Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  23—ఐగుప్తు తెగుళ్లు

  ఎంతోకాలంగా తనను విడిచివున్న తన తమ్ముడు వస్తున్నట్లు దేవదూతల ద్వారా తెలుసుకొన్న అహరోను అతణ్ని కలుసుకోటానికి ఎదురు వెళ్లాడు. వారు హోరేబు పర్వతం వద్ద ఏకాంతపు ఎడారిలో కలుసుకొన్నారు. ఇక్కడ వారు సంప్రదించు కొన్నారు. అప్పుడు మోషే “తన్ను పంపిన యెహోవా పలుకమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను”. నిర్గమకాండము 4:28. వారిద్దరూ కలిసి ఐగుప్తుకు వెళ్లారు. గో షెను ప్రదేశానికి వచ్చి అక్కడ ఇశ్రాయేలు పెద్దల్ని సమావేశపర్చారు. మో షేకి దేవుడు కనిపించి చెప్పిన వాటన్నటినీ అహరోను వారికి వివరించాడు. అనంతరం దేవుడు ఇచ్చిన గుర్తుల్ని మోషే ప్రజలముందు ప్రదర్శించాడు. “జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కని పెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి” 30, 31 వచనాలు.PPTel 247.1

  మోషే ఒక వర్తమానం రాజుక్కూడా అందించాల్సి ఉన్నాడు. రాజులకు రాజు రాయబారులుగా ఆ సహోదరులిద్దరూ రాజభవనంలో ప్రవేశించి ఆయన నామంలో ఇలా మాట్లాడారు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా - అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు.”.PPTel 247.2

  “నేను అతని మాటవిని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు ? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనియ్యను” అన్నాడు. రాజు. వారిచ్చిన జవాబు ఇది, “హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన యెడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము; లేనియెడల ఆయన మామీద తెగుళ్లతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో”.PPTel 247.3

  వారిని గురించి, ప్రజల్లో వారిపట్ల కలుగుతున్న అనుకూల స్పందనను గురించి రాజుకి సమాచారం అందింది. “మోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండి” అన్నాడు ఫరో. ఈ పరదేశుల జోక్యంవల్ల అప్పటికే దేశానికి ఎంతో నష్టం కలిగింది. అది జ్ఞాపకం వచ్చి ఇలా అన్నాడు. “ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది. వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారు.”PPTel 247.4

  ఇశ్రాయేలీయులు తమ దాసత్వంలో కొంతవరకు దేవుని గూర్చిన జ్ఞానాన్ని కోల్పోయి దేవుని ధర్మవిధులనుంచి తొలగిపోయారు. సబ్బాతును పూర్తిగా విస్మరించారు. వెట్టి పనులు అధికారుల కాఠిన్యం సబ్బాతు ఆచరణను కష్టతరం చేశాయి. కాగా దాస్యం నుంచి తమ విడుదలకు మొదటి షరతు తాము దేవునికి విధేయులు కావటమని మోషే ప్రజలకు సూచించాడు. సబ్బాతు ఆచరణను పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వారి హింసకుల దృష్టికి వెళ్లాయి.PPTel 248.1

  ఉద్రికత్తతో నిండిన రాజు ప్రజలు తమ వెట్టి చాకిరీకి స్వస్తి చెప్పి తిరుగుబాటు చేస్తారని భావించాడు. సోమరితనం అసంతృప్తికి మూలం. అందుచేత ప్రమాదకరమైన పథకాలు వేయకుండా వారిక తీరికలేకుండా చేయాలనుకున్నాడు. వెంటనే వారి బరువులు పెంచి తద్వారా వారి స్వతంత్రభావాన్ని నాశనం చేయాలనుకొన్నాడు. అదే రోజు వారి వెట్టిపని మరింత ఎక్కువ చేసి వారి శ్రమను పెంచటానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ దేశంలో సర్వసామాన్యమైన కట్టడపు దినుసు ఎండకు ఎండిన ఇటుక, చక్కని భవనాల గోడలు వాటితోనే నిర్మించి ఆ మీదట రాయి అతికేవారు. ఇటుకలు ధృడంగా ఉండేందుకు మట్టిలో ఎండుగట్టి కలిపి వాటిని చేసేవారు. ఆ పనికి పెద్దఎత్తున పనివారికి ఎండుగడ్డి సరఫరా చేసేవారు. ఇప్పుడు ఆ గడ్డి సరఫరా నిలిపివేయమని రాజు ఆజ్ఞపించాడు. పనివారు అవసరమైన గడ్డిని తామే సేకరించుకొని తాము చేయాల్సిన ఇటుకలు చేసి ఇవ్వాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు.PPTel 248.2

  ఈ ఆజ్ఞ దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులికి తీవ్ర ఇబ్బంది కలిగించింది. ప్రజల పనిని పర్యవేక్షించటానికి ఐగుప్తీయ వెట్టిపనుల అధికార్లు హెబ్రీ పర్యవేక్షకుల్ని బాధ్యుల్ని చేశారు. రాజు ఆజ్ఞ అమలైనప్పుడు ప్రజలు గడ్డి సేకరించటానికి బదులు చెత్త సేకరించటానికి దేశమంతా చెదిరిపోయారు. ఈ వైఫల్యానికి హెబ్రీ అధికార్లను ఐగుప్తు అధికార్లు క్రూరంగా దండించేవారు.PPTel 248.3

  తమకు వస్తున్న హింస వెట్టిపని అధికార్లవల్లనేగాని రాజువల్లకాదని భావించి హెబ్రీ అధికార్లు తమ కష్టాలు రాజుకి విన్నవించుకోటానికి వెళ్లారు. వారి ఫిర్యాదుకు ఫరో ఈ వెక్కిరింపు సమాధానం ఇచ్చాడు. “మీరు సోమరులు, మీరు సోమరులు అందుచేత -మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగు చున్నారు”. తమ భారం తగ్గించేదిలేదని కరాఖండిగా చెప్పి వారిని తమ తమ పనులకు తిరిగి వెళ్లమని రాజు ఆజ్ఞాపించాడు. వారు తిరిగి వచ్చి మోషేని ఆహారోనుని కలిసి ఏడూస్తూ ఇలా అన్నారు. “యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గమిచ్చితిరి.”PPTel 248.4

  ఈ నిందల్ని వినప్పుడు మోషే ఎంతో బాధపడ్డాడు. ప్రజల భారం బాధ మరింత పెరిగింది. దేశమంతటా పెద్దవారు చిన్నవారు అందరూ కలిసి తమ పరిస్థితిలో కలిగిన మార్పుకు తానే కారణమని మో షేని నిందిచటం మొదలు పెట్టారు. సంక్షోభిస్తున్న హృదయంతో దేవుని ముందుకి వెళ్లి మోషే ఈ విధంగా ప్రలాపించాడు. “ప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నేను నీ పేరిట మాటలలాడుటకు ఫరోయొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడు చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపించనేలేదు.” ప్రభువు సమాధానం ఇలాగుంది. “ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయము చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తముచేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయును”. పితరులతో తాను చేసిన నిబంధనను ప్రస్తావిస్తూ దాన్ని నెరవేర్చుతానని దేవుడు మళ్లీ అతడితో చెప్పాడు.PPTel 249.1

  ఐగుప్తు దాస్యం కొనసాగిన సంవత్సరాలన్నిటిలోను యెహోవాను ఆరాధించిన ఇశ్రాయేలీయులు కొందరున్నారు. రోజుకిరోజు తమ బిడ్డలు అన్యుల హేయ కార్యాల్ని వీక్షించటం, వారి అబద్ద దేవుళ్లకు సమస్కరించటం చూసినప్పుడు వీరు తీవ్ర మనస్తాపం పొందేవారు. విగ్రహారాధన దుష్ప్రబావంనుంచి తమకు విడుదల కలిగే నిమిత్తం ఐగుప్తు కాడినుంచి తమకు విమోచన అనుగ్రహించమని దు:ఖంతో ప్రభువును వేడుకొనేవారు. వార తమ విశ్వాసాన్ని దాచి పెట్టుకోలేదు. భూమ్యాకాశాల సృష్టికర్త అయిన నిజమైన దేవున్నే తాము ఆరాధిస్తున్నామని వారు ఐగుప్తీములకు చాటిచెప్పారు. సృష్టినుంచి యాకోబు దినాలవరకు ఆయన ఉనికికి ఆయన శక్తికి ఉన్న నిదర్శనాల్ని వారు పున:పరిశీలన చేసుకొనేవారు. ఈ విధంగా హెబ్రీయుల మతంతో ఐగుప్తీయులకు పరిచయం కలిగింది. అయితే తమ బానిసల నుండి నేర్చుకోటానికి ఇష్టం లేక ప్రతిఫలం ఎరచూపి అది పనిచేయనప్పుడు భయ పెట్టి దైవజనుల విశ్వాసాన్ని చెరచటానికి ప్రయత్నించారు.PPTel 249.2

  తమ పితురులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని వల్లించటం ద్వారాను, తమకు ఐగుప్తునుంచి విడుదల కలుగుతుందంటూ యోసేపు తన మరణానికి ముందు చెప్పిన మాటల్ని వల్లించటం ద్వారాను ఇశ్రాయేలు పెద్దలు దిగజారున్న సహోదరుల విశ్వాసాన్ని బలపర్చటానికి ప్రయత్నించారు. కొందరు విని విశ్వసించారు. ఇతరులు తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి ఆశలు వదులుకొన్నారు. తమ బానిసల సమాజంలో జరుగుతున్నదంతా తెలుసుకొన్న ఐగుప్తీయులు వారు ఎదురు చూస్తున్న విడుదలను గురించి ఎగతాళి చేస్తూ వారి దేవునికి శక్తి లేదని ఖండితంగా చెప్పారు. వారు ఆదేశంలో ఒక బానిస జాతిగా ఉన్నారంటూ ఎగతాళిగా ఇలా అన్నారు. “మీ దేవుడు న్యాయవంతుడు, కృపగలవాడు, ఐగుప్తు దేవుళ్లకన్నా అధిక శక్తిగలవాడు అయితే మిమ్మల్ని స్వతంత్రంగల ప్రజల్ని ఎందుకు చేయడు?” వారు తమ స్థితిని గురించి ప్రస్తావించారు. ఇశ్రాయేలీయులు అబద్ద దేవుళ్లుగా వర్ణిస్తున్న దేవుళ్లని పూజిస్తున్నా తాము భాగ్యవంతమైన, శక్తివంతమైన దేశంగా ఉన్నామని చెప్పారు. తమ దేవుళ్లు తమకు అభివృద్ధినిచ్చారని ఇంకా ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా ఇచ్చారని, యెహోవాను పూజించేవారిని హింసించి నాశనం చేయటంలో తాము అతిశయిస్తున్నామని చెప్పారు. హెబ్రీయుల దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన చేతుల్లోనుంచి రక్షించలేడని ఫరో కూడా ప్రగల్భాలు పలికాడు.PPTel 249.3

  ఇలాంటి మాటలు అనేకమంది ఇశ్రాయేలీయుల నీరీక్షణను దెబ్బతీశాయి. పరిస్థితి ఐగుప్తీయులు వర్ణిస్తున్నట్టే వారికి కనిపించింది. తాము బానిసలమన్న మాట నిజమేనని తను కార్య నియామకులు నియమించే విధుల్ని తాము చేయాల్సిందేనని భావించారు. తమ పిల్లల్ని వారు వేటాడి చంపారు. తమ జీవితాలు భారంగా ఉన్నాయి. అయినా తాము పరలోకమందున్న దేవున్ని ఆరాధించాము అని భావించారు. యెహోవా దేవుళ్లందరికన్నా అధికుడైతే తమనిలా విగ్రహారధ కులకు బానిసలుగా ఉంచడు అనుకొన్నారు. అయితే ఇశ్రాయేలీయులు దేవునికి దూరంగా వెళ్లి పోయినందున, అన్యజాతుల ప్రజలతో వివాహ బంధాలు ఏర్పరచుకొని విగ్రహారాధకులైనందున తాము బానిసలవ్వటానికి దేవుడు అనుమతించాడని దేవునికి నమ్మకంగా ఉన్న ఇశ్రాయేలీయులు కొందరు అవగాహన చేసుకొన్నారు. కొద్దికాలంలోనే దేవుడు తమను బానిసత్వం నుంచి విడిపిస్తాడని వారు తమ సోదర ఇశ్రాయేలీయులను ఉత్సహపర్చారు.PPTel 250.1

  ఎలాంటి ప్రత్యేక విశ్వాస పరీక్షగాని, ఎలాంటి శ్రమగాని, కష్టంగాని లేకుండానే తమకు స్వేచ్చ వస్తుందని హెబ్రీయులు ఎదురు చూసారు. కాగా విడుదలకు వారింకా సిద్ధంగా లేరు. దేవుని పై వారికి విశ్వాసం లేదు. తమకు విడుదల నివ్వటానికి ఆయన ఎంచుకొన్న సమయం వరకు తమ కష్టాలు బాధల్ని భరించటానికి వారు సమ్మతంగా లేరు. కొత్త ప్రదేశానికి తరలి వెళ్లటంలో ఉన్న సాధక బాధకాల్ని ఎదుర్కొనే కన్నా దాస్యంలోనే మిగిలి పోవటానికి అనేకులు సిద్ధమయ్యారు. కొందరైతే ఐగుప్తీయుల అలవాట్లనే అలవర్చుకొని ఐగుప్తులోనే స్థిరపడి పోవటానికి, ఎంపిక చేసుకొన్నారు. అందుచేత ఫరోముందు తన శక్తిని మొట్టమొదటగా ప్రదర్శించినప్పుడే దేవుడు వారిని విడిపించలేదు. ఐగుప్తు రాజు నిరంకుశ స్వభావం పూర్తిగా వృద్ధి చెందటానికి, తన ప్రజలకు తన్ను తాను ప్రత్యక్ష పర్చుకోటానికి దేవుడు పరిస్థితుల్ని అదుపు చేశాడు. ఆయన న్యాయశీలతను, ఆయన శక్తిని, ఆయన ప్రేమను చూసి వారు ఐగుప్తును విడిచి పెట్టి ఆయనను సేవించటానికి ఎంపిక చేసుకోవాలన్నది. ఆయన ఉద్దేశం. ఇశ్రాయేలీయుల్లో అనేకులు ఐగుప్తులో ఉండి పోవటానికి ఎంపిక చేసుకొని ఉండకపోతే మోషే పని ఎంతో తేలిక అయి ఉండేది.PPTel 250.2

  ప్రజలవద్దకు మళ్లీ వెళ్లి దాస్య విముక్తి వాగ్దానాన్ని వారికి మళ్లీ వినిపించి వారి పట్ల దేవుని ప్రేమను వివరించమని దేవుడు మోషేని ఆదేశించాడు. దేవుడి ఆదేశాసుసారం మోషే ప్రజల వద్దకు వెళ్లాడు. కాని వారు వినిపించుకోలేదు. “వారు మనో వ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి”. మోషేకు దేవుని వర్తమానం మళ్లీ వచ్చింది. “నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో -ఇశ్రాయేలీయులను తన దేశమునుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను”.ఆ ధైర్యం చెంది మోషే ఇలా అన్నాడు.“చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు. మాట మాంద్యము గలవాడగు నా మాట ఫరో యెట్లు వినును?” అహరోనును తీసుకొని ఫరో ముందుకు వెళ్లి “ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి .... వెలుపలికి” పంపుమని చెప్పమన్నాడు.PPTel 251.1

  ఐగుప్తు పై దేవుడు తన తీర్పులు కుమ్మరించి తన శక్తిని ప్రదర్శించి ఇశ్రాయేలీయుల్ని విడిపించే వరకూ రాజు వారిని పోనియ్యడని ఆయన మోషేకి తెలియజేశాడు. ఆ తెగుళ్లనుంచి తప్పించుకోవాలని తాను కోరుకున్నట్లుయితే దేశం మీదికి రాకముందు ప్రతీ తెగులు స్వభావాన్ని దాని పర్యవసానాన్ని మోషే అతడికి వివరించాల్సి ఉన్నాడు. అతడి గర్విష్ఠి హృదయం వినయం నేర్చుకొని భూమ్యాకాశాల సృష్టికర్తను నిజమైన దేవునిగా గుర్తించేవరకూ, అతడు నిరాకరించే ప్రతీ శిక్ష వెంట మరింత కఠినమైన శిక్ష వస్తుందని దేవుడు చెప్పాడు. యెహోవా అజ్ఞల్ని వ్యతిరేకించినప్పుడు తమ జ్ఞానుల జ్ఞానం ఎంత వ్యర్ధ మయిందో, తమ దేవుళ్ల శక్తి ఎంత నిరూపయోగమయ్యిందో చూసి తెలుసుకోటానికి ఐగుప్తీయులకు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. తమ విగ్రహరాధన నిమిత్తం, జీవంలేని దేవుళ్ల దీవెనల్ని గురించి వారి ప్రగల్భాల నిమిత్తం ఆయన ఐగుప్తు ప్రజల్ని శిక్షిస్తాడు. తక్కిన దేశాల ప్రజలు తన శక్తిని గూర్చి విని ఆయన అద్భుత కార్యాలు చూసి భయంతో వణికేటట్లు తన ప్రజలు విగ్రహారాధనను విడిచి పెట్టి తనను పరిశుద్ధంగా ఆరాదించేందుకు దేవుడు తన నామాన్ని మహిమ పర్చుకొంటాడు.PPTel 251.2

  ఐగుప్తు రాజు విలాసమందిరంలో మోషే అహరోనులు మరోసారి ప్రవేశించారు. బలమైన ఎత్తయిన స్తంభాలు, ధగధగ మెరిసే అలంకరణలూ, విలువైన చిత్రపటాలు, అన్యదేవుళ్ల శిలా విగ్రహాల నడుమ ఆనాటి దేశాల్లో మిక్కిలి శక్తివంతమైన దేశపు రాజు ముందు, ఇశ్రాయేలీయుల విడుదలకు దేవుని ఆజ్ఞను పునరుద్ఘాటించేందుకు, బానిసజాతి ప్రతినిధులుగా ఈ ఇద్దరు వ్యక్తులూ నిలబడి ఉన్నారు. తాము తెచ్చింది. దేవుని ఆజ్ఞ అనటానికి నిదర్శనంగా ఒక సూచన క్రియ చేయమని రాజు ఆదేశించాడు. అలాంటి ఆ దేశానికి ఎలా ప్రతిస్పందిచాలో మోషే అహరోనులకు దేవుడు ముందే సూచించాడు. అహరోను తన చేతి కర్రను ఫరోముందు నేలమీద పడవేశారు. అది సర్పం అయ్యింది. ఫరో “తన విద్వాంసులను మంత్రజ్ఞులను” పిలిపించాడు. “వారిలో ప్రతివాడును తన చేతికర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను చేతికట్టి వారి కజ్జలను మింగి వేసింది. ఇంతకు ముందుకన్నా రాజు కఠినుడై తన మాంత్రికులు మోషే అహరోనులతో వర్ణించాడు. వారి ఆజ్ఞల్ని ప్రతిఘటించడంలో ప్రమాదం లేదని భావించాడు. వారి వర్తమాన్నాన్ని తృణీకరించినా అతడు వారికి హని చేయకుండా దేవుడు అతణ్ని అదుపుచేశాడు.PPTel 252.1

  ఫరోముందు మోషే అహరోనులు చేసిన మహత్కారాలు దేవుని వల్ల మాత్రమే జరిగాయి గాని మానవ ప్రభావంవల్ల, శక్తివల్ల కాదు. “నేను ఉన్నాను” అనే మహోన్నతుడు మోషేని అహరోనుని పంపాడని సజీవుడైన తమ దేవుణ్ని ఆరాధించటానికి ఇశ్రాయేలీయుల్ని విడిచి పెట్టడం రాజు విధి అని ఫరోలో నమ్మకం కలగటానికి దేవుడు ఈ గుర్తుల్ని అద్భుతాల్ని ఉద్దేశించాడు. మాంత్రికులు కూడా గుర్తులు, అద్భుతాలు చేసి చూపించారు. వారు వాటిని కేవలం తమ శక్తివల్లే చేయ లేదు; తమ దేవుడు సాతాను శక్తివల్ల చేశారు. యెహోవా చేసిన దానికి నకిలీని చేయటానికి ఆ మాంత్రికులకు సాతాను సాయంచేశాడు.PPTel 252.2

  మాంత్రికులు నిజంగా తమ కర్రల్ని పాములు చేయ్యలేదు. గారడీవల్ల అపూర్వ వంచకుడి సహాయంవల్ల వారు పాము ఆకారాన్ని సృష్టించగలిగారు. కర్రల్ని నిజమైన సర్పాలుగా మార్చే శక్తి సాతానుకి లేదు. దుష్టుల గురువు సాతానుకు పతనమైన దూత జ్ఞానం, శక్తి ఉన్నప్పటికీ సృష్టించటానికి, ప్రాణం ఇవ్వటానికి శక్తి లేదు. ఇది దేవునికి మాత్రమే ఉన్న అధిక్యత. తాను చేయగలిగిన దంతా సాతాను చేశాడు. నకిలీని పుట్టించాడు. కర్రలు సర్పాలుగా మారినట్లు మానవ నేత్రానికి కనిపించింది. ఫరో అలాగనే నమ్మాడు. అతడి ఆస్థానంలోని వారూ నమ్మారు. మోషే సర్పానికి వారి సర్పాలకు తేడా ఏమీ కనిపించలేదు. నిజమైన సర్పం మాయా సర్పాల్ని మింగేటట్లు దేవుడు చేసినప్పటికీ దీన్ని కూడా దేవుని శక్తివల్ల జరిగిన కార్యంగా గాక తన మాంత్రికుల గారడీవల్ల జరిగిన కార్యంగా ఫరో పరిగణించాడు.PPTel 252.3

  తాను దేవుని ఆజ్ఞను మొండిగా తిరస్కరించటాన్ని ఫరో సమర్ధించుకోవాలని ప్రయత్నించాడు. అందుచేత మో షేద్వారా దేవుడు చేసిన మహత్కారాల్ని లెక్కచేయక పోవటానికి ఏదో సాకుకోసం వెదుకుతున్నాడు. తనకు అవసరమైన ఆ సాకును సాతాను అతడికి అందించాడు.మోషే,అహరోనులు ఐగుప్తీయులకు మాంత్రికులు, సోదెగాండ్రలా కనిపించేటట్లు, వారు తెచ్చిన వర్తమానం దేవుని వద్దనుంచి వచ్చిన వర్తమానంగా మన్నన పొందకుండా ఉండేటట్లు మాంత్రికుల ద్వారా తాను చేసిన పని ద్వారా చేయటం అతడి ధ్యేయం. తిరుగుబాటు చేయటానికి ఐగుప్తీయుల్ని ధైర్య పర్చటం లోను, విశ్వసించకుండా ఫరో హృదయాన్ని కఠిన పర్చటంలోను సాతాను నకిలీ పని లక్ష్యాన్నది ఈ రకంగా సాధించింది. తాము చేపట్టిన కార్యం దేవుని మూలంగా కలిగిందా అన్న విషయమై మోషే అహరోనుల విశ్వాసాన్ని సడలింపగలనని అతడను కొన్నాడు. ఇలా తన సాధనాలు విజయవంతమవుతాయని ఆశించాడు. సజీవుడైన దేవుని సేవించే నిమిత్తం ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వం నుంచి విడుదల పొందటం అతడికి సుతరాము ఇష్టం లేదు.PPTel 253.1

  మాంత్రికుల ద్వారా తన అద్భుతకార్యాలు ప్రదర్శించటంలో దుర్మార్గుల రాజు సాతానుకి ఇంకో ఉద్దేశం కూడా ఉంది. మానవాళి పై అధికారం చెలాయించే పాపపు కాడిని విరగకొట్టాల్సి ఉన్న క్రీస్తుకు ఇశ్రాయేలీయుల దాసత్వపు కాడిని విరుగగొట్టడంలో మోషే ముంగుర్తని అతడికి బాగా తెలుసు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయనను దేవుడు పంపాడనటానికి లోకానికి నిదర్శనంగా మహత్కార్యాలు జరగనున్నాయని అతడికి తెలుసు. ఆయన శక్తి విషయమై సాతాను వణుకుతాడు.PPTel 253.2

  మోషేద్వారా దేవుడు చేసిన నకిలీ సమకూర్చటం ద్వారా ఇశ్రాయేలీయుల విడుదలను అడ్డుకోవటమే గాక క్రీస్తు మహత్కార్యాలపై ముందు తరాల ప్రజల విశ్వాసాన్ని నాశనం చేయటానికి అతడు తన ప్రభావాన్ని ప్రసరిస్తాడు కూడా, క్రీస్తు పనికి నకిలీ తయారు చేసి తద్వారా తన అధికారిన్ని స్థాపించటానికి సాతాను నిత్యము కృషి చేస్తున్నాడు. క్రీస్తు మహత్కార్యాలు మానవ శక్తి సామర్ధ్యాలవల్ల జరిగిన కార్యాలుగా పరిగణించేటట్లు అతడు మనుషుల్ని మభ్య పెడ్తాడు. అనేకుల మనసుల్లో క్రీస్తు దేవుని కుమారుడన్న విశ్వాసాన్ని ఈ విధంగా నాశనం చేసి రక్షణ ప్రణాళిక ద్వారా ఏర్పటయిన కృపకు తిరస్కరించటానికి వారిని నడిపిస్తాడు.PPTel 253.3

  అలవాటు ప్రకారం రాజు వెళ్లే నది ఒడ్డుకు ఆ మర్నాడు మోషే అహరోనులు వెళ్లాల్సిందిగా దేవుడు ఆదేశించాడు. నైలునది ఐగుప్తు అంతటికి ఆహారానికి సంపదకు ప్రధాన వనరు కావటంతో ప్రజలు ఆ నదిని పూజించేవారు. పూజ నిమిత్తం రాజు అక్కడికి అనుదినం వచ్చేవాడు. ఇక్కడ ఈ అన్నదమ్ములు తమ వర్తమానాన్ని రాజుకి పునరుద్ఘాటించి తమ కర్రతో ఆ నదీ జలాన్ని కొట్టారు. ఈ పవిత్ర ప్రవాహం రక్తంగా మారింది. చేపలు చచ్చిపోయాయి. నది దుర్గంధంతో నిండింది. ఇళ్లలో నిల్వచేసుకొన్న నీళ్లు, కొళాయిల్లో నిల్వవున్న నీళ్లు రక్తంగా మారాయి. “ఐగుప్తు శకునగాండ్రు కూడా తన మంత్రముల వలన అట్లు చేయగా “ఫరో హృదయం కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.” ఆ తెగులు ఏడు దినాలు కొనసాగింది. అయినా ఫలితం లేక పోయింది.PPTel 254.1

  ఈ నీళ్ల పై మళ్లీ కర్రను చాపగా నదిలోనుంచి కప్పలు వచ్చి దేశమంతా వ్యాపించాయి. ఇళ్లు, పడక గదులు, పొయ్యిలు, పిండి కలుపుకొనే పాత్రలు వాటితో నిండాయి. కప్పను ఐగుప్తీయుల పవిత్ర ప్రాణిగా పరిగణించేవారు. అందువల్ల దాన్ని చంపేవారు కాదు. ఇప్పుడు అవి దుర్భరమయ్యాయి. అవి ఫరో భవనాన్ని కూడా నింపాయి. వాటి బెడదనుంచి తప్పించుకోటానికి రాజు తొందరపడున్నాడు. మాంత్రికులు, శకునగాండ్రు, కప్పల్ని సృష్టించగలిగారు గాని వాటిని తీసివేయలేక పోయారు. ఇది చూసి ఫరో కొంచెం సిగ్గుపడ్డాడు. మోషే, అహరోన్లకు కబురు పంపి వారితో ఇలా అన్నాడు. “నా యొద్ద నుండి నా జనులు యొద్ద నుండి ఈ కప్పకను తొలిగించుమని యెహోవాను వేడుకొనుడి; అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలకు అగత్యముగా పోనిచ్చెదను.” తాను క్రితం పలికిన డంబపు మాటల్ని గుర్తుచేసి ఆ తర్వాత ఆ తెగులు పోవటానికి తాము ఎప్పుడు ప్రార్థించాలో ఒక సమయం నిర్ణయించి చెప్పమన్నారు. ఆ వ్యవదిలో కప్పలు వాటంతట అవే వెళ్లిపోతాయన్న ఆశాభావంతోను, ఆరకంగా ఇశ్రాయేలీయుల దేవునికి లొంగి పోవలసిన అవమానం నుంచి తప్పించుకోవచ్చునన్న నీరిక్షణతోను ఫరో రేపు అన్నాడు. నిర్దేశిత సమయం వరకు తెగులు కొనసాగింది. అంతట దేశమంతా ఉన్న కప్పలు చచ్చిపోయాయి. కాని కుళ్లీ కంపుకొడున్న వాటి శరీరాలు మిగిలిపోయి వాతావరణాన్ని కలుషితం చేశాయి.PPTel 254.2

  ఒక్క క్షణంలో అవి తిరిగి మన్నయి పోయేటట్లు ప్రభువు చేసేవాడే. అవి తొలగిపోయాక అది మాంత్రికులు, శకునగాండ్ర శక్తివల్ల జరిగిందని రాజు అతడి ప్రజలు చెప్పుకోటానికి తావులేకుండా ప్రభువు ఆ పని చేయ్యలేదు. కప్పలు చచ్చాయి. వాటిని పోగులు పెట్టారు. అది మాంత్రికులవల్ల జరిగిన పనికాదని కాని అది దేవుడు పంపించిన తీర్పని రాజు ఐగుప్తు ప్రజలందరూ చూడటానికి వారి వ్యర్థ వేదాంతం కాదనలేని నిదర్శనంగా మిగిలింది.PPTel 254.3

  “ఫరో ఉపశమనము కలుగుట చూచి ...... తన హృదయమును కఠిన పరచు కొని వారి మాట వినకపోయెను” దేవుని ఆజ్ఞమేరకు ఆహరోను తన చెయ్యి చాపగా భూమ దూళి పేలుగా మారి ఐగుప్తు దేశమంతటా వ్యాపించాయి. అలాగే వారిని కుడా చేయమంటూ ఫరో తన మాంత్రికుల్ని ఆదేశించాడు. కాని అది వారు చేయలేకపోయారు. సాతాను పనికన్నా దేవుని పని గొప్పదని తేలిపోయింది. మాంత్రకులే ఇలా ఒప్పుకొన్నారు. “ఇది దైవశక్తి” రాజు చలించలేదు.PPTel 255.1

  విజ్ఞాపన హెచ్చరిక ఇవేవీ పని చేయ్యలేదు. దేవుడు ఇంకొక తీర్పును పంపాడు. అది దానంతట అదే వచ్చిందని అతడు చెప్పకుండా అది సంభవించే సమయాన్ని అతడికి ముందుగా తెలియపర్చటం జరిగింది. ఇళ్లలో ఇళ్ల బయట ఎక్కడ పడితే అక్కడ ఈగల దండులు ముసిరాయి. “ఆ దేశము ఈగల గుంపులవలన చెడి పోయేను”. ఆ ఈగలు పెద్దవి, విషంతో నిండి ఉన్నాయి. వాటి కాటు మనుషులకేంటి జంతువులకేంటి తీవ్రమైన బాధ కలిగించింది. ముందే చెప్పినట్లు ఈ వ్యాధి గోషేను దేశంలోలేదు.PPTel 255.2

  ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనే యెహోవాకు బలి అర్పించటానికి ఫరో ఇప్పుడు అనుమతినిచ్చాడు. అట్టి షరతుల్ని వారు తిరస్కరించారు “అట్లు చేయ తగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము” “హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్మును రాళ్ళతో కొట్టి చంపుదురుగదా?” అని మోషే అన్నాడు. హెబ్రీయులు బలులర్పించాల్సిన జంతువులు ఐగుప్తీయులికి పవిత్రమైన జంతువులు. ఆ జంతువుల్ని ఐగుప్తీయులు ఎంత పవిత్రంగా పరిగణిస్తారంటే పొరపాటున ఎవరైనా ఒకదాన్ని చంపితే దానికి శిక్ష మరణం. కనుక తమ యజమానులైన ఐగుప్తీయులకు ద్వేషం పుట్టించకుండా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో తమ దేవుణ్ని ఆరాధించటం అసాధ్యం. అరణ్యంలోకి మూడు రోజుల ప్రమాణమంత దూరం వెళ్తామని మోషే మళ్లీ రాజుకి ప్రతిపాదించాడు. అందుకు రాజు సమ్మతించాడు. ఆ తెగుల్ని ఉపసంహరించుకోవాల్సిందిగా దేవుణ్ని కోరమని దైవ సైనికుల్ని ఫరో బతిమాలాడు. అలాగే చేస్తామని వాగ్దానం చేస్తూ తమతో మోసపూరితంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. తెగులు ఆగింది. కాని రాజు తన మనస్సును కఠిన పర్చుకొని తిరుగుబాటు చేస్తూ వారి మనవిని తిరస్కరించాడు.PPTel 255.3

  దానివెంట ఒక భయంకరమైన తెగులు వచ్చింది. అది ఐగుప్తులోని పశుసంపదకు వచ్చిన బాధాకరమైన తెగులు. ఆవులు, ఎడ్లు, గొర్రెలు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు మొదలైన జంతువులు నాశనమయ్యాయి. హెబ్రీయుల పశు సంపదకు హాని కలుగదని స్పష్టంగా తెలియజేశారు. ఫరో ఇశ్రాయేలీయుల ఇళ్లకు దూతల్ని పంపించి అది నిజమని తెలుసుకొన్నాడు. “ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు”. అయున ఫరో రాజు ఇంకా దేవుని మాట వినలేదు.PPTel 256.1

  ఆవపు బూడిద తీసుకొని ఆకాశమువైపు దాని చల్లమని తర్వాత దేవుడు మోషేని ఆదేశించాడు. ఈ చర్య తీవ్ర ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. తన ప్రజలను హింసించేవారి పైకి తన తీర్పులు రాజుతున్న పొయ్యి అగ్నిజ్వాల చిహ్నంకింద తీసుకు వస్తానని ప్రభువు సెలవిచ్చాడు. ఇశ్రాయేలీయలు ఐగుప్తు శ్రమల కొలిమిలో చాలాకాలం బాధపడ్డారు. మోషే చేసిన ఈ క్రియ దేవుడు తన నిబంధనను మర్చిపోలేదని తమ విడుదలకు సమయం ఆసన్నమయ్యిందని ఇశ్రాయేలీయులకు హామీ ఇవ్వటానికి ఉద్దేశించింది.PPTel 256.2

  ఆ బూడిదను ఆకాశంవైపు చల్లినప్పుడు దాని సన్నని ధూళి ఐగుప్తు దేశమంతా వ్యాపించి అది ఎక్కడ పడితే అక్కడ పుండ్లు పుట్టించింది. “అది మనుష్యులకు జంతువులకు పొక్కులు, పొక్కుదద్దుర్లు” చేసింది. క్రితంలో యాజకులు, మంత్రికులు ఫరో మంకుతనాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు వచ్చిన తీర్పు వారిమీద కూడా పడింది. హేయమైన బాధాకరమైన వ్యాధితో కునారిల్లుతూ వారిక దేవునితో పోరాడలేకపోయారు. తమ్మును తాము కాపాడుకోలేని మాంత్రికుల్ని నమ్ముకోవటం ఎంత అవివేకమో ఐగుప్తు ప్రజలందరూ గ్రహించారు.PPTel 256.3

  ఫరో హృదయం ఇంకా కఠినమయ్యింది. ప్రభువు అతడికి ఇప్పుడీ వర్తమానం పంపాడు, “సమస్త భూమిలో నావంటి వారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్లన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని, నీ ప్రజలమీదికిని పంపెదను... నా బలమును నీకు చూపునట్లు, భూలోక మంతదంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని”. ఇందు నిమిత్తమే దేవుడు అతణ్ని పుట్టించాడని కాదు కాని ఇశ్రాయేలీయుల విడుదలకు సమయం అయినప్పుడు అతణ్ని సింహాసనం పై ఉంచటానికి పరిస్థితుల్ని సంఘటనల్ని ఆయన సమకూర్చాడు అని. గర్విష్టుడైన ఈ నియంత తన నేరాల్ని బట్టి దైవ కృపను కోల్పోయినప్పటికీ అతడి మంకుతనం ద్వారా దేవుడు తన మహత్కార్యాల్ని ఐగుప్తులో కనపర్చేందుకోసం అతడి ప్రాణాన్ని సంరక్షించాడు. సంభవాల పరిష్కారం దేవుని చిత్తానుసారంగా జరుగుతుంటుంది. అద్భుతమైన దైవ శక్తి ప్రదర్శనను ప్రతిఘటించటానికి సాహసించని దయగల రాజును సింహాసనం మీద ఆయన పెట్టగలిగి ఉండేవాడు. అలా జరిగితే అది దేవుని ఉద్దేశం నెరవేర్చి ఉండేదికాదు. నైతికంగా దిగజార్చే విగ్రహారాధన ప్రభావం గురించి తన ప్రజలు మోసపోకుండా ఉండే నిమిత్తం ఐగుప్తీయుల క్రూరత్వాన్ని వారు అనుభవించటానికి దేవుడు అనుమతించాడు. ఫరోతో తాను వ్యవహరించిన తీరులో విగ్రహారాధన పట్ల ప్రభువు తన అసహ్యతను వ్యక్తం చేశాడు. క్రూరత్వాన్ని, ప్రజా పీడనను శిక్షించటానికి తన ధృఢ సంకల్పాన్ని ప్రదర్శించాడు.PPTel 256.4

  ఫరో విషయంలో ప్రభువిలా ప్రకటించాడు, “నేను అతని హృదయమును కఠిన పరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు” నిర్గమ కాండము 4:21. రాజు హృదయాన్ని కఠిన పర్చటానికి మానవాతీతమైన శక్తి వినియోగం కాలేదు. దైవ శక్తికి తిరుగులేని నిదర్శనాన్ని దేవుడు ఫరోకిచ్చాడు. అయితే రాజు వెలుగును తిరస్కరించాడు. అతడు నిరాకరించిన ప్రతీ దైవశక్తి ప్రదర్శన అతణ్ని తిరుగుబాటుకి మరింత కృత నిశ్చయుణ్ని చేసింది. మొదటి సూచకక్రియను నిరాకరించినప్పుడు అతడు విత్తిన తిరుగుబాటు విత్తనాలు వాటి పంట పండాయి. అతడు తన తలబిరుసు విధానంలో ఒక మంకు చర్యనుంచి మరో మంకు చర్యకు రెచ్చిపోతూ హృదయం కఠిన పర్చుకొంటూ తుదకు తన ప్రథమ పుత్రుడి మరణం చూసేంతవరకూ వెళ్తాడు.PPTel 257.1

  దేవుడు తన సేవకుల ద్వారా మనుషులతో మాట్లాడాడు. మెళకువలు చెప్పుతూ హెచ్చరికలు చేస్తూ పాపం విషయంలో గద్దిస్తూ ఆయన మాట్లాడాడు. తప్పులు ప్రవర్తనలో స్థిరపడకముందు వాటిని సవరించుకోటానికి ప్రతీవారికి అవకాశం ఇస్తాడు. కాని ఎవరైనా వాటిని సవరించుకోటానికి నిరాకరిస్తే దైవశక్తి జోక్యం చేసుకొని అతడి క్రియాధోరణిని సరిచేయదు. అదే ధోరణిలో పదే పదే వ్యవహరించటం సులభమ వుతుంది. అతడు పరిశుద్దాత్మ ప్రభావానికి వ్యతిరేకంగా తన హృదయాన్ని కఠినపర్చుకొంటున్నాడు. వెలుగును ఇంకా నిరాకరించటం చివరికి ఎంతటి ప్రభావమైనా ఎలాంటి మార్పుకూ తావులేని పరిస్థితికి అతణ్ని దిగజార్చుతుంది.PPTel 257.2

  ఒకసారి శోధనకు లొంగిన వ్యక్తి రెండోసారి సులభంగా లొంగిపోతాడు. మళ్లీ మళ్లీ పాపం చేయటం అతడి ప్రతిఘటన శక్తిని క్షీణిపంజేస్తుంది. అతడి కళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది. విశ్వాసం గొంతు నులుముతుంది. విత్తిన ప్రతీ శరీరాశ విత్తనం పంట పండుతుంది. ఆ పంట పండకుండా చేయటానికి దేవుడు మహత్కార్యాలు చేయడు. “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోయును” గలతీ 6:7. కరడు కట్టిన నాస్తికత్వాన్ని ప్రదర్శించే వ్యక్తి, సత్యంపట్ల అనాసక్తి కనపర్చే వ్యక్తి తాను విత్తిన పంటనే కోస్తున్నాడు. ఒకప్పుడు తమ ఆత్మల్ని ఉర్రూతలూగించిన సత్యాల్ని వేవేల ప్రజలు ఈ విధంగా నిరాసక్తితో వినటం జరుగుతున్నది. వారు సత్యంపట్ల అలక్ష్యం ప్రతిఘటన విత్తారు. అందుకు అలాంటి పంటను కోస్తున్నారు. PPTel 257.3

  తాము అనుకొన్నప్పుడు తమ దుష్ప్రవర్తనను మార్చుకోగలమని, కృపాహ్వానాన్ని లెక్కచేయక పోయినప్పటికీ అది మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుందని అనుకొంటూ తమ మనస్సాక్షిని శాంత పర్చుకోజూసేవారు తమ నాశనాన్ని తామే కొనితెచ్చుకొంటారు. తమ సర్వశక్తి సామర్థ్యాల్ని సాతాను కార్యానికి వినియోగించిన తర్వాత అత్యవసర పరిస్థితిలో అపాయం ఏర్పడ్డప్పుడు ఒక్కక్షణంలో నాయకుల్ని మార్చుకోవచ్చునని వారు తలస్తారు. అయితే ఇది అంత సులభమైన పనికాదు. ఆ అనుభవం, ఆ విద్య, పాప క్రియలతో నిండిన తమ జీవితానికి ఆ క్రమశిక్షణ తమ ప్రవర్తనను రూపుదిద్దినందుకే వారు క్రీస్తు స్వరూపాన్ని పొందలేరు. తమ మార్గంలో వెలుగు ప్రకాశించి ఉండకపోతే వారి పరిస్థితి వేరేగా ఉండేది. కృపజోక్యం కలిగించుకొని తన్ను అంగీకరించటానికి వారికి ఒక అవకాశం ఇవ్వవచ్చు. అయితే వెలుగును ఎంతోకాలంగా తిరస్కరించి తృణీకరించినందువల్ల అది చివరికి ఉపసంహరింప బడ్తుంది.PPTel 258.1

  తర్వాత వడగండ్ల వాన ఫరోమీదికి రానుంది, దీనికి ముందు అతడికి దేవుడు ఈ హెచ్చరిక పంపాడు, “కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పించబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను, జంతువు మీదను, వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చును”. వర్షంగాని, వడగండ్లుగాని ఐగుప్తులో అసమాన్యం . ఐగుప్తుమీదికి వస్తాదని చెప్పినలాంటి తుఫాను ఎన్నడూ సంభవించలేదు. ఆ వార్తవేగంగా ప్రచారమయ్యింది. దేవుని మాట పై విశ్వాసమున్న వారందరూ తమ తమ పశువుల్ని పోగుచేసుకొన్నారు. హెచ్చరికను తృణీకరించిన వారు తమ పశువుల్ని పొలాల్లోనే ఉంచారు. ఈ విధంగా తీర్పు మధ్యనే దేవుడు తన కృపను ప్రదర్శించి తన శక్తి ప్రదర్శన ద్వారా తనకు భయపడున్న వారెవరో పరీక్షించాడు.PPTel 258.2

  చెప్పిన రీతిగానే తుఫాను వచ్చింది. పిడుగులు, వడగండ్లు వాటితో కలిసి అగ్ని కురిశాయి. “ఐగుప్తు దేశమంతటను అది రాజ్య మైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతట మనుష్యులననేమి జంతువులననేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను”. నాశనపు దూత కలిగించిన నాశనం మరణం అపారం. గో షెను దేశం మాత్రమే ఆ నాశనాన్ని చవిచూడలేదు. భూమి సజీవ దేవుని ఆధీనంలో ఉన్నదని పంచభూతాలు ఆయన ఆజ్ఞను శిరసావహిస్తాయని ఆయనకు లోబడటంలోనే క్షేమముందని అది ఐగుప్తీయులకి బోధపర్చింది.PPTel 258.3

  దేవుని తీర్పుల కుమ్మరింపుకు ఐగుప్తుదేశం యావత్తు గజగజలాడింది. ఫరో హడావిడిగా ఆ అన్నదమ్ములికి కబురంపాడు. వారితో ఇలా అంటూ ఏడ్చాడు. “నేను ఈసారి పాపము చేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా ప్రజలును దుర్మార్గులము. ఇంతమట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు, వడగండ్లు రాకుండనట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇక నిలుపను”. దీనికి ఈ సమాధానం వచ్చింది, “నేను ఈ పట్టణమునుండి బయట వెళ్లగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియును. అయినను నీవును, నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నది”.PPTel 259.1

  పందెం అంతం కాలేదని మోషేకి తెలుసు. ఫరో ఒప్పుకోళ్లు, వాగ్దానాలు అతడి మనసులోగాని, హృదయంలోగాని వచ్చిన గొప్ప మార్పు ఫలితం కాదు. అవి భయంనుంచి బాధనుంచి పుట్టుకొచ్చినవి. అతడి కోరిక చెల్లిస్తానని మోషే వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఇంకా మొండికెత్తటానికి అతడికి అవకాశమివ్వకూడదని మోషే అనుకొన్నాడు. ఈ భీకర తుఫానులోనే మోషే బయటికి వెళ్లాడు. దేవుడు తన సేవకుల్ని కాపాడటానికి శక్తిగలవాడనటానికి ఫరోనూ అతడి మనుషులే సాక్షులు. పట్టణం వెలుపలికి వెళ్లిన తర్వాత “యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములును, వడగండ్లును నిలిచిపోయెను. వర్షము భూమిమీద కురియుట మానెను”. అయినా ఆ భయాలు తొలగిపోయిన వెంటనే రాజు హృదయం మళ్లీ దుర్మార్గత్వంతో నిండింది.PPTel 259.2

  ప్రభువు మోషేను ఇలా అన్నాడు, “ఫరో యొద్దకు వెళ్లుము. నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయులయెదుట కనబడుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారియెదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠిన పరచితిని”. తానే సజీవుడైన ఏకైక దేవుడన్న ఇశ్రాయేలీయుల విశ్వాసాన్ని ధృఢపర్చటానికి ప్రభువు తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు. వారికి ఐగుప్తీయులికి మధ్య తాను ఉంచిన తేడాను గుర్తించటానికి తిరుగులేని నిదర్శనాన్ని ఇచ్చి తాను ద్వేషించి హింసించిన హెబ్రీయులు దేవుని కాపుదలకింద ఉన్న ప్రజలని నానాజాతులప్రజలుగుర్తించేటట్లు ఆయన చేశాడు.PPTel 259.3

  ఫరో ఇంకా దేవుని మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆయన మిడతల్ని పంపుతాడని అవి నేలను కప్పివేస్తాయని నేల మీద ఇంకా మిగిలి ఉన్న పచ్చని మొక్కల్ని అవి తినివేస్తాయని అంతేకాక ఆ మిడతలు రాజభవనంతో సహా గృహాలన్నింటిని నింపేస్తాయని “నీ పితరులుగాని నీ పితామహులుగాని ఈ దేశములో నుండిన నాటినుండి నేటివరకు అట్టిది చూడలేదని” అతణ్ని మోషే హెచ్చరించాడు.PPTel 260.1

  ఫరో సలహాదారులు తెల్లబోయి చూస్తున్నారు. పశుసంపద నష్టంతోనే దేశం అతలాకుతలమయ్యింది. వడగండ్ల పాటుకు చాలామంది మరణించారు. అడవులు దెబ్బతిన్నాయి, పంటలు నాశనమయ్యాయి. హెబ్రీయుల శ్రమ ఫలితంగా తాము పొందిన లాభమంతా ఐగుప్తీయులు నష్టపోతున్నారు. ప్రజలందరూ ఆకలితో చనిపోయే పరిస్థితి వచ్చింది. సామంత రాజులు, ఆ స్థానికులు రాజును ముట్టడించి ఆగ్రహంగా ఇలా అడిగారు, “ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తను దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకను తెలియదా?”.PPTel 260.2

  రాజు మోషే అహరోనుల్ని మళ్లీ పిలిపించి వారితో ఇలా అన్నాడు, “మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్లుదురు?” వారిచ్చిన జవాబు ఇది, “మేము యెహోవాకు పండుగ ఆచరించవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడ వెళ్లేదము”. రాజు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. “యె హోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పొనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదేగదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి” కఠిన శ్రమద్వారా ఇశ్రాయేలీయుల్ని మట్టు పెట్టడానికి ఫరో కృషిచేశాడు. అయితే ఇప్పుడు వారి సంక్షేమం విషయం తనకెంతో ఆసక్తి వారి చిన్నారులపట్ల తనకు అమిత శ్రద్ధ ఉన్నట్లు నటిస్తున్నాడు. పురుషులు తిరిగి వచ్చేందుకు భరోసాగా మహిళల్ని చిన్నారుల్ని ఉంచటమే అతడి అసలు ఉద్దేశం.PPTel 260.3

  మోషే ఇప్పుడు ఐగుప్తు దేశంమీద తన కర్ర చాపాడు. అంతట తూర్పు గాలి వీచింది. ఆ గాలికి మిడతలు వచ్చాయి. “అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు”. అవి ఆకాశాన్ని కప్పి వేయటంతో నేల చీకటి కమ్మినట్లు ఉంది. మిగిలి ఉన్న పచ్చని మొక్కల్ని ఆకు కూరల్ని అవి నాశనం చేశాయి. ఫరో ప్రవక్తల్ని పిలిపించి ఇలా అన్నాడు. “నేను మీ దేవుడైన యెహోవా యెడలను మీ యెడలను పాపము చేసితిని. మీరు దయచేసి యిసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడి”. వారు దేవునికి ప్రార్థించగా పడమటి గాలి వీచి మిడతల్ని, ఎర్ర సముద్రం దిశలో తీసుకుపోయింది. రాజింకా తన అవిధేయ ధోరణిని విడిచి పెట్టలేదు.PPTel 261.1

  ఐగుప్తు ప్రజలు మరింత నిరాశకు సిద్ధపడ్డారు. తమ పైకి అంతవరకూ వచ్చిన శ్రమల్ని భరించలేకుండా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకేమి జరుగుతుందో అని గుండెలు చేతపట్టుకొని ఉన్నారు. ఐగుప్తీయులు ఫరోని తమ దేవుడి ప్రతినిధిగా పూజించారు. కాని ఇప్పుడతడు ప్రకృతి శకుల్ని తన చిత్తం నెరవేర్చే సాధనాలుగా ఉపయోగించుకోగల సర్వశక్తిగల దేవుణ్నే వ్యతిరేకిస్తున్నట్లు గుర్తించారు అభిమానం పెరుగుతున్న హెబ్రీ బానిసల్లో తమకు విడుదల కలుగుతుందన్న ఆశాభావం పెరుగుతున్నది. తమ కార్య నియామకులు క్రితంలోలా ఇప్పుడు వారిని హింసించ లేకపోయారు. బానిసలైన ఇశ్రాయేలీయులు తమకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోటానికి తిరుగుబాటు చేస్తారన్న భయం ఐగుప్తు అంతా వ్యాపించింది. ఎక్కడ చూసిన ప్రజలు “తర్వాత ఏం జరుగుతుంది?” అని అందోళన వ్యక్తం చేస్తున్నారు.PPTel 261.2

  అర్ధాంతరంగా ఐగుప్తు దేశమంతా చీకటి కమ్మింది. అది దట్టమైన చీకటి. అది “చేతికి తెలియనంత చిక్కని చీకటి”. ప్రజలకు వెలుగులేక పోటమేగాక వాతావరణం భారమై గాలి పీల్చుకోటం కష్టంమయ్యింది. “మూడు దినములు ఒకనినోక్కడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోటనుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందలరికి వారి నివాసములలో వెలుగుండెను”. ఐగుప్తీయులు సూర్యుణ్ని, చంద్రుణ్ని పూజించారు. విచిత్రమైన ఈ చీకటిలో ప్రజలు వారి దేవుళ్లూ ఒకేరీతిగా బానిసల కార్యాన్ని చేపట్టిన మహశక్తిగల దేవుని చేతిలో పడ్డారు. ఈ తీర్పు ఎంతో భయంకరమైందయినా దేవుని కరుణా కటాక్షాలకు, నాశనం చేయటానికి ఆయన అసమ్మతికి గొప్ప నిదర్శనం, మిక్కిలి భయంకరమైన చివరి తెగులు ప్రజల మీదకు పంపకముందు, ఆలోచించటానికి, పశ్చాత్తాపం పొందటానికి వారికి సమయంమిచ్చాడు.PPTel 261.3

  చివరిగా భయం ఫరోచే ఇంకొక రాయితీ ఇప్పించింది. మూడో చీకటి రోజు చివర మో షేని పలిపించి తమ మందల్ని విడిచి వెళ్లినట్లయితే ప్రజలు వెళ్లటానికి తాను అనుమతిస్తున్నానని ఫరో చెప్పాడు. “ఒక డెక్కయినను విడువబడదు....... మేము దేనితో యెహోవాను సేవింపవలెనో చేరక మునుపు మాకు తెలియదు” అన్నాడు. మోషే, రాజుకి పట్టజాలనంత కోపం వచ్చింది. “నా యెదుట నుండి పొమ్ము, భద్రము సుమీ, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖము చూచు దినమున మరణమవుదువు” అని అరిశాడు.PPTel 262.1

  “నీవన్నది సరి. నేనికను నీ ముఖము చూడను” అని మోషే ఉత్తరమిచ్చాడు. “ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడయెను”. మో షేపట్ల ఐగుప్తు ప్రజలకు గొప్ప గౌరవం ఏర్పడింది. తెగుళ్లను తీసివేసి శక్తి తనకు మాత్రమే ఉన్నట్లు ప్రజలు గుర్తించి అతడి పట్ల ఎంతో అభిమానం కలిగి ఉన్నందువల్ల రాజు మోషేకి హాని చేయటానికి సాహసించలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వెళ్లి పోవటానికి రాజు అనుమతించాలని ప్రజలు కోరారు. మోషే విజ్ఞప్తుల్ని చివరిదాకా వ్యతిరేకించినవారు రాజూ, యాజకులే.PPTel 262.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents