Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 12—ఫ్రెంచ్ సంస్కరణ

    స్పెయిర్స్ నిరసన ఆగ్స్ బర్గ్ ప్రకటన జర్మనీలో సంస్కరణ విజయాన్ని సాధ్యపర్చాయి. అనంతరం సంవత్సరాలుగా సంఘర్షణ సాగింది. అంధకారం అలము కొన్నది. మద్దతు దారుల మధ్య విభేదాలు, బలవంతులైన శత్రువుల దాడులతో ప్రొటస్టాంటు తత్వం పూర్తిగా నాశనమవ్వటం తథ్యమనిపించింది. తమ విశ్వాసం నిమిత్తం వేలాదిమంది ప్రాణాలర్పించారు. అంతర్యుద్ధం ఆరంభమయ్యింది. ప్రొటస్టాంటు ఉద్యమ నాయకుల్లో ఒకడు ఉద్యమానికి ద్రోహం తల పెట్టాడు. సంస్కరణ వాద సామంతరాజుల్లో ఉత్తములు చక్రవర్తి చేతికి చిక్కగా వారిని బానిసలమల్లే, బంధించి నగర వీధులగుండా ఈడ్చుకు వెళ్లారు. గెలుపు సాధించాననుకొన్న సమయంలోనే చక్రవర్తిని పరాజయం మొత్తింది. తన చేతుల్లో నుంచి ఎర విడిపించుకొని పోవటం చూశాడు. చివరకు తాను ఏ సిద్ధాంతాల్ని నాశనం చేయటానికి తన జీవితాశయంగా పెట్టుకొన్నాడో వాటి విషయంలో సహసం చూపక తప్పింది కాదు. సిద్ధాంత వ్యతిరేకతను నిర్మూలించేందుకు అతడు తన రాజ్యాన్ని, ధనాగారాన్ని, తుదకు తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. ఇప్పుడు అతడి సేనలు యుద్ధం వల్ల క్షీణించి పోయాయి. బొక్కసం ఖాళీ అయ్యింది. అతడి పాలన కింద రాజ్యాలు తిరుగుబాటు చేశాయి. ఏ విశ్వాసాన్ని అణచివేయటానికి అతడు శతధా ప్రయత్నించాడో అది తామరతంపరగా వృద్ధిచెందుతున్నది. చార్లెస్ రి సర్వ శక్తునితో పోరాడుతున్నాడు. దేవుడు “వెలుగు కలుగుగాక” అని పలికితే చక్రవర్తి చీకటిని ఉంచటానికి ప్రయత్నించాడు. అతడి ప్రయాస వృధా అయ్యింది. అకాలంగా ముసలివాడై, సుధీర్ఘమైన పోరాటం వల్ల కృషించి, సింహాసనాన్ని త్యజించి ఏకాంత వాసాన్ని ఎన్నుకొన్నాడు.GCTel 192.1

    జర్మనీలో లాగే స్విడ్జర్లాండులోనూ సంస్కరణకు చీకటి దినాలు వచ్చాయి. అనేక కేంటన్లు (రాష్టాలు) దిద్దుబాటు విశ్వాసాన్ని స్వీకరించగా కొన్ని రోము మత విశ్వాసాన్ని గుడ్డిగా అనుసరించాయి. సత్యాన్ని ఆచరించటానికి ఎంపిక చేసుకొన్న వారిని వారు హింసించటం చివరికి అంతర్యుద్ధానికి దారితీసింది. జ్వింగ్లీ, ఆయనను అనుసరించిన అనేకులు కస్పెల్ రణరంగంలో కూలిపోయారు. ఈ భయంకర పరిణామాలకు ఎకో లేంపడియస్ గుండె చెదరి కొంత కాలానికి మరణించాడు. రోము విజయం సాధించింది. అనేక చోట్ల తాను పోగొట్టుకొన్న దాన్ని తిరిగి సాధించటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. అయితే ఎవరి ఆలోచనలు అనంతకాలం నుంచి ఉన్నవో ఆ ప్రభువు తన కార్యాన్నిగాని తన ప్రజల్నిగాని విడిచిపెట్టలేదు. ఆయన హస్తం వారికి విడుదల కలిగించింది. ఇతర దేశాల్లో సంస్కరణను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రభువు వారిని లేపాడు.GCTel 192.2

    ఫ్రేస్స్ లో సంస్కరణ సందర్భంగా లూథర్ పేరు వినబడకముందే అరుణోదయ కాంతులు కనిపించాయి. ఆ వెలుగును వీక్షించిన వారిలో ప్రధముడు వృద్దుడైన లెఫెవర్. లెఫెవర్ విద్యావంతుడు, పేరిస్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. యధార్ధత ఉద్రేకం కలిగిన పోపు మతవాది. తన ప్రాచీన సాహిత్య పరిశోధన బైబిలు అధ్యయనానికి నడిపించింది. అతను తన విద్యార్థులకు బైబిలును పరిచయం చేశాడు.GCTel 193.1

    లెఫెవర్ పరిశుదుల్ని (సెయింటుల్ని) ఆరాధించటంలో ఎంతో ఉత్సాహం కనపర్చేవాడు.సంఘ ఇతిహాసాల్లో ఉన్న పరిశుద్ధులు హతసాక్షుల చరిత్రను రచించటానికి పూనుకొన్నాడు. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. అయినా ముందుకు వెళ్లి చాలా పని చేశాడు. బైబిలు నుంచి చాలా సహాయం లభిస్తుందన్న ఉద్దేశంతో అధ్యయనం మొదలు పెట్టాడు. నిజానికి ఇక్కడ పరిశుదుల పరిచయం కలిగింది కాని రోము పంచాంగంలో ఉన్నట్లు కాదు. దైవకాంతి ఆయన మనసును వరదల్లే నింపింది. విస్మయంతో ఒకింత విసుగుదలతో తాను ఎంపిక చేసుకొన్న కార్యాన్ని పక్కన పెట్టి వాక్య పఠనంపై దృష్టి పెట్టాడు. తాను కనుగొన్న సత్యాలను బోధించటానికి వెంటనే పూనుకొన్నాడు.GCTel 193.2

    1512 లో లూథర్ గాని, జ్వింగ్లీగాని దిద్దుబాటు కృషిని ప్రారంభించకముందే లెఫెవర్ ఇలా రాశాడు, “విశ్వాసం ద్వారా మనకు నీతినిచ్చి కేవలం కృపద్వారా మనల్ని నీతిమంతులని తీర్పు తీర్చేవాడు దేవుడే ” — విలీ, పుస్త 13, అధ్యా 1. రక్షణ మర్మాల గురించి ప్రస్తావిస్తూ తన దిగ్ర్భమ అతను ఇలా వ్యక్తం చేశాడు, “ఆ నియమం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం. అపరాధి విడుదల పొందగా పాపంలేని ఆ ప్రభువు శిక్ష అనుభవించాడు. దీవెన శాపాన్ని భరిస్తుంది. శాపగ్రస్తుడు ఆశీర్వాదం పొందటానికి వస్తాడు. జీవం మరణిస్తుంది. మరణం జీవిస్తుంది. చీకటి మహిమను కప్పుతుంది. ముఖంపై అయోమయం తాండవిస్తున్న మనిషి మహిమను ధరిస్తాడు.”- డి అబినే, లండన్, ఎడి, పుస్త 12, అధ్యా 2.GCTel 193.3

    లెఫెవర్ మాటలు ఆత్రుతగా విని ఆయన స్వరం మూగబోయిన చాలా కాలానికి సత్యాన్ని ప్రకటించటం కొనసాగించాల్సిన వారు ఆయన విద్యార్థులలో కొందరున్నారు. అలాంటి వారిలో విలియమ్ ఫేరెల్ ఒకడు. ఫేరెల్ తల్లిదండ్రులు భక్తిపరులు. సంఘబోధనలను అచంచల విశ్వాసంతో అంగీకరించటం ఫేరెల్ నేర్చుకొన్నాడు. అపోస్తలుడైన పౌలుతో కలిసి తన గురించి తాను ఇలా చెప్పుకొని ఉండవచ్చు. మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిసయ్యుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు..” ఆ. 5.26:5. నిషగల రోమను మత వాదిగా సంఘాన్ని వ్యతిరేకించటానికి సాహసించిన వారిని నాశనం చేయటానికి ముందంజ వేసేవాడు ఫేరెల్. అనంతరం తన జీవితంలోని ఈ సమయాన్ని ప్రస్తావిస్తూ అతను ఇలా అన్నాడు, “ఎవరైన పోపుకు వ్యతిరేకంగా మాట్లాడటం విన్నప్పుడు నేను కోపంగా ఉన్న తోడేలల్లే పళ్లు నూరేవాణ్ణి”— విలీ, పుస్త 13, అధ్యా 2. పరిశుద్ధుల ఆరాధనల్లో అలుపెరగకుండా పాలు పొందే వాడు. లెఫెవర్‌తో కలసి పేరిస్ నగరంలోని సంఘాల చుట్టూ తిరిగి సంఘ పీఠాలవద్ద పూజలు సల్చి పరిశుద్ధ విగ్రహాల్ని అర్పణలతో అలంకరించాడు. ఈ కర్మకాండ ఆత్మకు శాంతిని ప్రసాదించలేకపోయింది. తాను పాపినన్న ఆలోచన అతణ్ణి విడిచిపెట్టలేదు. ప్రాయశ్చితార్ధం తాను చేసిన క్రియలు తన పాపాన్ని తీసివేయలేక పోయాయి. సంస్కర్త పలికిన ఈ మాట దేవుడు పలికిన మాటల్లా వినిపించాయి, “రక్షణ కృపద్వారా కలుగుతుంది” నిరపరాధికి శిక్ష, అపరాధికి విముక్తి కలిగిస్తుంది. “క్రీస్తు సిలువ మాత్రమే పరలోక ద్వారాలు తెరచి నరక ద్వారాలు మూసివేస్తుంది” - అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 2.GCTel 194.1

    సత్యాన్ని ఫేరెల్ ఆనందంగా అంగీకరించాడు. పౌలుకు కలిగినలాంటి మార్పు కలగటంతో ఆయన సంప్రదాయం చెరనుంచి విడుదల పొంది దేవుని కుమారుల స్వాతంత్ర్యంలో ప్రవేశించాడు. “ఆకలిగొని హత్యకు పాల్పడే తోడేలు హృదయం బదులు పోపు నుంచి తన హృదయాన్ని పూర్తిగా ఉపసంహరించుకొని, దాన్ని యేసుక్రీస్తుకిచ్చి, సాధు స్వభావం కలిగిన, హాని చేయని గొట్రెపిల్లలా తిరిగి వచ్చాను” అంటున్నాడాయన. డి అబినే, పుస్త 12, అధ్యా 3.GCTel 194.2

    లెఫెవర్ తన విద్యార్థులకు సత్యాన్ని బోధిస్తుండగా ఫెరేల్ పొపు మతాన్ని ఎంత ఉద్రేకంగా ప్రబోధించాడో అంత ఉద్రేకోత్సాహలతో క్రీస్తు సేవను నిర్వహిస్తూ సత్యాన్ని బహిరంగంగా ప్రకటించాడు. ఒక సంఘాధికారి మియాక్స్ బిషప్ వారిలో చేరాడు. సమర్ధత పరంగాను విజ్ఞాపన పరంగాను ఉన్నత శ్రేణికి చెందిన ఇతర అధ్యాపకులు సువార్త ప్రచారంలో వారితో చేతులు కలిపారు. చేతిపనివారు కర్షకుల గృహాలు మొదలుకొని రాజభవనం వరకు అన్ని వర్గాల నుంచి సువార్త నంగీకరించినవారిలో ఉన్నారు. అప్పటి రాజు ఫ్రెన్సెస్ I సహోదరి దిద్దుబాటు విశ్వాసాన్ని అంగీకరించింది. రాజు రాజమాత దిద్దుబాటు విశ్వాసం పట్ల సుముఖంగా ఉన్నట్లు కొంతకాలం కనిపించారు. సంస్కరణ వాదులు క్లీన్ సీస్ రాజు సువార్తను అనతికాలంలోనే అంగీకరిస్తాడన్న ఆశాభావంతో ఉన్నారు.GCTel 195.1

    అయితే వారి ఆశలు అడియాసలు కాబోతున్నాయి. క్రీస్తు అనుచరులకు శ్రమలు, హింస వేచి ఉన్నాయి. దైవ కృప చొప్పున ఇది వారికి కనుమరుగయ్యింది. రానున్న పెనుతుఫానును ఎదుర్కోటానికి అవసరమైన శక్తిని సంపాదించుకోటానికిగాను వారు కొంత కాలం శాంతి ననుభవించారు. ఆ కాలంలో సంస్కరణ పురోగమించింది. తన డయాసీలోని బోధక వర్గానికి ప్రజలకు ఉపదేశమివ్వటానికి మియాక్స్ బిషప్ ఉద్రేకంగా కృషిచేశాడు. అజ్ఞానులు, దుర్వర్తసులు అయిన ప్రీస్టులను తొలగించాడు. వారి స్థానాల్లో విద్యావంతుల్ని, భక్తిశ్రద్ధలు గలవారిని నియమించాడు. దైవవాక్యాన్ని సొంతంగా చదువుకొనే అవకాశం తన ప్రజలకుండాలని బిషప్ వాంఛించాడు. ఆ వాంఛ నెరవేరింది. లెఫెవర్ నూతన నిబంధన అనువాదాన్ని చేపట్టాడు. లూథర్ అనువదించిన జర్మను బైబిలు విట్బెర్గ్ లో విడుదల అవుతున్న సమయంలో మియా లో ఫ్రెంచ్ నూతన నిబంధన ప్రచురితమయ్యింది. తన పేరిష్ లో దాన్ని ప్రచురించటంలో బిషప్ శాయశక్తుల కృషిచేశాడు. కొద్దికాలంలోనే మియా లోని శ్రామిక ప్రజలు పరిశుద్ధ లేఖనాలను చదువుకో గలిగారు. GCTel 195.2

    దాహార్తితో మరణిస్తున్న ప్రయాణికులు ఏటి ప్రవాహాన్ని ఉత్సాహంతో స్వాగతించినట్లే ఈ ఆత్మలు కూడా దేవుని వర్తమానాన్ని ఆసందంతో అందుకొన్నారు. పొలాల్లోని పనివారు, కర్మాగారాల్లోని శ్రామికులు ప్రశస్త బైబిలు సత్యాలు ప్రస్తావించుకొంటూ ఉత్సాహం పొందే వారు. సాయంత్రం పానశాలలకు వెళ్లే బదులు వాక్యం పఠించటానికి ప్రార్థించటానికి ప్రభువును స్తుతించటానికి గుహల్లో సమావేశమయ్యేవారు. ఈ సమాజాల్లో గొప్ప మార్పు కనిపించింది. అట్టడుగు తరగతులకు చెంది అక్షర జ్ఞానానికి నోచుకోని శ్రమజీవులను సంస్కరించి ఉన్నత స్థాయికిలేపే దైవకృపాశక్తి ప్రస్ఫుటంగా కనిపించింది. సువార్తను చిత్తశుద్ధితో స్వీకరించే వారి విషయంలో అది సాధించే కార్యాలకు దీనులు, మమతానురాగాలు గల వారు, పరిశుద్దులు అయిన వారు సాక్షులుగా నిలిచారు.GCTel 195.3

    మియ లో వెలిగించిన దీపం కాంతి దూర ప్రాంతాలకు ప్రసరించింది. విశ్వాసుల సంఖ్య దినదినం పెరిగింది. సంఘనేతల ఆగ్రహావేశాలను రాజు అదుపులో ఉంచాడు. సన్యాసుల మత దురభిమానం రాజుకు నచ్చలేదు. తుదకు పోపు మతనాయకులు రాజును లొంగదీసుకొన్నారు. దహన స్తంభాల్ని సిద్ధం చేశారు. మియాక్స్ బిషప్ తన సమ్మకాల ఉపసంహారనో, దహస దండనో రెంటిలో ఒకదాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు సులభ మార్గాన్ని ఎన్నుకొన్నాడు. నాయకుడు దారి తప్పినప్పటికీ అతడి మందమాత్రం అచంచలంగా నిలిచింది. అనేకమంది మంటల్లో కాలుతూ తమ సాక్ష్యాన్ని చెప్పారు. దహన స్తంభం వద్ద తాము చూపిన ధైర్యం విశ్వాసం ద్వారా ఈ దీన క్రైస్తవులు శాంతి సమాధానాల రోజుల్లో తమ సాక్ష్యాన్ని విని ఎరుగని వేలాదిమంది ప్రజలతో మాట్లాడారు.GCTel 196.1

    హింసాకాండ, ఎగతాళి మధ్య క్రీస్తు నిమిత్తం సాక్ష్యం చెప్పేందుకు సాహసించిన వారు సామాన్యులు, నిరుపేదలు మాత్రమేకాదు. రాజ భవంతుల విలాసమందిరాల్లో, కోటల్లో సత్యాన్ని భాగ్యంకన్న, హోదాకన్న చివరికి ప్రాణంకన్న అధికంగా ఎంచిన రాజవంశపు ఆత్మలున్నాయి. బిషప్ నిలువుటంగీ మాటున పాగా మాటున దాగి ఉన్న స్పూర్తికన్నా రాజకవచం మరుగున ఉన్న స్పూర్తి సమున్నతమైనది, దృఢమైనది. లూయిస్ డి బెర్విన్ ఉన్నత వంశంలో జన్మించాడు. అతని ధైర్య సాహసాలు వినయ విధేయతలుగల నైట్. గ్రంథ పఠనంపై ఆసక్తి మెండు. మర్యాదస్థుడు, సత్ప్రవర్తనుడు. అతణ్ని గూర్చి ఒక రచయిత ఇలా అంటున్నాడు, “బెర్ క్విన్ పోపువుత నియమనిబంధనలను నిష్ఠగా ఆచరించే వ్యక్తి. గొప్ప ఆసక్తితో మార్లు ప్రసంగాలు వినేవాడు... లూథరన్లంటే ద్వేషించటం ఆయన సలక్షణాలన్నింటిని మించిన సద్గుణం” దైవానుగ్రహం చొప్పున అనేకుల్లాగ ఇతనికి కూడా బైబిలు పరిచయమయ్యింది. “అందులో అతనికి రోము సిద్ధాంతాలు కాదు లూథర్ సిద్ధాంతాలు కనిపించటం ఆశ్చర్యం వేసింది” — విలీ, పుస్త 13, అధ్యా 9. అప్పటినుంచి సువార్తకే తన్నుతాను పూర్తిగా అంకితం చేసుకొన్నాడు. “ఫ్రాన్స్ లోని ప్రముఖ పౌరులలో అధిక విజ్ఞానాన్ని ఆర్జించిన వ్యక్తి”, అతని ప్రతిభ, వాగ్దాటి, అతని ధైర్యసాహసాలు, ఉత్సాహం, రాజు ఆస్తానంలో అతని ప్రాబల్యం- ఎందుకంటే ఇతను రాజుకి ఎంతో ఇష్టుడు- వీటిని బట్టి ఇతను తన దేశ సంస్కర్త కానున్నాడని అనేకులు భావించారు. బెజా ఇలా అన్నాడు, “ఫ్రాన్సిస్ I లో బెర్ క్విన్ కి రెండో ఓటరు లభించి ఉంటే బెర్క్వన్ రెండో లూథర్ అయి ఉండేవాడు” “ఇతడు లూథర్ కన్నా చెడ్డవాడు” అంటూ కేకలు వేశారు పోపుమత వాదులు గురుపులు- అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 9. ఈయనంటే ఫ్రాన్స్ లోని పోపుమత వాదులు మరింత భయపడ్డారు. సిద్ధాంత వ్యతిరేకి అన్న ముద్రవేసి చెరసాలలో వేశారు. కాని రాజు అతన్ని విడుదల చేశాడు. పోరాటం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. రోము మతవాదులకు సంస్కరణ వాదులకు మధ్య ఊగిసలాడూ ఫ్రాన్సిస్ సన్యాసుల సమరోత్సాహాన్ని కొంతకాలం సహించటం కొంత కాలం అదుపు చేయటం జరిగింది. పోపు వాదుల ప్రోద్భలంతో బెర్క్వన్ ని మూడు సార్లు ఖైదులో వేశారు. ప్రతీసారి ఆయనను రాజు విడిపించాడు. బెర్విన్ ప్రతిభను ఉత్తమ ప్రవర్తనను అభినందించిన రాజు పోపు నేతల దుర్భుద్ధికి ఆయనను బలి చేయకూడదని నిర్ధారించుకొన్నాడు.GCTel 196.2

    ఫ్రాన్స్ లో ఉండటం తనకు ప్రాణహాని అని, స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన ఇతరుల ఆదర్యాన్ని అనుసరించటం క్షేమమని బెర్క్వన్ కి పదే పదే హెచ్చరికలు వచ్చాయి. ప్రాణం, గౌరవం, సత్యానికి లోబడి ఉండేకన్న ఉన్నత నీతి సూత్రాన్ని గుర్తించి అనుసరించటంలో విఫలుడు పిరికివాడు స్వార్ధపరుడు అయిన ఇరేసిమస్ బెర్ క్విన్ కి ఇలా రాశాడు, ” ఏదో విదేశానికి రాయబారిగా పంపుమని అడుగు. వెళ్లి జర్మనీలో పర్యటించు. బెడా ఎవరో తెలుసునా? వాడు వేయి తలల రాక్షసుడు. వాడు అన్ని పక్కలకూ విషం సంధిస్తాడు. నీ శత్రువులు లెక్కకుమించి ఉన్నారు. నీవు చేస్తున్న పని క్రీస్తు చేసిన పనులకన్న మెరుగైనదైతే నిన్ను నాశనం చేసేంతవరకు వాళ్లు నిన్ను విడిచిపెట్టరు. రాజు కాపాడాడన్న నమ్మకం పెట్టుకోవద్దు. అన్ని సందర్భాల్లోనూ నీ వేదాంత బోధనతో నన్ను రాజీపర్చవద్దు”. అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 9.GCTel 197.1

    ఉదృతమౌతున్న అపాయాలు బెర్క్విన్ ఉత్సాహానికి పదును పెట్టాయి. దురుద్దేశంతోను స్వార్ధంతోను కూడిన ఇరేసిమన్ హితవును పక్కన పెట్టి మరింత ధైర్యంగా వ్యవహరించటానికి బెర్విన్ నిశ్చయించుకొన్నాడు. సత్యాన్ని సమర్ధించటమే కాకుండా అబదాలపై దాడి చేయాలని తీర్మానించుకొన్నాడు. రోము మత వాదులు తనపై మోపుతున్న సిద్ధాంత వ్యతిరేకత నేరాన్ని తిప్పి వాళ్లమీదే మోపాలనుకున్నాడు. పారిస్ విశ్వవిద్యాలయం పేరిస్ నగరంలోను మొత్తం దేశంలోను మత సంబంధమైన అంశాల్లో ప్రసిద్ధిగాంచిన సంస్థ. ఈ విశ్వ విద్యాలయ వేదాంత విభాగంలో పని చేసే విద్వాంసులైన డాక్టర్లు, సన్యాసులు బెర్క్వనికి బద్ద శత్రువులు, బలమైన ప్రత్యర్ధులు. ఈ వేదాంత పండితుల రచనల నుంచి బెర్వస్ పన్నెండు ప్రతిపాదనలను ఎంపిక చేసుకొని అవి బైబిలును వ్యతిరేకిస్తున్న సిద్ధాంత వ్యతిరేక అంశాలని” బహిరంగంగా ప్రకటించి ఈ వివాదంలో న్యాయనిర్ణేతగా రాజు వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు.GCTel 197.2

    తలపడుతున్న మొనగాళ్ల శక్తి ప్రతాపాల ప్రదర్శనకు చక్రవర్తి సమ్మతించి గర్విష్టులైన సన్యాసుల దర్పాన్ని కుంగదీయాలన్న ఉత్సాహంతో తమ వాదనలను బైబిలు ఆధారాలతో సమర్ధించుకోవలసిందిగా రోము మత వాదుల్ని రాజు ఆదేశించాడు. ఈ ఆయుధం తమకు ఉపయోగపడదని వారికి బాగా తెలుసు. చెరసాల, హింస, దహనసంభం ఇవే వారు ఉపయోగించగల ఆయుధాలు. ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యింది. బెర్క్వేన్ని పడేయాలని వారు భావించిన గుంటలో ఇప్పుడు తాము పడటానికి సిద్ధంగా ఉన్నట్లు వారు గుర్తించారు. తప్పించుకొనే మార్గం కోసం ఇటూ అటూ చూశారు.GCTel 198.1

    ” ఇదే సమయంలో ఒక వీధి మూలలో ఉన్న మరియమ్మ విగ్రహాన్ని ఎవరో విరగ గొట్టారు” నగరంలో సంచలనం బయలుదేరింది. విలపిస్తూ ఆగ్రహం ప్రదర్శిస్తూ ప్రజలు ఆ స్థలంలో పోగుపడ్డారు. రాజు కూడా చలించాడు. ఈ పరిస్థితి సన్యాసులకు ఎంతో ఉపయోగం పడింది. అది గుర్తించి వారు పావులు కదపనారంభించారు. ఇది బర్విన్ సిద్ధాంతాల పర్యవసానం. లూథరన్ల కుట్రవల్ల సమస్తం కుప్పకూలటం ఖాయం- మతం, చట్టాలు తుదకు సింహాసనం కూడా” - అంటూ లబోదిబోమన్నారు. అదే పుస్తకం, పుస్త 1, అధ్యా 9.GCTel 198.2

    వారు మళ్లీ బెర్క్వన్ని అటకాయించారు. రాజు పారిస్ విడిచి వెళ్లిపోయాడు. సన్యాసులు తమ చిత్తం వచ్చినట్లు వ్యవహరించటానికి ఇలా రంగం సిద్ధమయ్యింది. విచారణ జరిపి సంస్కర్తకు మరణదండన విధించారు. ఆ దశలో ప్రాన్సీస్ కలిగించుకొని ఆయనను విడిపించకుండేందుకుగాను తీర్పు ఇచ్చిన రోజే దాన్ని అమలు పర్చారు.మరణ స్థలానికి బెర్విన్ ని నడిపించారు. ఆ ఘటనను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జనులు సమావేశమయ్యారు. ప్రాన్స్ ఉన్నత కుటుంబాల్లోని అత్యుత్తముణ్ణి మిక్కిలి సాహసవంతుణ్ణి బాధించటానికి వారు ఎంపిక చేసుకొన్నారని అనేకులు దిగ్ర్భాంతితోను అనుమానంతోను తలపోశారు. అధికమౌతున్న జనసమూహంలో ముఖాముఖి విస్మయం, ఆగ్రహం, తిరస్కారం, ద్వేషం కనిపించాయి. అయితే ఒక్క ముఖంలో మాత్రం అవేవీ కనిపించలేదు. కాబోతున్న ఆ హతసాక్షి ఆలోచనలు ఆ గందరగోళ సన్నివేశానికి దూరంగా ఉన్నాయి. ప్రభువు సముఖం మాత్రమే ఆయనకు తెలుసు. ఇంకేమీ తెలియదు.GCTel 198.3

    తనను తీసుకువెళ్తున్న బండి, తనను హింసిస్తున్న వారి కోప ముఖాలు, తాను మరణించబోతున్న భయంకర మరణం వీటిని ఆయన లెక్కచేయలేదు. మరణించి నివసిస్తున్న వాడు నిత్యము జీవించి ఉన్నవాడు. మరణం తాళాలు, నరకం తాళాలు కలిగి ఉన్నవాడు తన పక్కన ఉన్నాడు. పరలోక కాంతితోను సమాధానంతోను ఆయన ముఖం ప్రకాశించింది. ఆయన మంచి దుస్తులు ధరించాడు. వెల్వెట్ అంగీ, సేటిన్ డమస్కీతో తయారైన డబ్లెట్, బంగారపు హౌసు “ధరించాడు.-డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఇన్ యూరఫ్ ఇంది టైమ్ ఆప్ కెల్విన్, పుస్త 2, అధ్యా 16. రాజులకు రాజు సముఖంలోను, చూస్తున్న విశ్వం సమక్షంలోను తన విశ్వాసం గురించి సాక్ష్యం చెప్పటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆనందాన్ని దుఃఖ సూచనలు పాడు చేయకూడదు. GCTel 199.1

    జనులతో కిటకిటలాడుతున్న వీధుల్లో నుంచి ఊరేగింపు కదులుతున్నప్పుడు బెర్విన్ ముఖంలో గోచరిస్తున్న నిర్మల ప్రశాంతత, విజయానందం, ఆయన ముఖవైఖరి, హూందాతనం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. “దేవాలయంలో కూర్చొని పరిశుద్ధ విషయాలపై ధ్యానించే భక్తుడిలా ఉన్నాడు.” అన్నారు వారంతా. విలీ, పుస్త 13, అధ్యా 9.GCTel 199.2

    దహన స్తంభం వద్ద ప్రజల్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాలని బెర్ క్విన్ ప్రయత్నించాడు. కాని దాని ఫలితాలకు భయపడ్డ సన్యాసులు ‘కేకలు వేయటం మొదలుపెట్టారు. సైనికులు తమ ఆయుధాల్ని ఢీ కొట్టటం వల్ల హతసాక్షి మాటలు వినిపించలేదు. “ఇలా 1529 లో సంస్కారం గల పారిస్ నగర అత్యున్నత సాహిత్య మతవిషయక అధికారం ఉరికంభంపై మరణించే వ్యక్తి చివరి మాటల్ని అణచి వేయటంలో 1793 నాటి ప్రజలకు ఒక చెడ్డ ఆదర్శాన్ని స్థాపించింది”- అదే పుస్తకం, పుస్త 13, అభ్యా 9.GCTel 199.3

    బెర్ క్విన్ గొంతు నులిమారు. ఆయన శరీరం మంటలకు ఆహుతి చేశారు. ప్రా లోని దిద్దుబాటు వాదులు మిత్రులకు ఆయన మరణవార్త సంతాపం కలిగించింది. కాని ఆయన ఆదర్శం మరణించలేదు. సత్యాన్ని, విశ్వసించి చాటే కొందరు ఇలా అన్నారు. సంతోషంగా మరణించటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా దృష్టి భవిష్యత్ నిత్యజీవంపై నిలిచి ఉన్నది. ” డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఇన్ యూరప్ ఇంది టైమ్ ఆఫ్ కెల్విన్, పుస్త 2, అధ్యా 16.GCTel 199.4

    మియాక్స్ లో జరిగిన హింసాకాండలో దిద్దుబాటు విశ్వాస ప్రబోధకులకు అనుమతి పత్రాన్ని నిరాకరించారు. వారు ఇతర ప్రదేశాలకు వెళ్లిపోయారు. కొంతకాలం గడిచాక లిఫెవర్ జర్మనీకి వెళ్లాడు. ఫేరెల్ తాను పుట్టిన స్థలంలో సత్యాన్ని ప్రకటించేందుకు తూర్పు ఫ్రాన్స్ లోని తన పట్టణానికి వచ్చాడు. మియా లో జరుగుతున్న సేవను గూర్చి వార్తలు వచ్చాయి. తాను ఉద్రేకంగా, నిర్భయంగా ప్రకటించిన సత్యానికి మంచి స్పందన ఉన్నదని తెలిసింది. అధికారులు ఆయనను నోరు నొక్కెయ్యటానికి ప్రయత్నించారు. ఆయన్ని ఆ నగరం నుంచి వెలివేశారు. బహిరంగంగా సేవచేయలేక పోయినా వ్యక్తిగత గృహల్లో మారుమూల ప్రాంతాల్లో బోధిస్తూ పట్టణాలు, పల్లెలూ తిరుగుతూ బాల్యంలో తాను సందర్శించిన అడవుల్లోను, కొండ గుహల్లోనూ తల దాచుకొనేవాడు. ఇంకా తీవ్రమైన శ్రమలకు దేవుడు ఆయననుసన్నద్ధం చేస్తున్నాడు. ” శ్రమలు, హింసలు సాతాను కూహకాలకు లోటేమీలేదు. వాటిని గురించి నాకు హెచ్చరిక ముందే వచ్చింది. నేను భరించగలిగిన దానికన్న ఎంతో కఠినంగా అవి ఉండేవే. అయితే దేవుడు నాతండ్రి, నాకు అవసరమైన శక్తిని ఇచ్చాడు; ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు” అన్నాడాయన. - డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిపర్మేషన్ ఆఫ్ ది సికీ’ సెంచురీ, పుస్త 12, అధ్యా 9.GCTel 200.1

    అపోస్తలుల దినాల్లోలాగే హింస “సువార్త మరి ఎక్కువగా ప్రబలముగుటకే సమకూడెను” ఫిలిప్పీయులకు 1:12. పారిన్ నుంచి మియాకు పారిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి” అ. కా. 8:4. ఈ విధంగా స్క్రీన్స్ దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలలోకి సత్యం వెళ్లింది. GCTel 200.2

    తన కార్యకలాపాలను విస్తరించటానికి దేవుడు పని వారిని ఇంకా సిద్ధం చేస్తున్నాడు. ఫ్రాన్స్ లో ఒక పాఠశాలలో ఆలోచన పరుడు, నెమ్మదిపరుడు అయిన ఒక యువకుడున్నాడు. ఆయనకు నిశితమైన, శక్తిమంతమైన ఆలోచనా శక్తి ఉన్నది. ఆయన నిష్కళంక జీవితానికి, మానసిక ఉత్సుకతకు మత వైరాగ్యానికి అంకితమైన వ్యక్తి. తన ప్రతిభ, కార్యదీక్షను ఆయనను తన కళాశాలలో ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దాయి. జాబ్స్క్లిఫ్ సంఘాన్ని అతి సమర్ధంగా ప్రతిష్టాత్మకంగా బలపర్చుతాడని పలువురు ఎదురు చూశారు. కాని కేల్విన్ చుట్టూ ఉన్న పాండిత్యం, మూఢనమ్మకాల గోడల నడుమ నుంచిని కూడా దైవ వాక్యపు వెలుగు ప్రసరించింది. కొత్త సిద్ధాంతం గురించి విన్నప్పుడు ఈయనకు కంపరం పుట్టింది. సిద్ధాంత వ్యతిరేకులు సజీవదహన దండన పొందవలసిందే. అందులో సందేహమేమీలేదు అనుకున్నాడు తనలోతాను. అయితే అనుకోకుండా సిద్ధాంత వ్యతిరేకత ముఖాముఖి ఎదురు కావటంతో ప్రొటస్టాంట్ బోధనను ఎదుర్కోటానికి రోము మత వేదాంతాన్ని పరీక్షించాల్సి వచ్చింది. కెల్విన్ దగ్గర బంధువొకడు సంస్కరణ వాదుల్లో చేరాడు. అతడు పారిలో నివసిస్తున్నాడు. ఈ బంధువు లిద్దరూ తరచు కలుసుకొని క్రైస్తవ లోకాన్ని కలచివేస్తున్న అంశాలను చర్చించుకొనే వారు. “ప్రపంచంలో రెండే మతాలున్నాయి. ఒకతరగతికి చెందిన మతాలు మనుషులు సృష్టించుకొన్నవి. వాటి ప్రకారం ఆచారాలు మంచి పనుల ద్వారా మనిషి తన్నుతాను రక్షించుకొంటాడు. రెండోది బైబిలు బయలు పర్చుతున్న ఒకే ఒక మతం. దేవుని ఉచిత కృపచేతనే మానవుడికి రక్షణ కలుగుతున్నదని అది బోధిస్తున్నది.” అంటూ వివరించాడు ప్రొటస్టాంటు వాది ఆలివెటన్.GCTel 200.3

    “నీ కొత్త సిద్ధాంతాలు నాకొద్దు. నా జీవితకాలమంతా తప్పులోనే నివసించా ననుకుంటున్నావా?” అన్నాడు కెల్విన్ నిష్ఠూరంగా- విలీ, పుస్త 13, అధ్యా 1.GCTel 201.1

    అయినా తన మనసులో లేచిన ఆలోచనల్ని మరచిపోలేక పోయాడు. తన బంధువన్న మాటల గురించి తన గదిలో ఒంటరిగా ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను పాపినన్న విషయం బలంగా నమ్మాడు. పరిశుద్దుడు న్యాయవంతుడు అయిన న్యాయాధిపతి ముందు తాను విజ్ఞాపకుడు లేకుండా ఉన్నట్లు గ్రహించాడు. పరిశుద్ధుల మధ్యవర్తిత్వం, సత్కియలు, సంఘ కర్మకాండ- ఇవన్నీ పాప క్షమాపణ విషయంలో ఉపయోగం లేనివని గ్రహించాడు. తన ముందున్నవి అనంతమైన నిస్పృహ చీకటి మాత్రమేనని గుర్తించాడు. తన ఆందోళనను తొలగించటానికి సంఘ విద్వాంసులు వ్యర్ధ ప్రయత్నాలు చేశారు. పాపపు ఒప్పకోలు, ధ్యానముద్ర నిరర్ధకమయ్యాయి. అవి ఆత్మను దేవునితో సమాధాన పర్చలేక పోయాయి.GCTel 201.2

    ఈ నిష్ఫల ప్రయత్నాల నడుమ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఒక రోజు ఒక సిద్ధాంత వ్యతిరేకి సజీవ దహనాన్ని కేల్విన్ వీక్షించటం తటస్థించింది. హతసాక్షి ముఖంలో వ్యక్తమైన సమాధానం ఆయనను దిగ్ర్భాంత పరిచింది. ఆ భయంకర హింస మధ్య, మరింత భయంకరమైన సంఘ ఖండన కింద అతడు గొప్ప విశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రదర్శించాడు. తన విశ్వాసానికి ధైర్యానికి, సంఘానికి విధేయుడై నివసిస్తున్న సొంత ఆత్మలోని నిస్పృహకు అంధకారానికి మధ్యగల భేదాన్ని ఈ యువ విద్యార్ధి హృదయవేదనతో గుర్తించాడు. సిద్ధాంత వ్యతిరేకుల విశ్వాసం బైబిలు మీద ఆనుకొని ఉన్నదని ఆయన ఆకళించు కొన్నాడు. బైబిలును అధ్యయనం చేసి సాధ్యమైతే వారి సంతోష రహస్యాన్ని తెలుసుకోవాలని నిశ్చయించు కొన్నాడు.GCTel 201.3

    బైబిలులో ఆయన క్రీస్తును కనుగొన్నాడు. ఆయన ఆవేదనతో ఇలా అన్నాడు, “ఓ తండ్రీ, నీకోపం ఆయన బలిదానంతో చల్లారింది. ఆయన రక్తం నా పాప మాలిన్యాల్ని కడిగివేసింది. ఆయన సిలువ నా శాపాన్ని భరించింది. ఆయన మరణం నాకు ప్రాయశ్చిత్తం చేకూర్చింది. మేము నిరుపయోగం బుద్దిహీనం అయిన వాటిని రూపొందించుకొన్నాం. అయితే నీవు నీ వాక్యాన్ని దీపం వలే నా ముందు ఉంచావు. యేసు యోగ్యతలు తప్ప తక్కిన వాటిని హేయంగా ఎంచేందుకుగాను నీవు నా హృదయాన్ని సృష్టించావు” — మార్టిన్, సం 3, అధ్యా 13.GCTel 202.1

    కేల్విన్ ప్రీస్టుగా పరిచర్య చేసేందుకు విద్య నభ్యసించాడు. తన పన్నెండో పడిలోనే చిన్న సంఘ ప్రబోధకుడిగా నియమితుడయ్యాడు. సంఘ నిబంధనల మేరకు బిషప్ ఆయనకు గుండు చేశాడు. ఆయన అభిషేకం పొందలేదు. ప్రీస్తు విధులను నిర్వర్తించలేదు. అయినా ప్రబోధక వర్గ సభ్యుడయ్యాడు. ఆ హోదాకు సంబంధించిన బిరుదు పొందాడు. ఆ హోదాకు ఏర్పాటైన వేతనాన్ని అందుకొన్నాడు.GCTel 202.2

    తాను ప్రీస్టు అయ్యే అవకాశం లేదని గుర్తించి కొంతకాలం లా చదవటానికి ప్రయత్నించాడు. చివరికి ఆ ఉద్దేశానికి స్వస్తి చెప్పి తన జీవితాన్ని సువార్తకు అంకితం చేయటానికి తీర్మానించుకొన్నాడు. కాని బహిరంగ ప్రబోధకుడవటానికి వెనకాడాడు. ఆయన స్వాభావికంగా పిరికివాడు. బోధక పరిచర్య భార బాధ్యతలు గలదని గుర్తించాడు. దానికి తోడు ఇంకా చదువుకోవాలన్న ఆశకూడ ఉన్నది. మిత్రుల విజ్ఞాపనల వల్ల చివరికి ఒప్పుకున్నాడు. ఇంత తక్కువ స్థాయిలో వాడికి అంత ప్రతిష్టాత్మక స్థానం రావటం ఎంత మనోహరం” అన్నాడు కేల్విన్. విలీ, పుస్త 13, ఆధ్యా 9.GCTel 202.3

    కేల్విన్ తన పరిచర్యను నిరాడంబరంగా ప్రారంభించాడు. ఆయన మాటలు భూమిని తడిపి హాయి నిచ్చే మంచులా ఉన్నాయి. కెల్విన్ పేరిస్ విడిచి పెట్టాడు. ఇప్పుడు ఒక రాష్ట్రంలోని చిన్న పట్టణంలో మార్గరెట్ యువరాణి సంరక్షణ కింద ఉన్నాడు. సువార్త పట్ల అమితాసక్తిగల ఆమె సువార్త ప్రబోధకులకు తన మద్దతును సంరక్షణను అందించింది. కెల్విన్ ఇంకా యౌవన ప్రాయంలోనే ఉన్నాడు. ఆయన మృదు స్వభావి. యధార్ధవర్తనుడు. గృహాల్లో ఉన్న ప్రజలతో ఆయన పని ప్రారంభమయ్యింది. కుటుంబ సభ్యులను తన చుట్టూ కూర్చోబెట్టుకొని బైబిలు చదివి రక్షణ సత్యాలను వారికి బోధించాడు. వర్తమానం విన్న వారు సువార్తను ఇతరులకు అందించారు. అనంతరం ఆయన ఆ పట్టణం దాటి ఆ చుట్టుపట్ల ఉన్న పట్టణాలకు పల్లెలకు వెళ్లాడు. ధనికుల భవనాల్లో పేదల కుటీరాల్లో ఆయనకు ప్రవేశం లభించింది. సత్యాన్ని గూర్చి నిర్భయంగా సాక్షమివ్వాల్సి ఉన్న సంఘాలకు పునాదులు వేస్తూ ఆయన ముందుకు సాగాడు.GCTel 202.4

    కొన్ని మాసాల దరిమిల ఆయన మళ్లీ పారిస్ వెళ్లాడు. విద్వాంసులు, పండితుల వర్గాల్లో అసాధారణ సంచలనం చోటుచేసుకొన్నది. ప్రాచీన భాషల అధ్యయనం వారిని బైబిలు వద్దకు నడిపించింది. అందులోని సత్యాలను గూర్చి తెలియని వారు వాటిని ఆసక్తిగా చర్చిస్తున్నారు. రోము మత ఉద్దండులను కూడా బెంబేలెత్తి చూస్తున్నారు. వేదాంత వివాదంలో కెల్విన్ సమర్ధమైన యోధుడైనప్పటికీ ఆ అల్లరి పండితులకన్నా ఆయనకు ఉన్నతమైన కర్తవ్యం ఉంది. మనుషుల హృదయాల్లో కలకలం రేగింది. వారికి సత్యాన్ని పరిచయం చేయటానికి అనుకూల సమయం ఇదే. విశ్వవిద్యాలయం హాళ్లు వేదాంత సంవాదంతో మారు మోగుతుంటే కేల్విన్ ఇంటింటికి వెళ్లి బైబిలు తెరచి సిలువపై మరణించిన క్రీస్తును గురించి ప్రజలతో మాట్లాడున్నాడు.GCTel 203.1

    దేవుని కృపను బట్టి సువార్తను అంగీకరించటానికి పారిస్ నగరానికి మరో ఆహ్వానం అందవలసి ఉన్నది. లెఫెవర్, ఫేరిస్టు అందించిన ఆహ్వానాన్ని ప్రజలు తిరస్కరించారు. అయితే ఆ మహానగరంలో ప్రజలందరు ఆ వర్తమానాన్ని మళ్లీ వినవలసి ఉంది. రాజకీయ కారణాలవల్ల రాజు ఇంకా సంస్కరణకు వ్యతిరేకంగా రోముకు పూర్తి మద్దతు తెలుపలేదు. ఫ్రాన్స్ లో ప్రొటస్టాంట్ మతం నెలకొంటుందన్న ఆశాభావంకి మార్గరెట్ ఇంకా ఉంది. దిద్దుబాటు విశ్వాసం పారిస్లో ప్రకటితం కావాలన్నది ఆమె దృఢ నిశ్చయం. రాజు నగరంలో లేని సమయంలో నగర సంఘాలన్నింటిలోను బోధించుమని ఒక ప్రొటస్టాంట్ ప్రబోధకుణ్ణి ఆమె ఆదేశించింది. ఇందుకు పోపుమత అధినాయకుల నిషేధం అడ్డుతగులుతున్నందున యువరాణి రాజ భవనాన్నే తెరచింది. భవనంలో కొన్ని గదులను ప్రార్ధనాలయంగా మార్చి ప్రతి దినం నిర్దిష్ట గడియలో ప్రసంగం ఉంటుందని, అన్ని వర్గాలు స్థాయిల ప్రజలు ఆహ్వానితులని ప్రకటన చేయించింది.GCTel 203.2

    ఆ కార్యక్రమానికి చాలామంది ప్రజలు హాజరయ్యారు. ప్రార్థనాలయమే కాక దాని పక్కగదులు, హాళ్లు ప్రజలతో కిక్కిరిసి పోయాయి. ఉన్నత పౌరులు, రాజకీయ వేత్తలు, న్యాయవాదులు, వ్యాపారులు, చేతిపనివారు, వేలాదిమంది ప్రతిరోజూ హాజరయ్యారు. సమావేశాన్ని నిషేధించే బదులు, పేరిలో రెండు దేవాలయాల్ని తెరవవలసిందిగా రాజు అదేశించాడు. పారిస్ నగరం దైవ వాక్యానికి ముందెన్నడూ ఇంతగా ఆకర్షితం కాలేదు. పరలోకం నుంచి జీవపు ఊపిరి ప్రజల మీదికి వచ్చినట్లనిపించింది. తాగుబోతుతనం, వ్యభిచారం, కలహం, సోమరితనం స్థానే సంయమనం, పవిత్రత, క్రమశిక్షణ పరిశ్రమ చోటుచేసుకొన్నాయి.GCTel 203.3

    అయితే సంఘాధి నేతలు తీరుబడిగా కూర్చోలేదు. సువార్త ప్రచారాన్ని ఆపు చేయించటానికి రాజు నిరాకరించాడు. ఇక వారు ప్రజలపై దృష్టి సారించారు. ప్రజల భయాలను, దురభిమానాలను, మూఢనమ్మకాలుగల అమాయక ప్రజల మత మౌఢ్యాన్ని రెచ్చగొట్టటానికి విశ్వప్రయత్నాలు చేశారు. పూర్వం యెరూషలేములో లాగ పారిస్ అబద్ధ బోధలకు చెవినిచ్చి తన శ్రమ కాలం గురించిగాని తనకు సమాధానం తెచ్చే విషయాల గురించిగాని గ్రహించలేకపోయింది. రాజధాని నగరంలో సువార్త ప్రకటన రెండేళ్లుగా సాగింది. సువార్తను అనేకమంది అంగీకరించినా అధిక సంఖ్యాకులు నిరాకరించారు. ఫ్రాన్సీన్ మత సహనం పాటిస్తున్నట్లు కనిపించాడు. అది తన కార్యాలు సాధించుకోటానికే. పోపు మతవాదులు తమ ప్రాబల్యాన్ని తిరిగి సంపాదించు కొన్నారు. మళ్లీ దేవాలయాలు మూతపడ్డాయి. దహన స్తంభం తిరిగి వచ్చింది.GCTel 204.1

    కెల్విన్ ఇంకా పేరిలోనే ఉన్నాడు. భవిష్యత్తులో తన సేవకు అధ్యయనం, ధ్యానం, ప్రార్ధనల ద్వారా సిద్ధపడున్నాడు. అదే సమయంలో సత్యాన్ని ప్రకటించటం కొనసాగించాడు. చివరికి ఆయన మీద రోము నాయకులకు అనుమానం కలిగింది. ఆయనకు సజీవదహన దండన విధించాలని మతాధినేతల కృతనిశ్చయం. తాను ఏకాంతంగా ఉంటున్న స్థలంలో తనకు అపాయం ఉన్నదన్న తలంపే ఆయనకు కలుగలేదు. హడావుడిగా తన మిత్రులు తన గదికి వచ్చి తనను నిర్భంధించటానికి అధికారులు వస్తున్నారని తెలియజేశారు. అప్పుడే ఎవరో బైట తలుపు తట్టటం వినిపించింది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. మిత్రులు కొందరు వచ్చిన అధికార్లను తలుపువద్దే నిలుపుతుండగా మరికొందరు సంస్కర్తను కిటికీ గుండా కిందకు దింపారు. ఆయన అక్కడ నుంచి తప్పించుకొని నగరం పొలిమేరలకు వెళ్లిపోయాడు. సంస్కరణ వాదులకు మిత్రుడైన ఒక కార్మికుడి ఇంట్లో తలదాచుకొని అతని దుస్తులతో మారువేషం వేసుకొని భుజంపై పొడవాటి గౌనుగల చిన్న వస్త్రం ధరించి తన ప్రయాణం మొదలుపెట్టాడు. కేల్విన్, దక్షిణ దిశగా ప్రయాణిస్తూ మార్గరేట్ పాలన కింద ఉన్న రాష్ట్రాల్లో ఆశ్రయం పొందాడు.- డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఇన్ ది టైమ్ ఆఫ్ కెల్విన్, పుస్త2, అధ్యా 30 చూడండి.GCTel 204.2

    ఇక్కడ ప్రాబల్యం గల మిత్రుల సంరక్షణలో సురక్షితంగా ఉంటూ మునుపటిలాగ ఆధ్యయనంలో నిమగ్నుడై ఉన్నాడు. కాకపోతే ఫ్రాన్సులో సువార్త సేవ చేయాలని ఆయన మనసులో ఆకాంక్షించాడు. సువార్త సేవ చేయకుండా ఇలా ఎక్కువకాలం ఉండిపోడానికి వీల్లేదని నిర్ధారించుకొన్నాడు. తుఫాను ఉద్ధృతి కొంతమట్టుకు తగిన వెంటనే పోయి టియర్స్ లో కొత్త సేవారంగం వెదకాడు. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉంది. కొత్త అభిప్రాయాలకు ప్రజాదరణ ఏర్పడి ఉంది. అన్ని వర్గాల ప్రజలు సువార్తను సంతోషంగా విన్నారు. బహిరంగ ప్రబోధం జరగలేదు. కాని ప్రధాన న్యాయాధిపతి గృహంలో తాను బస చేసిన గదిలో కొన్ని సార్లు బహిరంగ ఉద్యానవనంలో వినాలని ఆశించిన వారికి కేల్విన్ వాక్యాన్ని బోధించేవాడు. కొంతకాలమైన తర్వాత వినేవారి సంఖ్య పెరిగిన కొద్దీ నగరం బైట సమావేశం కావటం క్షేమమున్న ఆలోచన కలిగింది. కొండల మధ్య ప్రవహిస్తున్న ఒక లోతైన సన్నని ఏరుపక్క గుహ ఉంది. చుట్టూ ఉన్న చెట్లూ బండల వలన అది మరింత మరుగున పడి ఉంది. తమ సమావేశాలకు వారు దీన్ని ఎంపిక చేసుకొన్నారు. నగరం నుంచి చిన్నచిన్న గుంపులుగా వేర్వేరు మార్గాల ద్వారా ప్రజలు అక్కడకు వెళ్లేవారు. ప్రశాంతమైన ఈ స్థలంలో బైబిలును అందరూ వినేటట్లు గట్టిగా చదవటం, విశదీకరించటం జరిగేది. ఫ్రాన్స్ లోని ప్రొటస్టాంట్లు మొట్టమొదట సారిగా ఇక్కడ ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించారు. ఈ చిన్న సంఘం నుంచి అనేకమంది ప్రబోధకులు సువార్త సేవారంగంలో ప్రవేశించారు. GCTel 205.1

    కెల్విన్ మరోసారి పీరిస్ నగరానికి వచ్చాడు. ఫ్రాన్స్ ఒక జాతిగా దిద్దుబాటు సువార్తను స్వీకరిస్తుందన్న ఆశాభావాన్ని వదులుకోలేకపోయాడు. అయితే తన సేవలకు అన్ని ద్వారాలు మూతపడినట్లు ఆయన కనుగొన్నాడు. సువార్త ప్రకటించటం దహన దండన మార్గంలో ప్రయాణించటమే. అందుచేత చివరికి జర్మనీకి వెళ్లిపోదానికి నిశ్చయించు కొన్నాడు. ఆయన ఫ్రాన్స్ విడిచి పెట్టిన వెంటనే ప్రొటస్టాంటుల సందర్భంగా తుఫాను రేగింది. అప్పుడు కేల్విన్ ఉండి ఉంటే అక్కడ సంభవించిన విధ్వంసంలో ఆయనను ఇరికించి ఉండేవారే.GCTel 205.2

    తమ దేశం జర్మనీ స్విట్జర్లాండులతో సరిసాటిగా నిలవాలన్న ఆసక్తితో ఫ్రెంచ్ సంస్కర్తలు రోము ప్రబోధిస్తున్న మూఢనమ్మకాలను దెబ్బతీయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. దానికి అనుగుణంగా మానను విమర్శిస్తూ ఒక్క రాత్రిలో ఫ్రాన్స్ దేశమంతటా గోడలపై ప్రకటనలు అంటించారు. సంస్కరణ కృషికి దోహదం చేయకపోగాGCTel 205.3

    ఈ అనుచిత కార్యం ప్రబోధకులకేగాక ఫ్రాన్స్ లో ఉన్న సంస్కరణ విశ్వాసులకు గొప్ప హాని కలిగించింది. రోము మత వాదులు దీర్ఘకాలంగా కోరుకొంటున్నదాన్ని ఇది వారి చేతిలో పెట్టింది. సిద్ధాంత వ్యతిరేకులు సింహాసనం సుస్థిరతకు దేశశాంతికి శత్రువులని అందుచేత వారిని నిర్మూలించటం అవసరమని డిమాండ్ చేయటానికి ఇది వారికి మంచి సాకు అయ్యింది.GCTel 206.1

    ఒక అజ్ఞాతవ్యక్తో - అజాత మిత్రుడో లేదా జిత్తులమారి శత్రువో తెలియదు - ఒక నినాద పత్రాన్ని రాజు వ్యక్తిగత గది తలుపులమీద అంటించాడు. రాజు భయంతో దద్దరిల్లాడు. తరతరాలుగా గౌరవాదరాలు అందుకొంటున్న మూఢనమ్మకాల్ని ఈ కాగితంలో తీవ్రంగా విమర్శించారు. గగుర్పాటు కలిగించే ఈ మాటల్ని దుస్సాహసంతో తన సముఖంలోకి నెట్టటం రాజు కోపం రేపింది. మాట్లాడకుండా వణకుతూ కాసేపు నిలబడ్డాడు. అనంతరం ఆగ్రహావేశాల్లో ఈ మాటలు పలికాడు, “లూథర్ సిద్ధాంత వాదులని అనుమానించిన వారందరిని విచక్షణ లేకుండ బంధించండి. వారందరినీ నిర్మూలిస్తాను”. అదే పుస్తకం, పుస్త 4, అధ్యా 10. పాచిక పారింది. రాజు పూర్తిగా రోమును సమర్పించటానికి నిశ్చయించుకొన్నాడు.GCTel 206.2

    పేరిస్ నగరంలో ఉన్న ప్రతీ లూథరన్ ని బంధించటానికి చర్య తీసుకొన్నారు. దిద్దుబాటు సిద్ధాంత విశ్వాసి అయిన ఒక బీద కార్మికుడు విశ్వాసులను తమ రహస్య సమావేశ స్థలానికి ఆహ్వానిస్తూ ఉండేవాడు. అలా ఆహ్వానిస్తున్న తరుణంలో ఒక అధికారి అతణ్ణి పట్టుకొని సజీవ దహనానికి గురిచేస్తామంటూ భయపెట్టి నగరంలో ఉన్న ప్రతి ప్రొటస్టాంటు ఇంటికి తనను తీసుకు వెళ్లుమని ఒత్తిడి చేశాడు. ఆ ప్రతిపాదన విని అతడు భయకంపితుడయ్యాడు. చివరికి మంటల్లో చాపు భయమే నెగ్గింది. సహోదరులను అప్పగించటానికి అతడు సమ్మతించాడు. అధికారి ముందు, అతడి చుట్టూ ప్రీస్టులు, ధూపవాహకులు, సన్యాసులు, సైనికులు, అపరాధ పరిశోధకుడు మోరిన్, పట్టి ఇస్తున్న ఈ వ్యక్తి నెమ్మదిగా, నిశబ్ధంగా నగర వీధులగుండా నడిచి వెళ్లారు. నిరసనకారులు మాస్ను అగౌరపర్చినందుకు “పరిశుద్ధ సంస్కార” గౌరవార్థం ప్రాయశ్చిత్తంగా, ఆ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు వ్యక్తమయ్యింది. కాని ఆ ప్రదర్శన వెనుక ఒక దురుద్దేశం దాగివుంది. అది ఒక లూథరన్ ఇంటికి ఎదురుగా వచ్చినప్పుడు నమ్మకద్రోహి ఒక సంజ చేసేవాడు. మాటలుండేవి కావు. ఊరేగింపు ఆగేది. వాళ్లు ఆ ఇంటిలో ప్రవేశించి కుటుంబ సభ్యుల్ని బైటకు ఈడ్చుకొచ్చి వారికి సంకెళ్లు వేసేవారు. కొత్త బాధితుల్ని వెతుక్కొంటూ ఊరేగింపు ముందుకు సాగేది. పెద్దలేగాని, పిన్నలేగాని ఏ యింటినీ వాళ్లు విడిచిపెట్టలేదు. పేరిస్ విశ్వవిద్యాలయ కళాశాలల్ని కూడ విడిచి పెట్టలేదు... మోరిన్ ఆ నగరాన్ని కంపింప జేశాడు... అది అతి భయంకర పరిపాలన.” అదే పుస్తకం, పుస్త 4, అధ్యా 10. GCTel 206.3

    బాధితులు క్రూరమైన హింసకు గురై మరణించేవారు. వారి బాధను కొనసాగించేందుకుగాను కావాలని మంటల వేడిని తగ్గించేవారు. అయితే వారు విజేతలుగా మరణించారు. వారి స్థిరత అచంచలత్వం. వారి ప్రశాంతత నిర్మలత వారి స్థిరత్వానికి గండి కొట్టటానికి శక్తిలేని వారి హింసకులు తమ ఓటమిని దిగమింగేవారు. “పేరిలోని నివాసిత ప్రాంతాలన్నింటిలోను మరణ స్తంభాలు ఏర్పాటుచేసి రోజు విడిచి రోజు సజీవదహన దండనను నిర్వహించే వారు. మరణ దండనను విస్తరింప చేయటం ద్వారా సిద్ధాంత వ్యతిరేకత భయాన్ని విస్తరింపచేయటమే ఈ ఎత్తుగడ పరమోద్దేశం. చివరికి ఇది ఫలించకపోగా సువార్తకే దీనివల్ల లాభం కలిగింది. నూతన విశ్వాసం ఎలాంటి మనుషులను రూపుదిద్దుతుందో పేరిస్ నగరం యావత్తు వీక్షించ గలిగింది. హతసాక్షి బూడిదకుప్పలాంటి ప్రసంగ వేదిక మరొకటి లేదు. మరణ స్థలానికి వెళ్తున్నప్పుడు వారి ముఖాలపై ప్రజ్వలించిన నిశ్చలానందం మంటల మధ్య నిలిచి ఉన్న వారి వీరత్వం, తమను హింసిస్తున్న వారి పట్ల వారి క్షమాగుణం అనేక సందర్భాల్లో కోపాన్ని కరుణా ద్వేషాల్ని మమతగా మార్చి సువార్త పక్షంగా అనర్గళంగా విజ్ఞాపన చేశాయి. ”- విలీ, పుస్త 13, అధ్యా 20.GCTel 207.1

    ప్రజల ఆగ్రహాన్ని రెచ్చగొట్టే ధ్యేయంతో ప్రీస్తులు, ప్రొటస్టాంటులపై అతి భయంకరమైన ఆరోపణలు చేశారు. కథోలిక్కుల్ని సంహరించటానికి కుతంత్రాలు పన్నుతున్నారని, ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నిస్తున్నారని, రాజును హత్యచేయటానికి చూస్తున్నారని వారిపై నేరారోపణ చేశారు. ఆ ఆరోపణలను బలపర్చటానికి కాస్త నిదర్శనం కూడా వారివద్దలేదు. అయినా దుర్దశను గూర్చిన ఈ ప్రవచనాలు నెరవేరనున్నాయి. వేరే పరిస్థితుల్లో, విరుద్ధమైన కారాణాల వల్ల నిరపరాధులైన ప్రొబస్టాంటులపై కథోలిక్కులు జరిపిన అత్యాచారాలు పోగుపడి బరువై ప్రతీకారం కోరుతున్నాయి. రాజుకు, అతడి ప్రభుత్వానికి, అతడు పాలించిన ప్రజలకు కలుగబోతున్నదని వారు ప్రవచించిన నాశనం ఆ తర్వాతి శతాబ్దాల్లో రానే వచ్చింది. కాగా అది అవిశ్వాసులు పోపుమత వాదులు తామే కలిగించిన నాశనం. మూడు వందల సంవత్సరాల అనంతరం ఫ్రాన్స్ లో చోటు చేసుకొన్న విపత్తులు ప్రొటస్టాంటు మత స్థాపన వల్ల కాదు గాని అణచివేతవల్ల సంభవించాయి.GCTel 207.2

    ఇప్పుడు సమాజంలో అన్ని తరగతుల ప్రజలలోను అనుమానం, అపనమ్మకం భయం వ్యాప్తి చెందాయి. విద్య, పలుకుబడి, సత్ప్రవర్తన విషయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మనుషుల మనసులపై లూథరన్ బోధన ప్రభావం సాధారణ అభద్రతా వాతావరణంలో సైతం ఎంత బలీయంగా ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. ప్రతిష్టాకరమైన బాధ్యతాయుతమైన హోదాలు అర్ధాంతరంగా ఖాళీ అయ్యాయి. చేతిపనివారు, అచ్చొత్తేవారు, విద్వాంసులు, విశ్వ విద్యాలయ ఆచార్యులు, గ్రంధకర్తలు, ఆ స్థానికులు మాయమయ్యారు. వందలాది ప్రజలు పేరిస్ విడిచి పారిపోయారు. తమ జన్మభూమి నుంచి తమ్ముని తాము వెలివేసుకొన్నారు. ఇలా అనేక సందర్భాలలో తాము దిద్దుబాటు విశ్వాసాన్ని సమర్థిస్తున్నామని వ్యక్తం చేశారు. బయలు పడని సిద్ధాంత వ్యతిరేకులు వారి మధ్య ఉండవచ్చునన్న అభిప్రాయంతో పోపుమతవాదులు తమ చుట్టూ చూశారు. తమ అధికారం కింద ఉన్న సామాన్య ప్రజలపై వారు తమ కోపం చూపించారు. ఖైదులు జనంతో కిక్కిరిసి ఉన్నాయి. సువార్తను నమ్మిన వారి కోసం ఏర్పాటైన దహన స్థానాల నుంచి పైకెగసిన పొగతో వాతావరణం మసకబారింది.GCTel 208.1

    పదహారో శతాబ్దంలో బయలుదేరిన విజ్ఞాన పునరుజ్జీవన ఉద్యమానికి నాయకుడిగా ఉండటం ఫ్రాన్సిస్ | గర్వకారణంగా భావించాడు. ప్రతీదేశం నుంచి వచ్చిన విద్వాంసులను తన ఆస్థానానికి సంతోషంగా ఆహ్వానించాడు. విజ్ఞానం పట్ల తనకున్న ప్రేమ వల్ల, సన్యాసుల అజ్ఞానం మూఢవిశ్వాసం వల్ల రాజు కొంత వరకు దిద్దుబాటు విశ్వాసం విషయంలో సహనం చూపించాడు. కానీ సిద్ధాంత వ్యతిరేకతను ఉక్కు పాదంతో నలిపివేయ వలసిందని మత గురువులు ప్రోత్సహించగా ఫ్రాన్స్ దేశమంతటిలోనూ అచ్చుగుద్దటం నిషిద్ధమంటూ శాసనాన్ని జారీ చేశాడీ పండిత పోషకుడు. ప్రతిభ, సంస్కారాలు పరమత అసహనానికి, హింసకు ఆటంకాలు కావన్న సత్యానికి ఫ్రాన్సిస్ జీవితం దాఖలై ఉన్న అనేక సాదృశ్యాలలో ఒక్కటి. బహిరంగంగా జరపవలసిన ఒక ఆచారకర్మ జరిపి ప్రొటస్టాంటువత నిర్మూలనకు తన నిబద్ధతను ఫ్రాన్స్ వ్యక్తం చేయాల్సి ఉన్నది. మాస్ ను ఖండించటం ద్వారా సర్వోన్నత దేవునికి జరిగిన అవమానానికి రక్తంతో ప్రాయశ్చిత్తం జరగాలని, ఈ భయంకర కార్యానికి తన ప్రజల పక్షంగా బహిరంగంగా రాజు అనుమతి ఇవ్వాలని” ప్రీస్టులు డిమాండ్ చేశారు. GCTel 208.2

    ఈ భీకర కర్మకాండను 1535 జనవరి 21న జరపటానికి నిర్దేశించారు. మూఢ విశ్వాసాలతో కూడిన భయాందోళనలను మత దురభిమానాన్ని దేశమంతటా రెచ్చ గొట్టారు. ఫ్రాన్స్ లో ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో నగర వీధులు కిక్కిరిసి పోయాయి. బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఆనాటి కార్యం ప్రారంభం కావలసి ఉన్నది. “ఊరేగింపు వెళ్లే మార్గంలో ఉన్న గృహాలపై సంతాప తోరణాలు కట్టారు. మధ్యమధ్య బలి పీఠాలు వెలశాయి “ప్రతీ తలుపుముందు ” పరిశుద్ధ సంస్కారం” గౌరవార్ధం కాలుతున్న దివిటీని ఉంచారు. తెల్లవారక ముందే ఊరేగింపు రాజ భవనం వద్ద ప్రారంభ మయ్యింది. “మొదట అనేక పేరి పతకాలు, సిలువలు వెళ్లాయి. తర్వాత దివిటీలు పట్టుకొని ఇద్దరిద్దరుగా నడుస్తూ పురజనులు వెళ్లారు. ” నాలుగు ఆర్డర్ల సన్యాసులు వారి వారి ఆర్డర్ల ప్రత్యేక దుస్తులు ధరించి వారిని అనుసరించారు. ఆ తర్వాత ప్రముఖ శల్యావశేషాలు (రివిక్స్) వెళ్లాయి. వీటి వెనుక ధగధగ మెరిసే అందమైన అలంకరణలు గల వంగసింధూర వన్నెల అంగీలు ధరించిన మత గురువులు గుర్రాలపై హుందాగా వెళ్లారు. అది శోభాయమానమైన ప్రదర్శన.GCTel 208.3

    “నాలుగు పక్కలా నలుగురు సామంత రాజులు పట్టుకొన్న వితానం కింద పేరిస్ బిషప్ ప్రభు భోజన రొట్టె పట్టుకొని నడిచాడు. రొట్టె వెనుక రాజు నడిచాడు... ఆ రోజు ఫ్రేన్సీస్ I కిరీటంగాని రాచ అంగీగాని ధరించలేదు.” తలమీద ఏమీలేకుండా కళ్లు కిందకు దించుకొని నేలను చూస్తూ వెలుగుతున్న మైనపు వత్తి పట్టుకొని, పశ్చాత్తాపం పొందిన వ్యక్తిలా” ఫ్రాన్స్ రాజు వెళ్లాడు.. అదే పుస్తకం, పుస్త 13,అధ్యా 21. ప్రతీ బలి పీఠం వద్ద వినయంగా వంగాడు. తన ఆత్మను మలినపర్చిన పాపాల నిమిత్తంగాని లేదా నిరపరాధుల రక్తంతో తడిసిన తన చేతుల నిమిత్తంగాని కాక మాసిని విమర్శించటానికి సాహసించిన తన ప్రజల ఘోరపాపం నిమిత్తం. అతడి వెనుక రాణి, ప్రభుత్వాధికార్లు దివిటీలు పట్టుకొని ఇద్దరిద్దరుగా నడుస్తూ వచ్చారు.GCTel 209.1

    ఆనాటి ఆరాధన కార్యక్రమంలో భాగంగా రాజ్యంలోని ఉన్నతాధికారులను ఉద్దేశించి బిషప్ భవనంలోని హాలులో రాజు ప్రసంగించాడు. విచారవదనంతో వారిముందు నిలబడి “తమ జాతిమీద పడిన నేరం, దేవదూషణ, దుఃఖం, అపకీర్తి” గురించి విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. ఫ్రాన్ను నాశనం చేస్తున్న సిద్ధాంత వ్యతిరేకతా జాడ్యాన్ని రూపుమాపటానికి ప్రతీ యుద్ధ పౌరుడు సహకరించాల్సిందిగా పిలుపు నిచ్చాడు. “పెద్దలారా, మీ రాజునైన నేను చెబుతున్న దేంటంటే, నా అవయవాల్లో ఒక దానికి ఈ హేయమైన మచ్చగాని, పుండుగాని వచ్చినట్లు నేను గుర్తిస్తే దాన్ని మీకిచ్చి నరికివేయమంటాను. ఇంకా నాబిడ్డల్లో ఒకడికి అది అంటుకొన్నట్లు నేను గుర్తిస్తే వాణ్ణి నేను కాపాడను...వాణ్ణి నేనే పట్టుకొని దేవునికి బలి ఇస్తాను” అన్నాడు ప్రెన్సీస్. కన్నీళ్లవల్ల మాటరాలేదు. సభలోని వారందరూ రోధిస్తూ ముక్త కంఠంతో ఇలా శపదం చేశారు, “మేము కథోలిక్ మతం కోసం జీవిస్తాం. కథోలిక్ మతం కోసం మరణిస్తాం.”- డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఇన్ ది టైమ్ ఆఫ్ కెల్విన్, పుస్త 4, అధ్యా 12.GCTel 209.2

    సత్యాన్ని తోసిపుచ్చిన జాతిని భయంకరమైన చీకటి అలముకొన్నది. “రక్షణ కలిగించే కృప ప్రత్యక్షమయ్యింది. అయితే దాని శక్తిని పరిశుద్ధతను వీక్షించిన తర్వాత దాని దివ్య సౌందర్యానికి వేలాది ప్రజలు ఆకర్షితులైన తర్వాత దాని ప్రకాశత నగరాన్ని, గ్రామాల్ని వెలుగుతో నింపిన తర్వాత, ఫ్రాన్స్ వెలుగు బదులు చీకటిని ఎంపిక చేసుకొని వెలుగును నిరాకరించింది. అర్పితమైన దివ్య పరాన్ని వారు తృణీకరించారు. ఆత్మ వంచనకు ఇష్టపూర్వకంగా లోనై పతనమయ్యేంతవరకు వారు మంచిని చెడు అని, చెడును పంచి అని పిలిచారు. ఇప్పుడు దేవుని ప్రజల్ని హింసించటం ద్వారా దేవుని సేవ చేస్తున్నామని వారు వ్విసించినప్పటికీ ఆ యధార్ధత వారిని నిరపరాధుల్ని చేయజాలదు. మోసంలో పడి రక్తం చిందించిన అపరాధానికి తమ ఆత్మలు గురి కాకుండా తమను కాపాడగలిగి ఉండే సత్యాన్ని వారు ఇష్ట పూర్వకంగా తోసి పుచ్చారు.GCTel 210.1

    సిద్ధాంత వ్యతిరేకతను నిర్మూలిస్తామని వారు దేవాలయంలో గంభీర శపదం చేశారు. దాదాపు మూడు శతాబ్దాల అనంతరం సజీవదేవుని మరచిపోయిన ఆ జాతే అదే స్థలంలో జ్ఞానదేవతకు సింహాసనం వేసి దానిపై ఆమెను కూర్చుండబెట్టనున్నారు. మళ్లీ ఒక ఊరేగింపు ఏర్పాటయ్యింది. ఫ్రాన్స్ ప్రతినిధులు తాము వాగ్దానం చేసిన కార్యాన్ని ప్రారంభించటానికి పూనుకొన్నారు. “కొంతమంది ప్రొటస్టాంటు క్రైస్తవుల్ని సజీవ దహనం చేసేందుకు దగ్గర దగ్గరగా దహన స్తంభాలు ఏర్పాటు చేశారు. రాజు సమీపించేటప్పుడు దహన స్తంభం వద్ద కట్టెలు వెలిగించటానికి, అక్కడ జరుగుతున్న సజీవ దహనాన్ని చూడటానికి ఊరేగింపు అక్కడ ఆగటానికి ఏర్పాట్లు జరిగాయి.” - విలీ, పుస్త 13, అధ్యా 21. క్రీస్తు నిమిత్తం ఈ సాక్ష్యులు భరించిన శ్రమలు వర్ణించలేనంత భయంకరమైనవి. బాధితుల్లో ఎలాంటి మార్పు చలనం లేదు. తన నమ్మకాల్ని ఉపసంహరించుకోమన్నప్పుడు ఒక సాక్షి సమాధానం ఇది, “ప్రవక్తలు, అపోస్తలులు పూర్వం బోధించిన భక్తులందరూ విశ్వసించిన వాటిని మాత్రమే నమ్ముతాను, దేవునిపై నాకున్న విశ్వాసం పాతాళ శక్తులన్నింటినీ ప్రతిఘటిస్తుంది.” - డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిపర్మేషన్ ఇన్ యూరప్ ఇంది టైమ్ ఆఫ్ కెల్విన్, పుస్త 4, అధ్యా 12.GCTel 210.2

    ఊరేగింపు తరచుగా హింస జరుగుతున్న స్థలాల్లో ఆగింది. ప్రారంభ స్థలమైన రాజభవనం వద్దకు వచ్చి ఊరేగింపు జనం చెదిరి పోయారు. ఆనాటి కార్యక్రమం సందర్భంగా ఎంతో తృప్తి పొంది, ఇప్పుడు మొదలైన కార్యం సిద్ధాంత వ్యతిరేకత నిర్మూలమయ్యేంతవరకు కొనసాగుతుందంటూ చెప్పుకొని రాజు, ప్రిలేటులు ఒకరినొకరు అభినందించుకొని తమతమ స్థానాలకు వెళ్లిపోయారు.GCTel 211.1

    ఫ్రాన్స్ నిరాకరించిన సమాధాన సువార్త నిర్మూలం కావటం నిశ్చయం. దాని ఫలితాలు అతి భయంకరంగా ఉండబోతున్నాయి. సంస్కర్తలను హింసించటానికి ఫ్రాన్స్ పూర్తిగా నిబద్దమైన నాటినుంచి 258 సంవత్సరాలకు 1793 జనవరి 21వ తేదీన మరో ఊరేగింపు వేరే ఉద్దేశంతో పేరిస్ నగర వీధులగుండా వెళ్లింది. ” రాజే మళ్లీ ప్రధానపాత్ర దారి. అల్లరి కేకలు మళ్లీ వినిపించాయి. ఎక్కువ మంది బాధితుల కోసం కేకలు మళ్లీ వినిపించాయి. ఉరికంభాలు మళ్లీ ఏర్పాటయ్యాయి. ఆనాటి సన్ని వేశాలు మళ్లీ భయానక మరణాలతో ముగిశాయి. లూయిస్ XVI జైలు అధికార్లతోను తలారీలతోను పెనుగులాడుతున్నాడు. వారు అతణ్ణి శిరచ్ఛేదన బండవద్దకు ఈడ్చుకు వెళ్లి ఆ బండపై అతడి శిరస్సు తెగి పడేంతవరకు అతణ్ణి అదిమి పట్టుకొన్నారు.” - విలీ, పుస్త 13, అధ్యా 21. బాధితుడు రాజొక్కడే కాదు. క్రూర పాలన దినాల్లో ఆ స్థలానికి సమీపంలో గిలోటిన్(తలనరికే) యంత్రం ద్వారా 2,800 మంది దారుణ మరణానికి గురి అయ్యారు.GCTel 211.2

    సంస్కరణ తెరిచిన బైబిలును లోకానికి అందించింది. దైవ ధర్మశాస్త్ర సూత్రాలను విశదపరచి వాటి ఆచరణను మనుషుల మనస్సాక్షికి విడిచిపెట్టింది. పరలోక విధులను సూత్రాలను అనంత ప్రేమామయుడైన దేవుడు మానవులకు బయలు పర్చాడు. దేవుడు ఇలా అన్నాడు, “ఈ కట్టడలన్నింటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జాన వివేచనలుగల జనమని చెప్పుకొందురు.” ద్వితియోపదేశ కాండము 4:6. ఫ్రాన్స్ దైవ వరాన్ని నిరాకరించినప్పుడు అరాచకాన్ని నాశనాన్ని విత్తింది. కార్యకారణ ప్రక్రియ విప్లవంగా దౌర్జన్యకాండగా పరిణమించింది.GCTel 211.3

    వివాద పత్రాలు తెచ్చిపెట్టిన హింసకు ఎంతో ముందు సాహసం కార్యదీక్ష గల ఫెరల్ జన్మభూమి వదలి పారిపోవలసివచ్చింది. ఆయన స్విట్జర్లాండుకు వెళ్లాడు. తన సేవ జ్వింగ్ సేవతో ఏకీభవించటంతో పరిస్థితులను సంస్కరణకు అనుకూలంగా మలచటానికి సహాయపడ్డాడు. ఫేరల్ చివరి సంవత్సరాలు ఇక్కడే గడిచాయి. ఆయన ఫ్రాన్స్ లో దిద్దుబాటు కృషి పురోగమనాన్ని బహుగా ప్రభావితం చేశాడు. తన బహిష్కృతి తొలి సంవత్సరాల్లో తన మాతృదేశంలో సువార్త ప్రచారంపై దృష్టి కేంద్రీకరించాడు. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న స్వదేశీయుల మధ్య సువార్త ప్రచార సేవలో చాలా సమయం గడిపాడు. తన దేశంలో రగులుతున్న సంఘర్షణను సరిహద్దు ప్రాంతాల నుంచి జాగ్రత్తగా పరిశీలించి ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని కూర్చే మాటలతో సంస్కరణకు తన వంతు సహాయం అందించాడు. ఇతర (దేశ) బహిష్కుృతుల సాయంతో జర్మను సంస్కర్తల రచనలను ఫ్రెంచ్ భాషలోకి అనువదించి వాటికి ఫ్రెంచ్ బైబిలుకు జతపర్చి వాటిని ఫ్రాన్స్ లో విస్తారంగా విక్రయించాడు. సాహిత్య విక్రయ సేవకులకు తక్కువ ధరకు వాటిని సరఫరా చేసి తద్వారా వచ్చే లాభాలతో ఆ సేవను కొనసాగించాడు.GCTel 211.4

    ఫేరెల్ బడిపంతులుగా స్విట్జర్లాండులో తనపనిని ప్రారంభించాడు. మారుమూలనున్న పేరిష్ కి వెళ్లి పిల్లలకు విద్య నేర్పటంలో నిమగ్నమయ్యాడు. సామాన్య బోధనాంశాలతో పాటు ఆచితూచి బైబిలు సత్యాల్ని కూడా పిల్లలకు పరిచయం చేస్తూ తద్వారా వారి తలిదండ్రుల్ని చేరాలని నిరీక్షించాడు. కొందరు విశ్వసించారు. కాని ప్రీస్టులు దాన్ని ఆపివేశారు. దాన్ని వ్యతిరేకించటానికి మూఢనమ్మకాలుగల అమాయక ప్రజల్ని రెచ్చగొట్టారు. “దానివల్ల సమాధానం కాక సంఘర్షణ కలగటాన్ని బట్టి అది క్రీస్తు సువార్త కాదంటే కాదు” అంటూ నచ్చజెప్పారు” ప్రీస్టులు - విలీ, పుస్త 14, అధ్యా 3. ఆది శిష్యుల మాదిరిగానే ఒక నగరంలో హింస కలిగితే ఆయన మరొక నగరానికి పారిపోయాడు. ఆకలి, చలి, శ్రమలకు ఓర్చి ప్రతీ తావులోను ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటూ, కాలినడకన గ్రామాన్నుంచి గ్రామానికి, నగరం నుంచి నగరానికి వెళ్లాడు. సువార్తను బజార్లలో ప్రకటించాడు. దేవాలయాల్లో ప్రచురించాడు. కొన్ని సార్లు కేతీ డ్రల్ ప్రసంగ వేదికల నుంచి ప్రసంగించాడు. కొన్ని సార్లు ఆలయంలో వినేవారు కరువయ్యారు. కొన్ని సార్లు ఆయన ప్రసంగిస్తుండగా ఎగతాళి కేకలు ప్రసంగానికి అంతరాయం కలిగించేవి. ఒకసారి ప్రసంగ వేదిక నుంచి దౌర్జన్యంగా కిందికి ఈడ్చుకొచ్చారు. రెండు మూడు సార్లు దుండగులు ఆయన మీదకు వెళ్లి దాదాపు మరణించేంతవరకు కొట్టారు. అయినా ఆగక ఆయన ముందుకు సాగాడు. తరచు విరోధానికి గురి అయినా గట్టి పట్టుదలతో తన దాడిని కొనసాగించాడు. ఫలితంగా పోపుమతానికి కోటలుగా ఉన్న పట్టణాలు, నగరాలు, ఒకదాని వెంట మరొకటి సువార్తకు తలుపులు తెరవటం మొదలు పెట్టాయి. ఫేరల్ మొదటగా పని చేసిన ఆ చిన్న పేరిష్ కొద్ది కాలంలోనే దిద్దుబాటు విశ్వాసాన్ని అంగీకరించింది. మొరేట్, న్యూషాటెల్ నగరాలు కూడా రోమను మతాచారాలను విడిచిపెట్టి తమ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలను తొలగించి వేశాయి.GCTel 212.1

    జెనీవాలో ప్రొటస్టాంట్ పతాకాన్ని, ఎగురవేయాలన్నది ఫేరెల్ చిరకాల వాంఛ. ఈ నగరాన్ని పరిపాలించగలిగితే అది ఫ్రాన్స్, సిద్ధర్థాండు, ఇటలీ దేశాల్లో దిద్దుబాటు విశ్వాసానికి కేంద్రంగా ఉండగలదన్న మా ఉద్దేశంతో ఆయన శాయశక్తుల కృషిచేసి చుట్టుపక్కల ఉన్న అనేక పట్టణాలు గ్రామాల్లో చాలా వాటిని నూతన విశ్వాసానికి మార్చాడు. అనంతరం ఒక్క అనుచరుడితో జెనీవా నగరంలో ప్రవేశించాడు. అయితే రెండు ప్రసంగాలు మాత్రమే చేయగలిగాడు. పౌర అధికారుల ద్వారా ఆయనకు శిక్ష విధించటానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వటంతో మత సంబంధమైన సభకు హాజరు కావలసిందిగా ప్రీస్టులు ఆయనను ఆదేశించారు. ఫేరెల్ ప్రాణాలు తీయాలన్న ఉద్దేశంతో తమ అంగీల కింద ఆయుధాలుంచుకొని ప్రీస్టులు ఆ సభకు వెళ్లారు. సభ నుంచి తప్పించుకొని బైటకు వస్తే అక్కడ ఆయనను చంపటానికి కర్రలతోను, కత్తులతోను పెద్ద గుంపు సిద్ధంగా ఉన్నది. మేజిస్ట్రేటులు, సాయుధ దళం అక్కడ ఉండటం వల్ల ఆయనకు హానికలుగలేదు. మరుసటి ఉదయం ఆయనను ఆయన సహచరుణ్ణి సరస్సు అవతల పక్క ఒక సురక్షిత స్థలానికి చేర్చారు. జెనీవాలో సువార్త ప్రచారానికి జరిగిన మొదటి ప్రయత్నం ఇలా ముగిసింది.GCTel 213.1

    తర్వాతి ప్రయత్నానికి కొంచెం తక్కువ స్థాయి వ్యక్తి ఎంపికయ్యాడు. అతడు అతిసామాన్యంగా కనిపించే యువకుడు. అతన్ని మిత్రుడని చెప్పుకొనే వారుకూడ తన వాలకాన్ని బట్టి అతణ్ణి చిన్న చూపు చూశారు. ఫేరెల్ తిరస్కృతుడైన చోట అలాంటి వాడేమి సాధించగలడు? ఏ తుఫానును తట్టుకోలేక గొప్ప శక్తి సాహసాలున్న వ్యక్తి పారిపోయాడో దాని ముందు ధైర్యం అనుభవం లోపించిన ఈ యువకుడెలా నిలువగలడు? శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని...యెహోవా సెలవిచ్చుచున్నాడు.” జెకర్యా 4:6. “బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.” “దేవుని వెట్టితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటె బలమైనది.” 1 కొరింథి 1:27,25.GCTel 213.2

    “మెంట్ తన పనిని బడి పంతులుగా ఆరంభించాడు. బడిలో ఆయన నేర్పిన సత్యాలు పిల్లలు తమ గృహాల్లో వల్లించేవారు. బైబిలు వివరణ వినటానికి తల్లిదండ్రులు వచ్చేవారు. ఆతృతగా వినటానికి వచ్చిన తలిదండ్రులతో తరగతి గది నిండిపోయేది. కొత్త నిబంధనలు, కరపత్రాలు స్వేచ్చగా పంచటం జరిగింది. కొత్త సిద్ధాంతాన్ని బహిరంగంగా వినటానికి సాహసించలేని అనేకులకు అవి అందేవి. కొంత కాలానికి ఈ కార్యకర్త కూడా పారిపోవటానికి ఒత్తిడి వచ్చింది. అయితే ఆయన బోధించిన సత్యాలు ప్రజల మనస్సుల్లో నాటుకుపోయాయి. సంస్కరణ నిలిచింది. అది బలోపేతమై విస్తరించింది. సువార్త ప్రబోధకులు తిరిగివచ్చారు. వారి సేవల ద్వారా జెనీవాలో చివరికి ప్రొటస్టాంట్ ఆరాధన నెలకొన్నది.GCTel 213.3

    ఆయా సంచారాలు పరివర్తనల దరిమిలా కెల్విన్ ఆ నగరంలో ప్రవేశించాడు. అది దిద్దుబాటు విశ్వాసానికి అనుకూలంగా స్పందించింది. తన స్వస్థలాన్ని ఆఖరిసారిగా సందర్శించి తిరిగి వస్తున్నప్పుడు బేసిల్ దిశగా ప్రయాణిస్తుండగా చార్లెస్ II సైన్యాలు మార్గాన్ని ఆక్రమించినందున జెనీవాకు కేల్విన్ చుట్టు మార్గాన వెళ్లవలసి వచ్చింది.GCTel 214.1

    ఈ సందర్భంలో ఫేరెల్ దైవ హస్తాన్ని గుర్తించాడు. జెనీవా సంస్కరణ విశ్వాసాన్ని అంగీకరించినా ఇక్కడ జరగాల్సిన పని ఇంకా ఎంతో మిగిలివుంది. సమాజాలుగాగాక వ్యక్తులుగా మనుషులు దేవునిపై విశ్వాసముంచి మారటం జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి వలన హృదయంలోను అంతరాత్మలోను పునర్జీవన క్రియ జరగాలి. సభల ఆదేశాల వలన కాదు. జెనీవా ప్రజలు రోము అధికారాన్ని తోసిపుచ్చినా రోము పరిపాలన కింద ప్రబలిన దురాచారాలను విడిచిపెట్టటానికి సిద్ధంగా లేరు. స్వచ్ఛమైన సువార్త నియమాల్ని నెలకొల్పి తాము నిర్వహించాల్సిందిగా ప్రభువు పిలుస్తున్న స్థానాన్ని సమర్ధంగా ఆక్రమించేందుకు సిద్ధపడటం తేలిక విషయం కాదు.GCTel 214.2

    ఈ సేవలో కలిసి పని చేసేందుకు కేల్విన్లో మంచి భాగస్వామి దొరికాడని పేరెల్ భావించాడు. ఇక్కడే ఉండి పని చేయుమని దేవుని పేర ఆయన బోధకుణ్ణి గంభీరంగా ఆదేశించాడు. కెల్విన్ భయంతో వెనకడుగు వేశాడు. పిరికి వాడు, శాంతి ప్రియుడు అయిన కెల్విన్ సాహస, స్వతంత్ర, హింసాత్మక స్వభావులైన జెనీవా ప్రజలతో అనుబంధమంటే వెనకాడాడు. తన ఆరోగ్య పరిస్థితి, తన గ్రంధ పఠనాభ్యాసాలు కారణంగా పని నుంచి విశ్రమించాలని భావించాడు. సంస్కరణ కృషికి తన రచనల ద్వారా దోహదం చేయగలనని విశ్వసించి పఠనానికి అనువైన ఒక ప్రశాంతమైన స్థలం ఎంపిక చేసుకొని అక్కడ నుంచి పత్రికల ద్వారా సంఘాలకు ఉపదేశం అందించి వాటిని పెంపొందించాలని ఆ కాంక్షించాడు. కాకపోతే ఫేరెల్ హితవు ఆయనకు దేవుని వద్దనుంచి వచ్చిన పిలుపుగా కనిపించింది. దాన్ని నిరాకరించటానికి సాహసించలేదు. “పరలోకం నుంచి దేవుడు చేయిచాపి తనను పట్టుకొని తాను ఉండనంటే ఉండనంటున్న స్థలంలో తనను ఉంచాడని” తనకు తోస్తుందని కేల్విన్ అన్నాడు. - డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఇన్ ది టైమ్ ఆఫ్ కెల్విన్, పుస్త 9, అధ్యా 17.GCTel 214.3

    ఈ సమయంలో ప్రొటస్టాంట్ సేవ ఘోర ప్రమాదాలను ఎదుర్కొంటున్నది. జెనీవాను ఖండిస్తూ పోపు బహిష్కరణ విధించాడు. జెనీవాను ధ్వంసం చేస్తామని శక్తిమంతమైన రాజ్యాలు బెదరించాయి. రాజుల్ని చక్రవర్తుల్ని శాసించగలిగిన శక్తిమంతుడైన మత గురువును ఈ చిన్న నగరం ఎలా ప్రతిఘటించ గలుగుతుంది? ప్రపంచంలోని అతిరథమహారథుల ముందు అది ఎలా నిలువగలుగుతుంది?GCTel 215.1

    క్రైస్తవ లోకమంతటా ప్రొటస్టాంట్ వాదానికి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సంస్కరణ మొదటి విజయాల అనంతరం దాన్ని మట్టు పెట్టటాలన్న ధ్యేయంతో రోము నూతన శక్తులను రంగంలోకి దింపింది. ఈ తరుణంలోనే జెసుఅయిట్ వ్యవస్థ (జెసు అయిట్ ఆర్డర్)ను సృష్టించింది. పోపు మత సంరక్షక వ్యవస్థలలో అతిక్రూరమైన, నీతిబాహ్యమైన, శక్తిమంతమైన వ్యవస్థ ఇదే. లౌకిక బాంధవ్యాలు మానవాసక్తులు వదలుకొని, స్వాభావిక మమతానురాగాలు, తెలివితేటలు చంపుకొని, అంతరాత్మను పూర్తిగా అణచివేసి వారు తమ వ్యవస్థను తప్ప ఏ నిబంధనను ఏ బాంధవ్యాన్ని గుర్తించరు. దాని అధికారాన్ని విస్తరింపజేయటం తప్ప ఏవిధినీ నిర్వహించరు. చలి, ఆకలి, శ్రమ, పేదరికం, చిత్రహింస, చీకటి బిలం, సజీవ దహనాలకు భయపడకుండా సత్యకేతనాన్ని ఎత్తిపట్టుకోటంలోని అపాయాన్ని ఎదుర్కోటానికి, బాధలు భరించటానికి విశ్వాసులకు క్రీస్తు సువార్త శక్తి నిచ్చింది. ఈ శక్తుల్ని ప్రతిఘటించటానికి జెసుఅయిటులు తమ అనుచరులలో మతమౌఢ్యాన్ని నూరిపోశారు. అది అటువంటి అపాయాల్ని భరించటానికి శక్తిని, సత్యాన్ని వ్యతిరేకించటానికి వంచనాయుధాల్ని వారికిచ్చింది. వారు ఎంతటినేరాన్నైనా చేస్తారు. ఎంత నీచమైన కార్యాలకైనా పాల్పడతారు. ఎలాంటి మారువేషాన్నైనా ధరిస్తారు. నిత్య దారిద్ర్యాన్ని సామాన్య జీవనాన్ని ఎంపిక చేసుకొన్న వారి ఏకైక లక్ష్యం ప్రొటస్టాంట్ విశ్వాసాన్ని నిర్మూలించి పోపువుతాధిక్యాన్ని పునఃస్థాపించటం.GCTel 215.2

    తమ వ్యవస్థ సభ్యులుగా వ్యవహరించినప్పుడు వారు భక్తి పరుల్లా కనిపిస్తూ ఖైదులు, ఆసుపత్రులు సందర్శిస్తారు. రోగులను, పేదవారిని పరామర్శించి వారికి సేవలందిస్తారు. లోకాన్ని త్యజించామని చెప్పుకొంటారు. మేలు చేస్తూ సంచరించిన యేసు పరిశుద్ధ నామం ధరిస్తారు. అయితే నిష్కళంకమైన ఈ ఆకారం మాటున అపాయకరమైన నేరపూరితమైన ఉద్దేశాలు దాగి ఉంటాయి. లక్ష్యం క్రియను సమర్ధిస్తుందన్నదే ఈ వ్యవస్థ ప్రాథమిక సూత్రం. ఈ సూత్రం ప్రకారం అబద్ధం దొంగతనం, అసత్యప్రమాణం, హత్య క్షమింప దగ్గవే కాదు, సంఘ ప్రయోజనాల్ని కాపాడేటప్పుడు అవి అభినందనీయాలు కూడా. వివిధ మారువేషాల్లో జెసుఅయిట్లు సర్కారు కార్యాలయాల్లో స్థానం సంపాదించి రాజులకు సలహాదారులుగా పెరిగి దేశ విధానాన్ని రూపొందించారు. తమ యజమానులపై గూఢ చర్యాన్ని నిర్వహించేందుకుగాను సేవకుల వేషం ధరించారు. సామంతరాజులు ధనికవర్గం పిల్లలకు కళాశాలలు, సామాన్య ప్రజలకోసం పాఠశాలలు నెలకొల్పారు. ప్రొటస్టాంట్ విశ్వాసుల పిల్లల్ని పోపు మతాచారాలకు ఆకర్షించారు. రోము మతారాధనలో ఉన్న ఆడంబరాన్ని ప్రదర్శనను మనసును గంధరగోళ పర్చి ఊహను ఆకట్టుకోటానికి వినియోగించుకొన్నారు. ఏ స్వేచ్ఛ కోసం తమ తండ్రులు కష్టపడి పని చేసి రక్తం కార్చారో దాన్ని పిల్లలు ఇలా కాలరాచారు. జెసుఅయిట్లు స్వల్ప కాలంలోనే యూరఫ్ ఖండమంతా విస్తరిల్లారు. వారు ఎక్కడకు వెళ్తే అక్కడ పోపు మతం పునరుజ్జీవం పొందింది.GCTel 215.3

    వారికి మరింత అధికారం కట్టబెట్టేందుకు అధికారిక విచారణను ఇన్క్వజిషన్ను పునరుద్ధరించటం జరిగింది. ఈ విచారణను సాధారణంగా ప్రజలు ద్వేషించారు. కథోలిక్ దేశాల్లోని ప్రజలు సైతం దాన్ని ద్వేషించారు. అయినా పోపు మతనాయకులు ఈ భయంకర ట్రిబ్యూనల్ ని తిరిగి నియమించారు. చెప్పటానికి సాధ్యంకాని భయంకర దురాగతాల్ని చీకటి కొట్టులలో బిగించారు. అనేక దేశాల్లో వేవేల మంది సజ్జనులు, నీతిపరులు, ఉత్తములు, ప్రతిభావంతులు, విద్యావంతులు, దైవభక్తులు, దైవ భక్తిగల బోధకులు, దేశభక్తిగల పౌరులు, విద్వాంసులు, నిపుణతగల కళాకారులు, దక్షతగల చేతిపనివారు వధకు గురి అయ్యారు. లేదా వారి ఒత్తిడి వల్ల ఇతర దేశాలకు పారిపోయారు. సంస్కరణ జ్యోతిని ఆర్పివేయటానికి, బైబిలుని ప్రజలకందకుండా చేయటానికి చీకటి యుగాల్లోని అజ్ఞానాన్ని మూఢనమ్మకాల్ని పునరుద్ధరించటానికి రోము అవలంభించిన విధానాలు ఇలాంటివి.GCTel 216.1

    పోతే దైవానుగ్రహంవల్ల, లూథర్ అనంతరం దేవుడు ఎంపిక చేసుకొన్న ఉత్తముల కృషి ఫలితంగా ప్రొటస్టాంట్ విశ్వాసం అంతం కాలేదు. అది సామంతరాజుల దయవల్లగాని వారి ఆయుధాలవల్లగాని నిలువలేదు. అతిచిన్న దేశాలు, పెద్దపట్టులేని సామాన్య దేశాలు దానికి ఆశ్రయ మార్గాలుగా పరిణమించాయి - తనను నాశనం చేయటానికి కుతంత్రాలు పన్నుతున్న బలమైన శత్రుదేశాల నడుమ ఉన్న చిన్నదైన జెనీవా నగరమది. ఉత్తర సముద్ర తీరపు ఇసుక భూభాగంపై నిలిచింది. అప్పటి దేశాల్లో గొప్పది, భాగ్యవంతమైనది అయిన స్పెయిన్ నిరంకుశ పాలనపై పోరు సల్పుతున్న హాలెండ్ అది. సంస్కరణ విశ్వాసం పక్షంగా విజయాలు సాధించిన స్వీడన్ అది.GCTel 216.2

    దాదాపు ముపై సంవత్సరాలుగా కెల్విన్ జెనీవాలో పని చేశాడు. మొదట బైబిలు సిద్ధాంతాల ఆధారంగా ఒక సంఘాన్ని స్థాపించటానికి కృషి సల్పాడు. ఆ మీదట సంస్కరణ విశ్వాసాన్ని యూరప్ అంతటా ప్రచురించటానికి పాటుపడ్డాడు. నాయకుడిగా ఆయన అవలంభించిన విధానం దోషరహితం కాదు. ఆయన సిద్ధాంతాలూ దోష రహితాలుకావు. కాని ఆయన ఆ కాలానికి ప్రాముఖ్యమైన సత్యాల్ని ప్రబోధించటంలోను వేగంగా బలపడి పెరుగుతున్న పోపుమత వెల్లువలో ప్రొబస్టాంట్ సిద్ధాంతాలను కొనసాగించటంలోను, రోము బోధనలు పెంచి పోషించిన అహంకారం, అవినీతి స్థానే నిరాడంబరత, పరిశుద్ధతలను ప్రోది చేయటంలోను ఆయన ప్రధాన పాత్ర పోషించాడు.GCTel 217.1

    సంస్కరణ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయటానికి ప్రచురణలు వెళ్లాయి. ప్రబోధకులు వెళ్ళారు. ఆయాదేశాల్లో హింసలకు గురి అయిన వారందరూ ఈ విషయంలో ఉపదేశం, హితవు, ప్రోత్సాహం కోసం ఈ నగరం వంక చూశారు. పశ్చిమ యూరప్లో వేటకు గురి అయిన సంస్కర్తలకు కెల్విన్ నగరమైన జెనీవా ఆశ్రయ దుర్గం అయ్యింది. శతాబ్దాల కొద్దీ కొనసాగిన తీవ్ర తుఫానుల నుంచి పారిపోతూ బాధితులు జెనీవా గుమ్మాలు చేరుకొన్నారు. గాయపడి, ఆకలితో బాధపడూ, ఇల్లుగాని, నా అన్నవారుగాని లేనివారు ఇక్కడ ఆశ్రయం ప్రేమతో కూడిన ఆదరణ పొందారు. ఇక్కడే నివాసం ఏర్పర్చుకొని తమ నైపుణ్యం, విజ్ఞానం, భక్తి జీవితం ద్వారా తమ దత్తత నగరానికి ఆశీర్వాదాలు తెచ్చారు. ఇక్కడ ఆశ్రయం పొందిన వారిలో అనేకమంది రోము నిరంకుశత్వాన్ని వ్యతిరేకించటానికి తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారు. స్కాచ్ సంస్కర్త జాన్ నాక్స్ పెక్కువుంది ప్యూరిటన్లు, హాలెండ్, స్పెయిన్ దేశాలకు చెందినGCTel 217.2

    ప్రొటస్టాంటులు, ఫ్రాన్సు దేశపు హ్యూజినాట్లు తమ మాతృదేశంలోని చీకట్లను పారదోలేందుకు జెనీవా నుంచి సత్య జ్యోతిని వెలిగించి పట్టుకెళ్లారు.*GCTel 217.3