Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 1—యెరూషలేము విధ్వంసం

    “సవు ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు గాని యిప్పడవి నీ కన్నులకు మరుగుచేయబడి యున్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడి వేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీతోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేలకలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను” లూకా 19:42,43,44.GCTel 1.1

    ఒలీవ పర్వత శిఖరం నుంచి యేసు యెరూషలేమును వీక్షించాడు. ముందున్న దృశ్యం మనోహరంగా, ప్రశాంతంగా ఉంది. అది పస్కాపండుగ కాలం. ఆ జాతీయ పండుగ ఆచరించేందుకు అన్ని ప్రాంతాల నుంచి యాకోబు పిల్లలు అక్కడ సమావేశ మయ్యారు. ఉద్యాన వనాలు, ద్రాక్ష తోటలు పరదేశుల గుడారాలతో నిండిన పచ్చటి బయళ్ళ మధ్య కొండలు, రాజభవనాలు, అభయమందిరాలు చూడముచ్చటగా ఉన్నాయి. సీయోను కుమార్తె గర్వంగా “నేను రాణిగా కూర్చున్నాను. దుఃఖ సమయం నాకుండదు” అంటూ కనిపిస్తుంది. “మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమై... భూమికి సంతోషముగా నున్నది.” అని యుగాల కిందట రాజకవి పాడినట్లు, అప్పటిలో ఎంతో అందంగా వున్న సీయోను దేవుని ప్రేమానురాగాలలో భద్రంగా ఉన్నానను కొన్నది. కీర్తనలు 48:2. దేవాలయ భవనాలు చక్కగా సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. మంచులాంటి తెల్లని ఆలయాల పాలరాతి గోడలు, అస్తమిస్తున్న సూర్య కిరణాల్లో మరింత ప్రకాశిస్తున్న బంగారు ద్వారం, గోపురం, ఆలయ శిఖరం ఆ కిరణ కాంతిలో ధగధగ మెరుస్తున్నాయి. “సంపూర్ణ సౌందర్యముగల సీయోను” అది యూదా జాతికి గర్వకారణం. ఆ దృశ్యాన్ని చూసి ఉత్సాహ భరిత హృదయాలతో ప్రశంసలు కురిపించని ఇశ్రాయేలీయులెవరు? అయితే యేసు మనస్సులోని తలంపులు వేరు. “ఆయన పట్టణమునకు సమీపించి నప్పుడు దానిని చూచి దాని విషయమై యేడిచెను” లూకా 19:41. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్న ప్రజలు జరుపుకొంటున్న వేడుకల నడుమ ఖర్జూరపు మట్టలు గాలిలో ఊగుతున్న తరుణంలో హోసన్నా ధ్వనులతో కొండకోనలు ప్రతిధ్వనిస్తున్న తరుణంలో, వేలాది ప్రజలు తనను రాజుగా ప్రకటిస్తూ కేకలు వేస్తున్న తరుణంలో లోకరక్షకుడు యేసు నిగూఢమైన దుఃఖానికి గురి అయ్యాడు. దైవ కుమారుడు, ఇశ్రాయేలు విమోచనకు దేవుడు వాగ్దానం చేసిన ప్రభువు తన శక్తిచేత మరణాన్ని జయించి దాని వశంలో ఉన్న బందీలను సమాధినుంచి లేపిన దేవుడు కన్నీరు కార్చుతున్నాడు. అది సామాన్యమైన దుఃఖం కాదు; ఆగని తీవ్రమైన హృదయ వేదన.GCTel 1.2

    ఆయన దుఃఖం తన నిమిత్తం కాదు. తన అడుగులు ఏ దిశగా పడుతున్నదీ ఆయన ఎరిగినా యేసు తన్ను గూర్చి దుఃఖించటం లేదు. గెత్సెమనే ఆయన ముందే ఉంది. వేగంగా దగ్గర పడుతున్న ఆయన ఆవేదనా ప్రాంగణం ఆ గెత్సెమనే గొర్రెల ద్వారం కూడా ఆయనకు కనిపిస్తుంది. బలి పశువుల్ని శతాబ్దాలుగా ఈ ద్వారం గుండా తోలుకు వెళ్ళేవారు. “వధకు తేబడు గొర్రెపిల్ల”గా ఆయన వెళ్లవలసి వచ్చినప్పుడు యేసుకు ఈ ద్వారం తెరుచుకొంటుంది. యెషయా 31:7. సిలువకు ఏర్పాటయిన కల్వరి దగ్గరలోనే ఉంది. పాపానికి ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని అర్పిస్తూ యేసు నడవనున్న ఈ మారం అంధకారమయంగా వున్నది. అయినా ఈ సంతోష సమయంలో ఆయనను మనస్తాపానికి గురిచేసింది. ఈ దృశ్యాలను గూర్చిన ఆలోచనకాదు. స్వార్థమన్నదిలేని ఆ మహాత్ముని మనస్సును తన ఆవేదనను గూర్చిన భయాందోళనలు కుంగదీయజాలవు. ఏ ప్రజలకు తన హితవును శుభాలను అందించి వారిని రక్షించాలని సంకల్పించాడో వారు తమ అంధత్వం వలన, పశ్చాత్తాపంలేని అవిధేయత వలన నశించిపోతున్నందుకు చింతించాడు. వేలాది యెరూషలేము ప్రజల నిమిత్తం దుఃఖించాడు.GCTel 2.1

    వెయ్యి సంవత్సరాలకు పైగా దేవుడు తాను ఎన్నుకొన్న ప్రజలకు కనుపర్చిన ప్రేమాదరాలు, శ్రద్ధాసక్తుల చరిత్రను యేసు తన మనోనేత్రంతో చూశాడు. అదిగో మోరియా పర్వతం. ఆ పర్వతం మీదే వాగ్దాత్త కుమారుడు ఇస్సాకు తండ్రికి ఎదురు చెప్పకుండా బలిపీఠానికి బందీ అయ్యాడు. దైవ కుమారుని బలిదానానికి అది ప్రతీక. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు మెస్సీయను గూర్చిన వాగ్దానాన్ని దేవుడు ధ్రువీకరించింది ఇక్కడే. ఆదికాండం 22:9,16-18. ఒర్నాను కళ్లం నుంచి పైకి లేస్తున్న బలిపీఠపు మంటలు మరణదూత ఖడ్గాన్ని తొలగించింది ఇక్కడే, 1 దిన. 21 అధ్యాయం. పాపమానవుల నిమిత్తం రక్షకుని త్యాగానికి , మధ్యవర్తిత్వానికి ఇది సరియైన చిహ్నం. లోకమంతటిలో దేవుడు యెరూషలేమునే ఎక్కువ అభిమానించాడు. ప్రభువు “సీయోనును ఏర్పరచుకొని యున్నాను” “తనకు నివాస్థలముగా దానిని కోరుకొని యున్నాను.” కీర్తనలు 132:13 యుగాలుగా పరిశుద్ధ ప్రవక్తలు తమ హెచ్చరికా వర్తమానాల్ని ప్రకటించింది ఇక్కడే. యాజకులు తమ ధూపారులను ఊపగా ధూప ద్రవ్యాల పొగ పరిశుద్ధుల ప్రార్ధనలతో కలసి పైకిలేచి దేవుని సన్నిధిని చేరింది ఇక్కడనుంచే. రానున్న దేవుని గొర్రెపిల్లను సూచిస్తూ అనుదినం వధించబడే గొర్రెపిల్లల రక్తం అర్పితమయ్యింది ఇక్కడే. కరుణా పీఠంపై మహిమతో ప్రకాశిస్తున్న మేఘంలో యెహోవా తన సన్నిధిని కనపర్చింది అక్కడే. ఆకాశాన్ని, భూమిని అనుసందానం చేస్తూ నిల్చిన ఆధ్యాత్మిక పరమైన నిచ్చెన ఆనుకొన్నది ఇక్కడే. ఆది. 28:12; యెహో.1:512. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్న నిచ్చెన, లోకానికి అతిపరిశుద్ధ స్థలంలోకి మార్గం తెరచిన నిచ్చెన అది. ఒక జాతిగా ఇశ్రాయేలు దేవునికి నమ్మకంగా ఉండివుంటే దేవుడు ఎన్నుకొన్న జనాంగంగా యెరూషలేము చిరస్థాయిగా నిల్చియుండేది. యిర్మీయా 17:21-25. అయితే దైవానురాగాన్ని చూరగొన్న ఈ ప్రజల చరిత్ర మతమంటే ఆసక్తిలేని ప్రజల చరిత్రగా, తిరుగుబాటు ప్రజల ఉదంతంగా మిగిలింది. వారు దైవ కృపను ప్రతిఘటించారు. తమ ఆధిక్యతలను దుర్వినియోగం చేశారు. తమకు వచ్చిన సదవకాశాన్ని నిర్లక్ష్యం చేశారు.GCTel 2.2

    ఇశ్రాయేలు “దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు” వచ్చినప్పటికీ (2 దినవృ.36:16.) “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా”గా ఆయన వారికి తన్నుతాను కనపర్చుకొన్నాడు. (నిర్గమ.34:6). వారు తనను పదేపదే విసర్జించినా ఆయన కృప, విజ్ఞాపనలు కొనసాగుతూనే వున్నాయి. జాగ్రత్తగా పెంచి పోషించుకుంటున్న కుమారుడి మీద ఒక తండ్రికుండే జాలికన్న మరెక్కువ జాలితో వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచువచ్చెను. ” 2 దినవృ.36:15. అసమ్మతి, విజాపన, గద్దింపు విఫలమైనప్పుడు ఆయన పరలోక మంతటిలోనూ అత్యుత్తమ వరదానాన్ని వారికందించాడు. కాదు, ఆ ఒక్క వరదానంలోనే పరలోకమంతటిని పానార్పణ చేశాడు.GCTel 3.1

    పశ్చాత్తాపంలేని ఆ పట్టణ ప్రజలతో విజ్ఞాపన చేయటానికి దైవకుమారుడు తానే ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలుకు ఐగుపులో నుంచి ఒక ద్రాక్షావల్లిని తెచ్చిన వాడు క్రీస్తే. కీర్తనలు 80:8. అన్యజనులను వెళ్లగొట్టి దానిని “సత్తువ భూమిగల కొండమీద” నాటిన వాడు ఆయనే. ఎంతో శ్రద్ధవహించి ఆయన దాని చుట్టూ కంచె వేశాడు. నీరు పోసి దాన్ని పెంచటానికి సేవకులను పంపాడు. “నా ద్రాక్షాతోటకు చేసినదానికంటే మరేమి దానికి చేయగలరు?” అని ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. యెషయా 5:14. ద్రాక్షాపండ్లు కాస్తుందని కనిపెట్టిన తరుణంలో అది కారు ద్రాక్షా కాసినప్పటికిని ముందు మంచి ద్రాక్షాలు కాస్తుందన్న నిరీక్షణతో తోట నాశనం కాకూడదన్న కోరికతో ఆయన వ్యక్తిగతంగా తనే ద్రాక్షా తోటకు వచ్చాడు. పాదులచుట్టూ తవ్వాడు. అల్లిబిల్లిగా పెరిగిన తీగెల్ని కత్తిరించాడు. తోటను బహుగా ప్రేమించాడు. స్వయంగా తానే నాటిన ద్రాక్షాతోటను రక్షించటానికి నిర్విరామంగా కృషి చేశాడు.GCTel 4.1

    కాంతి మహిమల ప్రభువు మూడు సంవత్సరాలు తన ప్రజల మధ్యకు వెళ్తూవస్తూ వున్నాడు. ఆయన “మేలుచేయుచు అపవాదిచేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచుచు” చెరలో ఉన్నవారిని విడిపిస్తూ, గుడ్డివారికి చూపునిస్తూ, నలిగిన వారిని విడిపిస్తూ, కుంటి వారిని నడిచేటట్లు చేస్తూ, కుష్ఠురోగులను స్వసపర్చుతూ, చెవిటి వారికి వినికిడినిస్తూ, చనిపోయిన వారిని లేపుతూ, బీదలకు సువార్త ప్రకటిస్తూ సంచరించాడు. అపొ. 10:38; లూకా 4:18.మత్తయి 11:5.ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనములారా, నా యొద్దకురండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అంటూ ఆయన అందరినీ పిలుస్తున్నాడు. మత్తయి 11:28. మేలుకు ప్రతిగా కీడు, ప్రేమకు ప్రతిగా ద్వేషం పొందినప్పటికీ (కీర్తనలు 109:5) ఆయన తన కృపాపరిచర్యను కొనసాగించాడు. తన కృపను ఆరించిన వారిని ఆయన ఎన్నడూ నిరాకరించలేదు. ఆయన నిలువ నీడలేని సంచారి. నింద, పేదరికం ఆయన అనుదిన అనుభవాలే. ఇతరులకు సహాయ మందించటానికి, పరుల బాధల్ని దుఃఖాన్ని తగ్గించటానికి నిత్యజీవిత వరాన్ని అంగీకరించుడమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయటానికి ఆయన జీవితాన్ని అంకితం చేసుకొన్నాడు. వెల్లు వెత్తుతున్న ఆయన కృపను ఆ కఠిన హృదయాలు తోసిపుచ్చాయి. అయినా అది మరింత బలమైన ప్రేమ స్రవంతి అయి వారి వద్దకు తిరిగి వచ్చింది. కాని ఇశ్రాయేలు ప్రజలు, తమ ప్రాణమిత్రుణ్ణి, ఏకైక సహాయకుణ్ణి విడిచి పెట్టారు. ఆయన ప్రేమపూర్వక విజ్ఞప్తుల్ని త్రుణీకరించారు. ఆయన బోధలను తోసిపుచ్చారు. ఆయన హెచ్చరికలను ఎగతాళి చేశారు.GCTel 4.2

    నిరీక్షణకు క్షమాపణకు ఉద్దేశించిన సమయం వేగంగా గడిచిపోతున్నది. ఎన్నడో నిండవలసి ఉన్న దేవుని ఉగ్రత పాత్ర దాదాపు నిండింది. మత భ్రష్టత, తిరుగుబాటు యుగాలు తరబడి కమ్ముకొంటున్న మబ్బు దుఃఖ బాధలతో నల్లబారి అపరాధి ప్రజలపై బద్దలవ్వటానికి సిద్ధంగా వున్నది. రానున్న వినాశం నుంచి తమను రక్షించగల ఒకే ఒక వ్యక్తిని వారు అవమానపర్చారు. దుర్భాషలాడారు. తృణీకరించారు. త్వరలో సిలువ వేయనున్నారు. క్రీస్తు సిలువపై వేలాడినప్పుడు దేవుని ప్రేమాభిమానాలు పొందిన జనాంగంగా ఇశ్రాయేలు చరిత్ర సమాప్తమవుతుంది. ఒక్క ఆత్మ నశించినా అది ఆయనకు లోకభాగ్యాలన్నింటిని పోగొట్టుకోవడంకన్నా ఎంతో విషాదకరమైంది. యేసు యెరూషలేము వంక చూస్తున్నప్పుడు పూర్తిగా నాశనం కానున్న పట్టణం, జనాంగం ఆయన కళ్లముందు మెదిలాయి. ఒకప్పుడు దేవుడు ఎంపికచేసుకొన్న పట్టణమది. వారు ఒకప్పుడు తనసొత్తుగా దేవుడు ఎంపిక చేసుకొన్న జనాంగం.GCTel 5.1

    ఇశ్రాయేలు ప్రజల మత భ్రష్టత గురించి, వారి పాపాల ఫలితంగా సంభవించిన భయంకర నాశనాల గురించి ప్రవక్తలు విలపించారు. వధకు గురి అయిన తన ప్రజల కుమార్తెల నిమిత్తం, బందీలుగా చేరలోకి వెళ్ళిన ప్రభువుమంద నిమిత్తం రాత్రింబగళ్ళు విలపించటానికి తన కండ్లు కన్నీటి మడుగులైతే బాగుండునని యిర్మీయా రోదించాడు, యిర్మీయా 9:1; 13:17. ఏళ్ళు కాదు యుగాలే ముందు చూడగల ఆ ప్రభువు మనస్తాపానికి ఏమిటి కారణం? ఎంతో కాలంగా యెహోవాకు నివాసంగా వున్న ఆ నగరంపై మరణ దూత కత్తిదుయ్యటం ఆయన చూశాడు. ఒలీవల పర్వత శిఖరం నుంచి లోయ అవతల పక్కవున్న పవిత్ర ఆవరణాన్ని ఆలయ గుమ్మాల్ని వీక్షించాడు. కన్నీటితో మసకబారిన కళ్ళతో చూడగా పట్టణ ప్రాకారాలు పరాయి సేనల ముట్టడిలో వున్నట్లు గమనించాడు. (అనంతరం అదే శిఖరాన్ని టైటస్ చక్రవర్తి ఆయన సైన్యం ఆక్రమించారు.) యుద్ధానికి కదలుతున్న సేనల సవ్వడి ఆయనకు వినిపించింది. ముట్టడి కింద ఉన్న పట్టణంలోని తల్లులు పిల్లలు కడుపుమంటతో అలమటించటం విన్నాడు. ఆ పట్టణ ప్రాంగణంలోని సుందర పరిశుద్ధాలయం, రాజభవనాలు, బురుజులు మంటలకు ఆహుతి కావటం చూశాడు. ఒకప్పుడు అవి నిలిచి ఉన్న సలం ఇప్పుడు మండుతున్న బూడిద కుప్పగా మారింది.GCTel 5.2

    యుగాలవంక తేరిచూడగా నిబంధన ప్రజలు = అరణ్యతీరాన పడివున్న శకలాల్లా” చెదరిపోవటం ఆయన చూశాడు. వారిపై విరుచుకు పడబోతున్న శారీరక శిక్షతో యేసు చూసింది దేవుని ఉగ్రత పాత్రలోని పానీయాన్ని వారు తాగనున్న మొదటి గుక్క మాత్రమే. చివరి తీర్పు సమయంలో దాన్ని ఆఖరి చుక్కవరకు వారు తొగవలసి వున్నారు. దుఃఖంతో కూడిన ఈ మాటల్లో దేవుని కనికరం, ప్రేమ వ్యక్తమవుతున్నాయి. “యెరూషలేమా, యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును పుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటినిగాని మీరు ఒల్లక పోతిరి. ” జనులందరికన్న అధిక మన్నన పొందిన నీవు నీకు ఇబ్బంది కలిగించే విషయాలేంటో, శాంతి సమాధానాలు తెచ్చిపెట్టేదేంటో ఎరిగియుంటే ఎంత బాగుండును. నీకు తీర్పునిచ్చే దూతను ఆపుజేశాడు. పశ్చాత్తాపం పొందమంటూ నీకు విజ్ఞప్తి చేశాడు. నీవు వినలేదు. కేవలం సేవకుల్ని, ప్రతినిధుల్ని, ప్రవక్తల్నేకాదు. నీవు తోసిరాజని నిరాకరించింది పరిశుద్ధ రక్షకుడు యేసునే నీవు విసర్జించావు. నీవు నాశనమైతే అది నీస్వయంకృతమే. “అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రావొల్లరు.” మత్తయి 23:37; యోహాను 5:40.GCTel 5.3

    విశ్వసించక తిరుగుబాటు చేస్తూ దేవుని తీర్పులకు శిక్షకు పరుగులు తీస్తున్న ప్రపంచానికి ప్రతీకగా యెరూషలేమును చూశాడు క్రీస్తు. పతనమైన మానవజాతి దుఃఖబాధలు పేదనను కలిగించగా బాధాకరమైన ఈ మాటలు ఆయన పలికాడు. మానవుల కష్టాల్లో, కన్నీళ్ళలో, రక్తపాతంలో పాపఛాయలను ఆయన చూశాడు. లోకంలో పలు భాధలకు లోనైన వారిని చూసి జాలిగొన్నాడు. ఆ బాధల్ని నివారించటానికి తహతహలాడాడు.అయితే వెల్లువెత్తిన మానవ దుఃఖానికి శ్రమలకు ఆ ప్రభువుకూడ అడ్డుకట్ట వేయకపోవచ్చు. సహాయమందించగల ఒకే ఒక శక్తిని ఆశ్రయించే వారు లేరు. రక్షణను వారి అందుబాటులోకి తెచ్చేందుకు మరణ పర్యంతం తన్నుతాను అర్పించుకోటానికి ఆయన సిద్ధంగా వున్నాడు. రక్షణ పొందేందుకు ఆయన వద్దకు వచ్చేవారు బహు తక్కువ మంది.GCTel 6.1

    దుఃఖిస్తున్న పరలోక ప్రభువు, అపార శక్తిగల దేవుని కుమారుడు భించటం, హృదయ వేదనతో కుంగిపోటం. ఆ దృశ్యం పరలోకాన్నే విస్మయ పర్చింది. పాపం ఘోరమూ, నీచమూ అయిందని ఈ దృశ్యం తెలుపుతుంది. దైవ ధర్మశాస్త్ర అతిక్రమ ఫలితాల నుంచి అపరాధులను రక్షించటం అపారశక్తిగల దేవునికి సైతం ఎంతో కష్టమని ఇది వ్యక్తం చేస్తున్నది. లోకంలోని చివరితరం వరకు వున్న ప్రజల్ని వీక్షిస్తూ, యెరూషలేము నాశనానికి కారణమైన మోసంవంటి మోసంలోనే లోకం చిక్కుకొని వున్నట్లు యేసు చూశాడు. యూదుల ఘోరపాపం క్రీస్తును విసర్జించటం. క్రైస్తవ ప్రపంచం ఘోర పాపం ఏదంటే పరలోకంలోనూ ఇహలోకంలోనూ దేవుని ప్రభుత్వానికి పునాది అయిన ధర్మశాస్త్రాన్ని తోసిరాజనటం. దేవుని నీతి సూత్రాలను ద్వేషించి కాలరాయటం. పాపదాస్యంలో మగ్గుతూ సాతానుకు బానిసలై రెండో మరణానికి పాత్రులైన ప్రజలు వారికి అందిన సత్యాన్ని వినటానికి నిరాకరిస్తారు. ఎంత భయంకరమైన గుడ్డితనం! ఎంత నికృష్ట వంచన!GCTel 6.2

    పస్కాకు రెండు రోజులు ముందు చివరిసారిగా క్రీస్తు దేవాలయాన్ని సందర్శించి వెళ్ళిపోయాడు. యూదు అధికారుల వేషధారణను విమర్శించి ఆ తర్వాత శిష్యులతో కలిసి ఒలీవకొండకు వెళ్ళి వారితో కలసి ఆ నగరానికి ఎదురుగా వున్న పచ్చికబయలులో కూర్చున్నాడు. ఆ నగరం గోడల్ని, గోపురాల్ని, రాజభవనాల్ని- మరోమారు వీక్షించాడు. ధగధగమెరుస్తున్న దేవాలయ ప్రాభవాన్ని మరోమారు పరికించాడు. ఆ పరిశుద్ద పర్వతానికి అది అందమైన కిరీటంలా వుంది. తన పరిశుద్ద మందిరాన్ని దేవుడు తన నివాసం చేసుకొని ఇశ్రాయేలుపై దయచూపినందుకు ఆయన్ను కొనియాడుతూ కీర్తనకారుడు వెయ్యేండ్ల కిందట ఇలాన్నాడు “షాలేములో ఆయన గుడారమున్నది. సీయోనులో ఆయన ఆలయమున్నది.” “యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టెను” కీర్తనలు 76:2; 78:68,69. ఇశ్రాయేలు చరిత్ర మహోజ్వలంగా ఉన్న కాలంలో మొదటి దేవాలయం నిర్మిత మయ్యింది. ఆలయ నిర్మాణం నిమిత్తం దావీదురాజు విస్తారమైన నిధులను సేకరించగా దాని నిర్మాణ ప్రణాళికలు దైవావేశం కింద రూపుదిద్దుకొన్నాయి. 18వృ.28:1219. ఇశ్రాయేలు రాజులలో మిక్కిలి వివేకవంతుడైన సొలోమోను దాన్ని పూర్తి చేశాడు. ఈ ఆలయం ప్రపంచంలో అత్యుత్తమ నిర్మాణం. రెండో ఆలయం గురించి ప్రవక్త హగ్గయి ద్వారా ప్రభువిలా అన్నాడు ” ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును” ( నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే యెహోవా వాక్కు ” హగ్గయి 2:79GCTel 7.1

    ఈ దేవాలయాన్ని నెబుకద్నెజరు ధ్వంసంచేశాడు. క్రీస్తు జననానికి ఐదువందల సంవత్సరాలు ముందు దీన్ని తిరిగి కట్టడం జరిగింది. చితికి శిధిలమై దాదాపు మనుష సంచారం లేని తమ మాతభూమికి తమ జీవితమంతా బానిసలుగా నివసించటానికి తిరిగి వచ్చిన ప్రజలు నిర్మించుకొన్నది ఇది. వారి మధ్య సొలోమోను దేవాలయ ప్రాభావాన్ని చూచిన వృద్ధులున్నారు. మొదటి ఆలయం కన్నా ఇది ఎంతో తక్కువగాGCTel 7.2

    ఉన్నదంటూ కొత్త ఆలయ నిరాణం ప్రారంభించేటప్పుడు వృద్ధులు ఏడ్చారు. నాటి భావోద్వేగాన్ని, ప్రవక్త చక్కగా వర్ణించాడు. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారుగదా? అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా” హగ్గయి 2:3:ఎజ్రా 3:12. రెండో ఆలయ మహిమ మొదటిదాని మహిమను మించి ఉంటుందన్న వాగ్దానం ఇవ్వటం అప్పుడు జరిగింది. GCTel 8.1

    కాగా మహిమ విషయంలో రెండో ఆలయం మొదటి ఆలయానికి దీటుగా లేదు. మొదటి ఆలయం విషయంలో దైవ సన్నిధిని సూచిస్తూ గుర్తులు కనిపించగా రెండో ఆలయం సందర్భంగా అవేమీ లేవు. ఆలయాన్ని దేవునికి అంకితం చేసిన తరుణంలో దైవ శక్తి ప్రదర్శన జరగలేదు. నూతనంగా నిర్మితమైన ఆలయాన్ని నింపేందుకు తేజోమహిమ దిగిరాలేదు. ఆలయ బలిపీఠంపై ఉన్న బలిని దహించేందుకు ఆకాశం నుంచి అగ్ని దిగిరాలేదు. అతిపరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్య షెకీనా కాంతి లేదు. మందసం, కరుణా పీఠం, సాక్షపు బల్లలు అందులోలేవు. యాజకుడికి యెహోవా చిత్తాన్ని వ్యక్తం చేసే దైవ స్వరం అందులో వినిపించలేదు.GCTel 8.2

    దేవుడు హగ్గయి ద్వారా పలికిన వాగ్దానపు నెరవేర్పును నిర్ధారించడానికి శతాబ్దాలుగా యూదులు వ్యర్ధ ప్రయత్నాలు చేశారు. అయినా గర్వం, అపనమ్మిక వారికి అంధత్వం కలిగించినందువల్ల వారు ప్రవక్త మాటల యధార్ధ భావాన్ని గ్రహించుకోలేక పోయారు. రెండో ఆలయంలో యెహోవా తేజోమహిమ ప్రజ్వరిల్లలేదు. కాని ఎవరిలో త్రిత్వం సశరీరంగా సంపూర్ణంగా మూర్తిభవించిందో, ఎవరు మానవ శరీరం ధరించిన దైవమో ఆ యేసు ప్రత్యక్ష సముఖంతో ఆలయం ప్రజ్వలించింది. పవిత్ర దేవాలయ ప్రాంగణంలో నజరేతు మహానీయుడు ప్రజలకు బోధించి రోగులను బాగు చేసినప్పుడు “సకల జనముల ఆకాంక్ష” అయిన యేసు తన నివాసంగా ఆ ఆలయానికి విచ్చేశాడు. మహిమ పరంగా కేవలం క్రీస్తు సన్నిధిని బట్టే రెండో ఆలయం మొదటి ఆలయం కన్నా మిన్న అయింది. అయితే ఈ దైవానుగ్రహాన్ని ఇశ్రాయేలు ప్రజలు నిరాకరించారు. నిరాడంబర ఉపాధ్యాయుడు ఆనాడు ఆలయం బంగారు ద్వారాలు తెరచి బయటికి వెళ్లటంతో మహిమ ఆలయాన్ని నిత్యం విడిచి వెళ్లిపోయింది. రక్షకుడు పలికిన ఈ మాటలు అప్పటికే నెరవేరి ఉన్నాయి. “ఇదిగో మీయిల్లు మీకు విడువబడియున్నది” మత్తయి 23:38.GCTel 8.3

    యేసు ఆలయ విధ్వంసాన్ని ప్రవచించటం శిష్యగణాన్ని దిగ్ర్భాంత పరచింది. ఆయన మాటల ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఆశించారు. ఆలయ సౌందర్యాన్ని ఇనుమటింప జేసేందుకు నలభై ఏళ్ల పాటు విశేష ద్రవ్యం, శ్రమదానం, నిర్మాణ కౌశలం వ్యయమయ్యాయి. మహా చక్రవర్తి హేరోదు రోమా ప్రభుత్వ సంపదను యూదుప్రజల నిధులను సుందరమైన ఈ ఆలయనిర్మాణానికి ఉపయోగించాడు. ఆ చక్రవర్తి ఆలయానికి ఎన్నో విరాళాలిచ్చాడు. రోమునుంచి వచ్చిన పెద్ద పెద్ద పాలరాతి పలకలు ఈ కట్టడంలో ఉపయోగించారు. ప్రభుపు గమనాన్ని వీటిపైకి తిప్పుతూ నీ శిష్యులు ఇలా అన్నారు- “యీ రాళ్లేలాటివో, యీకట్టడములు ఏలాటివో చూడుము” మార్కు 13:1.GCTel 8.4

    ఈ మాటలకు గంభీర స్వరంతో యేసు ఇలా బదులు పలికాడు. “రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” మత్తయి 24:2.GCTel 9.1

    విశ్వరాజ్య సింహాసనాన్ని అధిష్టించటానికి, మారు మనస్సు పొందని యూదుల్ని శిక్షించటానికి, రోమా కాడి నుంచి యూదుజాతిని విడిపించటానికి మహిమతో వ్యక్తిగతంగా క్రీస్తు వచ్చే తరుణంలో చోటుచేసుకునే సంభవాల్లో యెరూషలేము నాశనం ఒక భాగమని శిష్యులు భావించారు. తాను రెండోసారి వస్తానని ప్రభువు తన శిష్యులతో చెప్పాడు. కనుక యెరూషలేముపై దేవుని తీర్పులు అనగానే వారి మనసులు యేసురాకడ విషయం ఆలోచించటం మొదలు పెట్టాయి. ఒలీవ కొండపై రక్షకుని చుట్టూ చేరినప్పుడు “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికిని సూచనలేవి?” అని ఆయనను ప్రశ్నించారు. 3వ వచనం.GCTel 9.2

    వారికి భవిష్యత్తు మరుగు పడటం మంచిదయ్యింది. ప్రభువు శ్రమలు, మరణం, యెరూషలేము, అందులోని వారి దేవాలయం నాశనం అన్న ఈ రెండు విషయాలు అప్పుడు వారు గ్రహించగలిగి ఉంటే శిష్యులు ఎనలేని భయభ్రాంతులకు గురి అయి ఉండేవారు. లోకాంతానికి ముందు జరిగే ముఖ్య సంభవాలను వారికి క్రీస్తు రేఖామాత్రంగా తెలిపాడు. ఆ సమయంలో ఆయన మాటలు వారికి పూర్తిగా అర్ధంకాలేదు. అయితే ఈ మాటల్లోని ఉపదేశం దైవ ప్రజల అవసరానికి అనుగుణంగా విశదమవ్వటం జరుగుతుంది. ఆయన పలికిన ప్రవచనానికి రెండు అరాలున్నాయి. యెరూషలేము నాశనాన్ని గూర్చిన వర్ణనలో ఆ గొప్ప చివరి దినాన సంభవించే భయంకర విషయాల వర్ణన వున్నది.GCTel 9.3

    మహాభ్రష్టులైన ఇశ్రాయేలు ప్రజలు పొందనున్న తీర్పును ముఖ్యంగా మెస్సీయను నిరాకరించి సిలువ వేసినందుకు వారికి పడనున్న శిక్షను వింటున్న తన శిష్యబృందానికి యేసు ప్రకటించాడు. భయంకరమైన ఆ ముగింపుకు ముందు స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి. ప్రకటిత ఘడియ అర్ధాంతరంగా వస్తుంది. తన అనుచరుల్ని యేసు ఇలా హెచ్చరించాడు కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే- చదువువారు గ్రహించుగాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలెను” మత్తయి 24:15,16. యెరూషలేము పట్టణ ప్రాకారాల వెలుపల కొన్ని ఫర్లాంగుల దూరం పరిశుద్ధ స్థలం విస్తరించి ఉన్నది. విగ్రహారాధకులైన రోమీయుల ఆరాధన ప్రమాణాలు ఆ పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు నెలకొంటాయో అప్పుడు క్రీస్తు అనుచరులు పారిపోవటం క్షేమం. హెచ్చరిక సూచన కనిపించగానే పారిపోగోరేవాడు ఆలస్యం చేయకూడదు. పారిపోవలసిందిగా యూదయలోను, యెరూషలేములోను హెచ్చరించే సూచనకు అనుకూలంగా తక్షణం ప్రజలు స్పందించాలి. ఇంటికప్పుపై ఉన్న వ్యక్తి ఇంటిలోవున్న మిక్కిలి విలువైన వస్తువుల్ని తీసుకోటానికి కూడా లోనికి వెళ్ళకూడదు. పొలాల్లోగాని, ద్రాక్షతోటల్లోగాని పని చేస్తున్న వారు తాము ఎండలో పని చేస్తున్నప్పుడు వేసుకొన్న బట్టలు మార్చుకోడానికి కూడ ఇంటి లోనికి వెళ్లటానికి సమయం తీసుకో కూడదు. ఒక్క క్షణం సందేహిస్తే ఆ నాశనంలో చిక్కుకుని నశించటం ఖాయం.GCTel 9.4

    హేరోదు పాలనలో యెరూషలేము ఎంతో అందంగా రూపుదిద్దుకోవటమే గాక గోపురాలు, గోడలు, ఆశ్రయ దుర్గాల నిర్మాణం వల్ల పటిష్టమై దుర్భేద్య పట్టణంగా కనిపించింది. అట్టి సమయంలో ఆ పట్టణం నాశనమౌతుందని బహిరంగంగా ప్రవచించే వ్యక్తిని పిచ్చివాడని, ఆందోళనకారుడని ప్రజలు పిలిచేవారే. నాడు నోవాహును పిలిచినట్లు అయితే క్రీస్తు అన్నమాటలివి “ఆకాశమును భూమియు గతించునుగాని నామాటలు ఏమాత్రమును గతింపవు” మత్తయి 24:35. యెరూషలేము చేసిన పాపాలవల్ల దేవుని కోపము రేగింది. తన మూర్ఖపు అవిశ్వాసమువల్ల నాశనం కొని తెచ్చుకొన్నది.GCTel 10.1

    మీకా ప్రవక్త ద్వారా ప్రభువిలా పలికాడు “యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి. నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మనమధ్యనున్నాడుగదా, యే కీడును మనకు రాలేదని అనుకొందురు” మీకా 3:9-11.GCTel 10.2

    దుర్మార్గతతో స్వనీతితో నిండిన యెరూషలేము ప్రజల్ని ఈ మాటలు చక్కగా వర్ణించాయి. దైవధర్మశాస్త్ర సూత్రాల్ని నిష్టగా ఆచరిస్తున్నామని చెప్పుకొంటూ వాటన్నిటినీ అతిక్రమిస్తున్నారు. వారు యేసును ద్వేషించారు. ఎందుచేతనంటే ఆయన పరిశుదత వారి పాపాన్ని బయలుపర్చింది. తమ పాపాల ఫలితంగా కలిగిన కష్టాలకు కారకుడు ఆయనేనని క్రీస్తును నిందించారు. ఆయన పాపరహితుడని ఎరిగినా ఒక దేశంగా తమ మనుగడకి క్షేమానికి ఆయన మరణం అవసరమని వారు ఉద్ఘాటించారు. “మన మాయనను ఈలాగు చూచుచు ఊరకుండిన యెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులువచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకొందురు.” అని యూదు నాయకులు ఆందోళన చెందారు. యోహాను 11:48. క్రీస్తును హతమార్చితే తాము మళ్లీ బలమైన ఐక్య జనాంగం కాగలమని వారు భావించారు. వారి ఆలోచనా ధోరణి అది కాబట్టి ప్రజలంతా నాశనమవటంకన్నా ఒకవ్యక్తి మరణించటం మేలు అన్న వాదనతో వారు ఏకీభవించారు.GCTel 11.1

    “నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు” మీకా 3:10. యూదు నాయకులు ఈ విధంగా కట్టారు. తమ పాపాల నిమిత్తం తమను గద్దించినందున వారు తమ రక్షకుడైన యేసును చంపికూడా తాము దేవుని ప్రియ బిడ్డలమని తమ శత్రువుల నుంచి తమను దేవుడు కాపాడాడని వారు భావించారు. వారి స్వనీతి అలాంటిది. మీకా ప్రవక్త ఇంకా ఇలా అంటున్నాడు, “కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ళకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములవలె అగును.” 12 వచనం.GCTel 11.2

    యెరూషలేము నాశనాన్ని స్వయాన యేసే ప్రకటించిన దాదాపు నలబై సంవత్సరాలు ఆ పట్టణానికిగాని, ఆ ప్రజలకుగాని యేసు ప్రవచించిన తీర్పులు రాలేదు. వాటిని పంపటంలో ప్రభువే ఆలస్యం చేశాడు. సువార్తను విసర్జించిన వారిపట్ల తన కుమారుణ్ణి హత్యచేసిన దుర్జనులపట్ల దేవుని దీర్ఘశాంతం ఎంతో గొప్పది. ఫలాలులేని చెట్టు ఉపమాసం యూదు ప్రజలతో దేవుడు వ్యవహరించిన తీరును సూచిస్తున్నది. “నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్ధమై పోవలెను?” (లూకా 13:7). అన్న ఆవేశం వ్యక్తమయ్యింది. అయితే దైవకృప దాన్ని ఇంకా కొంత కాలం ఉంచింది. క్రీస్తు ప్రవర్తనను పరిచర్యను గూర్చి ఎరుగని యూదులు అప్పట్లో చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు తోసిపుచ్చిన సత్యం పట్ల తమ పిల్లలూ ఆసక్తి చూపించ లేదు. వారు దాన్ని అంగీకరించలేదు. అపోస్తలులు, వారి సహచరుల సువార్త సేవ ద్వారా వారికి సత్యం అందేటట్లు చేశాడు దేవుడు. ప్రవచనం ఎలా నెరవేరిందో వారు గ్రహించగలిగారు. క్రీస్తు జననం, జీవితంలోనేగాక ఆయన మరణం పునరుత్సానంలో కూడా ప్రవచన నెరవేర్సును వారు చూశారు. తల్లిదండ్రుల పాపాలను బట్టి పిల్లలు పాపులు కారాదు. కాకపోతే తల్లిదండ్రులకు వచ్చిన సత్యాన్ని గూర్చిన జ్ఞానంతో పాటు తమకు అదనంగా వచ్చిన సత్యాన్ని పిల్లలు తోసిరాజనిప్పుడు వారు తమ తల్లిదండ్రుల పాపాల్లో పాలిభాగస్తులై తమ దుర్నీతి పాత్రను నింపుకొన్న వారయ్యారు.GCTel 11.3

    యెరూషలేము విషయంలో దేవుడు చూపిన సహసం యూదులు పాపంలో మరింత మూర్ఖంగా కొనసాగటానికి తోడ్పడింది. యేసు శిష్యులపట్ల తమ ద్వేషభావం, క్రూరత్వం వల్ల కృప పొందటానికి తమకున్న చివరి అవకాశాన్ని యూదులు విసర్జించారు. అంతట దేవుడు తన భద్రతను పరిరక్షణను వారి నుంచి ఉపసంహరించుకొన్నాడు. సాతాను అతని దూతల దుష్టత్వాన్ని అదుపుచేయటం మానుకొన్నాడు. అందుచేత ఆ ప్రజలు తాము ఎంపికచేసుకొన్న నాయకుడి అదుపాజ్ఞలకింద నివసించవలసి ఉన్నారు. వారి పిల్లలు క్రీస్తు కృపను తృణీకరించారు. వారు తమ దురాలోచనల్ని అదుపుచేసుకోటానికి క్రీస్తు కృప తోడ్పడి ఉండదు. అయితే ఇప్పుడు దురాలోచనలే వారిని జయించి వశపర్చుకొన్నాయి. ఆత్మలో తీవ్రమైన నీచాతినీచమైన ఉద్రేకాన్ని ఆవేశాన్ని సాతాను రెచ్చగొట్టాడు. మనుషులు మంచి చెడ్డలు ఆలోచించలేదు. విచక్షణ కోల్పోయి దురాగ్రహానికి లోనై వారు యుక్తాయుక్త జ్ఞానాన్ని పోగొట్టుకున్నారు. క్రూరులై సాతాను మాదిరిగా వ్యవహరించారు. కుటుంబంలో దేశంలో ఉన్నవారి మధ్య లేనివారి మధ్య అనుమానం ఈర్ష్య ద్వేషం వైరుద్యం తిరుగుబాటు హత్య చోటుచేసుకున్నాయి. ఎక్కడ చూసినా అభద్రతే స్నేహితులు బంధువులు ఒకరికొకరు ద్రోహం తలపెట్టారు. పిల్లలు తల్లిదండ్రులు ఒకరినొకరు చంపుకొన్నారు. ప్రజాపరిపాలకులు తమ్ముతాము పాలించుకునే శక్తిని కోల్పోయారు. అదుపుతప్పిన ఆవేశాలు వారిని నియంతలుగా మార్చాయి. నిరపరాధి అయిన దైవ కుమారుడు యేసును తప్పుడు సాక్ష్యాలతో దోషి అని వారు తీర్పు చెప్పారు. ఇప్పుడు తప్పుడు ఆరోపణలు వారి జీవితాన్నే అస్థిరపర్చాయి. తమ క్రియల ద్వారా దీర్ఘకాలంగా వారిలా అంటున్నారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మాయెదుట ఎత్తకుడి”. యెషయా 30:11. వారి కోరిక ఇప్పుడు నెరవేరింది. వారికి దేవుని భయం ఇకలేదు. ఆ దేశానికి అధినాయకుడు సాతానే. ఉన్నత స్థాయిలోని ప్రజాధికారం, మతాధికారం సాతాను ప్రాబల్యం కిందే సాగాయి.GCTel 12.1

    కొన్నిసార్లు శత్రువర్గ నాయకులు ఏకమై పేదలను దోచుకొని హింసించి అనంతరం ఒక వర్గంపై ఇంకొక వర్గం పడి దయాదాక్షిణ్యాలు లేకుండ చంపుకొన్నారు. వారి క్రూర వర్తనకు పవిత్ర దేవాలయం కూడ అడ్డుకట్టవేయలేక యింది. బలిపీఠం ముందే భక్తుల్ని వధించారు. వారి మృత దేహాలతో ఆలయాన్ని అపవిత్రపర్చారు. ఇంతచేసి కూడా ఈ దురంతాల వెనుకవున్న నాయకులు ఆధ్యాత్మికమైన గుడి తనం, దురభిమానంతో నిండి, యెరూషలేము దేవుని పట్టణం గనుక అది విధ్వంస మవుతుందన్న భయం తమకులేదని బహిరంగంగా ప్రకటించారు. రోము సేనలు దేవాలయాన్ని ముట్టడిస్తున్న సమయంలో కూడా ఈ నాయకులు తమ అధికారాన్ని నిలుపుకునేందుకుగాను అబద్ద ప్రవక్తల్ని లంచాలతో కొని ప్రజలు దేవుని విడుదల కోసం వేచి ఉండాలంటూ వారితో ప్రకటనలు చేయించారు. సర్వోన్నతుడైన దేవుడు కలుగజేసుకొని తమ పక్షంగా శత్రుసేనల్ని మట్టి కరిపిస్తాడన్న నమ్మకాన్ని జనులు గట్టిగా పట్టుకొని చివరి వరకు నిలిచి ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సంరక్షణను తోసిపుచ్చారు. ఇప్పుడు వారికి కాపుదల లేకపోయింది. విచారంలో మునిగిన యెరూషలేము అంతర్గత విభేదాలతో ముక్కచెక్కలై పరస్పరం దూసుకొన్న కత్తులకు బలైన బిడ్డల రక్తంతో ఎర్రబడ్డ వీధుల్లో శత్రుసేనల దాడిలో యుద్దశూరుల్ని కోల్పోయిన యెరూషలేము నాశనాన్ని గురించి యేసు ప్రవచించిన దంతా అక్షరాలా నెరవేరింది. రాత్రి చీకటిలో దేవాలయం మీద బలిపీఠం మీద అస్వాభావిక కాంతి ప్రకాశించింది. యుద్ధానికి సమావేశమౌతున్న రధాలు, యుద్దశూరుల చిత్రాలు సూర్యాస్తమయం వేళ మేఘాలపై కనిపించాయి. దేవాలయంలో రాత్రి సేవలు నిర్వహిస్తున్న యాజకులు ఏవో విచిత్ర శబ్బాలువిని భయాందోళనలకు గురి అయ్యారు. భూమి కంపించింది. ” ఇక్కడ నుంచి మమ్మల్ని పోనీయండి ” అంటూ కేకలు పెడున్న స్వరాలు వినిపించాయి. తూర్పు గుమ్మం ఎంతో బరువైంది. బలమైన రాళ్ళతో తయారైన నేలలోకి బ్రహ్నాండమైన ఇనుపకమ్మెలతో ద్వారాల్ని అమర్చారు. ఆ ద్వారాల్ని మూయటం ఇరువైమంది మనుషులకు కూడా కష్టమే. మధ్యరాత్రిలో అవి వాటంతట అవే తెరుచుకొన్నాయి. మిల్మేన్ ది హిస్టరీ ఆఫ్ ది జూస్, పుస్తకం, పుట 13.GCTel 13.1

    యెరూషలేముకు కలుగనున్న శ్రమల్ని ఏకరువుపెడూ ఒక వ్యక్తి ఆపట్టణ వీధుల్లో ఇటూ అటూ ఏడు సంవత్సరాలు తిరిగాడు. “తూర్పు నుంచి వస్తున్న స్వరం, పడమర నుంచి వస్తున్న స్వరం, నాలుగు గాలుల నుంచి వస్తున్న స్వరం, పెండ్లికుమారులనూ, పెండ్లికుమార్తెలనూ వ్యతిరేకిస్తున్న స్వరం ప్రజలందరినీ వ్యతిరేకిస్తున్న స్వరం” అంటూ రాత్రింబగళ్లు మరణ గీతం పాడాడు- అదే పుస్తకం. ఈ వింత వ్యక్తిని ఖైదులో వేసి కొట్టారు. అతడి నోటివెంట ఎలాంటి ఫిర్యాదు వినిపించలేదు. అవమానించి నిందించినప్పుడు శ్రమ, యెరూషలేముకు శ్రమ” అన్నది మాత్రమే అతడి జవాబు. యెరూషలేము ప్రజలకు శ్రమ, శ్రమ” అన్న అతడి హెచ్చరిక పలుకులు తాను ప్రవచించిన ముట్టడి సంభవించి అందులో అతడు కూడా నేలకూలేంతవరకు ఆగలేదు.GCTel 13.2

    ఆ నాశనంలో ఒక్క క్రైస్తవుడు కూడా మరణించలేదు. క్రీస్తు తన శిష్యులను ముందే హెచ్చరించాడు. ఆయన మాటలు విశ్వసించిన వారందరూ ఆయన చెప్పిన గుర్తుకోసం కనిపెట్టారు. ఆయన ఇలా హెచ్చరించాడు “యెరూషలేము దండచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు వెలుపలికి పోవలెను”లూకా 21:20 21. సిస్టియన్ ఆదిపత్యం కింద రోమా సేనలు యెరూషలేమును ముట్టడించిన అనంతరం దాడికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికి ఎందుకో దాడిని విరమించుకున్నాయి. ముట్టడి బాధితులు శత్రువును ప్రతిఘటించలేక లొంగిపోడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో రోమా సేనాధిపతి కారణమేమీ లేకుండా తన సేనల్ని ఉపసంహరించుకొన్నాడు. తన ప్రజలకు ఉపకారం కలిగేందుకు కృపామయుడైన దేవుడు నాటి సంఘటనల్ని ఇలా నిభాయిస్తున్నాడు. వాగ్దానం చేసిన గుర్తు వేచి ఉన్న క్రైస్తవుల ముందున్నది. రక్షకుడు చేసిన హెచ్చరికను శిరసావహించగోరినందరికీ ఇప్పుడు ఒక అవకాశం కలిగింది. అప్పటి పరిస్థితిలో యూదులుగాని, రోమీయులుగాని క్రైస్తవుల నిర్ణయాన్ని అడ్డుకోలేకుండా వున్నారు. సెస్టియన్ వెనుకంజ వేయటంతో యెరూషలేము నుంచి దండుగా వచ్చిన యూదులు అతడి సేనల్ని, తరిమారు. ఇలా ఈ సేనలు ఒకదానితో ఒకటి తలపడిన తరుణంలో ఆ పట్టణం నుంచి పారిపోటానికి క్రైస్తవులకు మంచి అవకాశం దొరికింది. వారిని మార్గంలో ఆపటానికి ప్రయత్నించగల దేశ శత్రువులు లేరు. దేశం వారిని తొలగించుకుంది. ఈ ముట్టడి సమయంలో పర్ణశాలల పండుగ ఆచరించేందుకు యూదులు యెరూషలేములో సమావేశమయ్యారు. కనుక దేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఎలాంటి నిర్బంధం లేకుండా తప్పించుకో గలిగారు. ఎలాంటి జాప్యమూ లేకుండా వారు సురక్షితమైన స్థలానికి పారిపోయారు. అది యోర్దానునది అవతల ఉన్న పెరియా భూభాగంలోని పిల్లాఅనే నగరం. యూదుసైన్యం సెప్టెన్ సేనను తరుముతూ వెనక ఉన్న సేసల మీద విరుచుకు పడి వారిని పూర్తిగా నాశనం చేసినంతపని చేసింది. రోమా సేనలు అతికష్టంతో తప్పించుకొని పారిపోగలిగాయి. యూదులకు మాత్రం నష్టం ఏమీ వాటిల్లలేదు. కొల్లసొమ్ముతో, విజయోత్సాహంతో వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. రోమీయుల్ని మొండిగా ప్రతిఘటించటానికి ఈ ఘటన వారికి స్పూర్తి నిచ్చింది. నాశనం దిశగా పయనిస్తున్న ఆ నగరానికి చెప్పలేని శ్రమను త్వరలో తేవటానికి ఇది తోడ్పడింది.GCTel 14.1

    యెరూషలేము ముట్టడిని బైటస్ కొనసాగించాడు. యెరూషలేమును తీవ్ర శ్రములు, విషాదాలు పట్టిపీడించాయి. పస్కా పండుగ సందర్భంగా లక్షలాది యూదులు యెరూషలేము పట్టణంలో సమావేశమైనపుడు అది ముట్టడికి గురి అయ్యింది. జాగ్రత్తగా భద్రపర్చుకొని వుం వారికున్న ఆహారపు దినుసులు ప్రజలందరికి అనేక సంవత్సరాలు వచ్చి ఉండేవి. అయితే వర్గ కక్షలు, అసూయా ద్వేషాల ఫలితంగా అంతకుముందు అవి ధ్వంసమయ్యాయి. ప్రజలు తిండిలేక మలమల మాడి పోతున్నారు. కుంచెడు గోధుముల ధర తలాంతు పలికింది. ఆకలి బాధ తట్టుకోలేక మనుషులు తమ బెల్టులు, చెప్పులు, డాలు తొడుగుల తోలును పీక్కుని తినేవారు. రాత్రి చీకటిలో ఎంతోమంది పట్టణ ప్రాకారాల వెలుపల దొంగతనంగా వెల్లి పిచ్చిమొక్కల్ని పీకి తినటానికి తెచ్చుకునేవారు. ఇలా బైటికి వెళ్లిన వారు పట్టుబడితే వారికి బాధాకరమైన మరణం ప్రాప్తించేది. తరచు బైటవారిని తప్పించుకుని పట్టణం లోపలికి ఎవరైనా రాగలిగితే వారు ఎంతో ప్రయాసతో తెచ్చుకున్నవి తీసుకొని వారిని విడిచిపెట్టడం జరిగేది. ఆకలితో బాధపడున్న అభాగ్యులు కొద్దిపాటి ఆహారాన్ని దాచుకుంటే దాన్ని బలవంతంగా లాక్కొని అధికారులు వారిని అమానుషంగా హింసించేవారు. తరచూ ఈ అకృత్యాలకు పాల్పడేవారు ఎవరో తెలుసా? తినటానికి బాగా తిండివున్నవారు. ముందు రోజులకు దాచుకుందామని ఆశించే స్వార్ధపరులు!GCTel 15.1

    వేలకొలది ప్రజలు కరవుకు తెగుళ్లకు బలి అయిపోయారు. మమతానురాగాలు మటుమాయమయ్యాయి. భర్తలు భార్యల్ని, భార్యల్ని భర్తల్ని దోచుకున్నారు. పిల్లలు తమ ముసలి తలిదండ్రుల నోటిలోని కూడు తీసుకొని తినేవారు. “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా” (యెషయా 49:15.) అని ప్రవక్త అడిగిన ప్రశ్నకు జవాబు ఈ అభాగ్య పట్టణంలో దొరికింది. “వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. ” విలాపవాక్యములు 4:10 పద్నాలుగు శతాబ్దాల పూర్వం దేవుడిచ్చిన హెచ్చరికా ప్రవచనం మళ్లీ నెరవేరింది. “నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకపరచుట వలనను ముట్టడి వేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతిసుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతిసుకుపూరము చేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ మధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిట పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును.” ద్వితియోపదేశకాండము 28:56,57. GCTel 15.2

    రోమా నేతలు యూదుల్ని భయపెట్టి లొంగదీసుకోటానికి ప్రయత్నించారు. తీసుకు వెళ్లేటప్పుడు ప్రతిఘటించిన బందీలను కొట్టి, హింసించి పట్టణ ప్రాకారాలముందు సిలువ వేశారు. ఈ విధంగా అనుదినం వందలాది ప్రజల్ని చంపారు. యెహోషాపాతు లోయ పొడుగునా, కల్వరిపైనా నడవటానికి స్థలం లేకుండేంతగా, పెద్ద సంఖ్యలో సిలువలు నిర్మించేంతవరకూ ఈ భయంకర చర్య కొనసాగింది. “వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండునుగాక” అంటూ నాడు పిలాతు న్యాయస్థానంలో పలికిన మాటలు (మత్తయి 29:25). ఎంతో భయంకర రీతిలో నెరవేరాయి.GCTel 16.1

    ఈ భయంకర దృశ్యానికి తెరదించి యెరూషలేముకు రానున్న విపత్తు తీవ్రతను చాలా మట్టుకు తగ్గించటానికి టైటస్ సంసిద్ధంగా ఉండేవాడే. శవాలు కుప్పలు కుప్పలుగా లోయలలో పడి ఉండటం చూసి తీవ్ర ఆందోళనకు గురి అయ్యాడు. దర్శనం చూస్తున్న వాడిలా, ఒలీసకొండ శిఖరం నుంచి ఆ మహోన్నత దేవాలయాన్ని వీక్షించి దానిలోని ఒక్క రాయిని కూడా ముట్టడానికి వీలులేదని ఆదేశించాడు. ఆలయాన్ని స్వాధీనం చేసుకోటానికి ప్రయత్నించక ముందు రక్తపాతంతో అపవిత్రం చేయటానికి తనను ఒత్తిడి చేయవద్దంటూ తాము లొంగి పోవటం ఉత్తమమంటూ యూదు నాయకులకు అతను విజ్ఞప్తి చేశాడు. మరే స్థలంలోనైనా యుద్ధం చేయటానికి తాము ఇష్టపడివస్తే రోమీయులెవరూ ఆలయ పవిత్రలను అతిక్రమించరని వారికి హామీ ఇచ్చాడు. వారు లొంగిపోయి తద్వారా తమ్ముతాము తమ పట్టణాన్ని తమ పరిశుద్ధాలయాన్ని కాపాడుకోవలసిందిగా స్వయాన జోసేఫస్ వారికి విజ్ఞప్తి చేశాడు. దానికి జవాబుగా వారు అతనిని శపించారు. వారిని బతిమలాడటానికి నిలిచి ఉండగా అతని మీద బాణాలు వేశారు. అతనే చివరి మానవ మధ్యవర్తి. దైవ కుమారుని విజ్ఞాపనల్ని వారు తోసిపుచ్చారు. ఇపుడు తర్కం, విజ్ఞప్తి చివరి వరకు ప్రతిఘటించటానికి వారిని ప్రోత్సహించాయి. ఆలయాన్ని కాపాడేందుకు టైటస్ చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. టైటస్కన్న ఉన్నతమైన ప్రభువన్నాడు రాయిమీదరాయి నిలవదు అని.GCTel 16.2

    యూదునాయకుల మూర్ఖత, ముట్టడికిందవున్న పట్టణంలో జరుగుతున్న హేయమైన నేరాలు రోమీయులను ఆగ్రహంతో నింపాయి. చివరికి దాడిచేసి దేవాలయాన్ని స్వాధీనపర్చుకోటాని టైటస్ కృతనిశ్చయుడయ్యాడు. ఆలయాన్ని సాధ్యమైనంత పుట్టుకు ధ్వంసం చేయకూడదని అతడు నిశ్చయించుకున్నాడు. కాగా అతని ఆదేశాల ఉల్లంఘన జరిగింది. రాత్రి నిద్రించటానికి తన గుడారంలోకి అతను వెళ్లినప్పుడు యూదులు ఆలయంలోనుంచి దూసుకువచ్చి ఆలయం వెలపట ఉన్న సైనికుల మీద పడ్డారు. ఆ కుమ్ములాటలో సైనికుడొకడు కాలుతున్న కట్టెను తీసి గుమ్మం సందులో నుంచి లోపలికి విసిరాడు. వెంటనే ఆలయంలోని చెక్క పొదిగిన గదుల్లో మంటలు లేచాయి. టైటస్ ప్రమాదస్థలానికి హుటాహుటీన వెళ్లాడు. అతని వెంట సేనాపతులు, సైనికులు వున్నారు. మంటల్ని ఆర్పవలసిందిగా వారిని టైటస్ ఆదేశించాడు. కాని ఆ మాటలు వినిపించుకొన్న వాడొకడూలేడు. కోపావేశాలకు లోనైన సైనికులు మండుతున్న కట్టెల్ని ఆలయం పక్కనే ఉన్న గదుల్లోకి విసిరారు. అంతటితో ఆగక ఆ గదుల్లో తలదాచుకొంటున్న వందలాది అసహాయుల్ని సంహరించారు. ఆలయం మెట్లమీదనుంచి రక్తం నీరువలె ప్రవహించింది. యూదులు వేల సంఖ్యలో మరణించారు. యుద్ధం రొదలో “ఈ కాబోదు”- ప్రభావం పోయింది అన్న కేకలు వినిపించాయి.GCTel 16.3

    “సైనికుల ఉగ్రతను ఆపటం టైటస్ కి సాధ్యం కాలేదు. అతను తన అధికారులతో కలిసి పరిశుద్ధ మందిరంలోకి వెళ్లి పరిశీలించాడు. ఆలయ సౌందర్యం వారిని ముగ్గుల్ని చేసింది. మంటలు పరిశుద్ధ స్థలానికి ఇంకా వ్యాపించలేదు గనుక ఆలయాన్ని కాపాడేందుకు చివరి ప్రయత్నం చేశాడు. మంటలు విస్తరించకుండా వాటిని అదుపు చేయాల్సిందిగా సైనికులకు అతడు మరోసారి విజ్ఞప్తి చేశాడు. శతసైనికాధిపతి ఆదేశాన్ని అమలుపర్చటానికి ఒత్తిడి ఉపయోగించాడు. చక్రవర్తి పట్ల తనకున్న గౌరవం కూడా పోయింది. యూదులపట్ల వారిలో తీవ్రవిద్వేషం రేగింది. యుద్ధాన్మాదం పెచ్చరిల్లింది. దోపిడి సొమ్ముపట్ల ఆశ చోటు చేసుకొన్నది. తమచుట్టూ వున్నదంతా బంగారపు వెలుగులు విరజిమ్ముతున్నట్లు, మంటల కాంతిలో అంతా తళతళ లాడుతున్నట్లు సైనికులు చూశారు. ఆలయంలో విలువకందని ధనరాశులున్నాయని ఊహించుకొన్నారు. ఒక సైనికుడు గమనించుకోకుండా వెలుగుతున్న దివిటీని తలుపు బందుల్లోనుంచి లోపలకు నెట్టాడు. అంతే క్షణంలోనే ఆలయమంతా మంటల మయమయింది. లేస్తున్న మంటలు, పొగవల్ల కళ్లు కనబడటం లేదు. అధికారులు వెనుదిరగక తప్పలేదు. ఆ ఉదాత సుందర మందిరం మంటలకు ఆహుతి అయిపోయింది.GCTel 17.1

    ఆ దృశ్యం రోమీయులకు దిగ్ర్భాంతి కలిగించింది. యూదుల మాటేమిటి? ఆ కొండ మీదనుంచి యెరూషలేము పట్టణం చక్కగా కనిపించేది. ఆ కొండ శిఖరమంతా అగ్నిపర్వతంలా మండింది. ఒకదానివెంట మరొకటిగా భవనాలు గొప్ప శబ్దం చేస్తూ కూలి చెలరేగుతున్న మంటల్లో మాయమైపోయాయి. దేవదారుతో నిర్మితమైన ఇళ్లకప్పులు అగ్ని జ్వాలల రేకుల్లా కనిపించి, గుడి శిఖరాలు రక్తవర్ణ దీపాల్లా ప్రకాశించాయి. ద్వారం మీది గోపురాలనుంచి ఆకాశాన్నంటుతున్న మంటలు పొగ లేచాయి. ఆ చుట్టూ వున్న కొండలు వెలుగుతో ప్రకాశించాయి. వెనుక నల్లని నేపథ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా చేరి జరుగుతున్న విధ్వంసాన్ని పరిశీలిస్తున్నారు. ఎగువ పట్టణం గోడలు ఎత్తు ప్రదేశాలు ప్రజలతో కిటకిటలాడాయి. కొందరు బిక్కముఖంతో నిరాశ నిస్పృహలతో ఉంటే మరి కొందరు మొహం చిట్టించుకొని తీరని కక్షతో నకనకలాడుతున్నారు. అటూ ఇటూ పరుగెడున్న రోమా సైనికుల కేకలు మంటల్లో మాడిపోతున్న తిరుగుబాటు దారుల అరుపులు బొబ్బలు మంటల హోరుతో ఉరుముల్లా పడుతున్న వాసాల శబ్బంతో కలిసిపోతున్నాయి. ఎత్తు ప్రాంతాలలోని ప్రజల వెర్రి కేకలకు కొండల్లో నుంచి వచ్చిన ప్రతిధ్వనులే సమాధానం. గోడల పొడవునా అరుపులు శోకాలే వినిపించాయి. కరవు కోరల్లో చిక్కుకొని మరణిస్తున్న వారు తమలో ఇంకా మిగిలివున్న శక్తిని కూడగట్టుకొని బాధతో నిస్పృహతో ఒక్క అరుపు అరిశారు.GCTel 18.1

    “బయటి దృశ్యంకన్నా మరింత భయంకర దృశ్యం లోపల జరుగుతున్న ఊచకోత. పురుషులు, స్త్రీలు, వృద్ధులు పడుచువారు, తిరుగుబాటు దారులు, యాజకులు, పోరాడే వాళ్ళు,దయాభిక్ష కోరే వాళ్ళు, విచక్షణారహితంగా వధకుగురి అయ్యారు. చంపుతున్న వారికన్నా చచ్చినవారి సంఖ్యహెచ్చు. నిర్మూలన కార్యాచరణలో తల మునకలై ఉన్న సైనికులు శవాల గుట్టల మీదుగా వెళ్ళి పనులు చేయాల్సివచ్చింది” మిల్ మేన్, ది హిస్టరీ ఆఫ్ ది జూన్, పుస్తకం 16.GCTel 18.2

    ఆలయ విధ్వంసం అనంతరం నగరమంతా రోమీయుల హస్తగత మయ్యింది. యూదునాయకులు తమ దుర్భేద్య గోపురాన్ని విడిచి పెట్టారు. వారు ఏకాకులై ఉండటం టైటస్ చూశాడు. వారి వంక ఆశ్చర్యంతో చూస్తూ వారిని తన చేతులకు దేవుడు అప్పగించాడని అన్నాడు. కారణం ఏమిటంటే ఎలాంటి యంత్రాలయిన అవి ఎంతో శక్తివంతమైన దుర్భేద్యమైన ఆ బురుజుల్ని ధ్వంసం చేయగలిగి వుండేవికావు. పట్టణం, పట్టణంలోని దేవాలయం రెండూ నేలమట్టమయ్యాయి. పరిశుద్ధమందిరం నిలిచిన స్థలాన్ని “చేనుదున్నినట్లు” దున్నారు. యిర్మియా 26:18. దాని వెనుక సంభవించిన ముట్టడిలోను వధలోను పదిలక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలి ఉన్న వారిని బందీలుగా తీసుకుపోయి, బానిసలుగా అమ్మారు. రాజు సాధించిన విజయానికి సూచికలుగా వ్యవహరించేందుకు వారిని రోము నగరానికి ఈడ్చుకువెళ్ళి అనంతరం ఏంఫీ తియేటర్ లో అడవి మృగాలకు ఆహారంగా వేశారు. లేక ఇల్లూ వాకిలి లేని దేశదిమ్మరులుగా లోకంలోకి చెదరగొట్టారు.GCTel 18.3

    యూదులు తమ సంకెళ్లను తామే రూపొందించుకున్నారు. తమ శిక్షాపాత్ర తామే నింపుకొన్నారు. ఒక దేశంగా తమకు సంప్రాప్తించింది. సర్వనాశనంతో చెదరిపోయి ఆయాప్రాంతాలకు వెళ్లినప్పుడు తమను వెంటాడిన శ్రమలలో వారు తమ సొంత చేతులతో విత్తిన పంటనే కోస్తున్నారు. ప్రవక్త ఇలా అంటున్నాడు, “ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.” “ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి. గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము” హోషేయ3:9; 14:1. వారికి కలిగిన శ్రమలు దేవుని ప్రత్యక్ష ఆదేశం వల్ల వచ్చినవే అని తరచూ సూచించటం జరుగుతుంది. మహా వంచకుడైన సాతాను తన దుష్కృతాల్ని ఇలా కప్పిపుచ్చుకొంటూ ఉంటాడు.GCTel 19.1

    యూదులపై దేవుడు ఉంచిన కాపుదలను ఆయన ఉపసంహరించు కోటానికి కారణం ఆయన ప్రేమను కృపను వారు మూర్ఖంగా విసర్జించటమే. ఫలితంగా తన ఇష్టం పచ్చినట్లుగా వారిని పాలించటానికి సాతానుకు అవకాశం లభించింది. యెరూషలేము నాశనం సందర్భంగా చోటుచేసుకున్న భయానక ఘటనలు, సాతాను ఆధీనంలో ఉన్న ప్రజలపై అతడికి ఎలాంటి విధ్వంసక శక్తి ఉన్నదో ప్రదర్శించాయి.GCTel 19.2

    మనం అనుభవిస్తున్న శాంతి భద్రతల నిమిత్తం క్రీస్తుకి ఎంత రుణపడి ఉన్నామో చెప్పలేం. మానవులు సాతాను నియంత్రణకు పూర్తిగా లొంగకపోవటానికి అతణ్ణి అదుపులో ఉంచే దైవశక్తే కారణం. ఆ దుష్టుని క్రూరమైన, హానికరమైన శక్తిని అదుపులో ఉంచటంలో వ్యక్తమౌతున్న దేవుని కృపకు దీర్ఘశాంతానికి అవిధేయ ప్రజలు కృతజ్ఞతలేని ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అయితే మానవుడు ఆయన సహనం హద్దుల్ని మీరినపుడు తాను విధించిన ఆంక్షను దేవుడు తొలగిస్తాడు. అతిక్రమానికి శిక్షవేసే వాడిగా దేవుడు పాపిపట్ల వ్యవహరించడు. కాగా తన కృపను తృణీకరించే వారిని తాము విత్తే పంటను కోసేందుకు విడిచిపెట్టాడు. వారు విసర్జించే ప్రతి కాంతి కిరణం వారు లెక్కచేయని ప్రతి హెచ్చరిక, వారు తీర్చుకునే ప్రతి కోరిక, వారు అతిక్రమించే ప్రతి దైవ నిబంధన వారు విత్తే విత్తనం. అది తప్పక దాని పంట నిస్తుంది. పాపి దేవుని ఆత్మను పదేపదే ప్రతిఘటిస్తే చివరికి ఆత్మ అతణ్ణి విడిచి పెద్దడం జరుగుతుంది. అప్పుడు హృదయంలోని దురేచ్ఛల్ని అదుపులో ఉంచేందుకు శక్తి మిగిలివుండదు. సాతాను పుట్టించే ద్వేషం, పగ నుంచి ఎలాంటి భద్రతా ఉండదు. దేవుడిస్తున్న కృపను లెక్కచేయకుండా దైవకటాక్షానికై వస్తున్న విజ్ఞాపనల్ని ప్రతిఘటించే వానికి యెరూషలేము నాశనం గంభీరమైన హెచ్చరిక. దేవునికి పాసమంటే హేయమనటానికి, అపరాధులకు శిక్ష తప్పక కలుగుతుందనటానికి ఇంతకన్న కచ్చితమైన సాక్ష్యం మరొకటి లేదు.GCTel 19.3

    యెరూషలేమును గూర్చిన తీర్పుల విషయంలో రక్షకుడు ప్రవచించిన నాశనం నెరవేర్పుతోపాటు మరోనెరవేర్పుంది. అప్పుడు జరిగిన భయంకర విధ్వంసం ముందు జరగనున్నది. దాని నీడవంటిది మాత్రమే. యెరూషలేముకు సంభవించిన నాశనం దేవుని కృపను తృణీకరించి ఆయన ధర్మశాస్త్రాన్ని కాలరాసే ప్రపంచ నాశనాన్ని సూచిస్తున్నది. శతాబ్దాల పొడవునా జరుగుతూ వచ్చిన నేరాల కారణంగా వాటిల్లిన మానవ శ్రమ వేదనల దాఖలాలు మనకున్నాయి. వాటిని గూర్చి తలంచితేనే గుండె చెదుర్తుంది. మనసు శక్తిహీనమవుతుంది. దేవుని అధికారాన్ని భేదాలను ఖాతరు చేసినందువల్ల ఘోర పరిణామాలు సంభవించాయి. సంభవిస్తాయి. భవిష్యత్తును గూర్చిన వెల్లడితో ఇంతకన్న విషాదకరమైన దృశ్యం బయలు పడింది. అరుపులు కేకలతో నిండిన సుదీర్ఘమైన ఊరేగింపులు, ఘర్షణలు, విప్లవాలు, “యుద్ధ సందడిచేయు యోధులు... రక్తములో పొర్లింపబడిన వస్త్రములు” (యెషయ 9:5.) గతాన్ని గూర్చిన ఈ దాఖలాలు ఆ దినాన సంభవించనున్న భయంకర సంఘటనలతో పోలిస్తే ఏపాటివి? దుష్టులను అదుపులో ఉంచి, మానవ ఉద్రేకాన్ని, సాతాను ప్రేరిత ఉగ్రతను నియంత్రించే దైవాత్మను దేవుడు ఆ దినాన ఉపసంహరించుకుంటాడు. ఈ తరుణంలో సాతాను కలిగించే దుష్పలితాల్ని ముందెన్నటికన్నా మరింత స్పష్టంగా ప్రపంచం చూడగల్గుతుంది.GCTel 20.1

    కాగా యెరూషలేము నాశనమైనప్పుడు జరిగిన రీతిగా ఆనాడు దేవుని ప్రజలందరికి విడుదల కలుగుతుంది. యెషయా 4:3. తనకు నమ్మకంగా ఉన్నవారందరిని తనతో ఉంచుకోటానికి రెండోసారి వస్తానని క్రీస్తు ప్రకటించాడు. “ఆప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను, మహామహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న, సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశముయొక్క ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు” మత్తయి 24:30, 31. అప్పుడు సువార్తను ఆచరించని ప్రజలు ఆయన నోటి ఊపిరిచేత ఆయన ఆగమన ప్రకాశం చేత నాశనమౌతారు. 2 థెస్స. 2; 8. నాడు ఇశ్రాయేలు ప్రజల మల్లే దుష్టులు తమ్నును తామే నాశనం చేసుకొంటారు. తమ దుర్మార్గతకు తామే బలిఅవుతారు. తమ పాప జీవితాలవల్ల వారు దేవునితో సామరస్యాన్ని కోల్పోతారు. దుష్క్రియలవల్ల వారి స్వభావం దిగజారిపోతుంది. అందుచేత దేవుని మహిమా ప్రత్యక్షత వారిపట్ల దహించే అగ్నిగా పరిణమిస్తుంది.GCTel 20.2

    క్రీస్తు మాటల్లో వస్తున్న గుణపాఠాన్ని అలక్ష్యం చేయకుండా ఉండేందుకు మనుషులు జాగ్రత్తపడాలి. యెరూషలేముకు సంభవించబోతున్న నాశనం గురించి ప్రపంచాన్ని హెచ్చరించి ప్రజలు దాని నుంచి తప్పించుకొనేందుకుగాను దాన్ని గూర్చి ప్రభువు సూచనలిచ్చాడు. యేసు ఇలా చెబుతున్నాడు. “మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద... జనములకు శ్రమ కలుగును” లూకా 21:25; మత్తయి 24:29; మార్కు .13:2426; ప్రకటన 6:1217. ఆయన రాకను సూచించే ఈ గుర్తుల్ని చూసే ప్రజలు “ఆయన సమీపముననే, ద్వారము వద్దనే యున్నాడని” తెలుసుకోవాలి. మత్తయి 24:33. “గనుక మీరు మెలకువగా నుండుడి” అంటూహెచ్చరిస్తున్నాడు ప్రభువు. మార్కు.13:36. ఈ హెచ్చరికను పాటించే వారు చీకటిలో పడిఉండరు. ఆ దినం వారిపై అర్ధాంతరంగా వచ్చిపడదు. ఇకపోతే మెలకువగా లేని ప్రజలకు ” ఆ దినము దొంగవలె” వస్తుంది. 1 థెస్స. 5:25.GCTel 21.1

    యెరూషలేమును గురించి రక్షకుని హెచ్చరికను యూదులు ఎలా పెడ చెవిని పెట్టారో అలాగే ఈ రోజు కూడ లోకం దేవుని వర్తమానాన్ని అంగీకరించి, ఆచరించటానికి సిద్ధంగా లేడు. దేవుని ఉగ్రత దినం ఎప్పుడు వస్తుందోగాని అది వచ్చినప్పుడు దుష్టులపై హఠాత్తుగా విరుచుకుపడుంది. జీవితం ఏ మార్పు లేకుండా యథావిధిగా సాగుతూ ఉన్నప్పుడు మనుషులు సుఖజీవనంలో వ్యాపార విషయాల్లో రాకపోకల్లో డబ్బు సంపాదనలో తలమునకలై ఉన్నప్పుడు మన నాయకులు, ప్రపంచ ప్రగతిని విజ్ఞానాన్ని కొనియాడుతున్నప్పుడు, తప్పుడు భద్రతా భావంతో ప్రజలు ఆదమరచి నివసిస్తున్నప్పుడు, అప్పుడు కావలికొరవడ్డ నివాసంలోకి అర్థరాత్రి దొంగ ప్రవేశించే రీతిగా అజాగ్రత్తగా ఉన్న వారిమీదికి దుష్టుల మీదికి నాశనం అర్ధాంతరంగా వచ్చిపడుంది. “వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” 3 వచనం.GCTel 21.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents