Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 36—సమీపిస్తున్న సంఘర్షణ

    పరలోకంలోని మహా సంఘర్షణ ఆరంభం నుంచి దేవుని ధర్మశాస్త్రాన్ని కూలదోయాలన్నదే సాతాను ఉద్దేశం. దీన్ని సాధించటానికే సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంబించాడు. పరలోకం నుంచి బహిష్కృతుడైనా అదే సంఘర్షణను భూమిమీద కొనసాగిస్తున్నాడు. మనుషుల్ని వంచించి దైవధర్మశాస్త్రం అతిక్రమించటానికి వారిని నడిపించటమే అతని ధ్యేయం. దాన్ని అతను నమ్మకంగా అనుసరిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని సొంతంగా తోసిపుచ్చినా లేదా అందులోని ఒక సూత్రాన్ని తోసిపుచ్చినా చివరికి ఫలితం ఒక్కటే. ఎవరైన “ఒక ఆజ్ఞ విషయంలో, తప్పిపోతే అతను ధర్మశాస్త్రమంతటి విషయంలోను ధిక్కార స్వభావం కనపర్చినట్లే. అతను ధర్మశాస్త్రమంతటి విషయంలోను “అపరాధి” అవుతాడు. యాకోబు 2:10.GCTel 549.1

    దైవ నిబంధనల పట్ల ధిక్కార స్వభావాన్ని కలుగజేసే కృషిలో సాతాను బైబిలు సిద్ధాంతాలను వక్రీకరించాడు. లేఖనాల్ని విశ్వసిస్తున్నామని చెప్పుకొనేవారి విశ్వాసంలోకి తప్పుడు అభిప్రాయాలు ఇలా ప్రవేశించాయి. సత్యం అసత్యం మధ్య జరిగే సుదీర్ఘ సంఘర్షణలో చివరి పోరాటం దైవ ధర్మశాస్త్రంపై జరుగుతుంది. ఈ పోరాటం మానవ చట్టాలకు యెహోవా విధులకు, బైబిలు మతానికి కట్టుకథలు సంప్రదాయాలకు మధ్య జరిగే పోరాటం. ఈ పోరాటంలో మనం ప్రవేశిస్తున్నాం.GCTel 549.2

    ఈ పోరాటంలో సత్యానికి నీతికి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడే శక్తులు ఇప్పుడు చురుకుగా పని చేస్తున్నాయి. భక్తులు శ్రమలు భరించి రక్తం చిందించి వారసత్వంగా పొందిన దైవవాక్యం విలువను లెక్కచేయటంలేదు. బైబిలు అందరికి అందుబాటులో ఉంది. కాని తమ జీవిత మార్గదర్శిగా దాన్ని అంగీకరించేవారు తక్కువ మంది. లోకంలోనేగాక సంఘంలో కూడా అవిశ్వాసం పెచ్చుపెరుగుతున్నది. క్రైస్తవ విశ్వాస మూల సిద్ధాంతాలనే అనేకులు నమ్మటం లేదు. ఆవేశపూరిత రచయితలు అందిస్తున్న సృష్టి సత్యాల్ని మానవుడు పాపంలో పడటాన్ని ప్రాయశ్చిత్తాన్ని దైవ ధర్మశాస్త్ర నిత్యత్వాన్ని క్రైస్తవ లోకంలో క్రైస్తవులమని చెప్పుకొంటున్న వారిలో ఎక్కువ మంది తోసిపుచ్చుతున్నారు. మేధావులమని స్వతంత్రులమని గర్వంగా చెప్పుకొనే వేలాది మంది బైబిలుని విశ్వసించటం బలహీనతా చిహ్నమని భావిస్తున్నారు. లేఖనాల్ని తప్పుపట్టటం, ప్రాముఖ్యమైన బైబిలు సత్యాలకు అధ్యాత్మిక రూపమిచ్చి వాఖ్యానించటం ప్రతిభకు జ్ఞానానికి నిదర్శనమని వారి భావన. ఆజ్ఞలకు మార్పులు జరిగాయని లేదా అవి రద్దయ్యాయని అనేకమంది బోధకులు ప్రజలకు బోధిస్తున్నారు. అధ్యాపకులు తమ విద్యార్థులకు ఉపదేశమిస్తున్నారు. దాని సూత్రాలు ఇంకా ఆచరణీయాలని వాటిని విధిగా ఆచరించాలని భావించేవారిని ఎగతాళి చేసి ద్వేషిస్తున్నారు.GCTel 549.3

    సత్యాన్ని నిరాకరించటంలో మనుషులు దానినిచ్చిన దేవునినే నిరాకరిస్తున్నారు. దైవధర్మశాస్త్రాన్ని కాలరాయటం ద్వారా ధర్మశాస్త్రాన్నిచ్చిన దేవుని అధికారాన్నే వారు తోసిపుచ్చుతున్నారు. చెక్కను రాతిని విగ్రహాలుగా మలచటం ఎంత తేలికో సిద్ధాంతాల్ని సూత్రాల్ని విగ్రహాలు చేయటం అంతే తేలికయ్యింది. దేవుని గుణగణాల్ని తప్పుగా చిత్రించటం ద్వారా ఆయన శీలాన్ని తప్పుగా అర్ధం చేసుకొనేటట్లు సాతాను ప్రజల్ని నడిపిస్తున్నాడు. అనేకుల విషయాని కొచ్చేసరికి యెహోవా అంటే ఒక తాత్విక విగ్రహంగా చూస్తారు. పోతే తన వాక్యంలోను, క్రీస్తులోను, ఆయన సృష్టికార్యాల్లోను జీవంగల దేవుడుగా ప్రత్యక్షమైన ఆ ప్రభువును బహుకొద్ది మంది మాత్రమే ఆరాధిస్తారు. వేలాదిమంది ప్రకృతిని దేవుడని పూజిస్తారు. ప్రకృతి దేవుణ్ణి విస్మరిస్తారు. ఏలీయా రోజుల్లో ఇశ్రాయేలీయుల్లో విగ్రహారాధన ఉన్నట్లు నేడు క్రైస్తవ లోకంలో విగ్రహారాధన వేరే రూపంలో ఉంది. జ్ఞానులమని చెప్పుకొంటున్న అనేకమంది మేధావులకు తత్వవేత్తలకు, కవులకు, రాజకీయులకు, పాత్రికేయులకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు, కొన్ని వేదాంత విద్యాసంస్థలకు కూడా బయలుకన్నా కాస్త మెరుగైన ఫోనీషియా సూర్యదేవుడే దేవుడు.GCTel 550.1

    ఎక్కువగా ఆదరణ పొందుతున్న సిద్ధాంతం మానవులు ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సిన విధి లేదు అన్నది. దేవుని అధికారాన్ని, ధైర్యంగా దెబ్బతీస్తూ క్రైస్తవ ప్రపంచం ఆమోదం పొందుతున్న హేతువాదానికి విరుద్ధమైన ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తున్న ఘోరమైన తప్పు వంటిది మరొకటి లేదు. ప్రతీ దేశానికీ చట్టాలుంటాయి. వాటిని ఆ దేశ ప్రజలు గౌరవించి ఆచరిస్తారు. చట్టాలు లేకుండా ఏ ప్రభుత్వమూ కొనసాగలేదు. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త తాను సృజించిన ప్రజల్ని పాలించటానికి చట్టాలు లేకపోవటం అనూహ్యం. దేశ పాలనకు ప్రజాసంరక్షణకు ఉద్దేశించిన చట్టాలు ప్రజల స్వేచ్ఛను నియంత్రిస్తున్నందున వాటిని ప్రజలు అనుసరించాల్సిన విధిలేదని ప్రసిద్ధిగాంచిన బోధకులు ప్రబోధిస్తుంటే వారు ప్రసంగ వేదికలపై ఎంతకాలం పరిచర్యచేయ గలుగుతారు.? అన్ని ప్రభుత్వ చట్టాలకు పునాది అయిన దేవుని నియమాల్ని కాలికిందవేసి తొక్కటంకన్నా రాష్ట్రాలు దేశాల చట్టాల్ని అతిక్రమించటం పెద్ద తప్పా ?GCTel 550.2

    అపరాధుల్ని శిక్షించటానికి విశ్వపరిపాలకుడైన దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రద్దుచేసి చట్టాలకు విధేయులై నివసించే ప్రజలను సమర్ధించటానికి లోకానికి ఒక ప్రమాణం లేకుండా చేయటంకన్నా, దేశాలు తమతమ చట్టాల్ని రద్దుచేసి ప్రజల్ని తమ చిత్తానుసారంగా ప్రవర్తించ నీయటం ఎంతో మెరుగ్గా ఉంటుంది. దైవధర్మశాస్త్రాన్ని రద్దు పర్చటం వల్ల సంభవించే పరిణామాలు ఎలాగుంటాయో తెలుసా? ఈ ప్రయోగం చేసిచూశారు. స్టోన్స్ లో నాస్తికాధికారం అధికారం చేపట్టినప్పుడు భయంకర పరిణామాలు చోటుచేసుకొన్నాయి. దేవుడు విధించిన ఆంక్షలను తోసిపుచ్చటం అతికఠినమైన నిరంకుశ పాలకుల పరిపాలనను అంగీకరించటమే. ప్రజల నీతి ప్రమాణాన్ని పక్కన పెట్టినప్పుడు చీకటి ప్రభువు ఈ లోకంలో తన అధికారాన్ని స్థాపించటానికి మార్గం సరాళమయ్యింది.GCTel 551.1

    దైవ విధుల్ని తృణీకరించటం ఎక్కడ జరుగుతుందో అక్కడ పాపం పాపంగా కనిపించదు. నీతి వాంఛనీయ మనిపించదు. దైవ పరిపాలనకు ఎవరు తమ్ముతాము అప్పగించుకోరో వారు తమ్మును తాము అదుపుచేసుకోటానికి పూర్తిగా అసమర్దులవుతారు. వారి దుష్టబోధలవల్ల స్వాభావికంగా నియంత్రణ పట్ల అపహాసం కనపర్చే చిన్నారులలోను యువతలోను తిరుగుబాటు స్వభావం చోటుచేసుకొంటుంది. ఫలితంగా సమాజం చట్టరహితంగా విచ్చల విడిగా తయారవుతుంది. దేవుని ఆజ్ఞల్ని గైకొంటున్న వారు వెర్రి వెంగళాలని ఎగతాళి చేస్తూ జన సమూహాలు సాతాను మోసాలకు ఎర అవుతారు. శరీర క్రియలకు దాసులై అన్యుల మీదికి దేవుని తీర్పులు తెచ్చిన పాపాల్ని చేస్తూ పోతారు.GCTel 551.2

    దేవుని ఆజ్ఞల్ని చులకనగా చూడుమని ప్రజలకు బోధించే వారు అవిధేయత పంటకోయటానికి అవిధేయతను విత్తుతారు. దైవధర్మశాస్త్రం విధించే అదుపును పూర్తిగా ఉపసంహరించి వేస్తే కొద్ది కాలంలోనే మానవ చట్టాలకు విధేయత కొరవడుంది. అపనమ్మకపు కార్యాల్ని, దురాశను, అబద్దాల్ని, మోసాల్ని దేవుడు నిషేధిస్తున్నాడు. గనుక తమ లౌకిక పురోభివృద్ధికి దైవ నియమాలు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నట్లు భావించి వాటిని కాలరాయటానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. కాని ఈ సూత్రాల బహిష్కరణ ఫలితాలు వారు అనుకోని విధంగా ఉంటాయి. చట్ట విధేయత తప్పని సరి కాకపోతే అతిక్రమ భీతి ఎందుకు కలగాలి? ఆస్తికి భద్రత ఉండదు. మనుషులు పొరుగువారి ఆస్తుల్ని దౌర్జన్యంగా సొంతం చేసుకొంటారు. బలవంతుడే ధనవంతుడవుతాడు. ప్రాణానికి విలువ ఉండదు. పెండ్లి వాగ్దానం కుటుంబాన్ని పరిరక్షించే పవిత్ర దుర్గంగా ఇక ఎంతమాత్రమూ నిలువలేదు. బలమున్న వాడు కావాలనుకొంటే తన పొరుగున ఉన్న వ్యక్తి భార్యను బలవంతంగా తీసుకోవచ్చు. నాల్గో ఆజ్ఞతో పాటు అయిదో ఆజ్ఞను కూడా పక్కన పెట్టటం జరుగుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రాణాలు తీయటం వల్ల తమ హృదయ వాంఛలు తీరతాయంటే ఆ పని చేయటానికి వెనుకాడరు. నాగరిక ప్రపంచం దొంగలు హంతకుల దళంగా మారుతుంది. శాంతి, సమాధానం, విశ్రాంతి, ఆనందం ఇక లోకంలో ఉండవు.GCTel 552.1

    దేవుని ధర్మసూత్రాలకు మానవులు విధేయులు కానవసరం లేదన్న సిద్ధాంతం నైతిక విధిని బలహీనపర్చి దుర్నీతి ఉప్పెన ప్రపంచం మీద విరుచుకు పడేందుకు ఇప్పటికే వరద ద్వారాలు తెరచి ఉంచింది. అరాచకత్వం, విధ్వంసం, అవినీతి వరదవలె మన మీదికి వస్తున్నాయి. కుటుంబంలోనూ, సాతాను పని చేస్తున్నాడు. క్రైస్తవుల మని చెప్పుకొంటున్న వారి గృహాల్లో సైతం అతని పతాకం ఎగురుతున్నది. అసూయ, దురాలోచన, కపటవర్తన, వైమనస్యం, అనుకరణ, కలహం, పరిశుద్ధ విషయాల సందర్భంగా విద్రోహం, శరీర క్రియలు ప్రబలంగా వున్నాయి. సాంఘిక జీవితానికి పునాది ఆకారం కావలసిన మత సూత్రాలు సిద్ధాంతాల వ్యవస్థ యావత్తూ దడదడలాడుతూ పడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తమ నేరాలకు ఖైదుకు వెళ్లిన అతి నికృష్ట నేరగాళ్లు ఏవో గొప్ప కార్యాలు సాధించినట్లు తరచు పారితోషికాలు సత్కారాలు అందుకొంటారు. వారి ప్రవర్తనకు నేరాలకు గొప్ప ప్రచార విలువ నిస్తారు. పత్రికలు కూడా దుర్మార్హతకు సంబంధించిన జుగుప్సాకరమైన వివరాల్ని ప్రచురించి తద్వారా ఇతరులు మోసాలకు, దోపిడీలకు, హత్యలకు పాల్పడే టట్లు ప్రోత్సహిస్తున్నాయి. తన పథకాలు విజయవంత మవ్వటం చూసి సాతాను మురిసిపోతాడు. దుష్టత్వం పట్ల మోజు, కావాలని ప్రాణాలు తీసే తత్వం, పెరుగుతున్న మితరాహిత్యం , నానారకాల దుష్టత్వం - ఇవి దైవ భక్తుల్ని నిద్రలేపి, పొంగిపారుతున్న దుర్మార్గతకు అడ్డుకట్ట వేయటానికి చేయాల్సిందేమిటో ఆలోచింప చేయాలి.GCTel 552.2

    న్యాయస్థానాలకు అవినీతి చీడ పట్టింది. పరిపాలకులు ధనాపేక్షతో శరీరేచ్ఛలతో తపించిపోతున్నారు. హదులు రద్దయిన సుఖానుభవం వల్ల అనేకమంది మానసిక శక్తులు మసకబారాయి. వారు దాదాపు పూర్తిగా సాతాను అదుపులో ఉన్నారు. లంచాలు, మోసాలు, జూరీ సభ్యుల్ని వక్రమార్గాలు పట్టిస్తున్నాయి. తాగుడు, వినోదాలు, ఉద్రేకం ఈర్ష్య, నిజాయితీలేమి, న్యాయపరిపాలకుల్ని పట్టి పీడిస్తున్న రోగాలు. “న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. నీతి దూరమున నిలుచున్నది. సత్యము సంతవీధిలో పడి ఉన్నది, ధర్మం లోపల ప్రవేశింపనేరదు” యెషయా 59:14. GCTel 553.1

    రోమను సంఘ ఆధిపత్య కాలంలో పెచ్చరిల్లిన అధర్మం ఆధ్యాత్మికాంధకారం ఆ సంఘం లేఖనాల్ని అణచివేసినందువల్ల ఉత్పన్నమైన పరిణామాలే. అయితే మత స్వాతంత్ర్యమున్న యుగంలో సువార్త జ్యోతి దేదీప్యమానమైన వెలుగులో పురివిప్పిన అవిశ్వాసానికీ, దైవ ధర్మశాస్త్ర సూత్రాల నిరాకరణకు కారణం ఎక్కడ దొరుకుతుంది? లేఖనాల్ని తొక్కిపట్టి ఉంచటం ద్వారా లోకాన్ని ఇక ఎంత మాత్రం తన చేతిలో పెట్టుకోలేడు గనుక తన గురిని నెరవేర్చుకోటానికి అతను ఇతర సాధనాల్ని ఉపయోగించాలి. బైబిలు మీద విశ్వాసాన్ని నాశనం చేయటం ద్వారా తాను ఉద్దేశించింది సాధించటమేగాక బైబిలునే నాశనం చేయవచ్చు. దేవుని ఆజ్ఞల్ని అనుసరించనవసరం లేదన్న నమ్మకాన్ని ప్రచారం చేయటం ద్వారా బైబిలు గురించి ఏమీ తెలియని వారు వాటిని అతిక్రమించటానికి ఎంత కట్టుదిట్టంగా వారిని నడిపించగలడో అంత కట్టుదిట్టంగా వాటిని అతిక్రమించటానికి ప్రజల్ని నడిపిస్తాడు. గత యుగాలలో వలే ఇప్పుడూ తన కార్యాలు చక్కబెట్టుకోటానికి సంఘం ద్వారా పని చేస్తున్నాడు. నేటి మత సంస్థలు లేఖనాల్లో విపులంగా కనిపిస్తున్న అప్రియమైన సత్యాల్ని పరిశీలించటానికి నిరాకరిస్తున్నాయి. వాటిని ప్రతిఘటించటానికి గాను వింత వ్యాఖ్యానాల్ని బోధిస్తూ అవిశ్వాసపు విత్తనాలు వెదజల్లుతున్నాయి. స్వాభావిక అమర్యత, మరణంలో స్పృహ అంటూ పోపు మతం బోధించిన తప్పుడు బోధల్ని నమ్మి భూతమత మోసాల నుంచి తమను పరిరక్షించగల ఒకే ఒక అండను అవి తిరస్కరించాయి. నిత్యనరకాగ్ని శ్రమ అన్న సిద్ధాంతం అనేకులు బైబిలుని విశ్వసించక పోవటానికి హేతువయ్యింది. ప్రజల్ని నాల్గో ఆజ్ఞ ఆదేశిస్తున్నది ఏడోదిన సబ్బాతును ఆచరించాలని. నెరవేర్చటానికి తమకు సుతరామూ ఇష్టం లేని విధిని తప్పించుకోగల ఒకే ఒక మార్గంగా అనేకమంది బోధకులు దైవధర్మశాస్త్ర విధుల్ని ఆచరించ నవసరం లేదని ప్రబోధిస్తున్నారు. ఈ విధంగా వారు ధర్మశాస్త్రాన్ని సబ్బాతుని ఒక్క ఉదుట్ని తోసిపుచ్చుతున్నారు. సబ్బాతు సంస్కరణ విస్తరించే కొద్దీ నాలో ఆజ్ఞ ఆదేశాన్ని తప్పించటానికి ధర్మశాస్త్రాన్నే తోసిపుచ్చటం దాదాపు ప్రపంచ వ్యాప్తమౌతుంది. మత నాయకుల బోధనలు, అవిశ్వాసానికి, భూతమతానికి, దైవధర్మశాస్త్ర తిరస్కృతికి ద్వారం తెరిచాయి. క్రైస్తవలోకంలో చోటుచేసుకొన్న దుర్మార్ధతకు బాధ్యత ఈ నాయకులే వహించాలి.GCTel 553.2

    వేగంగా విస్తరిస్తున్న దుర్మార్తతకు క్రైస్తవ సబ్బాతు” పేరుతో జరుగుతున్న అపవిత్ర కార్యకలాపాలే కారణమని ఆదివారాచరణ అమలు జరిగిననాడు సమాజ నీతి ప్రమాణం ఎంతో మెరుగౌతుందని ఈ తరగతి నేతలే సెలవిస్తున్నారు. యధార్ధ సబ్బాతు సిద్ధాంతం ప్రబలంగా ప్రకటిత మవుతున్న అమెరికాలో ప్రత్యేకించి ఈ దుర్బోద జరుగుతున్నది. ఇక్కడ మితానుభవం ప్రధానమైన నైతిక సంస్కరణలలో ఒకటి. దాన్ని తరచు ఆదివారోద్యమంతో జోడించటం జరుగుతుంది. ఆదివారాచరణ ప్రబోధకులు తాము సమాజానికి దోహదపడే ఆసక్తుల్ని ప్రోదిచేయటానికి పాటుపడున్నామని ఈ కృషిలో తమకు సహకరించని వారు మితానుభవ ఉద్యమానికి మితానుభవానికి శత్రువులని ప్రబోధించారు. తప్పును స్థాపించటానికి ప్రారంభించిన ఉద్యమం ఒక మంచి పనితో సంబంధం పెట్టుకొన్నంత మాత్రాన అది ఆ తప్పును సమర్థిస్తున్నట్లు కాదు. మంచి భోజనంలో విషం కలిపి దాన్ని దాచవచ్చు. కాని దాని స్వభావాన్ని మార్చలేం. ఆ మాటకొస్తే దాన్ని తెలియకుండా తినే అవకాశమున్నందున అది మరింత ప్రమాద భరితం. ప్రజల్ని నమ్మించటానికి అబద్ధంతో తగినంత సత్యం కలపటం సాతాను మాయోపాయాలలో ఒకటి. ఆదివారోద్యమ నాయకులు ప్రజలకు అవసరమైన సంస్కరణలు, బైబిలుతో ఏకీభవించే సూత్రాలను ప్రభోధించవచ్చు. అయినా దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైన ఒక్క అంశం వారు ప్రబోధిస్తుంటే దైవ సేవకులు వారితో చేతులు కలుపకూడదు. మానవ నియమాల్ని అంగీకరిస్తూ దైవాజ్ఞల్ని పక్కన పెట్టే వారిని ఏదీ సమర్ధించదు.GCTel 554.1

    ఆత్మకు చావులేదు, ఆదివార పరిశుద్ధత అన్న ఈ రెండు అబద్ధ బోధల ద్వారా సాతాను ప్రజల్ని మోసగిస్తున్నాడు. మొదటిది భూతమతానికి పునాది వేస్తే రెండోది రోవును సంఘంతో సత్సంబంధాలు నెలకొల్పుతుంది. భూతవుతాన్నిGCTel 555.1

    అంగీకరించటానికి అమెరికాలోని ప్రొటస్టాంట్లు చేయిచాపటంలో ముందున్నారు. రోమను కథోలిక్ సంఘం చేయి పట్టుకోటానికి అగాధం మీదుగా తమ చేయి అందిస్తున్నారు. ఈ మూడు శక్తులు సంయుక్త మవ్వటంతో ఈ దేశం (అమెరికా) మనస్సాక్షి హక్కుల్ని కాల రాయటంలో రోమను సంఘం అడుగుజాడల్లో నడుస్తున్నది.GCTel 555.2

    భూతమతానికి నేటి నామమాత్రపు క్రైస్తవ మతంతో దగ్గర పోలికలుండటం వల్ల మోసగించటానికి, తన ఉచ్చులో బంధించటానికి భూతమతానికి ఎంతో శక్తి ఉంది. స్వయాన సాతానే ఈ నూతన మతాన్ని స్వీకరించాడు. అతను వెలుగుదూత వలే కనిపిస్తాడు. భూతమతం ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. రోగుల్ని బాగుచేస్తాడు. అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. దురాత్మలు బైబిలుని విశ్వసిస్తున్నట్లు చెప్పుతాయి. సంఘ వ్యవస్థ పట్ల విశ్వాసమున్నట్లు ప్రకటిస్తాయి. దురాత్మల పనిని దైవ శక్తి ప్రదర్శనగా ప్రజలు అంగీకరిస్తారు.GCTel 555.3

    నామమాత్రపు క్రైస్తవులకు దుర్మారులకు మధ్య ఉన్న తేడా ఇప్పుడు అసలు కనిపించటం లేదు. లోకం ప్రేమించే వాటినే సంఘ సభ్యులు ప్రేమిస్తూ వారితో కలిసి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. వారందరిని ఒక వర్గంగా సంఘటిత పర్చి భూతమతంలో చేర్చటం ద్వారా తన పనిని పటిష్ట పర్చుకోవాలని సాతాను చూస్తున్నాడు. నిజమైన సంఘానికి సూచకక్రియలు కచ్చితమైన సూచన అని ప్రగల్భాలు పలికే పోపు మతవాదులు సూచక క్రియలు చేసే ఈ శక్తిని చూసి మోసపోతారు. సత్యమనే డాలును పారవేసిన ప్రొటస్టాంట్లు కూడా మోసంలో పడ్డారు. పోపు మతవాదులు ప్రొటస్టాంట్లు లోకప్రియులు శక్తిలేని దైవభక్తిని అంగీకరిస్తారు. లోకం క్రైస్తవ మతాన్ని స్వీకరించటానికి దీర్ఘకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న వెయ్యేండ్ల పాలన ప్రారంభానికి ఈ కూటమి ఉద్యమిస్తుందని వారి ఆశాభావం.GCTel 555.4

    భూతమతం ద్వారా మానవాళికి సాతాను ఉపకారిగా కనిపిస్తాడు. ప్రజల వ్యాధుల్ని నయం చేస్తాడు. ఒక నూతన, ఉన్నత మత వ్యవస్థను స్థాపిస్తున్నట్లు చెప్పుకొంటాడు. అయితే అతను వినాశకుడుగానే పని చేస్తాడు. అతని శోధనలు వేలాది ప్రజల్ని నాశనానికి నడుపుతాయి. ఆత్మ నిగ్రహం లేకపోవటం బుద్ది బలాన్ని నిర్వీర్యం చేస్తుంది. శరీరేచ్ఛల అతిలాలసత్వం, సంఘర్షణ, రక్తపాతం దాని పర్యవసానాలు. యుద్ధమంటే సాతానుకి అమితాసక్తి. ఎందుకంటే యుద్ధం మనిషిలోని నికృష్ణ ఉద్రేకాన్ని రేపి బాధితుల్ని నేరాల్లోకి రక్తపాతానికి దింపుతుంది. రాజ్యాల్ని ఒకదానితో ఒకటి యుద్ధానికి దిగేటట్లు రెచ్చగొట్టటం అతని అభిమతం. ఎందుచేతనంటే దేవుని మహాదినానికి మనుషులు సిద్ధపడకుండా వారిని అపమార్గం పట్టించటం అతని ధ్యేయం.GCTel 555.5

    తాను సిద్ధం చేయని ఆత్మల పంటను పోగుచేసుకొనేందుకోసం సాతాను ప్రకృతి శక్తుల ద్వారా పని చేస్తాడు. ప్రకృతి ప్రయోగశాలల మర్మాల్ని అతను అధ్యయనం చేసి ఆ శక్తుల్ని నియంత్రించటానికి దేవుడు అనుమతించే హద్దుల మేరకు తన సర్వశక్తినీ ఉపయోగిస్తాడు. యోబుకు శ్రమలు కలిగించటానికి అనుమతి లభించినప్పుడు మందలు, ఇండ్లు తుడుచుకు పోయాయి. సేవకులు, పిల్లలు మరణించారు. ఒకదాని వెంట ఒకటిగా శ్రమలు ఎంతో వేగంగా వచ్చాయి. విధ్వంసకుడి శక్తి నుంచి తన ప్రజల ప్రాణాల్ని చుట్టూ కంచెవేసి కాపాడేవాడు దేవుడే. అయితే క్రైస్తవలోకం యెహోవా ధర్మసూత్రాలపట్ల తిరస్కార వైఖరి అవలంబిస్తున్నది. కనుక తాను ఏమి చేస్తానని ప్రభువు ప్రకటించాడో అది ఆయన చేస్తాడు- లోకంపై తాను కుమ్మరిస్తున్న దీవెనలను ఉపసంహరించుకొని తన ధర్మశాస్త్రంపై తిరుగుబాటు చేసి ఇతరుల్ని తిరుగుబాటు చేయటానికి ప్రోత్సహిస్తూ ఒత్తిడి చేస్తున్న వారి నుంచి తన సంరక్షక వలయాన్ని తొలగిస్తాడు. దేవుడు ఎవరినైతే ప్రత్యేకంగా సంరక్షించడో వారందరిని సాతాను అదుపుచేస్తాడు. తన పథకాల్ని కొనసాగించేందుకు గాను అతను కొందరిని అభిమానించి వర్ధిల్లజేస్తాడు. కొందరికి కష్టాలు శ్రమలు కలిగించి తమను శ్రమల పాల్గేస్తున్నది దేవుడేనని వారిని నమ్మింపజూస్తాడు.GCTel 556.1

    తమ వ్యాధులన్నింటిని బాగుచేయగల మహా వైద్యుడిగా ప్రజలకు కనిపిస్తూ అతను వ్యాధిని విపత్తును కలిగించి, నగరాల్ని పట్టణాల్ని నాశనం చేసి వాటిని నిర్జన ప్రదేశాలుగా మార్చుతాడు. ఇప్పుడు సైతం అతను పనిచేస్తూనే ఉన్నాడు. ప్రమాదాల్లోను, సముద్రాల్లోను, భూమిపై ప్రమాదాల్లోను, భయంకర తుఫాన్లలోను, వడగండ్ల వానల్లోను, గాలి వానల్లోను, వరదల్లోను, ఉప్పెనల్లోను, భూకంపాల్లోను ప్రతీ చోటా వెయ్యి రూపాల్లో సాతాను తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు. అతను పండుతున్న పంటల్ని ధ్వంసం చేస్తాడు. దానివెంట కరవు, దుఃఖం వస్తాయి. గాలిలో ప్రాణాంతకమైన రంగు విడిచి పెడ్తాడు. పర్యవసానంగా విరుచుకుపడే తెగుళ్లకు వేలాదిమంది బలి అవుతారు. ఈ విపత్తులు తరచుగా వచ్చి మరింత ప్రమాద భరిత మవుతాయి. ఈ ప్రమాదాలకు మనుషులు గురి అవుతారు. మూగప్రాణులూ గురి అవుతాయి. “లోకము దుఃఖముచేత క్షీణించి పోవుచున్నది.” “గొప్పవారు క్షీణించి పోవుచున్నారు... లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు. కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను” యెషయా 24:4,5.GCTel 556.2

    అనంతరం ఈ నయవంచకుడు ఈ బాధలు వ్యాధులన్నింటికీ కారకులు దేవుని సేవించే ప్రజలే అని జనుల్ని నమ్మిస్తాడు. తమ అవిధేయతవల్ల దేవుని కోపాన్ని రేపుతున్న ప్రజలు, దేవుని ఆజ్ఞలు కాపాడూ అవిధేయులకు నిత్యనిదర్శనంగా నివసిస్తున్న దైవ ప్రజలే తమ బాధలకు కారకులని నిందమోపుతారు. ఆదివార సబ్బాతును మీరటం ద్వారా మనుషులు దేవుని కోపం రేపుతున్నారని ఆదివారాచరణను పూర్తిగా పునరుద్ధరించే దాకా ఈ పాపం ఫలితంగా సంభవిస్తున్న విపత్తులు ఆగవని నాల్గో ఆజ్ఞ విధుల్ని ప్రబోధిస్తూ ఆదివార పరిశుద్ధతను నాశనం చేస్తున్న వారు ప్రజల్ని దేవుని ప్రసన్నతకు, లౌకికాభ్యున్నతికి దూరం చేస్తున్న కంటకులనీ ప్రచారం చేస్తారు. పూర్వం దైవసేవకుడిపై మోపిన నింద అదే రకమైన ఆధారాలతో పునరావృతం కానుంది. “ఆహాబు ఏలీయాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు- నేనుకాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవత ననుసరించు నీవును, నీ తండ్రియింటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారైయున్నారు. “అన్నాడు ప్రవక్త 1 రాజులు 18:17, 18. తప్పుడు అభియోగాలపై ప్రజలు కోపోద్రిక్తులై ఏలీయా విషయంలో భ్రష్ట ఇశ్రాయేలు ప్రజలు వ్యవహరించిన రీతిగా దైవ సేవకుల పట్ల ప్రజలు వ్యవహరిస్తారు.GCTel 557.1

    భూతమతం ద్వారా ప్రదర్శితమయ్యే సూచక క్రియల శక్తి మనుషులకు కాక దేవునికి విధేయులవటానికి ఎంపిక చేసుకొనే వారిపై వ్యతిరేకంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆదివారాన్ని తిరస్కరించే వారు తాము చేస్తున్న తప్పును తెలుసుకొని, దైవ ధర్మశాసనాల్ని ఎలా ఆచరిస్తారో అలాగే దేశ శాసనాల్ని ఆచరించటానికి ప్రజల్ని ఒప్పించటానికి దేవుడు తమను పంపాడని దురాత్మల వర్తమానాలు ప్రకటిస్తున్నాయి. లోకంలో పెరిగిపోతున్న దుర్మార్గత నిమిత్తం వారు సంతాపం వ్యక్తం చేస్తారు. నైతిక ప్రమాణాలు పడిపోవటానికి ఆదివారాన్ని అపవిత్ర పర్చటమే కారణం అంటూ మత గురువులు ఇస్తున్న సాక్ష్యాన్ని వారు బలపర్పుతారు. వారి సాక్ష్యాన్ని తిరస్కరించే వారందరిపట్ల తీవ్ర ఆగ్రహాన్ని రెచ్చగొడ్తారు.GCTel 557.2

    పరలోకంలో ప్రారంభమైన మహా సంఘర్షణలో సాతాను అనుసరించిన విధానాన్నే దైవ ప్రజలతో ఈ అంతిమ సంఘర్షణలో అతను అవలంబిస్తాడు. దైవ ప్రభుత్వాన్ని కూలదోయటానికి చడీచప్పుడు లేకుండా శాయశక్తులా కృషిచేస్తూ పైకి మాత్రం దైవప్రభుత్వ స్థిరత్వానికి పాటుపడున్నట్లు చెప్పుకొంటాడు. ఇలా తాను చేయటానికి శ్రమిస్తున్న దుష్కృతాల్ని దేవునికి నమ్మకంగా నిలిచిన దేవదూతలు చేస్తున్నట్లు నిందిస్తాడు. రోమను సంఘం కూడా ఇదే వంచన విధానాన్ని అనుసరించినట్లు చరిత్ర చెబుతున్నది. తాను దేవుని ప్రతినిధినని ఆ సంఘం చెప్పుకొంటూ దేవునికి పైగా తన్నుతాను హెచ్చించుకొని ఆయన ధర్మశాసనాన్ని మార్చటానికి చూస్తున్నది. సువార్తను నమ్మకంగా అనుసరించినందుకు రోమును సంఘ నిబంధన ప్రకారం మరణ శిక్షపొందిన వారు దుష్టులు దుర్మార్గులన్న ఖండనకు గురి అయ్యారు. వారు సాతానుతో చేతులు కలిపారన్నారు. వారిని నిందలపాలు చేయటానికి సాధ్యమైన ప్రతీ సాధనాన్ని ఉపయోగించు కొన్నారు. ప్రజల దృష్టికి తమ దృష్టికివారు నికృష్ణ నేరగాళ్లుగా కనిపించేటట్లు చేశారు. అదే ఇప్పుడూ జరుగనుంది. దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారిని నాశనం చేయటానికి వారు న్యాయ విరోధులని దేవుని అగౌరవ పర్చేవారని ఆ కారణంగా లోకం మీదికి దేవుని తీర్పులు తెచ్చేవారని నిందిస్తారు.GCTel 558.1

    చిత్తాన్ని లేదా మనస్సాక్షిని దేవుడు ఎన్నడూ ఒత్తిడి చేయడు. కాని తాను మోసగించలేని వారిపై అదుపు సాధించేందుకుగాను సాతాను ఎల్లప్పుడూ దౌర్జన్యంతో కూడిన ఒత్తిడికి దిగుతాడు. భయపెట్టి లేదా ఒత్తిడి ఉపయోగించి మనస్సాక్షిని అదుపుచేయటానికి నివాళులందుకోటానికి ప్రయత్నిస్తాడు. ఈ కార్యాన్ని సాధించటానికి మతాధికారం రాజకీయాధికారం రెండింటి ద్వారా కృషి చేస్తాడు. దైవ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మానవ చట్టాల్ని అమలుపర్చటానికి అధికారాల్ని ఉపయోగించుకొంటాడు.GCTel 558.2

    బైబిలు సబ్బాతును ఆచరించే ప్రజలు సంఘవ్యతిరేకులు, వారు సమాజ నైతిక ఆంక్షల్ని అతిక్రమిస్తూ అరాచకత్వాన్ని అవినీతిని పెంచుతూ భూమిపై దేవుని తీర్పులకు కారకులువుతున్నారు అన్న ఖండనకు గురి అవుతారు. వారు చిత్తశుద్ధితో అనుసరించే ధర్మశాస్త్ర సూత్రాలు మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని, అధికార ధిక్కారాన్ని ప్రోత్సహించేవని ప్రచారం జరుగుతుంది. వారి మీదికి రాజ్య విద్రోహులన్న ఆరోపణలు తెస్తున్నారు. దైవధర్మశాసనాల్ని నిరాకరించే మతబోధకులు ప్రభుత్వాధికారాన్ని గౌరవించి ఆచరించటం దేవుడు నిర్దేశించిన విధి అని ప్రసంగ వేదికల నుంచి ధర్మోపన్యాసాలు చేస్తారు. ఆజ్ఞలు కాపాడే ప్రజల్ని చట్టసభల్లోను, న్యాయస్థానాల్లోను అన్యాయంగా నిందించి శిక్షకు గురిచేస్తున్నారు. వారి మాటలకు అపార్థాలు తీస్తారు. వారి ఉద్దేశాల్ని తప్పుగా విశ్లేషిస్తారు.GCTel 559.1

    దైవ ధర్మశాస్త్ర పక్షంగా స్పష్టమైన లేఖన వాదాన్ని ప్రొటస్టాంట్ సంఘాలు తిరస్కరిస్తున్నాయి గనుక బైబిలు ప్రకారం వారి విశ్వాసాన్ని తప్పుపట్టలేక పోయినా ప్రొటస్టాంట్లు వారి గొంతునులుమటానికి చూస్తారు. ఈ సత్యాన్ని వారు అంగీకరించక పోయినప్పటికీ తక్కిన క్రైస్తవ లోకమంతా ఆచరిస్తున్నట్లు ఆచరించటానికి, పోపు సబ్బాతును గుర్తించటానికి చిత్తశుద్ధితో నిరాకరించేవారిని హింసించటానికి దారితీసే కార్యాచరణ విధానాన్ని ఇప్పుడు ప్రొటస్టాంట్లు అవలంభిస్తున్నారు.GCTel 559.2

    అన్ని తరగతుల ప్రజలు ఆదివారాన్ని గౌరవించేందుకు సంఘ, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏకమై లంచాలతో మెత్తని మాటలతో లేదా ఒత్తిడితో ప్రజల్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తారు. దైవాధికారం లేని లోటును కఠిన శాసనాల ద్వారా భర్తీ చేస్తారు. రాజకీయ అవినీతి న్యాయదృష్టిని సత్యాసక్తిని నాశనం చేస్తుంది. స్వతంత్ర అమెరికాలో సైతం పరిపాలకులు శాసన సభల సభ్యులు ప్రజాదరణ దృష్టితో ఆదివారాచరణకు ప్రజలు చేసే డిమాండుకు తలవంచుతారు. గొప్ప త్యాగంతో సాధించిన మనస్సాక్షి స్వతంత్రను ఇక ఎంత మాత్రం గౌరవించరు. త్వరలో సంభవించనున్న ంఘర్షణలో ప్రవక్త పలికిన ఈ మాటలు నిజం కావటం మనం చూస్తాం, “ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ” ప్రకటన 12:17.GCTel 559.3