Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విభాగం : 1 - బలంనుంచి బలహీనతకు

    1 - సొలొమోను

    దావీదు సొలొమోనుల పరిపాలనలో ఇశ్రాయేలు రాజ్యం రాజ్యాలన్నిటిలో బలమైన రాజ్యంగా రూపొందింది. సత్యం విషయంలోను, న్యాయం విషయంలోను ప్రాబల్యం చూపటానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. యెహోవా నామాన్ని ఘనపర్చి గౌరవించటం జరిగింది. ఏ ఉద్దేశంతో ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలో స్థిరపడ్డారో అది సఫలమయ్యింది. ప్రతిబంధకాలు తొలగిపోయాయి. అన్యజన ప్రాంతాలనుంచి సత్యాన్ని వెదుక్కుంటూ వచ్చిన వారెవరినైనా తృప్తిపరచకుండా పంపటం జరగలేదు. ఎందరో క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. భూమిపై దేవుని సంఘం విస్తరించి పరిఢవిల్లింది.PKTel 2.1

    తన చివరి సంవత్సరాల్లో దావీదు సింహాసనాన్ని ఖాళీచేసి కుమారుడు సొలొమోనును అభిషేకించి రాజుగా ప్రకటించాడు. సొలొమోను ప్రారంభ జీవితం ప్రగతిశీలంగా ఉంది. అతడు బలంనుంచి అధిక బలానికి, మహిమనుంచి అధిక మహిమకు ఎదుగుతూ నిత్యం తనవంటి ప్రవర్తనను కలిగి ఉండటానికి ఇతరులికి స్ఫూర్తి నిచ్చాడు. దైవ సత్య ధర్మకర్తలుగా వారు తమ బాధ్యతలు నిర్వహించ టానికి దోహదపడాలన్నది అతడి విషయంలో దేవుని కోరిక. PKTel 2.2

    దేవుడు తమ ముందుంచిన ప్రమాణాన్ని చేరటానికి పాలకులు, పాలితులు మెలకువగా ఉండి నిత్యం కృషి చెయ్యటం ద్వారా మాత్రమే ఇశ్రాయేలు విషయంలో దేవుని ఉద్దేశం నెరవేరుతుందని దావీదుకి తెలుసు. దేవుడు తనపై ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడుకోవాలంటే యువకుడైన సొలొమోను యుద్దశూరుడు, రాజకీయవేత్త, సర్వాధికారి మాత్రమేకాక, మంచి వ్యక్తిగా, నీతి బోధకుడుగా, నిజాయితీకి ఆదర్శంగా ఉండాలని దావీదుకి తెలుసు.PKTel 2.3

    సాహసం, ఉదాత్తగుణం కలిగి ఉండాలని, ప్రజలపట్ల కరుణ, ప్రేమాను రాగాలు ప్రదర్శించాలని, లోక రాజ్యాలతో తన వ్యవహారాలన్నిటిలో దేవునికి ఘనత మహిమ కలిగేవిధంగా మెలగుతూ పరిశుద్ధతా సౌందర్యాన్ని కనపర్చాలని ఉద్బోధించాడు. తన జీవితకాలంలో దావీదు పొందిన అనుభవాలు, ఉదాత్త గుణాలు ఎంతో విలువైనవని తనకు నేర్పిన పాఠాన్ని తాను మరణిస్తున్న సమయంలో సొలొమోనుకి ఇచ్చిన ఈ ఉద్దేశంలో తెలిపాడు. “మనుష్యులను ఏలునొకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు కలిగి యేలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బులేకుండ ఉదయించిన సూర్యునివలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.” 2 సమూ. 23:3,4.PKTel 2.4

    ఆహా, సొలొమోనుకి కలిగిన తరుణం ఎంత గొప్పది! తన తండ్రి దైవావేశం వల్ల ఇచ్చిన ఉపదేశాన్ని అతడు ఆచరిస్తే డబ్బయి రెండో కీర్తనలో వర్ణించిన రీతిగా అతడి పరిపాలన నీతివంతమైన పరిపాలనగా ఉంటుంది:PKTel 3.1

    “దేవా, రాజునకు నీ న్యాయవిధులను
    రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము
    నీతినిబట్టి నీ ప్రజలకును
    న్యాయ విధులనుబట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు
    న్యాయము తీర్చును
    నీతినిబట్టి పర్వతములును చిన్న కొండలును
    ప్రజలకు నెమ్మది పుట్టించును
    ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును

    బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును
    సూర్యుడు నిలుచునంతకాలము
    చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను
    జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు
    గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను
    భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును
    అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు
    చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును
    సముద్రమునుండి సముద్రము వరకు
    యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతముల వరకు
    అతడు రాజ్యము చేయును
    అరణ్యవాసులు అతనికి లోబడుదురు
    అతని శత్రువులు మన్ను నాకెదరు
    తరీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు
    షేల రాజులును సెబా రాజులును కానుకలు తీసికొని వచ్చెదరు
    రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు నిరు పేదలయందును బీదలయందును అతడు కనికరించును
    బీదల ప్రాణములను అతడు రక్షించును
    కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును
    వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును
    అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును
    అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు
    దినమంతయు అతని పొగడుదురు
    దేశములోను, పర్వత శిఖరములమిదను సస్యసమృద్ధి కలుగును
    దాని పంటను లెబనోను వృక్షమువలె తాండవమాడుచుండును
    నేలమీద పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు
    అతని పేరు నిత్యము నిలుచును
    అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును
    అతనినిబట్టి మనుష్యులు దీవించబడుదురు
    అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు
    దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడునుగాక
    ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు
    ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక
    సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక.
    ఆమేన్. ఆమేన్.”
    PKTel 3.2

    తన యౌవనంలో సొలొమోను దావీదు ఎంపికనే తన ఎంపిక చేసుకున్నాడు. అనేక సంవత్సరాలు యదార్ధంగా నడిచాడు. అతడి జీవితం దైవాజ్ఞలకు విధేయంగా సాగింది. తన రాజ్యపాలన ఆరంభంలో అతడు తన సలహాదారులతో గిబియోనుకు వెళ్లాడు. అక్కడ అరణ్యంలో నిర్మితి అయిన గుడారం ఇంకా ఉంది. అక్కడ తన సలహాదారులు అనగా “సహస్రాధిపతులు”, “శతాధిపతులు”, “న్యాయాధిపతులు”, “ఇశ్రాయేలీయుల పితరులు”, “ఇండ్లకు పెద్దలైనవారు” వీరందరూ కలిసి దేవునికి బలులు అర్పించి ప్రభువు సేవకు తమ్మును తాము పూర్తిగా సమర్పించుకున్నారు. (2 దిన వృ. 1:2). రాచరికపు బరువు బాధ్యతల విషయంలో అవగాహన ఉన్న సొలొమోను భారమైన బాధ్యతలు వహించేవారు వాటిని సవ్యంగా నిర్వహించటానికి సర్వజ్ఞాని అయిన ప్రభువు నడుపుదల కోరాలని గ్రహించాడు. తనతో కలిసి దేవుని ఆమోదాన్ని యాచించటానికి తన సలహాదారుల్ని ప్రోత్సహించాడు.PKTel 4.1

    దేవుడు తనకు నియమించిన పనిని నిర్వహించేందుకు లౌకికమైన ఏ ఉపకారం కాక, రాజు జ్ఞానాన్ని కోరుకున్నాడు. ప్రతిభను, విశాల హృదయాన్ని, సున్నిత స్వభావాన్ని ఆశించాడు. ఆ రాత్రి దేవుడు సొలొమోనుకి కలలో కనిపించి ఇలా అన్నాడు, “నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాని నడుగుము” అన్నాడు. యువకుడు అనుభవం లేనివాడు అయిన రాజు తన నిస్సహాయ స్థితిని వివరించి సహాయాన్ని అర్థించాడు. “నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యధార్థమైన మనస్సుగలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని యెడల పరిపూర్ణ కటాక్షమగుపరచి, యీ దినమున నున్నట్టుగా అతని సింహాసనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహా కృపను చూపించియున్నావు. నా దేవా, యెహోవా, నీవు నా తండ్రియైన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనులమధ్య ఉన్నాను. వారు విస్తరించి యున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనికీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము.”PKTel 4.2

    “సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను.” కనుక దేవుడు అతడికి ఇలా సెలవిచ్చాడు, “దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణములనైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములుగల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు. ఇకమీదట నీవంటి వాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటి వాడొకడైనను ఉండడు.”PKTel 5.1

    “మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనినయెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.” 1 రాజులు. 3:5-14;2 దిన వృ. 1:7-12.PKTel 5.2

    తాను దావీదుతో ఉన్న మాదిరిగానే తనతోకూడా ఉంటానని దేవుడు సొలొమోనుకి వాగ్దానం చేశాడు. రాజు దేవుని ముందు నీతిగా నిజాయితీగా నడిచినట్లయితే, దేవుడు ఆజ్ఞాపించినట్లు ప్రవర్తించినట్లయితే అతడి సింహాసనం భద్రంగా ఉంటుంది. అతడి పరిపాలన ఇశ్రాయేలుని “జ్ఞాన వివేకములుగల జనము”గా, చుట్టుపట్ల ఉన్న ప్రజలను వెలుగుగా తీర్చిదిద్దేదిగా ఉంటుంది. ద్వితి. 4:6. PKTel 5.3

    గిబియోనులో పురాతన బలిపీఠం ముందు నిలబడి సొలొమోను దేవునికి చేసిన ప్రార్ధనలో వాడిన మాటలు అతడి సాత్వికాన్ని దేవున్ని ఘనపర్చాలన్న అతడి తపనను వెల్లడి చేస్తున్నాయి. తనమీద ఉన్న బాధ్యతల్ని దేవుని అండ లేకుండా నిర్వర్తించటానికి చిన్నబిడ్డవలె అశక్తుణ్నని గుర్తించాడు. తనకు యుక్తాయుక్త జ్ఞానం లేదని గ్రహించాడు. తన అవసరం గుర్తింపు దేవునినుంచి వివేకాన్ని కోరుకోటానికి అతణ్ని నడిపించింది. ఇతరులకన్నా తనను ఉన్నతంగా ఉంచే జ్ఞానం కావాలన్న స్వార్థాశ అతడి మనసులోలేదు. తన పై ఉన్న బాధ్యతల్ని నమ్మకంగా నిర్వహించాలని ఆకాంక్షించాడు. అందుకే తన పరిపాలనను దేవునికి మహిమ తెచ్చేరీతిలో తీర్చిదిద్దే వరాన్ని కోరుకున్నాడు. “నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్దిచాలదు” అన్నప్పుడు సొలొమోను కనపరచిన భాగ్యం, వివేకం, ఔన్నత్యం నభూతో.PKTel 6.1

    ఈనాడు బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవారు సొలొమోను ప్రార్థన బోధిస్తున్న పాఠాన్ని నేర్చుకోటానికి ప్రయత్నించాలి. ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థానాన్ని అలంకరిస్తాడో అతడు వహించే బాధ్యత అంత భారంగాను అతడు ప్రసరించే ప్రభావం అంత విస్తృతంగాను అతడు దేవునిపై ఆధారపడాల్సిన అవసరం అంత ఎక్కువగాను ఉంటుంది. పని చెయ్యటానికి వచ్చే పిలుపుతోపాటు తన సహోదరులముందు ఆచితూచి అడుగులు వెయ్యటానికి పిలుపు వస్తుందని అతడు నిత్యం గుర్తుంచుకోవాలి. దేవునిముందు అతడు విద్యార్థి వైఖరితో నిలబడాలి. హోదావల్ల ప్రవర్తనకు పరిశుద్దత సంక్రమించదు. ఒక వ్యక్తి దేవున్ని ఘనపర్చటం ద్వారా ఆయన ఆజ్ఞల్ని ఆచరించటం ద్వారా మాత్రమే వాస్తవంగా గొప్పవాడుగా పరిగణన పొందుతాడు.PKTel 6.2

    మనం సేవించే దేవుడు పక్షపాతికాడు. సొలొమోనుకి వివేకాన్ని, వివేచనను ఇచ్చిన ఆ ప్రభువు వాటిని ఈనాడు తన బిడ్డలకు అనుగ్రహించటానికి సిద్దంగా ఉన్నాడు. ఆయన వాక్యం ఇలా సెలవిస్తున్నది, “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింప బడును.” యాకో. 1:5. బాధ్యత బరువును మోస్తున్న ఒక వ్యక్తి భాగ్యం అధికారం లేక పేరుకన్నా వివేకాన్ని కోరుకున్నప్పుడు అతడు దాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తి ఏమి చెయ్యాలో మాత్రమేగాక దేవుని ఆమోద ముద్రను పొందేరీతిగా దాన్ని ఎలా చెయ్యాలోకూడా ఆ మహోపాధ్యాయుడు నేర్పుతాడు.PKTel 6.3

    దేవునినుంచి వివేకాన్ని వివేచనను పొందిన వ్యక్తి ఆయనకు అంకితమై ఉన్నంతకాలం ఉన్నత స్థానాల్ని అధిష్టించటానికి వెంపర్లాడడు. అధికారం చెలాయించటానికి అదుపు చెయ్యటానికి ప్రయత్నించడు. మనుష్యులు బాధ్యతలు వహించటం అవసరమే కాని నిజమైన నాయకుడు సర్వాధికారం కోసం శ్రమించే బదులు గ్రహించే హృదయంకోసం, మంచి చెడులను గ్రహించే జ్ఞానం కోసం ప్రార్థిస్తాడు.PKTel 6.4

    నాయకులుగా నియమితులైన వ్యక్తుల మార్గం సులువైనది కాదు. అయితే వారు తమకు ఎదురయ్యే ప్రతీ కష్టంలోను ప్రార్థనకు పిలుపును వినాలి. సమస్త జ్ఞానానికి మూలం అయిన దేవున్ని సంప్రదించటం వారు ఎన్నడూ విస్మరించకూడదు. రక్షకుని నుంచి శక్తిని, వికాసాన్ని పొంది అపవిత్ర ప్రభావాన్ని బలంగా ప్రతిఘటించటానికి తప్పొప్పుల్ని గ్రహించటానికి వారు సమర్థులవుతారు. దేవుడు ఆమోదించిన దాన్నే వారు ఆమోదిస్తారు. ఆయన సేవలో తప్పుడు నియమాల వినియోగాన్ని ప్రతిఘటించటానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారు. PKTel 7.1

    ధనం, గౌరవం, దీర్ఘాయుష్చుకన్నా సొలొమోను కోరుకున్న వివేకాన్ని దేవుడు అతడికి ఇచ్చాడు. చురుకైన మనసు, విశాల హృదయం, కరుణార్ధ స్వభావం కోసం సొలొమోను మనవిని ఆయన మంజూరు చేశాడు. “దేవుడు జ్ఞానమును, బుద్దిని వర్ణింప శక్యముగాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయ చేసెను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానముకంటెను, ఐగుప్తీయుల జ్ఞానముకంటెను అధికమై యుండెను. అతడు సమస్తమైన వారి కంటెను; ... జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తి చుట్టునున్న జనములన్నిటిలో వ్యాపిత మాయెను.” 1 రాజులు. 4:29-31.PKTel 7.2

    “అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.” 1 రాజులు. 3:28. ప్రజలు దావీదుపట్ల అభిమానం చూపినట్లే సొలొమోనుపట్ల అనురక్తి చూపించి అన్ని విషయాల్లోను అతడికి విధేయులయ్యారు. “సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితోకూడ ఉండి అతనిని బహు ఘనుడైన రాజుగా చేసెను.” 2 దిన వృ. 1:1. PKTel 7.3

    సొలొమోను అనేక సంవత్సరాలు దేవునిపట్ల ఎంతో భక్తిగా నీతి నిబద్ధంగా నియమబద్ధంగా దైవాజ్ఞలకు విధేయంగా జీవించాడు. ప్రతీ ముఖ్య కార్యానికి దేవుడు దిశానిర్దేశం చేశాడు. అతడు దేశానికి సంబంధించిన వ్యాపార విషయాలన్నిటిని విజ్ఞతతో నిభాయించాడు. అతడి భాగ్యం, వివేకం, బ్రహ్మాండమైన భవనాలు, తన పరిపాలన తొలి సంవత్సరాల్లో తాను నిర్మించిన రహదార్లు, శక్తి, భక్తి, న్యాయ వ్యవస్థ, మాటలోను, క్రియలోను తాను చూపిన ఔదార్యం ప్రజల విశ్వాసాన్ని, అభిమానాన్ని సంపాదించాయి. అనేక ఇతర దేశాల పరిపాలకుల నివాళులు ప్రశంసల్ని పొందాయి.PKTel 7.4

    సొలొమోను ఏలుబడి మొదటి భాగంలో యెహోవా నామాన్ని ఘనపర్చటం జరిగింది. రాజు ప్రదర్శించిన వివేకం, నీతి నిజాయితీలు అతడు ఆరాధించిన దేవుని ఔన్నత్యాన్ని గుణగణాల్ని అన్నిదేశాల ప్రజలకూ చాటాయి. కొంతకాలం ఇశ్రాయేలు యెహోవా ఔన్నత్యాన్ని ప్రదర్శించే వెలుగుగా వర్ధిల్లింది. సొలొమోను తొలినాళ్ల పరిపాలన ప్రాభవం అతడి అపూర్వ వివేకంలోగాని అతడి అధికారం పేరు ప్రతిష్టల్లో గాని లేదు. కాని దేవుడిచ్చిన వరాల్ని తెలివిగా వినియోగించటం ద్వారా ఇశ్రాయేలు దేవునికి తెచ్చిన ఘనతలో ఉన్నది.PKTel 8.1

    గతిస్తున్న సంవత్సరాలతో సొలొమోను కీర్తి పెరుగుతున్నకొద్దీ తన మానసిక ఆధ్యాత్మిక బలాన్ని వృద్ధి పర్చుకుంటూ తాను పొందిన ఆశీర్వాదాల్ని ఇతరులికి అందించటంద్వారా అతడు దేవున్ని ఘనపర్చటానికి కృషి చేశాడు. యెహోవా కటాక్షం వల్లనే తనకు అధికారం, వివేకం అవగాహన లభించాయని, రాజులకు రాజైన దేవుని గూర్చిన జ్ఞానాన్ని లోకానికి అందించటానికే ఈ వరాల్ని దేవుడు తనకు ఇవ్వటం జరిగిందని సొలొమోనుకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియలేదు.PKTel 8.2

    సొలొమోను ప్రాకృతిక చరిత్రపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. కాని అతడి పరిశోధన ఏ ఒక్క విజ్ఞాన శాఖకూ పరిమితం కాలేదు. సృష్టి అయిన సమస్తాన్ని అది చేతనమైందే గాని అచేతనమైందేగాని ఏకాగ్రతతో అధ్యయనం చెయ్యటంద్వారా సృష్టికర్తను గూర్చి స్పష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రకృతి శక్తుల్లో, ఖనిజ ప్రపంచం, జంతు ప్రపంచంలో, ప్రతీ చెట్టు పొద పువ్వులో సొలొమోను దేవుని వివేకాన్ని చూశాడు.PKTel 8.3

    దైవావేశపూరితమైన సొలొమోను జ్ఞానం స్తుతిగీతాలు అనేక సామెతల్లో వ్యక్తమయ్యింది. “అతడు మూడువేల సామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునేగాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనేగాని చెట్లన్నిటినిగూర్చి అతడు వ్రాసెను.” 1 రాజులు. 4:32,33.PKTel 8.4

    సొలొమోను సామెతల్లో పరిశుద్ధ జీవిత సూత్రాలు, ఉన్నత కృషి నియమాలు సూచితమయ్యాయి. అవి పరలోక సూత్రాలు. దైవ భక్తికి నడిపించే సూత్రాలు. జీవితంలో ప్రతీ కార్యానికి ప్రాతిపదిక కావలసిన సూత్రాలు. సొలొమోను ఏలుబడి ఆరంభ సంవత్సరాల్లోని నైతిక ప్రగతికి లౌకిక విషయాల్లో అభివృద్ధికి కారణం ఈసూత్రాల విస్తృత వ్యాప్తి ఘనత, మహిమ దేవునికే చెందాలి అన్న గుర్తింపే.PKTel 8.5

    “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటే అది ప్రియమైనది. నీ యిష్ట వస్తువులన్నియు దానితో సమానములు కావు. దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమ చేతిలో ధనఫలములును ఉన్నవి. దాని మార్గములు రమ్యమార్గములు, దాని త్రోవలన్నియు క్షేమకరములు. దాని నవలంబించు వారికి అది జీవ వృక్షము, దాని పట్టుకొను వారందరు ధన్యులు.” సామె. 3:13-18.PKTel 9.1

    “జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయుఇచ్చి బుద్ది సంపాదించుకొనుము.” సామె. 4:7. “యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము.” కీర్త. 111:10. “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే.” సామె. 8:13.PKTel 9.2

    ఈ జ్ఞానోపదేశాన్ని అనంతర సంవత్సరాల్లో సొలొమోను పాటించిఉంటే ఎంత బాగుండేది! “జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును.” (సామె. 15:7) అని ప్రకటించిన అతడు ఒక లోక రాజుకు అర్పించే స్తోత్రాన్ని రాజులకు రాజైన దేవునికి అర్పించటం మంచిదని రాజులికి ఉద్బోధించిన అతడు “మూర్ఖపు మాటలు”, “గర్వము, అహంకారము”తో పలికి దేవునికి మాత్రమే చెందిన మహిమను తానే తీసుకోకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది! PKTel 9.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents