Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    32 - మనష్షే యోషీయా

    హిజ్కియా కాలమంతా మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన యూదా రాజ్యం మనష్షే దుష్ట పరిపాలన సుదీర్ఘ కాలంలో మరోసారి పతన దశకు చేరుకుంది. అన్యమతం పునరుజ్జీవనం పొందింది. అనేకులు విగ్రహారాధనకు ఆకర్షితులయ్యారు. “మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చినవాడై.... అన్యజనముల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.” 2 దినవృ. 33:9. వెనకటి తరాల వెలుగు వెనక మూఢ నమ్మకాలు, తప్పిదాల చీకట్లు ముసిరాయి. నిరంకుశత్వం, హింస, మంచిపట్ల ద్వేషం వంటి అపరాధాలు చోటుచేసుకుని తామరతంపరగా పెరిగాయి. న్యాయాన్ని వక్రీకరించటం, దౌర్జన్యం విశ్వరూపం దాల్చటం జరిగింది.PKTel 264.1

    అయినా ఈ దుష్టకాలంలో సయితం దేవునికీ నీతికీ నమ్మకమైన సాక్షులు లేకపోలేదు. హిజ్కియా పరిపాలనకాలంలో యూదాకు అనుభవమైన కఠిన పరిస్థితులు బలమైన ప్రవర్తన నిర్మాణంలో వారికి తోడ్పడ్డాయి. అది ఇప్పుడు వారిని దుష్టి నుంచి కాపాడే ఆశ్రయదుర్గంగా ఉంది. సత్యం, నీతి విషయంలో వారి సాక్ష్యం మనష్షేకి అతడి అనుచరులికి ఆగ్రహ కారణమయ్యింది. తమకు వ్యతిరేకంగా గళమెత్తేవారిని మట్టు పెట్టటంద్వారా వీరు తమ దుర్మార్గాన్ని కొనసాగించటానికి ప్రయత్నించారు. “మనష్షే... యెరూషలేమును ఈ కొననుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను.” 2 రాజులు 21:16.PKTel 264.2

    అతడు బలిగొన్నవారిలో మొదటివాడు యెషయా. యెహోవా ప్రతినిధిగా యెషయా యూదా ప్రజలముందు ఏబయి సంవత్సరాలికి పైగా నిలిచాడు, “మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొట్టే చర్మములను మేక చర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి.” హెబ్రీ. 11:36-38.PKTel 264.3

    మనష్షే పరిపాలనలో హింసననుభవించిన వారిలో కొందరు మందలింపును, తీర్పును ప్రకటించే వర్తమానాన్ని అందించటానికి నియుక్తులైనవారు. యూదా రాజు “ఈ హేయమైన కార్యములు” చేశాడు అన్నారు ప్రవక్తలు. ఈ చెడుతనంవల్ల అతడి రాజ్యం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతుందని, త్వరలో ఆ దేశ ప్రజలు బబులోనుకి బానిసలుగా కొనిపోబడ్డారని, “వారి శత్రువుల చేతికి వారిని” అప్పగిస్తానని దేవుడు వర్తమానం పంపాడు. 2 రాజులు 21:11,14. అయితే ఆ పరదేశంలో తనను తమ పరిపాలకుడిగా అంగీకరించేవారిని ప్రభువు పూర్తిగా విడిచి పెట్టడు. వారికి గొప్ప శ్రమ కలుగవచ్చు. అయినా ఆయన వారికి తాననుకున్న సమయంలోను తాననుకున్న రీతిగాను విడుదల కలిగిస్తాడు. ఎవరైతే ఆయనపై తమ పూర్తి విశ్వాసాన్ని ఉంచుతారో వారికి ఆయన ఖచ్చితమైన ఆశ్రయ దుర్గం.PKTel 265.1

    ప్రవక్తలు తమ హెచ్చరికల్ని హిత వచనాల్ని నమ్మకంగా అందిస్తూనే ఉన్నారు. మనషేతో నిర్భయంగా మాట్లాడారు. అతడి ప్రజల్ని హెచ్చరించారు. కాని ప్రజలు వారి వర్తమానాల్ని తోసిపుచ్చారు. తమకు ఏమి సంభవించబోతున్నదో అన్నదానికి మచ్చు తునకగా, రాజు అషూరు సైనికులకు పట్టుబడేటట్లు దేవుడు చేశాడు. వారు అతణ్ని “పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.” 2 దిన వృ. 33:11-13. అయితే ఈ పశ్చాత్తాపం విశేషమైనదే అయినా ఆలస్యంగా రావటంతో విగ్రహారాధక ప్రభావాల నుంచి రాజ్యాన్ని కాపాడటం సాధ్యంకాలేదు. అనేకులు పడిపోయి మళ్లీ లేవలేకపోయారు.PKTel 265.2

    మనష్షే ప్రారంభించిన ప్రమాదకరమైన మతభ్రష్టత ఎవరి ప్రవర్తనల్ని రూపుదిద్ది తిరుగులేని రీతిగా ఎవర్ని నాశనం చేసిందో వారిలో మనష్షే కుమారుడున్నాడు. అతడు తన ఇరవై రెండో ఏట సింహాసనానికి వచ్చాడు. ఆమోను రాజుగురించి లేఖనం ఇలా అంటున్నది : “అతడు తన తండ్రియైన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను.” (2 రాజులు 21:21,22). “తన తండ్రియైన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకును ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను.” దుష్టుడైన ఈ రాజు ఎక్కువ కాలం పరిపాలించటానికి దేవుడు అనుమతించలేదు. దైవ భీతి ఏమాత్రం లేని అతడు రాజ్యపాలనకు వచ్చిన రెండేళ్లలోనే తన రాజభవనంలోనే తన సేవకుల చేతిలో హత్యకు గురి అయ్యాడు. “దేశ జనులు... అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.” 2 దినవృ. 33:23,25.PKTel 265.3

    ముప్పయి ఒక సంవత్సరాలు పరిపాలించాల్సి ఉన్న యోషీయా రాజ్యపాలన ప్రారంభించటంతో, తమ విశ్వాసాన్ని పవిత్రంగా కాపాడుకున్నవారు దేశంలోని అవాంఛనీయ పరిస్థితులకు అడ్డుకట్ట పడ్తుందని నిరీక్షించారు. ఎందుకంటే ఎనిమిదేళ్ల ప్రాయం గలవాడే అయినా కొత్తరాజు దైవభక్తుడు. ఆరంభంనుంచి “అతడు యెహోవా దృష్టికి యధార్ధముగా నడుచుచు కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.” 2 రాజులు 22:2. దుర్మార్గుడైన రాజుకు పుట్టి తండ్రి అడుగుజాడల్లో పయనించటానికి ఎన్నో శోధనల నడుమ, సన్మార్గంలో నడవటానికి ప్రోత్సహించే వారు ఎక్కువమంది లేకపోయినా, యోషీయా ఇశ్రాయేలు దేవునికి నమ్మకంగా నిలిచాడు. గడచిన తరాల దోషాల్ని గుర్తుంచుకుని తన తండ్రి, అతడి తండ్రి స్థాయికి దిగజారే బదులు నీతిగా జీవించటానికి నిశ్చయించుకున్నాడు. అతడు “కుడియెడమలకు తిరగక” సరిగా ప్రవర్తించాడు. గొప్ప బాధ్యతను నిర్వహించాల్సిన వ్యక్తిగా అతడు ఇశ్రాయేలు పరిపాలనకు దేవుడిచ్చిన ఉపదేశాన్ని అనుసరించటానికి తీర్మానించుకున్నాడు. అతడి విధేయతనుబట్టి దేవుడు అతణ్ని తన నామ ఘనతకోసం ఉపయోగించుకున్నాడు.PKTel 266.1

    యోషీయా పరిపాలన ప్రారంభమైనప్పుడు, దానికి అనేక సంవత్సరాల ముందు కూడా, దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలు ఎప్పటికైనా నెరవేరేనా అని యూదయలో ఆందోళన చెందుతున్న కొందరు ప్రశ్నిస్తున్నారు. తాను ఎన్నుకున్న ప్రజల విషయంలో దేవుని సంకల్పాలు నెరవేరటం మానవ దృష్టికి అసాధ్యంగా కనిపించవచ్చు. పూర్వ శతాబ్దాల మతభ్రష్టత కాలగమనంతో పటిష్ఠమయ్యింది. పన్నెండు గోత్రాల్లోని పది గోత్రాలు అన్యజనుల మధ్యకు చెదరిపోయాయి. యూదాగోత్రం బెన్యామోను గోత్రం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఇవికూడా జాతీయంగా నైతిక నాశనం అంచున ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సొలొమోను నిర్మించిన దేవాలయం ఏ పట్టణంలో ఉందో, ఏ పట్టణంపై వారి జాతీయ ఔన్నత్య నిరీక్షణ కేంద్రీకృతమై ఉందో ఆ సుందర యెరూషలేము సర్వనాశన మౌతుందని ప్రవక్తలు ప్రవచించటం మొదలు పెట్టారు. తనను విశ్వసించిన వారికి విమోచన కలిగించటమన్న తన సంకల్పంనుంచి వైదొలగ టానికి దేవుడు ఆయత్తమౌతున్నాడా? నీతిమంతుల హింసాకాండ సుదీర్ఘంగా అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతున్నా దుష్టులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నట్లు కనపడుతున్నా, దేవునికి నమ్మకంగా నిలబడిన భక్తులు మంచి రోజులకోసం ఇంకా నిరీక్షించవచ్చా?PKTel 266.2

    ఆందోళకరమైన ఈ ప్రశ్నల్ని వేస్తున్నది ప్రవక్త హబక్కూకు. తన దినాల్లోని భక్తుల పరిస్థితిని చూసి తన హృదయ భారాన్ని ఈవిధంగా వ్యక్తం చేస్తున్నాడు. “యెహోవా, నేను మొట్టి పెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱ పెట్టినను నీవు రక్షింపక యున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవే ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి. జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్దకమాయెను. న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోవు చున్నది.” హబక్కూకు. 1:2-4.PKTel 267.1

    నమ్మకమైన తన బిడ్డల మొరను ఆయన ఆలకించి స్పందించాడు. అన్య దేవతలను సేవించటానికి తననుంచి తొలగిపోయిన జాతిపై తన తీర్పుల్ని పంపటానికి ధృఢ నిశ్చయంతో ఉన్నానని తాను ఎన్నుకున్న వక్తద్వారా ఆయన వెల్లడి చేశాడు. భవిష్యత్తును గురించి అప్పుడు విచారణ చేస్తున్న వారి జీవిత కాలంలోనే భూమిని పరిపాలించే జాతుల వ్యవహారాల తీరుతెన్నుల్ని అద్భుతంగా మార్చి బబులోనీయుల్ని ఆయన ప్రాబల్యంలోకి తేనున్నాడు. “ఘోరమైన భీకరజన” మైన ఈ కల్దీయులు దేవుడు నియమించిన కొరడాగా యూదయ దేశంపై హఠాత్తుగా పడనున్నారు. 7వ వచనం. యూదాలోని అధిపతుల్ని ప్రజలలో శ్రేష్టుల్ని చెరపట్టి బందీలుగా తీసుకుపోనున్నారు. యూదా పట్టణాల్ని, గ్రామాల్ని, పంట పొలాల్ని ధ్వంసం చేయాల్సి ఉంది. అందులోనిది ఏదీ మిగలకూడదు.PKTel 267.2

    ఈ భయంకర తీర్పులో సయితం దేవుని సంకల్పం ఏదోవిధంగా నెరవేరుందన్న నమ్మకంతో హబక్కూకు వెల్లడయిన యెహోవా చిత్రానికి విధేయుడయ్యాడు. “యెహోవా నా దేవా, నా పరిశుద్ద దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా?” అంటూ విస్మయం ఆ మీదట తన తక్షణ భవిష్యత్తును అధిగమించిన విశ్వాసంతో, తన్ను విశ్వసిస్తున్న బిడ్డలపట్ల దేవుని ప్రేమను వ్యక్తంచేసే వాగ్దానాల్ని గట్టిగా పట్టుకుని, “మేము మరణము నొందము” అన్నాడు ప్రవక్త. 12వ వచనం. ఈ విశ్వాస ప్రకటనతో తన సంగతి, విశ్వసిస్తున్న ప్రతీ ఇశ్రాయేలు సంగతి కృపామయుడైన దేవుని చేతులకు అప్పగించాడు.PKTel 267.3

    బలీయమైన విశ్వాసం అనుభవంలోకి రావడం హబక్కూకుకి ఇది మొదటిసారి కాదు. ఓ సందర్భంలో భవిష్యత్తును గురించి దీర్ఘంగా ఆలోచించేటప్పుడు అతడిలా అన్నాడు, “ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురము మిదను కనిపెట్టుకొని యుందును.” దయగల ప్రభువు ఇలా బదులు పలికాడు, “చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును. వారు యధార్ధపరులు కాక తమలోతాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రదుకును.” హబ. 2:1-4.PKTel 268.1

    తీవ్ర శ్రమలు హింస దినాల్లో హబక్కూకుని పరిశుద్దులు భక్తుల్ని బలపర్చిన విశ్వాసమే నేడు దైవ ప్రజల్ని నిలబెడ్తుంది. కన్ను కనిపించని చీకటి గడియల్లో, దుర్భర పరిస్థితుల నడుమ క్రైస్తవ విశ్వాసి వెలుగుకి శక్తికి నిలయమైన ప్రభువుమీద ఆధార పడవచ్చు. విశ్వాసం ద్వారా అతడి నిరీక్షణ అతడి మనోధైర్యం దినదినం నూతనం కావచ్చు. “నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రదుకును.” దేవుని సేవలో నిరుత్సాహానికి, ఊగిసలాటకి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే తనను నమ్ముకుంటారో వారి ఉన్నతాశయాల్ని ప్రభువు నెరవేర్చటమే కాదు ఇంకా ఎక్కువే చేస్తాడు. వారికి ఆయా సమయాల్లో ఏర్పడే అవసరాలికి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు.PKTel 268.2

    శోధనకు గురి అయిన ప్రతీ ఆత్మ నిమిత్తం ఏర్పాటైన సదుపాయం గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తున్నాడు. అతడికి దేవుడు ఈ వాగ్దానం చేశాడు, “నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.” కృతజ్ఞతతో నిండిన ఆ దైవ సేవకుడు విశ్వాసంతో ఇలా స్పందించాడు, “క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను; కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.” 2 కొరి. 12:9,10.PKTel 268.3

    ప్రవక్తలు అపొస్తలులు ఏ విశ్వాసం గురించి సాక్ష్యం ఇచ్చారో దాన్ని మనం పెంపొందించుకోవాలి. అది దేవుని వాగ్దానాల్ని విశ్వసించి ఆయన నియమించిన సమయంలోను మార్గంలోను విడుదలకు వేచి ఉండే విశ్వాసం. కచ్చితమైన ప్రవచన వాక్యం రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా రక్షకుడు యేసుక్రీస్తు మహిమాన్వితమైన రాకతో చివరి నెరవేర్పు జరుగుతుంది. నిరీక్షణ సమయం దీర్ఘంగా కనిపించవచ్చు. పరిస్థితులు నిరాశతోనిండి ఆత్మను క్షోభింపజెయ్యవచ్చు. విశ్వాస స్ఫూర్తిదాతలు అనేకులు దారితప్పి పడిపోవచ్చు. అయినా గొప్ప మతభ్రష్టత సమయంలో యూదాను ధైర్యపర్చి ప్రోత్సహించిన ప్రవక్తతో గళం కలిపి “యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక” అని మనమందరం విశ్వాసంతో ప్రకటిద్దాం. ( హబ. 2:20). ఉత్సాహభరితమైన ఈ వర్తమానాన్ని నిత్యం జ్ఞాపకముంచుకుందాం, “ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును.... నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రదుకును.” 3,4 వచనాలు.PKTel 268.4

    “యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా
    నీ కార్యము నూతన పరచుము
    సంవత్సరములు గతించుచుండగా దానిని
    తెలియజేయుము
    కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము
    తెచ్చుకొనుము”

    “దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు
    పరిశుద్ద దేవుడు పారానులోనుండి వేంచేయు
    చున్నాడు
    ఆయన మహిమ ఆకాశమండలమంతటను
    కనబడుచున్నది
    భూమియు ఆయన ప్రభావముతో నిండియున్నది
    సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడు
    చున్నది
    ఆయన హస్తమునుండి కిరణములు బయలువెళ్లు
    చున్నవి
    అచ్చట ఆయన బలము దాగియున్నది
    ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి
    ఆయన పాదములవెంట అగ్ని మెరుపులు వచ్చు
    చున్నవి
    PKTel 269.1

    ఆయన నిలువబడగా భూమి కంపించును
    ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలగు
    దురు
    ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు
    అణగును
    పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి
    గించువాడు.”

    “నీ జనులను రక్షించుటకు నీవు బయలు దేరుచున్నావు
    నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు

    దేరుచున్నావు”
    “అంజూరపు చెట్లు పూయకుండినను
    ద్రాక్షచెట్లు కాపులేకయుండినను
    గొట్టెలు దొడ్డిలో లేకపోయినను
    పాకలలో పశువులు లేకపోయినను
    నేను యెహోవాయందు ఆనందించెదను
    నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో
    షించెదను
    ప్రభువగు యెహోవాయే నాకు బలము
    ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును
    ఉన్నత స్థలములమీద ఆయన నన్ను నడవచేయును.”
    PKTel 270.1

    హబ. 3:2-6, 13,17-19.

    ఉజ్వల నిరీక్షణ, భవిష్యత్ విజయం ప్రస్తుత తీర్పుల్ని గురించిన వర్తమానం హబక్కూకు ఒక్కడి ద్వారా మాత్రమే ఇవ్వటం జరగలేదు. అడ్డూ అదుపూ లేకుండా కొనసాగే మతభ్రష్టత పర్యవసానాల్ని వివరిస్తూ సంఘం దృష్టిని ఉజ్వలమైన భవిష్యత్తుపై నిలుపుతూ ప్రభువు యోషీయా పరిపాలనా కాలంలో జెఫన్యాద్వారా వర్తమానం పంపించాడు. మారుమనసు పొందని ప్రపంచంమీద కూడా యూదాను గూర్చి అతడు వెలువరించిన దేవుని తీర్పులు, క్రీస్తు రెండోరాక సమయంలోనూ అదే ఉధృతితో పడనున్నాయి :PKTel 270.2

    “యెహోవా మహాదినము సమిపమాయెను,
    యెహోవా దినము సమిపమై అతి శీఘ్రముగ
    వచ్చుచున్నది
    ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది పరాక్రమశాలురు మహా రోదనము చేయుదురు.”

    “ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును
    మహా నాశనము కమ్ము దినము
    అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము”

    “మేఘములును గాఢాంధకారమును కమ్ముదినము
    ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను
    ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ద ఘోషయు
    బాకానాదమును వినబడును.”
    PKTel 270.3

    జెఫ. 1:14-16.

    “జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారిమీదికి ఉపద్రవము రప్పించబోవుచున్నాను. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు; వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, కోపాగ్నిచేత భూమియంతయు దహింపబడును; హఠాత్తుగా ఆయన భూ నివాసులందరిని సర్వనాశనము చేయబోవు చున్నాడు.” 17,18 వచనాలు.PKTel 271.1

    “సిగ్గుమాలిన జనులారా, కూడిరండి
    పొట్టు గాలికి ఎగురునట్లు సమయము
    గతించుచున్నది
    విధి నిర్ణయము కాకమునుపే
    యెహోవా కోపాగ్ని మిమిదికి
    రాకమునుపే
    మిమ్ము శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము
    రాకమునుపే కూడిరండి.”

    “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల
    ననుసరించు సమస్త దీనులారా,
    యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయము
    గలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ
    ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”
    PKTel 271.2

    జెఫ. 2:1-3.

    “ఆ కాలమున నిన్ను హింస పెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏయే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమిమీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు” జెఫ. 3:19-20.PKTel 272.1

    “సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయుడి;
    ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి;
    యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో
    సంతోషించి గంతులు వేయుడి.
    తాను మాకు విధించిన శిక్షను యెహోవా
    కొట్టివేసియున్నాడు
    మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు;
    ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మి మధ్య ఉన్నాడు;
    ఇకమీదట మీకు అపాయము సంభవింపదు.”

    “ఆ దినమున జనులు మితో ఇట్లందురు - యెరూషలేమా,
    భయపడకుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము
    నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు;
    ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును
    ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును
    నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీయందలి
    సంతోషముచేత ఆయన హర్షించును.”
    PKTel 272.2

    14-17 వచనాలు.

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents