Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    34 - యిర్మీయా

    యోషీయా ఆధ్వర్యంలో చోటుచేసుకున్న ఆధ్యాత్మిక ఉజ్జీవనం ఫలితంగా సంభవించిన దిద్దుబాటు స్థిరంగా నిలిచిపోతుందని ఆశించినవారిలో యిర్మీయా ఒకడు. యోషీయా రాజ్యపాలన ప్రారంభమైన పదమూడో ఏట ఇంకా చిన్నవాడైన యిర్మీయాను దేవుడు ప్రవక్తగా సేవ చెయ్యటానికి పిలిచాడు. లేవీయ యాజక సమాజంలో సభ్యుడైన యిర్మీయా తన చిన్ననాటినుంచే పరిశుద్ద పరిచర్యకు శిక్షణ పొందాడు. పరిచర్యకు సిద్ధపడుతున్న ఆనందకరమైన ఆ సంవత్సరాల్లో తాను పుట్టినప్పటినుంచే “జనములకు ప్రవక్తగా” ప్రతిష్ఠితుణ్నయ్యానని అతడు గ్రహించలేదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు తాను అయోగ్యుణ్ని అన్న గుర్తింపు కలిగింది. అతడు “అయ్యో ప్రభువా, చిత్తగించుము నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు.” అన్నాడు. యిర్మీ. 1:5,6.PKTel 283.1

    తీవ్ర వ్యతిరేకత నడుమ తన నమ్మకాన్ని వమ్ము చెయ్యని న్యాయానికి సత్యానికి నిలబడే వ్యక్తిని యువకుడైన యిర్మీయాలో దేవుడు చూశాడు. బాల్యదశలోనే నమ్మకస్తుడుగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు సిలువ యోధుడుగా కష్టాల్ని భరించాల్సి ఉన్నాడు. తాను ఎంపిక చేసుకున్న ఈ దూతను ప్రభువిలా హెచ్చరించాడు, “నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. “కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటన చేయుము; భయపడకుము లేదా నేను వారియెదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకుగాని ప్రధానులయొద్దకుగాని యాజకుల యొద్దకుగాని దేశనివాసుల యొద్దకుగాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారములుగల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి యున్నాను. వారు నీతో యుద్దము చేతురుగాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు” 7,8,17-19 వచనాలు.PKTel 283.2

    నలభై సంవత్సరాలపాటు సత్యానికి నీతికి సాక్షిగా జాతిముందు యిర్మీయా నిలిచాడు. కనివిని ఎరుగని మతభ్రష్టత సాగుతున్న కాలంలో అతడు తన జీవితం ద్వారాను ప్రవర్తన ద్వారాను యధార్ధ దేవుని ఆరాధనకు సాదృశ్యం కావాల్సి ఉన్నాడు. భయంకరమైన యెరూషలేము ముట్టడికాలంలో అతడు యెహోవా వక్తగా వ్యవహరించాల్సి ఉన్నాడు. దావీదు వంశ పతనాన్ని, సొలొమోను నిర్మించిన ఆ సుందర దేవాలయ నాశనాన్ని ప్రవచించాల్సి ఉన్నాడు. తన నిర్బయ ప్రకటనల కారణంగా చెరసాలలో వేసినప్పుడు సయితం ఉన్నత స్థలాల్లోని పాపాన్ని ఖండిస్తూ నిర్భయంగా మాట్లాడాల్సి ఉన్నాడు. మనుషుల తృణీకారానికి, ద్వేషానికి, నిరాకరణకు గురి అయి చివరికి అతడు తాను ప్రవచించిన ప్రవచనాల ప్రకారం చోటు చేసుకున్న నాశనాన్ని కళ్లారా చూడటం, ఆ అభాగ్య యెరూషలేము నాశనం అనంతరం సంభవించిన దుఃఖ బాధల్లో అతడు పాలుపంచుకోటం జరిగింది.PKTel 284.1

    అయినా ఆ జాతి సర్వనాశనం దిశగా వడిగా పరుగులు తీస్తున్నప్పటికీ, నిరాశ నిర్వేదం కలిగించే ప్రస్తుత దృశ్యాలనుంచి, దేవుని ప్రజలు శత్రువు భూభాగం నుంచి విమోచింపబడి మళ్లీ సీయోన్ని స్వతంత్రించుకునే మహిమకరమైన దృశ్యాల్ని వీక్షించటానికి దేవుడు యిర్మీయాను అనుమతించాడు. ప్రభువు తన నిబంధన బాంధవ్యాన్ని వారితో నవీకరించుకునే సమయాన్ని అతడు ముందే చూశాడు. “వారిక నెన్నటికిని కృషింపక నీళ్లు పారు తోటవలె నుందురు.” యిర్మీ. 31:12.PKTel 284.2

    ప్రావచనిక పరిచర్యకు తనకు వచ్చిన పిలుపు నిమిత్తం యిర్మీయా స్వయంగా ఇలా రాశాడు : “అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి, యీలాగు సెలవిచ్చెను - ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచుచున్నాను. పెల్లగించుటకును విరుగ గొట్టుటకును, నశింప జేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మిదను రాజ్యముల మిదను నిన్ను నియమించి యున్నాను.” యిర్మీ. 1:9,10.PKTel 284.3

    “కట్టుటకును నాటుటకును” అన్న మాటల నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు. పునరుద్దరించటం స్వస్తపర్చటం అన్న దైవ సంకల్పాన్ని ఈ మాటలు యిర్మీయాకు వ్యక్తం చేస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో తాను అందించాల్సి ఉన్న వర్తమానాలు కఠినమైనవి. త్వరలో రానున్న తీర్పుల్ని నిర్భయంగా అందించాల్సి ఉన్నాడు. షీనారు మైదానాలనుంచి “కీడు” బయలుదేరి “ఈ దేశవాసులందరి మీదికి వచ్చును.” “నన్ను విడిచి... తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.” 14,16 వచనాలు. ఈ వర్తమానాల దరిమిల ఎవరైతే తమ దుష్ట మార్గాల్ని విడిచిపెడ్తారో వారికి క్షమాపణ లభిస్తుందన్న భరోసా ప్రవక్త అందించాల్సి ఉన్నాడు. యిర్మీయా తన జీవిత పరిచర్య ఆరంభంలో యూదా ప్రజల్ని తమ ఆధ్మాత్మిక జీవితానికి పటిష్టమైన పునాది వేసుకుని యధార్థ పశ్చాత్తాపానికి కృషి చేయాల్సిందిగా ప్రోత్సహించాడు. వారు చాలాకాలంగా వ్యర్ధ నిర్మాణ సామగ్రితో తమ కట్టడాన్ని నిర్మించుకుంటున్నారు. ఆ సామగ్రిని పౌలు చెక్క గడ్డి కొయ్య కాలుతోను యిర్మీయా చెత్తతోను పోల్చుతున్నారు. “యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసి వేయవలసిన వెండియని వారికి పేరు పెట్టుదురు.” యిర్మీ. 6:30. ఇప్పుడు నిత్యజీవానికి జ్ఞానయుక్తంగా నిర్మించు కోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాడు. వారు తమ మతభ్రష్టతను అవిశ్వాసాన్ని విడిచి పెట్టాలని, విశ్వాసాన్ని విధేయతను సర్రియల్ని సూచించే మేలిమి బంగారంతోను, వెండితోను ప్రశస్తమైన రాళ్లతోను పునాదివేసి తమ కట్టడాన్ని నిర్మించుకోవలసిందని, అది మాత్రమే పరిశుద్ధ దేవుని దృష్టికి అంగీకృతమని విజ్ఞప్తి చేశాడు.PKTel 284.4

    యిర్మీయా ద్వారా తన ప్రజలకు దేవుని వర్తమానం ఇది : ద్రోహివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము... మిమిద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు... నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము... భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి; నేను మా యజమానుడను, ఇదే యెహోవా వాక్కు” “నీవు - నా తండ్రి అని నాకు మొట్ట పెట్టి నన్ను మానవనుకొంటినిగదా?” “భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి మా అవిశ్వాసమును నేను బాగు చేసెదను.” యిర్మీ. 3:12-14, 19,22.PKTel 285.1

    అద్బుతమైన ఈ విజ్ఞాపనలే కాకుండా తప్పులు చేస్తున్న తన ప్రజల్ని తన పక్కకు తిప్పే మాటల్ని ప్రభువు వారికిచ్చాడు. వారు ఇలా అనాల్సి ఉంది : “నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన హోష నిష్ ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.... సిగ్గు నొందినవారమై సాగిలపడుదము రండి; మనము కనబడకుండ అవమానము మనలను మరుగు చేయునుగాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.” 22-23 వచనాలు.PKTel 285.2

    యోషీయా ఆధ్వర్యంలో చోటుచేసుకున్న దిద్దుబాటులో ఆ దేశంలోని విగ్రహాలయాలు ధ్వంసమయ్యాయి. అయితే అనేకమంది హృదయాలు మారలేదు. సత్య విత్తనాలు మొలకెత్తి విస్తారమైన పంట పండే సూచనలు కనిపించినప్పుడు అవి ముళ్ల పొదల్లో చిక్కుకుని అణగారిపోయాయి. అలాంటి భ్రష్టత మరొక్కసారి జరిగితే అది ప్రాణాంతకమౌతుంది. కనుక ప్రభువు ఆ ప్రమాదాన్ని ఆ జాతి దృష్టికి తెచ్చాడు. వారు యెహోవాకు నమ్మకంగా నివసించటంద్వారా మాత్రమే తమ జీవితంలో అభ్యుదయాన్ని దైవ ప్రసన్నతను పొందగలరు.PKTel 285.3

    ద్వితియోపదేశకాండంలో ఉన్న హితవుకు వారి గమనాన్ని యిర్మీయా పదేపదే తిప్పాడు. ఇతర ప్రవక్తల ఉపదేశంకన్నా అతడు మోషే ధర్మశాస్త్ర బోధనల్ని నొక్కిపలికి ఇవి ఉన్నత ఆధ్మాత్మిక ఆశీస్సులు జాతికీ వ్యక్తిగత హృదయాలిటీ ఒనగూర్చుతాయని వ్యక్తం చేశాడు. అతడు వారికిలా విజ్ఞప్తి చేశాడు, “పురాతన మార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని యడిగి అందులో నడుచుకొనుడి; అప్పుడు మీకు నెమ్మది కలుగును.” యిర్మీ. 6:16.PKTel 286.1

    ఒకసారి దేవుని ఆదేశం మేరకు ఆ నగర ప్రధాన ద్వారాల్లో ఒకదాని పక్క ప్రవక్త నిలబడి సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించటం ప్రాముఖ్యమని ఉదోషించాడు. యెరూషలేము నివాసులు సబ్బాతు పరిశుద్ధతను విస్మరించే ప్రమాదంలో ఉన్నారు. ఆ దినాన లౌకిక కార్యకలాపాలు నిర్వహించకూడదని ప్రవక్త ప్రజల్ని హెచ్చరించాడు. విధేయతవల్ల గొప్ప దీవెన పొందగలరని వారికి చెప్పాడు. ప్రభువిలా అన్నాడు, “మీరు నా మాట జాగ్రత్తగా విని, విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములగుండ ఏ బరువును తీసికొని పోకుండిన యెడల దావీదు సింహాసనమందు ఆసీనులై, రథముల మిదను గుఱ్ఱముల మిదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును.” యిర్మీ. 17:24,25.PKTel 286.2

    విశ్వాస పాత్రతకు ప్రతిఫలంగా దేవుడు చేసిన ఈ శ్రేయోభివృద్ధి వాగ్దానం వెంట ఒక ప్రవచనం వచ్చింది. అది ఆ పట్టణ ప్రజలు దేవునికి దేవుని ధర్మశాస్త్రానికి అపనమ్మకంగా ఉన్నట్లు నిరూపించుకుంటే భయంకర తీర్పులకు గురి అవుతారన్న ప్రవచనం. తమ పితరుల దేవునికి విధేయులై ఆయన సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే ఆ పట్టణం దానిలోని రాజ భవనాలు అగ్నివలన పూర్తిగా నాశనమై పోతాయని ఆ ప్రవచనం చెప్పింది.PKTel 286.3

    ఇలా ధర్మశాస్త్ర గ్రంథంలో సూచించిన నీతి జీవిత నిబంధనల విషయంలో ప్రవక్త స్థిరంగా నిలబడి ఉన్నాడు. అయితే యూదాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మిక్కిలి నిశ్చయాత్మక చర్యలవల్ల మాత్రమే పరిస్థితులు మెరుగుపడేటట్లు కనిపించింది. కనుక అతడు మారుమనసు పొందనివారికోసం మరెక్కువ శ్రమపడ్డాడు. వారితో ఇలా విజ్ఞాపన చేశాడు, “ముళ్లపొదలలో విత్తనములు చల్లక మి బీడు పొలమును దున్నుడి.” “యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనమును కడిగివేసికొనుము.” యిర్మీ. 4:3,14.PKTel 286.4

    కాగా మారుమనసుకి దిద్దుబాటుకి వచ్చిన పిలుపు అధిక సంఖ్యాక ప్రజలు ఖాతరు చెయ్యలేదు. దైవభక్తుడైన యోషీయా రాజు మరణించినప్పటినుంచి దేశాన్ని పాలించిన రాజులందరు విశ్వాసఘాతుకులై ప్రజల్ని తప్పుదారి పట్టించారు. ఐగుపు రాజు ప్రమేయంతో యెహోయాహాజు సింహాసనాన్ని కోల్పోయాడు. అతడి తర్వాత యోషీయా పెద్దకొడుకైన యెహోయాకీము రాజయ్యాడు. తనకు అతి ప్రియమైన యెరూషలేమును నాశనం నుంచి ఆ దేశ ప్రజల్ని బానిసత్వంనుంచి కాపాడే నిరీక్షణ ఆవిరయ్యేటట్లు కనిపించింది. అయినా పూర్తి నాశనం తప్పనట్లు కనిపించినా అతడు మౌనంగా ఉండటానికి లేదు. దేవునికి నమ్మకంగా నిలబడ్డవారిని నీతి మార్గంలో కొనసాగటానికి ప్రోత్సాహపర్చాలి. సాధ్యమైతే పాపులు తమ దుష్టత నుంచి మరలటానికి ప్రోత్సాహ ఉద్రేకాలు పొందాలి.PKTel 287.1

    ఈ సంక్షోభం నివారణకు బహిరంగ, దీర్ఘకాలిక కృషి అవసరం. ఆలయ ఆవరణలో నిలబడి లోపలికి వచ్చిపోయే యూదా ప్రజలందరితో మాట్లాడాల్సిందిగా యిర్మీయాను ప్రభువు ఆజ్ఞాపించాడు. సీయోనులోని పాపులు ఆ మాటలువిని తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టటానికి సంపూర్ణావకాశం కలిగి ఉండేందుకోసం అతడు తాను పొందిన వర్తమానాలనుంచి ఒక్కమాట కూడా తొలగించరాదన్నది దేవుని హెచ్చరిక.PKTel 287.2

    ప్రవక్త అలాగే నడుచుకున్నాడు. అతడు దేవాలయ ద్వారంలో నిలబడి హెచ్చరిస్తూ విజ్ఞాపన చేస్తూ గళమెత్తాడు. సర్వశక్తుని ఆవేశంతో నిండి ఇలా ప్రకటించాడు :PKTel 287.3

    “నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము - యెహోవాకు నమస్కారము చేయుటకై యీ ద్వారములో నుండి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మి మార్గములను మి క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి. ఆలాగనక, మీ మార్గములను మి క్రియలను మీరు యదార్ధముగా చక్కబరచుకొని, ప్రతివాడు తన పొరుగువాని యెడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రిలేనివారిని విధవరాండను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మాకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల ఈ స్థలమున తనకు నిత్యముగా నుండుటకై పూర్వ కాలమున నేను మీ పితరులకిచ్చిన ప్రదేశమున మిమ్మును కాపురముంచుదును.” యిర్మీ. 7:2-7. PKTel 287.4

    శిక్షించటానికి ప్రభువు అయిష్టత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. పశ్చాత్తాప పడనివారితో విజ్ఞాపన చేసేందుకోసం తన తీర్పుల్ని నిలుపు చేస్తున్నాడు. “భూమిమీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న ప్రభువు తప్పులు చేస్తున్న తన బిడ్డల విషయమై ఆపేక్ష కలిగి ఉన్నాడు. యిర్మీ. 9:24. తనను సేవించే నిమిత్తం ఆయన ఇశ్రాయేలీయుల్ని బానిసత్వంనుంచి బయటికి తెచ్చాడు. ఆయనే యధార్ధ సజీవ దేవుడు. వారు సుదీర్ఘ కాలం విగ్రహారాధకులై దేవునికి దూరంగా వెళ్లిపోయి ఆయన పంపిన హెచ్చరికల్ని బేఖాతరు చేసినప్పటికీ వారి శిక్షను ఆలస్యంచేసి పశ్చాత్తాప పడటానికి వారికి మరో తరుణం ఇవ్వటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నిఖార్సయిన హృదయ సంస్కరణద్వారా మాత్రమే రానున్న నాశనం నుంచి తప్పించుకోటం సాధ్యమౌతుందని ప్రభువు స్పష్టం చేశాడు. వారు ఆలయంమీద ఆలయ సేవలమీద నమ్మకం పెట్టుకున్నా అది వ్యర్ధమే. ఆచారాలు ఆచరణలు పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యలేవు. తాము దేవుని ప్రజలమని చెప్పుకున్నప్పటికీ, తమ అతిక్రమ ఫలితం నుంచి వారిని రక్షించగలిగేది హృదయంలోను జీవిత సరళిలోను దిద్దుబాటు మాత్రమే. “యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను పరిశుద్ద లేఖనాల్లో దాఖలై ఉన్న యెహోవా స్పష్టమైన మాటలు ఇవి అంటూ యిర్మీయా ఈ రీతిగా తన వర్తమానాన్ని ప్రకటించాడు, “మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకొనుడి.” యిర్మీ. 11:6. యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో దేవాలయ ఆవరణలో నిలబడి యిర్మీయా ప్రకటించిన వర్తమానం ఇది.PKTel 288.1

    నిర్గమనం జరిగిన దినాలనుంచి ఇశ్రాయేలీయుల అనుభవాన్ని క్లుప్తంగా సమీక్షించాడు. వారితో దేవుడు చేసిన నిబంధన ఇది, “నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును. మీరు నాకు జనులైయుందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞాపించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.” ఈ నిబంధనను వారు పదేపదే ఉల్లంఘించారు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు “వినకపోయిరి. చెవియొగ్గకుండిరి. ముందుకు సాగక వెనుదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్టహృదయ కాఠిన్యముననుసరించి నడుచుకొనుచు వచ్చిరి.” యిర్మీ. 7:23,24.PKTel 288.2

    “యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయు చున్నారు?” అని ప్రభువు ప్రశ్నించాడు. యిర్మీ. 8:5. ప్రవక్త మాటల్లో దానికి కారణం, వారు తమ దేవుడైన ప్రభువు మాటను వినకపోవటం, దిద్దుబాటును అంగీకరించక పోవటం. యిర్మీ. 5:3 చూడండి. “నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది. అది వారి నోటినుండి కొట్టివేయబడి యున్నది.” అంటూ అతడు వాపోయాడు. “ఆకాశమునకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును; అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.” “నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షించకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా?” యిర్మీ. 7:28, 8:7, 9:9.PKTel 289.1

    ఆత్మావలోకనానికి సమయం వచ్చింది. యోషీయా రాజుగా ఉన్న కాలంలో ప్రజల నిరీక్షణకు కొంత హేతువుంది. కాని అతడు యుద్ధంలో హతుడయ్యాడు. వారి పక్షంగా విజ్ఞాపన చెయ్యలేడు. ఆ జాతి పాపాలు ఎంత ఘోరమైనవంటే విజ్ఞాపన చేసే సమయం దాటి పోయింది. ప్రభువిలా అన్నాడు, “మోషేయు సమూయేలును నా యెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుదును. మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన యెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు - చావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింప బడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.” యిర్మీ, 15:1,2.PKTel 289.2

    ఇప్పుడు దేవుడిస్తున్న కృపాహ్వానాన్ని నిర్లక్ష్యం చెయ్యటం, మారుమనసులేని ఆ జాతి ఒక శతాబ్దం ముందు ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంమీద పడ్డ తీర్పుల్ని ఇశ్రాయేలు తనమీదికి తెచ్చుకోటమే అవుతుంది. ఇప్పుడు వారికి వచ్చిన వర్తమానం ఇది : “మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మిరీలాగున చేసినందును నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను. ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనులకును శాస్పదముగా చేసెదను.” యిర్మీ, 26:4-6.PKTel 289.3

    దేవాలయ ఆవరణలో నిలబడి యిర్మీయా చెప్పిన మాటలు వింటున్నవారు షిలోహును గూర్చిన ప్రస్తావనను, ఏలీ కాలంలో ఫిలిషీయులు ఇశ్రాయేలుపై దాడిచేసి నిబంధన మందసాన్ని పట్టుకుపోయిన సమయాన్ని గూర్చిన ప్రస్తావనను అవగాహన చేసుకున్నారు. పరిశుద్ధ హోదాలో ఉన్న తన కుమారుల దుష్టతను, ఆ దేశమంతటా ప్రబలుతున్న పాపాల్ని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు, చూస్తూ ఉండటమే ఏలీ చేసిన పాపం. అతడు ఈ పాపాల్ని సంస్కరించక పోవటంవల్ల ఇశ్రాయేలు దేశం మీదికి ఘోర విపత్తు వచ్చింది. ఏలీ కుమారులు యుద్ధంలో హతులయ్యారు. ఏలీ కూడా మరణించాడు. దేవుని మందసాన్ని ఇశ్రాయేలు దేశంలోనుంచి శత్రువులు తీసుకుపోయారు. ముప్పయి వేలమంది ప్రజలు హతులయ్యారు. ఇదంతా పాపాన్ని అతడు అదుపు లేకుండా కొనసాగనిచ్చినందుకే సంభవించింది. తాము తమ పాప జీవితాల్లో కొనసాగుతూ ఉన్నా మందసం తమతో ఉన్నది గనుక తాము ఫిలిషీయులపై విజయం సాధించటం ఖాయమని ఇశ్రాయేలీయులు వ్యర్ధంగా ఆలోచించారు. అలాగే యిర్మీయా దినాల్లో యూదా ప్రజలు దేవుడు నియమించిన ఆలయ సేవల్ని నిష్ఠగా ఆచరించటంద్వారా తమ చెడు మార్గాలకు శిక్ష తప్పించుకోగలమని భావించారు.PKTel 290.1

    నేడు దేవుని సంఘంలో బాధ్యతగల స్థానాల్ని ఆక్రమిస్తున్నవారికి ఇది ఎంత గొప్ప పాఠం! సత్యాన్ని అభాసుపాలు చేసే దోషాల్ని సంస్కరించటం విషయంలో నమ్మకంగా వ్యవహరించాలని ఈ హెచ్చరిక వస్తున్నది. దైవ ధర్మశాస్త్రపు ట్రస్టీలమని చెప్పుకునేవారు తాము దైవాజ్ఞలపట్ల కనపర్చే భక్తి తమను దేవుని న్యాయ విమర్శ నుంచి కాపాడుందని హెచ్చులు చెప్పుకోకుందురుగాక. తప్పిదం నిమిత్తం మందలింపును ఎవరూ నిరాకరించకుందురుగాక. లేక దైవ ప్రజల శిబిరాన్ని దుష్టి నిర్మూలన ద్వారా క్షాళన చేయటానికి తెగబడ్తున్నారని ఎవరూ దైవ సేవకుల్ని నిందించ కుందురుగాక. దేవుడు పాపాన్ని అసహ్యించు కుంటాడు. తన ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నట్లు చెప్పుకునేవారిని దుష్టతనుంచి తొలగవలసిందిగా పిలుపునిస్తున్నాడు. పశ్చాత్తాపపడి చిత్తశుద్ధితో విధేయత చూపటం అశ్రద్ధచేస్తే దాని పర్యవసానంగా నాడు ఇశ్రాయేలీయులు అనుభవించిన తీవ్ర పరిణామాల్నే నేటి ప్రజలూ అనుభవించటం తథ్యం. యెహోవా తీర్పులకు ఒక పరిమితి ఉంది. దానికి మించి వాటిని ఆలస్యం చెయ్యటం సాధ్యపడదు. దేవుడు ఎంపిక చేసుకున్న సాధనాలద్వారా తమకు వచ్చే సలహాలు సూచనలు నవీన ఇశ్రాయేలీయులు లెక్కచెయ్యకపోటం ప్రమాద భరితమన్నదానికి యిర్మీయా దినాల్లో యెరూషలేముకి సంభవించిన నాశనం తీవ్ర హెచ్చరిక!PKTel 290.2

    యాజకులికి ప్రజలికి యిర్మీయా అందించిన వర్తమానం పెక్కుమందిలో వ్యతిరేకత పుట్టించింది. ఆవేశంతో రెచ్చిపోతూ “యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.” యిర్మీ. 26:9. తమకు నచ్చే మాటలు చెప్పి మోసపూరిత ప్రవచనం పలకటానికి సనేమిరా ఇష్టపడని ఆ ప్రవక్త మీదికి యాజకులు, అబద్ద ప్రవక్తలు, ప్రజలు ఆగ్రహంతో వెళ్లారు. వారు ఇలా దేవుని వర్తమానాన్ని తృణీకరించి ఆయన సేవకుణ్ని చంపుతామని బెదిరించారు.PKTel 290.3

    యిర్మీయా వర్తమాన సమాచారం యూదా అధిపతులకు చేరింది. వాస్తవమేంటో స్వయంగా తెలుసుకోవాలని వారు రాజభవనంనుంచి దేవాలయానికి వెళ్లారు. “యాజకులును ప్రవక్తలును అధిపతులతోను సమస్త ప్రజలతోను ఈలాగనిరి - మీరు చెవులార వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు పాత్రుడు.” 11వ వచనం. అయినా యిర్మీయా అధిపతుల ముందు ప్రజలముందు ధైర్యంగా నిలబడి ఇలా ప్రకటించాడు: “ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మా క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వశములోనున్నాను; మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపినయెడల మీరు మిమిదికిని ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మిదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.” PKTel 291.1

    ఉన్నతాధికారంలో ఉన్నవారి బెదిరింపులకి ప్రవక్త భయపడిఉంటే అతడి వర్తమానం నిష్పలమయ్యేది. అతడు తన ప్రాణాలు కూడా కోల్పోయేవాడు. కాని అతడు తన వర్తమానాన్ని జంకు కొంకు ఏకోశాన లేకుండా అందించినందుకు ప్రజల గౌరవాభిమానాల్ని పొందాడు. ఇశ్రాయేలు అధిపతులు ప్రవక్తకు మద్దతు పలికారు. వారు యాజకులతోను అబద్ద ప్రవక్తలతోను చర్చలు జరిపి తాము తలపెట్టిన తీవ్ర చర్యలు ఎంత అనుచితం అవివేకం అయినవో వారికి వివరించారు. వారి మాటలు ప్రజల మనుసుల్లో సానుకూల ప్రతిస్పందనను పుట్టించాయి. ఈవిధంగా దేవుడు తన సేవకుడికి మద్దతుదారుల్ని లేపాడు.PKTel 291.2

    యిర్మీయాను దండించటం విషయంలో యాజకుల తీర్మానాన్ని వ్యతిరేకించటంలో పెద్దలుకూడా ఏకమయ్యారు. “చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములవలె అగును” అంటూ దేవుని తీర్పులు ప్రవచించిన మికాను ప్రస్తావించారు. “అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా యైనను యూదా జనులందరిలో మరీ ఎవడైనను అతని చంపేనా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమిదికే గొప్ప కీడు తెచ్చుకొందుము” అని హెచ్చరించారు. 18,19 వచనాలు.PKTel 291.3

    పలుకుబడి ప్రాబల్యంగల ఈ వ్యక్తుల విజ్ఞాపన ద్వారా ప్రవక్తకు మరణాపాయం తప్పింది. అయితే యాజకుల్లోను అబద్ద ప్రవక్తల్లోను అనేకమంది అతడు ప్రకటిస్తున్న నిష్టుర సత్యాల్ని జీర్ణించుకోలేకపోయారు. వారు అతడిమిద దేశద్రోహ నేరం మోపి చంపటానికి వెనకాడేవారు కాదు. యిర్మీయా యూదా ముందు మనుషుడి ఆగ్రహానికి అతీతమైన “యిత్తడి ప్రాకారముగా” నిలిచాడు. ప్రభువు తన సేవకుణ్ని ముందే ఇలా హెచ్చరించాడు, “వారు నీమీద యుద్ధము చేయుదురు; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్దము చేయుదురు గాని నిన్ను జయింపక పోవుదురని యెహోవా వాక్కు సెలవిచ్చుచున్నది. దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమోచించెదను.” యిర్మీ. 6:27; 15:20,21.PKTel 292.1

    అతడు స్వాభావికంగా పిరికివాడు. వెనక్కి తగ్గే తత్వం గలవాడు. ప్రశాంత వాతావరణంలోని శాంతిని ఆశించాడు. అక్కడ తన జాతి ఎడతెగని పశ్చాత్తాప రాహిత్యాన్ని తాను చూడాల్సిన అవసరం ఉండదు. పాపం కలిగించిన చేటును గురించి అతడి హృదయం వేదననుభవించేది. “నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నాకన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. ఆహహా అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారి యొద్దనుండి తొలగిపోవుదును.” యిరీ. 9:1,2.PKTel 292.2

    అతడు అవహేళనను భరించాడు. అతడి వర్తమానాన్ని తృణీకరించి తమ రక్షణకోసం అతడికున్న హృదయ భారాన్ని లెక్కచెయ్యనివారు సంధించే హేళన ఎగతాళి బాణాలచే అతడి హృదయం తీవ్రంగా గాయపడింది. “నావారికందరికి నేను అపహాస్యా స్పదముగా ఉన్నాను. దినమెల్ల వారు పాడునట్టి పాటకు నేను ఆస్పదుడనైతిని.” “నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.” “నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు - దుర్మార్గుడని మీరు చాటించిన యెడల మేమును చాటింతుమందురు. అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరును నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొని యున్నారు.” అన్నాడు. విలాప. 3:14; యిర్మీ. 20:7,10. PKTel 292.3

    కాగా విశ్వాసపాత్రుడైన ఈ ప్రవక్త సహనం కలిగి ఉండటానికి రోజుకి రోజు శక్తిని పొందాడు. అతడు విశ్వాసంతో ఇలా వెల్లడించాడు : “పరాక్రమముగల కుమారుని వలె యెహోవా నాకు తోడై యున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లు దురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు.” “యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.” యిర్మీ. 20:11,13.PKTel 293.1

    తన యౌవన దినాల్లోను, అనంతరం తన పరిచర్య కాలంలోను యిర్మీయాకు కలిగిన అనుభవాలు “తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు” నేర్పించాయి. “యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపబడునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధినిబట్టి నన్ను శిక్షింపుము.” అని ప్రార్థించటం నేర్చుకున్నాడు. యిర్మీ. 10:23,24.PKTel 293.2

    శ్రమల పాత్రలోని పానీయాన్ని సేవించాల్సిసిందిగా పిలుపు వచ్చినప్పుడు “యెహోవాయందు నాకిక ఆశలు లేవు” అనటానికి శోధింపబడ్డప్పుడు తనపట్ల దేవుడు కనపర్చిన కృపలను జ్ఞాపకం చేసుకుని, అతడు విజయ దరహాసంతో ఇలా పలికాడు, “యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యము యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైన నమ్మదగినవాడవు. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించినవారియెడల యెహోవా దయాళుడు. తన్ను వెదకువారి యెడల ఆయన దయ చూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.” విలాప. 3:18, 22-26.PKTel 293.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents