Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    33 - ధర్మశాస్త్ర గ్రంథం

    బబులోను దాస్యం గురించి ప్రవక్తల వర్తమానాలు చూపిన శక్తిమంతమైన ప్రభావాలు యోషీయా ఏలుబడిలో పద్దెనిమిదో ఏట చోటుచేసుకున్న దిద్దుబాటుకి దారితీశాయి. ప్రవచించిన తీర్పుల్ని తాత్కాలికంగా నిలువరించిన ఈ దిద్దుబాటు ఉద్యమం ఎవరూ ఊహించని రీతిగా చోటుచేసుకుంది. అనేక సంవత్సరాలుగా మరుగునపడిన ఒక లేఖన భాగాన్ని దొరకటం దాన్ని అధ్యయనం చేయటంద్వారా అది జరిగింది.PKTel 273.1

    దాదాపు ఒక శతాబ్దం పూర్వం హిజ్కియా జరిపించిన మొదటి పస్కాలో యాజక బోధకులు ధర్మశాస్త్ర గ్రంథంనుంచి ప్రతిదినం ప్రజలికి చదివి వినిపించటానికి ఏర్పాట్లు జరిగాయి. మోషే దాఖలు చేసిన, ముఖ్యంగా ద్వితియోపదేశకాండంలో భాగమైన నిబంధన గ్రంథంలో ఉన్న కట్టడల్ని ఆచరించటం మూలాన హిజ్కియా ఏలుబడి ప్రగతి శీలమయ్యింది. అయితే ఈ కట్టడల్ని మనష్షే కాలరాయడానికి సాహసించాడు. అతడి ఏలుబడి కాలంలో ఆలయానికి చెందిన ధర్మశాస్త్ర గ్రంథపు ప్రతి అజాగ్రత్త కారణంగా పోయింది. ఇలా అనేక సంవత్సరాలపాటు ప్రజలికి దైవోపదేశం లేకపోయింది.PKTel 273.2

    ఎంతోకాలంగా కనిపించని గ్రంథం ప్రతి ప్రధాన యాజకుడైన హిల్కీయాకు దొరికింది. యోషీయా రాజు ప్రణాళిక ప్రకారం ఆలయానికి పరిశుద్ధాలయాన్ని కాపాడ్డానికి మరమ్మత్తులు నిర్వహిస్తుండగా అది దొరికింది. ప్రధాన యాజకుడు ఆ గ్రంథాన్ని గొప్ప పాండిత్యంగల శాస్త్రి అయిన షాఫానుకి ఇచ్చాడు. అతడు ఆ గ్రంథాన్ని అధ్యయనంచేసి ఆ మిదట దాన్ని రాజుకి ఇచ్చి అది ఎలా దొరికిందో వివరించాడు.PKTel 273.3

    ఆ ప్రాచీన రాత ప్రతిలో దాఖలై ఉన్న హితవుని హెచ్చరికల్ని చదవగా మొట్టమొదటిసారిగా విన్నప్పుడు యెషీయా తీవ్రంగా ఆందోళన చెందాడు. “జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును” (ద్వితి. 30:19). ఇశ్రాయేలీయులముందు దేవుడు ఉంచాడన్న సంగతిని మునుపెన్నడూ అతడు ఇంత పూర్తిగా గుర్తించలేదు. భూమిపై దేవుని స్తోత్రించే ప్రజలుగాను సర్వజాతులకూ ఆశీర్వాదంగాను ఉండేందుకు జీవన మార్గాన్ని ఎంచు కోవలసిందిగా వారికి ఎంత తరచుగా విజ్ఞప్తులు వచ్చాయి! “భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు. నిన్నెన్నడు ఎడబాయడు” అంటూ మోషే ద్వారా ఇశ్రాయేలికి ఆయన భరోసా ఇచ్చాడు. ద్వితి. 31:6.PKTel 273.4

    తనను సంపూర్తిగా నమ్మినవారందరిని బహుగా రక్షించటానికి దేవుడు సంసిద్ధుడన్న వాగ్దానాలతో ఆ గ్రంథం నిండి ఉంది. ఐగుప్తు దాస్యంనుంచి తమను విడిపించిన రీతిగానే వారిని వాగ్దత్త దేశంలో స్థిరపర్చటానికి లోక రాజ్యాలన్నిటిలో అగ్ర స్థానంలో ఉంచటానికి ఆయన అద్భుతాలు చేయనున్నాడు.PKTel 274.1

    విధేయతకు ప్రతిఫలంగా దేవుడు ఇవ్వజూపిన ప్రోత్సాహకాల వెంబడి అవిధేయులపైకి రానున్న తీర్పుల్ని గూర్చిన ప్రవచనాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. ఆవేశపూరితమైన ఆ మాటలు విన్నప్పుడు, తన ముందున్న దృశ్యంలోని పరిస్థితులు తన రాజ్యంలో ఉన్న పరిస్థితులు ఒకేలాగున్నట్లు రాజు గుర్తించాడు. దేవున్ని విడిచిపెట్టటాన్ని గూర్చిన ఈ ప్రావచనిక చిత్రమాలిక సందర్భంగా, ఆ భయంకర దినం వేగంగా వస్తుందని, దానికి తిరుగులేదని స్పష్టంగా చెబుతున్న విషయాల్ని విన్నప్పుడు రాజు కలవరం చెందాడు. ఆ మాటలు స్పష్టంగా ఉన్నాయి. వాటి భావంలో ఎలాంటి పొరపాటూ లేదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వ్యవహరించిన తీరును గూర్చిన సంగ్రహ కథనంలోను భవిష్యత్ సంభవాల వివరణలోను ఆ గ్రంథం చివరలో ఈ విషయాల్ని విస్పష్టం చెయ్యడం జరిగింది. ఇశ్రాయేలీయు లందరూ వింటుండగా మోషే ఇలా ప్రకటించాడు :PKTel 274.2

    “ఆకాశమండలమా, నా నోటిమాట వినుము
    నా ఉపదేశము వానవలె కురియును
    నా వాక్యము మంచువలెను
    లేత గడ్డిమీద పడు చినుకులవలెను
    పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును
    నేను యెహోవా నామమును ప్రకటించెదను
    మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి
    ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు; ఆయన
    కార్యము సంపూర్ణము
    ఆయన చర్యలన్నియు న్యాయములు
    ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు
    ఆయన నీతిపరుడు యధార్థవంతుడు.”
    PKTel 274.3

    ద్వితి. 32:1-4.

    “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము
    తరతరముల సంవత్సరములను తలంచుకొనుము
    నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును;
    నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు
    మహోన్నతుడు జనులకు వారి స్వాస్థ్యములను విభా
    గించినప్పుడు
    నరజాతులను ప్రత్యేకించినప్పుడు
    ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను
    నియమించెదను
    యెహోవా వంతు ఆయన జనమే
    ఆయన స్వాస్థ్యభాగము యాకోబే
    అరణ్య ప్రదేశములోను
    భీకర ధ్వనిగల పాడైన యెడారిలోను
    వాని కనుగొని ఆదరించి పరామర్శించి తన కనుపాపను
    వలె వాని కాపాడెను.”
    PKTel 275.1

    7-10 వచనాలు.

    అయితే ఇశ్రాయేలు “క్రొవ్వినవాడై కాలు జాడించెను
    నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి
    వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను
    తన రక్షణ శైలమును తృణీకరించెను
    వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము
    పుట్టించిరి
    హేయ కృత్యములచేత ఆయనను కోపింపజేసిరి
    వారు దేవత్వములేని దయ్యములకు
    తామెరుగని దేవతలకు
    క్రొత్తగా పుట్టిన దేవతలకు
    తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి
    నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి
    నిన్ను కనిన దేవుని మరచితివి యెహోవా దానిని చూచెను
    తన కుమారుని మిదను కుమార్తెల మిదను క్రోధపడెను
    వారిని అసహ్యించుకొనెను
    ఆయన ఇట్లనుకొనెను —
    నేను వారికి విముఖుడవై వారి కడపటి స్థితి యేమగునో
    చూచెదను
    వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసములేని పిల్లలు
    వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం
    చిరి
    తన వ్యర్థ ప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి
    కాబట్టి జనము కానివారి వలన వారికి రోషము పుట్టిం
    తును
    అవివేక జనము వలన వారికి క్రోధము పుట్టింతును.”

    “వారికి ఆపదలను విస్తరింపజేసెదను
    వారిమీద నా బాణములన్నిటిని వేసెదను
    వారు కరవుచేత క్షీణించుదురు
    మంటలచేతను క్రూరమైన హత్యచేతను హరించి
    పోవుదురు
    బురదలో ప్రాకు పాముల విషమును
    మృగముల కోరలను వారిమీదికి రప్పింతును.”

    “వారు ఆలోచనలేని జనము
    వారిలో వివేకము లేదు
    వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి
    స్థితి యోచించుట మేలు
    తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని యెడల
    యెహోవా వారిని అప్పగింపనియెడల
    ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును?
    ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు?
    వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది
    కాదు
    ఇందుకు మన శత్రువులే తీర్పరులు.”

    “ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?
    వారి కాలుజారు కాలమున
    పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే;
    వారి ఆపద్దినము సమీపించును
    వారి గతి త్వరగా వచ్చును
    వారికాధారము లేకపోవును.”
    PKTel 275.2

    15-21,23,24,28-31,34,35 వచనాలు.

    ఇవి ఇలాంటి వాక్యభాగాలూ దేవుడు తన ప్రజల్ని ప్రేమిస్తున్నాడని పాపమంటే ఆయనకు హేయమని యోషీయాకి వెల్లడి చేశాయి. తిరుగుబాటును విడిచి పెట్టకుండా కొనసాగించే ప్రజలపైకి సత్వర తీర్పులు వస్తాయని చెబుతున్న ప్రవచనాల్ని రాజు చదివినప్పుడు అతడు భవిష్యత్తును గురించి భయపడ్డాడు. యూదా దుర్మార్గత దారుణమైంది. ఆ ప్రజలు తమ భ్రష్టతలో కొనసాగటంవల్ల కలిగే పరిణామాలు ఎలా గుంటాయోనని కలతచెందాడు.PKTel 277.1

    ప్రబలుతున్న విగ్రహారాధన విషయంలో గతంలో రాజు ఉదాసీనంగా లేడు. “తన యేలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన్నుతాను దేవుని సేవకు పూర్తిగా సమర్పించుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత తన ఇరవయ్యో ఏట “ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ”టానికి ప్రయత్నించాడు. “జనులు బయలు దేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి, దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటిని బలులు అర్పించినవారి సమాధులమిద చల్లివేసిరి. బయలు దేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను.” 2 దిన వృ. 34:3-5.PKTel 277.2

    యూదా దేశంలో తాను చేసిన పనితో తృప్తి చెందక యువకుడైన రాజు తన ఈ కృషిని గతంలో ఇశ్రాయేలు పదిగోత్రాలు ఆక్రమించిన పాలస్తీనా భూభాగానికి విస్తరించాడు. అందులో అతి తక్కువ భాగం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఆ ప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను, నఫాలి మన్యమునందును... బలిపీఠములను పడగొట్టెను.” అని దాఖలా చెబుతున్నది. శిధిల గృహాలున్న ఈ ప్రదేశం ఈ చివరినుంచి ఆ చివరి వరకు ప్రయాణించి “బలి పీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీయుల దేశమంతటనున్నసూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికి” వేసేవరకూ యెరూషలేముకి తిరిగిరాలేదు. 6,7 వచనాలు.PKTel 277.3

    ఇలా దైవ ధర్మశాస్త్ర సూత్రాల్ని ఘనపర్చటానికి యోషీయా తన యౌవన దీనాల నుంచే రాజుగా తన హోదాను ఆసరా చేసుకుని కృషి చేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంనుంచి శాస్త్రి షిఫాను చదువుతుండగా ఆ గ్రంథంలో గొప్ప జ్ఞాన సంపదను, దేశంలో తాను నిర్వహించదలచిన దిద్దుబాటు కృషిలో ఓ శక్తిమంతమైన చేయూతను రాజు కనుగొన్నాడు. ఆ గ్రంథంలోని వెలుగు ననుసరించి నడుచుకోవాలని తీర్మానించు కున్నాడు. దాని బోధనల్ని గురించి తెలుసుకుని, దేవుని ధర్మశాస్త్రంపట్ల గౌరవ భావాన్ని వృద్ధి పరచుకోటానికి ప్రజల్ని నడిపించటానికి శాయశక్తులా కృషి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.PKTel 278.1

    అయితే, అవసరమైన ఈ దిద్దుబాటును తేవటం సాధ్యమా? ఇశ్రాయేలీయుల విషయంలో దేవుని సహనం దాదాపు అంతం కావచ్చింది. తనకు అవమానం అపకీర్తి తెచ్చినవారిని శిక్షించటానికి దేవుడు త్వరలో విజృంభించనున్నాడు. ఆ ప్రజలపై దేవుని కోపం రగులుకోటం అప్పుడే ఆరంభమయ్యింది. దుఃఖంతో నిరాశతో కుంగిపోతున్న యోషీయా పశ్చాత్తాపంలేని తన ప్రజలనిమిత్తం మనోవ్యధతో క్షమాపణ వేడుకుంటూ వస్త్రాలు చింపుకుని దేవునిముందు ప్రణమిల్లాడు.PKTel 278.2

    ఆ కాలంలో ప్రవక్తి అయిన హులా యెరూషలేములో దేవాలయానికి సమీపంగా నివసించేది. భయందోళనలతో నిండిన రాజు మనసు ఆమెను గూర్చి ఆలోచించింది. నాశనానికి సిద్ధంగా ఉన్న యూదాను కాపాడే మార్గం ఏదైనా ఉందేమోనని ఈమె ద్వారా ప్రభువువద్ద విచారణ చెయ్యాలని రాజు యోచించాడు.PKTel 278.3

    పరిస్థితి తీవ్రతను బట్టి ఆమెపట్ల తనకున్న అభిమానాన్నిబట్టి రాజు తన రాజ్యం లోని ప్రధాన వ్యక్తుల్ని తన దూతలుగా ఆమె వద్దకు పంపించాడు. అతడు ఇలా ఆజ్ఞాపించాడు, “మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలనుగూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవా వద్ద విచారణ చేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.” 2 రాజులు. 22:13.PKTel 278.4

    యెరూషలేము నాశనం నివారించలేనిదని హుల్హా ద్వారా ప్రభువు యెషీయాకి వర్తమానం పంపాడు. ప్రజలు ఇప్పుడు వినయ మనస్కులైనప్పటికీ వారు శిక్షను తప్పించుకోలేరని ప్రభువు చెప్పాడు. తప్పు చెయ్యటంలో వారి మానసిక శక్తులు ఎంతగా దిగజారిపోయాయంటే ఇప్పుడు శిక్షపడకపోతే వారు అదే దుర్మార్గానికి తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ప్రవక్తి ఇలా అంది, “మిమ్మును నాయొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి - యెహోవా సెలవిచ్చునదేమనగా - యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి యితర దేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులు కొనుచున్నది.” 15-17 వచనాలు.PKTel 278.5

    అయితే రాజు దేవునిముందు తన్నుతాను తగ్గించుకున్నాడు. గనుక క్షమాపణ కోసం కృపకోసం అతడు సత్వరమే చేసిన మనవిని దేవుడు గుర్తించాడు. ఆయన తిరిగి ఈ వర్తమానాన్ని పంపించాడు, “ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటను నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్ట చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి యున్నాను. నేను నిన్ను నీ పితరులయొద్దకు చేర్చుదును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు” 19,20 వచనాలు.PKTel 279.1

    భవిష్యత్తు సంభవాల్ని రాజు దేవునికి విడిచిపెట్టాలి. యెహోవా ఆదేశాల్ని అతడు మార్చలేడు. పరలోకం విధించిన శిక్షల్ని ప్రకటించటంలో ప్రభువు పశ్చాత్తాపానికి దిద్దుబాటుకి అవకాశాన్ని తొలగించలేదు. తన శిక్షలతో కరుణ సమ్మిళితం చెయ్యటానికి దేవుని సంసిద్ధతను ఈ వైఖరిలో గుర్తించి యోషీయా నిర్దిష్టమైన దిద్దుబాటు తేవడానికి కృతనిశ్చయుడయ్యాడు. వెంటనే ఒక సభను ఏర్పాటు చేశాడు. దీనికి సామాన్య ప్రజలతో పాటు యెరూషలేము యూదాల్లోని పెద్దల్ని న్యాయాధిపతుల్ని ఆహ్వానించాడు. వీరు, యాజకులు లేవీయులు ఆలయ ఆవరణలో రాజుతో సమావేశమయ్యారు.PKTel 279.2

    ఈ మహాసభకు రాజు స్వయంగా తానే “యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని” చదివి వినిపించాడు. 2 రాజులు. 23:2. చదువుతున్నప్పుడు రాజు కన్నీటి పర్యంతం అయ్యాడు. రాజు తన వర్తమానాన్ని హృదయ వేదనతోకూడిన కరుణతో అందించాడు. శ్రోతలు చలించిపోయారు. రాజు ముఖంలో వ్యక్తమైన భావోద్వేగం, ఆ వర్తమాన గంభీరత, రానున్న శిక్షను గూర్చిన హెచ్చరిక ఇవన్నీ వాటి ప్రభావాన్ని చూపాయి. క్షమాపణ వేడుకోటంలో అనేకులు రాజుతో ఏకమయ్యారు.PKTel 279.3

    ఉన్నత అధికారులు ప్రజలతో కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ నిర్దిష్టమైన మార్పులు చేసుకోటానికి దేవునిముందు నిబంధన చేసుకోవలసిందిగా ఇప్పుడు యోషీయా ప్రతిపాదించాడు. “రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి - యెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుమని యెహోవా సన్నిధిని నిబంధన” చేశాడు. ప్రజల స్పందన రాజు నిరీక్షించిన దాన్ని మించి ఉంది. “జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.” 3వ వచనం.PKTel 280.1

    దాని వెనువెంట చోటుచేసుకున్న సంస్కరణల పర్వంలో రాజు విగ్రహారాధన శేషాల నిర్మూలనపై దృష్టి పెట్టాడు. ఆ దేశ ప్రజలు తమ చుట్టూ ఉన్న జాతుల ఆచారాల్ని అనుసరించి కర్రతోను రాయితోను చేసిన విగ్రహాలకు నమస్కరించటానికి ఎంతోకాలంగా అలవాటు పడటంతో, ఈ పాపాల ఆనవాళ్లని పూర్తిగా నిర్మూలించటం దాదాపు అసాధ్యమనిపించింది. అయినా యోషీయా ఆ దేశాన్ని ప్రక్షాళన చేసే తన కృషిని దీక్షతో కొనసాగించాడు. “ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకుల నందరిని” చంపటంద్వారా విగ్రహారాధన సమస్యను ఉక్కుపాదంతో అణచివేశాడు. “మరియు కర్ణపిశాచి గలవారిని సోదే చెప్పువారిని గృహ దేవతలను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.” 20, 24 వచనాలు.PKTel 280.2

    శతాబ్దాల క్రితం ఇశ్రాయేలు రాజ్యం చీలిపోయిన దినాల్లో, నెబాతు కుమారుడైన యరొబాము దేవున్ని ధిక్కరిస్తూ, యెరూషలేము దేవాలయ సేవలనుంచి ప్రజల హృదయాల్ని మళ్లించేందుకు ఓ నూతన ఆరాధనా విధానాన్ని ఆచరణలోకి తెచ్చే ఉద్దేశంతో బేతేలులో అపవిత్ర బలిపీఠం స్థాపించటానికి ప్రయత్నిస్తున్నాడు. బలిపీఠాన్ని ప్రతిష్టించే సమయంలో - భవిష్యత్తులో అక్కడ అనేకులు విగ్రహారాధనకు ఆకర్షితులు కానున్నారు - యూదయకు చెందిన ఓ దైవ సేవకుడు అర్ధాంతరంగా అక్కడ ప్రత్యక్షమై అక్కడ జరుగుతున్న అపవిత్ర కార్యాల్ని తీవ్రంగా ఖండించాడు. బలిపీఠానికి వ్యతిరేకంగా అతడు ఇలా ప్రకటించాడు :PKTel 280.3

    “బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా - దావీదు సంతతిలో యోషీయా అనునొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్కయాజకులను అతడు నీమీద దహనము చేయును. అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.” 1 రాజు, 13:2. తాను పలికిన మాట ప్రభువు వద్దనుంచి వచ్చిందనటానికి ఆ ప్రకటన తర్వాత ప్రవక్త ఒక గుర్తు ఇవ్వటం జరిగింది.PKTel 280.4

    మూడు శతాబ్దాలు గడిచాయి. యోషీయా మొదలు పెట్టిన సంస్కరణల కాలంలో యోషీయా బేతేలుకి వెళ్లటం తటస్థించింది. అక్కడ ఆ ప్రాచీన బలిపీఠం ఉంది. ఎన్నో సంవత్సరాల కిందట యరొబాము ఎదుట ఉచ్చరించబడ్డ ప్రవచనం ఇప్పుడు అక్షరాల నెరవేరాల్సి ఉంది.PKTel 281.1

    “బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా తొక్కించి ఆమేరా దేవి ప్రతిమను కాల్చి వేసెను.PKTel 281.2

    “యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్ర పరచెను.”PKTel 281.3

    “అంతట అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు - అది యూదా దేశము నుండి వచ్చి నీవు, బేతేలు లోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి. అందుకతడు - దానిని తప్పించుడి; యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి.” 2 రాజు. 23:15-18.PKTel 281.4

    ఒలీవల కొండ దక్షిణ దిగుడుల్లో మోరీయా పర్వతంమీద ఉన్న సుందరమైన యెహోవా ఆలయానికి ఎదురుగా సొలొమోను తన విగ్రహారాధక భార్యల్ని సంతోష పర్చటానికి కట్టిన గుళ్లు విగ్రహాలు ఉన్నాయి. 1 రాజు. 11:6-8 చూడండి. అసహ్యకరమైన ఈ విగ్రహాలు మూడు శతాబ్దాలకు పైగా “అభ్యంతరకర పర్వతం మిద నిలిచాయి. ఇశ్రాయేలీయుల్లో మిక్కిలి జ్ఞాన వివేకములు గలిగిన రాజు మతభ్రష్టతకు అవి మూగ సాక్షులు. యోషీయా వీటినికూడా తీసివేసి కాల్చి బూడిద చేశాడు.PKTel 281.5

    ధర్మశాస్త్ర గ్రంథంలోని ఉపదేశానుసారం యూదా ప్రజలు తమ పితరుల దేవునిపై గట్టి విశ్వాసం పట్టు కలిగి ఉండటానికి సహకరించేందుకు పస్కా పండుగ జరపాలని రాజు యోచించాడు. పరిశుద్ధ సేవలకు బాధ్యులైన వారు సిద్దబాట్లన్నీ పూర్తి చేశారు. పండుగనాడు ఉదారంగా అర్పణలివ్వటం జరిగింది. “ఇశ్రాయేలీయులను న్యాయముగా నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటివరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరించబడెను.” 2 రాజులు. 23:22. కాగా దేవునికి అంగీకృతమైనప్పటికీ, యోషీయా ఉద్రేకావేశాలు గతించిన తరాల్లోని పాపాలికి ప్రాయశ్చిత్తం చెయ్యలేవు. రాజు సహచరులు ప్రదర్శించిన భక్తి విశ్వాసాలు యధార్థ దేవుని సేవించటానికిగాని, విగ్రహారాధన నుంచి మరలటానికి నిరాకరించిన వారిలో మార్పు కలిగించటానికిగాని తోడ్పడలేదు.PKTel 281.6

    పస్కాపండుగ జరిపించిన తర్వాత ఒక దశాబ్దానికి పైగా యోషీయా రాజ్యపాలన సాగించాడు. తన ముప్పయి తొమ్మిదో ఏట ఐగుప్తు సైన్యాలతో యుద్ధంలో అతడు మరణించాడు. “తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడెను.” “యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి. యిర్మీయాయు యోషీయాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరును గాయకురాండ్రందరును తమ ప్రలాపవాక్యములతో అతనిగూర్చి పలికిరి, నేటివరకు యోషీయాను గూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.” 2 దిన వృ. 35:24,25. యోషీయావలె “అతనికి పూర్వమున్న రాజులలో... పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అటువంటివాడు ఒకడును లేడు. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను.” 2 రాజు. 23:25, 26.యెరూషలేము సర్వనాశనమయ్యి, ఆ దేశనివాసులు బబులోనుకి బానిసలుగా చెరగొని పోబడి, అనుకూల పరిస్థితుల్లో నేర్చుకోటానికి వారు నిరాకరించిన పాఠాలు అక్కడ నేర్చుకునే సమయం వేగంగా వస్తున్నది.PKTel 282.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents