Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
పితరులు ప్రవక్తలు - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  7—జలప్రళయం

  ఆదాము పాపం కయీను హత్య కారణంగా నోవహు దినాల్లో భూమిమీదకి రెండు శాపాలు వచ్చాయి. అయినా ప్రకృతిలో పెద్ద మార్పు కనిపించలేదు. మరణ సూచనలు కనిపంచాయి. అయినప్పటికీ దేవుని వరాలనలం కరించుకొని భూమి సారవంతంగా అందంగా ఉన్నది. కొండలమీద ఎత్తయిన వృక్షాలు వాటి పై బరువైన గుత్తులతో పాకుతున్న పండ్ల తీగలు ఉన్నాయి. విశాలమైన మైదానాలు ఉద్యానవనాల్లా కనిపిస్తూ, పచ్చని మొక్కలతో సువాసనలీనే వేలాది పుష్పాలతో కనువిందుగొల్పాయి. భూమిపై రకరకాల పండ్లు పరిమితులు లేకుండా లభించేవి. ఇప్పటి వృక్షాలకన్నా ఆ వృక్షాలు పరిమానంలోను సౌందర్యంలోను పరిపూర్ణ పాళ్ల విషయంలోను ఎంతో ఉత్తమమైనవి. వాటి కలప నాణ్యతను గురించి చెప్పనక్కరలేదు. వాటి చెక్కరాయల్లే ధృఢంగా ఉండేది. ఆ చెక్క మన్నిక కూడా రాయి వంటిదే. బంగారం వెండి వజ్రాలు సమృద్ధిగా దొరికేవి.PPTel 78.1

  ఆదిలో మానవులికి ఉన్న శక్తిలో చాలామట్టుకు ఇప్పటికింకా ఉంది. జీవితాన్ని పొడిగించే చెట్టుపండును ఆదాము తిన్ననాటి నుంచి కొన్నితరాలు గతించాయి. మానవుడింకా తన ఉనికిని శతాబ్దాల్లోనే లెక్కించుకుంటున్నాడు. ప్రణాళికలు రచించుకొని కార్యాచరణ చేపట్టడానికి అపురూప సమర్థతలతో సుదీర్ఘకాలం నివసించిన ఆ ప్రజలు సృష్టికర్త నామాన్ని మహిమ పర్చేందుకు నడిపించి దేవుడు తమకు దీర్ఘ జీవితాలు ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి ఉండేవారు. అయితే వారీ పనిచేయలేదు. గొప్ప శారీరక బలం బుద్ధిబలం కలిగి అద్భుతమైన కార్యాలు సాధించగల మహాకాయాలు అనేకులున్నారు. అయితే వారు చేసిన పాపం వారి శరీర పరిమాణం, నైపుణ్యం, ప్రతిభ నిష్పత్తిలోనే ఉన్నది.PPTel 78.2

  జలప్రళయ పూర్వ ప్రజలకు దేవుడు అనేక వరాలిచ్చాడు. కాని వారు వాటిని స్వీయ ప్రతిష్టకోసం స్వలాభం కోసం ఉపయోగించుకొని ఇచ్చిన దేవుని విడిచి పెట్టి ఈవుల్ని ప్రేమించి వాటిని శాపాలుగా మార్చారు. వెండి, బంగారు వజ్రాలు ఉత్తమ శ్రేణి కలపను ఉపయోగించి ఇళ్లు కట్టుకొని వాటిని సింగారించుకోటంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. వినోదాల్లో దుష్కృతాల్లో మునిగి తేల్తూ తమ హృదయ వాంఛలు తీర్చుకోటానికి ప్రయత్నించారు. తమ మస్తిష్కంలోనుంచి దేవుని ఆలోచన తుడిచివేయటానికి దేవుడు లేడని వాదించారు. ప్రకృతి దేవుణ్ని పక్కన పెట్టి ప్రకృతిని పూజించారు. మానవ ప్రతిభను కీర్తించి, మానవాకృతుల్ని పూజించి విగ్రహాలకు మొక్కమని తమ బిడ్డలకు బోధించారు.PPTel 78.3

  వారు తమ విగ్రహాల బలిపీఠాల్ని పచ్చని పొలాల్లో చక్కని చెట్లకింద నిర్మించారు. సంవత్సరం పొడుగునా పచ్చగా ఉండేచెట్లు వనాల్ని అబద్ద దేవుళ్ల పూజకు ప్రత్యేకించారు. ఈ వనాలతో అందమైన తోటల్ని అనుసంధానపర్చారు. ఈ తోటల్లో వంకలు తిరిగేదార్లు, ఆ దారుల పక్క రకరకాల పండ్లతో నిండిన వృక్షాలు, శిలావిగ్రహాలు, కంటికి ఇంపుగా కనిపించే అలంకరణలు ఏర్పాటు చేశారు. విగ్రహారాధన చేయటానికి ఈ విధంగా ప్రజల్ని ఆకర్షించారు.PPTel 79.1

  మనుషులు దేవుని విస్మరించి తమ ఊహల్ని బట్టి సృష్టాన్ని పూజించారు. ఫలితంగా నైతికంగా మరింత దిగజారిపోయారు. విగ్రహారాధన అర్చకుడిపై ఎలాంటి ఫలితాన్ని కనబర్చుతుందో కీర్తన రచయిత వర్ణిస్తూ, “వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచువారును వాటి వంటివారైయున్నారు” అంటున్నారు. కీర్తనలు 115:8. ఒక వస్తువును పదే పదే చూడటంవల్ల దాని రూపురేఖల్ని సంతరించుకొంటామన్నది మానవ మనోశాస్త్ర సూత్రం. సత్యం, పవిత్రత, పరిశుద్ధత విషయాల్లో మానవుడు తనకున్న అభిప్రాయాల్ని మించి ఉన్నతస్థాయికి చేరలేడు. మనసు మానవత స్థాయికన్న ఉన్నతస్థాయికి లేవకపోతే, అనంత జ్ఞానాన్ని అనంత ప్రేమను ధ్యానించటానికి మనసు విశ్వాసమూలంగా పైకి లేవకుండా ఉంటే, మానవుడు నానాటికి క్షుద్రస్థాయికి దిగజారాడు. అబద్ద దేవుళ్ళను పూజించేవారు విగ్రహాలకు మానవ గుణలక్షణాలు మానవావేశాలు ఆపాదించటం వల్ల ఆ దేవుళ్ల ప్రవర్తనను మానవ ప్రవర్తన స్థాయికి దించుతున్నారు. ఫలితంగా వారిని అపవిత్ర పర్చుతున్నారు. “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి... నొచ్చుకొనెను... భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను” దేవుడు తన ఆజ్ఞల్ని జీవిత నియమంగా మానవుడికిచ్చాడు. అయితే ఆ చట్టాన్ని మానవుడు అతిక్రమించాడు. దాని పర్యవసానంగా ప్రతీ విధమైన పాపం వచ్చింది. మానవుల చెడుతనానికి అడ్డూ ఆపూ లేకపోయింది. న్యాయాన్ని కాలికిందవేసి తొక్కారు. బాధితుల మొర దేవునికి వినిపించింది.PPTel 79.2

  దేవుడు స్థాపించిన పద్ధతికి విరుద్ధంగా ఆదిలోనే బహుభార్యా వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేవుడు ఆదాముకి ఒక భార్యనే ఇచ్చాడు. ఆ విషయంలో తన నియమం ఇది అని చూపించాడు. అయితే ఆదాము పతనం అనంతరం మనుషులు తమ పాపేచ్చల ప్రకారం వర్తించటం మొదలు పెట్టారు. ఫలితంగా నేరం, దుర్మార్గత పెచ్చు పెరిగాయి. వివాహ బాంధవ్యాన్నిగాని ఆస్తిహక్కుల్నిగానీ ఎవరూ లెక్కచేయలేదు. పొరుగువాడి భార్యనుగాని ఆస్తినిగాని ఎవరు ఆశిస్తే అతడు దాన్ని బలవంతంగా సొంతం చేసుకునేవాడు. మనుషులు తమ దౌర్జన్య కార్యాల్ని బట్టి అతిశయించారు. జంతువుల్ని చంపటంలో ఆనందించారు. జంతువుల మాంసం తినటం వల్ల మనుషులు మరింత క్రూరులు రక్తపిపాసులు అయి చివరికి మానవ జీవితాన్ని చులకనగా చూశారు.PPTel 79.3

  లోకం ఇంకా ఆరంభ దశలోనే ఉంది. అయినా చెడుతనం లోకమంతా వ్యాపించింది. దేవుడు దాన్ని ఇక సహించలేకపోయాడు. “నేను సృజించిన నరులను... భూమిమీద నుండి తుడిచివేయుదును” అని ఆయన అనుకొన్నాడు. తన ఆత్మ అపరాధులైన మానవులతో ఎల్లప్పుడూ వాదించదని దేవుడు ప్రకటించాడు. లోకాన్ని దానిలోని విలువల్ని తమ పాపాలతో కల్మషం చేయటం మానకపోతే మానవుల్ని సృష్టి నుంచి తుడిచివేసి వారి శ్రేయస్సుకు తాను కలుగజేసిన వాటిని నాశనం చేయటానికి దేవుడు తీర్మానించుకొన్నాడు. వన్యప్రాణుల్ని, సమృద్ధిగా ఆహారాన్నిచ్చే మొక్కల్ని, పైరుల్ని తుడిచివేసి భూమండలాన్ని నిరాకార, నిర్జన, శిధిల ప్రదేశంగా మార్చటానికి నిశ్చయించుకున్నాడు.PPTel 80.1

  నిజమైన దేవుని గూర్చిన జ్ఞానాన్ని పదిలపర్చి తద్వారా నైతిక చెడుతనానికి అడ్డుకట్ట వేయటానికి పేట్రేగిపోతున్న దుష్టత్వం అవినీతి మధ్య మెతూ షెల, నోవహు ఇంకా అనేకమంది పాటుపడ్డారు. ప్రళయానికి నూట ఇరవై సంవత్సరాలకు ముందే దేవుడు తన ఉద్దేశాన్ని తెలియపర్చి ఒక ఓడ కట్టమని నోవహును ఆదేశించాడు. జలప్రళయంతో దేవుడు దుష్టుల్ని లోకాన్ని నాశనం చేయనున్నాడని ఓడ నిర్మాణం జరిగే కాలంలో నోవహు బోధించాల్సి ఉన్నాడు. వర్తమానాన్ని విశ్వసించి పశ్చాత్తాపం పరివర్తనల ద్వారా ఆ ఘటనకు సిద్ధపడే ప్రజలు క్షమాపణ పొంది రక్షించబడ్డారని బోధించాల్సి ఉన్నాడు. జలప్రళయం గురించి దేవుడు తనకు దర్శనంలో చూపించిన విషయాల్ని హనోకు తన బిడ్డలకు చెప్పాడు. నోవహు బోధ దినాలవరకూ జీవించి ఉన్న మెతూ షెల అతడి కుమారులు ఓడ నిర్మాణంలో నోవహుకు సహాయం చేశారు.PPTel 80.2

  ఓడ నిర్మాణానికి ఖచ్చితమైన కొలతల్ని, నిర్మాణంలో అవసరమయ్యే ప్రతీ చిన్న వివరాన్ని దేవుడు నోవహుకు ఇచ్చాడు. అంత బలమైన నాణ్యమైన నిర్మాణాన్ని మానవ జ్ఞానంతో రూపొందించటం అసంభవం. దేవుడే రూపశిల్పి. నోవహు నిర్మాణకుడు. నీటిలో తేలేందుకు దాని కింది భాగం ఓడమాదిరిగా నిర్మితమయ్యింది. కాని కొన్ని విషయాల్లో అది ఇంటిని పోలి ఉన్నది. దానికి మూడు అంతస్తులున్నాయి. ఒకటే తలుపు. అది ఒక పక్క ఉంది. ఓడకు వెలుతురు పైనుంచి వచ్చింది. లోపల ఉన్న ఆయా విభాగాలు వెలుగుతో చక్కగా నిండేటట్లు నిర్మితమయ్యాయి. ఓడ నిర్మాణంలో వందలాది సంవత్సరాలకు కూడా చివికిపోని చితిసారకపు మాను ఉపయుక్త మయ్యింది. బ్రహ్మాండమైన ఈ నిర్మాణానికి చాలా కాలం పట్టింది. ఎంతో శ్రమ అవసరమయ్యింది. ఆనాటి మనుషుల శక్తి ఎంతో అధికమైనప్పటికీ, అప్పటి చెట్ల పరిమాణం, చెక్క గట్టితనం వల్ల బల్లలు, వాసాలు మొదలైన వాటిని తయారు చేయటానికి అప్పుడు ఇప్పటికన్నా ఎంతో ఎక్కువ శ్రమ అవసరమయ్యింది. ఆ నిర్మాణాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దటానికి మానవుడు తనశక్తి మేరకు పరిశ్రమించాడు. అయినా రావాల్సి ఉన్న జలప్రళయాన్ని ఆ ఓడ దానంతట అది తట్టుకొని ఉండేది కాదు. భయంకరమైన ఆ నీటిపై ఉన్న తన సేవకుల్ని దేవుడు మాత్రమే భద్రంగా ఉంచగలుగుతాడు.PPTel 80.3

  “విశ్వాసమును బట్టి నోవహు ఇదివరకు చూడని సంగతులను గూర్చి దేవునిచేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన యింటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను” హెబ్రీ 11:7. లోకానికి హెచ్చరిక వర్తమానాల్ని అందిస్తున్న అతడు యదార్థవంతుడని అతని క్రియలు సాక్ష్యమిచ్చాయి. అతడి విశ్వాసం ఈ విధంగా పరిపూర్ణమై నిదర్శనంగా నిలిచింది. దేవుని మాటను నమ్మటంలో అతడు లోకానికి ఆదర్శమయ్యాడు. తనకున్నదంతా ఓడ నిర్మాణానికి పెట్టాడు. పొడినేల మీద ఆ బ్రహ్మాండమైన ఓడను అతడు కడుతుంటే ఆ వింతను చూడటానికి ఆ అపూర్వబోధకుడి మాటలు వినటానికి అన్ని ప్రాంతాల నుంచి జనులు గుంపులు గుంపులుగా వచ్చారు. ఓడమీద పడ్డ ప్రతీ సుత్తి దెబ్బా ప్రజల ముందు సాక్ష్యం చెప్పింది.PPTel 81.1

  మొదటే అనేకులు హెచ్చరికను అంగీకరిస్తున్నట్లు కనిపించారు. అయినా వారు నిజమైన పాపపశ్చాత్తాపంతో దేవుని పక్కకు తిరగలేదు. తమ పాపాలకు స్వస్తి చెప్పటానికి సమ్మతించలేదు. జలప్రళయం సంభవించకముందున్న కాలవ్యవధి వారి విశ్వాసానికి పరీక్ష సమయం. వారు దానికి నిలువలేకపోయారు. ప్రబలమౌతున్న అపనమ్మకానికి లొంగి ఆ గంభీర వర్తమానాన్ని తోసిపుచ్చుతూ తమ పూర్వమిత్రులతో చేతులు కలిపారు. కొందరు ఆ వర్తమానాన్ని బలంగా విశ్వసించారు. దాన్ని ఆచరించటానికి సిద్ధంగా ఉన్నారు కూడా. అపహసించేవాల్లు వెక్కిరించేవాళ్లు ఎక్కువవడంతో వీరు కూడా ఆ గుంపులో కలిసిపోయారు. దేవుని కృపను తృణీకరించారు. ఎగతాళి చేసి ధిక్కరించేవారిలో వీరు అఖండులయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు వర్తమానాన్నంగీకరించి ఆ మీదట దేవుని ఆత్మను ప్రతిఘటించేవారు చేసేటంత ధైర్యంగా నికృష్టంగా పాపకార్యాలు ఇంక ఎవరూ చేయరు.PPTel 81.2

  ఆ తరంలోని ప్రజలందరూ విగ్రహారాధకుల లెక్కలోకిరారు. దేవుణ్ని ఆరాధిస్తున్నట్లు చెప్పుకొన్నవారు చాలామంది ఉన్నారు. తమ విగ్రహాలు దైవం చిహ్నాలని వాటి మూలంగా దైవాన్ని గూర్చి ప్రజలు స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండవచ్చునని వారు వాదించారు. నోవహు బోధిస్తున్న వర్తమానాన్ని తోసిపుచ్చటంలో ఈ తరగతి ప్రజలు ముందున్నారు. దేవుణ్ని వస్తువుల రూపంలో చూపించటానికి ప్రయత్నించటం వల్ల మనుషులు ఆయన ఔన్నత్యాన్ని శక్తిని చూడలేకపోయారు. ఆయన ప్రవర్తన పరిశుద్ధమైనది పవిత్రమైనది అని, ఆయన ధర్మవిధులు మార్పులేనివని గుర్తించలేకపోయారు. పాపం సామాన్యమవ్వటంతో చాలామందికి అది పాపంగా కనిపించలేదు. చివరికి ప్రజలు దైవ ధర్మశాస్త్రం ఆచరణలో లేదని ప్రకటించారు. దేవుని తీర్పులు భూమిమీద పడ్డాయని నమ్మలేదు. ఆ తరం ప్రజలు దైవధర్మశాసనాన్ని అనుసరించి జీవించి ఉంటే దైవ సేవకుడు నోవహు హెచ్చరికలో దైవ స్వరాన్ని గుర్తించి ఉండేవారు. ప్రకాశిస్తున్న సత్యాన్ని నిరాకరించటం వల్ల మనసులు గుడ్డివై నోవహు వర్తమానం పిచ్చి భ్రమ అని భావించారు.PPTel 82.1

  వాస్తవాల్ని సమర్థించేవారు ఎక్కువమంది గాని అధిక సంఖ్యాకులుగాని కాదు. దేవుని న్యాయవ్యవస్థను ఆయన ధర్మశాసనాన్ని వ్యతిరేకించటానికి లోకం మోహరించి ఉంది. నోవహును మతమౌఢ్యుడుగా కొట్టిపారేసింది. దైవ శాసనాన్ని మీరటానికి అవ్వను వంచిస్తున్న తరుణంలో “మీరు చావనే చావరు” అని సాతాను ఆమెతో అన్నాడు, ఆది. 3:4. లోకంలో పేరు ప్రతిష్టలున్న గొప్ప వ్యక్తులు ఈ మాటల్నే మళ్లీ పలికారు. “దేవుని హెచ్చరికలు భయ పెట్టటానికే గాని నిజంగా అమలు పర్చటానికి కాదు. మీరు భయపడాల్సిన పనిలేదు. తాను సృజించిన ప్రపంచాన్ని నాశనం చేసి తాను సృజించి ప్రజల్ని దేవుడే శిక్షించటమన్నది జరగని పని. ధైర్యంగా ఉండండి. భయపడకండి. నోవహు మతపిచ్చిపట్టినవాడు” అంటూ నమ్మబలికారు. మోసపోయిన ముసలివాడంటూ నోవహును వెక్కిరిస్తూ లోకం వినోదాల్లో తేలి ఆడింది. వినయంగా దేవుని ముందు వంగి నమస్కరించే బదులు ప్రజలు తమ అవిధేయతను దుర్మార్గతను కొనసాగించారు. తన సేవకుడు నోవహు ద్వారా దేవుడు తమకు హెచ్చరిక చేయలేదన్నట్లు ప్రవర్తించారు.PPTel 82.2

  కాగా తుఫానులో బండ స్థిరంగా నిలిచి ఉండేటట్లు నోవహు ధృఢంగా నిలిచి ఉన్నాడు. ద్వేషిస్తూ ఎగతాళి చేస్తూ ఉన్న ప్రజల మధ్య తన పరిశుద్ధ ప్రవర్తనతో అచంచల విశ్వాసంతో నోవహు ప్రత్యేకంగా కనిపించాడు. అతడి మాటలకు గొప్ప శక్తి ఉన్నది. ఎందుకంటే అవి అతడి ద్వారా దేవుడు పలికిన మాటలు. మానవ జ్ఞానానికి అంతుచిక్కని అసాధ్యమైన సంఘటనల గురించి ఆ గంభీరస్వరంనూట ఇరవై సంవత్సరా లుగా ఏకరువు పెడ్తున్న విషయాల్ని ఆ తరం ప్రజలు పెడచెవిని పెడ్తుండగా, దేవునితో తనకున్న సన్నిహిత అనుబంధం నోవహును దైవశక్తితో నింపి బలో పేతుణ్ని చేసింది.PPTel 83.1

  ప్రకృతి చట్టాలు శతాబ్దాల కొద్దీ మార్పులేకుండా ఒకే విధంగా పనిచేస్తున్నామంటూ జలప్రళయానికి ముందున్న ప్రపంచం వాదించింది. ఋతువులు వాటి వాటి కాలాల్లో వస్తూనే ఉన్నాయి. ఇంతవరకూ భూమ్మీద వర్షం పడలేదు. మంచుపడి నేలను తడిపింది. నదులు కట్టలు దాటి ప్రవహించలేదు. నీరు తిన్నగా సముద్రాన్ని చేరేది. కట్టలు దాటకుండా నదులు స్థిరమైన నియమాల్ని అనుసరించేవి. అయితే ఈ తాత్వికులు “ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదు” (యోబు 38:11) అని జలాల్ని ఆపుజేసిన ప్రభువు హస్తాన్ని గుర్తించలేదు.PPTel 83.2

  ప్రకృతిలో మార్పులేమీ లేకుండా కాలం గతించి పోతున్నప్పుడు క్రితం భయంతో నిండి ఉన్న ప్రజలు ధైర్యం తెచ్చుకోటం మొదలు పెట్టారు. ప్రకృతి దాన్ని సృజించిన దేవుని కన్నా గొప్పదని ప్రకృతి నియమాలు దేవుడు కూడా మార్చలేనంత స్థిరమైనవని నేడు అనేకులు తర్కిస్తున్నట్లు తర్కించారు. నోవహు వర్తమానం నిజమయ్యిందే అయితే ప్రకృతి తారుమారు అయ్యేదే అని వాదిస్తూ ప్రజల మనసుల్లో ఆ వర్తమానాన్ని గొప్ప మోసంగా చిత్రించారు. హెచ్చరికకు ముందు జరిగించిన దుష్కార్యాలనే హెచ్చరిక తర్వాత కూడా సాగిస్తూ దానిపట్ల తమ తిరస్కార స్వభావాన్ని ప్రదర్శించారు. తమ విందులు వినోదాలు కొనసాగించారు. తిన్నారు తాగారు తోటలు వేసుకొన్నారు ఇళ్లు కట్టుకొన్నారు. మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించుకొన్నారు. దేవుని భయం తమకు ఏ మాత్రం లేదని నిరూపించుకోటానికి దేవుని ధిక్కరించి ఆయన ఆజ్ఞల్ని అతిక్రమించటంలో చాలా దూరం వెళ్లారు. నోవహు చెబుతున్నదాంట్లో ఏ మాత్రం నిజమున్నా దాన్ని లోకంలోని జ్ఞానులు, ప్రాజ్ఞులు ప్రఖ్యాతిగాంచిన ప్రతిభావంతులు గ్రహించే వారే అని హేతువాదం లేవదీశారు.PPTel 83.3

  జలప్రళయం పూర్వప్రజలు హెచ్చరికను అంగీకరించి తమ దుష్క్రియల నిమిత్తం అనంతరం నీనెవె ప్రజలమల్లే సంతాపం పొంది ఉంటే దేవుడు జలప్రళయాన్ని ఆ పేవాడు. అయితే తమ అంతరాత్మ గద్దింపుల్ని ప్రవక్త హెచ్చరికల్నీ మొండిగా ప్రతిఘటించినందువల్ల ఆ తరం ప్రజలు తమచెడుతనం పాత్రను నింపుకొని నాశనానికి సిద్ధమై ఉన్నారు.PPTel 84.1

  వారికిచ్చిన కృపకాలం అవధి ముగియవస్తున్నది. దేవుడిచ్చిన ఉపదేశాన్ని నోవహు సంపూర్తిగా పాటించాడు. ప్రభువు ఆదేశానుసారంగా ఓడలోని ప్రతీ భాగం పూర్తి అయ్యింది. ఓడలో మనుషులికి జంతువులికి అవసరమైన ఆహారం సమకూర్చి ఉ ంచటం జరిగింది. ఇప్పుడు దైవ సేవకుడు ప్రజలకు తన చివరి విజ్ఞప్తి చేశాడు. తమకు ఏర్పాటైన ఆశ్రయాన్ని చేరవల్సిందిగా హృదయ వేదనతో ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఆ విజ్ఞప్తిని నిరాకరిస్తూ కేకలు వేశారు. ఎగతాళి చేస్తున్న జనసమూహాలు అర్థాంతరంగా మూగబోయాయి. అడవుల్లోంచి కొండలు పర్వాతాల్లోనుంచి క్రూర మృగాలు సాధు జంతువులు నిశ్శబ్ధంగా ఓడ దిశగా రావటం జరిగింది. గాలి వీస్తున్నట్లు శబ్దం వినిపించగా చూస్తే అన్ని దిశల నుంచి పక్షులు ఎగిరి వస్తున్నాయి. అవి బారులు తీరి ఎగురుతుంటే ఆకాశం మబ్బుకమ్మినట్లనిపించింది. అవి ఓడలోకి వెళ్లాయి. జంతువులు దేవుని ఆజ్ఞను శిరసావహిస్తే మానవుడు మాత్రం ఆయనను ధిక్కరించాడు. పరిశుద్ధ దూతల నడుపుదల కింద అవి “రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహునొద్దకు ప్రవేశించెను”. పవిత్రమైన జంతువులు ఏడేసి చొప్పున ప్రవేశించాయి. ప్రజలు ఆ వింతను ఆశ్చర్యంగా చూశారు. కొందరు భయంతో వీక్షించారు. ఆ అపురూప సంఘటనను వివరించటానికి తత్త్వవేత్తల్ని పిలిచారు. వారు వచ్చి ఏమీతోచక తలలు గోక్కున్నారు. అది వారికి అంతు చిక్కని మర్మం. వెలుగును పదే పదే నిరాకరించటం వల్ల మనుషుల హృదయాలు రాయిలా కఠినమవ్వటంతో ఈ దృశ్యం సైతం తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపింది. సూర్యుడు ప్రచండ తేజంతో యథావిధిగా ప్రకాశించటం, భూమి దాదాపు ఏదెను సొగసులు ధరించుకొని కనబడటంతో ప్రజలు తమ భయాందోళనల్ని కొట్టి పారేసి తమ నికృష్ట వినోదాల్లో తేలియాడూ అప్పటికే రేగి ఉన్న దేవుని ఉగ్రతకు ఆహ్వానం పలికారు.PPTel 84.2

  “ఈ తరములో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి” అని నోవహుకు దేవుడు ఆదేశమిచ్చాడు. నోవహు హెచ్చరికల్ని లోక ప్రజలు తోసిపుచ్చారు. అయితే అతడి ప్రభావం ఆదర్శం తన కుటుంబానికి దీవెనగా పరిణమించింది. నోవహు నమ్మకమైన యథార్థమైన జీవితానికి ప్రతిఫలంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ దేవుడు రక్షించాడట. తల్లిదండ్రుల నీతి నిజాయితీలకు, విశ్వసనీయతకు ఇది ఎంత గొప్ప ప్రోత్సాహకం!PPTel 84.3

  పాప మానవుల నిమిత్తం కృపా విజ్ఞాపనకు తెరపడింది. వన్యప్రాణులు ఆకాశ పక్షులు ఆశ్రయ స్థానంలో ప్రవేశించాయి. నోవహు అతని కుటుంబ సభ్యులు ఓడలో ఉన్నారు. “అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను” అంతట ప్రచండమైన వెలుగు కనిపించింది. మెరుపుకన్నా ప్రకాశవంతమైన మేఘం ఆకాశంలోనుంచి దిగివచ్చి ఓడ ద్వారం ముందు నిలిచింది. కనిపించని హస్తం లోపలినుంచి మూయటానికి ఎవరికీ సాధ్యంకాని బ్రహ్మాండమైన తలుపును మూసింది. నోవహు ఓడలోపల ఉన్నాడు. దైవ కృపను నిరాకరించిన జనం వెలుపల ఉన్నారు. ఆ తలుపుమీద దేవుని ముద్రపడింది. అలాగే క్రీస్తు మేఘారూఢుడై రావటానికి ముందు పాపుల కోసం తన విజ్ఞాపనను ఆపినప్పుడు కృపాద్వారం మూసుకుంటుంది. అప్పుడు దుష్టుల్ని దైవకృప ఇక అదుపుచేయదు. కృపను తోసిపుచ్చిన వారి పై సాతానుకి పూర్తి అదుపు లభిస్తుంది. వారు దైవ ప్రజల్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు. కాని ఓడలో నోవహు ఎలా సురక్షితంగా ఉన్నాడో అలాగే నీతిమంతుల్ని దేవుని శక్తి భద్రంగా ఉంచుతుంది.PPTel 85.1

  నోవహు అతడి ఇంటివారు ఓడలో ప్రవేశించిన ఏడు దినాల వరకూ తుఫాను వస్తున్న సూచనలు కనిపించలేదు. ఈ సమయం వారికి విశ్వాస పరీక్షా సమయం. అది ఓడ వెలుపల ఉన్న ప్రపంచానికి విజయోత్సాహ సమయం. ఆ ఆలస్యం నోవహు వర్తమానం పిచ్చి భ్రమ, జలప్రళయం ఎన్నటికీ సంభవించదు అన్న ప్రజల నమ్మకాన్ని ధ్రువపర్చింది. జంతువులు పక్షులు ఓడలో ప్రవేశించటం, దేవుని దూత ఓడ తలుపు మూయటం వంటి గంభీర దృశ్యాల్ని కళ్లారా చూసికూడా తాగితందనాలాడుతూ దైవ శక్తికి సూచికలైన ఆ సంభవాల్ని కూడా ఎగతాళి చేశారు. ఓడచుట్టూ చేరి లోపల ఉన్నవారిని పరిహసిస్తూ తీవ్ర దౌర్జన్యానికి దిగారు. కాగా ఎనిమిదవ రోజు ఆకాశం మేఘావృతమయ్యింది. ఆ తర్వాత ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యా యి. కొద్ది సేపటిలో పెద్ద పెద్ద చినుకులు పడటం మొదలయ్యింది. ఇలాంటిది ముందెన్నడూ జరుగలేదు. మనుషుల హృదయాల్లో భయం పుట్టుకొచ్చింది. “నోవహు వర్తమానం నిజమై ఉంటుందా? లోకం నాశనం కాబోతున్నదా?” అంటూ అందరూ రహస్యంగా ఆరా తీస్తున్నారు. దట్టమైన మబ్బుతో ఆకాశం మసకబారింది. చినుకుల వేగం అధికమయ్యింది. జంతువులు భయంతో ఇటూ అటూ పరుగులు తీస్తున్నాయి. వాటి అరుపులు వాటికి మనుషులకు పట్టిన దుర్గతిని సూచిస్తున్నాయి. అప్పుడు “మహా సాధుజలముల ఊటలన్నియు” “ఆకాశపు తూములన్నియు విప్పబడెను” నీళ్లు మేఘాల నుంచి ధారాపాతంగా పడుతున్నట్లు కనిపించింది. నదులు కట్టలు తెగి లోయల్ని ముంచేశాయి. నీళ్లు భూమిని బద్దలు కొట్టుకొని ప్రచండ వేగంతో పెద్ద బండల్ని కొన్ని వందల అడుగులు ఆకాశంలోకి విసిరికొడూ ప్రవహించాయి. అవి కిందపడి భూమిలో లోతుగా కూరుకుపోయాయి.PPTel 85.2

  ప్రజలు తమ చేతి పనులన్నీ కూలిపోవటం ముందు చూశారు. తమ చక్కని ఇళ్ల, అందమైన తోటలు, వారు తమ విగ్రహాలను నిలుపుకొన్న అందమైన వనాలు పిడుగులు పడి ధ్వంసమయ్యాయి. వాటి శిథిలాలు చెదిరి దూరంగా పడ్డాయి. నరబలి అర్పించే బలిపీఠాలు తునాతునకలయ్యాయి. జీవంగల దేవుని శక్తి ప్రదర్శనను చూసి విగ్రహారాధకులు భయంతో వణికారు. తమ దుర్నీతి విగ్రహారాధనే తమకు నాశనం తెచ్చాయని తెలుసుకొన్నారు.PPTel 86.1

  తుఫాను ప్రచండత పెరిగే కొద్దీ చెట్లు, భవనాలు, బండలు మట్టి పెళ్లలు అన్ని దిశలకూ దూసుకుపోయి పడ్డాయి. మనుషులకు, జంతువులకు గొప్పభయం పుట్టింది. దేవుని అధికారాన్ని తృణీకరించిన ప్రజల విలాపం తుఫాను హెరును మించి వినబడ్తున్నది. ప్రకోపించిన పంచభూతాల మధ్య నిలిచిపోవలసి వచ్చిన సాతాను కూడా తన ప్రాణాలకి భయపడ్డాడు. శక్తిమంతమైన మానవజాతిని నియంత్రించి వారు దేవునికి వ్యతిరేకంగా తమ హేయ కార్యాల్ని చేస్తూ ఆయన పై తిరుగుబాటు కొనసాగించటం చూస్తూ సాతాను ఆనందిస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుని శపిస్తూ ఆయన అన్యాయస్తుడు, క్రూరుడు అని తెగనాడాడు. సాతాను మాదిరిగానే అనేకమంది దేవదూషణ చేశారు. సాధ్యపడితే ఆయన్ను తనసింహాసనం నుంచి పడగొట్టేవారు. ఇతరులు భయంతో వణుకుతూ ఓడదిశగా చేతులు చాపి లోనికి రానీయవలసిందిగా వ్యర్థ విజ్ఞాపనలు చేశారు. చివరగా విశ్వపాలకుడైన దేవుడున్నాడు అన్న మనస్సాక్షి వారిలో మేల్కొన్నది. ఆయనను వేడుకోటం మొదలు పెట్టారు. అయితే ఆయన ఆ విన్నపాల్ని ఆలకించలేదు. వాటికి ఆయన చెవిమూత పడింది. దైవధర్మశాస్త్రాన్ని మీరటం వల్ల తమకు నాశనం సంభవిస్తున్నదని ఆ భయంకర ఘడియలో వారు గుర్తించారు. వారు శిక్షకు జడిసి తమ పాపాల్ని ఒప్పుకున్నారేగాని వారిలో నిజమైన పశ్చాత్తాపం పాపం పట్ల ద్వేషం కనిపించలేదు. ఆ తీర్పును రద్దు చేస్తే వారు తిరిగి దేవదూషణకు దైవ ధిక్కారానికి దిగేవారు. అలాగే లోకాన్ని అగ్ని వరద ముంచకముందు భుజములపై దేవుని తీర్పులు పడినపుడు మారు మనసులేని దుష్టులు తమపాపం ఏంటో గుర్తిస్తారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరటమేనని గుర్తిస్తారు. అయినా జలప్రళయానికి ముందున్న లోకప్రజలకు మల్లే వారు కూడా నిజమైన పశ్చాత్తాపం పొందరు.PPTel 86.2

  కొందరు తలుపు పగులగొట్టి ప్రవేశించాలని ప్రయత్నించారు. కాని పటిష్టంగా నిర్మితమైన ఓడ తలుపును వారేమీ చేయలేకపోయారు. వడిగా ప్రవహిస్తున్న నీరు తమను లాక్కుపోయేవరకు కొందరు ఓడను గట్టిగా పట్టుకొని వెళ్లాడారు. లేదా కొట్టుకు వెళ్తున్న చెట్లు బండలు వచ్చి తమ పట్టును విడిపించేవరకు ఓడను పట్టుకొని ఉన్నారు. ప్రచండ శక్తితో వీస్తున్న గాలులు, ఉవ్వెత్తున ఎగిరిపడున్న తరంగాల ధాటికి బ్రహ్మాండమైన ఆ ఓడ కదిలిపోయింది. ఓడలో ఉన్న జంతువులు తమ భయాన్ని బాధను కనపర్చాయి. అయినా సంఘర్షిస్తున్న పంచభూతాల నడుమ ఓడ సురక్షితంగా దాని పయనం సాగించింది. ఓడను కాపాడటానికి దేవదూతలు నియమితులయ్యారు.PPTel 87.1

  గాలివానకు గురి అయిన జంతువులు సాయం కోసం అన్నట్లు మనుషుల వద్దకు పరుగులు తీశాయి. కొందరు తమ బిడ్డల్ని జంతువులకు కట్టారు. తాము కూడా జంతువులకు తాళ్లతో కట్టుకొన్నారు. జంతువులు బలమైనవి ఎక్కువవుతున్న నీటిలో నుంచి ఎత్తయిన స్థలాలకు ఈదుకొని వెళ్లగలవని భావించి వారు ఆ పని చేశారు. కొందరు కొండలు పర్వతాల శిఖరాలకు వెళ్లి అక్కడున్న చెట్లకు తమ్మును తాము కట్టుకొన్నారు. కానీ ఆ నీటి ధాటికి చెట్లు కూడా కూలిపోయాయి. మనుషులతో పాటు అవికూడా ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఒకదాని వెంట ఒకటిగా సురక్షిత స్థలాలన్నీ మాయమయ్యాయి. నీటిమట్టం పెరిగే కొద్దీ తలదాచుకోడానికి ప్రజలు ఎత్తయిన పర్వతాల్ని ఆశ్రయించారు. నిలబడే స్థలం కోసం మనిషి జంతువు పోటీ పడి ఇద్దరూ ప్రవాహంలో పడి కొట్టుకుపోటం తరచుగా జరిగింది.PPTel 87.2

  అత్యున్నత శిఖరాల పై నుంచి చూసేవారికి తీరం లేని విశాల సముద్రం కనిపించింది. దైవ సేవకుడు చేసిన హెచ్చరికను ఎగతాళి చేయటం అపహసించటం ఇక జరుగలేదు. తాము పోగొట్టుకున్న అవకాశం మళ్లీ వస్తే బాగుండునని నాశనమౌతున్న ఆ దుర్జనులు ఆశించారు. ఒక్క గంట సేపు కృపకాలం, కృపకోసం ఒక్క తరుణం, నోవహు నోటి నుండి ఒక్కపిలుపు వస్తే బాగుండునని ఆశించారు.ఆ మధుర కృపాస్వరం ఇక వినిపించలేదు. పాపాన్ని నిలువరించటానికి దేవుని తీర్పురావటం అవసరమని చట్టమే కాదు ప్రేమ కూడా కోరుతున్నది. ప్రళయ జలం చివరి ఆశ్రయాన్ని కూడా ముంచి వేయటంతో అపహాసకులు ఆ నీటిలో మునిగి నశించారు.PPTel 87.3

  “ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నవి” 2 పేతురు 3:6,7. ఇంకొక తుఫాను వస్తున్నది. దేవుని ఉగ్రత లోకాన్ని మళ్లీ తుడిచివేయబోతున్నది. పాపం నిర్మూలమై పాపులు నాశనం కాబోతున్నారు.PPTel 88.1

  జల ప్రళయానికి ముందు నివసించిన ప్రజల నాశనానికి ఏ పాపాలు హేతువో అవే ఈ నాటి ప్రపంచంలోనూ ప్రబలుతున్నాయి. మనుషుల హృదయాల్లో దైవ భీతిలేదు. ధర్మశాస్త్ర సూత్రాలంటే ప్రజలకు కంటికింపు. లోకంలో భోగాలపట్ల ఆ తరం ప్రజలు చూపించిన అమితాసక్తికి ఏ మాత్రం తీసిపోని వాంఛ ఈ తరం ప్రజల్లోనూ చోటు చేసుకొన్నది. క్రీస్తు ఈ మాటలన్నాడు, “జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచునుండిరి. జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఆలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును” మత్తయి 24:38, 39. తిన్నందుకూ తాగినందుకూ జలప్రళయానికి ముందు నివసించిన ప్రజల్ని దేవుడు ఖండించలేదు. శారీరక అవసరాలు తీర్చటానికి గాను వారికి సమృద్ధిగా భూమి పంటనిచ్చాడు. ఈవులనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపకుండా అడ్డూ ఆపూ లేకుండా తిని తాగటం ద్వారా వాటిని దుర్వినియోగం చేయటమే వారు చేసిన పాపం. పెళ్లి చేసుకోటం చట్ట సమ్మతం. పెళ్లి దేవుడు సంకల్పించిందే. దేవుడు స్థాపించిన మొదటి వ్యవస్థల్లో అది ఒకటి. వివాహానికి పరిశు ద్ధతను అందాన్ని కూర్చి దాన్ని గురించి ప్రత్యేక సూచన చేశాడు. అయితే ప్రజలు వీటిని చెవిని పెట్టలేదు.వాటిని వక్రీకరించి శరీర వాంఛల్ని తీర్చుకోటానికి ఉపయో గించుకొన్నారు.PPTel 88.2

  ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. చట్టసమ్మతమైన దాన్ని అతిగా చేయటం జరుగుతున్నది. తినటం తాగటం మితిమీరిపోతున్నాయి. నేడు క్రైస్తవులుగా చెలామణి అవుతున్నవారు తాగుబోతులతో కూడి తిని తాగుతున్నారు. సంఘ రికార్డుల్లో వారు గౌరవంగల సభ్యులు. అదుపు పాటించకుండా ఆశ తీర్చుకోటం నైతిక ఆధ్యాత్మిక శక్తుల్ని మొద్దుబార్చి నీచమైన అప్రతిష్టకరమైన కోర్కెలు తీర్చుకోటానికి దారి తీస్తుంది. శరీర వాంఛల్ని నిలువరించుకోటం తమ నైతిక బాధ్యత అని భావించనందున అనేకమంది మోసానికి బానిసలవుతున్నారు. శరీరాశలు తీర్చుకోటానికే మనుషులు బతుకుతున్నారు. ఈ లోకం కోసమే, ఈ జీవితం కోసమే బతుకుతున్నారు. సమాజంలో అన్ని వర్గాల్లోనూ దుబారా కళ్లకు కడుతున్నది. సుఖాల నిమిత్తం డంబం నిమిత్తం నిజాయితీని బలిచేస్తున్నారు. ధనవంతులు కావాలనే న్యాయాన్ని వక్రీకరించి పేదలను హింసిస్తారు. “మనుష్యుల ప్రాణములను”PPTel 88.3

  కొనటం అమ్మటం ఇంకా జరుగుతున్నది. ఉన్నత స్థాయి తక్కువ స్థాయి అన్న భేదం లేకుండా అన్ని స్థాయిల్లోను మోసం, లంచగొండితనం పట్టించుకొనే నాధుడు లేక స్వేచ్ఛగా సాగుతున్నాయి. మానవత, పూర్తిగా మాయమయ్యిందా అనిపించేంతగా హత్యలు ఘోర నేరాల ఉదతంతాలతో వార్తా పత్రికలు నిండి ఉంటున్నాయి. ఈ ఘోరాలు అనుదిన జీవితంలో భాగం కావటంతో వాటి గురించి వ్యాఖ్యానించేవారు లేరు. ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు అంతకన్నా లేరు. అన్ని దేశాల్లోనూ అస్తవ్యస్థ పరిస్థితులు చోటుచేసుకొంటున్నాయి. అప్పుడప్పుడు లోకం గుండెల్లో గుబులు పుట్టించే దౌర్జన్యకాండ, అంతర్గతంగా ఉన్న ఉక్రోషానికి దుష్టత్వానికి సూచన మాత్రమే. ఒక్కసారి అదుపు తప్పినప్పుడు అదే లోకాన్ని దు:ఖంతోను మరణంతోను నింపుతుంది. జలప్రళయ పూర్వ ప్రపంచం గురించి లేఖనం అందిస్తున్న వర్ణన ప్రస్తుత ప్రపంచం వడివడిగా అడుగులువేస్తూ చేరుకొంటున్న పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రస్తుత శతాబ్దంలో సైతం క్రైస్తవులమని చెప్పుకొంటున్న దేశాల్లో పాత ప్రపంచం జలప్రళయంలో నశించి పోవటానికి కారణమైన నికృష్టమైన నీచాతినీచమైన నేరాలు దినదినం చోటు చేసుకొంటున్నాయి.PPTel 89.1

  ప్రపంచాన్ని హెచ్చరించేందుకు జలప్రళయానికి ముందు దేవుడు నోవహును పంపాడు. పశ్చాత్తాపం చెంది రానున్న నాశనం నుంచి తప్పించుకొనేందుకు గాను ప్రజల్ని హెచ్చరించటానికి ఆయన నోవహును పంపాడు. క్రీస్తు రెండోరాకకు సమయం ఆసన్నమయినప్పుడు ఆ సంఘటన గురించి ప్రజల్ని చైతన్యపర్చటానికి లోకాన్ని సిద్ధం చేయటానికి ప్రభువు తన సేవకుల్ని పంపిస్తాడు. వేవేల ప్రజలు దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నివసిస్తున్నారు. తనపరిశుద్ధ ధర్మ నిబంధల్ని ఆచరించాల్సిందిగా ఇప్పుడు దేవుడు కృపతో విజ్ఞప్తి పంపిస్తున్నాడు. దేవుని ముందు పశ్చాత్తాపపడి తమ పాపాలు విడిచి పెట్టి క్రీస్తుపై విశ్వాసం ఉంచేవారందరూ క్షమాపణ పొందుతున్నారు. అయితే అనేకులు పాపాన్ని విడిచి పెట్టటం గొప్ప త్యాగమని భావిస్తున్నారు. దైవ ప్రభుత్వ సూత్రాలతో తమ జీవన సరళి అన్వయించటంలేదు గనుక ఆయన హెచ్చరికలకు చెవినియ్యక ఆయన ధర్మశాస్త్రాధికారాన్ని ప్రశ్నిస్తున్నారు.PPTel 89.2

  జలప్రళయానికి ముందు నివసించిన విస్తార జన సంఖ్యలో నోవహు ద్వారా దేవుడు పంపిన వర్తమానాన్ని నమ్మి ఆచరించినవారు ఎనిమిది మంది మాత్రమే. నాశనం వస్తున్నదని లోకాన్ని ఆ నీతి బోధకుడు నూట ఇరవై ఏళ్ళ హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రజలు ఆ వర్తమానాన్ని బేఖాతరు చేసి అతణ్ని ఎగతాళి చేశారు. ఇప్పటి పరిస్థితి కూడా అదే. అవిధేయులకు శిక్షవిధించటానికి ధర్మశాస్త్రకర్త అయిన ఆ ప్రభువు రాకముందు పశ్చాత్తాపపడి తన వద్దకు తిరిగి రమ్మంటూ ప్రజలకు ఆయన హెచ్చరికలు పంపుతాడు. ఈ హెచ్చరికల్ని ప్రజలు నిరాకరిస్తారు. అపొస్తలుడైన పేతురు ఇలా హెచ్చరిస్తున్నాడు, “అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్లే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసి కొనవలెను”. 2 పేతురు 3:3, 4. కేవలం భక్తిహీనుల నోటివెంటనే గాక మనదేశంలోని ప్రసంగ వేదికల్ని అలంకరిస్తున్న అనేక ప్రముఖ ప్రసంగికుల నోటి వెంట ఈ మాటలే పునరావృతం కావటం మనం వినటం లేదా? “ఆందోళన చెందాల్సినపనిలేదు. క్రీస్తురాకముందు సర్వలోకం మారుమనస్సు పొందుతుంది. నీతి వెయ్యి సంవత్సరాల పాటు పరిపాలిస్తుంది. శాంతి! శాంతి! సమస్తం సృష్టి ఆరంభంలో ఉన్నట్లే కొనసాగుతున్నది. ఆందోళనకారులు చెప్పే మాటల్ని బట్టి ఎవరూ ఆందోళన చెందనక్కరలేదు” అనటం వినటంలేదా? కాని ఈ వెయ్యేళ్ల సిద్ధాంతం యేసు ఆయన అపొస్తలులు బోధించిన బోధనలతో ఏకీభవించటంలేదు. “మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” అని యేసు ప్రశ్నించాడు. లూకా 18:8. మనం చూస్తున్నట్లు నోవహు దినాల్లో ఉన్నట్లే ఇప్పటి లోక పరిస్థితి ఉంటుందని అప్పుడు చెప్పాడాయన. లోకాంతం సమీపమయ్యే కొద్దీ దుష్టత్వం పెచ్చు పెరగటం చూస్తామని పౌలు హెచ్చరిస్తున్నాడు. “అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును ద్యముల బోధలయందును విశ్వాస భ్రష్టురలగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు” 1 తిమోతి 4:1. “అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము” అంటున్నాడు. 2 తిమోతి 3:1. పైకి భక్తిగలవారిగా కనిపించే వారి పాపాల జాబితాను కూడా అపొస్తలుడు వల్లిస్తున్నాడు.PPTel 89.3

  జలప్రళయ పూర్వ ప్రజలు తమ కృపకాలం ముగింపుకు వచ్చే కొద్దీ పండగలు పబ్బాలు జరుపుకొంటూ వినోదాల్లో మునిగి తేలారు. నోవహు చేస్తున్న హెచ్చరికకు ఎవరైనా అనుకూలంగా ప్రతిస్పందిస్తారేమోనన్న గుబులుతో అధికారం పలుకుబడి ఉన్నవారు ప్రజల మనసుల్ని విందులు వినోదాలతో ఆకట్టుకోటానికి ప్రయత్నించారు. మన దినాల్లో కూడా ఇదే జరగటం మనం చూడటం లేదా? లోకం అంతమొదటానికి సమయం ఆసన్నమయ్యిందంటూ దైవ సేవకులు వర్తమానాలందిస్తున్న తరుణంలో లోకం ఆటపాటలతోను విందులు వినోదాలతోను కాలం గడుపుతున్నది. దేవుని పట్ల నిర్లక్ష్య స్వభావం పుట్టించి రానున్న నాశనం నుంచి తమను కాపాడగల సత్యాల ప్రభావానికి ప్రజల్ని దూరంగా ఉంచటానికిగాను నిత్యము వినోదాలు ఉత్సవాల్ని సాతాను ఏర్పాటు చేస్తున్నాడు.PPTel 90.1

  ప్రపంచం నీటి మూలంగా నాశనమవ్వటం అసాధ్యమని నోవహు దినాల్లోని తత్వజ్ఞానులు కుండబద్దలు కొట్టి చెప్పారు. అలాగే ప్రపంచం అగ్నిమూలంగా నాశనమవ్వటం అసంభవమని అది ప్రకృతి నిబంధనలకు విరుద్ధమని చూపించటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రకృతిని చేసిన దేవుడు ప్రకృతి నిబంధనల్ని రూపొందించిన ఆ ప్రభువు తన ఉద్దేశాల నెరవేర్పుకు తన హస్తకృత్యాన్ని ఉప యోగించుకోగలడన్నది నిర్వివాదం.PPTel 91.1

  భూమి నీటి మూలంగా నాశనమవ్వటం అసాధ్యమని పేరుపొందిన జ్ఞానులు నిరూపించినప్పుడు, ప్రజల భయాందోళనలు సద్దుమణిగినప్పుడు, నోవహు వర్తమానం మోసంతో కూడిన అబద్దమని ప్రజలంతా నమ్మి అతణ్ని మతఛాందసుడిగా భావించినప్పుడు - అప్పుడే దేవుని సమయం వచ్చింది. “మహాగాధ జలముల ఊటలన్నియు ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను” అపహాసకులు ఆ ప్రళయ జల ప్రవాహంలో నశించారు. తమ తత్వం జ్ఞానం వెర్రితనమని, చట్టాలిచ్చిన ప్రభువు చట్టాలకన్నా గొప్పవాడని, తన ఉద్దేశాల నెరవేర్పుకు సర్వశక్తిగల ఆయనకు అనేక మార్గాలున్నాయని తత్వవేత్తలు ఆలస్యంగా తెలుసుకున్నారు. “నోవహు దినములలో జరిగినట్టు” “మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును” లూకా 17:26, 30. “ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములును కాలిపోవును” 2 పేతురు 3:10. తత్వజ్ఞానుల తర్కం దైవ శిక్ష భయాన్ని కొట్టిపారేస్తున్న తరుణంలో, మత గురువుల శాంతి సౌభాగ్యాల కాలం వస్తుందని నమ్మబలుకుతున్న తరుణంలో, లోక ప్రజలు తమ వ్యాపారాల్లోను వినోదాల్లోను తలమునకలై ఉన్న తరుణంలో వారిమీదికి హఠాత్తుగా నాశనం వస్తుంది. వారికి తప్పించుకొనే మార్గం ఉండదు. 1 థెస్స. 5:3.PPTel 91.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents