Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    15 - యెహోషాపాతు

    తన ముప్పయి ఐదోపడిలో రాజ్యపాలనకు వచ్చేవరకు యెహోషాపాతు ముందు మంచిరాజు ఆసా ఆదర్శం ఉంది. ఆసా దాదాపు ప్రతీ ఆపదలోను “యెహోవా దృష్టికి యధార్ధముగా నడుచుకొనెను.” 1 రాజులు 15:11. ప్రగతిపధంలో సాగిన యెహోషాపాతు ఇరవై అయిదు సంవత్సరాల రాజ్యపాలనలో “అతడు తన తండ్రియైన ఆసా యొక్క మార్గములన్నిటిననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచువచ్చెను.”PKTel 122.1

    వివేకంగా పరిపాలనచెయ్యాలన్న కోరికతో విగ్రహారాధక ఆచారాలకు వ్యతిరేకంగా గట్టిచర్యలు తీసుకోటానికి తన ప్రజల్ని ప్రోత్సహించటానికి యెహోషాపాతు ప్రయత్నించాడు. తన రాజ్యంలోని ప్రజల్లో అనేకమంది “ఉన్నత స్థలములలో... ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచునుండిరి.” 1 రాజులు 22:43. రాజు ఈ గుళ్లను వెంటనే ధ్వంసం చెయ్యలేదు. కాని అహాబు ఏలుబడిలో ఉత్తర రాజ్యంలో ప్రబలుతున్న పాపాల నుంచి యూదాను కాపాడాలని మొదటినుంచి ప్రయత్నించాడు. అతడు అహాబుతో సమకాలీనంగా అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. యెహోషాపాతు దేవునికి నమ్మకంగా నివసించాడు. అతడు “బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, ఇశ్రాయేలువారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించెను.” అతడి విశ్వాస పాత్రతను బట్టి యెహోవా అతడితో ఉన్నాడు “అతనిచేత రాజ్యమును స్థిరపరచెను.” 2 దినవృ 17:3-5.PKTel 122.2

    “యూదావారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి విశ్వాసము ఘనత మెండుగా కలిగెను. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనినవాడై” ఉన్నాడు. కాలక్రమంలో సంస్కరణలు నిర్వహించి రాజు “ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలో నుండి తీసివేసెను.” 5,6 వచనాలు. “తన తండ్రియైన ఆసా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్ళగొట్టెను.” 1 రాజులు 22:46. ఇలా యూదా ప్రజలు తమ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అనేక ప్రమాదకర దురాచారాల నుంచి క్రమక్రమంగా విముక్తిపొందారు.PKTel 122.3

    రాజ్యంలోని ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని గురించి ఉపదేశం అవసర మయ్యింది. ఈ ధర్మశాస్త్ర అవగాహనలోనే వారి క్షేమం ఉంది. దాని విధుల ఆచరణ ద్వారానే వారు దేవునికి మానవుడికి విశ్వాసపాత్రులు కావలసిఉన్నారు. ఇది గ్రహించి యెహోషాపాతు తన ప్రజలకు పరిశుద్ధ లేఖనాల్ని క్షుణ్నంగా బోధించటానికి చర్యలు చేపట్టాడు. నమ్మకమైన యాజకుల్ని ఉపదేశ పరిచర్యకు నియమించవలసిందిగా తన రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు బాధ్యులైన నాయకుల్ని ఆదేశించాడు. రాజు నియమించిన ఈ ఉపదేశకులు తమ నాయకుల ప్రత్యక్ష పర్యవేక్షణ కింద “యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.” 2 దినవృ 17:7-9. అనేకులు దైవ విధుల్ని గ్రహించి పాపాన్ని విడిచిపెట్టటంతో ఉజ్జీవనం కలిగింది..PKTel 123.1

    రాజుగా యెహోషాపాతు సాధించిన ప్రగతిలో చాలామట్టుకు అతడు తన ప్రజల ఆధ్యాత్మిక అవసరాలికి చేసిన జ్ఞానయుతమైన ఏర్పాటు మూలంగానే సాధ్యపడింది. దైవ శాసనాల ఆచరణలో గొప్పమేలుంది. దైవవిధుల్ని అనుసరించటంలో మార్పు కలిగించే శక్తి ఉంది. ఆ మార్పు ప్రజల మధ్య శాంతిని సుహృద్భావాన్ని సృష్టించి పెంపుజేస్తుంది. ప్రతీ స్త్రీ ప్రతీ పురుషుడి జీవితంలోను దైవ వాక్య బోధనలు ప్రభావం అదుపులో ఉంటే, మనస్సు హృదయం దాని నియత్రణ అధికారం కిందికి వస్తే, ఇప్పుడు జాతీయ జీవితంలోను, సాంఘిక జీవితంలోను ఉన్న చెడుగు ఉందడు. స్త్రీలని పురుషుల్ని ఆధ్యాత్మికంగాను నైతికంగాను బలోపేతం చేసే ప్రభావం ప్రతీ గృహం నుంచి వెళ్తుంది. ఇలా జాతులు వ్యక్తులు బలంగా నిలబడటం సాధ్యపడుంది.PKTel 123.2

    యెహోషాపాతు అనేక సంవత్సరాలు శాంతి సమాధానల్లో నివసించాడు. చుట్టూ ఉన్న రాజ్యాల నుంచి ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోలేదు. “యూదా దేశము చుట్టు ఉండు దేశముల రాజ్యములన్నిటిమిదికి యెహోవా భయము” వచ్చింది. 10వ వచనం. ఫిలిషియా నుంచి అతడు పన్నును కానుకల్ని స్వీకరించాడు. అరేబియా నుంచి మేకలు, గొర్రెల మందలు వచ్చాయి. “యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను..... అతని క్రింద పరాక్రమ శాలులు.... కూడియుండిరి... యూదా దేశమందంతట నుండు ప్రాకార పురములలో ఉండువారుగాక వీరు రాజు యొక్క పరివారములో చేరినవారై యుండిరి.” 12-19 వచనాలు. “ఐశ్వరమును ఘనతయు అధికంగా కలిగి అతడు సత్యం నీతి పక్షంగా గొప్ప ప్రాబల్యాన్ని కనపర్చగలిగాడు. 2దినవృ 18:1.PKTel 123.3

    సింహాసనానికి వచ్చిన కొన్ని సంవత్సరాల అనంతరం ఇప్పుడు ఉచ్చస్థితిలో ఉన్న యెహోషాపాతు తనకుమారుడు యెహోరాముకి అహాబు యెజెబెలుల కుమార్తె అతల్యాతో వివాహానికి అంగీకరించాడు. ఈ వివాహం వల్ల యూదా ఇశ్రాయేలు రాజ్యాల మధ్య మైత్రీబంధం ఏర్పడింది. అది దేవుని చిత్తాన్ని అనుసరించి జరిగిందికాదు. కష్టసమయంలో అది రాజుకి అతడి ప్రజల్లో అనేకమందికి ప్రమాదం తెచ్చిపెట్టింది.PKTel 124.1

    ఒక సందర్భంలో యెహోషాపాతు షోమ్రోనులోని ఇశ్రాయేలు రాజును సందర్శించాడు. ఈ యెరూషలేము రాచ అతిథిని ప్రత్యేకరీతిగా ఆ రాజు సన్మానించాడు. అతడి సందర్శన చివర తనతో కలిసి సిరియాపై యుద్ధం చెయ్యటానికి ఆ రాజు యెహోషాపాతుని ఒప్పించాడు. తన సైన్యంతో యూదా సైన్యం కలవటం ద్వారా పురాతన ఆశ్రయపురాల్లో ఒకటైన రామోతిలాదును తిరిగి సంపాదించవచ్చు ననుకున్నాడు. అది న్యాయతః ఇశ్రాయేలుకు చెందిన పురమని అతడు వాదించాడు.PKTel 124.2

    సిరియాపై యుద్దంలో ఇశ్రాయేలు రాజుతో చెయ్యి కలుపుతానని యెహోషాపాతు బలహీన గడియలో వాగ్దానం చేసినా, దాని విషయమై దేవున్ని సంప్రదించాలన్న సదుద్దేశం అతడికి కలిగింది. “నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము” అని అహాబుకు ప్రతిపాదించాడు. దానికి స్పందిస్తూ అహాబు షోమ్రోనులోని నాలుగువందలమంది అబద్ద ప్రవక్తల్ని పిలిపించి, “నేను రామోద్దిలాదు మీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా?” అని వారిని అడిగాడు. అందుకు వారు “పొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించును” అన్నారు. 4, 5 వచనాలు.PKTel 124.3

    దానితో తృప్తి చెందక యెహోషాపాతు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని ప్రయత్నించాడు. “మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చటలేడా?” అని అడిగాడు. 6వ వచనం. “ఇమ్రా కుమారుడైన మికాయ అను ఒకడున్నాడు: అతని ద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చునుగాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదు” అని అహాబు బదులు పలికాడు. 1 రాజులు 22:8. ఆ ప్రవక్తను పిలిపించమని యహోషాపాతు కోరాడు. అతడు వారి ముందుకు వచ్చిన మీదట అహాబు “యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసిన”దని చెప్పి ఆమేరకు అతనితో ప్రమాణం చెయ్యించగా మికాయ ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులందరును కాపరిలేని గొఱ్ఱలవలెనే కొండలమీద చెదరి యుండుట నేను చూచితిని. వారికి యజమానుడులేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను.” 16,17 వచనాలు.PKTel 124.4

    రాజుల పథకం దేవునికి అంగీకృతం కాదని చూపించటానికి ప్రవక్త పలికిన మాటలు సరిపోయి ఉండాల్సింది. కాని ఆ యిద్దరిలో ఒక్కడు కూడా ఆ హెచ్చరికను పాటించలేదు. అహాబు నిర్ధారణ చేసుకున్నాడు. దాన్ని ఆచరించి తీర్తాడు. “మేము నీతోకూడ యుద్ధమునకు వచ్చెదము” అని యెహోషాపాతు తనమాట ఇచ్చాడు. ఆ వాగ్దానం చేసిన మీదట తన సైన్యాల్ని ఉపసంహరించ టానికి ఇష్టంగాలేడు. 2 దినవృ 18:3 “ఇశ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషాపాతును రామోతిలాదు మీదికి” వెళ్లారు. 1 రాజులు 22:29.PKTel 125.1

    తర్వాత జరిగిన యుద్ధంలో అహాబు శత్రు బాణం వేటుకి గురిఅయి ఆ సాయంత్రం మరణించాడు. “సూర్యాస్తమయ సమయమందు దండు వారందరును తమ పట్టణములకును దేశములకును వెళ్లిపోవచ్చునని ప్రచారమాయెను” 36వ వచనం. ప్రవక్త పలికిన మాట ఈ విధంగా నెరవేరింది.PKTel 125.2

    ఈ దారుణ యుద్ధం నుంచి యెహోషాపాతు యెరూషలేముకి తిరిగి వెళ్లారు. పట్టణాన్ని సమీపిస్తున్నప్పుడు యెహూ అతణ్ని ఈ మందలింపు వర్తమానంతో కలిశాడు, “నీవు భక్తిహీనులకు సహాయముచేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు. నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.” 2 దినవృ 19:2,3.PKTel 125.3

    యెహోషాపాతు ఏలుబడి చివరి సంవత్సరాలు చాలామట్టుకు యూదా జాతీయ ఆధ్యాత్మిక రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చెయ్యటంలో గడిచాయి. అతడు “బెయేరెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను.” 4వ వచనం. PKTel 125.4

    రాజు చేపట్టిన ముఖ్యమైన చర్యల్లో ఒకటి సమర్ధమైన న్యాయస్థానాల స్థాపన వాటి కొనసాగింపు. “ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను” నిర్ణయించాడు. వారికి బాధ్యతలు అప్పగించినప్పుడు ఇలా విజ్ఞప్తి చేశాడు, “మీరు యెహోవా నియమమును బట్టియేగాని మనుష్యుల నియమమును బట్టి తీర్పుతీర్చవలసినవారు కారు, ఆయన మితో కూడ నుండును గనుక మీరు తీర్చుతీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మిమీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పుతీర్చుడి. మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు. ఆయన పక్షపాతికాడు. లంచము పుచ్చుకొనువాడు కాడు.” 5-7 వచనాలు.PKTel 125.5

    యెరూషలేములో అపీలు కోర్టు స్థాపన ద్వారా న్యాయవ్యవస్థను దోషరహితం చేశాడు. “యెహోవానిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహములను పరిష్కరించుటకును” యెహోషాపాతు దానికి లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల యిండ్ల పెద్దలలోను కొందరిని” నియమించాడు. 8వ వచనం. - న్యాయాధిపతుల్ని నమ్మకంగా ఉండాల్సిందిగా హితవు పలికాడు. “యెహోవా యందు భయభక్తులు కలిగినవారై నమ్మకముతోను యధార్ధ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను” అని ఆజ్ఞాపించాడు. “ఆయా పట్టణములలో నివసించు మా సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమర్శించునప్పుడు, మి మీదికిని మీ సహోదరుల మిదికిని కోపము రాకుండునట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండవారిని హెచ్చరిక చేయవలెను. మిరాలాగు చేసిన యెడల అపరాధులు కాకుందురు.PKTel 126.1

    “మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మిమీద ఉన్నాడు. యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు.PKTel 126.2

    “ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మితో కూడ ఉండును.” 9-11 వచనాలు.PKTel 126.3

    తన ప్రజల హక్కుల్ని స్వేచ్చల్ని జాగ్రత్తగా కాపాడటంలో మానవ కుటుంబంలోని ప్రతీ సభ్యుడు సర్వాన్నీ న్యాయంగా పాలించే దేవుని వద్దనుంచి పొందుతున్నాడన్న విషయాన్ని యెహోషాపాతు నొక్కి చెప్పాడు. “దేవుని సమాజములో దేవుడు నిలిచి యున్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పుతీర్చుచున్నాడు.” తన కింద న్యాయాధిపతులుగా నియుక్తులైన వారు ఈ పేదలకును తలిదండ్రులులేని వారికిని న్యాయము” తీర్చాలి వారు “శ్రమగల వారికిని దీనులకును న్యాయము” తీర్చి “దరిద్రులను నిరుపేదలను విడిపించాలి. కీర్త 82:1,3,4.PKTel 126.4

    యెహోషాపాతు పరిపాలన చివరికాలంలో యూదా రాజ్యంపై ఒక సైన్యం దాడి చేసింది. ప్రజలు దాని రాకకు భయంతో వణికారు. అందుకు కారణం లేకపోలేదు. “మోయాబీయులును అమోనీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి.” ఈ దాడిని గూర్చిన వార్త రాజుకి ఒక వార్తాహరుడి ద్వారా అందింది. అతడు ఈ వర్తమానం రాజుకి అందించాడు, “సముద్రము ఆవల నుండు సిరియనుల తట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది. చిత్తగించుము, వారు హాసనోన్ తామారు అను ఏన్గదీలో ఉన్నారు.” 2 దినవృ 20:1,2.PKTel 126.5

    యెహోషాపాతు ధైర్యశాలి, శూరుడు. అతడు అనేక సంవత్సరాలుగా తన సైన్యాన్ని పటిష్ఠపర్చాడు. పట్టణాల ప్రాకారాల్ని గట్టిపర్చాడు. ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోటానికి అతడు సంసిద్ధంగా ఉన్నాడు. అయినా అతడు తన నమ్మకాన్ని మానవహస్తంపై పెట్టుకోలేదు. సుశిక్షిత సైన్యం మీద బురుజులు, ప్రాకారాలుగల పట్టణాలమీద గాక ఇశ్రాయేలు సజీవ దేవునిమీద తన నమ్మకాన్ని పెట్టుకుని జాతుల దృష్టిలో యూదాను చిన్నబుచ్చాలని యోచించిన ఈ అన్యుల గర్వాన్ని అణచి విజయం సాధించాలని యెహోషాపాతు నిరీక్షించాడు.PKTel 127.1

    “అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నింపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా యుదా వారు యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.”PKTel 127.2

    ఆలయ ఆవరణంలో ప్రజల ముందు నిలబడి ఇశ్రాయేలీయుల నిస్సహాయతను ఒప్పుకుంటూ దేవుని వాగ్దానాల నెరవేర్పును వేడుకుంటూ యెహోషాపాతు మనసు విప్పి ప్రార్థన చేశాడు. అతడు ఇలా విజ్ఞాపన చేశాడు, “మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవైయున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రముగలవాడవు. నిన్నెదిరించుటకు కెవరికిని బలముచాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్దమైనను తీరైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని యిచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెనుగదా.PKTel 127.3

    “ఇశ్రాయేలీయులు ఐగుపులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయుల తోను మోయాబీయులతోను శేయూరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరివచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తిచాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు.” 3-12 వచనాలు.PKTel 127.4

    “నీవే మాకు దిక్కు” అని యెహోషాపాతు యెహోవాతో విశ్వాసంతో చెప్పగలిగాడు. గతించిన యుగాల్లో తాను ఎంపిక చేసుకున్న జనాంగాన్ని నాశనం కాకుండా తరచుగా జోక్యం చేసుకుని వారిని కాపాడిన ప్రభువును నమ్ముకో వలసిందని అనేక సంవత్సరాలుగా అతడు ప్రజలకు బోధించాడు. ఇప్పుడు తన రాజ్యానికి ముప్పు వస్తున్నప్పుడు యెహోషాపాతు ఒంటరిగాలేడు. “యూదా వారందరును తమ శిశువులుతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.” 13వ వచనం. యెహోవా నామానికి మహిమ కలుగునట్లు తమ శత్రువుల్లో గందరగోళం పుట్టించమంటూ వారంతా ఐక్యంగా యెహోవాను ప్రార్ధించారు.PKTel 128.1

    “దేవా, ఊరకుండకుము
    దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము
    నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు.
    నిన్ను ద్వేషించువారు తలయెత్తియున్నారు.
    నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను
    చున్నారు.
    నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయు
    చున్నారు.
    వారు - ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక
    పోవునట్లు
    జనముగా నుండకుండ వారిని సంహరించుదమురండని
    చెప్పుకొనుచున్నారు.
    ఏక మనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు.
    నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.
    గుడారపువాసులైన ఎదోమియులు ఇష్మాయేలీ
    యులును
    మోయాబీయులును హగ్రీయాలును
    గెబలువారును అమ్మోనీయులును అమాలే
    కీయులును....
    నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు....
    మిద్యానీయులకు నీవు చేసినట్లు
    కీషోను ఏటి యొద్ద నీవు సీసేరాకును యాబీనునకును
    చేసినట్లు వారికి చేయుము...
    వారికి పూర్ణావమానము కలుగజేయుము
    వారు నిత్యము సిగ్గుపడి భీతినొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక
    యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే
    సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.”
    PKTel 128.2

    కీర్త 83.

    ప్రజలు రాజు దేవునిముందు తమ్మును తాము తగ్గించుకుని సహాయం కోసం వినతి చేసినప్పుడు “ఆసాపు సంతతివాడును లేవీయుడునగు” యహజీయేలు మీదికి దేవుని ఆత్మవచ్చాడు. అతడు ఇలా అన్నాడు:PKTel 129.1

    “యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి, యెహోవా సెలవిచ్చునదేమనగా - ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవు. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యమందున్న వాగుకొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తములేదు. యూదా వారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి.”PKTel 129.2

    “అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదా వారందరును యెరూషలేము కాపురస్తులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతివారును కోరహీయుల సంతతివారును లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి.”PKTel 129.3

    వారు ఉదయం పెందలకడనే లేచి తెకోవ అరణ్యానికి వెళ్లారు. వారు యుద్దానికి ముందుకు వెళ్తున్నప్పుడు యెహోషాపాతు వారినుద్దేశించి ఇలా అన్నాడు, “యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నామాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్ధులగుదురు.” “మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు - యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.” 2 దినవృ 20:14-21. విజయం వాగ్దానం నిమిత్తం దేవున్ని స్తుతిస్తూ ఈ గాయకులు సైన్యం ముందు వెళ్లారు.PKTel 129.4

    స్తుతి గానం చేస్తూ, ఇశ్రాయేలీయుల దేవుణ్ని ఘనపర్చుతూ యుద్ధానికి వెళ్లటం మిక్కిలి విలక్షణమైన తీరు. ఇది వారి యుద్దగానం. వారపరిశుద్దాలంకారం ధరించారు. ఇప్పుడు దేవుని స్తుతించటం ఎక్కువగా ఉంటే నిరీక్షణ, ధైర్యం, విశ్వాసం క్రమక్రమంగా పెరుగుతాయి. నేడు సత్యాన్ని కాపాడూ నిలిచిన వీర సైనికుల హస్తాల్ని ఇది బలపర్చదా?PKTel 130.1

    “వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మిదను మోయాబీయుల మిదను శేయీరు మన్యవాసుల మిదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులును శేయీరు మన్య నివాసులును బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి.PKTel 130.2

    “యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి యుండిరి. ఒకడును తప్పించుకొనలేదు.” 22-24 వచనాలు.PKTel 130.3

    ఈ సంక్షోభంలో యూదా బలం దేవుడే. నేడు తన ప్రజలకు బలం ఆయనే. మనం రాజులపై నమ్మకం పెట్టుకోకూడదు. లేక మానవుణ్ని దేవుని స్థానంలో పెట్టకూడదు. మానవులు తప్పులు చేసేవారని సర్వశక్తిగల ప్రభువు మనకు కాపుదల సమకూర్చే కోట అని మనం జ్ఞాపక ముంచుకోవాలి. ప్రతీ అత్యవసర పరిస్థితిలోను యుద్ధం ఆయనదేనని మనం భావించాలి. ఆయన వనరులకు పరిమితులు లేవు. అసాధ్యాలుగా కనిపించేవి విజయాన్ని మరింత అద్భుతం చేస్తాయి.PKTel 130.4

    “దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము
    మమ్మును చేర్చుకొనుము
    మేము నీ పరిశుద్ద నామమునకు కృతజ్ఞతాస్తుతులు
    చెల్లించునట్లు
    నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు
    అన్యజనుల వశములో నుండి మమ్మును విడిపించుము.”
    PKTel 130.5

    2 దినవృ 16:35.

    విస్తారమైన కొల్లసొమ్ముతో యూదా సైన్యం సంతోషంగా తిరిగి వచ్చింది. “యెహోవా వారి శత్రువుల మిద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను.... వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి.” 2 దినవ 20:27,28. వారి ఆనందోత్సాహాలకు అది గొప్ప హేతువు. “మీరు యుద్దపంక్తులు తీర్చి నిలువబడుడి... యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి జడియకుడి” అన్న ఆజ్ఞకు విధేయులైనప్పుడు వారు తమ సంపూర్ణ విశ్వాసాన్ని దేవునిపై నిలిపారు. అప్పుడు ఆయన వారికి దుర్గంగాను విమోచకుడుగాను నిరూపించుకున్నాడు. 17వ వచనం. దావీదు ఆవేశపూరిత భక్తిగీతాల్ని ఇప్పుడు వారు అవగాహనతో పాడగలిగారు :PKTel 130.6

    “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు
    ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు...
    విల్లు విరుచువాడును బల్లెము తెగనరుకువాడును ఆయనే
    యుద్ద రథములను కాల్చివేయువాడు
    ఆయనే
    ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి
    అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును
    భూమి మీద నేను మహోన్నతుడనగుదును
    సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు
    యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై
    యున్నాడు.”
    PKTel 131.1

    కీర్త 46.

    “దేవా నీ నామము ఎంత గొప్పదో
    నీ కీర్తియు భూదిగంతముల వరకు అంతగొప్పది
    నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది
    నీ న్యాయ విధులను బట్టి
    సీయోను పర్వతము సంతోషించునుగాక
    యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక....

    “ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడైయున్నాడు
    మరణము వరకు ఆయన మనలను నడిపించును.”
    PKTel 131.2

    కీర్త 48:10-14.

    యూదా రాజు అతడి సైన్యం విశ్వాసం ద్వారా “దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్న వారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను.” 2 దినవృ 20:29,30.PKTel 131.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents