Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 13—నెదర్లాండ్సు, స్కేండినేవియ

    నెదర్లాండ్స్ లో పోపు నిరంకుశ పాలనకు చాలాకాలం ముందే ప్రతిఘటన ఎదురయ్యింది. లూథర్ కాలానికి ఏడువందల సంవత్సరాలు ముందే రోముకు రాయబారులుగా వెళ్లి “పరిశుద్ధ మత గురువు” యధార్ధ ప్రవర్తనను తెలుసుకొన్న ఇద్దరు బిషన్లు అతణ్ణి నిర్భయంగా అభిశంసించారు. “తన రాణి వధువు అయిన సంఘం విషయంలో ఆమె కుటుంబానికి దేవుడు ఉన్నతమైన, నిత్యమైన ఏర్పాటును చేశాడు. ఆమెకు మాయని, క్షీణించని కట్నాన్నిచ్చాడు. నిత్య కిరీటాన్ని రాజదండాన్ని ఇచ్చాడు. వీటన్నిటిని నీవు దొంగలా అందుకుపోతున్నావు. దేవుని మందిరంలో నిన్ను నీవే నెలకొల్పుకొంటున్నావు. కాపరిగా ఉండటానికి బదులు గొర్రెలకు నీవు తోడేలయ్యావు... నీవు సర్వోన్నత బిషవని మమ్మల్ని నమ్మిస్తున్నావు గాని నీవు నియంతలా వ్యవహరిస్తున్నావు...నీవు చెప్పుకొంటున్నట్లు సేవకులకు సేవకుడవై ఉండవలసి ఉండగా ప్రభులకు ప్రభువు కావటానికి ప్రయత్నిస్తున్నావు... దేవుని ఆజ్ఞల విషయంలో అవమానకరంగా వ్యవహరిస్తున్నావు... భూదిగంతాలవరకు పరిశుద్ధాత్మ సంఘ నిర్మాణకుడు...మనం ఏ నగర పౌరులమో ఆ దైవ నగరం పరలోక ప్రాంత భాగమై ఉన్నది. పరిశుద్ధ ప్రవక్తలు బబులోనుగా పేర్కొన్నది, దైవ పట్టణాన్ని తానే అని చెప్పు కొంటున్నది, పరలోకాన్ని సాధిస్తానని చెప్పుకొంటున్నది. తన జ్ఞానం చావులేనిదని అతిశయిస్తున్నది..చివరగా, హేతువేమీ లేకపోయినా- తానెన్నడూ తప్పుచేయలేదని, తప్పుచేయనని చెపుతున్నది, అయిన పట్టణంకన్న ఆ దైవ నగరం ఉన్నతమైనది. ” జెరార్డ్ బ్రేస్ట్, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఇన్ అండ్ ఎబౌట్ ది లో కంట్రీస్, పుస్త 1, పుట 6.GCTel 218.1

    ఈ నిరసనను ప్రతిధ్వనించటానికి ఇతరులు ప్రతీ శతాబ్దంలోనూ లేచారు. వివిధ దేశాల్లో వివిధమైన పేరులతో ప్రసిద్ధిగాంచిన తొలిదినాల బోధకులు వాడోయి మిషనెరీల ప్రవర్తనను తలపించే ప్రవర్తనను కలిగి సువార్తను ప్రతీచోటా ప్రచురిస్తూ నెదర్లాండులో ప్రవేశించారు. వారి సిద్ధాంతాలు శీఘ్రంగా వ్యాప్తి చెందాయి. వారు వాల్డెన్ సీయ బైబిలుని డచ్ భాషలోకి గేయ రూపంలో అనువదించారు”. అందులో సౌలభ్యం ఉన్నది. పరిహాసం, కట్టుకథలు, వ్యర్ధ విషయాలు, వంచనలు ఏమీ లేకుండా సత్యం మాత్రమే అందులోవుంది. ఇక్కడ అక్కడ అర్ధం కాని కఠినాంశాలున్నా, అందులో ఉన్న మాధుర్యాన్ని, మంచిని, పరిశుద్ధతను సులువుగా కనుగోవచ్చు.” అని వారన్నారు. - అదే పుస్తకం, పుస్త 1, పుట 14. ప్రాచీన విశ్వాసాన్ని ఆచరించిన మిత్రులు పన్నెండో శతాబ్దంలో ఇలా రాశారు.GCTel 219.1

    ఇప్పుడు రోమీయ హింసాకాండ ప్రారంభమయ్యింది. మంటలు, హింసాకాండ ప్రజ్వలిస్తున్నా విశ్వాసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మత పరంగా బైబిలు ఒక్కటే నిర్దుష్టమైన అధికారిక గ్రంధమని” ఎవరినైనా ప్రబోధం ద్వారానే తప్ప ఒత్తిడి ద్వారా నమ్మించకూడదు” అని ఆ విశ్వాసులు ప్రకటించారు. - మార్టిన్, సం 21, పుట 87.GCTel 219.2

    లూథర్ బోధనలకు నెదర్లాండ్స్ లో అనుకూల స్పందన ఉన్నది. చిత్తశుద్ధిగల విశ్వాసులు సువార్త ప్రకటించటానికి పూనుకొన్నారు. హాలెండ్ లోని ప్రాన్సిస్ కు చెందిన ఒక వ్యక్తి మెన్నోసైమన్. రోమన్ కథోలిక్ గా విద్యనభ్యసించి ప్రీస్తు సేవలకు అభిషేకం పొందిన ఈయనకు బైబిలంటే ఏంటో తెలియదు. సిద్ధాంత వ్యతిరేకతకు దారి తీయవచ్చునని జడిసి బైబిలును ముట్టుకోనేవాడు కాదు. రొట్టె, ద్రాక్షారసం, మాంసం రక్తంగా మారటమన్న కథోలిక్ సిద్ధాంత విషయమైన సందేహం కలిగినప్పుడు అది సాతాను పంపిన శోధనగా భావించి ధన ద్వారాను క్షమాభిక్ష వేడుకోటం ద్వారా, నిస్కృతి పొందాలని చూశాడు. అది సాధ్యపడలేదు. మరపు పుట్టించే కార్యాల్లో నిమగ్నమవటం ద్వారా విమర్శిస్తున్న అంతరాత్మ స్వరాన్ని అణచివేయాలని ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. కొంతకాలం అయిన తర్వాత కొత్త నిబంధన అధ్యయనాన్ని చేపట్టాడు. దీనితోపాటు లూథర్ రచనలు చదివి దిద్దుబాటు విశ్వాసాన్ని అంగీకరించాడు. అనంతరం దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో తిరిగి బాప్తిస్మం పొందినందుకు ఒక వ్యక్తికి శిరచ్ఛేదనం జరగటం చూశాడు. పసిపాపల బాప్తిస్మంపై బైబిలు అధ్యయనానికి ఇది ఆయనను నడిపించింది. దానికి లేఖనాల్లో నిదర్శనమేమీ కనిపించలేదు. కాని బాప్తిస్మం పొందటానికి పశ్చాత్తాం, విశ్వాసం షరతులని లేఖనాల్లో అన్ని చోట్లా కనుగొన్నాడు.GCTel 219.3

    మెన్నో రోమీయ సంఘాన్ని విడిచిపెట్టి తాను నేర్చుకొన్న సత్యాలను ప్రబోధించటానికి తన జీవితం అంకితం చేసుకొన్నాడు. జర్మనీలోను, నెదర్లాండ్ లోను మతోన్మాదం గల ఒక తరగతి ప్రజలు బయలుదేరారు. వారు అర్ధంలేని విద్రోహకర సిద్ధాంతాలు బోధిస్తూ క్రమాన్ని, సభ్యతను మంటగలిపి దౌర్జన్యాన్ని తిరుగుబాటును రెచ్చగొడున్నారు. ఈ ఉద్యమాలు చివరికి ఎలాంటి పరిణామాలు తెస్తాయో అన్నది మెన్నో గుర్తించి మత ఛాందసవాదుల తప్పుడు బోధలను అనాగరిక పథకాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. పోతే ఈ మతోన్మాదుల్ని నమ్మి మోసపోయినవారు చాలామంది ఉన్నారు. ప్రాచీన క్రైస్తవుల సంతతి వారు చాలామంది ఇంకా మిగిలి ఉన్నారు. వారు వాల్టెన్సీయుల బోధనల ఫలితంగా ఏర్పడ్డ జనాంగం. ఈ తరగతుల ప్రజల మధ్య మెన్నో ఉద్రేకంగా పని చేశాడు జయప్రదంగా.GCTel 220.1

    భార్యా బిడ్డల్ని వేసుకొని ఇరవై అయిదు సంవత్సరాలు సువార్త సేవ చేస్తూ తిరిగాడు. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో లేములు అనుభవించాడు. తరచు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన్నాడు. నెదర్లాండ్స్, జర్మనీ దేశాల్లో, సంచరించి ప్రధానంగా పేద ప్రజల మధ్య సేవచేసి ప్రజల జీవితాన్ని ప్రభావితం చేశాడు. స్వభావసిద్ధంగా మెన్నో మంచి వ్యక్తి. ఎక్కువ విద్యలేకపోయినా నిజాయితీగల వ్యక్తి, వినయశీలుడు, సాధుస్వభావి, భక్తిపరుడు. తాను బోధించిన సూత్రాలను ఆచరణలో కనపర్చిన వ్యక్తి. ఆయన మీద ప్రజలకు గొప్ప నమ్మకం ఏర్పడింది. ఆయన అనుచరులు ఆయాస్థలాలకు చెదరి పోయారు. హింసకు గురి అయ్యారు. ప్రజలు వీరిని మతోన్మాద మాస్టర్ రాక్షసుడి అనుచరులుగా అపార్థం చేసుకొన్నందువల్ల వీరు చాలా శ్రమలకు గురి అయ్యారు. అయినా మెన్నో సేవల ఫలితంగా అనేకమంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు.GCTel 220.2

    దిద్దుబాటు సిద్ధాంతాన్ని నెదర్లాండ్స్ ప్రజలు అంగీకరించినంత సామాన్యంగా మరెక్కడి ప్రజలూ అంగీకరించటం జరగలేదు. ఇక్కడి సంస్కరణ విశ్వాసులు అనుభవించినంత భయంకర హింస మరెక్కడి వారూ అనుభవించలేదు. జర్మనీలో చార్లెస్ V సంస్కరణ విశ్వాసాన్ని బహిష్కరించాడు. దాన్ని ఆచరించే వారందరికీ సజీవ దహన దండన సంతోషంగా విధించి ఉండే వాడే. కాని అదేశ సామంతరాజులు అతడి నిరంకుశ పాలనకు అడ్డుగోడగా నిలబడ్డారు. నెదర్లాండ్స్ లో రాజు అధికారం ఇంతకన్నా అధికం. హింసాశాసనాలు ఒకదాని వెనువెంట మరొకటి జారీ అయ్యేవి. బైబిలు పఠించటం, బైబిలు పఠనాన్ని వినటం, బైబిలును బోధించటం, లేదా బైబిలును గూర్చి మాట్లాడటం మంటల్లో కాలి మరణించే శిక్షను ఆహ్వానించటమే. రహస్యంగా దేవునికి ప్రార్ధన చేయటం, విగ్రహానికి మొక్కటానికి నిరాకరించటం లేదా కీర్తన పాడటం కూడా మరణదండనకు హేతువులే. తమ తప్పులు విడిచిపెడ్తామని వాగ్దానం చేసిన వాళ్లు కూడా దండనార్హులే. మగవాళైతే ఖడ్గం వలన, మహిళలైతే సజీవ సమాధి ద్వారా మరణించటం. చార్లెస్ పాలనకింద ఫిలిఫ్ || పాలన కింద వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.GCTel 220.3

    ఒక సారి ఒక కుటుంబమంతా విచారణాధికారుల ముందు నిలిచింది. వారిపై మోపిన అభియోగం వారు మాస్ కి హాజరుకాకుండా ఇంటిలోనే ఆరాధన కార్యక్రమం జరుపుకోవటం. తమ రహస్య సమావేశాల్లో వారి ఆచారాల విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించగా వారి చివరి కుమారుడిలా జవాబిచ్చాడు. “దేవుడు మానవుల్ని ఉత్తేజపర్చి మా పాపాల్ని క్షమించేందుకుగాను మేము మోకాళ్లూని ప్రార్థిస్తాం. మా రాజు కోసం ప్రార్థిస్తాం. ఆయన పరిపాలన భాగ్యవంతం కావాలని ఆయన జీవితం ఆనందంగా సాగాలని ప్రార్థిస్తాం. మామేజిస్ట్రేటుల్ని దేవుడు భద్రంగా కాపాడవలసిందిగా ప్రార్థిస్తాం.”— విలీ, పుస్త 18, అధ్యా 6. కొందరు న్యాయమూర్తుల కళ్లు చెమ్మగిల్లాయి. అతడి తండ్రి అతడి కొడుకుల్లో ఒకడు సజీవదహన శిక్షను అనుభవించారు.GCTel 221.1

    హింసకుల దురాగ్రహానికి హతసాక్షుల విశ్వాసం దీటుగా నిలిచింది. మగవాళ్లేకాదు సున్నితమైన మగువలు, చిన్నారి బాలలు మొక్కవోని సాహసాన్ని ప్రదర్శించారు. మంటల్లో కాలుతున్న తమ భర్తలకు దగ్గరగా భార్యలు నిలిచి వారి చెవుల్లో ఆదరణ కలిగించే మాటలు చెప్పడం లేదా వారిని ఉత్సాహపర్చేందుకు కీర్తనలు పాడటం చేసేవారు. రాత్రి నిద్రించేందుకు తమ గదిలోకి వెళ్తున్నట్లు కన్యకలు తమ సజీవ సమాధుల్లో పడుకొని ఉండేవారు. లేదా తమ వివాహానికి వెళ్తున్నట్లు తమ ఉత్తమ దుస్తులు ధరించి ఉరికంబం ఎక్కటానికి, అగ్నికి ఆహుతి కావటానికి వెళ్లేవారు.” - అదే పుస్తకం, పుస్త 18, అధ్యా 6.GCTel 221.2

    సువార్తను నిర్మూలించటానికి అన్యమతం ప్రయత్నించిన దినాల్లో లాగే క్రైస్తవుల రక్తం విత్తనమయ్యింది. (టెర్డులియన్, ఎపాలజి, పేరా1 చూడండి.) హింస సత్యం గురించి సాక్ష్యం చెప్పేవారి సంఖ్యను పెంచటానికి తోడ్పడింది. ప్రజల్లో పెల్లుబుకుతున్న పట్టుదలను చూసి శివమెత్తి పోతున్న రాజు ప్రతీ ఏడూ తన క్రూర కృత్యాల్ని కొనసాగించాడు. అతడు సాధించింది శూన్యం. మహాను భావుడు ఆరేంజ్ హేడు అయిన విలియమ్ నాయకత్వం కింద జరిగిన విప్లవం హాలెండ్ కి దేవుని ఆరాధించే స్వేచ్చను తెచ్చింది.GCTel 221.3

    పైడి మాంట్ పర్వతాలలో, ఫ్రాన్స్ మైదానాల్లో, హాలెండ్ తీరప్రాంతాల్లో సువార్త ప్రగతి శిష్యుల ప్రాణత్యాగాలతో సాగింది. కాగా దక్షిణాది దేశాల్లో సువార్త ప్రవేశం శాంతియుతంగా జరిగింది. విట్బెర్గ్ లోని విద్యార్థులు స్వగృహాలకు వెళ్తూ సంస్కరణ విశ్వాసాన్ని స్కేండినేవియాకి తీసుకు వెళ్లారు. లూథర్ రచనల ప్రచురణ కూడా సత్యాన్ని వెదజల్లింది. ఉత్తరాన ఉన్న సామాన్యమైన, దృఢమైన ప్రజలు రోమను మత అవినీతి, ఆడంబరం, మూఢనమ్మకాలను విడిచిపెట్టి పవిత్రమైన, స్పష్టమైన బైబిలు సత్యాలకు స్వాగతం పలికారు.GCTel 222.1

    “డెన్మార్క్ సంస్కర్త “టాసన్ రైతుబిడ్డ. చిన్నతనంలోనే ప్రతిభాశాలి లక్షణాలు కనపర్చాడు. విద్యకోసం తృష్ణగొన్నాడు. తల్లిదండ్రుల పరిస్థితులవల్ల ఈ కోరిక నెరవేరలేదు. కనుక ఆయన ఆశ్రమంలో చేరాడు. ఇక్కడ తన పవిత్ర జీవితం, కఠోర పరిశ్రమ విశ్వసనీయత తనపై అధికారి అనుగ్రహాన్ని సంపాదించాయి. పరీక్షించి చూడగా భవిష్యత్ లో సంఘానికి మంచి సేవలందించే ప్రతిభ ఈ యువకుడికున్నదని వ్యక్తమయ్యింది. జర్మనీ విశ్వ విద్యాలయంలోనో, నెదర్లాండ్ విశ్వవిద్యాలయంలోనో అతనికి చదువుకొనే అవకాశం కల్పించాలని తీర్మానించారు. తాను విట్బెర్గ్ వెళ్లకూడదన్న ఒకే ఒక షరతుపై తన పాఠశాలను ఎంపిక చేసుకొనే అవకాశం ఆ యువ విద్యార్థికిచ్చారు. ఈ సంఘవిద్యార్ధి సిద్ధాంత వ్యతిరేకత వల్ల అపాయానికి గురికాకూడదు. సన్యాసులు భావించింది అదే.GCTel 222.2

    టాసన్ కలోన్ కి వెళ్లాడు. ఇప్పటివలె అప్పుడుకూడా కలోన్ రోమీయ మత ఆశ్రమ దుర్గాల్లో ఒకటి. ఇక్కడ వేదాంత విద్యాంసుల ఆధ్యాత్మిక మీమాంసలతో అతడు విసిగిపోయాడు. దాదాపు అదే సమయంలో లూథర్ రచనలను సంపాదించాడు. వాటిని చదివి ఆనందించాడు. రచయితతో వ్యక్తిగత పరిచయాన్ని ఆకాంక్షించాడు. అది చేయటమంటే ఆశ్రమంలోని తన అధికారిని నొప్పించే ప్రమాదాన్ని ఎదుర్కోవాలి. తనకిప్పుడున్న అండను పోగొట్టుకోవాలి. తీర్మానం త్వరలోనే చేసుకొన్నాడు. అనతికాలంలోనే విట్బెర్గ్ లో విద్యార్ధిగా చేరాడు.GCTel 222.3

    డెన్మార్క్ కు తిరిగివచ్చినప్పుడు తన ఆశ్రమానికి తిరిగి వెళ్లాడు. అతడు లూథర్ సిద్ధాంత విశ్వాసి అని ఇంకా ఎవరూ అనుమానించలేదు. అతడు తన గుట్టు ఇంకా విప్పలేదు. తన సహచరుల దురభిమానాన్ని రేపకుండా వారిని పవిత్ర విశ్వాసం, పరిశుద్ధ జీవనం దిశగా నడిపించటానికి టాసన్ ప్రయత్నించాడు. బైబిలును తెరచి దాని వాస్తవమైన అర్ధాన్ని వారికి వివరించాడు. చివరగా క్రీస్తును పాపికి నీతిగాను, పాపి రక్షణకు ఒకే ఒక నిరీక్షణగాను వారికి బోధించాడు. రోమును కాపాడగల పరాక్రమశాలిగా తనపై ఆశలు పెట్టుకొన్న ప్రయర్ కి ఆయనపై పట్టజాలనంత కోపం వచ్చింది. వెంటనే టాసనను తన ఆశ్రమం నుంచి తీసివేసి ఇంకో ఆశ్రమంలో కఠినమైన పర్యవేక్షణ కింద చిన్న గదిలో బంధించి ఉంచాడు.GCTel 223.1

    తన కొత్త సందర్శకులకు వెన్నులో చలిపుట్టించిన అంశమేంటంటే అనేకమంది సన్యాసులు తాము ప్రొటస్టాంటు విశ్వాసాన్ని స్వీకరించినట్లు ప్రకటించటం. తనగది ఊచల సందుల్లో నుంచి టాసన్ సహచర సన్యాసులకు సత్యాన్ని బోధించాడు. సిద్ధాంత వ్యతిరేకత విషయంలో, సంఘవిధానాన్ని అనుసరించటంలో ఆ డేనిష్ ఫాదర్లు, ఆరి తేరినవారై ఉంటే బాసన్ గళం మూగపోయి ఇక వినపడకుండా ఉండేది. అయితే ఏదో చీకటి బిలంలోని సమాధిలో బంధించి ఉంచే బదులు వారు టాసన్ ని ఆ ఆశ్రమం నుంచి బహిష్కరించారు. ఆయనపై ఇప్పుడు వారికి అధికారం ఏమీలేదు. అప్పుడే జారీ అయిన రాజశాసనం నూతన సిద్ధాంత బోధకులకు భద్రతను ప్రకటించింది. ఇక టాసన్ బోధించటం మొదలు పెట్టాడు. ఆలయ ద్వారాలు తెరచుకొన్నాయి. ఆయన బోధ వినటానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఇంకా ఇతరులు కూడా దైవవాక్యాన్ని బోధిస్తున్నారు. డేనిష్ భాషలోకి అనువాదమైన నూతన నిబంధన విరివిగా ప్రసారమయ్యింది. పోపు మతవాదులు దైవ సేవను నాశనం చేయటానికి చేసిన ప్రయత్నాలు దాన్ని విస్తరింప చేయటానికి సహాయపడ్డాయి. కొద్ది కాలంలోనే డెన్మార్క్ దిద్దుబాటు విశ్వాసాన్ని స్వీకరించింది.GCTel 223.2

    స్వీడన్ లో కూడా విట్బర్గ్ నూతినీళ్లు తాగిన యువకులు తమ దేశ ప్రజలకు జీవజలం అందించారు. స్వీడిష్ సంస్కరణోద్యమంలో ఒలాఫ్, లారెన్షియస్ పెట్రి అనే వారిద్దరూ నాయకులు. వీరు ఒరెలో ఒక కమ్మరి పనివాని కొడుకులు. వారు లూథర్, మెలాంగతన్ల కింద చదువుకొన్నారు. తాము నేర్చుకొన్న సత్యాన్ని వారు ఇతరులకు బోధించారు. గొప్ప సంస్కర్త లూథర్ మాదిరిగా ఒలాఫ్ తన ఉత్సాహం వక్తృత్వం వల్ల ప్రజల్ని మేలుకొలిపాడు. లారెన్షియస్, మెలాం తన్ లాగ విద్వాంసుడు, ఆలోచనా పరుడు, నెమ్మదిపరుడు. ఇద్దరూ ప్రగాఢ ధైవభక్తిగల వారే. వేదాంత జ్ఞానం విషయంలోను, సత్యాన్ని ధైర్యంగా చాటే విషయంలోను ఇద్దరూ ఉద్దండులే. పోపు నాయకుల వ్యతిరేకతకు లోటు లేదు. కథోలిక్ ప్రీస్టులు మూఢ నమ్మకాలు గల అమాయక ప్రజల్ని రెచ్చగొట్టారు. తరచు అల్లరిమూక ఒలాఫ్ పెట్టి మీదికి దౌర్జన్యంగా వెళ్లటం జరిగేది. చాలాసార్లు అతడు తప్పించుకొని ప్రాణాలు రక్షించుకొనేవాడు. రాజు ఈ సంస్కర్తల్ని అభినందించి కాపాడేవాడు.GCTel 223.3

    రోమను సంఘ పరిపాలన కింద ఉన్న ప్రజలు పేదరికంలో కూరుకు పోయారు. హింస వారిని పొట్టన పెట్టుకొన్నది. వారు లేఖనాలులేని అనాథలయ్యారు. వారి మతం కేవలం గురుతులు, ఆచారాలకు ప్రాధాన్యాన్నిచ్చింది. అది వారి మనస్సులకు ఉత్తేజాన్నివ్వలేదు. తమ అన్య పూర్వికుల మూఢనమ్మకాలకు, అన్యమతాచారాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. దేశం పోరాడుకొంటున్న వర్గాలుగా విడిపోయింది. నిత్యమూ సాగుతోన్న కలహాలు, ప్రజల దుఃఖాన్ని అధికం చేశాయి. రాజ్యంలోను, సంఘంలోను రాజు సంస్కరణను ఆకాంక్షించాడు. రోముకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ సమర్థ సహాయకుల్ని రాజు స్వాగతించాడు.GCTel 224.1

    రాజు సమక్షంలోను స్వీడన్ దేశంలోని ప్రముఖ వ్యక్తుల సమక్షంలోను రోమను మత నాయకులతో వాదనలో సంస్కరణ సిద్ధాంతాన్ని ఒలాఫ్ పెట్ర బహు సమర్థంగా బలపర్చాడు. పాదుర్ల బోధనలు వాక్యాను సారంగా ఉన్నప్పుడే వాటిని అంగీకరించాలని, అందరూ అవగాహన చేసుకొనేందుకుగాను విశ్వాసానికి సంబంధించిన ముఖ్య సిద్ధాంతాలు బైబిలులో స్పష్టంగా దాఖలై ఉన్నాయని ఆయన కుండబద్దలు కొట్టాడు. ” నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే” యోహాను 7:16. అన్నాడు క్రీస్తు. తాను పొందిన సువార్తను తప్ప మరి దేనిని బోధించినా తనకు శాపం కలుగుతుందని (గలతీ 1:8.) లో పౌలు పలికాడు. “ఇలాగుండగా ఇతరులు తమ ఇష్టం వచ్చినట్లు సిద్ధాంతాల్ని శాసించి వాటిని రక్షణకు అవసర విషయాలుగా ఎలా విధించగలరు?” - విలీ, పుస్త10, అధ్యా 4. దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ఉన్నప్పుడు సంఘ డిక్రీలకు అధికారం లేదని సూచిస్తూ “బైబిలు బైబిలు మాత్రమే” విశ్వాసానికి ఆచరణకు ప్రామాణికమన్న గొప్ప ప్రొటస్టాంట్ సూత్రాన్ని సమర్థించాడు.GCTel 224.2

    ఈ సమరం తక్కువ స్థాయిలో జరిగినప్పటికీ సంస్కరణ సేనలోని సాధారణ సైనికులు ఎలాంటి వారోనన్నది ఇది మనకు స్పష్టం చేస్తోన్నది. వారు నిరక్షరాస్యులు, సాంఘిక దురభిమానులు, వివాదాస్పదులు కారు. వారు దైవ వాక్యాన్ని అధ్యయనం చేసిన వ్యక్తులు. బైబిలు ఆయుధశాల సరఫరాచేసే ఆయుధాలను నిపుణంగా ఉపయోగించటం తెలిసిన వ్యక్తులు. విద్య విషయానికొస్తే వారు తమ యుగాని కన్న ఎంతో ముందున్న మనుషులు. విటెన్ బర్గ్, జూరిక్ వంటి విజ్ఞాన కేంద్రాలను లూథర్,GCTel 224.3

    మెలంగతన్, జ్వింగ్లీ, ఎకోవేంపడియన్ వంటి ప్రఖ్యాతమైన పేరులను పరిగణిస్తే వీరు ఈ ఉద్యమ నాయకులని తెలుసుకొంటాం. వారు గొప్ప శక్తిమంతులు, విజ్ఞాన సంపన్నులు అయి ఉండాలనుకోటం సహజమే. కాని వారి కిందివారు వారిలా లేరు. స్వీడన్ వంటి చీకటి ప్రాంతానికి వెళ్లి ఒలాఫ్, లారెన్షియస్ పెట్రి వంటి పేర్లు- గురువుల నుంచి శిష్యుల దాకా పరిశీలిస్తే ఏమి కనుగొంటాం?... విద్వాంసులు, వేదాంత నిపుణులు, సువార్త సత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తులు, కుతర్కవాదులపైన రోము అధికారులపైన జయం సాధించగల వ్యక్తుల్ని కనుగొంటాం”. అదే పుస్తకం, పుస్త 10, అధ్యా 4.GCTel 225.1

    ఈ సంవాదం ఫలితంగా స్వీడన్ రాజు సంస్కరణ విశ్వాసాన్ని స్వీకరించాడు. తర్వాత కొద్దికాలానికి జాతీయ సభ దాన్ని ధ్రువపర్చింది. ఒలాఫ్ నూతన నిబంధనను స్వీడిష్ భాషలోకి అనువదించాడు. రాజు కోరికను మన్నించి ఆ సహోదరులిద్దరూ పూర్తి బైబిలు అనువాదాన్ని చేపట్టారు. ఈ విధంగా స్వీడన్ ప్రజలకు తమ భాషలో దైవ వాక్యం లభించింది. ఆ రాజ్యమంతటా బోధకులు లేఖనాలను విశదం చేయాలని, పాఠశాలలోని పిల్లలకు బైబిలు చదవటం నేర్పించాలని డయట్ (విధానసభ) ఆదేశించింది.GCTel 225.2

    శుభప్రదమైన సువార్త జ్యోతి అజ్ఞానం మూఢనమ్మకాల చీకట్లను పారదోలింది. రోము హింసాకాండ నుంచి స్వేచ్ఛ పొందిన జాతి ముందెన్నడూ లేని శక్తిని, ఔన్నత్యాన్ని సాధించింది. ప్రొటస్టాంట్ మతానికి స్వీడన్ ఒక ఆశ్రయ దుర్గమయ్యింది. ఒక శతాబ్దం దరిమిల మిక్కిలి అపాయకరమైన సమయంలో అప్పటిదాక బలహీనంగా ఉన్న ఈ చిన్న దేశం-చేయూతనివ్వటానికి సాహసించిన దేశం ఐరోపాలో ఒకే ఒక దేశం-ముప్పె సంవత్సరాల యుద్ధంలో జర్మనీని విడిపించటానికి వచ్చింది. ఉత్తర ఐరోపా అంతా మళ్లీ రోము నిరంకుశ పాలనకిందికి రావటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. కేల్వినిస్టు, లూథరన్, ప్రొటస్టాంట్లకు మత సహనాన్ని సాధించటానికి, సంస్కరణ విశ్వాసాన్ని స్వీకరించిన దేశాలకు మనస్సాక్షి, స్వతంత్రతను పునరుద్ధరించటానికి, పోపుతో జర్మనీ సలిపిన పోరులో పోపు విజయావకాశాన్ని రద్దుచేయటానికి స్వీడిష్ సేనలు సహాయం చేశాయి.GCTel 225.3