Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  అధ్యాయం 18—అమెరికన్ సంస్కర్త

  స్వాయశీలత, యధార్ధ హృదయం కలిగి దైవ లేఖనాల ప్రామాణికతను శంకిస్తున్నప్పటికీ సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న కర్షకుణ్ణి క్రీస్తు రెండోరాక ప్రచారాన్ని చేపట్టటానికి దేవుడు ప్రత్యేకంగా ఎంపిక చేసుకొన్నాడు. అనేక ఇతర సంస్కర్తల మాదిరిగా విలియమ్ మిల్లర్ బాల్యంలో పేదరికాన్ననుభవించి శక్తి అంటే ఏమిటో, ఆత్మ త్యాగం అంటే ఏమిటో నేర్చుకొన్నాడు. ఆయన పుట్టిన కుటుంబంలోని సభ్యులు స్వేచ్ఛను ప్రేమించిన వారు, సహనశీలురు, అపారదేశభక్తి గల వారు. ఈ గుణలక్షణాలు మిల్లర్ లోనూ స్పష్టంగా కనిపించాయి. ఆయన తండ్రి విప్లవ సేనలో కెప్టెన్. విప్లవ దినాల్లో ఆయన చేసిన త్యాగాలు, అనుభవించిన శ్రమల కారణంగా మిల్లర్ బాల్యం పేదరికంలో గడిచింది.GCTel 295.1

  మిల్లర్ దృఢమైన దేహ నిర్మాణం కలవాడు. ఆయన అసామాన్య మేధ చిన్న తనంలోనే వెల్లడయ్యింది. వయస్సు పెరిగిన కొద్దీ అది మరింత వికసించింది. ఆయన మనసు చురుకుగా పని చేసేది. బాగా పరిణతిచెందింది.GCTel 295.2

  జ్ఞాన సముపార్జనలో ఆయనకు ఆసక్తి మెండు. కళాశాల విద్యకు నోచుకోకపోయినా పఠనాసక్తి, శ్రద్ధతో కూడిన ఆలోచన, విమర్శనాత్మక దృష్టి ఆయనకు వివేచనను విశాల దృక్పధాన్ని సమకూర్చాయి. ఆయన సత్ప్రవర్తనుడు. మంచి పేరు గల వాడు. విశ్వసనీయతకు మితవ్యయానికి, దాతృత్వానికి ఖ్యాతిగాంచిన వ్యక్తి, కార్యదీక్ష పరిశ్రమ వలన చిన్న వయసులోనే సమర్ధత సాధించాడు. తన పఠనాభ్యాసాల్ని ఆయన కొనసాగించాడు. ఆయా పౌర సైనిక హోదాలను ఆయన సమర్థంగా నిర్వహించాడు. ధనార్జనకు పేరు ప్రతిష్ఠల సంపాదనకు ఎన్నో మార్గాలు మిల్లర్ ముందున్నాయి. GCTel 295.3

  తల్లి ప్రగాఢ దైవ భక్తిగల మహిళ. మిల్లర్ పసితనంలోనే మత ప్రభావాలకు లోనయ్యాడు. దేవుడున్నాడని క్రీస్తు దేవుడు కాడని నమ్మిన వారి సహవాసంలోకి తన బాల్యంలోనే మిల్లర్ ఆకర్షితుడయ్యాడు. వారు ప్రధానంగా మంచి పౌరులు సత్ప్రవర్తనులు, మానవత ఔదార్యం గల వ్యక్తులు. వారి ప్రభావం మిల్లర్ పై ఎక్కువగా పడింది. క్రైస్తవ సంసల నడుము నివసించటం వల్ల కొంతమేరకు పరిసరాలు వారిని ప్రభావితం చేశాయి. వారికి గౌరవ ప్రతిష్ఠలు తీసుకువచ్చిన అంశాలకు బైబిలే ముఖ్య కారణం. అయినా తాము పొందిన ఈ వరాలను వారు దుర్వినియోగ పర్చినందువల్ల అవి దైవ వాక్యానికి ప్రతికూల ప్రభావంగా పరిణమించాయి. ఈ వ్యక్తులతో కలిసి మెలసి ఉండటం ద్వారా మిల్లర్ వారి ఆలోచనా విధానాన్ని అవలంబించటం మొదలు పెట్టాడు. లేఖనాలను వివరించటం బహు కష్టమయ్యింది. ఆయనకు అది పెద్ద సమస్యగా పరిణమించింది. కాగా బైబిలును పక్కన పెట్టినా తన కొత్త నమ్మకం మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఆయనకు అందించలేకపోయింది. ఆయనలో అసంతృప్తి పెరుగుతూ ఉంది. సుమారు ఓ పుష్కరం పాటు ఈ దృక్పధాల్నే ఆయన పట్టుకొని వేళాడాడు. కాని తన ముప్పయి నాలుగో ఏట తాను పాపినన్న సృహ ఆయనకు పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. తన పూర్వ నమ్మకం సమాధికి ఆ పక్క ఆనందమయ జీవితం ఉన్నదన్న అభయం ఇవ్వటంలేదు. భవిష్యత్తు చీకటిమయం అయ్యింది. ఈ సమయంలో తన మనోభావాలను గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా అంటున్నాడు!GCTel 295.4

  “సర్వనాశనం తథ్యమన్నది గుండెల్లో గుబులు పుట్టించే తలంపు. జవాబుదారీ తనాన్ని బట్టి అందరికీ వినాశనం తప్పదు. మీది ఆకాశం కంచుగాను, పాదాల కింది భూగోళం ఇనుముగాను కనిపించాయి. నిత్యత్వం అంటే ఏమిటి? మరణం ఎందుకు? తలంచే కొద్దీ అవగాహన దూరమైపోయింది. ఎంత ఎక్కువ తలస్తే నా భావాలు అంత చెల్లాచెదురై పోయాయి. ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాను. కాని నా తలంపులు నా అదుపులో లేకుండాపోయాయి. నిజానికి నేను దిక్కులేని వాడినయ్యాను. దానికి కారణమేంటో గ్రహించలేకపోయాను. ఏదో గొణుగుకొన్నాను. ఏవో నిందలు వేశాను. ఎవరిగురించో, ఎవరిమీదో తెలిసింది కాదు. పొరపాటు ఉందని గుర్తించాను. అయితే ధర్మమేదో అదెక్కడ లభిస్తుందో తెలియలేదు. దుఃఖించాను. ఆశాకిరణం కనిపించలేదు. ఈ మానసిక స్థితిలో కొన్ని మాసాలు గడిచాయి. హఠాత్తుగా రక్షకుడు యేసు ప్రవర్తన నా మనసుపై చెరగని ముద్ర వేసుకొంది. మన అతిక్రమాలకు ప్రాయశ్చిత్తం చెల్లించి తద్వారా మనకు పాపవిముక్తి కలిగించే నీతిమంతుడు కరుణామయుడు ఉండవచ్చుననిపించింది. అలాంటి వ్యక్తి ఎంతో సౌమ్యుడై ఉంటాడని భావించాను. ఆయన కౌగిల్లో నేను చేరవచ్చునని ఆయన కరుణ మీద విశ్వాసముంచ వచ్చునని భావించాను. ఇకపోతే అలాంటి వ్యక్తి ఉన్నాడన్నది ఎలానిర్ధారణ అవుతుందన్నదే సమస్య. అలాంటి రక్షకుణ్ణి గురించిగాని లేదా భావి జీవితం గురించిగాని బైబిలులో తప్ప మరెక్కడా ఎలాంటి ఆధారమూ నాకు కనిపించలేదు... అన్నాడు.GCTel 296.1

  “నాకు అనసరమైన రక్షకుడిని బైబిలు నా దృష్టి పథంలోకి తీసుకువస్తున్నట్లు చూశాను. పతనమైన ప్రపంచ అవసరాలను సంపూర్తిగా తీర్చేందుకు ఆవేశపూరితంకాని పుస్తకం ఎలా సూత్రాలను రూపొందిస్తుందని దిగ్ర్భాంతి చెందాను. లేఖనాలు దేవుడు బయలుపర్చగా కలిగినవని బలమైన నమ్మకం ఏర్పడింది. లేఖన పఠనం నాకు అమితానందాన్నిచ్చింది. యేసులో మిత్రుణ్ణి కనుగొన్నాను. ఆయన పదివేలమందిలో గుర్తుపట్టగలిగిన వాడయ్యాడు నాకు. క్రితం అగమ్యంగా పరస్పర విరుద్ధంగా కనిపించిన లేఖనాలు ఇప్పుడు నా పాదాలకు దీపంగాను నా తోవకు వెలుగుగాను మారాయి. నా మనసు సిరపడింది, తృప్తి చెందింది. జీవిత సముద్రం మధ్య ప్రభువైన దేవుడు నాకు శిలగా నిలిచాడు. ఇప్పుడు బైబిలు పఠనం నాకు ప్రధాన విషయపుయ్యింది. అంతులేని ఆనందంతో బైబిలును పరిశోధించాను. అందులో సగం నాకు తెలియదని తేలింది. వాక్యంలోని సౌందర్యాన్ని, ఔన్నత్యాన్ని ఇంతకు ముందు ఎందుకు చూడలేదా అని విచారించాను. చూస్తే వాక్యాన్ని ఎన్నడూ నిరాకరించి ఉండేవాడ్ని కాదని తలంచాను. నా మనసు ఆకాంక్షించేదంతా దైవ వాక్యం బయలుపర్చుతున్నట్లు గుర్తించాను. ఆత్మను క్షోభింపజేసే ప్రతీ వ్యాధికి ఔషధం కనుగొన్నాను. ఇతర పుస్తకాల పఠనం రుచించలేదు. దైవవాక్యం నుంచి వివేకం సంపాదించటంపై మనసు లగ్నం చేశాను” -ఎస్ బ్లిస్ మెమోర్స్ ఆఫ్ విల్యమ్ మిల్లర్, పుటలు 65-67.GCTel 297.1

  తాను క్రితం తృణీకరించిన మతాన్ని మిల్లర్ ఇప్పుడు బహిరంగంగా స్వీకరించాడు. అయితే లేఖనాలు దైవ ప్రేరణవల్ల కలిగినవి కావంటూ గతంలో తాను లేవనెత్తిన వాదనలనే తన నాస్తిక మిత్రులు మిల్లర్ కి వ్యతిరేకంగా లేవదీశారు. వారికి వెంటనే సమాధానం చెప్పలేదు. బైబిలు దేవుని మూలంగా కలిగినదైతే అందులో వైరుధ్యాలేమీ ఉండవని, అది మనుషులకు ఉపదేశం అందించేందుకు కలిగింది గనుక దాన్ని తాను అవగాహన చేసుకోవటం సాధ్యమేనని మిల్లర్ తలంచాడు. తనంతటతానే లేఖనాలను అధ్యయనం చేసి వైరుధ్యాలుగా కనిపిస్తున్న అంశాలను సమన్వయ పర్చటానికి పూనుకొన్నాడు.GCTel 297.2

  తన పూర్వాభిప్రాయాల్ని పక్కన పెట్టి వ్యాఖ్యానాల వంక చూడకుండా మార్జీనులో ఉన్న అంశాలు కంకార్డెన్స్ సహాయంతో మిల్లర్ లేఖనంతో లేఖనాన్ని పోల్చుతూ పఠించాడు. క్రమాన్ని పద్ధతిని అనుసరించి తన అధ్యయనాన్ని నిర్వహించాడు. ఆదికాండంతో ఆరంభించి వచనం వెంబడి వచనం పఠించాడు. ఆ వచనాల భావాన్ని చక్కగా అవగతం చేసుకొన్నప్పుడు ముందుకు సాగేవాడు. తన అధ్యయనంలో స్పష్టత లోపించిన అంశం దసులైతే ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్న ఇతర వచనాలతో దాన్ని సరిపోల్చే వాడు. వచనం ప్రస్తావిస్తున్న అంశంతో ప్రతీ మాటకున్న సంబంధాన్ని వ్యక్తం కానిచ్చేవాడు. అంశంపై తన అభిప్రాయం ఆ అంశానికి సంబంధించిన ప్రతీ వాక్యభాగంతో ఏకీభవించటంతో సమస్య తొలిగిపోయేది. ఇలా అర్ధంకాని వాఖ్యభాగం ఎప్పుడు తారసపడినా దానికి వివరణ తక్కిన లేఖన భాగాల్లో కనుగొనే వాడు. దైవ జ్ఞానం కోసం ప్రార్ధన పూర్వకంగా అధ్యయనం చేసినప్పుడు క్రితంలో గ్రాహ్యంకాని విషయం తేటతెల్లమయ్యేది. కీర్తనకారుడి ఈ మాటలలోని సత్యాన్ని ఆయన అనుభవ పూర్వకంగా గ్రహించాడు. “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును” కీర్తనలు 119:130.GCTel 297.3

  ఇతర లేఖనాల వివరణలో వినియోగించిన సూత్రాలనే వినియోగించి దానియేలు, ప్రకటన గ్రంథాల్ని అత్యాసక్తితో పఠించి ప్రచనాల్లోని గుర్తుల్ని గ్రహించటం సాధ్యమేనని తెలుసుకొని ఆనందించాడు. నెరవేరిన ప్రవచనాలను పరిశీలించి వాటి నెరవేర్పు జరిగినంత మేరకు అవి అక్షరాలా నెరవేరాయని, వాటిలోని వివిధ చిహ్నాలు, రూపకాలు, ఉపమానాలు, సాదృశ్యాల వివరణ ఆ సమయ సందర్భాల్లో చోటు చేసుకోటమో లేక వాటి వ్యక్తీకరణ జరిగిన ఇతర లేఖనాల్లో నిర్వచితమవ్వడమో జరుగుతుందని అలా జరిగినప్పుడు వాటిని అక్షరాల అవగాహన చేసుకోవాలని భావించాడు. “బైబిలు ప్రకటితమైన సత్యాల వ్యవస్థ అని ఆ సత్యాలు మందమతి అయిన రక్షణ బాటసారికూడ పొరపాటు పడటానికి ఆస్కారం లేనంత స్పష్టంగా సామాన్యంగా ఉన్నవని నేను తృప్తి చెందాను” అంటున్నాడు ఆయన- బిస్, పుట 70. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రవచనాల్ని వెదకి తెలుసుకొన్నప్పుడు సత్యమనే గొలుసులోని లింకులు ఒకదాని తర్వాత ఒకటి ఆయనకు బయలు పడ్డాయి. పరలోక దూతలు ఆయన మనసును అదుపుచేసి లేఖనాలు గ్రహించటానికి ఆయనకు సహకరించారు.GCTel 298.1

  నెరవేరాల్సి ఉన్న ప్రవచనాలను పరిశీలించటానికి అప్పటిదాకా నెరవేరిన ప్రవచనాల నెరవేర్పు తీరును ప్రమాణంగా తీసుకొని లోకం అంతానికి పూర్వం వెయ్యేళ్ల పాటు క్రీస్తు తాత్కాలికంగా లోకంలో ఆధ్యాత్మిక పరిపాలన చేస్తాడన్న సామాన్య ప్రజాభిప్రాయాన్ని వాక్యం సమర్ధించటం లేదని ఆయన గ్రహించాడు. ప్రభువు రావటానికి ముందు లోకంలో ఉండే వెయ్యేళ్ల నీతి, శాంతి సమాధానాల కాలానికి సంబంధించిన ఈ సిద్ధాంతం దేవుని దినాన సంభవించనున్న భయంకర సంగతులను ఇంకా కొంత కాలం వాయిదా వేస్తున్నది. ఇది ఆనందించదగిన విషయమే. అయినా కోత సమయం వరకూ గోధుమలు, గురుగులు కలిసి పెరుగుతాయని, “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు...అంతకంతకు చెడిపోవుదురు” అని “అంత్యకాలములలో అపాయకరమైన కాలములు వచ్చునని” ప్రభువు రాకడ వరకూ చీకటి రాజ్యం కొనసాగుతుందని, ఆయన రాకడలోని ప్రచండ కాంతి వలన ఆయన నోటి ఊపిరివలన అది నాశనమౌతుందని లోకాంతాన్ని సూచిస్తూ క్రీస్తు, అపోస్తలులు బోధించిన బోధనకు ఇది విరుద్ధం. మత్తయి 13:30,3841; 2 తిమోతి 3:13, 1:2, థెస్స 2:8.GCTel 298.2

  లోకం మారుమనసు పొందుతుంది. క్రీస్తు నీతి రాజ్యం స్థాపిత మౌతుంది అన్నది అపోస్తలుల సంఘ విశ్వాసం కాదు. పద్దెనిమిదో శతాబ్దారంభం వరకూ క్రైస్తవులు ఈ నమ్మకాన్ని అంగీకరించలేదు. తక్కిన దోషాలమల్లే దీని పర్యవసానం కూడా చెడ్డదే. క్రీస్తు రాక భవిష్యత్తులో ఎప్పుడో సంభవిస్తుందని ప్రజలకు బోధించి ఆ రాక సామీప్యాన్ని, సూచించే గుర్తుల్ని లెక్కజేయకుండా సాగిపోటానికి ఇది ప్రజలను తప్పుదారి పట్టించింది. ఇది ఒక విధమైన ఆత్మ విశ్వాసాన్ని భద్రతాభావాన్ని కలిగించి తద్వారా ప్రభువును కలుసుకోటానికి అవసరమైన సిద్దబాటు చేసుకోకుండా అనేక మందిని పక్కదారి పట్టించింది.GCTel 299.1

  క్రీస్తు వ్యక్తిగతంగా రావటం అక్షరాలా నిజమని లేఖనాలు బోధిస్తున్నట్లు మిల్లర్ కనుగొన్నాడు. “ఆర్భాటముతోను ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును” (1 థెస్స 4:16) అంటున్నాడు పౌలు. రక్షకుడు యేసు ఇలా అంటున్నాడు, “అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి... వారు రొమ్ము కొట్టుకొందురు” “మెరుపు తూర్పున పుట్టి పడమరకు ఎలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును” మత్తయి 24:30, 27 ఆయన వెంట పరలోక నివాసుల సమూహాలు వస్తాయి. “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును” వస్తారు. మత్తయి 25:31.GCTel 299.2

  మరణించిన నీతిమంతులు ఆయన వచ్చేటప్పుడు పునరుత్థానులవుతారు. జీవిస్తున్న నీతిమంతులు అక్షయులుగా మార్పు చెందుతారు. పౌలు అంటున్నాడు, “ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మన మందరము నిద్రించముగాని నిమిషములో, ఒక రెప్పపాటున కడ బూర మ్రోగగానే మన మందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసి యున్నది. మర్యమైన యీ శరీరము అమర్యతను ధరించుకొనవలసి యున్నది.” 1 కొరిథి 15:5153. ప్రభువు రాకడను వివరించిన అనంతరం థెస్సలొనీకయులకు తాను రాసిన ఉత్తరాల్లో ఇంకా పౌలిలా అంటున్నాడు, “ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.” 1 థెస్స4:16,17.GCTel 299.3

  క్రీస్తు వ్యక్తిగత ఆగమనం చోటు చేసుకొనే వరకూ ఆయన ప్రజలకు పరలోక రాజ్యం లభించదు. రక్షకుడంటున్న ఈ మాటలు గమనించండి, “తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయ బడుదురు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెటును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రిచేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కోరకు సిద్ధపరచ బడిన రాజ్యమును స్వతంత్రించు కొనుడి“ మరణించిన నీతిమంతులు అక్షయత ధరించి లేస్తారని, జీవిస్తున్న నీతిమంతులు మార్పు పొందుతారని పై లేఖనాల్ని బట్టి మనం తెలుసుకొంటున్నాం. ఈ గొప్ప మార్పు కారణంగా పరలోకరాజ్యం అందుకోటానికి వారు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే, పౌలు అంటున్నట్లు “రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు” 1కొరింథి 15:50. తన ప్రస్తుత స్తితిలో మానవుడు మర్త్యుడు,క్షయుడు. అయితే దేవుని రాజ్యం అక్షయమైనది. నిత్యము నిల్చేది. అందుచేత మానవుడు తన ప్రస్తుత స్థితిలో దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కాకపోతే క్రీస్తు వచ్చినప్పుడు తన ప్రజలకు అమర్త్యత నిస్తాడు. ఆమీదట తాము వారసత్వం కలిగి ఉన్న రాజ్యాన్ని స్వతంత్రించు కోవాల్సిందిగా వారిని ఆయన ఆహ్వానిస్తాడు.GCTel 300.1

  క్రీస్తు రాకకు ముందు సంభవించాల్సి ఉన్న విశ్వవ్యాప్త శాంతి, భూమిపై దేవుని రాజ్యం వంటి సంఘటనలు రెండో రాకడ తదుపరి చోటుచేసుకోనే కార్యాలని ఇవీ ఇంకా ఇతర లేఖనాలూ మిల్లర్ కి సుస్పష్టం చేశాయి. పైగా కాల సూచనలు, లోకపరిస్థితిని చూస్తూవుంటే ప్రవచనం వివరిస్తున్న చివరి దినాలు ఇవే అనిపించింది. ప్రస్తుత స్థితిలో లోకం చరమాంకానికి దాదాపు సమయమయ్యిందని తన లేఖన అధ్యయనం నుంచి మిల్లర్ నిర్ధారించాడు.GCTel 300.2

  “నా మనస్సును బాధించిన ఇంకో రకమైన నిదర్శనం లేఖనాల్లోని వంశావళి... గతంలో నెరవేరిన ప్రవచిత సంఘటనలు తరచు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో నెరవేరినట్లు కనుగొన్నా ను. జలప్రళయానికి ముందు నూట ఇరవై ఏళ్ళు (ఆది. 6:3) దానికి ముందు ఏడు రోజుల వ్యవధి, అంతట ప్రవచితమైన నలభై దినాల వర్షం ( ఆది7:4) అబ్రాహాము సంతతి నాలుగు వందల సంవత్సరాలు పరదేశవాసం(ఆది 15:13) పానదాయకుడు, భక్ష్యకారుల మూడు దినాల కలలు (ఆది 40:1220) ఫరో ఏడు సంవత్సరాలు (ఆది 41:2654) అరణ్యంలో నలభై సంవత్సరాలు (సంఖ్యా 14:34) మూడున్నర సంవత్సరాల కరవు (1రాజులు 17:1) లూకా 4:25) బానిసత్వం (యిర్మీయ 25:11) చూడండి. నెబుకద్నెజరు ఏడు కాలాలు (దాని 4:1316), యూదులకు ఏర్పాటైన డబ్బయి వారాలు (దాని 9:2427) ఇవన్నీ ప్రవచనాలే. ప్రవచితమైనట్లే ఇవి నెరవేరాయి.” బ్లిస్, పుటలు 74,75.GCTel 301.1

  తన బైబిలు అధ్యయనంలో తన అవగాహన మేరకు కాలక్రమానుసార సమయాలు క్రీస్తు రెండోరాకడ వరకు విస్తరిస్తాయని కనుగొన్నప్పుడు అవి దేవుడు తన సేవకులకు బయలు పర్చిన నిర్ణయ కాలాలు” అని మిల్లర్ పరిగణించాల్సి వచ్చింది. “రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే... బయలుపర్చబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతివారివియు నగుసు” అని మోషే అంటున్నాడు. “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలు పరచకుండ ప్రభువైన యెహావా యేమియు చేయడు” అని ఆమోసు ద్వారా ప్రభువు సెలవిస్తున్నాడు. ద్వితీ. 29:29; ఆమోసు 3:7. కనుక మానవ చరిత్రలో చోటు చేసుకోనున్న బ్రహ్మాండమైన ఘటనను లేఖనాలు స్పష్టంగా సూచిస్తున్నట్టు లేఖన విద్యార్థులు గుండెలపై చేయివేసుకొని చెప్పవచ్చు. GCTel 301.2

  “దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ప్రయోజనకరమైనదని, (2తిమోథి3:16) అది మనుషుని ఇచ్చనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి (2 పేతురు 1:21) “లేఖనముల వలను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వము వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగునిమిత్తము వ్రాయబడియున్నవని (రోమా 15:4) నేను సంపూర్తిగా గుర్తించినప్పుడు బైబిలులోని కాలక్రమానుసార భాగాలు కూడా బైబిలులో అంతర్భాగాలని ఇతర లేఖనాలమల్లేనే వీటిని కూడా మనం పరిగణించాలని నేను భావించాను. కృపగల దేవుడు మనకు ఏది బయలు పర్చటానికి ఉచితమని భావిస్తున్నాడో దానిని అవగాహన చేసుకోటంలో ప్రవచన కాలవ్యవధుల్ని విస్మరించే హక్కు నాకు లేదని భావించాను” - బ్లిన్, పుట 75.GCTel 301.3

  రెండోరాక సమయాన్ని విస్పష్టంగా బయలు పర్చుతున్న ప్రవచనం దానియేలు 8:14. “రెండువేల మూడువందల దినముల మట్టుకేయని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును.” లేఖనమే లేఖనార్థాన్ని చెబుతుంది అన్న తన సూత్రాన్ననుసరించి చిహ్నరూపక ప్రవచనంలో ఒక దినం ఒక సంవత్సరమని (సంఖ్యా 14:34; యెహె 4:6) మిల్లర్ తెలుసుకొన్నాడు. రెండువేల మూడువందల ప్రావ చనిక దినాలు లేదా సంవత్సరాలు యూదు పాలన కాలానికి మించి కొనసాగుతాయని అందుచేత అది ఆ కాలంనాటి ఆలయానికి వర్తించటం అసంభవమని మిల్లర్ భావించాడు. క్రైస్తవ శకంలో లోకమే ఆలయమున్న సామాన్య అభిప్రాయాన్ని మిల్లర్ అంగీకరించాడు. అందుచేత దానియేలు 8:14 లో ప్రవచితమైన ఆలయ శుద్ధీకరణ రెండోరాక సమయంలో అగ్నిచేత లోకం శుద్ధీకరణ కార్యాన్ని సూచిస్తోందని మిల్లర్ అభిప్రాయపడ్డాడు. అందుకని రెండువేల మూడువందల దినాలకు నిర్దిష్టమైన ప్రారంభాన్ని కనుగొంటే క్రీస్తు రెండోరాకడ సమయాన్ని సులభంగా నిర్ధారించవచ్చు ననుకొన్నాడు. లక్ష్యసిద్ధి కలిగే ఆ మహోజ్వల సమయం ఇలా ప్రకటితమౌతుంది. అహంకారం, అధికారం, డంబం, ఆడంబరం, దుర్మార్గత, హింసతో కూడిన ప్రస్తుత కాలం అంతమొందుతుంది.” - బ్లిస్, పుట 76.GCTel 302.1

  మిల్లర్ నూతనోత్సాహంతో ప్రవచన పరిశీలనను మొదలు పెట్టాడు. ఇప్పుడు తనకు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్న అధ్యయనంలో రేయింబగళ్లు గడిపాడు. 2300 దినాల ఆరంభానికి దానియేలు ఎనిమిదో అధ్యాయంలో ఎలాంటి ఆధారమూ ఆయనకు దొరకలేదు. ఆ దర్శనాన్ని గ్రహించటానికి దానియేలుకు తోడ్పడేందుకు గాబ్రియేలు దూత నియమితుడైనప్పటికీ ఆయన దానియేలుకు పాక్షిక వివరణనను మాత్రమే ఇచ్చాడు. సంఘంపై విరుచుకు పడనున్న హింసాకాండను దర్శనంలో ప్రవక్త తిలకించగా ఆయన శక్తి సన్నగిల్లింది. ఆయన అది భరించలేకపోయాడు. దూత ఆయనను కొద్దిసేపు విడిచి వెళ్లాడు. దానియేలు మూర్చిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు.” “ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుప గలవాడెవడును లేకపోయెను” అన్నాడాయన.GCTel 302.2

  అయినా “యీ దర్శన భావమును ఇతనికి తెలియజేయు”మన్నది దేవుని ఆదేశం. ఆ ఆదేశం నెరవేరాలి. అందుకు అనుగుణంగా దూత కొంతకాలం దరిమిలా దానియేలు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, “దానియేలూ, నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని” కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము.” దానియేలు 8:27,16;9:22; 23, 2527. ఎనిమిదో అధ్యాయంలోని దర్శనం సందర్భంగా వివరణ దొరకని ముఖ్య విషయం ఒకటి మిగిలిపోయింది. అదే 2300 దినాల వ్యవధిని గూర్చిన సమయం. కనుక దూత దర్శన భావాన్ని బోధ పర్చటానికి పూనుకొన్నప్పుడు ప్రధానంగా ఈ సమయాన్ని గూర్చి ప్రస్తావిస్తున్నాడు.GCTel 303.1

  “నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను. యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలు కొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడువారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొండర గల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును. ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును... అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపి వేయును”GCTel 303.2

  ఎనిమిదో అధ్యాయములోని దర్శనంలో “రెండువేల మూడువందల దినముల మట్టుకే ... అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును” అన్న వాక్యంలోని సమయం దానియేలుకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేకించి దూత నియుక్తుడయ్యాడు. “సంగతిని తెలుసుకొని దర్శన భావమును గ్రహించుమని దానియేలుకు చెప్పిన మీదట దూత పలికిన మొట్టమొదటి మాటలు ”నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధించబడినవి” అన్నమాటలు “విధించబడెను”గా ఇక్కడ అనువాదమైన పదానికి “ప్రత్యేకించెను” అని అర్ధము. 490 సంవత్సరాలను సూచించే డెబ్బయి వారాలు యూదులకోసం ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. 8 వ అధ్యాయంలో పేర్కొంటున్న కాలం 2300 దినాల కాలమే గనుక డెబ్బయి వారాలు ఈ కాలవ్యవధి నుంచే ప్రత్యేకంగా ఏర్పాటై ఉండాలి. కాబట్టి ఈ డెబ్బయి వారాలు 2300 దినాలలో భాగమై ఉండాలి. ఈ రెండు కాలవ్యవధులు కలిసి ఉండాలి. యెరూషలేము పునరుద్ధరణకు ఆదేశం జారీ అవ్వటంతో డెబ్బయి వారాల కాలం ఆరంభమౌతుందని దూత పలికాడు. ఈ ఆదేశానికి ఆరంభ తేది కనుగోటం జరిగితే 2300 దినాల కాలం ఆరంభం కనుగోటం ఏమాత్రం కష్టం కాదు.GCTel 303.3

  ఈ ఆదేశం ఎజ్రా ఏడో అధ్యాయం 12-26 వచనాలలో ఉంది. క్రీ. పూ. 454 లో పర్యా దేశపు రాజు అర్తహషస్త ఈ ఆదేశాన్ని జారీచేశాడు. చకోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారశీక దేశపు రాజుల ఆజ్ఞచొప్పున” దైవ మందిరం నిర్మితి అయినట్లు ఎజ్రా 6:14 ఉన్నది. ఈ ఆదేశాన్ని రూపకల్పన చేయటంలోను, ధ్రువీకరించటంలోను, పూర్తిచేయటంలోను ప్రవచనం కోరుతున్న పరిపూర్ణత్వాన్ని సమకూర్చుతూ 2300 సంవత్సరాల ఆరంభానికి ఈ ముగ్గురు రాజులు తోడ్పడ్డారు. ఈ ఆదేశం జారీ అయిన కాలంగా క్రీ.పూ. 457 వ సంవత్సరాన్ని తీసుకొంటే డెబ్బయి వారాల సందర్భంగా ప్రవచనం పేర్కొంటున్న ప్రతి వివరమూ నెరవేరినట్లు కనిపించింది.GCTel 304.1

  “యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలు కొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును కట్టబడును” - అనగా అరవైతొమ్మిది వారాలు లేదా 483 సంవత్సరాలు. అర్తహషస్త ఆదేశం క్రీ. పూ.457 శరత్కాలంలో అమలయ్యింది. ఈ నాటి నుంచి 483 సంవత్సరాల కాలం క్రీ. శ. 27 పరకు సాగింది. ఆ సమయాన ఈ ప్రవచనం నెరవేరింది. “మెస్సీయ” అన్న పదానికి “అభిషిక్తుడు” అని అర్ధం. క్రీ.పూ. 27న క్రీస్తు యోహాను వల్ల బాప్తీస్మం పొంది ఆత్మాభిషేకం పొందాడు. “దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, శక్తితోను అభిషేకించెను” అంటూ అపోస్తలుడు పేతురు సాక్ష్యమిస్తున్నాడు. అ.కా.10:38. స్వయంగా రక్షకుడైన క్రీస్తే ఇలా ప్రకటించుకొన్నాడు, “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడి వారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ” లూకా 4:18. తన బాప్తిస్మం అనంతరం “కాలము సంపూర్ణమైయున్నది. దేవుని రాజ్యము సమీపించియున్నది. ” అని బోధిస్తూ యేసు గలిలయకు వెళ్లాడు. మార్కు 1:15.GCTel 304.2

  “అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును” ఇక్కడ ప్రస్తావించిన “వారము” డెబ్బయి వారాల్లో చివరిది. యూదులకు ప్రత్యేకంగా ఏర్పాటైన కాలంలోని చివరి ఏడు సంవత్సరాలు. క్రీ.శ. 27-34 మధ్యకాలంలో క్రీస్తు వ్యక్తిగతంగాను అనంతరం తన శిష్యుల ద్వారాను ప్రత్యేకంగా యూదులకు సువార్త ఆహ్వానాన్ని అందించాడు. దేవుని రాజ్య సువర్తమానంతో వెళ్ళిన అపోస్తలులకు రక్షకుడు ఈ సూచన చేశాడు, “మీరు అన్యజనుల దారి లోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొట్టెల యొద్దకే వెళుడి” మత్తయి10:5,6. “అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును” క్రీ. శ. 31 లో తన బాప్తిస్మం అయిన మూడున్నర సంవత్సరాలకు మన రక్షకుడు సిలువ మరణం పొందాడు. రానున్న దేవుని గొర్రె పిల్లను సూచిస్తూ నాలుగువేల సంవత్సరాలు ఆచరణలో ఉన్న బల్యర్పణ వ్యవస్థ కల్వరిలో జరిగిన బలిదానంతో అంతమొందింది. ముంగురుతు వాస్తవాన్ని కలిసినప్పుడు ఆచార ధర్మశాస్త్రంలోని బల్యర్పణలు నైవేద్యాలు అంతం కావలసి ఉన్నాయి.GCTel 304.3

  యూదులకు ప్రత్యేకంగా ఏర్పాటయిన డెబ్బయి వారాలు లేదా 490 సంవత్సరాలు క్రీ.శ. 34 లో అంతమైనట్లు మనం తెలుసుకొన్నాం. ఆ తరుణంలో యూదు సెహెడ్రైన్ తీసుకొన్న చర్యల ద్వారా అనగా స్టెఫస్ మరణం, క్రీస్తు అనుచరుల హింస ద్వారా యూదు జనాంగం సువార్తను తిరస్కరించింది. ఇక రక్షణ వర్తమానం ఎంపిక అయిన జనాంగమైన యూదులకే పరిమితం కాకుండా లోకానికి ప్రకటితమయ్యింది. హింస కారణంగా యెరూషలేమునుంచి పారిపోయిన శిష్యులు “సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి” “అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ” కైసరయలో శతాధిపతి దైవ భక్తుడు అయిన కొర్నేలీకి పేతురు సువార్త అందించాడు. పట్టుదలకు మారుపేరైన పౌలు క్రైస్తవుడయ్యాడు. “దూరముగా అన్యజనుల యొద్దకు” సువర్తమానం తీసుకు వెళ్లటానికి దేవుడు ఆయనకు పిలుపునిచ్చాడు అ.కా. 8:4,5; 22:21.GCTel 305.1

  ఇప్పటి వరకు ప్రవచనాల్లోని ప్రతీ వివరం నెరవేరింది. డెబ్బయి వారాల కాలం క్రీ. పూ. 457లో ప్రారంభమై క్రీ. శ. 34 లో ముగిసిందన్నది నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారం ఆధారంగా 2300 దినాల సమాప్తిని కనుగొనటం ఏమంత కష్టం కాదు. డెబ్బయి వారాలు లేదా 490 దినాలు 2300 దినాల్లో నుంచి తీసివేస్తే 1810 దినాలు మిగిలి ఉంటాయి. 490 దినాలు ముగిసిన తరువాత 1810 దినాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నాయి. క్రీ.శ. 34 నుంచి 1810 సంవత్సరాలు 1844 వరకు కొనసాగుతాయి. అందునుబట్టి దానియేలు 8:14లోని 2300 దినాలు 1844లో సమాప్తమౌతున్నాయి. ఈ గొప్ప ప్రవచన కాలాంతంలో దేవుని దూత సాక్ష్యం ప్రకారం “ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును” ఆలయ పవిత్రతను గూర్చిన సమయం - ఇది క్రీస్తు రెండోరాక సమయంలో జరుగుతుందని లోకమంతా నమ్ముతున్నది.. కచ్చితంగా వ్యక్తమౌతున్నది.GCTel 305.2

  2300 దినాలు 1844 సంవత్సర గ్రీష్మకాలంలో అంతమొందుతాయని మిల్లర్ ఆయన సహచరులు మొట్టమొదట విశ్వసించారు. అయితే ప్రవచనం సూచిస్తున్నది అదే సంవత్సరం శరత్కాలంలో. ఈ అంశాన్ని అపార్థం చేసుకున్నందువల్ల ప్రభువు రాకకు క్రితం తేదీని నిర్ణయించుకొన్న వారికి ఆశాభంగం, ఆందోళన ఎదురయ్యాయి. కాగా 2300 దినాలు 1844 లో ముగిశాయి. ఆలయ పవిత్రతకు సంకేతంగా ఉన్న సంఘటన ఇక జరగాల్సి ఉన్నది అన్న వాదనకు బలం ఏమాత్రం తగ్గలేదు.GCTel 306.1

  లేఖనాలు దేవుడు బయలు పర్చటం వల్ల కలిగాయని నిరూపించే ఉద్దేశంతో మిల్లర్ లేఖన అధ్యయనానికి పూసుకొన్నాడు. ఇప్పుడు తనకు కలిగిన నిశ్చితాభిప్రాయం ఏర్పడుతుందని మిల్లర్ ఆరంభంలో ఊహించలేదు. తన పరిశీలన ఫలితాలు మిల్లర్ని విస్మయపర్చాయి. లేఖన నిదర్శనం కాదనలేనంత స్పష్టంగా బలంగా ఉన్నట్లు కనుగొన్నాడు.GCTel 306.2

  మిల్లర్ దీక్షగా రెండు సంవత్సరాలు బైబిలు అధ్యయనంలో గడిపాడు. 25 సంవత్సరాల్లో క్రీస్తు తన ప్రజలను విమోచించేందుకు వస్తాడని 1818 లో మనసారా నమ్మాడు. మిల్లర్ ఇలా అన్నాడు, “ఆ ఆనందమయమైన సమయాన్ని గూర్చి ఆలోచించినప్పుడు నాలో వెల్లివిరిసిన ఉత్సాహం అంత ఇంతకాదు. రక్షణ పొందిన వారి ఆనందంలో పాలు పంచుకోవాలన్న ప్రగాఢ వాంఛ నాలో పరవళ్లు తొక్కింది. ఇప్పుడు నాకు బైబిలు ఒక నూతన గ్రంథం. అది నా మస్తిష్కానికి నిజమైన విందు భోజనం. దాని బోధనల్లోని అస్పష్ట సంగతులు, మర్మ విషయాలు ఇప్పుడు నా మనసుకు తేటతెల్లమయ్యాయి. దైవగ్రంథం నుంచి వచ్చిన స్పష్టమైన వెలుగే ఇందుకు కారణం.ఆహా! సత్యం ఎంత ప్రకాశవంతంగా మహిమకరంగా కనిపించింది! క్రితం నాకు కనిపించిన వైరుధ్యాలు, అసంగతాలు మాయమయ్యాయి. నేను తృప్తికరంగా గ్రహించలేని అనేక వాక్యభాగాలుండేవి. ఇప్పుడవి ఎంచక్కా గ్రాహ్యమౌతున్నాయి. వాక్యం నుంచి వచ్చే ప్రకాశత క్రితం నా చీకటి మనసులో కాంతిని నింపింది. అందుచేత ఇంతకు పూర్వం నేను అనుభవించని ఆనందాన్ని లేఖన అధ్యయనం నాకిస్తున్నది.”. బిస్, పుట 76,77.GCTel 306.3

  “ఇంత స్వల్ప వ్యవధిలో నెరవేరాల్సిన గంభీర సంఘటనలను లేఖనాలు ప్రవచిస్తున్నవన్న నమ్మిక కలగటంతో మనసును కలవరపెట్టే నిదర్శనం దృష్ట్యా ప్రపంచం పట్ల నా విధి ఏమిటన్నది ఉత్పన్నమైంది.”- అదే పుస్తకం, పుట 81. తాను కనుగొన్న సత్యాన్ని ఇతరులతో పంచుకోవటం తన విధ్యుక్త ధర్మమని ఆయన భావించాడు. దుర్మార్గుల నుంచి వ్యతిరేకత ఎదురౌతుందని భావించినా తాము ప్రేమిస్తున్నామని క్రైస్తవులంతా చెప్పుకొంటున్న ప్రభువును కలుసుకోటానికి అందరూ సంబరపడ్డారన్న ఆశాభావం ఆయనలో చోటుచేసుకొంది. ఆయనకొచ్చిన భయమంతా... త్వరలో తమకు సంభవించనున్న మహిమకరమైన విడుదలను గూర్చి తలస్తూ లోతుగా పరిశీలించకుండా ప్రజలు ఈ సత్యాన్ని అంగీకరిస్తారేమో అన్నదే. తన అవగాహనలో పొరపాటున్నదేమో, ఆ కారణంగా ఇతరుల్ని తప్పుదారి పట్టిస్తున్నానేమో అన్న ఆలోచనలు ఆ సత్యాన్ని ప్రకటించకుండా చేశాయి. అందుచేత తన సమాచారాన్ని విశ్లేషణల్ని పునఃపరిశీలిస్తూ తనకు ఎదురైన ప్రతీ సమస్యను జాగ్రత్తగా పరిగణించాడు. సూర్యకిరణాల ముందు పొగమంచు మాయమయ్యేటట్లు తన అభ్యంతరాలన్నీ ఇట్టే మాయమయ్యాయి. ఇలా గడిచిన అయిదు సంవత్సరాల అనంతరం తాను నమ్ముతున్నది యధార్ధమైనదని తేలింది.GCTel 306.4

  లేఖనాలు ఇంత స్పష్టంగా బోధిస్తున్నాయని తాను నమ్ముతున్న సత్యాన్ని ఇతరులకు పంచాలి అన్న కోరిక ఇప్పుడు ఆయనను బలవంతం చేస్తున్నది. “నేను నా వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు, “దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదుపని దుర్మారునికి నేను సెలవియ్యగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందునుగాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేతును. అయితే ఆ దుర్మారుడు తన దుర్మారతను విడువ వలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్థతను విడువని యెడల అతడు తన దోషమును బట్టి మరణము నొందునుగాని నీవు నీ ప్రాణమును దక్కించు కొందువు.” యెహేజ్కేలు 33:8, 9. దుర్మార్గులకు గట్టిగా హెచ్చరిక చేయటం జరిగితే వారు పెద్ద సంఖ్యలో పశ్చాత్తాపం పొందుతారని వారిని హెచ్చరించకపోతే వారి రక్తానికి బాధ్యత నాదే అవుతుందని భావించాను”- బ్లిస్, పుట 92.GCTel 307.1

  ఎవరో ప్రబోధకులు తన అభిప్రాయాలు విని వాటిని ప్రచారం చేయాలని మిల్లర్ ప్రార్ధిస్తూ తన ఈ అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా వ్యక్తంచేయటం మొదలుపెట్టాడు. కాగా ఈ హెచ్చరికను ప్రజలకందించటం తన వ్యక్తిగత ధర్మమూ బాధ్యతా అన్న నమ్మకం బలం పుంజుకొంది. “వెళ్లు, దీన్ని లోకానికి చాటించు. వారు నశిస్తే దానికి నీవే జవాబుదారివి” అన్న మాటలు ఆయనకు పదేపదే వినిపిస్తున్నాయి. తొమ్మిదేళ్ళు వేచి ఉన్నాడు. ఆయన హృదయ భారం ఏమీ తగ్గలేదు. చివరికి 1831లో మొట్ట మొదటి సారిగా తన విశ్వాసానికి కారణాల్ని బహిరంగంగా వెలిబుచ్చాడు.GCTel 307.2

  ఎద్దులతో పొలం దున్నుతున్న ఎలీషా ప్రవక్త పదవి తాలుకు పిలుపు పొందినట్లు విలియమ్ మిల్లర్ నాగలి విడిచి ప్రజలకు దేవుని రాజ్య మర్మాన్ని వివరించేందుకు పిలుపుపొందాడు. భయంతో వణకుతూ తన వృత్తిని చేపట్టి తన శ్రోతలను మెట్టువెంట మెట్టుగా ప్రవచన కాలాలగుండా నడిపించి క్రీస్తు రెండోరాక వరకు తెచ్చాడు. తన ఉపన్యాసాలపై ప్రజలు చూపుతున్న ఆసక్తిని చూసినప్పుడు ఆయనలో శక్తి ఉద్రేకం రెండూ పెరిగాయి.GCTel 308.1

  ఏ ప్రజల మాటల్లో మిల్లర్ దేవుని పిలుపు విన్నాడో వారి విజ్ఞప్తి మేరకు తన అభిప్రాయాల్ని బహిరంగంగా వెలిబుచ్చటానికి అంగీకరించాడు. ఇప్పుడు ఆయన వయసు ఏభై ఏళ్లు. ముందెప్పుడూ బహిరంగంగా ప్రసంగించి యెరుగడు. తన ముందున్న మహత్కార్యానికి అసమర్చుణ్ణి అన్న భావన ఆయనను కుంగదీస్తున్నది. కాని ఆయన కృషి మొదటి నుంచీ అనేకులకు రక్షణ భాగ్యాన్నందిస్తూ వచ్చింది. ఆయన మొదటి ఉపన్యాసం మతం పట్ల గొప్ప ఆసక్తి పుట్టించింది. ఇద్దరు వ్యక్తులు మినహా పదమూడు కుటుంబాలు క్రైస్తవాన్ని స్వీకరించాయి. తక్కిన స్థలాల్లో ఉసన్యసించాల్సిందిగా ఆహ్వానాలు వచ్చాయి. ప్రతీ స్థలంలోనూ ఆయన కృషి ఫలితంగా దైవ సేవ బలోపేతమయ్యింది. పాపులు మారుమనసు పొందారు. క్రైస్తవులు ఇతోధిక సేవకు తమ్మును తాము అంకితం చేసుకొన్నారు. నాస్తికులు, అవిశ్వాసులు బైబిలును నమ్మి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. మిల్లర్ ఎవరిమధ్య పని చేశాడో వారు ఇలా సాక్ష్యమిచ్చారు, “ఇతరులకు అందుబాటులోలేని ఒక తరగతి వ్యక్తులను ఆయన చేరగలిగాడు.”. అదే పుస్తకం, పుట 138. ప్రజల మనసులను మతంలోని గొప్ప సంగతుల తట్టు తిప్పి ఆయా నగరాల్లో పెరుగుతున్న లోకాశలు శరీరేచ్ఛలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఆయన బోధ సాగింది.GCTel 308.2

  ప్రతీ పట్టణంలోను ఇరవై ముపై మంది, కొన్ని స్థలాల్లో వందలాది మంది ఆయన బోధ ఫలితంగా మారుమనసు పొందారు. అనేక పట్టణాల్లో దాదాపు ప్రొటస్టాంట్ సంఘాలన్నీ ఆయన బోధకు తలుపులు తెరిచాయి. ఆయన సేవలకు ఆహ్వానం అనేక సంఘాల నుంచి వచ్చేది. ఆహ్వానం లేకుండా ఏ సంఘంలోను ప్రసంగించకూడదన్నది ఆయన నియమం. అయినా వచ్చిన ఆహ్వానాలన్నింటిని అంగీకరించటం సాధ్య పడేదికాదు. రెండో రాకకు నిర్దిష్ట సమయం విషయంలో ఆయన అభిప్రాయాల్ని అంగీకరించని పలువురు, క్రీస్తు రాకడ సమీపంలో ఉన్నదని దానికి సిద్ధపడాల్సిన అవసరం ఉందని గుర్తించారు. కొన్ని పెద్ద పెద్ద నగరాల్లో ఆయన కృషి ఫలితంగా కొన్ని మార్పులు చోటుచేసుకొన్నాయి. సారా వ్యాపారులు ఆ వృత్తిమానుకొని తమ దుకాణాలను ప్రజలకు సమావేశ స్థలాలుగా మార్చారు. జూద గృహాలు మాయమయ్యాయి. నాస్తికులు అవిశ్వాసులు అందరికీ రక్షణ ఉంటుందనే వారు. ముష్కరులు అందరిలోను మార్పు చోటుచేసుకొన్నది. వీరిలో కొందరు ఏళ్లు తరబడి గుడి ముఖం చూడని వారు. ఆయాముతశాఖలు వివిధ నివాసగృహాల్లో దాదాపు ప్రతీ గంటకూ ప్రార్థన సమావేశాలు ఏర్పాటుచేశాయి. వ్యాపార వేత్తలు ప్రతీ మధ్యాహ్నం ప్రార్ధన సమావేశాలకు హాజరయ్యేవారు. సమావేశాల్లో అనవసరమైన ఉద్రేకం లేదు. అందరి మనసుల్లో గంభీరత రాజ్యమేలింది. పూర్వం సంస్కర్తల కృషిమల్లేనే ఆయన కృషి కూడా విశ్వాసాన్ని అవగాహనను ప్రోది చేసిందే తప్ప భావోద్రేకాలను రెచ్చగొట్టలేదు.GCTel 308.3

  మిల్లర్ బాప్టిస్ట్ సంఘ సభ్యుడు. 1833 లో సువార్త సేవకుడిగా బాప్టిస్టు సంఘం నుంచి లైసెన్స్ పొందాడు. ఆ సంఘానికి చెందిన బోధకులనేక మంది ఆయన సేవపై ఆమోదముద్రవేశారు. వారి ఆదరాభిమానాలతోనే మిల్లర్ తన సువార్త కృషిని సాగించాడు. ఆయన నిత్యం ప్రయాణాలు చేస్తూ సువార్త ప్రచారం చేశాడు. ఆయన సువార్త సేవలు ముఖ్యంగా న్యూ ఇంగ్లండు మిడిల్ రాష్ట్రాలకు పరిమితమయ్యాయి. చాలా ఏళ్లు తన ప్రయాణ ఖర్చుల్ని తానే భరించాడు. ఎక్కడికైనా ఆహ్వానితుడైనప్పుడు ఆయన ప్రయాణ ఖర్చులకు సరిపడా ద్రవ్యం ఎన్నడూ లభించలేదు. ఇలా తన బహిరంగ సేవలు ఆయనకు లాభం కూర్చకపోగా తన ఆస్తిని హరించేవిగా పరిణమించాయి. ఆయనది గంపెడు సంతానం. కుటుంబ సభ్యులంతా జాగ్రత్తపరులు శ్రమజీవులు గనుక వారి కుటుంబ వ్యవసాయం వారి భుక్తికి ఏమీ లోటు రానివ్వలేదు.GCTel 309.1

  క్రీస్తు రెండో రాకడ త్వరలోసంభవిస్తుందనటానికి నిదర్శనాలను గూర్చి మిల్లర్ బహిరంగంగా ప్రచారం చేయటం మొదలు పెట్టిన రెండేళ్ళకు అనగా 1833 లో క్రీస్తు తన రెండో రాకడ సందర్భంగా ప్రస్తావించిన సూచనల్లో చివరిది కనిపించింది. “ఆకాశము నుండి నక్షత్రములు రాలును” అన్నాడు యేసు. మత్తయి 24:29. ప్రభువు దినాన్ని వివరించే దృశ్యాన్ని దర్శనంలో చూసినప్పుడు ప్రకటన గ్రంధంలో యోహానిలా అంటున్నాడు, “పెద్దగాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను” ప్రకటన 6:13. నవంబరు 13, 1833 లో సంభవించిన ఉల్కాపాతంలో ఈ ప్రవచనం నెరవేర్పు జరిగింది. అది చరిత్రలో అతి విస్తృతమైన, విచిత్రమైన ఉల్కాపాత విన్యాసం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఆకాశ విశాలం యావత్తు గంటలు తరబడి గొప్ప శబ్దం చేసుకొంటూ బ్రహ్మాండమైన వెలుగుతో ప్రజ్వలించింది. ఈ దేశంలో మొట్టమొదటి వలస ఏర్పడ్డప్పటి నుంచీ ఆకాశంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఈ దృశ్యాన్ని ఒక వర్గం ప్రజలు అమితాశక్తితో తిలకిస్తే ఇంకో వర్గం ప్రజలు భయంతోను వణకుతోను తేరిచూశారు. “ దాని ఔనత్యం, సౌందర్యం జ్ఞాపకాలు అనేకుల హృదయాల్లో ఇంకా ఉన్నాయి... ఉల్కలు కురిసినంత దట్టంగా వర్షం ఎన్నడు కురువలేదు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నిదిశలా అది ఒకేలా వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశం యావత్తు కదులున్నట్లు అనిపించింది...GCTel 309.2

  ఆచార్య సిల్లీమెన్స్ జర్నలో అభివర్ణితమైనట్లు ఈ విన్యాసాన్ని ఉత్తర అమెరికా ప్రజలంతా తిలకించారు... రెండు గంటల నుంచి తెల్లవారే వెలుగు వచ్చేవరకు మేఘాలు లేకుండా ఆకాశం నిర్మలంగా ఉన్న వేళ ఆకాశమంతా ప్రచండ కాంతులతో ధగధగ మెరిసిపోయింది.”- ఆర్.ఎమ్. డేవన్స్, అమెరికన్ ప్రోగ్రెస్, ఆర్. ది. గ్రేట్ ఇవెంట్స్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెంచురి, అధ్యా 28, 1-5 పేరాలు.GCTel 310.1

  బ్రహ్మాండమైన ఆ విన్యాసాన్ని వర్ణించటానికి భాషలేదు...దాన్ని కళ్లారా చూసిఉండని వారు దాని ప్రాభవాన్ని ఊహించలేరు. ఆకాశ శిఖరంలో ఒక చోట ఆకాశ నక్షత్రాలన్నీ పోగుపడి మెరుపు వేగంతో దిగంతాలకు ఒకేసారి దూసుకుపోతున్నట్లు కనిపించాయి. అయినా అవి అలసిపోలేదు. వేలాది నక్షత్రాల వెంట వేవేల నక్షత్రాలు వేగంగా వెళ్తుంటే అవి ఆ సమయానికి చేసిన సృష్టిగా తోచాయి. ” ఎఫ్. రీడ్, ఇంది క్రిస్టియన్ ఎడ్వొకేట్ అండ్ జర్నల్, డిసెంబరు 13,1833. “పెద్దగాలలో చిక్కిన అత్తిచెట్టుకున్న అత్తిపళ్లు జలజలా రాలే దృశ్యం ఈ ఉల్కాపాతానికి నిర్దుష్టమైన సాదృశ్యం”- ది ఓల్డ్ కంట్రమేస్ ఇన్ పోర్ట్ లాండ్ ఈవినింగ్ ఎడ్వటైజర్, నవంబరు 26, 1833.GCTel 310.2

  నవంబరు 14,1833 న్యూయార్క్ జర్నల్ ఆఫ్ కామర్స్ అన్న పత్రికలో అద్భుతకరమైన ఈ సంఘటనను గూర్చిన వ్యాసంలో ఈ వాక్యాలున్నాయి, “నిన్న ఉదయం జరిగిన సంఘటన లాంటి సంఘటనను ఏ తత్వవేత్తగాని, విద్వాంసుడుగాని దాఖలు చేసి ఉండడను కొంటా. పద్దెనిమిది వందల ఏళ్ల క్రితం ప్రవక్త కచ్చితంగా ప్రవచించాడు నక్షత్రాలు రాల్తాయని. నక్షత్రాలు రాలటమంటే అవి నిజంగా రాలటమే.”GCTel 310.3

  “మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసి కొనుడి” (మత్తయి 24:33) అంటూ తన రాకడకు శిష్యులతో యేసు చెప్పిన సూచనల్లో చివరిది, ఇలా ప్రదర్శితమయ్యింది. ఈ సూచనల అనంతరం జరగనున్న సంఘటనగా యోహాను చూసింది ఆకాశమండలం చుట్టబడ గ్రంథంలా తొలగిపోవటం. భూమి కంపించటం. ప్రతీకొండ, ప్రతీ ద్వీపం వాటివాటి స్థానాలు తప్పటం. దుష్టులు భయకంపితులై కొండగుహల్లోను బండల సందుల్లోను మనుష్యకుమారుని సముఖమునుంచి దాగుకోవటం. ప్రకటన 6:1217.GCTel 310.4

  ఆనాడు నక్షత్రాలు రాలటాన్ని కళ్లారా చూసిన పెక్కుమంది అది రానున్న తీర్పు సూచిక అని “ఆ భయంకర దినానికి అది భయానక ప్రతీక అని, కచ్చితమైన ముంగుర్తని” భావించారు.- ది ఓల్డ్ కంట్రీ మేన్ ఇన్ పోర్ట్ లాండ్ ఈవినింగ్ ఎడ్వటైజర్, నవంబరు 26, 1833. ప్రజల దృష్టి ప్రవచనం నెరవేర్చుకు ఈ విధంగా ఆకర్షితం కావటం జరిగింది. అనేకమంది క్రీస్తు రెండోరాకడ హెచ్చరికను పరిగణించటానికి ఈ సంఘటన దారి తీసింది.GCTel 311.1

  1840 లో మరో ప్రసిద్ధ ప్రవచనం నెరవేర్పు గొప్ప సంచలనాన్ని సృష్టించింది. రెండో రాకను గూర్చి బోధించే ప్రముఖ బోధకుల్లో ఒకడైన జోషయ లిచ్ ప్రకటన 9 వ అధ్యాయంపై ఒక వ్యాసం ప్రచురించాడు. ఆ వ్యాసంలో ఓటమన్ సామ్రాజ్య పతనాన్ని ప్రవచించాడు. ఆయన లెక్కల ప్రకారం ఈ సామ్రాజ్యం క్రీ.శ. 1840 ఆగస్టు మాసంలో పతనమవ్వనుంది. దీని నెరవేర్పుకు కొద్ది దినాలముందు ఆయన ఇలా రాశాడు, “టర్కుల అనుమతితో డికోజిస్ సింహాసనాన్ని అధిష్టించక ముందు 150 ఏళ్ల మొదటి కాలం కచ్చితంగా నెరవేరిందని, మొదటి కాలం అంతంలో 391 సంవత్సరాల పదిహేను దినాలు ఆరంభమయ్యాయని అంగీకరిస్తే ఓటమన్ రాజ్యం 1840 ఆగస్టు 11న అంతమొందనుంది. కాన్ స్టాంటినోపుల్ లోని ఓటమన్ సామ్రాజ్యం అప్పుడు అంతమౌతుంది. ఇది జరుగుతుందన్నది నానమ్మకం” జోషయ లిచ్, ఇన్ సైన్స్ ఆఫ్ ది టైమ్స్ అండ్ ఎక్స్పో సిటర్ ప్రోఫసి, ఆగస్టు 1, 1840.GCTel 311.2

  నిర్దిష్ట సమయంలో టర్కీ తన రాయబారి ద్వారా ఐరోపా మిత్రరాజ్యాల సంరక్షణను అంగీకరించి తద్వారా క్రైస్తవ రాజ్యాల నియంత్రణకు తన్నుతాను సమర్పించుకొంది. ఈ ఘటన ప్రవచనాన్ని కచ్చితంగా నెరవేర్చింది. ఇది అందరికీ తెలిసినప్పుడు మిల్లర్, ఆయన సహచరులు అనుసరించిన ప్రవచన వివరణ సూత్రాలు సరిఅయినవని వేలాది ప్రజలు గుర్తించారు. రెండో రాకడ ఉద్యమానికి ఇది ఉత్సాహోదైకాలను సమకూర్చింది. సువార్త ప్రచారంలోను, సాహిత్య ప్రచురణలోను విద్యావంతులు సమాజంలో హోదాగల వారు మిల్లతో చేయి కలిపారు. 1840-1844 మధ్య కాలంలో మిల్లర్ ఉద్యమం మూడు పువ్వులు ఆరుకాయలుగా వృద్ధిచెందింది.GCTel 311.3

  విలియమ్ మిల్లర్ గొప్ప ప్రతిభ గలవాడు. అది అధ్యయనం వల్ల క్రమశిక్షణతో కూడిన ఆలోచన వల్ల కలిగిన ప్రతిభ. అంతేకాదు జ్ఞాననిధి అయిన ప్రభువుతో సాన్నిహిత్యం ద్వారా మిల్లర్ తన ప్రతిభకు పదును పెట్టుకున్నాడు. ఆయన యధార్ధవర్తనుడు. నీతి నిజాయితీలు, గౌరవాదరాలు ప్రేమించే వారి మధ్య ఆయన గౌరవం అపారం. దయ, కనికరం, క్రైస్తవ నమ్రత, ఆత్మనిగ్రహం దండిగావున్న మిల్లర్ అందరిపట్ల ఆదరం, అనురాగం ప్రదర్శించాడు. ఎదుటివాళ్ల అభిప్రాయాలు విని వాటికి విలువనివ్వగల ఉద్దాత్త హృదయుడు. రాగద్వేషాలకు తావీయకుండా అన్ని సూత్రాలను సిద్ధాంతాలను దైవ వాక్యం గీటురాయిపై పరీక్షించేవాడు. అసత్యాన్ని విసర్జించటానికి, తప్పులను ఎండగట్టటానికి తన హేతువాదం, లేఖన పరిజ్ఞానం ఆయనకు అండగా నిలిచాయి.GCTel 312.1

  అలాగని ఆయనకు వ్యతిరేకత లేదనుకోకూడదు. ఆయన సేవలో చాలా వ్యతిరేకత ఎదురైంది. పూర్వ సంస్కర్తలమల్లే మిల్లర్ ప్రబోధించిన సత్యాలు ప్రఖ్యాత మత గురువుల ఆమోదాన్ని పొందలేదు. తమ బోధనలకు లేఖనాధారాలు లేవు గనుక వారు మనుషుల మాటల మీద సిద్ధాంతాల మీద ఫాదర్ల సంప్రదాయాల మీద ఆధారపడవలసి వచ్చింది. అయితే ఆగమనవాద ప్రబోధకులు అంగీకరించింది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం ఒక్కటే. బైబిలు- బైబిలు మాత్రమే అన్నది వారి నినాదం. ప్రత్యర్థులకు లేఖస ఆధారిత వాదన లోపించటంతో వారు ఎగతాళికి,అపహస్యానికి దిగారు. వారి అపరాధం దారిని చూపించటానికి తమ శక్తి సామర్థ్యాల్ని సమయాన్ని ఉపయోగించటం. ప్రభువు రాకకోసం ఉత్సాహంగా ఎదురు చూడటం, పరిశుద్ధ జీవితాలు జీవించేందుకు కృషి చేయటం, ప్రభువు ఆగమనం కోసం సిద్ధపడాల్సిందిగా ఇతరులను ప్రోత్సహించటం.GCTel 312.2

  రెండోరాక అంశం నుంచి ప్రజల మనసులను మరల్చటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. క్రీస్తు రాకడ గురించి, లోకాంతం గురించి ఉన్న ప్రవచనాలను పరిశీలించటం పాపమని, అది మనుషులు సిగ్గు పడాల్సిన విషయమని ప్రచారం జరిగింది. నాటి సువార్త సేవ ఈ విధంగా దైవ వాక్యం పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆ బోధకుల బోధనలు ప్రజలను నాస్తికుల్ని చేశాయి. అనేకులు తమ శరీరేచ్ఛలు తీర్చుకోటానికి అడ్డూ, ఆపు లేకుండా వ్యవహరించారు. దుర్మార్గులు తమ దురంతాలను ఆగమన వాదుల మీదికి నెట్టేసేవారు.GCTel 312.3

  మిల్లర్ సభలు విజ్ఞులతోను, ఆసక్తిగా వినే శ్రోతలతోను కిటకిటలాడుతూ ఉన్నా, ఎగతాళికి, ఖండనమండనలకు తప్ప మిల్లర్ పేరును మత పత్రికల వారు ప్రస్తావించే వారు కాదు. మతగురువుల దన్నుతో భక్తిహీనులు దుర్భాషలాడటానికి, దేవదూషణ పూర్వక ఎకసక్కెం చేయటానికి ముందుకు వచ్చి, ఆయన కృషిని అప్రతిష్టపాలు చేయటానికి సమకట్టేవారు. సుఖసౌఖ్యాలున్న గృహం విడిచి, సొంత ఖర్చుతో నగరం నుంచి నగరానికి, పట్టణం నుంచి పట్టణానికి ప్రయాణం చేసి దగ్గర పడుతున్న తీర్పును గూర్చి ప్రజలను హెచ్చరించటానికి ప్రయాస పడున్న పెద్దమనిషిని మతచాంధసుడని, అబద్ధికుడని, మోసగాడని నిందించారు.GCTel 313.1

  ఆయనపై కురిపించిన ఎగతాళి, తిట్లు, అబద్దాలు లౌకిక పత్రికల వారికి కూడా ఆగ్రహం పుట్టించాయి. అంత గంభీరమైన భయంకరమైన ఫలితాలుగల అంశంపై చౌకబారుగా, అశ్లీలంగా మాట్లాడటం “దాని ప్రబోధకుల భావాలతో ఆడుకోటం మాత్రమే కాకుండా తీర్పు దినాన్ని అపహసించటం, దేవుణ్ణి ఎగతాళి చేయటం, ఆయన న్యాయస్థానాన్ని కించపరచటం అవుతుంది. ”- బ్లిస్, పుట 183.GCTel 313.2

  సమస్త దుష్టికి కారకుడైన సాతాను ఆగమన వర్తమాన ప్రభావాన్ని నిరర్ధకం చేయటానికే గాక సందేశాన్నందించే దూతను నాశనం చేయటానికి కూడా ప్రయత్నించాడు. లేఖన సత్యాన్ని మిల్లర్ తన శ్రోతల హృదయాలకు క్రియాత్మకంగా వర్తింపజేసి, తమ పాపాల నిమిత్తం వారిని గద్దించి వారి ఆత్మతృప్తికి విఘాతం కలిగించాడు. కపటం లేని, గుచ్చుకొనే ఆయన మాటలు, వారిలో శతృత్వం పుట్టించాయి. ఆయన వర్తమానం పట్ల సంఘ సభ్యులు ప్రదర్శించిన వ్యతిరేకతను ఆసరా చేసుకొని మొదటి వర్గాల ప్రజలు అసభ్యంగా వ్యవహరించారు. సభలు ముగించుకొని వెళ్లిపోయే తరుణంలో ఆయనను హతమార్చటానికి శత్రువులు వ్యూహం పన్నారు. పరిశుద్ధ దూతలు జన సమూహంలో ఉన్నారు. వారిలో ఒక దూత మనిషి రూపంలో మిల్లర్ చేయి పట్టుకొని రౌద్రంగా ఉన్న ఆ జన సమూహంలో నుంచి ఆయనను తీసుకు వెళ్లిపోయాడు. ఆయన చేయాల్సిన పని ఇంకా పూర్తికాలేదు. సాతాను, అతడి అనుయాయులు తాము యోచించిన దాన్ని సాధించనందుకు నిరుత్సాహపడ్డారు.GCTel 313.3

  వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉన్నా ఆగమనోద్యమం పట్ల ప్రజాసక్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే వుంది. పాతికలు, వందల నుంచి శ్రోతల సంఖ్య వేలకు పెరిగింది. ఆయా ఆలయాల్లో అదనపు హాళ్లు నిర్మితమయ్యాయి. అయితే కొంత కాలం అయ్యే సరికి కొత్త విశ్వాసుల పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యింది. మిల్లర్ భావాలతో ఏకీభవించిన వారిపై తమ తమ సంఘాలు క్రమశిక్షణ చర్యలు చేపట్టాయి. ఇది మిల్లర్ ప్రతిస్పందనకు దారితీసింది. తన సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలైతే తన తప్పేంటో లేఖనాల నుంచి బహిర్గతం చేయాల్సిందంటూ అన్ని మతశాఖల క్రైస్తవులకూ లేఖలు రాశాడు మిల్లర్.GCTel 313.4

  “విశ్వసించాల్సిందిగా వాక్యం ఆజ్ఞాపించని దాన్ని దేన్ని మేము విశ్వసించాం? మీరు ఏమైతే అనుమతిస్తారో అదే మా విశ్వాసానికి ఆచరణకు ప్రమాణమా? వేదిక నుంచి, పత్రికల ద్వారా మీరు మమ్మల్ని (ఆగమనవాదుల్ని) తీవ్రంగా ఖండించటానికి మీ సంఘాల నుంచి మమ్మల్ని బహిష్కరించటానికి అంత చేయకూడని పని మేమేం చేశాం?” “మేము పొరపాటులో ఉంటే అదేంటో చూపించండి. మేము తప్పు చేస్తున్నామని వాక్యం నుంచి నిరూపించండి. మీరు చేసిన ఎగతాళి సరిపోతుంది. మేము పొరపాటులో ఉన్నట్లు అది మాకు నమ్మకం పుట్టించదు. మా అభిప్రాయాల్ని మార్చగలిగేది దేవుని వాక్యం ఒక్కటే. మేము లేఖనాల్లో నిదర్శనాలు చూశాం. మా అభిప్రాయాలు నమ్మకాలు ఆలోచన పూర్వంకగాను, ప్రార్ధన పూర్వకంగాను ఏర్పడ్డాయి.” అన్నాడు మిల్లర్.. అదే పుస్తకం, పుటలు 250-252.GCTel 314.1

  యుగం వెంబడి యుగంలో తన భక్తుల ద్వారా దేవుడు పంపిన హెచ్చరికల్ని ప్రజలు నమ్మలేదు. జలప్రళయం నాటి ప్రజల ముష్కర వర్తన దేవుని ఆగ్రహం రేపి భూమిపై జలప్రళయానికి కారణమైనప్పుడు తమ దుర్మార్గత నుంచి ప్రజలు మరలటానికి వారికి అవకాశం కలిగే నిమిత్తం తాను చేయనున్న కార్యాన్ని ముందు దేవుడు వారికి తెలియజేశాడు. దేవుని ఆగ్రహానికి గురి అయి నాశనం కాకుండే నిమిత్తం పశ్చాత్తాప పడండని హెచ్చరికా వర్తమానం నూట ఇరవై సంవత్సరాలుగా వారి చెవుల్లో మోగింది. అయితే వారు దాన్ని లెక్కచేయలేదు, దాన్ని నమ్మలేదు. దుర్వర్తనంలో తల మునకలై దేవుడు పంపినదూతను ఎగతాళి చేశారు. అతని విజ్ఞాపనను కొట్టిపారేశారు. అతన్ని వదరుబోతుగా పరిగణించారు. ప్రపంచంలోని మహా మహులందరినీ ఒక్కడు ఎలా ఎదుర్కోగలడు? నోవహు వర్తమానం యధార్ధమైనదై వుంటే లోకమంతా దాన్ని ఎందుకు గుర్తించలేదు? ఎందుకు విశ్వసించలేదు? వేలాదిమంది జ్ఞానానికి భిన్నంగా ఒక్క మనిషి మాట! వారు హెచ్చరికను నమ్మలేదు. ఓడలో తలదాచుకోనూ లేదు.GCTel 314.2

  అపహాసకులు ప్రకృతి కార్యాల్ని ఎత్తిచూపారు- మార్పులేని రుతువుల క్రమం, వర్షం లేని నిర్మలాకాశం, రాత్రుళ్లు పడే పొగమంచుతో తడిసే పచ్చని పొలాలు.. నీటిని చూపుతూ వారిలా కేకలు వేశారు, “ఈయన కట్టుకథలల్లటంలేదా?”, నీతి బోధకుడైన ఆయనను ఉన్మాది అన్నారు. శరీరేచ్ఛలు తీర్చుకోటంలో, తమ దుష్కియాచరణలో వారు మరింత దిగజారిపోయారు. కాకపోతే వారి అవిశ్వాసం ప్రవచిత సంభవాన్ని ఆపలేదు. దేవుడు వారి దుర్మార్థతను చాలా కాలం సహించాడు. పశ్చాతాపపడటానికి వారికి చాలా సమయమిచ్చాడు. అయితే కృపను తృణీకరించిన వారికి ఆయన సిద్ధంచేసిన శిక్ష నిర్దిష్ట సమయంలో వచ్చింది.GCTel 315.1

  తన రెండో రాకడ సందర్భంగా అలాంటి అవిశ్వాసమే ప్రబలుతుందని క్రీస్తు చెప్పాడు. నోవహు దినాల్లోని ప్రజలు “జలప్రళయము వచ్చి, అందరిని కొట్టుకొని పోవువరకు ఎరుగకపోయి”నట్లు “మనుష్యకుమారుని రాకడ ఉండును. ” అని రక్షకుడంటున్నాడు. మత్తయి 24:39. దైవజనులమని చెప్పుకొంటున్నవారు లౌకిక ప్రజల జీవన సరళిని అనుసరిస్తూ వారితో మమేకమైనప్పుడు నిషిద్ధ భోగాలు అనుభవించటంలో వారితో కలిసినప్పుడు, లోకభోగాలు సంఘ సుఖాలుగా పరిణమించినప్పుడు, పెండ్లి గంటలు మోగుతుండగా సుదీర్ఘమైన లోక సుఖసంతోషాలకు అందరు ఎదురు చూస్తుండగా - అప్పుడు హఠాత్తుగా ఆకాశం నుంచి మెరుపు వస్తుంది. ఉజ్వల భవిష్యత్తును గూర్చిన వారి కలలు ఆశలు అంతమొందుతాయి.GCTel 315.2

  ముంచుకు వస్తున్న జలప్రళయం గురించి ప్రపంచాన్ని హెచ్చరించ్చేందుకు దేవుడు తన భక్తుడు నోవహును పంపిన రీతిగా, అంతిమతీర్పు సమీపంలో ఉన్నదని ప్రకటించటానికి దేవుడు తన భక్తులను ఈనాడు పంపుతున్నాడు. నోవహు పలికిన ప్రవచన వాక్కుల్ని విన్న ఆనాటి ప్రజలు ద్వేషంతో నవ్విన చందాన మిల్లరు దినాల్లోని ప్రజలనేకులు దైవ ప్రజలుగా చెప్పుకొన్న వారు సహ హెచ్చరికా వర్తమానాల్ని గేలిచేశారు.GCTel 315.3

  క్రీస్తు రెండోరాకడ సిద్ధాంతం దానిపై బోధ అంటే సంఘాలకు కంటగింపు దేనికి? ప్రభువు రాకడ ముష్కరమూకలకు దుఃఖం వ్యాకులత తెస్తే, నీతిమంతులకు ఆనందాన్ని నిరీక్షణను తెస్తుంది. యుగాల పొడవునా నివసించిన భక్తులకు ఆదరణ నిచ్చింది ఈ గొప్ప సత్యమే. అది ఆ ప్రభువులాగే ఆయన ప్రజలమని చెప్పుకునే వారికి - “తగులు రాయిగాను” “అభ్యంతర బండగాను” ఎందుకు ఉంది? మన ప్రభువు తన శిష్యులకు వాగ్దానం చేశాడు, “నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల... మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోదును” యోహాను 14:3. తన అనుచరులకు సంప్రాప్తించనున్న ఒంటరితనం, హృదయవేదనను గ్రహించిన దయగల రక్షకుడు తాను వెళ్తున్న రీతిగానే వ్యక్తిగతంగా తిరిగివస్తానని వారిని ఉత్సాహ పర్చవలసిందిగా దేవదూతలకు ఆదేశించాడు. తాము అమితంగా ప్రేమించిన ప్రభువును చివరిసారిగా చూస్తూ పైకి కన్నులెత్తి ఉండగా ఈ మాటలు వారి గమనాన్ని ఆకర్షించాయి, “గలిలయ మనుష్యులారా, మీ రెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే ఏరీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును.” అ.కా. 1:11. దూత పలికిన మాటలు నూతనంగా నిరీక్షణను రగిలించాయి. శిష్యులు “మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.” లూకా 24:52,53. యేసు తమను విడిచి వెళ్ళిపోయినందుకు లోకంలో తమకు ఎదురయ్యే శ్రషులు శోధనలతో సతమతమయ్యేందుకు ఇక్కడ మిగిలి ఉన్నందుకు వారు సంతోషించుటలేదు. ఆయన మళ్లీ వస్తాడంటూ దూత ఇచ్చిన అభయాన్ని బట్టి వారు ఆనందిస్తున్నారు.GCTel 315.4

  అలనాడు బేల్లెహేములో గొల్లలకు దూత అందించిన సంతోషకరమైన సువర్తమానం లాగే నేడు క్రీస్తు రాకడ వర్తమానమూ ఉండాలి. ఎపరిపై తమ నిత్యజీవ నిరీక్షణ కేంద్రీకృతమై ఉన్నదో ఆ యేసు రక్షకుణ్ణి చిత్తశుద్ధితో ప్రేమించే వారందరూ ఆయన మళ్లీ వస్తున్నాడంటూ వాక్యం చేస్తున్న ప్రకటనను ఆనందోత్సాహాలతో స్వాగతించారు. క్రితం సారిమల్లే అధిక్షేపణకు, తృణీకారానికి, విసర్జనకు గురికావటానికి కాక తన ప్రజలను విమోచించటానికి గొప్ప శక్తితోను మహిమతోను ఈ సారి ఆయన వేంచేయటం జరుగుతుంది. రక్షకుడంటే ప్రేమలేని వారే ఆయన అక్కడే నిలిచిపోవాలని కోరుకొంటారు. దేవుడు పంపిన ఈ వర్తమానం పట్ల వారి అసహనం వ్యతిరేకతలే వారి ప్రతికూల వైఖరికి ప్రబల తార్కాణం.GCTel 316.1

  ఆగమన సిద్ధాంతాన్ని అంగీకరించినవారు పశ్చాత్తప్త హృదయాలతో దేవుని ముందు వినమృలై నిలవాలని అవసరాన్ని గుర్తించారు. అనేక మంది చాలా కాలంగా క్రీస్తుకి లోకానికి మధ్య ఆగిపోయి ఉన్నారు. ఏదో తీర్మానాన్ని తీసుకోవలసిన అవసరాన్ని ఇప్పుడు గుర్తించారు. “నిత్య జీవానికి సంబంధించిన సంగతులు ఎంతో యధార్ధమైన విషయాలుగా ఇప్పుడు వారికి కనిపించాయి. పరలోకం వారి ముందుకు వచ్చింది. దేవుని ముందు వారు అపరాధులుగా నిలిచారు.”— బ్లిస్, పుట 146. క్రైస్తవులు నిద్రలేచి నూతన ఆధ్యాత్మిక జీవన సరళిని అంగీకరించారు. సమయం ఎక్కువ లేదని తమ సమకాలికులకు తాము చేయాల్సినదంతా త్వరగా చేయాలని వారు గ్రహించారు. లోకం వెనక్కు తిరిగిపోయినట్లు నిత్యకాలం తమ ముంగిట నిలిచి ఉన్నట్లు వారు గమనించారు. తన అమర్త్యతకు సంబంధించిన సుఖదుఃఖాల పరిగణనతో నిండిన వారి ఆత్మ ఇహలోక చింతల విషయంలో గుడ్డిదయ్యింది. పరిశుద్ధాత్మ వారిమీదికి రావటంతో రక్షణ నిమిత్తం సహోదరుల నుద్దేశించి వారు చేసిన విజ్ఞప్తులు గొప్ప శక్తిని సంతరించుకున్నాయి. నిరాడంబరంగా నిశ్శబ్ధంగా దినదినం వారు జీవించిన జీవితం నామమాత్రపు క్రైస్తవులకు మారుమనసు పొందని సంఘసభ్యులకు గద్దింపుగా పరిణమించింది. సుఖభోగాలు, ధనసంపాదన, లోక గౌరవప్రతిష్ఠలతో కూడిన తమ జీవితాలకు అంతరాయం కలుగకూడదన్నది వారి ఆశయం. అందుకే ఆగమన విశ్వాసంపట్ల దాన్ని ప్రకటించే వారిపట్ల వారికి ద్వేషం, వ్యతిరేకత.GCTel 316.2

  ప్రవచన కాలాలను గూర్చిన వాదనలు తిరుగులేని వవ్వటంతో ప్రవచనాలకు ముద్ర పడిందంటూ ప్రత్యర్థులు వాటి పరిశోధనను అడ్డుకోటానికి ప్రయత్నించారు. ఈ తీరున ప్రొటస్టాంటులు రోము మత వాదుల పద్ధతులను అనుసరించారు. పోపు సంఘం బైబిలును ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తే వాక్యంలో ప్రాముఖ్యమైన భాగం- ముఖ్యంగా మన కాలానికి సంబంధించిన సత్యాలను మన దృష్టికి తెచ్చే భాగం - మనకు అర్ధం కాదంటూ ప్రొటస్టాంటు సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. GCTel 317.1

  దానియేలు ప్రకటన గ్రంధాల్లోని ప్రవచనాలు అవగాహనకు మించిన మర్మాలని బోధకులు సామాన్య ప్రజలు గంటాకంఠంగా చెప్పారు. తమ దినాల్లో సంభవించనున్న ఘటనలను గూర్చి శిష్యుల గమనాన్ని దానియేలు ప్రవక్త మాటలకు తిప్పుతూ క్రీస్తిలా అంటున్నాడు, “చదువువాడు గ్రహించునుగాక” మత్తయి 24:15 ప్రకటన గ్రహించలేని మర్మమన్న భావనను ఆ గ్రంథం పేరే తోసిపుచ్చుతున్నది. “యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై యున్నవి... ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు” ప్రకటన 1:13.GCTel 317.2

  “ఈ ప్రవచన వాక్యములు చదువు వాడు... ధన్యుడు” అంటున్నాడు ప్రవక్త. చదువని వారు ఉన్నారు. వారికి ధన్యత లేదు. “వాటిని విని ప్రవచనాలను గురించి వినటానికి నిరాకరించే వారు కొందరున్నారు. ఈ తరగతి ప్రజలకు ధన్యతలు లేవు. “ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ”- ప్రకటనలో ఉన్న హెచ్చరికలను పాటించటానికి అనేకమంది నిరాకరిస్తారు. వీరెవరూ వాగ్దాత్త దీవెనలను పొందలేరు. ప్రవచనాంశాలపై ఎగతాళిగా మాట్లాడి ప్రవచనాల్లోని పవిత్ర సంకేతాలను కించపర్చే వారందరూ తమ జీవితాలను సరిచేసుకొని క్రీస్తు రాకకు సంసిద్ధులు కాని వారందరూ ధన్యులు కారు; అభాగ్యులు.GCTel 318.1

  ఆవేశం ఇస్తున్న సాక్ష్యం దృష్ట్యా ప్రకటన గ్రంధం మనుషుల గ్రహింపుకు అతీతమైన మర్మమని బోధించటం ఎంతటి సాహసం? అది బట్టబయలైన మర్మం. తెరచి ఉంచిన గ్రంథం. ప్రకటన గ్రంథ పఠనం మనసును దానియేలు ప్రవచనాలకు నడిపిస్తుంది. ఈ రెండు గ్రంథాలు ప్రపంచ చరిత్ర చరమ దశలోని సంఘటనలను గూర్చి దేవుడిచ్చిన అతి ముఖ్యమైన ఉపదేశం మనకు అందిస్తున్నాయి.GCTel 318.2

  సంఘం అనుభవంలో మిక్కిలి రసవత్తరమూ, ఆశావహమూ ఆయిన దృశ్యాలు యోహాను దృష్టికి రావటం జరిగింది. దైవ ప్రజల ఉనికి, వారు ఎదుర్కొంటున్న అపాయాలు, సంఘర్షణలు, వారి అంతిమ విడుదల యోహాను చూశాడు. లోకం పంటకు పక్వతకూర్చే వర్తమానాన్ని ఆయన దాఖలు చేస్తున్నాడు. అది పరలోకపు కొట్లలో కూర్చేందుకు ఏర్పాటైన పంటగానో కాల్చివేయటానికి నిర్దేశించిన చొప్పగానో ఉండబోతున్నది. ప్రధానంగా చివరి సంఘాన్ని ఉద్దేశించి ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు యోహానుకు బయలుపర్చాడు. సత్యాన్ని అంగీకరించిన వారు ఎదుర్కొనే అపాయాలు పోరాటాల గురించి వారిని ఉపదేశించటానికి దేవుడనుగ్రహించిన సంగతులవి.GCTel 318.3

  కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రముఖ భాగమైన ఈ గ్రంథం విషయమై ఇంత అజ్ఞానం ఎందుకు ప్రబలాలి? ఆ గ్రంథ బోధనల పరిశీలన విషయంలో ఈ అయిష్టత ఎందుకు? తమ మోసాల గుట్టు రట్టుచేసే సంగతులను దాచి ఉంచటం సాతాను వ్యూహారచనలో భాగం. అందుకని ప్రవచన గ్రంథ పఠనం సందర్భంగా జరిగే పోరాటాన్ని ముందుగానే చూసిన ప్రకటికుడైన క్రీస్తు ఈ ప్రవచన వాక్యాన్ని చదివే వారు, వినేవారు, వాటిననుసరించి నివసించే వారు ధన్యులని ప్రకటించాడు.GCTel 318.4

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents