Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    53 - గోడపై నిలిచి కట్టేవారు

    యెరూషలేముకి నెహెమ్యా ప్రయాణం సురక్షితంగా సాగింది. తన ప్రయాణ మార్గంలోని సంస్థానాధికార్లకు రాజు రాసిన లేఖలు అతడికి మర్యాదపూర్వక స్వాగతం సత్వర సహాయ సహకారాలు సమకూర్చాయి. పారసీక రాజు అధికారం పరిరక్షిస్తున్న అధికారిని ఏ శత్రువు కన్నెత్తి చూడలేకపోయాడు. సంస్థానాధిపతులు అతణ్ని ఎంతో ఆదరంగా చూశారు. సైనికుల పరిరక్షణతో రావటంవల్ల, తాను ఓ ప్రత్యేక కార్యార్ధం వచ్చినట్లు సూచిస్తూ అతడు యెరూషలేము చేరటం పట్టణానికి దగ్గరలో నివసిస్తున్న అన్యజాతుల ప్రజలికి కన్నుకుట్టింది. వారు యూదులపట్ల శత్రుత్వం ప్రదర్శించేవారు. వారికి హాని కలిగించటానికి వారిని పరాభవించటానికి వెనకాడేవారు కాదు. ఈ దుష్కార్యంలో ముందున్నవారు ఈ జాతుల నాయకులైన హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన టోబియా, అరబ్బీయుడైన గెషెము. ఈ నాయకులు మొదటి నుంచి నెహెమ్యా కదలికల్ని డేగకళ్లతో కనిపెడ్తూ అతడి ప్రణాళికల్ని అడ్డుకోటానికి అతడి కృషికి అడ్డుకట్ట వెయ్యటానికి తమ శక్తిమేరకు ప్రయత్నించారు.PKTel 446.1

    ఇంతకుముందు వ్యవహరించినట్లే నెహెమ్యా జాగ్రత్తగా వివేకంగా మెలగటం కొనసాగించాడు. కరడుగట్టిన, కృతనిశ్చయులైన శత్రువులు తనను వ్యతిరేకించటానికి సిద్దంగా ఉన్నారని గ్రహించి, తన ప్రణాళికల్ని రూపొందించు కోటానికిగాను పరిస్థితిని అధ్యయనం చేసేవరకు తన కర్తవ్య స్వభావ స్వరూపాల్ని వారికి తెలియకుండా గోప్యంగా ఉంచాడు. ఈవిధంగా ప్రజల సహకారాన్ని పొంది ప్రత్యర్థుల వ్యతిరేకత ఉద్ధృతం కాకముందు వారిని పనిలో వినియోగించాలన్న ఆశాభావంతో ఉన్నాడు. PKTel 446.2

    విశ్వాస పాత్రులుగా తాను ఎరిగిన కొంతమందిని ఎంపికచేసి, తాను యెరూషలేముకు రావటానికి దారితీసిన పరిస్థితుల్ని, తాను సాధించదలచిన కార్యాన్ని, తాను అనుసరించదలచిన ప్రణాళికల్ని వారికి వివరించాడు. అతడు తలపెట్టిన కార్యంలో వారి ఆసక్తి వెంటనే రగుల్కుంది. ఇలా వారి సహాయ సహకారాల్ని నెహెమ్యా పొందాడు.PKTel 446.3

    నెహెమ్యా యెరూషలేము చేరిన మూడోరోజు మధ్య రాత్రిలో లేచి నమ్మకస్తులైన కొంతమంది మిత్రులతో కలిసి జనరహితమైన యెరూషలేమును స్వయంగా చూడటానికి బయటికి వెళ్లాడు. తన వాహనమైన గాడిదపై కూర్చుని పట్టణంలోని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లి పడిపోయిన ప్రాకారాన్ని తన తండ్రుల పట్టణమైన యెరూషలేము గుమ్మాల్ని పరీక్షించాడు. ముంచుకొస్తున్న దుఃఖంతో తనకు ప్రియమైన యెరూషలేము పట్టణ శిథిలాల్ని వీక్షిస్తుండగా బాధాకరమైన తలంపులు అతడి మనసును నింపాయి. ఇశ్రాయేలు గత ప్రాభవం వైభవం సృతులికి ఇప్పుడు ఆ జాతి పొందుతున్న పరాభవ సూచనలు భిన్నంగా ఉన్నాయి.PKTel 447.1

    రహస్యంగా, చడీచప్పుడు లేకుండా పట్టణం గోడ సందర్శనాన్ని నెహెమ్యా పూర్తి చేశాడు. అతడిలా అన్నాడు, “నేను ఎక్కడికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకేగాని యాజకులకేగాని యజమానులకేగాని అధికారులకేగాని పనిచేయు ఇతరమైనవారికేగాని నేను ఆ సంగతి చెప్పియుండ “లేదు.” మిగిలిన రాత్రి అతడు ప్రార్థనలో గడిపాడు. ఎందుకంటే నిరుత్సాహపడిన, విభజించబడి అనైక్యంగా ఉన్న తన దేశప్రజల్ని ఉదయాన ఐక్యం చెయ్యటానికి కృషి చేయాల్సి ఉంది.PKTel 447.2

    పట్టణం గోడను పునర్నిర్మించటంతో ప్రజలు నెహెమ్యాకు సహకరించాలంటూ రాజు జారీచేసిన ఆజ్ఞ నెహెమ్యా వద్ద ఉంది కాని అతడు అధికారాన్ని ఉపయోగించుకోటం పై ఆధారపడలేదు. తన ముందున్న మహాకార్యానికి హృదయాలు హస్తాలు ఒకటవ్వాలని ఎరిగి, ప్రజలవిశ్వాసాన్ని సానుభూతిని సంపాదించటానికి ప్రయత్నించాడు. ఆ ఉదయం ప్రజల్ని సమావేశ పర్చినప్పుడు నిద్రాణమై ఉన్నవారి శక్తుల్ని మేల్కొల్పటానికి చెదిరిపోయిన వారిని ఐక్యపర్చటానికి ఉద్దేశించిన పదునైన వాదనల్ని నెహెమ్యా వినిపించాడు.PKTel 447.3

    తన మాటలు వింటున్న ప్రజలికి గడిచిన రాత్రిలో తాను పట్టణాన్ని సందర్శించినట్లు నెహెమ్యా చెప్పలేదు. అయితే అతడి సందర్శనం తన విజయానికి ఎంతగానో దోహదపడింది. ఎందుచేతనంటే పట్టణం పరిస్థితిని గురించి అతడు చిన్నచిన్న వివరాలతోసహా ఖచ్చితంగా చెప్పి శ్రోతల్ని విస్మయపర్చాడు. యెరూషలేము బలహీనతను దుస్థితిని చూసినప్పుడు అతడికి ఏర్పడ్డ అభిప్రాయం అతడి మాటలకు శక్తినిచ్చింది. PKTel 447.4

    అన్యజనులమధ్య తమకు కలిగిన నిందను తమ మతం గౌరవించబడక పోవటాన్ని, తమ దేవుడు దూషించబడటాన్ని నెహెమ్యా వారి ముందు పెట్టాడు. ఒక దూరదేశంలో తమ శ్రమలగురించి విన్నానని, తమ తరపున దేవుని కృపకోసం విజ్ఞప్తి చేశానని, తాను ప్రార్థన చేస్తున్నప్పుడు తమకు సహాయం చేయాల్సిందిగా రాజును వేడుకోవాలని నిర్ధారించుకున్నానని నెహెమ్యా వారికి చెప్పాడు. రాజు అనుమతినివ్వటమేకాకుండా తనకు అధికారాన్ని, తన పనిని నిర్వహించటానికి కావలసిన సహాయాన్ని ఇచ్చేటట్లు చెయ్యమని దేవునికి ప్రార్థించానని, తన ప్రార్థనను దేవుడు సఫలం చేసిన తీరునుబట్టి అది దేవునినుంచి వచ్చిన ప్రణాళిక అని వ్యక్తమయ్యిందని చెప్పాడు.PKTel 447.5

    ఇదంతా అతడు వివరించి, అనంతరం తనకు ఇశ్రాయేలు దేవుని అధికారం పారసీక రాజు అధికారం రెండు ఏకమై ఉన్నట్లు చూపించిన మిదట ప్రజలు దీన్ని ఆసరా చేసుకుని లేచి గోడను నిర్మించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు.PKTel 448.1

    ఆ విజ్ఞప్తి వారి హృదయాల్ని కదిలించింది. తమపట్ల దేవుని కృప ప్రదర్శిత మయ్యిందన్న ఆలోచన వారి భయాల్ని పోగొట్టి వారిలో నూతనోత్సాహాన్ని నింపింది. “మనము కట్టుటకు పూనుకొందమురండి” అని వారు ముక్తకంఠంతో పలికి “యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.”PKTel 448.2

    నెహెమ్యా మనసంతా తాను చేపట్టిన ఆ మహాకార్యం మీదే ఉంది. అతడి ఆశాభావం, అతడి బలం, అతడి ఉత్సాహం, అతడి ధృఢ సంకల్పం ఇతరులికి అంటుకుని వారిని కూడా అదే ధైర్యంతో అదే ఉన్నతాశయంతో నింపాయి. వారిలో ప్రతీఒక్కరూ ఓ నెహెమ్యాగామారి తన పక్కవ్యక్తి హృదయాన్ని హస్తాన్ని పటిష్ఠ పర్చటానికి తోడ్పడ్డాడు.PKTel 448.3

    ఇశ్రాయేలీయుల శత్రువులు యూదులు సాధించదలచిన కార్యాన్నిగూర్చి విన్నప్పుడు అపహాస్యంగా నవ్వుతూ ఇలా అన్నారు, “మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా?” అందుకు నెహెమ్యా, “ఆకాశమందు. నివాసియైన దేవుడు తానే మా యత్నము సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపకసూచనయైనను లేదు” అని ప్రత్యుత్తరమిచ్చాడు. PKTel 448.4

    నెహెమ్యా ఉత్సాహస్పూర్తిని పట్టుదలను పుణికిపుచ్చుకున్నవారిలో ప్రథములు యాజకులు. తమ ప్రభావపూరిత హోదానుబట్టి పని ముందుకి సాగటానికి లేదా దానికి ఆటంకాలు సృష్టించటానికి వారు ఎంతో చెయ్యగలరు. ఆరంభలోనే వారి సహకారం ఆ కర్తవ్య విజయానికి ఎంతో దోహదపడింది. ఇశ్రాయేలులోని అధిపతులు సంస్థానాధిపతుల్లో అధిక సంఖ్యాకులు తమ విధి నిర్వహణకు వచ్చారు. నమ్మకస్తులైన ఈ మనుషులు దేవుని గ్రంథంలో గౌరవనీయులుగా పేర్కొనబడతారు. కొందరు తెకోనీయ అధికారులు ప్రభువు పనిచేయ నొప్పుకొనక పోయిరి.” సోమరులైన ఈ దాసుల స్మృతి సిగ్గు ముద్రతో భావితరాలకు హెచ్చరికగా వస్తున్నది.PKTel 448.5

    అది దేవుని కార్యం కాదనలేనప్పటికీ, సహాయం చెయ్యటానికి ప్రయత్నించకుండా చేతులు ముడుచుకుని దూరంగా నిలబడేవారు ప్రతీ మతోద్యమంలోను కొందరుంటారు. అలాంటివారు పరలోకంలో ఓ రికార్డు ఉన్నదని జ్ఞాపకముంచుకుంటే మంచిది. ఆ పుస్తకంలోకి ఎక్కని విషయాలు ఉండవు. తప్పులు ఉండవు. ఆ పుస్తకంలోని వాటిపైనే తీర్పు ఉంటుంది. దేవుని సేవ చెయ్యటానికి నిర్లక్ష్యం చేసిన ప్రతీ తరుణం అందులో నమోదై ఉంటుంది. అందులోనే నిత్యం జ్ఞాపకముండేందుకు విశ్వాసాన్ని ప్రేమను వ్యక్తీకరించే ప్రతీకార్యం నిలిచి ఉంటుంది. PKTel 449.1

    స్ఫూర్తిదాయకమైన నెహెమ్యా సన్నిధికి ప్రతికూలంగా ఉన్న తెకోనీయ అధికారుల ప్రభావం దాదాపు శూన్యం. దేశభక్తి, ఉత్సాహాలతో ప్రజలు ఉత్తేజితులయ్యారు. ప్రతిభ ప్రభావాలుగల నాయకులు వివిధ తరగతుల ప్రజల్నీ గుంపులుగా ఏర్పర్చారు. ప్రతీ నాయకుడు గోడలోని ఓ నిర్దిష్ట భాగాన్ని నిర్మించటానికి బాధ్యత వహించాడు. “తమ యిండ్ల కెదురుగా బాగుచేసిరి” అని కొందరి గురించి రాయటం జరిగింది.PKTel 449.2

    ఇప్పుడు అసలు పని ప్రారంభమయ్యింది. నెహెమ్యాశక్తి తగ్గలేదు. విరామం లేని అప్రమత్తతతో పనివారికి సూచనలిస్తూ, ఆటంకాల్ని గుర్తిస్తూ, అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోటానికి ఏర్పాట్లు చేస్తూ నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. మూడుమైళ్లు పొడవున్న ఆ గోడ ఈ కొననుంచి ఆ కొనవరకు అతడి ప్రభావం నిత్యం ప్రసరించింది. భయపడున్న వారిని చక్కని మాటలతో ఉత్సాహపర్చాడు. సోమరులైన వారిని మేల్కొలిపాడు. నమ్మకంగా పనిచేస్తున్న వారిని ప్రశంసించాడు. శత్రువుల కదలికలపై ఎప్పుడూ కన్నేసి ఉంచాడు. శత్రువులు అప్పుడప్పుడు కొంతదూరంలో గుంపుగా పోగుపడి ఏదో కుట్ర పన్నుతున్నట్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండి కాసేపటికి నిర్మాణపు పనివారి వద్దకువచ్చి వారి గమనాన్ని పక్కదారి పట్టించటానికి ప్రయత్నించేవారు.PKTel 449.3

    తన వివిధ కార్యకలాపాల నడుమ నెహెమ్యా తన బలానికి ఆయువు పట్టయిన ప్రభువుని మర్చిపోలేదు. అతడి హృదయం నిత్యం దేవున్ని ధ్యానించేది. “ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును.” అన్నాడు. ఈ మాటలు మళ్లీమళ్లీ ప్రతిధ్వనించి గోడమీద నిలిచికట్టే పనివారి హృదయాల్ని ఉత్సహంతో నింపాయి.PKTel 449.4

    యెరూషలేము ప్రాకార పునరుద్దరణ కార్యం ఆటంకాలు లేకుండా ముందుకు సాగలేదు. వ్యతిరేకతను సృష్టించి నిరుత్సాహపర్చటానికి సాతాను కృషిచేస్తున్నాడు. సన్బల్లటు, టోబియా, గేషెము ఈ ఉద్యమంలో సాతాను ప్రతినిధులు. వారిప్పుడు పునరుద్దరణ కృషికి ప్రతిబంధకాలు కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. పనివారిలో చీలికలు తేవటానికి చూశారు. పునరుద్ధరణ సాధించలేని కార్యమన్నారు. అది విఫలమౌతుందని ప్రవచించారు.PKTel 449.5

    సన్బల్లటు ఎగతాళిగా ఇలా అన్నాడు, “దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా?... కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా?” మరెక్కువ ద్వేషంతో నిండిన టోబియా “వారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవును” అన్నాడు.PKTel 450.1

    నిర్మాణకులికి త్వరలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. వారు తమ శత్రువుల కుట్రల విషయంలో నిత్యం జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. వారు స్నేహం నటించి గందరగోళం ఆందోళన సృష్టించి అపనమ్మకం కలిగించటానికి ప్రయత్నించారు. యూదుల ధైర్యాన్ని నాశనం చెయ్యటానికి కృషిచేశారు. వారి విద్రోహక చర్యలకు సహకరించటానికి కపట హృదయులైన యూదులు కొందరు సిద్దంగా ఉన్నారు. తన్నుతాను ఇశ్రాయేలు రాజుగా హెచ్చరించుకోవాలన్న ఆకాంక్షతో నెహెమ్యా పారసీక రాజుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడని, అతడికి సాయంచేసిన వారందరూ దేశద్రోహులని ఓ నివేదిక తయారుచేసి ప్రచారం చేశారు.PKTel 450.2

    ఇలాగుండగా మార్గ నిర్దేశంకోసం సహాయంకోసం నెహెమ్యా దేవునిమిద ఆధారపడి ఉన్నాడు. “పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను.” గోడలోని ఖాళీల్ని పూరించే వరకు కట్టడం సాగింది. గోడ అనుకున్న ఎత్తులో సగంవరకూ లేచింది.PKTel 450.3

    ఇశ్రాయేలు శత్రువులు తమ పప్పు ఉడకటంలేదని గ్రహించి కోపోద్రిక్తు లయ్యారు. ఇప్పటివరకు వారు తీవ్రచర్యలు చేపట్టలేదు. ఎందుకంటే నెహెమ్యా, అతడి అనుచరులు రాజు అధికారంతోనే వ్యవహరిస్తున్నారని వారికి తెలుసు. నెహెమ్యాపట్ల తీవ్ర వ్యతిరేకత తమమీదికి రాజు ఆగ్రహాన్ని తేవచ్చునని భయపడ్డారు. కాని ఇప్పుడు తమకోపంలో నెహెమ్యా ఏ నేరంచేసినట్లు ఆరోపిస్తున్నారో ఆ నేరానికే వారు పాల్పడ్డారు. ఆలోచన చెయ్యటానికి సమావేశమై వారందరు “యెరూషలేము మీదికి యుద్ధమునకు” వచ్చారు. PKTel 450.4

    సమరయులు నెహెమ్యాకు అతడి కర్తవ్యానికి వ్యతిరేకంగా కుట్రచేస్తున్న సమయంలోనే, యూదుల్లో ప్రముఖులు కొందరు విరక్తిచెంది, తన కర్తవ్య సాధనలో ఎదురవుతున్న కష్టాల్ని కొండంతలు చేసి చెప్పటంద్వారా అతణ్ని నిరుత్సాహ పర్చటానికి ప్రయత్నించారు. “బరువులు మోయువారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేము.” అన్నారు వారు.PKTel 450.5

    నిరుత్సాహం మరో మూలంనుంచి వచ్చింది. “మా శత్రువుల యొద్ద నివాసులైయున్న యూదులు” - నిర్మాణం పనిలో పాల్గొనివారు - తమ శత్రువుల మాటలు నివేదికలు పోగుచేసి పనివారిని అధైర్యపరచి వారికి విరక్తి పుట్టించటానికి వాటిని ఉపయోగించారు.PKTel 450.6

    అయితే ఎత్తిపొడుపు మాటలు, ఎగతాళి, వ్యతిరేకత, బెదిరింపులు నెహెమ్యాలో పట్టుదలను పెంచి అతణ్ని మరింత జాగృతం చేశాయి. శత్రువులతో పోరాటంలో ఎదుర్కోవలసిన ప్రమాదాల్ని అతడు గుర్తించాడు. అయినా అతడిది వెన్నుచూపని ధైర్యం. అతడిలా అన్నాడు, “మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలి యుంచితిమి.” “అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి ఈటెలతోను వారి విండ్లతోను నిలిపితిని. అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను - వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మా నివాసము మికుండునట్లు యుద్ధము చేయుడి.PKTel 451.1

    “వారి యోచన మాకు తెలిసియుండెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తనపనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటినుండి నా పనివారిలో సగముమంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది ఈటెలును బల్లెములును కవచములును ధరించినవారై వచ్చిరి.... గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒకొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి. మరియు కట్టువారిలో ఒకొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను.” PKTel 451.2

    నెహెమ్యా పక్కనే బాకా ఊదేవాడొకడు నిలబడి ఉన్నాడు. గోడ వివిధ భాగాల్లో బాకాలు పట్టుకున్న యాజకులు నిలిచి ఉన్నారు. ప్రజలు ఆయా పనులు చేస్తూ చెదిరిపోయి ఉన్నారు. ఏ భాగంలోనైనా అపాయం సమీపిస్తున్నట్లయితే వెంటనే అందరూ అక్కడికి రావలసిందిగా బాకా సూచన ఇవ్వటం జరిగేది. నెహెమ్యా ఇలా అంటున్నాడు, “ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి; సగముమంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.”PKTel 451.3

    యెరూషలేము వెలపల పట్టణాల్లోను పల్లెల్లోను నివసిస్తున్నవారు ఇప్పుడు ప్రాకారం లోపల నివసించాల్సిందిగా ఆదేశించటం జరిగింది. దీని వెనుక ఉద్దేశం - వారు జరిగిన పనిని కాపాడటం, ఉదయం తమతమ విధుల నిర్వహణకు సిద్ధంగా ఉండటం. ఇది అనవసర జాప్యాన్ని తొలగించి పనివారు తమ ఇండ్లనుంచి వచ్చీ పోయేటప్పుడు శత్రువు వారిపై దాడిచేసే అవకాశం లేకుండా చేసింది. శ్రమలు కష్టాలు అనుభవించటానికి కఠిన పరిస్థితుల్లో సేవచెయ్యటానికి నెహెమ్యా అతడి అనుచరులు వెనుదీయలేదు. పగలుగాని రాత్రిగాని, నిద్రించటానికి తమకున్న ఆ కొద్ది సమయంలో సయితం వారు తాము ధరించిన వస్త్రాల్నిగాని లేక తమ కవచాల్ని గాని పక్కన పెట్టలేదు. PKTel 451.4

    నెహెమ్యా కాలంలోని కట్టడం పనివారు బహిరంగ శత్రువులనుంచి కపట వేషం ధరించిన మిత్రులనుంచి ఎదుర్కున్న వ్యతిరేకత, నిర్వేదం, నేడు దేవుని సేవ చేసేవారు ఎదుర్కొనే అనుభవానికి ప్రతీక. క్రైస్తవులికి వచ్చే శ్రమలు శత్రువుల కోపం, ద్వేషం, కాఠిన్యంవల్ల మాత్రమేకాదు. మిత్రులు, సహాయకుల సోమరితనం, చాపల్యం, ఉదాసీనం, నమ్మకద్రోహం వల్ల కూడా వస్తాయి. వారిని ద్వేషిస్తారు, నిందిస్తారు. తిరస్కారం అవమానం కలుగజేసిన ఆ శత్రువే అవకాశం కలిసివచ్చినప్పుడు క్రూరమైన, దౌర్జన్య పూరితమైన చర్యలకు పూనుకుంటాడు.PKTel 452.1

    తన ఉద్దేశాల్ని నెరవేర్చుకోటానికి ప్రతీ దుష్టశక్తి ఆసరానీ సాతాను ఉపయోగించుకుంటాడు. దైవ సేవ మద్దతుదారులమని ప్రకటించుకునేవారిలో దేవుని శత్రువులతో చెయ్యికలిపి, ఆయన బద్ద విరోధుల బహిరంగ దాడులకు తోడ్పడేవారున్నారు. దేవుని సేవాభివృద్ధిని కోరుకునే కొందరు సయితం దేవుని విరోధులు ప్రచారంచేసే పుకార్లు, ప్రగల్బాలు, బెదిరింపులు వినటం, ప్రచురించటం, సగం నమ్మటం ద్వారా దైవ సేవకుల కృషికి విఘాతం కలిగిస్తారు. సాతాను తన ప్రతినిధులద్వారా పనిచేసి అమోఘమైన జయం సాధిస్తాడు. వారి ప్రభావానికి లొంగేవారందరూ, జ్ఞానుల వివేకాన్ని నాశనంచేసే, ప్రాజ్ఞుల అవగాహనను భగ్నంచేసే ఓ మాంత్రిక శక్తి అదుపులో ఉంటారు. కాని దైవ ప్రజలు నెహెమ్యాలా తమ శత్రువులికి భయపడకుండా అయినా వారిని తృణీకరించకుండా ఉండాలి. దేవునిపై నమ్మిక ఉంచి వారు క్రమంగా ముందుకు సాగాలి. ఆయన పనిని స్వార్థరహితంగా చేస్తూ, తాము ఏ కార్యాచరణకు నిబద్దులో దాన్ని ఆయన చిత్తానికి అప్పగిస్తూ పురోగమించాలి.PKTel 452.2

    నిరాశగొలిపే తీవ్ర పరిస్థితుల నడుమ నెహెమ్యా దేవున్ని తన విశ్వాస నిధిగాను; నిశ్చితమైన సంరక్షణగాను ఎన్నుకున్నాడు. అప్పుడు అతడికి బాసటగా ఉన్న ఆ ప్రభువు ప్రతీయుగంలోను తన ప్రజలకు అండగా ఉన్నాడు. ప్రతీ చిక్కులోను ఆయన ప్రజలు “దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి యెవడు?’ అని ధైర్యంగా ప్రకటన చేయవచ్చు. (రోమా. 8:31). సాతాను అతడి పరివారం తమ కుట్రల్ని ఎంత తెలివిగా పన్నినా వాటిని పసికట్టి వారి ఆలోచనల్ని దేవుడు నిరర్ధకం చెయ్యగలడు. “మన దేవుడు మన పక్షముగా యుద్దము చేయును” అన్న నెహెమ్యా స్పందనే నేడు విశ్వాసం స్పందనకూడా. ఎందుకంటే ఈ పని దేవునిది. దీని అంతిమ విజయాన్ని ఏ మానవుడూ అడ్డుకోలేడు.PKTel 452.3