Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 22—నెరవేరిన ప్రవచనాలు

    ప్రభువు వస్తాడని కనిపెట్టిన సమయం అనగా 1844 వ సంవత్సరం దాటి పోయినప్పుడు ఆయన రాకకోసం విశ్వాసంతో ఎదురుచూసినవారు కొద్దికాలం సందేహం అనిశ్చయతల నడుమ సతమతమయ్యారు. వారిని పరాజితులుగా, ఏదో భ్రమను పట్టుకోని వేళాడున్న వారిగా లోకం కొట్టిపారేసింది. వారికి ఆదరణ దేవుని వాక్యమే. అనేకులు లేఖన పరిశోధన కొనసాగించారు. తమ విశ్వాసానికి నిదర్శనాలను సరికొత్తగా పరిశీలించారు. మరింత వెలుగు కోసం ప్రవచనాల్ని శ్రద్ధగా అధ్యయనం చేశారు. వారి నమ్మకానికి మద్దతుగా బైబిలు పలుకుతున్న సాక్ష్యం సుస్పష్టంగా నిశ్చయాత్మకంగా ఉంది. పొరబడటానికి వీలులేని గుర్తులు క్రీస్తురాక సమీపంగా ఉన్నదని సూచిస్తున్నాయి. పాపులు మారుమనసు పొందటం, క్రైస్తవుల్లో ఆధ్యాత్మిక జీవితం ఉజ్జీవం పొందటం ఆ వర్తమానం దేవుని వర్తమానమని రూఢిపర్చాయి. విశ్వాసులు తమకు కలిగిన ఆశాభంగాన్ని విశదం చేయలేకపోయిప్పటికీ ఆ అనుభవంలో దేవుడు తమను నడిపించాడని దృఢంగా నమ్మారు.GCTel 365.1

    రెండోరాకకు సంబంధించినవని వారు భావించిన ప్రవచనాలతో అంతర్లీనమై ఉన్న ఉపదేశం తమ ప్రస్తుత అనిశ్చిత, ఉత్కంఠభరిత స్థితికి ఉపయుక్తమై ప్రస్తుతం తమకు గ్రాహ్యంకాని విషయాలు ఉచిత కాలంలో విశదమవుతాయని తాము ఓర్పుతో విశ్వాసంతో వేచి ఉండాలని వారిని ఉత్సాహ పర్చాయి.GCTel 365.2

    ఈ ప్రవచనాల్లో ఒకటి హబక్కూకు 2:14 లో ఉన్న ప్రవచనం: “ఆయన నాకు ఏమి సెలవిచ్చునో చూచుటకై నేను నా కాపరి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందు ననుకొనగా యెహోవా నా కీలాగు సెలవిచ్చెనుః చదువువాడు పరుగెత్తుచు చదువ వీలున్నట్లు, నీవు ఆదర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శనము నిర్ణయకాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతుర పడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును. వారు యధార్ధపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును”GCTel 365.3

    “చదువువాడు పరుగెత్తుచు చదువ వీలున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము” అన్నది ఈ ప్రవచన ఆదేశం. దానియేలు, ప్రకటన గ్రంధాల్లోని దర్శనాలను చార్జులపై చిత్రాల రూపంలో ప్రదర్శించాలని చార్లెస్ ఫిచ్ కి 1842 లోనే ఒక అభిప్రాయం కలిగింది. హబక్కూకు ద్వారా వచ్చిన ఆదేశాన్ని నెరవేర్చే ఈ చార్టు ప్రచురణ అని భావించటం జరిగింది. ఈ ప్రవచనం నెరవేర్పులో ఏర్పడ్డ జాప్యం- కనిపెట్టే సమయం- ఆ ప్రవచంలోనే ఉన్న సంగతి అప్పుడు ఎవరూ గుర్తించ లేదు. ఆశాభంగం అనంతరం ఈ లేఖనం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. “ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తముగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది జాగుచేయక వచ్చును... అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును”GCTel 366.1

    యెహెజ్కేలు ప్రవచనంలోని ఈ భాగం కూడా విశ్వాసులకు బలాన్ని ఆదరణను చేకూర్చుతున్నది. “నరపుత్రుడా దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థక మగుచున్నదని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా... దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును... నేను మాట యిచ్చుచున్నాను, నేనిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును” (“వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహు దినములు జరుగవలెననియు బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రకటించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము- ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండ జరుగుసు” యెహెజ్కేలు 12:2125,27,28.GCTel 366.2

    మత్తయి 25 వ అధ్యాయంలోని పదిమంది కన్యకల ఉపమానం కూడా ఆగమన వాదుల అనుభవానికి ఒక ఉదాహరణ. మత్తయి 24 వ అధ్యాయంలో తన రాకడ గురించి లోకాంతం గురించి శిష్యులడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ లోక చరిత్రలోను తన మొదటిరాక రెండోరాక మధ్య ఉన్న సంఘచరిత్రలోను అతిముఖ్యమైన సంఘటనలను క్రీస్తు పేర్కొన్నాడు. అవేమంటే, యెరూషలేము నాశనం, అన్యరాజులు, పోపుల పరిపాలనలో సంఘానికి గొప్ప శ్రమ, సూర్యచంద్రులు చీకటి కమ్మటం, నక్షత్రాలు రాలటం, దీని తర్వాత ఆయన తన రాజ్యంతో రావటాన్ని గురించి ప్రస్తావిస్తూ తన రాక కోసం ఎదురు చూస్తున్న రెండు తరగతుల సేవకుల గురించిన ఉపమానం చెప్పాడు. “పరలోక రాజ్యము... పదిమంది కన్యకలను పోలియున్నది” అన్నమాటలతో 25 అధ్యాయం ఆరంభమౌతున్నది. ఇరవైనాలుగో అధ్యాయం చివరలో సూచించినట్లే ఇక్కడ చివరి దినాల్లో నివసిస్తున్న సంఘాన్ని మన దృష్టికి తేవటం జరిగింది. ఈ ఉపమానంలో వారి అనుభవానికి తూర్పు దేశాల్లోని వివాహాలు చక్కని ఉదాహరణ.GCTel 366.3

    “పరలోక రాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదురుకొనుటకు బయలుదేరిన పదిమంది కస్యకలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు. అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధిలేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ- ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను”.GCTel 367.1

    మొదటి దూత వర్తమానం ప్రకటించిన రీతిగా పెండ్లి కుమారుడి రాక క్రీస్తు రాకను సూచిస్తున్నది. క్రీస్తు త్వరలోవస్తున్నాడన్న ప్రకటన కన్యకలు బయలు దేరటాన్ని సూచిస్తున్నది. మత్తయి 24 లోని ఉపమాసంలోలాగే ఈ ఉపమానంలో రెండు తరగతుల ప్రజలున్నారు. అందరూ తమ దివిటీలు- బైబిలు- చేతబట్టి ఆ వెలుగులో పెండ్లి కుమారుణ్ణి కలుసుకోటానికి బయలుదేరారు. అయితే “బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసుకుపోలేదు. “బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ... నూనె తీసికొని” పోయారు. రెండో తరగతి ప్రజలు తమ పాదాలకు దీపం, తమత్రోవకు వెలుగుగా ఉండి నవీకరించే, ఉత్తేజపర్చే పరిశుద్ధాత్మ శక్తికి ప్రతీక అయిన దైవకృపను పొందారు. సత్యాన్ని తెలుసుకోటానికి దైవభీతితో లేఖనాలు అధ్యయనంచేసి హృదయ శుద్ధికి, పరిశుద్ధ జీవనానికి కృషి చేశారు. వీరు దేవుని మీద దైవ వాక్యం మీద విశ్వాస ముంచారు. ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారు. ఆశాభంగంవల్ల ఆలస్యం వల్ల వారు కుంగిపోలేదు. తక్కిన వారు తమ దివిటీలు పట్టుకొని తమతో నూనె తీసుకొని పోలేదు.” వారు ఉద్వేగ భరితులై కదిలారు. ఆ గంభీర వర్తమానం విన్నప్పుడు వారిలో భయం పుట్టింది. కాని వారు తమ సహోదరుల విశ్వాసం మీద ఆధారపడ్డారు. సత్యాన్ని క్షుణ్ణంగా గ్రహించకుండా లేదా తమ హృదయాల్లో దైవకృప చేసే పనిని అవగాహన చేసుకోకుండా వారు తమ హృదయాల్లో మినుకుమినుకు మంటున్న భావోద్రేకాలతో తృప్తి చెందారు. వీరు ప్రభువును కలిసేందుకు బయలుదేరారు. తమకు తక్షణమే ప్రతిఫలం కలుగుతుందని వారి ఆశాభావం. కాని ఆలస్యానికి, ఆశాభంగానికీ వారు సిద్ధంగా లేరు. శ్రమలు కలిగినప్పుడు వారి విశ్వాసం నీరుకారిపోయింది. వారి దివిటీలు కొడిగట్టుకు పోయాయి.GCTel 367.2

    “పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి” పెండ్లి కుమారుడు ఆలస్యం చేయటం ప్రభువు వస్తాడని కనిపెట్టిన సమయం దాటిపోవటాన్ని, ఆశాభంగాన్ని, ఆలస్యం అన్న భ్రమను సూచిస్తుంది. నిశ్చయతలేని ఈ సమయంలో చిత్తశుద్ధి నిజాయితీ లేని వారి ఆసక్తి తగ్గనారంభించింది. వారి క్రియలకు తెరపడింది. కాగా ఎవరి విశ్వాసం తమ వ్యక్తిగత బైబిలు జ్ఞానం మీద ఆధారపడి ఉన్నదో వారు స్థిరంగా నిలిచారు. ఆశాభంగ తరంగాలు వారి పాదాలను కదల్చలేక పోయాయి. ‘’వారందరు కునికి నిద్రించుచుండిరి” ఒక తరగతి ప్రజలు అనిశ్చయతతో కొట్టుమిట్టాడి తమ విశ్వాసాన్ని విడిచి పెట్టగా రెండో తరగతి ప్రజలు నిర్దిష్టమైన వెలుగు వచ్చేవరకు ఓపికతో కనిపెడూ నిద్రించారు. అయినా ఆ రాత్రి శ్రమలో ఆ రెండో వర్గం వారు తమ ఉద్రేకాన్ని భక్తితత్పరతను కొంతమేరకు కోల్పోయినట్లు కనిపించింది. అరకొర నమ్మకంతో ఉన్న వారు సహోదరుల విశ్వాసంGCTel 368.1

    మీద ఇక ఎంత మాత్రం ఆధారపడటం సాధ్యపడలేదు. ప్రతీవారు స్వతంత్రంగా వ్యవహరించి జయాప జయాలకు జవాబుదార్లు కావాలి.GCTel 368.2

    దాదాపు ఇదే సమయంలో మతమౌఢ్యం తలెత్త నారంభించింది. ఆగమన వర్తమానాన్ని ఉత్సాహ ఉద్రేకాలతో విశ్వసిస్తున్నట్లు చెప్పుకొంటున్న కొంతమంది దైవవాక్యమే మానవుడి నిర్దుష్ట మార్గదర్శి అన్న సత్యాన్ని తోసిరాజని పరిశుద్ధాత్మ తమను నడిపిస్తున్నట్లు చెప్పుకొంటూ తమ సొంత మనోభావాలు, అభిప్రాయాలు, ఊహాగానాల నియంత్రణకు లొంగిపోయారు. కొందరు తమ మార్గాన్ని అనుసరించని వారందరిని గుడ్డి దురభిమానంతో దూషించారు. ఈ మతోన్మాదుల అభిప్రాయాలు, విశ్వాసాలు ఆగమన విశ్వాసుల సానుభూతిని పొందలేక పోయాయి. అవి సత్యానికి అపకీర్తి తెచ్చిపెట్టాయి.GCTel 368.3

    ఈ రీతిగా దేవుని సేవను వ్యతిరేకించి ధ్వంసం చేయటానికి సాతాను శతవిధాల ప్రయత్నించాడు. ఆగమన ఉద్యమం ప్రజలను చైతన్యపర్చింది. పాపులు వేలకొద్దీ మారుమనసు పొందారు. వేచి ఉండే కాలంలో సయితం యధార్ధ హృదయులెందరో సత్యాన్ని ప్రకటించటానికి తమ్మును తాము అంకితం చేసుకొన్నారు. సాతాను అనుచరులు అతన్ని విడిచిపెట్టేస్తున్నారు. దైవకార్యాన్ని నిందలపాలు చేయటానికిగాను ఆగమన విశ్వాసాన్ని నమ్ముతున్న వారిని మోసగించి వారిచే దురంతాలు చేయించటానికి అతను ప్రయత్నించాడు. ఆగమన వాదులను వారి విశ్వాసాన్ని కించపర్చటానికి ప్రతీ పొరపాటును ప్రతీ పరాజయాన్ని ప్రతీ అవాంఛనీయ క్రియనూ సొమ్ముచేసికోటానికి సాతాను అనుచరులు సన్నదులై వేచి ఉన్నారు. సాతాను ఎంత ఎక్కువమందిని రెండోరాక విశ్వాసులుగా కనపర్చి వారి మనసుల్ని నియంత్రించ గలిగితే వారు విశ్వాసుల సర్వ సమూహంలో ప్రతినిధులు అన్న విషయంపై అంత గమనాన్ని ఆకర్షించి లబ్ధిపొందవచ్చు.GCTel 369.1

    సాతాను “సహోదరులపై నిందలు మోపేవాడు”. దైవ ప్రజలను మంచి పనులను పట్టించుకోకుండా వారి దోషాలను, లోపాలను కనిపెట్టి వాటిని ప్రముఖంగా చూపటానికి మనుషుల్ని ప్రోత్సహించేది సాతాను స్వభావమే. ప్రజల రక్షణ కోసం దేవుడు పనిచేసే తరుణంలో అతను చురుకుగా పని చేస్తాడు. దైవ కుమారులు ప్రభువు సన్నిధిని నిలువటానికి వచ్చేటప్పుడు వారితోపాటు సాతాను కూడా వస్తాడు. ప్రతి ఉజ్జీవంలోను హృదయశుద్ధి లేని వారిని వక్రబుద్ధి గలవారిని ప్రవేశపెట్టటానికి అతను సిద్ధంగా ఉంటాడు. వీరు సత్యంలో ఏవోకొన్ని విషయాల్ని అంగీకరించి విశ్వాసులమధ్య స్థానం సంపాదించినప్పుడు అజాగ్రత్తగా ఉన్నవారిని మోసగించటానికి వీరిని ఉపయోగించి వీరి ద్వారా తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టటానికి ప్రయత్నిస్తాడు. దైవ మందిరంలో గాని ప్రభువు బల్లవద్దగాని దైవ జనులతో ఉన్నంత మాత్రాన ఎవరూ యధార్థ క్రైస్తవులు కాలేరు. అది దానికి రుజువుకాదు కూడా. తరచు ముఖ్యమైన అన్ని సందర్భాల్లోనూ తన అనుచరుల రూపంలో ఉంటూనే ఉంటాడు.GCTel 369.2

    పరలోక పట్టణం వైపుకు దైవ ప్రజలు చేసే ప్రయాణంలో ప్రతీ అంగుళం స్థలంకోసం అపవాది పోరాటం సల్పుతాడు. సంఘ చరిత్ర అంతటిలోనూ తీవ్ర ప్రతి బంధకాలు ఎదుర్కోకుండా ఎలాంటి దిద్దుబాటు జరుగలేదు. పౌలు దినాల్లోనూ అదే జరిగింది. అపోస్తలుడు ఎప్పుడు సంఘం స్థాపించినా విశ్వసిస్తున్నట్లు చెప్పేవారు కొందరుండే వారు. కాని వారు తప్పుడు సిద్ధాంతాలను ప్రబోధించేవారు. వాటిని ప్రజలు అంగీకరిస్తే పర్యవసానంగా సత్యం పట్ల ప్రేమ క్రమేణా తగ్గిపోవడం తధ్యం. తమ ద్వారా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడని చెప్పుతూ లేఖనాలను పక్కనపెట్టి తమ సొంత అభిప్రాయాలు ప్రకటించే మతోన్మాదుల విషయంలో లూథర్ కూడా తీవ్ర ఆందోళనకు మనస్తాపానికి గురి అయ్యాడు. విశ్వాసం అనుభవం లోపించినా బోలెడు ఆత్మవిశ్వాసం ఉండి ఏదోకొత్త విషయం వినాలని చెప్పాలని ఆశించే అనేకులు ఈ కొత్త బోధకుల అబద్దాలు నమ్మి మోసపోయారు. వారు సాతాను ప్రతినిధులతో చేతులు కలిపి దేవుడు లూథర్ ద్వారా నెలకొల్పిన పనిని ధ్వంసం చేయటానికి పూనుకొన్నారు. తమ పలుకుబడిని బట్టి విశ్వాసాన్ని బట్టి లోక శ్రేయానికి దోహదపడిన వెస్లీ సోదరులు తదితరులు ఉన్మాదులు దుర్నీతిపరులు అయిన సాతాను అనుచరుల పలురకాల మత ఛాందసాన్ని అడుగడుగున ఎదుర్కొన్నారు.GCTel 369.3

    మతఛాందసుల ప్రభావాన్ని విలియమ్ మిల్లర్ సమర్ధించలేదు. ప్రతీ ఆత్మను దైవ వాక్య ప్రమాణంతో పరీక్షించాలని లూథర్తో మిల్లర్ గళం కలిపాడు. “ప్రస్తుత సమయంలో కొందరి మనసులపై సాతానుకి గొప్ప పట్టు ఉన్నది. ” వారి స్వభావం ఎలాంటిదో మనకెలా తెలుసు? బైబిలు ఇస్తున్న జవాబు ఇది: “వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు”... అనేక ఆత్మలు లోకంలోకి బయలు వెళ్లాయి గనుక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించవలసిందిగా మనకు వస్తున్న ఆదేశం. మనం ప్రస్తుతమున్న ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోసు భక్తితోను నివసించటానికి ఏ ఆత్మ సహకరించదో అది క్రీస్తు ఆత్మకాదు. ఈ విచిత్ర ఆటవిక ఉద్యమాలు సాతాను సంబంధమైనవన్నది నా ప్రగాఢ విశ్వాసం... సంపూర్ణ పరిశుద్ధత గలవారిగా నటించే మనలో అనేకులు మానవ సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. అట్టివారు అసలు సత్యం తెలియనివారితో సమానులు” అని మిల్లర్ అన్నాడు -బ్లిస్, పుటలు 236,237. “తప్పుడు ఆత్మ మనల్ని సత్యానికి దూరం చేస్తుంది. దేవుని ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఒకడు తప్పులో ఉండి కూడా తనకు సత్యమున్నదని భావించవచ్చని మీరంటారు. దాని సంగతేంటి? ఆత్మకు వాక్యానికి మధ్య వైరుధ్యం లేదు అన్నదే మా సమాధానం. ఒకవ్యక్తి వాక్య ప్రమాణంతో తన్నుతాను పరీక్షించుకొని వాక్యమంతటిలోను సామరస్యం ఉన్నట్లు కనుగొంటే అప్పుడు తనకు సత్యమున్నదని అతను నమ్మాలి. కాని తనను నడిపించే ఆత్మ దేవుని వాక్యంతో లేదా దైవ గ్రంధంతో ఏకీభవించనట్లు కనుగొంటే అట్టివ్యక్తి సాతాను ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ” - ఎడ్వెంట్ హెరాల్డ్ అండ్ సైన్స్ ఆఫ్ ది టైమ్స్ రిపోర్టర్, సం 8, నం 23 (జనవరి 15,1845). “క్రైస్తవ లోకం నుంచి వినిపించే కేకలు, అరుపుల కన్నా, ఎర్రబారిన నేత్రం, తడిసిన చెక్కిలి, దుఃఖంలో వచ్చీరాని మాటల నుంచి అంతర్గత భక్తికి ఎక్కువ నిదర్శనం కనిపించింది నాకు.” బ్లిస్, పుట 282.GCTel 370.1

    సంస్కరణ దినాల్లో సంస్కరణోద్యమ విరోధులు మతమౌఢ్యం దుష్పరిణామాలకు వ్యతిరేకంగా కృషి సల్పిన వారిని నిందించారు. ఆగమనోద్యమ విరోధులు కూడా అలాంటి పంథానే అవలంబించారు. మత తీవ్రవాదుల తప్పిదాలను హెచ్చించి విభేదాలు సృష్టించటంతో తృప్తి చెందక ఇసుమంత సత్యంకూడా లేని వ్యతిరేక నివేదికలను ప్రచురించారు. దురభిమానంతో ద్వేషంతో నిండి వారు ఇలా వ్యవహరించారు. క్రీస్తు ద్వారం వద్దే ఉన్నాడన్న బోధ వారికి కలవరం పుట్టించింది. అది వాస్తవం కావచ్చునని భయపడ్డారు. అయినా అది సంభవించదని నిరీక్షించారు. వారు ఆగమన వాదులకు వారి నమ్మకానికి వ్యతిరేకంగా పోరాటం సాగించటానికి కారణం ఇదే.GCTel 371.1

    మతమౌఢ్యులు కొందరు ఆగమన విశ్వాసుల మధ్య స్థానం సంపాదించినంత మాత్రాన అది దేవుని వలన కలిగిన ఉద్యమం కాదనటం ఎంత అసమంజసమో పౌలు దినాల్లోను లేదా లూథర్ దినాల్లోను మత మౌఢ్యులూ, వంచకులూ సంఘంలో ఉండటాన్ని బట్టి వారి పరిచర్యం యధార్ధమైనది కాదనటం అంతే అసమంజసం. దైవప్రజలు నిద్రలేచి యధార్ధహృదయంతో పశ్చాత్తాప పడి తప్పులు సవరించుకోటం మంచిది. యేసు నీతిలో ఉన్నది ఉన్నట్టుగానే సత్యం నేర్చుకోటానికి వారు లేఖనాలను పరిశోధించాలి. వారు తమ్మునుతాము దేవునికి సంపూర్తిగా సమర్పించుకోనివ్వండి. సాతాను ఇంకా చురుకుగా పనిచేస్తున్నాడనటానికి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడనటానికి నిదర్శనానికి కొదువ ఉండదు. అపూర్వవంచనతో అతను తన శక్తిని ప్రదర్శిస్తాడు. ఈ పనిలో తనకు ఆసరాగా ఉండటానికి తన దుష్టదూతలందరినీ చుట్టూ ఉంచుకొంటాడు. GCTel 371.2

    మతమౌఢ్యానికి అనైక్యతకు హేతువు రెండోరాక ప్రకటన కాదు. ఇవి 1844 ఎండాకాలంలోనే పొడచూపాయి. ఆగమన విశ్వాసులు తమ వాస్తవిక స్థితిని గురించి సందేహంతో ఆందోళనతో సతమతమౌతున్నప్పుడు ఇవి తలెత్తాయి. మొదటి దూత వర్తమానాన్ని ” అర్ధరాత్రి కేక’ను గూర్చిన ప్రకటన, మతమౌఢ్యాన్ని అసమ్మతిని అణచివేయటానికి దోహదపడింది. ఈ గంభీర ఉద్యమాల్లో పాలుపొందిన వారు సామరస్యంతో వ్యవహరించారు. వారు ఒకరిపట్ల ఒకరు, తాము త్వరలో చూడ నిరీక్షిస్తున్న యేసుపట్ల, ప్రేమానురాగాలతో నివసించారు. తమకున్న ఏకైక విశ్వాసం ఏకైక నిరీక్షణ ఏ మానవ ప్రభావానికి లొంగకుండా వారిని ఉన్నతపర్చి సాతాను దాడులనుంచి కాపాడింది.GCTel 371.3

    “పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ - ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి. అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి” (మత్తయి 25:57) 1844 ఎండాకాలంలో, 2300 దినాలు అంతమొందుతాయనిGCTel 372.1

    మొదటిసారి భావించిన సమయానికీ అదే సంవత్సరం శరత్కాలానికి మధ్యకాలంలో “ఇదిగో పెండ్లి కుమారుడు” అన్న లేఖన వాక్కుల్లో ఈ వర్తమాసం ప్రచారమయ్యింది. తర్వాత వారు దాన్ని ఈ సమయానికి పొడిగించినట్లు తెలుస్తున్నది.GCTel 372.2

    2300 దినాల ప్రవచన కాలానికి ప్రారంభాంశం అయిన యెరూషలేము పునరుద్ధరణకు రాజు అర్తహషస్త జారీచేసిన డిక్రీ క్రీ.పూ. 457లో అమలయ్యిందనీ, క్రితం విశ్వసించిన రీతిగా ఆ సంవత్సరారంభంలో కాదని తెలిపే ఆవిష్కరణే ఈ ఉద్యమానికి నాంది. 457 శరత్కాలం నుంచి లెక్క మొదలు పెడితే 2300 దినాలు 1844 శరత్కాలంలో సమాప్తం కానున్నాయి.GCTel 372.3

    “ఆలయ పవిత్రత” సూచించే ఘటన శరత్కాలంలో సంభవిస్తుందని పాత నిబంధనలోని ముంగురుల ఆధారంగా రూపొందిన వాదనలు కూడా తెలుపుతున్నాయి. క్రీస్తు మొదటిరాకకు సంబంధించిన ముంగుర్తులు ఎలా నెరవేరాయో పరిశీలించినప్పుడు ఇవి సులువుగా అవగతమయ్యా యి. పస్కా గొర్రెపిల్లను వధించటం క్రీస్తు మరణానికి ముంగుర్తు. పౌలు ఈ రీతిగా అంటున్నాడు, “క్రీస్తు అను పస్కాపశువు వధింపబడెను.” 1కొరింథి 5:7. పస్కా సమయంలో మొదటి పంటలో ఒక పనను ప్రభువుసన్నిధిని అల్లాడించటం క్రీస్తు పునరుత్థానానికి ముంగురు. ప్రభువు పునరుత్థానం గురించి ఆయన ప్రజల పునరుత్థానం గురించి ప్రస్తావిస్తూ పౌలిలా అంటున్నాడు, “ప్రథమఫలముగా క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు” 1కొరింథి 15:23. పండిన ధాన్యాన్ని కోతకు ముందు కూర్చి అల్లాడించే పనమాదిరిగా రక్షణ పొందే ప్రజలనే అమరమైన పంటలో క్రీస్తు ప్రథమ ఫలం, రక్షణ అందుకొనే వారు భవిష్యత్తులో సంభవించనున్న, పునరుత్థానంలో దేవుని రాజ్యంలో నివసించేందుకు పోగుచేయ బడతారు.GCTel 372.4

    ఈ ఛాయారూపకాలు సంఘటన పరంగానేగాక కాలం పరంగానూ నెరవేరాయి. పదిహేను శతాబ్దాలపాటు యూదుల మొదటి నెల పద్నాలుగో రోజున పస్కా పశువుసు వధించటం జరుగుతూ వచ్చింది. ఆ దినాన క్రీస్తు తన శిష్యులతో పస్కాను భుజించిన అనంతరం ‘’లోక పాపమును మోసికొనుపోవు దేవుని గొర్రెపిల్ల” మరణాన్ని జ్ఞాపకం చేసే భోజన సంస్కారాన్ని స్థాపించాడు. అదే రాత్రి సిలువ వేసి చంపటానికి దుష్టులు ఆయనను తీసుకొని పోయారు. అల్లాడించే పనకు నిజ స్వరూపమైన మన ప్రభువు ప్రధమ ఫలముగా” మూడోనాడు మృతులలో నుంచి లేచాడు. పునరుత్థానులు కానున్న నీతిమంతులకు ఆయన పునరుత్థానం మాదిరి. “ఆయన వారి దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా” మార్చుతాడు. ఫిలిప్పీ 3:21GCTel 373.1

    అదే విధంగా రెండోరాకకు సంబంధించిన చిహ్నాలు ఛాయారూపక సేవలో నిర్దిష్ట కాలంలో నెరవేరాలి. మోషే వ్యవస్థలో ఆలయ శుద్ధీకరణ ప్రక్రియ లేదా ప్రాయశ్చితార్థ మహాదినం యూదుల ఏడోమాసం పదోరోజున జరిగేది. (లేవీకాడం 16:2934) ఆ దినాన ప్రధాసయాజకుడు ఇశ్రాయేలు ప్రజలందరికి ప్రాయశ్చిత్తంచేసి తద్వారా వారి పాపాలు గుడారం సుంచి తీసివేసిన తరువాత బైటికి వచ్చి ప్రజల్ని దీవించేవాడు. అలాగే మన ప్రధానయాజకుడైన క్రీస్తు పాపాన్ని, పాపుల్ని నిర్మూలించటం ద్వారా భూమిని పవిత్ర పర్చి, వేచి ఉన్న తన ప్రజలకు అమర్త్యతను ప్రసాదించటానికి లోకానికి వస్తాడని విశ్వాసుల నమ్మిక. 1844 లో ఏడోనెల పదోదినం ఆలయ శుద్ధీకరణ జరిగే ప్రాయశ్చితార్ధ మహాదినం అక్టోబరు 22 న వచ్చింది. అది ప్రభువు వస్తాడని కనిపెడున్న సమయం. 2300 దినాలు శరత్కాలంలో అంతమొందుతాయంటూ అప్పటికే సవుకూర్చిన రుజువులతో ఇది ఏకీ భవిస్తున్నది. ఈ అభిప్రాయం బలాన్ని సంతరించుకొన్నది.GCTel 373.2

    మత్తయి 25 లోని ఉపమానంలో కనిపెడూ కునికి నిద్రించిన సమయంలో పెండ్లి కుమారుడు రావటం జరిగింది. ప్రవచనం ఛాయరూపం ఆధారంగా సమర్పించిన వాదనలకు ఇది అనుకూలంగా ఉన్నది. అవి యధారమనటానికి వీటిలో ఎంతో బలముంది. వేలాది విశ్వాసులు “అర్ధరాత్రి కేక’ను ప్రచారం చేశారు.GCTel 373.3

    ఈ ఉద్యమం ఉప్పెనవలె దేశమంతటా వ్యాపించింది. నగరాలకు గ్రామాలకు మారుమూల ప్రదేశాలకు ఉద్యమం వ్యాపించింది. వేచి ఉన్న దైవ ప్రజలు నిద్రలేచారు. ఉదయిస్తున్న సూర్యుడి ముందు పొగమంచు మాయమైనట్లు ఆగమన ప్రకటనతో మతమౌఢ్యం అదృశ్యమయ్యింది. విశ్వాసుల సందేహాలు ఆందోళనలు తొలగి పోయాయి. నిరీక్షణ ఉత్సాహం వారి హృదయాల్ని ఉత్తేజపర్చాయి. దేవుని వాక్యం దేవుని ఆత్మ నియంత్రణ ప్రభావం లేనప్పుడు తప్పకుండా చోటుచేసుకొనే మానవ ఆవేశం, ఉద్రేకం ఆ సేవలో లేవు. దైవసేవకులు అందించిన గద్దింపు వర్తమానాల తర్వాత పూర్వం ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపం చెంది వినయ మనసుతో ప్రభువు చెంతకు వచ్చిన లాంటిది అది. ప్రతీ యుగంలోను దేవుని సేవను సూచించే చిహ్నాలు దానిలో ఉన్నాయి. అందులో ఏమంత ఉద్రేకం ఉత్సాహం లేవు. ఆత్మ పరీక్ష, పాపం ఒప్పుకోలు, లోకభోగాల విసర్జన ప్రస్పుటంగా కనిపించాయి. హృదయ వేదనతో కునారిల్లుతున్న విశ్వాసులు ప్రభువును కలుసుకోటానికి సిద్ధబాటులో తలమునకలై ఉన్నారు. ఎక్కడ చూసిన మెలకువగా ఉండి ప్రార్ధించటం, ప్రజలు తమ్మును తాము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం కనిపించింది.GCTel 374.1

    ఆ పరిచర్యను వివరిస్తూ మిల్లర్ ఇలా అన్నాడు, “ఆ విషయమై పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు కనిపించలేదు. భవిష్యత్తుకు వాటిని అట్టిపెట్టుకున్నారు ప్రజలు. చెప్పశక్యంకాని ఆనందాన్ని మహిమను అనుభవించే సమయం వరకు పరలోకం భూలోకం కలిపి దాచుకొన్నారు. కేకలులేవు. వాటిని కూడా పరలోకం నుంచి వచ్చే శబ్దం వినిపించే సమయం వరకు అట్టిపెట్టుకొన్నారు... అభిప్రాయ బేధాలులేవు. వారందరిదీ ఒకేమాట ఒకే బాట. ” బ్లిస్, పుటలు 270,271.GCTel 374.2

    ఆ ఉద్యమంలో పాలుపొందిన మరోవ్యక్తి ఈ సాక్ష్యం ఇచ్చాడు. “దాని ఫలితంగా ప్రతీచోట ఆత్మ పరిశోధన, దేవుని ముందు దీనత్వాన్ని మేలిబుచ్చటం కనిపించాయి. లోక వ్యా మోహాన్ని విసర్జించటం నినాదాలకు వివాదాలకు విద్వేషాలకు స్వస్తి పలకటం, పొరపాట్లు ఒప్పుకొని సరిచేసుకోవటం, దైవ సన్నిధిలో విలపించటం, క్షమాభిక్షకుGCTel 374.3

    దైవాంగీకారానికి పరితప్త హృదయంతో విరిగినలిగిన మనసుతో విజ్ఞాసన చేయటం ముమ్మగమయ్యాయి. ముందెన్నడూ జరగని విధంగా ఆత్మనూన్యతకు ఆత్మ త్యాగానికి అది నడిపించింది. దేవుని మహాదినం వచ్చేటప్పుడు యోవేలు ప్రవక్త పరిముఖంగా దేవుడు ఆదేశించినట్లు, బట్టలు చింపుకోటానికిగాక హృదయాలు చింపుకోటానికి, ఉపవాసంతో కన్నీళ్ళతో దుఃఖంతో ప్రభువు తట్టుకు తిరగటానికి అది దారితీసింది. జెకర్యా ప్రవక్త పరిముఖంగా దేవుడు పలికినట్లు, దైవప్రజలు కృపా స్వభావాన్ని, విజ్ఞాపన స్పూర్తిని పొందారు. తాము గాయపర్చిన ఆ ప్రభువును వారు వీక్షించారు. దేశంలో గొప్ప సంతాపం చోటుచేసుకొన్నది... ప్రభువు రాకకు ఎదురుచూస్తున్న ప్రజలు ఆయనGCTel 374.4

    ముందు దుఃఖించి ప్రలాపించారు. ”- బ్లిస్, ఇన్ ఎడ్వెంట్ షీల్డ్ అండ్ రివ్వూ సం 1, పుట 271 (జనవరి 1845).GCTel 375.1

    అపోస్తలుల దినాలనుంచి చరిత్రలో చోటు చేసుకొన్న మతపరమైన ఉద్యమాలన్నిటిలోనూ మానవ బలహీనతలకుగాని, సాతాను కుతంత్రాలకుగాని తావులేని ఉద్యమం 1844 శరత్కాలంలో జరిగిన ఉద్యమం ఒక్కటే. అనేక సంవత్సరాలు గతించినా ఇప్పటికీ ఆ ఉద్యమంలో పాల్గొన్నవారు, సత్యవేదికపై స్థిరంగా నిలిచిన వారూ ఆ ఉద్యమం పరిశుద్ధ ప్రభావం గురించి సాక్ష్యమిస్తూ అది దేవుని వలన కలిగినదని గంటా కంఠంగా చెబుతున్నారు.GCTel 375.2

    “ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి” అన్న పిలుపు రావటంతో వేచివున్న వారు “లేచి తమ దివిటీలను చక్కబరచిరి”. అపూర్వ శ్రద్ధాసక్తులతో దైవ వాక్యాన్ని అధ్యయనం చేశారు. నిరాశతో కుంగిపోతున్న వారిని ఉత్సాహపర్చి ఆ వర్తమానాన్ని అంగీకరించటానికి సన్నద్ధం చేయటానికి పరలోకం నుంచి దేవదూతలు వచ్చారు. అది మానవ వివేకం ప్రతిభ వలన గాక దేవుని శక్తివలన కలిగిన కార్యం . ఆ పిలుపును మొట్టమొదటగా విని అనుకూలంగా స్పందించినవారు ప్రజ ప్రతిభలు గలవారుకారు. అతి దీనులు దైవభక్తిగల వారు. రైతులు, పండిన పొలాలు విడిచిపెట్టారు. మెకానిక్కులు తమ పనిముట్లు విడిచిపెట్టారు. వారంతా ప్రజలకు హెచ్చరికను అందించటానికి బిరబిరా వెళ్లారు. క్రితం ఈ సేవలో ముందున్న వారు ఈ ఉద్యమంలో చివరగా చేరారు. సంఘాలు సామాన్యంగా ఈ వర్తమానానికి తలుపులు మూసివేశాయి. వర్తమానాన్ని అంగీకరించిన సభ్యులు ఆ సంఘాల నుంచి వేరైపోయారు. దైవ సంకల్పం ప్రకారం ఆగమన వర్తమానం రెండోదూత వర్తమానంతో ఏకమై ఆ పరిచర్యను బలోపేతం చేసింది.GCTel 375.3

    లేఖన నిదర్శనం విస్పష్టంగాను కరాఖండిగాను ఉన్నా- ఇదిగో పెండ్లి కుమా రుడు” అన్న పిలుపు వాదనకు దిగాల్సిన విషయంకాదు. దానిలో కదలించే శక్తి ఉన్నది. అది ఆత్మను చలింపచేసింది. అందులో సందేహంగాని ప్రశ్నించటం గాని లేవు. విజయుడైన క్రీస్తు యెరూషలేములో ప్రవేశించినప్పుడు పండుగను ఆచరించటానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఒలీవా కొండవద్ద గుమిగూడారు. యేసును వెంబడిస్తున్న జనసమూహంతో వారు కలిసి వెళ్తుండగా అనేకులు వారి ఉత్సాహంలో పాలుపంచుకొని వారితో శ్రుతి కలిపి “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక” అని కేకలు వేశారు. మత్తయి 21:9. అలాగే ఆగమన వాదుల సమావేశాలకు హాజరైన అవిశ్వాసులు- చోద్యం చూడటానికి కొందరు, ఎగతాళి చేయటానికి కొందరు - ఇదిగో “పెండ్లికుమారుడు” అన్న వర్తమానంలోని శక్తిని గుర్తించారు.GCTel 375.4

    ఆ సమయంలో ప్రార్ధనకు సమాధానం పొందే విశ్వాసం ఉన్నది. ప్రతిఫలంగా కలిగే గొప్ప బహుమానాన్ని లక్షించిన విశ్వాసం అది. ఎండిన నేలపై కురిసే వర్షంలా చిత్తశుద్ధితో సత్యాన్ని వెదకే విశ్వాసులపైకి కృపాసంపూర్ణుడైన ఆత్మ దిగివచ్చాడు. క్రీస్తును ముఖాముఖి కలిసి ఆయనతో త్వరలో ఉంటామని భావించిన వారు అమితానంద భరితులయ్యారు. నమ్మకమైన విశ్వాసుల మీద దేవుని దీవెనలు పడగా సున్నితమైన పరిశుద్ధాత్మ శక్తి హృదయాల్ని కరిగించింది.GCTel 376.1

    వర్తమానాన్ని అంగీకరించిన వారు ప్రభువును కలుసుకొంటామని నిరీక్షించిన సమయానికి జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చారు. తమను దేవుడు అంగీకరించాడన్న నిదర్శనాన్ని పొందటం తమ ప్రథమ కర్తవ్యమని ప్రతీ ఉదయం వారు తలంచేవారు. ఏకమనసుతో వారు ఒకరికోసం ఒకరు ప్రార్ధించటంలో ఎక్కువ సమయం గడిపారు. తరచు నిర్జన ప్రదేశాల్లో కూడుకొని ప్రార్ధన చేసేవారు. పంటపొలాల్లోనుంచి, చెట్ల తోపుల్లో నుంచి విజ్ఞాపన ప్రార్ధనలు పరలోకానికి ఎగసేవి. అనుదిన ఆహారం కన్నా రక్షకుని ఆమోదం వారికి ముఖ్యమయ్యింది. ఒకనల్లని మేఘం వారి మనసును మసకబార్చితే అది తొలగిపోయేవరకు వారు విశ్రమించలేదు. క్షమించే కృపను అనుభవించే కొద్దీ తమ ఆత్మలు అమితంగా ప్రేమించే ఆ ప్రభువుని తిలకించాలని ఉవ్విళ్లూరాయి.GCTel 376.2

    అయితే మళ్లీ ఆశాభంగం వాళ్లముందుంది. కనిపెట్టిన సమయం దాటిపోయింది. రక్షకుడు రాలేదు. అచంచల విశ్వాసంతో ప్రభువు రాకకోసం ఎదురుచూశారు. రక్షకుని సమాధి వద్దకు వెళ్ళి సమాధి ఖాళీగా ఉండటం చూసినప్పుడు “నా ప్రభువును ఎవరో ఎత్తికొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు” అంటూ కుప్పకూలిన మరియమల్లే ఇప్పుడు వారు నిరాశచెందారు. యోహాను 20:13.GCTel 376.3

    ఒకలాంటి భయం- ఆ వర్తమానం నిజం కావచ్చునన్న భయం అవిశ్వాసుల్ని కొంతకాలం అదుపుచేయటానికి తోడ్పడింది. ఆ సమయం దాటిపోయాక అది తక్షణమే మాయమవ్వలేదు. ఆశాభంగానికి గురి అయిన వారిపై విజయభేరి మోగించటానికి వారికి ధైర్యం చాలలేదు. కాగా దేవుని ఆగ్రహ సూచనలు ఎక్కడా కనిపించకపోవడంతో ధైర్యం తెచ్చుకొని వారిని నిందించటం అపహసించటం మొదలుపెట్టారు. ప్రభువు త్వరలో వస్తాడని విశ్వసించిన ఒక పెద్ద వర్గానికి చెందిన ప్రజలు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టుకొన్నారు. గొప్ప నమ్మకంతో ఉన్న కొందరైతే తీవ్ర మానసిక క్షోభకు గురి అయి లోకంనుంచి పారిపోవాలనుకొన్నారు. యోనామల్లే దేవుని గురించి ఫిర్యాదు చేశారు. జీవించటం కన్నా మరణించటం మేలనుకొన్నారు. దేవుని వాక్యం మీద గాక మనుషుల అభిప్రాయాలమీద విశ్వాసముంచిన వారు తమ అభిప్రాయాలను మళ్లీ మార్చుకోటానికి సిద్ధంగా ఉన్నారు. అపహాసకులు బలహీనుల్ని పిరికివారిని తమ తట్టు తిప్పుకొన్నారు. వీరంతా ఏకమై ఇక ఎలాంటి భయాలు ఎలాంటి నిరీక్షణలు ఉండవని ప్రకటించారు. సమయం దాటిపోయింది. ప్రభువు రాలేదు. వేవేల సంవత్సరాలు ప్రపంచం ఇలాగే కొనసాగవచ్చు అన్నారు.GCTel 376.4

    నిజాయితీ పరులు యధార్థ విశ్వాసులు క్రీస్తు నిమిత్తం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. ప్రభువు సముఖాన్ని మరెక్కువ పంచుకొన్నారు. తాము భావించిన రీతిగా లోకానికి తుది హెచ్చరికను ప్రకటించారు. కొద్ది కాలంలోనే రక్షకునితోను దూతలతోను ఉంటామన్న ఆశాభావంతో ఆగమన వర్తమానాన్ని అంగీకరించని వారి సహవాసం నుంచి చాలా మట్టుకు దూరంగా ఉన్నారు. “ప్రభువైన యేసూ రా, త్వరగా రా” అంటూ గాఢమైన ఆకాంక్షతో ప్రార్థించారు. కాని ఆయన రాలేదు. ఇప్పుడు మళ్లీ జీవిత సమస్యలు ఆందోళనలతో సతమతమౌతూ అపహాసకుల ఎగతాళిని నిందలను భరిస్తూ నివసించటం విశ్వాసానికి సహనానికీ పెద్ద పరీక్షే.GCTel 377.1

    ఏది ఏమైనా, ఈ ఆశాభంగం యేసు మొదటిరాక సమయాన శిష్యులు అనుభవించిన ఆశాభంగంమంత ఘోరమైంది కాదు. విజయుడైన యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్టించి ఇశ్రాయేలీయుల దేశాన్ని తన శత్రువుల చేతి నుంచి రక్షిస్తాడని శిష్యులు భావించారు. తమ రాజైన యేసు పట్ల తమ గౌరవాన్ని ప్రదర్శించటంలో వారు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. అనేకమంది ఆయన నడిచే మార్గంలో తమపై వస్త్రాలు పరిచారు. లేదా అంజూరపు మట్టలు వెద జల్లారు. పెల్లుబుకుతున్న ఆనందంతో “దావీదుకుమారునికి జయము” అని కేకలు వేశారు. వెల్లువెత్తుతున్న ఆనందోత్సాహాలను చూసి కోపంతో నిండిన పరిసయ్యులు యేసు తన శిష్యుల్ని గద్దించాలని కోరినప్పుడు ఆయన ఈ సమాధానం ఇచ్చాడు, “మీరు ఊరకుండిన యెడల ఈ రాళ్లు కేకలు వేయును” లూకా 19:40. ప్రవచనం నెరవేరాలి. శిష్యులు దైవ సంకల్పాన్ని నెరవేర్చుతున్నారు. అయినా వారికి దుర్బర ఆశాభంగం తప్పదు. కొద్ది దినాలకే వారు రక్షకుని బాధాకరమైన మరణాన్ని సమాధినీ తిలకించారు. ఒక్క సందర్భంలో కూడా వారనుకొన్నది నెరవేరలేదు. వారి నిరీక్షణలు ఊహాగానాలు యేసుతోనే సమసిపోయాయి. ప్రభువు సమాధి నుంచి విజయుడై వచ్చేంతవరకు ప్రవచనంలో ముందే చెప్పిన ప్రకారం సమస్తం నెరవేరిందని, “క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు” (అ.కా. 17:3) వారు గ్రహించలేక పోయారు.GCTel 377.2

    అయిదువందల సంవత్సరాలు ముందు జెకర్యా ప్రవక్త ముఖంగా ప్రభువు ఈ విధంగా పలికాడు, “సీయోను వాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీసుడునై, గాడిదను, గాడిదపిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.” జెకర్యా 9:9. క్రీస్తు తీర్పును మరణాన్ని పొందబోతున్నట్లు శిష్యులు గుర్తించి ఉంటే వారు ఈ ప్రవచనాన్ని నెరవేర్చ గలిగేవారు కాదు.GCTel 378.1

    ఆ విధంగానే మిల్లర్ ఆయన సహచరులు ప్రవచనం నెరవేర్చి, వారు లోకానికి అందిచాల్సిందని ప్రవచనం చెప్పిన వర్తమానాన్ని అందించారు. అయితే వారు తమ ఆశాభంగానికి సంభంధించిన ప్రవచనాల్ని పూర్తిగా గ్రహించగలిగివుంటే, ప్రభువు రాకకు ముందు లోకంలోని ప్రజలకు ప్రకటించేందుకు మరో వరమానం అందించాలని గ్రహించివుంటే, దాన్ని వారు అందించ గలిగేవారుకాదు. మొదటి దూత రెండో దూత వర్తమానాలు సరియైన సమయంలో ప్రకటితమై దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని పూర్తి చేశాయి.GCTel 378.2

    లోకం చూస్తూ ఉన్నది. సమయం దాటిపోయి క్రీస్తు రాకపోతే రాకను గూర్చిన వ్యవస్థయావత్తు కుప్పకూలుతుందని కనిపెడున్నది. పలువురు బలమైన శోధనకు లొంగి తమ విశ్వాసాన్ని వదులుకోగా స్థిరంగా నిలిచిన వారుకొందరున్నారు. ఆగమన ఉద్యమ ఫలాలు, సాత్విక స్వభావం, హృదయ పరిశోధన, లోకాశల పరిత్యాగం, మారిన జీవితం, ఆ ఉద్యమం దేవుని మూలంగా కలిగిందనటానికి ఈ ఫలితాలే ప్రబల సాక్ష్యం . రెండోరాక వర్తమాన ప్రకటన పరిశుద్ధాత్మ శక్తితో సాగిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ప్రవచన కాలాల నిర్దేశంలో వారికి ఏదోషమూ కనిపించలేదు. వారి ప్రవచన విశదీకరణ పద్ధతిని తమ ప్రత్యర్థులలో మిక్కిలి ప్రతిభావంతులు కూడ తోసిపుచ్చలేకపోయారు. దేవుని ఆత్మచైతన్య పర్చగా సజీవమైన ఆత్మశక్తితో నిండిన భక్తులు ప్రార్ధన పూర్వకంగా సల్సిన లేఖన అధ్యయనాన్ని బైబిలు నిదర్శనం లేకుండా త్యజించటానికి వారు అంగీకరించ లేదు. లేఖనాధ్యయనం ద్వారా వారు అంగీకరించిన సత్యాలు తీవ్ర విమర్శల్ని తట్టుకొన్నాయి. ప్రసిద్ధ మతబోధకులు లోక జ్ఞానుల తీవ్ర వ్యతిరేకతను ప్రతిఘటించాయి. విజ్ఞానమూ వాక్చాతుర్యమూ కలిసి చేసిన దాడిని తిప్పికొట్టాయి. అధికులు అధముల దూషణల మధ్య స్థిరంగా నిలిచాయి.GCTel 378.3

    ఎదురుచూసిన సంఘటన సందర్భంగా వైఫల్యం ఎదురైన మాట నిజమే. ఇది సైతం దేవుని వాక్యంపై వారి విశ్వాసాన్ని సడలించలేకపోయింది. నలభై దినాల్లో ఆపట్టణం నాశనం కానున్నదని నినివే పట్టణ వీధులలో యోనా ప్రకటించినప్పుడు నినివే ప్రజలు ప్రదర్శించిన మారుమనస్సును దేవుడు అంగీకరించి వారి కృపకాలాన్ని, పొడిగించాడు. అయినప్పటికీ యోనా ప్రకటించిన వర్తమానం దేవుడిచ్చిందే. నినివే పట్టణాన్ని దేవుడు పరీక్షించాడు. ఆ రీతిగానే తీర్పు గురించి లోకాన్ని హెచ్చరించటానికి దేవుడు తమను నడిపించాడని ఆగమన వాదులు నమ్మారు. “దాన్ని విన్న వారి హృదయాల్ని పరీక్షించి ప్రభువు రాకకోసం ప్రగాఢ వాంఛను అది మేల్కొలిపింది. లేదా ఆయన రాక పట్ల ద్వేషాన్ని పుట్టించింది. స్పష్టంగా కనిపించకపోయినా అది దేవునికి మాత్రం తెలుసు. అది ఒక హద్దును ఏర్పాటు చేసింది. దాని ప్రకారం ఎవరైతే తమ హృదయాలు పరీక్షించుకొంటారో వారు ప్రభువు వచ్చివుంటే ఏ పక్కవుండేవారో తెలుసుకోవచ్చు. (“ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు. మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే అని ఆనందపడ్డారో లేదా సింహాసనాసీనుడైన ఆయన ముఖ ప్రకాశత నుంచి గొర్రెపిల్ల ఆగ్రహం నుంచి తమను మరుగుపర్చటానికి గాను శిలలు పర్వతాలు తమపై పడవలసిందిగా కోర్తారో వారే తెలుసుకోవచ్చు. మనకు తెలిసిన విధంగా దేవుడిలా తన ప్రజల విశ్వాసాన్ని పరీక్షించాడు. వారికి దేవుడు నియమించిన బాధ్యతలలో కష్టకాలంలో కొనసాగుతారో లేక వాటి నుంచి వెనుదిరుగుతారో ఈ లోకాన్ని త్యజించి దేవుని వాక్యంపై అచంచల విశ్వాసంతో ఆధారపడ్డారో అని వారిని పరీక్షించి చూశాడు” అని ఆగమస వాదులు ప్రకటించారు. - ది ఎడ్వంటిస్ట్ హెరాల్డ్ అండ్ సయన్స్ ఆఫ్ ది టైమ్స్ రిపోర్టర్, సం 8, నం. 14 (నవంబరు 13, 1844)GCTel 379.1

    గతంలో తమకు వచ్చిన అనుభవాల్లో తమను దేవుడు నడిపించాడని ఇంకా నమ్ముతున్న ప్రజల మనోభావాలు విలియమ్ మిల్లర్ అన్న ఈ మాటల్లో వ్యక్తమవుతున్నాయి. “దేవుని విషయంలోను మానవుడి విషయంలోను యధార్ధంగా ఉండేందుకు అప్పుడున్న నిదర్శనమే ఇపుడూ ఉండి మళ్లీ నా జీవితాన్ని తిరిగి జీవించటం సాధ్యపడితే అప్పుడెలా జీవించానో ఇప్పుడూ అలాగే జీవిస్తాను” (ఆత్మల రక్తం అంటిన నా దుస్తుల్ని శుభ్రం చేసుకొన్నానను కొంటున్నాను. “వారి శిక్ష విధింపులో నా అపరాధాన్ని నా శక్తి మేరకు సరిచేసుకొన్నాను.” భక్తుడు మిల్లర్ ఇలా అంటున్నాడు. “రెండుమార్లు ఆశాభంగానికి గురి అయినా నేను నిస్పృహ చెందలేదు, అధైర్యపడలేదు. క్రీస్తురాక విషయంలో నా కింకా బలమైన ఆశాభావం ఉంది. సంవత్సరాల పరిగణన అనంతరం నాపవిత్ర కర్తవ్యమని నేను పరిగణించిన దాన్నే చేశాను. నావల్ల పొరపాటు జరిగితే అది ఔదార్యం పక్షంగా, నాతోటి మనుషుల పట్ల ప్రేమ పక్షంగా, దేవుని పట్ల నా విహిత కర్తవ్యమన్న నమ్మకం పక్షంగా జరిగిన పొరపాటే”. “ఒకటి మాత్రం నాకు తెలుసు. నేను నమ్మిన దానినే బోధించాను. మరి దేవుడు నాతో ఉన్నాడు. నా పరిచర్యలో ఆయన మహాశక్తి ప్రదర్శితమయ్యింది. ఫలితంగా ఎంతో మేలు జరిగింది” “అప్పటి బోధ ఫలితంగా వేలకొలది ప్రజలు లేఖనాల్ని అధ్యయనం చేశారు. ఆ విధంగా విశ్వాసం ద్వారాను, క్రీస్తు రక్తం ద్వారాను పలువురు దేవునితో సమాధాన పడ్డారు.” బ్లిస్, పుటలు 256,255,277,280,281. “నేను అహంకారుల చిరునవ్వుల్ని ఎన్నడూ ఆశించలేదు. లోకం ఆగ్రహించినప్పుడు జంకలేదు. ఇప్పుడు వారి ప్రాపకానికి పాకులాడను. నా విధిని దాటి ప్రవర్తించి వారి ద్వేషాన్ని కొని తెచ్చుకోను. నా ప్రాణాల కోసం వారిని ప్రాధేయపడను. తన సంకల్పం చొప్పున దేవుడు కోరితే ప్రాణాలు కోల్పోటానికి వెనుకాడను” - జె. వైట్, లైఫ్ ఆఫ్ విల్యమ్ మిల్లర్, పుట 315.GCTel 380.1

    దేవుడు తన ప్రజల్ని విడనాడలేదు. తమకు వచ్చిన వెలుగును అనాలోచితంగా తృణీకరించి ఆగమన ఉద్యమాన్ని ఖండించని ప్రజలతో పరిశుద్ధాత్మ ఇంకా వున్నాడు. ఈ క్లిష్ట సమయంలో పరీక్షకు గురి అయి వేచి ఉన్న వారికి ఉద్రేకాన్ని హెచ్చరికను అందించే ఈ మాటలు హెబ్రీయులకు రాసిన పత్రికలో వున్నాయి, “కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై వాగ్దానము పొందునిమిత్తము మీకు ఓరిమి అవసర మైయున్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును. నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించునుగాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మ సంతోషపడదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.” హెబ్రీ 10:35-39.GCTel 380.2

    ప్రభువు రాక సామీప్యాన్ని సూచిస్తున్న మాటలను బట్టి ఈ హెచ్చరిక చివరిదినాల సంఘానికి ఉద్దేశించినదని స్పష్టమౌతున్నది, “ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును.” ఆలస్యము ఉన్నట్లు, ప్రభువు ఆలస్యం చేస్తున్నట్లు ఈ మాటను బట్టి అర్ధమౌతున్నది. ఇక్కడున్న ఉపదేశం ప్రత్యేకించి ఈ సమయంలో ఆగమన వాదుల అనుభవానికి అనుకూలంగా ఏర్పాటయ్యింది. ఈ ప్రజలు తమ విశ్వాసాన్ని పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ మార్గ దర్శకత్వాన్ని దైవ వాక్యాన్ని అనుసరించటంలో ఈ ప్రజలు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అయినా తమ గతానుభవంలో దేవుని ఉద్దేశం ఏమిటో వారు గ్రహించలేకపోయారు. తమ ముందున్న మార్గాన్ని కూడా వారు గ్రహించలేకపోయారు. దేవుడు నిజంగా తమను నడిపిస్తున్నాడా అన్న సందేహానికి తావిచ్చారు. ఈ మాటలు ఈ సమయానికి వర్తిస్తున్నాయి, “నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును”. “అర్ధరాత్రి కేక” ప్రచండకాంతి వారి మార్గంలో ప్రకాశించగా ప్రపచనాల ముద్రలు విడిపోవటంతోను వేగంగా నెరవేరున్న గుర్తులు క్రీస్తురాక సమీపంగా ఉన్నదని తెలపటంతోను వారు కంటిచూపును బట్టి నడిచారని చెప్పాలి. ఇకపోతే ఆశాభంగంతో కుప్పకూలిన వారు దేవుని మీద ఆయన వాక్యం మీద విశ్వాసాన్ని పెంచుకొని దానిమీదే నిలవగలిగారు. లోకులు వారిని ఇలా అపహసించారు. తిరిగి “మీరు మోసపోయారు. మీ నమ్మకాన్ని మానుకొని ఆగమన ఉద్యమం సాతాను సంబంధమైనదని ఒప్పుకోండి”. అయితే వాక్యం చెబుతున్న మాటలు ఇవి, “అతడు వెనుక తీసిన యెడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు”. వారు ఇప్పుడు తమ విశ్వాసాన్ని త్యజించి ఆ వర్తమానాన్ని ఆవేశపర్చిన ఆత్మను ఉపేక్షించటం వెనుక ఉన్న నాశనం వైపు సాగటమే అవుతుంది. (“కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతి ఫలముగా గొప్ప బహుమానము కలుగును”. “మీకు ఓరిమి అవసరమైయున్నది. “. “ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది. వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును” తాము దేవుని వలన పొందిన వెలుగును ప్రేమించి ఆయన వాగ్దానాన్ని విశ్వసిస్తూ లేఖనాల్ని పరిశోధిస్తూ అదనపు వెలుగుకోసం ఓపికతో కనిపెట్టడమే వారికి క్షేమం.GCTel 381.1