Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    45 - బందీల తిరిగిరాక

    కోరేషు సైన్యం వచ్చి బబులోను గోడలముందు మోహరించటం యూదులకు తమ విడుదల సమయం సమీపించిందని గుర్తు. కోరేషు జననానికి శతాబ్దం పైచిలుకు ముందే పరిశుద్ధ లేఖనం అతణ్ని పేరు పెట్టి ప్రస్తావించి, చెరలో ఉన్న దైవప్రజల విడుదలకు మార్గం సిద్ధంచేసే క్రమంలో అతడు బబులోను పట్టణాన్ని అకస్మాత్తుగా పట్టుకోటానికి చేయాల్సిన పనినిగూర్చి ఓ రికార్డును రూపొందించింది. యెషయా ద్వారా దేవుడు ఇలా పలికాడు :PKTel 385.1

    “అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని యున్నాను. నేను... ద్వారములు అతనియెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు - నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగుల గొట్టెదను. ఇనుప గడియలను విరుగగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనేయని నీవు తెలిసికొనునట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.” యెష. 45:1-3.PKTel 385.2

    నది జలాల్ని పక్కకు మళ్లించి అలా ఏర్పడ్డ మార్గంద్వారా వెళ్లి, కావలి భటులు రక్షణ లేకుండా అజాగ్రత్తగా విడిచిపెట్టిన లోపలిద్వారాలగుండా పారసీక చక్రవర్తి సైన్యం బబులోను రాజధాని నగరం నడిబొడ్డున ప్రవేశించటం, హింసకుల ఆకస్మిక నాశనాన్ని గూర్చిన యెషయా ప్రవచనం అక్షరాల నెరవేర్పని యూదులు నమ్మటానికి చాలినంత నిదర్శనం. తమపక్షంగా దేవుడు దేశాల వ్యవహారాల్ని తీర్చిదిద్దుతున్నాడనటానికి ఇది వారికి ఓ తిరుగులేని సూచన కావలసింది. ఎందుకంటే బబులోను పట్టుబడి నాశనమయ్యే తీరును నిర్దేశిస్తున్న ప్రవచనంతో ఈ మాటలు జతపడి ఉన్నాయి :PKTel 385.3

    “కోరెషుతో - నా మంద కాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో - నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను.” “నీతినిబట్టి కోరెషును రేపితిని. అతని మార్గములన్నియు సరాళము చేసెదను. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును.” యెష. 44:28; 45:13.PKTel 385.4

    బందీలు తమ శీఘ్ర విడుదల నిరీక్షణను ఆధారం చేసుకోటానికి కేవలం ఈ ప్రవచనాలే కాక యిర్మీయా ప్రవక్త రచనలు వారికి అందుబాటులో ఉన్నాయి. బబులోనులో నుంచి ఇశ్రాయేలు పునరుద్ధరణకు ముందు గతించాల్సిన కాలావధిని ఈ రచనల్లో స్పష్టంగా పేర్కోటం జరిగింది. తన సేవకుడిద్వారా ప్రభువు ఇలా ముందే చెప్పాడు, “డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగ నుండనట్లు నియమింతును.” యిర్మీ. 25:12. విశ్వాసంతో చేసిన ప్రార్థనకు జవాబుగా ప్రభువు వారిపై కనికరం చూపిస్తాడు. “నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు ఎచ్చటినుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.” యిర్మీ. 29:14.PKTel 386.1

    తన ప్రజల నిమిత్తం దేవుని సంకల్పాన్ని సూచించే ఈ ప్రవచనాల్ని ఇలాంటి ప్రవచనాల్ని దానియేలు అతడి మిత్రులు తరచుగా అధ్యయనం చేసేవారు. వేగంగా సంభవిస్తున్న ఘటనలు జాతుల నడుమ మహాశక్తిగల దైవహస్తం పనిచెయ్యటాన్ని సూచించటంతో దేవుడు ఇశ్రాయేలుకిచ్చిన వాగ్దానాల్ని దానియేలు ఇప్పుడు ప్రత్యేకంగా పరిశీలించాడు. ప్రవచనవాక్యంపై అతడికున్న విశ్వాసం పరిశుద్ద రచయితలు ప్రవచించిన అనుభవాల్లోకి అతణ్ని నడిపించింది. ప్రభువిలా ప్రకటించాడు, “బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నే నెరుగుదును. రాబోవు కాలమందు మికు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు... మీరు నాకు మొఱ్ఱ పెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు.” 10-13 వచనాలు.PKTel 386.2

    బబులోను పతనానికి కొంచెం ముందు, దానియేలు ఈ ప్రవచనాల్ని గురించి ధ్యానిస్తూ, కాలాన్ని గూర్చిన అవగాహన కోసం దేవున్ని అర్థిస్తున్నప్పుడు రాజ్యాల ఉత్థాన పతనాల్ని గురించి దేవుడు కొన్ని దర్శనాల్ని పంపాడు. దానియేలు గ్రంథం ఏడో అధ్యాయంలో దాఖలైనట్లు మొదటి దర్శనంతో దాని భావంకూడా ఇవ్వటం జరిగింది. అయినా ప్రవక్తకు అంతా స్పష్టం కాలేదు. అప్పటి తన అనుభవం గురించి ప్రవక్త ఇలా రాశాడు, “మనస్సునందు అధికమైన కలతగలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమాయెను. అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని.” దాని. 7:28.PKTel 387.1

    ఇంకొక దర్శనంద్వారా భవిష్యత్ సంభవాలపై ఇంకా కొంత వెలుగును ప్రకాశింప జెయ్యటం జరిగింది. ఈ దర్శనం చివరే దానియేలు ఈ మాటలు విన్నాడు, “పరిశుద్దులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్దునితో మరియొక పరిశుద్దుడు మాటలాడుచుండెను ఏమనగా... యీ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు?” దాని. 8:13. “రెండువేల మూడు వందల దినముల మట్టుకే... అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును.” అన్న సమాధానం అతణ్ని గలిబిలి పర్చింది. (14వ వచనం). ఆ దర్శన భావం కోసం పట్టుదలతో ప్రార్థించాడు. యిర్మీయా ప్రవచించిన డెబ్బయి సంవత్సరాల చెరకు, దర్శనంలోని పరిశుద్దుడు తాను వింటుండగా చెప్పినట్లు దేవుని ఆలయ పవిత్రతకు ముందు రెండువేల మూడు వందల సంవత్సరాలు గతించాలన్న దానికి మధ్యగల సంబంధం దానియేలుకి అవగాహన కాలేదు. గబ్రియేలు దూత దాని భావాన్ని కొంతమేరకు మాత్రమే చెప్పాడు. అయినా “అది యనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును” అన్న మాటలు విన్నప్పుడు అతడు మూర్చిల్లాడు. తన అనుభవం గురించి దానియేలు ఇలా దాఖలు చేశాడు, “దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనైయుంటిని. పిమ్మట నేను కుదురై రాజుకొరకు చేయవలసిన పని చేయుచు వచ్చితిని. ఈ దర్శనమునుగూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడును లేకపోయెను.” 26,27 వచనాలు. PKTel 387.2

    ఇశ్రాయేలు నిమిత్తం ఇంకా హృదయ భారంతోనిండిన అతడు యిర్మీయా ప్రవచనాల్ని సరికొత్తగా అధ్యయనం చేశాడు. అవి చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి ఎంత స్పష్టంగా ఉన్నవంటే గ్రంథాల్లో దాఖలై ఉన్న సాక్షాలద్వారా “యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని” గ్రహించాడు. దాని. 9:2. నిశ్చితమైన ప్రవచన వాక్య పునాదిపై స్థాపితమైన విశ్వాసంతో ఈ వాగ్దానాల్ని వేగంగా నెరవేర్చవలసిందిగా దానియేలు ప్రభువుతో విజ్ఞాపన చేశాడు. తన ఘనతను కాపాడుకోవలసిందిగా విజ్ఞాపన చేశాడు. దైవ సంకల్పాన్ని నెరవేర్చటంలో విఫలులైన వారిలో తన్నుకూడా తన విజ్ఞాపనలో లెక్కించుకున్నాడు. వారి పాపాల్ని తనవిగా ఎంచుకుని వాటిని ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నాడు.PKTel 387.3

    ప్రవక్త ఇలా అన్నాడు, “అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవునియెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని. నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థన చేసి” నా పాపాలు ఒప్పుకున్నాను. 3,4 వచనాలు. దానియేలు దేవుని సేవలో సుదీర్ఘ కాలంగా ఉండి, “నీవు అతిప్రియుడవు” అని పరలోకం పరిగణను పొందినప్పటికీ ఇప్పుడు అతడు దేవునిముందు పాపిగా నిలబడ్డాడు. తాను ప్రేమిస్తున్న ప్రజల అవసరాన్ని విన్నవిస్తూ సహాయం అర్ధిస్తున్నాడు. అతడి ప్రార్ధన సరళత, సామాన్యత కలిగి అతడి హృదయం నుంచి వచ్చింది. అతడి విజ్ఞాపనను వినండి :PKTel 388.1

    “ప్రభువా, మహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనువారి యెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమునుబట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయ దేశజనులందరికిని చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుటమాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.”PKTel 388.2

    “ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికార మొందినవారము. మేము నీమీద తిరుగుబాటు చేసితిమి. దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టియు, పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.”PKTel 388.3

    “మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటుచేసితిమి; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడై యున్నాడు.” “ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోషములనుబట్టియు, యెరూషలేము నీ జనుల చుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్టితమైన పర్వతము; ఆ పట్టణము మీదికివచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యము లన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.”PKTel 388.4

    “ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్ధనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిధిలమైపోయిన నీ పరిశుద్ద స్థలముమీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరమునుబట్టియే మేము నిన్ను ప్రార్థించు చున్నాముగాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరు పెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.”PKTel 389.1

    “ప్రభువా, ఆలకింపుము; ప్రభువా క్షమింపుము; ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవిని చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.” 4-9, 16-19 వచనాలు.PKTel 389.2

    ప్రవక్త చేస్తున్న విజ్ఞాపనను వినటానికి పరలోకం కిందకు వంగుతున్నది. క్షమాభిక్షకు పునరుద్దరణకు అతడి విజ్ఞాపన ముగియక ముందే గబ్రియేలు దూత మళ్లీ అతడి ముందు నిలిచి, బబులోను పతనానికి ముందు బెల్పసరు మరణానికి ముందు తనకు కలిగిన దర్శనానికి అతడి గమనాన్ని తిప్పాడు. అప్పుడు ఆ డెబ్బయి వారాల కాల వ్యవధినిగూర్చి దూత అతడికి వివరంగా సూచించాడు. అది “యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగ గ్రహించుము.” అన్నాడు. 25వ వచనం.PKTel 389.3

    దానియేలు తన ప్రార్థనను మాదీయ రాజైన దర్యావేషు “ఏలుబడిలో మొదటి సంవత్సరమందు” చేశాడు (1వ వచనం). అతడి సేనాపతి కోరేషు బబులోను చేతుల్లో నుంచి ప్రపంచ పరిపాలనా రాజదండాన్ని లాక్కున్నాడు. దర్యావేషు ఏలుబడిని దేవుడు గౌరవించాడు. అతణ్ని “స్థిరపరచుటకును బలపరచుటకును” గబ్రియేలు దూతను అతడి వద్దకు పంపాడు. దాని 11:1. బబులోను పతనం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల్లో దర్యావేషు మరణించాడు. అతడి వారసుడిగా కోరెషు సింహాసనానికి వచ్చాడు. కోరెషు పరిపాలన ప్రారంభం నాటికి నెబుకద్నెజరు యూదయ దేశంనుంచి చెరపట్టి బబులోనుకి తెచ్చిన బందీల మొదటి జట్టు వచ్చి డెబ్బయి సంవత్సరాలు పూర్తి అయ్యాయి. PKTel 389.4

    కోరెషు చక్రవర్తి మనసులో సదభిప్రాయం పుట్టించటానికి దేవుడు సింహాల గుహలోనుంచి దానియేలు విడుదలను వినియోగించుకున్నాడు. దూరదృష్టిగల సమర్ద రాజనీతిజ్ఞుడైన ఆ దైవభక్తుడి ఉదాత్త, సౌమ్య గుణలక్షణాలు అతణ్ని అతడి విజ్ఞతను ఈ పారసీక రాజు గౌరవించటానికి దారితీశాయి. ఇప్పుడు యెరూషలేములోని తన ఆలయాన్ని తిరిగి కడతానని దేవుడు చెప్పిన ఈ సమయంలో తన్నుగూర్చిన ప్రవచనాల్ని గ్రహించటానికి, యూదులికి స్వేచ్ఛను ఇవ్వటానికి, తన సాధనమైన కోరెషును దేవుడు ప్రేరేపించాడు. బబులోన్ని పట్టుకోవలసిన తీరును నిర్దేశిస్తూ, తన జననానికి వంద సంవత్సరాలకు పైచిలుకు కాలం ముందే ప్రవచించబడ్డ మాటల్ని చూసినప్పుడు, విశ్వపాలకుడైన దేవుడు తనకు ఉద్దేశించిన ఈ వర్తమానాన్ని చదివినప్పుడు — “తూర్పు దిక్కునుండి పడమటి దిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనునట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్దపరచితిని.” తన కళ్లముందే ఉన్న నిత్య దేవుని ఈ ప్రకటనను చూసినప్పుడు, “నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికిని నీకు బిరుదు లిచ్చితిని;” దైవావేశపూరితమైన ఈ దాఖలాని పరిశీలించినప్పుడు, “నీతినిబట్టి కోరెషను రేపితిని అతని మార్గములన్నియు సరాళము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును.” అతడి హృదయం చలించింది. దేవుడు తనకు నియమించిన కర్తవ్యాన్ని నెరవేర్చటానికి కృత నిశ్చయుడయ్యాడు. యెష. 45:5,6,4,13. చెరలో ఉన్న యూదులికి విడుదల కలిగించి, యెహోవా మందిరాన్ని పునరుద్దరించి వారికి తోడ్పడాలని నిర్ధారించుకున్నాడు.PKTel 389.5

    హెబ్రీయులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవటానికి, తమ దేవాలయాన్ని తిరిగి నిర్మించుకోటానికి వీలు కల్పిస్తూ కోరెషు ఓ ప్రకటనను రాయించి దాన్ని “తన రాజ్య మందంతట” చంటిపజేశాడు. రాజు ఈ బహిరంగ ప్రకటనలో దేవున్ని గుర్తించి తన కృతజ్ఞతను ఇలా వ్యక్తం చేశాడు, “ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు, బయలుదేరి... ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. మరియు.... స్వేచ్చారణనుగాక ఆయా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెను.” ఎజ్రా 1:1-4.PKTel 390.1

    ఆలయ నిర్మాణం గురించి అతడు ఇంకా ఇలా సూచించాడు, “బలులు అర్పింప తగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను. మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్తమ్రానుల చేతను కట్టించబడవలెను. దాని వ్రయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసికొని వచ్చిన దేవుని మందిరముయొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను.” ఎజ్రా. 6:3-5.PKTel 390.2

    ఈ డిగ్రీని గూర్చిన వార్త రాజ్యంలోని మిక్కిలి దూరప్రాంతాలకు చేరింది. అన్ని ప్రాంతాల్లోను చెల్లాచెదురైన దైవ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరశాయి. దానియేలు లాగే అనేకులు ప్రవచనాల్ని అధ్యయనం చేస్తూ సీయోను పక్షంగా తాను కలుగ జేసుకుంటానని తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు వారి ప్రార్థనలు ఫలించాయి. ఆనందభరిత హృదయాలతో వారు అందరూ కలిసి ఇలా స్తోత్రగానం చెయ్యగలిగారు : PKTel 391.1

    “సీయోనుకు తిరిగివచ్చిన వారిని యెహోవా చెరలో
    నుండి రప్పించినప్పుడు
    మనము కల కనినవానివలె నుంటిమి
    మన నోటినిండ నవ్వుండెను
    మన నాలుక ఆనందగానముతో నిండియుండెను
    అప్పుడు - యెహోవా వీరికొరకు గొప్పకార్యములు
    చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి
    యెహోవా మనకొరకు గొప్ప కార్యములు చేసి
    యున్నాడు
    మనము సంతోషభరితులమైతిమి”
    PKTel 391.2

    కీర్త. 126:1-3.

    “అప్పుడు యూదా పెద్దలును, బెన్యామినీయుల పెద్దలును, యాజకులును, లేవీయులును, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని” వచ్చారు. వీరు శేషించిన ప్రజలు. చెరగా వెళ్లిన ప్రాంతాలనుంచి వచ్చినవారు. వీరి సంఖ్య ఏభై వేలవరకూ ఉంది. వీరు “యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు” వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నిశ్చయించుకున్నవారు. వారి మిత్రులు వారిని వట్టి చేతులతో వెళ్లనివ్వలేదు. “వారి చుట్టునున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.” వీటికి ఇతరత్రాగా వచ్చిన స్వచ్ఛంద కానుకలకూ తోడుగా “నెబుకద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవతలయొక్క గుడియందుం చిన... మందిరపు ఉపకరణములు రాజైన కోరెషు బయటికి తెప్పించెను... తన ఖజానాదారుడైన మిత్రదాతు ద్వారా వాటిని లెక్కవేయించి... అన్నియు అయిదువేల నాలుగువందలు” ఇచ్చాడు. కట్టనున్న దేవాలయంలో ఉపయోగించటానికి రాజు వాటిని ఇచ్చాడు. (ఎజ్రా. 1:5-11).PKTel 391.3

    యూదాకు తిరిగివెళ్లే ప్రజల నాయకత్వ బాధ్యతను కోరెషు దావీదు వంశీకుడైన (షేషజ్ఞరు అని కూడా పిలిచే) జెరుబ్బాబెలుపై పెట్టాడు. ప్రధాన యాజకుడు యేషూవా అతడితో కలిసి పనిచేశాడు. అరణ్య జలాలు దాటుతూ వారు చేసిన దీర్ఘ ప్రయాణం సురక్షితంగా జరిగింది. సంతోషానందాల్తో కృతజ్ఞతతో నిండిన ఆ జనం ధ్వంసమై శిధిలాలుగా ఉన్న మందిరాన్ని తిరిగికట్టే పనికి వెంటనే పూనుకున్నారు. ఆలయ నిర్మాణం ఖర్చుకి తోడ్పడేందుకు “కుటుంబ ప్రధానులు కొందరు” తమకున్న దానిలోనుంచి కానుకలు సమర్పించారు. వారి స్పూర్తిని పుణికి పుచ్చుకుని ప్రజలు తమ స్వల్ప ఆదాయంలోనుంచి ధారాళంగా కానుకలిచ్చారు. ఎజ్రా. 2:64-70 చూడండి.PKTel 392.1

    ఆలయ ఆవరణంలో పూర్వ బలిపీఠం ఉన్న స్థలంలో త్వరత్వరగా బలిపీఠాన్ని నిర్మించారు. ఈ బలిపీఠం ప్రతిష్టకు సంబంధించిన పనులు చెయ్యటానికి “జనులు ఏక మనస్సు కలవారై” సమావేశమయ్యారు. నెబుకద్నెజరు యెరూషలేమును ధ్వంసం చేసిన సమయంలో నిలిచిపోయిన పరిశుద్ధ సేవల్ని తిరిగి స్థాపించటంలో వారందరు ఒకటయ్యారు. తాము పునరుద్దరించుకోటానికి ప్రయత్నిస్తున్న ఇళ్లలో నివసించటానికి వెళ్లిపోక ముందు వారు “పర్ణశాలల పండుగను” ఆచరించారు. ఎజ్రా. 8:1-6.PKTel 392.2

    అనుదిన దహన బలిపీఠాన్ని స్థాపించటం శేషించిన నమ్మకస్తుల్ని ఎంతో ఆనందపర్చింది. దేవాలయ పునర్నిర్మాణానికి అవసరమైన సిద్దబాటు పనుల్లో అందరూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ పనులు నెలకునెల ముందుకు సాగటంతో వారు ధైర్యం తెచ్చుకొని పనిచేశారు. దేవుని సన్నిధికి కనిపించే చిహ్నమైన ఆలయానికి అనేక సంవత్సరాలుగా వారు దూరమయ్యారు. ఇక ఇప్పుడు తమ తండ్రుల మత భ్రష్టతను గుర్తుచేసే అనేకమైన సూచికల మధ్య నివసిస్తున్న వారు దేవుని క్షమాపణను ప్రసన్నతను సూచించే ఓ చిహ్నంకోసం ఆశగా ఎదురు చూశారు. వ్యక్తిగత ఆస్తికన్నా పూర్వపు ఆధిక్యతలకన్నా వారు ఎక్కువ విలువైనదిగా పరిగణించింది దేవుని ప్రసన్నత. వారిపక్షంగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన సముఖం తమ మధ్య ఉంటుదన్న భరోసా వారికి కలిగింది. అయినా వారు ఇంకా ఉన్నతమైన దీవెనల్ని ఆకాంక్షించారు. ఆలయం పునర్నిర్మితమై, దాని లోపలనుంచి దేవుని మహిమ ప్రకాశించటం ఎప్పుడు వీక్షిద్దామా అని వారు ఉత్సాహానందాల్తో ఎదురు చూశారు.PKTel 392.3

    సొలొమోను దినాల్లో ఆలయ నిర్మాణ వస్తువుల్ని సిద్ధంచేసే కార్మికులు ఆలయ స్థలానికి నిర్మాణకులు తెచ్చిన బ్రహ్మాండమైన రాళ్లను అక్కడున్న శిధిలాల్లో కనుగొన్నారు. నిర్మాణంలో ఉపయోగించటానికి సిద్ధం చేసిన రాళ్లు ఇవి. వారు ఇంకా కొత్త సామగ్రిని సమకూర్చుకున్నారు.. పని చురుకుగా సాగుతుంది. పునాది రాయి వేయాల్సిన సమయం వచ్చింది. పని పురోగతిని వీక్షించటానికి, ఆ కార్యంలో తమకో పాత్ర ఉన్నందుకు తమ ఆనందాన్ని వెలిబుచ్చటానికి సమావేశమైన వేల ప్రజల సముఖంలో ఇది జరిగింది. మూలరాయిని దాని స్థానంలో అమర్చేటప్పుడు, యాజకుల బూరలు, ఆసాపు కుమారుల తాళాల మేళవింపుతో ప్రజలు “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి.” 11వ వచనం.PKTel 393.1

    పునర్నిర్మాణానికి సిద్ధంగా ఉన్న ఈ ఆలయం, దేవుడు సీయోనుకు చేయాలని కోరుకున్న మేలుగా అనేక ప్రవచనాలు ప్రవచించిన అంశం. మూలరాయి వేసే సందర్భంగా హాజరైన వారందరూ ఆ సందర్భంలో చోటుచేసుకున్న ఉత్సాహంలో పాలు పొంది ఉండాలి. అయినా ఆనందమయమైన ఆ దినాన సంగీతం స్తోత్రార్పణల నడుమ ఓ అపశ్రుతి వినిపించింది. “మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి.” 12వ వచనం.PKTel 393.2

    ఈ వృద్ధుల హృదయాలు విచారంతో నిండటం సహజమే. ఎందుకంటే వారు ఎంతోకాలంగా కొనసాగుతున్న పశ్చాత్తాప రాహిత్యం ఫలితాల గురించి ఆలోచించారు. వారు వారితరం వారు దేవునికి విధేయులై, ఇశ్రాయేలు నిమిత్తం ఆయన సంకల్పాన్ని నెరవేర్చి ఉంటే, సొలొమోను నిర్మించిన ఆలయం నాశనమయ్యేదికాదు. చెర అవసర ముండేది కాదు. అయితే తమ కృతఘ్నతవల్ల అపనమ్మకంవల్ల వారు అన్యజనుల మధ్య చెదిరిపోయి నివసించాల్సి వచ్చింది.PKTel 393.3

    పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. దయ కనికరాలుగల దేవుడు తన ప్రజల్ని మళ్లీ దర్శించాడు. వారు తమ దేశానికి తిరిగి రావటానికి అనుమతించాడు. గత దోషాల నిమిత్తం దుఃఖం స్థానే ఆనందం చోటు చేసుకోవలసింది. ఆలయాన్ని తిరిగి కట్టటంలో వారికి సహాయం చెయ్యటానికి దేవుడు కోరెషుని ప్రేరేపించాడు. ఇందుకు వారు దేవునికి ఎంతో కృతజులై ఉండాల్సింది. కాని వారిలో కొందరు దేవుని కృపలను గుర్తించలేదు. సంతోషంతో గంతులు వేసే బదులు వారు అసంతృప్తి, నిరాశా భావాలతో సతమతమాయ్యరు. వారు సొలొమోను ఆలయ వైభవాన్ని చూశారు. ఇప్పుడు నిర్మితికానున్న ఆలయం దానంత గొప్పగా లేనందుకు విలపించారు.PKTel 393.4

    వారి గొణుగుడు, ఫిర్యాదులు, అసంబద్ధ సరిపోలికలు అనేకుల మనసుల్లో భయాన్ని నింపాయి. నిర్మాణకుల్ని బలహీనపర్చాయి. ప్రారంభంలోనే అంతగా విమర్శలకు గురిఅయి ఎంతో సంతాపాన్ని కలిగించిన కట్టడాన్ని కట్టటమా మానటమా అన్న మీమాంసలోPKTel 394.1

    కాగా ఆ జన సమూహంలో స్థిరమైన విశ్వాసం, విశాల దృక్పధం గలవారు చాలామంది ఉన్నారు. ఆ తక్కువ మహిమను చూసి అంతగా అసంతృప్తి చెందకుండా ఉండటానికి అది వారికి తోడ్పడింది. “మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో యేది దుఃఖ శబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.” 12,13 వచనాలు.PKTel 394.2

    ఆలయానికి పునాది రాయి వేసినప్పుడు సంతోషించలేకపోయిన వారు ఆ దినాన తాము ప్రదర్శించిన విశ్వాస రాహిత్యం పర్యవసనాన్ని ముందే చూడగలిగి ఉంటే, వారు తీవ్ర దిగ్ర్భాంతికి గురి అయ్యేవారు. అసమ్మతిని, ఆశాభంగాన్ని సూచించిన తమ మాటల ప్రాముఖ్యాన్ని వారు గ్రహించలేదు. తాము వ్యక్తంచేసిన అసంతృప్తి కారణంగా దేవాలయ నిర్మాణం సంపూర్తి కావటంలో ఎంత జాప్యం జరుగుతుందో వారికి తెలియలేదు.PKTel 394.3

    మొదటి ఆలయ వైభవం, దానిలోని ఆడంబర ఆచారకర్మలు తమ చెరకు ముందు ఇశ్రాయేలీయులికి గర్వకారణంగా ఉండేవి. కాని వారి ఆరాధనలో అతి ముఖ్యమని దేవుడు పరిగణించే అంశాలు తరచుగా లోపించేవి. మొదటి ఆలయ వైభవం, దానిలోని గంభీర సేవలు వారిని దేవునికి సిఫార్సు చెయ్యలేవు. ఆయన దృష్టికి ఏది విలువగలదో దాన్ని వారు అర్పించలేదు. వారు వినమ్రమైన, విరిగినలిగిన హృదయాన్ని ఆయనకు అర్పణగా సమర్పించలేదు.PKTel 394.4

    దేవుని రాజ్య ముఖ్య సూత్రాల్ని విస్మరించటం జరిగినప్పుడు ఆచారాలు కర్మకాండలు ఎక్కువవుతాయి. ప్రవర్తన నిర్మాణాన్ని అశ్రద్ధ చేసినప్పుడు, ఆత్మ సౌందర్యం కొరవడినప్పుడు, సామాన్యమైన దైవభక్తిని తృణీకరించినప్పుడు, అహంకారం, ఆడంబరం పట్ల ఆసక్తి చూపటం వైభవోపేతమైన దేవాలయాల్ని, గొప్ప అలంకరణల్ని, గంభీరమైన ఆచారాల్ని డిమాండు చేయటం జరుగుతుంది. అయితే ఇవి దేవున్ని ఘనపర్చలేవు. సంఘానికి దేవుడు ఎంతో విలువనిస్తాడు. దానివలన ఒనగూడే బాహ్య ప్రయోజనాల్ని గురించికాదు. అది కనపర్చే యదార్ధ భక్తినిబట్టి. సంఘాన్ని లోకంనుంచి వేరు చేసేది ఇదే. సంఘ సభ్యులు క్రీస్తును గూర్చిన జ్ఞానంలో ఎదగటాన్ని బట్టి ఆధ్యాత్మికానుభవంలో వారి అభివృద్దినిబట్టి దాన్ని ఆయన బేరీజు వేస్తాడు. మనలో ప్రేమ మంచితనం కోసం ఆయన చూస్తున్నాడు. కళ సృష్టించగల సౌందర్యం మొత్తం క్రీస్తు రాయబారులైన వారిలో వెల్లడయ్యే స్వభావ రమ్యతకు, గుణ సౌందర్యానికి సరిసాటి కాదు.PKTel 394.5

    ఓ సంఘం దేశంలో అతి పేద సంఘం కావచ్చు. దానికి బాహ్యాకర్షణ లేవీ లేకపోవచ్చు. ఆ సంఘ సభ్యులు క్రీస్తు ప్రవర్తనను కలిగి ఉంటే దేవున్ని ఆరాధించ టానికి దేవదూతలు వారితో ఏకమౌతారు. కృతజ్ఞ హృదయాలనుంచి వచ్చే స్తోత్రార్పణ దేవుని వద్దకు వెళ్తుంది.PKTel 395.1

    “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా
    స్తుతులు చెల్లించుడి
    ఆయన కృప నిరంతరముండును
    యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు
    గాక
    విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును”

    “ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి
    ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ
    చేయుడి
    ఆయన పరిశుద్ద నామమునుబట్టి అతిశయించుడి
    యెహోవాను వెదకువారు హృదయమందు సంతో
    షించుదురుగాక”

    “ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి
    యున్నాడు
    ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి
    యున్నాడు”
    PKTel 395.2

    కీర్త. 107:1,2; 105:2,3; 107:9