Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 7—రోముతో లూథర్ తెగతెంపులు

    సంఘాన్ని పోపుమత అంధకారంలో నుంచి స్వచ్ఛమైన విశ్వాస కాంతిలోకి నడిపించటానికి పిలుపు పొందిన వారిలో ప్రథమ గణ్యుడు మార్టిన్ లూథర్. ఉత్సాహం, పట్టుదల, భక్తి విశ్వాసాలు దండిగా ఉన్నవాడు. దేవునికి తప్ప ఎవరికీ భయపడని వాడు. మత విశ్వాసానికి లేఖన పునాదిని తప్ప మరి దేనినీ గుర్తించనివాడు. లూథర్ కన కాలానికి దేవుడు ఎంపిక చేసుకొన్న వ్యక్తి. సంఘాన్ని సంస్కరించటంలోను లోకాన్ని సువార్తతో చైతన్య పర్చటంలోను దేవుడు మహత్కార్యాలు సాధించాడు.GCTel 101.1

    సువార్త ప్రథమ ప్రబోధకుల మల్లే లూథర్ పేదరికం లో నుంచి వచ్చాడు. ఈయన బాల్యం ఒక పేద శ్రామిక కుటుంబంలో గడిచింది. తండ్రి ప్రతిరోజు గనిలో పనిచేసి ఈయనకు విద్య చెప్పించాడు. లూథరిని న్యాయవాదిని చేయాలని తండ్రి ఆశించాడు. అయితే నెమ్మదిగా శతాబ్దాలుగా నిర్మితమవుతున్న గొప్ప మందిర నిర్మాణకుడుగా ఈయన పని చేయాలని దేవుడు సంకల్పించాడు. శ్రమ లేమి కఠోర క్రమశిక్షణ పాఠాలు నేర్పించి జీవితంలో తాను నిర్వహించాల్సిన ముఖ్యమైన పనికి లూథర్ ని అనంత జ్ఞాని అయిన దేవుడు సన్నద్ధం చేశాడు.GCTel 101.2

    లూథర్ తండ్రి దృఢమైన, చురుకైన బుద్ధిగలవాడు. సచ్ఛీలుడు, యధార్ధవంతుడు, దృఢ సంకల్పం కలవాడు. ముక్కుసూటి మనిషి, పర్యవసానాలేమైన విధి నిర్వహణ విషయంలో తన నమ్మకాలననుసరించి వ్యవహరించిన వ్యక్తి. తన కున్న అవగాహనను బట్టి ఆశ్రమ వ్యవస్థ అంటే ఆయనకు నమ్మకం లేదు. తనకు తెలియకుండా లూథర్ ఆశ్రమంలో చేరినప్పుడు అతడు తీవ్ర అసంతృప్తికి గురి అయ్యాడు. అది జరిగిన రెండేళ్ళకుగాని తండ్రి కొడుకుల మధ్య సయోధ్య కుదరలేదు. అయినప్పటికీ అతని అభిప్రాయాల్లో మార్పు రాలేదు.GCTel 101.3

    తమ బిడ్డల చదువు సంధ్యల మీద తర్బీతుమీద లూథర్ తలిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపారు. దైవ జ్ఞానంలోను క్రైస్తవ సుగుణాల ఆచరణలోను వారిని పెంచేందుకు కృషి చేశారు. తన తనయుడు దేవుని నామాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఒకనాడు దైవ సత్యాన్ని ప్రబల పర్చటంలో సాధనం కావాలని కుమారుడు వింటుండగా తండ్రి తరచు ప్రార్ధన చేసేవాడు. తమ శ్రమాజీవితాల్లో సాధ్యపడినంతమేరకు నైతిక లేదా మానసిక సంస్కృతిని వృద్ధిపర్చుకోటానికి కలిగే ప్రతి అవకాశాన్ని ఆ తల్లిదండ్రులు సద్వినియోగ పర్చుకొని ఆనందించే వారు. తమ బిడ్డల్ని భక్తిగాను, ప్రయోజకులుగాను జీవించటానికి రూపు దిద్దేందుకు వారు చిత్తశుద్ధితో పట్టుదలతో కృషి చేసేవారు. తమ దృఢత్వం, బుద్ధిబలం వల్ల కొన్ని సార్లు కఠినంగా వ్యవహరించే వారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగినప్పటికీ వారి క్రమశిక్షణ సరైనదేగాని ఖండనార్హం కాదని సంస్కర్త లూథర్ గుర్తించాడు.GCTel 102.1

    చిన్న వయసులోనే చదవటానికి వెళ్లిన పాఠశాలలో అధికారులు లూథర్ తో కర్కశంగా ఒకింత దౌర్జన్యంగా కూడా వ్యవహరించారు. లూథర్ తల్లిదండ్రులు చాలా పేదవాళ్లు. లూథర్ ఇంకో పట్టణంలో ఉన్న పాఠశాలలో చేరినప్పుడు ఇంటింటికి వెళ్లి పాటలు పాడి భోజనం సంపాదించుకొనేవాడు. భోజనం లేక తరచు ఆకలితో ఉండే వాడు కూడా. ఆ కాలంలో ప్రబలంగావున్న మూఢ, విచారభరిత మత నమ్మకాలు లూథర్ ని భయంతో నింపాయి. రాత్రుళ్లు పండుకొని దేవుని దయగల పరలోకపు తండ్రిగా కాక కఠినమైన న్యాయాధిపతిగా, కఠోర నియంతగా తలస్తూ చీకటితో నిండిన భవిష్యత్ లోకి చూస్తూ నిత్యమూ భయాందోళనలతో వణికేవాడు.GCTel 102.2

    అయినా అనేక తీవ్ర ఆశాభంగాలు ఎదురైనా లూథర్ ఉన్నత నైతిక ప్రమాణాలు మానసిక ఔనత్యం సొంతం చేసుకోటానికి ముందుకు సాగాడు. వాటికి ఆయన హృ దయం ఆకర్షితమయ్యేది. జ్ఞానం కోసం హృదయం తృష్ణగొనేది. ప్రయోగాత్మకమైన అతని మనస్సు డంబమైన పై మెరుగుగల వాటినిగాక యధార్ధమైన, స్థిరమైన, ప్రయోజనకరమైన వాటిని ఎంపిక చేసుకోటానికి నడిపించేది.GCTel 102.3

    పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఎన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు లూథర్ పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. అతని అభివృద్ధి క్రితంకన్న ఇపుడు మెరుగయ్యింది. ఖర్చు తగ్గించుకొని కష్టపడి పని చేయటం ద్వారా లూథర్ తల్లిదండ్రుల ఆర్ధిక సామర్థ్యం పెరిగింది. అతనికి అవసరమైన సహాయాన్ని వారు అందించగలిగారు. బుద్ధిమంతులైన మిత్రుల ప్రభావం తన పూర్వ తర్ఫీతు దుష్ఫలితాన్ని కొంతమేర తగ్గించింది. ఉత్తమ రచయితల పుస్తకాల్ని అధ్యయనం చేసి వారి విలువైన భావాల్ని భద్రపర్చుకొని జ్ఞానుల వివేకాన్ని సొంతం చేసుకొన్నాడు లూథర్. తన పూర్వ అధ్యాపకుల కఠిన క్రమశిక్షణ కింద ఉన్నప్పుడు సయితం తన ప్రతిభను కనపర్చాడు. అనువైన ప్రభావాలు పరిస్థితులు ఒనగూడటంతో మనసు వేగంగా అభివృద్ధి చెందింది. మంచి జ్ఞాపకశక్తి చురుకైన ఊహాశక్తి, చక్కని హేతువాద శక్తి, వాటిని నిర్విరామంగా అనువర్తించటం తన సహచరులందరిలోను అతణ్ని ప్రథమగణ్యుణ్ణి చేశాయి. మానసిక క్రమశిక్షణ అతనికి పరిణతిని అవగాహనం మానసిక చైతన్యం, సూక్ష్మగాహ్యత కలిగించి జీవిత సంఘర్షణలకు అతన్ని సన్నద్ధ పర్చాయి.GCTel 103.1

    లూథర్ అంతరంగంలో దైవభీతి చోటుచేసుకొన్నది. నిశ్చలమైన గురిని కలిగి దేవుని ముందు వినయంగా నివసించటానికి అది అతణ్ని దేవుని వద్దకు నడిపించింది. తాను దేవుని సహాయంపై ఆధారపడటం అవసరమని అతను నిత్యము గుర్తించాడు. అనుదిన కార్యకలాపాల్ని ప్రార్థనతో ప్రారంభించే వాడు. మార్గదర్శకత్వానికి మద్దతుకోసం తన హృదయం ఎడతెగక విజ్ఞాపన చేస్తూ ఉండేది. “సరిగా ప్రార్థన చేయటం అధ్యయనంలో కూడా సగభాగం. అది మెరుగైన భాగం” అని అతను తరచు అనేవాడు. - ది అబినే, పుస్త.2, అధ్యా.2.GCTel 103.2

    ఒకనాడు విశ్వవిధ్యాలయ గ్రంథాలయంలో పుస్తకాలు తిరగేస్తూన్నప్పుడు లూథర్ కి ఒక లేటిన్ బైబిలు కనిపించింది. అలాంటి పుస్తకాన్ని ముందెన్నడూ చూడలేదు. అలాంటి పుస్తకం ఉనికిలో ఉన్నదని కూడా ఎరుగడు. సువార్తలు, పత్రికల భాగాలను బహిరంగ ఆరాధన సమావేశాల్లో ప్రజలకు చదివి వినిపించటం విన్నాడు. అదే సంపూర్ణ బైబిలని భావించాడు. ఇప్పుడు మొదటిసారిగా దేవుని సంపూర్ణ వాక్యాన్ని చూశాడు. భయంతోను విస్మయంతోను ఆ పరిశుద్ధ గ్రంధం పుటలు తిరగేశాడు. గుండె దడదడ కొట్టుకొంటోంది. జీవ వాక్యాన్ని తనకైతాను చదివాడు. మధ్యమధ్య ఆగి “ఇలాంటి పుస్తకాన్ని దేవుడు నాకు సొంతంగా ఇస్తే ఎంత బాగుండును” అని ఆశ్చర్యపడ్డాడు. అదే పుస్తకం, పుస్త.2, అధ్యా.2. అతని పక్క దేవదూతలు నిలిచి ఉన్నారు. తాను సత్యాన్ని గ్రహించేటట్లు దేవుని సింహాసనం నుంచి వచ్చిన కాంతి సత్యనిధులను అతనికి బయలు పర్చింది. అతను ఎన్నడూ దేవుని అగౌరవ పర్చలేదు. తన పాప స్థితిని గూర్చిన గుర్తింపు ముందెన్నటికన్న ఇప్పుడు బలంగా కలిగింది. పాపం నుంచి విముక్తి పొంది దేవునితో సమాధానం కలిగి ఉండాలన్న కోరిక కలిగింది. అది తాను ఆశ్రమంలో ప్రవేశించి సన్యాసి జీవితం జీవించటానికి లూథర్ ని నడిపించింది. ఇక్కడ అతను దినమంతా శ్రమ చేసేవాడు. ఇంటింటి కెళ్లి అడుక్కునేవాడు. గౌరవం ప్రశంసలను ఆకాక్షించే మనసు అతనిది. లూథర్ నిర్వహిస్తున్న నీచ సేవక కృత్యాలు తననెంతో చిన్నపుచ్చి, తన మనోభావాలకు విఘాతం కలిగించేవి. కాని ఆ సిగ్గును సహనంతో భరించాడు. తన పాపాలకు అది నిష్కృతి అని నమ్మాడు.GCTel 103.3

    తన అనుదిన విధుల నడుము లభించే విరామ ఘడియల్ని అధ్యయనానికి వినియోగించేవాడు. నిద్రలేకుండా, తన అతిసామాన్యమైన ఆహారం తీసుకోటానికి కూడా సమయం లేకుండా తన పఠనాన్ని సాగించేవాడు. ప్రధానంగా దేవుని వాక్య పఠనం అతనికి అమితానందాన్నిచ్చేది. ఒక సన్యాసి గృహం గోడకు గొలుసుతో కట్టి ఉంచిన బైబిలును చూశాడు. తరచు దాన్ని పఠించటానికి వెళ్లేవాడు. పాపం విషయంలో తన నమ్మకాలు బలీయమయిన కొద్దీ తన సొంత క్రియల ద్వారా నిష్కృతి పొంది శాంతిని సంపాదించ చూశాడు. అతను అతికఠోరమైన జీవితం జీవించాడు. ఉపవాసం, జాగరణ, స్వీయదండన వీటి ద్వారా తన పాపనై జాన్ని నియంత్రించటానికి ప్రయత్నించాడు. ఆశ్రమ జీవితం కూడ ఈ స్థితిని నివారించలేదు. దేవుని ముందు నిలిచేందుకుగాను పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండటానికి అవసరమైన ఏ త్యాగాన్నైనా చేయటానికి లూథర్ వెనుకాడలేదు. అనంతరం ఆయన ఇలా అన్నాడు, ” నేను నిజంగా ఎంతో భక్తిగల సన్యాసిని, నా హోదాకు సంబంధించిన నియమ నిబంధనల్ని, నిష్టగా ఆచరించాను. సన్యాసి విధుల నిర్వహణ ద్వారా ఒక సన్యాసి ముక్తి పొందగలిగితే అది నాకు తప్పక లభించాలి... నాకృషి ఇంకా కొనసాగాల్సి ఉంటే నా అవమానాన్ని మరణం వరకు భరించాల్సి ఉంటుంది.” అదే పుస్తకం, పుస్త.2, అధ్యా. 3. బాధాకరమైన ఈ క్రమశిక్షణ ఫలితంగా అతను బలహీనుడయ్యాడు. స్పృహ తప్పి పడిపోతూ ఉండేవాడు. దాని పర్యావసానాలనుంచి లూథర్ పూర్తిగా కోలుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పాప భారంతో కుంగిపోతున్న అతని ఆత్మకు ఉపశమనం లభించలేదు. చివరికి అతను నిరాశ నిస్పృహల అంచున నిలిచాడు.GCTel 104.1

    కథ ముగిసిందని లూథర్ అధైర్యం చెందిన తరుణంలో అతనికి ఒక స్నేహితుణ్ణి, సహాయకుణ్ణి లేపాడు దేవుడు. భక్తుడైన స్టాపి లూథర్ కి దేవుని వాక్యాన్ని వివరించి, తన పరిధిని దాటి విషయాలు పరిగణించుమని, దైవ ధర్మశాస్త్ర ఉల్లంఘనకు అంతంలేని శిక్ష అన్న తలంపును విసర్జించుముని, తన రక్షకుడైన యేసును నమ్ముకొమ్మని ఉపదేశించాడు. “నీ పాపాల నిమిత్తం నిన్ను నీవు హింసించుకొనే బదులు రక్షకుని ప్రేమాబాహుబంధంలో చేరు. ఆయనను నమ్ము. ఆయన నీతి జీవితాన్ని, ప్రాయశ్చితార్ధమైన ఆయన మరణాన్ని నమ్ము. దైవ కుమారుని మాటలు విశ్వసించు! నిశ్చితమైన దైవ ప్రేమను నీకు కనపర్చటానికి ఆయన మానవుడయ్యాడు. ” “నిన్ను ముందు ప్రేమించిన ఆ ప్రభువును ప్రేమించు” - అదే పుస్తకం, పుస్త.2, అధ్యా.4. ఈ కృపా కనికరాల దూత వర్తమానం ఇది. ఆయన మాటలు లూథర్ ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఎంతో కాలంగా ఆదరణ పొందుతూ వచ్చిన దోషాలతో ఎన్నో పోరాటాలు పోరాడాక లూథర్ కి సత్యం అవగతమయ్యింది. కల్లోలితమైన ఆయన ఆత్మలో శాంతి సమాధానాలు నెలకొన్నాయి.GCTel 105.1

    లూథర్ ఫ్రీ గా అభిషేకం పొంది ఆశ్రమ జీవితం నుంచి విట్బెర్గ్ విశ్వవిధ్యాలయ ఆచార్యుడుగా నియమితుడయ్యాడు. ఇక్కడ ఆయన లేఖనాల్ని మూలభాషలలో అధ్యయనం చేయటానికి పూనుకొన్నాడు. బైబిలు పై ఉపన్యాసాలివ్వ నారంభించాడు. కీర్తనల గ్రంధం, సువార్తలు, పత్రికలు సామాన్యులు గ్రహించి ఆనందించేటట్లు బోధించాడు. ఆయన మిత్రుడు పై అధికారి అయిన స్టాపెట్టి, వేదిక ఎక్కి దైవ వాక్యం బోధించ వలసిందిగా లూథర్ ని కోరాడు. క్రీస్తు స్థానంలో ప్రజలతో మాట్లాడటానికి తాను యోగ్యుణ్ణి కానని భావిస్తూ లూథర్ సందేహించాడు. దీర్ఘసంఘర్షణ అనంతరం మిత్రుల విజ్ఞాపనలకు లూథర్ అనుకూలంగా స్పందించాడు. అప్పటికే వాక్య వివరణలో ఆయన ఉద్దండుడయ్యాడు. దేవుని కృప ఆయనకు మెండుగా తోడై ఉన్నది. ఆయన వాగాటి శ్రోతల్ని ముగుల్ని చేసింది. సత్యాన్ని ఆయన స్పష్టంగా శక్తిమంతంగా ప్రకటించి వారికి అవగాహన కలిగించాడు. ఆయన ఉద్రేకం వారిని చైతన్యవంతుల్ని చేసింది.GCTel 105.2

    లూథర్ ఇంకా పోపుసంఘం అసలు సిసలైన కుమారుడే. అలా ఉండిపోవటం తప్ప వేరే అభిప్రాయం తనకు లేదు. దేవుని సంకల్పం చొప్పున లూథర్ రోము నగరాన్ని, సందర్శించటం జరిగింది. దారి పొడుగునా ఉన్న సన్యాసుల ఆశ్రమాల వద్ద విశ్రమిస్తూ ఆ ప్రయాణమంతా కాలినడకన కొనసాగించాడు. ఇటలీలోని ఒక ఆశ్రమంలో తాను చూసిన ధనం, వైభవం, విలాసాలకు లూథర్ దిగ్ర్భాంతి చెందాడు. రాజుల ఆదాయం వంటి ఆదాయంతో సన్యాసులు ఉత్తమ భవనాల్లో నివసించారు. మిక్కిలి విలువైన వస్త్రాలు ధరించారు. విలాసవంతమైన బల్లలపై భోంచేశారు. ఆత్మత్యాగంతో కష్టాలతో నిండిన తన జీవితానికి ఈ దృశ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లూథర్ గుర్తించాడు. ఆయన మనస్సు ఆందోళనతో నిండింది.GCTel 105.3

    చివరకు కొంత దూరంలో ఏడుకొండల నగరం కనిపించింది. ఉప్పొంగుతున్న భావోద్వేగంతో నేలపై సాష్టాంగపడి “పరిశుద్ధ రోము నగరమా నమస్కారాలు.” అన్నాడు. - అదే పుస్తకం, పుస్త.2, అధ్యా. 6. లూథర్ ఆ నగరంలో ప్రవేశించి, సంఘాలు దర్శించి, ప్రీస్టులు, సన్యాసులు వల్లించిన విచిత్ర కథలు విని అవసరమైన ఆచారాలన్నింటిని ఆచరించాడు. ప్రతీ చోటా ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగించే దృశ్యాలను చూశాడు. బోధకవర్గం అన్ని స్థాయిల్లోను అక్రమం చోటుచేసుకోటం చూశాడు. ప్రిలేట్లు, అసభ్యంగా పరిహసించటం, మాస్ జరిగేటప్పుడు సైతం చెడుగా ప్రవర్తించటం చూసి నిశ్చేష్టితుడయ్యాడు. సన్యాసులతోను, తక్కిన ప్రజలతోను కలిసి తిరిగినప్పుడు ఆయన చూసింది అవినీతి, ఘోర అనైతిక వర్తన. ఎక్కడకు వెళ్ళితే అక్కడ పరిశుద్దత బదులు అపవిత్రత చూశాడు. ‘రోములో చోటు చేసుకొంటున్న పాపాలు, దుష్కృతాలు ఎవరూ ఊహించలేనివి. కళ్లారా చూస్తేనే తప్ప వాటిని నమ్మటం సాధ్యంకాదు. అందుకే కాబోలు ‘నరకమంటూ ఒకటుంటే దానిమీదే రోము నిర్మితమయ్యింది. అది ప్రతి విధమైన పాపానికి జన్మస్థానం, అన్న మాటలు వినవచ్చాయి. ” అదే పుస్తకం, పుస్త. 2, అధ్యా. 6.GCTel 106.1

    ఎవరైతే మోకాళ్ల మీద “పిలాతు మెట్లు ” ఎక్కుతారో వారందరికి పాపక్షమాపణ వాగ్దానం చేస్తూ పోపు నవీనంగా ఒక డిక్రీ జారీ చేశాడు. ఆ మెట్లు మన ప్రభువు రోము న్యాయ మందిరం నుంచి వచ్చే సమయంలో దిగివచ్చినవని అవి అద్భుత రీతిగా యెరూషలేమునుంచి రోముకు మార్పిడి అయ్యాయని ఒక నమ్మకముండేది. ఒకనాడు లూథర్ ఈ మెట్లను భక్తి పూర్వకంగా ఎక్కుతుండగా ఉరుము వంటి ఒక స్వరం ఇలా తనతో చెప్పటం వినిపించింది. “నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును” రోమా 1:17 వెంటనే లేచి సిగ్గుతోను భయంతోను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ మాటలు లూథర్ ని ఎంతగానో ప్రభావితం చేశాయి. రక్షణ పొందటానికి మానవ సత్కియల్ని నమ్ముకోటం వ్యర్థమని, క్రీస్తు నీతిపై అచంచల విశ్వాసం ఉంచటం అవసరమని అప్పటి నుంచి స్పష్టంగా చూడగలిగాడు. పోపుల మోసాలకు తెరచుకున్న ఆయనకళ్లు ఎన్నడూ మూసుకోవు. ఆయన రోము నుంచి తన ముఖం తిప్పుకొన్నప్పుడు హృదయంలో కూడా దాని నుంచి ముఖం తిప్పుకొన్నాడు. అప్పటి నుంచి - దూరం పెరిగి చివరికి పోపు సంఘంతో లూథర్ సంబంధం తెగిపోయింది.GCTel 106.2

    రోము నుంచి తిరిగి వచ్చిన అనంతరం విట్బెర్గ్ విశ్వవిద్యాలయం లూథర్ కి డాక్టర్ ఆఫ్ డివినిటీ పట్టాను ప్రదానం చేసింది. తాను బహుగా ప్రేమించిన లేఖనాలను అధ్యయనం చేయటానికి ఇప్పుడు ఆయనకు స్వేచ్ఛ లభించింది. పోపుల మాటలను సిద్ధాంతాలను కాక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనంచేసి నమ్మకంగా తన జీవిత కాలమంతా బోధిస్తానని ప్రతిజ్ఞచేశాడు. ఆయన ఇక కేవలం సన్యాసి లేదా ఆచార్యుడు మాత్రమే కాదు. అధికారం పొందిన బైబిలు ప్రభోధకుడు. సత్యం కోసం ఆకలి దప్పులు గొన్న దేవుని మందకు కాపరిగా ఆయన పిలుపు పొందాడు. పరిశుద్ధ లేఖనాధికారంపై ఆనుకొని ఉన్న సిద్ధాంతాలను తప్ప మరి వేటినీ క్రైస్తవులు అంగీకరించ కూడదని నొక్కి చెప్పాడు. ఈ మాటలు పోపుల సర్వాధికారానికి గొడ్డలి పెట్టు. ఆ మాటల్లో సంస్కరణ, ముఖ్య సూత్రాలు ఉన్నాయి.GCTel 107.1

    దేవుని వాక్యంకన్నా మానవ సిద్ధాంతాలను అభిమానించటంలో ఉన్న అపాయాన్ని లూథర్ చూశాడు. దీర్ఘ కాలంగా ప్రజల్ని అదుపుచేస్తున్న తత్వాన్ని, వేదాంతాన్ని వ్యతిరేకించాడు. విద్వాంసుల ఊహాజనిత అవిశ్వాసాన్ని నిర్భయంగా ఖండించాడు. అలాంటి అధ్యయనాలు నిరరకమే కాకుండ ఎంతో హానికరమని గర్జిస్తూ తన శ్రోతల మనసుల్ని తత్వవేత్తలు వేదాంత పండితుల కుతర్కాల నుంచి మళ్లించి ప్రవక్తలు అపోస్తలులు బోధించిన నిత్యసత్యాలకు తిప్పటానికి ప్రయత్నించాడు.GCTel 107.2

    తన మాటల్ని ఆత్రుతగా వింటున్న జనసమూహాలకు ఆయన అందించిన వర్తమానం ప్రశస్తమైనది. ముందెన్నడూ అలాంటి బోధలు వారు విన ఉండలేదు. ప్రేమగల రక్షకుణ్ణి ఆయన ప్రాయశ్చితార్ధ బలి ద్వారా క్షమాపణ, సమాధానాల్ని గూర్చిన సువార్త వారి హృదయాల్లో సంతోషానందాలు నింపి వారిలో నిత్యజీవ నిరీక్షణను పుట్టించింది. విటెన్ బర్గ్ లో ఒక దీపం వెలిగింది. దాని కిరణాలు లోకమంతటిలోనూ ప్రకాశించాలి. దానివెలుగు ప్రకాశవంతమవుతూ లోకాంతం వరకు కొనసాగాలి. GCTel 107.3

    కాగా వెలుగు చీకట్లు కలిసి వుండలేవు. సత్యానికి, అసత్యానికి మధ్య అనివార్య సంఘర్షణ సాగుతుంది. ఈ రెండింటిలో ఒక దానికి మద్దతు పలికి సమర్ధించటం, రెండోదానిపై దాడిచేసి తోసిపుచ్చటమౌతుంది. రక్షకుడిలా అన్నాడు, నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునేగాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.” మత్తయి10:34. సంస్కరణోద్యమం ప్రారంభమైన కొన్ని సంవత్సరాలకు లూథర్ ఇలా అన్నాడు, “నన్ను దేవుడు నడిపించటం లేదు, ముందుకు నెట్టుతున్నాడు, నన్ను మోసుకుపోతున్నాడు. నేను నా అధికారిని కాదు. శాంతిగా నివసించాలన్నది నా ఆశ. కాని ఆయన నన్ను గంధరగోళాల మధ్య, విప్లవాల మధ్య పడవేస్తున్నాడు.” ది అబినే, పుస్త.5, అధ్యా. 3. ఇప్పుడు పోటీకి ఆయన నన్ను ప్రోత్సాహిస్తున్నాడు.GCTel 107.4

    రోమను సంఘం దైవకృపను ఒక కొనుగోలు వస్తువు చేసింది. దాని వేదికల పక్క రూకలు మార్చే వారి బల్లలు (మత్తయి 21:12) ఏర్పాటయ్యాయి. దాని ఆవరణం క్రయ విక్రయదారుల కేకలతో గందగోళంగా తయారయ్యింది. రోము నగరంలో పేతురు దేవాలయ నిర్మాణానికి నిధులు సమకూర్చే మిషతో పాపక్షమా పత్రాలు పోపు అధికారంతో బహిరంగంగా విక్రయించారు. నేర ద్రవ్యంతో దైవారాధనకు ఆలయం నిర్మితం కానుంది. పాప జీతంతో దానికి పునాది పడింది. తన బలసంపదల వృద్ధికి రోము అవలంబించిన మార్గమే దాని అధికారం ఔన్నత్యం చావుదెబ్బ తినటానికి దారితీసింది. పోపుల అధికారాన్ని కృతనిశ్చయంతోను జయ ప్రదంగాను ప్రతిఘటించే ప్రత్యర్థుల్ని మేలుకొలిపి, పోపు సింహాసనాన్ని కుదిపివేసి, అతడి తలమీది మూడు మెట్ల కిరీటాన్ని పడగొట్టటానికి జరిగిన పోరాటానికి దారితీసిందీ ఇదే. GCTel 108.1

    జర్మనీలో పాపక్షమా పత్రాలు విక్రయించేందుకు నియమితుడైన అధికారిపేరు టెట్ జెల్. సమాజ పరంగాను, దైవధర్మశాస్త్ర పరంగాను అతినికృష్ణనేరాలు చేసినందుకు టెట్ జెల్ నేరస్తుడిగా తీర్పు పొందాడు. తన నేరాలకు శిక్ష తప్పించుకొని పోపు అవినీతి పథకాలను నిర్వహించే ఉద్యోగం సంపాదించాడు. సులువుగా మోసపోయే మూఢ నమ్మకాలుగల అమాయక ప్రజల్ని వంచించటానికి పచ్చి అబద్ధాల్ని, వింత కథల్ని వల్లించేవాడు. ప్రజల్ని పోపుల అధికారం కింద ఉంచటానికి అధికార దాహం గల నాయకుల అధికారాన్ని ఆదాయాన్ని పెంచటానికి బైబిలుని వారికి దూరం చేయటం జరిగింది. (జాన్ సి.ఎల్.గీసలర్, ఏ కంపోడియమ్ ఆఫ్ ఎక్లీసియాస్టికల్ హిస్టరి పెర్ 4, సెక్ష 1, పేర 5 చూడండి.)GCTel 108.2

    టెట్ జెల్ ఒక పట్టణంలో ప్రవేశించేటప్పుడు “దేవుని కృప పరిశుద్ద ఫాదర్ కృప మీ గుమ్మం వద్ద ఉన్నది” అని ప్రకటిస్తూ అతడి ముందు ఒక దూత వెళ్లేవాడు. - ది అబినే, పుస్త 3, అధ్యా 1. దివి నుంచి భువికి దేవుడే దిగి వచ్చినట్లుగా దేవదూషకుడైన ఆ నయవంచకుణ్ణి, ప్రజలు స్వాగతించే వారు. ఆ హేయవర్తకం ఆలయంలోనే సాగేది. వేదిక ఎక్కి టెట్ జెల్ పాపక్షమాపణ పత్రాలు దేవుని ప్రశస్త వరమంటూ ప్రశంసించేవాడు. తానిచ్చే పాపపరిహార పత్రాల ప్రభావంవల్ల కొనుగోలుదారుడు తర్వాత తర్వాత చేయగోరే పాపాలకు క్షమాపణ లభిస్తుందని, పశ్చాత్తాపం అవసరముండదని” ఆతగాడు ప్రకటించే వాడు. - అదే పుస్తకం పుస్త3, అధ్యా 1. అంతేకాదు పాపపరిహార పత్రాలకు బతికి ఉన్న వారినే కాక మరణించిన వారినికూడా రక్షించే శక్తి ఉన్నదని, తన గళాలో డబ్బు పడ్డ శబ్దం వినిపించిన వెంటనే ఎవరి తరపున ఆ డబ్బు జమయ్యిందో ఆవ్యక్తి ఆత్మ పాపప్రాయశ్చిత్త స్థలం నుంచి పరలోకానికి బయలుదేరుతుంది అని తన శ్రోతలకు వాగ్దానం చేసేవాడు. (కె. ఆర్. హేగెన్ బాక్ హిస్టరీ ఆఫ్ రిఫర్మేషన్, సం 1, పుట 96 చూడండి.)GCTel 108.3

    సూచక క్రియలు చేసే శక్తి అపోస్తలుల వద్ద కొనాలని సీమోను ప్రయత్నించినప్పుడు ” నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొని నందున నీ వెండి నీతోకూడ నశించును గాక” (అపో.8:20) అని పేతురు మందలించాడు. అయితే టెట్ జెల్ అమ్మకాల్ని వేలాది ప్రజలు ఆతృతగా అందుకొన్నారు. బంగారం, వెండి, ఖజానాలోకి ప్రవహించాయి. పాపాన్ని ప్రతిఘటించి జయించటానికి పశ్చాత్తాపం, విశ్వాసం, కృషి అవసరమైయుండగా డబ్బుతో కొనగలిగిన రక్షణను సునాయాసంగా సంపాదించవచ్చు. GCTel 109.1

    రోమును సంఘంలోని విద్యావంతులు భక్తిపరులు పాపక్షమాపణా సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. హేతువాదానికి దైవా వేశానికి రెంటికి విరుద్ధంగా ఉన్న అబద్దపు హక్కుల్ని నమ్మనివారు చాలా మంది ఉన్నారు. ఈ అపవిత్ర వ్యాపారానికి వ్యతిరేకంగా ఏలేటు లెవరూ గళమెత్తటానికి సాహసించలేదు. కాని ప్రజల మనసులు ఆందోళనతో అశాంతితో నిండాయి. తన సంఘాన్ని పవిత్రపర్చటానికి దేవుడు ఏదో సాధనం ద్వారా పని చేస్తాడని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు.GCTel 109.2

    ఇంకా పోపు మతాభిమానే అయినా పాపక్షమా విక్రయదారుల దేవదూషణకరమైన ఊహలు గురించి లూథర్ తీవ్ర దిగ్ర్భాంతికి గురి అయ్యాడు. తన సభ్యులలో చాలామంది పాపక్షమాపణ పత్రాలు కొని తన వద్దకు వచ్చి తాము చేసిన ఆయా పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నారు. వారు కోరుతున్న క్షమాపణ పశ్చాత్తాప పడి మార్పు కోరుకుంటున్నందుకు కాదు. కాని పాపక్షమా పత్రం కొన్నందుకు లూథర్ అలాంటి వారికి క్షమాపణ ఇవ్వలేదు. పశ్చాత్తాపడి తమ జీవితాల్ని మార్చుకుంటేనేతప్ప తమ పాపాల వలన నాశనం రాక తప్పదని హెచ్చరించాడు. గొప్ప ఆంధోళనతో వారు టెట్ జెల్ వద్దకు వెళ్లి తమ బోధకుడు తానిచ్చిన క్షమా పత్రాలను నిరాకరించాడని పిర్యాదు చేశారు. కొందరైతే తమ డబ్బు తిరిగి ఇచ్చేయమని ధైర్యంగా డిమాండ్ చేసేవారు. ఆ సన్యాసి ఉగ్రుడయ్యేవాడు. అతి భయంకర శాపాలు ఉచ్చరించేవాడు. ప్రజలు సమావేశమయ్యే బహిరంగ స్థలాలకు నిప్పు పెట్టించేవాడు. “తన మిక్కిలి పరిశుద్ధ పాపక్షమా పత్రాల్ని వ్యతిరేకించటానికి సాహసించే సిద్ధాంత వ్యతిరేకుల్ని సజీవ దహనం చేయటానికి తనకు ఆదేశాలు జారీ అయ్యాయని ప్రకటించేవాడు” - డి.అబినే, పుస్త 3, అధ్యా.4.GCTel 109.3

    సత్యసమర్ధకుడుగా లూథర్ ఇప్పుడు తన పనిలో నిమగ్నుడయ్యాడు. బోధకుడి వేదికనుంచి హెచ్చరిక చేస్తూ ఆయన స్వరం వినిపించింది. హేయమైన పాప స్వభావాన్నిప్రజలకు వివరించి మానవుడు తనంతట తానుగా దాని అపరాధాన్ని తగ్గించటంగాని, దాని శిక్షను తప్పించుకోటంగాని చేయలేడని బోధించాడు. పాపం నిమిత్తం పశ్చాత్తాపపడి క్రీస్తు మీద విశ్వాసముంచట మొక్కటే పాపి రక్షణకు మార్గం. క్రీస్తు కృప కొనటానికి దొరికే వస్తువుకాదు. అది ఉచిత వరం. పాపక్షమా పత్రాలు కొనవద్దని సిలువను పొందిన విమోచకుణ్ణి విశ్వాసం ద్వారా చూడవలసిందని ప్రజలకు హితవు పలికాడు. అవమానం, ప్రాయశ్చిత్తం ద్వారా రక్షణ పొందటానికి తాను చేసిన వ్యర్థ ప్రయత్నాలు పొందిన బాధాకరమైన అనుభవాల్ని వివరించి, తన్ను గురించి తాను ఆలోచించటం మాని క్రీస్తుమీద నమ్మకం ఉంచటం ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని కనుగొన్నానని తన శ్రోతలకు తెలిపాడు.GCTel 110.1

    టెట్ జెల్ తన వ్యాపారాన్ని అసత్య నటనల్ని కొనసాగించిన కొద్దీ ఆ దురాచారాన్ని గట్టిగా ప్రతిఘటించాలని లూథర్ తీర్మానించు కొన్నాడు. త్వరలోనే ఒక తరుణం వచ్చింది. విట్బె ర్గ్ లోని ఆలయంలో చాలా అవశేషాలు (రిలిక్స్) ఉండేవి. కొన్ని సెలవుదినాలప్పుడు ప్రజలకు ప్రదర్శించే వారు. ఈ తరుణాల్లో దేవాలయానికి వెళ్లి క్షమాపణ యాచించే ప్రజలకు సంపూర్ణ క్షమాపణ లభించేది. అందువల్ల ఆ దినాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో ఆలయానికి వెళ్లేవారు. ఈ ముఖ్య సందర్భాల్లో ఒకటైన సర్వభక్తుల (అల్ సెయింట్స్) పండుగ వస్తున్నది. దానికి ముందురోజు అప్పుడే ఆలయానికి వస్తున్న జనసమూహాల్తో కలిసి వచ్చి పాప పరిహార సిద్ధాంతాన్ని ఖండిస్తూ తొంభై అయిదు అంశాలతో ఒక సిద్ధాంత వ్యాస పత్రాన్ని ఆ ఆలయం తలుపుమీద అంటించాడు. లూథర్ ఆ వ్యాసాంశాలు నిజంకాదని తర్కించదలచే వారుంటే మర్నాడు విశ్వ విద్యాలయం వద్ద వాటిని సమర్ధించటానికి తాను సంసిద్ధమని లూథర్ ప్రకటించాడు.GCTel 110.2

    ఆయన వ్యాసాంశాలు సర్వజనుల దృష్టిని ఆకర్షించాయి. ప్రజలు వాటిని మళ్లీ మళ్లీ చదపటం అన్ని ప్రాంతాల్లోను వాటిని వల్లించటం జరిగింది. విశ్వవిద్యాలయంలోను ఆ నగరమంతటిలోను ఉద్రేకం ఉత్సాహం వెల్లివిరిశాయి. పాపాల్ని క్షమించే అధికారం, శిక్షను మాఫీ చేసే అధికారం పోపుకుగాని మరేయితర వ్యక్తికిగాని ఎన్నడూ లేదని ఇవి వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకమంతా ఒక ప్రహసనం - ప్రజల మూఢ నమ్మకాల్ని సొమ్ము చేసుకోటానికి పన్నిన పన్నాగం. మోసపూరితమైన తన నటనల్ని నమ్మే ఆత్మలను నాశనం చేయటానికి సాతాను వ్యూహం అని క్రీస్తు సువార్త సంఘానికున్న మిక్కిలి విలువైన నిధి అని అందులో వ్యక్తమైన దైవ కృప పశ్చాత్తాపం, విశ్వాసం ద్వారా వెదకే వారికి ఉచితంగా లభిస్తుందని కూడా స్పష్టంగా వ్యక్తం చేయటం జరిగింది.GCTel 111.1

    లూథర్ సిద్ధాంత వ్యాసాంశాలు చర్చకు సవాలు విసిరాయి. అయితే ఆ సవాలును అంగీకరించటానికి ఎవరూ సాహసించలేదు. ఆయన వేసిన ప్రశ్నలు కొన్ని రోజులకు జర్మనీ దేశమంతటా, కొన్ని వారాలకు క్రైస్తవ లోకమంతటా చర్చినీయాంశాలయ్యాయి. సంఘంలో ప్రబలుతున్న భయంకర పాపాన్ని, చూసి మనస్తాపం చెందుతూ దాని పురోగమనాన్ని ఆపలేని స్థితిలో ఉన్న అనేకమంది రోమును మతవాదులు ఆ వ్యాసాంశాలను ఎంతో ఆనందంతో చదివి వాటిలో దేవుని స్వరాన్ని గుర్తించారు. రోము అధికార క్షేత్రం నుంచి వరదల్లే పొంగుతున్న అవినీతిని ఆపటానికి ప్రభువు తన దయగల హస్తాన్ని చాపాడని వారు భావించారు. తన తీర్మానాలపై విజ్ఞాపనకు తావులేదని చెప్పుకునే అహంకార పూరిత అధికారానికి కళ్లెం పడుతున్నందుకు యువరాజులు, న్యాయాధికారులు రహస్యంగా సంతోషించారు.GCTel 111.2

    తమ భయాందోళనలను చలార్చిన కుతర్కాలు తుడుచుకు పోవటం చూసి పాప ప్రియులు, మూఢవిశ్వాసులు అయిన జనసమూహాలు భయభ్రాంతులయ్యారు. నేరానికి చేయూతనిచ్చే తమ పనికి అంతరాయం కలుగుతున్నట్లు, తమ లాభాలకు గండి పడుతున్నట్లు గుర్తించిన కుటిల మతగురువులు ఉగ్రులై తమ అసత్య నటనల్ని సమర్ధించుకోటానికి ఏకమయ్యారు. సంస్కరణ వాది లూథర్ తీవ్ర విమర్శకుల్ని ఎదుర్కోవలసి ఉన్నాడు. ఉద్వేగాలకులోనై దుందుడుకుగా వ్యవహరిస్తున్నాడని కొందరు ఆయనను విమర్శించారు. ఆయన ఊహమీద ఆసుకోని వ్యవహరిస్తున్నాడని ఆయనను దేవుడు నడిపించటం లేదని, కాని అహంభావం, దురుసుతనం వలన అలా ప్రవర్తిస్తున్నాడని మరికొందరు నిందించారు. ” ఒకవ్యక్తి ఒక నూతన అభిప్రాయాన్ని రవ్వంత గర్వంతో వెలిబుచ్చటం తద్వారా పోట్లాటలు రేపుతున్నాడన్న నిందలు పడటం ఎవరెరుగరు? ... క్రీస్తును హతసాక్షులను ఎందుకు చంపారు? ఎందుకంటే ఆ కాలం వివేకాన్ని వారు తృణీకరించారు. ముందు సనాతనాభిప్రాయాన్ని దీన మనస్సుతో పరిగణించకుండా వారు నూతన భావాలను వెలువరించారు అని లూథర్ స్పందిచాడు.GCTel 111.3

    ఆయన ఇంకా ఇలా అన్నాడు, “నేను చేస్తున్న పనిని మానవ జ్ఞానాన్ని బట్టి నేను చేయటంలేదు. దేవుని ఉపదేశం వల్ల చేస్తున్నాను. ఈపని దేవుని వల్ల జరుగుతుంటే దానిని ఎవరు ఆపగలరు? ఇది ఆయన మూలంగా జరగకుంటే దాన్ని ఎవరు కొనసాగించగలరు? నా యిష్టంగాని, వారి యిష్టంగాని మా యిష్టంగాని కాదు. పరిశుద్ధుడవైన పరలోకపు తండ్రీ, నీ యిష్టమే” అదే పుస్తకం, పుస్త 3, అధ్యా 6.GCTel 112.1

    తన పనిని ప్రారంభించటానికి లూథర్ ఆత్మ ప్రేరితుడైనప్పటికీ కఠిన సంఘర్షణలతోనే అది ముందుకు సాగాల్సివుంది. ప్రత్యర్థుల అపవాదులు, ఆయన ఉద్దేశాన్ని వారు వక్రీకరించటం, ఆయన ప్రవర్తన లక్ష్యాలపై వారు బురద చల్లట-అన్నీ ఆయన మీదకు వరదలై వచ్చి పడ్డాయి. వాటి మూల్యం కూడా కొంత ఉన్నది. సంస్కరణ కృషిలో సంఘంలోను పాఠశాలల్లోను ఉన్న ప్రజానాయకులు తనతో చేతులు కలుపుతారని ఆయన దృఢంగా నమ్మాడు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు ప్రోత్సహిస్తూ పలికిన మాటలు ఆయనలో సంతోషానందాల్ని నిరీక్షణను పుట్టించాయి. ఆశాభావంతో నిండిన తాను సంఘానికి మంచిరోజు వస్తుందని గ్రహించాడు. అయితే ఉద్రేకం నిందగా ఖండనగా మారింది. సంఘానికి దేశానికి చెందిన అనేకమంది అధికారులు ఆయన సమర్పించిన సిద్ధాంత వ్యాసాంశాల యధార్ధతను గుర్తించారు. కాగా ఆ సత్యాలను అంగీకరించటంవల్ల పెద్ద మార్పులు చేయాల్సి వస్తుందని గ్రహించారు. ప్రజల్ని చైతన్యపర్చి సంస్కరించటం రోము అధికారాన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు రోము బొక్కసంలోకి ప్రవహిస్తున్న నిధుల ఏరులను ఆపి తద్వారా పోపు నేతల దుర్వ్యయాన్ని విలాసాల్ని అడ్డగించట మౌతుంది. ఇంకా రక్షణ కోసం ప్రజలు యేసువంక మాత్రమే చూస్తూ బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఆలోచించి వ్యవహరించటం బోధించటం పోపు సింహాసనాన్ని పడదోసి చివరకు పోపుల అధికారాన్ని అంతం చేయటమే. ఈ కారణంగా వారు దేవుడనుగ్రహించిన జ్ఞానాన్ని విసర్జించి తమకు సత్యాన్ని ప్రకటించటానికి దేవుడు పంపిన వ్యక్తిని వ్యతిరేకించి తద్వారా క్రీస్తుకి సత్యానికి వ్యతిరేకంగా నిలిచారు.GCTel 112.2

    తన్నుతాను పరిగణించు కొన్నప్పుడు లూథర్ వణికాడు- ఒక్కడు లోకంలో మిక్కిలి శక్తిమంతమైన అధికారాన్ని వ్యతిరేకించటం, సంఘ అధికారాన్ని వ్యతిరేకించటానికి పూనుకోటంలో తనసు దేవుడు నడిపిస్తున్నాడా అన్న సందేహం కొన్ని సార్లు లూథర్ కి కలిగింది. “ఎవరి ముందు లోకరాజులు సర్వప్రపంచం వణకటం జరుగుతుందో ఆ పోపు హుందాతనాన్ని వ్యతిరేకించటానికి నేనేపాటివాణ్ణి?... ఈ మొదటి రెండు సంవత్సరాల్లో నా హృదయం ఎంత బాధ పడిందో, ఎంతగా అధైర్యం చెందిందో ఎవరికీ తెలియదు. నేనెంత నిస్పృహకు గురి అయ్యానో చెప్పగలను” అదే పుస్తకం, పుస్త 3, అధ్యా 6. అయితే ఆయన పూర్తిగా అధైర్యం చెందనక్కరలేదు. మానవ సహాయం అందనప్పుడు దేవుని మీదే ఆధారపడి సర్వశక్తి గల ఆ ప్రభువు భుజం మీద ఆనుకొని క్షేమంగా ఉండగలనని ఆయన నేర్చుకొన్నాడు.GCTel 113.1

    సంస్కరణోద్యమంలో ఒక మిత్రుడికి లూథర్ ఇలా రాశాడు, “అధ్యయనం ద్వారా, ప్రతిభ ద్వారా లేఖనాలను అవగాహన చేసుకోలేం. నీ మొదటి విధి ప్రార్ధించటం. తన కృపాబాహుళ్యం నుంచి నిజమైన అవగాహనను అనుగ్రహించుమని ప్రభువుని అర్ధించు. వాక్యానికి కర్త అయిన ఆయనే తన వాక్యానికి అర్ధం చెప్పగలడు. ఆయనే ఇలా అన్నాడు. వారికి దేవుడు బోధిస్తాడు’ నీ సొంత కృషి ద్వారా, ఆవగాహన ద్వారా ఏదో సాధిస్తానని నిరీక్షించకు. దేవుని మీద ఆయన ఆత్మ ప్రభావం మీద మాత్రమే నమ్మకం పెట్టుకో. ఎంతో అనుభవమున్న ఒక వ్యక్తి చెబుతున్న మాట మీద దీన్ని విశ్వసించు.”. అదే పుస్తకం, పుస్త 3, అధ్యా 7. ప్రస్తుతకాలానికి అవసరమైన గంభీర సత్యాలను ఇతరులకు ప్రకటించటానికి తమను దేవుడు పిలిచాడని వ్యక్తులు నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం. ఇక్కడ ఒకటి వున్నది. ఈ సత్యాలు సాతాను శత్రుత్వాన్ని అతడు అల్లిన కథలను నమ్మిన ప్రజల శత్రుత్వాన్ని రేపుతాయి. దుష్ట శక్తులతో పోరాటంలో మానవ బుద్ది బలం విజ్ఞానంకన్న ఎక్కువే అవసరమవుతుంది.GCTel 113.2

    ప్రత్యర్ధులు ఆచారాన్ని, సంప్రదాయాన్ని లేదా పోపు మాటల్ని అధికారాన్ని ఉటంకించినప్పుడు వారికి లూథర్ బైబిలుతో మాత్రమే బదులు పలికాడు. ఇక్కడ వారు సమాధానం చెప్పలేని వాదనలున్నాయి. అందుచేత సాంప్రదాయానికి మూఢ విశ్వాసానికి బానిసలైన మత గురువులు యూదులు యేసు రక్తాన్ని కోరుతూ కేకలు వేసినట్లు లూథర్ రకాల్ని కోరారు. “అతడు సంఘ సిద్ధాంత వ్యతిరేకి” అని రోము తాలూకు ఆవేశపరులు కేకలు వేశారు. “ఇలాంటి సిద్ధాంత తీవ్ర వ్యతిరేకిని ఒక గంట కూడా జీవించనీయటం దేశద్రోహ చర్య. ఇతడికి ఉరికంబం వెంటనే ఏర్పాటు చేయండి.” అన్నారు. అదే పుస్తకం, పుస్త 3, ఆధ్యా 9. కాని లూథర్ వారి ఆగ్రహానికి బలికాలేదు. దేవుడు ఆయనకొక పనిని నియమించాడు. ఆయనను పరిరక్షించటానికి దేవుడు పరలోక దూతలను పంపాడు. ఇలాగుండగా లూథర్ వద్దనుంచి ప్రశస్త సత్యాన్ని అందుకొన్న అనేకమంది సైతాను ఆగ్రహానికి గురి అయ్యారు. వారు సత్యం కోసం హింసను మరణాన్ని భయంలేకుండా స్వీకరించారు.GCTel 113.3

    లూథర్ బోధనలు జర్మనీ దేశంలో ఉన్న ఆలోచనాపరుల గమనాన్ని ఆకర్షించాయి. ఆయన ప్రసంగాలు రచనల నుంచి వెలుగు కిరణాలు ప్రసరించి వేలాది ప్రజల్ని మేలుకొలిపి జ్ఞానంతో నింపాయి. దీర్ఘకాలంగా సంఘంలో అర్ధరహిత లాంచనాల స్థానే సజీవ విశ్వాసం చోటుచేసుకొంటున్నది. రోమను మతం తాలూకు మూఢ నమ్మకాలపై ప్రజల విశ్వాసం దినదినం తగ్గిపోతున్నది. పక్షపాత ధోరణి తొలగిపోతున్నది. దేవుని వాక్యం ప్రజల హృదయాల్లోకి చొచ్చుకొని పోయే రెండంచుల ఖడ్గం లాంటిది. ప్రతి సిద్ధాంతాన్ని ప్రతీ హక్కును వాక్యమనే గీటురాయితో లూథర్ పరీక్షించాడు. ఆధ్యాత్మిక ప్రగతికోసం ప్రతిచోటా ఆసక్తి నిద్రలేస్తున్నది. నీతికోసం ఇంతకు ముందులేని ఆకలిదప్పులు కనిపిస్తున్నాయి. మానవాచారాలకు భూలోక మధ్యవర్తులకు ఇంతకాలంగా ఆకర్షితమైన కళ్లు ఇపుడు పశ్చాత్తాపంతో, విశ్వాసంతో యేసుపై, సిలువను పొందిన యేసుపై కేంద్రీకృతమవుతున్నాయి.GCTel 114.1

    బహుగా విస్తరించిన ఈ ఆసక్తి పోపు అధినేతలకు మరింత భయం కలిగించింది. సిద్ధాంత వ్యతిరేకత అభియోగానికి సమాధానం చెప్పటానికి రోము అధికారుల ముందు నిలవవలసిందిగా లూథర్ కి సమన్లు అందాయి. ఆ ఆదేశం ఆయన మిత్రుల్ని భయకంపితుల్ని చేసింది. హతసాక్షుల రక్త మద్యంతో మత్తిల్లిన ఆ దుష్ట నగరంలో ఆయనకు సంభవించగల ప్రమాదం గురించి వారికి బాగా తెలుసు. రోము నగరానికి వెళ్లవద్దని వారు ఆయనకు చెప్పారు. ఆ పరీక్షను జర్మనీలోనే ఎదుర్కోవలసిందని మిత్రులు అభ్యర్థించారు. GCTel 114.2

    చివరికి ఈ ఏర్పాటు ఆమోదం పొందింది. ఆ పిర్యాదును పరిశీలించటానికి పోపు ప్రతినిధి నియమితుడయ్యాడు. ఈ అధికారికి పోపు పంపిన సూచనల్లో లూథర్ ని సిద్ధాంత వ్యతిరేకిగా ప్రకటించటం జరిందన్నది ఒకటి. కాబట్టి ఈ ప్రతినిధికిచ్చిన బాధ్యత “ఎలాంటి జాప్యం లేకుండా లూథరిని శిక్షించటం, నిర్భంధించటం” ఆయన నిశ్చలంగా ఉండి ప్రతినిధి ఆయనను బంధించలేని పరిస్థితి ఏర్పడితే జర్మనీలోని ప్రతి ప్రాంతం నుంచి ఆయనను ఆయన అనుచరులను నిషేదించటానికి , బహిష్కరించటానికి, శపించటానికి, వెలివేయటానికి ప్రతినిధికి అధికారం ఇచ్చాడు”. అదే పుస్తకం, పుస్త 4, అధ్యా 2. సిద్ధాంత వ్యతిరేకతను నిర్మూలించేందుకు, చక్రవర్తి మినహా దేశంలో ఉన్న ఎవరినైనా దేశంలోను సంఘంలోను ఎంత అధికులైనప్పటికీ వారు లూథర్ ని ఆయన అనుచరుల్ని బంధించి రోముకు అప్పగించకపోతే వారందరినీ వెలివేయాలని ప్రతినిధిని పోపు ఆదేశించాడు.GCTel 114.3

    పోపు మతతత్వ వాస్తవ స్వభావం ఇక్కడ ప్రస్సుటంగా కనిపిస్తున్నది. క్రైస్తవ సూత్రాల ఛాయగాని, సామాన్య న్యాయంగాని ఆ పత్రమంతటిలో ఎక్కడా కనిపించదు. లూథర్ రోముకు చాలా దూరంలో ఉన్నాడు. తన అభిప్రాయల్ని విశదం చేయటానికి సమర్ధించుకోటానికిగాని ఆయనకు అవకాశం లేదు. అయినా తనపై ఉన్న ఆరోపణలను దర్యాప్తు చేయకముందే ఆయనను సిద్ధాంత వ్యతిరేకి అని ప్రకటించారు. అదే రోజు ఆయనను హెచ్చరించారు, నిందించారు, విమర్శించారు. ఆయనకు శిక్ష విధించారు. సంఘంలోను దేశంలోను తప్పులేని ఒకే ఒక అధికారం, పరిశుద్ధ పాదర్ అని తన్నుతానే పిలుచుకొంటున్న వ్యక్తి వలన ఇదంతా జరిగింది.GCTel 115.1

    ఈ సమయంలో లూథర్ కి యధార్ధమైన మిత్రుడి సానుభూతి, హితవు అవసరమైన తరుణంలో దేవుడు మెలాంగ్ తనను విట్బెర్గ్ కి పంపాడు. వయస్సులో చిన్న వాడు, మట్టు మర్యాదలు దండిగా ఉన్నవాడు అయిన మెలాంతన్ సుబుద్ధి, విజ్ఞత, వాగ్దాటి కలవాడు. ఆయన పవిత్రమైన నీతివంతమైన ప్రవర్తన ప్రజల గౌరవాభిమానాలను చూరగొన్నవి. ఆయన ప్రతిభాపాటవాలకు తీసిపోనిది ఆయన సాధుస్వభావం. కొద్ది కాలంలోనే ఆయన సువార్తిక అనుచరుడు లూథర్‌కు నమ్మకమైన మిత్రుడు విలువైన సహాయకుడు అయ్యాడు. లూథర్ ధైర్యగుణానికి ఉద్రేకానికి మెలాంగ్ తన్ సాధుగుణం, జాగరూకత, కచ్చితత్వం పూర్ణాలుగా పని చేశాయి. సంస్కరణోద్యమంలో వారి సంయుక్త కృషి సంస్కరణకు బలాన్ని లూథర్ కి ఉద్రేకాన్ని సమకూర్చింది.GCTel 115.2

    లూథర్ విచారణకు ఆగ్స్ బర్గ్ నగరాన్ని ఎంపిక చేశారు. సంస్కర్త ఆ స్థలానికి కాలినడకన బయలుదేరాడు. ఆయన క్షేమం గురించి భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆయనను మార్గంలో పట్టుకొని హత్య చేస్తామని బెదరింపులు వినిపించాయి. అక్కడకు వెళ్లవద్దని మిత్రులు లూథర్ ని బతిమాలారు. కొంత కాలం పాటు విట్బెర్గ్ విడిచిపెట్టి తనను కాపాడేందుకు సిద్ధంగా ఉన్న వారి వద్ద తల దాచుకోవలసిందిగా కోరారు. కాని తనకు దేవుడు నియమించిన స్థలాన్ని విడిచి పెట్టటానికి లూథర్ ససేమిరా ఇష్టపడలేదు. తనపై ఎన్ని గాలితుఫానులు విరుచుకు పడినా సత్యాన్ని కొనసాగించేందుకు లూథర్ నమ్మకంగా ముందుకు సాగాలి. ఆయన అన్న మాటలు ఇవి, “నేను యిర్మీయామల్లే జగడాలు, వాదనల వ్యక్తిని. వారి బెదరింపులు ఎంత ఎక్కువైతే నా ఉత్సాహం అంత అధికమౌతుంది... ఇప్పటికే వారు నాగౌరవ మర్యాదల్ని నాశనం చేశారు. ఇక ఒక్కటే మిగిలింది. అది నా పాడు శరీరం. దాన్ని కూడా వాళ్లు తీసుకోవచ్చు. అలా నా జీవితాన్ని కొన్ని గంటలు కురుచచేయవచ్చు. ఇక నా ఆత్మ అంటారా, దాన్ని వాళ్లు ముట్టుకోలేరు. క్రీస్తు వార్తను ప్రకటించగోరే వ్యక్తి ఏ ఘడియలోనైనా మరణించటానికి సిద్ధంగా ఉండాలి.” అదే పుస్తకం, పుస్త 4, అధ్యా 4.GCTel 115.3

    ఆగ్స్ బర్గ్ కి లూథర్ ఆగమన వార్త పోపు ప్రతినిధికి ఎంతో తృప్తినిచ్చింది. సర్వప్రపంచ గమనాన్ని ఆకర్షిస్తున్న పేచీకోరు సిద్ధాంత వ్యతిరేకి ఇప్పుడు రోము వశంలో ఉన్నాడు. ఆయనను తప్పించుకుపోనీయకూడదని ప్రతినిధి కృత నిశ్చయంతో ఉన్నాడు. సంస్కర్త సురక్షిత ప్రయాణ హామీ పొందిరాలేదు. అది లేకుండా ప్రతినిధి ముందుకు వెళ్లవద్దని లూథర్ ని మిత్రులు శతపోరారు. చక్రవర్తి వద్దనుంచి తామే దాన్ని తెస్తామని చెప్పారు. సాధ్యమైతే తన నమ్మకాల్ని ఉపసంహరించుకొనేలా లూథర్ ని ఒత్తిడి చేయాలని ప్రతినిధి ఉద్దేశించాడు. లేని పక్షంలో హస్ జెరోములల్లే మరణించటానికి ఆయనను రోముకు పంపాలని నిర్ధారించుకొన్నాడు. కాబట్టి ప్రతినిధి దయాదాక్షిణ్యాల్నినమ్మి, సురక్షిత ప్రయాణ హామీ లేకుండానే లూథర్ ప్రతినిధి ముందు నిలవటానికి, ఆయనను ఒప్పించటానికి, అతడు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించాడు. ఆ ప్రతిపాదనను సంస్కర్త తోసిపుచ్చాడు. సురక్షిత ప్రయాణ హామీ పత్రం చక్రవర్తి వద్దనుంచి వచ్చాకే ఆయన పోపు రాయబారి సమక్షంలో నిలబడటానికి సమ్మతించాడు.GCTel 116.1

    మృదువైఖరి ద్వారా లూథర్ ని వశపర్చుకోటానికి ప్రయత్నించటం రోము మతవాదులు నిర్ణయించుకొన్న విధానం. ప్రతినిధి లూథర్ తో తన సమావేశాల్లో గొప్ప స్నేహశీలత ప్రదర్శించాడు. అయితే లూథర్ సంఘాధి కారానికి ప్రశ్నలేమీ లేకుండా లొంగిపోవాలని ప్రతి అంశాన్ని ప్రశ్నగాని, వాదనగాని లేకుండా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు. తాను వ్యవహరించాల్సిన వ్యక్తి ప్రవర్తనను అతడు సరిగా అంచనా వేసుకోలేదు. అతడికి సమాధానమిస్తూ సంఘం పట్ల తన గౌరవాన్ని సత్యం విషయంలో తనకున్న ఆకాంక్షను తాను బోధిస్తున్న సత్యాల పరంగా ఎవరికైనా ఉన్న అభ్యంతరాలను గురించి సమాధానం చెప్పటాని తన సంసిద్ధతను వ్యక్తంచేసి తన సిద్ధాంతాలపై తీర్పుకు కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు వాటిని సమర్పించగలనని లూథర్ ఉద్ఘాటించాడు. అదే సమయంలో తాను తప్పులో వున్నట్లు నిరూపించకుండానే తన నమ్మకాల్ని ఉపసంహరించకోవలసిందిగా తనను కోరటంలో ఆ కార్డినల్ అనుసరిస్తున్న విధానాన్ని లూథర్ తప్పుపట్టాడు.GCTel 116.2

    ఉపసంహరించుకో, ఉపసంహరించుకో” అన్నదే అతడి ప్రతిస్పందన. తన నమ్మకాలు లేఖనాలపై ఆనుకొని ఉన్నాయి కనుక తాను సత్యాన్ని విసర్జింపజాలనని సంస్కర్త కరాఖండిగా చెప్పాడు. లూథర్ తర్కాలకు జవాబు ఇవ్వలేక నిందలు, హేళన, ముఖస్తుతి, మధ్యమధ్య సాంప్రదాయాలు, ఫాదర్లు పలికిన సుభాషితాలతో తికమకపెట్టి ప్రతినిధి ఆయనను మాట్లాడకుండా చేశాడు. ఇలా కొనసాగే సభవల్ల ఫలితం శూన్యమని గ్రహించి తన సమాధానం రాత పూర్వకంగా సమర్పించేందుకు లూథర్ అనుమతి పొందాడు.GCTel 117.1

    ఒక స్నేహితుడికి రాస్తూ లూథర్ ఇలా అన్నాడు, “ఇలా రాత పూర్వకంగా సమర్పించటం బాధితుడికి రెండు విధాల లాభం. మొదటిది, రాసినదాన్ని ఇతరుల తీర్మానానికి సమర్పించవచ్చు. రెండోది, దర్పంతో కూడిన తన మాటలతో జయించటానికి చూసే గర్వి, వదరుబోతు అయిన నియంత అంతరాత్మను కాకున్నా భయాలను మేల్కొల్పటానికి ఇది మంచి అవకాశాన్నిస్తుంది.” మార్టిన్ ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ లూథర్ పుటలు 271,272.GCTel 117.2

    తర్వాత సమావేశంలో లూథర్ తన అభిప్రాయాలను స్పష్టంగా, క్లుప్తంగా, శక్తిమంతంగా వ్యక్తీకరించాడు. వాటిని లేఖన వచనాలతో బలపర్చుతూ సమర్పించాడు. గట్టిగా చదివిన తరువాత ఆయన ఆ పత్రాన్ని ఆ కార్డినల్ చేతికిచ్చాడు. దాన్ని లెక్కజేయకుండా పక్కన పెడుతూ అది వట్టి మాటల కుప్ప అని అసంబద్ద వ్యాఖ్యల సమాహారమని కొట్టిపారేశాడు. ఉద్వేగ భరితుడైన లూథర్ గర్వాంధుడైన ప్రిలేటును తన స్థాయిలోనే - సంఘ సాంప్రదాయాలు బోధనల స్థాయితో - ఎదుర్కొని అతడి అభిప్రాయాలను పూర్తిగా తోసిపుచ్చాడు.GCTel 117.3

    లూథర్ హేతు వాదానికి బదులు చెప్పలేని ప్రిలేదు ఆత్మ నిగ్రహం కోల్పోయి ఆగ్రహోదగ్రుడై “ఉపసంహరించుకో, లేకపోతే నిన్ను రోముకు పంపుతాను. నీకు తీర్పు తీర్చటానికి నియమితులైన న్యాయాధిపతుల ముందు అక్కడ నీవు నిలబడతావు. నిన్ను నీ సహచరులందరినీ, ఎప్పుడైనా నిన్ను సమర్థించిన వారిని వెలివేస్తున్నాను. వారందరినీ సంఘంలో నుంచి తీసివేస్తున్నాను.” చివరగా కోపంతో ఇలా అన్నాడు. “ఉపసంహరించుకోలేకపోతే ఇక తిరిగి రావద్దు” డి అబినే, లండన్ ఏ.డి., పుస్త4, అధ్యా 8.GCTel 118.1

    అలాగే మిత్రులతోపాటు లూథర్ అక్కడ నుంచి నిష్క్రమిస్తూ తన నమ్మకాల్ని ఉపసంహరించుకొనేది లేదని సూచించాడు. కార్డినల్ ఉద్దేశించింది ఇదికాదు. ఆయనను దౌర్జన్యంతో భయపెట్టి లొంగదీసు కోవాలనుకొన్నాడు. ఇక మిగిలి ఉన్నవారు ప్రతినిధి అతడి మద్దతుదారులు మాత్రమే. ఒక్కొక్కరి వంక చూస్తూ తన పథకాల వైఫల్యానికి ఎంతో ఆశాభంగం చెందాడు.GCTel 118.2

    ఈ సమయంలో లూథర్ చేసిన పనికి మంచి ఫలితాలు కనిపించాయి. అక్కడ సమావేశమైన సభకు ఆ యిద్దరినీ సరిపోల్చుకొని వారి వైఖర్లను వారి అభిప్రాయల బలాబలాలను గ్రహించటానికి అవకాశం లభించింది. ఆ ఇద్దరి మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. సంస్కర్త నిరాడంబరత, నమ్రత, ధైర్యం గలవాడు. దేవుని శక్తితో నిలబడ్డాడు. సత్యం ఆయన పక్క ఉన్నది. పోపు ప్రతినిధి స్వార్ధపరుడు, పరుషభాష, గర్వాంధుడు, సబబులేని లేఖనాల నుంచి ఒక్క వాదనను చేయలేని వ్యక్తి. అయినా ఉపసంహరించుకో లేకపోతే శిక్షకు రోముకు వెళ్లాల్సి ఉంటుంది.” అని అరిచాడు.GCTel 118.3

    లూథర్ సురక్షిత ప్రయాణ హామీ పొందినప్పటికీ ఆయనను బంధించి చెరశాలలో వేయటానికి రోమను మతవాదులు కుతంత్రాలు పన్నారు. అక్కడ ఇంకా ఉండటం అర్ధరహితం గనుక జాప్యం లేకుండా లూథర్ విట్బెర్గ్ కి తిరిగి వెళ్లి పోవటం మంచిదని ఆయన ప్రణాళికల్ని గోప్యంగా ఉంచేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలని మిత్రులు విజ్ఞప్తి చేశారు. ఆ ప్రకారమే తెల్లవారకముందే లూథర్ గుర్రం మీద ప్రయాణమయ్యాడు. ఆయన వెంట మేజిస్ట్రేట్ ఏర్పాటు చేసిన మార్గదర్శకుడు మాత్రమే ఉన్నాడు. చీకటితో నిండిన ఆనగర వీధుల్లోనుంచి ఎన్నో భయాలతో రహస్యంగా ప్రయాణించాడు. నిఘావేసివున్న క్రూర ప్రత్యర్థులు లూథర్ ని మట్టు పెట్టటానికి దురాలోచనలు చేస్తున్నారు. వారి పన్నాగాల నుంచి ఆయన తప్పించుకొంటాడా? అవి ఆందోళనతో నిండిన ఘడియలు. యధార్ధ ప్రార్ధన అగత్యమైన ఘడియలు. ఆ నగర ప్రాకారంలో ఉన్న ఒక గుమ్మానికి ఆయన వచ్చాడు. ఆటంకమేమీ లేకుండా ఆయన మార్గదర్శకులు దాన్ని దాటి వెళ్లి పోయారు. నగరం వెలపలికి సురక్షితంగా చేరటంతో వారు తమ ప్రయాణాన్ని వేగవంతం చేసి తాము వెళ్లిపోవటం పోపు ప్రతినిధికి తెలియక ముందే శత్రువుల చేతికి దొరకకుండా దాటిపోయారు. సైతాను అతడి దూతలు పరాజితులయ్యారు. చేజిక్కాడని తాము భావించిన వ్యక్తి కిరాతకుడి ఉచ్చులో నుంచి తప్పించుకొన్న పిట్టలా తప్పించుకు పోయాడు.GCTel 118.4

    లూథర్ తప్పించుకు పోయాడన్న వార్త ప్రతినిధికి విస్మయాన్ని ఆగ్రహాన్ని పుట్టించింది. సంఘంలో కలకలం రేపుతున్న ఈ వ్యక్తితో తెలివిగాను కఠినంగాను వ్యవహరించినందుకు పేరు ప్రతిష్టలు సంపాదించాలని అతడు ఆశించాడు. కాని అతనికి ఆశాభంగం ఎదురయ్యింది. సేక్సనీ ఓటరు ఫ్రెడ్రిక్ కి తాను రాసిన లేఖలో పోపు ప్రతినిధి లూథరిని తీవ్రంగా నిందిస్తూ ఫ్రెడ్రిక్ సంస్కర్తను రోముకి పంపటమో లేదా ఆయనను సేక్సనీ నుంచి బహిష్కరించటమో చేయాలని డిమాండ్ చేశాడు. దానిపై స్పందిస్తూ ప్రతినిధిగాని పోపుగాని తన తప్పులేమిటో లేఖనాల నుంచి చూపించాలని తాను దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నట్లు వారు చూప గలిగితే తన సిద్ధాంతాలను ఉపసంహరించుకొంటానని లూథర్ గంభీరంగా ప్రతిజ్ఞ చేశాడు. అంత పవిత్రమైన కార్యం నిమిత్తం శ్రమననుభవించటానికి తనను యోగ్యుణ్ణి చేసినందుకు దేవునికి తన కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు.GCTel 119.1

    సంస్కరణ వాద సిద్ధాంతాల విషయంలో ఓటరుకి పరిజ్ఞానం ఏమంతలేదు. కాని లూథర్ మాటల్లోని యధార్థ శక్తి స్పష్టత ఫ్రెడ్రిక్ ని ఎంతో ఆకట్టుకొన్నాయి. సంస్కర్త తప్పులో ఉన్నట్లు రుజువయ్యేవరకు లూథర్ పరిరక్షకుడుగా ఉండాలని అతడు నిర్ణయించు కొన్నాడు. ప్రతినిధి డిమాండ్ కి సమాధానం ఇస్తూ అతడు ఇలా రాశాడు. ” డాక్టర్ మార్టిన్ ఆ బ లో మీ సమక్షంలో హాజరయ్యాడు గనుక మీరు తృప్తి చెంది ఉండవచ్చు. తప్పులేమిటో చూపించకుండా ఆయనను ఉపసంహరించుకోమంటారని మేము అనుకోలేదు. మార్టిన్ సిద్ధాంతం భక్తి రాహిత్యమైనది, క్రైస్తవ వ్యతిరేకమైనది లేక సిద్ధాంత వ్యతిరేకత కలది అని మేము భావించటం లేదు. పైగా ఆ యువరాజు లూథర్ ని రోముకు పంపటానికి గాని, తన రాష్ట్రం నుంచి నిషేధించటానికి గాని అంగీకరించలేదు” డి ఆబిన్, పుస్త 4, అధ్యా 10.GCTel 119.2

    సమాజంలో నైతిక నియంత్రణలు శిధిలమౌతున్నట్లు ఓటరు చూశాడు. గొప్ప దిద్దుబాటు కృషి అవసరమని గుర్తించాడు. మనుషులు దైవ విధులను గుర్తించి వాటిని అంతరాత్మ ప్రబోధాలను ప్రజలు అవలంబిస్తే నేరాన్ని నియంత్రించి శిక్షించటానికి అమలులో ఉన్న ఏర్పాట్ల ఆవశ్యకత ఉండదని భావించాడు. లూథర్ ఈ లక్ష్య సాధనకు కృషి సల్పుతున్నట్లు గ్రహించి అది సంఘంలో మంచి ప్రభావం చూపుతుందని రహస్యంగా సంబరపడ్డాడు.GCTel 120.1

    విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా లూథర్ విజయాలు సాధించి ఖ్యాతి గడించిన వ్యక్తి అని కూడా అతను గుర్తించాడు.సంస్కర్త తన సిద్ధాంత వ్యాసాల్ని ఆలయం తలుపుమీద అంటించి ఒక్క ఏడాది గడిచేసరికి సర్వభక్తుల పండుగకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆరాధకుల సంఖ్య తగ్గి కొనుకలు సన్నగిల్లాయి. అయితే విటన్బర్గ్ కు వచ్చే భక్తుల ఆస్థానం ఇంకో తరగతి ప్రజలు ఆక్రమించారు. వారు అవశేషాలకు మొక్కే యాత్రికులు కారు. జ్ఞానార్జన కోరు ఆ విద్యాలయానికి వచ్చిన విద్యార్థులు కారు. లూథర్ రచనలు ప్రతీచోట లేఖనాలపట్ల ఆసక్తిని రేకెత్తించాయి. జర్మనీలోని ఆ విశ్వవిద్యాలయానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. మొట్టమొదటిసారి విట్బెర్గ్ నగరాన్ని చూసిన విద్యార్థులు “తమ చేతులెత్తి పూర్వం సీయోనుకు సత్యమనే వెలుగు వచ్చి అక్కడ నుంచి దూరదేశాలకు వ్యాపించినట్లే ఈనగరం నుంచి వెలుగును ప్రకాశింప జేసినందుకు దేవుని కొనియాడారు.” అదే పుస్తకం, పుస్త 4, అధ్యా 10.GCTel 120.2

    లూథర్ రోమను మత తప్పిదాల్ని పాక్షికంగా మాత్రమే విడిచిపెట్టాడు. కాగా పరిశుద్ధ లేఖనాల్ని పోపు డిక్రీలతోను నిబంధనలతోను సరిపోల్చినప్పుడు దిగ్రమ చెందాడు. ” నేను ప్రధాన గురువుల డికీలను అధ్యయనం చేస్తున్నాను... పోపు వైరి క్రీస్తో ఆయన అపోస్తలులో నాకు తెలియదు. వారు క్రీస్తును వికృతంగా చూపించి ఆయనను సిలువ వేస్తున్నారు.”అని రాశాడు. అదే పుస్తకం, పుస్త 5, అధ్యా 1. అయినప్పటికీ ఈ సమయంలో లూథర్ ఇంకా రోమా సంఘ సభ్యుడే. ఆ సంఘ సహవాసం నుంచి విడిపోవాలన్న అభిప్రాయం ఆయనకు లేదు.GCTel 120.3

    సంస్కర్త లూథర్ రచనలు సిద్ధాంతాలు క్రైస్తవ లోకంలోని ప్రతి జాతికీ విస్తరిస్తున్నాయి. సంస్కరణోద్యమం స్విట్జర్లాండు, హాలెండ్ దేశాలకు విస్తరించింది. లూథర్ రచనల ప్రతులు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లోకి వెళ్లాయి. ఇంగ్లాండులో ఆయన బోధనలు దైవ వర్తమాసంగా పరిగణన పొందాయి. బెల్జియమ్, ఇటలీ దేశాల్లోకి కూడా సత్యం ప్రవేశించింది. మరణతుల్యమైన స్తబ్దత నుంచి వేలాది ప్రజలు మేల్కోని విశ్వాస జీవితానందాన్ని నిరీక్షణను అనుభవిస్తున్నారు.GCTel 120.4

    లూథర్ ఆక్షేపణలకు రోము ఆగ్రహం రోజురోజుకి పెరుగుతున్నది. మతమౌఢ్యంగల తన ప్రత్యర్థులు కొందరు కథోలిక్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్లు సయితం - ఈ తిరుగుబాటు సన్యాసిని చంపిన వ్యక్తి పాపికాడు అని ప్రకటించారు. ఒకరోజు ఒక అపరిచిత వ్యక్తి బట్టల్లో పిస్తోలు దాచిపెట్టి సంస్కర్తను కలిసి ఇలా “ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు” అని లూథరిని ప్రశ్నించాడు. “నేను దేవుని చేతుల్లో ఉన్నాను, ఆయనే నాబలం, ఆయనే నాకేడెం, మనుషుడు ఏహానీ నాకు చేయలేడు” అని బదులు పలికాడు లూథర్. అదే పుస్తకం, పుస్త 6, ఆధ్యా 2. ఈ మాటలు విన్న వెంటనే ఆ అపరిచితవ్యక్తి తెల్లబోయి పరలోక దూత సమక్షం నుంచి పారిపోయేటట్లు అక్కడ నుంచి పారిపోయాడు.GCTel 121.1

    లూథర్ ని మట్టు పెట్టాలని రోము కృత నిశ్చయంతో ఉన్నది. అయితే దేవుడు ఆయనకు రక్షణ కవచం. ఆయన సిద్ధాంతాలు అన్నిచోట్ల వినిపించాయి. ఇళ్ళలో, సన్యాసి గృహాల్లో, సామంతుల భవనాల్లో, విశ్వవిద్యాలయాల్లో, రాజుల ప్రాసాదాల్లో ఆయన కృషిని బలపర్చటానికి గొప్పవాళ్లు ముందుకు వస్తున్నారు. అదే పుస్తకం, పుస్త 6 , అధ్యా 2.GCTel 121.2

    దాదాపు ఇదే సమయంలో హస్ రచనల్ని అధ్యయనం చేస్తూ తాను బలపర్చుతూ ప్రబోధింప జూస్తున్న విశ్వాస మూలంగా నీతి మంతుడన్న తీర్పు పొందటమన్న మహత్తర సత్యాన్ని బోహీమియా సంస్కర్త హస్ బలపర్చాడని తెలుసుకొన్నాడు. “పౌలు, అగస్టీన్ నేను మేమంతా మాకు తెలియకుండానే హస్ తత్వవాదులం” అన్నాడు లూథర్. “ప్రపంచానికి ఈ సత్యం ఒక శతాబ్దం క్రితమే ప్రకటితమయ్యింది. ఇది ప్రజ్వలించింది.” “నిశ్చయంగా దేవుడు దీన్ని ప్రపంచం మీదికి పంపిస్తాడు. విల్లీ, పుస్త 6, అధ్యా 1.GCTel 121.3

    క్రైస్తవమతం దిద్దుబాటు అంశంపై జర్మనీ చక్రవర్తికి, ఆ దేశంలోని గొప్పవారికి చేసిన విజ్ఞప్తిలో పోపును గురించి లూథర్ ఇలా రాశాడు, “క్రీస్తు రాయబారినని చెప్పుకుంటూ ఏ చక్రవర్తీ ప్రదర్శించలేనంత వైభవ విలాసాల్ని ప్రదర్శిస్తున్న వ్యక్తిని నిరీక్షించటం జుగుస్సాకరం. నిరుపేద అయిన యేసు లేదా వినయవినమ్రుడైన పేతురు నడవడి లాంటిదా ఇతడి నడత? ఇతడు లోకానికి ప్రభువని అంటారు. అయితే తనకు ప్రభువని ఇతడు గర్వంగా చెప్పుకొంటున్న క్రీస్తు, నారాజ్యం ఈ లోక సంబంధమైందికాదు అంటున్నాడు. రాయబారి రాజ్య విస్తీర్ణత తన ప్రభువు రాజ్య విస్తీర్ణతను మించి ఉండగలదా?” డి అబినే, పుస్త 6, అధ్యా 3.GCTel 121.4

    విశ్వవిద్యాలయాలగురించి ఇలా రాశాడాయన, “పరిశుద్ధ లేఖనాల్ని విశదం చేయటానికి వాటిని యువత హృదయాల్లో లిఖిస్తేనేగాని విశ్వవిద్యాలయాలు నరక ద్వారాలుగా మార్తాయని నా భయం.లేఖనాలు ప్రధాన స్థానం ఆక్రమించని ఏ విద్యాలయాల్లోను ఎవరూ తమ బిడ్డల్ని ఉంచరాదని నా హితవు. ప్రతీ సంస్థలోను ఎడతెగకుండా దైవవాక్యం అధ్యయనం చేసే అధ్యాపకులు లేకపోతే అది భ్రష్ట సంస్థ అవుతుంది.” అదే పుస్తకం, పుస్త 6, అధ్యా 3.GCTel 122.1

    ఈ విజ్ఞప్తి జర్మనీ అంతటిలోనూ ప్రచారమై ప్రజల్ని ప్రభావితం చేసింది. దేశమంతటిలో కలకలం రేగింది. జనసమూహాలు చైతన్యం పొంది సంస్కరణ కేతనం కింద నిలిచాయి. లూథర్ ప్రత్యర్థులు ప్రతీకార కాంక్షతో మండిపడూ లూథర్ ని నిలువరించటానికి నిర్ణయాత్మక చర్యను చేపట్టుమంటూ పోపును అర్ధించారు. ఆయన సిద్ధాంతాన్ని వెంటనే ఖండించాలన్న డిక్రీ జారీ అయ్యింది. సంస్కర్తకు ఆయన అనుచరులకు ఆరుదినాల గడువు ఇచ్చి ఈలోపున వారు తమ నమ్మకాల్ని ఉప సంహరించుకోకుంటే వారిని వెలివేయాలని తీర్మానించటమయ్యింది.GCTel 122.2

    దిద్దుబాటు ఉద్యమానికి అది గొప్ప సంకట పరిస్థితి. రోము వెలివేత తీర్మానం శక్తిమంతులైన రాజుల్ని సైతం శతాబ్దాల కొద్దీ భయభ్రాంతుల్ని చేసింది. శక్తిమంతమైన సామ్రాజ్యాల్ని వ్యాకులత నైరాశాలతో నింపింది. వెలివేత వేటు ఎవరిమీద పడుతుందో వారిని లోకం భయాందోళనలతో పరిగణించేది. పౌరులు సహచరులతో సంబంధ బాంధవ్యాలు తెంచుకునే వారు. వారిని వేటాడి చంపాల్సిన బందిపోటు దొంగలుగా ప్రజలు పరిగణించేవారు. తనమీద విరుచుకుపడనున్న తుఫాను గురించి లూథర్ కి బాగా తెలుసు. యేసే తనకు అండదండలు సంరక్షణ అని నమ్మి స్థిరంగా నిలబడ్డాడు. హతసాక్షి విశ్వాసంతోను, ధైర్యసాహసాలతోను ఆయన ఇలా రాశాడు. “ఏమి జరగనున్నదో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా నాకు లేదు... దెబ్బ ఎక్కడ పడాలని వుంటే అక్కడ పడనీయండి. నాకు భయంలేదు. తండ్రి ఇష్టం లేకుండా ఒక్క ఆకు కూడా రాలదు. మరి మన విషయంలో ఆయన చూపే శ్రద్ధ ఇంకెంత ఎక్కువ? వాక్యం నిమిత్తం మరణించటమన్నది గొప్ప సంగతి కాదు. ఎందుకంటే శరీరధారి అయిన వాక్యమే మరణించాడు. మనం ఆయనతో మరణిస్తే ఆయనతో పాటు జీవిస్తాం. మనకు ముందు జీవించి ఆయన భరించింది మనం కూడా జీవించి భరిస్తే ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండి ఆయనతో నిత్యమూ జీవిస్తాం.” అదే పుస్తకం, 3వ లండన్ ఎడి, వాల్టర్, 1840, పుస్త 6, అధ్యా 9.GCTel 122.3

    బుల్ ప్రకటన పత్రం లూథర్ కి అందినప్పుడు ఆయన ఇలా స్పందించాడు, ఇది భక్తిహీనమైన అబద్ద పత్రం. దీన్ని అసహ్యించుకొంటున్నాను, వ్యతిరేకిస్తున్నాను... ఇది నిందిస్తున్నది క్రీస్తునే... ఒక ఉత్తమ కార్యం నిమిత్తం ఇలాంటి శ్రమలను భవించటానికి ఆనందిస్తున్నాను. ఇప్పటికే హృదయంలో గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాను. ఎందుకంటే చివరికి క్రీసు వైరి పోపేనని అతడి సింహాసనం సైతాను సింహాసనమని తెలుసుకొన్నాను. ” డి అబినే, పుస్త 6, ఆధ్యా 9.GCTel 123.1

    అయినా రోము ఫర్మానా నిరర్భకం కాలేదు. బలవంతంగా విధేయత పొందటానికి వారు ఉపయోగించిన ఆయుధాలు చెరసాల, హింస, ఖడ్గం. పోపు డిక్రీ ముందు బలహీనులు, మూఢవిశ్వాసులు వణికేవారు. లూథర్ పట్ల ప్రజలకు సానుభూతి ఉన్నా సంస్కరణ కోసం ప్రాణాలొడ్డటం మంచిది కాదని అనేక మంది అభిప్రాయపడ్డారు. సంస్కర్త ఉద్యమ కృషి అంతం కాబోతున్నట్లు ఎన్నో సూచనలు కనిపిస్తున్నాయి.GCTel 123.2

    లూథర్ ఇంకా నిర్భయంగా ఉన్నాడు. రోము ఆయన మీదకు ఎన్నో బహిష్కరణలు విసిరింది. ప్రపంచం చూస్తూనే వుంది. లూథర్ అంతమొందటమో లొంగిపోవటమో జరుగుతుందని రోము భావించింది. తనపై పడ్డ నిషేదాంక్షను ప్రబల శక్తితో తిప్పికొట్టి రోమను సంఘంతో తెగతెంపులు చేసుకోటానికి నిర్ణయించుకొన్నట్లు ప్రకటించాడు లూథర్. పోపు బుల్ ప్రకటన పత్రాన్ని, క్రైస్తవ ధర్మ చట్టాన్ని, డిజీల్ని, పోపు అధికారాన్ని నిలిపే కొన్ని రచనల్ని- విద్యార్థులు, డాక్టర్లు, వివిధ స్థాయిల్లోని పౌరుల సమక్షంలో తగులబెట్టాడు. “నా విరోధులు నా పుస్తకాలని తగుల బెట్టడం ద్వారా సామాన్య ప్రజల మనసుల్లో సత్యానికి విఘాతం కలిగించి వారి ఆత్మలను నాశనం చేశారు. అందుకు ప్రతీకారంగా వాళ్ల పుస్తకాల్ని నేను తగులబెట్టాను. తీవ్ర పోరాటం ఇప్పుడే ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ నేను పోపుతో ఆడుకొంటూ వచ్చాను. ఈ పనిని దేవుని నామంలో ప్రారంభించాను. నేను లేకుండా ఈపని అంతం అవుతుంది - ఆయన శక్తితో” అదే పుస్తకం, పుస్త 6, అధ్యా 10.GCTel 123.3

    తన ఉద్యమం బలహీనమైందని నిందిస్తూ పరిహసించే ప్రత్యర్థులకు లూథర్ సమాధానం ఇలాగుంది, “దేవుడు నన్ను ఎంపిక చేసి పిలిచాడేమో నన్ను తృణీకరించటం ద్వారా వారు దేవునినే తృణీకరిస్తున్నారేమో ఎవరికి తెలుసు? ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు మోషే ఒంటరివాడే. ఏలీయా ఆహాబు రాజు పరిపాలనలో ఒంటరివాడే. యెషయా యెరూషలేములో ఒంటరివాడు. యెహెజ్కేలు బబులోనులో ఒంటరివాడు... ప్రధాన యాజకునిగా మరే గొప్ప వ్యాక్తిని గాని ప్రవక్తగా ఎన్నడు ఎంపికచేయలేదు దేవుడు. సామాన్యంగా ఆయన దీనులను అట్టడుగు వారిని ఒకసారి కాపరి ఆమోసును ఎంపిక చేసుకొన్నాడు. ప్రతి యుగంలోను భక్తులు గొప్పవారిని, రాజులను, యువరాజులను, యాజకులను, జానులను గద్దించాల్సివచ్చేది. అది వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టేది... నేను ప్రవక్తనని చెప్పటం లేదు. కాని నేను చెబుతున్నదేంటంటే వాళ్లు ఎక్కువమంది కాగా నేను ఒక్కడినే అయినందుకు వారు భయపడాలని. నాతో దైవ వాక్యముంది. వాళ్లతో లేదు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.” అదే పుస్తకం, పుస్త 6, అధ్యా 10.GCTel 124.1

    సంఘంతో చివరగా విడిపోవటం లూథర్ కి అంతర్గతంగా తీవ్ర వ్యధ కలిగించింది. ఈ తరుణంలో ఆయన ఇలా రాశాడు, “చిన్నతనంలో నేర్చుకొన్న నియమాల్ని వదులుకోటం ఎంత కష్టమో ప్రతీరోజూ గ్రహిస్తూ ఉన్నాను. లేఖనాలు నాపక్షాన ఉన్నప్పటికీ ఒంటరిగా పోపుకు వ్యతిరేకంగా నిలబడి అతడే అబద్ధ క్రీస్తు అని చెప్పేందుకు సాహసించటం న్యాయమేనని పరిగణించటం నాకెంతో బాధకలిగించింది. నా హృదయం అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదు. పోపు మత వాదులు తరచు అడిగే ఈ ప్రశ్నలు “నీ వొక్కడివే వివేకవంతుడవా? తక్కిన వారందరూ పొరబడటం సాధ్యమా? ఆ మాటకొస్తే తప్పులో ఉన్నది నీవే అయి నీ పొరపాటులో ఎంతోమందిని పాలిభాగస్తులు చేసి వారి నిత్యనాశనానికి నీవే కారకుడవైతే ఎలాగుంటుంది? అని ఎన్ని సార్లు నన్ను నేను అడుగుకోలేదు? తన నిర్దుష్ట వాక్యం ద్వారా ఈ సందేహాలకు వ్యతిరేకంగా నా హృదయాన్ని క్రీస్తు బలపర్చే వరకు అంతర్గతంగాను సైతానుతోను నేను ఇలా పోరాటం సాగించాను.GCTel 124.2

    తన నమ్మకాల్ని వదలుకోకపోతే తనను వెలివేస్తానని పోపు లూథర్ ని బెదరించాడు. ఆ బెదరింపును ఇప్పుడు నెరవేర్చుకున్నాడు. రోమా సంఘంతో సంస్కర్త అంతిమ వేర్పాటును ప్రకటిస్తూ, లూథరూ ఆయన సిద్ధాంతాన్ని అంగీకరించే వారందరూ శాపస్తులని ఖండిస్తూ ఒక కొత్త బుల్ ప్రకటన పత్రం వెలువడింది. ఈ గొప్ప పోటీ సంపూర్తిగా ఇప్పుడు ప్రారంభమయ్యింది. GCTel 124.3

    తమ కాలానికి వర్తించిన సత్యాలు బోధించటానికి దేవుడు ఉపయోగించిన ప్రజలకు వ్యతిరేకత ఎదురయ్యింది. లూథర్ దినాలకు వర్తించిన సత్యం ఉన్నది. ఆ దినాల్లో అది ప్రాముఖ్యమైన సత్యం. ఈ దినాల్లో సంఘానికి వర్తించే సత్యం ఒకటున్నది. తన దివ్య చిత్రాన్ననుసరించి సమస్త కార్యాలు నిర్వహించే ప్రభువు మనుషులను వేర్వేరు పరిస్థితులలో ఉంచి తాము నివసిస్తున్న కాలానికి పరిస్థితులకు అవసరమైన విధులను వారికి నియమిస్తాడు. తాము పొందిన సత్యం విలువను వారు గుర్తించగలిగితే ఆ సత్యాన్ని గూర్చిన విశాల భావాలు వారికి బోధపడ్డాయి. వ్యతిరేకించిన పోపు మత వాధులకు సత్యమంటే ఆసక్తి లేనట్లే ఈనాడు అధిక సంఖ్యాకులకు సత్యం పట్ల ఆసక్తి లేదు. పూర్వయుగాల్లో జరిగినట్లే నేడు కూడా దైవ వాక్యం బదులు మానవ సిద్ధాంతాలను సంప్రదాయాలను అంగీకరించే తత్వం ప్రబలుతున్నది. వెనుకటి సంస్కర్తలకు లభించిన ఆ ఆదరణను మించిన ఆదరణ తమకు లభిస్తుందని ఈ దినాల్లో సత్యం ప్రకటించే వారు ఎదురు చూడకూడదు. సత్యానికి అసత్యానికి క్రీస్తుకి సైతానుకి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఉదృతి లోక చరిత్ర చివరివరకూ పెరుగుతూనే ఉంటుంది.GCTel 125.1

    యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోకసంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచు కొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకముంచుకొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడ హింసింతురు. నా మాట గైకొనిన యెడల మీమాట కూడ గైకొందురు” యోహాను 15:19, 20. కాగా మన ప్రభువు స్పష్టంగా చెప్పింది ఇది, “మసుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ద ప్రవక్తలకు అదే విధముగ చేసిరి.” లూకా 6:26. లోక సంబంధమైన స్పూర్తికి క్రీస్తు సంబంధమైన స్ఫూర్తికి మధ్య సామరస్యం గతకాలంలోలాగే నేడూ అంతంత మాత్రమే. కనుక దైవ వాక్యాన్ని దాని పవిత్ర రూపంలో బోధించేవారు గతంలోకన్నా నేడు ఎక్కువ ప్రజాదరణ పొందరు. సత్యవ్యతిరేకత రూపాల్లో మార్పు ఉండవచ్చు. విరోధ భావం కుటిలమైనది గనుక బాహాటంగా కనిపించక పోవచ్చు. కాని అదే వ్యతిరేకత ఇంకా కొనసాగవచ్చు. అదే వ్యతిరేకత చివరి వరకు ప్రదర్శితం కావచ్చు.GCTel 125.2