Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 31—దురాత్మల ప్రాతినిధ్యం

    క నిపించే ప్రపంచంతో కనిపించని ప్రపంచానికున్న సంబంధం, దేవదూతల పరిచర్య, దురాత్మల ప్రాతినిధ్యం లేఖనాల్లో స్పష్టంగా వెల్లడయ్యా యి. అవి మానవ చరిత్రలో అంతర్భాగమై ఉన్నాయి. దురాత్మల ఉనికి విషయంలో అపనమ్మకం పెరుగుతుంటే “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు” అయిన పరిశుద్ధ దూతల్ని (హెబ్రీ 1:14.) అనేకులు మరణించినవారి ఆత్మలుగా పరిగణించటం జరుగుతున్నది. దేవదూతల ఉనికిని గూర్చి బోధించటమేగాక వారు మృతుల శవాల్ని విడిచిపెట్టి సంచరించే ఆత్మలు మాత్రం కారని లేఖనాలు తిరుగులేని రుజువు అందిస్తున్నాయి.GCTel 481.1

    మానవుడి సృష్టికి పూర్వమే దేవదూతలున్నారు. జగతికి పునాదులు వేసినప్పుడు “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి” పాడారు. “దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు” చేశారు. యోబు 38:7. మానవుడు పాపం చేసిన అనంతరం జీవ వృక్షాన్ని దూతలు కాపలా కాశారు. అప్పటికి ఏ మానవుడు మరణించలేదు. స్వభావ పరంగా దేవదూతలు మానవులకన్నా అధికులు. దూతలకంటె “వానిని కొంచెము తక్కువగా చేసి యున్నావు.” అంటున్నాడు దావీదు. కీర్తనలు 8:5.GCTel 481.2

    దేవదూతల సంఖ్య, వారి శక్తి, ప్రభావం, దేవుని ప్రభుత్వంతో వారి సంబంధం, రక్షణ కార్యంలో వారి పాత్ర- వీటిని గురించి లేఖనంలో సమాచారం ఉంది. “యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ” రారాజు సముఖంలో వారు వేచి ఉంటారు - “యెహోవా దూతలారా... బలశూరులారా” “ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా” అనేక దూతల స్వరము వినబడెను” కీర్తనలు 103:1921; ప్రకటన 5:11. దానియేలు ప్రవక్త వేవేలకొలది పరలోక పరిచారకుల్ని చూశాడు. అపోస్తలుడైన పౌలు వారిని వేవేల దూతలు” గా వర్ణించాడు. దానియేలు 7:10; హెబ్రీ 12:22. దేవుని దూతలుగా వారు “మెరుపుతీగెలు కనబడురీతిగా” సాగిపోతారు. (యెహేజ్కేలు 1:4). వారి ప్రకాశత అంత తేజోవంతంగాను వారి చలనం అంత వేగవంతంగాను ఉంటాయి. యేసుప్రభువు సమాధి వద్ద కనిపించిన దేవదూత “స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమువలె తెల్లగా నుండెను” “అతనిని చూచి కావలివారు భయకంపితులై చచ్చినవారివలె నుండిరి” మత్తయి 28:3,4. గర్వాంధుడైన అపూరురాజు సనైరీబు దేవుని నిందించి అవమానిస్తూ ఇశ్రాయేలీయుల్ని నాశనం చేస్తానని భయపెట్టినప్పుడు “ఆ రాత్రియే యెహోవాదూత బయలుదేరి అపూరువారి దండుపేటలో జొచ్చి లక్ష ఎనుబది యయిదు వేల మందిని హతము చేసెను.” (అపూరు రాజు దండులోని పరాక్రమ శాలుల నందరిని సేనానాయకులను అధికారులను నాశనము చేయగా అప్లూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను.” 2 రాజులు 19:35; 2 దినవృ త్తాంతములు 32:21.GCTel 481.3

    దేవదూతలు కారుణ్య యాత్రలపై దైవ ప్రజల వద్దకు వెళ్తారు. దైవానుగ్రహ వాగ్దానాలతో అబ్రాహాము వద్దకు, అగ్ని వలస జరగనున్న నాశనం నుంచి నీతిమంతుడైన లోతును రక్షించటానికి సొదొమ పట్టణ ద్వారాల వద్దకు, అరణ్యంలో అలసి సొలసి ఆకలితో మరణిస్తున్న ఏలియా వద్దకు, శత్రువులు చుట్టుముట్టిన చిన్న పట్టణంలో అగ్ని రథాలు గుర్రాలతో ఎలీషా వద్దకు, అన్య రాజు ఆస్థానంలో దైవజ్ఞానాన్ని అన్వేషిస్తున్నప్పుడు లేదా సింహాలకు ఆహారం కావటానికి బందీ అయినప్పుడు దానియేలు వద్దకు, హేరోదు చీకటి కొట్టులో మరణించటానికి వేచి ఉన్న, పేతురువద్దకు, సముద్రయానంలో తుఫాను రాత్రి పౌలు ఆయన సహచరుల వద్దకు, సువార్తను స్వీకరించటానికి గాను కొర్నేలికి జ్ఞానోదయం కలిగించటానికి, అన్యుడైన పరదేశికి రక్షణ వర్తమానంతో పేతురును పంపటానికి - ఇలా అన్నియుగాల్లోను పరిశుద్ధ దూతలు దైవ ప్రజలకు సేవలందించారు.GCTel 482.1

    క్రీస్తు అనుచరులలో ప్రతీ ఒక్కరికీ ఒక దూత రక్షక భటుడుగా నియమితు డవుతాడు. ఈ పరలోక పరిచారకులు దుష్టుడైన సాతాను దురాగతాల నుంచి నీతిమంతులను పరిరక్షిస్తారు. “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా?” అని ప్రశ్నించినప్పుడు స్వయాన సాతానే ఇది గుర్తించాడు. యోబు 1:9, 10. తన ప్రజలను సంరక్షించటంలో దేవుడుపయోగించిన పరిచారకులను కీర్తనకారుడు ఈ మాటల్లో పరిచయం చేస్తున్నాడు, “యెహోవాయందు భయభక్తులు గల వారిచుట్టు ఆయన దూత కావలియుండి వారిని రక్షించును” కీర్తనలు 34:7. తనపై విశ్వాసంచే వారిని గూర్చి ప్రస్తావిస్తూ ప్రభువిలాగంటున్నాడు, “ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురు” మత్తయి 18:10. దేవుని బిడ్డలకు పరిచర్య చేయటానికి నియమితులైన దూతలకు అన్ని వేళలలోను దేవుని సముఖంలోకి ప్రవేశముంటుంది.GCTel 483.1

    సాతాను మోసాలవల్ల మాలిన ద్వేషానికి గురి అయి, దుష్ట శక్తులతో పోరాడుతున్న దైవప్రజలకు దేవదూతల నిత్య పరిరక్షణ కలదన్న నిశ్చయత ఉన్నది. అట్టి నిశ్చయత అవసరంలేకుండ ఇచ్చింది కాదు. దేవుడు తన బిడ్డలకు కృప సంరక్షణలు వాగ్దానం చేశాడంటే దానికి కారణం వారు ఎదుర్కోడానికి బలమైన దుష్ట శక్తులుండటమే. ఆ శక్తులు ఆసంఖ్యాకంగా ఉన్నాయి. కృతనిశ్చయంతో అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. ప్రమాదభరితమైన వాటి శక్తిని గూర్చి ఎవరూ అజ్ఞానంగా ఉదాసీనంగా ఉండటం క్షేమం కాదు.GCTel 483.2

    స్వభావం, శక్తి, మహిమ విషయాల్లో దురాత్మలు దేవుని రాయబారులైన పరిశుద్ధ దూతలతో సమానులు. ఆదిలో దురాత్మలు కూడా పాపరహితులుగా సృష్టి అయినవారే. కాని పాపం వలన పతనమొంది దేవునిని ఆ గౌరవ పర్చటానికి మానవులను నాశనం చేయటానికి సంఘటితమయ్యారు. సాతాను తిరుగుబాటులో అతనితో చేతులు కలిపారు. సాతానుతోపాటు పరలోకం నుంచి బహిష్కృతులయ్యారు. అప్పటినుంచి దేవుని అధికారానికి వ్యతిరేకంగా యుగయుగాలుగా సాగుతున్న పోరాటంలో అతనికి సహకరిస్తూ వ్యవహరిస్తున్నారు. వారి కూటమి, ప్రభుత్వం, హోదా, స్థాయిలు, మేధ కుటిలత, మానవుల శాంతి ఆనందాలను నాశనం చేయటానికి వారి కుతంత్రాల్ని గురించి లేఖనం వివరిస్తున్నది.GCTel 483.3

    పాతనిబంధన చరిత్రలో వారి ఉనికి, కార్యకలాపాలను గురించి అంతంత మాత్రం సమాచారమే ఉన్నది. కాని క్రీస్తు కాలంలో దురాత్మల శక్తి ప్రభావాలు పెద్ద ఎత్తున ప్రదర్శితమయ్యాయి. మానవ రక్షణ కోసం ఏర్పాటైన ప్రణాళికను అమలుపర్చటానికి క్రీస్తు వచ్చాడు. లోకాన్ని నియంత్రిచే హక్కు తనకున్నదని చూపించుకోటానికి సాతాను కృతనిశ్చయంతో ఉన్నాడు. పాలస్తీనా దేశంలో తప్ప లోకంలో ప్రతీచోటా విగ్రహారాధనను జయప్రదంగా స్థాపించాడు. శోధకుని ప్రాబల్యానికి పూర్తిగా లొంగని ఒకే ఒకదేశమైన పాలస్తీనా ప్రజలకు పరలోక సంబంధమైన వెలుగును అందించటానికి క్రీస్తు వచ్చాడు. ఇక్కడ ప్రాబల్యం కోసం రెండు అధికారాలు పోటీపడ్డాయి. తాను అనుగ్రహించే క్షమాపణను సమాధానాన్ని అంగీకరించడంటూ యేసు చేతులు చాపి ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. తమ కున్నది పరిమితులుగల ప్రాబల్యం మాత్రమే అని, క్రీస్తు ఉద్యమం విజయవంతమైతే తమ అధికారం అంతమొందుతుందని అంధకారశక్తులు గ్రహించాయి. బంధించి ఉన్న సింహంలా సాతాను రెచ్చిపోయాడు. ప్రజల దేహాలపైన ఆత్మలపైన తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు.GCTel 484.1

    మనుషుల్ని దయ్యాలు పట్టటం గురించి నూతన నిబంధన స్పష్టంగా చెబుతున్నది. ఆ బాధకు గురి అయిన వ్యక్తులు స్వాభావిక కారణాలవల్ల వచ్చిన వ్యాధితో మాత్రమే బాధపడేవారు కాదు. తాను పరిశీలిస్తున్న స్థితిని గూర్చి క్రీస్తుకు సంపూర్ణ అవగాహన ఉండేది. దురాత్మల ప్రత్యక్ష ఉనికిని, ప్రాతినిధ్యాన్ని ఆయన గుర్తించేవాడు. దురాత్మల సంఖ్య, శక్తి, వాటి వలన జరిగేహాని, ఆయన దయాళుత్వం-వీటికి చక్కని ఉదాహరణ గెరాసెనుల దేశంలో దయ్యాలు పట్టినవారి స్వస్థతను గూర్చిన లేఖన కథనంలో చూడగలం. పాపం, ఆ పిచ్చివాడు గిలగిల కొట్టుకొంటూ నురుగలు కక్కుతూ అడ్డూ ఆపూ లేకుండా విరుచుకు పడూ, పెద్దకేకలు వేస్తూ, తనకు తాను హాని చేసుకొంటూ, వచ్చేవారికీ, పోయేవారికీ ప్రమాదకరంగా పరిణమించాడు. రక్తం కారుతూ వికృతంగా ఉన్నవారి దేహాలు, వాలకాలు సాతానుకి అమితానందం కలిగించాయి. వారిని అదుపుచేస్తున్న ఒక అపవిత్రాత్మ “నాపేరు సేన. ఏలయనగా మేము అనేకులము” అని చెప్పింది. మార్కు 5:9. రోమా సైన్యంలో సేన అంటే మూడువేల నుంచి ఐదు వేల మంది అని భావం. సాతాను కూడా తన బలగాలను కంపెనీలుగా వ్యవస్థీకరిస్తాడు. ఒక కంపెనీకి చెందిన అపవిత్రాత్మలు ఒక సేనకు తక్కువ గాకుండా ఉంటాయి.GCTel 484.2

    యేసు ఆదేశమివ్వగా దురాత్మలు బాధితుల్ని రక్షకుని పాదాల చెంత విడిచి వెళ్లిపోయాయి. వారు నిర్మలంగా ప్రశాంతంగా తెలివి కలిగి ఉన్నారు. ఆ అపవిత్రాత్మలు పందులమందలోపడి సముద్రంలో మునిగిపోవటానికి సమ్మతి పొందాయి. కాగా గెరాసేనులకు క్రీస్తు ఇచ్చే దీవెనలకన్నా పందుల నష్టమే ప్రధానమయ్యింది. స్వస్థత కూర్చే దైవాన్ని వెళ్లిపోవలసిందిగా కోరారు. సాతాను కోరుకొన్నదీ ఇదే. తమ నష్టానికి హేతువు యేసే అని నిందించి ప్రజల్లో భయాలను పుట్టించి వారు ఆయన చెప్పిన మాటల్ని, వినకుండా చేశాడు సాతాను. నష్టం, దురదృష్టం, బాధ వీటికి అసలు కారకులైన తన అనుచరులను తన్నుతాను విడిచిపెట్టి క్రైస్తవులను నిందించటం సాతానుకి పరిపాటి.GCTel 485.1

    అయితే క్రీస్తు ఉద్దేశాలకు గండిపడలేదు. లాభంకోసం ఆ అపవిత్ర జంతువులను పెంచుతున్న యూదులకు చెంప పెట్టుగా దురాత్మలు పందుల్ని నాశనం చేయటాన్ని ఆయన అనుమతించాడు. క్రీస్తు అదుపుచేసి ఉండకపోతే పందులనే కాదు వాటి కాపలాదారుల్ని, సొంతదారుల్ని కూడా ఆ దయ్యాలు సముద్రంలో ముంచివేసేవే. కాపలా దారులు సొంతదారుల పరిరక్షణ ఆయన శక్తి మూలంగానే జరిగింది. దయగల ప్రభువే వారిని రక్షించాడు. మానవులపట్ల జంతువుల పట్ల సాతాను కాఠిన్యాన్ని శిష్యులు వీక్షించేందుకు ఈ సంఘటన ఏర్పాటయ్యింది. సాతాను దుస్తంత్రాల వల్ల తన శిష్యులు మోసపోయి పడిపోకుండేందుకుగాను తాము ఎదుర్కోవలసి ఉన్న శత్రువును గురించి వారికి పరిజ్ఞానం ఉండాలన్నది రక్షకుని ఉద్దేశం. సాతాను బందీలుగా ఉన్న ప్రజలను విడిపించటానికి తనకున్న శక్తిని ఆ ప్రాంతపు ప్రజలు వీక్షించాలన్నది కూడా ఆయన పరమోద్దేశం. యేసు అక్కడ నుంచి వెళ్లిపోయి నప్పటికినీ దయ్యాల చెర నుంచి విముక్తి పొందిన వ్యక్తులు అక్కడ ఉండి రక్షకుని కృపలను ప్రజలకు చాటి చెప్పారు.GCTel 485.2

    ఇలాంటి ఉదంతాల దాఖలాలు లేఖనాల్లో ఉన్నాయి. సురోఫెనికయ మహిళ కుమార్తెను బాధిస్తున్న దయ్యాన్ని యేసు తన మాటతో వెళ్లగొట్టాడు. మార్కు 7:24 30. “దయ్యము పట్టిన గుడ్డివాడును, మూగవాడును (మత్తయి 12:22.) మూగదయ్యము పట్టిన యువకుడు” (“వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును (మార్కు 9:17 27.) “అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు కపెర్నహోము సమాజమందిరములో” సబ్బాతు ప్రశాంతతను పాడుచేశాడు. (లూకా 4:3336.) కరుణామయ రక్షకుడు అందరినీ స్వస్థపర్చాడు. దాదాపు ప్రతీ సందర్భంలోనూ దయ్యాన్ని తెలివిగల వ్యక్తిగా సంబోధించి బాధిత వ్యక్తిలో నుంచి బయటికి రావలసిందిగా ఆదేశించి అతన్ని ఇక బాధపెట్టవద్దని ఆజ్ఞాపించాడు. కపెర్నహోము సమాజమందిరములోని విశ్వాసులు ఆయన మహాశక్తిని చూసి “ఇది ఎట్టిమాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవుచున్ననని ఒకనితో నొకడు చెప్పుకొనిరి.” లూకా 4:36.GCTel 485.3

    దయ్యాలు పట్టిన వ్యక్తులు ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఉన్నట్లు తరుచు వ్యక్తమవుతుండేది. అయినా ఈ నిబంధనకు కొన్ని మినహాయింపులున్నాయి. మాసవాతీతమైన శక్తిని సంపాదించేందుకు కొందరు సాతాను ప్రభావాన్ని స్వాగతించే వారు. స్వాభావికంగా వీరికి దయ్యాలతో ఎలాంటి సంఘర్షణాలేదు. వ్యర్ధమైన కలలు కని సోదె చెప్పిన సీమోను, గారడివాడైన ఎలిమ, ఫిలిప్పులో పౌలు సీలలను వెంబడించిన యువతి ఈ తరగతికి చెందినవారే.GCTel 486.1

    ప్రత్యక్ష లేఖన నిదర్శనం సమృద్ధిగా ఉన్నప్పటికీ సాతాను అతని భ్రష్ట దూతల ఉనికిని ఉపేక్షించేవారు, అపవిత్రాత్మల ప్రభావం వలన ఏర్పడే ప్రమాదంలో ఉన్నారు. వారి జిత్తులను మనం గ్రహించనంతకాలం వారిదే పైచేయిగా ఉంటుంది. తమ ఆత్మప్రబోధాన్ననుసరిస్తున్నామని భావించే అనేకులు అపవిత్రాత్మల సలహాలను పాటిస్తారు. ఇందువల్లనే లోకాంతం సమీపమయ్యేకొద్ది ప్రజలను మోసగించి నాశనం చేసే తన పనిలో సాతాను నిమగ్నమై ఉన్న తరుణంలో సాతాను అనేవాడు లేడన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రచారం చేస్తాడు. తాను కనపడకుండా, తన పనులను తెలియనీయకుండా వ్యవహరించటమే అతని విధానం.GCTel 486.2

    తన కుతంత్రాలను మనం పసికట్టటమున్న అంశంకన్న సాతానుకి కంపరం పుట్టించే అంశం మరొకటి ఉండదు. తన వాస్తవిక ప్రవర్తనను, ఉద్దేశాలను మరుగు పర్చుకోటానికిగాను తనను ప్రజలు ఎగతాళి చేయటానికి, ధిక్కరించటానికి సరిపడే విధంగానే తన్నుతాను ప్రదర్శించుకొంటాడు. నవ్వు లేదా అసహ్యం పుట్టించే వ్యక్తిగా, కురూపిగా, సగం జంతువు సగం మనిషిగా చిత్రాలలో కనబడటం అతనికి చాలా యిష్టం. తెలివిగల వారులో విద్యావంతులుగా తమ్మును తాము పరిగణించుకొనేవారిగా ఛలోక్తులతో అపహాస్యంలో తన పేరును ఉపయోగించటం విని అతనెంతో సంతోషిస్తాడు.GCTel 486.3

    అతను తన్నుతాను అంత తెలివిగా మరుగుపర్చుకొన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి వున్నాడా? అన్న ప్రశ్న ఎక్కువగా వినబడున్నది. సరళమైన లేఖన సత్యాలు అవాస్తవాలని బోధించే సిద్ధాంతాన్ని మతపరమైన ప్రపంచం అంగీకరించటం సాతాను సాధిస్తున్న విజయానికి నిదర్శనం. తన ప్రభావాన్ని గుర్తించని మనుషుల మనసుల్ని సాతాను తక్షణమే అదుపు చేయగలడు కాబట్టి అతను చేసే ప్రమాదకరమైన పని గురించి, అతని రహస్య బలగాలను గురించి తెలిపి తద్వారా మనం ఆతని దాడులు గురించి అప్రమత్తంగా ఉండేందుకు దైవ వాక్యం మనకు ఎన్నో సాదృశ్యాలిస్తున్నది.GCTel 487.1

    రక్షకుని అనన్య సాధ్యమైన శక్తికింద ఆశ్రయం, విడుదల పొందగలగటమన్న హామీ మనకు లేకపోతే, సాతాను అతని అనుచరగణం తాలూకు శక్తి, వారు చేసే హాని మసకు ఆందోళన కలిగించటం సహజమే. దుష్టుల నుంచి ఆస్తిని ప్రాణాలను కాపాడుకోటానికి, బోల్టులు, తాళాలతో ఇళ్లను భద్రపర్చుకొంటాం. కాని మనల్ని స్వాధీనపర్చుకోటానికి నిత్యము ప్రయత్నించే దుష్టదూతల గురించి ఆలోచించం. మన స్వశక్తితో వారి దాడుల్ని ఎదుర్కోలేం. ఆ దాడుల్ని మనం తిప్పికొట్టలేం కూడా. మనం అనుమతిస్తే వారు మన మనసుల్ని తప్పుదారి పట్టిస్తారు. మనల్ని శారీరకంగా హింసిస్తారు. మన ఆస్తిని ధ్వంసం చేస్తారు. మన జీవితాన్ని నాశనం చేస్తారు. దుఃఖం, నాశనం కలిగించటంలోనే వారికి ఆనందం లభిస్తుంది. దైవ విధులను కాలరాసే, తమను దేవుడు, అపవిత్రాత్మల నియంత్రణకు విడిచిపెట్టేసే వరకు సాతాను శోధనలకు లొంగి నివసించేవారిది భయంకర పరిస్థితి. అయితే క్రీస్తును వెంబడించేవారు వాత్సల్య పూర్వకమైన ఆయన ఆలన పాలన కింద సురక్షితంగా ఉంటారు. వారిని సంరక్షించటానికి బలాధికులైన పరలోక దూతలు నియమితులవుతారు. తన ప్రజల చుట్టూ దేవుడు ఏర్పాటు చేసే రక్షణ కవచాన్ని దుష్టసాతాను ఛేదించలేడు.GCTel 487.2