Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ప్రవక్తలు - రాజులు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    11 - కర్మైలు

    అహాబు ముందు నిలబడి తనతోను బయలు, అషారోతు ప్రవక్తలతోను కలవ టానికి ఇశ్రాయేలు ప్రజల్ని కర్మెలు పర్వతం మీద సమావేశపర్చాల్సిందిగా ఏలీయా డిమాండు చేశాడు. “నీవు ఇశ్రాయేలువారందరిని, యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషీరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుము” అని ఆదేశించాడు. PKTel 88.1

    ఆ ఆదేశం దేవుని సముఖంలో నిలబడి ఉన్నట్లు కనిపించిన వ్యక్తి ఇచ్చింది. అహాబు దాన్ని వెంటనే శిరసా వహించాడు. ఆ ప్రవక్తీ రాజు అయినట్లు రాజే పౌరుడు అయినట్లు ఆ మొత్తం వ్యవహారం జరిగింది. తక్షణమే రాజ్యమంతా దూతల్ని పంపించి ఏలీయాను బయలు ప్రవక్తల్ని అషారోతు ప్రవక్తల్ని కలవటానికి రావలసిందిగా ప్రజల్ని కోరటం జరిగింది. నిర్ణీత సమయంలో సమావేశమవ్వ టానికి ప్రతీ పట్టణంలోను ప్రతీ పల్లెలోను ప్రజలు సిద్ధపడ్డారు. ప్రజలు ఆ స్థలానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమంది మనసుల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ఏదో విచిత్ర సంఘటన జరగనుంది. అలాకాకపోతే కర్మెలు వద్ద సమావేశం కావలసిందని ఈ ఆదేశం ఎందుకు? ప్రజలమీద దేశంమీద ఇంకే కొత్త విపత్తు పడబోతుంది?PKTel 88.2

    అనావృష్టికి పూర్వం కర్మెలు పర్వతం ఎంతో సుందరంగా ఉండేది. దాని ఏరులికి నిత్యం ప్రవహించే నీటి బుగ్గలనుంచి నీరువచ్చేది. దాని లోతట్టు భూములు చక్కని పువ్వులతో పచ్చని వనాలతో కనువిందు చేసేవి. ఇప్పుడు దాని అందం మాయ మయ్యింది. బయలుకి అషారోతుకి కట్టిన బలిపీఠాలు ఇప్పుడు ఆకుల్లేని వనాల్లా ఉన్నాయి. వీటికి భిన్నంగా ఆ కొండల్లో ఒకదానిమీద శిధిలమైన యెహోవా బలిపీఠం ఉంది.PKTel 88.3

    కర్మెలు పక్కనే విశాల గ్రామప్రాంతాలున్నాయి. ఆ రాజ్యంలో అనేక స్థలాలనుంచి ఆ పర్వత శిఖరం కనిపించేది. పర్వతం మొదలులో కొన్ని స్థలాలనుంచి చూస్తే పైని జరిగేది చాలామట్టుకు కనిపించేది. చెట్లతో కప్పిఉన్న పర్వతం దిగువ భాగాల్లో జరిగే విగ్రహారాధనవల్ల దేవునికి అగౌరవం కలిగేది. దేవుని శక్తి ప్రదర్శనకు, ఆయన ఘన నామ మహిమ ప్రకటనకు ఏలీయా ఈ పర్వత శిఖరాన్ని ఎంచుకున్నాడు.PKTel 88.4

    నిర్ణీత దినం ఉదయాన్నే మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు తీవ్ర ఉత్కంఠతో ఆ పర్వత శిఖరం సమీపంగా సమావేశమయ్యారు. యెజెబెలు ప్రవక్తలు ఆడంబరంగా నడుస్తూ పైకెళ్లారు. రాజు గొప్ప ఠీవితో దర్శనమిచ్చి యాజకులముందు స్థానంలో ఉన్నాడు. ఆయనకు విగ్రహారాధకులు స్వాగతం పలికారు. యాజకుల హృదయాల్లో చాలా భయం ఉంది. ప్రవక్త పలికిన మాట ప్రకారం ఇశ్రాయేలు దేశంలో మూడున్నర సంవత్సరాలు మంచు గాని, వరంగాని పడలేదు. ఏదో భయంకర ఘటన సంభవించటం ఖాయమని వారు భయపడ్తున్నారు. తాము నమ్ముకున్న దేవతలు ఏలీయా అబద్ధికుడని నిరూపించలేక పోయాయి. వారి మొరలకు, వారి ప్రార్థనలకు, వారి కన్నీటికి, వారి దీనత్వానికి, వారి కర్మకాండలకు, వారి విలువైన, అంతులేని త్యాగాలకు వారి దేవుళ్లు ఉదాసీనంగా, నిర్లిప్తంగా ఉన్నారు.PKTel 89.1

    సమావేశమై ఉన్న ఇశ్రాయేలీయుల సభ మధ్య, అహాబు రాజుకు అబద్ధ ప్రవక్తలకు ఎదురుగా, యెహోవా ఘనతను గౌరవాన్ని నిలబెట్టటానికి ఒంటరిగా ఏలీయా నిలబడ్డాడు. ఆ దేశ ప్రజలందరు తాము ఎవరిమూలంగా తీవ్రబాధలకు ఆపదలకు గురి అయ్యామని ఆరోపిస్తున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు తమముందు నిలిచి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు, బయలు ప్రవక్తలు, సైనికులు, చుట్టూ కూడిఉన్న వేలమంది సముఖంలో ఏలీయా నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు. కాని ఏలీయా ఒంటరిగా లేడు. అతడికి పైగా ఆకాశంలో, అతడి చుట్టూ అతణ్ని కాపాడూ పరలోక దూత సైన్యాలు ఉన్నాయి.PKTel 89.2

    సిగ్గుగాని, భయంగాని ఏకోశానా లేకుండా ప్రజలముందు ప్రవక్త నిలబడ్డాడు. దైవాజ్ఞను నెరవేర్చాల్సి ఉందని అతడికి పూర్తిగా తెలుసు. అతడి ముఖం వింతయిన గాంభీర్యంతో ప్రకాశిస్తున్నది. అతడి మాటలు వినటానికి ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. విరిగిపోయి శిథిలావస్థలో ఉన్న యెహోవా బలిపీఠం వంక ఆ మిదట అక్కడున్న జనసమూహం వంక చూసి బూరధ్వని వంటి స్వరంతో ఏలీయా ఇలా అన్నాడు, “ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపులమధ్య తడబడు చుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడి.”PKTel 89.3

    జవాబుగా ప్రజలు ఒక్కమాట కూడా పలుకలేదు. ఆ విస్తార జన సమూహంలో ఒకడుకూడా యెహోవాపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చెయ్యలేదు. మోసం గుడ్డితనం ఇశ్రాయేలీయుల్ని నల్లటి మేఘంలా ఆవరించింది. ఈ భ్రష్టత ఒక్కసారిగాగాక క్రమక్రమంగా వారిని చుట్టుముట్టింది. ప్రభువు పంపిన హెచ్చరికల్ని గద్దింపుల్ని నిర్లక్ష్యం చేస్తూవచ్చి ఈ స్థితికి దిగజారారు. నీతిమార్గం నుంచి తప్పుకున్న ప్రతీసారి, పశ్చాత్తాప పడటానికి నిరాకరించిన ప్రతీసారి వారి దోషిత్వం తీవ్రమై వారిని దేవునికి మరింత దూరం చేసింది. ఇప్పుడు ఈ విషమ పరిస్థితిలో వారు దేవుని పక్క నిలబడటానికి మొండిగా నిరాకరించారు.PKTel 90.1

    తన సేవలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉదాసీనవైఖరిని నమ్మక ద్రోహాన్ని ప్రభువు ద్వేషిస్తాడు. మంచి చెడుల మధ్య జరుగుతున్న మహా సంఘర్షణ చివరి ఘట్టాన్ని విశ్వమంతా అమితాసక్తితో పరిశీలిస్తున్నది. దైవ ప్రజలు నిత్యరాజ్యం పొలిమేరల్ని సమీపిస్తున్నారు. పరలోకమందున్న దేవునికి నమ్మకంగా నిలవటంకన్నా ఎక్కువ ప్రధానాంశం వారికి ఇంకేముంది? యుగాల పొడవునా దేవునికి నైతిక వీరులుంటూ వచ్చారు. ఇప్పుడూ ఉన్నారు. యోసేపు, ఏలీయా, దానియేలు వంటివారు తాము దేవుని ప్రత్యేక ప్రజలమని చెప్పుకోటానికి సిగ్గుపడరు. వారు కార్యశూరులు. నిర్వర్తించాల్సిన విధినుంచి ఇటుగాని అటుగాని తిరగక దేవుని శక్తితో “యెహోవా పక్షమున నున్నవారు” ఎవరు? (నిర్గమ. 32:26) అని విచారణ చేసే మనుషులు వారు. ఆ మనుషులు ఈ విచారణతోనే ఆగరు. యెహోవాను ఎంపిక చేసుకునేవారు ముందుకువచ్చి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుఅయిన సజీవ దేవునిపట్ల తమ విశ్వాసాన్ని స్పష్టంగా వ్యక్తం చేయమని డిమాండు చేసే మనుషులు. ఆ మనుషుల సేవపై దేవుని ప్రత్యేక దీవెన ఉంటుంది. అట్టి మనుషుల చిత్తాలు దైవ ధర్మశాస్త్రానికి లొంగి ఉంటాయి. వారి ప్రణాళికలు దైవ ధర్మశాస్త్రానికి అనుగుణంగా రూపుదిద్దు కుంటాయి. ఆయన ప్రేమకు వారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టటానికి సిద్దంగా ఉంటారు. దైవ వాక్యం నుంచి వెలుగును తీసుకుని దాని స్పష్టమైన స్థిరమైన కిరణాల్ని లోకానికి ప్రకాశింప చెయ్యటమే వారి కర్తవ్యం. దేవునికి నమ్మకంగా నిలవటమే వారి దీక్ష. PKTel 90.2

    కర్మెలు పర్వతం మీద ఉన్న ఇశ్రాయేలీయులు సందేహిస్తూ వెనకాడుతూ ఉండగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఏలీయ స్వరం ఇలా అంటుంది: “యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించియున్నాను; అయితే బయలుకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు. మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్నియేమియు లేకుండనే దానిని కట్టెలమిద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్దము చేసి, క్రింద అగ్నియేమియు లేకుండనే దానిని కట్టెలమిద ఉంచుదును. తరువాత మీరు మీ దేవతల పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగుల బెట్టుటచేత ప్రత్యుత్తర మిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పాడు.PKTel 90.3

    ఏలీయా ప్రతిపాదన సముచితంగా ఉండటంతో ప్రజలు దాన్ని తోసిపుచ్చ లేదు. ధైర్యం తెచ్చుకుని “ఆ మాట మంచిది” అని ప్రత్యుత్తరమిచ్చారు. బయలు ప్రవక్తలు అసమ్మతి గళం ఎత్తటానికి సాహసించలేదు. వారి నుద్దేశించి ఏలీయా ఇలా సూచించాడు, “మీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యొద్దును కోరుకొని సిద్దముచేసి మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దు.”PKTel 91.1

    పైకి ధైర్యంగా ధిక్కరిస్తున్నట్లుగా కనిపించినా ఆ అబద్ద ప్రవక్తల హృదయాలు భయంతో నిండాయి. వారు బలిపీఠాన్ని తయారు చేసుకోటానికి కట్టెలు పేర్చి తమ ఎద్దును సిద్ధం చేసుకోటానికి ఉపక్రమించారు. అనంతరం వారు తమ ప్రార్ధనల్ని ఉచ్చరించటం మొదలు పెట్టారు. “బయలా, మా ప్రార్థన వినుము” అని బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థన చేశారు. వారి కేకలు అడవుల్లోనుంచి, చుట్టూ ఉన్న కొండల్లో నుంచి ప్రతిధ్వనించాయి. బయలు యాజకులు, మత బలిపీఠం చుట్టూ చేరి గంతులు వేస్తూ గిజగిజ కొట్టుకుంటూ కేకలు వేస్తూ తలచింపుకుంటూ శరీరాన్ని గాయపర్చు కుంటూ తమ దేవుళ్లని పిలుస్తున్నారు. PKTel 91.2

    ఉదయం గడిచిపోయింది. మధ్యాహ్నమయ్యింది. మోసపోయిన తన భక్తుల మొర బయలు విన్న సూచనలు కనిపించలేదు. వారి ప్రార్థనలకు సమాధానంగా ఏ స్వరం వినిపించలేదు. బలిపశువు దహనం కాకుండా అలాగే మిగిలిపోయింది.PKTel 91.3

    వారి పిచ్చి కేకలు ప్రార్థనలు కొనసాగుతుండగా వంచకులైన యాజకులు ఏదో రకంగా కట్టెల్ని వెలిగించి అది నేరుగా బయలు వద్దనుంచి వచ్చిన అగ్ని అని ప్రజల్ని నమ్మించాలని చూశారు. అయితే వారి ప్రతీ కదలికను ఏలీయా గమనిస్తూనే ఉన్నాడు. యాజకులు ఏదోవిధంగా మోసగించటానికి తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ తమ అర్థరహిత కర్మకాండను పొడిగిస్తూ పోతున్నారు.PKTel 91.4

    “మధ్యాహ్నము కాగా ఏలీయా - వాడు దేవుడైయున్నాడు. పెద్ద కేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసియున్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయుచు రక్తము కారుమటుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను, శస్త్రములతోను తమ దేహములను కోసికొను చుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యమర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరిగాని, మాటయైనను ప్రత్యుత్తర మిచ్చువాడైనను లక్ష్యము చేయువాడైనను లేకపోయెను.”PKTel 91.5

    తాను మోసగించిన, తన సేవకు అంకితమై ఉన్నవారికి సాతాను ఆనందంగా సహాయం చేసేవాడే. వారి బలిని దహించటానికి ఆనందంగా మెరుపు పుట్టించేవాడే. కాని యెహోవా సాతానుకి హద్దులు నియమించాడు. అతడి శక్తిని పరిమితం చేశాడు. కనుక అతడెంత ప్రయత్నించినా బయలు బలిని దహించటానికి ఒక్క నెరసును కూడా పుట్టించలేకపోయాడు.PKTel 92.1

    చివరికి కేకలు వేయటంవల్ల వారి గొంతులు బొంగురుపోయాయి. తాము చేసుకున్న గాయాలవల్ల వారి వస్త్రాలు రక్తపు మరకలతో నిండాయి. యాజకులు నిరాశ చెందారు. వారి ఉన్మాదం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు తమ విజ్ఞాపనతోపాటు తమ సూర్యదేవుణ్ని శపించటం మొదలుపెట్టారు. ఏలీయా వారిని శ్రద్దగా పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే ఏదోవిధంగా యాజకులు ఆ బలిపీఠానికి నిప్పు అంటించ గలిగితే ప్రజలు తనను వెంటనే ముక్కముక్క అతడికి తెలుసు.PKTel 92.2

    సాయంత్రమవుతుంది. బయలు ప్రవక్తలు అలసిపోయి బలహీనపడి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఒకడు ఒకటంటే ఇంకొకడు మరొకటనడంతో వారు తమ ప్రయత్నాలు మానుకున్నారు. వారి కేకలు, శాపనార్థాలు కర్మెలుపై ఇక ప్రతిధ్వనించటం లేదు. నిస్పృహకులోనై వారు పోటీనుంచి తప్పుకున్నారు. PKTel 92.3

    యాజకుల వ్యర్థ ప్రదర్శనల్ని ప్రజలు దినమంతా వీక్షించారు. మండుతున్న సూర్య కిరణాలు పుణికిపుచ్చుకుని తమ పబ్బం గడుపుకోవటానికి చూస్తున్నట్లు యాజకులు బలిపీఠం చుట్టూ గంతులు వేయటం చూశారు. యాజకులు తమ శరీరాల్ని భయంకరంగా గాయపర్చుకోటం చూశారు. విగ్రహారాధన ఎంత బుద్దిహీనమయ్యిందో గ్రహించటానికి ఇది వారికి ఒక అవకాశాన్ని కల్పించింది. ఆ జనసమూహంలోకి కొందరు దయ్యాల సంబంధమైన ఆ ప్రదర్శనతో విసిగిపోయి ఏలీయా కదలికలకోసం ఆసక్తితో కనిపెడ్తున్నారు.PKTel 92.4

    అది అస్తమయ బలిఅర్పణ సమయం. అప్పుడు “నా దగ్గరకు రండి” అని ఏలీయా ప్రజల్ని పిలిచాడు. ప్రజలు భయపడ్డూ అతడి దగ్గరకు వస్తున్నప్పుడు ఏలీయా ఒకప్పుడు ప్రజలు దేనిపై యెహోవాను ఆరాధించారో, ఇప్పుడు ఏది విరిగిపడి ఉన్నదో ఆ బలిపీఠం పక్కకు తిరిగి దాన్ని బాగు చేశాడు. అన్య బలిపీఠాలన్నిటికన్నా ఈ శిధిలాలకుప్పే అతడికి ఎంతో ప్రశస్తమైంది, ఎంతో విలువైంది.PKTel 92.5

    ఈ పురాతన బలిపీఠాన్ని తిరిగి కట్టడంలో, ఇశ్రాయేలీయులు వాగ్దత్త కనానుకి వెళ్లటానికి యోర్దాను నదిని దాటినప్పుడు వారితో దేవుడు చేసిన నిబంధనను గౌరవించి, “యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము” కట్టాడు.PKTel 93.1

    తమ నిరర్ధక శ్రమతో అలసిపోయిన బయలు యాజకులు ఏలీయా ఏంచేయ నున్నాడో చూద్దామని కనిపెడ్తున్నారు. తమ దేవతల బలహీనతను అసమర్థతను బయట పెట్టిన ఆ పరీక్షను ప్రతిపాదించినందుకు వారు ఏలీయాను ద్వేషించారు. అయినా అతడి శక్తికి భయపడ్డారు. ప్రజలు కూడా భయంతోను తీవ్ర ఉత్కంఠతోను ఏలీయా చేస్తున్న సిద్దబాటుని శ్రద్దగా గమనిస్తున్నారు. ప్రవక్త ప్రదర్శించిన ప్రశాంత వైఖరికీ బయలు అనుచరుల వ్యర్ధ మతోన్మాద ప్రవర్తనకు మధ్య ఎంతో తేడా కనిపించింది.PKTel 93.2

    బలిపీఠం పూర్తి అయిన తర్వాత ప్రవక్త దానిచుట్టూ కందకం తవ్వి, బలిపీఠంపై కట్టెలు పేర్చి, తన బలిపశువును సిద్ధంచేసి దాన్ని బలిపీఠంపై పెట్టి బలిపశువుని బలి పీఠాన్ని నీళ్లతో తడపవలసిందిగా ప్రజల్ని ఆదేశించాడు. “మీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహన బలి పశుమాంసముమిదను కట్టెల మిదను పోయుడని చెప్పెను. అదియైన తరువాత - రెండవమారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవమారు ఆలాగు చేసిరి; మూడవమారు చేయుడనగా వారు మూడవమారు చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టును పొర్లిపాయెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను.” PKTel 93.3

    యెహోవా కోపాన్ని రేపిన తమ దీర్ఘకాల మతభ్రష్టతను వారికి గుర్తుచేస్తూ ఇశ్రాయేలు దేశం పై ఉన్న శాపం తొలగి పోయేందుకు దీన హృదయులై తమ తండ్రుల దేవుడైన యెహోవా తట్టు తిరుగవలసిందిగా ఏలీయా వారికి పిలుపునిచ్చాడు. అప్పుడు ఆ అదృశ్య దేవుని ముందు మోకాళ్లూని ఆకాశంకేసి చేతులెత్తి సామాన్య ప్రార్థన చేశాడు. బయలు యాజకులు ఉదయం నుంచి మధ్యాహ్నం పొద్దు తిరిగే వరకు కేకలు వేశారు, నురుగు కక్కారు, గంతులు వేశారు. కాగా ఏలీయా ప్రార్థన చేసినప్పుడు కర్మెలు పై అర్థంలేని కేకలు వినపడలేదు. యెహోవా అక్కడున్నాడని ఎరిగినట్లు, ఆ సన్నివేశాన్ని వీక్షిస్తున్నట్లు, తన మనవిని వింటున్నట్లు ప్రార్థించాడు. బయలు ప్రవక్తలు అనాగరికంగా పొంతనలేకుండా ప్రార్థించారు. ఇశ్రాయేలు ప్రజలు తనతట్టు తిరిగేటట్లు బయలుపై తన ఆధిక్యాన్ని ప్రదర్శించాల్సిందని విజ్ఞాపనచేస్తూ ఏలీయా యెహోవాకు ప్రార్థన చేశాడు.PKTel 93.4

    ప్రవక్త ఇలా విజ్ఞాపన చేశాడు, “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థనను ఆలకించుము; యెహోవావైయున్న నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనములకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.”PKTel 94.1

    బాధాకరమైన నిశ్శబ్దం అందరినీ ఆవరించింది. బయలు యాజకులు భయంతో వణుకుతున్నారు. తాము అపరాధులమన్న స్పృహ కలిగి త్వరిత ప్రతిఫలం కోసం వేచి ఉన్నారు.PKTel 94.2

    ఏలీయా ప్రార్ధన ముగిసిన వెంటనే ఆకాశంనుంచి మెరుపువంటి ప్రకాశంతో అగ్ని దిగివచ్చి బలిపీఠంమీద ఉన్న బలిపశువును దహించి కందకంలో నిలిచిన నీళ్లను నాకివేసి బలిపీఠం రాళ్లను సయితం బుగ్గి చేసింది. ప్రకాశమానమైన ఆ అగ్ని కాంతి ఆ పర్వతాన్ని వెలుగుతో నింపి ప్రజల కళ్లను మిరుమిట్లు గొలిపింది. పైనున్నవారి కదలికల్ని ఉత్కంఠతో వీక్షిస్తూ కింద లోయలో ఉన్న అనేకమంది ఆకాశంలోనుంచి దిగివచ్చిన అగ్నిని స్పష్టంగా చూశారు. అందరూ ఆ దృశ్యాన్ని విస్మయంతో వీక్షించారు. ఎర్రసముద్రం వద్ద ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తీయులనుంచి వేరుచేసిన అగ్ని స్తంభంలా ఉంది ఆ అగ్ని.PKTel 94.3

    పర్వతంమీద ఉన్న ప్రజలు అదృశ్య దేవునిముందు భయభీతితో సాగిలపడ్డారు. పరలోకం నుంచి వచ్చిన అగ్నివంక చూడటానికి భయపడ్డారు. అది తమనుకూడా దహించి వేస్తుందని భయపడ్డారు. తాము విధేయత చూపించాల్సిన తమ తండ్రుల దేవుడు ఏలీయా దేవుడేనని గుర్తించి వారు ముక్తకంఠంతో “యెహోవాయే దేవుడు; యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు. ఆ కేకలు పర్వతంమీద దద్దరిల్లి కింద లోయలో ప్రతిధ్వనించాయి. చివరికి ఇశ్రాయేలు ప్రజలు మేల్కొన్నారు. పశ్చాత్తాపం పొందారు. తాము దేవున్ని ఎంతగా అగౌరవ పర్చారో తుదకు ప్రజలు గుర్తించారు. నిజ దేవుడు కోరే యుక్తమైన సేవకు బయలు సేవా స్వభావం ఎంతో భిన్నమైందని వెల్లడయ్యింది. ప్రజలు దేవున్ని గుర్తించి ఆయన్ని స్వీకరించటానికి వచ్చేవరకు వారికి మంచుగాని వర్షంగాని పడకుండా ఆపుచెయ్యటంలో దేవుని న్యాయశీలతను కరుణను వారు గుర్తించారు. ఏలీయా దేవుడే ప్రతీ విగ్రహంకన్నా సమున్నతమైన దేవుడని అంగీకరించటానికి ఇప్పుడు వారు సిద్దంగా ఉన్నారు.PKTel 94.4

    బయలు యాజకులు యెహోవా అద్భుత శక్తి ప్రదర్శనను ఆశ్చర్యపడుతూ చూశారు. పరాజయం పొందినా, మహిమతో నిండిన దేవుని సన్నిధిలో ఉన్నా వారు తమ దుర్మార్గం గురించి పశ్చాత్తాపం పొందటానికి నిరాకరించారు. ఇంకా బయలు ప్రవక్తలుగా ఉండటానికే తీర్మానించుకున్నారు. ఇలా వారు నాశనానికి అరులుగా నిరూపించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు బయలు పూజ నేర్పించిన ఆ బయలు ప్రవక్తల ప్రలోభాలనుంచి వారిని కాపాడటానికి ఆ అబద్ద ప్రవక్తల్ని నాశనం చెయ్యాల్సిందిగా ప్రభువు ఏలీయాను ఆదేశించాడు. అతిక్రమంలో ఉన్న ఆ నాయకుల మీద ప్రజల ఆగ్రహం అప్పటికే రగుల్కున్నది. “ఒకనినైన తప్పించుకొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడి” అని ఏలీయా వారిని ఆదేశించగా ప్రజలు ఆ ఆదేశాన్ని శిరసావహించటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు వారిని పట్టుకున్నారు. ఏలీయా వారిని కీషోను వాగు దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ సూర్యాస్తమయానికి ముందు దిద్దుబాటు ప్రారంభమైన ఆ దినాన వారిని సంహరించాడు. ఒక్కణ్నికూడ తప్పించుకోనివ్వలేదు.PKTel 95.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents