఇతరుల్ని తానున్న రొంపిలోకి లాగేందుకు తాననుభవిస్తున్న దు:ఖాన్ని పైకి కనబడనియ్యలేదు. ఈ అపరాధి ఇప్పుడు తన నిజమైన ప్రవర్తనను కప్పిపుచ్చుకొని తిరగటానికి ప్రయత్నిస్తున్నాడు. తాను పరిశు దుణ్ణని చెప్పుకోవచ్చుగాక. కాని తాను పలికే ప్రగల్బాలు అతణ్ణి మరింత ప్రమాదకరమైన మోసగాణ్ణి చేస్తున్నాయి. అతడు సాతాను పక్షంవాడని, దేవుని ధర్మ విధుల్ని కాలరాస్తూ ఇతరుల్ని అదే పొరపాటులోకి నడిపించి వారి నిత్యనాశనానికి కారకుడవుతున్నాడని స్పష్టమవుతుంది.PPTel 41.2

  సాతాను మాటలు నిజమని అవ్వ నమ్మింది. కాని ఆ నమ్మిక పాపం శిక్షనుంచి ఆమెను రక్షించలేకపోయింది. ఆమె దేవుని మాట నమ్మలేదు. అది ఆమె పడిపోటానికి కారణమయ్యింది. తీర్పులో అబద్దాన్ని యధార్థంగా నమ్మినందుకుగాక సత్యాన్ని నమ్మనందుకు మనుషులు శిక్షపొందుతారు. సాతాను కుతార్కాన్ని కాదంటున్నప్పటికి దేవునికి అవిధేయులవ్వటం నాశనకరం. సత్యం తెలుసుకోటానికి మనం ఎల్లప్పుడూ సుముఖంగా ఉండాలి. దేవుని వాక్యంలో దాఖలై ఉన్న అనుభవాలన్నీ మనకు హెచ్చరిక, ఉపదేశం నిమిత్తమే లిఖితమై ఉన్నాయి. మనల్ని మోసంనుంచి కాపాడటానికి అవి అనుగ్రహించబడ్డాయి. వాటిని లక్ష్య పెట్టకుంటే మనకు నాశనం తథ్యం. దైవ వాక్యాన్ని ఖండించేదల్లా సాతాను వద్ద నుంచి వస్తున్నదే.PPTel 42.1

  నిషిద్ధ వృక్షఫలాన్ని కోసి దాన్ని ఏమంత ఇష్టంగా లేని అవ్వచేతిలో పెట్టింది సర్పం. అప్పుడు ఆ సర్పం తాము చావకుండేందుకు వారు దాన్ని ముట్టకూడదంటూ దేవుడు పలికిన మాటల్ని అవ్వకు జ్ఞాపకం చేసింది. పండుతినటం దాన్ని ముట్టటం కన్నా ప్రమాదకరం కాదని ఆమెతో అతడన్నాడు. తాను చేసిన క్రియకు పర్యవసానం లేకపోవటంతో అవ్వ ధైర్యం తెచ్చుకొన్నది. ఆమె “ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు... దాని ఫలములలో కొన్ని తీసుకొని... తినెను.” అది తినటానికి బాగున్నది. అది తింటున్నప్పుడు తనలో గొప్పశక్తి ప్రవేశించినట్లు తాను ఉన్నతస్థాయి జీవితంలో ప్రవేశిస్తున్నట్లు భావించింది. భయం ఏమీ లేకుండా పండ్లు కోసుకొని తిన్నది. ఇప్పుడు తానే ఆజ్ఞను అతిక్రమించింది కాబట్టి తన భర్తను నాశనం చేయటానికి అవ్వ సాతాను ప్రతినిధి అయ్యింది. నిషిద్ధ ఫలాలు పట్టుకొని అస్వాభావికమైన ఉద్రేకంతో అతని వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పింది.PPTel 42.2

  ఆదాము తీవ్ర విచారానికి లోనయ్యాడు. ఆమె కథనం విని ఆందోళన చెందాడు. తమకు వచ్చిన హెచ్చరిక ఇతడి గురించే అయి ఉంటుందని దేవుని తీర్పు ప్రకారం తాను మరణించాలని ఆమెకు సమాధానం చెప్పాడు. అతనికి బదులు చెప్పుతూ తాము చావనే చావరని సర్పం చెప్పిన మాటల్ని పునరుద్ఘాటిస్తూ తాను కూడా ఆ పండు తినాల్సిందంటూ బతిమాలింది. అది నిజమే అయి ఉంటుందని ఎందుచేతనంటే దేవుని ఆగ్రహానికి సూచనలేమీ తనకు కనిపించలేదని, ఆ మాటకొస్తే దానివల్ల తనమీదికి ఉత్తేజకరమైన ప్రభావం వచ్చిందని, ఫలితంగా పరలోక దూతల్ని ఆవేశపర్చేలాంటి ఉత్తేజం తనను ప్రభావితం చేసిందని అవ్వ చెప్పింది.PPTel 42.3

  తన భార్య దేవుని ఆజ్ఞను అతిక్రమించిందని, తమ విశ్వసనీయతకు ప్రేమకు పరీక్షగా దేవుడు విధించిన నిషేధాన్ని ఆమె ఉల్లంఘించిందని ఆదాము గ్రహించాడు. అతని మనసులో భయంకర పోరాటం బయలుదేరింది. తనను విడిచి పెట్టి అవ్వను వెళ్లనిచ్చినందుకు క్షోభించాడు. కాని ఇప్పుడు పొరపాటు జరిగిపోయింది. తాను ఎంతగానో ప్రేమించిన తన భార్య అవ్వ నుంచి ఇప్పుడు ఎడబాటు కలుగుతుంది. అతను దీన్ని ఎలా జరగనివ్వగలడు? ఆదాము దేవునితోను దూతలతోను సహవాసం అనుభవించాడు. దేవుని మహిమను చూశాడు. మానవులు నమ్మకంగా ఉంటే వారికి అందుబాటులో ఉండే ఉజ్వల భవిష్యత్తును ఆదాము అవగతం చేసుకొన్నాడు. తన దృష్టిలో అన్నిటికన్నా మిక్కిలి విలువైన ఆ ఒక్క వరం దృష్ట్యా ఆదాము ఈ దీవెనలన్నిటినీ విస్మరించాడు. ప్రేమ, కృతజ్ఞత సృష్టికర్తపట్ల ప్రభుభక్తి - అవ్వపట్ల తన ప్రేమకు వచ్చేసరికి ఇవన్నీ అతడి పరిగణలోకి రాలేదు. ఆమె తనలో భాగం. ఎడబాటు అన్నతలంపునే అతడు తట్టుకోలేకపోయాడు. నేల మట్టిలోనుంచి తనను సురూపి అయిన మనిషిగా సృజించి ప్రేమతో తనకు జీవిత భాగస్వామినిచ్చిన సర్వశక్తుడైన దేవుడే ఆమెకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయగలడని అతను గుర్తించలేదు. కనుక ఆమె అతిక్రమ పర్యవసానాన్ని ఆమెతో పంచుకోడానికి నిర్ణయించుకున్నాడు. ఏమైనా, వివేకంగల సర్పం చెప్పిన మాటలు నిజమైతే కావచ్చు గదా అనుకొన్నాడు. అవ్వ అతని ముందు నిలబడి ఉంది. ఈ అపరాధానికి ముందు ఎంత అందంగా, ఎంత అమాయకంగా ఉందో అంత అందంగాను, అమాయకంగాను ఆమె కనిపించింది. మరణ చిహ్నాలు ఆమెలో ఎక్కడా కనిపించలేదు. పర్యవసానాలు ఏమైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ధారణ చేసుకొన్నాడు. పండు అందుకొని తిన్నాడు.PPTel 43.1

  ఆజ్ఞను అతిక్రమించిన అనంతరం ఉన్నత స్థాయి జీవితంలో ప్రవేశించిన అనుభూతిని మొదట్లో ఆదాము పొందాడు. కాని కొద్ది సేపటిలో తాను చేసిన పాపం గురించిన తలంపులు అతణ్ణి భయంతో నింపాయి. అప్పటిదాకా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం చలిచలిగా మారినట్లు అపరాధులైన దంపతులకు అనిపించింది. వారి అనురాగం శాంతి మాయమయ్యాయి. వాటికి బదులు పాపం చేశామనే భావం వారిని వేధిస్తున్నది. భవిష్యత్తును గూర్చిన భయం, ఆత్మన్యూనత ఏర్పడ్డాయి. వారిని కప్పిన నీతి వస్త్రం ఇకలేదు. తమ సిగ్గును కప్పుకోటానికి సొంతంగా మైమరుగు తయారు చేసుకోటానికి ప్రయత్నించారు. ఎందుకంటే వారు తమ వస్త్రహీన స్థితిలో దేవున్ని దూతల్నీ కలుసుకోటానికి సిద్ధంగా లేరు.PPTel 43.2

  ఇప్పుడు వారు పాపం నిజస్వరూపాన్ని చూడటం మొదలు పెట్టారు. తనను విడిచి పెట్టి వెళ్లి సాతాను మోసంలో పడ్డందుకు ఆదాము అవ్వను నిందించాడు. అయితే తన ప్రేమను గురించి ఎన్నో నిదర్శనాల్నిచ్చిన ఆ ప్రభువు తమ ఈ ఒక్క అపరాధాన్ని క్షమిస్తాడని లేదా తను భయపడున్న తీవ్ర శిక్షను ఆయన విధించడని వారిద్దరూ ఒకర్నొకరు ప్రోత్సహించుకొన్నారు.PPTel 44.1

  తన విజయం గురించి సాతాను బ్రహ్మానంద భరితుడయ్యాడు. దేవుని ప్రేమను ఆయన వివేకాన్ని శంకించి ఆయన ఆజ్ఞను మీరటానికి అవ్వను శోధించటంలోను ఆమెద్వారా ఆదాము పతనాన్ని సాధించటంలోను అతను విజయం సాధించాడు.PPTel 44.2

  అయితే ఘనమైన ఆ ధర్మశాస్త్రదాత ధర్మపరిపాలకుడు అయిన దేవుడు ఆదామవ్వలకు తమ అతిక్రమ పర్యవసానాల్ని తెలియపర్చనున్నాడు. తోటలోకి దేవుని సముఖం వచ్చింది. ఆనందదాయకమైన తమ పాపరహిత స్థితిలో సృష్టికర్త రాకను వారు ఉత్సాహంగా స్వాగతించేవారు. కాని ఇప్పుడు భయంతో పారిపోయారు. ఆ తోటలో ఎక్కడో దాక్కొన్నారు. “దేవుడైన యెహోవా ఆదామును పిలిచి - నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు - నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగానుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. అందుకాయన - నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను”.PPTel 44.3

  పాపం చెయ్యలేదనిగాని చేసింది పాపం కాదనిగాని ఆదాము అనలేకపోయాడు. కాని పశ్చాత్తాపాన్ని కనపర్చే బదులు తన భార్యను నిందించటానికి తద్వారా దేవున్ని నిందించటానికి ప్రయత్నించాడు. “నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను”. తన భార్య అవ్వపై ప్రేమను బట్టి ఆదాము దేవుని ప్రేమను, పరదైసులో తన గృహాన్ని, ఆనందమయమైన నిత్యజీవనాన్ని వదులుకోటానికి తీర్మానించుకొని పాపం జరిగిన తర్వాత తన అతిక్రమానికి హేతువుగా తన భార్యనూ తుదకు తన సృష్టికర్తనూ నిందించటం మొదలు పెట్టాడు.PPTel 44.4

  “నీవు చేసినది యేమిటని?” ఆ స్త్రీని అడగ్గా “సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని” అని సమాధానం చెప్పింది. “సర్పాన్ని ఎందుకు సృజించావు? దాన్ని ఏదెను తోటలోకి ఎందుకు రానిచ్చావు?” తన పాపానికి సాకుగా అవ్వ సమాధానంలో ఈ ప్రశ్నలు ధ్వనిస్తున్నాయి. ఇలా ఆదాముకు మల్లే అవ్వకూడా తమ పతనానికి దేవుడే బాధ్యుడని నిందించింది. చేసిన తప్పును సమర్థించే స్వభావం అబద్దాల జనకుడైన సాతానుతో ప్రారంభమయ్యింది. సాతాను శోధనకు లొంగిన అనంతరం ఆదామవ్వలు ఈ పంథానే అనుసరించారు. ఇదే స్వభావాన్ని ఆదాము కుమారులూ కుమార్తెలూ ప్రదర్శిస్తూ ఉన్నారు. నమ్రతతో తమ పాపాన్ని ఒప్పుకొనే బదులు తమ్మును తాము కాపాడుకొనేందుకు వారు ఇతరుల పైన, పరిస్థితుల పైన లేదా దేవుని పైన నిందమోపి తుదకు దేవుడిచ్చే దీవెనల్ని కూడా ఆయన్ను గూర్చి గొణుగుడికి కారణంగా చెబుతారు.PPTel 44.5

  అంతట ప్రభువు సర్పానికి ఈ తీర్పునిచ్చాడు: “నీవు దీని చేసినందున పశు వులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు”. సర్వం సాతాను సాధనంగా ఉపయుక్తమయ్యింది గనుక అది కూడా దేవుని తీర్పుకు గురి అయ్యింది. సృష్టి ప్రాణులన్నిటిలోను మిక్కిలి అందమైన సర్పం నేలపై పాకుతూ మనుషులు జంతువులు బయపడి ద్వేషించే జీవిగా మారింది. దేవుడు తర్వాత పలికిన మాటలు ప్రత్యక్షంగా సాతానుని ఉద్దేశించి పలికిన మాటలు. ఈ మాటలు చివరగా అతడి పరాజయాన్ని సర్వనాశనాన్ని సూచిస్తున్న మాటలు : “మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు”.PPTel 45.1

  ఇక నుంచి దు:ఖం, బాధ తన జీవితంలో భాగమై ఉంటాయని అవ్వతో చెప్పాడు. “నీ భర్తయెడల నీకు వాంఛకలుగును. అతడు నిన్ను ఏలును” అని ప్రభువు చెప్పాడు. సృష్టి జరిగినప్పుడు అవ్వను ఆదాముతో సమానురాలిగా దేవుడు చేశాడు. దేవునికి విధేయులై ఆయన ధర్మశాస్త్రానుసారంగా నివశించి ఉంటే వారు నిత్యమూ పరస్పర సహృదయతతో సామరస్యంతో నివసించి ఉండేవారు. ఆజ్ఞమీరటంలో అవ్వ మొదటిది. దేవుని ఆదేశాన్ని మీరి భర్త నుంచి దూరంగా వెళ్లటం మూలాన ఆమె శోధనలో పడింది. ఆమె విజ్ఞాపన వల్లే ఆదాము పాపం చేశాడు. ఇప్పుడు ఆమె తన భర్త నియంత్రణ కిందకు వచ్చింది. దైవ ధర్మశాస్త్రంలోని సూత్రాల్ని మానవాళి మనసులో ఉంచుకొని ఉంటే, పాపఫలితంగా వచ్చినప్పటికినీ, ఈ తీర్పు దీవెనగా పరిణమించేది. అయితే తనకు కలిగిన ఈ ఆధిక్యాన్ని పురుషుడు దుర్వినియోగించటం స్త్రీ పరిస్థితిని తరచు భారంగా దుర్భరంగా మార్చింది.PPTel 45.2

  అవ్వ ఏదెను గృహంలో తన భర్త సరసన హాయిగా ఆనందంగా జీవించింది. కాగా శాంతి కొరవడ్డ నవీన అవ్వలకుమల్లే తనకు దేవుడు నియమించిన స్థాయికంటే ఉన్నతంగా ఎదగాలని ఆశించింది. తనకున్న స్థానాన్ని మించిపోవాలని ప్రయత్నించటంలో దానికన్నా ఎంతో తక్కువ స్థాయికి దిగజారింది. దేవుని చిత్తం ప్రకారం తమకు కలిగిన స్థితిని సంతోషంగా అంగీకరించనివారు ఇలాంటి పర్యవసానాన్నే ఎదుర్కొనే పరిస్థితికి చేరారు. అనేకులు దేవుడు తమను సిద్ధం చేయని స్థానాలు చేరటానికి కృషిచేస్తూ తాము గొప్ప దీవెనగా ఉండగలిగిన స్థానాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఉన్నతస్థాయిని చేరాలన్న కోరికతో అనేకమంది స్త్రీలు తమ గౌరవాన్ని ఉదాత్త గుణశీలాన్ని త్యాగం చేసి, తమకు దేవుడు నియమించిన పనిని చేయకుండా విడిచి పెట్టేశారు.PPTel 46.1

  ఆదాముతో ప్రభువిలా చెప్పాడు : “నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నియు దాని పంటతిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు”.PPTel 46.2

  పాపరహితులైన ఆ దంపతులు పాపం గురించి తెలుసుకోటమన్నది దేవుని సంకల్పం కాదు. వారికి మంచిని చూపించాడు కాని దుష్టిని వారికి దూరంగా ఉంచాడు. అయితే దేవుని ఆదేశానికి విరుద్దంగా ఆయన నిషేధించిన చెట్టు ఫలాన్ని వారు తిన్నారు. తమ జీవితకాలమంతా తినమన్నా మానవజాతి ఆ సమయంనుంచి సాతాను శోధనలకు గురి అయి బాధలనుభవిస్తూ ఉంటుంది. అంతవరకు శారీరక శ్రమ ఆనందదాయకంగా ఉంటూ వచ్చింది. ఇక అది ఆందోళనతో కష్టంతో నిండి ఉంటుంది. వారికి ఆశాభంగాలు, దు:ఖం, బాధ, చివరికి మరణం ప్రాప్తిస్తాయి.PPTel 46.3

  పాపశాపంకింద ఉన్న ప్రకృతి యావత్తు దేవుని పై తిరుగుబాటు పర్యవసానాల్ని గురించి మానవుడికి సాక్ష్యం కావలసి ఉన్నది. దేవుడు మనుషుణ్ణి చేసి అతన్ని భూమి అంతటి మీద సమస్తజీవుల మీద పరిపాలకుడిగా నియమించాడు. ఆదాము దేవునికి విధేయుడై ఉన్నంతకాలం ప్రకృతి అంతా అతనిపాలనకు లోబడి ఉన్నది. అయితే అతడు దైవధర్మశాస్త్రాన్ని మీరి పాపం చేసినప్పుడు క్షుద్రప్రాణులు అతని అధికారానికి ఎదురు తిరిగాయి. కృపగల దేవుడు తన ధర్మశాస్త్రం పరిశుద్ధమైందని మనుషులకు ఇలా చూపించి దాన్ని మీరటం వల్ల ఏర్పడే ప్రమాదాన్ని తమ అనుభవజ్ఞానం ద్వారా తెలుసుకోటానికి వారిని నడిపిస్తాడు.PPTel 46.4

  ఇకనుంచి మానవుడికి సంప్రాప్తించిన శారీరక శ్రమతో కూడిన జీవితం దేవుడు ప్రేమతో ఏర్పాటు చేసిందే. మానవుడి మితంలేని తిండిని, ఉద్రేకాన్ని అదుపులో ఉంచేందుకు, ఆత్మ నిగ్రహాన్ని పెంపొందించే అలవాట్లను ప్రోత్సహించేందుకు పాప పర్యవసానంగా కలిగిన ఈ క్రమశిక్షణ అవసరమయ్యింది. పాపం కలిగించిన నాశనం నుంచి హీన స్థితి నుంచి మానవుణ్ణి ఉద్ధరించటానికి దేవుని ప్రణాళికలో శారీరక శ్రమ ఒక భాగం.PPTel 47.1

  “నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు” (ఆది 2:17) ఆదామవ్వలకు వచ్చిన హెచ్చరిక వారు నిషిద్ధఫలం తిన్నప్పుడే మరణించాల్సి ఉన్నారన్న అర్థం ఇవ్వటం లేదు. కాని మార్పులేని ఆ తీర్పు ఆ దినాన ప్రకటితమయ్యిందని అర్థం. విధేయత షరతు పై వారికి అమర్త్యత వాగ్దత్తమై ఉంది. తమ అతిక్రమం వల్ల వారు నిత్యజీవాన్ని పోగొట్టుకొంటారు. ఆ దినాన్నే వారు మరణానికి గురి అయ్యారు.PPTel 47.2

  నిత్యజీవం కలిగి ఉండటానికి మానవుడు జీవవృక్ష ఫలాన్ని భుజించటం కొనసాగించాలి. ఈ ఫలం తినకపోతే అతడి జీవశక్తి క్రమేణ సన్నగిల్లి చివరికి ప్రాణం పోతుందిజ అవిధేయత ద్వారా ఆదామవ్వలు దేవుని ఆగ్రహానికి గురికావలసి ఉన్నది. సాతాను ఎత్తుగడ, వారు దేవుని క్షమాపణ పొందకపోయినట్లయితే వారు జీవవృక్షఫలాలు తింటారని తద్వారా పాపజీవితాన్ని నిరంతరం కొనసాగిస్తారన్నది. ఇలా ఉండగా, మానవుడి పతనం వెనువెంటనే జీవవృక్షానికి కాపలా కాయటానికి దేవుడు దూతల్ని నియమించాడు. ఈ దూతల చుట్టూ ధగధగ మెరిసే ఖడ్గంలా కనిపిస్తున్న కాంతి కిరణాలు ప్రకాశించాయి. జీవాన్నిచ్చే ఆ పండును కోసేందుకు ఆదాము కుటుంబీకులెవ్వరూ హద్దు దాటి వెళ్లటానికి అనుమతి లేదు. అందుచేత నిత్యజీవులైన పాపులెవరూ లేరు.PPTel 47.3

  మన ఆది తల్లిదండ్రులు అతిక్రమంనుంచి వరదలా ప్రవహించిన చెడు, దు:ఖం చిన్నతప్పుకు భయంకర పర్యవసానంగా అనేకులు పరిగణిస్తున్నారు. మానవుడితో వ్యవహరించటంలో దేవుని వివేకాన్ని న్యాయశీలతను అభిశంసిస్తున్నారు. అయితే ఈ సమస్యను ఒకింతలోతుగా ఆలోచిస్తే తమ తప్పేంటో వారికే బోధపడుంది. మానవుణ్ణి దేవుడు తన స్వరూపంలో పాపంలేకుండా సృజించాడు. దూతలకన్నా కొంచెం తక్కువగా సృష్టిపొందిన మానవులు భూమిని నింపాల్సి ఉన్నారు. కాని వారి విధేయతను పరీక్షించాల్సి ఉన్నది. ఎందుకంటే తన చట్టాన్ని గౌరవించని వారితో భూమిని నింపటం దేవునికి ఇష్టం లేదు. అయినా ఆయన ఆదాముకి కఠిన పరీక్ష పెట్టలేదు. ఆయన విధించిన అల్ప నిషేధం ఆ పాపాన్ని మరింత తీవ్రం చేసింది. ఆదాము చిన్న పరీక్షకే నిలవలేకపోతే ఉన్నత బాధ్యతలు అప్పగించినప్పుడు పెద్ద కష్టాలు వస్తే భరించలేకపోయేవాడే.PPTel 47.4

  ఆదాముకి కఠినమైన పరీక్ష పెట్టి ఉంటే దుర్మార్గతకు అలవాటు పడ్డవారు “ఇది చిన్న విషయమే, చిన్న చిన్న వాటిని దేవుడు పట్టించుకోడు” అంటూ తమ పొరపాట్లను కొట్టేసుకొనేవారే. చిన్న పొరపాట్లుగా మనుషులు భావించి అదుపు చేయని విషయాల్లో అతిక్రమం కొనసాగుతుంటుంది. చిన్నదైనా పెద్దదైనా పాపం తనకు హేయమయిందని ప్రభువు స్పష్టం చేస్తున్నాడు.PPTel 48.1

  దేవుడు నిషేధించిన చెట్టుపండు తినటం, ఆజ్ఞను అతిక్రమించమని భర్తను శోధించటం అవ్వకు చిన్న పొరపాటుగా కనిపించింది. అయితే వారు చేసిన పాపం లోకాన్ని ఎంత దు:ఖానికి లోనుచేసింది! ఒక్క తప్పటడుగువల్ల ఉత్పన్నమయ్యే ఘోర పర్యవసానం శోధన సమయంలో ఎవరు గ్రహించగలరు?PPTel 48.2

  మానవుడు ధర్మశాస్త్రానికి బద్దుడుకాడని బోధించే అనేకమంది దానిలోని ధర్మవిధుల్ని మానవుడు ఆచరించటం అసాధ్యమని వాదిస్తారు. ఇది నిజమైతే ఆదాము అతిక్రమఫలితంగా శిక్ష ఎందుకు అనుభవించాడు? మన ఆది తల్లిదండ్రుల పాపం వల్ల అపరాధం దు:ఖం లోకం మీదకు వచ్చాయి. దేవుని దయాళుత్వం కృప అడ్డుకోకపోతే మానవజాతి నిరీక్షణలేని నిరాశలో మునిగిపోయేదే. ఎవరూ తమ్మును తాము మోసగించుకోకుందురుగాక. “పాపము వలన వచ్చు జీతము మరణము” రోమా 6:23 ఆదాము పాపం చేసినప్పుడు అమలైన అదే ధర్మశాస్త్రం ఇప్పుడూ అమలలులో ఉంది. అప్పుడు ఎక్కువ ఇప్పుడు తక్కువ అమలు అన్నదిలేదు. తమ పాపం తర్వాత ఆదామవ్వలు ఏదెనులో నివశించటం కుదరలేదు.PPTel 48.3

  తాము నిరపరాధులుగా ఆనందంగా నివసించిన ఆ తోటలోనే తమను కొనసాగనీయమని వారు ప్రాధేయపడ్డారు. అక్కడ నివసించే హక్కును పోగొట్టుకొన్నామని కన్నీటితో ఒప్పుకొన్నారు. ఇకముందు దేవునికి మిక్కిలి విధేయులమై ఉంటామని వాగ్దానం చేశారు. అయితే పాపం వల్ల తమ స్వభావం చెడ్డదయ్యిందని, దుష్టిని ప్రతిఘటించటానికి తమ శక్తి క్షీణించిన హేతువు చేత తాము సాతాను ప్రవేశానికి మార్గం సుగమం చేశారని అప్పుడు అజ్ఞాన స్థితిలో శోధనకులొంగారు గాని ఇప్పుడు పాపాన్ని ఎరిగి ఉన్న స్థితిలో నమ్మకంగా ఉండటానికి తమకు ఏమంత శక్తి ఉండదని వారికి దేవుడు వివరించాడు. PPTel 48.4

  దు:ఖంతో బరువెక్కిన హృదయాలతో ఏదెనుకు వీడ్కోలు చెప్పి పాపశాపంతో నిండిన భూమిపై నివాసం ఏర్పర్చుకోటానికి వారు వెళ్లిపోయారు. క్రితం అనుకూలంగా, సమతౌల్యంగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఎంతో మారిపోయింది. చలి నుంచి వేడిమి నుంచి వారికి కాపుదలనివ్వటానికి దేవుడు వారికి చర్మపు దుస్తులను అనుగ్రహించాడు.PPTel 49.1

  వాడిపోతున్న పువ్వులో, పడిపోతున్న ఆకులో చావుకు మొదటి గుర్తులు చూసినప్పుడు నేడు మనుషులు మరణించినప్పుడు ప్రియులు దు:ఖించేదానికన్నా ఆదాము అతని భార్య ఎక్కువ దు:ఖించారు. సుతిమెత్తని పువ్వులు చచ్చిపోవటం దు:ఖ కారణమే. కాని మంచి చెట్లు ఆకులు రాల్చటమన్నది జీవిస్తున్న ప్రతీదీ మరణించిక తప్పదన్న కటువైన సత్యాన్ని వారి దృష్టిముందుంచింది.PPTel 49.2

  ఏదెను తోటలోనుంచి మానవుడి నిషేధం జరిగిన చాలాకాలం వరకు ఆ తోట భూమిమీదే ఉన్నది. పాపం లేకుండా జీవించినప్పటికి పడిపోయిన వారి గృహాన్ని మానవజాతి వీక్షించేందుకు అది చాలాకాలం ఉన్నది. అందులో మానవులు ప్రవేశించకుండా దేవదూతలు కావలి ఉన్నారు. కెరూబులు కావలి ఉన్న ఆ తోట గుమ్మంవద్ద దేవుని మహిమ ప్రదర్శితమయ్యేది. ఆదాము ఆదాము కుమార్లు ఇక్కడికి దేవుని ఆరాధించేందుకు వచ్చేవారు. తాము ఏ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినందుకు ఏదెను నుంచి బహిష్కృతి పొందారో ఆ దైవ ధర్మశాస్త్రానికి విధేయులమై ఉంటామన్న తమ వాగ్దానాన్ని వారు ఇక్కడ నవీకరించుకొన్నారు. దుష్టత్వం లోకమంతా వరదవలె వ్యాపించి మనుషుల దుర్మార్గత పెచ్చరిల్లగా వారి నాశనం జలప్రళయం ద్వారా జరగాలన్న తీర్మానం జరిగినప్పుడు ఏదెనుని నాటిన హస్తమే దాన్ని భూమి పైనుంచి ఉపసంహరించుకొన్నది. కాగా అంతిమ పునరుద్దరణలో “క్రొత్త ఆకాశము క్రొత్త భూమి” (ప్రక 21:1). ఏర్పాటైనప్పుడు పూర్వంకన్నా మరెక్కువ వైభవం సంతరించుకొని అది పునరుద్ధరణ పొందుతుంది.PPTel 49.3

  దేవుని ఆజ్ఞలు గైకొన్న ప్రజలు అప్పుడు జీవవృక్షం కింద అనంత యుగాలుగా అమరత్వ శక్తిని పొందుతూ జీవిస్తారు. పాపం తాకిడిలేని దైవ సృష్టికార్యానికి, మానవుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉంటే ఈ భూమి సంతరించుకొని ఉండే పరిపూర్ణస్థితికి మాదిరిని పాపరహిత లోకాల్లోని ప్రజలు దానిలో చూసేవారు.PPTel 49.4

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents