Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    43 - అదృశ్యపరిశీలకుడు

    దానియేలు చివరి దినాల్లో అరవై సంవత్సరాలకు పైచిలుకు కాలంక్రితం అతడు అతడి హెబ్రీ మిత్రులు బానిసలుగా చెరపట్టి తేబడ్డ బబులోను దేశంలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. “జాతులన్నిటిలో భయంకరుడైన” (యెహె. 28:7) నెబుకద్నెజరు మరణించాడు. “జగత్ ప్రసిద్ధమైన” పట్టణమైన బబులోను అతడి అసమర్ధ వారసుల పాలన కిందకివచ్చి క్రమేణా నాశనమయ్యే స్థితికి చేరింది.PKTel 364.1

    నెబుకద్నెజరు మనవడైన బెల్టస్సరు బుద్దిహీనత బలహీనతవల్ల సుందరమైన బబులోను త్వరలో పతనం కానుంది. తన చిన్న వయసులోనే రాజ్యాధికారంలో పాలు పంచుకున్న బెల్పసరు అధికార దర్పంతో పరలోక దేవుని మిద ఎదురు తిరిగాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోటానికి విధేయత చూపటానికి తన బాధ్యతను అవగాహన చేసుకోటానికి అతడికి ఎన్నో అవకాశాలున్నాయి. తన తాత దేవుని ఆజ్ఞ ప్రకారం మానవ సమాజంనుంచి బహిష్కృతుడైన సంగతి అతడికి తెలుసు. నెబుకద్నెజరుకు కలిగిన మారుమనసు గురించి, అతడికి అద్భుతరీతిగా తన రాజ్యం పునరుద్ధరించ బడటాన్ని గురించి అతడికి తెలుసు. అయితే బెల్టస్సరు సుఖభోగాలపట్ల ఆత్మస్తుతి పట్ల కలిగిఉన్న ఆసక్తి తాను ఎన్నటికి మర్చిపోకూడని పాఠాల్ని తుడిచివేసింది. తనకు వచ్చిన అవకాశాల్ని వ్యర్థపుచ్చాడు. సత్యాన్ని మరెక్కువగా తెలుసుకోటానికి తన అందుబాటులో ఉన్న సాధనాల్ని నిర్లక్ష్యం చేశాడు. తీవ్రశ్రమలద్వారా అవమానము ద్వారా నెబుకద్నెజరు చివరికి సంపాదించినదాన్ని బెలస్సరు అలక్ష్యంవల్ల పోగొట్టు కున్నాడు.PKTel 364.2

    తారుమారు పరిస్థితులు రావటానికి ఎక్కువ కాలం పట్టలేదు. మాదీయుడైన దర్యావేషు మేనల్లుడు, మాదీయ పారసీకుల సంయుక్త సైన్యానికి అధిపతి అయిన కోరెషు బబులోనుపై దండెత్తి దాన్ని ముట్టడించాడు. అయితే బలమైన గోడలు, ఇత్తడి ద్వారాలు, యూఫ్రటీసు నది రక్షణ, విస్తారమైన ఆహారనిల్వ కలిగి దుర్భేద్యంగా కనిపించే తన కోటలో భోగలాలసుడైన రాజు తాను క్షేమంగా ఉన్నానన్న ధీమాతో తిని తాగుతూ వినోదాలతో సమయం గడిపాడు.PKTel 364.3

    గర్వం అహంకారంతో అంధుడై, తన భద్రతకు ధోకాలేదన్న తెంపరితనంతో నిండి బెల్పసరు “తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను.” ఐశ్వర్యం అధికారం అందించగల ఆకర్షణలన్నీ ఆ విందుకు వన్నె కూర్చాయి. అందమైన స్త్రీలు ఆ విందుకి ఆహ్వానితులుగా వచ్చారు. ప్రతిభావంతులు విద్యావంతులు అయిన పురుషులు ఆ విందులో ఉన్నారు. అధిపతులు రాజనీతిజ్ఞులు ద్రాక్షారసాన్ని మంచినీళ్లులా తాగుతూ దాని ప్రభావంకింద పిచ్చివాళ్లమల్లే ప్రవర్తించారు. చిత్తుగా తాగి మత్తులో మునగటంతో వారి విచక్షణాశక్తి శూన్యమయ్యింది. క్షుద్ర భావోద్రేకాలు పేట్రేగిపోయాయి. ఆ తాగుబోతుల గలాభాలో రాజే ముందుండి ఆ దొమ్మి మూకను నడిపిస్తున్నాడు. విందు కార్యక్రమం కొనసాగుతుండగా “తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్లోప కరణములను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను.” తాను ముట్టకూడనంత పరిశుద్ద వస్తువు ఏదీ లేదని రాజు నిరూపించదలచాడు. “వారు... సువర్లోపకరణములను తెచ్చియుండగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి యిత్తడి యినుము కట్ట రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము” తాగారు.PKTel 365.1

    విగ్రహారాధనతో కూడిన ఆ విందు వినోదాలకి ఓ పరలోక సాక్షి ఉన్నాడని, గుర్తు తెలియని ఓ దివ్య పరిశీలకుడు ఆ అపవిత్ర దృశ్యాన్ని తమ దేవదూషణ కరమైన వేడుకను విగ్రహారాధను చూస్తున్నాడని బెల్పసరు తలంచలేదు. అయితే ఎవరూ ఆహ్వానించని ఆ అతిధి త్వరలోనే తన ఉనికిని చాటుకున్నాడు. ఆ వేడుక పరాకాష్టకు చేరినప్పుడు రక్తంలేని ఓ హస్తం వచ్చి ఆ రాజ భవనం గోడమీద అగ్నిలా మెరిసే అక్షరాల్లో రాజుకి అతడి అతిథులికి రానున్న నాశనాన్ని సూచించే మాటలు రాసింది. ఆ మాటలు అక్కడున్న జనసమూహానికి తెలియని మాటలు. ఇప్పుడు రాజు అతడి అతిథుల మనస్సాక్షి మేలుకుంది.PKTel 365.2

    అల్లరితో కూడిన ఉల్లాసం ఆగిపోయింది. ఆ హస్తం ఆ నిగూఢమైన అక్షరాల్ని నెమ్మదిగా రాయటం చూస్తున్నప్పుడు వారు భయభ్రాంతులయ్యారు. కదులుతున్న దృశ్యంలాగ వారిముందు తమ దుష్ట జీవితాల్లోని క్రియలు కనిపించాయి. ఎవరి అధికారాన్ని వారు ధిక్కరించారో ఆ నిత్యదేవుని న్యాయపీఠం ముందు తమ నేరాలనిమిత్తం తీర్పుకు నిలబడినట్లు కనిపించారు. కొద్దిక్షణాల కిందటే ఎక్కడ ఉల్లాసపు కేకలు దేవదూషణ పూరిత హాస్యోక్తులు వినిపించాయో అక్కడివారి ముఖాల్లో ఇప్పుడు రక్తపు చుక్కలేదు. వారు ఇప్పుడు భయంతో కేకలు వేస్తున్నారు. దేవుడు మనుషులికి భయం కలిగించినప్పుడు ఆ భయం తీవ్రతను మనుషులు దాచిపెట్టలేరు.PKTel 365.3

    బెలసరు వారందరికన్నా ఎక్కువ భయకంపితుడయ్యాడు. దేవునిపై జరిగిన ఆ తిరుగుబాటుకు అందరికన్నా అతడు ఎక్కువ బాధ్యుడు. బబులోను రాజ్యంలో ఆ రాత్రి అది అత్యున్నత స్థాయికి చేరింది. వారి మధ్య ఉన్న అదృశ్య పరిశీలకుడు వారు ఎవరి అధికారాన్ని సవాలుచేసి ఎవరి నామాన్ని దూషించారో ఆ దేవుని ప్రతినిధి. ఆయన సముఖంలో రాజు భయంతో విగ్రహంలా నిలిచిపోయాడు. అతడి అంతరాత్మ మేల్కొన్నది. “అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టు కొనుచుండెను.” బెల్పసరు భక్తిహీనుడై దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అతడు తన సొంత శక్తిని నమ్ముకున్నాడు. “ఎందుకు ఇలా చేస్తున్నావు?” అని తన్ను ప్రశ్నించటానికి ఎవరూ సాహసించరని భావించాడు. అయితే తనకు అప్పగించబడ్డ దాని నిమిత్తం తాను లెక్క అప్పగించాలని, తాను వృధాపుచ్చిన అవకాశాలకు, తన ధిక్కార వైఖరికి తనకు ఎలాంటి సాకూ లేదని ఇప్పుడు గ్రహించాడు. PKTel 366.1

    అగ్నిలా మండుతున్న అక్షరాల్ని చదవటానికి రాజు వ్యర్థ ప్రయత్నం చేశాడు. అది అతడికి అంతు చిక్కని రహస్యం. అతడికి అర్థంకాని, అతడు వ్యతిరేకించలేని శక్తి అది. నిసృహతో సహాయం కోసం తన రాజ్యంలోని జ్ఞానుల్ని ఆశ్రయించాడు. సభలోని జ్యోతిష్యుల్ని కల్దీయుల్ని శకునగాండ్రిని ఆ రాత చదవవలసిందిగా అర్ధిస్తూ పిచ్చివాడిలా అరిచాడు. రాజు ఈ వాగ్దానం చేశాడు, “ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠాభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.” గొప్ప బహుమానాల వాగ్దానంతో తన సలహాదారులికి రాజు చేసిన విజ్ఞప్తి వ్యర్ధమయ్యింది. పరలోక జ్ఞానాన్ని కొనటం అమ్మటం సాధ్యపడదు. “రాజు నియమించిన జ్ఞానులందరు... వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారివల్ల కాకపోయెను.” క్రితం తరంలో నెబుకద్నెజరు కలల భావాన్ని తెలియజెప్పటానికి అప్పటి జ్ఞానులు శక్తిశూన్యులైనట్లే వారు ఆ మార్మిక అక్షరాల్ని చదవలేక పోయారు.PKTel 366.2

    అప్పుడు రాజమాత దానియేలుని గుర్తు చేసుకుంది. దానియేలు ఓ అర్ధ శతాబ్ది క్రితం నెబుకద్నెజరు బ్రహ్మాండమైన ప్రతిమనుగూర్చి కన్న కలను దాని భావాన్ని చెప్పిన సంగతి ఆమెకు తెలుసు. ఆమె ఇలా అంది, “రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచ నియ్యకుము. నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల యాత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను. గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రుకును గారడీ విద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెత్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును.”PKTel 366.3

    “అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి.” ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తూ బెలసరు ప్రవక్తతో ఇలా అన్నాడు : “రాజగు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసికొని వచ్చిన చెర సంబంధమగు యూదులలోనుండు దానియేలు నీవే గదా? దేవతల ఆత్మయు వివేకమును బుద్దియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీ విద్యగలవారిని పిలిపిచితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి. అంతర్భావములను బయలు పరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తర మిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్నుగూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలుపుటకును నీకు శక్యమైన యెడల నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ యధిపతిగా ఏలుదువు.”PKTel 367.1

    భయాందోళనలతో నిండిన ఆ జనం ముందు దానియేలు నిశ్చలంగా నిలబడ్డాడు. రాజు చేసిన వాగ్దానాలకు చలించలేదు. సర్వోన్నతుని సేవకుడి కుండాల్సిన నిరాడంబర హుందాతనంతో నిలబడ్డాడు. ముఖ స్తుతి మాటలు చెప్పటానికి కాదు, నాశనాన్ని గూర్చిన వర్తమానభావాన్ని చెప్పటానికి. “నీ దానములు నీయొద్ద నుంచుకొనుము; నీ బహుమానములు మరి ఎవరికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను” అన్నాడు.PKTel 367.2

    బెల్పసరుకు తెలిసిన విషయాల్ని ప్రవక్త ముందు అతడికి గుర్తు చేశాడు. కాని అవి అతడికి అణకువ అన్నపాఠాన్ని నేర్ప లేకపోయాయని అణకువ అతణ్ని కాపాడి ఉండేదని ప్రవక్త అతడికి గుర్తు చేశాడు. దానియేలు నెబుకద్నెజరు పాపంగురించి దేవుడు అతడితో వ్యవహరించటాన్ని గురించి - అనగా దేవుడు అతనికి రాజ్యాన్ని గొప్ప కీర్తిని ఇవ్వటం, అతడి గర్వాన్ని అణచటానికి తీర్పులు పంపటం, తర్వాత ఆ రాజు ఇశ్రాయేలు దేవుని అధికారాన్ని కరుణను గుర్తించటం గురించి మాట్లాడి, ఆ మీదట తన తీవ్రదుష్టత ముష్కరత్వం గురించి కఠిన పదజాలంతో బెల్పసరుని మందలించాడు. రాజుపాపాన్ని ఎత్తి చూపి తాను నేర్చుకుని ఉండాల్సిన పాఠాల్ని సూచించి అతడు వాటిని నేర్చుకోలేదని నిందించాడు. బెలసరు తన తాత అనుభవాన్ని సవ్యంగా చదవలేదని, తన జీవితానికి ప్రాముఖ్యమైన హెచ్చరికలు కావాల్సిన ఘటనల్ని తాను లెక్క చెయ్యలేదని చెప్పాడు. నిజమైన దేవున్ని ఎరిగి ఆయనకు విధేయుడై నివసించే తరుణం అతడికి వచ్చింది. కాని అతడు దాన్ని అందిపుచ్చుకోలేదు. ఇప్పుడతడు తిరుగుబాటు పర్యవసానాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాడు.PKTel 367.3

    ప్రవక్త ఇలా ప్రకటించాడు, “బెల్పసరూ,... ఈ సంగతంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించు కొంటివి. ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహించనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి యినుము కట్ట రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను.” PKTel 368.1

    గోడమీద ఉన్న దైవ వర్తమానం తట్టు తిరిగి ప్రవక్త మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అని చదివాడు. ఆ రాత రాసిన చెయ్యి ఇక కనిపించటంలేదు. కాని ఈ నాలుగు మాటలూ ఇంకా స్పష్టంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. వృద్దుడైన ప్రవక్త ఇలా వెల్లడిస్తుండగా అక్కడున్న జనులు ఊపిరి బిగబట్టుకుని వింటున్నారు :PKTel 368.2

    “ఈ వాక్య భావమేమనగా, మెనె అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూచి దాని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.”PKTel 368.3

    ఆ విందు వినోదాల రాత్రి బెల్పస్సరు అతడి అధిపతులు తమ అపరాధ పాత్రను కల్దీయుల అపరాధ పాత్రను నింపుకున్నారు. నిలువరించే దైవ హస్తం ముంచుకొస్తున్న ముప్పును ఇక ఆపుచెయ్యలేకపోయింది. ధర్మశాస్త్రంపట్ల వారికి భక్తి భావం గౌరవం నేర్పటానికి దేవుడు అనేక మార్గాల్లో ప్రయత్నించాడు. ఇప్పుడు ఎవరి తీర్పు ఆకాశాన్ని అంటుతుందో ఆ ప్రజల గురించి “మనము బబులోనును స్వస్థపరచ గోరితిమి అయితే అది స్వస్థత నొందలేదు” అన్నాడు దేవుడు. యిర్మీ. 51:9. మానవ హృదయం వక్రధోరణి వల్ల తుదకు దేవుడు మార్పులేని తీర్పును ఇవ్వటం అవసరమయ్యింది. బెల్టస్సరు నేలకూలటం అతడి రాజ్యం ఇతరుల హస్తగతం కావటం జరగాల్సి ఉంది.PKTel 368.4

    ప్రవక్త మాట్లాడటం ముగిసిన వెంటనే అతడికి వాగ్దానం చేసిన పురస్కారాల్ని అతడికి ఇవవ్వలసిందిగా రాజు ఆదేశించాడు. ఈ ఆదేశానుసారంగా “వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి.”PKTel 369.1

    “ఇష్టమైన సంధ్యవేళ”, దేవుని నామం దూషించటంలో రాజు మంత్రులు ఒకరితో ఒకరు పోటీపడినవేళ, అది హఠాత్తుగా బీభత్సం నాశనం సమయంగా మారుతుందని ఓ శతాబ్దానికి పైచిలుకు ముందే లేఖనం వచించింది. ఈ నాటకంలోని ప్రధాన పాత్రధారులు పుట్టటానికి ఎన్నో సంవత్సరాలు ముందే ప్రవచనంలో ఎలా వర్ణించటం జరిగిందో అలాగే ప్రాముఖ్యంగల ఘటనలు ఒకదాని వెంట ఒకటి తు.చ. తప్పకుండా వడివడిగా సంభవించాయి.PKTel 369.2

    ఇంకా ఉత్సవ మందిరంలో ఉండగానే, ఎవరి నాశనం ఖరారయ్యిందో ఆ అతిథులు తనచుట్టూ ఉండగా ఓ వార్తాహరుడు వచ్చి, తాను ఏ శత్రువునుంచి క్షేమంగా ఉన్నానని రాజు తలంచాడో అతడిచే “పట్టణమంతయు పట్టబడెను” అని “దాని యోధులు దిగులు పడిరి” అని “దాని రేవులు శత్రువశమాయెను” అని రాజుకి తెలియజేశాడు. 31,32 వచనాలు. రాజు అతడి ప్రధానులు యెహోవా పరిశుద్ధ ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసుకుని తాగుతూ, వెండితోను బంగారంతోను చేసిన తమ దేవతలను స్తుతిస్తుండగా, మాదీయులు పారసీకులు యూఫ్రటీసు ప్రవాహాన్ని మళ్లించి కాపలాలేని ఆ పట్టణంలోకి ప్రవేశించారు. కోరెషు సైన్యం ఇప్పుడు రాజు భవనం గోడలవద్ద నిలబడి ఉంది. ఆ పట్టణం శత్రు సైనికులతో నిండింది. శత్రు సైనికులు “గొంగళి పురుగులంత” విస్తారంగా ఉన్నారు. (14వ వచనం). వారి విజయ నినాదాలు లోపల విందు వేడుకలు చేసుకుంటున్న వారు భయభ్రాంతులతో వేస్తున్న కేకల్ని మింగివేశాయి.PKTel 369.3

    “ఆ రాత్రి యందే కల్దీయుల రాజగు బెల్పసరు హతుడాయెను.” ఓ పరదేశపు రాజు సింహాసనాసీనుడయ్యాడు.PKTel 369.4

    హెబ్రీ ప్రవక్తలు బబులోను పతనంకానున్న తీరునుగూర్చి బహు స్పష్టంగా చెప్పారు. భవిష్యత్ సంభవాల్ని గూర్చి దర్శనంలో దేవుడు వారికి ప్రత్యక్షపర్చినట్లు వారిలా వెల్లడించారు : “షేషకు పట్టబడెను. జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను.” “సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను!” “బబులోను పట్టబడు చున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది. జనములో అంగలార్పు వినబడుచున్నది.”PKTel 369.5

    “బబులోను నిమిష మాత్రములోనే కూలి తుత్తునియలాయెను.” “బబులోను మీదకి పాడుచేయువాడు వచ్చుచున్నాడు. దాని బలాఢ్యులు పట్టుబడియున్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతికారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదను. వారు చిరకాల నిద్రనొంది మేలుకొనక పోదురు. ఇదే రాజు వాక్కు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.”PKTel 370.1

    “బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టియున్నాను. తెలియకయే నీవు పట్టబడియున్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయబూనుకొంటివి. నీవు చిక్కుబడి పట్టుబడియున్నావు. కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు.”PKTel 370.2

    “సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదావారును బాధింపబడిరి. వారిని చెరపట్టిన వారందరు వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవర పరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడముట్టించును.” యిర్మీ. 51:41; 50:23,46; 51:8, 56, 57; 50:24,25,33,34.PKTel 370.3

    ఇలా “విశాలమైన బబులోను ప్రాకారములు” “బొత్తిగా” పడగొట్టబడ్డాయి. “దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచే” కాల్చివేయబడ్డాయి. ఈ రీతిగా సైన్యాలకధిపతి అయిన యెహోవా “అహంకారుల అతిశయమును మాన్పించెను. బలాత్కారుల గర్వమును అణచివేసెను.” ఇలా “రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహాత్మ్యమునగు బబులోను” సొదొమ గొమొర్రాల్లా నిత్యం శాపగ్రస్తమైన స్థలమయ్యింది. “అది మరెన్నడును నివాస స్థలముగ నుండదు. తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొఱ్ఱల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు. నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును. నిప్పుకోళ్లు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలును వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలును మొరలిడును.” “నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.” యిర్మీ. 51:58; యెష. 13:11, 19-22; 14:23.PKTel 370.4

    బబులోను మొదటి రాజుకి ఛాయారూపకంగా వచ్చినట్లే దాని చివరి రాజుకీ దివ్య పరిశీలకుడి ఈ తీర్పు వస్తున్నది: ఓ రాజా, “యిదే నీకు ప్రకటన - నీ రాజ్యము నీ యొద్దనుండి తొలగిపోయెను.” దాని. 4:31.PKTel 371.1

    “కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండు కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము. నీవు మృదువునని యైనను సుకుమారినని యైనను జనులు ఇకమీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసికొని పిండి విసరుము. నీ ముసుకు పారవేయుము. కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము. కాలిమీది బట్టతీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన యవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ద దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు. నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవువారియందు కనికరపడక వృద్దులమీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు - నేను ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు. నేను విధవరాలనై కూర్చుండను. పుత్రశోకము నేను చూడనని అనుకొను చున్నదానా, ఈ మాటను వినుము - ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నిన్ను చూడడని అనుకొంటివి - నేనున్నాను నేను తప్ప మరి ఎవరునులేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదికి వచ్చును. నీవు మంత్రించి దాని పోగొట్టజాలవు. ఆ కీడు నీమీద పడును. దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యమునండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనమగునేమో. ఒకవేళ నీవు మనుష్యులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాస చర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువలెనైరి. అగ్నివారిని కాల్చివేయు చున్నది. జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పుకాదు. ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలు కొని నీతో వ్యాపారము చేయువారు తమతమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు. నిన్ను రక్షించువాడొకడైన నుండడు.” యెష. 47:1-15.PKTel 371.2

    పరిశీలకుడు పరిశుద్ధుడు అయిన ఆయన ఉద్దేశాల్ని సంకల్పాల్ని నెరవేర్చుతాయో లేదో నిర్ధారించేందుకు, కార్యరంగంలోకి వచ్చే ప్రతీ జాతీ లోకంలో దాని దాని స్థానాన్ని ఆక్రమించటానికి అనుమతించటం జరుగుతుంది. లోక మహా సామ్రాజ్యాలైన బబులోను, మాదీయ పారసీకం, గ్రీసు, రోము వీటిలో ప్రతీ ఒక్కదాని విషయంలోను - చిన్న చిన్న రాజ్యాల విషయంలోలాగే - చరిత్ర పునరావృత్తమౌతూ వచ్చింది. ప్రతీదానికీ దాని పరీక్షా సమయం వచ్చింది. ప్రతీ రాజ్యం విఫలమయ్యింది. దాని ప్రాభవం పోయింది. దాని అధికారం అంతమొందింది.PKTel 372.1

    దేశాలు దైవ నియమాల్ని విసర్జించటం అలా చేయటంలో తమ్మును తాము నాశనం చేసుకోటం జరుగుతున్నా, దాన్ని అధిగమించి పనిచేసే దైవోద్దేశం ఒకటి యుగాల పొడవునా కనిపిస్తున్నది. కల్దీయుల దేశంలో తన ప్రవాస కాలంలో తనకు కలిగిన అద్భుత దర్శనంలో యెహెజ్కేలు ప్రవక్త చూసింది ఇదే. అప్పుడు లోక రాజుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వాటిని తోసిపుచ్చే మహత్తర శక్తిపై విస్మయంతో నిండిన అతడి దృష్టి నిలిచింది. ఆ శక్తి చిహ్నాల రూపంలో ప్రదర్శితమయ్యింది.PKTel 372.2

    కెబారు నది ఒడ్డున యెహెజ్కేలు ఓ సుడిగాలి రావటం చూశాడు. అది ఉత్తరం నుంచి వస్తున్నట్లు కనిపించింది. “మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టు ఆవరించియుండెను. ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను.” ఒకదానిలో ఒకటి అమరిఉన్న ఎన్నో చక్రాల్ని నాలుగు జీవులు ముందుకి వెనకకు నడుపుతూ ఉన్నాయి. వీటికి ఎంతో ఎత్తులో “సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటిదానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.” “కెరూబుల రెక్కలక్రింద మానవ హస్తరూప మొకటి కనబడెను.” యెహె. 1:4, 26; 10:8. చక్రాల ఏర్పాటు సంక్లిష్టంగా ఉంది. ఒకసారి చూసినప్పుడు అవి అస్తవ్యస్తంగా ఉన్నట్లు కనిపించాయి. అయినా అవి సమన్వయంతో కదిలాయి. కెరూబుల రెక్కలకింద ఉన్న హస్తం బలపర్చుతూ నడిపిస్తున్నందువల్ల ఈ చక్రాలు ముందుకు కదులుతున్నాయి. వాటిపైన నీలకాంతమయమైన సింహాసనం మీద నిత్యుడు ఆసీనుడై ఉన్నాడు. సింహాసనం చుట్టూ ధనస్సు ఉంది. అది దేవుని కృపకు సంకేతం. కెరూబుల రెక్కల కింద ఉన్న హస్తంవంటి దాని నడుపుదల కింద ఉన్న చక్రాల వంటి వాటిలోని చిక్కుల్లాగే మానవులకు సంబంధించిన ఘటనల్లోని చిక్కులు దేవుని అదుపులో ఉన్నాయి. కెరూబులకు పైగా కూర్చున్న ఆయన జాతుల పోరాటాలు గందరగోళాల నడుమ ఈ లోక వ్యవహారాల్ని ఇంకా నడుపుతూ ఉన్నాడు.PKTel 372.3

    జాతుల చరిత్ర నేడు మనతో మాట్లాడుతున్నది. తన ప్రణాళికలో ప్రతీ వ్యక్తికీ దేవుడు ఒక స్థానాన్ని నియమించాడు. ఎన్నడూ ఏ పొరపాటు చేయని ఆ ప్రభువు చేతిలో వడంబం పట్టుకుని మనుషుల్ని దేశాల్ని నేడు పరీక్షిస్తున్నాడు. అందరూ తమ సొంత నిర్ణయంవల్లనే తమ గమ్యాన్ని నిర్ణయించుకుంటారు. తన సంకల్పాల సాఫల్యం కోసం దేవుడు సమస్తాన్నీ ప్రభావితం చేస్తాడు. నేను ఉన్నాను అన్న దేవుడు తన వాక్యంలో ఇచ్చిన ప్రవచనాలు - గతంలోని నిత్యంనుంచి భవిషత్తులోని నిత్యత్వం వరకూ జరిగిన జరగనున్న సంఘటనల గొలుసులో ఒక లింకును ఒకలింకుకు కలుపుతూ - యుగాల ప్రస్థానంలో నేడు మనం ఎక్కడున్నామో, రాగల కాలంలో ఏమి సంభవించనుందో తెలుపుతాయి. ప్రస్తుత కాలం వరకు సంభవిస్తాయని ప్రవచనం ముందే చెప్పినదంతా జరిగినట్లు చరిత్రపుటల్లో దాఖలై ఉంది. ఇంకా సంభవించాల్సి ఉన్నదంతా దానిదాని సమయంలో సంభవిస్తుందని మనం నమ్మవచ్చు.PKTel 373.1

    కాలాన్ని సూచించే సూచనలు గొప్ప ఘటనలు చోటుచేసుకునే సమయంలో నేడు మనం నివసిస్తున్నామని వెల్లడిస్తున్నాయి. మన ప్రపంచంలో ప్రతీదీ ఆందోళనతో నిండి ఉంది. తన రాకకు ముందు చోటుచేసుకుంటాయని రక్షకుడు ప్రవచించిన సంభవాలు మన కళ్లముందే నెరవేరుతున్నాయి : “మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు.... జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులును భూకంపములును కలుగును.” మత్త. 24:6, 7,8.PKTel 373.2

    జీవిస్తున్న వారందరికి ప్రసుత్త కాలం ఆసక్తికరమైన కాలం. పరిపాలకులు రాజ నీతిజ్ఞులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అన్ని తరగతులకు చెందిన ఆలోచనా పరులైన పురుషులు మహిళలు మన చుట్టూ సంభవిస్తున్న ఘటనలపై దృష్టి నిలుపు తున్నారు. దేశాలమధ్య కొనసాగుతున్న సంబంధాల్ని పరిశీలిస్తున్నారు. భూమిమిది ప్రతీ అంశం తీవ్రరూపం ధరిస్తున్నట్లు వారు గుర్తిస్తున్నారు. ఏదో గొప్ప నిశ్చయాత్మక ఘటన సంభవించబోతుందని గుర్తిస్తున్నారు. లోకం గొప్ప ఉత్పాతం అంచున ఉన్నదని గుర్తిస్తున్నారు.PKTel 374.1

    వీటిని గురించి నిజమైన సమాచారం బైబిలు మాత్రమే ఇవ్వగలదు. లోక చరిత్రలోని చివరి సన్నివేశాల్ని ఈ గ్రంథం వెల్లడిచేస్తున్నది. ఈ సంభవాలు తమ నీలి నీడల్ని ఇప్పుడే ప్రసరిస్తున్నాయి. వాటి పద ఘట్టనలు భూమిని కంపింప జేస్తున్నాయి. మనుషుల హృదయాలు భయంతో వణుకుతున్నాయి.PKTel 374.2

    “యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోల పరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.... లోక నివాసులు ధర్మ శాసనములను అతిక్రమించియున్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మిరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి.” యెష. 24:1-6.PKTel 374.3

    “ఆహా, యెహోవా దినము వచ్చెనే. అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తుని యొద్దనుండి వచ్చును.... విత్తనము మంటి పెల క్రింద కుళ్లిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. కళ్లపు కోట్లు నేల పడియున్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి. గొట్టెల మందలు చెడిపోవుచున్నవి.” “ద్రాక్షచెట్లు చెడిపోయెను. అంజూరపు చెట్లు వాడిపోయెను. దానిమ్మ చెట్లును ఈతచెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి. నరులకు సంతోషమేమియు లేకపోయెను.” యోవే. 1:15-18,12.PKTel 374.4

    “నా అంతరంగములో నాకెంతో వేదనగా నున్నది... తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నదిగదా? యుద్ద ఘోష నీకు వినబడుచున్నది గదా? కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది.” యిర్మీ. 4:19,20.PKTel 374.5

    “అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు, అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చు దీనము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.” యిర్మీ. 30:7.PKTel 375.1

    “యెహోవా, నీవే నా ఆశ్రయము అని
    నీవు మహోన్నతుడైన దేవుని నీకు
    నిత్య నివాసముగా చేసికొనియున్నావు
    నీకు అపాయమేమియు రాదు
    ఏ తెగులును నీ గుడారమును సమీపించదు.”
    PKTel 375.2

    కీర్త. 91:9,10.

    సీయోను కుమారీ.... యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును. మనము చూచుచుండగా - సీయోను అపవిత్ర పరచబడునుగాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చియున్నారు. ... అయితే వారు ఆయన తలంపులు తెలిసికొనకున్నారు. ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.” మికా 4:10-12. తన సంఘం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఆదుకోకుండా ఉండడు. విమోచనను వాగ్దానం చేస్తూ ఆయన ఇలా అంటున్నాడు, “యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను చెరలో నుండి రప్పింతును.” యిర్మీ. 30:18.PKTel 375.3

    అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుతుంది. సూర్యుడి కింద నివసించే జనులంతా ఆయన రాజ్య సూత్రాల్ని ఘనపర్చుతారు.PKTel 375.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents