Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    52 - అవకాశాన్ని అందిపుచ్చుకున్న మనిషి

    హెబ్రీ బందీల్లో ఒకడైన నెహెమ్యా పారసీక ఆస్థానంలో పలుకుబడి గౌరవంగల పదవిని నిర్వహించాడు. రాజుకి పానదాయకుడైన అతడు రాజు సముఖంలోకి స్వేచ్ఛగా వెళ్లేవాడు. తన హోదానుబట్టి, తన ప్రతిభాపాటవాలు, విశ్వసనీయతనుబట్టి అతడు రాజుకి మంచి మిత్రుడు సలహాదారు అయ్యాడు. రాజు ప్రాపకాన్ని పొందినవాడైనా, ప్రభావం వైభవంగలవాడైనా, తన దేవుణ్ని, తన ప్రజల్ని అతడు మర్చిపోలేదు. ప్రగాఢమైన ఆసక్తితో అతడి హృదయం యెరూషలేము తట్టు తిరిగింది. ఆ పట్టణం ప్రగతితో అతడి ఆశలు సంతోషానందాలు ముడిపడి ఉన్నాయి. పారసీక ఆస్థానంలో తన నివాసం ద్వారా తాను పిలవబడనున్న పనికి సిద్దం చెయ్యబడ్డ ఈ వ్యక్తిద్వారా పితృదేశంలో ఉన్న తన ప్రజలకు శుభాలు ఆశీస్సులు చేకూర్చాలని దేవుడు ఉద్దేశించాడు. PKTel 441.1

    యెరూషలేముకి కష్టదినాలు వచ్చాయని యూదానుంచి వచ్చిన దూతలద్వారా ఈ హెబ్రీ దేశభక్తుడు తెలుసుకున్నాడు. చెరనుంచి తమ దేశానికి తిరిగివెళ్లిన ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని నిందలకు గురి అవుతున్నారని విన్నాడు. ఆలయాన్ని పట్టణంలోని కొన్ని భాగాల్ని తిరిగి కట్టడం జరిగింది. కాని పునరుద్దరణ పనికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆలయ సేవలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారం ఇంకా చాలామట్టుకి శిధిలమై ఉండటంతో ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు.PKTel 441.2

    దుఃఖంలో మునిగిపోయిన నెహెమ్యాకు తినటానికి తాగటానికి మనసులేదు. అతడు “కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము” ఉన్నాడు. తన దుఃఖంలో అతడు తన పరలోక సహాయకుడి తట్టు తిరిగాడు. “ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని” అన్నాడు. తన పాపాల్ని తన ప్రజల పాపాల్ని ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలీయుల కార్యాన్ని కొనసాగించమని, వారిలో ధైర్యం నింపి వారిని బలోపేతం చెయ్యమని, యూదాలోని పాడుపడ్డ స్థలాల్ని బాగుచెయ్యటానికి వారికి సహాయం చెయ్యమని దేవునితో విజ్ఞాపన చేశాడు.PKTel 441.3

    నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు అతడి విశ్వాసం, అతడి ధైర్యం పటిష్టమయ్యాయి. అతడి నోరు పరిశుద్ధ వాదనలతో నిండింది. ఇప్పుడు మళ్లీ తనవద్దకు తిరిగి వచ్చిన తన ప్రజలు బలహీనులుగా ఉండి హింసకు గురి కావటానికి విడువబడితే దేవుని నామానికి అపకీర్తి కలుగుతుందని సూచించి తన ఈ వాగ్దానాన్ని నెరవేర్చవలసిందిగా దేవున్ని అర్థించాడు, “అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడనుండి సహా మిమ్మును గూర్చి, నా నామము ఉండుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదను.” ద్వితి. 4:29-31 చూడండి. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించక ముందు ఈ వాగ్దానాన్ని దేవుడు మోషేద్వారా ఇశ్రాయేలీయులకిచ్చాడు. శతాబ్దాలు తరబడి ఇది మార్పులేకుండా నిలిచి ఉంది. దేవుని ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపంతోను విశ్వాసంతోను ఆయన వద్దకు తిరిగి వచ్చారు. ఆయన వాగ్దానం నెరవేరుతుంది.PKTel 442.1

    నెహెమ్యా తరచుగా తన ప్రజల తరపున హృదయపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేసేవాడు. అయితే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఓ పరిశుద్ధ ఉద్దేశం అతడి మనసులో ఏర్పడింది. రాజు సమ్మతిని, పరికరాలు సామగ్రిని సమకూర్చటానికి అవసరమైన సహాయాన్ని పొందగలిగితే, యెరూషలేము గోడ పునర్నిర్మాణాన్ని, ఇశ్రాయేలు జాతీయ బలాన్ని పునరుద్దరించటాన్ని తానే చేపట్టాలని నిశ్చయించుకున్నాడు. తన ప్రణాళిక సాకారానికి తాను రాజు అనుగ్రహం పొందేటట్లు నడిపించమని ప్రభువుని వేడుకున్నాడు. ఇలా ప్రార్థించాడు, “ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుము.”PKTel 442.2

    రాజుకి తన మనవిని విన్నవించటానికి అనుకూల సమయం కోసం నెహెమ్యా నాలుగు మాసాలు నిరీక్షించాడు. ఈ కాలంలో తన హృదయం వేదనతో కుమిలి పోతున్నా, రాజు సముఖంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించటానికి ప్రయత్నించాడు. వినోదాలు వైబోగాలతో కళకళలాడే ఆ విలాస మందిరాల్లో అందరు చలాకీగా ఉల్లాసంగా కనిపించాలి. రాజుకి సపర్యలు చేసేవారు తమ ముఖాల్లో విచార ఛాయలు కనిపించనియ్యకూడదు. మనుషులికి కనిపించకుండా విశ్రాంతి తీసుకుంటున్న సమయాల్లో అతడు చేసిన అనేక ప్రార్థనలు, పాపపు ఒప్పుకోళ్లు కార్చిన కన్నీళ్లు దేవుడు దేవదూతలు విన్నారు. చూశారు.PKTel 442.3

    తుదకు ఆ దేశభక్తుడి హృదయాన్ని కుంగదీస్తున్న దుఃఖాన్ని అతడు ఇక దాచుకో లేకపోయాడు. నిద్రలేనిరాత్రులు ఆందోళనతో నిండిన దినాల ఛాయలు అతడి ముఖంపై కనిపించాయి. సొంత క్షేమం నిమిత్తం, ముఖ వైఖర్లు చదవటానికి, వేషధారణ వెనక ఏమున్నదో గ్రహించటానికి రాజు అలవాటు పడ్డాడు. తన పానదాయకుణ్ని చూసి అతణ్ని ఏదో రహస్య సమస్య బాధిస్తున్నట్లు గ్రహించాడు. రాజు “నీకు వ్యధలేదు గదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది” అన్నాడు.PKTel 442.4

    ఆ ప్రశ్న నెహెమ్యాకు భయం పుట్టించింది. పైకి తన సేవ చేస్తున్నట్లు కనిపిస్తూ, అతడు బాధపడూ దూరంగా ఉన్న తన వారి గురించి ఆలోచిస్తున్నాడని విన్నప్పుడు రాజుకి కోపం రాదా? ఇలా అపరాధం చేసిన వ్యక్తి ప్రాణం కోల్పోడా? యెరూషలేము బలాన్ని పునరుద్దరించాలన్న తన ప్రియమైన ప్రణాళిక బుట్టదాఖలుకు సిద్ధంగా ఉందా? “నేను మిగుల భయపడితిని అని రాస్తున్నాడు. వణుకుతున్న పెదవులతో నీళ్లునిండిన కళ్లతో తన చింతకు కారణమేంటో వెల్లడించాడు. “రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా?” అని రాజుకి సమాధానమిచ్చాడు. PKTel 443.1

    యెరూషలేము పరిస్థితిని గూర్చిన కథనం దురాగ్రహాన్ని రేపకుండా రాజులో సానుభూతిని పుట్టించింది. రాజు అడిగిన మరో ప్రశ్న. నెహెమ్యా ఎదురుచూస్తున్న అవకాశాన్ని అతడికిచ్చింది : “ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు?” ఆ దైవ భక్తుడు అర్తహషస్త కన్న అధికుడైన ప్రభువును సంప్రదించేవరకు రాజుకు బదులివ్వటానికి సాహసించలేదు. అతడు ఓ పరిశుద్ద కార్యాన్ని నిర్వహించనున్నాడు. అందులో రాజు సహాయ సహకారాలు ఎంతో అవసరం. రాజు ఆమోదాన్ని సహాయాన్ని సంపాదించే విధంగా విషయాన్ని రాజుకి సమర్పించటం మిద ఎంతో ఆధారపడి ఉంటుందని అతడు గుర్తించాడు. “నేను ఆకాశమందలి దేవునికి ప్రార్ధన” చేశాను అన్నాడు. ఆ చిన్న ప్రార్థనలో నెహెమ్యా రాజులకు రాజు సమక్షంలోకి వెళ్లి నదుల నీళ్లను మళ్లించేటట్లు హృదయాల్ని మళ్లించగల ఓ మహత్తర శక్తిని తన పక్కకు తిప్పుకున్నాడు. PKTel 443.2

    ఇతరత్రా రూపాల్లో ప్రార్థన అసాధ్యమైన పరిస్థితుల్లో క్రైస్తవుడికి అందుబాటులో ఉన్న వనరు... నెహెమ్యా తన అవసర గడియలో ప్రార్థన చేసినట్లు ప్రార్థన చెయ్యటం. ఉపాధి సంపాదన కృషిలో కష్టపడి పనిచేసేటప్పుడు, దిక్కుతోచక తికమక పడుతున్న పరిస్థితుల్లో మార్గ నిర్దేశం కోసం దేవునికి ఈరకంగా విజ్ఞప్తి పంపవచ్చు. నీటి పైన నేలపైన నింగిలోన ప్రయాణం చేసేటప్పుడు ప్రమాద పరిస్థితులు నెలకొన్నప్పుడు అలా పరలోక దేవుని కాపుదలకు పరిరక్షణకు ప్రయాణికులు తమ్మును తాము అప్పగించుకోవాలి. అకస్మాత్తుగా సంభవించే సమస్యలు ప్రమాదాల్లో సహాయంకోసం మనసులో దేవునికి ఓ వినతి పంపవచ్చు. విశ్వసించే నమ్మకమైన తన బిడ్డలు తనను వేడుకున్నప్పుడల్లా వారికి సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ప్రతీ సందర్భంలోను ప్రతీ పరిస్థితిలోను దుఃఖం, ఆందోళన భారం కింద నలిగిపోతున్న ఆత్మ, లేక శోధన దాడికి గురి అయిన ఆత్మ నిబంధనను కాపాడే దేవుని అభయం, అండదండలు, సహాయం పొందవచ్చు.PKTel 443.3

    రాజులకు రాజైన దేవునికి ప్రార్థన చేసిన ఆ స్వల్ప కాలంలో ఆస్థానంలో తన బాధ్యతలనుంచి కొంతకాలం సెలవు తీసుకోవాలన్న తన కోరికను అర్తహషస్త రాజుకు చెప్పటానికి నెహెమ్యా ధైర్యం తెచ్చుకున్నాడు. యెరూషలేములోని పాడుపడిన స్థలాల్ని కట్టి దాన్ని మళ్లీ ప్రాకారంగల పట్టణంగా చెయ్యటానికి అధికారాన్ని కోరాడు. ఈ మనవిమిదే ఇశ్రాయేలు జాతికి సంబంధించినంతవరకు ప్రాముఖ్యమైన పరిణామాలు ఆధారితమై ఉన్నాయి. “నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవిని ఆలకించెను” అని నెహెమ్యా అన్నాడు.PKTel 444.1

    తాను కోరిన సహాయాన్ని పొందిన నెహెమ్యా ఆ పథకం విజయానికి ప్రాజ్ఞతతో దూరాలోచనతో ఏర్పాట్లు చేయటానికి పూనుకున్నాడు. ఆ కార్య సాధనకు దోహద పడే ఏ ముందస్తు జాగ్రతను అతడు నిర్లక్ష్యం చెయ్యలేదు. తన దేశసులికి సయితం తన ఉద్దేశాల్ని వెల్లడి చెయ్యలేదు. అతడి విజయాన్ని అనేకులు హర్షిస్తారని ఎరిగినా కొందరు అవివేకంగా వ్యవహరించటం వల్ల శత్రువులకు అసూయ పుట్టించి ఆ పథకం వైఫల్యానికి దోహదపడవచ్చునని భయపడ్డాడు.PKTel 444.2

    తాను చేసిన మనవికి రాజు సానుకూలంగా స్పందించటంతో నెహెమ్యా ధైర్యం తెచ్చుకుని మరింత సహాయాన్ని అర్థించాడు. తన కర్తవ్యానికి ఆదరణ అధికారం చేకూరేందుకు, ప్రయాణంలో భద్రతను కల్పించేందుకు సైనిక బృందం తోడును కోరి పొందాడు. యూదా దేశానికి వెళ్లటానికి యూఫ్రటీసు నది దాటిన తర్వాత తాము దాటాల్సిన సంస్థానాల అధికారులికి రాజువద్దనుంచి లేఖల్ని తీసుకున్నాడు. నెహెమ్యాకు అవసరమైనంత కలప రాజు అడవినుంచి ఇవ్వవలసిందంటూ లెబానోను పర్వత ప్రాంతంలోని అడవుల అధికారిని ఆదేశిస్తూ ఒక ఉత్తరం రాజువద్దనుంచి తీసుకున్నాడు. తన బాధ్యతనుమించి వ్యవహరించాడన్న ఫిర్యాదు రాకుండేందుకు తన అధికారాన్ని ఆధిక్యతల్ని స్పష్టంగా రాజు నిర్వహించేటట్లు నెహెమ్యా జాగ్రత్తలు తీసుకున్నాడు. PKTel 444.3

    జ్ఞానయుతమైన దూరాలోచన, నిర్దిష్టమైన కార్యాచరణ క్రైస్తవులికి ఒక పాఠం. దేవుని బిడ్డలు విశ్వాసంతో ప్రార్థించటం మాత్రమే కాదు కష్టపడి శ్రద్దతో పనిచెయ్యాలి. వారు అనేక కష్టాల్ని ఎదుర్కుంటూ తరచు తమపక్షంగా పనిచేసే దేవునికి ఆటంకం కలిగిస్తారు. ఎందుకంటే వివేకానికి శ్రమతోకూడిన పనికి మతంతో సంబంధంలేదని వారు భావిస్తారు. నెహెమ్యా దేవునిముందు ఏడ్చి ప్రార్థించటంతోనే తన బాధ్యత తీరిపోయిందనుకోలేదు. అతడు తన మనవులతో పరిశుద్ద కృషిని మేళవించాడు. తాను నిమగ్నమైఉన్న కార్య సాఫల్యానికి ప్రార్థన పూర్వకంగా ప్రతీ ప్రయత్నం చేశాడు. యెరూషలేము గోడ పునర్నిర్మాణమప్పటిలాగే నేడు కూడా పరిశుద్ద కార్యాల పురోగతికి జాగరూకతతోకూడిన పరిగణన, నిర్దుష్ట ప్రణాలికలు అతిముఖ్యం.PKTel 444.4

    నెహెమ్యా అనిశ్చితిపై ఆధారపడలేదు. తనకు కొరవడ్డ ఆర్థిక వనరులు ఇచ్చే సామర్థ్యం గలవారిని అడిగి సేకరించాడు. సువార్త సేవకు ఇవ్వటానికి, తన వస్తువులికి సొంతదారులైన వారి హృదయాల పై పనిచేసి నిధులు ఇప్పించటానికి ప్రభువు ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఇవ్వటానికి ఆయన ప్రేరేపించే వ్యక్తుల ఆర్థిక సహాయాన్ని దేవుని సేవ చేసేవారు వినియోగించుకోవాలి. ఆయన ఇవ్వటానికి మనుషుల్ని ప్రేరేపిస్తాడు. సత్యకాంతి అనేక చీకటి దేశాల్లో ప్రకాశించటానికి ఈ కానుకలు మార్గాలు తెరవవచ్చు. దాతలు క్రీస్తును విశ్వసించకపోవచ్చు. ఆయన వాక్యం వారికి తెలియకపోవచ్చు. అయినా ఈ కారణంవల్ల వారి కానుకల్ని నిరాకరించకూడదు.PKTel 445.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents