Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    16 - అహాబు వంశపతనం

    యెజెబెలు అహాబు మీద మొదటి నుంచి చూపించిన ప్రభావం అతడి అనంతర జీవితంలో కొనసాగి సిగ్గుకరమైన పనులు దౌర్జన్యకార్యాల్లో ప్రతిఫలించింది. అలాంటి కార్యాలకు సాటి పరిశుద్ధ చరిత్రలో ఎక్కడాలేదు. “తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబు వంటివాడు ఎవ్వడును లేడు.”PKTel 132.1

    స్వభావసిద్దంగా అహాబు పేరాశగలవాడు. అది యెజెబెలు దుష్క్రియలవల్ల బలపడి కొనసాగింది. తుదకు తనను స్వార్ధం సంపూర్తిగా అదుపుచేసే వరకు అతడు తన దుష్ట ఆలోచన ప్రకారం క్రియలు చేస్తూవచ్చాడు. తాను కోరింది నెరవేరకపోవటాన్ని సహించేవాడు కాదు. తాను కోరిన వాటిని సొంతం చేసుకోటం తన హక్కు అన్నది అతడి ఆలోచనాధోరణి. PKTel 132.2

    అహాబులోని ఈ ప్రత్యేక లక్షణం తన అనంతరం పాలించిన రాజుల్ని ఎంతో ప్రభావితం చేసి వారి పాలనకింద దేశం నాశనమవ్వటానికి కారణమయ్యింది. ఏలీయా ఇశ్రాయేలులో ప్రవక్తగా ఉన్న కాలంలో ఒక సందర్భంలో ఇది వెల్లడయ్యింది. రాజు భవనాన్ని ఆనుకుని యెజ్రాయేలువాడైన నాబోతుకు ఒక ద్రాక్షాతోట ఉంది. ఈ ద్రాక్షాతోట మీద అహాబు కన్నుపడింది. దాన్ని కొంటానని లేదా దానికి మారుగా ఇంకో స్థలం ఇస్తానని కాని అది తనకు కావాలని నాబోతుకు ప్రతిపాదించాడు. “నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొనియున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమున కిమ్ము” అన్నాడు నాబోతుతో.PKTel 132.3

    ఆ ద్రాక్షతోట తన పిత్రార్జితం కావటంతో నాబోతుకి అది ఎంతో విలువైన ఆస్తిగా ఉంది. కనుక దాన్ని విడిచిపెట్టటానికి సమ్మతించలేదు. “నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదు” అని నాబోతు తెగేసి చెప్పాడు. లేవీయ న్యాయ నిబంధన ప్రకారం అమ్మకంవల్ల గాని ఇచ్చిపుచ్చుకోటంవల్ల గాని ఏ భూమినీ శాశ్వతంగా బదలాయించటం నిషిద్ధం. ఇశ్రాయేలు వారిలో ప్రతీ ఒక్కడూ “తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.” సంఖ్యా 36:7.PKTel 132.4

    నాబోతు తిరస్కారం స్వార్ధపరుడైన రాజుకి జబ్బు కలిగించింది. “యెజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో.... పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.”PKTel 133.1

    యెజెబెలుకి త్వరలో ఆసంగతులన్నీ తెలిశాయి. రాజు మనవిని తిరస్కరించే వారెవరైనా ఉంటారా అని ఉగ్రరూపం ధరించి, ఇక తాను విచారించాల్సిన అవసరం లేదని రాజుకి ధైర్యం చెప్పింది. “ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుట లేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను నీకిప్పించెదను.” అని చెప్పింది.PKTel 133.2

    ఆ కార్యాన్ని తన భార్య ఎలా సాధిస్తుందో అన్నది అహాబు పరిగణించలేదు. యెజెబెలు వెంటనే తన దురుద్దేశాన్ని నెరవేర్చటానికి ఉపక్రమించింది. రాజు పేరుతో ఇలా ఉత్తరాలు రాసి అతడి ముద్రవేసి నాబోతు నివసిస్తున్న పట్టణం పెద్దలికి సామంతులికి వాటిని పంపింది: “ఉపవాస దినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనుల యెదుట నిలువబెట్టి - నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయిన మిదట అతని బయటికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టుడి” అని అందులో రాసింది.PKTel 133.3

    అలాగే వారు ఆ పని జరిగించారు. “అతని పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులును యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి.” అప్పుడు యెజెబెలు రాజువద్దకు వెళ్లి లేచి వెళ్లి ద్రాక్షాతోటను స్వాధీన పర్చుకోమని అహాబుతో అంది. అహాబు పర్యవసానాల్ని లెక్కచెయ్యకుండా ఆమె సలహాను గుడ్డిగా అవలంబించి తాను మనసుపడ్డ ఆ ఆస్తిని సొంతం చేసుకోటానికి వెళ్లాడు.PKTel 133.4

    మోసం ద్వారా రక్తపాతం ద్వారా సంపాదించిన ఆస్తిని మందలింపు లేకుండా రాజు అనుభవించటానికి లేదు. అప్పుడు యెహోవా వాక్కు తిషీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను - నీవు లేచి షోమ్రోనులో నున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీన పరచుకొనబోయెను. నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము - యెహోవా సెలవిచ్చునదేమనగా - దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా?” అని అహాబుపై భయంకర తీర్పు ప్రకటించమని ప్రభువు ఏలీయాను ఆదేశించాడు.PKTel 133.5

    దైవాజ్ఞను నెరవేర్చటానికి ప్రవక్త వెంటనే బయలుదేరాడు. అపరాధి అయిన రాజు ద్రాక్షాతోటలో యెహోవా సేవకుణ్ని ముఖాముఖి చూసినప్పుడు “నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా?” అని తన గుండెల్లోని భయాన్ని వెళ్లగక్కాడు.PKTel 134.1

    ఎలాంటి సంకోచం లేకుండా దైవ సేవకుడు ఇలా బదులు పలికాడు, “యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను- నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతివారిని నాశనము చేతును.” అతడిపట్ల దయచూపటం జరగదు. అహాబు సంతతి పూర్తిగా నాశనం కావలసి ఉంది. “ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”PKTel 134.2

    యెజెబెలు గురించి ప్రభువిలా సెలవిచ్చాడు, “యెజ్రాయేలు ప్రాకారము నొద్ద కుక్కలు యెజెబెలుని తినివేయును; బయటి భూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును.”PKTel 134.3

    ఈ భయంకర వర్తమానం విన్నప్పుడు రాజు “తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్టమీద పరుండి వ్యాకుల” పడ్డాడు.PKTel 134.4

    “యెహోవా వాక్కుతిషీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను - అహాబు నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండ ఆపి, అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి దాని రప్పించెదను.”PKTel 134.5

    ఇది జరిగిన మూడు సంవత్సరాలకు ముందే అహాబు సిరియన్ల చేతిలో మరణించాడు. అతడి తర్వాత వచ్చిన రాజు అహజ్యా “యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను.” “అతడు బయలు దేవతను పూజించుచు, దానికి నమస్కారము చేయుచు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.” 1 రాజులు. 22:52,53. తిరుగుబాటు దారుడైన రాజు పాపాలికి శిక్ష వెంటనే వచ్చింది. మోయాబీయులతో నష్టదాయకమైన యుద్ధం, ఆ తర్వాత తన ప్రాణానికి ముప్పు తెచ్చిన ప్రమాదం అతడి పై దేవుని కోపానికి సాక్ష్యాలు.PKTel 134.6

    “తన మేడగది కిటికీలోనుండి” కింద పడి అహజ్యా తీవ్రంగా గాయపడ్డాడు. దాని ఫలితం ఎలాగుంటుందోనన్న భయంకొద్దీ తన పరిస్థితిని గూర్చి విచారణకోసం ఎక్రోనులోని బయలు దేవత వద్దకు సేవకుల్ని పంపాడు. భవిష్యత్తులోని ఘటనల్ని గురించి ఎక్రోను దేవత తన యాజకుల ద్వారా తెలియజేస్తాడని ప్రజలు నమ్మేవారు. భవిష్యత్తును తెలుసుకోటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు వెళ్లేవారు. అయితే భవిష్యత్తును గూర్చి అక్కడ చెప్పే విషయాలు సమాచారం అంధకార శక్తుల రాజైన సాతాను వద్ద నుంచే వచ్చాయి.PKTel 135.1

    అహజ్యా పంపిన దూతల్ని దైవ సేవకుడు కలిశాడు. రాజు వద్దకు ఈ వర్తమానంతో తిరిగి వెళ్లమని అతడు వీరికి చెప్పాడు, “ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్డెబూబు నొద్ద మీరు విచారించబోవుచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా- “నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు.” తన వర్తమానం అందించిన వెంటనే ప్రవక్త వెళ్లిపోయాడు..PKTel 135.2

    దిగ్రృమ చెందిన సేవకులు రాజు వద్దకు వడివడిగా వెళ్లి దైవ సేవకుడన్న మాటలు అతడికి వల్లించారు. “ఈ మాట చెప్పిన వాడు ఏలాంటివాడు?” అని రాజు ప్రశ్నించాడు. అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తో కట్టుకొనినవాడు” అని వారు సమాధానమిచ్చారు.. “ఆ మనుష్యుడు తిప్పీయుడైన ఏలీయా” అని అహజ్యా అన్నాడు. తన సేవకుల్ని కలిసిన అపరిచిత వ్యక్తి ఏలీయాయే అయితే అతడు పలికిన మాటలు తప్పక నెరవేర్తాయని అతడికి తెలుసు. సాధ్యపడితే ఆ తీర్పును మార్చుకోవాలన్న ఆకాంక్షతో ప్రవక్తను పిలిపించాలని రాజు ఆత్రంగా ఉన్నాడు.PKTel 135.3

    ప్రవక్తను బెదిరించటానికి రాజు రెండుసార్లు సైనికుల్ని పంపాడు. రెండుసార్లు వారిమీద దేవుని ఉగ్రత పడింది. సైనికుల మూడో బృందం దేవునిముందు తమ్మునితాము తగ్గించుకుని వినయ మనస్కులయ్యారు. వారి సేనాపతి దైవ సేవకుణ్ని సమీపించినప్పుడు “ఏలీయా యెదుట మోగాళ్లూని - దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము” అన్నాడు.PKTel 135.4

    “యెహోవా దూత-వారికి భయపడక వానితో కూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి- విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్డెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితినే నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణించెదవు అని చెప్పెను.”PKTel 136.1

    తన తండ్రి పరిపాలన కాలంలో అహజ్యా సర్వోన్నతుని మహత్కార్యాల్ని చూశాడు. తన ధర్మశాస్త్ర విధుల్ని కాలరాచేవారిని దేవుడెలా పరిగణిస్తాడన్న విషయమై మత భ్రష్టులైన ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఇచ్చిన భయంకర నిదర్శనాన్ని అతడు చూశాడు. ఈ పచ్చి నిజాల్ని కట్టుకథలుగా భావించినట్లు అహజ్యా వ్యవహరించాడు. దేవుని ముందు తన్నుతాను తగ్గించుకునే బదులు అతడు బయలు దేవతను అనుసరించాడు. కడకు తన భక్తి హీనతకు పరాకాష్ఠ అయిన ఈ కార్యానికి తెగించాడు. తిరుగుబాటుదారుడు, పశ్చాత్తాపరహితుడు అయిన అహజ్యా “ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము” మరణించాడు.PKTel 136.2

    అహజ్యా రాజు పాపాన్ని గురించి దానికి శిక్షను గురించిన చరిత్రలో ఒక హెచ్చరిక ఉంది. దాన్ని ఎవరూ నిర్లక్ష్యం చెయ్యటం క్షేమంకాదు. నేడు మనుషులు అన్యదేవతలకు నమస్కరించకపోవచ్చు. అయినా వేల ప్రజలు ఇశ్రాయేలు రాజు మాదిరిగా సాతాను ఆలయంలో పూజలు చేస్తున్నారనటం వాస్తవం. నేడు విగ్రహారాధన తత్వం ప్రబలుతుంది. అయితే ఇది అహజ్యా ఎక్రోను దేవత వద్ద విచారణ చేయప్రయత్నించిన నాటికన్నా ఇప్పుడు విజ్ఞానశాస్త్రం విద్య ప్రభావంతో సున్నితంగాను ఆకర్షణీయంగాను ఉన్నది. నిశ్చితమైన ప్రవచన వాక్యంపై విశ్వాసం సన్నగిల్లూ ఉన్నదనటానికి దాని స్థానంలో మూఢనమ్మకం, భూతవిద్య ప్రజల మనసుల్ని ఆకట్టుకుంటున్నాయనటానికి రోజుకు రోజు నిదర్శనం పోగుపడ్తున్నది.PKTel 136.3

    నేడు అన్యమత మర్మాల స్థానాన్ని రహస్య సంఘాలు, భూతమత సాధనాలు ఆక్రమిస్తున్నాయి. దైవవాక్యపు వెలుగుని లేక ఆయన ఆత్మ ప్రసరించే వెలుగుని నిరాకరించే వేల ప్రజలు ఈ భూతమత సాధనాలు వెల్లడిచేసే సంగతుల్ని ఆత్రంగా స్వీకరిస్తున్నారు. భూత మతతత్వాన్ని విశ్వసించేవారు సనాతన శకునగాండ్రను గురించి ఎగతాళిగా మాట్లాడవచ్చు. కాని వివిధ రూపాల్లోని తన వంచన కళలకు వారు పడిపోయినప్పుడు ఆ మహావంచకుడు విజయదర్పంతో నవ్వుతాడు.PKTel 136.4

    ప్రేతాత్మల మాధ్యమాలతో సంప్రదించటమనే ఆలోచన నుంచి భయంతో తొలగిపోయినా మరింత ప్రీతిదాయకమైన భూతమత రూపాలకి ఆకర్షితులయ్యే వారు చాలామంది ఉన్నారు. ఇతరులు క్రైస్తవ విజ్ఞానశాస్త్రం దివ్యజ్ఞాన మర్మాలు తదితర ప్రాచ్యమతాల బోధనలవల్ల పక్కదారి పడ్తున్నారు.PKTel 136.5

    దాదాపు అన్ని రూపాల భూత మతతత్వ ప్రబోధకులు తమకు స్వస్తపర్చే శక్తి ఉన్నదని చెప్పుకుంటున్నారు. మానవుడి మెదడులో నిక్షిప్తమై ఉన్న విద్యుత్తు, అయస్కాంతం, “సానుభూతి నివారణలు” లేదా అంతర్గతశక్తులు ఈ శక్తికి మూలమని వారంటున్నారు. జీవంగల దేవుని శక్తి మీద మంచి యోగ్యతలుగల వైద్యులమీద ఆధారపడక ఈ స్వస్తత శక్తులు గల వ్యక్తులవద్దకు వెళ్లేవారు ఈ క్రైస్తవ యుగంలోనూ తక్కువ సంఖ్యలో లేరు. జబ్బుగా ఉన్న తనబిడ్డను చూసుకుంటున్న తల్లి “నేనిక చేయగలిగింది ఏమిలేదు. నా బిడ్డకు స్వస్తత శక్తిగల వైద్యుడు లేడా?” అంటుంది నిస్పృహగా. దివ్యశక్తితో అయస్కాంత శక్తితో స్వస్తత కూర్చే వ్యక్తిని గూర్చి ఎవరో చెప్పుతారు. ఆమె ప్రియమైన తన బిడ్డను అప్పగిస్తుంది. అది తన పక్కనే నిలిచిఉన్న సాతాను చేతిలో తన బిడ్డను పెట్టినట్లే. అనేక సందర్భాల్లో ఆబిడ్డ భవిష్యత్ జీవితం సాతాను శక్తి నియంత్రణకింద ఉంటుంది. దాని నుంచి విడిపించుకోటం అసాధ్యం.PKTel 137.1

    అహజ్యా భక్తి రాహిత్యం దేవుని ఆగ్రహానికి కారణముంది. ఇశ్రాయేలు ప్రజలికి తన పై విశ్వాసం కలిగించటానికి వారి హృదయాల్ని ఆకట్టుకునేందుకు దేవుడు ఏమి చెయ్యలేదు? తన ప్రజలపట్ల అసమాన దయ ప్రేమల్ని యుగయుగాలుగా ప్రదర్శిస్తూ వచ్చాడు. “నరులను చూచి ఆనందించు చుంటిని” అని ఆయన ఆదినుంచి అంటూనే ఉన్నాడు. (సామె 8:31). తన్ను హృదయపూర్వకంగా వెదకే వారికి ఆయన నిత్య సహాయకుడై ఉన్నాడు. తన ప్రజలకు బద్ద శత్రువైన దేవతను సహాయం అర్థించటానికి ఇశ్రాయేలు రాజు ఇప్పుడు దేవున్ని విడిచిపెట్టి వెళ్ళటం ద్వారా తనకు పరలోకమందున్న దేవుని మీద కన్నా తమ దేవతలమీదే ఎక్కువ నమ్మకం ఉందని అన్యజనులికి చూపించాడు. ఈ రీతిగానే మనుషులు శక్తికి వివేకానికి మూలమైన దేవున్ని విడిచిపెట్టి చీకటి శక్తుల సహాయం లేక సలహా అర్ధించటానికి వెళ్లినప్పుడు వారు దేవున్ని అగౌరవపర్చుతారు. అహజ్యా కార్యం దేవుని కోపాన్ని రేపితే, మరింత వెలుగున్న వారు అలాంటి మార్గాన్నే ఎంపిక చేసుకుంటే వారిని ఆయన ఎలా పరిగణిస్తాడు?PKTel 137.2

    సాతాను మంత్రశక్తిని ఆశ్రయించేవారు తామెంతో మేలు పొందుతున్నామని చెప్పుకోవచ్చు. అయితే వారనుసరిస్తున్న మార్గం సురక్షిత మార్గమని ఇది. నిరూపిస్తుందా? జీవితం పెరిగితే ఏంటి? లోకసంబంధమైన లాభం లభిస్తే ఏంటి? దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చెయ్యటం కడకు ప్రయోజనాన్ని ఇస్తుందా? లాభంగా కనిపించే అలాంటిదంతా చివరికి పూడ్చలేని నష్టంగా తేలుతుంది. సాతాను శక్తి నుంచి మనల్ని కాపాడటానికి దేవుడు నియమించిన ఒక్క కట్టడను కూలదోసి శిక్షను తప్పించుకోలేం.PKTel 137.3

    అహజ్యాకు కొడుకు లేడు గాబట్టి అతడి తర్వాత తన సహోదరుడు యెహోరాము ఇశ్రాయేలు పదిగోత్రాల్ని పన్నెండేళ్లు పరిపాలించాడు. ఈ సంవత్సరాల్నిటిల్లోను అతడి తల్లి యెజెబెలు జీవించే ఉంది. ఆమె ఆ దేశ వ్యవహారాలపై తన దుష్ప్రభావాన్ని ప్రసరిస్తూనే ఉంది. అనేకమంది ప్రజలు విగ్రహారాధక ఆచారాల్ని అవలంబిస్తూనే ఉన్నారు. యెహోరాము “యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాబు చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.” 2 రాజులు 3:2,3.PKTel 138.1

    యెహోరాము ఇశ్రాయేలుపై రాజ్యపాలన చేసిన కాలంలోనే యెహోషాపాతు మరణించాడు. యెహోషాపాతు కుమారుడి పేరు కూడా యెహోరామే. అతడు తన తండ్రి బదులు యూదా సింహాసనంపై ఆశీనుడయ్యాడు. అహాబు యెజెబెలు కుమార్తెతో వివాహం ద్వారా యూదా దేశపు యెహోరాము ఇశ్రాయేలు రాజుకి దగ్గర బంధువయ్యాడు. తన రాజ్యపాలనలో అతడు బయలును అనుసరించి “అహాబు సంతతివారు నడచిన ప్రకారముగా” నడిచాడు. “మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించునట్లు చేసెను, యూదా వారిని విగ్రహ పూజకు లోపరచెను.” 2 దివ్య 21:6,11.PKTel 138.2

    యూదా రాజు తన భయంకర మతభ్రష్టతను మందలింపు లేకుండా కొనసాగించటానికి లేదు. ఏలీయా ప్రవక్త ఇంకా ఆరోహణం కాలేదు. ఉత్తర రాజ్యాన్ని నాశనం అంచుకి నడిపించిన పాపాల్నే యూదా రాజ్యం చేస్తుంటే అతడు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండలేడు. యూదా యెహోరాముకి ఒక ఉత్తరం రాశాడు. దుష్టుడైన రాజు అందులో ఈ మాటలు చదివాడు :PKTel 138.3

    “నీ పితరుడగు దావీదు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు నీతండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదా రాజైన ఆసా మార్గము లందైనను నడువక ఇశ్రాయేలు మార్గమందు నడచిఅహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతివారగు నీ సోదరులను నీవు చంపియున్నావు కాబట్టి గొప్ప తెగులుచేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములన్నిటిని మొత్తును.”PKTel 138.4

    ఈ ప్రవచనం నెరవేర్పుగా “యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తియులను కూషీయుల చేరువనున్న అరబ్బీయులను రేపగా వారు యూదా దేశము మీదికి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్ధములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి. అతని కుమారులలో కనిష్టుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.PKTel 139.1

    “ఇదియంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున... రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి... బహువేదన నొందుచు అతడు మరణమాయెను.” “అతని కుమారుడైన అహజ్యా (యెహోయాహాజు) అతనికి మారుగా రాజాయెను.” 12-19 వచనాలు; 2 రాజులు. 8:24.PKTel 139.2

    అహాబు కమారుడు యెహోరాము ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతడి మేనల్లుడు అహజ్యా యూదా సింహాసనానికి వచ్చాడు. అహజ్యా ఒక్క సంవత్సరమే పరిపాలించాడు. ఈ కాలంలో “దుర్మార్గంగా ప్రవర్తించుటకు” తన సలహాదారు అయిన తన తల్లి అతల్యా అతణ్ని ప్రభావితం చేయటంతో అతడు అహాబు సంతతివారి మార్గములందు నడచెను. అహాబు సంతతివారి వలెనే అతడు యెహోవా దృష్టికి చెడునడత నడచెను.” 2 దినవృ 22:3,4., 2 రాజులు 8:27. అతడి అమ్మమ్మ యెజెబెలు ఇంకా జీవించే ఉంది. అతడు ఇశ్రాయేలు రాజు తన మేనమామ అయిన యెహోరాముతో ధైర్యంగా చేతులు కలిపాడు.PKTel 139.3

    యూదాకు చెందిన అహజ్యా కొద్ది కాలంలోనే మరణించాడు. అహాబు కుటుంబంలో మిగిలిఉన్న సభ్యులు “అతని తండ్రి మరణమైన తరువాత... అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి.” 2 దినవృ 22:3,4. అహజ్యా యెజ్రాయేలులోని తన మేనమామను సందర్శిస్తున్న తరుణంలో యెహూను ఇశ్రాయేలు రాజుగా అభిషేకించటానికి ప్రవక్తల శిష్యుల్లో ఒకణ్ని రామోతిలాదుకి పంపమని ఏలీయాని దేవుడు ఆదేశించాడు. ఆసమయంలో రామోత్తిలాదులో సిరియన్లతో యూదా ఇశ్రాయేలు సంయుక్త సైన్యం యుద్ధంలో నిమగ్నమై ఉంది. యుద్ధంలో యెహోరాము గాయపడి యెత్రేయేలుకి తిరిగి వెళ్తూ యెహూని సేనలకు అధిపతిగా ఉంచాడు. యెహూని అభిషేకించినప్పుడు ఏలీయా దూత ఇలా అన్నాడు, “యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.” ఆతర్వాత యెహూకి దేవుని ఈ ప్రత్యేక ఆదేశాన్ని అతడిచ్చాడు, “నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానిని బట్టియు, యెజెబెలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతము చేయుము. అహాబు సంతతి వారందరును నశింతురు.”PKTel 139.4

    సైన్యం తనను రాజుగా ప్రకటించిన తర్వాత యెహూ యెజ్రాయేలుకి వెళ్లాడు. పాపంలో కొనసాగటానికి బహిరంగంగా ఎన్నుకున్నవారిని, ఇతరుల్ని పాపంలోకి నడిపించిన వారిని సంహరించటమనే తన కర్తవ్యాన్ని అక్కడ ప్రారంభించాడు. ఇశ్రాయేలు రాజు యెహోరాము, యూదరాజు అహజ్యా, రాజమాత యెజెబెలులను “యెజ్రాయేలులో అహాబు కుటుంబీకులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువులనందరిని, అతడు నియమించిన యాజకులను” షోమ్రోను వద్ద కేంద్రంలోని “బయలు ప్రవక్తలందరిని, వారి భక్తులందరిని వారి యాజకులందరిని” యెహూ సంహరించాడు. బయలు దేవతాలయాన్ని ధ్వంసం చేసి దాన్ని శిధిలాల కుప్పగా మిగిల్చాడు. “ఈ ప్రకారము యోహూ బయలు దేవతను ఇశ్రాయేలువారి మధ్య నుండకుండ నాశనము చేసెను. 2 రాజులు 10:11,19,28.PKTel 140.1

    ఈ సాధారణ సంహారాన్ని గూర్చిన వార్త యెజెబెలు కుమార్తె అతల్యాకు చేరింది. అతల్యా యూదా రాజ్యంలో ఇంకా అధికార హోదాలోనే ఉంది. తన కుమారుడు యూదరాజు హతుడయ్యాడని తెలుసుకుని “ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశజులనందరిని హతము చేసెను.” “ఈ హత్యాకాండలో సింహాసనానికి వారసులైన దావీదు వంశీయులందరిని సంహరించింది. యోవాడు అనే శిశువు మాత్రం మిగిలిఉన్నాడు. ఆ శిశువుని ప్రధానయాజకుడు యెహోయాహి భార్య అతల్యాకు కనబడకుండ దేవాలయంలో దాచిపెట్టింది. ఆ బాలుడు ఆరు సంవత్సరాలు దేవుని మందిరంలో దాచబడి ఉన్నాడు. “ఆ కాలమున అతల్యా దేశమును పరిపాలించెను.” 2 దినవృ 22:10, 12.PKTel 140.2

    ఈ కాలం చివరలో “లేవీయులును యూదావారందరును” బాలుడైన యోవాఘును రాజకిరీటం ధరింపజేసి,అభిషేకించిన తమ రాజుగా ప్రకటించటంలో ప్రధాన యాజకుడు యెహోయాదాతో ఏకమయ్యారు. వారు “చేతి చప్పట్లుకొట్టి - రాజు చిరంజీవి యగునుగాకని చాటించిరి” 2 రాజులు 11:12.PKTel 140.3

    “పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనులయొద్దకు” వచ్చింది. 1 దినవృ 23:12. “ప్రవేశస్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడి యుండుటయు, అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు, దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులు వాద్యములతో స్తుతిపాటలు పాడుటయు చూచి”PKTel 140.4

    అల్య “వస్త్రములు చింపుకొని- ద్రోహము ద్రోహమని అరచెను.” 2 రాజులు 11:14. అయితే ఆమెను ఆమె సహచరులందర్ని పట్టుకుని దేవాలయంలో నుంచి వధ్యాస్థలానికి తీసుకువెళ్ళమని యెహోయాదా అధికారుల్ని ఆదేశించాడు. అక్కడ వారిని సంహరించటం జరగనుంది.PKTel 141.1

    అహాబు కుటుంబంలోని చివరి వ్యక్తి ఈరకంగా మరణించింది. యెజెబెలుతో అతడి బాంధవ్యం ద్వారా సంభవించిన భయంకర పాపం అతడి సంతతి వారిలో చివరి వ్యక్తి నాశనమయ్యేవరకు కొనసాగింది. యధార్ధ దేవుని ఆరాధనను లాంఛనప్రాయంగా తోసిపుచ్చని యూదా రాజ్యంలో సయితం అనేకమందిని మోసగించి అతల్యా పక్కదారి పట్టించగలిగింది. మారుమనసులేని రాణి మరణించిన వెంటనే “దేశపు జనులందరును బయలు గుడికిపోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను ఛిన్నాభిన్నముచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి.” 18వ వచనం.PKTel 141.2

    దిద్దుబాటు ప్రారంభమయ్యింది. యోవాషను రాజుగా ప్రకటించటంలో పాలుపొందినవారు “యెహోవావారై యుండవలెనని నిబంధన చేశారు. ఇప్పుడు యెజెబెలు దుష్ప్రభావాల్ని యూదా రాజ్యంలోనుంచి తొలగించటం బయలు యాజకుల్ని బయలు ఆలయాన్ని నాశనం చెయ్యటం జరగటంతో “దేశ జనులందరు సంతోషించిరి.... పట్టణము నెమ్మదిగా ఉండెను.” 2 దినవృ 23:16,21.PKTel 141.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents