Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    7 - యరొబాము

    దావీదు కుటుంబీకులపై తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు పదిగోత్రాలు సింహాసనం ఎక్కించిన సొలొమోను మాజీ సేవకుడు యరొబాము పౌర సంబంధాల్లోను, మతపరమైన విషయాల్లోను అర్థవంతమైన సంస్కరణలు చేపట్టటానికి అనుకూల పరిస్థితిలో ఉన్నాడు. సొలొమోను ఏలుబడిలో అతడు కౌశలం విజ్ఞత ప్రదర్శించాడు. అతడు నమ్మకంగా సేవచేసిన కాలంలో సంపాదించిన జ్ఞానం ప్రజల్ని విజ్ఞతతో పరిపాలించటానికి సమర్ధుణ్ని చేసింది. అయితే యరొబాము దేవునిపై నమ్మిక ఉంచలేదు.PKTel 56.1

    భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు ప్రజల మనసులు దావీదు సింహాసనంపై ఉన్న రాజు తట్టు తిరుగుతాయన్నది యరొబాము మనసును తొలుస్తున్న భయం. సొలొమోను పాలనకాలంలోలాగ ఆలయ సేవలు ఇంకా జరుగుతున్న ఆ పురాతన యూదు రాజ్య అధికార కేంద్రాన్ని సందర్శించటానికి ఈ పదిగోత్రాల్నీ అనుమతిస్తే యెరూషలేము కేంద్రంగా ఉన్న ప్రభుత్వానికి అనేకులు సుముఖత చూపవచ్చునని అతడు తర్కించుకున్నాడు. తన సలహాదారులతో ఆలోచించిన మిదట తన పరిపాలనపై తిరుగుబాటు అవకాశాన్ని ఒక్కవేటుతో తీసివెయ్యాలని యరొబాము నిశ్చయించు కున్నాడు. నూతనంగా ఏర్పడ్డ తన రాజ్యంలోనే రెండు ఆరాధన కేంద్రాల్ని బేతేలులో ఒకటి, దానులో ఒకటి ఏర్పాటు చేయటంద్వారా ఈ కార్యాన్ని సాధించాలనుకున్నాడు. ఆ పదిగోత్రాలు దేవున్ని యెరూషలేములోగాక ఇక్కడ ఆరాధించాల్సిందిగా కోరాలని యరొబాము యోచించాడు.PKTel 56.2

    ఈ మార్పిడిని ఏర్పాటు చెయ్యటంలో, కనిపించని దేవుని సముఖాన్ని సూచించటానికి కనిపించే ఒక రూపాన్ని ప్రజలముందు ఉంచటంద్వారా ఇశ్రాయేలు ప్రజల మనుసుల్ని ఆకట్టుకోవాలని భావించాడు. ఆ ఆలోచనమేరకు అతడు రెండు బంగారు దూడల్ని చేయించి వాటిని ఆ రెండు ఆరాధన కేంద్రాల్లో ప్రతిష్టింపజేశాడు. దేవున్ని సూచించటానికి చేసిన ఈ ప్రయత్నంలో యెహోవా ఇచ్చిన ఈ నిర్దిష్ట ఆజ్ఞను యరొబాము అతిక్రమించాడు : “దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసికొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింప కూడదు.” నిర్గమ. 20:4,5.PKTel 56.3

    ఆ పదిగోత్రాల్ని యెరూషలేముకి దూరంగా ఉంచాలన్న కోరిక యరొబాము మనసులో ఎంత బలంగా ఉన్నదంటే తన ప్రణాళికలోని ప్రాథమిక లొసుగును అతడు విస్మరించాడు. ఐగుప్తు దాస్యంలో మగ్గుతున్న శతాబ్దాల్లో తమ పితరులకు పరిచయమైన దేవతా చిహ్నానికి విగ్రహరూపమిచ్చి, దాన్ని ఇశ్రాయేలీయుల ముందుంచటంలోని ప్రమాదాన్ని అతడు పరిగణించలేదు. అన్యజనుల విగ్రహాల్ని ప్రజల ముందుంచటం బుద్దిహీనమని ఐగుప్తులో యరొబాము ఇటీవలి ఉనికి అతడికి బోధించి ఉండాల్సింది. అయితే ఉత్తర గోత్రాలు ఏటేటా పరిశుద్ధ పట్టణాన్ని సందర్శించటాన్ని ఆపటానికి అతడు అవివేకమైన చర్యలు చేపట్టాడు. “ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశమునుండి మిమ్మును రప్పించిన మా దేవుడు ఇదే” అన్నాడు (1 రాజులు 12:28). ఈరకంగా బంగారు విగ్రహాలకు సాగిలపడి అన్య ఆరాధన పద్దతుల్ని ఆచరించటానికి ప్రజల్ని ఆహ్వానించటం జరిగింది. బేతేలులోను దానులోను కొత్తగా కట్టిన గుడుల్లో యాజకులుగా సేవ చెయ్యటానికి తన రాజ్యంలో ఉన్న కొందరు యాజకుల్ని ఒప్పించటానికి రాజు ప్రయత్నించాడు. కాని అతడి ప్రయత్నము ఫలించలేదు. కనుక అతడు “సాధారణమైన వారిలో), కొందరిని యాజకత్వానికి నియమించాల్సి వచ్చింది. (31వ వచనం). భవిష్యత్తు గురించి ఆందోళన చెంది అనేకమంది లేవీయులు సహా దైవ నిబంధనలకు అనుగుణంగా దేవుని ఆరాధించేందుకు యెరూషలేముకి పారిపోయారు.PKTel 57.1

    “యరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠము మీద బలులు అర్పించుచువచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను.” 32వ వచనం.PKTel 57.2

    ధిక్కార వైఖరితో దైవ నిబంధనల్ని తోసిపుచ్చటాన్ని గద్దించకుండా విడిచిపెట్టటం జరగలేదు. బేతేలులో స్థాపించిన ఆ అన్య బలిపీఠాన్ని ప్రతిష్టిస్తూ ధూపార్జన చేస్తున్న తరుణంలో యూదా రాజ్యంనుంచి వచ్చిన ప్రవక్త యరొబాము ముందు ప్రత్యక్షమయ్యాడు. కొత్త ఆరాధన ఆచారాన్ని ప్రవేశపెట్టటానికి పూనుకున్నందుకు అతణ్ని మందలించటానికి దేవుడు అతణ్ని పంపాడు. ఆ ప్రవక్త “బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను - బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా - దావీదు సంతతిలో యెషియా అనునొక శిశువు పుట్టును; నీమీద ధూపమువేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.”PKTel 57.3

    “ఈ బలిపీఠము బద్దలైపోయి దానిమీదనున్నబుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచనయొకటి ఇచ్చెను.” వెంటనే “యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను.” 1 రాజులు. 13:2,3,5. PKTel 58.1

    ఇది చూసినమీదట యరొబాము దేవునిపట్ల తిరస్కార స్వభావంతో నిండి దైవ రాయబారిని అడ్డగించటానికి ప్రయత్నించాడు. ఆగ్రహంతో అతడు “బలిపీఠము మీదనుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుము” అని అరిచాడు. అతడి దుందుడుకు చర్యకు తక్షణ మందలింపు వచ్చింది. యెహోవా దూతకు వ్యతిరేకంగా చాపిన చెయ్యి హఠాత్తుగా శక్తిహీనమై ఎండిపోయింది. దాన్ని అతడు వెనక్కు తీసుకోలేకపోయాడు.PKTel 58.2

    భయభ్రాంతుడై తనపక్షంగా దేవునితో విజ్ఞాపన చేయమని రాజు ప్రవక్తను వేడుకున్నాడు. “నా చెయ్యి మనుపటివలె బాగుపడునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలబాగై మునుపటివలె ఆయెను.” 4,6 వచనాలు.PKTel 58.3

    అన్యబలిపీఠం ప్రతిష్టకు గాంభీర్యాన్ని చేకూర్చటానికి యరొబాము చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. దాన్ని గౌరవించటం యెరూషలేము దేవాలయంలోని యెహోవా ఆరాధనను అగౌరవపర్చడానికి దారితీసేది. ప్రవక్త వర్తమానం రాజు పశ్చాత్తాపపడటానికి, ప్రజల్ని సత్యదేవుని ఆరాధననుంచి మళ్లిస్తున్న చెడు మార్గాల్ని విసర్జించటానికి దారితీసి ఉండాల్సింది. కాని అతడు తన హృదయాన్ని కఠిన పర్చుకుని తన సొంతమార్గాన్ని అవలంబించటానికి నిర్ణయించుకున్నాడు.PKTel 58.4

    బేతేలులోని పండుగ సమయంలో ఇశ్రాయేలు ప్రజల హృదయాలు పూర్తిగా కఠినమవ్వలేదు. అనేకులు తమ హృదయాల్లో పరిశుద్దాత్మకు చోటిచ్చారు. మతభ్రష్టత దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నవారి గమనాన్ని ఎక్కువ ఆలస్యం కాకముందే అడ్డుకోవాలని ప్రభువు తలంచాడు. ఆ విగ్రహారాధక కార్యకలాపాల్ని ఆపటానికి ఈ మత భ్రష్టత స్వరూపం ఎలా ఉండబోతుందో రాజుకీ, ప్రజలకీ బయలు పర్చటానికీ ప్రభువు తనదూతను పంపాడు. బలిపీఠం బద్దలవ్వటం ఇశ్రాయేలులో జరుగుతున్న హేయకార్యంపట్ల దేవుని అసమ్మతిని సూచిస్తుంది.PKTel 58.5

    ప్రభువు రక్షించటానికే గాని నాశనం చెయ్యటానికి చూడడు. పాపుల్ని రక్షించటమే ఆయనకి ఆనందాన్నిస్తుంది. “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషములేదు.” అంటున్నాడు ప్రభువు. (యెహె. 33:11). దుర్మార్గులు తమ దుష్కీయలు మాని ఆయనను ఆశ్రయించి జీవించాల్సిందిగా హెచ్చరికల ద్వారాను, విజ్ఞప్తులద్వారాను ఆయన వారికి పిలుపునిస్తాడు. తాను ఎన్నుకున్న తనదూతలు ప్రకటించేది విని భయపడి ప్రజలు పాపపశ్చాత్తాపం పొందేందుకోసం ఆయన తన దూతలకు పరిశుద్ద ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రవక్త రాజుని ఎంత కఠినంగా మందలించాడు! ఈ కాఠిన్యం అవసరం. అప్పుడు ప్రబలుతున్న పాపాల్ని వేరేవిధంగా ఖండించటం సాధ్యపడేదికాదు. విన్నవారి మనసుల్లో ఆ మందలింపు స్థిరంగా నిలిచేందుకు ప్రభువు తన సేవకుడికి ధైర్యానిచ్చాడు. దైవ ప్రతినిధులు మానవుడి ముఖంచూసి భయపడకూడదు. వారు అచంచలంగా నిలిచి సత్యం వచించాలి. తమ నమ్మకాన్ని దేవునిమిద ఉంచినంతకాలం వారు భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వారికి ఆ కర్తవ్యం ఇచ్చే ప్రభువే తమను కాపాడ్డానని భరోసా ఇస్తున్నాడు. PKTel 59.1

    ప్రవక్త తన వర్తమానాన్ని అందించి వెళ్లిపోతున్నప్పుడు యరొబాము అతడితో ఇలా అన్నాడు, “నీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదను.” ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చాడు, “నీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెను.” 1 రాజులు. 13:7-9.PKTel 59.2

    ప్రవక్త ఆలస్యం చెయ్యకుండా యూదయకు తిరిగి రావాలన్న తన ఉద్దేశానికి కట్టుబడిఉంటే బాగుండేది. వేరొక మార్గాన ఇంటి దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వృద్దుడు తానుకూడా ప్రవక్తనని చెప్పుకుంటూ అతణ్ని కలిశాడు. అతడు ఈ ప్రవక్తకు అబద్దాలు చెప్పి ఇలా అన్నాడు, “నేనును నీవంటి ప్రవక్తనే. మరియు దేవదూత యొకడు యెహోవాచేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెను.” ఆ అబద్దాన్ని పదేపదే చెప్పి ఆ ప్రవక్తను ఆహ్వానించగా అతడు ఆ అబద్ధ ప్రవక్తతో వెళ్లటానికి సమ్మతించాడు.PKTel 59.3

    నిజమైన ప్రవక్త తన విధి నిర్వహణకు విరుద్ద మార్గాన్ని అవలంబించాడు. గనుక ఆ అతిక్రమానికి అతడు శిక్ష అనుభవించటానికి దేవుడు అనుమతించాడు. అతడు అతన్ని బేతేలుకు తిరిగి రావలసిందిగా ఆహ్వానించినవాడు. భోజన బల్లవద్ద కూర్చుండగా అబద్ద ప్రవక్తమీదికి దైవావేశం వచ్చింది. “అతడు యూదా దేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచి - యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు - నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటిమాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి ... యున్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.” 18-22 వచనాలు.PKTel 59.4

    మృత్యువునుగూర్చిన ఈ ప్రవచనం అనతికాలంలోనే అక్షరాలా నెరవేరింది. “అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త ... ఆ ప్రవక్తకు గాడిదమిద గంతకట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దానిదగ్గర నిలిచియుండెను. సింహమును శవముదగ్గర నిలచియుండెను. కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు, సింహము శవముదగ్గర నిలిచియుండుటయు చూచి, ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు - యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే.” అన్నాడు. 23-26 వచనాలు.PKTel 60.1

    అపనమ్మకంగా ఉన్న దూత అనుభవించిన శిక్ష బలిపీఠంపై పలికిన ప్రవచనం సత్యమనటానికి మరొక నిదర్శనం. దేవుని మాటకు అవిధేయుడైన తర్వాత ప్రవక్త క్షేమంగా తిరిగివెళ్లటం జరిగితే, తన అవిధేయతను సమర్థించుకోటానికి ఇది రాజుకు బలం చేకూర్చేది. విరిగిన బలిపీఠంలో, ఎండిపోయిన చెయ్యిలో, యెహోవా ఆజ్ఞను అతిక్రమించటానికి సాహసించిన ప్రవక్తలో యరొబాము దేవుని అసంతుష్టిని చూసి ఉండాల్సింది. దుర్వర్తనలో కొనసాగకుండా ఈ తీర్పులు అతణ్ని నిరోధించి ఉండాల్సింది. అయితే పశ్చాత్తాపపడే బదులు యరొబాము “తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగ ప్రతిష్టించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.” ఈవిధంగా తానే గొప్ప పాపం చెయ్యటమేగాక అతడు “ఇశ్రాయేలువారు పాపము చెయ్యటానికి కారకుడయ్యాడు. “యరొబాము సంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింప జేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.” 33,34; 14-16 వచనాలు.PKTel 60.2

    శాంతి సమాధానాలు కొరవడ్డ ఇరవైరెండు సంవత్సరాల పరిపాలన చరమ. దశలో రెహబాము వారసుడైన అబీయాతో జరిగిన యుద్ధంలో యరొబాము పరాజయం పొందాడు. “అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు. యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణమొందెను.” 2 దిన వృ. 13:20. PKTel 61.1

    యరొబాము పరిపాలన కాలంలో ప్రారంభమైన మతభ్రష్టత ఇంతలంతలై చివరికి ఇశ్రాయేలు రాజ్య పతనానికి దారితీసింది. లోహులో ఉన్న వృద్దప్రవక్త, యరొబాము రాజవుతాడని ప్రవచించినవాడు అయిన అహియా యరొబాము మరణానికి ముందే ఇలా ప్రకటించాడు : “ఇశ్రాయేలువారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెట్లు అల్లాడునట్లు యెహోవా ఇశ్రాయేలువారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశమునుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదరగొట్టును, మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగించబోవుచున్నాడు.” 1 రాజులు. 14:15,16.PKTel 61.2

    ఇశ్రాయేలు ప్రజల్ని తిరిగి. తనకు నమ్మకంగా నివసించటానికి నడిపించటానికి తాను చేయగలిగినదంతా చెయ్యకుండా ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. ఒకరి తర్వాత ఒకరుగా రాజులు దేవునికి వ్యతిరేకంగా నిలిచి ఇశ్రాయేలు ప్రజల్ని విగ్రహారాధనలోకి నడిపించిన దీర్ఘ అంధకార సంవత్సరాల్లో దేవుడు భక్తి విడచిన తన ప్రజలకు వర్తమానం వెంట వర్తమానం పంపాడు. మతభ్రష్టత పోటును ఆపి తనవద్దకు తిరిగి వచ్చేందుకు వారికి ఆయన తన ప్రవచనాలద్వారా ప్రతీ అవకాశం ఇచ్చాడు. రాజ్యం చీలిన తర్వాతి సంవత్సరాల్లో ఏలీయా ఎలీషాలు జీవించి సేవ చెయ్యాల్సి ఉన్నారు. హో షేయ ఆమోసు ఓబద్యాల విజ్ఞాపనలు దేశంలో వినిపించాల్సి ఉన్నాయి. పాపంనుంచి రక్షించటానికి దేవుని మహాశక్తిని గురించిన సాక్ష్యం లేకుండా ఇశ్రాయేలు రాజ్యం ఎన్నడూ విడువబడలేదు. మిక్కిలి అంధకార గడియల్లో సయితం దైవపరిపాలకునికి నమ్మకంగా నిలిచేవారు, విగ్రహారాధన మధ్య పరిశుద్ధ దేవుని దృష్టిలో నిరపరాధులుగా పరిగణన పొందేవారు ఉంటారు. నమ్మకంగా నిలిచే వీరు శేషించిన నీతిమంతులుగా పరిగణన పొందుతారు. యెహోవా నిత్యసంకల్పం చివరగా వీరిద్వారా నెరవేర్పు పొందాల్సి ఉంది.PKTel 61.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents