Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    8 - జాతీయ మతభ్రష్టత

    యరొబాము మరణమైనప్పటినుంచి ఏలీయా అహాబుముందు కనిపించిన సమయంవరకు ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక జీవనం క్రమంగా క్షీణించింది. దేవునికి భయపడని, అన్యారాధనను ప్రోత్సహించే రాజులు పరిపాలించటంతో సజీవ దేవున్ని సేవించే విధిని అధిక సంఖ్యాక ప్రజలు విస్మరించి విగ్రహారాధనకు సంబంధించిన అనేక ఆచారాల్ని అంగీకరించారు. PKTel 62.1

    యరొబాము కుమారుడు నాదాబు ఇశ్రాయేలు సింహాసనంపై ఆసీనుడై కొన్ని నెలలు మాత్రమే పరిపాలించాడు. పరిపాలన చేజిక్కించుకోవాలని సేనాపతుల్లో ఒకడైన బయెషా పన్నిన కుట్రవల్ల నాదాబు దుష్ట పరిపాలన అకస్మాత్తుగా అంత మొందింది. నాదాబు హతుడయ్యాడు. రాజ్యానికి వారసులైన అతడి బంధువులందరూ అతడితోపాటు హతులయ్యారు. “తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఇది జరిగెను. తాను చేసిన పాపముచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము ... యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగు జరిగెను.” 1 రాజులు. 15:29, 30.PKTel 62.2

    యరొబాము సంతతి ఇలా అంతమొందింది. అతడు ప్రవేశపెట్టిన విగ్రహారాధన అపరాధులమీదికి దేవుని తీర్పుల్ని తెచ్చింది. అయినా తర్వాత వచ్చిన రాజులు అనగా బయెషా, ఎలా, జిక్ర్, ఓట్రాలు పాలించిన దాదాపు నలభై సంవత్సరాల కాలంలోనూ ఈ దుర్మార్గ జీవనమే కొనసాగింది.PKTel 62.3

    ఇశ్రాయేలులో ఈ మతభ్రష్టత సాగిన కాలంలో సింహభాగం యూదా రాజ్యాన్ని ఆసా పరిపాలించాడు. అనేక సంవత్సరాలు “ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించెను. ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతని యేలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.” 2 దిన వృ. 14:2-5.PKTel 62.4

    “కూషీయుడైన జెరహు... దండెత్తి వేయివేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి” తన రాజ్యం మీదికి వచ్చినప్పుడు ఆసా విశ్వాసానికి గొప్ప పరీక్ష వచ్చింది. (9వ వచనం). ఈ సంక్షోభంలో ఆసా తాను “యూదా దేశమందు” కట్టించిన “ప్రాకార పట్టణములను” వాటికి అమర్చిన “ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను” “పరాక్రమ శాలులైన” శూరులతోకూడిన సైన్యాన్ని నమ్ముకోలేదు. 6-8 వచనాలు. రాజు తన నమ్మికను సైన్యాలకు అధిపతి అయిన యెహోవామీద పెట్టుకున్నాడు. పూర్వం ఇశ్రాయేలు ప్రజలపక్షంగా ఆయన నామంలో అద్భుతమైన విడుదలలు సంభవించాయి. తన సైన్యాన్ని యుద్దానికి మోహరించి అతడు దేవుని సాయాన్ని అర్థించాడు.PKTel 63.1

    యుద్ధానికి సిద్ధమవుతున్న రెండు సైన్యాలూ ముఖాముఖీ నిలిచాయి. యెహోవాను సేవించేవారికి అది తీవ్ర పరీక్షా సమయం. ప్రతీ పాపాన్నీ ఒప్పుకోటం జరిగిందా? విడుదల కలిగించే దైవశక్తిని యూదా ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారా? నాయకుల మనసుల్లో ఇలాంటి తలంపులు చెలరేగుతున్నాయి. మానవ దృక్కోణం నుంచి చూసినప్పుడు ఐగుపు సైన్యం తన ముందున్న సమస్తాన్నీ ధ్వంసం చెయ్యటం ఖాయమనిపిస్తుంది. శాంతి సమాధానాల కాలంలో ఆసా వినోదాలు సుఖభోగాల్లో కాలం గడపలేదు. ఏ అత్యవసర పరిస్థితికైనా సిద్దపడ్తున్నాడు. యుద్ధానికి సుశిక్షితమైన సైన్యం అతడికుంది. అతడు తన ప్రజల్ని దేవునితో సమాధాన పడటానికి నడిపించాడు. ఇప్పుడు తన సైన్యం శత్రు సైన్యంకన్నా చిన్నదైనా అతడు ఎవరి పైన విశ్వాసాన్ని పెట్టుకున్నాడో ఆ ప్రభువుపై అతడి నమ్మకం చెక్కు చెదరకుండా ఉంది.PKTel 63.2

    దేశం అభివృద్ధి చెందుతున్న కాలంలో యెహోవాను నమ్ముకున్న రాజు ఇప్పుడు తన కష్టకాలంలో ఆయనపై ఆనుకోగలిగాడు. తాను దేవుని అద్భుత శక్తిని ఎరుగని వాడుకాడని అతడు చేసిన విజ్ఞాపనలు సూచించాయి. ఇలా విజ్ఞాపన చేశాడు, “యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండ బలము లేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నీ నామమును బట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలు దేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమొంద నియ్యకుము.” 11వ వచనం.PKTel 63.3

    ప్రతీ క్రైస్తవ విశ్వాసీ ఆసా చేసిన ప్రార్థన చెయ్యటం మంచిది. మనం ఒక యుద్ధంలో పోరాడున్నాం. మనం పోరాస్తున్నది రక్తమాంసాలుగల మనుషులతో కాదు. మనం పోరాడున్నది ప్రధానులతోను, అధికారులతోను, అంధకార శక్తులతోను, ఉన్నత స్థానాల్లో ఉన్న ఆధ్యాత్మిక దుష్టత్వంతోను! ఎఫెసీ. 6:12. చూడండి. జీవిత సమరంలో నీతికి నిజానికి వ్యతిరేకంగా మోహరించి ఉన్న దుష్టశక్తులతో మనం పోరాడవలసి ఉన్నాం. మన బలం మానవుడిలో లేదు. జీవంగల దేవునిలో ఉంది ఆయన తన నామం మహిమ పొందే నిమిత్తం మానవ ప్రతినిధుల కృషితో తన సర్వశక్తిని జోడించి పనిచేస్తాడన్న ధృఢ నమ్మకంతో మనం ఎదురుచూడవచ్చు. ఆయన నీతి కవచాన్ని ధరించి మనం శత్రువులపై విజయం సాధించవచ్చు.PKTel 63.4

    రాజైన ఆసా విశ్వాసానికి అద్భుత ప్రతిఫలం లభించింది. “యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడనున్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరల పంకులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి.” 2 దిన వృ. 14:12,13.PKTel 64.1

    యూదా బైనామాను సేనలు విజయోత్సాహంతో యెరూషలేముకు తిరిగి వస్తుండగా, “దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామిదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను - ఆసా, యూదావారలారా, బెన్యామినీయులారా! మీరందరును నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణ చేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును.” “కాగా మీరు బలహీనులుకాక ధైర్యము వహించుడి, మి కార్యము సఫలమగును.” 2 దిన వృ. 15:1,2,7. PKTel 64.2

    ఈ మాటలు ఆసాను ఉత్సాహంతో నింపాయి. అతడు త్వరలో యూదాలో రెండో సంస్కరణ చేపట్టాడు. అతడు “యూదా బైన్యామినీయుల దేశమంతట నుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి, యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి “యూదావారినందరిని, బెన్యామినీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్ర స్థానములలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడైయుండుట చూచి ఇశ్రాయేలు వారిలోనుండి విస్తారముగా జనులు అతని పక్షము చేరిరి. ఆసా యేలుబడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడా తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ములోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడువేల గొట్టెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమని ... నిష్కర్ష చేసికొనిరి.” “ఆయనను వెదకి యుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్దములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను.” 8-12,15 వచనాలు.PKTel 64.3

    ఆసా నమ్మకంగా చేసిన దీర్ఘ సేవ చరిత్రలో కొన్ని అపశ్రుతులు దొర్లాయి. అతడు దేవున్ని కొన్నిసార్లు పూర్తిగా విశ్వసించకపోయినప్పుడు అవి సంభవించాయి. ఒకసారి ఇశ్రాయేలు రాజు యూదా రాజ్యంలో ప్రవేశించి యెరూషలేముకి అయిదు మైళ్ల దూరంలో ఉన్న ప్రాకార పట్టణమైన రామాను పట్టుకున్నప్పుడు ఆ పరిస్థితినుంచి బయటపడటానికి ఆసా సిరియా రాజైన బెనదదుతో సంధి చేసుకున్నాడు. అవసర కాలంలో దేవుని మాత్రమే నమ్ముకోకపోవటంవల్ల జరిగిన ఈ వైఫల్యానికి ప్రవక్త హనానీ ద్వారా ఆసాకి తీవ్ర మందలింపు వచ్చింది. ప్రవక్త ఆసాముందు నిలిచి ఈ వర్తమానం అందించాడు :PKTel 65.1

    “నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశమునుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములును, గుఱ్ఱపు రౌతులుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికప్పగించెను. తనయెడల యధార్ధ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్దములే కలుగును.” 2 దినవృ. 16:7-9.PKTel 65.2

    తాను చేసిన పొరపాటుకి దేవునిముందు దీనమనసు కనపర్చేబదులు “ఆసా అతనిమాద కోపగించి రౌద్రముచూపి అతనిని బందీ గృహములోవేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.” 10వ వచనం.PKTel 65.3

    “తన ఏలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున” ఆసాకు “పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను.” 12వ వచనం. తన ఏలుబడి నలభై ఒకటో ఏట రాజు మరణించాడు. అతడి స్థానంలో అతడి కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు.PKTel 65.4

    ఆసా మరణానికి రెండు సంవత్సరాలు ముందు ఆహాబు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించటం మొదలు పెట్టాడు. ఆరంభంనుంచీ అతడి రాజ్యపాలన ఒక విచిత్రమైన భయంకరమైన మతభ్రష్టతతో నిండింది. సమరయ సంస్థాపకుడైన అతడి తండ్రి ఒమ్రా “యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన పూర్వికులందరి కంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను.” (1 రాజులు 16:25). అయితే అహాబు పాపాలు ఇంకా ఎక్కువ.” “నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్పసంగతి యనుకొని” అతడు “తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.” 31, 33 వచనాలు. బేతేలులోను దానులను అనుసరించిన అన్యమతా చారాల్ని ప్రోత్సహించటమేకాదు యెహోవా ఆరాధనను తోసిపుచ్చి అన్యమతమైన బయలు పూజను ప్రవేశపెట్టాడు.PKTel 66.1

    సీదోనీయుల రాజు బయలు దేవత ప్రధాన యాజకుడు అయిన ఎతృయలు కుమార్తె యెజెబెలును వివాహం చేసుకుని ఆహాబు “బయలు దేవతను పూజించుచు దానికి మొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను.” 31, 32 వచనాలు.PKTel 66.2

    అహాబు రాజధాని నగరంలో బయలు దేవత పూజలను ప్రవేశపెట్టటమే కాదు యెజెబెలు ఆధ్వర్యంలో అనేకమైన “ఉన్నత స్థలములలో” అన్య బలిపీఠాలు కట్టించాడు. వాటి చుట్టూ ఉన్న తోటల్లోని చెట్లకింద యాజకులు భ్రష్టు పట్టించే విగ్రహారాధనతో సంబంధమున్నవారు హానికరమైన ప్రభావాన్ని ప్రసరించేవారు. ఇది చిలికిచిలికి గాలివానే చివరికి ఇశ్రాయేలుఅంతా బయలు ఆరాధకులయ్యారు. “తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబువంటివాడు ఎవ్వడును లేడు. ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను.” 1 రాజులు. 21:25,26.PKTel 66.3

    అహాబు నైతికంగా బలహీనుడు. కరడుగట్టిన విప్రరాధకురాలు, దృఢ ప్రవృత్తి గల స్త్రీతో అతడి వివాహం అతడికి ఇశ్రాయేలు జాతికి తీవ్ర విపత్తుగా పరిణమించింది. నియమాలు గాని, నీతి న్యాయ ప్రమాణాలుగాని లేని అతడి ప్రవర్తనను యెజెబెలు ఇష్టానిష్టాలు రూపుదిద్దాయి. దైవ ప్రజల పరిరక్షకుడుగాను, నాయకుడుగాను, తన బాధ్యతలను, ఇశ్రాయేలీయులపట్ల దేవుని కృపలను అతడి స్వార్థ స్వభావం అభినందించలేకపోయింది.PKTel 66.4

    అహాబు పరిపాలన వినాశకర ప్రభావం కింద ఇశ్రాయేలువారు దేవునికి దూరంగా వెళ్లిపోయారు. వారి మార్గాలు దుష్టతతో నిండాయి. అనేక సంవత్సరాలుగా వారు భక్తిభావాన్ని, దైవ భీతిని విస్మరిస్తూ వచ్చారు. ఇప్పుడు కొనసాగుతున్న దేవ దూషణను వ్యతిరేకించటానికి బహిరంగంగా నిలబడటంద్వారా తమ్మునుతాము బయట పెట్టుకోటానికి సాహసించేవారెవరూ లేనట్లు కనిపించింది. మతభ్రష్టత చీకట్లు దేశమంతా ముసురుతున్నాయి. బయలు దేవత విగ్రహాలు అషారోతు విగ్రహాలు అన్నిచోట్లా కానవచ్చాయి. విగ్రహాలకు ఆలయాలు, మానవహసాలు పోతపోసిన ప్రతిమల్ని పూజించటానికి ప్రతిష్టిత వనాలు తామరతంపర అయ్యాయి. అబద్ధ దేవతలకు అర్పించిన బలుల పొగతో వాతావరణం కలుషితమయ్యింది. సూర్యచంద్ర నక్షత్రాలకు బలులర్పించి తాగిన అన్య యాజకుల కేకలతో కొండలు, లోయలు మారుమోగాయి.PKTel 66.5

    తాము ప్రతిష్ఠించిన విగ్రహాలు దేవుళ్లని వారు తమ మార్మిక శక్తివలన భూమి, అగ్ని, నీరు వంటి ప్రకృతి శక్తుల్ని పాలిస్తారని యెజెబెలు ఆమె అపవిత్ర యాజకుల ప్రభావంద్వారా ప్రజలకు బోధించటం జరిగింది. వాగులు, ఏరులు, మంచు, భూమిని తడిపి పొలాలు సమృద్ధిగా పండేటట్లు చేసే వరధారలు - దేవుడిచ్చే ఈ వనరుల్ని ప్రతీ మంచి వరాల్నీ ఇచ్చేది దేవుడు కాదు బయలు, అషారోతులని బోధించారు. కొండలు, లోయలు, ఏరులు, ఊటలు, జీవంగల దేవుని చేతుల్లో ఉన్నాయని, ఆయనే సూర్యుణ్ని, మేఘాల్ని, ప్రకృతి శక్తుల్ని అదుపులో ఉంచుతాడని ప్రజలు మర్చిపోయారు. PKTel 67.1

    నమ్మకమైన తన సేవకుల ద్వారా ప్రభువు భ్రష్టుడైన రాజుకి ప్రజలకి పదేపదే హెచ్చరికలు పంపాడు. ఆ మందలింపు మాటలు నిరర్థకమయ్యాయి. ఇశ్రాయేలులో దేవుడుగా ఉండే హక్కు యెహోవాకు మాత్రమే ఉన్నదని ఆత్మతో నిండిన దైవదూతలు వ్యర్థంగా బోధించారు. ఆయనిచ్చిన నీతినిధుల్ని వారు వ్యర్థంగా ఘనపర్చారు. విగ్రహారాధనలోని ఇంపైన ప్రదర్శనకు కర్మకాండకు ఆకర్షితులై ప్రజలు, రాజు, అతడి ఆస్థానికుల మాదిరిని అవలంబించి, మత్తు కల్గించే తుచ్చ శారీరక వినోదాలతోకూడిన ఆరాధనకు తమ్ముని తాము అంకితం చేసుకున్నారు. కన్నుగానని ఆ బుద్దిహీనతలో ప్రజలు దేవున్నీ ఆయన ఆరాధనను విసర్జించారు. వారికి దేవుడిచ్చిన వెలుగు చీకటిగా మారింది. శ్రేష్ఠమైన బంగారం కాంతిహీనమయ్యింది..PKTel 67.2

    అయ్యో ఇశ్రాయేలు మహిమ ఎలా మాయమయ్యింది! దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు మతభ్రష్టతలో ఇంతగా ఎన్నడూ కూరుకుపోలేదు. “బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల ఏబదిమంది”. వీరుగాక “అషీరాదేవి ప్రవక్తలు” నాలుగువందల మంది ఉన్నారు. 1 రాజులు. 18:19. అద్భుతాలు చేసే దేవుని శక్తి మినహా ఇంకేదీ ఆ జాతిని సర్వనాశనం నుంచి కాపాడలేదు. ఇశ్రాయేలు ప్రజలు స్వచ్ఛందంగా యెహోవానుంచి వేరయ్యారు. అయినా పాపంలో పడ్డవారి కోసం ప్రభువు కరుణా కటాక్షాలతోనిండి, వారి వద్దకు ప్రవక్తల్లో మిక్కిలి శక్తిమంతుల్ని పంపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రవక్తలద్వారా అనేకులు తమ పితరుల దేవునికి విశ్వాసపాత్రులవ్వటానికి ఆకర్షితులు కావలసిఉంది.PKTel 67.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents