Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  అధ్యాయం 33—మొదటి గొప్ప మోసం

  మానవుడి ఆరంభ చరిత్రలోనే మానవ జాతిని మోసగించటానికి సాతాను తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పరలోకంలో తిరుగుబాటు లేపిన అతను దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి భూనివాసుల్ని సంఘటిత పర్చాలని ఆకాంక్షించాడు. ఆదాము అవ్వలు దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఎంతో సంతోషంగా నివసించారు. దేవుని ధర్మశాస్త్రం కఠినమైందని, అది పాలిత ప్రజల మంచికి ఉద్దేశించింది కాదని సాతాను పరలోకంలో చేసిన వాదనలో సత్యం లేదని వారి జీవితమే సాక్ష్యం ఇస్తున్నది. ఇంకా చెప్పాలంటే, పాపరహితులైన ఈ దంపతుల కోసం ఏర్పాటయిన అందమైన గృహాన్ని చూసి సాతాను అసూయపడ్డాడు. వారిని ఏదోవిధంగా పడగొట్టాలని వారిని దేవుని నుంచి విడదీసి తన ఆధీనంలో ఉంచుకొని తద్వారా ఈ భూమిని స్వాధీనం చేసుకొని మహోన్నతునికి వ్యతిరేకంగా తన రాజ్యాన్ని స్థాపించుకోవాలని కలలు కన్నాడు.GCTel 500.1

  సాతాను తన నిజ స్వరూపంలో తన్నుతాను కనపర్చుకొని ఉంటే తిరస్కృతి ఎదురయ్యేది. ఎందుకంటే ప్రమాదకరమైన ఈ శత్రువును గూర్చి ఆదామవ్వలకు హెచ్చరిక అందింది. కాని అతను చీకటిలో వ్యవహారించాడు. తన లక్ష్యాన్ని సాధించేందుకు గాను తన ఉద్దేశాన్ని బైటపడనీయలేదు. అప్పట్లో ఆకర్షణీయమైన రూపం గల ప్రాణి అయిన సర్పాన్ని తన కార్య సాధనకు మాధ్యమంగా ఎంపిక చేసుకొని అవ్వతో ఇలా అన్నాడు, “ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” ఆదికాం 3:1. అవ్వ శోధకుడితో వాదనకు దిగకుండా ఉండి ఉంటే ఆమె క్షేమంగా ఉండేది. కాని అవ్వ అతనితో మంతనాలు జరిపింది. అతని జిత్తులకు చిత్తయ్యింది. ఇప్పుడు కూడా ఇలాగే అనేకులు మోసపోతున్నారు. వారు దైవ విధులను గూర్చి సందేహాలు వ్యక్తంచేసి వాదనలకు దిగుతారు. దైవ ఆజ్ఞలకు విధేయులై నివసించే బదులు మానవ సిద్ధాంతాలను అనుసరిస్తారు. అవి పేరేరూపంలో ఉన్న సాతాను కుయుక్తులే.GCTel 500.2

  “అందుకు స్త్రీ - ఈ తోట చెట్ల ఫలములను మేము తిననచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు--మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్భము--మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని” స్త్రీతో చెప్పింది. 2-5 వచనాలు. క్రితంకంటే అధిక జ్ఞానంతో ఉన్నత స్థాయిలో జీవిస్తూ వారు దేవునివలె ఉంటారని ఉద్ఘాటించాడు. అవ్వ శోధనకు లొంగింది. ఆమె మూలంగా ఆదాము పాపంలో పడ్డాడు. దేవుడన్నది నిజం కాదని సాతాను చెప్పిన మాటల్ని వారు నమ్మారు. సృష్టి కర్తను శంకించారు. ఆయన తమ స్వేచ్ఛకు కళ్లెం వేస్తున్నాడని, ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం ద్వారా తాము గొప్ప జ్ఞానాన్ని ఔన్నత్యాన్ని పొందవచ్చునని భావించారు.GCTel 501.1

  తన పాపం అనంతరం “మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు” అన్నమాటల్లో ఆదాము కనుగొన్న అర్ధం ఏమిటి? సాతాను నమ్మబలికినట్లు ఆ మాటలు ఉన్నత జీవన స్థాయిని కూర్చిన సూచనను కనుగొన్నాడా? అలాగైతే అతిక్రమం వలన గొప్ప మేలే చేకూరింది. సాతాను ప్రజోపకారి అని రూఢి అయ్యింది. అయితే దేవుని మాటలకు అర్థం ఇదికాదని ఆదాము కనుగొన్నాడు. తన పాపపర్యవసానంగా మానవుడు తాను తీయబడిన మన్నుకు తిరిగి చేరాల్సి ఉన్నాడని దేవుడు ప్రకటించాడు. “నీవు మన్నేగనుక తిరిగి మన్నెపోదువు” 19 వ వచనం. “మీ కన్నులు తెరువబడును” అని సాతాను చెప్పిన మాటలు ఈ విధంగా మాత్రమే నిజం--ఆదామువ్వలు దేవునికి అవిధేయులయిన తర్వాత తమ పాపాల్ని గుర్తించటానికి వారి కన్నులు తెరువబడ్డాయి. వారు దుష్టిని లేక చెడుని తెలుసుకొన్నారు. అతి క్రమం ఫలించిన చేదు ఫలాన్ని రుచి చూశారు.GCTel 501.2

  ఏదెను మధ్యలో జీవవృక్షం పెరిగింది. దాని ఫలాలకు జీవాన్ని కొనసాగించే శక్తి ఉంది. ఆదాము దేవునికి విధేయుడిగా నిలిచి ఉంటే ఈ వృక్ష ఫలాలకు హక్కు కలిగి నిత్యమూ జీవించి ఉండేవాడు. కాని అతను పాపం చేసినప్పుడు జీవవృక్షఫలాన్ని అనుభవించే అవకాశాన్ని పోగొట్టుకొని మరణానికి లోనయ్యాడు. “నీవు మన్నేగనుక తిరిగి మున్నెపోదువు” అన్నమాటలు జీవం పూర్తిగా ఆరిపోవటాన్ని సూచిస్తున్నాయి.GCTel 501.3

  విధేయత షరతుపై వాగ్దానం చేయబడిన అమరత్వం అతిక్రమ ఫలితంగా చేజారిపోయింది. తనకేదైతే లేదో దాన్ని ఆదాము తన సంతతికి అందించలేకపోయాడు. పడిపోయిన మానవ జాతి అందుబాటులోనికి దేవుడు తన కుమారుని త్యాగం ద్వారా అమరత్వాన్ని తెచ్చి ఉండకపోతే వారికి ఎట్టి నిరీక్షణా ఉండేదికాదు. “మనుష్యులందరు పాపము చేసినందున మరణ మందరికిని సంప్రాప్తము ” కాగా క్రీస్తు “జీవమును అక్షయతను సువారవలన వెలుగులోనికి తెచ్చెను.” రోమా 5:12; 2 తిమోథి 1:10. క్రీస్తు ద్వారా మాత్రమే అమరత్వం లభిస్తుంది. యేసు ఇలా అన్నాడు, “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు.” యోహాను 3:36. షరతులు పాటించటానికి సిద్ధంగా ఉన్న ప్రతివారు ఈ అమూల్య వరాన్ని సొంతం చేసుకోవచ్చు. “సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు” అందరు నిత్యజీవము” పొందుతారు. రోమా 2:7.GCTel 502.1

  అవిధేయత ద్వారా జీవాన్ని వాగ్దానం చేసిన ఒకే ఒకడు వంచకుడైన సాతానే. “మీరు చావనే చావరు” అని సర్పం ఏదెనులో అవ్వతో అన్నమాట ఆత్మకు చావులేదన్న అంశంపై చేసిన మొట్టమొదటి ప్రసంగం. అయినా కేవలం సాతాను మాటలు ఆధారంగా చేసిన ఈ ప్రకటన క్రైస్తవ లోకంలోని ప్రసంగ వేదికలపై మారుమోగుతున్నా మన మొదటి తల్లిదండ్రులు సందేహించకుండా అందిపుచ్చుకొన్నట్లు నేడు లోకంలో అధిక సంఖ్యాకులు దీన్ని అందిపుచ్చుకొంటున్నారు. “పాపము చేయువాడే మరణము నొందును” (యెహేజ్కేలు 18:20) అన్న దైవతీర్పుకు పాపం చేసేవాడు మరణించడు, నిత్యమూ జీవిస్తాడు, అన్న అర్ధం చెబుతున్నట్లయ్యింది. మనుష్యులు సాతాను మాటలు అమాయకంగా నమ్మటం దేవుని మాటలు నమ్మకపోవటం విచిత్రంగా వుంది.GCTel 502.2

  పాపం అనంతరం మానవుడికి జీవ వృక్ష ఫలాలు తినటానికి స్వేచ్ఛ ఉండి వుంటే అతను నిత్యమూ జీవించేవాడు. పాపం కూడా నిత్యం ఉండేది. అయితే “జీవ వృక్షమునకు పోవు మార్గమును” (ఆదికా 3:24.) కెరూబులు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలు కాపాడగా ఆ హద్దులు దాటి జీవదాయకఫలాన్ని తినటానికి ఆదాము కుటుంబంలో ఒక్కరు కూడా వెళ్లలేక పోయారు. ఆ కారణంగా అమరుడైన పాపిఅంటూ ఎవరూ లేరు.GCTel 502.3

  కాని పాపం అనంతరం మానవుడు సహజంగా అమర్యుడన్న నమ్మకాన్ని ప్రబోధించటానికి తన దూతలు ప్రత్యేక కృషి చేయాల్సిందిగా సాతాను ఆదేశించాడు. ఈ తప్పుడు బోధను అంగీకరించేందుకు ప్రజలను నడిపించిన మీదట, పాపులు నిత్యం బాధలు దుఃఖాలలో నివసిస్తారని నమ్మేటట్లు చేయటం ఆ దుష్టదూతల బాధ్యత. ఈ చీకటి రాజు తన సహచరుల సాయంతో పని చేస్తూ దేవున్ని పగసాధించే నియంతగాను తనకు అయిష్టులైన వారిని నరకంలోకి నెట్టి అక్కడ నిత్యము ఉంచి నిత్యాగ్నిలో కొలుతూ చెప్పరాని బాధననుభవిస్తూండగా చూసి ఆనందించే క్రూరుడు గాను చిత్రిస్తున్నాడు.GCTel 502.4

  ఈ ప్రధాన దురాత్మ ఇలా తన అవలక్షణాల్ని సృష్టికర్త అయిన దేవునికి ఆపాదిస్తున్నాడు. క్రూరత్వం సాతాను గుణ లక్షణం. దేవుడు ప్రేమా స్వరూపి. ఆయన సృజించిన సమస్తమూ-- ఈ మొదటి తిరుగుబాటు దారుడు పాపాన్ని ప్రవేశపెట్టేంత వరకు-సృష్టి పవిత్రంగా, పరిశుద్ధంగా అందంగా ఉండేది. మానవుణ్ణి శోధించి పాపంలోకి నడిపించి తరువాత సాధ్యమైతే అతణ్ని నాశనం చేస్తాడు. తనకు చిక్కినట్లు నిర్ధారణ అయిన దరిమిలా తాను కలిగించిన నాశనాన్ని చూసి ఆనందిస్తాడు. సాధ్యమైతే మానవ జాతి అంతటిని తన వలలో చిక్కించు కొంటాడు. దేవుడు కలుగజేసుకోకపోతే ఒక స్త్రీ గాని పురుషుడుగాని అతని నుంచి తప్పించుకోటం సాధ్యంకాదు.GCTel 503.1

  సృష్టికర్త మీద విశ్వాసాన్ని సడలింపజేయటం ద్వారాను, ఆయన ప్రభుత్వాన్ని ధర్మశాస్త్రాన్ని సందేహించటానికి నడిపించటం ద్వారాసు ఆదామవ్వల్ని మోసగించినట్లే, నేడు మనల్ని మోసగించటానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. తమ దుష్టత్వాన్ని తిరుగుబాటు స్వభావాన్ని సమర్థించుకోటానికి సాతాను అతని దూతలు దేవున్ని తమ కన్నా చెడ్డవానిగా చిత్రిస్తారు. అన్యాయస్తుడైన పాలకుడికి తల ఒగ్గనందున పరలోక బహిష్కృతి పొంది గొప్ప అన్యాయానికి గురి అయిన వానిగా తన్నుతాను కనపర్చు కొనేందుకు ఈ వంచకుడు తన క్రూర ప్రవర్తనను మన పరలోకపు తండ్రికి ఆపాదించటానికి ప్రయత్నిస్తున్నాడు. యెహోవా కఠినపాలనకు ప్రతిగా తన దయా పూరిత పాలనలో లోక ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను వాగ్దానం చేస్తున్నాడు. ఈ విధంగా దేవునికి విధేయులై నివ సించే ప్రజలను ఆకట్టుకోటంలో కృత కృత్యుడవుతున్నాడు.GCTel 503.2

  మరణించిన దుష్టులు అగ్నిగంధకంతో నిత్యమూ మండే అగ్ని గుండంలో కాలుతూ బాధ ననుభవిస్తారని, ఈ లోకంలోని బహుస్వల్ప జీవితంలోని దుష్టులు పాపాల నిమిత్తం దేవుడు జీవించి వున్నంతకాలం బాధ అనుభవిస్తారు అని బోధించే సిద్ధాంతం కృపాను రాగాలు న్యాయ దృష్టిగల మనసులకు ఎంత హేయంగా ఉంటుంది! అయినా ఈ సిద్ధాంతాన్ని క్రైస్తవ ప్రపంచములో బహుళంగా బోధించటం జరుగుతున్నది. అనేక సంఘ విశ్వాసాల్లో ఇది చోటుచేసుకొన్నది. ఒక వేదాంత పండితుడిలా అన్నాడు, “నరకంలోని బాధల దృశ్యం నీతిమంతుల ఆనందాన్ని నిత్యం అధికం చేస్తుంటుంది. అదే స్వభావం కలిగి అదే పరిస్థితులలో జన్మించి దుస్థితిలో ఉన్న ఇతరుల్ని చూస్తూ తమకు లభించిన గౌరవాన్ని గుర్తించినప్పుడు తాము ఎంత ఆనందంగా ఉన్నారో అప్పుడు వారికి అర్ధమవుతుంది.” ఇంకొకవ్యక్తి ఇలా అంటున్నాడు, “దుర్మార్గుల శిక్షావిధి నిత్యమూ అమలవుతుండగా రక్షణ పొందిన వారి కళ్లముందు దుష్టులు కాలుతున్న మంటలు నిత్యం పైకిలేస్తూ ఉంటాయి. రక్షణ పొందిన నీతిమంతులు కాలుతున్న దుష్టులతో ఏకీభవించకుండా ఆమెన్, హల్లెలూయ, ప్రభువుకు స్తోత్రం అంటారు.”GCTel 503.3

  దైవ గ్రంధంలో ఇలాంటి బోధ ఎక్కడుంది? రక్షణ పొంది పరలోకంలో ఉన్న వారు దయదాక్షిణ్యాలు, సామాన్య మానవత కోల్పోయిన వారా? పాషాణ హృదయులా? ఉదాసీనతకు, అనాగరికుల క్రూరత్వానికి వీరు ప్రత్యామ్నాయాలా? కానే కాదు. అది దైవవాక్య బోధన ముమ్మాటికి కాదు. పైన ఉటంకించిన వాక్యాలలోని భావాలు వ్యక్తం చేసిన వారు విద్యాధికులు, యధార్ధవంతులు కావచ్చు. కాని వారు సాతాను వలలోపడి మోసపోయిన వ్యక్తులు. దేవునికి చెందని, తనకే చెందే కాఠిన్యాన్ని, ద్వేషాన్ని, స్ఫురింపజేసే రంగు భాష పులిమి లేఖనంలోని పతిష్ఠ పదబంధాలకు అపార్థాలు ఆరోపించటానికి వారిని నడిపిస్తాడు. “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషములేదు. దుర్మారుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీ రెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు ” యెహెజ్కేలు 33:11. నిత్య బాధ ననుభవించే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడని, తాను ఏర్పాటు చేసిన నిత్యాగ్ని గుండపు మంటల్లో బాధపడేవారి అరుపులు, మూలుగులు, శాపనార్థాలు ఆయనకు సంతోషం కలిగిస్తాయని మనం ఒప్పుకొంటే ఆయనకు ఒరిగే దేమిటి? అనంత ప్రేమాస్వరూపి అయిన దేవునికి ఈ భయంకర శబ్దాలు సంగీతంలా మధురంగా ఉండగలవా? దుష్టులకు శిక్షగా అంతంలేని శ్రమను విధించటం విశ్వశాంతిని క్రమాన్ని నాశనం చేసే కీడుగా పాపంపట్ల దేవునికున్న ద్వేషాన్ని సూచిస్తుందన్న వాదన ఉన్నది. ఎంత భయంకర దేవదూషణ! పాపం పట్ల దేవుని ద్వేషమే అది నిత్యం కొనసాగటానికి హేతువు అన్నట్లుంది. ఎందుచేతనంటే, ఈ వేదాంత పారంగతుల బోధలు కృపకు తావులేని, అంతులేని శ్రమా బాధితుల్ని ఆగ్రహావేశాలతో నింపుతుందని, ఆ స్థితిలో వారు శాపనార్థాలకు దేవదూషణకు దిగినప్పుడు తమ దోషిత్వాన్ని ఇబ్బడి ముబ్బడి చేసుకొంటారని సూచిస్తున్నాయి. ఇలా నిత్యమూ పెరుగుతున్న పాపాల్ని అనంతయుగాల పొడుగున కొనసాగించటం ద్వారా దేవునికి మహిమ కలుగదు.GCTel 504.1

  నిత్య నరకబాధ అన్న తప్పుడు సిద్ధాంతం వలనకలిగిన చేటు ఇంత అని అంచనా వేయటం సాధ్యంకాదు. బైబిలు బోధించే మతం ప్రేమ, మంచితనం దయాళుత్వంతో నిండిన మతం. మూఢనమ్మకం భయం దాన్ని మసకబార్చుతున్నాయి. సాతాను దేవుని ప్రవర్తనను ఎంత చెడ్డగా చిత్రిస్తున్నాడో అన్నది పరిగణించినప్పుడు కృపానిధి అయిన మన దేవుడంటే భయం, ద్వేషం, ఏర్పడున్నాయంటే ఆశ్చర్యం ఏముంది? ప్రసంగ వేదికల నుంచి దేవుని గురించి వినవస్తున్న ఘోరమైన అభిప్రాయాలు లోకమంతా వ్యాపించి వేలాది లక్షలాది ప్రజలను నాస్తికులుగాను విశ్వాసరహితులుగాను తయారు చేస్తున్నాయి.GCTel 505.1

  నిత్య నరకబాధ అన్న సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతాల్లో ఒకటి. ఈ సిద్ధాంతాలు సమస్త జనులను బబులోను తాగించే వ్యభిచార మద్యంగా పరిణమిస్తున్నాయి. ప్రకటన 14:8; 17:2. క్రీస్తు బోధకులు ఈ తప్పుడు సిద్ధాంతాలను అంగీకరించి పవిత్ర వేదికల సుంచి వాటిని ప్రబోధించటం ఒక మర్మంగా మిగిలింది. తప్పుడు సబ్బాతును స్వీకరించిన రీతిగానే వారు దీన్ని కూడా రోమునుంచి స్వీకరించారు. నిజమే. దీన్ని బోధిస్తున్న వారు పేరుగాంచిన వ్యక్తులు. మంచివారు కూడా. అయితే ఈ అంశంపై మనకు వచ్చిన వెలుగు వారికి రాలేదు. తమ కాలంలో ప్రకాశించిన వెలుగుకే వారు బాధ్యులు. ఈ కాలంలో ప్రకాశిస్తున్న తెలుగుకి మనం జవాబుదారులం. దైవ వాక్య సాక్ష్యం నుంచి వైదొలగినా మన పితరులు బోధించారు గనుక అవి తప్పుడు సిద్దాంతాలైనా వాటినే అంగీకరిస్తే బబులోనుకు వచ్చిన తీర్పు మనకూ వర్తిస్తుంది. ఆమె వ్యభిచార మద్యాన్ని మనమూ సేవిస్తున్న వారమౌతాం.GCTel 505.2

  నిత్య నరక బాధ సిద్ధాంతంతో ఏకీభవించని వారి సంఖ్య పెద్దదే. వారూ పొరపాటులోనే ఉన్నారు. దేవుడు ప్రేమ దయ గలవాడని లేఖనాలు బోధిస్తున్న సత్యం ఆధారంగా దేవుడు తాను సృజించిన మానవాళిని నిత్య నరకాగ్నిలో పడేస్తాడన్నది నమ్మలేమని వారంటారు. ఆత్మకు స్వభావ సిద్ధంగా మరణం లేదని నమ్ముతూ చివరకు మానవులంతా తప్పనిసరిగా రక్షణ పొందుతారని భావిస్తారు. బైబిలులోని హెచ్చరికలన్నీ మనుషుల్ని భయపెట్టి విధేయుల్ని చేయటానికే గాని వాటిని నిజంగా ఆచరణలో పెట్టటానికి కాదని అనేకుల పరిగణన. దేవుని విధులను లెక్కచేయకుండా స్వార్ధ సుఖ భోగాలనుభవిస్తూ నివసించినా తుదకు పాపిని దేవుడు స్వీకరిస్తాడన్న నమ్మకం ఇలా ఏర్పడుతున్నది. దేవుడు కృపామయుడని భావించుకొని ఆయన న్యాయశీలతను విస్మరించే ఈ సిద్ధాంతం పాపనైజం గల హృదయాన్ని తృప్తి పరచి దుష్టులు తమ దుష్టత్వంలో కొనసాగటానికి ఊతమిస్తుంది.GCTel 505.3

  రక్షణ అందరికీ కలుగుతుంది అని నమ్మేవారు ఆత్మను నాశనానికి నడిపే తప్పుడు సిద్ధాంతాలను సమర్ధించటానికి లేఖనాలను ఎలా వక్రీకరిస్తారో చూపించడానికి వారి మాటలనే ఉటంకిస్తే సరిపోతుంది. ఒక ప్రమాదంలో అక్కడికక్కడే మరణించిన భక్తిహీనుడైన యువకుడి సమాధి కార్యక్రమానికి ఈ సిద్ధాంతాన్ని నమ్మిన బోధకుడొకడు దావీదు గురించి ప్రస్తావిస్తున్న ఈ లేఖనాన్ని ఎంపిక చేసుకొన్నాడు. “అమ్మోను మరణమాయె ననుకొని అతనిని గూర్చి యోదార్పు నొందినవాడై...” 2 సమూయేలు 13:39.GCTel 506.1

  ఆ బోధకుడిలా అన్నాడు, “ఘోరమైన పాపస్థితిలో ఉండి, తమ దుస్తులపై రక్తపు మరకలు అలాగే వుంచుకొని, క్షమాభిక్ష కోరకుండా లేదా మతానుభవం పొందకుండా మరణించే వారికి ఏమి జరుగుతుంది అని విశ్వాసులు నన్ను తరచు ప్రశ్నించటం జరుగుతుంది. లేఖనాలు మనకెంతో తృప్తినిస్తాయి. ఈ భయంకర సమస్యను లేఖనాలిచ్చే జవాబు పరిష్కరిస్తుంది. దావీదు దేవుని ప్రవక్త. పరలోకంలో అమ్మోనుకు మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో దావీదుకు తెలిసే ఉంటుంది. ఆయన మనోభావాలు ఎలా ఉన్నాయి? ‘అమ్మోను మరణమాయెననుకొని అతనిని గూర్చి యోదార్పు నొందినవాడై అబ్లాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను’ 39వ వచనం.GCTel 506.2

  “ఇక్కడ వాడిన పదజాలం నుంచి ఏమి ఊహించుకోగలం? అతని మత విశ్వాసంలో అంతులేని బాధ అన్నది లేదనేకదా? ఇదే భావం స్పురిస్తుంది. చివరగా విశ్వవ్యాప్త పవిత్రతను శాంతిని గూర్చి స్పష్టమైన, ఉదారమైన, విజయవంతమైన వాదన ఇక్కడ మనకు వినిపిస్తున్నది. మరణించిన కుమారుని విషయంలో దావీదు ఓదార్పు పొందాడు. ఎందుచేత? ఎందుకంటే ప్రవచనం దృష్ట్యా ఆయన మహిమాపూరిత భవిష్యత్తును చూడగలిగాడు. తన కుమారుడు శోధనల నుంచి విముక్తి పొంది దాస్యం నుంచి క్షీణత నుంచి విడుదల పొందాడు. పరిశుద్ధత జ్ఞానం పొందిన తర్వాత పరలోకాన్ని చేరుకొని ఆనందిస్తున్న ఆత్మల మధ్యకు పరలోక ప్రవేశం పొందాడు. తన ప్రస్తుత పాపస్థితి నుంచి బాధ నుంచి అతనికి విముక్తి కలగటమే ఆయనకు ఓదార్పు కలిగించింది. పాపపంకిలంతో మసకబారిన ఆత్మలపై పరిశుద్ధాత్మ ప్రభావం ప్రసరించే స్థలానికి ఆయన ప్రియమైన కుమారుడు వెళ్లాడు. అక్కడ దైవGCTel 506.3

  జ్ఞానానికి, శాశ్వత ప్రేమకు అతని మనసు విప్పారి పరిశుద్ధ స్వభావాన్ని సంతరించుకొని పరలోక విశ్రాంతిని సహవాసాన్ని అనుభవించటానికి సమాయత్తమౌతుంది.GCTel 507.1

  “ఈ జీవితంలో మనం చేయగలిగిన ఏకార్యం మీదా అనగా మారుమనసు మీద గాని, ప్రస్తుతం నమ్మే నమ్మకాల మీదగాని, ప్రస్తుతం ఆచరిస్తున్న మతంమీద గాని రక్షణ ఆధారపడలేదని ఈ ఆలోచనలను బట్టి మనకు అర్ధమవుతున్నది.”GCTel 507.2

  క్రీస్తు సువార్త ప్రబోధకుడినని చెప్పుకొనే ఈ వ్యక్తి ఏదెనులో సర్పం “మీరు చావనే చావరు” మీరు వాటిని తినిన దినమున మీకన్నులు తెరవబడుననియు... మీరు దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును” అంటూ పలికిన అబద్దాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. హంతకులు, దొంగలు, వ్యభిచారులవంటి ఘోర పాపులు సైతం మరణించిన తర్వాత నిత్యజీవం పొందటానికి సిద్ధం చేయబడ్డారని ఇతను ప్రబోధిస్తున్నాడు.GCTel 507.3

  లేఖ నాలను వక్రీకరిస్తున్న ఈ పెద్దమనిషి భావాలు ఏమూలం నుంచి వస్తున్నట్లు? దేవుని చిత్తానికి దావీదు తన్నుతాను సమర్పించుకొంటున్నట్లు తెలిపే ఒకే ఒక వాక్యం నుంచి. “అమ్మోను మరణమాయెననుకొని అతనిని గూర్చి యోదార్పు నొందినవాడై అబ్లాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచనను మానెను.” కాలం గతిస్తున్న కొద్దీ తన దుఃఖం తగ్గటంతో దావీదు ఆలోచనలు మరణించిన కుమారుడి మీద నుంచి బతికి ఉండి తన నేరానికి న్యాయంగా కలిగే శిక్షకు భయపడి తన్నుతాను బహిష్కరించుకొన్న కుమారుడి మీదకు తిరిగాయి. వ్యభిచారి తాగుబోతు అయిన అమ్మోను మరణించిన వెంటనే పరలోకానికి వెళ్లాడని అక్కడ పరిశుద్ధ దూతలతో సహవాసానికి శుద్ధి పొందుతున్నాడని అనటానికి ఇది నిదర్శనం. అది చక్కని కట్టుకథ. దుష్టుల మనసుల్ని రంజింప చేసే కథ. ఇది సాతాను సొంత సిద్ధాంతం. దీనితో అతని పని సమర్థంగా కొనసాగుతుంది. ఇలాంటి సిద్ధాంతాలు గల ఉపదేశంతో దుర్మార్గత పెచ్చరిల్లటంలో ఆశ్చర్యమేముంది?GCTel 507.4

  ఈ ఒక్క అబద్ధ బోధకుడు చేస్తున్న పని అనేకమైన ఇతర బోధకులు చేస్తున్న పనికి సాదృశ్యం. లేఖనంలో కొన్ని మాటల్ని సమయ సందర్బాలకు సంబంధం లేకుండా విడదీస్తారు. అవి వారు చెబుతున్న అర్ధానికి భిన్నంగా ఉన్నట్లు అనేక సందర్భాల్లో తేలుతుంది. అలా విడదీసిన వాక్య భాగాలను వక్రీకరించి వాక్యంలో ఎలాంటి పునాదీ లేని సిద్ధాంతాలకు మద్దతుగా వాటిని ఉపయోగిస్తారు. తప్పతాగిన అమ్మోను పరలోకంలో ఉన్నాడనటానికి నిదర్శనంగా ఉటంకించిన సాక్ష్యం కేవలం ఊహ మాత్రమే. తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరన్న సరళలేఖన వాక్యం దీన్ని ప్రత్యక్షంగా ఖండిస్తున్నది. 1 కొరింథీ 6:10. ఈ రకంగా శంకితులు, అవిశ్వాసులు, నాస్తికులు సత్యాన్ని అబద్ధంగా మార్చుతారు. వేలాది ప్రజలు ఈ అబద్ధబోధల వల్ల మోసపోయి ఐహిక సుఖ భద్రతల ఒడిలో నిద్రపోతారు.GCTel 507.5

  మరణ గడియలో మానవాత్మలు నేరుగా పరలోకానికి వెళ్లటం నిజమైతే జీవంకన్నా మరణమే మనందరం కోరుకోదగ్గది. ఈ నమ్మకం అనేకుల్ని ఆత్మహత్యకు నడిపించింది. కష్టాలు, ఆందోళనలు, ఆశాభంగాలు విరుచుకు పడ్డప్పుడు దారం వలె బలహీనమైన జీవితాన్ని తెంచి అంతం చేసుకొని నిత్యజీవం నిత్యానందం గల లోకంలోకి ఎగసిపోవటం ఎంతో సులభమనిపిస్తుంది!GCTel 508.1

  తన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వారిని దేవుడు శిక్షిస్తాడనటానికి దైప వాక్యంలో ఖచ్చితమైన నిదర్శనం ఉంది. దేవుడు ఎంతో కృపగలవాడు గనుక పాపిపై ఆయన న్యాయ విమర్శ అమలుపర్చడు అని నమ్మేవారంతా కల్వరి సిలువను వీక్షించాలి. కళంకంలేని దైవ కుమారుని మరణం “పాపం వలన వచ్చు జీతము మరణము” అని ధర్మశాస్త్ర అతిక్రమానికి శిక్ష తప్పదని సాక్ష్యం ఇస్తున్నది. నిరపరాధి అయిన క్రీస్తు మానవుడి నిమిత్తం పాపమయ్యాడు. తన హృదయం బద్దలై ప్రాణం పోయేంతవరకు అతిక్రమ అపరాధాన్ని, తండ్రి ముఖం చాటువేసుకోటాన్ని ఆయన భరించాడు. పాపికి విమోచన కలిగే నిమిత్తం ఈ త్యాగమంతా జరిగింది. మానవుడు పాపానికి కలిగే శిక్ష నుంచి విడుదల పొందే మార్గం ఇంకొకటి లేదు. ఇంత గొప్ప త్యాగంతో ఏర్పాటైన ప్రాయశ్చిత్తంలో పాలు పొందటానికి తిరస్కరించే వారందరూ సొంతంగా అపరాధానికి బాధ్యత వహించి శిక్ష అనుభవించాలి.GCTel 508.2

  భక్తిహీనులు, పాప పశ్చాత్తాపం లేని వారు పరిశుద్దులుగా దేవదూతల వలే పరలోకంలో ఉంటారని విశ్వజన రక్షణ వాదులు ప్రబోధిస్తుండగా ఈ విషయమై బైబిలు ఏమి బోధిస్తున్నదో పరిశీలిద్దాం. “దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.” ప్రకటన 21:6. ఈ వాగ్దానం దప్పిగొన్న వారికి వర్తిస్తుంది. జీవజలం ఆవశ్యకతను గుర్తించి సమస్తాన్ని విడిచి పెట్టి దాన్ని అన్వేషించేవారే పొందుతారు. ” జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనై యుందును. అతడు నాకు కుమారుడై యుండును.” 7 వ వచనం. ఇక్కడ కూడా ప్రత్యేకమైన షరతులున్నాయి. అన్నిటిని స్వతంత్రించుకోటానికి మనం పాపాల్ని ప్రతిఘటించి జయించాలి.GCTel 508.3

  యెషయా ప్రవక్త ద్వారా ప్రభువిలా సెలవిస్తున్నాడు, “మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము”. “దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును” యెషయా 3:10, 11. “పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడవంటి దీర్ఘాయువును పొందక పోవుదురనియు నేనెరుగుదును.” ప్రసంగి 8:12, 13. “ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు” పాపి ఉగ్రతను సమకూర్చుకొంటాడని “ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును” అని “దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును” అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. రోమా 2:5,6,9.GCTel 509.1

  “వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ” ఎఫెసీ 5:5. “అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు” హెబ్రీ 12:14. “జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలును, మాంత్రికులును, వ్యభిచారులును, నరహంతకులును, విగ్రహారాధకులును, అబద్దమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు” ప్రకటన 22:14,15.GCTel 509.2

  తన ప్రవర్తనను గూర్చి, పాపంతో తాను వ్యవహరించే తీరును గూర్చి మనుషులకు దేవుడు ఒక ప్రకటన చేశాడు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను” నిర్గమకాండము 34:6,7. “అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును”. “ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును” కీర్తనలు 145:20; 37:38. తిరుగుబాటును అణచివేయటానికి దైవ ప్రభుత్వాధికారం, శక్తి, ఉపయుక్తమవుతాయి. అయినా శిక్షావిధికి సంబంధించిన కార్యాలు దయ, దీర్ఘశాంతం, ఔదార్యం గల దేవుని శీలంతో సంపూర్ణంగా ఏకీభవించే కార్యాలే.GCTel 509.3

  దేవుడు ఎవరి మనసునుగాని తీర్మానాన్నిగాని ఒత్తిడి చేయడు. ఇష్టంలేని విధేయతను ఆయన కోరడు. తాను సృజించిన మానవులు తాను తమ ప్రేమకు అర్హుడని భావించి ప్రేమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన వివేకాన్ని, న్యాయశీలతను, ఔదార్యాన్ని విజ్ఞతతో అభినందిస్తున్నందుకు తనకు విధేయులు కావాలని ఆయన కోరుకొంటున్నాడు. ఈ గుణ శీలం గురించి సరియైన అవగాహన ఉన్నవారు వాటికి ఆకర్షితులవుతారు. వాటిని అభిమానిస్తారు కాబట్టి ఆయనను ప్రేమిస్తారు.GCTel 510.1

  మన రక్షకుడు బోధించి ఆచరణలో పెట్టిన దయ, కనికరం, ప్రేమ తండ్రి గుణశీలానికి నకలు. తండ్రి వద్దనుంచి తాను ఏమైతే పొందాడో దానినే తాను బోధించానని క్రీస్తు చెప్పాడు. దైవ ప్రభుత్వ సూత్రాలు, “మీ శత్రువులను ప్రేమించుడి” అన్న క్రీస్తు ఉపదేశం ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి. విశ్వం మేలుకోసం, దేవుని తీర్పులకు గురి అయిన వారి మేలుకోసం దేవుడు దుష్టులకు తీర్పు తీర్చుతాడు. తన ప్రభుత్వ చట్టాలను తన నీతి ప్రవర్తనను అనుసరించి సాధ్యమైనంత వరకు వారిని సంతోషపెడ్తాడు కూడా. తన ప్రేమా చిహ్నాలు వారి చుట్టూ ఉంచుతాడు. తన ధర్మశాస్త్రాన్ని గురించిన జ్ఞానాన్ని అందిస్తాడు. తన కృపను అనుగ్రహిస్తానంటూ వారిని వెంబడిస్తాడు. ఆయన ఇచ్చే ఈ వుల్ని నిత్యమూ అందుకొంటూ, వాటినిస్తున్న దేవున్ని కించపర్చుతారు. దేవుడు తమ పాపాల్ని అసహ్యించుకొంటాడు గనుక వారు ఆయనను ద్వేషిస్తారు. వారి దుర్మారతను ప్రభువు దీర్ఘకాలం సహిస్తాడు. అయితే నిర్ణయాత్మక ఘడియ చివరికి వస్తుంది. వారి భవిష్యత్తు నిర్ణయమౌతుంది. అప్పుడు ఈ తిరుగుబాటు దారుల్ని గొలుసులతో బంధించి తన పక్క ఉంచుకొంటాడా? తన చిత్రాన్ని నెరవేర్చుమని వారిని ఒత్తిడి చేస్తాడా?GCTel 510.2

  సాతానుని తమ నేతగా ఎంపిక చేసుకొని అతని అదుపాజ్ఞల కింద ఉండేవారు దేవుని సన్నిధిలో ప్రవేశించటానికి ఇష్టపడరు. అహంభావం, వంచన, విచ్చిలవిడి ప్రవర్తన, క్రూరత్వం వారి ప్రవర్తనలలో అంతర్భాగమై ఉంటాయి. లోకంలో జీవించి వున్నప్పుడు తాము తృణీకరించి ద్వేషించిన వారితో నిరంతరం నివసించటానికి పరలోకంలో ప్రవేశించగలరా వారు? అబద్ధికుడికి సత్యం ఎప్పటికీ ఇష్టం ఉండదు. నమ్రత ఆత్మాభిమానాన్ని డంబాన్ని తృప్తి పర్చలేదు. అవినీతిపరుడు పవిత్రతను అంగీకరించడు. స్వార్ధరహిత ప్రేమ స్వార్ధపరుల్ని ఆకట్టుకోలేదు. ప్రాపంచిక విషయాల్లో స్వార్ధాసక్తుల్లో తలమునకలై ఉన్నవారికి పరలోకమంటే ఆసక్తి ఉంటుందా?GCTel 510.3

  జీవితమంతా దేవునిపై తిరుగుబాటు చేస్తూ గడిపిన వారు అర్ధంతరంగా పరలోకానికి రవాణా కావటం అక్కడ రాజ్యమేలే ఉన్నతస్థాయి పరిశుద్ధతను సంపూర్ణత్వాన్ని తిలకించటం జరిగితే- ప్రతీ వారు ప్రేమతో నిండివుండటం, ప్రతీ ముఖంపై సంతోషం తాండవించటం, దేవుని గౌరవార్ధం గొర్రెపిల్ల గౌరవార్థం మైమరపించే మధుర సంగీతం వినిపించటం, సింహాసనాసీనుడైన దేవుని ముఖం నుంచి విమోచన పొందిన వారి మీదికి వెలుగు జీవనదివలె ప్రహించటం - దేవున్ని ఆయన సత్యాన్ని పరిశుద్ధ్యతను ద్వేషించేవారు పరలోక వాసులతో కలసి వారి స్తుతిగానాల్లో గొంతు కలుపగలుగుతారా? దేవుని మహిమను గొర్రెపిల్ల మహిమను వారు తాళగలుగుతారా? తాళలేరు. పరలోక జీవనానికి అనువైన ప్రవర్తనలు రూపొందించుకోటానికి ఎన్నో సంవత్సరాల కృపకాలం వారికి దేవుడనుగ్రహించాడు. కాని వారు పరిశుద్ధతను ప్రేమించటం అలవర్చుకోలేదు. పరలోక భాషను నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకోటం సాధ్యపడదు. చాలా ఆలస్యమై పోయింది. జీవితమంతా దేవునికి వ్యతిరేకంగా జీవించి వారు పరలోకానికి అనర్హులయ్యారు. పరలోకంలోని పవిత్రత, పరిశుద్ధత, ప్రశాంతత వారికి హింసగా పరిణమిస్తాయి. దేవుని మహిమ దహించే అగ్నిలా ఉంటుంది. ఆ పరిశుదలోకాన్ని విడిచిపెట్టి పారి పోవాలనిపిస్తుంది. అక్కడ ఉండటం కన్నా నాశనమవ్వటమే మేలనుకొంటారు. తమను విమోచించటానికి మరణించిన ఆ ప్రభువు ముఖం చూడటంకన్నా మరణమే మేలనుకొంటారు. దుష్టులు తమ భవితను వారే ఎంపిక చేసుకొన్నారు. పరలోకం నుంచి తమ బహిష్కృతి వారు స్వయంగా ఎంచుకొన్నదే. దేవుని పక్షంగా అది న్యాయమైంది, కృపతో కూడినది.GCTel 511.1

  జలప్రళయ జలాల మాదిరిగా ఆ మహాదినాన లేచే మంటలు దుష్టులు మారని దుర్మార్గులన్న దేవుని తీర్పును వ్యక్తం చేస్తాయి. దేవుని అధికారాన్ని అంగీకరించే స్వభావం వారికి లేదు. తిరుగుబాటుకే వారు తమ శక్తి యుక్తుల్ని వినియోగిస్తారు. జీవితం చరమాంకానికి చేరినప్పుడు తమ ఆలోచనా ధోరణిని మార్చుకొని వ్యతిరేక మార్గంలో పయనించటం వారికి సాధ్యపడదు. అతిక్రమం నుంచి విధేయతకు, ద్వేషం నుంచి ప్రేమకు మారటం సాధ్యం కాదు.GCTel 511.2

  విశృంఖల దుర్మారతను కొనసాగిస్తూ పాపిని నివసించనీయటం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొంటాయో సూచించటానికి హంతకుడైన కయీనును బతకనివ్యటం ద్వారా దేవుడు లోకానికి ఒక సాదృశ్యాన్నిస్తున్నాడు. కయీను మాటలు జీవిత విధాన ప్రభావం ద్వారా అతని అనువంశీకుల్లో వేవేల మంది “నరుల చెడుతనము భూమిమీద గొప్పది” “వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది” గా కనిపించేంతగా దుర్మార్గులయ్యారు. “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి యుండెను. భూలోకము బలాత్కారముతో నిండి యుండెను” ఆదికాండము 6:511.GCTel 512.1

  లోకంపట్ల కనికరంతో నోవహు కాలంలోని దుర్మార్గులైన ప్రజలను దేవుడు నాశనం చేశాడు. దుర్మారులైన సొదొమ నివాసుల్ని దయతోనే నాశనం చేశాడు. సాతాను వంచక శక్తి ద్వారా దుష్టులకు సానుభూతి ప్రశంసలు లభిస్తాయి. వారు ఇతరులను నిత్యము తిరుగుబాటు చేయటానికి నడిపిస్తారు. కయీను నోవహు దినాల్లో ఇదే జరిగింది. అబ్రాహాము, లోతు కాలంలోనూ జరిగింది ఇదే. మన దినాల్లోనూ ఇదే జరుగుతున్నది. విశ్వం పట్ల తనకున్న కరుణను బట్టే తన కృపను నిరాకరించే ప్రజలను దేవుడు చివరగా నాశనం చేస్తాడు.GCTel 512.2

  “పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము” రోమా 6:23. జీవం నీతిమంతుల వారసత్వం కాగా మరణం దుష్టులు ఆర్జించుకొన్న సంపాదన. మోషే ఇశ్రాయేలీయులకు ఇలా ప్రకటించాడు, “చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను” ద్వితియోపదేశ 30:15. ఈ లేఖన వచనాల్లో వ్యక్తమైన మరణం ఆదాము మీదికి వచ్చిన మరణంకాదు. ఎందుకంటే ఆదాము అతిక్రమ శిక్షను మానవులందరూ అనుభవిస్తున్నారు. అది నిత్యజీవానికి భిన్నంగా ఉన్న “రెండవ మరణము”GCTel 512.3

  ఆదాము పాప పర్యవసానంగా మానవులందరి మీదికి మరణం వచ్చింది. ఏ భేదం లేకుండా అందరూ మరణిస్తారు. రక్షణ ప్రణాళికను బట్టి అందరూ తమ సమాధుల్లో నుంచి లేచి రావలసి ఉన్నారు. (నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” “ఆదామునందు అందరు ఏలాగు మృతి పొందుచున్నారో ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రతికింపబడుదురు” అ.కా. 24:15; 1 కొరింథి 15:22. అయితే పునరుత్సానులైన రెండు వర్గాల మధ్య తేడా ఉన్నది. “సమాధులలో నున్న వారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” యోహాను 5:28, 29. జీవ పునరుత్థానానికి అర్హులుగా ” ఎంపికైనవారు ధన్యులును పరిశుదులునై యుందురు.” “ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు.” ప్రకటన 20:6. పశ్చాత్తాపం ద్వారాను విశ్వాసం ద్వారాను క్షమాపణ పొందియుండని వారందరు అతిక్రమ శిక్షను అనగా “పాపమువలన వచ్చు జీతము” ను పొందవలసిందే. వారు శిక్ష అనుభవిస్తారు. “తమ క్రియల చొప్పున” వారి శిక్ష నిడివిలోను ఉదృతిలోను వేర్వేరుగా ఉంటుంది. కాని చివరగా వారందరు రెండో మరణంతో అంతమొందుతారు. తన కృప న్యాయాల విధానం ప్రకారం పాపిని తన పాప స్థితిలో రక్షించటం దేవునికి సాధ్యపడదు గనుక అతని ప్రాణాన్ని తీసుకోవటం అనివార్యమవుతుంది. జీవించే ఆధిక్యతను అతను తన అతిక్రమాలవల్ల పోగొట్టు కొంటాడు. జీవించటానికి అనర్హుడనని కూడా నిరూపించు కొంటాడు. ప్రవక్త ఇలా అంటున్నాడు, “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడక పోవుదురు”. ఇంకొక ప్రవక్త ఇలా అంటున్నాడు, ఇకనెన్నడు నుండని వారైనట్లు వారేమియు మిగులకుండ” ఉంటారు. ఓబద్యా 16. అపకీర్తి గడించి వారు నిరంతరం మరుగునపడి వుంటారు. GCTel 512.4

  పాపం దాని పర్యవసానంగా చోటు చేసుకొన్న దుఃఖం, నాశనం ఈ విధంగా అంతమొందుతాయి. కీర్తనకారుడిలా అంటున్నాడు, “నీవు... దుష్టులను నశింపచేసి యున్నావు. వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపుపెట్టి యున్నావు. శత్రువులు నశించిరి. వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరి.” కీర్తనలు 9:5,6. ప్రకటన గ్రంథంలో, నిత్యరాజ్యం కోసం ఎదురుచూస్తూ విశ్వమంతా దైవ సంస్తుతి గానం చేయటం యోహాను విన్నాడని ఉంది. ఒక అపశ్రుతికూడా అందులో లేదు. పరలోకంలోను భూలోకంలోను ప్రతీ ప్రాణీ దేవుని మహిమపర్చటం వినిపించింది. ప్రకటన 5:13. అంతులేని బాధ అనుభవిస్తూ దేవుని దూషించటానికి భ్రష్ట ఆత్మలు ఇక వుండవు. రక్షణ పొందినవారి గానాలతో తమవెర్రి కేకలను కలగలిపేందుకు నరకంలో దుష్టులు ఉండరు.GCTel 513.1

  స్వాభావిక అమర్యత్వం అన్న ప్రాథమిక దోషంపై మరణంలో సచేతనత అన్న సిద్ధాంతం ఆధారపడి ఉన్నది. ఈ సిద్ధాంతం లేఖన బోధనలకు, హేతువాదానికి, మానవాతా భావాలకు విరుద్ధమైన నిత్య నరకబాధ సిద్ధాంతం వంటిది. రక్షణ పొంది పరలోకంలో నివసిస్తున్న వారికి భూలోకంలో జరుగుతున్న విషయాలు ముఖ్యంగా లోకంలో ఉన్న తమ ఆప్తులకు సంబంధించిన విషయాలు తెలుస్తాయని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే జీవించి ఉన్నవారి శ్రమలు బాధల గురించి తెలుసుకోటం, తమ ప్రియులుచేసే పాపాల్ని చూడటం, బరువైన బతుకుల్లోని దుఃఖాన్ని, ఆశాభంగాల్ని, బాధల్ని భరించటం చూడటం మృతులకు ఆనందాన్ని ఎలాగివ్వగలవు? లోకంలోని తమ ఆప్తుల చుట్టూ పరిభ్రమించేవారు పరలోకానందాన్ని ఎంతమేరకు అనుభవించ గలుగుతారు? ఊపిరి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన వెంటనే పాప పశ్చాత్తాపంలేని ఆత్మ నరకాగ్నిలో బాధపడుతుందన్న నమ్మకం ఎంత జుగుప్సాకరమైంది. అంతులేని పాపం దుఃఖం నిరంతరం అనుభవించటానికి సంసిద్ధత లేకుండా తమ ఆప్తులు సమాధుల్లోకి వెళ్లటం చూసినప్పుడు వారికి ఎంత మనోవ్యధ ఎంత దుఃఖం కలుగుతాయి! వణుకు పుట్టించే ఈ అంశం అనేకుల్ని పిచ్చివాళ్లుగా మార్చింది.GCTel 513.2

  ఈ అంశాలపై లేఖనాలు ఏమి చెబుతున్నాయి.? మరణంలో మానవుడికి స్పృహ ఉండదని దావీదు తెలుపుతున్నాడు; “వారి ప్రాణములు వెడలిపోవును, వారు మట్టిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును” కీర్తనలు 146:4. సొలోమోను చెబుతున్నది కూడా ఇదే; “బ్రతికినవారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు,” (“వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగువాటిలో దేనియందును వారికిక నెన్నటికిని వంతులేదు” “నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు” ప్రసంగి 9:5,6,10. GCTel 514.1

  హిజ్కి యా చేసిన ప్రార్ధనకు ప్రతిఫలంగా దేవుడు అతనికి 15 సంవత్సరాల అదనపు ఆయుర్దాయం ఇచ్చినప్పుడు దేవుడు చూపించిన కృప నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. తానెందుకు ఆనందిస్తున్నాడో ఈ కీర్తనలో వ్యక్తం చేస్తున్నాడు: “పాతాళమున నీకు స్తుతికలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను.” యెషయా 38:18, 19 మరణించిన నీతిమంతులు స్వర్గానందం అనుభవిస్తూ దేవుని స్తుతిస్తూ పరలోకంలో ఉన్నట్లు ప్రజాదరణగల వేదాంతం బోధిస్తున్నది. అయితే హిజ్కియాకు అలాంటిదేమీ కనిపించలేదు. హిజ్కియా మాటలతో కీర్తనకారుడి సాక్ష్యం ఏకీభవిస్తుంది. “మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానములేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?” “మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు” కీర్తనలు 6:5; 116:17. పితరుడైన దావీదు “చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది.” అని పేతురు పెంతెకొస్తు దినాన పలికాడు, ”GCTel 514.2

  దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు” అపొ.కా.2:29,34. పునరుత్థాన సమయం వరకు దావీదు సమాధిలోనే ఉంటాడన్న విషయం మరణించిన వెంటనే నీతిమంతులు పరలోకానికి వెళ్లరని నిరూపిస్తున్నది. పునరుత్థానం ద్వారా, క్రీస్తు పునరుత్థానుడైన హేతువుచేత మాత్రమే చివరగా దావీదు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండ గలుగుతాడు.GCTel 515.1

  పౌలు అంటున్నాడు, “మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడ లేపబడలేదు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్ధమే, మీరింకను మీ పాపములోనే యున్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి) 1 కొరింథి 15:16 18. నీతిమంతులు నాలుగువేల సంవత్సరాలుగా మరణించిన వెంటనే నేరుగా పరలోకానికి వెళ్లిపోతే, పునరుత్థానం లేని యెడల “క్రీస్తునందు నిద్రించిన వారుసు నశించిరి” అని పౌలు ఎలా చెప్పి ఉండగలడు? పుసరుతానం అవసరముండదు.GCTel 515.2

  మరణించిన వారి స్థితిని గురించి ప్రస్తావిస్తూ హతసాక్షి టిండేల్ ఇలా అన్నాడు, “క్రీస్తు ఉన్న పరిపూర్ణ మహిమలోగాని దేవుని దూతల మహిమలోగాని వారు ఇప్పటికే ఉన్నారని నేను నమ్మను. అది నా మత సూత్రం కాదు. ఒకవేళ అయితే అది నాకు సమ్మతం కాదు. అది నిజమైతే పునరుత్థానాన్ని గురించిన బోధ వ్యర్ధమే.” విలియమ్ టిండేల్, ఫిఫేస్ టు న్యూట్మెంట్ (ఎ.డి.1534). రీప్రింటెడ్ ఇన్ బ్రిటిష్ రిపామర్స్ ప్రిల్, బార్నె స్, పుట 349.GCTel 515.3

  మరణించిన వెంటనే అమరత్వం సిద్ధిస్తుందన్న నిరీక్షణ బైబిలు సిద్ధాంతమైన పునరుత్థానాన్ని విస్తృతంగా నిర్లక్ష్యం చేయటానికి దారి తీసిందన్నది కాదనలేని నిజం. ఈ ధోరణిపై ఏడమ్ క్లార్క్ ఇలా వ్యాఖ్యానించాడు, “పునరుత్థాన సిద్ధాంత ప్రాధాన్యాన్ని ఈ కాలంలో వారికన్నా సనాతన క్రైస్తవులు ఎక్కువ గుర్తించినట్లు కనిపిస్తున్నది. దానికి కారణం? అపోస్తలులు పునరుత్థానాన్ని పదేపదే బోధించారు. విశ్వాసులు వాక్యం శ్రద్ధగా అధ్యయనం చేయటానికి, పఠించిన దాన్ని ఆచరణలో పెట్టటానికి, సంతోషంగా జీవించటానికి వారు ప్రోత్సహించారు. వారి స్థానంలో ఉన్న ప్రస్తుత ప్రబోధకులు పునరుత్థానాన్ని ప్రస్తావించరు కూడా. అపోస్తలులు ఎలా బోధించారో సనాతన క్రైస్తవులు అలా విశ్వసించారు. మనం ఎలా బోధిస్తే ప్రజలు అలా విశ్వసిస్తారు. సువార్త అంతటిలోను ఇంతకన్నా ప్రధానమైన సిద్ధాంతం ఇంకొకటి లేదు. ప్రస్తుత బోధనా వ్యవస్థలో నిర్లక్ష్యానికి గురి అయిన సిద్ధాంతం మరొకటి లేదు.” కామెంటరీ, రిమార్క్స్ ఆన్ 1 కొరింథియన్స్ 15, పేరా 3.GCTel 515.4

  ఉజ్వలమైన ఈ పునరుత్థాన సత్యం దాదాపు సంపూర్తిగా క్రైస్తవ లోకానికి కనుమరుగయ్యేంత వరకు ఈ పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. 1 థెస్సలోనికయులకు 4:13-18 పై వ్యాఖ్యానిస్తూ ఒక ప్రముఖ మత రచయిత ఇలా అంటున్నాడు, “వాస్తవానికి నీతిమంతుల అమర్యత సిద్ధాంతం మనకు సంబంధించినంత వరకూ ప్రభువు రెండో రాకకు సంబంధించిన, సంశయాస్పదమైన ఒక సిద్ధాంతం స్థానాన్ని ఆక్రమిస్తున్నది: మనం మరణించేటప్పుడు ప్రభువు మన వద్దకు వస్తాడు. మనం దాని కోసం వేచి ఉండాలి. మృతులు అప్పుడే మహిమలోకి వెళ్లిపోతారు. తీర్పుకోసం, పరలోక ధన్యత కోసం బూర మోగే వరకు వారు వేచి ఉండరు”GCTel 516.1

  అయితే శిష్యుల్ని విడిచి వెళ్లబోయే సమయం వచ్చినప్పుడు వారు త్వరలో తన వద్దకు వస్తారని వారితో ఆయన చెప్పలేదు. “మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున... మిమ్మును తీసికొని పోవుదును” అన్నాడు. యోహాను 14:2,3. పౌలు ఇంకా ఇలా అంటున్నాడు, “ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృ తులైనవారు మొదటలేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము” “మీరు మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి” 1థెస్స 4:1618. ఓదార్పు నిచ్చే ఈ మాటలకు క్రితం ఉటంకించిన విశ్వజన రక్షణ వాద ప్రబోధకుడి మాటలకు మధ్య ఎంత వ్యత్యాసముంది! మరణించిన వ్యక్తి ఎంతటి పాపి అయినా ఇక్కడ ప్రాణం పోయిన వెంటనే పరలోక దూతలలో ఒకడుగా పరలోకంలో ఉంటాడన్న హామీ ఇస్తూ ఆ బోధకుడు దుఃఖంలో ఉన్న మిత్రుల్ని ఓదార్చాడు. ప్రభువు వచ్చినప్పుడు సమాధి బంధకాలు తెగిపోతాయని క్రీస్తునందు మృతు” లైనవారు నిత్యజీవానికి పునరుత్థానం పొందుతారని చెబుతూ యేసు రాకడకు కనిపెట్టవలసిందిగా పౌలు సహవిశ్వాసుల్ని ప్రోత్సహిస్తున్నాడు.GCTel 516.2

  ఎవరైనా పరలోక నివాసాల్లో స్థిరపడకముందు వారి కేసుల దర్యాప్తు జరగాలి. వారి ప్రవర్తన, క్రియలు దేవుని ముందు పరిశీలనకు రావాలి. గ్రంథాలలోని దాఖలాల ప్రకారం అందరూ తీర్పు పొందుతారు. తమ క్రియల చొప్పున అందరికి ప్రతి ఫలం కలుగుతుంది. ఈ తీర్పు మరణమప్పుడు జరగదు. పౌలు మాటలు గమనించండి, ‘‘తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసి యున్నాడు.” అ.కా. 17:31. లోకానికి తీర్పు తీర్చటానికి నిర్దిష్ట కాలం (అప్పటికి అది జరుగలేదు) ఏర్పాటయ్యిందని అపోస్తలుడిక్కడ స్పష్టంగా తెలుపుతున్నాడు.GCTel 516.3

  యూదా కూడా అదేకాలం గురించి ప్రస్తావిస్తున్నాడు, “మరియు తము ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసస్థలములను విడచిన దేవదూతలను మహా దినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను”. యూదా ఇంకా హానోకు మాటల్ని ఉటంకిస్తున్నాడు, “ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను.” యూదా 6, 14, 15. “గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడి యుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను... ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పుపొందిరి.” ప్రకటన 20:12.GCTel 517.1

  కాగా మరణించిన వారు పరలోక సుఖాలు అనుభవించటమో లేక నరకాగ్నిలో కాలుతూ బాధపడటమో జరిగితే భవిష్యత్తులో తీర్పు జరగాల్సిన అవసరం ఏముంటుంది? ప్రాముఖ్యమైన ఈ అంశాలపై దైవ వాక్య బోధనలు అస్పష్టంగా కాని పరస్పర విరుద్ధంగా కాని లేవు. వాటిని సామాన్యులు అవగాహన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత చర్చనీయాంశం విషయంలో యధార్ద హృదయులకు విజ్ఞతగాని న్యాయంగాని కనిపిస్తుందా? బహుశా దేవుని సన్నిధిలో యుగాలకొద్దీ నివసిస్తున్నప్పుడు నీతిమంతులు తీర్పులో తమకేసుల పరిశీలన అనంతరం భళానమ్మకమైన మంచిదాసుడా... నీయజమాని సంతోషములో పాలు పొందుము” అన్న ప్రశంస పొందుతారా? « శపింపబడిన వారలారా, నన్ను విడచి... నిత్యాగ్నిలోకి పోవుడి” అన్న తీర్పు విశ్వ న్యాయాధిపతి నుంచి పొందిన దుర్మార్గులు ఆ తీర్పు అమలుకు నరకం నుంచి పిలువబడ్డారా? మత్తయి 25:2141. ఇది ఎంత గంభీరమైన అపహాస్యం! దేవుని వివేకానికి న్యాయవర్తనకు ఎంత అవ మానకరమైన అభిశంసన!GCTel 517.2

  ఆత్మ అమర్యమైనది అన్న సిద్ధాంతం రోము మతం అన్యమతం నుంచి స్వీకరించి క్రైస్తవ మతంలోకి ప్రవేశపెట్టిన తప్పుడు సిద్ధాంతాల్లో ఒకటి. మార్టిన్ లూథర్ ఈ సిద్ధాంతాన్ని “రోము గురువుల డికీల పెంటకుప్పల్లోని కట్టుకధల జాబితాలో చేర్చాడు. ఇ.పెటవెల్, ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇమోర్టాలిటి, పుట 255. మరణించిన వారు ఏమీ ఎరుగరు అని ప్రసంగిలో అన్న సొలొమోను మాటలపై వ్యాఖ్యానిస్తూ లూథర్ ఇలా అంటున్నాడు, “మరణించిన వారికి ఆలోచనలు ఉండవని నిరూపించే మరోస్థలం. అక్కడ విధినిర్వహణ లేదు, శాస్త్రం లేదు, జ్ఞానం లేదు. వివేకం లేదు. మరణించినవారు నిద్రిస్తున్నట్లు వారికేమీ తెలియదని దినాలు సంవత్సరాలు లెక్కలేకుండా మృతులు పడివుంటారు అంటున్నాడు. కాని వారు మేల్కొన్నప్పుడు ఒక్క నిముషం పాటు కూడా నిద్రపోయి ఉండనట్లు కనిపిస్తారు” మార్టిన్ లూథర్ ఎక్స్పోజిషన్ ఆఫ్ సాలమన్స్ బుర్కాల్డ్ ఎక్లీషియాస్టీన్, పుట 152.GCTel 517.3

  మరణించినప్పుడు నీతిమంతులు తమ ప్రతిఫలం దుష్టులు తమ శిక్షను పొందుతారని పరిశుద్ధ లేఖనాలలో ఎక్కడా లేదు. పితరులు ప్రవక్తలు అలాంటి హామీని ఎక్కడా విడిచివెళ్లలేదు. క్రీస్తుగాని ఆయన అపోస్తలులుగాని దాని గురించి సూచన ప్రాయంగా కూడా చెప్పలేదు. మృతులు వెంటనే పరలోకానికి వెళ్లరని బైబిలు స్పష్టంగా బోధిస్తుంది. పునరుత్థాన సమయం వరకు నిద్రిస్తున్నట్లు మాత్రమే వారిని వర్ణించటం జరుగుతున్నది. 1థెస్స 4:14; యోబు 14:1012. వెండితాడు విడిపోవటం బంగారుగిన్నె పగిలిపోవటం జరిగిన నాడే (ప్రసంగి 12:6.) మానవుడి తలంపులు నశిస్తాయి. సమాధికి చేరేవారు నిశ్శబ్దంగా ఉంటారు. సూర్యుని కింద సంభవించేది ఏదీ వారికి తెలియదు. యోబు 14:21. అలసిన నీతిమంతులకు వాంఛనీయమైన విశ్రాంతి! కాలం అది కొంచెమైనా ఎక్కువైనా వారికి క్షణం మాత్రమే. వారు నిద్రిస్తారు. దేవుని బూర శబ్దంతో మేల్కొంటారు. “బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు... క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును” 1 కొరింథి 15:52 54. తమ గాఢ నిద్ర నుంచి వారు మేల్కొని తాము జీవించి ఉన్నప్పుడు ఆపిన ఆలోచనలను కొనసాగిస్తారు. చివరగా వారు అనుభవించిన బాధ చివరి ఆలోచన సమాధి అధికారం క్రిందికి వెళ్తున్నాను అన్నది సమాధి నుంచి లేచిన వెంటనే వారి ఉత్సాహభరితమైన మొదటి ఆలోచనను ఈ మాటలు వ్యక్తం చేస్తాయి, ” ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?” 25 వ వచనం.GCTel 518.1