Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  27—ఇశ్రాయేలీయులికి ఇవ్వబడ్డ ధర్మశాస్త్రం

  సీనాయి కొండవద్ద మకాం అనంతరం దేవునితో సమావేశానికి కొండమీదికి రమ్మని మో షేకి పిలుపు వచ్చింది. ఏటవాలుగా ఉన్న కొండమీదికి కరకు బండలతో నిండిన దారిన ఒంటరిగా ఎక్కివెళ్లాడు. యెహోవా ఉన్న మేఘం దగ్గరకు వెళ్లాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులికి దేవునితో ప్రత్యేకమైన సన్నిహిత సంబంధం ఏర్పడాల్సి ఉన్నది. వారు దేవుని ప్రభుత్వం కింద ఒక సంఘంగా ఒక జాతిని ఏర్పాటు కానున్నారు. మోషే ద్వారా దేవుడు ప్రజలకిచ్చిన వర్తమానం ఇది :“నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.PPTel 292.1

  సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, పరిశు ద్దమైన జనముగాను ఉందరు”. మోషే శిబిరానికి తిరిగి వచ్చాడు. ఇశ్రాయేలు పెద్దల్ని పిలచి వారికి దేవుని వర్తమానాన్ని వివరించాడు.” యెహోవా చెప్పినదంతయు చేసెదము” అని వారు ఏకంగా ఉత్తరమిచ్చారు. ఈ విధంగా వారు దేవునితో నిబంధన చేసుకొన్నారు. ఆయనను తమ రాజుగా అంగీకరించి ప్రత్యేక రీతిగా ఆయన పరిపాలించే ప్రజలుగా ఉండటానికి నిబంధన చేసుకొన్నారు. తమ నాయకుడు మరోసారి పర్వతం ఎక్కాడు. అప్పుడు తనతో ప్రభువిలా అన్నాడు, “ఇదిగో నేను నీతో మాటలాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచునట్లు నేను కారుమబ్బులలో నీయొద్దకు వచ్చెదను”. మార్గంలో కష్టాలు ఎదురైనప్పుడు మోషే మీద అహరోను మీద సణుగుతూ తమను నాశనం చేయాలన్న ఉద్దేశ్యంతోనే తమను ఐగుప్తులోనుంచి ఆ అరణ్యంలోకి తీసుకు వచ్చారని ప్రజలు వారి పై నింద మోపారు. ప్రజలు మోషే పై నమ్మకముంచి అతడి మాటల్ని విశ్వసించి పాటించేందుకుగాను ప్రభువు మోషేని వారిముందు గౌరవించాలని ఉద్దేశించాడు.PPTel 292.2

  ధర్మశాస్త్ర ఔన్నత్యం, పరిశుద్ధత దృష్ట్యా తన ధర్మశాస్త్రాన్ని స్వయంగా ప్రజలకు వినిపించే సందర్భాన్ని ఒక ఉజ్వలమైన దృశ్యంగా రూపొందించాలని దేవుడు ఉద్దే శించాడు. దేవుని సేవకు సంబంధించిన ప్రతీ విషయం, గొప్ప గౌరవంతో, మర్యాదతో జరగాలన్నది ప్రజలు గుర్తించాల్సి ఉన్నారు.PPTel 292.3

  ప్రభువు మోషేని ఇలా ఆదేశించాడు, “నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును, రేపును వారిని పరిశుద్ధ పరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవనాటికి సిద్ధముగా నుండవలెను. మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నులయెదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును”. మధ్యనున్న వ్యవధిలో ప్రజలు దేవుని ముందు కనిపించటానికి వ్యక్తిగతంగా సిద్ధపడాల్సి ఉన్నారు. వ్యక్తిపరంగాను, తాము ధరించే దుస్తులపరంగాను వారు కళంకం లేకుండా ఉండాలి. హృదయాలు పాపాల నుంచి శుద్ధి పొందేందుకుగాను వాటిని మోషే తమ దృష్టికి తెచ్చినప్పుడు వారు వినయ మనసుతో తమ్మును తాము తగ్గించుకోవాల్సి ఉన్నారు.PPTel 293.1

  దేవుని ఆజ్ఞ మేరకు సిద్ధబాటంతా జరిగింది. దేవుడిచ్చిన మరో ఆదేశం ప్రకారం మనుషులుగాని, జంతువులుగాని ఆ పరిశుద్ధమైన హద్దులు దాటకుండా ఉండేందు కోసం పర్వతంచుట్టూ హద్దులు ఏర్పర్చమని దేవుడు మోషేని ఆదేశించాడు. ఆ పర్వతాన్ని ముట్టటానికి ఎవరైనా సాహసిస్తే దాని పర్యవసానం తక్షణ మరణం. మూడోనాడు ప్రజల దృష్టి అంతా ఆ పర్వతం మీద నిలిచి ఉండగా దాని శిఖరాన్ని దట్టమైన మేఘం ఆవరించింది. ఆ మేఘం మరింత నల్లబారి కిందకు వ్యాపిస్తూ వచ్చి చివరికి ఆ పర్వతాన్ని పూర్తిగా కప్పివేసింది. పర్వతమంతా చీకటితో నిండి గొప్ప మర్మంగా కనిపించింది. దేవునితో సమావేశం కావలసిందంటూ పిలుస్తూ బూరధ్వనిలాంటి శబ్దం వినిపించింది. మోషే ప్రజల్ని కొండ సమీపానికి నడిపించాడు. ఉరుముల శబ్దంతో చుట్టుపక్కల ఉన్న కొండ శిఖరాలు ప్రతిధ్వనించాయి. “యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగివచ్చినందుకు అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను”. ” యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె” అక్కడ సమావేశమైన వారికి కనిపించింది. “ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను”. యెహోవా సన్నిధిని గూర్చిన గుర్తులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు భయంతో వణికి ప్రభువు ముందు సాగిలపడ్డారు. మోషే “నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను” అన్నాడు. హెబ్రీ 12:21.PPTel 293.2

  ఇప్పుడు ఉరుములు ఆగిపోయాయి.బూరధ్వని లేదు, భూమిప్రశాంతంగా ఉన్నది. కంత సేపు అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ తర్వాత దేవుని స్వరం వినిపించింది. తన్ను ఆవరించి ఉన్న దట్టమైన మేఘంలో నుంచి మాట్లాడూ దూతలు చుట్టూ ఉం డగా పర్వత శిఖరం పై నుంచి ప్రభువు తన ధర్మ శాస్త్రాన్ని ప్రకటించాడు. ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ మోషే ఇలా అంటున్నాడు: ” యెహోవా సీనాయి కొండనుండి వచ్చెను శేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహాల మధ్యనుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియుచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్దు లందరు నీ వశమున నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు” ద్వితీయో 33:2, 3.PPTel 293.3

  న్యాయాధిపతిగా శాసనకర్తగా మాత్రమేగాక కనికరం గల కాపుకర్తగా తన ప్రజల విషయంలో యెహోవా తన్ను తాను ప్రత్యక్ష పర్చుకొన్నాడు : “నీ దేవుడైన యెహోవాను నేను; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని” తమ మార్గదర్శకుడుగా, తమ విమోచకుడుగా, తమను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చిన వానిగా, సముద్రంలో తమకు నడిచే మార్గం ఏర్పాటు చేసినవానిగా, ఫరోని అతడి సైన్యాన్ని నాశనం చేసి తద్వారా ఐగుప్తు దేవుళ్లందరికన్నా తాను అధికుణ్నని చూపించిన వానిగా తామెరిగిన ఆ ప్రభువే ఇప్పుడు తన నోటితో తన ధర్మశాస్త్రాన్ని వారికి వర్ణించాడు.PPTel 294.1

  ఇక్కడ దేవుడు పలికిన ధర్మశాస్త్రం కేవలం హెబ్రీయులికి పరిమితం కావటానికి ఉద్దేశించింది కాదు. తన ధర్మశాస్త్రానికి పరిరక్షకులుగా అవలంబకులుగా వారిని నియమించటం ద్వారా దేవుడు వారిని గౌరవించాడు. అయితే దాన్ని వారు లోక ప్రజలందరి ఉపకారం నిమిత్తం ఒక పవిత్రమైన ధర్మనిధిగా కాపాడాల్సి ఉన్నారు. పది ఆజ్ఞలు మానవులందరికీ వర్తించే ధర్మసూత్రాలు. అవి జ్ఞానోపదేశానికి ప్రజా పాలనకు ఉపకరించే సూత్రాలు. సంక్షిప్తం, సమగ్రం, అధికారికం అయిన ఈ పది నీతి సూత్రాలూ దేవునిపట్ల తోటి మానవులపట్ల మానవుడి విధుల్ని నిర్దేశిస్తున్నాయి. ఇవన్నీ గొప్ప మౌలిక సూత్రం అయిన ప్రేమ మీద ఆధారితమై ఉన్నాయి. “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడియున్నది” (లూకా 10:27; ద్వితి 6:4, 5; లేవి. 19:18 కూడా చూడండి). ఈ సూత్రాల్ని పది ఆజ్ఞలు వివరంగా నిర్దేశించి వాటిని మానవుడి స్థితిగతులికి పరిస్థితులికి వర్తింపజేస్తున్నాయి.PPTel 294.2

  “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు”. నిత్యుడు, స్వయంభవుడు, అమర్త్యుడు, సర్వానికి ఆధారభూతుడు, సర్వానికి పోషకుడు అయిన యెహోవా మాత్రమే భక్తి పూజలకు అర్హుడు. తన ప్రేమ విషయంలోగాని తన సేవ విషయంలోగాని ఎవరికీ ఏ వస్తువుకి మానవుడు ప్రథమ స్థానం ఇవ్వకూడదు. దేవునిపట్ల మన ప్రేమను తగ్గించేందుకుగాని దేవుని సేవించటంలో ఆటంకాలు కలిగించేందుకుగాని దారితీసేదేదైనా ఉంటే అది మనకు దేవుడవుతుంది.PPTel 294.3

  “పైన ఆకాశమందేగాని క్రింద భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందే గానియుండు దేని రూపమునయినను విగ్రహమునైనను నీవు చేసికొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు”.PPTel 295.1

  విగ్రహాల రూపంలోగాని ఇతరత్రా మరే రూపంలోగాని నిజమైన దేవున్ని పూజించటాన్ని రెండో ఆజ్ఞ నిషేధిస్తున్నది. తమ విగ్రహాలు దేవుణ్ని పూజించటానికి తమకు తోడ్పడే బొమ్మలే లేక చిహ్నాలే అని అనేకమంది అన్యులు వాదిస్తారు. అయితే అట్టి ఆరాధన పాపమని దేవుడంటున్నాడు. నిత్యుడైన దేవున్ని లౌకికమైన వస్తువుల రూపంలో సూచించటం మానవుడికి దేవుని గూర్చి తక్కువ అభిప్రాయాన్ని పుట్టిస్తుంది. యెహోవా అపార పరిపూర్ణత నుంచి దృష్టి మరల్చుకొన్న మనసు సృష్టికర్తకు ఆకర్షితం అయ్యే బదులు సృష్టానికి ఆకర్షితమవుతుంది. దేవుని గూర్చి మానవుడి అభిప్రాయాలు, ప్రాముఖ్యాన్ని కోల్పోయే కొద్దీ మానవుడి విలువ పడిపోతుంది.PPTel 295.2

  “నీ దేవుడైన యెహోవానగు నేను రోషముగల దేవుడను”. దేవునికి తన ప్రజలతో ఉన్న సన్నిహిత పవిత్ర సంబంధం వివాహ బాంధవ్యాన్ని పోలి వుంది. విగ్రహారాధన ఆధ్యాత్మిక వ్యభిచారం గనుక అదంటే దేవునికి కలిగే ద్వేషాన్ని రోషం అనటం సవ్యమే.PPTel 295.3

  “మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి” రప్పిస్తాను. తల్లిదండ్రుల తప్పిదాల ఫలితంగా పిల్లలు బాధలనుభవించటం అనివార్యం. కాని తాము వాటిలో పాలు పొందితే తప్ప పిల్లలు తల్లిదండ్రుల దోషాల నిమిత్తం శిక్షననుభవించరు. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తుంటారు. పారంపర్యాన్ని బట్టి ఆదర్శాన్ని బట్టి తండ్రి పాపంలో కుమారులు పాలిభాగస్తులవుతారు. తప్పుడు ప్రవృత్తులు, వక్రమైన అభిరుచులు, అనైతికత శారీరకమైన వ్యాధి, క్షీణత మూడు నాలుగు తరాల పర్యంతం తండ్రి నుంచి కుమారుడికి సంక్రమిస్తాయి. ఈ భయంకర సత్యం మనుషుల్ని పాప మార్గాన్ని అనుసరించకుండా అదుపు చెయ్యాలి. “నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడను”. అబద్ద దేవుండ్ల పూజను నిషేధించటం ద్వారా రెండో ఆజ్ఞ: నిజమైన దేవుని ఆరాధనను సూచన ప్రాయంగా ప్రతిపాదిస్తున్నది. ఆయన్ను ద్వేషించే వారి సందర్భంలో తన కోపంలాగ మూడు నాలుగు తరాల మట్టుకే కాకుండా దేవుని నమ్మకంగా సేవించేవారికి వెయ్యి తరాల వరకు కృపను వాగ్దానం చేస్తుందీ ఆజ్ఞ. “నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు”.PPTel 295.4

  అబద్దపు శపథాలు చేయటం, ఒట్టు పెట్టుకోటం నిషేధించటమే గాక దేవుని తీవ్ర మహత్మ్యాన్ని పరిగణించకుండా దాన్ని చులకనగా ఉపయోగించటాన్ని కూడా ఈ ఆజ్ఞ నిషేధిస్తున్నది. సాధారణ సంభాషణలో దేవుని పేరు ఉచ్చరించటం ద్వారా, చిన్న చిన్న విషయాల్లో ఆయన పేరు ఎత్తటం ద్వారా, ఆయన పేరు అర్థరహితంగా పదే పదే పలకటం ద్వారా ఆయనను అగౌరవ పర్చుతాం. “ఆయన నామము పరిశుద్ధ మైనది. పూజింపదగినది”కీర్తనలు 111: 9. మనసు ఆయన ఘనమైన అంతస్తును గ్రహించేందుకుగాను ఆయన ఔన్నత్యాన్ని గూర్చి, ఆయన పవిత్రత, పరిశుద్ధతల్ని గూర్చి అందరూ ధ్యానించాలి. ఆయన పరిశుద్ధ నామాన్ని పూజ్యభావంతో గంభీరతతో ఉచ్చరించాలి.PPTel 296.1

  “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.దానిలో నీవైనను,నీ కుమారుడైనను,నీ కుమార్తె యైనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నీ యిండ్లలో నున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను”.PPTel 296.2

  సబ్బాతు కొత్తగా వచ్చిన నియమం కాదు. అది సృష్టి జరిగిన నాడే స్థాపితమయ్యింది. సృష్టికర్త చేసిన పనికి జ్ఞాపకార్థంగా సబ్బాతును ఆచరించాలి. భూమ్యాకాశాల్ని కలిగించినవాడు దేవుడని చెబుతూ అది అబద్ద దేవుళ్ల నుంచి నిజమైన దేవుణ్ని వేరు చేస్తుంది. ఏదో దినాన్ని పరిశుద్ధంగా ఆచరించేవారందరూ ఈ క్రియ ద్వారా యెహోవాను పూజించే ప్రజలు. లోకంలో ఆయనను సేవించే ప్రజలున్నంతకాలం దేవునిపట్ల మానవుడి ప్రభుభక్తికి విశ్వసనీయతకూ సబ్బాతు ఒక గుర్తు. ధర్మశాస్త్రకర్త పేరు, ఆయన అధికారం నిక్షిప్తమై ఉన్న ఆజ్ఞ పది ఆజ్ఞల్లోనూ నాల్గో ఆజ్ఞ ఒక్కటే. ధర్మశాస్త్రం ఎవరి అధికారాన్ని బట్టి అమల్లోకి వచ్చిందో చెప్పే ఆజ్ఞ ఇదొక్కటే. ఇలా ఈ ఆజ్ఞలో దేవుని ముద్ర ఉన్నది. ఇది ధర్మ శాస్త్ర అధికారానికి ఆచరణ విధికి నిదర్శనగా దేవుడు వేసిన తన అధికార ముద్ర.PPTel 296.3

  మనుషులు పనిచేసుకోటానికి దేవుడు ఆరు దినాలిచ్చాడు. మనుషులు తమ పనులు ఈ ఆరుదినాల్లో పూర్తి చేసుకోవాలన్నది దేవుని ఉద్దేశం. సబ్బాతు నాడు తప్పక చేయాల్సిన పనులు కారుణ్య కార్యాలు నిర్వహించవచ్చు. జబ్బుగా ఉన్నవారి, బాధపడున్నవారి ఆలన పాలన చూసి వారికి సహాయ సదుపాయాలు అన్నివేళల్లోనూ అందియ్యాలి. కాగా అవసరమైన పనిని విధిగా మానాలి. “నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు”. యెషయా 58:13, 14. ఈ నిఘం ఇక్కడ అంతం కావటం లేదు. “లోక వార్తలు చెప్పుకొనకయు” అంటున్నాడు ప్రవక్త. సబ్బాతునాడు వ్యాపార విషయాలు చర్చించటం గాని ప్రణాళికలు రూపొందించటం గాని చేసేవారిని ఆ వ్యాపారం నిర్వహిస్తున్నట్లే దేవుడు పరిగణిస్తాడు. సబ్బాతును సరిగా ఆచరించటమంటే లోక సంబంధమైన విషయాల గురించి మన మనసులు ఆలోచించటం కూడా చేయకూడదని. ఈ ఆజ్ఞ మన ఇండ్లలో ఉన్న వారందరికీ వర్తిస్తుంది. సబ్బాతు పరిశుద్ధ ఘడియల్లో మన ఇండ్లలో ఉన్నవారు వ్యాపార విషయాల్ని పక్కన పెట్టాల్సి ఉన్నారు. ఆయన పరిశుద్ధ దినాన దేవుని సేవించటంలో అందరు ఉల్లాసంగా పాల్గొనాలి.PPTel 296.4

  “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగు నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము”. PPTel 297.1

  తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ప్రేమ, గౌరవాలు పొందే హక్కున్నది. అవి ఇంకెవరికీ చెందవు. పిల్లల జీవిత ప్రారంభ దశలో వారి తల్లిదండ్రులు తన స్థానంలో ఉండి వ్యవహరించాలని దేవుడు ఉద్దేశించాడు. దేవుడు తానే అప్పగించిన ఆ పిల్లల ఆత్మల నిమిత్తం తల్లిదండ్రులు బాధ్యత వహించాలని ఆయన ఉద్దేశించాడు. తల్లిదండ్రుల న్యాయమైన అధికారాన్ని తోసిపుచ్చే వ్యక్తి దేవుని అధికారాన్ని తోసిపుచ్చుతున్నట్లే. తమ తల్లిదండ్రులపట్ల గౌరవంతో వినయ విధేయతలతో మెలగటమే గాక వారి మంచి పేరును కాపాడి వృద్ధాప్యంలో వారికి ఆసరాగా ఉండి వారి వెచ్చా వేడి చూడాలని ఐదో ఆజ్ఞ పిల్లల్ని ఆదేశిస్తుంది. దైవ సేవకుల్ని పరిపాలకుల్ని దేవుడు ఎవరికి అధికారం అప్పగించాడో వారిని వారు గౌరవించాలని ఈ ఆజ్ఞ ఆదేశిస్తున్నది.PPTel 297.2

  “ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది” అని పౌలు అంటున్నాడు. ఎఫెసీ 6:2. కొద్దికాలంలో కనానులో ప్రవేశించటానికి ఆయత్తమవుతున్న ఇశ్రాయేలీయుల్లో విధేయులైన వారికి అది ఆ దేశంలో దీర్ఘాయుష్షును వాగ్దానం చేస్తున్నది. అంతేకాక దానిలో ఇంకా లోతైన అర్థం ఉన్నది. అది ఇశ్రాయేలీయులందరి గురించి మాట్లాడూ ఈ భూమి పాపం నుంచి విముక్తి పొందినప్పుడు నూతన భూమిపై వారికి నిత్యజీవాన్ని వాగ్దానం చేస్తున్నది. PPTel 297.3

  “నరహత్య చేయరాదు”.PPTel 298.1

  ఆయువు తగ్గించటానికి తోడ్పడే అన్యాయపు కార్యాలు, ద్వేషం, క్ష, ఇతరులకు హాని కలిగించే ఆవేశం, లేదా ఇతరులకు హాని కలగాలని మనలో పుట్టే ఆలోచన (తన సహోదరుని ద్వేషించువాడు “నరహంతకుడు”), సహాయం అవసరమైన వారిని, బాధలో ఉన్నవారిని ఆదుకోకపోటం, స్వార్ధాశలు తీర్చుకోటం, వంచన, పనివారి ఆరోగ్యం దెబ్బతినేలా వారితో మితిమీరి పని చెయ్యించుకోటం -- ఇవన్నీ ఆరో ఆజ్ఞను అతిక్రమింపజేసే కార్యాలే. PPTel 298.2

  “వ్యభిచరించకూడదు”PPTel 298.3

  అనైతిక కార్యాల్నే గాక శరీరేచ్చల్ని గూర్చిన ఆలోచనల్ని కోరికల్ని లేక వాటిని రెచ్చగొట్టే అభ్యాసాల్ని కూడా ఈ ఆజ్ఞ నిషేధిస్తున్నది. బహిర్గత జీవితంలోనేగాక హృదయంలో నిక్షిప్తమైవున్న రహస్య కోరికలు భావోద్వేగాల విషయంలో కూడా పవిత్రతను ఈ ఆజ్ఞ కోరుతున్నది. నిత్యమూ నిలిచే ధర్మశాస్త్ర విధినిగూర్చి బోధించిన క్రీస్తు దుష్టతలంపు, దురుద్దేశపు చూపు ఆ క్రియతో సమానమైన పాపమేనని బోధించాడు.PPTel 298.4

  “దొంగిలకూడదు”PPTel 298.5

  ఈ ఆజ్ఞ బహిరంగ పాపాల్ని, రహస్య పాపాల్ని నిషేధిస్తున్నది. ఎనిమిదో ఆజ్ఞ మనిషి అపహరణాన్ని, బానిస అపహరణాన్ని నిషేధిస్తున్నది. యుద్ధాలు చేసి రాజ్యాన్ని గెల్చుకోటం కూడా నిషేధిస్తుంది. దొంగతనాల్ని, దోపిడీల్ని నిషేధిస్తుంది. జీవితంలో స్వల్ప విషయాల్లో సయితం యథాతను, నిజాయితీని కోర్తుంది. వర్తకంలో అధిక లాభాన్ని నిషేధిస్తుంది. న్యాయమైన అప్పుల్ని తీర్చటం, పనివాళ్ల వేతనాలు చెల్లించటం అవశ్యం చెయ్యాలంటున్నది. ఎదుటి వారి అజ్ఞానాన్ని, బలహీనతను, దుస్థితిని సొమ్ము చేసుకోటానికి జరిగే ప్రతీ ప్రయత్నం పరలోక గ్రంథాల్లో మోసంగా దాఖలవుతుందని ఈ ఆజ్ఞ చెబుతున్నది. PPTel 298.6

  “నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు” PPTel 298.7

  మన పొరుగువారిని ఏ విషయంలోనైనా, ఏ ప్రయత్నంలోనైనా, ఉద్దేశంలోనైనా మోసగించేందుకు అబద్దమాడటాన్ని ఈ ఆజ్ఞ ప్రస్తావిస్తున్నది. మోసగించే ఉద్దేశం కూడా అబద్ధమే. మాటలతో అబద్ధం చెప్పినట్లే కన్ను మిటకరింపు ద్వారా, చెయ్యి తిప్పటం ద్వారా, ముఖ కవళికల చలనం ద్వారా కూడా చెప్పవచ్చు. ఉద్దేశ పూర్వకంగా అతిశయోక్తులు చెప్పటం, తప్పుడు అభిప్రాయం కలిగించటానికి హెచ్చులు చెప్పటం, తప్పుదారి పట్టించడానికి వాస్తవాల్ని కూడా వేరే భావం వచ్చేటట్లు చెప్పటం - అంతా అబద్దం కిందే వస్తుంది. అసత్య కథనం ద్వారా, అబద్ధపు పూకార్ల ద్వారా, నీలాపనిందల ద్వారా, తప్పుడు ప్రచారం ద్వారా పొరుగువాడి పేరు చెడగొట్టటాన్ని ఈ ఆజ్ఞ నిషేధిస్తున్నది. పరులకు హాని కలిగేటట్లు సత్యాన్ని అణచివేయటం తొమ్మిదో ఆజ్ఞను అతిక్రమించటమే.PPTel 298.8

  “నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసుడనైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు”.PPTel 299.1

  పదో ఆజ్ఞ సకల పాపాల తల్లివేరును నరుకుతుంది. పాపక్రియకు జన్మనిచ్చే స్వార్దాశను అది నిషేధిస్తుంది. దైవ ధర్మశాస్త్రానుసారం వేరొకడికి చెందే దాన్ని ఆశించటమనే పాపం చేయని వ్యక్తి తోటి మానవుడికి ద్రోహం చెయ్యటానికి పూనుకోడు. ఉరుములు అగ్ని జ్వాలల మధ్య, ధర్మశాస్త్ర కర్త అయిన దేవుడు తన మహాశక్తి ఔన్నత్యాల ప్రదర్శనల మధ్య పలికిన పది ఆజ్ఞలు అలాంటివి. తన ప్రజలు ఆ దృశ్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదని ధర్మశాస్త్రకర్త, భూమ్యాకాశాల సృష్టికర్త అయిన తన పట్ల వారు అచంచల భక్తి విశ్వాసాలు ప్రదర్శించాలని కోరి ఆ ప్రకటనను తన శక్తి మహిమల ప్రదర్శనలతో ఆయన చేశాడు. తన ధర్మశాస్త్రం పరిశుద్ధమైందని, ప్రాముఖ్యమైందని, నిత్యమయ్యిందని సర్వ మానవులకు ఆయన చూపించగోర్తున్నాడు.PPTel 299.2

  ఇశ్రాయేలు ప్రజలు భయంతో వణికిపోయారు. భయంతో కంపిస్తున్నవారి హృదయాలు దేవుని స్వరంలోని శక్తిని తాళలేకపోయాయి. సత్యాన్ని గూర్చిన దైవ నియమం తమ ముందు నిల్చున్నప్పుడు పాపం తాలూకు దుష్ట స్వభావాన్ని వారు గుర్తించారు. పరిశుద్ధ దేవుని ముందు తమ దోషిత్వాన్ని గుర్తించారు. భయంతో, భీతితో ఆ పర్వతం దగ్గర నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. ప్రజలు మో షేకి ఇలా మొర పెట్టుకొన్నారు. “నీవు మాతో మాటలాడుము. మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము”. మోషే ఇలా బదులు పలికాడు, “భయపడకుడి. మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెను”. మోషే “దేవుడున్న ఆ గాడాంధకారమునకు సమీపముగా” ప్రజలు దూరంగా నిలిచి ఆ దృశ్యాన్ని గుండెలు చేతపట్టుకొని చూస్తున్నారు.PPTel 299.3

  దాస్యం వల్ల, అన్యమతం వల్ల నైతికంగా దిగజారిపోయి గుడ్డివారైన ప్రజల మనసులు దేవుని పది నియమాలలోని సూత్రాల్ని అభినందించలేకపోయాయి. ప్రజలు పది ఆజ్ఞల విధుల్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆచరించేందుకు వాటికి ఉదాహరణలిస్తూ వాటిని మరికొన్ని సూత్రాలు కలపటం జరిగింది. ఈ సూత్రాల్ని న్యాయవిధులు అన్నారు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి అవి అనంత జ్ఞాని అయిన దేవుడే రూపొందించిన న్యాయ సూత్రాలు. న్యాయాధిపతులు తమ తీర్పులు వాటిని బట్టే ఇవ్వాల్సి ఉన్నారు. పది ఆజ్ఞలకు మల్లేగాక అవి ప్రత్యేకంగా మో షేకి ఇవ్వటం మోషే వాటిని ప్రజలకు అందించటం జరిగింది.PPTel 300.1

  వీటిలో మొట్టమొదటి నియమం సేవకులకు సంబంధించింది. పూర్వకాలంలో న్యాయాధిపతులు నేరగాళ్లని సేవకులుగా అమ్మేవారు. కొన్ని సందర్భాల్లో అప్పిచ్చినవాడు అప్పుతీసుకున్నవాణ్ని అమ్మేవాడు. పేదరికంవల్ల వ్యక్తులు తమ్మును తాము లేదా తమ పిల్లల్ని అమ్ముకొనేవారు. అయితే హెబ్రీయుడు తన్నుతాను జీవితాంతం సేవకుడుగా అమ్ముకోటానికి లేదు. అతడి దాసత్వకాలం ఆరు సంవత్స రాలకు పరిమితమైంది. ఏడో సంవత్సరం అతడు స్వతంత్రుడు. యజమాని అతణ్ని విడిచి పెట్టాలి. మనిషిని అపహరించటం, హత్య, తల్లిదండ్రుల అధికారానికి ఎదురు తిరగటం నేరాలు. వాటికి శిక్ష మరణం. ఇశ్రాయేలీయులుగా పుట్టని వారిని జీవిత కాలమంతా సేవకులుగా ఉండవచ్చు. కాని వారి ప్రాణాన్ని సురక్షితంగా కాపాడటం యజమాని బాధ్యత. సేవకుడి హత్య శిక్షార్హం. యజమానివల్ల సేవకుడికి పన్ను విరగటంవంటి చిన్న కష్టం కలిగినా అది అతడికి స్వతంత్రుడయ్యే హక్కునిచ్చింది.PPTel 300.2

  కొద్దికాలం క్రితంవరకూ ఇశ్రాయేలీయులు బానిసలు. ఇప్పుడు స్వతంత్రులైన ఇశ్రాయేలీయులికి బానిసలుంటారు గనుక ఐగుప్తీయులు తమ పట్ల వ్యవహరించినట్లు వారు తమ బానిసలపట్ల క్రూరంగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉండాలి. తమ దాస్యం జ్ఞాపకాలు తమ దాసుల సాధక బాధకాల్ని గ్రహించటానికి తోడ్పడాలి. వారు దయగా వ్యవహరించటానికి ఇతరులు తమను ఎలా చూడాలని కోర్తారో వారు తమ దాసుల్ని అలా చూడాలని భావించటం నేర్చుకోవాలి. PPTel 300.3

  విధవరాండ్ర హక్కులు దిక్కులేని పిల్లల హక్కులు ప్రత్యేక శ్రద్ధతో కాపాడటం జరిగింది. వారి నిస్సహాయ స్థితిని కరుణా కటాక్షాలతో పరిగణించాల్సిందిగా నియమం ఆదేశించింది. “వారు నీచేత ఏ విధముగా నైనను బాధ నొంది నాకు మొట్ట పెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొఱ విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను. మీ భార్యలు, విధవరాండ్రగుదురు. మీ పిల్లలు దిక్కులేని వారగుదురు”. ఇశ్రాయేలీయులతో ఏకమైన పరదేశుల్ని పీడన నుంచి వారు కాపాడాల్సి ఉన్నారు. “పరదేశిని విసికింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరిగదా”. బీదవారి వద్దనుంచి వడ్డీ వసూలు చేయటం నిషిద్ధం. కుదవగా తీసుకొన్న పేదవాడి వస్త్రాన్నిగాని, దుప్పటినిగాని రాత్రిపడే సరికి తిరిగి అతడికి ఇచ్చివేయాలి. దొంగతనం చేసినవాడు దొంగిలించినదానికి రెట్టింపు తిరిగి చెల్లించాలి. న్యాయాధిపతుల్ని, అధికారుల్ని గౌరవించాలి. లంచాలు పట్టి న్యాయాన్ని, వక్రీకరించరాదని న్యాయాది . పతులికి హెచ్చరికలున్నాయి. దూషించటం, నిందమోపటం నిషిద్ధం, శత్రువులకు సయితం దయ చూపించటం నియమం.PPTel 300.4

  సబ్బాతును ఆచరించటమనే పవిత్ర విధిని గూర్చి ప్రజలకు మళ్లీ జ్ఞాపకం చేయటం జరిగింది. సాంవత్సరిక పండుగలు ఏర్పాటయ్యాయి. ఆ పండుగల సమయంలో దేశంలోని మనుషులందరూ ప్రభువు ముందు సమావేశమై కృతజ్ఞతార్పణలు, ప్రథమ ఫలాలు సమర్పించాల్సి ఉన్నారు. వీటన్నిటి ఉద్దేశం ఇది : అవి నిరంకుశంగా ఉప యోగించిన శక్తి ఫలితంగా రాలేదు; అవన్నీ ఇశ్రాయేలీయుల శ్రేయోభివృద్ధికోసం దేవుడు అనుగ్రహించినవి. “మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు” -- పరిశుద్ధుడైన దేవుని వలన గుర్తింపుకు యోగ్యులైన వారు. ఈ న్యాయ నిధుల్ని మోషే లిఖించి జాతీయ చట్టానికి పునాదిగా ఇశ్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దానాల నెరవేర్పుకు షరతుగా భద్రపర్చాల్సి ఉన్నాడు. ఇప్పుడు యెహోవా వారికి ఈ వర్తమానం ఇచ్చాడు : “ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినియునై యుందును”. ఇశ్రాయేలీయుల ప్రయాణ కాలమంతటిలో క్రీస్తు మేఘ స్తంభంలోను, అగ్ని స్తంభంలోను ఉండి వారిని నడిపించారు. రానైయున్న రక్షకుని సూచించే ముంగుర్తులు ఉన్నా, రక్షకుడు వ్యక్తిగతంగా వారితో ఉండి, ప్రజలకు అందించటానికి మో షేకి ఆదేశాలిచ్చి, వారికి దీవెనలిచ్చే ఒకే సాధనంగా ఉన్నాడు.PPTel 301.1

  పర్వతం మీదనుంచి దిగివచ్చిన తర్వాత “మోషే వచ్చి యెహోవామాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు - యెహోవా మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి”. ఈ వాగ్దానాన్నీ, ప్రభువు చెప్పిన ఏ మాటల ప్రకారం నడుచుకుంటామని ప్రజలు వాగ్దానం చేశారో వాటిని మోషే ఒక పుస్తకంలో రాశాడు. అనంతరం నిబంధన ధ్రువీకరణ జరిగింది. పర్వతం అడుగున ఒక బలిపీఠం దాని పక్క తాము నిబంధనను అంగీకరించినట్లు సాక్ష్యంగా “ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను” కట్టారు. ఆ సేవకు ఎంపిక అయిన యువకులు బలులు అర్పించారు.PPTel 301.2

  బలులు రక్తాన్ని బలిపీఠం పై ప్రోక్షించిన అనంతరం మోషే “నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపించాడు”. ఈ విధంగా తీసుకొని ప్రజలకు వినిపించాడు”. ఈ విధంగా నిబంధన షరతులన్నిటినీ చదివి వినిపించగా అందరూ వాటిని అంగీక రించటానికో, నిరాకరించటానికి ఎంపిక చేసుకోవాల్సి ఉన్నారు. మొదట అందరూ దేవుని మాట ప్రకారం చేస్తామని వాగ్దానం చేశారు. ఆ తర్వాత ఆయన ప్రకటించిన ధర్మశాస్త్రాన్ని విన్నారు. ధర్మశాస్త్ర సూత్రాల ప్రత్యేకార్థం వివరణను విని ఆ నిబంధనలలో ఏమేమి ఇమిడి ఉన్నాయో గ్రహించారు. ” యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము” అంటూ ప్రజలు మళ్లీ ముక్తకంఠంతో పలికారు. “ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ... రక్తమును తీసికొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను” హెబ్రీ 9:19, 20.PPTel 302.1

  ఎంపికయిన ప్రజలు యెహోవా రాజ్యపరిపాలన కింద ఒక జాతిగా స్థాపితం కావటానికి ఇప్పుడు ఏర్పాట్లు జరగాల్సి ఉన్నాయి. మోషేకి ఈ ఆజ్ఞ వచ్చింది, “నీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బది మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపించవలెను”. ప్రజలు కొండ మొదట దేవుని ఆరాధిస్తుండగా తాను ఎంపిక చేసిన ఈ మనుషుల్ని కొండమీదికి పిలిచాడు దేవుడు. ఇశ్రాయేలీయుల రాజ్యపాలనలో ఈ డెబ్బదిమంది పెద్దలు మో షేకి తోడుగా ఉండాల్సి ఉన్నారు. దేవుడు తన ఆత్మను వారి పై కుమ్మరించి తన శక్తిని ఔన్నత్యాన్ని వీక్షించటానికి తరుణమిచ్చి వారిని సన్మానించాడు. వారు “ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలిమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను”. వారు దేవుని చూడలేదు. ఆయన సన్నిధి కాంతిని చూశారు. దీనికి ముందు అలాంటి దృశ్యాన్ని వారు భరించగలిగేవారు కాదు. దేవుని మహిమా ప్రదర్శన వారిలో భయాన్ని పశ్చాత్తాపాన్ని పుట్టించింది. తాము ఎవరి గురించి ధ్యానిస్తున్నారో ఆ ప్రభువును సమీపించగలిగే వరకూ ఆయన మహిమను, పవిత్రతను, కృపను గూర్చి ఆలోచిస్తూ ఉన్నారు.PPTel 302.2

  మోషే, “అతని పరిచారకుడైన యెహోషువ” దేవునితో సమావేశం కావలసిందిగా పిలుపువచ్చింది. వారు కొంతకాలం ప్రజల మధ్య ఉండరు గనుక తన స్థానంలో వ్యవహరించటానికి మోషే అహరోనును, హూరును నియమించాడు. వారు పెద్దల సహాయంతో నాయకులుగా వ్యవహరిస్తారని చెప్పాడు. “మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను”. దేవుని ప్రత్యేక సన్నిధికి సూచనగా మేఘము ఆ కొండను ఆరుదినాలు కమ్మింది. అయినా ఆయన ప్రత్యక్షమవటంగాని తన చిత్రాన్ని బయలుపర్చటంగాని జరగలేదు. ఈ సమయంలో దేవునితో సమావేశమవ్వటానికి మోషే కని పెడ్తూ ఉన్నాడు. “నీవు కొండ ఎక్కి నాయొద్దకు వచ్చి అచ్చట నుండుము” అన్న సందేశం మో షేకి వచ్చింది. మోషే విధేయతకూ, విశ్వాసానికీ అది ఒక పరీక్ష. అతడు విసుగుచెంది తన స్థానాన్ని విడిచి పెట్టి వెళ్లిపోలేదు. కని పెట్టే ఈ కాలం సిద్ధబాటుకు ఆత్మ పరీక్షకు ఉపయోగించుకోవాల్సిన సమయం. దేవునికి ఇష్టుడైన ఈ సేవకుడు సైతం దేవుని సముఖంలోకి వెంటనే ప్రవేశించి ఆయన మహిమను భరించగలిగేవాడు కాదు. తన సృష్టికర్తతో ప్రత్యక్ష సమావేశానికి ముందు ఆత్మ పరీక్ష చేసుకొని ధ్యానించటం ద్వారా ప్రార్థన ద్వారా సన్నద్ధం కావటానికి ఆరు దినాలకాలం పట్టింది.PPTel 303.1

  ఏదోనాడు దేవుడు మోషేని మేఘంలోకి పిలిచాడు. అది సబ్బాతు దినం. ఇశ్రాయేలీయులు చూస్తుండగా దట్టమైన ఆ మేఘం తెరుచుకుంది. యెహోవా మహిమ దహించే అగ్నిలా ఉన్నది. “అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్లు నలుబది దినములుండెను”. సిద్దబాటులో గడిపిన ఆరుదినాలు గాక మోషే నలబయి దినాలు కొండ మీద ఉన్నాడు. ఆ ఆరు రోజుల కాలంలో యెహోషువా మోషేతో ఉన్నాడు. వారిద్దరు మన్నాను భుజించి “ఆ కొండమీద నుంచి ప్రవహించే వాగు నీరు” తాగారు. యెహోషువ మోషేతో ఆ మేఘంలోకి వెళ్లలేదు. అతడు బయటనే ఉండి ప్రతిదినం మన్నా తింటూ నీల్లు తాగుచూ మోషే రాకకోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. కాగా మోషే ఆ నలబయి దినాలూ ఉపవాసమున్నాడు.PPTel 303.2

  మోషే పర్వతం పై ఉన్నకాలంలో ప్రత్యేక రీతిగా దైవ సముఖం ప్రదర్శితం కావాల్సి ఉన్న గుడార నిర్మాణానికి ఉపదేశం పొందాడు. “నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను” (నిర్గమ 25:8) అని దేవుడు ఆజ్ఞాపించాడు. సబ్బాతును ఆచరించాల్సిందిగా దేవుడు మూడోసారి ఆదేశించాడు. “నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడు గురుతైయుండును”. “మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను అని తెలిసికొనునట్లు... మీరు విశ్రాంతి దినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్దము. దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును” నిర్గమ 31:17, 13:14. తన సేవల నిమిత్తం తక్షణం గుడార నిర్మాణానికి దేవుడ ఉపదేశం ఇచ్చాడు. ఇప్పుడు తమ ముఖ్యోద్దేశం దేవుని మహిమ పర్చటం గనుక, తమ ముఖ్యావసరం ఆరాధన స్థలం గనుక, సబ్బాతునాడు నిర్మాణం పనిచేయటం మంచిదే అని ప్రజలు భావించవచ్చు. ఆ పొరపాటు చేయకుండా వారిని హెచ్చరించటం జరిగింది. దేవుని నిమిత్తం జరుగుతున్న ఈ ప్రత్యేక అత్యవసర పరిశుద్ధ కార్యాన్ని కూడా సబ్బాతును మీరి చేయకూడదని విదితమయ్యింది.PPTel 303.3

  ఇక నుంచి ప్రజల మధ్య తమ రాజు సముఖం ఉంటుంది. “నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును”. “అది నా మహిమ వలన పరిశుద్ధ పరచబడును” అని ప్రభువు మోషేకి హామీ ఇచ్చాడు. (నిర్గమ 29:45, 43). తన అధికారానికి చిహ్నంగాను, తన చిత్రానికి ప్రతిరూపంగాను తన చేతివేలితో రెండు రాతి పలకలమీద రాసిన పది ఆజ్ఞల నకలును దేవుడు మోషేకి అందించాడు (ద్వితి. 9:10, నిర్గమ 32:15, 16). దాన్ని గుడారంలో పరిశుద్ధంగా ఉంచాల్సి ఉంది. అలా ఉంచిన మీదట గుడారం ఇశ్రాయేలు జాతీయ దైవారాధన కేంద్రం కావలసి ఉంది.PPTel 304.1

  రాజులకు రాజైన తనకు స్వకీయ సంపాద్యం కావటానికిగాను ఇశ్రాయేలీయుల్ని బానిసల స్థాయి నుంచి ఉన్నత స్థాయికి దేవుడు తెచ్చాడు. తమకు పవిత్రమైన కర్తవ్యాన్ని ట్రస్టుగా అందించటానికి దేవుడు వారిని లోకంలోనుంచి వేరు చేశాడు. తన ధర్మశాస్త్రానికి వారిని ధర్మకర్తలుగా నియమించి ప్రజల మధ్య తన్నుగూర్చిన జ్ఞానాన్ని వారిద్వారా పరిరక్షించాలని ఉద్దేశించాడు. చీకటి కమ్మిన లోకంలో దేవుని వెలుగు ప్రకాశించటం, ప్రజలు విగ్రహారాధనను మాని సజీవ దేవుణ్ని సేవించాలంటూ వచ్చే విజ్ఞప్తిని వినటం ఈ విధంగా జరగాల్సి ఉన్నది. ఇశ్రాయేలీయులు తమ పవిత్ర కర్తవ్యానికి నిబద్దులై ఉంటే వారు లోకంలో మహాశక్తిగా రూపాంతరం చెందుతారు. దేవుడే వారికి రక్షణగా ఉంటాడు. వారు అన్ని జాతుల ప్రజలకంటే ఉన్నతంగా ఉంటారు. వారి ద్వారా ఆయన వెలుగు సత్యంలోకానికి ప్రకటితమవుతుంది. ఆయన పరిశుద్ధ పరిపాలన కింద సాగే ఆరాధన విగ్రహారాధన కన్నా ఉత్తమమైందని చాటే గొప్ప సాక్షులుగా వారు నిలబడతారు.PPTel 304.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents